రక్షణ

రచయిత: డి. యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 18 నిమిషాలు
ఆడియో

 'ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని' యోహాను 3:5 లో యేసు నీకొదేముతో చెప్పిన మాటల భావం ఏంటి?

'ఒక వ్యక్తి భౌతికంగానూ ఆత్మీయంగానూ, రెండు విధాలుగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అదే ఈ వచనంలోని యేసు మాటల భావం' అని కొందరు చెప్తారు. ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి కోశంలో (అమ్నియోటిక్ సాక్ లో) ఉంటుంది. బిడ్డ చుట్టూ ఉమ్మ నీరు ఉంటుంది. తల్లి ప్రసవించడానికి కాస్త ముందు ఈ ఉమ్మనీటి కోశం యొక్క పొర చిరిగి, ఉమ్మనీరు బయటికి వచ్చేస్తుంది. మరి కాసేపట్లో పురిటి నొప్పులు మొదలయ్యి ఆమె ప్రసవించబోతోంది అనడానికి ఇది ఒక సూచన. ఈ సంగతుల ఆధారంగా నీటిమూలంగా జన్మించడం అంటే భౌతికంగా జన్మించడమే అని చెప్తారు. ఒకవేళ యేసు మాట్లాడుతున్నది భౌతికంగా జన్మించడం గురించే అయితే 'నువ్వు రక్షణపొందాలి అంటే మొదట ఈ భూమిపై పుట్టి, ఉనికి కలిగి ఉండాలి' అని యేసు అప్పటికే పుట్టి, పెరిగి, వయస్సు పైబడిన నీకొదేము వంటి వృద్ధుడితో చెప్పడం అర్థరహితంగా ఉంటుంది.

ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే తప్పక బాప్తిస్మం తీసుకోవాలి అని బోధిస్తుంటారు మరికొందరు. అలా బోధించేవారు తమను సమర్థించుకోవడానికి చూపించే వాక్యభాగాలలో యోహాను 3:5 ఒకటి. విశ్వాసులు తీసుకునే నీటి బాప్తిస్మం అప్పటికి ఇంకా ఆచరణలో లేనప్పటికీ, అటువంటి ఒక పుణ్యకార్యం చెయ్యడం ద్వారా నువ్వు నీ రక్షణను సంపాదించుకోవచ్చని యేసు చెప్తున్నాడా? కానే కాదు. ఎందుకంటే పరిసయ్యుడైన నీకొదేము అలా అర్థం చేసుకొని ఉంటే యేసు మాటలకి ఎందుకు ఆశ్చర్యపోతాడు. పైపెచ్చు సంతోషంతో ఎగిరి గంతులు వెయ్యాలి. ఓస్, ఇంతేనా! రక్షణ పొందాలి అంటే ఇది చేస్తే సరిపోతుందా? రేపే చేసేస్తాను అని యేసు మాటలను బట్టి సంతోషించాలి. కానీ యేసు మాటలకు నీకొదేము స్పందించిన తీరుని బట్టి అలాగే యేసు తరువాత బోధించిన సంగతులన్నిటిని బట్టి ఆలోచిస్తే తన రక్షణను తాను సంపాదించుకోలేడని నీకొదేముకి అర్థం అయ్యుండొచ్చు.

నీకు అర్థం అయ్యిందా? పుణ్యకార్యాలు లేదా నీతిక్రియలు ఏ మనిషినీ రక్షించలేవని అపొ.కార్య. 15 & రోమా 4 వంటి వాక్యభాగాల ద్వారా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కృప చేత విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ ( రోమా 3:22-30; 4:5 గలతీ 2:16; ఎఫెసీ 2:8-9; ఫిలిప్పీ 3:9). ఒకవేళ ఒక వ్యక్తి రక్షించబడటానికి బాప్తిస్మం అవశ్యం అయితే సువార్త ప్రకటించబడిన ప్రతి సందర్భంలోనూ బాప్తిస్మం గురించి కూడా ప్రస్తావించబడి ఉండేది. కానీ యేసు గానీ, అపొస్తలులు గానీ అలా చేసినట్లు ఎక్కడా చదవము. పేతురు పెంతెకొస్తు దినాన ప్రసంగిస్తూ బాప్తిస్మం గురించి ప్రస్తావిస్తాడు (అపొ.కార్య. 2:38) కానీ అపొ.కార్య. 3వ అధ్యాయంలో ప్రసంగిస్తూ పాపక్షమాపణ పొందుకోవాలంటే మారుమనస్సు పొందాలని చెప్తాడు (అపొ.కార్య. 3:19). ఒక వేళ పాపక్షమాపణ పొందుకోవడానికి బాప్తిస్మం తప్పనిసరి అయితే పేతురు ఎందుకు ఇక్కడ దాని గురించి ప్రస్తావించలేదు?

పౌలు చేసిన సువార్త ప్రకటనలలో ఎప్పుడూ బాప్తిస్మం గురించి ప్రస్తావించలేదు. 1 కొరింథీ 15:1-4లో పౌలు తాను ప్రకటించిన సువార్త సత్యాల సారాంశాన్ని తెలియజేస్తాడు. అందులో బాప్తిస్మం గురించిన ప్రస్తావనే కనిపించదు. పైగా 1 కొరింథీ 1:17లో ఇలా అంటాడు - '17. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, .... సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.' సువార్త, బాప్తిస్మం ఇవి, రెండు విభిన్నమైన విషయాలు అన్న సత్యం పౌలు మాటలను బట్టి స్పష్టం అవుతోంది. ఇలా కాకుండా ఒకవేళ ఒక వ్యక్తి రక్షించడటానికి బాప్తిస్మం తీసుకోవడం తప్పనిసరి అయితే, పౌలు బాప్తిస్మం ఇవ్వకుండా, కేవలం సువార్త ప్రకటించడం వల్ల ఉపయోగం ఏంటి? ఇలా చెయ్యడం వల్ల ఎవ్వరూ రక్షించబడి ఉండేవారు కాదు కదా! కాబట్టి సువార్త, బాప్తిస్మం ఇవి రెండూ వేరు వేరు అన్న సత్యాన్ని పౌలు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. లూకా 7:37లో ప్రభువు పాదాలను కన్నీళ్లతో తుడిచి, అత్తరు పూసిన స్త్రీ, మత్తయి 9:2లోని పక్షవాయువు గలవాడు, లూకా 18:13-14లోని సుంకరి, వీరంతా బాప్తిస్మంతో నిమిత్తం లేకుండానే పాపక్షమాపణ పొందుకున్నారు.

అలాగే బాప్తిస్మం తీసుకోక ముందే రక్షణ పొందారని కొందరి గురించి బైబిల్ లో రాయబడింది. కొర్నేలీ, అతనితో కూడా ఉన్నవారు పేతురు వర్తమానము విని మారుమనస్సు పొందినట్లు అపొ.కార్య. 10:44-48లో చదువుతాము. వీరు పరిశుద్ధాత్మను పొందుకోవడాన్ని బట్టి (వ.44), పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవడాన్ని బట్టి (వ. 46) బాప్తిస్మం పొందకముందే వీరు రక్షణ పొందినట్లు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. అంత మాత్రమే కాదు వీరు రక్షించబడినట్లు, పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు నిర్ధారించుకున్న కారణాన్ని బట్టే బాప్తిస్మం పొందమని పేతురు వీరికి ఆజ్ఞాపించాడు.

ఒక లేఖనభాగం యొక్క సరైన భావాన్ని తెలుసుకోవడం కోసం, ఆ లేఖనభాగాన్ని మిగిలిన లేఖనమంతటితో పోల్చి సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఈ సూత్రం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ లోని ఏ రెండు వాక్యభాగాలకీ మధ్య వైరుధ్యం ఉండే అవకాశం లేదు ఎందుకంటే అవి దేవుని మాటలు. ఏదో ఒక వాక్యభాగం తీసుకొని, ఆ వాక్యభాగాన్ని మాత్రమే ఆధారం చేసుకొని  ఒక సిద్ధాంతాన్ని కట్టడం సరైనది కాదు. బాప్తిస్మం అనే పుణ్యకార్యం చెయ్యడం ద్వారా గానీ లేదా ఇతర నీతి క్రియలేవైనా చెయ్యడం ద్వారా గానీ ఒక వ్యక్తి రక్షించబడడు అన్నదే బైబిల్ సమగ్ర బోధ. కాబట్టి బైబిల్ లో ఒక అంశానికి సంబంధించిన వేరు వేరు వాక్యభాగాలన్నింటిలో సమతుల్యత ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణపొందడానికి బాప్తిస్మం తప్పనిసరి అని బోధిస్తున్నట్లుగా అనిపించే వాక్యభాగాల సంగతేంటో చూద్దాం.

అపొ.కార్య. 2:38లో పేతురు మారుమనస్సుని బాప్తిస్మంతో ముడిపెట్టి మాట్లాడుతున్నట్లు చదువుతాము. 'పేతురు - మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి ...'  ఈ మాటలను ఇలా కూడా తర్జుమా చెయ్యొచ్చని గ్రీకు పండితులు సూచిస్తారు - 'పేతురు - పాపక్షమాపణ నిమిత్తము మీరు మారుమనస్సు పొంది, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి". కాబట్టి పేతురు ఖచ్చితంగా మారుమనస్సుని బాప్తిస్మముతో ముడిపెట్టి మాట్లాడుతున్నాడు అని అనడానికి అవకాశం లేదు. ఈ వ్యాఖ్యానానికి బలం చేకూర్చే మరో విషయం ఏంటి అంటే - గ్రీకు భాషలో ఈ వచనంలోని మిగిలిన పదాలన్నీ బహువచనంలో ఉంటే 'బాప్తిస్మము పొందుడి' అన్న పదాలు మాత్రం భిన్నంగా ఏకవచనంలో ఉన్నాయి. అంటే సంబంధం ఉన్నది మారుమనస్సుకీ పాపక్షమాపణకీ గానీ, మరుమనస్సుకీ, బాప్తిస్మానికీ కాదు. ఈ భావం మిగిలిన కొత్త నిబంధన సమగ్ర బోధతో సరిగ్గా సరిపోతుంది.

మార్కు 16:16 - ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే బాప్తిస్మం తప్పనిసరి అని వాదించేవారు తమని తాము సమర్థించుకోవడానికి ఎక్కువగా చూపించే వాక్యభాగాము ఇది. "16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును." ఈ వచనంలో శిక్ష ఎవరికి విధించబడుతుందో గమనించారా? బాప్తిస్మం పొందనివాడికా? లేక నమ్మనివాడికా? నమ్మనివాడికే. బాప్తిస్మం అనేది కేవలం మొదటి భాగంలోనే ఉంది ఎందుకంటే నమ్మిన వ్యక్తిలో అంతరంగంగా జరిగిన మార్పుకి బహిరంగ సూచనగా, బాప్తిస్మం తీసుకుంటాడు. అయితే ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకున్నా సరే అతను నమ్మకపోతే, శిక్షావిధిని తప్పించుకోలేడు. దీన్ని బట్టి రక్షించేది నమ్మిక, బాప్తిస్మము కాదు అని స్పష్టమవుతోంది.

బాప్తిస్మం అన్న మాటకి 'ముంచడము' అని అర్థం. 'బాప్టిజో' అన్న గ్రీకు పదాన్ని లిప్యంతరీకరణ చేసి బాప్తిస్మం అని అన్నారు. కానీ ఈ పదాన్ని కొత్త నిబంధనలో ఎక్కడ వాడినా అది నీటి బాప్తిస్మాన్నే సూచిస్తోంది అని అనుకోకూడదు. 1 పేతురు 3:21 లో పేతురు బాప్తిస్మం గురించి మాట్లాడుతూ "శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని" అని అంటాడు. నీటి బాప్తిస్మం ద్వారా శరీర మాలిన్యం పోతుంది కదా, కాబట్టి పేతురు ఈ సందర్భంలో నీటి బాప్తిస్మం గురించి మాట్లాడటం లేదు. క్రీస్తు మరణ పూనరుత్థానాలలో మునగడం గురించి, ఆ బాప్తిస్మం గురించి పేతురు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అలాగే రోమా 6లో, గలతీ 3లో కూడా నీటి బాప్తిస్మం గురించి ప్రస్తావించబడలేదు. అక్కడ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం గురించి ప్రస్తావించబడింది.

అపొ.కార్య. 22:16లో పౌలు - అననీయ తనతో చెప్పిన సంగతులను వివరిస్తూ - '16. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను." ఈ వచనంలో కూడా ఏ గ్రీకు పదాలకు, ఏ గ్రీకు పదాలతో సంబంధం ఉంది అనే సంగతులను పండితులు పరిశీలించిన పిదప సూచించిన అనువాదం, గ్రేస్ మినిస్ట్రీస్ వారి వాడుక భాష అనువాదాన్ని పోలి ఉంటుంది. "అయితే మీరింకా ఆలస్యం చెయ్యడం దేనికి? లేచి బాప్తిస్మము పొందండి. ఆయన పేర ప్రార్థన చేస్తూ మీ పాపాలు కడిగివేసుకోండి." అంటే ప్రార్థనకీ, పాపాలు కడగబడటానికీ సంబంధం ఉంది అంతే కానీ బాప్తిస్మానికీ పాపాలు కడగబడటానికీ కాదు.

అయితే బాప్తిస్మం అవసరం లేదా? నేను అలా చెప్పడం లేదు. బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను తగ్గించడం నా ఉద్దేశం అస్సలు కాదు. మారుమనస్సు పొంది, పాప క్షమాపణ పొందుకున్న ప్రతి వ్యక్తి తప్పక బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకుంటాడు (ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే లక్షణం, ఆయన మాటకు లోబడే మనస్తత్వం ఒక విశ్వాసికి ఉంటుంది). కానీ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందుతాడని గానీ, ఏదైనా తగిన కారణం చేత తీసుకోలేకపోతే ఆ వ్యక్తి నశించి నిత్య నరకాగ్ని పాలవుతాడని కానీ బైబిల్ బోధించడం లేదని జ్ఞాపకం ఉంచుకోండి.

బాప్తిస్మం గురించిన ప్రాథమిక బైబిల్ బోధను సులువుగా అర్థం చేసుకోవడం కోసం ఈ లింక్ ద్వారా 'బాప్తిస్మం' అనే వ్యాసాన్ని చదవండి.

అలాగే 'రక్షణకు బాప్తిస్మం అనే సత్క్రియ తప్పనిసరి' అన్న దుర్బోధను ఇంకా విపులంగా అర్థం చేసుకోవడం కోసం ఈ లింక్ ద్వారా 'బాప్తిస్మం ద్వారా రక్షణ వస్తుందా?' అనే వ్యాసాన్ని చదవండి.

ఇప్పుడు మన ప్రధాన లేఖనభాగం గురించి ఆలోచిద్దాము.

'ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు'.

నీటి మూలముగా జన్మించడం అంటే భౌతికంగా జన్మించడమూ కాదు, నీటి బాప్తిస్మం తీసుకోవడమూ కాదు. మరి ఒక వ్యక్తి రక్షించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చెయ్యాలో సూచించే యేసు మాటల యొక్క అసలు భావం ఏంటి? ఇలా ప్రశ్నించిన నీకొదేమును యేసు గద్దించాడు. 'నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా?' అని యేసు నీకొదేముని ప్రశ్నించాడు (యోహాను 3:10). గొప్ప పరిసయ్యుడివయ్యుండి ఈ మాత్రం తెలియదా? పాత నిబంధనలో ఎంత గొప్ప పండితుడవయ్యుంటావు, నా ఈ మాటలు నీకు గోచరించడం లేదా? అని యేసు నీకొదేమును గద్దించాడు. అంటే ఈ సంగతులు అంతకముందే పాత నిబంధనలో తెలియజేయబడ్డాయి అనమాట. అందుకే యేసు నీకొదేముని ఇలా గద్దించాడు. అయితే పాత నిబంధనలో ఏ వాక్యభాగాన్ని దృష్టిలో పెట్టుకొని యేసు ఈ మాటలు చెప్పి ఉండవచ్చు? 

యెహెఙ్కేలు 36:24-27 - "24. నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. 25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. 26. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. 27. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను."

తన పిల్లలను సమకూర్చుతానని దేవుడు కొన్ని శతాబ్దాల పూర్వమే వాగ్దానం చేసాడు. అంతమాత్రమే కాదు అపవిత్రత అంతా పోవులాగున వారిని శుద్ధజలముతో కడుగుతాననీ,తన ఆత్మను వారిలో ఉంచుతాననీ చెప్పాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించడం కోసం దేవుడు ఏం చేస్తాడో ఈ వాక్యభాగంలో నొక్కి చెప్పటం జరిగింది. మనుషులు తమని తామే రక్షించేసుకుంటారు అని గానీ లేదా తమ రక్షణను తామే సంపాదించేసుకుంటారని గానీ చెప్పడం లేదు. మనిషికి ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ దేవుడు అతనిలో చేసే తిరిగి జన్మింపజేసే కార్యం. దేవుడు "మీ మీద శుద్ధజలము చల్లు"తాడు. "మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివే"స్తాడు. ఇదే 'నీటిమూలముగా జన్మించాలి' అన్న యేసు మాటల యొక్క అసలు భావం. దేవుడు - "రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను", "నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను" అని కూడా వాగ్దానం చేసాడు. ఇదే 'ఆత్మమూలంగా జన్మించాలి' అన్న యేసు మాటల యొక్క అసలు భావం. తిరిగి జన్మించడం గురించి యేసు ఇచ్చిన వివరణ ఇది. దేవుడు మన పాపముల నుండి మనలను కడిగి పవిత్రపరచి, తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఈ రక్షణ గురించే పరిసయ్యులు ఇశ్రాయేలీయులకు ప్రకటించాలి. కేవలం బాహ్య ఆచారాలతో, వేషధారణతో కూడిన భక్తి కాదు.

కొత్త నిబంధనలో తిరిగి జన్మించడం అనేవి అప్పటి వరకూ ఎక్కడా వినని, ఎవ్వరు బోధించని కొత్త సంగతులు కావు. ఈ సంగతులు పాత నిబంధనలో చాలాసార్లు ప్రస్తావించబడినట్లు చూడగలము. ఉదాహరణకి, ఇదే యెహెఙ్కేలు గ్రంథంలో ఇది వరకే ఈ సంగతులు వాగ్దానం చేయబడినట్లు చదువుతాము. యెహెఙ్కేలు 11:19 -20 - "19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును. 20. అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును." ఈ వాక్యభాగాలన్నీ నీకొదేముకి బాగా తెలిసుండాలి. లేఖనాల విషయంలో ఇంత అజ్ఞానంగా ఉన్నావు ఏంటి అని యేసు అతన్ని గద్దిస్తున్నాడు. ఇశ్రాయేలుకి బోధకుడైయ్యుండి కొత్త నిబంధన వాగ్దానాల యొక్క నెరవేర్పును గ్రహించలేకపోతున్నాడు. పరిసయ్యుల బోధ దేవుని వాక్యం నుండీ తొలగిపోయింది అని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. వారు తప్పుడు సువార్తను ప్రకటించారు. పుణ్యకార్యాలు చేసి రక్షణను సంపాదించుకోవచ్చని బోధించారు. తమ స్వంత నీతిక్రియల ద్వారా తమ పాపానికి పరిష్కారం చేసుకోవచ్చని బోధించారు కానీ యేసు దానిని పూర్తిగా కొట్టిపారేస్తూ ఇలా చెప్పాడు - "6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది."(యోహాను 3:6). "శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు" అని పౌలు రోమా 8:8లో చెప్తాడు. శరీరము యొక్క బలహీనత గురించి, అసమర్థత గురించీ పాత నిబంధనలో చాలా ప్రస్ఫుటంగా అనేక వాక్యభాగాలలో బోధించబడింది. కాబట్టి ఆ సంగతి నీకొదేముకి తెలిసుండాలి.

కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, బాహ్య క్రియలు బాగుపడితే రక్షించబడినట్లు కాదు. అసలు సమస్య అంతా హృదయానికి సంబంధించినది. బాహ్య మార్పు కన్నా అంతరంగ మార్పు చాలా ప్రాముఖ్యము. హృదయం మార్పు చెందకుండా పైకెన్ని భక్తి వేషాలు వేసినా అవన్నీ వ్యర్థమే. అటువంటి వ్యక్తి రక్షించబడలేదు.

'మానవుని యొక్క సంపూర్ణ పతనం' అనే సిద్ధాంతం గురించి నీకొదేముకి పూర్తి అవగాహన ఉండి ఉండాలి. అందుకే యేసు ఇలా అన్నాడు - "మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు" (యోహాను 3:7). ఎందుకంటే ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. ఇశ్రాయేలు బోధకుడు గనుక మనిషి తనని తాను రక్షించుకోవడానికి ఏమీ చెయ్యలేడనీ తిరిగి జన్మింపజేయడం అనేది పూర్తిగా దేవుడు చేసే కార్యమని నీకొదేముకి తెలిసుండాలి.

ప్రియ చదువరీ, ఈ సంగతులను నీవు గ్రహించావా? మనందరి ఆత్మీయ ప్రయోజనార్థం దేవుడు ఈ సంగతులను గ్రంథస్థం చేయించాడు. బాప్తిస్మం ద్వారా ఏ వ్యక్తీ రక్షించబడలేడు, ఏ వ్యక్తీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. ఒకవేళ ఇంతకాలం నువ్వు ఈ అబద్ధం చేత మోసగించబడి ఉంటే, దేవుడు నీ యెడల కృప జూపి ఈ సంగతులను నీ ముందు ఉంచుతున్నాడు. ఈ బోధ అబద్ధమని గ్రహించు. కేవలం బాప్తిస్మం తీసేసుకొని 'నేను పరలోకం వెళ్ళిపోతాను అన్న అబద్ధ నిశ్చయతతో' నిన్ను నీవు మోసం చేసుకోకు.

ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరాలంటే నీటి మూలంగానూ, ఆత్మ మూలంగానూ జన్మించాలని యేసు చెప్పాడు. నీటి మూలంగా జన్మించడం అంటే పాపాలు కడుగబడి, పవిత్రపరచబడటం అని తెలుసుకున్నాము. ఆత్మ మూలంగా జన్మించడం అంటే దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడం, నూతన హృదయాన్ని పొందుకోవడం అని తెలుసుకున్నాము. మరి నువ్వు నీటి మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించావా? నువ్వు నిజంగా మారుమనస్సు పొందావా? నీ పాపాలు కడగబడ్డాయా? నువ్వు పాప క్షమాపణ పొందుకున్నావా? నీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడిందా?

ఈ ప్రశ్నలు చాలా కీలకమైనది. నీ రక్షణకు సంబంధించినవి.

నిజంగా మారుమనస్సు పొందిన వ్యక్తులలో కనబడే గుర్తుల గురించి మరింత లోతుగా ధ్యానించడం కోసం ఈ కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా '"నీవు తిరిగి జన్మించావా ??' & 'నిజమైన మారుమనస్సుకు ఏడు ఖచ్చితమైన గుర్తులు' అన్న వ్యాసాలను చదవాలని మనవి.

'రక్షణ యెహోవాదే' అన్న సత్యాన్ని కూడా ఈ వ్యాసంలో మనం నేర్చుకున్నాము. ప్రియ చదువరీ, నువ్వు జన్మతః పాప స్వభావం కలిగి, ఆత్మీయంగా అంధకారంలోనూ, చచ్చిన స్థితిలోనూ ఉండి, నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావని గుర్తెరిగావా? ఏ పుణ్యకార్యాల ద్వారానూ నీ రక్షణను నీవు సంపాదించుకోలేవని గుర్తెరిగావా? మన రక్షణ కోసం మనం చేయగలిగేది ఏమీ లేదనీ, దేవుడు తన కృప చొప్పుననే మనలో తిరిగి జన్మించడం అనే అద్భుతాన్ని జరిగిస్తాడనీ గ్రహించావా?

ప్రభువా, ఈ వ్యాసాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ సువార్త సత్యాల చేత వెలిగించబడి, ప్రకటన 7:9,10 లోని లెక్కింపజాలని గొప్ప జనసమూహము చెప్పినట్లుగా 'మా రక్షణకై స్తోత్రము' అని నాతో కూడా ఎలుగెత్తి మిమ్మును స్తుతించు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.