వివాహం గురించి ఒక ప్రాథమికమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. వాక్యంలో బహుభార్యత్వాన్ని మనం గొప్ప విశ్వాసులుగా పరిగణించబడ్డవాళ్ళ జీవితంలో చూస్తున్నాం. ఉదాహరణకు: అబ్రాహాము, యాకోబు, ఎల్కానా, దావీదు, సొలొమోను....! నాకు ఎదురైన ప్రశ్న ఏంటంటే వీరందరూ గొప్ప విశ్వాసులు, దేవునిని ప్రేమించినవారు, దేవునిచేత సాక్ష్యం పొందుకున్నవారు, ఇలాంటివారు ఎందుకు చాలామంది స్త్రీలను వివాహం చేసుకున్నారు? ఇది దేవుని దృష్టిలో పాపం అయితే దేవుడు వీరిని ఎందుకు హెచ్చరించలేదు? ఇలా చేయకూడదు అని ఒక్క సందర్భంలో కూడా చెప్పలేదు.
అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందు, దేవుని దృష్టిలో వివాహం అంటే ఏంటి, దేనిని దేవుడు అనుమతించాడు అనే విషయాలు తెలుసుకుందాం.
1. "ఏకభార్యత్వం" దేవుని ప్రణాళికా?
ఒక పురుషునికి ఒక భార్య మాత్రమే ఉండాలి అనేది దేవుని ప్రణాళిక, అయితే దీనిని నిరూపించడానికి నాలుగు వాదనలను తీసుకుందాం:
a. సృష్టిక్రమం యొక్క వాదన
"కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు." - ఆది. 2:24
దేవుడు ఒక స్త్రీని సృష్టించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక వేళ, బహుభార్యత్వం దేవుని ప్రణాళిక అయితే, బహుశా ఒకరి కంటే ఎక్కువమంది స్త్రీలను తయారు చేసేవాడేమో. కానీ దేవుడు అలా చెయ్యలేదు.
ఇదే విషయాన్ని యేసు ప్రభువు ఆమోదించాడు, అపొస్తలులు కూడా దీనినే బోధించారు.
"పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయననడిగిరి. అందుకాయన మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారినడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు మీ హృదయకాఠిన్యమును బట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని సృష్ట్యాది నుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగానుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను." మార్కు 10:2-9
ప్రభువు, భార్యను విడనాడుట అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ, భార్యాభర్తల క్రమం గురించి ప్రస్తావించడానికి, దేవుడు సృష్టించిన క్రమం యొక్క వాదనను తీసుకున్నాడు. దేవుడు వారిని పురుషునిగాను మరియు స్త్రీనిగాను అని చెప్పి, "వారిద్దరు ఏకశరీరమైయుందురు" అని అంటున్నాడు. దేవుని చేత ఆమోదించబడింది వివాహం ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య మాత్రమే.
b. క్రీస్తు మరియు సంఘం యొక్క సాదృశ్యం
వాక్యంలో అనేకచోట్ల యేసుక్రీస్తుని వరుడుగా, సంఘాన్ని వధువుగా వర్ణించడం మనం చూస్తాం.
“దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని” 2 కొరింథీ. 11:2
“ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.” ఎఫెసీ. 5:31,32
ఇక్కడ మనం గమనిస్తే పౌలు సంఘాన్ని, "పవిత్రురాలైన కన్యక" అని పిలుస్తున్నాడు. అదేవిధంగా, ఎఫెసీ. 5:30,31లో వివాహం గురించి మాట్లాడుతూ దానిని క్రీస్తుకు మరియు సంఘానికి ఉన్న సంబంధంలో పోల్చడం గమనిస్తాం. (దేవుడు తనకు తన ప్రజలకు, అలాగే క్రీస్తుకు తన సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని సాదృశ్యపరచడానికి వివాహాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు.)
గమనించండి, సంఘం క్రీస్తుకు "పవిత్రురాలైన కన్యక" గా పిలువబడింది "పవిత్రురాలైన కన్యకలు"గా పిలువబడలేదు. క్రీస్తు (వరుడు), సంఘం (వధువు). ఒక వరుడు, ఒక వధువు అనే సాదృశ్యాన్నే మనం చూస్తున్నాం. అంతే గాని ఒక వరుడు అనేక వధువులు ఉన్న సాదృశ్యంగా క్రీస్తు మరియు సంఘం వర్ణించబడలేదు. ఈ సాదృశ్యం, వివాహంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు అని (ఒక వరుడు, ఒక వధువుకు) తెలియజేస్తుంది.
c. వివాహానికి సంబంధించి నామవాచకాలు మరియు సర్వనామాల వినియోగంపై ఆధారపడిన వాదన
భార్యాభర్తలకు, లేదా వధువువరులకు దేవుని చిత్తాన్ని తెలియజేసే ప్రతి సందర్భంలో వారిని సంబోధించినప్పుడు, కచ్ఛితంగా ఆ పదాలు ఏకవచనంలోనే ఉపయోగించబడ్డాయి. భార్యకు గాని భర్తకుగాని (వధువుకుగాని వరునికిగాని) బహువచన ఉపయోగం మనం వాక్యంలో చూడం.
కొన్ని వచనాలు పరిశీలిద్దాం:
"అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంతభార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్తయుండవలెను. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు." 1 కొరింథీ. 7:2-4
“సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము” సామె. 19:14
“మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను” ఎఫెసీ. 5:33
ఈ వచనాలలో మనం చూస్తే, కొన్ని విషయాలు మనకు అర్ధమవుతాయి. మొదటిగా, ప్రతివానికి సొంత "సొంతభార్య" ఉండాలి అని వాక్యం చెప్తుంది "సొంత భార్యలు" కాదు. రెండవదిగా, "సుబుద్ధిగల భార్య" ను అనుగ్రహించేది దేవుడే అని చూస్తున్నాం, అంతే గాని "సుబుద్ధిగల భార్యలను" దేవుడు అనుగ్రహించట్లేదు. మూడవదిగా, భర్త తన వలె తన భార్యను ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించాడు, తన వలె తన భార్యలను ప్రేమించమని ఆజ్ఞాపించలేదు. ఇలా చూసుకుంటూ పోతే, ఏకవచనంలో భర్త అనే పదం వాడబడిన ప్రతిసారి, భార్యను ప్రస్తావించేప్పుడు ఏకవచనంలోనే ప్రస్తావించబడింది, బహువచనంలో ఎప్పుడు ప్రస్తావించబడలేదు.
అయితే మీరు ఈ క్రింది వచనాలు చూపించి ఇది తప్పు అని మాట్లాడొచ్చు:
“అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి” 1 పేతురు 3:7
“పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.” ఎఫెసీ 5:25
“అటువలెనే పురుషులుకూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు” ఎఫెసీ. 5:28
“భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి” కోలోస్సి. 3:19
ఇక్కడ భార్యలు అనే మాట వాడబడిందిగా బ్రదర్ అని అడుగుతారో ఏమో?
వివాహం విషయంలో దేవుని ప్రణాళిక లేదా ఆజ్ఞలు చెప్పబడినప్పుడు, "భార్యలు" అని బహువచన పదం వాడిన ప్రతిసారి "భర్తలు" లేదా "పురుషులు" అనే బహువచనం జతచేయబడింది. అంతేగాని, ఏకవచనంలో భర్తను సంబోధిస్తూ బహువచనంలో భార్యలు అని ప్రస్తావించడం మనం వాక్యంలో ఎక్కడా చూడం.
d. అధ్యక్షుడుగా ఉండడానికి దేవుడు ఇచ్చిన నియమాల నుండి వాదన
మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, సంఘంలో అధ్యక్షుడిగా ఉండడానికి కావాల్సిన అర్హతలను పౌలు చెప్తూ, "అధ్యక్షుడగువాడు......ఏకపత్నీపురుషుడు.."గా ఉండాలి అనే దేవుని ఆజ్ఞను తెలియజేసాడు.
కొంచెం ఆలోచించండి, ఇక్కడ దేవుని ఉద్దేశం అధ్యక్షులు మాత్రమే "ఏకపత్నీపురుషుడుగా" ఉండాలి, మిగతా సంఘస్తులు మరియు పెద్దలకు అనేక భార్యలు ఉన్నా పర్వాలేదు అని చెప్తుందా? అక్కడ ఉన్న భావం అదే కదా బ్రదర్ అంటారేమో...! మొత్తం వచనం చదువుదాం:
“అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను” 1 తిమోతి 3:2-4
జాగ్రత్తగా గమనించండి, "అధ్యక్షుడగువాడు" "ధనాపేక్షలేనివాడునై" ఉండాలి అని ఒక నియమం ఇక్కడ చూస్తున్నాం, అంటే దీని ఉద్దేశం సంఘంలో అధ్యక్షులు కానివారు "ధనాపేక్షగలవారై" ఉండవచ్చు అనేనా? అలాగే, అతను "మద్యపానియు కొట్టువాడునుకాక" అనే చెప్పబడింది అంటే, మిగతా సంఘస్తులు "మద్యపానియు కొట్టువాడుగా" ఉండవచ్చు అని దేవుడు చెప్తున్నాడా! కాదు.
అపొస్తలులైన, పెద్దలైన, అధ్యక్షులైన, సంఘస్తులైన అందరూ "ఏకపత్నీపురుషులు"గానే ఉండాలి (పౌలువలె దేవుని రాజ్యం కోసం వివాహం చేసుకోకుండా ఉండగలిగే వరం ఉన్నవారు తప్ప).
వాక్యంలో, అపొస్తలులు కూడా "ఏకపత్నీపురుషులు" అని కచ్చితంగా నిరుపించొచ్చు.
“తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?” 1 కొరింథీ. 9:5
పెద్దలు మరియు అధ్యక్షులు సంఘానికి మాదిరి గనుక వారిని వెంబడించాలి.
2. పాత నిబంధనలో విశ్వాసవీరులకు అనేకమంది భార్యలు ఎందుకున్నారు?
పాత నిబంధనలో దాదాపు 16 మందికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉన్నట్టు చూస్తాం. బైబిల్లో విశ్వాస వీరులుగా పరిగణించబడ్డ అబ్రాహాము, యాకోబు, దావీదు, సొలొమోను మొదలగువారికి ఎందుకు అనేకమంది భార్యలు ఉన్నారు? ఎందుకు దేవుడు దీనిని అనుమతించాడు అనేది విశ్లేషిద్దాం.
వాక్యంలో వివరణాత్మకంగా ఉన్న ప్రతి విషయం దేవుని ఆదేశం కాదు (All the Descriptive Narratives in the Bible cannot be confused as God’s Prescription to follow). అబ్రాహాము, యాకోబు, దావీదులు అనేకమంది భార్యలను కలిగి ఉండడం అనేది దేవుని ఆజ్ఞ కాదు, మీరు ఈ విషయంలో వీరిలాగానే ప్రవర్తించండి అని దేవుడు మనకు ఎక్కడా ఆజ్ఞాపించలేదు.
ఈ 16 మంది జీవితాలలో (అబ్రాహాము, యాకోబు, దావీదుతో సహా) బహుభార్యత్వం వలన కలిగిన ప్రయోజనం ఏమీ లేదు అని, దాని వలన నష్టమే ఉంది అని చాలా చక్కగా తెలుసుకోవచ్చు. (For more information please read, “OLD TESTAMENT TEACHING ON POLYGAMY” by James P. Breckenridge).
కొన్ని ఉదాహరణలు ప్రస్తావించుకుందాం:
దావీదుకు అనేకమంది భార్యలు ఉన్నారు. మరి ఆయన వారసులు ఎలా ఉన్నారు, అమ్నోను తన చెల్లితో వ్యభిచారం చేసాడు, అబ్షాలోము అమ్నోనును చంపాడు, అంతే కాకుండా దావీదు రాజ్యం మీద తిరుగుబాటు చేసి స్వాధీనపరచుకున్నాడు. దావీదు ఉపపత్నులతో శయనించాడు. దావీదు తర్వాత తరం నాశనం అయ్యింది. అయితే దావీదుదే మొత్తం తప్పా? వారి తప్పేమీ లేదా అంటే కచ్చితంగా అమ్నోను, అబ్షాలోము వారి పాపానికి వారే బాధ్యులు. అయితే దావీదు "ఏకపత్నీపురుషుడు" అయ్యుంటే ఈ సమస్య ఉండకపోయేదేమో!
సొలొమోను పరిస్థితి కూడా ఇదే, తాను భార్యలను, ఉపపత్నులను పెంచుకుంటూ పోయాడు. ఏమి కాదులే, నేను చెప్పినట్టే వీరందరూ వింటారు అని అనుకున్నాడేమో. దేవుడు చెప్పిన హెచ్చరికను కూడా లెక్కచేయలేదు, ఫలితం "సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాకపోయెను" 1 రాజులు 11:4.
దావీదుకు ఒక సమస్య, సొలొమోనుకు మరొక సమస్య (అబ్రాహాము మరియు యాకోబులకు కూడా ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉండడాన్ని బట్టి సమస్యలే గాని ప్రశాంతత లేదు). ఆదాము ఏ విధంగా అయితే హవ్వ మాట విని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాడో, అబ్రాహాము కూడా శారా మాటలు విని పాపం చేసాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును చూసి ఒకే భార్య ఉండాలి అనే నియమాన్ని నేర్చుకోకుండా ఇద్దరు భార్యలు (వారి దాసీలను) కలిగి ఉన్నాడు, దీనిని బట్టి యాకోబుకు వేదనే. ఈ ఇద్దరు భార్యల మధ్య ఈర్ష్య, ద్వేషం. అంతే కాకుండా, తన కుమారులు ఈర్ష్యతో, ద్వేషంతో, యోసేపును చంపినంత పని చేసారు, అనేక సంవత్సరాలు యాకోబు వేదన అనుభవించాల్సి వచ్చింది.
ఒక పాస్టర్ ఇలా అంటున్నాడు, “కొత్త నిబంధన చాలా తరచుగా పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసాన్ని అనుకరణకు అర్హమైన ప్రాథమిక లక్షణంగా సమర్థిస్తుంది, అయితే వారు చేసిన ప్రతిపనినీ అనుకరణకు అర్హమైనది అని చెప్పలేదు"
మరొక వ్యాఖ్యాత ఇలా అంటాడు, "యాకోబు యొక్క వైవాహిక జీవితం, బహుభార్యాత్వంతో ముడిపడి ఉన్న సమస్యల గురించిన అతి ముఖ్యమైన పరిశీలనగా పిలవవచ్చు"
పాత నిబంధనలో విశ్వాసవీరులు ఏ కారణాన్ని బట్టి అనేకమందిని వివాహం చేసుకున్నా, అది దేవుని చిత్తం కాదు అని మనం కచ్చితంగా చెప్పొచ్చు
3. కొన్ని బైబిల్ వచనాలను బట్టి దేవుడు బహుభార్యత్వాన్నిఆమోదిస్తున్నాడు అని చెప్పొచ్చా?
కొంతమంది, కొన్ని బైబిల్ వచనాలు చూపించి దేవుడు బహుభార్యత్వాన్ని సమర్థిస్తున్నాడు అని చెప్తారు. వీటిని పరిశీలిద్దాం:
మొదటి అభ్యంతరం
దేవుడు, ఇద్దరు భార్యలు ఉంటే, వారి పిల్లల విషయంలో ఎలా ఉండాలో నియమాలు ఇచ్చాడు కదా. మరి దేవుడు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను అనుమతిస్తున్నారు అని దీనిని బట్టి చెప్పొచ్చా?
“ప్రేమింపబడునదొకతెయు ద్వేషింపబడునదొకతెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైన యెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడినదాని కుమారు నికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారం భము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.” ద్వితీయో. 21:15-17
ఒకవేళ ఈ ఆజ్ఞ యొక్క అర్థం ఇదే అయితే, అదే అధ్యాయంలో వేరే వచనాలు చూద్దాం, వాటి అర్థం ఏంటో మీరే చెప్పండి:
“ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన యెడల..” ద్వితీయో. 21:18
“మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల...” ద్వితీయో. 21:22
“ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి” అనే మాట, ఇద్దరు భార్యలు ఉన్నా పర్వాలేదు అనే అర్థాన్నిస్తే, "ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి" అని చెప్పినప్పుడు, పిల్లలందరూ మొండివారిగా ఉండవచ్చు అని చెప్పొచ్చా? అదేవిధంగా, "మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా" అనే మాటలు అలంటి పాపాలు చేయవచ్చు అని ఆమోదించినట్టు పరిగణించాలా?
ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే, "If a man has two wives….” అని చూస్తాం. అంతే గాని “Since a man has two wives..” అని ఉండదు.
ఒకనికి ఇద్దరు భార్యలుండగా అనే ఈ వచనాన్ని చూపించి, ఇద్దరు భార్యలు ఉండడాన్ని బైబిల్ సమర్థిస్తుంది అని చెప్పడానికి ఏ అవకాశమూ లేదు. ఒక వేళ ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉంటే, వారి పిల్లలకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయం గురించి మాత్రమే మాట్లాడుతుంది.
రెండవ అభ్యంతరం
దేవుడు దావీదుతో, సౌలు భార్యలను నీ కౌగిటికి అప్పగించాను అని చెప్పాడు? మరి దేవుడు ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉన్నా పర్వాలేదు అని చెబుతున్నట్టే కదా?
“నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగా ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.” 2 సమూయేలు 12:7,8
ఇక్కడ దేవుడు దావీదుతో, "నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి", "ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును" అని అంటున్నాడు. ఈ మాటలను బట్టి, దావీదుకు దేవుడు సౌలు భార్యలను అప్పగించాడు, మరి అది బహుభార్యత్వాన్ని దేవుడు ఆమోదిస్తున్నట్టే అని చెప్పొచ్చు కదా!
ఆ నిర్ధారణకు వచ్చే ముందు ఇంకొంచెం పరిశీలనగా ఈ వచనాన్ని చూద్దాం:
“"నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి" అనే మాటను, సౌలు భార్యలను దావీదు భార్యలుగా చేసుకున్నాడు అని చెప్తే, వాక్యం ఆ విషయానికి సమ్మతి తెలుపదు, ఎందుకంటే దావీదు భార్యల జాబితాలో వీరి పేర్లు ఎక్కడా లేవు (1 సమూయేలు 18:24-27, 2 సమూయేలు 3:2-5).
ఒక రాజు యొక్క రాజ్యం ఇంకొకరి చేతిలోకి వెళ్ళినప్పుడు, ఆ మొదటి రాజుకు సంబందించిన ప్రతీదీ రెండవ రాజు యొక్క అధికారం క్రిందకి వస్తుంది. అదే విధంగా, సౌలు భార్యల బాధ్యత లేదా వారి మీద అధికారం దావీదుకు వచ్చింది అని విశ్లేషించొచ్చు. అంతే గాని దావీదు వారిని వివాహం చేసుకున్నాడు అని చెప్పడానికి ఏ రుజువూ లేదు.
వాక్యంలో ఉన్న కొన్ని ఉదాహరణలు చూద్దాం:
"గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును." యెషయా 40:11
"నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు." సంఖ్యా. 11:12
"అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసికొని కౌగిటనుంచుకొని వానికి దాదిగా నుండెను." రూతు 4:16
ఈ వచనాలను పరిశీలిస్తే "ఖకే" (Khake) అనే హీబ్రూ పదం ఈ వచనాలలో "రొమ్మున", "కౌగిట" అని అనువదించడం జరిగింది. ఈ పదానికి ఉన్న రెండు ప్రాముఖ్యమైన అర్థాలు ఏంటంటే, అక్షరాలా లైంగికపరంగా కౌగిటిలోకి తీసుకోవడం, మరియు తమ బాధ్యతగా స్వీకరించడం. గనుక "కౌగిట" అని ఈ పదాన్ని అనువదించిన ప్రతిసారి, అందులో ఎదో లైంగిక కోణం ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మోషేకు ఇశ్రాయేలీయుల బాధ్యత ఎలాగైతే దేవుడు అప్పగించాడో, అలానే దావీదుకు కూడా సౌలు భార్యల యొక్క బాధ్యతను అప్పగించాడు.
4. సారాంశం
• ఒక భర్తకి ఒక భార్య మాత్రమే అనేది దేవుని చిత్తం
• బహుభార్యత్వాన్ని బట్టి కలిగిన ఆశీర్వాదం గాని సంతోషం గాని ఏమి లేదు, అందుకు భిన్నంగా కష్టాలూ, ఇబ్బందులూ, శ్రమలే కలిగాయి
• బహుభార్యత్వాన్ని మనం పాత నిబంధన విశ్వసవీరుల నుంచి అవలంబించ గలిగే అవకాశం లేదు
• పరిపూర్ణమైన పరిశుద్ధులు ఎవరూ లేరు, విశ్వాసానికి మారుపేరైన అబ్రాహాము కూడా ఒక పాపే
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.