ఇతర అంశాలు

రచయిత: అజ్ఞాత క్రైస్తవుడు

Article Release-Bethseba th.jpg

 

వస్త్రధారణ విషయంలో క్రైస్తవ స్త్రీల కొరకు దైవికమైన సలహా

 

విషయసూచిక

 


ముఖ్య గమనిక
ఈ పుస్తకాన్ని పన్నెండేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు మరియు అవివాహిత పురుషులు చదవకూడదు. ప్రార్థనాపూర్వకంగా కనీసం రెండుసార్లైనా చదవకుండా ఈ పుస్తకంలో వ్యవహరించిన విషయమై ఏ నిర్ణయానికీ రావద్దని పాఠకులకు మనవి

- ప్రచురణకర్త

ప్రచురణకర్తల పరిచయం

స్త్రీ యొక్క వస్త్రధారణ పురుషునిపై చూపించే ప్రభావం గురించి ఈ పుస్తకం బాహాటంగా చర్చిస్తుంది కనుక అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపర్చాలని ఆశించేవారికి దైవికమైన సలహా ఇవ్వగలుగుతుంది. కేవలం ఆలోచన మాత్రమే అయ్యుండి, బాహ్యంగా క్రియారూపం దాల్చకపోయినప్పటికీ, స్త్రీ అందాన్నిబట్టి, పురుషుడు ఆమెను మోహించటం వ్యభిచారమౌతుందని యేసు మనకు బోధించాడు (మత్తయి 5:28). స్త్రీ వస్రాలు ధరించే తీరు పురుషుని హృదయంలో ఈ పాపానికి దారితీసే ఒక కారణం కాగలదు. ఇటువంటి పాపానికి ఇదొక్కటే కారణమనటం సబబు కానప్పటికీ ఇది సర్వసాధారణమైన కారణమన్న వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేరు. పాపం మానలేని కన్నులుగల పురుషుడు 2 పేతురు 2:14, ఎంతటి నిరాడంబరమైన స్త్రీనైనా కామంతోనే చూస్తాడనటంలో సందేహమేమీ లేదు. కానీ, పాపానికి వ్యతిరేకంగా ప్రయాసపడుతూ, పాపవాంఛలకు విరోధంగా మంచి పోరాటం పోరాడే వ్యక్తి, అసభ్యకరమైన వస్త్రాలు ధరించిన స్త్రీ తన కంటికి కనబడినప్పుడు, తరచుగా తన పవిత్రతను కోల్పోయి పతనానికి గురౌతున్నాడు; ఇటువంటి శోధనను ఉత్తమోత్తములైన పరిశుద్ధులు సహితం ప్రతిసారీ జయించగలరని అనుకోకూడదు. స్త్రీని మోహించేవాడు తన పాపానికి తానే బాధ్యుడనీ, దానికి ఆ స్త్రీని నిందించాల్సిన అవసరం లేదనీ ప్రతి పురుషుడు జ్ఞాపకముంచుకోవాలి. అదే సమయంలో, ఏ పురుషుడైనా తొట్రిల్లి పాపంలో పడిపోడానికి అశ్లీలమైన తన వస్త్రధారణ, లేక సంభాషణ, లేదా ప్రవర్తన ఏవిధంగానైనా కారణమైనట్లయితే, దేవుని ఎదుట లెక్క చెప్పాల్సిన బాధ్యత తనకున్నదనే విషయాన్ని ప్రతి స్త్రీ జ్ఞాపకముంచుకోవాలి.

"అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ! అభ్యంతరములు రాక తప్పవు; గాని యెవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి (స్త్రీకైనా, పురుషునికైనా) శ్రమ” (మత్తయి 18:7).


ఈ వ్యాస రచయిత ఎవరో తెలియదు. ఇందులో వాడిన కొన్ని మాటలు, రచయిత తన గుర్తింపును వెల్లడించకపోవటానికి కారణమైయుండొచ్చు. ఐనా, రోజూ మనం చూస్తున్న అసభ్యత కంటే ఎక్కువ అభ్యంతరకరమైన విషయాలు ఏమీ రచయిత చెప్పలేదు. పాపాన్ని బహిర్గతం చేయటం పాపమౌతుందని ప్రచురణకర్తలముగా మేము భావించడం లేదు. అందువలన ఈ వ్యాసంలోని వివరాలను మేము ఏ విధంగానూ మార్చలేదు, కాని రచయిత వ్యక్తం చేసిన విషయాలన్నిటిని యథాతథంగానే ఉంచాము. కనుక ఇందులోని కొన్ని విషయాలను పేర్కొనడం అభ్యంతరకరంగా ఉందని ఏ పాఠకులైనా భావిస్తే, వాటిని ఆచరణలో చూసినప్పుడు కూడా అంతే ఘాటుగా  ఖండించమని మేము వారిని బతిమాలుతున్నాము. దిద్దుబాటు మరియు గద్దింపు నిమిత్తం అశ్లీలతను పేర్కొనడం, ఆచరణలో కనబడే అశ్లీలత కంటే తప్పేమీ కాదు. అలాంటప్పుడు, క్రీస్తు నిమిత్తము "తప్పు”ను తప్పు అని నిర్మొహమాటంగా పిలవడం తప్పనుకుంటే, ఈ తప్పునుబట్టి మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ప్రభువునందు తిరిగి జన్మించిన ప్రతి సహోదరీ సరైన క్రైస్తవ సద్గుణాలను ప్రదర్శిస్తూ, తన వస్త్రధారణ గురించి తాను చేసుకునే ఎంపిక ద్వారా దేవునిని ఘనపర్చాలనే స్వచ్ఛమైన సదుద్దేశంతో మాత్రమే మేము ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నాము.

-సి.వి. పబ్లిషర్స్

1 - బత్షెబ పాపం

దావీదు పాపం గురించి మనం ఎన్నోసార్లు వినుంటాము, కాని బత్షెబ పాపాన్ని ఎవరైనా ప్రస్తావించడం చాలా అరుదు. దావీదు పాపంతో పోల్చితే బత్షెబ పాపం చాలా చిన్నదనేది నిజమే. దావీదు పాపం బుద్ధిపూర్వకమైనది, దురభిమానంతో కూడినది కాగా బత్షెబ పాపం కేవలం అజ్ఞానం వలన జరిగింది. దావీదు బుద్ధిపూర్వకమైన వ్యభిచారం మరియు నరహత్య చేశాడు; బత్షెబ అయితే అజాగ్రత్తతో, అనాలోచితంగా తన నగ్నశరీరాన్ని దావీదు కళ్ళ ఎదుట ప్రదర్శించింది. దావీదు పాపం ఘోరమైనది, బత్షెబ పాపం చిన్నదనే విషయంలో మనకెటువంటి సందేహమూ లేదు.

అయినప్పటికీ, దావీదు యొక్క ఘోర పాపానికి బత్షెబ యొక్క చిన్న పాపమే కారణమయ్యిందన్నది వాస్తవం. అనాలోచితంగా, అజాగ్రత్తగా తన నగ్నశరీరాన్ని చూపించిన ఆమె చిన్న పాపం, దహించివేసే మంటను రగిలించిన నిప్పుకణమయ్యింది. "ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!” ఒక వైపు కొంచెము అజాగ్రత్త మరియు అనాలోచితంగా, అనుకోకుండా బత్షెబ నగ్నశరీరాన్ని దావీదు కన్నుల ఎదుట ప్రదర్శించటం మాత్రమే కనిపిస్తుంది. కాని మరో వైపు వ్యభిచారము మరియు మనస్సాక్షి యొక్క దోషారోపణ; నరహత్య మరియు యుద్ధంలో భర్తను కోల్పోవడంతో పాటు అమాయకులైన ఇతర పురుషులు చనిపోవటం; ప్రభువు శత్రువులు దేవదూషణ చేయడానికి గొప్ప అవకాశం కలగడం; అక్రమ సంబంధం వలన వచ్చిన గర్భాన్ని బట్టి గొప్ప అవమానము మరియు బిడ్డ మరణము; అబ్షాలోము తిరుగుబాటు మరియు మరణము; ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట దావీదు భార్యలు అపవిత్రులవ్వటం; దావీదు ఇంటివారికి సదాకాలము యుద్ధము కలగడం (2 సమూ 12:11-18) వంటి ఘోర పర్యవసానాలు కనిపిస్తున్నాయి.

"ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!" అని మరోసారి చెబుతున్నాను. బత్షెబ తన నగ్నశరీరాన్ని ఒక పురుషుని ముందు ప్రదర్శించకుండా కొంచెం జాగ్రత్తపడుంటే, ఈ ఘోరపాపాలేవీ జరిగుండేవి కావు. గమనించండి: ఆమె ఈ కీడంతటినీ ఉద్దేశించలేదు సరికదా, ఇలా ఔతుందని కూడా ఆమె ఊహించలేదు, అయినప్పటికీ దీనంతటికీ ఆమెనే కారణమయ్యింది. ఆమె తనను తాను ఉద్దేశపూర్వకంగా లేక కాముకత్వంతో ప్రదర్శించుకోలేదు; ఆమె కేవలం అజ్ఞానంతోనూ, అనాలోచనతోనూ ఆ విధంగా ప్రవర్తించింది. అయినప్పటికీ ఆమె తన అజ్ఞానాన్ని బట్టి చేసిన చిన్న పాపం యొక్క పరిణామాలు ఉద్దేశపూర్వకమైన కామాతురతతో చేసినట్టుగానే అయిపోయాయి.

ఇంతకూ ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే: అజాగ్రత్త విషయంలో బత్షెబవలే దోషులైన క్రైస్తవస్త్రీలు చాలామంది ఈనాడు కూడా ఉన్నారు. తమ శరీరాలను ఉద్దేశపూర్వకంగా కాముకత్వంతో ప్రదర్శించాలనే తలంపుకే భయపడే దైవభక్తిగల స్త్రీలలో కొందరు సైతం తమ వస్త్రాలు ధరించే విధానం ద్వారా అజాగ్రత్తగానూ, అనాలోచితంగానూ తమ శరీరాలను కనపరుచుకుంటున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా అలా చేస్తున్నారని ఆరోపించడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. ఈ విషయంలో వారు కూడా బత్షెబ అంతే నిర్దోషులని నేను నమ్ముతున్నాను. అలా అని వారు అసలే దోషులు కారని కూడా అనలేను. కొన్ని రకాల స్త్రీదుస్తులు పురుషుణ్ణి రెచ్చగొట్టేవిగానూ, శోధించేవిగానూ ఉంటాయన్నది జగమెరిగిన సత్యమైనప్పుడు, క్రైస్తవ స్త్రీలు మాత్రమే ఈ విషయంలో అమాయకులా? అది అసాధ్యం; అయినా నేను మిమ్ములను నిందించాలని ఈ విషయాన్ని రాయడం లేదు కానీ మీకు ఉపదేశించాలనీ, అంటే, ప్రేమ మరియు సత్క్రియల విషయమై మిమ్మల్ని పురికొల్పాలనీ, ఇంతకు ముందు మీరు అనాలోచితంగా ఉన్న విషయాల్లో మిమ్మల్ని ఆలోచనాపరులుగా చేయాలనీ, మీ సహోదరీసహోదరులలో అత్యంత బలహీనులైనవారి ఆత్మీయ క్షేమాభివృద్ధి విషయమై ఇంతకు ముందు అజాగ్రత్తపరులై ఉన్న మిమ్మల్ని జాగ్రత్తపరులుగా చేయాలనీ, ఇదివరకు మీరు అజ్ఞానులైయున్న విషయాల్లో జ్ఞానముగలవారిగా చేయాలనీ ఇదంతా రాస్తున్నాను.

2- ఇతరుల ముందు నగ్నంగా ఉండటం తప్పు

ఇతరుల కళ్ళ ముందు నగ్నంగా ఉండటం తప్పని మనం మొదట అర్థం చేసికోవాలి. స్త్రీ విషయంలో అది తప్పు, పురుషుని విషయంలో కూడ అది తప్పే. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి "చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.” ఆదికాండములో స్పష్టంగా రాయబడియున్నట్టు, వారి దిగంబరత్వాన్ని కప్పాలనేది వారికి వస్త్రాలు ధరింపజేయటంలోగల ఒకే ఒక్క ఉద్దేశం. గమనించండి, ఆయన వారికి చొక్కాయిలను తొడిగించాడు. వారు అదివరకే కచ్చడాలు వేసుకున్నారు, అవి బహుశా, ఈరోజు చాలామంది వేసుకుంటున్న వస్త్రాలు అంతే లేక అంతకన్నా ఎక్కువగానే వారి దిగంబరత్వాన్ని కప్పి ఉండొచ్చు. వారు కచ్చడాలు ధరించినప్పటికీ, తమ సొంత కళ్లకు మరియు దేవుని దృష్టికి దిగంబరులుగానే ఉన్నారు. దేవుడు నిక్కర్లు లేదా ఈత దుస్తులు లేదా జాకెట్లు లేదా అటువంటి మరి వేటితోనైనా వారిని కప్పలేదు సరికదా చొక్కాయిలతో, మూలభాషను సరిగ్గా అనువదిస్తే - పొడుగాటి చొక్కాయిలతో (Robes) వారిని కప్పాడు. మరొక విషయం గమనించండి, ఆయన వారికి చొక్కాయిలను ధరింపజేశాడు. ఆయన హవ్వకు చొక్కాయిని, ఆదామునకు నిక్కరును తొడిగించలేదు. ఆయన వారిద్దరికీ చొక్కాయిలను తొడిగించాడు కనుక నగ్నత్వము స్త్రీలో ఎంత తప్పో, పురుషునిలో కూడా అంతే తప్పనే సత్యాన్ని మనం నిశ్చయంగా అర్థం చేసుకోవచ్చు.

కాని తన నగ్నశరీరాన్ని స్త్రీ చూపిస్తే ఎంత పాపమో పురుషుడు చూపించడం కూడా అంతే పాపమైనప్పటికీ, అంతే ప్రమాదకరం కాదు, ఎందుకంటే పురుషుని శరీరాన్ని చూడటంతోనే స్త్రీల కోరికలు అంత సులభంగా లేక అంత తీవ్రంగా రెచ్చగొట్టబడవు - మరియు పురుషులను నగ్నంగా చూడటం వారిని ఏమాత్రమూ రెచ్చగొట్టదనే విషయాన్ని అనేక మంది స్త్రీలు ఒప్పుకుంటారు. కాబట్టి, పురుషుడు తన శరీరంలోని నాలుగింట మూడోవంతు నగ్నంగా ఉండి కూడ (ఇది కూడ తప్పే) ఎక్కువ హాని కలుగజేయడు. కాని, స్త్రీ లేశమాత్రం నగ్నత్వాన్ని కనపరిచినా, చూసే ప్రతి పురుషుని హృదయాన్ని శోధించడానికి ఆమె ఒక అగ్ని బాణమౌతుంది. మీరిది ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, ఇదొక నగ్నసత్యం. కనుక నీకిష్టమైన విధంగా వస్త్రాలు ధరించే స్వేచ్ఛ నీకు లేదు. "మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువపెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” (1 కొరింథీ 6:19-20). కాని నువ్వు దేవునికి భయపడి నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తే, నీ శరీరం / శరీరావయవాలు ఎక్స్పోజ్(Expose) అయ్యే విధంగా వస్త్రాలు ధరించి పురుషుల కళ్ళను ఆకర్షిస్తూ, హృదయాలను శోధిస్తూ, వారి కోరికలను రేపి వేధించే తీరులో పరిశుద్ధాత్మకు ఆలయమైయున్న నీ దేహాన్ని దుర్నీతి సాధనంగా ఉపయోగించుకోవడానికి నువ్వు సాహసించలేవు.

చాలామంది పురుషులు దుర్మార్గులు కాబట్టి నువ్వేమి చేసినా వారు నిన్ను మోహించకుండా ఆపలేవు. వారు “వ్యభిచారిణి చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారై యున్నారు" (2 పేతురు 2:14). అంతమాత్రాన, వారు పాపం చేయడానికి నువ్వు వారికి సహాయపడతావా? వారిని మరింత శోధనకు గురి చేస్తావా? అలా చేయడానికి దేవుడు ఒప్పుకుంటాడా? ఐంకొంతమంది పురుషులు దైవభక్తిపరులు; వారు దుర్మార్గులు కారు కాని బలహీనులు. దావీదు దుర్మార్గుడు కాదు. అతడు దేవుని హృదయానుసారి. కాని నగ్నంగా ఉన్న స్త్రీ ఎదుట అతడు బలహీనుడయ్యాడు - అలా కాని పురుషుడు అరుదు.

క్రీస్తునందలి నీ సహోదరులు దుర్మార్గులు కాదు, కాని బలహీనులు. వారి బలహీనతను అదనుగా తీసుకొని అపవాది వారిని మరింత బలహీనులనుగా చేయడానికి వాడి శాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు. వారి నైతికతను భంగపర్చి, హృదయ పవిత్రతను పాడుచేయటానికి వారి ఆత్మల శత్రువు చేత రూపకల్పన చేయబడిన దృశ్యాలు, ఎడతెరిపిలేకుండా ముట్టడించి శోధించే లోకంలో జీవించడానికి పురుషులు బలవంతం చేయబడుతున్నారు. అలాంటప్పుడు క్రైస్తవ స్త్రీలు దుష్టుని కార్యాలకు తోడ్పడవలసిందేనా? దేవుని సంఘంలో సైతం తమను తాము తమ సహోదరులకు ఒక శోధనగా చేసుకోవడం వారికి తగునా? నీ స్త్రీ రూపాన్ని అజాగ్రత్తతో ప్రదర్శించడం ద్వారా నువ్వు పురుషుల కోరికలను రెచ్చగొట్టినప్పుడు, నీ సహోదరుల ఆత్మలలో చెలరేగే తీవ్రమైన, చేదైన ఘర్షణను నువ్వు గ్రహించగలిగుంటే ఎంత బాగుండేది! ఇట్టి శోధనల బలాన్ని ఓడించడానికి అవసరమయ్యే సహాయం మరియు దాని నుంచి కావలసిన విడుదల కోసం వారు దేవునికి చేసే ప్రార్థనలు నువ్వు వినగలిగుంటే ఎంత బాగుండేది! శోధన వారిని జయించినప్పుడు, వారు తమ కళ్ళు, హృదయము మరియు మనస్సుతో పాపం చేసినప్పుడు కలిగిన సిగ్గును, పశ్చాత్తాపముతో కార్చిన కన్నీటిని నువ్వు చూడగలిగుంటే ఎంత బాగుండేది!  ఈ గ్రహింపు ఉంటే నీకిష్టమైన విధంగా వస్త్రాలు ధరింవచ్చనే నీ హక్కు కోసం నువ్వు ఇంకెప్పుడూ పోరాడవు.

వాస్తవానికి, అలాంటి హక్కేదీ నీకు లేదు. అజాగ్రత్తగా వేసుకునే నీ వస్త్రధారణ ద్వారా ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో ఆ సహోదరుణ్ణి పాడుచేసే హక్కు నీకు లేదు. నువ్వు విలువపెట్టి కొనబడినదానవు కనుక నువ్వు నీ సొత్తు కాదు. నీ దేహంతో నీకిష్టమైనట్టుగా కాక దేవుని చిత్తప్రకారం ఆ దేహాన్ని కప్పుకొని, దేవునిని మహిమపరచటం నీ కర్తవ్యం. నీ సహోదరుల ఆత్మల పట్ల నీకు నిజమైన ప్రేమ ఏమాత్రమున్నా, అది నీకిష్టమైన విధంగా వస్త్రాలు ధరించాలనే కోరికను నీ హృదయంలో నుంచి శాశ్వతంగా తొలగిస్తుంది. “కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు; గాని "నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను” అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను” (రోమా 15:1-3). క్రీస్తు నీ ఆత్మను రక్షించటం కోసం పరలోక మహిమంతటినీ కాదని, భక్తిహీనుల నిందలను భరించడానికి ఇష్టపడ్డాడు, అలాంటప్పుడు నీ వస్త్రధారణ ద్వారా నిన్ను నువ్వు సంతోపరచుకోవాలనే నీ హక్కు కోసం నువ్వు పోరాడతావా? ఒక పురుషుని ఆత్మను రక్షించడం కోసం కొంచెం సౌకర్యాన్ని నువ్వు కాదనుకోలేవా? నీ సహెూదరుడు పాపంతో చేసే పోరాటంలో సహాయపడటానికి "ఇది పాత ఫ్యాషన్" లేదా “ఇప్పుడా స్టైలు లేదు” లాంటి స్వల్ప అవమానాలను నువ్వు భరించలేవా?

3- ఈ విషయంలో ఒక పురుషుని మాట నమ్ము

గోరంత విషయాన్ని నేను కొండంత చేస్తున్నానని నువ్వనుకోవచ్చు. ఈ విషయం నేను చెప్పినంత తీవ్రమైనది కాదని నువ్వు భావించవచ్చు. కాని ఒకసారి ఆలోచించు: నువ్వొక స్త్రీవి కనుక పురుషునికున్న వాంఛలను నీవనుభవించలేవు. స్త్రీగా నీకు నీ సొంత వాంఛలుంటాయి, కాని అవి పురుషునికున్నవంటివి కావు. అవి (సర్వసాధారణంగా) పురుషుని వాంఛలంత బలమైనవి కావు. సరికదా, పురుషునిలో రేగే అంత సులభంగా నీలో అవి రేకెత్తించబడవు. ఇంకా చెప్పాలంటే, అవి పురుషునిలో రేపబడే విధంగానే స్త్రీలో రేపబడవు. పురుషుని వాంఛలు స్త్రీ పట్ల పనిచేసే తీరును నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే, ఆ విషయంలో నువ్వు ఒక పురుషుని మాటే నమ్మాలి. నీకు నువ్వుగా దానిని అనుభవించలేవు. సూటిగా నిజం చెప్పాలంటే, బత్షెబ స్నానం చేస్తుండగా దావీదు ఆమెను చూసినప్పుడు సంభవించిన విధంగానే స్త్రీ దేహాన్ని చూడటంతోనే పురుషుని వాంఛలు సులభంగా రేపబడతాయి. చాలామంది పురుషులు, దావీదు కంటె మెరుగ్గా నువ్వు పెట్టే ప్రలోభాన్ని తట్టుకోగలరు అన్నది నిజమే. వారు నిన్ను మరులుగొలుపరు లేదా మానభంగం చేయరు. కాని అలాంటి ఆలోచనలను, కోరికలను కూడా వారు జయించగలరని నీకెలా తెలుస్తుంది? పురుషులు తమ కళ్ళు, హృదయం మరియు ఊహల్లో పాపం చేయట్లేదని నీకెలా తెలుసు? ఇంకేమీ చేయకపోయినా, చూసి మోహించడంలోనే పురుషుడు ఎంతో సుఖాన్ని పొందుతాడు. “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగునని” బైబిలు సెలవిస్తున్న విషయం నీకు బాగా తెలుసు (మత్తయి 5:28), కనుక ఇది అంత తీవ్రమైన విషయం కాదని నువ్వు చెప్పగలవా? ఔను ఇదొక తీవ్రమైన విషయం, ఎందుకంటే అది పాపం - పాపం తీవ్రమైనది. పాపం చెరుపు చేస్తుంది, కురూపిని చేస్తుంది, శిథిలం చేస్తుంది,  పాడు చేస్తుంది మరియు నాశనం చేస్తుంది. ఇది ఎంత తీవ్రమైన విషయమో నువ్వు తెలుసుకోవాలనుకుంటే, ఆ తరువాతి వచనాన్ని చదివితే నీకు తెలుస్తుంది. ఆ వచనం, "నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల, దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ, నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా” అని సెలవిస్తుంది. పాపం యొక్క తీవ్రత గురించి బైబిల్లోని అత్యంత గంభీరమైన వాంగ్మూలం బహుశా ఇదే అయ్యుంటుంది, అందులోనూ అజాగ్రత్తపూర్వకమైన వస్త్రధారణ వల్ల నువ్వు ఎంతో తేలికగానూ, అనాలోచితంగానూ కారణమౌతున్న ఆ పాపాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. ఇది అంత స్వల్ప విషయమేమీ కాదు కాబట్టి దానిని చులకనగా చూసే సాహసం చేయకు.

ఈ సందర్భంలో, 'ఆమేన్, ఇదంతా నిజమే, కాని ఈ వివరమంతా వినాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నా వస్త్రధారణ సచ్ఛీలతతో కూడినదై ఉంటుందని' నువ్వు అనవచ్చు. ఈ మాటలు నువ్వు కచ్చితంగా చెప్పగలవా? ఈ కాలపు ఫ్యాషన్లను మరియు అలవాట్లను నువ్వు అనుసరిస్తున్నట్లయితే, నీ వస్త్రధారణ కచ్చితంగా సచ్ఛీలతతో కూడినది కాదు, ఎందుకంటే ఈ కాలంలో అనేకులు సచ్ఛీలతను అలక్ష్యం చేస్తుంటే, ఇంకొందరు దానిని కావాలని గాలికి వదిలేస్తున్నారు. నువ్వు ఒక స్త్రీవైయుండి, పురుషుని దృష్టికోణంతో నిన్ను నువ్వు చూసుకోలేక, నీ వస్త్రధారణలో నిజంగా శోధిస్తున్న,రెచ్చగొడుతున్న విషయాలేంటో గ్రహించలేకపోతున్నావు. నువ్వు "పాములవలె తెలివిగాను, పావురములవలె హాని చేయనివారుగానూ ఉండాలని" దేవుడు కోరుతున్నాడు ((మత్తయి 10:16) - వాడుకభాషలో). కాని నువ్వు కూడ మిగిలిన లోకంవలె అనాలోచితంగా వస్త్రాలు ధరించినట్లయితే, నువ్వు తెలివైనదానివి కాదు సరికదా, హాని చేయనిదానవు అసలే కాదు. తెలివైనదానివి కాదు, ఎందుకంటే నువ్వు ఎంత అజ్ఞానురాలివైనా, అమాయకురాలివైనా, పురుషుల నైతికతను పాడుచేయాలని చూసే దుర్మార్గులు మరియు దురాత్మల చేత కల్పించబడిన పోకడను అనుసరిస్తున్నావు. హాని చేయనిదానవు కాదు, ఎందుకంటే నువ్వు ఉద్దేశించకపోయినా, నిన్ను చూచే ప్రతి పురుషుణ్ణి శోధించటానికి దుర్మార్గుని చేతిలో అగ్నిబాణంగా నిన్ను నువ్వు చేసుకుంటున్నావు. అందుకే, నిన్ను తెలివైనదానిగా చేయడానికి నేను కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేస్తూ నిర్మొహమాటంగా మాట్లాడుతున్నందుకు నువ్వు నన్ను మన్నించాలి. అవి పాటిస్తే నీ హృదయంలోని దైవభక్తి నిన్ను హాని చేయనిదానిగా చేస్తుందనే నమ్మకం నాకుంది.

ముందు చెప్పిన విధంగా, ఆదాముహవ్వలకు చొక్కాయిలను తొడగటంలో వారి నగ్నత్వాన్ని కప్పడమనేది దేవుని ఉద్దేశం కాబట్టి ఈ ఉద్దేశాన్ని నెరవేర్చని ఎలాంటి వస్త్రధారణైనా సరైనది కాదు. బట్టలు కప్పని వీపులు, బట్టలు కప్పని పొట్ట, బట్టలు కప్పని కాళ్లు మరియు తొడలు - ఇవన్నీ తప్పే - నగ్నంగా ఉన్న ఆదాముహవ్వల శరీరాలను చొక్కాయిలతో కప్పిన దేవుని దృష్టిలో ఇవన్నీ తప్పే. నిక్కర్లు, బిగుతు వస్త్రాలు, ఈత దుస్తులు మరియు నిన్ను పాక్షికంగా నగ్నంగా చేసే ఏ వస్త్రానికీ దైవభక్తిగల స్త్రీ వస్త్రధారణలో తావు లేదు. లోకమంతా ఏంచేసినా, నువ్వు మాత్రం సరైనదే చెయ్యాలి. సంఘసభ్యుల్లో మిగిలినవారంతా ఏంచేసినా, నువ్వు మాత్రం సరైనదే చెయ్యాలి. ఇప్పుడు నేను పేర్కొన్న వస్త్రధారణ పద్ధతులు, వస్త్రాలు ధరింపజేయటంలోగల దేవుని ఉద్దేశాన్ని ఎంతో తేటగా మరియు దారుణంగా ఉల్లంఘిస్తున్నాయి కాబట్టి 'ఇంతకూ సరైన వస్త్రధారణేమిటి?' అనే ప్రశ్నే నీకు తలెత్తకూడదు. కాని, కటకటా, నేడు సంఘంలో నైతికప్రమాణాలు ఎంతగా దిగజారిపోయాయంటే, ఇలాంటి విషయాలను సమర్థించే క్రైస్తవులు మరియు బోధకులు సైతం పుట్టుకొస్తున్నారు. వాస్తవంగా వారు 'స్త్రీపురుషులు కలిసి స్నానం చేయడా'న్ని అంటే, స్త్రీపురుషులు కలిసి దాదాపు దిగంబరులుగా ఉంటూ స్నానం చేయటాన్ని సమర్థిస్తారు. వారికి సిగ్గు లేదా? మతి చెడిందా? వారు క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఇటువంటి విషయాలను సమర్థిస్తారని నేను అనుకోను. వారు ఇప్పుడు సిగ్గుపడకపోయినా, అప్పుడు మాత్రం సిగ్గుపడాల్సొస్తుంది. ఇలాంటివాటినే సమర్థిస్తున్నవారు దేవుని ఉద్దేశాన్ని ఇంత స్పష్టంగా భంగం చేసే రకరకాల వస్త్రధారణలను సమర్థించడం గురించి మనమిక ఎక్కువగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు అంత ఘోరంగా కాకపోయినా స్పష్టమైన దేవుని ఉద్దేశాల్ని ఉల్లంఘించే కొన్ని వస్త్రధారణ విధానాల గురించి ఆలోచిద్దాము.

4- వస్త్రధారణ

పొట్టి దుస్తులు

ఇవి సరైనవి కావని మరొకరు నీకు చెప్పనవసరం లేదు. అవి పురుషుని కళ్ళకు రెచ్చగొట్టేవిగా కనిపిస్తాయని లోకమంతటికీ తెలుసు. కాని భక్తిపరులని చెప్పుకొనే స్త్రీలు, మెరుగైన జ్ఞానం కలిగుండాల్సిన స్త్రీలు, అవి పొట్టివా లేక పొడుగువా, సరైనవా కావా అనే విచక్షణ లేకుండా లోకపు పోకడలను అనుసరిస్తుంటారు.  ఎంత పొట్టివైతే  అవి 'పొట్టి దుస్తులు' ఔతాయి అనే వాదనకు దిగుతుంటారు. వారు ధరించే వస్త్రాలు చాలినంత పొడుగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవటానికి బదులుగా, వాటిని ఎంత పొట్టిగా చేయగలిగితే అంత పొట్టిగా చేయడానికే మొగ్గుచూపుతూ, 'ఇవి మాకు చాలినంత పొడుగ్గా ఉన్నాయని' సమర్థించుకుంటారు. నువ్వు అద్దం ముందు నిలుచుని , పొట్టిగా ఉన్న నీ దుస్తుల వలన నీ శరీరంలో ఏ భాగమూ కనబడటంలేదని నిన్ను నువ్వు ఒప్పించుకుంటూ మెచ్చుకోవచ్చు, కాని అవే దుస్తులతో నువ్వు క్రింద కూర్చున్నప్పుడు, కొంచెము ముందుకు వంగినప్పుడు, కారులో కూర్చోడానికి లేదా కారులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు, నువ్వు ఎంత నగ్నత్వాన్ని ప్రజల ముందు ప్రదర్శిస్తున్నావో అర్థమౌతుంది. నువ్వు ఉద్దేశించినా, ఉద్దేశించకపోయినా, నువ్వు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, నగ్నంగా ఉన్న నీ కాళ్లు మరియు తొడలు పురుషుని కోర్కెలను రేపేవిగా ఉంటాయి.

ఇందుకే, అటూఇటూ కింద నుండి సగభాగం పైవరకూ చీలి ఉండే స్కర్టుల జోలికి కూడా పోకూడదు. ఇటువంటి ఫ్యాషన్లు నీ తొడలను ఇతరులకు చూపించడం కొరకే రూపించబడ్డాయని ఎవరు అర్థంచేసుకోలేరు? లేక అది నువ్వు నడిచేటపుడు సులభంగా అడుగులు వేయడానికి ఉద్దేశింపబడిందని అనుకోవాలా? అదే నిజమైతే ఇది మరీ దారుణం. నువ్వు వేసుకునే స్కర్టుని అటూఇటూ చీల్చకపోతే నడవటం ఇబ్బంది ఔతుందనుకుంటే, దానిని తీసి పారేసి, ఇంకా కొంచెం ఎక్కువ బట్ట ఉన్న దుస్తులను ధరించటం మంచిది. మున్ముందు ఈ బిగుతు వస్త్రాల గురించి మనమింకా కొంచెం ఎక్కువ చర్చిస్తాము. నువ్వు ధరించే వస్త్రాలు ఎంత పొడుగ్గా ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు వంగినప్పుడు లేక కూర్చున్నప్పుడు, నీ కాళ్లు, నీ మోకాళ్ల క్రింద, వెనుక ప్రక్క మరియు ముందు భాగం చక్కగా కప్పబడి ఉండేలా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. కాని ఇక్కడ కొంచెం జాగ్రత్తపడాల్సిన విషయం ఏంటంటే నీ కాళ్లు నీ చూపుమేరకు మాత్రమే కప్పబడుంటే సరిపోదు. నువ్వు ముందుకు వంగినప్పుడు లేక కూర్చున్నప్పుడు, నువ్వు ధరించిన వస్త్రాల ముందు భాగం సహజంగానే క్రిందికి వ్రేలాడుతూ, నీ కాళ్ల ముందుభాగాన్ని ఎక్కువగా కప్పి ఉంచుతుంది , కాని దాని వెనుక భాగం పైకి లాగబడుతుంది కాబట్టి నీ కాళ్ల వెనుకభాగం ఎక్కువగా కనబడుతుంది. నువ్వు ధరించే వస్త్రాలు అన్ని శరీర భంగిమల్లో నీ మోకాళ్ల క్రిందివరకూ మీ కాళ్ళను కప్పి ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొట్టి మెడ జాకెట్లు

పురుషుని కంటికి ఇవి కూడా గొప్ప శోధన అనే సంగతి లోకమంతటికీ బాగా తెలుసు. నువ్వు భక్తిపరురాలవైనట్లయితే, ఉద్దేశపూర్వకంగా మరీ పొట్టి మెడలున్న జాకెట్లు వేసుకోవాలని కలలో కూడా అనుకోవు. కాని, అనాలోచితంగా, అజ్ఞానంగా నువ్వు అలా చేస్తుండవచ్చు. పొట్టి మెడలున్న జాకెట్లు మాత్రమే కాదు గాని పెద్ద మెడలు లేక చాలా వదులుగా ఉండే మెడలున్న జాకెట్లు కూడా అభ్యంతరకారణంగా ఉంటున్నాయి. పెద్ద లేదా చాలా వదులుగా ఉన్న మెడగల జాకెట్టును వేసుకుని అద్దం ముందు నిలబడి చూసుకుంటూ, 'ఇది పద్ధతిగా ఉందని' నువ్వనుకోవచ్చు. కాని నువ్వు కొంచెం ముందుకు వంగినప్పుడు నీ జాకెట్టు క్రిందికి వాలుతుంది, అప్పుడు నీ శరీరంలో అత్యధికంగా రెచ్చగొట్టే, శోధన కలిగించే అవయవాలు నీ ముందు నిలుచుండే ఏ పురుషుని దృష్టినైనా ఇట్టే ఆకర్షిస్తాయి.

సహజంగానే, పై రెండు లేదా మూడు గుండీలు పెట్టుకోకుండా నువ్వు జాకెట్టును ధరించినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అలా చేసినప్పుడు బయటకు ఏదీ కనిపించపోయినా, ఆ దృశ్యమే రెచ్చగొట్టేదిగా, మరులుగొల్పేదిగా ఉంటుంది. నువ్వలా చేసేది కావాలనే అతనికి ఆశ రేపి రెచ్చగొట్టడానికని పురుషునికి అనిపిస్తుంది. అలా కాక ఇంకేమనుకుంటాడు? మూడింటిలో రెండు గుండీలు పెట్టుకోకపోవడంలో ఇదిగాక ఇంకేమి ఉద్దేశం ఉంటుంది? ఇది సౌకర్యం కోసమంటావా?  ఊపిరి సలపనీయకుండా మెడవరకూ కప్పే జాకెట్టును నువ్వు వేసుకోలేనంటావా? తమ 'టై'లను చూపించుకోవటానికి మెడవరకూ గుండీలు పెట్టుకునే పురుషుల్లాగ నువ్వు కూడా దానిని భరించడం నేర్చుకోగలవని భావిస్తున్నాను. సరే అదలా ఉంచుదాం. సౌకర్యం కావాలనుకోవడం తప్పు కాదు, కానీ సౌకర్యమే కావాలనుకుంటే పై గుండీను ఒక్కటే పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది, అది చూడటానికీ పద్ధతిగా ఉంటుంది. కానీ రెండు మూడు గుండీలను పెట్టుకోకపోవటానికి ఎలాంటి సమర్థనలూ చెప్పుకోవడం సమంజసం కాదు. అలా చేయడం నీకు అదనపు సౌకర్యాన్నేమీ కలిగించదు. అది కేవలం దుర్మార్గపు లోకం యొక్క దుర్మార్గపు పంథాను అనుసరించడమే. మూడు గుండీలు పెట్టుకోకుండా ఉన్నప్పటికంటే ఒక్క బత్తామే పెట్టుకోనప్పుడు ఊపిరాడకుండా ఉండటమనేదేమీ ఉండదు.

సౌకర్యం విషయానికొస్తే, ఒక్క గుండీను పెట్టుకోకుండా ఉండటమే సరిపోతుంది, ఐతే కొన్ని జాకెట్ల విషయంలోనైతే అది కూడా చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి. పైగుండీను పెట్టుకోకుండా కూడ, నువ్వు ముందుకు వంగినప్పుడు నీ స్తనాలను ఎక్స్పోజ్ చేయకుండా ఉండగలిగినట్లయితే, నీ జాకెట్టు బట్ట నీ రొమ్ము మీది నుండి జారిపోకుండా ఉన్నట్లయితే, అది చాలా మంచిది. ఇది నువ్వు కుట్టించుకొనే జాకెట్టు నమూనా మరియు నీ ఛాతిభాగంపై ఆధారపడి ఉంటుంది. నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడం వలన ఏదైనా అపాయమున్నట్లయితే, ఎందుకైనా మంచిది గుండీలన్నిటినీ పెట్టుకోవడం ఉత్తమం. ఈ విషయంలో నువ్వు ఎంత ఎక్కువ జాగ్రత్తపడినా అది తక్కువే అవుతుంది, ఎందుకంటే పురుషుడిని స్త్రీ స్తనాలు ప్రలోభపెట్టినంతగా ఆమె అవయవాలలో మరేదీ ప్రలోభపెట్టదు; తన జాకెట్టు యొక్క పై రెండు లేదా మూడు గుండీలను పెట్టుకోని స్త్రీని పురుషుడు చూసినప్పుడు, పురుషులను శోధిస్తూ వారిని ఆశపెట్టి వేధించాలనేది ఆమె ఉద్దేశమై ఉంటుందనే అభిప్రాయం అతడు ఏర్పరచుకోవచ్చు. ఇటువంటి అభిప్రాయాన్ని కలిగించాలని నువ్వు ఇష్టపడుతున్నావా? కాదంటే, నీ జాకెట్టు గుండీలన్నిటిని సరిగా పెట్టుకో, జారుముళ్ళను సరిగా ముడివేసుకో, జిప్పులను సరిగా పెట్టుకో. పురుషుని ముందు నువ్వు కొంచెం వంగక తప్పనప్పుడు, నువ్వు ధరించిన జాకెట్టు పెద్దదీ, వదులుగా ఉన్నదీ, పొట్టిమెడగలదీ, లేదా తెరచి ఉన్నదైనప్పుడు నీ స్తనాలు ఎక్స్పోజ్ అవడం అతడు చూసినట్లయితే, కోటికొక్కరైతే తప్ప, నువ్వు ఏమి అనుకున్నా, ఏమి ఉద్దేశించినా, అతడు మాత్రం తాను చూసే దృశ్యాన్ని బట్టి మోహపు కోరికతో వేధింపబడతాడు. కాబట్టి లోకమంతా చేస్తున్నట్టు నువ్వు కూడ చేయకూడదు. నీ జాకెట్టు యొక్క మెడ చాలినంత పైకి మరియు చాలినంత చిన్నదిగా - అది చాతిపట్టీ లేదా భుజాలపట్టీగా కాక మెడపట్టీగా - ఉండేలా చూసుకో, అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. ఒక విషయం బాగా గమనించు: నువ్వు ధరించే జాకెట్టు మెడ నీ తల మీద నుంచి వేసుకునేంత వదులుగా ఉంటే, బహుశా అది చాలా పెద్దదిగా ఉందని అర్థం.

చేతులు లేని జాకెట్లు

చేతులులేని జాకెట్లు ఎప్పుడూ ఎక్కువగానే ఎక్స్పోజ్ చేస్తాయి. నీకు అర్థం కాకపోవచ్చేమో కాని, నీ చంకలు, వాటిని ఆనుకొని ఉన్న నీ ఛాతీ మరియు వీపులోని భాగాలూ పురుషునికి ఎంతో ఆకర్షణీయమైనవి; కనుక చేతులులేని నీ జాకెట్టు ఈ భాగాలను ఎక్స్పోజ్ చేయకుండా ఉండటం సాధ్యం కాదు. ఇతరులు నిన్ను అన్ని కోణాల్లో నుంచీ, అన్ని శరీర భంగిమల్లో చూస్తుంటారనే విషయాన్ని కూడ నువ్వు మనస్సులో ఉంచుకోవాలి. చేతులులేని నీ జాకెట్టు యొక్క చేతులు దూరే స్థలము (రంధ్రం), ముఖ్యంగా నీ చేతులు పైకెత్తబడినప్పుడు లేదా అవి బాగా చాపబడినప్పుడు, నీ ఛాతీలోని భాగం, బహుశా నీ స్తనాలలో కొంత భాగం, ప్రదర్శింపబడుతుంది కనుక తరుచుగా పురుషుడు జాకెట్టు లోపలికి చూడటానికి అది అనువుగా ఉంటుంది. చాలా పెద్ద లేదా చాలా వదులైన పొట్టి చేతులున్న జాకెట్టు విషయంలో కూడ ఇలాగే జరుగుతుంది. నువ్వు నీ మోచేతులను నీ ప్రక్కగా ఉంచుకుంటున్నంత వరకూ ఇది నిరాడంబరమైనదిగా ఉండవచ్చు, కాని నువ్వు నీ చేతులను పైకెత్తగానే పురుషుడు దాని గుండా నీ జాకెట్టు లోపలికి చూడగలగటానికి నువ్వొక ద్వారాన్ని తెరుస్తున్నావు, ఇది పురుషుని హృదయానికి ఒక ఆకర్షణీయమైన పెద్ద ఉచ్చు. నువ్వొక స్త్రీవనీ, నిన్నొక పురుషుడు చూసే రీతిగానే నిన్ను నువ్వు చూసుకోలేవనే నిజాన్ని మర్చిపోవద్దు. నేనొక పురుషుణ్ణి, కనుక ఇటువంటి దృశ్యాల చేత శోధింపబడటం అంటే ఏంటో నాకు తెలుసు. ప్రభువునందు నీ సహోదరులలో అత్యంత బలహీనమైనవాడే చేతులులేని లేదా చేతులు వదులుగా ఉన్న నీ జాకెట్టును చూసి శోధింపబడుతుంటే, అతని మేలు కోసం నువ్వు కొంచెం అసౌకర్యాన్ని అనుభవిస్తూ లేదా ఫ్యాషను మార్చుకుంటూ, నీ శరీరాన్ని కొంచెం మంచిగా కప్పుకోలేవా?

చాలీచాలని వస్త్రాలు

లోపలివి కనిపించే, చాలా పల్చని వస్త్రాల గురించి ఏమీ చెప్పనే అక్కర్లేదు. ఇటువంటి వస్త్రాలు - వస్త్రధారణ యొక్క అసలు ఉద్దేశాన్ని భంగం చేసి - నీ శరీరాన్ని కప్పడానికి బదులు దానిని ఎక్స్పోజ్ చేయడానికే రూపొందించబడ్డాయన్నది ఎవరూ కాదనలేని స్పష్టమైన వాస్తవం. ఇది నువ్వు గుర్తించక తప్పదు.

 ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు, కాబట్టి నువ్వు ఈ విధంగా బట్టలు ధరించటం చూసే పురుషుడు, నీ శరీరాన్ని ప్రదర్శించటానికే అలా చేస్తున్నావని కాకుండా ఇంకేమి అనుకోగలడు? అయినా, ఈనాటి సంఘాల్లో విలువలు ఎంత దిగజారిపోయాయంటే లోపలివి కనిపించే పల్చని దుస్తులను క్రైస్తవస్త్రీలు ధరించటం అసాధారణమైన విషయమేమీ కాదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నట్లైతే, ముందు మారుమనస్సు పొంది, తక్షణమే ఉద్దేశపూర్వకంగా అటువంటి పల్చని వస్త్రాలను తృణీకరించాలి. నువ్వు వెలుగులో నిల్చుని ఉన్నప్పుడు లేదా కిటికీ ముందు నిల్చుని ఉన్నప్పుడు, ఇలాంటి పల్చని వస్త్రాలను ధరించకుండా జాగ్రత్తపడాలి. చివరిగా, చాలా నాసిరకంగా నేయబడిన ఏ బట్టలనైనా నిరాకరించాలి : బట్టలు వేసుకోవాలి కానీ వలలు (Netting) కాదు.

బిగువైన దుస్తులు

నీ నగ్నత్వాన్ని ఎక్స్పోజ్ చేసే దుస్తులు ఎంత హానికరమైనవో, నీ శరీరాకృతిని తేటతెల్లంగా ఎక్స్పోజ్ చేసే వస్త్రాలు కూడా అంతే హానికరం. ఇలాంటివి రెచ్చగొట్టే వస్త్రాలని లోకమంతటికీ తెలుసు; అందరూ వాటి గురించి చెడుగానే అనుకుంటారు, చెడుగానే మాట్లాడుకుంటారు. బిగువుగా ఉండి, తన శరీరాకృతిలోని ప్రతి వంపునూ ప్రదర్శించే వస్త్రాలు ధరించిన స్త్రీని ఒక పురుషుడు చూసినప్పుడు, ఆమె నగ్నశరీరాన్ని చూసినప్పుడు కలిగేంత వేగంగా లేదా బలంగా కాకపోయినా, అతని వాంఛలు తప్పకుండా మరులుగొల్పబడతాయి. బిగువుగా ఉండే దుస్తులను 'చూపించుకునే వస్త్రాల'ని లోకం పిలుస్తుంది, అవి సరిగ్గా అవే, అందుకే అవి వస్త్రాలు ధరింపజేయటంలో దేవునికి ఉన్న ఉద్దేశాన్ని ఉల్లంఘిస్తున్నాయని స్పష్టమౌతుంది. కాబట్టి, 'నేను దైవభక్తిపరురాలిన'ని చెప్పుకొనే ప్రతి స్త్రీ తన శరీరాకృతిని 'చూపించుకునే' ప్రతి విధమైన వస్త్రధారణనూ నిష్ఠగా నిరాకరించాల్సిందే. 

 ఉన్ని స్వెటర్లు, టీషర్టులు, అల్లినవి, సాగేవి, లేదా శరీరానికి అంటుకుపోయేలాంటి ఏ వస్త్రాలైనా ధరించినప్పుడు నువ్వు ప్రత్యేకంగా జాగ్రత్తపడాలి. అవి వదులుగా ఉండకపోతే నీ శరీరాకృతి కనపడే ప్రమాదం ఉంటుంది. అల్లబడి, మందంగా ఉండే దుస్తులు నీ ఆకారాన్ని చక్కగా కప్పుతాయి. మరిముఖ్యంగా ఇది వక్షభాగం పెద్దగా ఉన్న స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తపడాల్సిన విషయం. స్త్రీ స్తనాలు -  అవి నేరుగా కనిపించినా, లేదా బిగువైన దుస్తుల వలన వాటి ఆకృతి కనిపించినా -  భూమ్మీద ఒక పురుషుని దృష్టిని కచ్చితంగా ఆకర్షించి, శరవేగంగా అతని ఉద్రేకాలను రేపే దృశ్యం మరొకటి లేదు. ఇది జగమెరిగిన సత్యం. దీనికి సంబంధించి దాదాపు ఇరువై ఐదు సంవత్సరాల క్రితం ఒక సినిమా పాట కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో స్త్రీపురుషుల స్వభావాల్లో మార్పులేమీ రాలేదు.

పురుషుడు నిన్ను చూసినప్పుడు అతడు నీ వస్త్రాలను చూడాలి కాని వాటి లోపల ఉన్న ప్రతి అవయవాలనీ, వాటి రూపురేఖలనూ కాదు. స్వెటర్లు, టీషర్టులు మరియు అల్లబడిన జాకెట్లు నీ శరీరానికి అంటుకుపోయే వస్త్రాలు కాబట్టి నీ శరీరావయవాల ఆకారం మరియు రూపురేఖలను  ప్రదర్శిస్తుంటాయి. ఈ విషయంలో ఒక పురుషుని మాట నమ్ము, ఎందుకంటే స్త్రీ శరీరాకృతి మరియు రూపురేఖలు వస్త్రధారణనుబట్టి కప్పబడినా, ఆ స్త్రీ నగ్నంగా కనపడితే రెచ్చగొట్టబడినంత త్వరగా, కచ్చితంగా అది అతని దృష్టిని ఆకర్షిస్తుంది, అతని వాంఛలను ఉద్రేకపరుస్తుంది, అతని ఊహలను రెచ్చగొట్టుతుంది. శరీరాకృతి కనపడకుండా స్వెటర్లు లేదా అల్లబడిన దుస్తులు ధరించటం సాధ్యమే కాదని నేను చెప్పడం లేదు. కాని నేటి యవ్వనస్త్రీలు ధరించే పాశ్చాత్య వస్త్రాలు చాలావరకూ ఎక్కువ బిగువుగా ఉంటాయని చెప్పుతున్నాను. వారు సాధారణంగా ధరించే కొలతల కంటే ఎన్నో రెట్లు పెద్ద కొలతల్లో ఉన్న స్వెటర్లు ధరించినట్లయితే అది వారికి ఎంతో బాగుంటుంది. వక్షభాగం చిన్నగా ఉన్న స్త్రీ తన రూపురేఖలను దాయటానికి చాలినంత వదులుగా ఉన్న స్వెటర్లను వేసుకుంటే పర్లేదు, కాని ఆమె స్తనాలు ఎంత ఎక్కువ పెద్దగా ఉంటే అలా దాయటం అంతే ఎక్కువ కష్టమౌతుంది. వక్షభాగం పెద్దగా ఉన్న స్త్రీ శరీరానికి అంటుకుపోయే దుస్తులను అసలే ధరించకపోవడం ఉత్తమం. ఈ విషయాన్ని నేను ఇంతకంటే నొక్కి చెప్పలేను. ముఖ్యంగా తన వక్షభాగం పెద్దగా ఉన్న స్త్రీ, ఆమె వక్షభాగం యొక్క దృశ్యం పురుషుని హృదయాన్ని ఇట్టే చెరపడుతుందని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి, ఈ విషయంలో ఒక పురుషుని మాటను నమ్మండి. వెచ్చదనం కోసం ఆమె శరీరానికి అంటుకుపోయే స్వెటర్లులాంటి దుస్తులు వేసుకోవాలనుకుంటే, ఆమె వాటి మీద (వాటి క్రింద కాదు) వదులుగా ఉండే కాటన్ / దూది దుస్తులను / జాకెట్టును ధరించాలి, అప్పుడు ఆమె ఎక్కువ వెచ్చగా ఉండగలుగుతుంది. ఇది స్టైలుగా ఉండదు, నిజమే, కాని స్టైలు ముఖ్యమైన విషయం కాదు. నేను దైవభక్తిగల స్త్రీలనుద్దేశించి, లోకానికి బదులుగా దేవునినే సంతోషపరచాలనుకునేవారికి రాస్తున్నాను.

స్త్రీలు ఏ వస్త్రాలు ధరించినా అవి మరీ ఎక్కువ బిగువుగా ఉంటే పురుషుల్ని రెచ్చగొట్టే విధంగా వారి రూపురేఖల్ని అవి బహిర్గతం చేస్తాయి. కొంతమంది అధికబరువున్న స్త్రీలు, వారు కనీసం 10 లేదా 20 కిలోల తక్కువ బరువు ఉంటే ధరించే  వస్త్రాలను ధరించడం వలన, ఈ విషయంలో తరుచుగా అభ్యంతరకారకులై ఉంటున్నారు. వీరు పెద్ద సైజు వస్త్రాలను ధరించకుండా ఆపుజేసేది మూర్ఖత్వంతో కూడిన వారి గర్వం తప్ప మరేమీ కాదు. రొమ్ము భాగంపై బిగువుగా ఉండే  జాకెట్టును నువ్వు ఎప్పుడూ వేసుకోకూడదు, అయితే పురుషుడు నిన్ను చూసినప్పుడు అతడు నీ జాకెట్టును మాత్రమే చూడాలి అందులో ఉన్న రూపురేఖలను కాదు. అది అందుకు చాలినంత వదులుగా ఉండాలి. ఈ కారణాన్ని బట్టే రెచ్చగొట్టే శరీర భంగిమలకు - నీ వక్షభాగం ప్రస్ఫుటంగా కనిపించేలా చేసే లేదా దానిపై నీ వస్త్రాలను  బిగుతుగా చేసే ఏ శరీరభంగిమకైనా - నువ్వు దూరంగా ఉండాలి. ఉదా॥ మోచేతులను వెనక్కి వంచి అరచేతుల్ని నడుము మీద ఉంచుకోవడం , లేదా ఒళ్ళు విరుచుకుని ఆవలించడం. నేను మళ్ళీ చెప్పేదేంటంటే, నేనొక పురుషుడిని, ఇలాంటి దృశ్యాలచేత శోధింపబడటం అంటే ఏంటో నాకు బాగా తెలుసు, వాటిని అనాలోచితంగానైనా క్షణమాత్రం చూసినా ఒక పురుషుని తలంపులూ, ఊహలూ ఎలా తప్పుదోవ పడతాయో కూడా తెలుసు.

ప్యాంట్లు

ఇప్పుడు మన ముందు సంఘాలనీ, కుటుంబాలనీ మరియు స్నేహితుల్నీ విడదీస్తున్న ఒక వివాదం ఉంది. దాని నేపథ్యం ఏంటంటే చారిత్రాత్మకంగా మన సంస్కృతిలో పురుషులు షర్ట్లూ మరియు ప్యాంట్లూ ధరిస్తే, స్త్రీలు చీరలూ, పంజాబీ దుస్తులు లాంటివి ధరించారు. ఇదొక నిర్వివాదమైన వాస్తవము కాబట్టే ఇళ్ళలో పురుషుల మీద పెత్తనం చేసే స్త్రీలను 'ప్యాంట్లు వేసుకునే స్త్రీలు' అని పిలిచే నానుడి ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో ఉండేది. వందేళ్ళ పాతదైన స్త్రీవాద ఉద్యమం కూడా ఇలా స్త్రీలందరినీ ప్యాంట్లు వేయించే పనిలోనే ఉంది. అంటే అది పురుషుడు చేసే పనులన్నీ స్త్రీలు కూడా  చేయడానికి "సమాన హక్కులు” ఇవ్వాలంటూ, పురుషునికి లోబడి ఉండాలన్న దేవుని నియమం నుండి స్త్రీని "విడిపించే" ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ ఉద్యమం స్త్రీలను పురుషులవలే ప్యాంట్లు ధరించేలా ప్రేరేపించింది. ఈ విషయంలో సంఘం కూడా లోకాన్నే అనుసరించింది. తమపై లోకపు ప్రభావం ఎక్కువగా లేని చాలామంది పాతకాలపు దైవజనులు, స్త్రీలు ప్యాంట్లు ధరించటాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు.  (ద్వితీ. కా. 22:5 )ఆధారంగా ప్యాంట్లు పురుషులు ధరించాల్సినవనీ, వాటిని స్త్రీలు ధరించడం హేయమని వారు అంటారు. ఐతే స్త్రీలు కూడా ప్యాంట్లు వేసుకునే సంస్కృతిలో పెరిగిన ప్రస్తుత తరంవారు మాత్రం బహుశా ఈ వివాదం వెనకున్న చరిత్ర తెలియక, పెద్దలు ఎందుకు ఈ విషయంలో అంత ఖచ్చితంగా ఉన్నారో అర్థం చేసుకోలేక, దానిని సంకుచితమైన మనస్తత్వమనీ, ఇదంతా చాలా చిన్న విషయమనీ భావిస్తారు. "స్త్రీలు వేసుకునే ప్యాంట్లు స్త్రీల కొరకు తయారు చేయబడ్డాయి కాబట్టి అవి పురుషుల వస్త్రాలు కావు కదా!” అన్నది వారి వాదన.

 దేవుడు ఆదాము కొరకు ప్యాంట్లు వంటివి, హవ్వ కొరకు చీరలు వంటివి చేయలేదు కాని వారిద్దరికీ చొక్కాయిలను చేశాడని వాదించొచ్చేమో. ఐతే, స్త్రీలు మరియు పురుషులు ఒకే విధమైన వస్త్రాలు ధరించకూడదని (ద్వితీ. కా. 22:5 ) నిశ్చయంగా తెలియజేస్తుంది, అలాగే చారిత్రాత్మకంగా మన సంస్కృతిలో షర్ట్లూ మరియు ప్యాంట్లూ పురుషులు ధరించే వస్త్రాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఇప్పుడు సంస్కృతిలో మార్పులొచ్చాయని, స్త్రీలు ప్యాంట్లు ధరించటం అంగీకారమేనని కూడా వాదించొచ్చు. అయినా, మన సంస్కృతిలో మార్పు తీసుకురావడానికి శాయశక్తులా ప్రయాసపడిన దుష్టశక్తుల గురించి మనము ఆలోచన చేసినప్పుడు, ఈ మార్పు ఏ విధంగానూ దేవుని చేత ఆమోదించబడలేదనీ, పైపెచ్చు అది ఆయనకు హేయమైనదనీ మనము అర్థం చేసుకోవచ్చు. నేను ఈ వివాదాన్ని గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పదలచుకోలేదు, ఎందుకంటే అది మన ప్రస్తుత చర్చాంశానికి సంబంధించినది కాదు. ఈ సందర్భంలో, స్త్రీ ప్యాంట్లు వేసుకోవడం దేవుని దృష్టిలో తప్పా? అని నేను అడగడం లేదు. కానీ, స్త్రీలు వేసుకునే ఈ ప్యాంట్లు పురుషునిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అని ప్రశిస్తున్నాను.

మొదటిగా, ఈ ప్యాంట్లు నీ శరీరాకృతిని బయటపెట్టి ప్రదర్శించే విధంగా రూపొందించబడ్డాయి. దానికి, ప్యాంట్లు చాలినంత వదులుగా ఉంటే సరిపోతుందని కొంతమంది స్త్రీలు వాదిస్తుంటారు; కాని, అలాంటివి ఎవరు వేసుకుంటున్నారు? అవి వేసుకునే స్త్రీలు కనిపించడం చాలా అరుదు. ఎందుకంటారు? పురుషులు వేసుకునే ప్యాంట్లు వదులుగా ఉంటున్నప్పుడు, స్త్రీలు వేసుకునే ప్యాంట్లు మాత్రం వారి కాళ్ళూ, తొడలూ, నడుమూ, పిరుదులూ, మరియు వారి పంగల యొక్క ప్రతి అంగుళానికీ అతుక్కుపోయేలా ఎందుకంటున్నాయి? ఎందుకంటే, వీటిని రూపొందించేది ఈ 'యుగసంబంధమైన దేవత(సాతాను)' కాబట్టి వాడేం చేస్తున్నాడో వాడికి బాగా తెలుసు. స్త్రీ యొక్క తొడలూ, పిరుదులూ మరియు పంగల రూపురేఖలు పురుషుని కళ్ళ ఎదుట ప్రదర్శించబడటం అతని హృదయానికి ఒక భయంకరమైన ఉరి అనే విషయం వాడికి చాలా బాగా తెలుసు. నీ పంగలు - నీ "రహస్యావయవాలు” - అన్ని విధాలుగా, అన్ని సమయాల్లో, అతి జాగ్రత్తగా గోప్యంగా ఉంచటానికి నువ్వు జాగ్రత్తపడాలి, అందుకు దోహదపడే వస్త్రాలనే ఎప్పుడూ ఎంచుకోవాలి. నీ నడుము మరియు మోకాళ్ల మధ్య ఉండి, శోధనకు చోటిచ్చే శరీరావయవాలన్నిటినీ గుప్తముగా దాచుకోవడానికి వదులుగా ఉండి పొట్టిది కాని గౌను లేక డ్రెస్సు కూడా చాలా మంచి ప్రత్యామ్నాయమే.

కొందరు స్త్రీలు, వారు ధరించే ప్యాంట్లు శరీరానికి అంటుకపోయే అంత బిగువైనవి కావు కాబట్టి అవి పద్ధతిగానే ఉన్నాయి అని అనుకుంటారు. అది సరే, అయితే ఒక విషయం. నువ్వు ధరించిన ప్యాంట్లు నీ శరీరానికీ, బట్టకూ మధ్య కొంచెం ఖాళీ ఉండేంత వదులుగా ఉన్నాయని అనుకుందాము. అయినా అవి నీ కాళ్ళూ, తొడలూ మరియు పిరుదుల రూపాన్ని ప్రదర్శిస్తాయి. అదే ఆ వస్త్రం స్వభావం కనుక దాన్ని మనం ఏమీ  చేయలేము. నువ్వు ముందుకు వంగినప్పుడూ, లేదా కూర్చున్నప్పుడూ లేదా, మఠం వేసుకున్నప్పుడూ, ఇతర స్త్రీలు వేసుకునే బిగువైన ప్యాంట్లు శరీరానికి అంటుకపోయేలాగే, నీ "పద్ధతైన ప్యాంట్లు” కూడా నీ శరీరాకృతిని బయటపెట్టేలా అతుక్కుపోతాయి. కాబట్టి నువ్వు పురుషుడిని ఆకర్షించలేనంత సన్నగా ఉంటే తప్ప, లేదా నీ ఆకారాన్ని చూసే పురుషుడు నిన్ను ఏవగించుకునే అంత లావుగా ఉంటే తప్ప (ఇది నీకు నువ్వుగా నిర్ధారించుకోలేవు), ప్యాంట్ల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఇది నీకు అర్థం కాకపోవచ్చు కానీ  (ఎందుకంటే ఒక స్త్రీ రూపం పురుషుడిని ప్రభావితం చేసినంతగా ఒక పురుషుని రూపం స్త్రీని బహుశా ప్రభావితం చేయకపోవచ్చు), పురుషుని వాంఛలను రెచ్చగొట్టేది స్త్రీ యొక్క రూపమే. పురుషుడు తాకితే స్త్రీకి ఎలా ఉంటుందో, స్త్రీ రూపాన్ని చూస్తే పురుషునికి అలా ఉంటుంది. ఇదే విషయం బైబిలులోని దావీదు మరియు బత్షెబ వృత్తాంతంలో చాలినంత స్పష్టంగా తెలుస్తుంది, అంతేగాక నిజాయితీగల ఏ పురుషుడినుండైనా దీనిని నువ్వు నిర్ధారించుకోగలవు. అది నీకు అర్థం కాకపోయినా సరే ఈ విషయంలో నువ్వు పురుషుని మాటనే నమ్మాలి. నీ తొడలూ, పిరుదులూ మరియు పంగల ఆకృతి పురుషుని హృదయాన్ని శోధిస్తుంది, అయితే సాధారణంగా ప్యాంట్లు వాటిని ప్రదర్శించే విధంగానే ఉంటాయి. 

అందుకే ఏ విధమైన వస్త్రాలు వేసుకున్నా సరే, అవి పద్ధతిగా ఉన్నాయా, లేదా అని ప్రశ్నించుకోవాలి. నీ శరీరావయవాలన్నీ గోప్యంగా దాచబడే విధంగా కప్పబడాలి; అలా పద్ధతిగా ఉండే వస్త్రాలనే ఎంచుకోవాలి.

నిర్దిష్టమైన ఆదేశాల గురించి ఇంతవరకూ చాలు. ఇక కొన్ని ఆక్షేపణలు చూద్దాము.

5- ఆక్షేపణలు

(1) "పురుషుడయ్యుండి** స్త్రీల వస్త్రధారణ గురించి పరిసయ్యుల లాగ నియమనిబంధనలు జారీచేసే అధికారం ఇతనికి ఎవరిచ్చారు?"

అందుకు నా జవాబు ఏంటంటే, పాపం లేకుండా మనమింకా ఏదెను తోటలోనే  ఉండుంటే, నీకిష్టమైన వస్త్రాలు వేసుకున్నా, లేక అసలేమీ వేసుకోకపోయినా, ఎవరికీ ఏ హానీ కలిగుండేది కాదు. కాని ప్రస్తుత లోకంలో అది కుదరదు, అలా చేస్తే నువ్వు పాపం ఇంకా ప్రబలడానికే తోడ్పడతావు. నేను రాసేది, సరైనదే చేయాలనుకునే దైవభక్తిగల స్త్రీల కోసం మాత్రమే, అయితే ఈ విషయంలో పురుషుడు చెబితేనే తప్ప ఏది సరైనదో తెలుసుకోవడం సాధ్యం కాని కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి అవి వారితో పంచుకోవడానికే రాస్తున్నాను. నిన్ను చూసే పురుషులపై నువ్వు వేసుకునే వస్త్రాల ప్రభావం గురించి ఒక పురుషుడు మాత్రమే నీకు చెప్పగలిగే విషయాలకు సంబంధించి కొన్ని నిర్దేశాలు ఇవ్వాలని మాత్రమే నేనాశిస్తున్నాను. నిజంగా దైవభక్తిగల స్త్రీలు ఈ నిర్దేశాలను బట్టి సంతోషిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. సాధారణంగా లోకసంబంధులైనవారే సరైనవి చేయడం ఇష్టం లేక, తమను తాము సమర్థించుకోవటానికి 'ఇది  పరిసయత్వం' లాంటి నినాదాల్ని ప్రయోగిస్తుంటారు.

** - ఇదంతా చదివాక కూడా కొంతమంది స్త్రీలు, 'ఇది స్త్రీలకు సంబంధించిన విషయం కదా, పురుషులెందుకు దీని గురించి మాట్లాడుతున్నారు?' అనే ప్రశ్న లేవనెత్తి విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తుంటారు. దానికి కూడా రచయిత ఇచ్చిన జవాబును మనం పైన చూశాము. కానీ, రచయిత చెప్పినదానితో పాటు మనం గుర్తించాల్సిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘంలో బోధించే బాధ్యత పురుషులకే దేవుడు అప్పగించినట్టుగా మనం చూస్తాము. కాబట్టి పురుషులుగా ఉండే సంఘకాపరులు అన్ని విషయాల్లో - అది పురుషులకు సంబంధించిన విషయమైనా, స్త్రీలకు సంబంధించిన విషయమైనా - బోధించడానికి సమర్థులై ఉండాలి. వాక్యంలో ఉండే అన్ని అంశాలనూ వారు నమ్మకంగా బోధించబద్ధులై ఉన్నారు కాబట్టి వారి బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ విషయాలను నేర్పించాలి. సంఘంలోనూ, కుటుంబాలలోనూ అన్నిటినీ నేర్పించే బాధ్యత పురుషులకే ఉంది కనుక 'పురుషులెందుకు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు?' అనే అభ్యంతరం లేఖనానుసారం కాదని గుర్తిస్తే అది అందరికీ క్షేమాభివృద్ధి - ప్రచురణకర్తలు

(2) "ఇది చాలా చిన్న విషయం. దీనికింత హడావుడి చేయాల్సిన అవసరం లేదు.”

మనము వాక్యంలో ఉన్న ప్రధానమైన విషయాల గురించి, హృదయానికి సంబంధించిన విషయాల గురించి మన సమయాన్ని కేటాయించాలి కానీ ఇలా చిన్నచిన్న విషయాల గురించి గొడవ చేసుకోకూడదు. ఐతే ఇది బాహ్య సంబంధమైన విషయమే కావచ్చు కానీ చిన్న విషయమైతే కాదు. (మత్తయి 5:28-29 ) చదివిన తరువాత కూడ ఇదొక చిన్న విషయమని నువ్వు వాదించగలవా? ఐనా ఇదొక చిన్న విషయమే అనుకుందాము: అలాగని దీనిని చులకన చేసి పక్కన పెట్టొచ్చా? పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయవచ్చా? లేదు, చేయకూడదు, ఎందుకంటే “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును” (లూకా 16:10). ప్రభువు యూదులను గద్దించింది చిన్న చిన్న విషయాలను పట్టించుకున్నందుకు కాదు కానీ ప్రధానమైన విషయాలని నిర్లక్ష్యం చేసేంతగా వాటిని పట్టించుకున్నందుకే ప్రభువు వారిని గద్దించాడు. "వాటిని (చిన్న చిన్న విషయాలను) మానక వీటిని (ప్రాముఖ్యమైన విషయాలను) చేయవలసియున్నది” (లూకా 11:42).

(3) "స్త్రీలను ఈ దృష్టితో చూసే పురుషుడు కామవికారంతో నిండినవాడైయుంటాడు.”

ఔను; పురుషుల మనసుల్లో కామవికారం ఉంటుందని మీరు తెలుసుకోవడం ఎంతైనా మంచిది. అది పురుషులందరి మనసుల్లోనూ ఉంటుంది. మనమందరమూ పాపులము. ప్రారంభంలో దేవుడు మనకిచ్చిన పవిత్రతను మనము పోగొట్టుకున్నాము, కనుక స్వాభావికంగానే మన హృదయాలు పాపం చేయటానికి, మరి ముఖ్యంగా కామం విషయంలో పాపం చేయటానికే బలంగా మొగ్గు చూపుతాయి. పాపం మనలను సుళువుగా చిక్కుల్లో పడేస్తుంది (హెబ్రీ 12:2). కాని ఒక విషయం అర్థం చేసుకోవాలి, పురుషులందరూ వారి ప్రారంభ పవిత్రతను కోల్పోయి కామవికారం కలిగినవారైనప్పటికీ, ఈ విషయంలో పురుషులందరి (విపరీతంగా కామతప్తులైనవారు తప్ప) వాంఛలూ ఒకే విధంగా ఉంటాయన్నది నిజమే అయినప్పటికీ, పురుషులందరి ప్రవర్తన ఒకే విధంగా ఉంటుందనే భావనను మీ మనస్సుల్లో కలిగించాలనిగాని, లేదా పురుషుల మధ్యలో ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా అనిపించాలనిగాని ఈ మాటలు చెప్పటం లేదు. సరైన బట్టలు ధరించి, సరైన ప్రవర్తన కలిగి, సరైన పురుషులతో సరైన పరిస్థితుల్లో సహవాసం చేస్తే, నువ్వు ఎలాంటి అసౌకర్యానికీ గురయ్యే అవకాశం ఉండదు. ఐతే చాలా మంచి పురుషుల మధ్య ఉన్నప్పుడు కూడా, నువ్వు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకని? ఎందుకంటే, దైవభక్తిగలవారు "శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నప్పటికీ" (గలతీ 5:24), అలాంటి కోరికలు కలిగించే అక్రమమైన విచ్చలవిడితనాన్ని విసర్జించినప్పటికీ, ఆ కోరికలు మాత్రం వారిలో ఇంకా నిలిచే ఉంటాయి. "శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించే”ది దైవభక్తిగలవారిలోనే (వ 17). ఈ వాంఛలను చంపడానికి పురుషులు ఎంతో ప్రయాసపడవచ్చు, కాని వాటిని చంపడానికి ఎంతో చిత్తశుద్ధితో మరియు శ్రద్ధతో చేసే మానవ ప్రయత్నాలన్నీ సాధారణంగా అంత పెద్దగా జయప్రదం కాలేదనేది పురుషులందరి అనుభవం నుండి నిర్ధారించబడిన చారిత్రక వాస్తవం. బత్షెబ పట్ల ఆకర్షణచేత ఓడించబడింది దేవుని హృదయానుసారుడు.

విషయానికి తిరిగొస్తే: పురుషులకు కామవికారం ఉంటుందా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. ఎంత మేరకు అతని కోరికలు సరైనవి, లేక ఎంత మేరకు అవి వాని పాపపర్యవసానంగా కలిగినవి అనేది నిర్ధారించడం కష్టమే. ఐనా అవి ఎలా కలిగితే ఏంటి? వాస్తవాలను నువ్వు ఉన్నవి ఉన్నట్టుగా ఎదుర్కోవాలి, 'ఎలా ఉంటే బాగుండేది' అన్నట్టుగా కాదు. అసలు విషయమేంటంటే: చాలామంది పురుషులు బలహీనులు, కాబట్టి స్త్రీ రూపము చూసి సులభంగా శోధింపబడతారు. కొందరు పురుషులు ఎంత ప్రయత్నించినా శోధించలేనంత స్థిరచిత్తులుగా ఉన్నారనుకుందాము, అయితే ఏంటి? చాలామంది పురుషులు బలహీనులు అనే వాస్తవాన్ని అదేమీ మార్చదు. స్థిరచిత్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కాని "బలహీనుల దౌర్బల్యములను భరించటం" - ఔను, అత్యంత బలహీనులకు కూడా "అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుండా" ఉండటం అనే బాధ్యతను నువ్వు ప్రేమతో నిర్వర్తించబద్ధురాలివై ఉన్నావు  (రోమా 15:1; 14:13).

(4) "పురుషుడు నన్ను మోహపు చూపుతో చూడటం అతని పాపం గాని నా పాపం కాదు కదా!”

కాదు - “...నీవికను ప్రేమకలిగి నడుచుకొనువాడవు కావు. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుట గాని, నీ సహోదరునికడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది” (రోమా 14:15,21). బత్షెబ అజాగ్రత్తగా తన శరీరాన్ని కనపరుచుకోవడం ద్వారా దావీదు బలహీనపరచబడ్డాడు, తొట్రిల్లజేయబడ్డాడు;  నీ శరీరాన్ని ప్రదర్శించడం కూడా నీ సహోదరులపై ఇదే ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వ్యాసాన్ని చదివిన తరువాత, ఈ విషయం నీకు తెలియదని నువ్వు చెప్పలేవు, కాబట్టి "మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపం కలుగును” (యాకోబు 4:17). బట్టలు ధరించకపోతే పురుషునిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో నీకు అసలు ఏమీ తెలీదని అనుకుంటే, నీకిష్టం వచ్చినట్టు ఏమి బట్టలు ధరించినా పాపం ఉండేది కాదు, కాని ఇప్పుడలా అనలేవు. ఎవరి పాపానికి వారే బాధ్యులు, కాని అలా చేయటానికి వారిని రెచ్చగొట్టినవారు కూడా ఆ పాపంలో బాధ్యులు ఔతారు. "దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణము నొందుదువు” అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నువ్వు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల, ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును, గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదునని” దేవుడు యెహెజ్కేలుకు సెలవిచ్చాడు (యెహె 33:8). దుర్మార్గుడు తన పాపం విషయమై తానే పూర్తిగా బాధ్యుడు, నిశ్చయంగా వాడు దానికై మరణిస్తాడు. కాని, దుర్మార్గుడు పాపం చేయకుండా ఆపుజేయడానికి అతడు చేయగలిగింది చేయలేదు కాబట్టి కాపలాదారుడు కూడా బాధ్యుడుగా ఎంచబడతాడు. అలాంటిది, ఒకని మార్గంలో ఆటంకాలనీ,అడ్డంకుల్నీ ఉంచి, అతడు పాపం చేసేలా రెచ్చగొడితే, దానికి నువ్వు ఇంకెంత ఎక్కువ బాధ్యురాలిగా ఎంచబడతావో ఒకసారి ఆలోచించు.

(5) "ఇవన్నీ నేను పాటించాలంటే, ప్రస్తుతం నా దగ్గరున్న బట్టలన్నిటినీ తీసి పారేసి, క్రొత్త దుస్తులను కొనవలసి ఉంటుంది.  ఆ ఖర్చు నేను భరించలేను.”

నా సహెూదరీ, నువ్వు పాపం చేయటాన్ని భరించకూడదు. నువ్వు నిజమైన క్రైస్తవురాలివైతే, ప్రతి పాపాన్ని విసర్జించి, ఎంత మూల్యం చెల్లించైనా సరే, దేవుని సంపూర్ణ చిత్తానికి లోబడాలనే దృఢసంకల్పంతోనే క్రీస్తు వద్దకు వచ్చి ఉంటావు. సరైనదే చేయాలనే మనస్సు నీకుంటే, అది చెయ్యటానికి మార్గాన్ని కనుగొంటావు - లేదా మార్గాన్ని చూపించమని దేవునికి మొరపెడతావు. వస్త్రధారణని మార్చుకోగలగాలి కానీ పాపంతో రాజీపడకూడదు, ఇతరులు పాపం చేసేలా ప్రేరేపించకూడదు.

(6) “నేను అంత అందగత్తెను కాను. నన్ను చూసి ఏ పురుషుడూ ఆకర్షించబడడు, శోధింపబడడు. కాబట్టి నేను నాకిష్టమైన వస్త్రాలు ధరిస్తాను.”

మొట్టమొదటిగా, పురుషుని దృష్టిని ఏది ఆకర్షిస్తుందో నిర్ణయించేది నువ్వు కాదు. మామూలుగా ఉండే స్త్రీ కంటే అందమైన స్త్రీ పురుషునికి ఎక్కువ శోధనగా ఉండగలదు అన్నది నిజమే, కాని ఒక పురుషుని కంటికి అందంగా కనిపించని స్త్రీ, వేరొక పురుషుని కంటికి ఆకర్షణీయంగా కనిపించొచ్చు అనేది కూడ అంతే నిజం; ఎంత  అందంగా లేని స్త్రీ ఐనా ఏదో ఒక పురుషునికి ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ పురుషుడూ నిన్ను రెండవసారి తిరిగి చూడలేనంత అసహ్యంగా ఉన్నావనే ఊహించుకుందాము. ఐనా సరే, ఇతర స్త్రీల ఎదుట నువ్వు కనపరచాల్సిన ఆదర్శం సంగతేంటి?  అవిశ్వాసులుగా ఉన్న కాలం అంతా లోకానుసారమైన వస్త్రధారణే కలిగుండి, ఇప్పుడు సరైన మార్గంలో నడిపించబడటానికి బహుశా నీవైపు చూస్తున్న నూతన విశ్వాసులైన స్త్రీలకు నువ్వు కనపరచాల్సిన మాదిరి సంగతేంటి?  వారి అసభ్యకరమైన వస్త్రధారణను సమర్థించుకోవటానికి నీ మాదిరిని ఒక సాకుగా వాడుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావా?

చివరగా, కొందరు స్త్రీలు పురుషుని స్వభావం విషయమై ఎంత అమాయకులై ఉంటారంటే, వారి వెంట ఎవరూ పడటం లేదు కాబట్టి, తప్పుడు ప్రతిపాదనలు ఏమీ చేయడం లేదు కాబట్టి, వారు ఏ పురుషునికీ ఎలాంటి శోధననూ కలిగించట్లేదని అనుకుంటుంటారు. అయితే వారొక విషయం అర్థం చేసుకోవాలి. ఏమంటే, పురుషుడు స్త్రీలను చూస్తూ - ఏ ఆకర్షణీయమైన స్త్రీనైనా చూస్తూ - గొప్ప సుఖానుభూతిని, పాపపు సుఖానుభూతిని పొందుతాడు. పురుషులు ప్రతి సంవత్సరమూ అశ్లీల చిత్రాలు చూడటానికి లక్షల్లో ఖర్చు చేయడం ఎందుకు అనుకుంటున్నారు?  వాటిని చూస్తే కలిగే ఆనందం తప్ప, ఈ చిత్రాలు వారికి ఇంకేమి తృప్తిని ఇవ్వగలవు? పురుషుని కోరికలను తీవ్రంగా రగిలించేది, అతని వాంఛలను రెచ్చగొట్టేది స్త్రీ శరీరాన్ని చూడటమే -  అలా చూడటంలోనే అతనికి చెప్పలేనంత తృప్తి కలుగుతుంది. చాలామంది పురుషులు యథేచ్ఛగా, ఎలాంటి నియంత్రణ లేకుండా, ఈ సుఖానుభూతిలో మునిగి తేలుతారు. పద్ధతైన వస్త్రధారణ లేకుండా నిన్ను నువ్వు ప్రదర్శించుకుంటే, స్త్రీ ఆకారం ఎక్కడ కనబడినా కనువిందు చేసుకునే వీరికి నీ రూపం కూడా ఒక మినహాయింపు కాదు. దైవభక్తిగల పురుషులు అలాంటి సుఖానుభూతి వివాహానికే పరిమితమని, దానికి వెలుపల అది పాపమని గుర్తిస్తారు, కనుక ఆ శోధనను అధిగమించి ఆ పాపాన్ని జయించటానికి వారు శాయశక్తులా పోరాడతారు.

కాని పురుషవాంఛలు చాలా బలంగానూ, తీవ్రంగానూ ఉండటాన్ని బట్టి ఈ పోరాటం వారికి ఎంతో కష్టతరంగా అనిపిస్తుంది. ఆత్మ సిద్ధమే కాని, తీవ్రమైన శోధనలను బట్టి, శరీరము బలహీనంగా ఉంటుంది. 'మేలైనది చేయాలన్న కోరిక వారికి కలుగుతుంది గాని, దానిని చేయటం కొన్నిసార్లు వారికి కలుగటం లేదు'(రోమీయులు 7:18). ఎంతో దృఢసంకల్పం, ప్రార్థన మరియు ప్రయాస ఉన్నప్పటికీ, ఒక అందమైన, సొగసైన స్త్రీరూపం వైపు వారి కళ్ళు అప్రయత్నంగానే ఆకర్షింపబడతాయి, అలాంటి ఒక క్షణమాత్రపు చూపు చాలు వారి మనసులు అపహరించబడటానికి. ఇటువంటి శోధనలపై కొంత నియంత్రణ సాధించినవాడు ఆరంభదశలో ఈ దాడిని సులువుగానే అధిగమించగలడేమో కానీ, పదేపదే ఇలాంటి ప్రలోభానికి గురైనప్పుడు మాత్రం ఎంతటి బలవంతుడైనా బలహీనుడవుతాడు.

కాబట్టే మనము “యౌవనేచ్ఛల నుండి పారిపోవలెనని” హెచ్చరించబడ్డాము - అంటే అలాంటి శోధనలున్న స్థలం నుండే మనం పారిపోవాలి (2 తిమోతి 2:22). కాని ఈ దుష్టలోకం నుండి ఎక్కడికి పారిపోగలము? మన హృదయాలను పవిత్రంగా ఉంచుకోవడం కోసం దేవుని సంఘం నుండే పారిపోవాలా? ఆ స్థలం కూడా మనకు క్షేమకరం కాకపోతే అది సిగ్గుచేటు!

చివరిగా: నీ శారీరక అందంలో తప్పు కానీ పాపం కానీ ఏమీ లేదు. అది దేవుని సృష్టి, కనుక అయన సృష్టించిన అన్నిటిలాగే అది కూడా 'చాలా మంచిది'. ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో దేవుడు దాన్ని రూపొందించాడు: "స్త్రీ పురుషుని కొరకే” సృష్టించబడింది (1 కొరింథీ 11:9). ఒక పురుషుని హృదయాన్ని సంతృప్తిపరచడానికే నీకు అందం ఇవ్వబడిందనేది ఎంతో స్పష్టమైన విషయం - అయితే ఒక పురుషుని హృదయాన్ని మాత్రమే, పురుషులందరి హృదయాలనీ కాదు. దేవుడు నిన్ను ఆ ఒక్క పురుషునితో జతపరిచి ఉంటే, నీ అందమంతటినీ పూర్ణహృదయంతో ఆ ఒక్క పురుషునికే ఇచ్చి అతనితో, “నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన యిఱ్ఱివలె ఉండుము, గంధవర్గవృక్ష పర్వతముల మీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుమని” చెప్పు (పరమగీతము 8:14). దేవుడతనికి ఆజ్ఞాపించినట్టుగా, 'నీ రొమ్ములవలన అతడు ఎల్లప్పుడు తృప్తినొందుచుండనిమ్ము. నీ ప్రేమచేత అతడిని నిత్యము బద్ధుడవైయుండనిమ్ము' (సామెతలు 5:19). అలా తృప్తిచెందటం ద్వారా ఇతర స్త్రీల అందం అతడిని తక్కువగా ఆకట్టుకుంటుంది. ఇలా వాడబడటం ద్వారా నీ శరీరం యొక్క అందచందాలు, వాటిని నీకనుగ్రహించిన దేవుణ్ణి మహిమపరచటంతో పాటు, అవి ఏ పురుషుని కొరకు ఉద్దేశించబడ్డాయో అతనిని కూడా తృప్తి పరుస్తాయి. కాని అవే అందచందాలని నువ్వు  విచ్చలవిడిగా లోకమంతటి దృష్టికి ప్రదర్శిస్తే, అది నిన్ను నువ్వు ఘనపరుచుకుని సాతానుని సేవించడం ఔతుంది.

చివరిమాట

ఒక సగటు స్త్రీలాగే నువ్వు కూడా ఉంటే, నీకు కూడ ఈ వ్యాసంలో రాయబడిన చాలా విషయాలు కొత్తగానూ, వింతగానూ అనిపించొచ్చు. ఇవన్నీ నీకు అర్థం కాకపోవచ్చు, వీటిని నమ్మడానికి నువ్వు సంకోచించొచ్చు. దీనిని చదివిన కొందరు స్త్రీలు, నిజంగా నేను రాసిన విధంగానే పురుషుల కోరికలు ఉంటాయని ఒప్పుకోలేకపోయారు, కాని దీన్ని చదవమని నేను అడిగిన పురుషులందరూ మనస్ఫూర్తిగా దీనిని ఆమోదించారు. వీరిలో దైవజనుడూ, బోధకుడూ ఐన ఒకతను, “నా దగ్గర ఇవి ఐరవై లక్షల ప్రతులుంటే బాగుండేది” అనన్నాడు. కాబట్టి ఈ విషయాలు నీకు అర్థం కాకపోయినా, వీటిని నువ్వు నమ్మాలని నేను బతిమాలుతున్నాను. రెండవదిగా, ఈ వ్యాసాన్ని ఒకసారి చదవటంతోనే సరిపెట్టుకోకుండా, దానిని మళ్ళీ మళ్ళీ చదివి, క్షుణ్ణంగా అధ్యయనం చేయమని మనవి చేస్తున్నాను; అప్పుడు ఇందులోని విషయాలన్నీ నువ్వు అర్థం చేసుకుని, జ్ఞాపకం ఉంచుకోగలగుతావు. ఆ తర్వాత అందులో ఉన్నవన్నీ ఆచరణలో పెట్టు. చివరగా, ఈ విషయాలను క్రీస్తులో ఉన్న నీ సహోదరీలకు నేర్పించడానికి నీ శాయశక్తులా ప్రయాసపడు. ఇలా చేయడం ద్వారా నువ్వు ఎంతో గొప్ప ఉపకారం చేస్తావు.

క్రీస్తునందు మీ సహెూదరుడు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.