క్రైస్తవ యువత లోకంతో కలసి అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతున్న తరుణంలో, సంఘపరమైన హెచ్చరికలు, కుటుంబపరమైన క్రమశిక్షణలు లోపించడం వల్ల వారు అనేకసార్లు ఆ లోకంతో కలసి దైవవిరుద్ధమైన మార్గాలలో అడుగులెయ్యడం మనం తరచుగా గమనిస్తున్నాం. అందులో ఒకానొకటే అవిశ్వాసులను వివాహం చేసుకోవడం. ముఖ్యంగా క్రైస్తవ యువత చదువుకునే ప్రదేశాల్లోనూ ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లోనూ పరిచయమయ్యే అన్యులను ప్రేమించడం ద్వారా ఈ వివాహాలకు సిద్ధపడుతున్నారు. ఈ తెగకు చెందిన చాలామంది తమకు "అనుకూలమైన బోధకుల" ప్రేరేపణతో ఎస్తేరు అన్యరాజైన అహష్వేరోషును వివాహం చేసుకున్న సందర్భాన్నీ యోసేపు ఐగుప్తీయురాలైన ఆసెనతును వివాహం చేసుకున్న సందర్భాన్నీ ఉటంకించి తాము చేసుకున్న అన్య వివాహాలను సమర్థించుకోవడం మరింత విచారకరం. అందుకే లేఖనాల ప్రకారం విశ్వాసులు అవిశ్వాసులను వివాహం చేసుకోవచ్చా, చేసుకోకూడదు అంటే దానికి కారణం ఏంటి? ఎస్తేరు, యోసేపుల వివాహాలను మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలో వివరించడానికి ఈ వ్యాసం రాస్తున్నాను. ముఖ్యంగా లేఖనాల దృష్టిలో అన్యులుగా ఎవరెవరు గుర్తించబడతారో కూడా ఇందులో ప్రస్తావించదలిచాను.
ఆదికాండము 6:1-3 నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు.
ఈ వాక్యభాగంలో దేవుని కుమారులుగా పిలువబడేవారు నరుల కుమార్తెలుగా పిలవబడుతున్నవారి అందాన్ని చూసి వారిని వివాహం చేసుకున్నట్టుగా ఆ విషయంలో దేవుడు "నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు" అని ఆగ్రహించినట్టుగా మనం చూస్తాం. లేఖనాలలో దేవుని కుమారులు అన్నప్పుడు విశ్వాసులు అనే భావం చాలా స్పష్టంగా ఉంది.
రోమీయులకు 8: 14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
అదేవిధంగా ఇక్కడ (ఈ సందర్భంలో) "నరుల కుమార్తెలు" అన్నప్పుడు వారిని విశ్వాసుల నుండి వేరుచేసి మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోగలం (శరీరానుసారులు రోమా 8:5). దీనిప్రకారం విశ్వాసులైనవారు శరీరానుసారులను వివాహం చేసుకుంటే అది దేవునికి ఇష్టమైనకార్యం కాదని, ఆయనకు ఆగ్రహం కలిగించే కార్యమని ఈ సందర్భాన్ని బట్టి అర్థమౌతుంది. ఎందుకంటే దేవుడు తన పిల్లలు ఈ లోకం నుండి, లోకపు మాలిన్యాలనుండి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దీనిగురించి ముందుముందు మరింతగా మాట్లాడుకుందాం.
(నేను ఇక్కడ ప్రస్తావించిన "దేవుని కుమారులు, నరుల కుమార్తెలు" సందర్భాన్ని చాలామంది దేవదూతలు మానవ కుమార్తెలుగా భావిస్తుంటారు, కానీ నేను కొన్ని అభ్యంతరాల కారణంగా ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాను, దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి నేను రాసిన ఆదికాండము 6వ అధ్యాయపు వ్యాఖ్యానం చదవండి)
ఆదికాండము 24:1-4 అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము; నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడు నైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.
ఈ సందర్భంలో అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహం నిమిత్తం తన దాసునిచేత ప్రమాణం చేయించుకోవడం మనం చూస్తాం. నిజానికి అబ్రాహాము నివసిస్తున్న కనాను దేశంలో అతనికి చాలామంది సన్నిహితులు ఉన్నారు. వారిలో కొందరు మంచివారు కూడా ఉన్నారు, ఆ విషయం శారా చనిపోయిన సందర్భంలో మనకు అర్థమౌతుంది (ఆదికాండము 23). అయినప్పటికీ అతను వారిలో ఎవరి కుమార్తెనూ ఇస్సాకుకు వివాహం చెయ్యకుండా యెహోవా దేవునితో సంబంధం కలిగిన తన స్వజనుల కుమార్తె నిమిత్తం అన్వేషిస్తున్నాడు. ఎందుకంటే కనానీయులు యెహోవా దేవుణ్ణి ఎరుగని అన్యులు, విగ్రహారాధికులు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. వాగ్దానపుత్రుడి భాగస్వామి అన్యులకు చెందినదై ఉండే ప్రసక్తే లేదు, అందుకే అతని భాగస్వామిని యెహోవా దేవునితో సంబంధం కలిగిన తన స్వజనులలోనే వెదకమని తన దాసుడిని పంపిస్తున్నాడు.
ఇతర జాతుల ప్రజలతో పోల్చుకుంటే, రిబ్కా కుటుంబానికి యెహోవా దేవునితో ఎంతోకొంత సంబంధం ఉంది కాబట్టే, లాబాను అబ్రాహాము దాసుడిని "యెహోవా పేరుతో ఆశీర్వదించి" ఇంటిలోనికి ఆహ్వానించాడు, ఆ దాసుడు మార్గంలో జరిగిందంతా వివరించినప్పుడు బెతూయేలుతో సహా "అది యెహోవా వలన జరిగిన కార్యమని ఒప్పుకుని" రిబ్కాను అతనితో పంపించారు (ఆదికాండము 24:31-50). అయితే రాహేలు లాబాను ఇంట్లో దొంగిలించిన దేవతలను బట్టి వారు కూడా విగ్రహారాధికులే కదా అనే సందేహం మనకు కలుగుతుంది (అదికాండము 31:19). కానీ అవి వారు పూజించే విగ్రహాలు కాదు ఈ విషయం నేను అదికాండము 31వ అధ్యాయపు వ్యాఖ్యానంలో వివరించాను. అబ్రాహాము కుటుంబం పూర్వం విగ్రహారాధికులే అయినప్పటికీ వారు ఎప్పటికీ అలానే ఉండిపోయారని చెప్పలేం. అబ్రాహామును బట్టి వారు కూడా మార్పుచెంది యుండవచ్చు. అందుకే వారు కూడా యెహోవా దేవుణ్ణి తమ దేవునిగా తలచుకుంటున్నారు, ఆయనచేత ప్రత్యేకంగా పిలవబడిన అబ్రాహాము ఇంటిలోకి తమ కుమార్తెను సంతోషంగా సాగనంపుతున్నారు.
తరువాత కాలంలో ఇస్సాకు కూడా తన కుమారుడైన యాకోబు వివాహం విషయంలో ఈవిధంగానే ప్రవర్తిస్తూ అతనిని లాబాను ఇంటికి పంపించాడు (ఆదికాండము 28:1,2). ఈవిధంగా అబ్రాహాము ఇస్సాకులు తమ వాగ్దాన పుత్రుల జీవితంలోకి అన్య స్త్రీలు, ప్రవేశించకుండా చాలా జాగ్రత తీసుకున్నారు. ఎందుకంటే వారికి తెలుసు; తమ కుమారులు యెహోవా దేవుణ్ణి ఎరుగని అన్యులను, విగ్రహారాధికులను వివాహం చేసుకుంటే వారి జీవితాలు దేవునికి దూరంగా జరుగుతాయని. ఈ విషయం మోషే ధర్మశాస్త్రంలో మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
నిర్గమకాండము 34:16 మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.
ఈ వాక్యభాగంలో దేవుడు ఇశ్రాయేలీయులతో నీ కుమారులకు కనానీయుల (అన్యుల) కుమార్తెలను వివాహం చెయ్యకూడదని చెబుతూ, అలా చేస్తే జరిగే పర్యవసానం గురించి హెచ్చరిస్తున్నాడు. లేఖనాల ప్రకారం; విగ్రహారాధన అనేది చాలా పెద్ద పాపం. ఎందుకంటే ఏ తండ్రీ కూడా తన పిల్లలు ఉనికిలో లేని వేరొక వ్యక్తినో లేక ఏ రాయినో తండ్రీ అని పిలచి గౌరవిస్తుంటే ఓర్చుకోలేడు. అలాగే సృష్టికర్తయైన దేవుడు కూడా తన స్థానాన్ని విగ్రహాలకు ఆపాదించి పూజించడాన్ని ఎంతమాత్రం సహించలేడు (రోమా 1:22-24). విశ్వాసులు విగ్రహారాధికులను వివాహం చేసుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో వారి విగ్రహారాధనలోనో, దానికి సంబంధించిన ఆచారాల్లోనో పాలుపొందవలసిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. మహా జ్ఞానియైన సొలోమానే ఈ ఉరి నుండి తప్పించుకోలేకపోయాడు (1రాజులు 11: 4). తరువాత కాలంలో ఇశ్రాయేలీయులు ఎలాంటి నిర్భంధం లేకుండా అన్యులను వివాహం చేసుకుంటున్నప్పుడు నెహెమ్యా ఈ సొలొమోను సంఘటననే ఉదాహరణగా తీసుకుని వారిని తీవ్రంగా గద్దించాడు. అలా చెయ్యడం దేవుని దృష్టికి గొప్ప కీడు అనీ, పాపమనీ ప్రస్తావించాడు (నెహెమ్యా 13:25-27).
కాబట్టి విశ్వాసులు ఎట్టి పట్టిస్థితుల్లోనూ విగ్రహారాధికులను వివాహం చేసుకోకూడదు. అయితే కొందరు మేము విగ్రహారాధికులను కాకుండా ఏ మతానికీ చెందని వారిని అనగా నాస్తికులను వివాహం చేసుకుంటే పాపం కాదని భావించవచ్చు, ఎందుకంటే లేఖనాలు విగ్రహపూజలు చేసేవారిని వివాహం చేసుకుంటే తప్పుపడుతున్నాయి తప్ప ఎలాంటి విగ్రహారాధన చెయ్యకుండా, ఏ మతానికీ చెందకుండా ఉండేవారిని వివాహం చేసుకుంటే తప్పులేదన్నది వారి అభిప్రాయం. కానీ దేవుణ్ణి మహిమపరచని వారందరూ ఆయన ఉగ్రత కిందే ఉన్నారని లేఖనం చెబుతుంది (రోమా 1:18-21 , ఎఫెసీ 2:3). ఈ కారణంగా దేవుని ఉగ్రతను తప్పించుకున్న విశ్వాసులు ఇంకా ఆయన ఉగ్రతకిందే జీవిస్తున్న వ్యక్తులను తమ జీవిత భాగస్వాములుగా ఆహ్వానించకూడదు. అదేవిధంగా లేఖనాలు విశ్వాసులు విగ్రహారాధికులను వివాహం చేసుకోకూడదు అన్నప్పుడు వారు తప్పకుండా విశ్వాసులనే వివాహం చేసుకోవాలనే భావం అందులో ఉంది. దీనికి పౌలు మరింత స్పష్టతను ఇస్తున్నాడు చూడండి.
1కొరింథీయులకు 7: 39 ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.
ప్రభువు నందు వివాహం చేసుకోవడమంటే క్రైస్తవ పద్ధతిలో పెళ్ళి చేసుకోవాలని మాత్రమే కాదు, ముఖ్యంగా వధూవరులు ఇద్దరూ ప్రభువుకు చెందినవారై యుండాలని, వారి వివాహ జీవితం ప్రభువుకు మహిమ తెచ్చేదిగా ఉండాలని అర్థం. కాబట్టి విశ్వాసి తప్పకుండా ప్రభువునందు ఉన్న వ్యక్తినే వివాహం చేసుకోవాలి. లేఖనాలలో ప్రభువునందు అంటే; మారుమనస్సు పొంది ఆయన శరీరంలో అవయంగా చేర్చబడినవారని భావం. దీనికారణంగా "మారుమనస్సు అనుభవం లేని క్రైస్తవ కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా మనకు అన్యులే, విగ్రహారాధికులే". కాబట్టి వివాహం చేసుకునే విశ్వాసులు అవతలి వ్యక్తి క్రైస్తవ కుటుంబానికి చెందినవారేనా, చర్చికి వెళ్ళేవారేనా అనే కాకుండా "మారుమనస్సు అనుభవం ఉన్నవారేనా లోకం నుండి ప్రత్యేకంగా జీవిస్తున్నవారేనా" అనేది గమనించడం చాలా ప్రాముఖ్యం. లేదంటే విశ్వాసి వారివల్ల కూడా ప్రభువుకు దూరం అవ్వవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే పౌలు మరొక సందర్భంలో ఇలా అంటున్నాడు.
2 కొరింథీయులకు 6:14-17 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
ఈ మాటలు వివాహం గురించిన సందర్భంలో చెప్పబడకున్నప్పటికీ, ఆ విషయంలో ఈ నియమాలను మనం మరింతగా ఆపాదించుకోవాలి. లేదంటే విశ్వాసియొక్క విశ్వాస జీవితం ఎంతో నష్టపోతుంది. ఎందుకంటే వివాహం యొక్క పరమార్థం, దానివెనుక ఉన్న దేవుని సంకల్పం విశ్వాసికి తెలిసినట్టుగా అన్యులకు (విశ్వాసులు కానివారికి) తెలియదు. దీనికారణంగా వారు వివాహ జీవితాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు, విశ్వాసియైన తమ భాగస్వామిని తమ పాపంలో పాలివారుగా చేస్తుంటారు. ఈవిధంగా ఇబ్బందిపడుతున్న ఎంతోమంది విశ్వాసులను నేను చూసాను. అందుకే విశ్వాసి విశ్వాసిని మాత్రమే, మారుమనస్సు అనుభవం కలిగిన విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలి.
కొంతమంది విశ్వాసులైతే వారు కూడా భవిష్యత్తులో విశ్వాసులుగా మారతారనే (అలా మార్చుకోగలమనే) ధీమాతో అవిశ్వాసులను వివాహం చేసుకుంటున్నారు. దానికి అలా మార్పుచెందిన వ్యక్తులను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. నిజమే; కొందరు విశ్వాసులు అవిశ్వాసులను వివాహం చేసుకున్నప్పటికీ తరువాత కాలంలో వారు కూడా విశ్వాసులుగా మార్పుచెందిన సాక్ష్యాలు ఉన్నాయి, అలాంటివారిని నేను కూడా చూసాను. అయితే అది దేవుడు వారిపట్ల చూపించిన కనికరమే తప్ప, మనం అవిశ్వాసులను వివాహం చేసుకోవడానికి అనుమతి కాదు. వారు దేవుని సంకల్పంలో ఉన్నారు కాబట్టి ఉగ్రతనుండి తప్పించుకుని విశ్వాసులుగా మార్పుచెందారు. ఉదాహరణకు రూతు. కానీ ఇప్పటికే విశ్వాసులైన మనం మాత్రం లేఖనాలలో బయలుపరచబడిన దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి. ఆ అజ్ఞల్లో ఒకానొకటే విశ్వాసులైన మనం విశ్వాసులను మాత్రమే వివాహం చేసుకోవాలి. "ప్రభువు నందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను".
ఇక ఎస్తేరు, యోసేపుల వివాహం దగ్గరకు వస్తే; ఒక విశ్వాసి లేఖనాలలో బయలుపరచబడిన దేవుని చిత్తానికి తలవంచాలి. మనకు దేవుని ఆజ్ఞలే ప్రామాణికం తప్ప ఎస్తేరు జీవితం కాదు. దేవుడు ఎస్తేరును సాధనంగా వాడుకున్నంత మాత్రాన, ఆమె చేసుకున్న అన్య వివాహాన్ని ఆయన ఆమోదించినట్టు కాదు. ఆయన తన కనికరం చొప్పున ఎవర్నైనా కనికరించి క్షమిస్తాడు, వారిని సాధనంగా వాడుకుంటాడు. వాటి ఆధారంగా మనం స్పష్టంగా బోధించబడుతున్న దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించకూడదు. ఉదాహరణకు; ఆయన మోయాబీయుల జాతికి చెందిన రూతు ద్వారా యేసుక్రీస్తు వంశావళిని కొనసాగించాడు. ఈ మోయాబీయులు లోతు కుమార్తెలు చేసిన పాపం కారణంగా ఉద్భవించినవారు. ఆ జాతికి చెందిన స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నంతమాత్రాన లోతు కూతుర్లు చేసింది పాపం కాదందామా? యూదా తామారుతో చేసిన వ్యభిచారం కారణంగా జన్మించిన పెరెసు ద్వారా కూడా యేసుక్రీస్తు వంశావళి కొనసాగింది. అంతమాత్రాన యూదా తామరులు చేసింది వ్యభిచారం కాదందామా? లేదు తప్పకుండా వారు చేసింది పాపమే. అయినప్పటికీ దేవుడు వారిని క్షమించి, వారి పాపంతో నిమిత్తం లేకుండా తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడు. అలానే ఎస్తేరు వివాహాన్ని కూడా సాధనంగా వాడుకున్నాడు. ఆయన సార్వభౌముడు, సాతానును కూడా తన చిత్తనెరవేర్పుకై వాడుకునే సర్వశక్తిమంతుడు.
అదేవిధంగా యోసేపు కానీ, మోషే కానీ అన్యస్త్రీలనే వివాహం చేసుకున్నారని మనం కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే; ఆదికాండము 41:45 లో ఫరో యోసేపుకు ఆసెనతును వివాహం చేసాడని రాయబడినప్పటికీ అది వెంటనే జరిగిందిగా మనం భావించలేము. యోసేపు ఐగుప్తు అధికారాన్ని చేపట్టిన కొంతకాలానికి ఆసెనతు యోసేపుకు పరిచయమై యెహోవా దేవునిగురించి తెలుసుకున్న తరువాతే అతను ఆమెను వివాహం చేసుకునియుండవచ్చు. మోషే విషయంలో కూడా మనం ఇదేవిధంగా ఆలోచించాలి. మోషే మామయైన యిత్రో ఒక మిద్యానీయుడు (నిర్గమకాండము 3:1), మిద్యానీయులు అంటే అబ్రాహాముకు కెతూరా ద్వారా జన్మించిన సంతానం (ఆదికాండము 25:1,2 ) ఈ కారణంగా వారిలో కొందరు యెహోవా దేవునికి భక్తులుగానే జీవించారు, అందులో ఈ యిత్రో ఒకరు, ఇతను యెహోవా దేవునికి బలులను అర్పిస్తూ ఆయనను సేవించబట్టి "యాజకుడు" అని కూడా పిలవబడ్డాడు (నిర్గమకాండము 3:1, 18:1) ఇతను యెహోవా దేవునికి మోషే సమక్షంలో బలులను అర్పించినట్టు మనం నిర్గమకాండము 18:12 లో చూస్తాం. దీనినిబట్టి అతని కుమార్తెయైన సిప్పోరా కూడా యెహోవా దేవుణ్ణి ఎరిగిన విశ్వాసురాలే. ఒక మాట ఆలోచించండి. దేవునికోసం ఎలాంటి శ్రమలకైనా సిద్ధపడిన యోసేపు, మోషేలు వివాహం వంటి ప్రాముఖ్యమైన విషయాలలో తప్పిపోతారని అనుకోగలమా? ఒకవేళ యోసేపు కానీ, మోషే కానీ అన్యులనే వివాహం చేసుకున్నారు అనుకున్నప్పటికీ వారి విషయంలో కూడా నేను ఎస్తేరు విషయంలో చెప్పిన మాటలే వర్తిస్తాయి. మనకు లేఖనాలు (దేవుని ఆజ్ఞలు) ప్రామాణికం తప్ప వ్యక్తుల జీవితాలు కాదు. భక్తుల జీవితాలలో కూడా మనం లేఖనాల పరిధిలోనే మాదిరిని తీసుకోవాలి. కాబట్టి లేఖనాల (దేవుని ఆజ్ఞ) ప్రకారం మనం విశ్వాసులనే వివాహం చేసుకోవాలి.
1కొరింథీయులకు 7: 39 ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.