నిజ క్రైస్తవ జీవితం

రచయిత: డి. యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 14 నిమిషాలు
ఆడియో

Article Release long find gods will 2 min

దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నిర్థారించుకునే ఒక కీలకమైన రహస్యాన్ని మొదటి బాగంలో వివరించడం జరిగింది. దానికి కొనసాగింపుగా రాయబడిన ఈ రెండవ భాగాన్ని చదవడానికంటే ముందు, ఈ క్రింది సూచించిన లింకు ద్వారా "దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ - 1" అనే వ్యాసాన్ని చదవాలని మనవి. 

దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ 1

నా విషయంలో దేవుని చిత్తం ఏంటి? చాలామంది ఈ ప్రశ్నతో సతమతమౌతూ ఉంటారు. ఇదొక పెద్ద మిస్టరీలాగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఏ ఉద్యోగం చెయ్యడం దేవుని చిత్తము? లేదా ఈ ఉద్యోగంలో కొనసాగడం దేవుని చిత్తమేనా? నేను ఫలానా వ్యక్తిని పెళ్లిచేసుకోవడం దేవుని చిత్తమేనా? నా కుటుంబం ఈ ప్రాంతంలోనే ఉండాలా లేక పట్టణం వెళ్లిపోవాలా? ఇటువంటి అనేక ప్రశ్నల విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి మాత్రమే లోబడాలి అన్న నిజమైన కోరిక కలిగి, దేవుని చిత్తాన్ని కనుక్కోవడం కోసం మానవులు కల్పించిన అనేక తప్పుడు పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. ఉదాహరణకు - చీట్లు వెయ్యడం, చుట్టూ ఉన్న పరిస్థితులలో నుండి దేవుడేమన్నా సూచనప్రాయంగా మాట్లాడుతున్నాడేమో అని వెతుక్కోవడం. ప్రార్థన చేస్తున్నప్పుడు నెమ్మదిని, సమాధానాన్ని అనుభవించడం, దేవుని మెల్లనైన స్వరాన్ని వినడం, ఇటివంటి అనేక ఇతర పద్ధతుల ద్వారా 'ఇదే దేవుని చిత్తము' అన్న నిర్ధారణకు వస్తుంటారు. కానీ అటువంటి పద్ధతులేవీ వాక్యం బోధించడం లేదు. మరి మన అనుదిన జీవితంలో మనం చేసే అనేక నిర్ణయాలలో ఏది దేవుని చిత్తమో ఎలా తెలుసుకోవాలి?

ఇటువంటి విషయాల గురించి బైబిల్ లో ఎక్కడా ప్రస్తావించబడలేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు అని చెప్తారు కొందరు. అది క్రీస్తునందు మనకున్న స్వేచ్ఛ అని చెప్తారు. నిజమే నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయంలోనూ 'ఇదే దేవుని చిత్తం' అని బైబిల్ లో ఎక్కడా రాయబడి లేదు. అలాగే క్రీస్తునందున్న మనకు స్వేచ్ఛ కూడా ఉంది . కానీ వాక్యం మనకు అందించిన నియమాలకు లోబడుతూ, వాక్యపరిధిలో మాత్రమే మనము మన స్వేచ్ఛను వినియోగించుకోవాలి.

బంగారము, వెండి, రాగి వంటి లోహాలతో ఏవైనా వస్తువులు తయారు చేసేటప్పుడు, ముందుగా ఒక అచ్చు తయారు చేసి, వేడి చేసి కరిగించిన లోహాన్ని ఆ అచ్చులో పోస్తారు. చల్లారి గట్టిపడిన ఆ లోహం, అచ్చు నుండీ వేరు చేసినప్పుడు, సరిగ్గా ఆ అచ్చు యొక్క ఆకారంలోకి వస్తుంది. అదే విధంగా దేవుని వాక్యపు నియమాలు అనే అచ్చుని బైబిల్ రూపంలో దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ అచ్చు వివిధ సూత్రాలు, నియమాలతో తయారయ్యింది. నువ్వు లోహమే వాడతావో, మైనమే వాడతావో, ప్లాస్టికే వాడతావో నీ ఇష్టం, కానీ దానిని కరిగించి ఆ అచ్చులో పోస్తే, అందులో చక్కగా ఇమిడిపోయి, ఆ అచ్చు ఆకారంలోకి రావాలి. అటువంటి పదార్థాన్నే ఎంచుకోవాలి. కానీ రాళ్ళూ, చెక్క వంటి వాటిని కరిగించి ఆ అచ్చు ఆకారంలోకి తేలేము కాబట్టి అటువంటివాటిని ఎంచుకోకూడదు. ఇక్కడ లోహము, మైనము అనేవి వాక్యం ఆమోదించే విషయాలు, వాక్య నియమాలకు అనుగుణమైన నిర్ణయాలు. ఇవి మనం చెయ్యొచ్చు. రాళ్ళూ, చెక్క అనేవి వాక్య విరుద్ధమైన విషయాలు, వాక్య నియమాలతో పొసగని విషయాలు. ఇవి మనం చెయ్యకూడదు. మన దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి నిర్ణయానికి అవసరమైన సూత్రాలు, నియమాలు బైబిల్ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. అయితే వాటిని తెలుసుకోవడం ఎలా? ఇది చాలా సులభం. కొన్ని ఉదాహారణలతో మీకు అర్థం అయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాను.

మొదటిగా, నీ నిర్ణయం వల్ల నీకు ఆధ్యాత్మికంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా?

"అన్ని విషయములయందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు" ( 1 కొరింథీ 10:23).

'అన్నియు చేయదగినవి కావు' అనే మాటకి 'అన్నియు ప్రయోజనకరమైనవి కావు', 'అన్నియు లాభకరమైనవి కావు' అనే అర్థం వస్తుంది. అలాగే 'క్షేమాభివృద్ధి' అన్న మాటని సందర్భంలో అర్థం చేసుకుంటే, ఆధ్యాత్మిక క్షేమం గురించే పౌలు మాట్లాడుతున్నాడని అర్థం అవుతోంది. కాబట్టి ఈ వచనం ప్రకారం నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేసే ఈ నిర్ణయం, నువ్వు చేయాలనుకుంటున్న ఈ పని నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్దికి ఏ విధంగానైనా దోహదపడుతుందా? అది నీలో సద్భక్తిని పెంపొందించగలదా? నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అలా కాకుండా నీకు ఆధ్యాత్మికంగా నష్టాన్ని కలుగజేసేది అయితే, అటువంటి నిర్ణయం ఎప్పుడూ చెయ్యకూడదు.

రెండవదిగా, నీ నిర్ణయం నిన్ను దేనికైనా బందీగా చేస్తుందా?

"అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను" (1 కొరింథీ 6:12).

ఈ వచనంలోని రెండవ భాగంలో పౌలు అంటున్నాడు - 'నేను దేనికీ బానిసగా మారను', 'దేనినీ నా పై అధికారం చేసేలా అనుమతించను'. ఒక వేళ నువ్వు చేసే నిర్ణయం లేదా నువ్వు చేయాలనుకుంటున్న పని, క్రమేపీ ఒక వ్యసనంలా పరిణమించే అవకాశం వుంటే, అటువంటివాటి విషయంలో జాగ్రత్త. నువ్వు కేవలం యేసు క్రీస్తుకు మాత్రమే కట్టుబానిసవి అన్న విషయం జ్ఞాపకం ఉంచుకో.

మూడవదిగా, నీ నిర్ణయం దేవుని ఆలయాన్ని అపవిత్రపరుస్తుందా?

"మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి" (1 కొరింథీ 6:19-20).

ఈ సందర్భంలో పౌలు జారత్వము గురించి విశ్వాసులను హెచ్చరిస్తూ, జారత్వము చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు అని చెప్పి, అలా చెయ్యడం పాపం ఎలా అవుతుందో ఈ వచనాలలో వివరిస్తున్నాడు.

1. మీకు మీ దేహాన్ని అనుగ్రహించింది దేవుడే 

2. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము 

3. మీరు మీ సొంతం కాదు, మీరు వెలపెట్టి కొనబడినవారు.

ఈ కారణాలు చెప్పి నీ దేహంతో నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు. నీ శరీరం కేవలం దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే నీకు అనుగ్రహించబడింది. నీ శరీరానికి హానికరమైనదేదీ నువ్వు చెయ్యడానికి వీలు లేదు అని చెప్తున్నాడు పౌలు. ఇదే విషయాన్ని పౌలు రోమా పత్రికలో కూడా ప్రస్తావిస్తాడు. "మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. (రోమా 6:13). కాబట్టి నీ నిర్ణయం నీ శరీరానికి ఏ విధంగానైనా హానికరంగా ఉందా? నీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగిస్తున్నావా? లేక నీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించడం ద్వారా, నీ శరీరం అంతటి తోటి దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? నీ దేహాన్ని నువ్వు వాడుకునే విషయంలో కూడా నీ నిర్ణయం ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా దేవునికి ఘనత రావాలి అన్న విషయం జ్ఞాపకం ఉంచుకో.

నాల్గవదిగా, నీ నిర్ణయం వల్ల ఎవరికైనా అభ్యంతరం కలుగుతుందా?

"భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు. అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్య్రము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి." (1 కొరింథీ 8:8-9).

ఇది ప్రేమకు సంబంధించిన సూత్రం. పౌలు రోమా పత్రికలో కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ " ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే" అని అంటాడు. ( రోమా 13:10 ). ఏ విధంగానైనా నీ నిర్ణయం, నువ్వు చేసే పని ప్రభువును వెంబడించడంలో నీ పొరుగువానికి అభ్యంతరం కలుగచేసినా, నీ పొరుగువాడు పాపంలో పడిపోయేలా ప్రేరేపిస్తున్నా అటువంటి పని, అటువంటి నిర్ణయం చెయ్యకూడదు. అవసరమైతే నీ స్వేచ్ఛను, సుఖాన్ని, ఇష్టాన్ని కూడా కాదనుకునేంత ఎక్కువగా నువ్వు నీ పొరుగువానిని ప్రేమించాలి. ఈ వైఖరి నేటి దినాల్లో అంగీకారం కాదు. ఎవడు ఎటుపోయినా, ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నా జీవితం, నా ఇష్టం అన్న వైఖరి లోకంలో ఎక్కువగా కనబడుతోంది. నేను చేస్తుంది తప్పు కానప్పుడు, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అని అంటుంటారు చాలా మంది. నువ్వు చేస్తున్నది తప్పు కానప్పటికీ నువ్వు చేస్తున్న పని వల్ల నీ పొరుగువాడికి అభ్యంతరం కలిగితే అది పాపమే.

"ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు. కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను" (1 కొరింథీ 8:12,13).

కాబట్టి నీ నిర్ణయం వల్ల నీ సహోదరునికి అభ్యంతరం కలుగకుండా చూసుకోవాలి.

ఐదవదిగా, నీ నిర్ణయం సువార్త ప్రబలడానికి ఏమైనా దోహదపడుతుందా?

యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను" (1 కొరింథీ 10:32-33)

నువ్వు ఈ స్పృహతో ఉన్నా, లేకున్నా, నీ ప్రవర్తన, నీ బ్రతుకే నువ్వు నీ రక్షకుడి గురించి ఇచ్చే సాక్ష్యం. లోకం నిన్ను నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇది నీ సాక్ష్యానికి సంబంధించిన విషయం. దేవుడి గురించి నీ బ్రతుకు ఈ లోకానికి ఏమని సాక్ష్యమిస్తోంది? ప్రతి రోజూ నువ్వు చేసే అనేక నిర్ణయాలు దేవుని నామానికి అవమానకరంగా కాకుండా, దేవుని నామాన్ని హెచ్చించే విధంగా, ఘనపరిచే విధంగా ఉన్నప్పుడు నీ సాక్ష్యం బాగున్నట్లు. అటువంటి సాక్ష్యాన్ని బట్టి నీ పొరుగువారు క్రీస్తు వైపు నడిపించబడవచ్చు. ఒక వ్యక్తి రక్షణ పొందడం కోసం, ఒక వ్యక్తిని సంతోషపరచడం కోసం, స్వప్రయోజనం కొరక, అతని ప్రయోజనం కోరుతూ, అందుకు అనుగుణమైన నిర్ణయాలే చెయ్యాల్సి ఉంటుంది. అటువంటి జీవితము, సాక్ష్యము సువార్త ప్రబలడానికి దోహదపడుతుంది. నీ నిర్ణయం, నీ పనులు అలానే ఉన్నాయా అని పరిశీలించుకోవాలి?

ఆరవదిగా, నీ నిర్ణయం నీ మనస్సాక్షి చెప్తున్నదానిని ఉల్లంఘించేదిగా, అతిక్రమించేదిగా ఉందా?

"ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను" (అపొ. కార్య. 14:24)

ఈ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 'ఎప్పుడూ మన మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ చెయ్యొద్దు.' ఏదైనా ఒక విషయం గురించి నీ మనస్సాక్షి నిన్ను అభ్యంతరపరుస్తుంటే, ఆ విషయంలో ముందుకు వెళ్లకపోవడమే మంచిది. నువ్వు చేస్తున్నది సరైనదే అన్న ఖచ్చితమైన నిర్ధారణ నీ మనస్సాక్షి ఇవ్వని పక్షంలో నువ్వు ఆ పని చెయ్యకూడదు. దేవునితో మీకు ఉన్న సంబంధానికి ఏ రకంగానూ ఆటంకం కలుగకుండు నిమిత్తము దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలియుండటం మంచిది. అలాగని నీ మనస్సాక్షి ప్రతీసారి నిన్ను సరైన విధంగానే నడిపిస్తుంది అని అనుకోకూడదు.  నువ్వు నిత్యం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వుంటే, ఏది సరైనది, ఏది సరైనది కాదు అని నీ మనస్సాక్షికి నేర్పించుకోగలవు, తద్వారా "ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు"కున్నవారవుతారు ( ఎఫెసీ 5:10 ).

ఏడవదిగా, నీ నిర్ణయం దేవుణ్ణి మహిమపరుస్తుందా?

"కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి" (1 కొరింథీ 10:31)

ఈ వచనము ఇప్పటి వరకూ తెలియజేసిన నియమాలన్నిటికీ సారాంశము, లక్ష్యము. ఆహారం తీసుకోవడం వంటి సాధారణ విషయాలతో సహా ప్రతి విషయంలోనూ మన ప్రభువునూ, రక్షకుడూ అయిన క్రీస్తుని మహిమపరచాలన్నదే ప్రతి విశ్వాసి యొక్క హృదయాభిలాష. కాదంటారా? నువ్వు చేసే నిర్ణయం గురించి ఆలోచించు. అది దేవుణ్ణి మహిమపరుస్తుందా, ఘనపరుస్తుందా? యేసుకు వలె "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని" అని నువ్వు చెప్పగలవా? ( యోహాను 17:4 )

ముగింపు

నీకు ఏ ప్రశ్నలు ఉన్నా ఈ నియమాలు, సూత్రాలకు అనుగుణంగా, వీటిని మీరకుండా, అతిక్రమించకుండా నిర్ణయాలు చేసుకో. అయితే ఇవి మాత్రమే కాదు, బైబిల్ లో ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. మనం అనుదినం బైబిల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇటువంటి నియమాలు అనేకం మనం నేర్చుకుంటూ ఉంటాం. అలా మనం అచ్చు తయారు చేసుకోవాలి. ఆ అచ్చులో ఇమడగలిగేవి మాత్రమే ఎంచుకోవాలి. అంటే వాక్యంతో సరిపోయే, వాక్యానుసారమైన, వాక్యపు నియమాలకు అనుగుణమైన నిర్ణయాలు మాత్రమే చెయ్యాలి. ఆ వాక్యపు నియమాల పరిధిలోనే క్రీస్తునందు నీకు ఉన్న స్వేచ్ఛను వినియోగించుకోవాలి. అందుకు విరుద్ధమైన ప్రతీది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదని గుర్తించాలి.

చివరిగా ఇంకొక్క విషయం చెప్పి ముగిస్తాను. చాలాసార్లు చాలామంది ఫలానా విషయంలో దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడంలో, అన్వేషించడంలోనే కాలం వృథా చేస్తున్నారు. దేవుడు స్పష్టంగా తన వాక్యం ద్వారా ప్రత్యక్షపరచిన సంగతులను అనుదినం బైబిల్ ధ్యానించడం ద్వారా నేర్చుకుంటూ, వాటిని ఆచరణలో పెట్టడంపై ఎక్కువగా దృష్టి సారించాలి. అన్వేషణకే సమయం అంతా వృథా చెయ్యకుండా నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యాలని పిలుపునిస్తున్నాను. చదువరుల ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధికి దోహదపడేలా ఈ మాటలను దీవించమని ప్రభువును వేడుకుంటూ ముగిస్తున్నాను.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.