ఇతర అంశాలు

రచయిత: కె విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 20 నిమిషాలు

బైబిల్ పై బురద చల్లడమే బ్రతుకుదెరువుగా పెట్టుకున్న మతోన్మాది ఒకరు "బైబిల్ దేవుడు ఇశ్రాయేలీయులకు మోషేకాలంలో మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చి వారెలా జీవించాలో బోధించాడు. ఇశ్రాయేలీయులు కాని మిగిలిన జాతుల ప్రజలకు ఆవిధంగా ఏమీ బోధించలేదు. అలాంటప్పుడు ఆ ప్రజలు (ఉదాహరణకు; కనానీయులు) ఎలాంటి పాపం‌ చేసినప్పటికీ వారికి ఎలా తీర్పు తీరుస్తాడంటూ" వాదించాడు.

అతను ఇలా వాదించడానికి బైబిల్ పై అతని కపట పరిశీలన మాత్రమే కారణం కాదు కానీ కొందరు క్రైస్తవ బోధకులు కూడా కొన్ని లేఖనాలను అపార్థం చేసుకుని "ధర్మశాస్త్రానికి ముందు ప్రజలకు ఏది పాపం ఏది పాపం కాదు అనే విషయాలు తెలియవంటూ" బోధిస్తుంటారు. ఇలాంటి బోధ కారణంగా కూడా ఆ మతోన్మాది దేవునిన్యాయంపై ఆ ఆరోపణ చెయ్యగలిగాడు. కానీ బైబిల్ గ్రంథంలోని అనేక సందర్భాలు మోషే ధర్మశాస్త్రానికి ముందు జీవించిన ప్రజలకు అందులో బోధించబడిన నైతికవిలువలు తెలుసని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. అందుకే ఈ వ్యాసంలో సాధ్యమైనంతమట్టుకు అవన్నీ వివరించే ప్రయత్నం చేస్తాను.

ఎందుకంటే దేవుని పరిశుద్ధ స్వభావానికి సంబంధించిన నైతిక విలువలను, మానవుడికి ఆయన ప్రారంభం నుండీ బోధిస్తూనే ఉన్నాడని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ధర్మశాస్త్రానికి ముందటికాలంలోనైనా, తరువాత కాలంలోనైనా ఆ నైతిక విలువలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ధర్మశాస్త్రం నుండి విడిపించబడి క్రీస్తునందు విశ్వాసులమైన మనం కూడా, దాని శాపం నుండీ, అందులోని విధిరూపకమైనవాటి (ఆచార సంబంధమైనవాటి) నుండి విడిపించబడ్డామే తప్ప నైతికవిలువల నుండి కాదు (ధర్మశాస్త్రం అన్నప్పుడు అందులో చాలా భాగాలు ఉన్నాయి). నిబంధన ప్రజలు ఎప్పటికీ ధర్మశాస్త్రంలోని నైతిక విలువలను అనుసరిస్తూనే జీవిస్తారు. నూతన నిబంధనలో అనేక వాక్యభాగాలు దీనిని రుజువుచేస్తున్నాయి. ఉదాహరణకు; దేవుణ్ణి మాత్రమే పూజించాలి, విగ్రహారాధన చెయ్యకూడదు. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువానిది ఆశించకూడదు, అబద్ధం చెప్పకూడదు, ద్వేషించకూడదు, వరుసలు తప్పి ప్రవర్తించకూడదు.

ఇక ధర్మశాస్త్రానికి ముందున్న ప్రజలకు అందులోని నైతికవిలువలు తెలుసు అని బైబిల్ స్పష్టంగా ఇస్తున్నటువంటి ఆధారాలను పరిశీలిద్దాం.

ఆదికాండము 4:10-13 అప్పుడాయన నీవు చేసిన పనియేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.

ఈ సందర్భంలో కయీను తన తమ్ముడిని చంపినప్పుడు దేవుడతనిపై ఆ పాపాన్ని ఆరోపించి, తగిన శిక్షను విధించినట్టు కనిపిస్తుంది. కానీ నరహత్య చెయ్యకూడదనే ఆజ్ఞను మనం నోవహు కాలంలోనూ (ఆదికాండము 9:6), మోషే ధర్మశాస్త్రంలోనూ (నిర్గమకాండము 20:13)  దేవుడు తెలియచేసినట్టుగా కనిపిస్తుంది. మరి అంతకుముందున్న ప్రజలకు ఇది తెలియకపోతే, ఆదాము నుండి రెండవతరమైన కయీను అది చేసినప్పుడు దేవుడెందుకు శిక్షిస్తున్నాడు? కాబట్టి తప్పకుండా ఆ ఆజ్ఞ కయీనుకు తెలుసు. అది కయీను మాటల్లో కూడా మనకు స్పష్టమౌతుంది. ఒకవేళ అతనికి హత్య చెయ్యడం పాపమని తెలియకపోతే, దేవుని దగ్గర దానిని దాచిపెడుతూ "నా తమ్ముడికి నేను కావలివాడనా" అనకుండా, అతన్ని "నేనే  చంపేసాను, అందులో తప్పేంటి" అన్నట్టుగా దేవునితో వాదించేవాడు.

ఆదికాండము 6:11,12 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను; భూమిమీద సమస్తశరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

ఈ సందర్భంలో దేవుడు నోవహు కాలపు ప్రజల బలత్కారం నిమిత్తం సంతాపపడుతూ, వారు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారని పలకడం మనకు కనిపిస్తుంది. దీనిప్రకారం వారి ముందు ఆయన ఒక మార్గాన్ని ఉంచాడు కానీ వారు దానిని తప్పి ప్రవర్తించారు, కాబట్టే ఆయన వారిని నాశనం చేసి నిందారహితుడిగా ఆయనతో నడిచిన నోవహునూ, అతని కుటుంబాన్నీ కాపాడుతున్నాడు. నోవహు దేవుని ఎదుట నిందారహితుడిగా నడిచాడంటే (ఆదికాండము 6:9), దానికి ఖచ్చితంగా అతనికి ఒక ప్రమాణం తెలియచెయ్యబడి ఉండాలి.

ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

ఈ సందర్భంలో యాకోబు కుమారుడైన రూబేను, తన తండ్రి ఉపపత్నితో శయనించినట్టుగా రాయబడింది. ఆ విషయం తెలుసుకున్న యాకోబు ఆ సమయంలో మౌనంగా ఉన్నప్పటికీ తన మరణ సమయంలో దానిని జ్ఞాపకం చేసుకుంటూ రూబేనును శపించినట్టూ, అతనిని జేష్ఠత్వపు హక్కునుండి తొలగించినట్టూ మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 49:3,4 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.  నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.

1 దినవృత్తాంతములు5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు.

వాస్తవానికి తన తండ్రి భార్యతో శయనించకూడదు అనే నియమం కూడా మోషే ధర్మశాస్త్రంలోనే రాయబడింది.

ద్వితియోపదేశకాండము 22: 30 ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.

ద్వితియోపదేశకాండము 27: 20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

ఈ నియమం దీనికి ముందటి కాలపు ప్రజలకు తెలియకపోతే/వర్తించకపోతే, రూబేను చేసింది పాపమెలా ఔతుంది, దాని విషయంలో యాకోబు అతనిని ఎందుకు శపించాడు.

ఆదికాండము 38:26 యూదా వాటిని గురుతు పట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పు డును ఆమెను కూడలేదు.

ఈ సందర్భంలో, యూదా తన కోడలిని వేశ్యగా భావించి ఆమెతో శయనించాక, ఆమె అతని కోడలు అని తెలుసుకుని మరెప్పుడూ ఆమెతో అలా ప్రవర్తించకపోవడం మనం చూస్తాం. కోడలితో శయనించకూడదనే ఆజ్ఞ‌ కూడా మోషే ధర్మశాస్త్రంలోనే రాయబడింది.

లేవీయకాండము 18:15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

ఈ నియమం యూదాకు ముందే తెలుసు కాబట్టే, అప్పటికే తన భార్య చనిపోయినప్పటికీ, కోడలిని వేశ్యగా భావించి గర్భవతిని చేసినప్పటికీ ఆమెను వివాహం చేసుకుని కాపురం చెయ్యలేదు. ఆమెకు కూడా ఆ నియమం తెలుసు కాబట్టే తన మామ దగ్గరకు మారువేషంలో వెళ్ళింది తప్ప, ముఖాముఖిగా వెళ్ళి నీ కొడుకును నాకు ఇవ్వకపోతే నువ్వే నన్ను పెళ్ళి చేసుకో అని అడగలేకపోయింది.

ఆదికాండము 12:17-19 అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయిని బట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అనియేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను.

ఈ సందర్భంలో అన్యరాజైన ఫరో, తనతో అబ్రాహాము శారాను తన చెల్లిగా చెప్పడాన్ని బట్టి గద్దిస్తూ, నువ్వలా చెప్పడం వల్ల నేను ఆమెను నా భార్యగా చేసుకుందునే అంటున్నాడు. అంటే పరాయివాని భార్యను తన భార్యగా చేసుకోకూడదనే నైతికనియమం అతనికి తెలుసు (దానిని పాటిస్తారా పాటించరా అనేది పక్కనపెడితే అలా చెయ్యకూడదని మాత్రం వారికి తెలుసు).

ఇలాంటివే మరో రెండు సందర్భాలు చూడండి -

ఆదికాండము 20:2-5 అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.

ఆదికాండము 26:9-11 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పనియేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవుగదా అనెను. అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా-

ఈ సందర్భాలలో, అబ్రాహామూ, ఇస్సాకూ గెరారు దేశాన్ని పాలించిన ఇద్దరు అబీమెలకుల దగ్గరా తమ భార్యలను చెల్లెళ్ళని చెప్పడం, తరువాత వారు ఆ పురుషులకు భార్యలని తెలిసి తిరిగి అప్పగించడం‌ మనకు కనిపిస్తుంది. పరాయి పురుషుల భార్యలను ఆశించకూడదని మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన నైతికనియమం (నిర్గమకాండము 20:17)  వీరికి‌ తెలియకపోతే ఆ విధంగా కంగారుపడి శారా, రిబ్కాలను వారికి అప్పగించవలసిన అవసరం లేదు.

అదేవిధంగా, అబ్రాహాము ఇస్సాకులు తమ భార్యలైన‌ శారా రిబ్కాలను ఆ రాజుల ముందు చెల్లెళ్ళని మాత్రమే ఎందుకు చెప్పారు? ఉదాహరణకు; నేను ఒక స్త్రీని నా చెల్లెలు అని చెబితే ఆమెకూ నాకూ మధ్య లైంగిక సంబంధం ఉందని ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే, అలా చెయ్యడం మహా పాపమని మన సమాజానికి తెలుసు. ఇదే అవగాహన ఐగుప్తీయులకూ, ఫిలిష్తీయులకూ కూడా ఉంది కాబట్టే అబ్రాహాము ఇస్సాకులు తమ భార్యలైన శారా రిబ్కాలను వారిముందు మా చెల్లెళ్ళని చెబితే వారి మధ్య లైంగిక సంబంధం ఉందేమో అని వారు అనుమానించలేదు. ఇస్సాకు రిబ్కాతో సరసం ఆడడం చూసిన అబీమెలకుకు అన్నాచెల్లెళ్ళు అలా ఉండరని తెలియబట్టే "నాతో ఎందుకు అబద్ధం చెప్పావు, ఈమె‌ నీ చెల్లి కాదు భార్య" అంటూ అతనితో వాదిస్తున్నాడు. రక్తసంబంధికులతో లైంగిక సంబంధం కలిగి ఉండకూడదనే నియమం కూడా మోషే ధర్మశాస్త్రంలోనే రాయబడింది (లేవీకాండము 18:9),  కానీ అది వీరికి ముందే తెలుసు.

మరో ప్రాముఖ్యమైన సందర్భాన్ని కూడా చూద్దాం -

లేవీయకాండము 18:24,25 వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుట నుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

ఈ వాక్యభాగానికి ముందున్న సందర్భాన్ని మనం చదివితే, కనానీయులు వావివరసలు లేకుండా లైంగికసంబంధాలు సాగించినట్టూ, స్వలింగసంపర్కం, జంతుశయనం వంటి హేయమైన కార్యాలు కూడా జరిగించినట్టూ కనిపిస్తుంది. ఆ కారణంగానూ, ఇతర హేయక్రియల కారణంగానూ దేవుడు వారిని నాశనం చేస్తున్నాడు. ఒకవేళ మోషే ధర్మశాస్త్రానికి ముందు ప్రజలకు దేవుని చేత నైతికనియమాలు బోధించబడకపోతే కనానీయులు చేసేది పాపమని ఎలా ఆరోపించబడుతుంది? సొదొమ గొమొర్రా పట్టణస్తులపై ఎలా ఆరోపించబడింది?

ఇంతకూ అలా చెయ్యకూడదని ఆయన‌‌ బోధించాడో లేదో ఈ వాక్యభాగం చూడండి -

ద్వితీయోపదేశకాండము 8:20 నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవు డైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.

ఈ వాక్యభాగం ప్రకారం దేవుడు వారందరికీ అలా చెయ్యకూడదని బోధించాడు కానీ, వారు ఆయన మాట వినలేదు. ఇంతకూ ఆయన ఎలా బోధించాడంటే (కొన్ని అవాంతర శాఖలవారు చెబుతున్నట్టు వారి మతగ్రంథాలను కూడా ఆయనే రాయించి కాదు) -

1. మనిషి దేవునిపోలిక దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు అనగా ఆయన నైతికగుణలక్షణాలతో సృష్టించబడ్డాడు (ఆదికాండము 1:26:27 వ్యాఖ్యానం చూడండి). మానవ మనసాక్షి అందులో భాగమే. అందుకే ఆ మనసాక్షి మనిషికి తప్ప మరే జీవికీ సంక్రమించలేదు‌. ఆవిధంగా ఆయన మనస్సాక్షి ద్వారా తన నైతిక విలువలను ప్రారంభం నుండీ బోధిస్తూ వచ్చాడు. దానిని ఉద్దేశించే పౌలు "ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు" (రోమీయులకు 2:14,15) అని రాస్తున్నాడు.

గమనించండి. ఆ మనసాక్షిని బట్టే ప్రపంచంలోని మనుషులందరికీ అబద్ధం చెప్పడం నేరం, హత్య చెయ్యడం నేరం, వ్యభిచరించడం నేరం, దొంగతనం చెయ్యడం నేరం...ఇలాంటి నైతికతకు సంబంధించిన విషయాలు బాగా తెలుసు. వారి వ్యక్తిగత కాఠిన్యాన్ని బట్టి వాటిని అనుసరించకపోయినప్పటికీ, వారి శరీరవాంఛలను బట్టి వాటిలో కొన్ని నేరాలు కాదన్నట్టుగా వారి దేశాలలో చట్టాలు చేసుకున్నప్పటికీ, వారి మనస్సాక్షికి మాత్రం అవి నేరమని బాగా తెలుసు (మనస్సాక్షి వాత వేయడినప్పుడు మాత్రం వాటిని నేరంగా పట్టించుకోరు 1 తిమోతీ 4:3). దీనిప్రకారం ఏ కాలంలోనైనా మానవుడు వాటికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఆయన శిక్షించడం న్యాయమే.

మోషేకాలంలో ఆయన మానవునికి మొదటినుండీ మనస్సాక్షి ద్వారా బోధించిన నైతికవిలువలనే గుర్తుచేస్తూ వాటితో పాటుగా తన ఆరాధనకూ (బలులకూ) మరికొన్ని ఆచారాలకు అనగా వ్యక్తిగత శుభ్రతకూ ఆహారానికీ సంబంధించిన ఆజ్ఞలను ధర్మశాస్త్రంగా రాయించి ఇచ్చాడు. వీటిలో కూడా కొన్ని ఆజ్ఞలు భక్తులకు ముందు నుండీ తెలుసు. ఉదాహరణకు, దశమభాగం గురించిన కట్టడ మనకు మోషేధర్మశాస్త్రంలో రాయబడింది కానీ, అబ్రాహాము, యాకోబులు వాటిని ముందే పాటించినట్టుగా మనం చదువుతాం (ఆదికాండము 14:20, 28:22). అదేవిధంగా దేవునికి ఆయన పవిత్ర జంతువులుగా ఎంచినవాటిని మాత్రమే బలిగా అర్పించాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. కానీ అంతకుముందే నోవహు దానిని పాటించినట్టుగా మనం చూడగలం (ఆదికాండము 8:20).

2. నోవహు జలప్రళయం తరువాత ప్రజలంతా ఒకే చోట నివసించారు, అక్కడి నుండే చెదరగొట్టబడి అనేక మతాలను‌ స్థాపించుకున్నారు (ఆదికాండము 11వ అధ్యాయం). ఆ సమయంలో నోవహు కుమారులవంటి భక్తులు (మెస్సీయ జన్మించబోయే వంశంలోనివారు) వారి మధ్య ఉండి, వారికి దేవుని నైతిక ప్రమాణాలను తప్పకుండా బోధించియుంటారు. కాబట్టే వారు చెదరిపోయినప్పటికీ వారివారి మతగ్రంథాలు కొన్నిటిలో వీటి గురించిన ప్రస్తావనలు మనకు కనిపిస్తుంటాయి (జలప్రళయంతో సహా).

ఈ విధంగా మానవులందరికీ మోషే ధర్మశాస్త్రానికి పూర్వమే నైతిక నియమాలు తెలుసు. అలా తెలియవు, ధర్మశాస్తం లేనప్పుడు ఏం చేసినా పాపం ఆరోపించబడదనే అపార్థబోధ వల్ల చివరికి ఆదాము మొదటి తరమంతా వావివరుసలు తప్పి తమ రక్తసంబంధికులనే వివాహం చేసుకునేలా దేవుడు అనుమతించాడనీ, దేవునిచేత పిలవబడిన అబ్రాహాము కూడా తన తండ్రి కుమార్తెనే వివాహం చేసుకున్నాడనే దరిద్రపు బోధలు సంఘంలో చోటుచేసుకున్నాయి. కానీ అవేమీ కూడా వాస్తవం కాదు. ఈ వ్యాసాలు చదవండి.

కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడా?

నూతననిబంధనలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్నప్పుడు ధర్మశాస్త్రంలోని నైతిక నియమాల గురించి చెప్పబడడం లేదు. ఆచార సంబంధమైన విధుల గురించే చెప్పబడుతున్నాయి. వాటిని మానవులు తమ పతనస్వభావం కారణంగా ఒకటి కూడా తప్పిపోకుండా పాటించలేక శాపానికి గురౌతున్నారు; అందుకే  క్రీస్తు వాటిని నెరవేర్చి తన సిలువ మరణంతో  కొట్టివేసాడు (ఎఫెసీ 2:14, 2 కొరింథీ 3:14-16).

ఇప్పటిదాకా మనం చూసిన ఈ వాదనను కొందరు మరొక వచనం ఆధారంగా వ్యతిరేకించే ప్రయత్నం చేయొచ్చు; అది కూడా చూడండి -

కీర్తనల గ్రంథము 147:19,20 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.

ఈ సందర్భంలో, దేవుని న్యాయవిధులు ఇశ్రాయేలీయులకు మాత్రమే తెలుసని, మరే జనానికీ ఆయన అలా తెలియచేయలేదని ఉంది.  దీనిప్రకారం, మోషే ధర్మశాస్త్రానికి ముందున్న ప్రజలకు నైతికవిలువలు తెలియవని చెప్పే వాదనే సరిగానే కనిపిస్తుంది. ఐతే అలా ఆలోచించే ముందు ఇశ్రాయేలీయులకు ముందున్న అబ్రాహాము, నోవహు, హనోకులకు కూడా దేవుని న్యాయవిధులు తెలియవా? దేవుడు వారికి తెలియచెయ్యలేదా అనే ప్రశ్న వేసుకోవలసి వస్తుంది. వాస్తవానికి ఈ సందర్భంలో భక్తుడు ఒక ప్రత్యేకమైన రీతిలో (ప్రత్యక్షతను అనుగ్రహించి) ఇశ్రాయేలీయులకు లిఖితపూర్వకంగా, నిబంధన ప్రకారం ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడే తప్ప, అందులోని నైతికవిలువలు ముందుకానీ, తరువాత కానీ ఎవరికీ మనస్సాక్షి ద్వారా తెలియచెయ్యలేదనే భావం ఇందులో లేదు.

మోషే ధర్మశాస్త్రంలో నైతికవిలువలతో పాటు వాటిని మీరినవారిని ఎలా శిక్షించాలో తెలియచేస్తూ న్యాయశాస్త్రాన్ని కూడా ఆయన రాయించాడు. అదేవిధంగా అందులో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో (బలులు, ఆచారాలు) స్పష్టంగా క్రమంగా రాయబడ్డాయి (ఇశ్రాయేలీయులకు పితరులైనవారిలో కొందరికి కూడా ఇవి ప్రత్యక్షత ద్వారా తెలియచేయబడ్డాయి). తరువాత కాలంలో కూడా ఇశ్రాయేలీయులకు ప్రవక్తల ద్వారా ఆ ధర్మశాస్త్ర భావాన్ని వివరిస్తూ మరెన్నో బోధలు చెయ్యబడ్డాయి. ఆవిధంగా అన్యజనులకు ఆయన తన న్యాయవిధులను వాక్యప్రత్యక్షత ద్వారా తెలియచెయ్యలేదు. ఆయనను ఎలా ఆరాధించాలో వారికి‌ తెలియకుండానే ఉన్నారు. కానీ ఆ దేవుని గురించిన కొన్నిసత్యాలు ఈ సృష్టి ద్వారా అందరూ తెలుసుకోగలరు (రోమా 1:19,20, అపొ.కా 14:16,17).

దేవుడు కనాను ప్రజలను నశింపచేసిందీ, సొదొమ పట్టణాలపై అగ్నిని కురిపించిందీ, నినెవేని నాశనం చేయబోతున్నానని యోనాతో ప్రకటింపచేసిందీ, మిగిలిన కొన్ని జాతులపై యుద్ధాన్ని ప్రకటించిందీ,  వారికి ఆయన మనస్సాక్షి ద్వారా బోధించిన నైతికవిలువలను తప్పారనే కారణంతోనే తప్ప, మోషే ధర్మశాస్త్రంలోని విధిరూపకమైన ఆజ్ఞలు (ఆరాధనకు సంబంధించినవి, ఇతరమైనవి) పాటించలేదని కాదు. కాబట్టి, మోషేధర్మశాస్త్రానికి ముందు ప్రజలకు అందులోని నైతికవిలువలు తెలియవని కానీ, ధర్మశాస్త్రం నుండి విడిపించబడిన మనకు అందులో రాయబడిన నైతికవిలువలు వర్తించవని కానీ బోధించడం వాక్యవిరుద్ధం. నూతన నిబంధనలో నైతిక విలువలకు ఎలాంటి మార్పులూ చెయ్యబడలేదు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

పది ఆజ్ఞల వివరణ

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.