నిజ క్రైస్తవ జీవితం

రచయిత: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 15 నిమిషాలు

ఆడియో

ప్రభువు తన శిష్యులకు నేర్పిన ''పరలోక ప్రార్థన'' మనందరికి సుపరిచితమైనది.

మత్తయి 6:9-13 లోని లేఖనభాగంలో ఈ పరలోక ప్రార్థనను మనం చదువుతాము. ఇది ప్రార్థనా విధానాన్ని మనకు బోధించడమే కాకుండా, దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్థనకు మూలమైన కొన్ని ప్రాతిపదికలను కూడా మనకు నేర్పిస్తుంది. అయితే కేవలం ఒక ఆచారంగా చేస్తున్న కారణాన ఈ ప్రార్థనలోని ఆత్మీయ సూత్రాలను గ్రహించడం గాని, గైకొనడం గాని సాధ్యపడటంలేదు. కాని ఇందులో ఉన్న ప్రాతిపదికలకు అనుగుణంగా ప్రార్థన చేయనివారు ఎంత సమయాన్ని వెచ్చించి, ఎంత ప్రయాసతో, ఆసక్తితో ప్రార్ధన చేసినా వారు కేవలం వ్యర్ధంగానే ప్రార్థన చేస్తున్నారని గ్రహించటంలేదు. పాపజీవితం, పరిసయ్యులవంటి ఆసక్తి, పనికిరాని సాంప్రదాయాలు మొదలైనవి మన ప్రార్థనలకు అవరోధాలుగాను, దేవునికీ మనకు మధ్య అడ్డుగోడలుగాను నిలుస్తాయి. వీటి నుండి విడుదల పొంది ప్రార్థన ద్వారా దేవునితో ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండి ఆయన సన్నిధిని వాస్తవంగా అనుభవించి ఆయనయందు నిత్యం ఆనందించడానికి, పరలోక ప్రార్థనలోని ఈ ప్రాతిపదికలను గుర్తెరగటం ఎంతో అవసరం. ఆ ప్రాతిపదికలను ఇప్పుడు నేర్చుకుందాం. 

1.ఎవరు ప్రార్థించాలి? ప్రభువు నేర్పిన ఈ ప్రార్థన ''పరలోకమందున్న మా తండ్రీ...............'' అని ప్రారంభమౌతుంది. ఈ మాటలు, ప్రార్థన ఎవరికి చేయాలి అని మాత్రమే కాదు, ప్రార్థన చేయడానికి ఎవరు అర్హులు అని కూడా మనకు తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డలు మాత్రమే యథార్థంగా ఆయనను 'తండ్రి' అని సంబోధించగలరు. కాబట్టి ప్రార్ధించే అర్హత దేవునిబిడ్డలకు మాత్రమే చెందిన శ్రేష్ఠమైన ధన్యత అని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించగలము. 'అందరినీ దేవుడే సృష్టించాడు కాబట్టి అందరూ ఆయన బిడ్డలే' అని కొందరు వాదిస్తారు. ఈ వాదనలో వాస్తవం లేదని నేను అనను. ఇందుకు సంబంధించిన స్పష్టమైన లేఖనభాగాలు కూడా ఉన్నాయి. (ఉదాహరణకు మలాకీ 2:10 , యెషయా 64:8) ఐనప్పటికీ ఆదాము పతనం వలన మానవులందరూ దేవునితో ఉన్న ఇలాంటి సత్సంబంధాన్ని కోల్పోయి, ఉగ్రతకు పాత్రులయ్యారని (ఎఫెసీ 2:3) బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరూ స్వభావసిద్దంగా దేవునిబిడ్డలు కారు. ''తండ్రి'' అని సంబోధించి ఆయనకు ప్రార్థన చేసే అర్హత స్వతహాగా ఎవరికీ లేదు. ఈ విధంగా దేవునికి దూరమైనవారు తిరిగి ఆయనతో ఐక్యం చేయబడి ఆయన బిడ్డలుగా అంగీకరించబడటానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గమే యేసు క్రీస్తు. పశ్చాత్తపం మరియు విశ్వాసంతో ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి, తమ ప్రభువుగా ఆయనకు లోబడటానికి తీర్మానించుకుంటారో, వారు తిరిగి దేవునిబిడ్డలుగా అంగీకరించబడతారని బైబిల్ స్పష్టం చేస్తుంది. ''తన్ను ఎందరంగీకరించిరో వారందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుషేచ్ఛలవలననైనను పుట్టినవారు కారు'' (యెహాను 1:12,13). ప్రియ చదువరీ, పైవచనములోని సత్యం అనుభవాత్మకంగా నీ స్వంతం కానంతవరకూ నీకు దేవునితో ఎలాంటి సంబంధం లేదు. "తండ్రి" అని ఆయనను సంబోధించటానికి గాని, ఆయనకు ప్రార్ధన చేయడానికి గాని నీకు ఏ అర్హతా లేదు. ''మేము అబ్రహాము సంతతివారము'' అని అతిశయించిన యూదులలాగే నేడు క్రైస్తవులలో కూడా అనేకులు 'మేము క్రైస్తవ కుటుంబములో పుట్టి పెరిగాము, కాబట్టి మేము క్రీస్తుకు చెందినవారమే. మేము దేవుని బిడ్డలమే' అని పొరబడుతున్నారు. ''శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది'' (యోహాను 3:6) అని యేసు చెప్పిన మాటలు మరువకు సుమా! క్రైస్తవ కుటుంబములో పుట్టినవారు దేవునిబిడ్డలని బైబిల్ బోధించడం లేదు. దేవుని మూలంగా పుట్టినవారు మాత్రమే ఆయన బిడ్డలు. మరి నేను దేవుని మూలంగా  పుట్టినవాడనని ఎలా నిర్ధారించుకోవాలి? కొందరి విషయమై, ''మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు'' (యోహాను 8:44) అని యేసు సాక్ష్యమిచ్చినప్పుడు, ''మీ తండ్రి దురాశలను మీరు చేయుదురు'' అంటూ వారి స్వభావాన్ని వర్ణించాడు. ఈ మాట ప్రకారం, ఎవరి కోరికలను నెరవేర్చడానికి మనం మొగ్గు చూపుతామో వారికి చెందినవారమని, వారి బిడ్డలమని అర్థం చేసుకోగలం. మరి నువ్వు దేవుని కోరిక చొప్పున జీవిస్తున్నావా? ఆయన తన వాక్యంలో బయలుపరచిన తన చిత్తానుసారమైన జీవితాన్ని కల్గియున్నావా? లేదా ఆయన వాక్యానికి లోబడక అపవాది దురాశలను నెరవేరుస్తున్నావా? స్వజాతి స్వజాతిని కంటుంది, నీవు పరిశుద్ధుడైన దేవుని మూలంగా పుట్టినవాడవైతే, నీలో పరిశుద్ధత నియమం నాటబడి, నీతిని ప్రేమించి, భక్తిహీనతను ద్వేషించే స్వభావం నీలో ఉత్పన్నం ఔతుంది. ఇలాంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎంతమాత్రమూ దేవుని బిడ్డవు కావు. మనం ప్రారంభంలో చూసిన విధంగా, దేవునిని ''తండ్రీ'' అని సంబోధించగలిగినవారు మాత్రమే ఆయనకు ప్రార్ధన చేయగలరు. మరి నువ్వు యథార్థంగా ఆయన బిడ్డవు కాకపోతే ఆయనను 'తండ్రి' అని యథార్థంగా ఎలా సంబోధించగలవు? దేవునిబిడ్డలకు విధేయత ఒక ఖచ్చితమైన గుర్తు. అవిధేయుల ప్రార్థన దేవుడు వినడు. ''ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము'' (సామెత 28:9). పైవచనంలో చూసిన విధంగా దేవునివాక్యానికి విధేయులవటానికి నిరాకరించేవారి ప్రార్థన దేవుని దృష్టికి హేయకరంగా ఉందని స్పష్టమౌతుంది. అవిధేయత దేవునిబిడ్డలు కానివారికి గుర్తు. అలాంటివారి ప్రార్థన దేవునికి అసహ్యకరమని మనం చూసాము. కాబట్టి నువ్వు ఇప్పటికీ దేవునిబిడ్డవు కాకుండా అవిధేయతలో జీవిస్తున్నవాడవైతే, నిన్ను క్షమించి యేసుక్రీస్తునందు ఆయన బిడ్డగా అంగీకరించమని తప్ప మరేది అడగటానికి లేఖనం నీకు అనుమతి ఇవ్వదు (అపొ.కా. 8:22,23; లూకా 15:18-24). 'ఎవరు ప్రార్థించాలి?' అనే ఈ ప్రశ్నకు స్పష్టమైన జవాబు లేఖనాల నుండి మనం తెలుసుకున్నామని భావిస్తున్నాను. 'పరలోక ప్రార్థన'లో మనం నేర్చుకునే మొట్టమొదటి ప్రాతిపదిక ఇదే. కేవలం దేవునిబిడ్డలు మాత్రమే ప్రార్ధించడానికి అర్హులు కాబట్టి నువ్వు దేవునిబిడ్డవో కావో నిర్ధారించుకో. ప్రార్థనకు ఇదే మొదటి మెట్టు.

2. ఎలా ప్రార్ధించాలి? ''తండ్రీ'' అనే మాట 'ఎవరు ప్రార్దించాలో' తెలియజేస్తే ''పరలోకమందున్న'' అనే మాట 'ఎలా ప్రార్దించాలో' నేర్పిస్తుంది. ఈ మాట దేవుడు పరలోకాన్ని తన సింహాసనంగా చేసుకుని సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడైయున్నాడని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎంత మహిమాన్వితుడో, మహోన్నతుడో ఇది మనకు తెలియచేస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకమందు ఆసీనుడైయున్న సర్వోన్నతునితో మాట్లాడుతున్నామని మరువకూడదు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మహిమకు, ఘనతకు తగిన విధంగానే మనం మాట్లాడాలి. మన తండ్రి కాబట్టి ఆయన సన్నిధిలో మనకు స్వేచ్ఛ ఉందన్నది వాస్తవం అయినప్పటికీ ఆయనను సన్మానించే విషయంలో రాజీపడేంత స్వేచ్ఛ ఎవరికీ లేదని జ్ఞాపకముంచుకోవాలి. ''నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా వుండవలెను'' (ప్రసంగి 5:2). పై మాటలు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థించకూడదని చెప్పటంలేదు కాని ప్రార్థించినప్పుడు వ్యర్థమైన మాటలను ఉచ్ఛరించకూడదని నేర్పిస్తున్నాయి. పరలోకమందున్న మన తండ్రి మహాసార్వభౌముడు. ''యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు'' (కీర్తన 103:19). ఆయన ''ఆకాశమందు'' (పరలోకమందు) ఉన్నాడని, మనము ''భూమి మీద'' ఉన్నామని, ఆ మహోన్నతుని సన్నిధిలో నిలవడం మన గొప్ప ఆధిక్యత అని, కాబట్టి ఆరాధనాభావంతోనే ఆయనకు ప్రార్థన చేయాలని మనమెల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

పరలోకమందున్న మన తండ్రి మహాపరిశుద్ధుడైన దేవుడు. ''నీ నామము పరిశుద్ధపరచబడును గాక'' అనే మాటలు ఆయన పరిశుద్ధతను జ్ఞాపకముంచుకొని అందుకు తగిన రీతిగానే మనం ఆయనను సమీపించాలని మనకు గుర్తుచేస్తున్నాయి. కాబట్టి 'ఎలా ప్రార్థించాలి' అనే సూత్రం పరలోక ప్రార్థనలో మనం స్పష్టంగా చూడగలం. అయితే దానిని అనుభవాత్మకంగా అన్వయించుకోవడానికి మనం ప్రతిరోజూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి. మాకు ప్రార్ధించటం నేర్పించమని యేసు శిష్యులు అడిగినట్లు మనం కూడా ప్రతిరోజు దేవుని యెదుట యథార్ధంగా వేడుకోవాలి. ''ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు'' (రోమా 8:26).

3. ఎందుకు ప్రార్థించాలి? ''నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక''. ఈ మాటలు 'ఎందుకు ప్రార్థించాలి' అనే సూత్రాన్ని మనకు నేర్పుతాయి. ప్రార్థన మన చిత్తాన్ని నెరవేర్చమని దేవునిని బలవంతపెట్టే సాధనం కాదు కాని ఆయన చిత్తాన్ని నెరవేర్చే ప్రక్రియలో దేవుడు మన ద్వారా ఉపయోగించే సాధనం. యథార్థమైన ప్రార్థన పరిశుద్ధాత్ముని వలన పురికొల్పబడుతుంది కనుక అది స్వార్ధాన్ని అణిచివేసి ఎల్లప్పుడూ అన్ని విషయాలలో దేవుని చిత్తమే నెరవేరాలని ఆకాంక్షిస్తుంది. ప్రార్థన దేవునినీ ఆయన ప్రణాళికనూ మార్చదు గాని ఆయన చిత్తానుగుణంగా మనం మారేలా సహాయం చేస్తుంది. దేవుని చిత్తంతో నిమిత్తం లేకుండా చేసే స్వార్థపూరిత ప్రార్థనలు లేఖనబద్ధమైనవి కావు. ''ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగినయెడల మనమాయనను వేడుకొనినది మనకు కలిగినవని యెరుగుదుము'' (1యోహాను 5:14,15). పై మాటలలో ''మనమేది అడిగినను'' అనేది ''ఆయన చిత్తానుసారముగా'' అనే దానికి పరిమితం చేయబడిందని గమనించాలి. ఈ విషయంలో మన ప్రభువు కనపరచిన మాదిరిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆయన ప్రార్థించినట్లు మన ప్రార్థనల చివర కూడా ''అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక'' అని తప్పక జోడించాలి. ఇది మనమెందుకు ప్రార్థించాలనే సూత్రాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకునేలా సహాయపడుతుంది. ఈ సూత్రాన్ని బట్టి చూస్తే ప్రార్థన అనేది ఆయన చిత్తాన్ని ఆకాంక్షించి, అన్వేషించి, దాన్ని నెరవేర్చడానికి యథార్థమైన ఆసక్తిని కలిగున్నామని దేవుని సన్నిధిలో వ్యక్తపరచటమే. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే ప్రక్రియలో మనం కూడా పాలిభాగస్తులం కావడానికి ప్రార్థన ఒక సాధనమని ఈ సూత్రం మనకు నేర్పుతుంది. 'ఎందుకు ప్రార్థించాలి?.' ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేర్చే సాధనం కాబట్టి మనం ప్రార్థించాలి.

4. దేని కొరకు ప్రార్థించాలి? పరలోక ప్రార్థన మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆ విన్నపాలన్నిటిలో మన 'అవసరాలు' మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు గమనించగలం. దీనిని బట్టి, మనం దేని కొరకు ప్రార్థించాలనే సూత్రాన్ని స్పష్టంగా తెలుసుకోగలం. ప్రార్థన మన అవసరాలను వేడుకొనే సాధనమే కాని మన ఇచ్ఛలను/భోగేచ్ఛలను తీర్చమని అడిగే సాధనం కాదు. పరలోక ప్రార్థనలో నేర్పబడిన ఈ సూత్రం లేఖనమంతటా వ్యాపించియున్నట్లు మనం చూడగలం. దేవుని ఆజ్ఞలు మరియు వాగ్దానాలు మన ప్రార్థన పరిమితిని నిర్వచించి మనం ప్రార్ధించాల్సిన విధానాన్ని నిర్దేశించేవిగా ఉన్నాయి.కనీస అవసరాలతో తృప్తిపడమని లేఖనం స్పష్టంగా మనల్ని ఆజ్ఞాపిస్తుంది. ''సంతుష్టిసహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై యున్నది. మనమీలోకములోనికి ఏమియు తేలేదు. దీనిలో నుండి ఏమియు తీసుకొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము'' (1 తిమోతి 6:6-8). ఇలాంటి ఆజ్ఞలతో ఏకీభవిస్తూ దేవుని వాగ్దానాలు కూడా కేవలం మన అవసరాల విషయమై మాత్రమే హామీ ఇస్తున్నాయి. ''దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతిఅవసరమును తీర్చును'' (ఫిలిప్పీ 4:19). ''తన మహిమను బట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవజ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున...'' (2 పేతురు 1:2-3). పై వచనంలో చూసిన విధంగా మనం కేవలం మన అవసరాలతో సంతృప్తిపడాలని, అవి మాత్రమే తీర్చబడతాయని వాగ్ధానం చేయబడింది. దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఆయన వాగ్ధానాలను అధిగమించి దేనినైనా అడిగే అర్హత, అధికారం మనకు లేదు. పరలోక ప్రార్థనలోని విన్నపాల జాబితా ఈ సూత్రాన్ని తేటగా స్పష్టం చేసి దానిని దృఢపరుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయమేంటంటే, పరలోక ప్రార్థనలోని విన్నపాలన్నీ మన ఆత్మీయ అవసరాలకే చెందినవై కేవలం ఒక్క విన్నపం మాత్రమే మన శారీరక అవసరాలకు కేటాయించబడింది. ఇది మనకుండాల్సిన ప్రాధాన్యతల క్రమాన్ని స్పష్టంగా నిర్వచించటం లేదా? మనం దేని గురించి ఎక్కువ చింతిస్తున్నామో, దాని గురించి ఎక్కువగా ప్రార్థిస్తాము కదా? మరి నువ్వు దేని గురించి ఎక్కువగా ప్రార్దిస్తున్నావు? నీ ఆత్మీయ అవసరాల గురించా లేక నీ శారీరక కొరతల గురించా? నువ్వు దేని గురించి ఎక్కువ భారం కలిగి ప్రార్దిస్తున్నావో అది నీ ఆత్మీయస్థితిని బేరీజు వేయటానికి చక్కని కొలబద్ద అని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. శారీరక అవసరాలను గురించి ప్రార్థించొద్దు అని నేను చెప్పడం లేదు. కాని నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో, దేని కొరత నీకు ఎక్కువ బాధ కలిగిస్తుందో, దాని విషయమై నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తావనే వాస్తవాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. 'దేని కొరకు ప్రార్థించాలనే' సూత్రంపై మరింత ధ్యానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా ఇక్కడ ఇచ్చిన క్లుప్త వివరణ ఈ సూత్రాన్ని కొంతైనా అర్థం చేసుకోడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

5. ఎప్పుడు ప్రార్థించాలి? ''మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.'' 'ఎప్పుడు ప్రార్థించాలి?' అనే సూత్రం ఈ మాటలలో స్పష్టంగా అంతర్లీనమైయుంది. ప్రతిరోజూ ప్రార్ధించాల్సిన అవసరాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. దీని గురించిన ఇతర లేఖనభాగాలలోని ఆజ్ఞలు ఈ మాటలను పునరుద్ఘాటిస్తున్నాయి. ''వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ....'' (లూకా 18:1). ''ఎడతెగక ప్రార్థన చేయుడి'' (1 థెస్స 5:17). ప్రతిరోజు ప్రతిపరిస్థితిలోను ప్రార్థన ద్వారా దేవునిపై ఆధారపడాలని, ఇది ప్రతి క్రైస్తవుడు రాజీపడకూడని విషయమని పై వచనాలు తెలుపుతున్నాయి. మరి నువ్వు ప్రతిరోజు దేవునిపై ఆధారపడుతున్నావా? ప్రతి అవసరతను తీర్చి ప్రతి మంచి ఈవిని దయచేసేవాడు ఆయనే అనే విశ్వాసాన్ని నువ్వు యథార్ధంగా కలిగి ఉన్నావా?నువ్వు అలాంటి విశ్వాసాన్ని కలిగివున్నావని దృఢపరిచేది నీ ప్రార్థనాజీవితమే. స్వీయసమృద్ధిపై విశ్వాసముంచేవారికి దేవునిపై ఆధారపడాల్సిన అవసరం ఎంతమాత్రమూ కనిపించదు, కాబట్టి ప్రార్థనతో వారికి పనిలేదు. మరి నువ్వు నీ స్వీయసమృద్ధిపై ఆధారపడుతున్నావా? లేదా అన్ని విషయాలలో దేవునిపై ఆధారపడుతున్నావా? దీనిని నిర్ధారించేది నీ ప్రార్థన జీవితమే. ప్రతిదినం ప్రార్ధించాలనే ఈ సూత్రం కేవలం ''అనుదిన ఆహారము''నకు మాత్రమే పరిమితమని మనం అనుకోకూడదు. ఈ విన్నపము మిగిలిన విన్నపాలన్నిటితో కలిపి ఒకే ప్రార్థనగా నేర్పబడింది. కాబట్టి ఈ సూత్రం ఈ ఒక్క విన్నపానికే కాక ప్రార్థనంతటికీ అన్వయించదగిన సూత్రమని మనం గమనించాలి. కాబట్టి ప్రతిదినం ప్రార్ధించాలనే సూత్రం పరలోక ప్రార్థనలో స్పష్టంగా ఇమిడియున్నట్లు మనం గమనించగలం.

6. ఎవరి కొరకు ప్రార్థించాలి? పరలోక ప్రార్థనంతటిలో బహువచన ప్రయోగం చేయబడటాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. ఉదాహరణకు ''పరలోకమందున్న నా తండ్రి'' అని కాక ''పరలోకమందున్న మా తండ్రి'' అని ప్రార్థింప నేర్పబడ్డాము. మనతోపాటు ''విశ్వాస గృహమునకు చేరిన'' దేవుని బిడ్డలందరి కొరకు విజ్ఞాపన చేయాలని ఇది మనకు నేర్పిస్తుంది. ఈ సూత్రం ''నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమనే'' ఆజ్ఞలోని ఒక ముఖ్యమైన అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. నా పొరుగువారిని నేను నాకు వలె ప్రేమిస్తే, నా కొరకు నేను ఆశించే క్షేమాన్ని వారి కోసం కూడా కోరుకుంటాను. అంతే కాక ఈ సూత్రంపై యేసుక్రీస్తే చక్కని మాదిరిని కనపరిచాడు. యోహాను 17లో ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన, నిత్యం మన కొరకు ఆయన చేసే విజ్ఞాపన (హెబ్రీ 7:25) ఇందుకు మంచి ఉదాహరణలు. కాబట్టి మన కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తునందలి మనతోటి సహోదరీసహోదరులను మరిచిపోకూడదు.

     ఇక్కడ ప్రస్తావించబడిన 6 ప్రాతిపదికలు నీ ప్రార్థన జీవితాన్ని మెరుగుగుపరచడానికి సహాయపడేలా దేవుడు దీవించును గాక.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.