విమర్శలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

 

గమనిక: ఈ వ్యాసం పూర్తిగా చదవకుండా అపార్థం చేసుకోవడం కానీ నాకు తీర్పు తీర్చడం కానీ చెయ్యవద్దని విజ్ఞప్తి. "సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును" (సామెతలు 18:13). ఇది చదువుతుండగా మీకు ప్రారంభంనుండే కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి.‌ వ్యాసం పూర్తయ్యేసరికి అన్నిటికీ సమాధానం లభిస్తుంది.

హిందూ మతోన్మాదులు బైబిల్ అనైతికమైన గ్రంథమని ఆరోపించే క్రమంలో పదే పదే కయీను భార్యను ప్రస్తావించి బైబిల్ లో అన్నా చెల్లెళ్ళ వివాహం ఉందంటూ మాట్లాడుతుంటారు. దీనికి సంఘచరిత్రలో చాలామంది బోధకులు "లేఖనం దేనినైతే ప్రకటిస్తుందో దానిని ప్రకటించాలి, లేఖనం దేని విషయంలోనైతే మౌనంగా ఉందో ఆ విషయంలో మౌనంగానే ఉండాలనే" (Be Silent Where the Bible Is Silent) నియమాన్ని (ద్వితీయోపదేశకాండము 29:29) మరచిపోయి ఆదాము హవ్వల ప్రథమ కుమారుడైన కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడని (ఆదికాండము 4:16,17) బోధించడం కూడా ప్రధాన కారణం. ఇది చాలా హేయమైన మరియు దేవుని నైతికతనే ప్రశ్నిస్తున్నటువంటి బోధ. ఎందుకంటే ఆయన తన నైతికతకు ప్రతిరూపమైన ధర్మశాస్త్రంలో రక్తసంబంధికులను అనగా తమ స్వంత తల్లికి కానీ, తండ్రికి కానీ పుట్టిన వారిని వివాహం చేసుకోవడం అత్యంత హేయమైన పాపంగా పరిగణించాడు. ఆయన కనానీయులను నాశనం చెయ్యడానికి అది కూడా ప్రధాన కారణం.

లేవీయకాండము 18:9-25
నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క యైనను నీ తల్లి కుమార్తె యొక్క యైనను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. "నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది".

అలాంటప్పుడు కయీను కానీ, ఆదాముకు పుట్టిన ఇతర సంతానం కానీ, తమ తల్లితండ్రులకు పుట్టిన వారినే వివాహం చేసుకుంటే దానికి దేవుడే బాధ్యుడౌతాడు. తరువాత తరాలు అలా చేసినా లేక దేవుడు పెట్టిన ప్రత్యమ్నాయాలను ధిక్కరించి వీరే అలా చేసుకున్నా ఆ పాపం‌ వారిదే ఔతుంది. ఉదాహరణకు కనానీయుల్లా. కానీ ఆదాము హవ్వల మొదటి సంతానం ఏ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల అలా చేసినప్పుడు మాత్రం "మీరు ఫలించి అభివృద్ధి చెందమని చెప్పిన దేవుడు" (ఆదికాండము 1:28) వారికి వేరే ప్రత్యమ్నాయం లేకుండా చెయ్యబట్టే వారు అలా చేసుకున్నారు కాబట్టి ఆ అనైతికపు వివాహాలకు దేవుడే కారణమౌతాడు. ఉదాహరణకు; ఎవరైనా తల్లితండ్రులు తమ కొడుకుకు మద్యం త్రాగవద్దని ఆజ్ఞాపించారు అనుకుందాం, కానీ అదే తల్లితండ్రులు ఆ అబ్బాయిని ఒక గదిలో బంధించిప్పుడు, అతనికి దాహం వేసి ఆ గదిలో మద్యం తప్ప ఏమీలేని పరిస్థితిలో దానిని త్రాగితే దానికి బాధ్యులు ఎవరు? ఆ తల్లితండ్రులే కదా! ఎందుకంటే వారు ఆ అబ్బాయికి దాహం వేస్తుందని తెలిసి కూడా ఆ గదిలో మంచి నీరు ఉంచలేదు. అందుకే అతనికి అందుబాటులో ఉన్న మద్యంతో అతను తన దాహం తీర్చుకున్నాడు.

దీనిని మరోలా ఆలోచిద్దాం; దేవుడు ఆదాము హవ్వలను ఆకలిగలవారిగా సృష్టించి, ఏదేనులో ఒకే ఒక చెట్టును మాత్రమే ఉంచి, ఆ చెట్టుఫలాలను తినవద్దని ఆజ్ఞాపించినప్పుడు వారు ఆకలితో వాటిని తింటే దానికి బాధ్యులు ఎవరౌతారు? కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆయన ఏదేనులో వారు తినగలిగిన ఫలాల చెట్లను వందలుగా సృష్టించి, కేవలం మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలాలను మాత్రమే తినవద్దన్నాడు (ఆదికాండము 2:16,17, ఆదికాండము 3:1-3). అయితే ఆదాము హవ్వలు ఆ చెట్ల ఫలాలతో పాటు ఈ చెట్టు ఫలాలను కూడా తిన్నారు కాబట్టే వారు చేసింది పాపమైంది. అలాగే ఆయన ఆదాము మొదటి సంతానాన్ని (కయీనును కానీ, షేతును కానీ) కోరికలు గలవారిగా సృష్టించి, ఫలియించి అభివృద్ధి చెందాలనే తన సంకల్పాన్ని వారిముందు ఉంచి, తీరా వారు అలా చెయ్యడానికి ఎలాంటి ప్రత్యామ్నాయాన్నీ సిద్ధపరచకుండా, తాను పాపంగా ఎంచిన అవకాశాన్ని మాత్రమే వారి ముందుంచితే దానికి బాధ్యులు ఎవరౌతారు? దేవుడే కదా? ఎందుకంటే వారికి వేరే ప్రత్యామ్నాయం లేకనే అలా చేసారు. అప్పుడు దేవుడు తన నైతికనియమాలకు విరుద్ధంగా ప్రవర్తించేలా తానే వారికి అవకాశం లేక అనుమతిని కల్పించినవాడు ఔతాడు.‌ కానీ ఆయన అలా చెయ్యడని మొదటినుండీ గమనిస్తున్నాం.‌ అలా చేసాడు అని చెప్పేవారంతా నిజానికి బైబిల్ ప్రకటించని వేరొక దేవుణ్ణే ప్రకటిస్తున్నారు. 

గమనించారా? కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడని బైబిల్ దేవుని పేరిట ప్రకటించబడుతున్న దుర్బోధ మన దేవుణ్ణి ఎలా అవమానిస్తుందో. ఆయన తన నైతికస్వభావానికి విరుద్ధంగా ఏమీ చెయ్యడని (2 తిమోతీ 2:13), పాపం చేసేలా ఎవర్నీ శోధించడని (యాకోబు 1:13) వాక్యం‌ ఇంత స్పష్టంగా బోధిస్తుంటే, "సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు" (యెషయా 6:3) అని పరలోకం మారు మ్రోగుతుంటే ఈ బోధ చేసేవారు మాత్రం ఆ సత్యానికి వ్యతిరేకంగా ఆయనపై ఇలాంటి నిందమోపుతున్నారు‌. మతోన్మాదులు బైబిల్ లో అన్నా చెల్లెళ్ళ వివాహం అంటూ దేవుణ్ణి దూషించడానికి ఈబోధనేగా కారణం?. అయితే దేవుడు ప్రత్యామ్నాయం సిద్ధపరిచాక కూడా కయీను కానీ షేతు కానీ తమ తన చెల్లెళ్ళనే వివాహమాడితే దానికి ఆ అన్నా చెల్లెళ్ళే బాధ్యులు, హేయవివాహాలతో దేవునికి ఏ సంబంధం ఉండదు. 

మీకు ఇప్పుడు అదేంటి దేవుడు అన్నా చెల్లిళ్ళు వివాహం చేసుకోకూడదనే ఆజ్ఞను మోషే ధర్మశాస్త్రంలో కదా బోధించాడు. అలాంటప్పుడు దానికి చాలాకాలం క్రిందటివారైన కయీను తరానికి అదెలా వర్తిస్తుంది. కయీను తన‌ చెల్లినే వివాహం చేసుకున్నాడనే బోధ దేవునినైతికతను ప్రశ్నించేదిలా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆజ్ఞలేనప్పుడు పాపం ఆరోపించబడదని (రోమా 5:13), అబ్రాహాము కూడా తన తండ్రి కుమార్తెనే (Half-sister) వివాహం చేసుకున్నాడని రాయబడిందిగా అనే ప్రశ్నలు రావొచ్చు. వీటన్నిటికీ నేను సమాధానం చెబుతాను.

దానికంటే ముందు "మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి" (అపో.కా 17: 26) అనే వాక్యభాగానికి సమాధానం చెప్పదలిచాను. ఎందుకంటే చాలామంది కయీను తన చెల్లిలినే వివాహం చేసుకున్నాడని బోధించడానికి ఈ‌వాక్యభాగాన్ని మరియు "జీవము గల ప్రతీవానికీ తల్లి హవ్వ" (ఆదికాండము 3:20) అనే మాటలనూ ప్రధానంగా తీసుకుంటారు. ఎందుకంటే వారు కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడని బోధించడానికి ఆ వాక్యభాగాలే ప్రధానకారణం. వాటిప్రకారం "యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించబడ్డారు" కాబట్టి అనగా ఆదాము నుండే మనుష్యులందరూ పుట్టారు కాబట్టి, "జీవము గల ప్రతీవానికీ తల్లి హవ్వనే" కాబట్టి కయీను‌ వివాహం చేసుకున్న స్త్రీ కూడా ఆదాము హవ్వల కుమార్తెనే అనేది వీరి పరిపూర్ణ విశ్వాసం.

అలాగైతే మరి హవ్వ ఆదాముకు పుట్టలేదు కదా? కేవలం ఆదాము ఎముక నుంచి తీయబడి స్త్రీగా నిర్మించబడింది (ఆదికాండము 2:21,22) అయినప్పటికీ ఆదాము నుండే హవ్వ సృష్టించబడింది అన్నది వాస్తవం (ఆదికాండము 2:23, 1 కొరింథీ 11:8-12). ఇలా ఆలోచించినప్పుడు ఒకవేళ దేవుడు కయీనుకూ, అలానే ఆదాము మిగిలిన కుమారులకు ఆదాము విషయంలో చేసినట్టే వారికి వారి శరీరాల నుంచే భాగస్వాములను నిర్మించినప్పటికీ, ఆదాము అందరికీ తండ్రే ఔతాడు, హవ్వ అందరికీ తల్లే ఔతుంది (మరి ఆదాము కుమార్తెల పరిస్థితేంటో చివరిలో వివరిస్తాను). ఎందుకంటే కయీను ఆదాము హవ్వలకు పుట్టాడు కాబట్టి అతని శరీరం నుండి సృష్టించబడిన స్త్రీ కూడా ఆదాము హవ్వలనుండి పుట్టినట్టే ఔతుంది. అలానే ఆదాము హవ్వల ద్వారా కయీనుకు సంక్రమించిన మరణం, పాపస్వభావం కూడా ఆమెకు సంక్రమిస్తుంది. ఆమెకు మూలమైన కయీను శరీరం వారిదేగా. ఈ మాటలు మీకు విచిత్రంగా అనిపించవచ్చు. అలాగైతే దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీని నిర్మించాడు (ఆదికాండము 2:21,22)  అనే సత్యం కూడా అన్యులకు ఇంకా విచిత్రంగా ఉంటుంది. అంతమాత్రాన అది సత్యం కాదు అనగలమా?

గమనించండి. ఈమాటలు నేను ఇలానే కచ్చితంగా జరిగిందని చెప్పడం లేదు కానీ ఆయన ఆదాము విషయంలో చేసినట్టే అతని సంతానపు మొదటితరం వారికి చేసినప్పటికీ "యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించబడ్డారు", " జీవము గల ప్రతీవానికీ తల్లి హవ్వ" అనే వాక్యభాగాలు అసత్యం కాజాలవు అంటున్నాను. ఆదాముకు వేరు కాకుండా అతని నుండే భార్యను చేసిచ్చిన దేవునికి వారిరువురి ద్వారా పుట్టిన కుమారులకు కూడా మోషే ధర్మశాస్త్రంలోని ఆయన నైతికవిలువలకు భంగం కలుగకుండా, అందరూ ఆదాము నుండే సృష్టించబడ్డారనే వాక్యభాగానికీ, జీవము గల ప్రతీవానికీ తల్లి హవ్వయనే సత్యానికీ వ్యతిరేకం కాకుండా భాగస్వాములను చేసివ్వడం‌ ఎంతమాత్రం అసాధ్యం కాదుగా? దేవుడు దేనినైనా ఎలాగైనా చెయ్యగల సమర్థుడు. కానీ ఆయన తన నైతికప్రమాణాన్ని మీరేలా ప్రజలకు అవకాశం కల్పించడం మాత్రం అసాధ్యం. దానిని ఆయన మీరడు ఎందుకంటే అది ఆయనస్వభావానికి ప్రతిరూపం (అది ఏ కాలంలోనూ మార్చబడదు - మలాకీ 3:6), అలానే మరెవ్వరూ మీరేలా అవకాశం/అనుమతి కల్పించడు ఎందుకంటే అది ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకం (లేవీకాండము 19:2, 20:26, 1 పేతురు 1:14,16).

కాబట్టి ఆదాము హవ్వలను ఏదెను నుండి పంపివేసేటప్పుడు వారికి కావలసిన వస్త్రాలను చేసిచ్చిన దేవుడు కయీనుకైనా, ఇతర ఆదాము కుమారులకైనా కావలసినవి తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే వారు ఫలించి అభివృద్ధి చెందాలన్నది ఆయన సంకల్పం. దీనిప్రకారం ఆయన కయీనును‌‌ తన సన్నిధినుండి వెలివేసినప్పటికీ, తన సంతానం కూడా భూమిపైన విస్తరించాలి కాబట్టి ఆ విధంగా చేసి ఉండవచ్చు. ఇక్కడ నా వ్యాసం యొక్క ఉద్దేశం కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడనే‌‌ బోధను ఖండించడం మాత్రమే.

ఎందుకంటే;
1. కయీను‌ కానీ ఆదాము హవ్వల మొదటితరంలో మరెవరైనా కానీ అలా తమ రక్తసంబంధికులనే‌ వివాహం చేసుకున్నారని వాక్యం చెప్పడం లేదు (అలానే ఎవర్ని చేసుకున్నారో కూడా వాక్యం చెప్పలేదు కాబట్టి "మరి ఎవర్ని చేసుకున్నారు" అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పనవసరం లేదు)

2. "కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను" (ఆదికాండము 4:17) అని రాయబడింది కానీ చెల్లిని కూడగా అని లేదు.

3. ఈబోధ దేవుడు తన నైతికప్రమాణానికి తానే వ్యతిరేకంగా ప్రవర్తించాడని అనగా ఆదాము హవ్వల మొదటితరం ఆ నైతికప్రమాణం మీరేలా ఆయనే వారికి అవకాశం/అనుమతి కల్పించాడని ఆయనపై నిందమోపుతుంది.

కాబట్టి నేను దీనిని ఖండిస్తున్నాను. అందుకే ఆ క్రమంలో "ఒకని నుండి ప్రతిజాతి మనుష్యులు సృష్టించబడ్డారు", "జీవము‌ గల ప్రతీవానికీ తల్లి హవ్వ" అనగానే కయీనుతరం వివాహం చేసుకున్నవారు ఆదాము, హవ్వలకే పుట్టనవసరం లేదని ఒక పరిష్కారాన్ని కూడా సూచించాను. ఎందుకంటే వాటి ఆధారంగానే కదా కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడని బోధించి తెలిసో తెలియకో దేవునిపైనే నిందను మోపుతున్నారు, మతోన్మాదులకు ఆ అవకాశం ఇస్తున్నారు. గమనించండి. పరిమితమైన నాకే ఆదామునుండే ప్రతీమానవుడు సృష్టించబడ్డాడనే వాక్యభాగానికీ, హవ్వ అందరికీ తల్లియనే వాక్యభాగానికీ వ్యతిరేకం కాని పరిష్కారం లభిస్తే అనంతుడైన దేవునికి ఆయన బోధించిన నైతికప్రమాణానికి భంగం కలుగకుండా, ఆ వాక్యభాగాలకు వ్యతిరేకం కాకుండా కయీనుకు కానీ ఇతర సంతతికి కానీ భాగస్వాములను‌ చేసివ్వడానికి మరెన్ని మార్గాలు ఉంటాయో కదా! కాబట్టి అందులో నేను చెప్పినదాని ప్రకారంగా కానీ, లేక మరోవిధంగా కానీ ఆయన వారికి భాగస్వాములను చేసిచ్చాడు. మళ్ళీ చెబుతున్నాను: దేవుడు ప్రత్యామ్నాయం సిద్ధపరిచాక కూడా కయీను కానీ షేతు కానీ తమ తన చెల్లెళ్ళనే వివాహమాడితే దానికి ఆ అన్నా చెల్లెళ్ళే బాధ్యులు, ఆ హేయవివాహాలతో దేవునికి ఏ సంబంధం ఉండదు.

ఇక్కడ మరో దుర్బోధను ఖండించదలిచాను. "అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను" (ఆదికాండము 4:16,17). అనే ఈ వాక్యభాగంలో కయీను దేవుని సన్నిధినుండి నోదుదేశానికి వెళ్ళి, వెంటనే తన భార్యను కూడినట్టుగా రాయబడడాన్ని చూసి ఆదాముకు ముందే ఈ భూమిపై మనుషులు ఉన్నారనీ ఆ మానవులు జీవించిన ఒకానొక దేశమైన నోదుకు కయీను వెళ్ళి వారిలోని ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడనీ కొందరు బోధిస్తుంటారు. ఇది ఒక దుర్బోధ. ఎందుకంటే; బైబిల్ ప్రకారం ఈ భూమిపై మొట్టమొదటి మనుషులు ఆదాము హవ్వలు మాత్రమే (ఆదికాండము 1:26,27). ఆదాము నుండే ప్రతిజాతి మనుష్యులు సృష్టించబడ్డారు (అపొ.కా 17:26).

మోషే యొక్క చారిత్రక రచనాశైలిని మనం పరిశీలించినప్పుడు అతను కొన్నిప్రాంతాలను అతని సమయంలో ఉన్న పేర్లతోనే ప్రస్తావించడం మనం గమనిస్తుంటాం. ఉదాహరణకు అబ్రాహాము పిలిష్తీయులతో చేసుకున్న నిబంధనకు గుర్తుగా అతను ఒక ప్రాంతానికి బెయేర్షెబ అనే పేరు పెట్టాడు (ఆదికాండము 21:31). కానీ మోషే ముందే ఆ ప్రాంతపు అరణ్యాన్ని ఆ పేరుతో లిఖించాడు (ఆదికాండము 21:14). అలానే అతను అబ్రాహాము కనానుకు చేరుకున్నప్పుడు "బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవ నామమున ప్రార్ధన చేసెను" (ఆదికాండము 12:8) అని రాస్తున్నాడు. కానీ బేతేలు అనే ప్రదేశానికి ఆ పేరును అబ్రాహాము మనువడు ఐన యాకోబు పెట్టాడు "యాకోబు భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు" (ఆదికాండము 28:17-19). ఈవిధంగా కయీను దేవునిసన్నిధి నుండి వెళ్ళిన ప్రాంతం కూడా మోషే సమయానికి నోదుదేశంగా పిలవబడుతుంది. అందుకే అతను ఆ పేరుతోనే దానిని ప్రస్తావించాడు, అసలు భూమి దేశాలుగా విభజించబడిందే ఆ చాలాకాలం తర్వాత పెలెగు సమయంలో (ఆదికాండము 10:25). కాబట్టి కయీను సమయంలో నోదు దేశమూ లేదు, అక్కడ మనుషులు ఉండే అవకాశం అస్సలు లేదు. మనం కూడా చరిత్రను చెప్పేటప్పుడు ప్రస్తుతం‌ మన సమయంలోని పేర్లతో కొన్ని ప్రాంతాలను ప్రస్తావించడం సాధారణం కదా. కానీ మనం చెబుతున్న చరిత్ర సమయానికి వాటిపేర్లు అవి కావు. దీనికి మరో ఉదాహరణ చెబుతాను. ఆదాము హవ్వలు కయీనునూ హేబెలునూ కన్నారని (ఆదికాండము 4:1,2) ఇలా మోషే రచనల్లోనూ మిగిలిన కొన్ని లేఖనభాగాల్లో కూడా పలానా వారికి పలానా వ్యక్తి పుట్టాడని పేర్లతో సహా రాయబడింది. అంటే వారు పుట్టడం పుట్టడమే ఆ పేర్లతో పుట్టారు అనా? కాదు కదా!. ఆ పేర్లు వారికి తరువాత పెట్టబడ్డాయి. చరిత్రలో ఆ పేర్లు ఏంటో ఆ గ్రంథకర్తలకు తెలుసు కాబట్టి వారు ఆ పేర్లతోనే వారి జననాలను ప్రస్తావించారు.

ఇక ధర్మశాస్త్రానికి ముందటి కాలంలో నీ తండ్రి కుమార్తెను కానీ, తల్లికుమార్తెను కానీ, వివాహం చేసుకోకూడదనే ఆజ్ఞ కయీను విషయంలో కానీ, మిగిలిన ఆదాము మొదటి సంతానం విషయంలో కానీ ఏ విధంగా వర్తిస్తుందో చూద్దాం.

ఆదికాండము 4:8-13 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.

ఈ సందర్భంలో కయీను తన తమ్ముడైన హేబేలును పగతో చంపివేసినట్టు, అందుకు దేవుడు అతనిపై దోషశిక్షను మోపినట్టు మనం చూడగలం. ధర్మశాస్త్రంలో మాత్రమే స్వంత అన్నా చెల్లెల్లు వివాహం చేసుకోవడం పాపమని రాయబడింది‌ కాబట్టి, దానికిముందటి కాలంలో ఆదాముకు పుట్టిన కుమారులూ కుమార్తెలూ తమలో తామే వివాహం చేసుకున్నప్పటికీ పాపం కాదు, అప్పటికి ఆజ్ఞ లేదు కనుక పాపం ఆరోపించబడదని వాదించేవారు ఇక్కడ దేవుడు కయీనుపై అన్యాయంగా దోషశిక్షను మోపాడని ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు నరహత్య చెయ్యవద్దు అనే ఆజ్ఞను కూడా మొదటిసారిగా నోవహు సమయంలోనే ప్రస్తావించాడు (ఆదికాండము 9:5,6). ఆయన కయీనుకు ఆ ఆజ్ఞను‌ ఇచ్చినట్టుగా బైబిల్ లో ఎక్కడా రాయబడలేదు.‌ అలాంటప్పుడు ఆ ఆజ్ఞ లేని సమయంలో కయీను ఆ పనిచేసి ఆయన దృష్టికి దోషి ఎలా అయ్యాడు?

నిజానికి ఆ ఆజ్ఞ కయీనుకు తెలుసు కాబట్టే తన తమ్ముడి హత్యను దాచిపెడుతూ నేను కావలివాడనా అని బొంకేప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ హత్యచెయ్యడం నేరమని అతనికి తెలియకపోతే అలాంటి ప్రయత్నం చెయ్యడు. కాబట్టి అది కయీనుకు‌ తెలుసు అందుకే దేవుడు న్యాయంగా శిక్షవిధించాడు.

మరొక సందర్భాన్ని చూద్దాం;

లేవీయకాండము 18:24,25 వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

లేవీయకాండము 20:23 నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్యపడితిని.

ద్వితీయోపదేశకాండము 8:20 నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవు డైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.

ఈ సందర్భాల్లో దేవుడు కనాను దేశపు ప్రజలను వారు చేసిన హేయక్రియల నిమిత్తం నాశనం చెయ్యబోతున్నట్టు ప్రకటిస్తున్నాడు. పైగా ఆ కనాను ప్రజలు ఆయన మాట వినకుండా ఆ హేయక్రియలు జరిగించారని "నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు" వారికి ముందుగానే అలాంటి హేయక్రియలను చెయ్యకూడదని ఆయన ఆజ్ఞాపించినట్టుగా చెబుతున్నాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదనే వాక్యభాగాన్ని చూపించి అంతకుముందు ఒకే తండ్రికి కానీ, తల్లికి కానీ పుట్టిన పిల్లలు వివాహం చేసుకున్నప్పటికీ ఏ పాపం లేదని వాదించేవారు. దేవుడు కనానీయుల విషయంలో ఎందుకిలా స్పందిస్తున్నాడో వివరించాలి. ఎందుకంటే మనం‌ పైన చదివిన లేవీకాండము18వ అధ్యాయంలోని 9వ వచనం నుండే "నీ తండ్రి పిల్లలను కానీ, తల్లి పిల్లలను" కానీ వివాహం చేసుకోకూడదని ఉంటుంది, అలానే కనానీయులు జరిగించిన జంతుశయనాలు హేయమని కూడా అక్కడే ఆజ్ఞాపించబడింది. దీనిప్రకారం ఆ ప్రజలపై దేవుడు ఆ పాపాన్ని ఆరోపించకూడదుగా? కానీ మానవులకు ఆయన ప్రారంభం నుండే ఇవన్నీ తెలియచేసాడు. అయినప్పటికీ వారు ఆయన మాట వినకుండా అలా చేసారు కాబట్టి చివరికి వారిని నాశనం చేసాడు. దీనికిముందు సొదొమ గొమొర్రాల విషయంలో కూడా ఇదే జరిగింది.

ధర్మశాస్త్రంలో నైతికపరమైన ఆజ్ఞలు, ఆచార సంబంధమైన ఆజ్ఞలు, చట్టపరమైన ఆజ్ఞలు, ఆహారసంబంధమైన ఆజ్ఞలు వీటన్నిటినీ ఆయన ఒక క్రమపద్దతిలో మోషే ద్వారా రాయించాడు. అయితే అంతకుముందు నుండే మానవులంతా ఆయన స్వభావప్రతిరూపమైన నైతికపర ఆజ్ఞలను మనస్సాక్షి ద్వారా ఎరిగియున్నారు. ఎందుకంటే మానవులంతా ఆయన పోలిక స్వరూపంలోనే జన్మిస్తున్నారు. ఆదాము హవ్వల ద్వారా మానవజాతియంతా పతనమైనప్పటికీ దేవుని నైతికతకు సంబంధించిన ఆయన పోలిక, స్వరూపాన్ని వారు కోల్పోలేదు (యాకోబు 3:9). అందుకే పౌలు ఇలా అంటున్నాడు.‌

రోమీయులకు 2:14,15 ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

దీనిప్రకారం; కయీను కానీ అతని తరం కానీ, సొదొమ గొమొర్రాలు కానీ, కనాను ప్రజలు కానీ, దేవునిస్వభావమైన నైతికఆజ్ఞలను ఎరిగే ఉన్నారు. వీటిని ధిక్కరించేలా ఏ కాలంలో ఏ మానవుడు ప్రవర్తించినా అది ఆయన దృష్టికి పాపమే ఔతుంది. కాబట్టి కయీను తరమంతా దానిని ధిక్కరించి వివాహాలు చేసుకునేలా ఆయన ఇతర ప్రత్యామ్నాయం లేకుండా చెయ్యడు. లేదంటే పైన వివరించినట్టుగా ఆయనే దానికి బాధ్యుడౌతాడు. తర్వాత తరపు ప్రజలు అలాచేస్తే మాత్రం కనానీయుల్లానే అది వారి వ్యక్తిగత పాపం. అలానే దేవుడు ప్రత్యామ్నాయం సిద్ధపరిచాక కూడా కయీను తన చెల్లినే చేసుకుంటే దానికి వారే బాధ్యులు, ఆ హేయ వివాహాలతో దేవునికి ఏ సంబంధం ఉండదు.

ఇక అబ్రాహాము కూడా తన చెల్లినే పెళ్ళిచేసుకున్నాడు మోషే ధర్మశాస్త్రానికి ముందటి కాలంలో అది ఏమాత్రం తప్పు కాదనే వాదనకు కూడా సమాధానం చూద్దాం. నిజానికి దీనికి నేను సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే అబ్రాహాము సమయానికి అతను వివాహం చేసుకోవడానికి చాలామంది స్త్రీలు ఉన్నారు. అయినప్పటికీ అతను తండ్రి కుమార్తెనే వివాహం చేసుకుంటే అది అతని పాపమే ఔతుంది. పైగా అప్పటికి అబ్రాహాము విశ్వాసి కూడా కాదు. అలాంటప్పుడు దానితో దేవునికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ అబ్రాహాము అలా చెయ్యలేదు కాబట్టి మరియు మోషే ధర్మశాస్త్రానికి ముందు చెల్లెలిని వివాహం చేసుకోకూడనే ఆజ్ఞ లేదనడానికి ఆధారంగా దీనిని ప్రస్తావిస్తున్నారు కాబట్టి సమాధానం చెబుతున్నాను.

ఆదికాండము 20:11,12 అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని. అంతేకాక ఆమె నా చెల్లెలనుమాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్యయైనది.

ఈ సందర్భంలో అబ్రాహాము తన భార్యయైన శారాను తన చెల్లిలిగా అనగా తండ్రి కుమార్తెగా (Half-sister) ప్రస్తావించడం మనం చూస్తాం. దీని ఆధారంగానే అబ్రాహాము తన చెల్లెలిని వివాహం చేసుకున్నాడని కొందరు అపార్థానికి గురౌతున్నారు. కానీ అబ్రాహాము తండ్రియైన తెరహుకు అసలు ఆడసంతానమే లేదు.

ఆదికాండము 11:26,27 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను. "తెరహు వంశావళి ఇది, తెరహు అబ్రామును నాహోరును హారానును" కనెను.

దీనికి ముందు వచనాలలో తెరహు పితరులకు ఆడసంతానం కలిగితే అది రాయబడింది‌ కానీ, తెరహు విషయంలో మాత్రం అలా రాయబడలేదు. కాబట్టి అతనికి ముగ్గురు కుమారులే తప్ప కూతురులేదు. పైగా తెరహుకు అబ్రాహాము భార్యయైన శారా ఏమౌతుందని రాయబడిందో చూడండి

ఆదికాండము 11:31 తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, "తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని" తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.

కాబట్టి శారా అబ్రాహాము తండ్రికి పుట్టిన స్వంత చెల్లి కాదు. మరి అబ్రాహాము అబీమెలెకు దగ్గర ఆమె నా తండ్రి కుమార్తెయని ఎందుకు‌ సంబోధించాడంటే, దానిని మనం హెబ్రీయుల కోణం నుండి‌ అర్థం చేసుకోవాలి. హెబ్రీయులు తమ తండ్రి వంశపువారందరినీ "తండ్రి" అనే సంబోధిస్తారు. శారా అబ్రాహాము తండ్రియైన తెరహు తరంలోని వారికి (పెదనాన్న&చిన్నాన్న) పుట్టిన అమ్మాయి. ఈ కారణంతోనే అబ్రాహాము ఆమెను "నా తండ్రి కుమార్తె" (చెల్లెలు వరస) అని సంబోధించాడు. అబ్రాహాము మాటల్లోనే శారా తన స్వంత చెల్లి కాదని మనకు స్పష్టం ఔతుంది. ఎందుకంటే తెరహుకు అబ్రాహామును కన్నటువంటి భార్య తప్ప వేరే భార్య ఉన్నట్టు ఎలాంటి ఆధారం లేదు.

మరొక విషయం గమనించండి; ఇంతకూ అబ్రాహాము గెరారు రాజుముందు శారాను చెల్లెలు అని ఎందుకు చెప్పాడు? అతని కుమారుడైన ఇస్సాకు కూడా ఇదేవిధంగా‌ చేసాడు (ఆదికాండము 26:7). ఎందుకంటే ఈరోజు ఒక పురుషుడు ఒక స్త్రీని ఎవరికైనా పరిచయం చేస్తూ ఈమె నా చెల్లెలని చెబితే వారు మీకు పెళ్ళి అయిందా అని అడగరు. కారణం: అన్నా చెల్లెళ్ళు పెళ్ళి చేసుకోరనే నైతికనియమం అందరికీ తెలుసు. అదే నియమం ఆ కాలంలో ఆ దేశపు వారికి కూడా (అప్పటికి ధర్మశాస్త్రం రాయబడలేదు) తెలుసు కాబట్టే అబ్రాహామూ ఇస్సాకులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తమ భార్యలను చెల్లెళ్ళు అని చెబితే ఒకవేళ ఆ స్త్రీలు వీరికి భార్యలు కూడానేమో అనే అనుమానంతో వీరిని చంపలేదు. పైగా ఇస్సాకు రిబ్కాతో సరసమాడడం చూసిన అబీమెలెకు అన్నా చెల్లెళ్ళు అలా ఉండరని అతనికి తెలుసు కాబట్టే నాతో ఎందుకు అబద్ధం చెప్పావని ఇస్సాకును నిలదీసాడు (ఆదికాండము 26:8,9). అదేవిధంగా నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదని మోషే ధర్మశాస్త్రంలోని నైతికనియమం ఆ రాజులకు తెలుసు కాబట్టే శారా, రిబ్కాలు అబ్రాహాము ఇస్సాకుల భార్యలని తెలిసి వారిని తిరిగి అప్పగించారు.

కాబట్టి అబ్రాహాము తన స్వంతచెల్లిని వివాహం చేసుకోలేదు అనేదానితో పాటు ధర్మశాస్త్రానికి ముందున్న ప్రజలకు కూడా అందులో రాయబడిన నైతికనియమాలు తెలుసని మరోసారి స్పష్టం చేస్తున్నాను. దేవుని పోలిక దేవుని స్వరూపంలో జన్మిస్తున్న మానవులకు వారి మనసాక్షి ద్వారా అవి బోధించబడ్డాయి. మనిషి తన పతనస్వభావాన్ని బట్టి తనకు బోధించబడిన నైతికతకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ ఆ నైతికతను‌ ఐతే ఎరిగేయున్నాడు. పౌలు ఆజ్ఞ లేనప్పుడు పాపం ఆరోపింపబడదు అనే మాటలను ఆజ్ఞ ఉంది కాబట్టే పాపం ఆరోపించబడిందనే కోణంలో చెబుతున్నాడు. మరో ఉదాహరణ చెబుతున్నాను. అవతలి వ్యక్తుల ఇష్టంతో వారికి కానీ మనకు కానీ ఏవిధమైన హానీ కలగకుండా లైంగికసంబంధం పెట్టుకోవచ్చని చెబుతున్న చట్టాలు ఉన్న దేశంలో కూడా ఒక మంచి తల్లి కానీ మంచి తండ్రి కానీ వయసుకు వచ్చిన తమ పిల్లలతో అలా ఎందుకు ప్రవర్తించరు? ఎవరైనా బరితెగించి అలా ప్రవర్తించినప్పుడు వాటిని అత్యంతనీచంగా, వారు చేసింది తప్పుగా ఎందుకు భావిస్తారు? ఎందుకంటే స్వభావసిద్ధంగానే అలాంటివి వారికి హేయంగా అనిపిస్తాయి. మనసాక్షిలో ఈ నైతికనియమం ప్రారంభం నుండే ఉంది. అయితే కొందరు నీచులు మానవస్వేచ్చ పేరుతో ఆ మనసాక్షికి వాతవేసి (1 తిమోతీ 4:3) నీచంగా ప్రవర్తిస్తుంటారు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

మోషే ధర్మశాస్త్రానికి‌ ముందు నైతిక ఆజ్ఞలు లేవా?

ఇప్పటివరకూ కయీను కానీ ఆదాము మొదటితరంలో మరెవరైనా కానీ తమ స్వంత చెల్లెళ్ళను వివాహం చేసుకోలేదని, అలా జరిగుంటే దానికి దేవుడే బాధ్యుడై తన నైతికనియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేలా తానే ప్రజలకు అవకాశం/అనుమతి కల్పించినవాడు ఔతాడు కాబట్టి ఆయన వారికి వేరే ప్రత్యామ్నాయాలను సిద్ధపరిచాడని వివరించాను‌. అయితే గతంలో కొందరు నన్ను; "కయీను తన చెల్లిని వివాహం చేసుకున్నట్టు బైబిల్ లో లేదు కాబట్టి అలా బోధించకూడదంటే, ఆదాము హవ్వల సంతానంలో కయీనుకు షేతుకు తప్ప మరెవరికీ వివాహమైనట్టు రాయబడలేదు, అప్పుడు వారికి వివాహాలు‌ జరిగాయని బోధిస్తే అది కూడా పాపమా" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. నిజానికి నేనేం చెబుతున్నానో వారికి సరిగా అర్థం కాలేదు పాపం.

నేను కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడనే బోధను తప్పని చెబుతుంది, లేఖనాలలో అది రాయబడలేదనే కారణంతో మాత్రమే కాదు. ఆ బోధ దేవుడు మనముందుంచిన నైతిక ప్రమాణాలపై తీవ్రప్రభావం చూపిస్తుంది కాబట్టి, దాని ఆధారంగా లేఖనంలో స్పష్టంగా లేనిదానిని ఎందుకు అలానే నిర్ధారించి బోధిస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. గమనించండి. లేఖనాలు ఒక విషయం గురించి వివరంగా చెప్పనప్పటికీ, మిగిలిన సంఘటనల ఆధారంగా దానిని నిర్థారించుకోవచ్చు. ఉదాహరణకు ఆదాము‌ మృతిచెందాడని లేఖనంలో ఉంది కానీ, హవ్వ మృతిచెందినట్టు ఎక్కడా రాయబడలేదు. కానీ దేవుడు ఆదాము హవ్వలు ఇద్దరికీ చెప్పినమాటలను బట్టి (పండు తింటే చస్తారు) ఆమెకూడా చనిపోయిందని భావించడంలో మనకేం సందేహం లేదు. అయితే లేఖనంలో వివరంగా లేని ఒక విషయం గురించి అలాంటి నిర్థారణకే వచ్చేముందు దానితో మరో లేఖనం తీవ్రంగా విభేదిస్తుంటే మాత్రం అలా చెయ్యకూడదు. పైగా ఇది దేవుని నైతికప్రమాణానికి సంబంధించిన విషయం. 

మరొకరు; దేవుడు ఆదాము హవ్వల సంతతిలో పురుషులకైతే వారి శరీరం నుండే భార్యలను చేసిచ్చాడు అనుకుందాం, మరి స్త్రీల సంగతేంటని ప్రశ్నించారు. ఆదాము హవ్వలకు కుమార్తెలు కూడా ఉన్నట్టు రాయబడడం వాస్తవమే (ఆదికాండము 5:4). కానీ "కయీను తన భార్యను కూడగా" అని రాయబడింది కాబట్టి, షేతు వంశావళి గురించి ప్రస్తావించబడింది కాబట్టి, వారు తమ చెల్లెళ్ళను వివాహం చేసుకునే పరిస్థితి లేదని చర్చించుకున్నాం.‌ కానీ ఆదాము కుమార్తెల వివాహం గురించి కానీ వారి వంశావళి గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. అలాంటప్పుడు వారి విషయంలో ఏం జరిగిందనేది మాట్లాడడం అప్రస్తుతతమని నా ఉద్దేశం.‌ పరిశుద్ధుడైన దేవుడు ఆదాము కుమారులకు తన నైతిక ప్రమాణానికి విరుద్ధంగా వివాహం చేసుకునే పరిస్థితి కల్పించాడని ఒప్పుకోవడం కంటే, ఆదాము కుమార్తెల విషయంలోని ఈ ప్రశ్నకు మౌనంగా ఉండడమే నాకు మంచిది అనిపిస్తుంది. బహుశా వారు వివాహం చేసుకోకుండానే చనిపోయి ఉండవచ్చుగా?

జలప్రళయం తర్వాత మానవజాతికి మూలపురుషులైన నోవహు ముగ్గురు కుమారుల వంశావళి గురించీ స్పష్టంగా ప్రస్తావించబడింది (ఆదికాండము 10:1, 10:32). మరి ప్రారంభమానవజాతికి మూలపురుషులైన ఆదాము కుమారులలో కయీను, షేతుల వంశావళి (ఆదికాండము 4&5) మాత్రమే ఎందుకు వివరించబడింది? అందుకే బహుశా ఆదాము మిగిలిన సంతానమంతా వివాహం లేకుండానే చనిపోయి ఉండవచ్చు అంటున్నాను. ఎందుకంటే వారికి భాగస్వాములను ఇవ్వవలసింది దేవుడే అయినప్పుడు, ఆయన సంకల్పమైన మానవ విస్తరణకు ఆయన కయీను షేతులను నిర్ణయించినప్పుడు మిగిలినవారికి అలా ఇవ్వవలసిన అవసరం ఉండదుగా.

మరొకరు; కయీను విషయంలో ఇంకాస్త ముందుకెళ్ళి అతను తన చెల్లెలును చేసుకోలేదు కానీ, తన సోదరులలో ఎవరొకరికి పుట్టిన కుమార్తెను చేసుకున్నాడని వాదించాడు. కానీ అప్పుడు కూడా అతని సోదరులకు భార్య ఎలా వచ్చింది తమ‌‌ చెల్లెళ్ళనే చేసుకున్నారా అనే ప్రశ్న మరలా ఉత్పన్నం ఔతుంది. మరొక విషయం ఏంటంటే, ఇప్పటివరకూ మనం దేవుని ఏ నైతికప్రమాణం ప్రకారమైతే కయీను కానీ అతని తరం కానీ తమ తల్లితండ్రులకు పుట్టిన స్వంత అన్నా చెల్లెళ్ళను వివాహం చేసుకోలేదని వివరించుకున్నామో ఆ నైతికప్రమాణంలో "నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి రక్తసంబంధి" (లేవీయకాండము18:13) అని కూడా రాయబడింది. అది స్త్రీల కోణం నుండి నీ తండ్రి సహోదరునితో కలిసుండకూడదని తెలియచేస్తుంది. కయీను సహోదరుల కుమార్తెకు కయీను అదేగా ఔతాడు. అప్పుడు కూడా కయీనుకు దేవుడు వేరే ప్రత్యమ్నాయం చూపలేదు కాబట్టి ఇలా చేసాననే నింద ఆ అమ్మాయి దేవునిపైనే మోపుతుంది. కాబట్టి‌ ఇది కూడా ఒక పనికిమాలిన వాదన.

ఇంకా పనికిమాలిన వాదన ఏంటంటే; గతంలో ఒక బోధకుడు "ఆదాము నుండి హవ్వ సృష్టించబడింది కాబట్టి నిజానికి హవ్వ ఆదాముకు కుమార్తె ఔతుందని" అలా చూసినప్పటికీ ప్రారంభంలో వావి‌ వరసలు లేవని, అందుకే కయీను తన చెల్లిని వివాహం చేసుకున్నప్పటికీ పాపం కాదని బోధిస్తున్నాడు. ఆదాము హవ్వలు ఇరువురూ జతగా ఒక్కటిగా ఉండాలనే ఉద్దేశంతో ఒకరినుండి ఒకరు సృష్టించబడడానికీ, ఒక అమ్మాయి తండ్రికి కూతురుగా జన్మించడానికీ ఉన్న వ్యత్యాసం తెలియని అతని మూర్ఖత్వం చూసి ఆశ్చర్యపడ్డాను. ఇలాంటి పనికిమాలిన బోధకులవల్లేగా అన్యజనుల మధ్య క్రైస్తవ్యం అవమానించబడుతుందని బాధపడ్డాను. హవ్వను దేవుడు ఆదాముకు భార్యగా సృష్టించాడు, కూతురుగా కాదు. ఇలాంటి పనికిమాలిన తర్కాలు తీసుకువచ్చి లేఖనసత్యాన్ని మార్చకూడదు.‌ చూసారుగా కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడని రుజువుచెయ్యడానికి కొందరు ఎంతదారుణంగా దిగజారుతున్నారో.

మరొకరు నన్ను "దేవుడు ఈ సృష్టంతటినీ ఆరురోజుల్లో చేసి ముగించాడని" వాక్యం చెబుతుంది. నువ్వు చెబుతున్నట్టుగా కయీనుకూ ఆదాము మిగిలిన కుమారులకూ ఆయన వారి శరీరాలనుండే భాగస్వాములను నిర్మించియిస్తే ఆయన సృష్టి కొనసాగినట్టే కదా, అప్పుడు ఆ వాక్యభాగం తప్పు ఔతుంది కదా అని ప్రశ్నించారు. ఇది తార్కికమైన ప్రశ్నే అయినప్పటికీ నా వాదనను సరిగా అర్థం చేసుకోనటువంటి ప్రశ్న.

దేవుడు ఆరురోజుల్లో చేసి ముగించింది నూతనమైన సృష్టి. కానీ ఆ తర్వాత కూడా ఆయన ఈ సృష్టి నుండి ప్రతిసృష్టి చేస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు; భక్తుడైన దావీదు "నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది" (కీర్తనలు 139:13,14) అంటూ తన తల్లి గర్భంలో తనను దేవుడే సృష్టించినట్టుగా రాస్తున్నాడు. యోబు కూడా "నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నవి" (యోబు 10:8) అని అంటున్నాడు. "నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" (యెషయా 44:2), "అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు" (1కోరింథీ 15:38) అని కూడా రాయబడింది. కాబట్టి ఆరురోజుల్లో ఆయన చేసి ముగించింది నూతనమైన సృష్టి, అనగా ఏ మూలం లేనప్పుడు కూడా శూన్యం నుండి ఆయన సృష్టించాడు. కానీ కయీను విషయంలో కానీ అతని తరం విషయంలో కానీ నేను సూచించిన పరిష్కారంగా ఆయన సృష్టించినప్పటికీ అది నూతన సృష్టి కాజాలదు. ఎందుకంటే అప్పటికే ఉన్నవారి నుండి వారి ప్రాణంతో పాటు పతనస్వభావం కూడా పంచుకున్నవారిగా ఆయన సృష్టించాలి. మళ్ళీ చెబుతున్నాను; నేను కేవలం పరిమితమైన నాకే ఆదాము విషయంలో చేసినట్టుగా అలాంటి పరిష్కారం తోచినప్పుడు, అపరిమితుడైన దేవునికి అసాధ్యుడైన దేవునికి ఇంకెన్ని మార్గాలు ఉంటాయో కదా అనే ఉద్దేశంతోనే ఆ పరిష్కారాన్ని ప్రస్తావించాను, తప్ప అలానే జరిగిందని నిర్ధారించడానికి కాదు. ఏమాత్రం అవగాహన లేకుండా కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడని వాదించేవారిలా, వాక్యం చెప్పనిది నేను నిర్ధారించి చెప్పను. Be Silent Where the Bible Is Silent

నేను ఈ వ్యాసం రాయడానికి ప్రధానకారణమైన నైతిక ఆజ్ఞలకోసం మరోసారి జ్ఞాపకం చెయ్యదలిచాను.‌ ధర్మశాస్త్రంలోని ఆచారసంబంధమైన మరియు ఆహారానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి ఇశ్రాయేలీయులను ఇతరజాతుల నుండి ప్రత్యేకించడానికి (లేవీకాండము 20:26) మరియు క్రీస్తుకూ ఆయనలో మనం కలిగియుండవలసిన ఆధ్యాత్మిక పరిశుద్ధతకూ ఛాయలుగా నిర్ణయించబడ్డాయి (హెబ్రీ 9:9-12, 10:1). ఇవి అప్పటి చుట్టుప్రక్కల ప్రజలకు కానీ అలానే ప్రస్తుతం మనకు కానీ సంబంధించినవి కావు. దేవుడు వీటి ఆధారంగా వారికి కానీ మనకు కానీ తీర్పు తీర్చడు.‌ ఎందుకంటే ధర్మశాస్త్రంలో అవి నియమించబడిన ఉద్దేశం వేరు (కొలస్సీ 2:16,17). కానీ మనం‌ నైతిక ఆజ్ఞలు అని వేటినైతే అంటున్నామో, అనగా వేటి ఆధారంగానైతే దేవుడు మోషే ధర్మశాస్త్రానికి ముందే కయీనుకూ, నోవహు తరానికీ, కనానీయులకూ, సొదొమొ గొమొర్రా పట్టణాలకు తీర్పు తీర్చాడో, ఆ నైతికఆజ్ఞలు అన్ని సమయాలలోనూ అందరూ పాటించవలసిన ఆజ్ఞలుగానే ఉన్నాయి. ప్రస్తుతం ధర్మశాస్త్రం క్రింద లేని మనం కూడా వాటిని పాటించాలి కదా! ఔను (మత్తయి 5:19, రోమా 13:8-11). ఎందుకంటే అవి దేవునినైతిక స్వభావానికి సంబంధించినవి. "మార్పు లేని దేవునిగా" నిత్యుడైన ఆయన స్వభావం మారనట్టే అవి కూడా ఎప్పుడూ మార్పు చెయ్యబడలేదు, చెయ్యబడవు కూడా. ఒకవేళ అలా మార్పు చెయ్యబడితే ఉదాహరణకు కయీను తరంలో అవి పాపంగా లేకుండా తరువాత వాటిని ఆయన పాపంగా ఎంచితే ఆయన నైతికస్వభావం కాలానుగుణంగా, పరిస్థితుల కారణంగా మార్పు చెయ్యబడుతుందనే దారుణమైన నింద ఆయనపై మోపబడుతుంది. అలాంటప్పుడు ఆయన తన పరిశుద్ధత విషయంలో మార్పులేని దేవునిగా అవ్వడు. కొన్నిసార్లు వెలుగును చీకటిగా చీకటిని వెలుగుగా ఎంచినవాడు ఔతాడు (యెషయా 5:20). కానీ అది అసాధ్యం. లేఖనాల్లో దేవుడు కొన్నిసార్లు మారినట్టుగా కనిపించేది ఆ మార్పు కూడా ఆయన నిర్ణయంలో లేక చిత్తంలో భాగమైనట్టుగానే తప్ప ఆయనలో లేని క్రొత్త మార్పుగా కాదు. అయితే అది కూడా ఆయన నైతికస్వభావం‌ విషయంలో జరిగినట్టు ఎక్కడా రాయబడలేదు. దాని విషయంలో అలా జరగదు. ఉదాహరణకు వ్యభిచరించవద్దు అని ఆజ్ఞాపించి, మళ్ళీ వ్యభిచరించమనడం, అబద్ధం చెప్పవద్దని ఆజ్ఞాపించి, మళ్ళీ అబద్ధం చెప్పమనడం... ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది ఆయన నైతికస్వభావానికి సంబంధించింది. కాబట్టి ఆ స్వభావం ఎప్పటికీ మారదు (2 తిమోతి 2:13).

ఇప్పుడు; మానవులు ఆ పరిశుద్ధుడైన దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృజించబడ్డారంటే, ఆయన స్వభావమైన నైతిక గుణలక్షణాలతో సృజించబడ్డారని అర్థం (ఆదికాండము 1:26,27 వ్యాఖ్యానం చూడండి). అందుకే ఆదాము నుండి అందరూ ఆయన నైతికఆజ్ఞలను తమ మనసాక్షి ద్వారా ఎరిగేయున్నారు (రోమా 2:14,15) వారికి మధ్యలో అవి రాలేదు. కాబట్టి ఈ వ్యాసానికి ఆధారమైన దేవుని నైతికస్వరూపమైన ఆజ్ఞలను ఆచారసంబంధమైన లేక క్రీస్తునందు కొట్టివెయ్యబడడానికే (నిజస్వరూపమైన ఆయనలో నెరవేరడానికే) నియమించబడిన విధిరూపకమైన ఆజ్ఞలతో (ఎఫెసీ 2:14) పోల్చుకుని తికమక పడవద్దని‌ మనవి. ఉదాహరణకు, సున్నతి, విశ్రాంతిదినం, బలులు, పండుగలు....ETC..ETC...

ఇంత వివరించినప్పటికీ ఇంకా కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడు ధర్మశాస్త్రం లేనప్పుడు అది పాపం కాదు అనేవారికి ఒక ప్రశ్న. అతను చెల్లినే ఎందుకు చేసుకోవాలి తల్లిని కూడా చేసుకుని ఉండవచ్చు కదా? ఎలాగూ ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఆ తరంలో ఏం చేసినా పాపం కాదు కాబట్టి హవ్వ కూడా దానికి ఏ అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటాది. ఆమె ఆదాముకు మాత్రమే భార్యగా ఉండాలి కొడుకుకు అలా ఉండకూడదు అనే నియమం ఎక్కడుంది? ఛీ. చదవడానికి అసహ్యంగా ఉంది కదా? మరి కయీను షేతులు తమ చెల్లెళ్ళనే చేసుకున్నారు అనేది కూడా నాకు అంతే అసహ్యంగా అనిపిస్తుంది. నైతికపరంగా చెల్లిని చేసుకోవడం తల్లిని చేసుకోవడం వేరువేరు కాదు. రెండూ అత్యంత నీచమైన పాపాలే.

అలానే కొందరు సముద్రపు దొంగలు ఇద్దరు అన్నా చెల్లెళ్ళను ఎత్తుకుపోయి ఒక దీవిలో విడిచిపెట్టేసారు అనుకుందాం. వారు అక్కడే ఏ కాయలో పండ్లునో తిని పెద్దయ్యారు. ఆ దీవి నుండి వారు బయటపడే అవకాశం కానీ, ఇతరులు ఆ దీవిలోకి పోయే అవకాశం కానీ లేనేలేదు. అలాంటప్పుడు వారిద్దరూ వివాహం చేసుకోవచ్చా? మీ కయీను కొలమానం ప్రకారం; ప్రస్తుతం అలా చేసుకోకూడదనే ఆజ్ఞ ఉన్నప్పటికీ వారి పరిస్థితిని బట్టి చేసుకున్నా ఎలా తప్పు ఔతుంది? సముఖపు రొట్టెలను యాజకులు తప్ప ఇతరులెవరూ తినకూడదనే ఆజ్ఞ ఉన్నప్పటికీ దావీదు తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తిని నిర్దోషి అయినట్టుగా (మత్తయి 12:3-5), ఆ అన్నా చెల్లెళ్ళు కూడా నిర్దోషులే ఔతారా మరి? నేనైతే కాదంటాను. ఎందుకంటే సముఖపు రొట్టెలు తినడం వేరు, నైతిక నియమాలను తప్పడం వేరు. రెండూ ఆజ్ఞలే అయినప్పటికీ నైతికతకు సంబంధించిన ఆజ్ఞలకు ఏ పరిస్థితిలోనూ మినహాయింపులు ఉండవు. కానీ మీ కొలమానం ప్రకారం ఇది మీరెలా చెప్పగలరు.

చివరిగా; ఈరోజు క్రైస్తవవిశ్వాసులు కూడా దేశ సంస్కృతుల ఆధారంగా దేవుడు పాపంగా బోధించిన వరస వారిని వివాహాలు చేసుకుంటున్నారు. కయీను తరం వారు దేవుడు ఎలాంటి ప్రత్యామ్నాయాన్నీ సిద్ధపరచనప్పుడు తమ తల్లితండ్రుల పిల్లలనే వివాహం చేసుకుంటే దానికి ఆయనే బాధ్యుడౌతాడు కానీ మనం ఆయన నిషేధించిన వరసలో వివాహాలు చేసుకుంటే దానికి మనమే బాధ్యులమౌతాము (ఎందుకంటే మనం వివాహం చేసుకోవడానికి మన చుట్టూ ఎంతోమంది విశ్వాసులైన స్త్రీ పురుషులు ఉన్నారు కదా). ఉదాహరణకు మేనరికాలు. ఈ మేనరికపు వివాహాలు మన దేశ సంస్కృతిని బట్టి క్రైస్తవ్యంలో కూడా సరైనవిగా చలామణి ఔతున్నాయి. కానీ దేవుడు వీటిని నిషేధించాడని మీకు తెలుసా?

లేవీయకాండము 18:12,13
నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదన మును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.

ఈ సందర్భంలో దేవుడు పురుషుడి కోణం నుండి మాట్లాడుతూ నీ తండ్రి సహోదరిని కానీ నీ తల్లి సహోదరిని కానీ సమీపించకూడదు అంటున్నాడు. అంటే మేనత్తను కానీ పినతల్లిని కానీ అని అర్థం. ఇదే నియమం స్త్రీలకు నీ తల్లి సహోదరుడిని కానీ నీ తండ్రి సహోదరుడిని కానీ అని వర్తిస్తుంది. అంటే మేనమామను కానీ చిన్నాన్నను కానీ అని అర్థం (బైబిల్ లోని ఏ నియమమైనా స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది, ఉదాహరణకు మోహపు చూపు - మత్తయి 5:28). దీనిప్రకారం మేనరికపు వివాహంలో ఆ స్త్రీ ఈ నియమాన్ని మీరి తన మేనమామను సమీపిస్తుంది. పైగా ఈ వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు వైకల్యాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రీయంగా రుజువైనప్పటికీ సమాజం వీటిని నిషేధించలేకుంది. కాబట్టి విశ్వాసులు ఇకనైనా సంఘం‌లో ఈ మేనరికపు వివాహాలు జరగకుండా నిషేధించాలి.‌ జరిగిపోయినవాటికి మనమేం చెయ్యలేం, వారు కలసే ఉండాలి. కానీ అలాంటివి జరగకుండా మాత్రం ఆపగలం కదా!

హిందూ మతోన్మాదులు బైబిల్ గ్రంథంపై చేస్తున్న మరికొన్ని ఆరోపణలకు సమాధానం కోసం ఈ వ్యాసం చదవండి.

హిందూ మతోన్మాదుల అశ్లీలపు ఆరోపణలకు బైబిల్ సమాధానాలు

Add comment

Security code
Refresh

Comments  

# gnanijameson ganta 2020-01-06 05:34
తాను జ్ఞానీ అని చెప్పుకున్న అజ్ఞాని( పీడీ సుందర రావు ) లోకాన్ని విడువక ముందె అతని అజ్ఞానాన్ని దేవుడు సాగర్ ద్వారా ఇంత త్వరగా బట్ట చేసినందుకు దేవునికి వందనాలు . దేవుడు తన పనిలో సాగర్ ని ఇంకా ఇంకా వాడుకొనును గాక .
Reply
# Bro.Joe Ratnam 2020-05-03 15:09
బ్రదర్ సాగర్ గారు,
ఈఆర్టికల్ చాలా తప్పుగా యున్నది!
ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక(ప్రక్క) నుండి హవ్వ చేయబడినప్పుడు ఆదాము దేవుని రూపములోనే యుండి ఏదేను తోటలో ఉన్నాడు! వారిద్దరు ఏదేనులో ఉండి పాపము చేయనంతవరకు సంతానము కలిగినట్లు బైబిల్ చెప్పుట లేదు!
పాపము జరిగి, వీరిద్దరు తోటనుండి గెంటివేయబడిన తరువాత- ఆదాము హవ్వల కలయిక ద్వారా కయీను జన్మించినట్లు- ఆతరువాత హేబెల్ జన్మించినట్లు చూడ గలము!
దేవుడు కయీనును గాని, తరువాత వచ్చిన పురుష సంతానమునకు గాని ఆదామునుండి హవ్వను చేసినరీతిగా కయీనుకు కూడా భార్యను చేసియుండవచ్చును అనేది కేవలము మీ ఊహ మాత్రమే!
మీరు గమనించ వలసిన విషయాలు:
1) ఆదాము-హవ్వల సృష్టి వారితోనే ఆరంభము- వారితోనే అంతము! ఆతరువాత ఎవరూ వారి వలె చేయబడ్డారు అని బోధించుట కేవలము చెప్పే వారి స్వంత ఊహ మాత్రమే!
2) కయీను తోట బయట ఆదాము హవ్వలకలయిక ద్వారానే జన్మించుట - దేవుడు ముందుగా వారికిచ్చిన ఆజ్ఞల నెరవేర్పు మాత్రమే! గనుక దేవుని ప్రత్యక్ష ప్రమేయము ఏదెను తోట బయట మరేయితర మానవులలో ఉండలేదు!
3) గనుక కయీను కొరకు తననుండే భార్యను యివ్వటము జరుగదు- కారణము ప్రతిమానవుడు తనసంతానము కనే ఆజ్ఞను దేవుడు యిచ్చి న తరువాత ఆయన తన ప్రత్యక్ష ప్రమేయమును తానే తొలగించుకొనినట్లు చూపించుట లేదా?
4) ఏదో పి డి సుందరరావు గారు చెప్పినది తప్పు అని చెప్పుటకై మీరు వ్రాసిన ఈ ఆర్టికల్ పూర్తిగా వాక్యవిరుద్ధమే!
5) మీ కవసరమైతే ఇంగ్లీషులో "కయీను భార్య ఎవరు?" అనే ఆర్టికల్ పంపిస్తాను! చదివి వాక్య "పరిమాణమందు" ఏదైనా వ్రాయుటకు ప్రయత్నించండి!
పి డి సుందరరావు బోధను నేనిక్కడ సమర్థించుట లేదు గాని వాక్యము "పరోక్షముగా" -కయీను భార్య ఆదాము కుమార్తె అని చూపిస్తుంది!
అది తప్పుకాదు అని చెప్పుటకు లేఖనము చాలా ఆధారములు చూపించు చున్నది!
1) ఆదాముకు కేవలము వృక్షఫలములు తినమని చెప్పిన దేవుడు- నోవహుకు జలప్రళయము తరువాత జంతుమాంసము తినమని చెప్పుట తప్పుకాదు-
2) ధర్మశాస్త్రము యిచ్చేటంతవరకు దేవుడు సృష్టికార్యము ముగిసినవెంటనే "ఏడవ దినము" వింశ్రాంతి తీసుకొన్నాడు- అయితే నిర్గ 20 వరకు ఎవరూ కూడా "విశ్రాంతి" దినాచారము చేయకపోవుట తప్పుకాదు!
3) అబ్రాహాము, యాకోబులు బహుభార్యాత్వము కలిగియుండినా వారిని దేవుడు తప్పు పట్టినట్లు వ్రాయబడియుండలేదు! ధర్మశాస్త్రము ప్రకారము వారు శిక్షార్హులు లేక తప్పుచేసారు అని చెప్పుటకు ఎవరికి అధికారములేదు!
ఇలా ఎన్నో ఉదాహరణములు ఉన్నాయి!

గనుక ధర్మశాస్త్రము లోవ్రాయబడిన వాటివిషయము అంతకు ముందు కాలమందు గాని ఆ ధర్మశాస్త్రము క్రీస్తునందు నెరవేర్చబడిన ఈ క్రొత్తనిబంధన కాలములో గాని ఏ విషయాన్ని గూడా ధర్మశాస్త్రమందలి ఆజ్ఞలను బట్టి తీర్పు చేయరాదు!
దయచేసి ఎవరో ఏదో వ్రాసారు అది తప్పు అని చెప్పుటకు మీ మేర దాటి వెళ్ళవద్దు!
Reply
# SagarSagarjesus 2020-06-27 14:04
బ్రదర్ మీరు చాలా విషయాలు చెప్పాలని చూసారు, బట్ మీరు పూర్తిగా ఆర్టికల్ చదువుంటే చాలామంచిది, మీరు చెప్పిన విశ్రాంతిదినం ఆచారసంభంధమైన ఆజ్ఞ అది ఇప్పుడు లేదని మాకు తెలసు, మాంసాహారం తినడం అనేది డైట్ కి సంభంధించిన నియమం, కొత్తనిభంధనలో ఆహారానికి ఎటువంటి ప్రత్యేకత లేకుండడం మనకి కనిపిస్తుంది ఐ మీన్ మాంసము తినడం తినకపోడంలాంటివి.
అయితే ఏ కాలంలో అయినా నైతికపరమైన ఆజ్ఞలు మారుతూ రాలేదు, చెల్లిని పెళ్లిచేసుకోవడం అనేది నైతికపరమైన విషయం...మీరన్నట్లుగా మోషే ధర్మ శాస్త్రానికి ముందు ఆ ఆజ్ఞలేకపోతే కానాను ప్రాంతంలో ఉన్నవారిని దేవుడు ఎందుకు చంపాడో, ఆ జ్ఞలన్నీ వారికి తెలుసని ఎందుకు పలికాడో మీరే చెప్పాలి..దానికి సంభంధించిన వచనాలు ఆర్టికల్ లో ఉన్నాయి చూడండి.
Reply
# Very good message, thank you so much brother.Jacob David mittagadpula 2020-05-09 20:57
Mana prabhuvunu priya rakshakudina yesu kreestu namamulo meeku vandanamulu. Very intrest messages
Thank you so much. .
Reply
# SagarSagarjesus 2020-06-27 14:04
Thank u brother
Reply
# your article is not rightcommon man 2020-05-10 02:08
"లేఖనము దేనినైనా ప్రకటించకుండా ఉన్నదంటే అది మానవునికి అవసరం లేదనే కారణముతోనే దేవుడు దానిని ప్రకటించలేదు కనుక అటువంటి అంశములపైన ఎవరైనా ప్రశ్నించినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడమే శ్రేయస్కరం." aite meeru samadanam enduku cheppe prayatnam chesaru?
Reply
# SagarSagarjesus 2020-06-27 13:56
లేఖణం చెప్పనిదానికి వివరణ ఇస్తూ కయీను తన చెల్లినే చేసుకొన్నాడనే వాదన దేవుని నైతికతను భంగపరిచేలా ఉంది కనుకనే ఇది రాశాం; మీరు లేఖణం చెప్పనిదాన్ని బోధించడానికీ, ఎవరైనా అలా బోధించినపుడు ప్రతిస్పందించడానికీ మధ్య ఉన్న తేడా తెలుసుకొంటే మంచిదని నా అభిప్రాయం;
Reply
# your article is not rightcommon man 2020-05-10 02:09
aite ipudu meeru chepe samadaname ganuka teesukunte janma papanni samrthinche mee vishayamlo (sakshi apologitics usual ga samarthistaru kabatt meeru kuda danne opukuntarani assume chesukuntunnanui) papamu leni maro stree ni nirmincharu anna mee vadanani ela samarthinchukuntaru? aite meeru samarthinchukunte andaru pampulone janmistunnaru ane vishayanni meerela samarthistaru?
Reply
# SagarSagarjesus 2020-06-27 13:58
మా ఆర్టికల్ లో మల్లీ దేవుడు పాపం లేని స్త్రీని నిర్మించాడని ఎక్కడ రాశామో కాస్త చూపించండి;
ఒకవేళ దేవుడు కయీనునుండే స్త్రీని చేసిస్తే అప్పటికే పతనమైన కయీను నుండి నిర్మించబడిన స్త్రీ పతనస్వభావం లేకుండా ఎలా ఉంటుంది? మేము రాయనివాటిని మాకు ఆపాదించకండి.
Reply
# RE: కయీను తన చెల్లిని పెళ్లిచేసుకొన్నాడా?Durga rajkumar 2020-10-17 14:06
Chala baga vivarincharu...tq so much brother..devuni goppathanam manchithanam ardam ayayi..
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.