దుర్బోధలకు జవాబు

రచయిత: నీవన్ థామస్
చదవడానికి పట్టే సమయం: 10 నిమిషాలు

ఉపోద్ఘాతము :

'యాజకుడు' అంటే యాజకత్వము చేసేవాడు అని అర్థము. యాజకుడు చేసే పనిని అంటే అతడు చేయాల్సిన విధిని 'యాజక ధర్మము' అని అంటారు.

అయితే బైబిల్లో సేవకుడు, సేవ అనే పదాలు కూడా యాజకుడు, యాజకత్వము పదాలకు పర్యాయ పదాలుగా ఉపయోగించడం జరిగింది. ఇంగ్లీషులో 'ప్రీస్ట్' లేదా 'మినిస్టర్' అని ప్రీస్ట్ హుడ్' లేదా 'మినిస్ట్రీ' అనే పదాలు ఉపయోగించబడ్డాయి. ఇక్కడ యాజకత్వము లేదా సేవ చేయడం అంటే మహోన్నతుడైన దేవునికి చేయడం. మరి అంతటి సర్వోన్నతుడైన దేవునికి సేవ చేయాలంటే దానికి తగిన అర్హత కూడా ఉండాలి కదా! మరి ఆ అర్హతలు ఏమీటో? ఆ యాజకులు ఎవరో? ఆ యాజక ధర్మమేమిటో? ఒకసారి మనం బైబిల్లో పరిశోధన చేద్దాం!

 

పాతనిబంధనలో లేవీయులు మాత్రమే యాజకులు :

ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో లేవీ గోత్రము ఒకటి. ఆ గోత్రానికి చెందినటువంటి ప్రజలను మాత్రమే దేవుడు యాజకులుగాను, ప్రధాన యాజకులనుగాను దేవుని సేవ చేయుటకు ఎన్నుకున్నాడు.

“ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొనియున్నాను; ప్రత్యక్షపు గుడారము యొక్క సేవచేయుటకు వారు యెహోవా వలన మీకప్పగింపబడియున్నారు. కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను.” (సంఖ్యా 18:6,7).

“ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారము యొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ." (సంఖ్యా 18:22,23)

“నేను కరుణా పీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణా పీఠము ఎదుటనున్న అడ్డుతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.” (లేవీ 16:2).

“సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ." (లేవీ 16:34) “మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.” (లేవీ 16:33; హెబ్రీ 9:7 )

అయితే లేవీయులకు ఏ అర్హత ఉందని దేవుడు వారిని ఎన్నుకున్నాడు? కేవలం దేవుని కృప, దయచేతనే వారికి ఈ బాధ్యత అప్పగించబడింది.

"దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించిన యెడల మరణ శిక్షనొందును." (సంఖ్యా 18:7బి)

అయితే మరీ ఆ యాజకులు, ప్రధాన యాజకులు చేయాల్సిన పని అంటే యాజక ధర్మము ఏమిటో మనం తెలుసుకుందాం!

“ప్రత్యక్షపు గుడారము యొక్క సేవచేయుటకు వారు యెహోవా వలన మీకప్పగింపబడియున్నారు. కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటీ విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను.” (సంఖ్యా 18:6,7)

“మరియు ప్రతి యాజకుడు దీనదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును.” (హెబ్రీ 10:11) "ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి యేర్పరచబడినవాడై, పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును.” (హెబ్రీ 5:1)

"ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేతపట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును." (హెబ్రీ 9:6,7)

అంటే యాజకులు మొదటి ఆవరణములో ఉండి ప్రజల నిమిత్తము బలులు, అర్పణలు అర్పించుచు సేవచేయుదురు. ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతిపరిశుద్ధ స్థలమైన రెండవ గుడారములోనికి ప్రవేశించి తన కొరకును, యాజకుల కొరకును, ప్రజలందరి కొరకును బలులు అర్పించును. ఇదియే పాతనిబంధనలో చెప్పబడిన యాజక ధర్మము.

క్రొత్తనిబంధనలో యాజకులెవరు?

పాత నిబంధనలో లేవీయులు మరియు అహరోను సంతతి వారు యాజకులుగా ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలో యాజకులు గాని యాజక ధర్మము గాని ఉన్నదా? ఒకసారి గమనిద్దాం!

“అయితే క్రీస్తు రాబోవుచున్న (కలిగియున్న) మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారము ద్వారా, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.” (హెబ్రీ 9:11,12) “నిజమైన పరిశుద్ధ స్థలమునుపోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములో ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.” (హెబ్రీ 9:24)

అంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువులవారు మన 'ప్రధాన యాజకుడుగా ఉన్నాడు.

పరిశుద్దాత్ముడు తన భక్తుల చేత తన సంఘమును గురించి విశ్వాసులను గురించి పలికించిన మాటలను గమనించండి- "అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము చేయునిమిత్తము, ఏర్పరచబడిన వంశమును,రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతురు 2:9)నూతన నిబంధనలో యేసు ప్రభువు ప్రధాన యాజకుడుగాను, సంఘము అనగా విశ్వాసులు యాజకులుగాను నియమించబడినట్లుగా గమనించవచ్చును. పాత నిబంధనలో లేవీయులే యాజకులు. “మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.” (హెబ్రీ 7:14) అలాగే సంఘము విషయానికి వస్తే క్రైస్తవులు ఏ గోత్రమునకు చెందినవారు కాదుగదా! అంటే ఇక్కడ యాజకులు లేవీయులు కాదు, మార్చబడ్డారు.

"యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును.” (హెబ్రీ 7:12) లేవీయుల క్రమములో గాకుండా వచ్చిన యాజకుల యొక్క యాజక ధర్మమేమిటో ఇప్పుడు మనం గమనిద్దాం!

"ఈయన (క్రీస్తు) నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.” (హెబ్రీ 7:24,25) అంటే క్రీస్తు తన యాజక ధర్మము చొప్పున విశ్వాసులైన మనము దేవునిచే అంగీకరించబడుటకు విజ్ఞాపనము చేయుచున్నాడు.

మరి విశ్వాసులమైన మన యొక్క యాజక ధర్మము ఏమిటో చూద్దాం - "యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ద యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.” (1 పేతురు 2:5)

ఇక్కడ విశ్వాసులమైన మనము మన యొక్క యాజక ధర్మము ప్రకారము ఆత్మసంబంధమైన బలులను అర్పించాలని వాక్యము సెలవిస్తోంది. మరీ మనం ఏవిధంగా ఆత్మసంబంధమైన బలులనర్పించగలం? ఈ విషయమై పౌలు భక్తుడు ఏమంటున్నాడో గమనించండి!

"అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి, అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడనైతిని.” (రోమా 15:15,16)

అంటే ఆత్మసంబంధమైన బలులనర్పించడం అంటే సువార్త ద్వారా అన్యజనుల ఆత్మలను సంపాదించి దేవునికి అర్పించడమే! ఇదియే మనకున్న యాజక ధర్మములలో అతి ప్రాముఖ్యమైనది. అంతేగాకుండా “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.” (రోమా 12:1)

“ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీ 13:15-16)

సహోదరీ, సహోదరులారా! పాతనిబంధన పరిచర్యకు, క్రొత్త నిబంధన పరిచర్యకు గల వ్యత్యాసాలను, సారూప్యాలను గమనించారు గదా! క్రొత్తనిబంధన పరిచర్య ఎంతటి మహిమగలదో చూడండి - "ఆయనే మమ్మును క్రొత్తనిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకరమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడినఅక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గి పోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును? శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ గలదగును. అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేని దాయెను. తగ్గిపోవునదే మహిమగలదై యుండిన యెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా.” (2కొరింథి 3: 6-11)

కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము.” (2కొరింథీ 4:1,2)

“ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవచేయుచున్నాము.” (రోమా 7:6) ఇకమీదట కూడా ఆలాగుననే సేవచేయుదము గాక! ఆమెన్.

ముగింపు:

వారి మనసులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది” (2 కొరింధి 3:14) అని పౌలు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుచున్నాడు. ఇక మన గురించి ఏమైనా చెప్పవలెనా? మనం కూడా అదే ముసుకులో ఉన్నామా? ఆలోచించండి!

“కాగా మీరు నా మాట శ్రద్దగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము;" (నిర్గమ 19:5,6).

“ఆయన (క్రీస్తు) మనలను తన తండ్రియైన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.” (ప్రకటన 1:6).

మనమందరం (పాస్టర్లు, పెద్దలు, విశ్వాసులు అంటే క్రైస్తవులందరం) యాజకులమని, మనందరి ప్రాముఖ్యమైన యాజక ధర్మము సువార్త చెప్పడమని బైబిల్ చెబుతోంటే, కొందరే యాజకులని, మిగిలినవారందరూ యాజకులుకారని తప్పుగా బోధిస్తూ, తప్పుగా ప్రవర్తిస్తున్నాము.

"నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము)” (యాకోబు 3:1,2)

 

 

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.