విషయసూచిక
పరిచయం
పౌలు తీతుకు రాసిన పత్రికలో ఒక సేవకుని యొక్క ధర్మాలేంటో తెలియజేశాడు. ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసిన వర్గంగా అతడు యవ్వనస్థుల గురించి అందులో ప్రస్తావించాడు. వృద్ధుల గురించీ వృద్ధ స్త్రీల గురించీ యవ్వన స్త్రీల గురించీ మాట్లాడిన తర్వాత "అటువలెనే స్వస్థబుద్ధి గలవారై యుండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము" (తీతు 2:6) అంటూ యవ్వనులకు ఒక సంక్షిప్తమైన సలహాను అతడు జతచేశాడు. అపోస్తలుని సలహాను ఇక్కడ నేను అనుసరించదలచుకుని యవ్వనస్థులకు స్నేహపూర్వకమైన ఉపదేశంగా కొన్ని మాటలను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను వృద్ధాప్యంలోకి చేరుకుంటున్నాను. నా యవ్వనప్రాయంలో నేను గడిపిన రోజుల గురించి కొన్ని సంగతులు నాకు బాగా గుర్తున్నాయి. ఒక యవ్వనస్థుని జీవితంలో ఉండే సంతోషాలు, సంతాపాలు, ఆశలు, ఆందోళనలు, శోధనలు, శ్రమలు, తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు కోరికలు, పొరపాట్లు, పరితాపాలు నాకు బాగా గుర్తున్నాయి. ఇవే యవ్వనస్థుల జీవితాలను చుట్టుముడతాయి, తోడు వస్తాయి. యవ్వనస్థుల్లో కొందరినైనా సరైన మార్గంలో ఉంచగలిగేలా, భూమ్మీద వారి జీవితాన్ని మరణం తర్వాత వారి నిత్యత్వాన్ని నాశనం చేసే పొరపాట్ల నుంచి, పాపాల నుంచి వాళ్ళకు సరైన మార్గం చూపించగలిగితే నేను చాలా కృతజ్ఞుణ్ణి.
ఈ పుస్తకంలో నేను నాలుగు విషయాలను ఉపదేశించబోతున్నాను.
1. యవ్వనస్థులకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం ఎందుకుందో కొన్ని కారణాలను నేను తెలియచేస్తాను.
2. యవ్వనస్థులు ఎదుర్కొనే కొన్ని ప్రత్యేకమైన ప్రమాదాల గురించి నేను హెచ్చరిస్తాను.
3. యవ్వనస్థులు అంగీకరించవలసిన కొన్ని సాధారణ మార్గదర్శకాలను నేను సూచిస్తాను.
4. యవ్వనస్థులు అనుసరించవలసిన ప్రత్యేకమైన ప్రవర్తన నియమాలు కొన్నింటిని నేను బలంగా స్థాపిస్తాను.
ఈ నాలుగు అంశాల గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను చెప్పే విషయాలు కొన్ని ఆత్మలకు మేలు చేకూర్చాలని దేవునికి ప్రార్థిస్తున్నాను.
- జె.సి. రైల్
అధ్యాయం 1
యవ్వనస్థులకు ఉపదేశించడానికి కారణాలు
మొదటిగా, యవ్వనస్థులకు ప్రత్యేకంగా ఉపదేశం ఎందుకు అవసరం? దానికి కారణాలేంటి?
నేను వాటిలో కొన్నిటిని వరుసగా ప్రస్తావిస్తాను.
(1) మొదటి కారణం: అసలు దైవభక్తి కలిగిన యవ్వనస్థులు ఎక్కడా కనబడట్లేదనే బాధాకరమైన వాస్తవమే.
నేను మనుషుల యెడల వ్యత్యాసం చూపించకుండా మాట్లాడతాను; మనుషులు గొప్పవారైనా సామాన్యులైనాధనికులైనా పేదవారైనా చదువుకున్న వారైనా చదువు లేనివారైనా పల్లె ప్రజలైనా పట్టణస్థులైనా నాకు ఎలాంటి పట్టింపులూ లేవు. కొద్దిమంది యవ్వనస్థులు మాత్రమే ఆత్మచేత నడిపించబడడం, కొద్దిమంది యవ్వనస్థులు మాత్రమే నిత్యజీవానికి నడిపించే ఆ ఇరుకైన మార్గంలో ఉండడం, కొద్దిమంది యవ్వనస్థులే పైనున్న వాటిపై తమ ప్రేమను ఉంచడం, కొద్దిమంది యవ్వనస్థులే సిలువను మోస్తూ క్రీస్తును అనుసరించడం గమనించినప్పుడు నేను వణుకుతున్నాను. దేవుని సాక్షిగా చాలా బాధతో నేను నిజం తప్ప మరేమీ చెప్పడం లేదు.
యవ్వనస్థులారా, ఈ దేశ జనాభాలో అధిక సంఖ్యలో అతి ముఖ్యమైన వారిగా మీరే ఉన్నారు; అయితే నిత్యమైన మీ ఆత్మలు ఏ స్థితిలో ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అయ్యో, జవాబు కోసం మనం ఎటువైపు తిరిగినా, నివేదిక ఒకేలా ఉంది!
నమ్మకమైన ఏ సువార్తికుణ్ణయినా ఈ కింది ప్రశ్నలు అడిగి, అతడు మనకు ఏం చెబుతాడో గమనిద్దాం. “ప్రభువు బల్లలో పాలుపొందే వారిలో అత్యంత తక్కువగా ఉండేవాళ్లు ఎవరు? రక్షణ కార్యం గురించి ఏ మాత్రమూ అవగాహన లేకుండా వెనుకబడినవారు ఎవరు? ప్రతి ఆదివారం సంఘ ఆరాధనలకు సక్రమంగా రానివారు ఎవరు? ప్రతి వారం బైబిల్ స్టడీకి, ప్రార్థనా కూడికలకు రావడానికి ఇష్టపడనివారు ఎవరు? బోధించబడుతున్న వాటి పట్ల అత్యంత శ్రద్ధలేనివారు ఎవరు? మీ సంఘంలోని ఏ గుంపు మిమ్మల్ని ఎక్కువ బాధపెడుతున్నారు? మీ సంఘంలో మిమ్మల్ని అతిగా వేదనకు గురిచేసే రూబేనీయులు ఎవరు? మీ మందలో ఎవరిని నడిపించడం మీకు కష్టతరమౌతోంది? ఎవరికి తరుచుగా హెచ్చరికలు, మందలింపులు అవసరమౌతున్నాయి? మీకు తీవ్రమైన అశాంతిని, దుఃఖాన్ని కలిగించేవారు ఎవరు? తమ ఆత్మలను నిర్లక్ష్యం చేస్తూ మిమ్మల్ని భయపెట్టేవారెవరు? అత్యంత నిరీక్షణ లేనివారు ఎవరు?" ఈ ప్రశ్నలన్నింటికీ ఆ సేవకుడు చెప్పే జవాబు ఒక్కటే: “యవ్వనస్థులు".
ఈ భూమిపై ఉన్న ఏ దేశంలోని తల్లిదండ్రులనైనా ఈ కింది ప్రశ్నలు అడిగి, వారు మనకు ఏం చెబుతారో గమనిద్దాం. మీ కుటుంబాల్లో మీకు ఎక్కువ బాధలు, కష్టాలు ఎవరివల్ల వస్తున్నాయి? పదేపదే మీరు చెప్పే విషయాలకు విసిగిపోయి, నిరాశపడేది ఎవరు? మంచి మార్గాల నుండి తప్పిపోవడానికి ముందుండేది, జాగ్రత్తలను మంచి సలహాలను గుర్తుంచుకునే విషయంలో చివర ఉండేది ఎవరు? క్రమాన్ని, నియమాలను అత్యంత కష్టంగా భావించేది ఎవరు? చాలా తరచుగా బహిరంగ పాపాల్లోకి పడిపోతూ, ఒకపక్క కన్నవారికి, బంధువులకు చెడ్డ పేరును తెస్తూ, మరోపక్క స్నేహితులను బాధపెట్టి, వారిని దుఃఖంతో మానసికంగా చనిపోయేలా చేసేది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ వారు చెప్పే జవాబు ఒక్కటే: “యవ్వనస్థులు”.
న్యాయమూర్తులను, పోలీసు అధికారులను ఈ కింది ప్రశ్నలు అడిగి, వారు మనకు ఏం జవాబు చెబుతారో గమనిద్దాం. నైట్ క్లబ్బులకు, బార్లకు ఎక్కువగా వెళ్లేది ఎవరు? వీధి రౌడీలుగా తయారయ్యేది ఎవరు? తాగుడు, అల్లర్లు, గొడవలు, దొంగతనాలు, దాడులు ఇలాంటివాటికి ఎక్కువగా అరెస్టయ్యేది ఎవరు? జైళ్లలో, నిర్బంధ గృహాలలో ఎక్కువ సంఖ్యలో ఉండేది ఎవరు? ఎవరిని నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలి? ఈ ప్రశ్నలన్నింటికీ వారు వెంటనే ఒక సమూహాన్ని చూపించి, వారు “యవ్వనస్థులే” అని జవాబు చెబుతారు.
ఉన్నత వర్గాలకు చెందినవారిని అడిగి, వారిచ్చే సమాచారాన్ని గమనిద్దాం. ఒక కుటుంబంలో యవ్వనస్థులు తమ సంతోషం కోసం, స్వార్థం కోసం, సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటారు. ఇంకొక కుటుంబంలో యవ్వనస్థులు ఏ పనీ చేయకుండా వారి జీవితంలోని అత్యంత విలువైన సంవత్సరాలను వృథా చేసుకుంటారు. మరొక కుటుంబంలో యవ్వనస్థులు కేవలం పేరుకు మాత్రమే పనులు చేస్తారు కానీ ఆ పనిలోని నియమాలను విధులను పట్టించుకోరు. మరొక కుటుంబంలో యవ్వనస్థులు ఎల్లప్పుడూ తప్పుడు సంబంధాలు పెట్టుకుంటారు, జూదం ఆడుతుంటారు, అప్పులు చేస్తుంటారు, చెడు సహవాసాలు చేస్తుంటారు, చివరికి తమ స్నేహితులను తీవ్రమైన ఆందోళనలో వదిలేస్తారు. ఉన్నతమైన స్థాయి, బిరుదులు, ఐశ్వర్యం, చదువులు ఏవీ కూడా వాళ్లను ఆ విధంగా ప్రవర్తించకుండా అడ్డుకోలేవని గమనించండి. ఆవేదనగల తండ్రులు, గుండె పగిలిన తల్లులు, విచారంలో ఉన్న కుటుంబసభ్యులు ఇలాంటి నిజాల గురించి ఎన్నో విచారకరమైన కథలు చెబుతారు. చాలా కుటుంబాల్లో తనకిష్టం వచ్చినట్టు జీవిస్తూ తనను ఎరిగిన వారందరికీ దుఃఖాన్ని కలిగించే కొడుకో కూతురో సోదరుడో సోదరో మేనల్లుడో మేనకోడలో లేక బంధువో ఉంటారు. వారి పేరు ఎవ్వరూ ప్రస్తావించరు, లేదా వారిని దుఃఖంతోనో అవమానంతోనో జ్ఞాపకం చేసుకుంటారు.
ప్రతీ సంపన్న కుటుంబానికి ఏదో ఒక ముల్లు ఉంటుంది. దాని సంతోషపు పేజీలో ఏదో ఒక మరక ఉంటుంది, నిరంతరం నొప్పికీ ఆందోళనకూ కారణమయ్యే విషయం ఉంటుంది. తరచూ యవ్వనస్థులే వీటికి కారణం కాదా?
ఈ విషయాలకు మనం ఏం చెప్పాలి? ఇవి వాస్తవాలు, స్పష్టమైన వాస్తవాలు, అన్ని చోట్లా మనకు కనబడే వాస్తవాలు, మనం కొట్టిపారేయలేని వాస్తవాలు. ఇది ఎంత భయంకరమైన విషయం! నేను ఒక యవ్వనస్థుణ్ణి కలిసిన ప్రతిసారీ బహుశా పరలోకానికి అనర్హుడైనవానిని, నరకానికి దారితీసే విశాలమైన దారిలో ప్రయాణిస్తున్న వానిని, దేవునికి శత్రువును కలిసానేమోనని అనిపిస్తుంది. ఇది ఆలోచన ఎంత భయంకరమైనదో కదా! ఖచ్చితంగా
అలాంటి వాస్తవాలు నా ముందున్నాయి, కాబట్టి నేను మీకు ఉపదేశిస్తున్నాను. దానికి మీరు ఆశ్చర్యపోవద్దు, మంచి కారణమే ఉందని మీరు అనుమతించండి.
(2) రెండవ కారణం: ఇతరుల కోసం ఎదురుచూస్తున్నట్టుగానే యవ్వనస్థుల కోసం కూడా మరణం, తీర్పులు ఎదురుచూస్తున్నాయి. అయితే దాదాపుగా అందరూ ఆ సంగతిని మరచిపోయినట్టు కనిపిస్తోంది.
యవ్వనస్థులారా మీ మరణాన్ని కూడా దేవుడు నియమించాడు. ఇప్పుడు మీరు ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీ మరణ దినం చాలా దగ్గరలోనే ఉంది. యవ్వనస్థులు కూడా వృద్ధుల మాదిరిగానే అస్వస్థతకు గురవ్వడం నేను చూస్తున్నాను. పెద్దవారికి చేస్తున్నట్టుగానే యవ్వనస్థుల మృతదేహాలకు కూడా నేను సమాధి కార్యక్రమాలను చేస్తున్నాను. ప్రతి స్మశానంలోనూ సమాధులపై మీ వయస్సులో ఉన్నవారి పేర్లను నేను చదువుతున్నాను. పసిపిల్లల తర్వాత వృద్ధుల తర్వాత ఎక్కువ శాతం 13- 23 సంవత్సరాల వయస్సులో ఉన్నవారే మరణిస్తున్నారని నేను పుస్తకాల నుండి తెలుసుకున్నాను. అయితే ప్రస్తుతం మేము ఎన్నటికీ మరణించమన్నట్టు మీరు జీవిస్తున్నారు.
మేము రేపటి రోజున ఈ విషయాలపై శ్రద్ధ చూపిస్తామని ఆలోచిస్తున్నారా? "రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు" అని చెప్పిన సొలొమోను మాటలను గుర్తుంచుకోండి (సామె 27:1). రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించిన ఒక వ్యక్తికి “నేను ఈ విషయాల గురించి రేపు తీవ్రంగా ఆలోచిస్తాను" అని రక్షించబడని వ్యక్తి చెప్పాడు. కానీ అతనికి రేపు అనే ఆ రోజు ఎన్నటికీ రాలేదు. రేపు అనేది సాతానుది, కానీ ఈ రోజు దేవునిది. నీ ఉద్దేశాలు తీర్మానాలు ఎంత ఆత్మీయమైనవైనా పవిత్రమైనవైనా “వాటిని రేపు చేద్దాంలే” అని నిర్ణయించుకుంటే, వాటిని సాతాను అస్సలు పట్టించుకోడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో సాతానుకు అస్సలు అవకాశం ఇవ్వొద్దు! పురుషులందరూ ఇస్సాకు, యాకోబులు జీవించినంత కాలం జీవించరు. చాలామంది పిల్లలు తమ తండ్రుల కంటే ముందే చనిపోతారు. దావీదు తన ఇద్దరు కుమారుల మరణాన్ని బట్టి దుఃఖించవలసి వచ్చింది; యోబు తన పదిమంది పిల్లల్ని ఒకే రోజులో కోల్పోయాడు. మీ వంతు కూడా వారిలాగానే కావచ్చు. మరణం వచ్చినప్పుడు, మీరు వెళ్ళవలసిందే తప్ప రేపటి గురించి మాట్లాడడం వ్యర్థం.
ఈ విషయాల గురించి ఆలోచించడానికి మీకు మరింత అనుకూలమైన సమయం ఉంటుందని మీరు భావిస్తున్నారా? అయితే పౌలుచేత బోధించబడిన ఫెలిక్సు, ఏథెన్సువారిని జ్ఞాపకంచేసుకోండి; అనుకూలమైన సమయం ఒకటి వస్తుందని వాళ్ళు అనుకున్నారు, కానీ అది ఎప్పటికీ రాలేదు. ఇలాంటి ఆలోచనలతోనే నరకానికి వెళ్ళే మార్గం వేయబడుతుంది. మీకు సమయం ఉన్నంతవరకు పనిచెయ్యడం మంచిది. నిత్యత్వానికి సంబంధించిన విషయాలలో దేనినీ మధ్యలో విడిచిపెట్టకండి. మీ ఆత్మ ప్రమాదంలో ఉన్నప్పుడు ఎలాంటి సాహసమూ చెయవద్దు. మనిషి రక్షించబడడం అనేది అంత తేలికైన విషయం కాదు, నన్ను నమ్మండి. చిన్నవారైనా, పెద్దవారైనా ప్రతి ఒక్కరికి “గొప్ప రక్షణ" అవసరం. అందరూ తిరిగి జన్మించాలి. అందరూ క్రీస్తు రక్తంలో కడగబడాలి. అందరూ పరిశుద్ధాత్ముని ద్వారా పవిత్రపరచబడాలి. ఈ విషయాలను సులువుగా వదిలిపెట్టకుండా, తన అంతరంగంలో తాను దేవుని బిడ్డనని అతడు పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి సాక్ష్యమిచ్చేవరకూ విశ్రమించని వ్యక్తి ధన్యుడు.
యవ్వనస్థులారా, మీకున్న సమయం చాలా తక్కువ. మీ రోజులు కేవలం నీడలాంటివి; కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరిలాంటివి. త్వరలో చెప్పబడే ఒక కథ లాంటివి. మీ శరీరాలు ఇత్తడితో చెయ్యబడలేదు. "యవ్వనస్థులు కూడా తప్పక తొట్రిల్లుదురు” అని యెషయా అంటున్నాడు (యెషయా 40:30). ఒక్క క్షణంలో మీ ఆరోగ్యం మీ నుండి తొలగిపోవచ్చు: దానికి ఒక చిన్న యాక్సిడెంట్ కాని, ఒక జ్వరం కాని, ఒక చిట్లిన రక్తనాళం కాని చాలు. త్వరలోనే సమాధిలో పురుగు మిమ్మల్ని తినేస్తుంది. మీకూ మరణానికీ మధ్య ఒక్క అడుగు మాత్రమే ఉంది. ఈ రాత్రి మీ ప్రాణాన్ని దేవుడు మీ నుండి తీసేసుకోవచ్చు. భూలోక నివాసులందరూ వెళ్ళిన మార్గంలోనే మీరు కూడా ఎంతో వేగంగా ప్రయాణిస్తున్నారు. కాబట్టి మీరు త్వరలోనే వెళ్ళిపోతారు. మీ జీవితం నిశ్చయత లేనిది. మీ మరణం, తీర్పు ఖచ్చితమైనవి. మీరు కూడా ఒక రోజున ప్రధానదూత శబ్దం వినాలి. ధవళమైన మహా సింహాసనం ముందు తీర్పు నిమిత్తం నిలబడాలి. ఆ తీర్పుకు మీరు కట్టుబడి ఉండాలి. “మృతులారా, లేవండి, తీర్పుకు రండి" అనే మాటలు తన చెవుల్లో ఎల్లప్పుడూ మారుమ్రోగుతూ ఉండేవని జెరోం అనే భక్తుడు చెబుతుండేవాడు. “ఇదిగో, నేను త్వరలో వస్తున్నాను,” అని న్యాయాధిపతి స్వయంగా చెబుతున్నాడు. కావున నేను మిమ్మల్ని ఇలాంటి స్థితిలో ఒంటరిగా విడిచిపెట్టే సాహసం చెయ్యలేను.
మీరందరూ ప్రసంగి మాటలను హృదయపూర్వకంగా అంగీకరిస్తే ఎంత మేలు. "యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము" (ప్రసంగి 11:9). అలాంటి తీర్పు రాబోతుండగా ఏ మనిషైనా అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండడం ఆశ్చర్యమే కదా? మరణానికి సిద్ధపాటు లేకుండా సంతృప్తిగా జీవించేవారి కంటే పిచ్చి వాళ్ళెవ్వరూ ఖచ్చితంగా ఉండరు. నిశ్చయంగా మనుషుల అవిశ్వాసం ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?" అనే మాటలతో బైబిల్లోని అత్యంత స్పష్టమైన ప్రవచనం ప్రారంభమౌతుంది (యెషయా 53:1). “మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అతడు భూమిపై విశ్వాసమును కనుగొంటాడా?" అని ప్రభువైన యేసు అన్నాడు (లూకా 18:8).
యౌవనస్థులారా, మీలో చాలామందిపై న్యాయస్థానంలో “వారు నమ్మరు” అనే నివేదిక వస్తుందని నేను భయపడుతున్నాను. మీరు ఈ లోకం నుండి త్వరగా వెళ్ళిపోతారనీ మరణం, తీర్పు అనేవి వాస్తవాలు అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారేమోననీ నేను భయపడుతున్నాను. కాబట్టి నేను మీకు ఉపదేశిస్తున్నాను.
3) మూడవ కారణం: యవ్వనస్థులు ఇప్పుడెలా ఉంటారనే విషయంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, కానీ వారు ఈ విషయాన్ని మర్చి పోతున్నారు.
యవ్వనం అనేది నిండు జీవితానికి విత్తే కాలం వంటిది, రాబోయే జీవితానికి రూపాన్నిచ్చే నమూనా వంటిది, మనిషి యొక్క మనస్సు చరిత్రకు మలుపువంటిది. చిగురించే రెమ్మను బట్టి మనం పెరుగుతున్న చెట్లను అంచనా వేయవచ్చు, పువ్వులను బట్టి ఫలాలను అంచనా వేయవచ్చు, వసంతకాలాన్ని బట్టి వచ్చే పంటను అంచనా వేయవచ్చు, ఉదయాన్ని బట్టి మనం రాబోయే రోజును అంచనా వేయవచ్చు. అలాగే యవ్వనస్థుని స్వభావాన్ని బట్టి అతడు పెద్దయ్యాక ఎలా ఉంటాడో మనం సాధారణంగా అంచనా వేయవచ్చు.
యవ్వనస్థులారా మోసపోకండి. మొదటిలో మీరు ఇష్టానుసారంగా జీవించి, మీ కోరికలను ఆనందాలను అనుభవించి, ఆపై చివరలో సులభంగా దేవుణ్ణి సేవించొచ్చు అని అనుకోకండి. మీరు ఏశావులాగా జీవించి ఆపై యాకోబులాగా చనిపోవచ్చని అనుకోకండి. దేవునితోనూ మీ ఆత్మలతోను ఆ విధంగా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు లోకానికి, అపవాదికి మీ అమూల్యమైన బలాన్నిచ్చి, రాజుల రాజుకు మిగిలిన శక్తిలేని బలహీనమైన జీవితాన్ని వదిలేద్దాం అనుకోవడం ఒక భయంకరమైన అపహాస్యమే ఔతుంది.
ఆలస్యంగా మారుమనస్సును పొందుదామనే ఆలోచనలో మీరున్నారు. మీరేం చేస్తున్నారో మీకు తెలియదు. మీరు దేవుణ్ణి మీ ప్రణాళికల్లో భాగం చేయట్లేదు. మారుమనస్సు, విశ్వాసం అనేవి దేవుని వరాలు. సుదీర్ఘ కాలం వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆయన వాటిని అనుగ్రహించడు. నిజమైన మారుమనస్సుకు ఆలస్యం అనే పదం ఎన్నడూ వర్తించదు. జీవితపు చివరి క్షణాల్లో పొందే మారుమనస్సు సత్యమయ్యే అవకాశం చాలా తక్కువ. అయితే పశ్చాత్తాపపడిన దొంగ తన చివరి ఘడియల్లోనే మారుమనస్సు పొందాడని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ విధంగా ఒక్కడు మాత్రమే రక్షింపబడ్డాడు. అందువల్ల జీవితపు చివరి ఘడియల్లో రక్షణ పొందుదామని ఎవ్వరూ అనుకోవద్దు. “యేసు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు” అని రాయబడింది (హెబ్రీ 7:25). అయితే ఈ మాటల్ని రాయించిన పరిశుద్ధాత్ముడే “నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను" అనే మాటలను కూడా రాయించాడు (సామెతలు 1:24, 26).
నేను చెప్పేది నమ్మండి, మీకు నచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అంత తేలికైన విషయం కాదు. “పాపం” అనేది పర్వతం నుండి అగాధంలోకి పడిపోయే మార్గంలాంటిది. ఏ మనిషైనా అగాధంలో పడిపోతూ ఉండగా ఆగాలని కోరుకుంటే ఆగలేడు" అని లైటన్ అనే భక్తుడు చెప్పాడు. పరిశుద్ధమైన ఆలోచనలు, తీవ్రమైన నమ్మకాలు అనేవి మీరు కోరినప్పుడల్లా వచ్చి వెళ్ళడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండే శతాధిపతి దాసుల్లాంటివి కాదు (మత్తయి 8:5). అవి యోబు గ్రంథంలో గురుపోతుల్లాంటివి. నీ మాటకు లోబడడానికి అవి సమ్మతించవు, నీ ఆజ్ఞకు విధేయత చూపవు (యోబు 39:9). పురాతన కాలం నాటి ప్రసిద్ధ జనరల్ హన్నిబాల్ గురించి ఈ విధంగా చెప్పబడింది, అతడు యుద్ధం చేసిన నగరాన్ని స్వాధీనం చేసుకోగలిగినప్పుడు, దాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఆ తర్వాత అతను దాన్ని క్రమక్రమంగా స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు, అది అతనికి సాధ్యం కాలేదు. నిత్యజీవం విషయంలో మీకు కూడా అలాంటిదే జరగకుండా జాగ్రత్తపడండి.
ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను? బలవంతం చేసే అలవాటు వల్లనే! మనుషుల హృదయాలు యవ్వనంలో ఉన్నప్పుడు మారకపోతే అవి వృద్ధాప్యంలో ఉండగా మారవని నా అనుభవం చెప్పబట్టే నేనిలా చెబుతున్నాను. వాస్తవానికి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనుషులు మార్పు చెందడం అనేది అరుదు. అనుభవాలకు లోతైన వేర్లు ఉంటాయి. పాపానికి మీ హృదయమనే గూటిలో ఒక్కసారి ఆశ్రయమిస్తే, మీరు ఆజ్ఞాపించినప్పుడు వెంటనే అది తొలగిపోదు. అది మీ రెండవ స్వభావంగా మారుతుంది, దాని మూడు పేటల గొలుసును అంత సులభంగా మనం తెంచలేము. "కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొన గలదా? మార్చుకొనగలిగినయెడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలుచేయ వల్లపడును” అని ప్రవక్త చక్కగా చెప్పాడు. (యిర్మీయా 13:23).
అలవాట్లు అనేవి కొండపై నుంచి దొర్లుతున్న రాళ్ళలాంటివి. అవి కిందికి దొర్లుకుంటూ వస్తున్నప్పుడు, మనం నియంత్రించలేనంత వేగాన్ని అవి పొందుకుంటాయి. అలవాట్లు కూడా చెట్ల మాదిరిగానే వయస్సులో పెరిగేకొద్దీ బలపడుతుంటాయి. సింధూర వృక్షం చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఒక బాలుడు కూడా దానిని వంచగలుగుతాడు. కాని అది మహా వృక్షంగా ఎదిగినప్పుడు వందమంది వచ్చినా దానిని పెకలించలేరు. థేమ్స్ నది ఆరంభమైన చోట ఒక పిల్లవాడు సైతం దాన్ని దాటగలడు, అది సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఓడ కూడా దానిలో తేలుతుంది. అదేవిధంగా అలవాట్లు కూడా ఉంటాయి. మనలో ఎంత బలంగా అవి పాతుకుపోతే అంత ఎక్కువకాలం మనల్ని స్వాధీనం చేసుకుంటాయి, అప్పుడు వాటిని వెళ్ళగొట్టడం మరింత కష్టమౌతుంది. అవి మనతో పాటే పెరుగుతాయి, మనతోపాటే బలపడతాయి. అలవాటు అనేది పాపాన్ని సాకుతుంది. పాపం యొక్క ప్రతీ చర్య మనలో భయాన్ని, పశ్చాత్తాపాన్ని తగ్గిస్తుంది, మన హృదయాలను కఠినపరుస్తుంది, మన మనస్సాక్షిని మొద్దుబారుస్తుంది. మన దుష్ట ప్రవృత్తిని పెంచుతుంది.
యవ్వనస్థులారా, నేను ఈ విషయంలో మీపై చాలా ఒత్తిడి తెస్తున్నానని మీరు అనుకోవచ్చు. సమాధి అంచున ఎలాంటి భావాలూ లేకుండా వాతవేయ బడినట్టు, మొద్దుబారినట్టు, మృతమైనట్టు, క్రూరులుగా, రాయిలా గట్టిగా ఉన్న వృద్ధులను మీరు చూసినట్టైతే, మీరలా అనుకోరు. నేను చెప్పేది నమ్మండి, మీరు మీ ఆత్మలకు సంబంధించిన విషయాల్లో నిశ్చలంగా ఉండిపోకూడదు.
అలవాట్లు - అవి మంచివైనా చెడ్డవైనా - మీ హృదయాలలో ప్రతిరోజూ బలపడుతున్నాయి. ప్రతి రోజూ మీరు అయితే దేవునికి దగ్గరౌతున్నారు లేదా దూరమౌతున్నారు. పశ్చాత్తాపపడకుండా మీరు గడుపుతున్న ప్రతీ సంవత్సరం, మీకు పరలోకానికి మధ్యనున్న అడ్డుగోడను మరింత ఎత్తుగానూ మందంగానూ చేస్తోంది, మీకూ పరలోకానికి మధ్యనున్న అగాధాన్ని మరింత లోతుగానూ వెడల్పుగానూ చేస్తోంది. అయ్యో, నిరంతరం పాపంలో తడవులాడుతూ ఉంటే అది మిమ్మల్ని కఠినపరుస్తుందని ఎరిగి వణకండి! ఇదే అనుకూల సమయం. మీరు పారిపోవలసిన దినాలు శీతాకాలం కాకుండా చూసుకోండి. మీరు యవ్వనంలో ప్రభువును వెదకకపోతే, అలవాటు యొక్క బలంవల్ల బహుశా మీరు ఎన్నటికీ ఆయనను వెదకలేరు. నేను దీనికి భయపడుతున్నాను, అందువల్లే నేను మీకు ఉపదేశిస్తున్నాను.
4) నాలుగవ కారణం: యవ్వనస్థుల ఆత్మలను నాశనం చెయ్యడానికి సాతాను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు, కానీ ఆ విషయం వారికి తెలియదు.
మీరు రాబోయే తరానికి ముఖ్యులౌతారని సాతానుకు బాగా తెలుసు, కాబట్టి అతడు మిమ్మల్ని తన సొంతం చేసుకునేందుకు వాడికుండే ప్రతి నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటాడు. వాడి పన్నాగాల గురించి మీరు నిర్లక్ష్యంతో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను.
సాతాను అత్యంత ప్రత్యేకమైనవిగా ఎంపిక చేసుకున్న శోధనలను మీపైనే ఎక్కుపెడతాడు. మీ హృదయాలను చిక్కించుకునేందుకు అత్యంత జాగ్రత్తతో వాడు తన వలను విసురుతుంటాడు. మిమ్మల్ని తన ఆధీనంలోకి తీసుకు రావడానికి వాడు “అత్యంత తీయనైన రొట్టె ముక్కలను” మీకు ఎరగా వేస్తుంటాడు. మీరు వాడి విషంతో నిండిన తీపి వస్తువులను, శాపగ్రస్తమైన విందులను కొనుగోలు చేసి తినేలా వాడు ఎంతో చాతుర్యంతో తన సరుకులను మీ కళ్ళముందు ప్రదర్శిస్తాడు. అపవాది చేసే దాడికి అసలైన శత్రువులు మీరే. ప్రభువే వాణ్ణి గద్దించి, వాడి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును గాక!
యవ్వనస్థులారా, సాతాను పన్నిన ఉచ్చుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. వాడు మీ కళ్ళల్లో ధూళిని విసిరేందుకు ప్రయత్నిస్తాడు, మీరు వాస్తవాలను చూడకుండా అడ్డుకుంటాడు. చెడు మంచిదనీ మంచి చెడ్డదనీ మీరు ఆత్రంగా ఆలోచించేలా చేస్తాడు (యెషయా 5:20). వాడు పాపానికి దుస్తులు ధరింపచేసి, దానికి రంగులు వేసి, బంగారంతో కప్పి, మంచి ఆకర్షణీయమైన దానిగా చేసి మిమ్మల్ని దాని ప్రేమలో పడేలా చేస్తాడు (2 కొరింథీ 11:15). సాతాను నిజమైన క్రైస్తవ్యంలో లేని అనేకమైన వాటిని కల్పించి, తప్పుగా చూపించి, వికృతంగా చేసి, మీకు క్రైస్తవ్యంపై అసహ్యం కలిగేలా చేస్తాడు. వాడు దుష్టత్వపు ఆనందాలను గొప్పగా చూపిస్తాడు, కానీ దానికున్న ముల్లును మీకు కనబడకుండా దాచిపెడతాడు. వాడు మీ కళ్ళ ముందు సిలువను దాని మూలంగా కలిగే బాధను తీవ్రంగా చూపిస్తాడు, కాని శాశ్వతమైన కిరీటాన్ని మీ దృష్టికి దూరంగా ఉంచుతాడు. మీరు వాడికి మాత్రమే సేవ చేస్తే వాడు క్రీస్తుకు వాగ్దానం చేసినట్టుగా మీకు కూడా అన్నింటిని వాగ్దానం చేస్తాడు (మత్తయి 4:8). మీరు క్రైస్తవ్యంలో పైకి భక్తిగలవారివాలె ఉండేలా దాని శక్తిని నిర్లక్ష్యం చేసేలా మీకు సహాయం చేస్తాడు (2 తిమోతి 3:5). మీ జీవిత ప్రారంభంలో "నువ్వు దేవునికి సేవ చెయ్యడానికి ఇంకా చాలా సమయం నీకు ఉంది” అని వాడు అంటాడు. చివరికొచ్చేసరికి వాడు “ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందని” మీకు చెబుతాడు. అయ్యో, మీరు మోసపోకండి!
ఈ శత్రువు వల్ల మీరు ఎలాంటి ఆపదలో ఉన్నారో మీకు తెలియదు. మీకున్న ఈ అజ్ఞానం వల్లే నేను భయపడుతున్నాను. మీరు గుంటల, గొయ్యిల మధ్య నడిచే గుడ్డివారిలా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రమాదాలను మీరు చూడలేకపోతున్నారు (లూకా 6:39).
మీ శత్రువు బలవంతుడు. వాడికి "ఈ లోకాధికారి" అనే పేరు ఉంది (యోహాను 14:30). మన ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య చేసిన కాలమంతట్లోనూ ఆయనను వాడు వ్యతిరేకించాడు. నిషిద్ధ ఫలాలను తినమని ఆదాము, హవ్వలను శోధించాడు. పాపాన్ని మరణాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చాడు. వాడు దేవుని హృదయానుసారుడైన దావీదును కూడా శోధించి,
అతని జీవితం చివరి రోజుల్ని దుఃఖంతో నిండేలా చేశాడు (2 సమూ 11:2). ఎన్నుకోబడిన అపోస్తలుడైన పేతురును కూడా శోధించాడు, ప్రభువును తిరస్కరించేలా చేశాడు (మత్తయి 26:69). వాడి శతృత్వాన్ని మీరు నిర్లక్ష్యం చెయ్యొచ్చా? మీ శత్రువు తీరికలేకుండా పనిచేస్తున్నాడు. వాడు ఎన్నడూ నిద్రపోడు. ఎవరిని మింగేద్దామా అని వెదుకుతూ గర్జించే సింహంలా ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాడు (1 పేతురు 5:8). వాడు భూమిపై ఇటూ అటూ తిరుగుతూ పైకీ కిందకీ నడుస్తూ ఉంటాడు (యోబు 1:7). మీరు మీ ఆత్మల గురించి అజాగ్రత్తగా ఉండవచ్చేమో కానీ వాడు మాత్రం అజాగ్రత్తగా ఉండడు. వాడి మాదిరిగానే మీరు కూడా దుఃఖంతో బతకాలనీ మీరు వాడికి దాసులుగా మారాలని కోరుకుంటున్నాడు. వాని శతృత్వాన్ని మీరు నిర్లక్ష్యం చెయ్యొచ్చా?
మీ శత్రువు జిత్తులమారి. ఆరు వేల సంవత్సరాలుగా వాడొక పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆ పుస్తకం మరేదో కాదు మానవుని హృదయమే. వాడు మానవుని హృదయాన్ని బాగా పరిశోధించాడు. దాని బలహీనత గురించీ వంచన గురించీ మూర్ఖత్వం గురించీ వాడికి బాగా తెలుసు. మనిషి హృదయానికి అత్యంత హాని కలిగించే ఉపాయాలతో నిండిన పెద్ద షోరూం వాడికుంది. మీరు ఎక్కడికెళ్ళినా వాడి కంటపడకుండా ఉండలేరు. పట్టణంలోకి వెళ్ళండి, వాడు అక్కడ ఉంటాడు. అరణ్యానికి వెళ్ళండి, వాడు అక్కడ కూడా ఉంటాడు. మీరు వెళ్ళి తాగుబోతుల మధ్యలో కూర్చుంటే వాడు అక్కడ కూడా మీకు సహాయం చేస్తాడు. మీరు వెళ్ళి వాక్యం వింటుంటే వాడు మీ దృష్టిని మరల్చడానికి అక్కడే ఉంటాడు. అలాంటి శత్రువు గురించి మీరు నిర్లక్ష్యంగా ఉండొచ్చా?
యవ్వనస్థులారా, మీరు పెద్దగా పట్టించుకోకపోయినా, ఈ శత్రువు మీ నాశనం కోసం చాలా కష్టపడుతున్నాడు. వాడు ప్రత్యేకంగా ప్రయాసపడి పోటీపడుతున్న బహుమతి మీరే. మీ తరంలో మీరు అయితే దీవెనకరంగా లేదా శాపగ్రస్తంగా ఉంటారని ముందుగానే ఎరిగి, మీరు ప్రతి రోజు వాడి రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో సహాయపడాలని, మీ జీవిత ప్రారంభంలోనే మీ హృదయాలలో అగ్రస్థానం సంపాదించడానికి వాడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మొగ్గను పాడుచెయ్యడమే పువ్వును నాశనం చెయ్యడానికి ఖచ్చితమైన మార్గమని వాడికి తెలుసు.
ఎలీషా యొక్క సేవకుని కళ్ళు తెరుచుకున్నట్టుగా మీ కళ్ళు తెరుచుకుంటే ఎంత బాగుండును! (2 రాజులు 6:13-17). మీ శాంతి సమాధానాలకు వ్యతిరేకంగా సాతాను ఏమి పన్నాగాలు పన్నుతున్నాడో మీరు చూడగలిగితే ఎంత మేలు! నేను మిమ్మల్ని హెచ్చరించాలి, ప్రోత్సహించాలి. మీరు విన్నా, వినకపోయినా నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలే సాహసం చెయ్యలేను.
(5) ఐదవ కారణం: యవ్వనస్థులకు ఉపదేశం అవసరం. ఎందుకంటే అది వారిని శ్రమ నుంచి రక్షిస్తుంది, ఇప్పుడే దేవుని సేవను ఆరంభించేందుకు పురికొల్పుతుంది.
పాపం దుఃఖమంతటికీ తల్లి లాంటిది. యవ్వన వయస్సులో చేసిన పాపాలకంటే మనిషికి ఎక్కువ దుఃఖాన్ని, బాధను కలిగించేవి ఏవీ లేవు. అతడు చేసిన మూర్ఖపు పనులు, వృథా చేసుకున్న సమయం, చేసిన తప్పులు, చెడు సహవాసాలు, తన శరీరానికి ఆత్మకు చేసుకున్న హాని, ఆనంద జీవితానికి అతడు వదులుకున్న అవకాశాలు, అతడు నిర్లక్ష్యం చేసిన ఉపయోగకరమైన పనులు; ఇవన్నీ ఒక వృద్ధుని మనస్సాక్షిని తరచుగా బాధిస్తాయి, అతని చివరి దినాలను చీకటితో నింపేస్తాయి, తన్ను తానే నిందించుకునేలా, అవమానంతో కృంగిపోయేలా చేస్తాయి.
యవ్వనంలో చేసిన పాపాల వల్ల కలిగిన అకాల అనారోగ్యం గురించి కొంతమంది మీకు చెబుతుంటారు. వ్యాధులు వారి అవయవాలను నొప్పితో ముంచెత్తుతాయి, శరీరం దాదాపుగా బలహీనమైపోతుంది. వారి కండరాల బలం చాలా వృథా ఔతుంది, చివరికి మిడత బరువు కూడా వాళ్ళకు భారంగా అనిపిస్తుంది. వారి కళ్ళు ఎంతో తొందరగా మసకబారతాయి. వారి సహజ శక్తి క్షీణిస్తుంది. ఇంకా పొద్దు ఉండగానే వారి ఆరోగ్య సూర్యుడు అస్తమిస్తాడు, వారు తమ శరీరం తినివేయబడడం చూసి దుఃఖిస్తారు. నేను చెప్పేది నమ్మండి, ఇది కూడా తాగడానికి చేదైన పాత్రయే.
తమ సోమరితనం వల్ల కలిగిన పరిణామాల గురించి ఇతరులు మీకు విచారకరమైన సంగతులను చెప్పి ఉంటారు. నేర్చుకునేందుకు వారికొచ్చిన సువర్ణావకాశాన్ని వదులుకున్నారు. వారి మనస్సు చక్కగా స్వీకరించగలిగినప్పుడు, వారి జ్ఞాపకశక్తి భద్రపరుచుకోవడానికి సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని స్వీకరించలేదు. ఇప్పుడు కూర్చుని నేర్చుకునేంత సమయం వారికి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఒకవేళ వారికి సమయం ఉన్నప్పటికీ, వారికి అదే శక్తి ఇప్పుడు లేదు. కాబట్టి పోగొట్టుకున్న సమయాన్ని ఎన్నటికీ తిరిగి పొందుకోలేము. ఇది కూడా తాగడానికి చేదైన పాత్రయే. ఇతరులు తీసుకున్న నిర్ణయాలలో వారు చేసిన ఘోరమైన తప్పుల గురించి మీకు చెప్పి ఉంటారు. వాటివల్ల వాళ్ళు తమ జీవితమంతా బాధపడతారు. వాళ్ళు ఎవరి సలహానూ తీసుకోలేదు. వారి సొంత మార్గాలను వాళ్ళు ఎన్నుకున్నారు. తమ సంతోషాన్ని పూర్తిగా నాశనం చేసే ఏదో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఏ మాత్రమూ నప్పని వృత్తిని ఎంచుకున్నారు. తాము చేసిన పొరపాటు అంతటినీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. తప్పును తిరిగి సరిచేసుకోలేనప్పుడు మాత్రమే వారి కళ్ళు తెరవబడుతుంటాయి. అయ్యో, ఇది కూడా తాగడానికి చేదైన పాత్రయే!
యవ్వనస్థులారా, మీరు యవ్వనకాలంలో చేసిన సుదీర్ఘమైన పాపాలను బట్టి భారాన్ని భరించకుండా మీ మనస్సాక్షి ఓదార్పును పొందియుంటే బాగుండునని నేను అనుకుంటున్నాను. ఆ పాపాలు లోతుగా గుచ్చుకునే గాయాలు, మనిషి ఆత్మను చీల్చివేసే బాణాలు. అవి ఆత్మలోకి ప్రవేశించే ఇనుము లాంటివి. మీ పట్ల మీరే దయ కలిగి ఉండండి. తొందరగా ప్రభువును వెదకండి, తద్వారా మీరు విస్తారమైన కన్నీళ్ళు కార్చకుండా తప్పించబడతారు.
“నీవు నాకు కఠిన శిక్ష విధించావు. యవ్వనంలో నేను చేసిన పాపాలకు
ప్రతిఫలం అనుభవించేలా చేస్తున్నావు" అని యోబు అన్నప్పుడు అతడు అనుభవించిన సత్యం ఇదే అయ్యుంటుంది (యోబు 13:26). అలాగే అతని స్నేహితుడు జోరు కూడా చెడ్డవారి గురించి మాట్లాడుతూ, “వారి యెముకలలో యవ్వన బలము నిండియుండునుగాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును” అని అన్నాడు (యోబు 20:11). దావీదు కూడా ప్రభువుతో “నా యవ్వనంలో నేను చేసిన పాపాలు, నా అక్రమ కార్యాలు జ్ఞాపకం ఉంచుకోవద్దు" అని అన్నప్పుడు ఇదే సత్యాన్ని అతడు కూడా అనుభవించి ఉంటాడు (కీర్తన 25:7).
స్విస్ దేశానికి గొప్ప సంస్కర్తయైన బేజా చాలా బలంగా ఈ సత్యాన్ని అనుభవించాడు. అందువల్లనే “కేవలం దేవుని మహాకృపనుబట్టి ఈ లోకంలో నుండి పదహారేళ్ళ వయస్సులోనే నేను ప్రత్యేకంగా బయటపడటం జరిగింది” అని తన పుస్తకంలో రాసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి విశ్వాసులను అడిగి చూడండి, వారిలో చాలామంది “నాకు మళ్ళీ నా యవ్వనంలో జీవించే అవకాశం ఉంటే బాగుండును, నేను నా జీవిత ఆరంభాన్ని మంచి మార్గంలో గడిపి ఉండేవాణ్ణి, కాని చెడు అలవాట్లకు అంత బలమైన పునాదిని వేసేవాణ్ణి కాదు!" అని మీకు సమాధానం చెబుతారని నేను అనుకుంటున్నాను.
యవ్వనస్థులారా, నాకు సాధ్యమయ్యేంత వరకూ ఈ దుఃఖం నుండి మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాను. నరకం అనేది చాలా ఆలస్యంగా తెలిసే నిజం. జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యవ్వనంలో ఏమి విత్తుతారో వృద్ధాప్యంలో ఆ పంటే కోస్తారు. మీ జీవితంలోని చివరి రోజుల్లో మిమ్మల్ని మనశ్శాంతితో ఉండనివ్వని వాటికి మీరు అత్యంత విలువైన సమయాన్ని ఇవ్వకండి. నీతి విషయాల్లో విత్తండి. ముళ్లపొదల మధ్య విత్తకుండా మంచి నేలలో విత్తండి.
పాపాన్ని మీ చేతులతో మీరు చిన్నగానే చెయ్యవచ్చు, పాపపు మాటలు మీ నాలుక నుండి మృదువుగానే బయలు వెళ్లవచ్చు. కానీ పాపాన్ని మీరెంత తక్కువగా ఇష్టపడినా క్రమక్రమంగా మళ్ళీ ఏదో ఒకసారి దాన్ని కలుస్తారు.
పాత గాయాలు తగ్గిన చాలాకాలం తర్వాత కూడా తరచుగా నొప్పిని కలిగిస్తాయి. గాయాలు పోవచ్చు కాని మచ్చ మాత్రం మిగిలే ఉంటుంది. కాబట్టి మీ పాపాల వలన కలిగే బాధలు అదేవిధంగా మీకు కలగవచ్చు. ఒకప్పుడు తడిగా ఉండే ఇసుక నేలపైన జంతువుల అడుగుజాడలు కనబడ్డాయి. ఆ తడి ఇసుక నేల, వేల సంవత్సరాల తర్వాత బండలుగా మారిపోయింది. వాటిపై నడిచిన జంతువులు చనిపోయిన వాటి అడుగుజాడలు ఇంకా నిలిచే ఉన్నాయి. మీ పాపాల పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు.
ఒక సామెత ఇలా చెబుతుంది, “అనుభవమే గొప్ప పాఠశాల, మూర్ఖులు ఏ పాఠశాలలోనూ నేర్చుకోరు. ” మీరందరూ ఆ పాఠశాలలో నేర్చుకునే దుస్థితి నుండి తప్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను. యవ్వనంలో తరచుగా జరిగే పాపాల నుండి మీరు తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇదే చివరి కారణం.
అధ్యాయం 2
యవ్వనస్థులకు ఎదురయ్యే ప్రమాదాలు
యవ్వనస్థులకు ఎదురయ్యే ప్రత్యేక ప్రమాదాలు ఉన్నాయి. వాటి గురించి వాళ్ళను హెచ్చరించాలి.
(1) యవ్వనస్థులకు ఎదురయ్యే ఒక ప్రమాదం: గర్వం.
అందరి ప్రాణాలు భయంకరమైన ప్రమాదంలో ఉన్నాయని నాకు బాగా తెలుసు. చిన్న పెద్ద అనే తేడా ఏదీ లేదు; అందరికి పరిగెత్తవలసిన పందెమనేది ఉంది, పోరాడటానికి యుద్ధమనేది ఉంది, లోబడడానికి హృదయమనేది ఉంది, జయించడానికి ప్రపంచమనేది ఉంది, క్రమశిక్షణలో ఉంచుకోవడానికి శరీరమనేది ఉంది, ఎదిరించడానికి సాతానుడనేవాడు ఉన్నాడు. ఈ విషయాలన్నిటికి చాలిన వారెవరు? జవాబు మనం తేలిగ్గానే చెప్పొచ్చు. కానీ ఏ వయస్సుకు చెందిన వారికైనా కొన్ని వింతైన ఉచ్చులు, శోధనలు ఉంటాయి, వాటిని తెలుసుకోవడం మంచిది. ముందుగా హెచ్చరించబడినవాడు, ముందుగానే జాగ్రత్తపడతాడు. నేను చెప్పబోయే ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని ఒప్పించగలిగితే, నేను మీ ఆధ్యాత్మికతకు అవసరమైన సహాయం చెయ్యగలనని ఖచ్చితంగా భావిస్తున్నాను.
గర్వమనేది ప్రపంచంలోనే అత్యంత పురాతన పాపం. నిజానికి, ఇది మనుష్య ప్రారంభానికి ముందే ఉంది. సాతాను, వాడి దూతలు గర్వంవల్లే పతనమైపోయారు. వారి మొదటి స్థితితో వారు సంతృప్తి చెందలేదు. ఆ విధంగా గర్వం అనే పాపం వల్లే నరకం నిండడం ప్రారంభమయ్యింది.
గర్వమే ఆదామును ఏదెను తోట నుండి బయటకు నెట్టేసింది. దేవుడు తనకు కేటాయించిన స్థలంతో అతడు సంతృప్తి చెందలేదు. అతడు తనను తాను పైకి లేపుకోవడానికి ప్రయత్నించి పతనమైపోయాడు. కాబట్టే పాపం, దుఃఖం, మరణం అనేవి గర్వంవల్లే లోకంలోకి ప్రవేశించాయి.
స్వభావరీత్యా మనందరి హృదయాల్లో గర్వం ఉంటుంది. మనం గర్వంతోనే పుట్టాం. గర్వం, మనతో మనం సంతృప్తి చెందేలా చేస్తుంది. మనం తగినంత మంచివాళ్ళమని భావించేలా చేస్తుంది. ఎలాంటి సలహాలనూ వినకుండా మన చెవుల్ని మూసేస్తుంది. క్రీస్తు సువార్తను తిరస్కరించేలా చేసి, ప్రతి ఒక్కరిని తమ తమ సొంత మార్గాలకు తిప్పుతుంది. అయితే గర్వం ఒక్క యవ్వనస్థుని హృదయంలో తప్ప మరెక్కడా అంతటి శక్తివంతమైన పరిపాలన చెయ్యలేదు.
యవ్వనస్థులు దురుసుగా పొగరుగా ఉంటారు, ఏదైనా సలహా ఇస్తే అసహనం చూపిస్తారు, ఇది సర్వ సాధారణం. తమ చుట్టూ ఉన్నవాళ్ళు తమకు తగినట్టుగా విలువనూ గౌరవాన్నీ ఇవ్వట్లేదని వారిపై తరుచూ కఠినంగా అమర్యాదగా ప్రవర్తిస్తారు. పెద్దలు చెప్పే మంచి మాటలను విసుక్కోకుండా వాళ్ళు ఎంతవరకు ఉండగలరు! తమకంతా తెలుసని వాళ్ళు అనుకుంటారు. వారు తమ సొంత జ్ఞానం అనే అహంకారంతో నిండి ఉంటారు. తమ బంధువులను, పెద్దలను వెర్రివారిగాను, తెలివితక్కువ వారిగాను, మందబుద్ధి గలవారిగాను పరిగణిస్తారు. తమకు ఎవ్వరి బోధలూ ఉపదేశమూ అవసరం లేదనీ తమకంతా తెలుసని అనుకుంటారు. ఒకవేళ అలాంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తే వారికి కోపం వస్తుంది. వాళ్ళను చూస్తే మచ్చిక చెయ్యబడని యవ్వన గుర్రాల మాదిరిగా కనిపిస్తారు. వాళ్ళు ఎవరిపైనా ఆధారపడకుండా, తమ సొంత మార్గాలను ఎంచుకుంటారు. వాళ్ళను చూస్తే యోబు ప్రస్తావించిన విషయం గుర్తొస్తుంది: “నిజముగా లోకములో మీరే జనులు. మీతోనే జ్ఞానము గతించి పోవును" (యోబు 12:2). ఇదంతా గర్వమే.
రెహబాము తన తండ్రి ముందు నిలబడిన అనుభవజ్ఞులైన పెద్దవారి సలహాను తృణీకరించి, తన వయస్సుకు చెందిన తోటి యువకుల సలహాలను విన్నాడు. అతడు తన మూర్ఖత్వానికి తగిన పరిణామాలను పొందడానికే జీవించాడు. ఇంకా అతనిలా చాలామంది ఉన్నారు.
“తప్పిపోయిన కుమారుడు" అనే ఉపమానంలో కూడా ఉన్నది అలాంటి వ్యక్తే, అతడు తన వారసత్వపు వాటాను తీసుకుని, తద్వారా తను కోరుకున్న జీవనశైలిలో జీవించాడు. అతడు తన తండ్రి దగ్గర మౌనంగా జీవించలేక లోబడలేక, దూర దేశానికి వెళ్ళి, తనకు తానే యజమానిగా ఉన్నాడు. తల్లి చేయి విడిచి ఒంటరిగా నడిచే చిన్న పిల్లాడిలా, అతడు తన మూర్ఖత్వానికి వెంటనే తగిన ఫలితాన్ని అనుభవించాడు. చివరికి పందులతో పొట్టు తినవలసి వచ్చినప్పుడు అతడు జ్ఞానవంతుడయ్యాడు. కానీ అతనిలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు.
యవ్వనస్థులారా, గర్వం పట్ల జాగ్రత్త వహించాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. రెండు విషయాలు ప్రపంచంలో చాలా అరుదైన దృశ్యాలు: ఒకటి వినయ విధేయతలు కలిగిన యవ్వనస్థుడు, మరొకటి సంతృప్తి చెందిన వృద్ధుడు. ఇది చాలా నిజం. అందుకే నేను భయపడుతున్నాను.
మీరు మీ సొంత సామర్థ్యాలను బట్టి అనగా మీ సొంత బలాన్ని బట్టీ మీ సొంత జ్ఞానాన్ని బట్టీ మీ సొంత రూపాన్ని బట్టీ మీ సొంత తెలివితేటలను బట్టీ గర్వపడకండి. మీ గురించి మీరు గర్వించకండి. ఈ ప్రపంచం గురించి కాని మిమ్మల్ని గురించి కాని మీరు తెలుసుకోకపోవడం వల్లే మీరు గర్విస్తున్నారు. మీరు ఎదిగే కొలది లోకాన్ని ఎక్కువగా చూస్తారు, అప్పుడు గర్వపడడానికి తగిన హేతువు మీకు కనబడదు. అజ్ఞానం, అనుభవలేమి అనేవి అహంకారానికి పెద్ద పీఠ వంటివి. ఆ పీఠాన్ని తొలగించిన వెంటనే, అహంకారం కుప్పకూలిపోతుంది.
వినయంతో నిండిన వ్యక్తి ఎంత శ్రేష్ఠుడనే విషయాన్ని లేఖనం ఎంతో తరచుగా మన ముందు ఉంచుతోంది. “తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు" అని లేఖనం మనల్ని గట్టిగా హెచ్చరిస్తున్నది కదా! (రోమా 12:3) "ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు
కాడు” అని లేఖనం మనకు ఎంత స్పష్టంగా చెబుతున్నదో కదా! (1 కొరింథీ 8:2) “వినయమును ధరించుకొనుడి” అనే ఆజ్ఞ ఎంత కఠినమైనదో కదా! (కొలస్సీ 3:12; 1 పేతురు 5:5). ఈ విధంగా వినయం అనే వస్త్రం చాలామందికి లేదు, ఎందుకంటే వాళ్ళకది మురికి వస్త్రంలా కనిపిస్తుంది.
ఈ విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన ముందుంచిన గొప్ప ఆదర్శం గురించి ఆలోచించండి. ఆయన తన శిష్యుల పాదాలను కడిగి, “నేను మీకు చేసినట్లే మీరు కూడా చేయాలి” అన్నాడు (యోహాను 13:15). “ఆయన ధనవంతుడైనప్పటికీ మీ నిమిత్తము దరిద్రుడాయెను” అని రాయబడింది (2 కొరింథీ 8:9). “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను" (ఫిలిప్పీ 2:6-8). నిశ్చయంగా గర్వపడడమంటే, క్రీస్తులా కాకుండా సాతానులా పడిపోయిన ఆదాములా ఉండటమే.
అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోను గురించి ఆలోచించండి. అతను తనను తాను “చిన్న పిల్లవాడిగా” ఎలా తగ్గించుకున్నాడో చూడండి. “నా దేవా యెహోవా, నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు” (1 రాజులు 3:7). ఇది అతని సోదరుడు అబ్షాలోముకు చాలా భిన్నమైన వైఖరి. ఎందుకంటే తాను దేనికైనా అర్హుణ్ణని అతడు భావించేవాడు, “నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను” (2 సమూ 15:4). అలాగే అతని సోదరుడు అదోనీయాది కూడా చాలా భిన్నమైన వైఖరి, ఎందుకంటే అతడు “నేను రాజును ఔతాను” అని తనను తాను హెచ్చించుకున్నాడు (1 రాజులు 1:5). దీనత్వమే సొలొమోను జ్ఞానానికి ప్రారంభం. కాబట్టి అతడు దానిని తన సొంత అనుభవంతో ఇలా రాశాడు: "తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుట కంటె మూర్ఖుని గుణపరచుట సుళువు" (సామె 26:12).
యవ్వనస్థులారా, పైన చెప్పబడిన లేఖనాలను హృదయానికి దగ్గరగా ఉంచుకోండి. మీ సొంత జ్ఞానాన్ని అంత గుడ్డిగా నమ్మకండి. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ సరైనవారిగా భావిస్తూ, ఇతరులను తప్పులు చేసేవారిగా చూడడం మానేయండి. పెద్దల అభిప్రాయానికి, మరిముఖ్యంగా మీ తల్లి దండ్రుల అభిప్రాయానికి విరుద్ధంగా ఎప్పుడూ మీ సొంత అభిప్రాయం పైన మీరు ఆధారపడవద్దు. వయస్సు అనుభవాన్నిస్తుంది, కాబట్టి అది గౌరవానికి అర్హమైనదే. యోబు గ్రంథంలో, “యోబు తనకంటే పెద్దవాడని ఎరిగి, తాను మాట్లాడటానికి ముందు ఎలీహు వేచి ఉన్నాడు" (యోబు 32:4). ఇది ఎలీహు యొక్క జ్ఞానానికి చిహ్నంగా ఉంది. ఆపై అతడు ఇలా అన్నాడు: “నేను వయస్సులో చిన్నవాడిని మీరు పెద్దవారై ఉన్నారు; అందుకే నేను భయపడి ఉన్నాను, నాకు తెలిసినది మీకు చెప్పడానికి ధైర్యం లేదు. వృద్ధులు మాట్లాడడానికి తగినవారని ఎక్కువ వయసు జ్ఞానం బోధించడానికి తగినదని నేను అనుకొన్నాను" (యోబు 32:6-7).
వినయం, మౌనం అనేవి యువతలో కనిపించే అద్భుతమైన కృపావరాలు. నేర్చుకునే వ్యక్తిగా ఎప్పుడూ సిగ్గుపడకండి: యేసు పన్నెండు సంవత్సరాల వయస్సులో దేవాలయంలో కనిపించినప్పుడు, ఆయన "బోధకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలు అడిగాడు” (లూకా 2:46). తెలివైన వ్యక్తులు తాము ఎల్లప్పుడూ నేర్చుకునేవారిగానూ తమకు తెలిసింది చాలా తక్కువన్నట్టుగా వినయపూర్వకంగా ఉంటారు. "జ్ఞానమనే సముద్రపు ఒడ్డున కొన్ని విలువైన రాళ్ళను ఏరుకున్న చిన్నపిల్లవాడి కంటే తాను గొప్పవాణ్ణి కాదని” సర్ ఐజాక్ న్యూటన్ చెప్పేవారు.
యవ్వనస్థులారా, మీరు జ్ఞానవంతులైతే, సంతోషంగా ఉంటారు. నేను మీకు ఇస్తున్న ఈ హెచ్చరికను గుర్తుంచుకోండి. గర్వం అనే పాపం విషయంలో జాగ్రత్త వహించండి.
(2) యవ్వనస్థులకు ఎదురయ్యే మరో ప్రమాదం: సుఖానుభవంపై ప్రేమ
మొండిగా ఉండే పిల్లలు తమకు నచ్చినవాటి కోసం చాలా బిగ్గరగా ఏడిచినట్లే యవ్వన వయస్సులో మన అభిరుచులు బలంగా ఉంటాయి. అలాగే యవ్వనకాలం అనేది ఆరోగ్యం బలం పుష్కలంగా ఉండే సమయం. మరణం సుదూరంలో ఉన్నట్టు, ఈ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడమే సర్వస్వమన్నట్టు కనబడుతుంది. యవ్వనకాలంలో తమ దృష్టిని ఆకర్షించే బాధలు, కష్టాలు కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి. కాబట్టి వారు ప్రతి విషయంలో సుఖానుభవం గురించి తప్ప మరి దేని గురించీ ఆలోచించకుండా ఈ వయస్సు సహాయపడుతుంది. “నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు?” అనే ప్రశ్న వేస్తే దానికి వాళ్ళు నిజాయితీగా జవాబిస్తే “నేను సుఖభోగాలకు మాత్రమే సేవచేస్తాను” అనేదే చాలామంది యవనస్థుల చెప్పే జవాబు ఔతుంది.
యవ్వనస్థులారా, ఈ సుఖ భోగాలను ప్రేమించడంవల్ల వచ్చే అన్ని ఫలాలను, అవి మీకు హాని కలిగించే అన్ని మార్గాలను మీకు చెప్పడానికి సమయం సరిపోదు. అల్లరి కేకల, విందుల, మద్యపానం, జూదం, సినిమాలు, డ్యాన్సర్ల గురించి నేను ఎందుకు మాట్లాడాలి? వీటిలో ఆనందించి, చేదు అనుభవాలను రుచిచూడని వారి సంఖ్య చాలా తక్కువే కదా! ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. కొంతసేపు ఉద్రేకాన్ని కలిగించేవన్నీ ఆలోచనలను ముంచేసేవన్నీ మనస్సును నిరంతరం సుడిగుండంలో ఉంచేవన్నీ ఇంద్రియాలను సంతోషపెట్టేవన్నీ శరీరాన్ని ఆహ్లాదపరిచేవన్నీ మీ జీవిత కాలంలో అపరిమితమైన శక్తి కలిగినవే. సుఖానుభవం వల్లే వాటికి ఆ శక్తి కలుగుతుంది. అప్రమత్తంగా ఉండండి. "దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” అని పౌలు చెప్పిన వారిలా ఉండకండి (2 తిమోతి 3:4).
నేను చెప్పేది గుర్తుంచుకోండి: మీరు భూసంబంధమైన సుఖభోగాలను అంటిపెట్టుకుని ఉండొద్దు. అవి మీ ఆత్మలను చంపే విషయాలు. శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలకు మార్గం తెరవడం కంటే వాత వేయబడిన మనస్సాక్షిని కఠినమైన పశ్చాత్తాపం లేని హృదయాన్ని పొందే ఖచ్చితమైన మార్గం ఏదీ లేదు. అవి మొదట్లో అపాయకరంగా కనిపించవు, కానీ దీర్ఘకాలంలో తప్పక నష్టం చేస్తాయి.
పేతురు ఏం చెప్పాడో పరిశీలించండి: “ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి” (1 పేతురు 2:11). అవి ఆత్మ యొక్క శాంతిని నాశనం చేస్తాయి, దాని బలాన్ని విచ్ఛిన్నం చేస్తాయి, చివరికి చెరలోకి నడిపించి బానిసగా చేస్తాయి.
పౌలు ఏం చెప్పాడో పరిశీలించండి: "కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి” (కొలస్సీ 3:5). "క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు” (గలతీ. 5:24). ఒకప్పుడు శరీరం ఆత్మకు పరిపూర్ణమైన నివాసంగా ఉండేది. ఇప్పుడు అదంతా అవినీతిమయంగా అస్తవ్యస్తంగా ఉండి, నిరంతరం కావలి కాయవలసిన విధంగా ఉంది. కాబట్టి శరీరం ఆత్మకు భారంగా ఉంది కాని సహాయకరంగా లేదు; ఆటంకంగా ఉంది కాని తోడ్పాటుగా లేదు. శరీరం ఆత్మకు ఉపయోగకరమైన సేవకుడిగా ఉండవచ్చు, కానీ ఎల్లప్పుడూ అది చెడ్డ యజమానే.
ఇంకోసారి, పౌలు చెప్పిన మాటలను పరిశీలించండి: “మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.” (రోమా 13:14). లైటన్ గారు ఇలా చెప్పారు, “ఈ వచనం చదవడం వల్లే జారత్వంలో పొర్లుతున్న అగస్టీన్ అనే యువకుడు యేసుక్రీస్తు ప్రభువుకు నమ్మకమైన సేవకుడిగా మారాడు. "యువ్వనస్థుల్లారా మీ అందరి విషయంలోనూ ఇలాగే జరగాలని నేను కోరుకుంటున్నాను.”
ఇంకోసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు సుఖభోగాలను హత్తుకోవద్దు, అవన్నీ అసంతృప్తికరంగానూ శూన్యమైనవిగానూ అర్థంలేనివిగాను ఉంటాయి. ప్రకటన గ్రంథంలోని దర్శనంలో మిడుతలవలే వాటి తలపై కిరీటాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ అదే మిడుతల్లా వాటికి ముళ్ళు ఉన్నట్టు మీరు కనుగొంటారు. మెరిసేదంతా బంగారం కాదు. తియ్యగా ఉండేదంతా మంచిది కాదు. కొద్దిసేపే నిలిచి ఉండే సంతోషమంతా నిజమైన సంతోషం కాదు.
మీరు కోరుకున్నట్టే వెళ్ళి భూసంబంధమైన సుఖభోగాలను తీర్చుకోండి కానీ మీ హృదయం వాటితో ఎన్నడూ సంతృప్తి చెందదు. సామెతలు 30:15లో “ఇవ్వు! ఇవ్వు!" అనే జలగలాగా ఏడుస్తూ లోపల ఎల్లప్పుడూ మీకు ఒక స్వరం వినబడుతుంది. అక్కడ హృదయంలో శూన్యం ఉంది, దానిని దేవుడు తప్ప మరెవ్వరూ పూరించలేరు. సొలొమోను అనుభవించి తెలుసుకున్నట్టుగా, భూసంబంధమైన సుఖభోగాలు కేవలం అర్థరహితమైన ప్రదర్శన అని వ్యర్థమని మీరు తెలుసుకుంటారు, అవి సున్నం కొట్టిన సమాధుల మాదిరిగా అందంగా ఉంటాయి, కానీ వాటి లోపల కుళ్ళిపోయిన శరీరం ఎముకలు ఉంటాయి. యవ్వనంలో తెలివిగా ఉండండి. భూసంబంధమైన ఆనందాలన్నిటిపై “విషం” అనే పదాన్ని రాసుకోండి. వాటిలో అత్యంత చట్టబద్ధమైన వాటిని మితంగా ఉపయోగించండి. మీరు వాటికి మీ హృదయాన్ని ఇస్తే అవి మీ ఆత్మను నాశనం చేస్తాయి. కాబట్టి నువ్వు ఆనందంచబోయేది పాపం కాదని మొదట నిశ్చయత కలిగి ఉండాలి. ఆ తర్వాత దానిని మితంగా ఆస్వాదించాలి.
అలాగే "వ్యభిచరింపవద్దు" అనే ఏడవ ఆజ్ఞను గుర్తుంచుకోవాలని యవ్వనస్థుల్ని హెచ్చరించే విషయంలో నేను సంకోచించను; వ్యభిచారం, లైంగిక అనైతికత అన్ని రకాల అపవిత్రతల గురించి జాగ్రత్త వహించాలి. దేవుని ఆజ్ఞలలో ఈ అంశంపై స్పష్టమైన మాటలు కొదువగా ఉన్నాయని తరచుగా నేను భయపడుతున్నాను. కానీ ప్రవక్తలు, అపొస్తలులు ఈ విషయంతో ఎలా వ్యవహరించారో నేను చూసినప్పుడు, మన సొంత సంఘ సంస్కర్తలు దానిని ఖండించిన బహిరంగ మార్గాన్ని నేను గమనించినప్పుడు, రూబేను, హోఫ్నీ, ఫీనెహాసు, అమ్నోను లాంటి వారి పాపపు అడుగుజాడల్లో నడిచే యవ్వనస్థుల సంఖ్యను చూసినప్పుడు, నేను మంచి మనస్సాక్షితో మనఃశాంతిని కలిగి ఉండలేక పోతున్నాను. ఈ ఆజ్ఞ విషయంలో మితిమీరిన మౌనం లోకానికి ఏదైనా మేలు చేస్తుందనే విషయం నాకు సందేహమే.
ప్రాథమికంగా యవ్వనస్థులు చేసే పాపాన్ని ప్రస్తావించకుండా వాళ్ళకు బోధించడం అసత్యమైన, లేఖన విరుద్ధమైన సున్నితత్వం అని నేను భావిస్తున్నాను.
ఏడవ ఆజ్ఞను ఉల్లంఘించడం అన్నిటికంటే పాపం, అది హోషేయ చెప్పినట్లుగా, “మతిని చెడగొడుతుంది" (హోషేయ 4:11). మనిషి చేసే ఇతర పాపాల కంటే ఆత్మపై లోతైన మచ్చలను మిగిల్చే పాపం ఇది. ప్రతి యుగంలో వేలాదిమందిని వధిస్తున్న పాపం ఇదే, గతంలో ఇది కూలగొట్టిన దేవుని పరిశుద్ధుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అందుకు లోతు, సమ్సోను, దావీదులే భయంకరమైన రుజువులు. మనిషి ఈ పాపాన్ని చూసి చిరునవ్వు చిందించటానికి సాహసిస్తాడు. విలాసం, అస్థిరత్వం, మొండితనం, క్రమ రాహిత్యం అనే పేర్లతో దాని తీవ్రతను తగ్గిస్తున్నాడు. కానీ సాతాను “అపవిత్రమైన ఆత్మ” గనుక వాడు సంతోషించే పాపం ఇది. దేవుడు అసహ్యించుకునే పాపం ఇది, ఆయన “తీర్పుతీరుస్తాను” అని ప్రకటించిన పాపం ఇది (హెబ్రీ 13:4).
యవ్వనస్థులారా, మీరు జీవాన్ని ప్రేమిస్తే “జారత్వమునకు దూరముగా పారిపోండి" (1 కొరింథీ 6:18). "వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయు లైన వారి మీదికి వచ్చును” (ఎఫెసీ 5:6). ఈ పాపం యొక్క పరిసరాల నుండి పారిపోండి. మిమ్మల్ని ఈ పాపంలోకి ఆకర్షించే వారి సహవాసం నుండి పారిపోండి. మీరు దీన్ని చెయ్యడానికి శోధించబడే ప్రదేశాల నుండి పారిపోండి. దీని గురించి మన ప్రభువు మత్తయి 5:28 లో ఏం చెప్పాడో చదవండి: "నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును.” పరిశుద్ధ సేవకుడైన యోబులా ఉండండి. "నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని. కన్యకను నేనేలాగు చూచుదును? ” (యోబు 31:1). వాటి గురించి మాట్లాడకుండా పారిపోండి. సంభాషణలో కూడా ప్రస్తావించకూడని విషయాలలో ఇది ఒకటి. మీ చేతులకు మురికి అంటకుండా మీరు నల్లతారును ముట్టుకోలేరు. వాటి గురించిన ఆలోచనల నుండి పారిపోండి; వాటిని ప్రతిఘటించండి, నాశనం చెయ్యండి, వాటికి వ్యతిరేకంగా ప్రార్ధించండి. వాటికి అవకాశం ఇవ్వడానికి బదులు ఎలాంటి త్యాగమైనా చెయ్యండి. ఈ పాపం చాలా తరచుగా పొదగబడేది ఊహల్లోనే. కాబట్టి మీ ఆలోచనలకు జాగ్రత్తగా కావలి కాయండి, మీ చర్యల గురించి కొంచెం భయం కూడా ఉండదు. నేను ఇస్తున్న ఈ హెచ్చరిక గురించి శ్రద్దగా ఆలోచించండి. మీరు మిగతావన్నీ మరచిపోయినా దీన్ని మాత్రం మరచిపోవద్దు.
(3) యవ్వనస్థులకు ఎదురయ్యే మరో ప్రమాదం: "అవివేకం, ముందు వెనకా ఆలోచించకపోవడం”
ఆలోచనాలేమి అనే కారణం చేతనే, వేలాది మంది శాశ్వతంగా నశిస్తున్నారు. మనుషులు ఆలోచించరు, వాళ్ళకు ముందు చూపు ఉండదు, వారి చుట్టూ ఏం జరుగుతుందో గమనించరు, వారి ప్రస్తుతకాలపు మార్గాల ఖచ్చితమైన పరిణామాలను గ్రహింపరు. తమ అనాలోచన వల్లే నాశనాన్ని అనుభవిస్తున్నారని చివరి క్షణంలో మేల్కొంటారు.
యవ్వనస్థులారా, మీ కంటే ఎక్కువ ప్రమాదంలో వేరే ఎవ్వరూ లేరు. మీ చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి మీకు కొంచెం కూడా తెలీదు కాబట్టే ఎలా నడచుకోవాలనే విషయంలో మీకు జాగ్రత్త లేదు. మీరు శ్రద్ధగా నిబ్బరంగా ఆలోచించడానికి ఇష్టపడరు, తద్వారా మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీ మీదకు మీరు లేనిపోని బాధలు తెచ్చుకుంటారు. యవ్వనస్థుడైన ఏశావు తన సోదరుని వంటకాన్ని ఆశించి, తన జేష్టత్వపు హక్కునే అమ్ముకున్నాడు కాని భవిష్యత్తులో ఎంతగా దాన్ని కోరుకుంటాడో అతడు ఎప్పుడూ ఆలోచించలేదు. తమ సోదరి దీనాపై జరిగిన అత్యాచారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి యవనస్థులైన షిమ్యోను, లేవి షెకెము వారిని చంపారు. కాని వారు తమ తండ్రియైన యాకోబును అతని కుటుంబాన్ని ఎంతగా ఇబ్బందికి ఆందోళనకు గురిచేసారో వారెన్నడూ ఆలోచించలేదు. యోబు తన పిల్లలలో ఇలాంటి ఆలోచనా రాహిత్యానికి ప్రత్యేకంగా భయపడినట్టు అనిపిస్తుంది: “వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను" (యోబు1:5).
నేను చెప్పేది నమ్మండి, మనం ఈ ప్రపంచంలో అనాలోచనగా ఉంటే అభివృద్ధి పొందడం సాధ్యం కాదు. ఆలోచన లేకపోతే మన ఆత్మల విషయంలో కూడా ఎంతమాత్రమూ మనం ముందుకు సాగలేము. “ఆలోచించొద్దు,” అని సాతాను పదే పదే మన చెవిలో గుసగుసలాడు తుంటాడు: నిజాయితీ లేని ఒక వ్యాపారవేత్త యొక్క ఆర్థిక లావాదేవీల పుస్తకం ఎలా ఉంటుందో, మారుమనస్సు లేని వ్యక్తి హృదయం కూడా అలానే ఉంటుందని సాతానుకు తెలుసు. "మీ మార్గాలను పరిశీలించుకోండి" అని దేవుని వాక్యం చెబుతుంది. ఏ విషయమైనా ఆగి ఆలోచించి జ్ఞానవంతంగా నిర్ణయం తీసుకోవాలని దాని అర్థం.
"తొందరపాటుతనం అనేది సాతాను నుండి వస్తుంది" అని స్పానిష్ సామెత చెబుతుంది. మనుషులు తొందరగా వివాహం చేసుకుని, తీరికగా బాధపడతారు. తమ ఆత్మల విషయంలో వారు ఒక నిమిషంలో చేసిన తప్పులను బట్టి, సంవత్సరాల తరబడి బాధపడతారు. చెడ్డ సేవకుడు తప్పు చేసి, “నేను ఎన్నడూ ఆలోచించలేదు” అని చెప్పినట్టు, యవ్వనస్థులు కూడా పాపంవైపు పరుగెత్తి, ఆపై “నేను దాని గురించి ఆలోచించలేదు. నాకు అది పాపంలా కనిపించలేదు” అని చెబుతారు. పాపంలా కనిపించడం లేదా! మీరు ఏం అనుకుంటున్నారు? పాపం నీ దగ్గరకు వచ్చేటప్పుడు, “నేను పాపాన్ని” అని చెప్పదు. అలా చెబితే దాని మూలంగా కలిగే హాని తక్కువగానే ఉంటుంది. అనుభవించే సమయంలో పాపం ఎల్లప్పుడూ “మంచిదిగా, ఆహ్లాదకరమైనదిగా, కోరదగినదిగానే” అనిపిస్తుంది. అయ్యో, జ్ఞానం పొందండి, విచక్షణ పొందండి! సొలొమోను మాటలను గుర్తుంచుకోండి:
"నీవు నడచు మార్గమును గురించి ఆలోచన చేయుము. అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును” (సామె 4:26).
ఆలోచనాపూరితంగా, ఆచితూచి అడుగులు వేసే కాలం యవ్వన కాలం కాదని, నేను చెబుతున్నది అనుచితమని కొందరు అభ్యంతరపడతారని నేను చెప్పగలను. ప్రస్తుత రోజుల్లో తెలివితక్కువగా మాట్లాడడం, తమాషాలు చెయ్యడం, జోక్స్ వేయడం, మితిమీరిన వినోదాలు చాలా సాధారణం అయ్యాయి. అన్నిటికి సమయం ఉందనే విషయం నిస్సందేహమైనది, కానీ ఎగతాళిగా హాస్యాస్పదంగా మీ కాలాన్ని గడపడం జ్ఞానమైన పని కాదు. ప్రసంగి చెబుతున్న మాట ఏంటి? "విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించు చున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును” (ప్రసంగి7:2-4).
క్వీన్ ఎలిజబెత్ కాలంలోని ఒక గొప్ప రాజకీయవేత్త గురించి మాథ్యూ హెన్రీ ఒక కథను చెప్పాడు. అతడు తన చివరి రోజుల్లో ప్రజల మధ్యలో జీవించడం మానుకుని, సీరియస్ గా ఆలోచించడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. చింతలు బాధలు లేని అతని స్నేహితులు ఒక రోజు అతణ్ణి చూడడానికి వచ్చి, “నువ్వు ఎంతో దిగులు కలిగిన వ్యక్తిగా మారిపోతున్నావు,” అని అతనితో అన్నారు. "లేదు! నేను సీరియస్ గా ఉన్నాను, ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సీరియస్ గా ఉన్నారు. దేవుడు మనల్ని గమనించడంలో సీరియస్ గా ఉన్నాడు. క్రీస్తు మధ్యవర్తిత్వం చెయ్యడంలో సీరియస్ గా ఉన్నాడు. మన కోసం కష్టపడడంలో పరిశుద్ధాత్ముడు సీరియస్ గా ఉన్నాడు. దేవుని సత్యాలు సీరియస్ గా ఉన్నాయి. మన ఆధ్యాత్మిక శత్రువులు మనల్ని నాశనం చేసే ప్రయత్నాల్లో సీరియస్ గా ఉన్నారు. తప్పిపోయిన పాపులు నరకంలో సీరియస్ గా ఉన్నారు. మరి మీరు, నేను కూడా ఎందుకు సీరియస్ గా వుండకూడదు?" అని అతడు జవాబిచ్చాడు.
ఓ యవ్వనస్థులారా, ఆలోచనాత్మకంగా ఉండడం నేర్చుకోండి! మీరు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో పరిశీలించడం నేర్చుకోండి. ప్రశాంతంగా ఆలోచించడానికి సమయం కేటాయించండి. మీ సొంత హృదయంతో మాట్లాడుతూ, నిబ్బరంగా ఉండండి. నేను చెప్పిన జాగ్రత్తలు గుర్తుంచుకోండి. కేవలం ఆలోచన లేకపోవడం వల్ల నష్టపోకండి.
(4) యవ్వనస్థులకు ఎదురయ్యే మరో ప్రమాదం: క్రైస్తవ్యాన్ని చులకనగా చూడడం.
మీరు ఎదుర్కొనే ప్రమాదాలలో ఇది కూడా ఒకటి. యవ్వనస్థులుగా మీరు క్రైస్తవ్యాన్ని ఏ మాత్రమూ గౌరవించకపోవడం నేను ఎల్లప్పుడూ గమనిస్తుంటాను. కృపను పొందడానికి కృపలో ఎదగడానికి దేవుడు ఏర్పరిచిన మార్గాలను యవ్వనస్థులు అనుసరించరు, సంఘ పరిచర్యల్లో పాలుపొందరు, బైబిల్ ను చదవరు, పాటలు పాడరు, బోధించేటప్పుడు కొంతసేపైనా వాక్యం వినరు. ప్రార్థనా సమావేశాలకు, బైబిల్ అధ్యయనాలకు, ఇతర వారాంతపు రోజులలో జరిగే ఆత్మీయ కూడికలకు హాజరు కారు. ఈ విషయాలు తమకు అవసరం లేదని, అవి స్త్రీలకూ వృద్ధులకూ మంచివి కావచ్చేమో కానీ తమకు కాదని యవ్వనస్థులు భావిస్తారు. వారు తమ ఆత్మల గురించి పట్టించుకోవడంలో సిగ్గుపడుతుంటారు, పరలోకానికి వెళ్ళడం సిగ్గుచేటని వారు భావిస్తుంటారు. ఇది క్రైస్తవ్యాన్ని అగౌరవపరచడం, ఇదే విధంగా బేతేలులోని యువకులు ఎలీషాను ఎగతాళి చేశారు. యవ్వనస్థుల్లారా! జాగ్రత్త! క్రైస్తవ్యాన్ని కలిగి ఉండడం విలువైనదైతే దానిని తీవ్రంగా గౌరవించడం కూడా అంతే విలువైనది.
పరిశుద్ధమైన విషయాలను చులకనగా చూడడం అపనమ్మకత్వానికి నేరుగా వెళ్ళే మార్గం లాంటిది. ఒక వ్యక్తి క్రైస్తవ్యంలో ఏ విషయాన్నైనా అపహసించడం ప్రారంభించిన తర్వాత, అతడు అవిశ్వాసిగా మారాడని విన్నప్పుడు నేను ఏ మాత్రమూ ఆశ్చర్యపోను.
యవ్వనస్థులారా, మీరు నిజంగా దీని విషయంలో దృఢ నిశ్చయం చేసుకున్నారా? మీరు క్రైస్తవ్యాన్ని తృణీకరించడంలో పట్టుదలతో ఉంటే మీ ముందున్న మంటలను మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారా? దావీదు చెప్పిన మాటలను గుర్తుచేసుకోండి: “దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో చెప్పుకొనుచున్నాడు” (కీర్తనలు 14:1). మూర్ఖుడు, కేవలం మూర్ఖుడే తప్ప మరెవరూ అనలేదు. అయినప్పటికీ వాడు ఆయన లేడని ఎప్పుడూ నిరూపించలేడు. గుర్తుంచుకోండి, మొదటి నుండి చివరివరకూ ప్రతి విధమైన రుజువులనుబట్టి సత్యమని నిరూపించబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ అని గుర్తుంచుకోండి. ఇది అన్ని శతృవుల, రంధ్రాన్వేషణ చేసే వ్యక్తుల దాడులను తిప్పికొట్టింది. "ప్రభువు వాక్యము నిర్మలమైనది” (కీర్తన 18:30). అన్ని విధాలుగా పరీక్షించబడింది, అది ఎంత ఎక్కువగా పరీక్షించబడిందో, అది దేవుని చేతిపనే అని అంత ఎక్కువగా చూపబడింది. మీరు బైబిల్ ను నమ్మకపోతే ఏం నమ్ముతారు? హాస్యాస్పదమైన, అసంబద్ధమైనదాన్ని నమ్మడం తప్ప మీకు వేరే మార్గం లేదు. బైబిల్ ను దేవుని వాక్యమని తిరస్కరించిన వ్యక్తికంటే అమాయకుడు ఎవ్వడూ లేడు; అది దేవుని వాక్యం కాబట్టి, దానిని తృణీకరించకుండా జాగ్రత్తపడండి.
బైబిల్లో అర్ధంచేసుకోవడానికి కష్టమైన విషయాలు ఉన్నాయని కొందరు మీకు చెప్పవచ్చు. అలాంటివి లేకుంటే అది దేవుని గ్రంథం అవ్వదు. అర్థంచేసుకోవడానికి కష్టమైన విషయాలు ఉన్నాయి, అయితే ఏంటి? డాక్టర్ గారు ఇచ్చే మందులన్నింటినీ మీరు వివరించగలుగుతున్నారా? లేదే, అవి మీకు అర్ధం కాకపోయినప్పటికి మీరు వాటిని అసహ్యించుకోరు. కానీ నిత్యజీవానికి అవసరమైన విషయాలను ప్రకటించేటప్పుడు బైబిల్లోని మాటలు పగటిపూటలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్ధంచేసుకోండి. ప్రజలు బైబిల్ ను తృణీకరించేది దాన్ని అర్థంచేసుకోకపోవడం వల్ల కాదు. వాళ్ళు దాన్ని బాగానే అర్థంచేసుకుంటారు; అది వారి సొంత ప్రవర్తనను ఖండిస్తున్నదని వాళ్ళు అర్థంచేసుకుంటారు; అది వారి సొంత పాపాలకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుందని, తీర్పులో వారిని నిలబెడుతుందని వారు అర్థంచేసుకుంటారు. వారు ఇది అబద్ధం అని పనికిరానిదని నమ్మడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే ఈ నిజాలను నమ్మడానికి వారు ఎంత మాత్రమూ ఇష్టపడరు కాబట్టి. బైబిల్ మీద చేయి వేసి, “దుర్మార్గపు జీవితమే ఈ గ్రంథానికి ఉన్న ప్రధానమైన అభ్యంతరం" అని లార్డ్ రాచెస్టర్ చెప్పాడు. "మనుషులు, క్రైస్తవ సత్యాన్ని ప్రశ్నిస్తారు. ఎందుకంటే దానిని అభ్యాసం చెయ్యడమంటే వాళ్ళకు అసహ్యం” అని రాబర్ట్ సౌత్ చెప్పారు.
యవ్వనస్థులారా, తన మాటను నిలబెట్టుకోవడంలో దేవుడు ఎప్పుడు విఫలమయ్యాడు? ఎప్పుడూ విఫలం కాలేదు. ఆయన చెప్పినవన్నీ చేసాడు; ఆయన ఏవైతే మాట్లాడాడో వాటిని ఆయన మంచికే చేసాడు. నోవహు జలప్రళయంలో ఆయన తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడా? లేదు. సొదొమ గొమొర్రాల్లో ఆయన తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడా? లేదు. ఆయనను నమ్మని యెరూషలేము విషయంలో విఫలమయ్యాడా? లేదు. ఆయన ఈ క్షణం వరకూ యూదుల విషయంలో విఫలమయ్యాడా? లేదు. ఆయన తన మాటను నెరవేర్చడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. దేవుని వాక్యాన్ని తృణీకరించే వారి మధ్య మీరు ఉండకుండా జాగ్రత్త వహించండి.
క్రైస్తవ్యాన్ని చూసి ఎప్పుడూ నవ్వకండి. పరిశుద్ధమైన విషయాలను ఎప్పుడూ అపహాస్యం చెయ్యవద్దు. తమ ఆత్మల గురించి గంభీరంగా శ్రద్ధగా ఉండేవారిని ఎప్పుడూ ఎగతాళి చెయ్యకండి. మీరు నవ్వి ఎగతాళిచేసినవారే సంతోషకరమైన జీవితాన్ని కలిగివుండే సమయం రావొచ్చు. మీ నవ్వు దుఃఖంగానూ మీ ఎగతాళి భారంగానూ మారే సమయమూ రావొచ్చు.
(5) యవ్వనస్థులు ఎదురయ్యే మరో ప్రమాదం: మనుషుల అభిప్రాయం గురించిన భయం.
"భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును” (సామె 29:25). మనుషుల అభిప్రాయం గురించిన భయం చాలామంది మనస్సులపై మరి ముఖ్యంగా యవ్వనస్థుల మనస్సులపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది, దాన్ని గమనించడం చాలా భయంకరమైన విషయం. కొందరికి వారి సొంత అభిప్రాయాలంటూ ఏమీ ఉండవు. వాళ్ళు తమ గురించి తాము ఆలోచించుకోరు. చనిపోయిన చేపల వలే వారు ప్రవాహంతో ఆటుపోట్లతో కొట్టుకుని పోతారు. ఇతరులు ఏది సరైనదని చెబితే దాన్ని వాళ్ళు కూడా సరైనదనే అనుకుంటారు; ఇతరులు దేన్ని తప్పు అని పిలిస్తే, వాళ్ళు కూడా దాన్ని తప్పు అనే పిలుస్తారు. ప్రపంచంలో అసలైన ఆలోచనాపరులు ఎక్కువ మంది లేరు. చాలామంది గొర్రెల వంటివారు, వాళ్ళు ఒక నాయకుణ్ణి అనుసరిస్తారు. రోమన్ కేథలిక్ లు కావడం ఆనాటి ఫ్యాషన్ ఐతే, వాళ్ళు రోమన్ కేథలిక్ లుగానూ, మహమ్మదీయులు కావడమే ఫ్యాషన్ ఐతే, వాళ్ళు మహమ్మదీయులుగానూ మారిపోతారు. ప్రవాహానికి ఎదురీదాలనే ఆలోచనకు వాళ్ళు భయపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాటి లోక అభిప్రాయమే వారి మతం, వారి విశ్వాస ప్రమాణం, వారి బైబిలు, వారి దేవుడు.
“నా స్నేహితులు నా గురించి ఏమనుకుంటారు?" అనే ఆలోచన మంచి కోరికను మొగ్గలోనే తుంచేస్తుంది. అందరూ నన్ను పరిశీలిస్తారేమో నన్ను చూసి నవ్వుతారేమో ఎగతాళి చేస్తారేమో అనే భయం చాలామందిని మంచి అలవాట్లను చేపట్టకుండా అడ్డుకుంటుంది. యజమానులు ధైర్యం చేసుంటే ఈ రోజు చదవబడే బైబిళ్ళు ఎన్నో ఉండేవి. బైబిల్ ను చదవాలని వారికి తెలుసు కానీ "ప్రజలు ఏమనుకుంటారో? అని వారికు భయం. “ఈ రాత్రే ప్రార్థనలో వంచే మోకాళ్ళు ఉంటాయి. అయితే మనుషుల భయం దానిని అడ్డుకుంటుంది. నేను ప్రార్థించడం చూస్తే “నా భార్య, నా భర్త నా సోదరుడు, నా స్నేహితుడు, నా సహచరుడు ఏమనుకుంటారో?" అనే భయం అతణ్ణి ప్రార్థించకుండా నిషేధిస్తుంది. వామ్మో, ఇది ఎంత నీచమైన బానిసత్వం, అయినప్పటికి ఇది సహజమైన విషయమే!
“సౌలు - జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా
ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని” (1 సమూ 15:24). “నేను యూదులకు భయపడుతున్నాను," అని యూదా రాజైన సిద్కియా చెప్పి యిర్మీయా ఇచ్చిన సలహాను ధిక్కరించాడు (యిర్మీయా 38:19). హేరోదు తన అతిథులు తన గురించి ఏమనుకుంటారో అని భయపడ్డాడు కాబట్టి అతడు బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించి "చాలా బాధను కలిగించే” పనిచేసాడు. పిలాతు యూదులను అడ్డగించడానికి భయపడ్డాడు. కాబట్టి అతడు తన మనస్సాక్షికి అన్యాయమని తెలిసినప్పటికీ యేసును సిలువ వేయడానికి అప్పగించాడు. ఇది బానిసత్వం కాకపోతే మరేంటి?
యవ్వనస్థులారా, మీరందరూ ఈ బానిసత్వం నుండి విముక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను. మీరు చెయ్యాలనుకునే పని సరైనదైనప్పుడు మీలో ప్రతి ఒక్కరూ మనుషుల అభిప్రాయాన్ని పట్టించుకోకూడదని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పేది నమ్మండి, “నాకు కుదరదు!” అని చెప్పగలగడం గొప్ప విషయం. ఇక్కడే మంచి రాజైన యెహోషాపాతులో ఒక బలహీనమైన విషయం ఉంది. అతడు అహాబుతో తన వ్యవహారాలలో చాలా తేలికగా లొంగిపోయాడు, అందువల్ల అనేక ఇబ్బందులకు గురయ్యాడు. (1 రాజులు 22:4). “నాకు కుదరదు!" అని చెప్పడం నేర్చుకోండి. మంచి మనసున్న వ్యక్తిగా ఇతరులకు కనబడకపోతే వాళ్ళు ఏమనుకుంటారనే భయం వల్ల “నాకు కుదరదు” అనే మాట మీరు చెప్పలేరు. పాపులు మిమ్మల్ని ప్రలోభపెట్టినప్పుడు, “నేను ఒప్పుకోను” అని నిశ్చయంగా చెప్పగలగాలి (సామెతలు 1:10).
మనిషికున్న ఈ భయం ఎంత అసమంజసమైనదో గమనించండి. మనిషి చూపే శత్రుత్వం ఎంతకాలం ఉంటుంది? అతడు మీకు చేసే హాని ఎంత తక్కువ? "చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా?” (యెషయా 51:12-13). ఈ భయం ఎంత కృతజ్ఞతలేనిది? దానినిబట్టి ఎవ్వరూ మీ గురించి గొప్పగా ఆలోచించరు. దేవుని నిమిత్తం ధైర్యంగా నిలబడేవారిని లోకం ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. ఈ బంధాలను తెంచుకోండి, మీ నుండి ఈ సంకెళ్ళను విసిరి కొట్టండి! మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారని మనుషులకు తెలియచెయ్యడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. మిమ్మల్ని మీరు దేవుని సేవకునిగా కనపరుచుకోవడం అవమానంగా భావించకండి. సరైన దానిని చెయ్యడానికి ఎప్పుడూ భయపడకండి.
ప్రభువైన యేసు మాటలను గుర్తుంచుకోండి: 'ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి” (మత్తయి 10:28). దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే ప్రయత్నించండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇతరులకు ఇష్టమైనవారిగా చేస్తాడు. "ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా, వానికి మిత్రులుగా చేయును” (సామెతలు 16:7).
యవ్వనస్థులారా, ధైర్యంగా ఉండండి. లోకం ఏమనుకుంటుందో అని చింతించకండి. మీరేమీ శాశ్వతంగా లోకంతో ఉండరు. మనిషి మీ ఆత్మను రక్షించగలడా? రక్షించలేడు! భయంకరమైన తీర్పు రోజున మనిషి మీకు న్యాయమూర్తిగా ఉంటాడా? ఉండడు! మనిషి ఈ జీవితంలో మీకు మంచి మనస్సాక్షిని కాని, మరణంలో మంచి నిరీక్షణ కాని, పునరుత్థానపు ఉదయాన మంచి జవాబును ఇవ్వగలడా? లేదు! లేదు! లేదు! మనిషి అలాంటిదేమీ చెయ్యలేడు. అందుకే “మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును. బొద్దీక గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికి వేయును” (యెషయా 51:7-8). కొలొనల్ గార్డినర్ గారి సామెతను గుర్తుంచు కోండి: "నేను దేవునికి భయపడుతున్నాను, అందువల్ల నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు." వెళ్లి, ఆయనలా ఉండండి.
ఇవే నేను మీకిస్తున్న శ్రేష్ఠమైన హెచ్చరికలు. వాటిని మీ హృదయంలో ఉంచుకోండి. అవి ఆలోచించదగినవి. అవి గొప్ప అవసరం అయ్యుండకపోతే నేను చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. అవి మీకు వృథాగా ఇవ్వబడలేదు, వాటిని ప్రభువే అనుగ్రహించాడు.
అధ్యాయం 3
యవ్వనస్థులకు కొన్ని సలహాలు
మూడవదిగా, యవనస్థులకు కొన్ని సామాన్యమైన సూచనలను ఇవ్వాలనుకుంటున్నాను.
(1) పాపం అనే దుష్టత్వం గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి ప్రయత్నించండి.
యవ్వనస్థులారా పాపం అంటే ఏంటో పాపం వల్ల ఏం జరిగిందో మీకు తెలిసి ఉంటే నేను మిమ్మల్ని హెచ్చరించే విషయాలు మీకు వింతగా అనిపించవు. పాపం యొక్క నిజస్వరూపాన్ని మీరు చూడలేదు. మీ కళ్ళు సహజంగానే పాపం వలన కలిగే అపరాధ భావనకు అపాయానికి మూసుకు పోయాయి. అందువల్లే మీ గురించి నేను ఆందోళన చెందడానికి గల కారణాన్ని మీరు అర్థంచేసుకోలేరు. అయ్యో, పాపం అనేది చిన్న విషయమని చెబుతూ సాతాను మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. దానిలో వాణ్ణి విజయం సాధించనివ్వొద్దు.
పాపం గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒక్కసారి ఆలోచించండి; సజీవులుగా ఉన్న ప్రతి స్త్రీ, పురుషుల హృదయంలో అది సహజంగా ఎలా నివసిస్తుందో ఆలోచించండి (ప్రసంగి 7:20, రోమా 3:23). మన ఆలోచనలను, మాటలను, చర్యలను నిరంతరం అదెలా అపవిత్రం చేస్తుందో ఆలోచించండి(ఆది 6:5, మత్తయి 15:19). అది పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో మనందరినీ ఎలా దోషులుగా అసహ్యంగా మారుస్తుందో ఆలోచించండి (యెషయా 64:6, హోషెయ 1:13). మనవైపు మనం చూసుకుంటే రక్షణ పొందేందుకు నిరీక్షణ లేనివారిగా అది మనల్ని ఎలా చేస్తుందో ఆలోచించండి (కీర్తన 143:2, రోమా 3:20). ఈ లోకంలో దాని ప్రతిఫలం అవమానకరమనీ రాబోయే లోకంలో దానివల్ల వచ్చే జీతం నిత్యమరణమనీ ఆలోచించండి (రోమా 6:21, 23). వీటన్నిటి గురించీ ప్రశాంతంగా ఆలోచించండి. ఈ రోజు నేను మీకు చెబుతున్న విషయాన్ని అర్థంచేసుకోండి. కేన్సర్ తో ఉన్న వ్యక్తి, ఆ వ్యాధి తనలో ఉందని తెలియకుండా చనిపోవటం వల్ల కలిగే బాధకంటే, కేన్సర్ తో జీవిస్తూ దాని గురించి తెలిసుకోకపోతేనే ఎక్కువ బాధ కలుగుతుంది.
పాపం మన స్వభావాలన్నింటిపై ఎంత దారుణమైన మార్పును తీసుకొచ్చిందో ఆలోచించండి. దేవుడు మనిషిని భూమిలోని మట్టిని తీసుకుని చేసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా లేడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు (ప్రసంగి 7:29). అతణ్ణి సృష్టించిన రోజున అతడు అన్నిటిలాగే “చాలా మంచివాడు” (ఆది 1:31). అయితే ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? అతడిప్పుడు ఒక పతనమైన జీవి, శిథిలమైన జీవి, అంతటా దుర్నీతి గురుతులను చూపించే జీవి. నెబుకద్నెజరువలే అతని హృదయం దిగజారిపోయింది, భూ సంబంధమైనది. అది పైకి చూడకుండా కిందున్న వాటినే చూస్తుంది. అతని వాంఛలు అస్తవ్యస్తమైన ఇంటిలాగా ఉంటాయి, అతడు ఏ మనిషినీ యజమాని అని పిలువడు, అన్నిటినీ దుబారాగా గందరగోళంగా చేస్తాడు. అతని అవగాహన చీకట్లోని దీపంలా మిణుకు మిణుకుమనేలా ఉంటుంది, అది అతనికి దారి చూపించలేదు. అతడు మంచి చెడులకు ఉన్న వ్యత్యాసం గురించి తెలుసుకోలేడు. అతని చిత్తం చుక్కాని లేని ఓడలాంటిది, అది ప్రతి విధమైన కోరిక చేత అటు ఇటు కొట్టుకుపోతూ ఉంటుంది, దేవుని మార్గం వైపు కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవడంలో స్థిరంగా ఉంటుంది. అయ్యో జీవితం ఎంత దారుణంగా విచ్ఛిన్నమైపోయిందో కదా! మనిషి ఎలా ఉన్నాడో ఒక చిత్రాన్ని ఆత్మ మనకు ఇవ్వవలసి వచ్చినప్పుడు, అంధత్వం, చెవిటితనం, వ్యాధి, నిద్ర, మరణం వంటి వాటిని ఉపయోగించడాన్ని మనం అర్థంచేసుకోవచ్చు. పాపం వల్లే మనిషి ఇప్పుడున్న స్థితిలో ఉన్నాడు.
పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యడానికి, పాపులకు క్షమాపణ అందించడానికి దేవుడు ఎంతగా వెల చెల్లించవలసి వచ్చిందో ఆలోచించండి. మన విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి, ధర్మశాస్త్రపు శాపం నుండి మనలను విడిపించడానికి దేవుని ప్రియకుమారుడు ఈ లోకంలోకి రావలసి వచ్చింది, మన పాపాన్ని ఆయన మోయవలసి వచ్చింది. తండ్రితో ఆది నుండి ఉన్నవాడు, సమస్తాన్ని సృష్టించినవాడు, నీతిమంతుడైన ఆయన అనీతిమంతుల కోసం శ్రమను అనుభవించవలసి వచ్చింది. ఏ ఒక్కరికైనా పరలోక మార్గం తెరవబడాలంటే ముందుగా నేరస్థునిలా ఆయన మరణించవలసి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు తృణీకరించబడి, తిరస్కరించబడి, కొరడాలతో కొట్టబడి, వెక్కిరించబడి, అవమానించబడ్డాడు. కల్వరి సిలువపై రక్తం చిందిస్తూ “నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని వేదనతో విలపిస్తున్న ఆయనను చూడండి. సూర్యుణ్ణి ఎలా చీకటి కమ్మిందో కొండలు రాళ్ళు ఎలా బద్దలయ్యాయో గమనించండి. యవ్వనస్థులారా, పాపం యొక్క దుష్టత్వం గురించి, దాని అపరాధం గురించి ఆలోచించండి.
భూమిపై ఇప్పటికే పాపం ఏం చేసిందో ఆలోచించండి. ఇది ఆదాము, హవ్వలను ఏదెను నుండి ఎలా తరిమివేసిందో ఆనాటి ప్రజలపై జల ప్రళయాన్ని ఎలా తీసుకొచ్చిందో సొదొమ గొమొర్రాలపై అగ్నిని ఎలా కురిపించిందో ఫరోను అతని సైన్యాన్ని ఎలా ఎర్ర సముద్రంలో ముంచి వేసిందో కనానులోని ఏడు దుష్టజాతులను ఎలా నాశనం చేసిందో భూమి మీద ఉన్న ఇశ్రాయేలు పన్నెండు గోత్రలవారిని ఎలా చెదరగొట్టిందో ఆలోచించండి. పాపం ఒక్కటే ఇదంతా చేసింది.
అంతేకాదు, ఈ రోజుకు కూడా పాపం వల్ల కలిగిన, కలుగుతున్న బాధలన్నిటి గురించీ దుఃఖం గురించీ ఆలోచించండి. బాధ, వ్యాధి, మరణం, కలహాలు, వివాదాలు, విభజనలు, అసూయ, దురాలోచనలు, ద్వేషం, మోసం, కక్షలు, పగ, హింస, అణచివేత, దోపిడీ, స్వార్థం, నిర్దయ, కృతఘ్నత; ఇవన్నీ పాపపు ఫలాలు. పాపమే వీటన్నిటికీ మూలం. దేవుని సృష్టి యొక్క అందాన్ని పాడు చేసింది పాపమే.
యవ్వనస్థులారా, ఈ విషయాలు ఆలోచించండి, అప్పుడు మేము ఎందుకిలా బోధిస్తున్నామో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోరు. ఖచ్చితంగా మీరు మేము చెప్పినవాటి గురించి ఆలోచిస్తే పాపంతో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటారు. మీరు విషంతోనూ నరకంతోనూ ఆటలాడతారా? మీరు నిప్పును చేతుల్లోకి తీసుకుంటారా? మీరు మీ బద్ధశత్రువును పక్కనే పెట్టుకుంటారా? మీ పాపాలు క్షమించబడినా క్షమించబడకపోయినా పాపం మీపై ఆధిపత్యం చెలాయించినా చెలాయించకపోయినా మీరు ఏమీ పట్టనట్టుగా జీవిస్తారా? అయ్యో, పాపం యొక్క దుర్మార్గత విషయంలో దాని ప్రమాద తీవ్రత విషయంలో మీరు మేల్కోండి. సొలొమోను మాటలను గుర్తుంచుకోండి: "మూఢులు చేయు అపరాధ పరిహారార్ధబలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు. పాపపరిహారము చేయుచు వెక్కిరింపజేస్తారు, అయితే యథార్థవంతులలో మంచితనము కనబడును” (సామె 14:9).
కాబట్టి, ఈ రోజు నేను మీ నిమిత్తం చేసే అభ్యర్థనను వినండి. దేవుడు మీకు “పాపం” యొక్క నిజమైన దుష్టత్వం గురించి బోధించమని ప్రార్థించండి. మీరు మీ ఆత్మను రక్షించుకునేలా, లేచి ప్రార్థించండి.
(2) మన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నించండి.
నిజానికి, క్రైస్తవ్యంలో ఇది ప్రధాన విషయం. ఇది క్రైస్తవ్యానికి మూలస్తంభం. ఇది మీకు తెలిసేంత వరకూ నా హెచ్చరికలూ సలహాలూ నిరుపయోగమే, మీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. సమయాన్ని చూపించలేని గడియారమూ క్రీస్తును చూపించలేని క్రైస్తవ్యమూ ఎందుకూ పనికిరావు.
కానీ నన్ను తప్పుగా అర్థంచేసుకోకండి. క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం అంటే ఆయన నామాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, కాని ఆయన కృపను, దయను, శక్తిని తెలుసుకోవడం, ఆయన గురించి చెవి ద్వారా వినడం కాదు కాని ఆయనను హృదయాల్లో అనుభవం ద్వారా తెలుసుకోవడం. విశ్వాసం ద్వారా మీరు ఆయనను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. "ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానాను భవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగవలెనని” చెప్పిన పౌలు మాదిరిగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను (ఫిలిప్పీ 3:10). “ఆయనే నా సమాధానం, నా బలం, నా జీవం, నా ఓదార్పు, నా వైద్యుడు, నా కాపరి, నా రక్షకుడు, నా దేవుడు" అని ఆయన గురించి మీరు చెప్పగలగాలని నేను కోరుకుంటున్నాను.
నేనెందుకు ఇలాంటి విషయాన్ని చెబుతున్నాను? ఎందుకంటే “క్రీస్తులోనే సర్వసంపూర్ణత నివసిస్తోంది” (కొలస్సీ 1:19). మన ఆత్మల అవసరాలకు కావలసినదంతా ఆయనలో మాత్రమే ఉంది. మనకు మనంగా పేదవారం, శూన్యులం, నీతి న్యాయాలు లేనివారం, శాంతీ నీతి లేనివారం, బలమూ ఆదరణా లేనివారం, ఈ దుష్ట ప్రపంచంలో నిలబడడానికి కాని ముందుకు సాగడానికి కాని పురోగతి సాధించడానికి కాని ఎలాంటి శక్తీ లేనివారం. కృప, సమాధానం, జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచన క్రీస్తులో మాత్రమే దొరుకుతాయి. మనం ఎంత ఎక్కువగా ఆయనపైన ఆధారపడతామో అంత బలమైన క్రైస్తవులమౌతాము. మనలో అహం శూన్యమైనప్పుడే, క్రీస్తునందు మనం విశ్వసించినప్పుడే, మనం గొప్పగా భక్తిలో ఎదుగుతాం. అప్పుడే మనం జీవితమనే యుద్ధానికి సాయుధులమై, జయిస్తాం. అప్పుడే మనం జీవిత ప్రయాణానికి సిద్ధమై, ముందుకు సాగుతాం. క్రీస్తుపై ఆధారపడి జీవించడం, క్రీస్తు దగ్గరనుంచే బలాన్ని పొందుకోవడం, క్రీస్తు బలంతోనే సమస్తాన్నీ చెయ్యడం, ఎల్లప్పుడూ క్రీస్తు వైపే చూడటం మన ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క నిజమైన రహస్యం. "నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలను” అని పౌలు చెప్పాడు (ఫిలిప్పీ 4:13).
యవ్వనస్థులారా, నేను ఈ రోజు యేసుక్రీస్తును మీ ఆత్మల నిధిగా మీ ముందుంచాను. ఆయన దగ్గరకు వెళ్ళడం ద్వారా మీ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ మొదటి అడుగు వేయండి, క్రీస్తు దగ్గరకు వెళ్ళండి. మీరు స్నేహితులను సంప్రదించాలనుకుంటున్నారా? ఆయన గొప్ప స్నేహితుడు: "సహోదరుని కంటే దగ్గరగా ఉండే స్నేహితుడు” (సామెతలు 18:24). మీ పాపాల వల్ల మీరు అయోగ్యులుగా భావిస్తున్నారా? భయపడవద్దు: ఆయన రక్తం పాపాలన్నింటినీ పవిత్ర పరుస్తుంది. 'నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమమువలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చువలె తెల్లనివగును” అని ఆయన చెబుతున్నాడు (యెషయా 1:18). మీరు బలహీనంగా భావిస్తూ ఆయనను అనుసరించలేకపోతున్నారా? భయపడవద్దు: దేవుని కుమారులుగా మారే శక్తిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీలో నివసించడానికి, మిమ్మల్ని తన సొత్తుగా ముద్రించడానికి ఆయన మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు; మీకు నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు, మీలో నూతన ఆత్మను ఉంచుతాడు. మీరు శ్రమలో ఉన్నారా? కొన్ని వింతైన బలహీనతలు మిమ్మల్ని ముట్టడించాయా? భయపడవద్దు: యేసు పారద్రోలలేని దురాత్మ అంటూ ఏదీ లేదు, ఆయన నయం చెయ్యలేని ఆత్మరోగం ఏదీ లేదు. మీకు సందేహాలు, భయాలు ఉన్నాయా? వాటిని పక్కన పడేయండి: “నా దగ్గరకు రండి,” అని, “నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎన్నటికీ త్రోసివేయను” అని ఆయన చెబుతున్నాడు.”
ఒక యవ్వనస్థుడి హృదయంలో ఏముంటుందో ఆయనకు బాగా తెలుసు. మీ శ్రమలు, మీ శోధనలు, మీ కష్టాలు, మీ శత్రువులు ఆయనకు తెలుసు. ఆయన శరీరధారిగా ఉన్న రోజులలో నజరేతులో ఒక యవ్వనస్థుడిగా మీలాగే ఉన్నాడు. కాబట్టి యవ్వనస్థుడి మనసు ఏంటో అనుభవపూర్వకంగా ఆయనకు తెలుసు. ఆయన మీ బలహీనతలను అర్థంచేసుకోగలడు. ఎందుకంటే ఆయన కూడా శోధించబడ్డాడు, ఆయన కూడా శ్రమలను అనుభవించాడు. మీరు అలాంటి రక్షకుణ్ణి, స్నేహితుణ్ణి వదులుకుంటే సాకులు చెప్పే అవకాశం మీకు ఖచ్చితంగా ఉండదు.
ఈ రోజు నేను మీ నిమిత్తం చేసే అభ్యర్థనను వినండి. మీరు జీవాన్ని ప్రేమిస్తే, యేసుక్రీస్తుతో సహవాసం పొందడానికి ప్రయత్నించండి.
(3) మీ ఆత్మకంటే ముఖ్యమైనది మరొకటి లేదని ఎప్పటికీ మర్చిపోకండి.
మీ ఆత్మ శాశ్వతమైనది. అది శాశ్వతంగా జీవిస్తుంది. లోకము, దానిలో ఉన్నవన్నీ గతించిపోతాయి. దృఢమైనవి, అందమైనవి, చక్కటివి క్రమబద్ధీక రించబడినవి అన్నిటి అంతం వస్తుంది. “అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును” (2 పేతురు 3:10). రాజనీతిజ్ఞుల, రచయితల, చిత్రకారుల, వాస్తుశిల్పుల రచనలు అన్నీ స్వల్ప కాలికం మాత్రమే: మీ ఆత్మ వాటన్నింటికంటే గొప్పది. దేవదూత స్వరం ఒక రోజు ప్రకటిస్తుంది, “ఇక ఆలస్యం ఉండదు!” (ప్రకటన 10:6).
మీ ఆత్మ జీవించడానికి విలువైనదనే వాస్తవాన్ని గ్రహించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది ఎల్లప్పుడూ మొదటిగా పరిగణించవలసిన విషయం. మీ ఆత్మను గాయపరిచే ఏ చోటైనా ఏ ఉపాధియైనా మీకు మంచిది కాదు. మీకున్న ఆత్మ సంబంధమైన ఆసక్తిపట్ల విశ్వాముంచని ఏ స్నేహితులూ ఏ సహచరులూ మీతో ఉండేందుకు అర్హులు కారు. మిమ్మల్ని, మీ ఆస్తిని, మీ పేరును పాడుచేసే వ్యక్తి మీకు తాత్కాలిక హాని మాత్రమే చేస్తాడు, అయితే మీ ఆత్మను దెబ్బతీయడానికి పన్నాగం పన్నినవాడే మీ నిజమైన శత్రువు.
మీరు ఈ లోకంలో ఎందుకు పుట్టారో ఒకసారి ఆలోచించండి. కేవలం తినడానికి, త్రాగడానికి, కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే కాదు, మీ శరీరాన్ని అలంకరించుకోవడానికో అది మిమ్మల్ని ఎక్కడికి నడిపించినా దాని కోరికలను తీర్చుకోవడానికి కాదు. కేవలం పని చేయడానికో నిద్రించ డానికో నవ్వడానికో మాట్లాడటానికో ఆనందించడానికో సమయం అయిపోతుందని ఆలోచించడానికో కాదు. మీరు వీటికంటే ఉన్నతమైన, మెరుగైన వాటికోసం సృష్టించబడ్డారు. మీరు నిత్యత్వం కోసం శిక్షణ పొందడానికి ఇక్కడ ఉంచబడ్డారు. మీ శరీరం మీ ఆత్మకు ఒక ఇల్లుగా మాత్రమే ఉద్దేశించబడింది. చాలామంది చేస్తున్నట్టుగా ఆత్మను శరీరానికి దాసునిగా చెయ్యడం కాకుండా, శరీరాన్ని ఆత్మకు దాసునిగా చెయ్యడమే దేవుని ఉద్దేశం.
యవ్వనస్థులారా, దేవుడు మనుషులపై పక్షపాతాన్ని చూపించడు, మనుషులు ఇచ్చే గౌరవాలనుబట్టి గౌరవించడు. ఆయన ఏ వ్యక్తి యొక్క వారసత్వాన్ని కాని సంపదను కాని, హోదాను కాని స్థానాన్ని కాని పరిగణించి ప్రతిఫలమివ్వడు. ఆయన మనిషి కళ్ళతో చూసేవాడు కాదు. ఆయన దృష్టిలో రాజభవనంలో మరణించిన అత్యంత ధనవంతుడైన పాపి కంటే పూరి గుడిసెలో మరణించిన అత్యంత పేదవాడైన పరిశుద్ధుడే గొప్పవాడు. దేవుడు ఐశ్వర్యాన్ని, బిరుదులను, విద్యను, అందాన్ని, మరి ఏ రకమైన వాటినీ లక్ష్యపెట్టడు. దేవుడు లక్ష్యపెట్టేది ఒక్కటే అదే ఆత్మీయ జీవితం. ఆయన మనుషులందరినీ ఒకే ప్రమాణంతో ఒకే కొలతతో ఒకే పరీక్షతో కొలుస్తాడు. అది వారి ఆత్మయ స్థితినిబట్టే.
ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆత్మ సంబంధమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోండి. మీరు ఆత్మీయతలో ఎదగాలనే కోరికతో ప్రతిరోజూ నిద్రలేవండి, నిజంగానే మీరు ఆత్మలో ఎదిగారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రతి సాయంత్రం నిద్రపోయే ముందు పరీక్షించుకోండి. పాతకాలంలో గొప్ప చిత్రకారుడైన జ్యూక్సిస్ ను గుర్తుంచుకోండి. "ఎందుకు ప్రతి చిత్రాన్ని గీయడానికి ఇంత తీవ్రంగా శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు" అని అతణ్ణి అడిగినప్పుడు, "నేను నిత్యత్వం కోసం పెయింటింగ్ వేస్తున్నాను" అని అతడు జవాబిచ్చాడు. అతని మాదిరిగా ఉండడానికి సిగ్గుపడకండి. మీ నిత్యత్వాన్ని మీ మనస్సు యొక్క కన్నుల ఎదుట ఉంచండి. మీరు ఎందుకు జీవిస్తున్నారని అడిగినప్పుడు, వారికి ఇలా జవాబు ఇవ్వండి, “నేను నా ఆత్మరక్షణ కోసం జీవిస్తున్నాను.” నన్ను నమ్మండి, మనుషులు ఆలోచించే ఆత్మీయంగా మారే రోజు వేగంగా వస్తోంది, అప్పుడు “నా ఆత్మ తప్పిపోయిందా లేదా రక్షించబడిందా?" అనే ప్రశ్న మాత్రమే ముఖ్యమైనది.
(4) యవ్వనస్థులుగా ఉండి దేవుణ్ణి సేవించడం సాధ్యమేనని గుర్తుంచుకోండి.
ఈ విషయంలో సాతాను మీ కోసం వేస్తున్న ఉచ్చులకు నేను భయపడుతున్నాను. యవ్వనంలో నిజమైన క్రైస్తవుడిగా ఉండడం అసాధ్యం అనే వ్యర్థమైన భావనతో మీ మనస్సులను నింపడంలో వాడు విజయం సాధిస్తాడని నేను భయపడుతున్నాను. ఈ భ్రమకు లోనైన చాలామందిని నేను చూశాను. “యవ్వనస్థుల నుంచి ఎంతో భక్తిని ఆశిస్తూ మీరు అసాధ్యమైనవాటిని కోరుతున్నారు. యవ్వనప్రాయం అనేది భక్తికి సంబంధించిన విషయాలను తీవ్రంగా ఆలోచించడానికి సమయం కాదు. మా కోరికలు చాలా బలంగా ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలని మీరు కోరుతున్నారు కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మమ్మల్ని హాయిగా ఆనందించమని సృష్టించాడు. భవిష్యత్తులో భక్తి చేయడానికి చాలా సమయం ఉంటుంది కదా” అని కొందరు చెప్పడం నేను విన్నాను. ఈ రకమైన అభిప్రాయాన్ని లోకం చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఈ లోకం యవ్వనస్థుల పాపాలను చూసీ చూడనట్టు విస్మరించడానికి సిద్ధంగా ఉంది. విచ్చలవిడిగా జీవించడం యవ్వనస్థులకు సహజం అన్నట్టు లోకం భావిస్తోంది. యవ్వనస్థులు భక్తిపరులుగా ఉండడం, క్రీస్తును అనుసరించడం సాధ్యం కాదని అనుకుంటూ ఈ లోకం దానిని తేలికగా తీసుకుంటోంది.
యవ్వనస్థులారా నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలను కుంటున్నాను. దేవుని వాక్యంలో ఇలాంటి భావన ఎక్కడ ఉంది? లోకం గురించి, లోకపోకడల గురించి చెప్పే అధ్యాయం కానీ వచనం కానీ బైబిల్లో ఎక్కడ ఉంది? ఎలాంటి వ్యత్యాసమూ చూపించకుండా బైబిల్ పెద్దలతోనూ యవ్వనస్థులతోనూ మాట్లాడదా? పాపం, ఇరవై ఏళ్ళ వయస్సులో చేసినా యాభై ఏళ్ళ వయస్సులో చేసినా, పాపం కాదా? తీర్పు రోజున, “నేను పాపం చేశానని నాకు తెలుసు, కాని నేను అప్పుడు చిన్నవాడిని కదా?” అని మనుషులు చెప్పే ఇలాంటి వ్యర్థమైన సాకులు ఏమైనా మేలు చేస్తాయా? కాబట్టి ఇలాంటి వ్యర్థమైన సాకులను వదిలిపెట్టి మీ ఇంగితజ్ఞానాన్ని చూపండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు తప్పొప్పులను తెలుసుకున్న క్షణం నుండే దేవునికి జవాబుదారులుగా ఉంటారు.
మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయని నాకు బాగా తెలుసు. మంచి మార్గంలో ఎల్లప్పుడూ ఇబ్బందులు ఉంటాయి. మనం చిన్నవారమైనా పెద్దవారమైనా పరలోకానికి వెళ్ళే మార్గం ఎప్పుడూ ఇరుకైనదే. ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించే కృప దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు కఠినమైన యజమాని కాడు. గడ్డి లేకుండా ఇటుకలు తయారు చెయ్యమని ఆదేశించిన ఫరో లాగా ఆయన మిమ్మల్ని కోరడు. మనం నడవాలని ఆయన కోరుతున్న మార్గం ఎన్నటికీ అసాధ్యమైన మార్గం కాదని ఆయన నిర్ధారణ చేస్తాడు. ఆచరించగలిగే శక్తినివ్వకుండా మనిషికి ఆయన ఏ ఆజ్ఞలూ ఇవ్వడు. ఇబ్బందులు ఉంటాయి, కానీ చాలామంది యవ్వనస్థులు గతంలో వాటిని అధిగమించారు కాబట్టి మీరు కూడా అలానే అధిగమించవచ్చు.
మోషే మీలాంటి అభిరుచులు కలిగిన యవ్వనస్థుడే; కానీ లేఖనాల్లో అతని గురించి ఏమి చెప్పబడిందో చూడండి: “మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను” (హెబ్రీ 11:24-26). దానియేలు బబులోనులో దేవుణ్ణి సేవించడం ప్రారంభించినప్పుడు యవ్వనస్థుడే. అతని పక్షంగా ఉన్నవాళ్ళు కొద్దిమందే అతనికి విరోధంగా ఉన్నవాళ్లు అనేకులు. అయినప్పటికీ దానియేలు జీవితం చాలా నిర్దోషంగానూ స్థిరంగానూ ఉంది, అతని శత్రువులు కూడా అతనిలో ఏ తప్పునూ కనుగొనలేకపోయారు. “అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమనుకొనిరి” (దాని 6:5).
ఇవి మాత్రమే కాదు. నేను పేరు పెట్టగల సాక్షుల సమూహం ఉంది. యవ్వనస్థుడైన ఇస్సాకు, యవ్వనస్థుడైన యోసేపు, యవ్వనస్థుడైన యెహోషువ, యవ్వనస్థుడైన సమూయేలు, యవ్వనస్థుడైన దావీదు, యవ్వనస్థుడైన సొలొమోను, యవ్వనస్థుడైన అబీయా, యవ్వనస్థుడైన ఓబద్యా, యవ్వనస్థుడైన యోషియా, యవ్వనస్థుడైన తిమోతి తదితరుల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. వీరేమీ దేవదూతలు కాదు, మీలాంటి సహజ హృదయాలు కలిగిన మనుషులే. మీలాగే అధిగమించవలసిన అడ్డంకులు, చంపవలసిన పాపేఛ్ఛలు, భరించవలసిన శ్రమలు వాళ్ళకు కూడా ఉండేవి. అయితే చిన్న వయస్సులో ఉన్నప్పటికీ వారందరూ దేవుణ్ణి సేవించడం సాధ్యమని కనుగొన్నారు. "లేదు, అది సాధ్యం కాదు" అని మీరు పట్టుదలగా ఉంటే, వారంతా తీర్పులో లేచి మిమ్మల్ని ఖండించరా?
యవ్వనస్థులారా, దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నించండి. అది అసాధ్యం అని గుసగుసలాడే అపవాదిని ఎదిరించండి. ప్రయత్నించండి, వాగ్దానాలు చేసిన దేవుడే మీ ప్రయత్నాల్లో మీకు బలాన్నిస్తాడు. ఆయన తన దగ్గరకు రావడానికి కష్టపడే వారిని చూసి ఇష్టపడతాడు, ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడు, మీకు అవసరమైన శక్తినిస్తాడు. జాన్ బన్యన్ రచించిన "యాత్రికుని ప్రయాణం” అనే కావ్యంలో “క్రైస్తవుడు” అనే వ్యక్తి ఉంటాడు. అతడు తన ప్రయాణంలో “వివరణ కర్త యొక్క గృహానికి చేరుకుంటాడు. ఆ గృహంలో క్రైస్తవుడు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఒక సుందరమైన రాజ సౌధంలోనికి ప్రవేశించాలని బయలుదేరి “నా పేరు నమోదు చేసుకోండి" అని ఆ రాజ సౌధపు ద్వారం దగ్గర కూర్చున్న వ్యక్తికి చెప్పి, తన ఒరలో ఉన్న కత్తిని చూసి ఆ ద్వారం దగ్గర తనకు అడ్డుగా నిలబడిన వాళ్లందరి పైన విరుచుకుపడి ఆ రాజ సౌధంలోనికి ధైర్యంగా ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి మాదిరిగా మీరు దేవుని రాజ్యానికి ఎదురుపడే ఆటంకాలను ధైర్యంగా జయించండి. మన ప్రభువు పలికిన ఈ కింది మాటలు ఎంతో నిజమైనప్పటికి హృదయం లేని, భావరహితమైన స్థితిలో వాటిని పదేపదే అనేకమంది ప్రస్తావించడం వింటున్నాను: “అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును” (మత్తయి 7:7).
పర్వతాల మాదిరిగా అనిపించే కష్టాలు వసంతకాలంలో మంచులా కరిగిపోతాయి. ఆటంకాలు పొగ మంచు వలన మీకు రాక్షసుల్లా కనబడినా మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఏమీ లేకుండా తగ్గిపోతాయి. మీరు ప్రయాణించే మార్గాన్ని అడ్డుకుని, మీకు తీవ్ర భయాన్ని కలిగించే సింహం, గొలుసుతో బంధించబడి ఉంది. మనుషులు వాగ్దానాలను ఎక్కువగా విశ్వసిస్తే, వారు తమకు అప్పగించిన విధులకు ఎన్నటికీ భయపడరు. కానీ నేను మీకు నొక్కిచెబుతున్న చిన్న మాటలను గుర్తుంచుకోండి. "నువ్వు యవ్వనంలో ఉండగా క్రైస్తవునిగా ఉండలేవు" అని సాతాను చెప్పినప్పుడు, “సాతానా, నా వెనుకకు పో. దేవుని సహాయంతో నేను ప్రయత్నిస్తాను" అని మీరు వాడికి జవాబు చెప్పండి.
(5) మీరు జీవించి ఉన్నంత కాలం బైబిల్ ను మీ మార్గదర్శిగా, సలహాదారుగా చేసుకోవాలని తీర్మానించుకోండి.
బైబిల్ అనేది పాపి యొక్క ఆత్మరక్షణ కోసం దేవుని దయగల ఏర్పాటు, మనిషి నిత్యజీవాన్ని పొందాలంటే బైబిల్ అతనికి మార్గాన్ని చూపించే దిక్సూచి. సమాధానంగా పరిశుద్ధంగా సంతోషంగా జీవించడానికి మనం తెలుసుకోవలసినవన్నీ అందులో సమృద్ధిగా ఉన్నాయి. ఒక యువకుడు తన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోవాలనుకుంటే అతడు దావీదు చెప్పేది వినాలి: "యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?” (కీర్తన119:9).
యవ్వనస్థులారా, బైబిలు చదవడం అలవాటు చేసుకోమని, ఆ అలవాటును వదులుకోవద్దని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. స్నేహితుల హేళనలను కాని, మీ కుటుంబంలోని దురాచారాలను కాని మీ బైబిల్ అధ్యయనాన్ని ఆపేందుకు అనుమతించవద్దు. మీరు బైబిల్ ను కలిగి ఉండాలనే కాదు, దానిని చదవాలని కూడా తీర్మానించుకోండి. బైబిల్ అనేది సండే స్కూల్ పిల్లల నిమిత్తం, వృద్ధుల నిమిత్తం మాత్రమే ఉన్న గ్రంథమని మిమ్మల్ని ఒప్పించడానికి ఏ వ్యక్తినీ అనుమతించవద్దు. రాజైన దావీదుకు ఈ గ్రంథం వల్లే జ్ఞాన వివేకాలు కలిగాయి. యవ్వనస్థుడైన తిమోతికి చిన్నప్పటి నుండి తెలిసిన గ్రంథం ఇదే. దానిని చదవడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. వాక్యోపదేశాన్ని అపహాస్యం చెయ్యకండి (సామెతలు 13:13).
వాక్యాన్ని అర్థంచేసుకోవడానికి పరిశుద్ధాత్మ కృప కోసం ప్రార్థిస్తూ బైబిల్ చదవండి. "మనిషి కళ్ళు లేకుండా లేఖనాన్ని చదవగలిగితే కృప లేకుండానే దానిలోని భావాన్ని అర్థంచేసుకోగలడు” అని బిషప్ బెవరిడ్జ్ చక్కగా చెప్పాడు. వాక్యం ఆమోదించేది ఏదైనా సరైనదని, వాక్యం ఖండించేది ఏదైనా అది తప్పు అని నమ్ముతూ అది మనుషుల మాటన్నట్టు కాకుండా దేవుని వాక్యం అని భక్తితో చదవండి. లేఖనాల పరీక్షకు నిలబడని ప్రతీ సిద్ధాంతం తప్పు అని చాలా ఖచ్చితంగా చెప్పండి. అది మిమ్మల్ని ఈ చివరి రోజుల్లో ప్రమాదకరమైన అభిప్రాయాల వలన అటూ ఇటూ కొట్టుకొని పోకుండా కాపాడుతుంది. మీ జీవితంలో లేఖనాలకు విరుద్ధమైన ప్రతి అభ్యాసం పాపమని, దానిని తప్పక వదిలివేయాలని చాలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. ఇది చాలామంది మనస్సాక్షికి సంబంధించిన ప్రశ్నలకు పరిష్కారం చూపిస్తుంది. అలాగే అనేక చిక్కు సమస్యల ముడిని విప్పుతుంది.
యూదాకు చెందిన ఇద్దరు రాజులు దేవుని వాక్యాన్ని ఎలా విభిన్నంగా చదివారో గుర్తుంచుకోండి: యెహోయాకీము దానిని చదివాడు, వెంటనే ఆ గ్రంథాన్ని చాకుతో కోసి, దానిని అగ్నిలో కాల్చాడు (యిర్మీయా 36:23). ఎందుకు? ఎందుకంటే అతని హృదయం దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది, దానికి విధేయత చూపకూడదని దృఢ నిశ్చయం చేసుకున్నాడు కాబట్టి. కానీ యోషీయా దానిని చదివి, వెంటనే తన బట్టలు చింపుకొని, యెహోవాకు ఎలుగెత్తి మొరపెట్టాడు (2 దిన 34:19). ఎందుకు? ఎందుకంటే అతని హృదయం మృదువుగా, విధేయతతో ఉంది కాబట్టి. తన కర్తవ్యమని లేఖనం చెప్పే దేనినైనా చెయ్యడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఈ ఇద్దరిలో మొదటి వ్యక్తిని కాకుండా చివరి వ్యక్తిని అనుసరిస్తే మీకు ఎంత మేలు! వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవండి. "లేఖనాలలో ప్రవీణులు” కావడానికి ఇదే ఏకైక మార్గం (అపొ.కా. 18:24). బైబిల్ ను కంగారుగాను, అప్పుడప్పుడు చదవడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలా చదివితే దానిలోని నిధుల గురించి మీకు అవగాహన ఎన్నటికీ కలగదు, యుద్ధ ఘడియలో మీ చేతికి అమర్చబడిన ఆత్మ ఖడ్గాన్ని మీరెన్నడూ ఉపయోగించుకోలేరు. కానీ శ్రద్ధగా చదవడం ద్వారా మీ మనస్సును వాక్యంతో నింపుకోండి. అప్పుడు మీరు దాని విలువను, శక్తిని త్వరలోనే కనుగొంటారు. శోధన సమయంలో మీ హృదయాలలోకి కొన్ని వాక్యభాగాలు చొచ్చుకు వస్తాయి. సందేహ సమయాల్లో ఆజ్ఞలు తమను తాము మీకు కనపరచుకుంటాయి. నిరుత్సాహానికి గురైన సమయంలో మీ ఆలోచనల్లోకి వాగ్దానాలు వస్తాయి. “నేను నీకు విరోధముగా పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొనియున్నాను" అనే దావీదు మాటలోని సత్యాన్ని మీరు అనుభవిస్తారు (కీర్తన 119:11); సొలొమోను మాటలలో, "నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును” (సామె6:22).
ఇది చదివే యుగం కాబట్టి నేను ఈ విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నాను. పుస్తకాల ముద్రణకు అంతం లేదు, అయితే వాటిలో కొన్ని మాత్రమే నిజంగా లాభదాయకంగా ఉంటాయి. ముద్రణ, ప్రచురణ చౌకగా ఉండడం వల్ల పుస్తకాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. అన్ని రకాల వార్తాపత్రికలు పుష్కలంగా ఉన్నాయి. అవి విస్తృత ప్రచురణను కలిగి ఉన్నప్పటికీ కొన్ని ఈ యుగానికి ఉన్న చెడు అభిరుచి గురించి తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య నేను నా యజమాని గ్రంథాన్ని చదవమని నేను మిమ్మల్నందరినీ వేడుకుంటున్నాను, ఆత్మకు సంబంధించిన గ్రంథాన్ని మరచిపోవద్దని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. ప్రవక్తలను, అపొస్తలులను తృణీకరిస్తూ వార్తాపత్రికలను, నవలలను, ప్రేమకథలను చదవకండి. మీకు క్షేమాభివృద్ధి కలిగించే, మిమ్మల్ని పవిత్రపరిచే పుస్తకాలకు మీ మనస్సుల్లో స్థానాన్నివ్వండి! ఉద్రేకాన్ని రెచ్చగొడుతూ సంచలనాత్మకమైన సంగతులున్న పుస్తకాలకు మీలోని ఆసక్తిని మింగేసే అవకాశమివ్వకండి.
యవ్వనస్థులారా, మీరు జీవించే ప్రతి రోజులోనూ బైబిలుకు తగిన గౌరవాన్ని ఇవ్వండి. అన్నింటికంటే ముందుగా బైబిల్ చదవండి. చెడు పుస్తకాల పట్ల జాగ్రత్త వహించండి: ఈ రోజుల్లో పుస్తకాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్త వహించండి. చాలామందికి ఈ విధంగా ఆత్మలకు ఎక్కువ హాని జరుగుతుందని నేను ఆందోళన చెందుతున్నాను. లేఖనాలకు అనుగుణంగా ఉన్న పుస్తకాలను మాత్రమే విలువైన వాటిగా ఎంచండి. బైబిల్ కి దగ్గరగా ఉన్నవి ఉత్తమమైనవి, దానికి దూరంగాను విరుద్ధంగాను ఉన్నవి చెత్త లాంటివి.
(6) దేవునికి స్నేహితుడు కాని ఏ ఒక్కడినీ మీకు సన్నిహితమైన మిత్రునిగా ఎన్నడూ చేసుకోవద్దు.
నేను చెప్పేది అర్థంచేసుకోండి. స్నేహితులే అవసరం లేదని నేను చెప్పట్లేదు. నిజమైన క్రైస్తవులతో తప్ప ఎవ్వరితోనూ స్నేహం చేయవద్దని నేను చెప్పట్లేదు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఈ లోకంలో సాధ్యం కాదు, కోరతగినది కాదు. అయితే స్నేహితులను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని నేను మీకు సలహా ఇస్తున్నాను. కేవలం ఒక వ్యక్తి తెలివైనవాడని, అన్నింటినీ అంగీకరించేవాడని, మంచి మనసున్నవాడని, చురుగ్గా ఉండేవాడని, దయగలవాడని మీ హృదయమంతటిని అతని ముందు తెరవకండి. ఈ విషయాలన్నీ మంచివే కానీ ఇవే సమస్తము కాదు. మీ ఆత్మకు ప్రయోజనకరం కాని ఏ వ్యక్తి స్నేహంతోనూ మీరు ఎన్నడూ సంతృప్తి చెందవద్దు.
నన్ను నమ్మండి, ఈ సలహా యొక్క ప్రాధాన్యతను మీరు తక్కువ అంచనా వేయవద్దు. భక్తిహీనులైన సహచరులతో స్నేహితులతో కలిసి ఉండడం వల్ల జరిగే హాని గురించి వివరించడం వల్లపడదు. ఒకని ఆత్మను నాశనం చెయ్యడానికి అపవాది చేసే సహాయాలు కొన్ని ఉన్నాయి. వాడికి అవకాశమిస్తే వాడికి విరోధంగా మీరు ధరించిన సర్వాంగ కవచాన్ని వాడు ఏ మాత్రమూ పట్టించుకోడు. భక్తిహీనులైన స్నేహితులను మీరు హత్తుకున్నంత కాలం మంచి చదువు, నైతిక విలువలు, ప్రసంగాలు, పుస్తకాలు, తల్లిదండ్రుల ఉత్తరాలు మొదలైనవేవీ పెద్దగా ప్రయోజనకరం కావని వాడికి తెలుసు. మీరు ఎన్నో శోధనలను ఎదిరించవచ్చు, స్పష్టమైన ఉచ్చులను ఎన్నో మీరు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క చెడ్డ స్నేహితుణ్ణి మీరు ఎంచుకుంటే సాతాను గాడు సంతృప్తి చెందుతాడు. తామారుతో అమ్నోను యొక్క దుష్ప్రవర్తనను వివరించే ఆ భయంకరమైన అధ్యాయం ఈ మాటలతో మొదలౌతుంది: “అమ్నోనునకు మిత్రుడొకడుండెను... అతడు బహు కపటము గలవాడు” (2 సమూ 13:3).
మనందరం కూడా విన్న మాటలు నుంచి కంటే చూసిన చేష్టలనుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. ఉపదేశం మనకు నేర్పించవచ్చు కానీ ఆదర్శం మనల్ని ఆకర్షిస్తుంది. మనం ఎవరితోనైతే జీవిస్తామో ఎల్లప్పుడూ వారి మార్గాలనే అనుసరించడానికి ప్రయత్నిస్తాము. మనం వారిని ఎంతగా ఇష్టపడతామో అంత బలంగా వారి స్వభావంతోనే ఎదుగుతాము. మనకు తెలియకుండానే వాళ్ళు మన అభిరుచులను అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. వారికి మరింత ఆప్త మిత్రులుగా ఉండడానికి వాళ్ళకు నచ్చని వాటిని నెమ్మదిగా మనం కూడా విడిచి పెడతాం, వాళ్ళకు నచ్చే వాటిని చేపడతాం. వాళ్ళు చేసే మంచి పనులను చెడ్డ పనులను చూస్తూ వాటిలో చెడ్డవాటినే ఎంతో వేగంగా మనం చేపడతాం. వ్యాధి అంటినంత వేగంగా ఆరోగ్యం ఇతరులనుంచి అంటుకోదు. చెడ్డ స్నేహితులతో సమయం గడుపుతూ ఉంటే భక్తిలో ఎదుగుదల రాదు, భ్రష్టత్వమే వస్తుంది.
యవ్వనస్థులారా, ఈ విషయాలను మీ హృదయానికి హత్తుకోమని మీకు మనవి చేస్తున్నాను. ఎవరినైనా మీ స్థిరమైన సహచరునిగా చేసుకునే ముందు, ప్రతీదీ అతనితో పంచుకునే అలవాటు చేసుకునే ముందు, మీ సుఖదుఃఖాలలో అతని దగ్గరకు వెళ్ళడానికి ముందు నేను చెబుతున్న విషయాల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. "ఇతనితో స్నేహం నాకు ప్రయోజనకరంగా ఉంటుందా? ఉండదా?" అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.
"దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది" (1 కొరింథీ 15:33). ఈ వచనాన్ని పుస్తకాల్లో రాయడం కంటే హృదయాల్లో ఎక్కువగా రాసుకోవాలని నేను కోరుతున్నాను. మనకు కలిగే అత్యంత గొప్పదైన ఆశీర్వాదాల్లో మంచి స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ళు మనల్ని దుష్టత్వం నుంచి దూరంగా ఉంచుతారు, మన విశ్వాస యాత్రలో మనల్ని పురికొల్పుతారు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆదరణకరమైన మాటలు పలుకుతారు, పరలోకం వైపు మనల్ని అడుగులు వేయిస్తారు. అయితే చెడ్డ స్నేహితుడు మనల్ని నిరంతరం కిందకు లాగే భారం లాంటివాడు. మనల్ని పాపానికి కట్టేస్తాడు. భక్తిహీనుడితో సహవాసం చేస్తే చివరికి మీరు కూడా అతని మాదిరిగానే తయారవుతారు. అలాంటి స్నేహాలన్నింటి సాధారణ ఫలితం అదే. చెడ్డ స్నేహాల వల్ల మంచివాళ్ళు చెడుగా మారిపోతారే కాని చెడ్డవాళ్ళు మంచిగా మారిపోరు. పదేపదే నేలకేసి కొడుతూ ఉంటే రాయి ఐనా చివరికి పగిలిపోతుంది. “మన దేహం మీద వస్త్రాలు, మన చుట్టూ ఉండే స్నేహితులు మన స్వభావం గురించిన నిజమైన సంగతులు చెబుతారు” అనే లోక సామెతలో వాస్తవం ఉంది. “ఒక వ్యక్తి ఎవరితో జీవిస్తాడో నాకు చూపించండి, అతడు ఎలాంటి వాడో నేను మీకు చూపిస్తాను” అని స్పానియార్డ్స్ చెబుతారు.
నేను ఈ అంశాన్ని ఎక్కువగా చర్చిస్తున్నాను. ఎందుకంటే జీవితంలో ఇది మొదట మీకు కనిపించిన దాని కంటే విలువైనది. మీరు వివాహం చేసుకుంటే మీ స్నేహితులలో మీకు పరిచయమైన వారినే మీకు భార్యగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము అహాబు యొక్క కుటుంబంతో స్నేహాన్ని ఏర్పరచుకొని ఉండకపోతే అతడు అహాబు యొక్క కుమార్తెను పెళ్ళి చేసుకుని ఉండేవాడు కాదు. వివాహంలో సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంలోని ప్రాధాన్యతను ఎవరు తక్కువ అంచనా వేయగలరు? "ఒక వ్యక్తి జీవితాన్ని ఆ నిర్ణయం వర్ధిల్లేలా చేస్తుంది, లేదా వ్యర్థమయ్యేలా చేస్తుంది" అని చెప్పే ఒక పురాతన సామెత ఉంది. రెండు జీవితాల్లోనూ మీ సంతోషం ఆ నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది. నీ భార్య ఐతే నీ ఆత్మకు సహకారిగా ఉంటుంది లేదా హాని చేస్తుంది. మధ్యస్థ స్థితి ఏదీ ఉండదు. భక్తి అనే జ్వాలలు నీ హృదయంలో ఎల్లప్పుడూ మండేలా ఆమె చేస్తుంది లేదా వాటిపై చల్లటి నీళ్లు కుమ్మరించి వాటిని ఆర్పేస్తుంది. ఆమె స్వభావాన్ని బట్టి ఆమె నీకు రెక్కలు ఇచ్చి ఎగిరేలా చేస్తుంది, లేదా సంకెళ్ళతో నిన్ను కట్టిపడేస్తుంది. మంచి భార్య దొరికిన వానికి మేలు దొరకును (సామె 18:22). అందువల్లనే స్నేహితులను ఎంచుకునే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలో మీరు నన్ను అడుగుతారా? మీ ఆత్మకు ప్రయోజనం చేకూర్చే మీరు నిజంగా గౌరవించే, మీ మరణ పడక మీద మీకు దగ్గరగా ఉండాలని మీరు కోరుకునే బైబిల్ ను ప్రేమించే దాని గురించి మీతో మాట్లాడడానికి భయపడని, క్రీస్తు రాకడలో తీర్పుదినాన మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గుపడనక్కరలేని స్నేహితులను మీరు ఎంచుకోండి. దావీదు మీ ముందుంచిన ఆదర్శాన్ని అనుసరించండి. "నీ యందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను" అని అతడు అంటున్నాడు (కీర్తన 119:63). సొలొమోను యొక్క మాటలను గుర్తుంచుకోండి: "జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును" (సామె 13:20). రాబోయే లోకంలో అసహ్యమైన స్నేహాలను పొందుకునే ఖచ్చితమైన మార్గం, ఈ లోకంలో చెడు స్నేహాలే.
అధ్యాయం 4
యవ్వనస్థుల కోసం ప్రత్యేక నియమాలు
చివరిగా, నేను కొన్ని ప్రత్యేకమైన ప్రవర్తనా నియమాలను సూచిస్తాను.
వీటిని అనుసరించాలని యవ్వనస్థులందరికి నేను గట్టి సలహా ఇస్తున్నాను.
(1) దేవుని సహాయంతో తెలిసిన ప్రతి పాపాన్ని అది ఎంత చిన్నదైనప్పటికీ సరే దాన్ని మానుకోవడానికి ప్రయత్నించండి.
మీలో ప్రతి ఒక్కరు మీ అంతరంగాన్ని పరిశీలించుకోండి. మీ సొంత హృదయాలను పరీక్షించుకోండి. దేవుని దృష్టిలో తప్పు, అని మీకు తెలిసిన ఏదైనా అలవాటు, ఆచారం మీ హృదయంలో ఉన్నట్టు మీకు కనిపిస్తోందా? అలాగైతే, దానిపైన దాడి చెయ్యడానికి ఒక్కక్షణం కూడా ఆలస్యం చెయ్యకండి. దాన్ని వెంటనే విడిచి పెట్టడానికి తీర్మానించుకోండి.
మనం మన జీవితంలో అనుమతించే పాపం కంటే ఎక్కువగా మనో నేత్రాలను చీకటిగా చేసేది, మనస్సాక్షిని చంపేది ఏదీ లేదు. అది చిన్న పాపం కావొచ్చు, కానీ అది చేసే ప్రమాదం చిన్నది కాదు. ఒక చిన్న రంధ్రం, ఒక పెద్ద ఓడను ముంచేస్తుంది, ఒక చిన్న నిప్పురవ్వు ఒక గొప్ప అడవిని తగలబెట్టేస్తుంది, తేలికగా తీసుకునే పాపం అమర్త్యమైన ఆత్మను నాశనం చేస్తుంది. నా సలహాను వినండి, పాపం చిన్నదే అయినా దాన్ని ఎన్నటికీ వదిలిపెట్టవద్దు. చిన్న, పెద్ద అని వ్యత్యాసం లేకుండా కనానీయులలో ప్రతి ఒక్కరిని చంపమని ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు, అదే సూత్రం ప్రకారం మీరు కూడా పని చేయండి, చిన్న పాపాలకు దయ చూపకండి. “మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి” (పరమ2:15).
ఏ దుర్మార్గుడైనా తాను చివర్లో ఉన్నంత దుర్మార్గంగా తన ప్రారంభంలో ఉండడు. కానీ అతడు తనకు తానుగా కొన్ని చిన్న పాపాలను అనుమతిస్తూ కొనసాగడంవల్ల, అది గొప్ప ప్రమాదానికి దారితీసి, కాలక్రమేణా ఇంకా చెడుతనంలోకి వెళ్ళి చివరికి చాలా నీచమైన జీవిగా మారతాడు. హజాయేలు ఎలీషా నుండి ఒక రోజున తాను చేయబోయే భయంకరమైన చర్యల గురించి విన్నప్పుడు, ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, "అందుకు హజాయేలు - కుక్కవంటి వాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటివాడను?” (2 రాజులు 8:13). కానీ అతడు తన హృదయంలో పాపం పాతుకుపోయేలా అనుమతించాడు కాబట్టే చివరికి అతడు ఆ పాపాలన్నింటిని చేయగలిగాడు.
యవనస్థులారా, పాపాన్ని దాని ప్రారంభ సమయాలలోనే ఎదిరించండి. అవి చిన్నవిగా బలహీనమైనవిగా కనిపించవచ్చు, కానీ నేను చెప్పేది వినండి, వాటిని మాత్రం ఎదిరించండి, రాజీపడకండి. ఏ పాపాన్నీ మీ హృదయంలో నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండనివ్వకండి. “మోసం అనేది అత్యంత సూక్ష్మ రూపంలోనే మన జీవితంలో ప్రవేశించి అతిపెద్ద హాని చేస్తుంది.” సూది బెజ్జం కంటే చిన్నదేదీ లేదు, కానీ అదే బెజ్జం నుండి దారం మొత్తం వెళ్తుంది. "పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?" (1కొరింథీ 5:6).
చాలామంది యవ్వనస్థులు బాధతో అవమానంతో “తాము నాశనం కావడానికి అసలు కారణం, ప్రారంభంలో పాపాన్ని చులకనగా చూసి దాన్ని అనుమతించడమేనని” చెబుతున్నారు. చిన్న విషయాలలో మోసం, అవినీతి వంటి అలవాట్లను ప్రారంభిస్తారు, అవి కాలక్రమేణా పెరిగి పెద్దవవుతాయి. వాళ్ళు కొద్దికొద్దిగా చెడుతనం నుంచి దుర్మార్గత వైపు అడుగులు వేసి ఒకనాడు అసాధ్యమని అనుకున్న పనులను సహితం చేసేంత వరకు దిగజారతారు. ఫలితంగా వాళ్ళు తమ స్థానాన్ని శీలాన్ని ఆదరణను చివరికి తమ ఆత్మను పోగొట్టుకుంటారు. వారు తమకూ మనస్సాక్షికీ ఉన్న మధ్య గోడకు సందును అనుమతిస్తారు. మొదట అది చిన్నదిగా అనిపిస్తుంది. ఒక్కసారి దానిని అనుమతించిన తర్వాత, ఆ సందు ప్రతిరోజూ పెద్దదిగా ఔతూ కాలక్రమేణా గోడ కూలిపోయే పరిస్థితి వస్తుంది.
"మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును” (లూకా 16:10). ఈ వాక్యాన్ని సత్యం విషయంలోనూ నిజాయితీ విషయంలోనూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకం ఏమనుకున్నప్పటికీ చిన్న పాపాలంటూ ఏమీ లేవు. అన్ని గొప్ప భవనాలు చిన్న భాగాలతోనే నిర్మించబడతాయి. మొదటి రాయి మిగతావాటిలానే ముఖ్యమైనది. అన్ని అలవాట్లు చిన్న చిన్న చర్యల ద్వారానే మొదలౌతాయి, చిన్న చర్య కూడా గొప్ప పర్యవసానంతో సమానమైనదే. కల్పిత కథ ఒకటి ప్రచారంలో ఉంది. “నాకు చేతిపిడి (హ్యాండిల్ చేయడానికి ఒక చిన్న చెక్క ముక్క) నరుక్కోవడానికి అనుమతి కావాలి, ఆ తరువాత ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను" అని గొడ్డలి చెట్లను వేడుకుంది. ఆ గొడ్డలి, చెట్లనుంచి అనుమతి పొందిన తర్వాత మొత్తం చెట్లన్నింటిని నరికేస్తుంది. అలాగే సాతాను కూడా మీ హృదయంలోకి చిన్న పాపపు చీలికను అనుమతించబడాలని మాత్రమే కోరుకుంటాడు. త్వరలోనే మీరు వాడి సొంతమౌతారు. “దేవునికీ మనకూ మధ్యలో చిన్న విషయాలు ఏవీ ఉండవు. ఎందుకంటే దేవుడు అనంతుడు" అని విలియం బ్రిడ్జ్రు చెప్పారు.
నిచ్చెన పైనుంచి కిందికి రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నిచ్చెన పైనుంచి కిందికి దూకడం, మరొకటి మెట్ల ద్వారా కిందికి రావడం: కానీ రెండూ మిమ్మల్ని దిగువకు నడిపిస్తాయి. అలాగే నరకానికి వెళ్ళడానికి కూడా రెండు మార్గాలు ఉన్నాయి; మొదటి మార్గం, మీ కళ్ళు తెరిచి దానిలోకి నడవడం. కొంతమంది మాత్రమే అలా చేస్తారు; రెండవ మార్గం, చిన్న పాపాలు అనే మెట్ల మీద నుంచి దిగడం. ఈ మార్గం చాలా సాధారణమని నేను భయపడుతున్నాను. కొన్ని చిన్న పాపాలను అనుమతిస్తే త్వరలో మీకు మరికొన్ని కావాలనుకుంటారు. “ఎవరైనా ఎప్పుడైనా ఒకే పాపంతో సంతృప్తి చెందుతారా?” మీరు చిన్న పాపాలకు చోటిస్తే అవి మీ జీవితాన్ని ప్రతి సంవత్సరం అధ్వాన్నంగానూ నీచంగానూ చేస్తాయి” అని ఒక విగ్రహారాధికుడు
కూడా చెబుతాడు.
జెర్మీ టేలర్ మనిషిలో పాపం యొక్క పురోగతిని చాలా స్పష్టంగా వివరించాడు: మొదట, పాపం అతణ్ణి ఉలిక్కిపడేలా చేస్తుంది. తరువాత అది సంతోషంగా ఉంటుంది, తరువాత సులభంగా మారుతుంది. అటు తరువాత స్థిరపడుతుంది. తర్వాత తరచుగా చెయ్యాలనిపిస్తుంది, తర్వాత అలవాటుగా మారుతుంది, ఆపైన జీవన విధానంగా ఔతుంది. అప్పుడు అది మనిషికి అపరాధ భావన కలిగించదు. దాని విషయంలో మానవుడు మొండిగా తయారౌతాడు, ఆపై పశ్చాత్తాపపడకూడదని నిర్ణయించుకుంటాడు. చివరిగా అతడు నాశనాన్ని ఎదుర్కొంటాడు.
యవ్వనస్థులారా, మీరు ఈ పరిస్థితికి రాకూడదనుకుంటే, ఈ రోజు నేను మీకు ఇస్తున్న నియమాన్ని గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఉన్న ఏ పాపాన్నైనా వెంటనే మానుకోవడానికి తీర్మానించుకోండి.
(2) పాపం జరగడానికి అవకాశాన్ని కల్పించే ప్రతిదానికీ దూరంగా ఉండేలా దేవుని సహాయంతో ప్రయత్నించండి.
“చెడు చర్యల నుండి సురక్షితంగా ఉండాలనుకునేవాడు ఆ చర్యలకు నడిపించే సందర్భాలనుండి ఖచ్చితంగా తప్పించుకోవాలి” అని బిషప్ హాల్ చెప్పారు. ఒక పాత కథ ఉంది, సీతాకోకచిలుక ఒకసారి గుడ్లగూబను “నా రెక్కలను కాల్చేసిన అగ్నిని ఎలా ఎదుర్కోవాలి?" అని అడిగింది. అప్పుడు గుడ్లగూబ దానికి సమాధానంగా దాని పొగ వైపు కూడా చూడవద్దని సలహా ఇచ్చింది. ఏ పాపమూ చెయ్యకూడదని నిర్ణయించుకుంటే సరిపోదు, ఏ సందర్భాల్లోనైతే ఆ పాపాన్ని చేస్తామో ఆ సందర్భాలన్నింటికీ దూరంగా కూడా ఉండి తీరాలి. ఈ విధంగా మన సమయాన్ని గడిపే విధానాలను పరీక్షించుకోవాలి. మనం చదివే పుస్తకాలు, దర్శించే కుటుంబాలు, మనం సమయం గడిపే సొసైటీలు మనం మన సమయాన్ని ఎలా గడుపుతున్నామో తెలియచేస్తాయి. “ఇక్కడ చెడు ఏమీ లేదు” అని చెబుతూ మనతో మనం సంతృప్తి చెందకూడదు. "ఇక్కడ నేను పాపం చేసే పరిస్థితి ఏమైనా తలెత్తుతుందా?” అని మనం ప్రశ్నించుకోవాలి.
ఈ కారణం చేతనే సోమరితనాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టాలి. ఏమీ చెయ్యకపోవడం దుర్మార్గం కాకపోవచ్చు. అయితే ఖాళీగా ఉన్న సమయంలోనే దుర్మార్గపు ఆలోచనలు వ్యర్థమైన ఊహలు పుడుతుంటాయి. ఏ పనీ చెయ్యకపోవడమే సాతానుకు ద్వారాన్ని పూర్తిగా తెరుస్తుంది, చెడు విత్తనాలు విత్తడానికి వాడికి అవకాశం ఇస్తుంది. మనం ముఖ్యంగా భయపడవలసింది దీనికే. యెరూషలేము గోడమీద ఖాళీగా నడుస్తూ అపవాదికి అవకాశం ఇవ్వకపోతే దావీదు ఎప్పుడూ బత్తెలను చూసి ఉండేవాడు కాడు, ఊరియాను హత్య చేసి ఉండేవాడు కాడు.
ఈ లోకంలోని వినోదాలు చాలా అభ్యంతరకరంగా ఉండటానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. కొన్ని సందర్భాల్లో ఈ వినోదాలను లేఖన విరుద్ధమైనవిగా తప్పుగా చూపించడం కష్టంగా ఉండవచ్చు. కానీ వీటి ధోరణి ఆత్మకు అత్యంత హానికరంగా ఉందని చూపించడం పెద్ద కష్టం కాదు. ఈ వినోదాలు భూసంబంధమైన, శరీర సంబంధమైన మనస్సు యొక్క విత్తనాలను విత్తుతాయి. ఇవి విశ్వాస జీవితానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాయి. ఇవి ఉత్సాహంగా ఉండడానికి అనారోగ్యకరమైన, అసహజమైన కోరికలు రేకెత్తిస్తాయి. ఇవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు సేవచేస్తాయి (1 యోహాను 2:16). ఇవి పరలోకాన్ని నిత్యత్వాన్ని చూసే చూపును మనక బారుస్తాయి, ఈ లోకానికి సంబంధించిన విషయాల పట్ల తప్పుడు రంగులను పులుముతుంటాయి. ఇవి వ్యక్తిగత ప్రార్థనను, లేఖన అధ్యయనాన్ని, దేవునితో సహవాసాన్ని కలిగివుండేందుకు మనస్సును కేంద్రీకరించనివ్వవు. లోక వినోదాలలో మునిగిపోయే వ్యక్తి, దాడి చేసేందుకు సాతానుకు మంచి అవకాశాన్ని కల్పిస్తాడు. అతడు చెయ్యవలసిన యుద్ధం ఒకటి ఉంది. కానీ శత్రువుకు గాలి వెలుతురు ఎత్తైన ప్రదేశాన్ని ఇచ్చి అతడు సహాయపడుతుంటాడు. అందువల్ల అతడు నిరంతరం సాతాను చేతిలో ఓడిపోవడం వింతేమీ కాదు.
యవ్వనస్థులారా, మీ ఆత్మకు హాని కలిగించే ప్రతిదానికీ దూరంగా ఉండటానికి మీరు వీలైనంతగా ప్రయత్నించండి. సాతానుగాడు చేసే పనులకు మీరు ఎప్పుడూ ఆకర్షితులు కావద్దు. “మీరు అతి జాగ్రత్తపరులు, మీకు చాదస్తం ఎక్కువ. అసలు అలాంటివాటి వల్ల మీకు పెద్దగా హాని ఎక్కడ జరిగింది?" అని మనుషులు మీతో చెప్పవచ్చు. అయితే వారి మాటలు వినవద్దు. పదునైన కత్తులతో ఆడటం ప్రమాదకరం. మరణం లేని మీ ఆత్మ విషయంలో విపరీతమైన స్వేచ్ఛను ఆస్వాదించడం చాలా ప్రమాదకరం. సురక్షితంగా ఉండాలనుకునేవాడు ప్రమాదం అంచుల దగ్గరకు కూడా వెళ్ళకూడదు. మీరు మీ హృదయాన్ని గన్ పౌడర్ బారెల్ గా భావించాలి, మీరు భరించగలిగిన దానికంటే అధికమైన శోధన అనే నిప్పురవ్వను వెలిగించకుండా జాగ్రత్తగా ఉండాలి.
మీకు మీరుగా శోధనలోనికి పరిగెత్తకుండా జాగ్రత్తపడితే తప్ప “ప్రభువా, మమ్మల్ని శోధనలోనికి నడిపించవద్దు" అనే ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? దుష్టుని నుంచి దుష్టత్వం నుంచి దూరంగా ఉండాలని మీరు కోరుకోకపోతే "దుష్టుని నుంచి మమ్మల్ని కాపాడు" అనే ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? ఉదాహరణకు యోసేపును తీసుకోండి. అతడు తన యజమాని భార్య నుండి వచ్చిన పాపం చెయ్యమనే ప్రేరేపణను తిరస్కరించడమే కాదు, "ఆమెతో" ఉండటానికి కూడా నిరాకరించడం ద్వారా అతడు తన వివేకాన్ని చూపించాడు (ఆది 39:10).
"దుష్టుల బాటలో అడుగుపెట్టవద్దు" అని మాత్రమే కాకుండా, “దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోయి సాగిపొమ్ము” అని సొలొమోను చెప్పిన సలహాను హృదయంలోనికి తీసుకోండి (సామెతలు 4:15). ద్రాక్షారసం తాగి మత్తులవ్వడం మానేయడమే కాదు, "అది మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను కనీసం దానివైపు చూడకుము” (సామెతలు 23:31). ఇశ్రాయేలులో నాజీరుగా ఉంటానని ప్రమాణం చేసిన వ్యక్తి, ద్రాక్షారసాన్ని తీసుకోకపోవడమే కాకుండా ఏ రూపంలోనైనా ద్రాక్షపండ్లకు దూరంగా ఉండాలి. కేవలం దుష్క్రియలు చెయ్యకుండా ఉండడమే కాదు, “చెడును ద్వేషించు" అని పౌలు చెప్పాడు (రోమా 12:9); “యవ్వనేచ్ఛల నుండి పారిపో" అని అతడు తిమోతికి రాసాడు; వీలైనంత వరకూ వాటి నుండి దూరంగా ఉండు (2 తిమోతి 2:22). ఔను. అలాంటి జాగ్రత్తలు ఎంతో అవసరం. దీనా చెడ్డ షెకెమీయుల యొక్క మార్గాలను చూడడానికి వెళ్ళి, తన కన్యత్వాన్ని కోల్పోయింది. లోతు పాపంతో నిండిన సొదొమ దగ్గర తన గుడారం వేసుకుని కేవలం తన ప్రాణం తప్ప సమస్తాన్ని కోల్పోయాడు.
యవ్వనస్థులారా మీ సమయం విషయంలో తెలివిగా ఉండండి. శత్రువు మీకు ఎంత దగ్గరగా రాగలడో చూసి, అప్పుడు తప్పించుకోవచ్చులే అనే సాహసాలు చెయ్యడానికి ప్రయత్నించవద్దు. వాణ్ణి దూరంలోనే ఉంచండి. వీలైనంత వరకు శోధన నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి, పాపం నుండి దూరంగా ఉండటానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.
(3) దేవుని కనుదృష్టిని మరచిపోకూడదని తీర్మానించుకోండి.
దేవుని కనుదృష్టి గురించి ఆలోచించండి. ప్రతిచోటా ప్రతి ఇంట్లోనూ ప్రతి క్షేత్రంలోనూ ప్రతి గదిలోనూ ప్రతి కంపెనీలోనూ మీరు ఒంటరిగా ఉన్నా గుంపులో ఉన్నా దేవుని కన్ను దృష్టి ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును” (సామెతలు 15:3). అవి హృదయాలను, చర్యలను చదివే కళ్ళు
ఈ వాస్తవాన్ని గ్రహించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అన్నీటిని చూసే దేవుణ్ణి ఎన్నడూ కునుకని నిద్రపోని దేవుణ్ణి మీరు ఎదుర్కోవాలని గుర్తుంచుకోండి (కీర్తన 121:4). మీ ఆలోచనలను అర్థంచేసుకునే దేవుణ్ణి, రాత్రిని సహితం పగలంత స్పష్టంగా చూడగలిగే దేవుణ్ణి ఎదుర్కోవాలని గుర్తుంచుకోండి (కీర్తన 139:2,12). మీరు మీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తప్పిపోయిన కుమారునిలా దూరదేశానికి వెళ్ళి, మీ ప్రవర్తనను ఎవ్వరూ చూడలేరని అనుకోవచ్చు; కానీ దేవుని కన్నులు, చెవులు మీ ముందు ఉన్నాయి. మీరు మీ తల్లిదండ్రులను, యజమానులను మోసగించవచ్చు, వారికి అబద్ధాలు చెప్పవచ్చు, వారి ముందు ఒక విధంగానూ వారి వెనుక మరొక విధంగానూ ప్రవర్తించవచ్చు, కానీ మీరు దేవుణ్ణి మోసగించలేరు. ఆయన మీ గురించి సంపూర్ణంగా ఎరిగినవాడు. మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పింది ఆయన విన్నాడు. ఈ నిమిషంలో మీరేం ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. అత్యంత రహస్యమైన మీ పాపాలను ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నాయి, మీరు జాగ్రత్త వహించకపోతే అవి ఒక రోజున మిమ్మల్ని అవమానపరడానికి ఈ ప్రపంచం ముందుకు వస్తాయి (1 కొరింధీ 4:5).
దీనిని నిజంగా మనుషులు ఎంత తేలిగ్గా భావిస్తున్నారో కదా! ఎన్నో కార్యాలు నిరంతరం జరుగుతున్నాయి, అయితే ఇతరులు తమను చూస్తున్నారని తెలిస్తే ఎప్పటికీ వాటిని చెయ్యరు. ఊహల గదుల్లో ఎన్నో లావాదేవీలు జరుగుతుంటాయి, అవి ఎప్పటికీ వెలుగులోకి రావు; మనుషులు ఏకాంతంగా ఆలోచనల్లో ఆనందంగా మునిగి తేలుతుంటారు. ఏకాంతంలో మాటలు చెబుతారు, ఏకాంతంలో పనులు చేస్తారు, కానీ అవి ప్రపంచం ముందు బహిర్గతమైతే సిగ్గుపడతారు. ఒకని పాదాల చప్పుడే చాలా దుర్మార్గపు పనులను నిలిపివేసింది. ఎవరో తలుపు తట్టిన శబ్దమే చాలామందిని కంగారు పెట్టింది, చెడు పనులు పక్కనపట్టేలా చేసింది. అయ్యో, ఇదంతా ఎంత నీచమైన మూర్ఖత్వం!
మనం ఎక్కడికి వెళ్ళినా అన్నింటినీ చూసే సాక్షి మనతో ఉంటాడు. తలుపుకు తాళం వేయండి, కర్టెన్లు కిందికి లాగండి, దీపాలు ఆర్పండి. దేవునికి ఎలాంటి పట్టింపులూ ఉండవు, ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రతిచోటా ఉన్నాడు, మీరు ఆయనను బయటే నిలబెట్టలేరు, మిమ్మల్ని చూడకుండా ఆయనను ఆపలేరు. “మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది" (హెబ్రీ 4:13). తన యజమానుని భార్య ప్రలోభపెట్టినప్పుడు యవ్వనస్థుడైన యోసేపు ఈ విషయాన్ని బాగా అర్థంచేసుకున్నాడు. వారిద్దరినీ చూడడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వడానికి మానవ కన్ను ఏదీ లేదు; కానీ యోసేపు అదృశ్యమైన దేవుణ్ణి చూసే వ్యక్తిగా జీవించాడు: “నేను ఇంత చెడ్డ పని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?” అని అతడు ప్రశ్నించాడు (ఆది 39:9).
యవనస్థులారా, 139 వ కీర్తనను చదవమని నేను మీ అందరినీ కోరుతున్నాను. దానిని కంఠతం చెయ్యమని నేను మీ అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ లోక వ్యవహారాలన్నింటిలో మీ పనులన్నింటికి దీనిని పరీక్షగా చేసుకోండి. “దేవుడు నన్ను చూస్తున్నాడని నాకు గుర్తుందా?" అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుని దృష్టి మీపై ఉందనే ఆలోచనతో జీవించండి. అబ్రాహాము చేసింది అదే, అతడు దేవుని ముందు నడిచాడు. హనోకు చేసింది అదే, అతడు దేవునితో నడిచాడు. పరలోక జీవితం ఆ విధంగానే అనగా దేవుని నిత్యమైన సన్నిధిలోనే ఉండబోతోంది. దేవుడు చూడకూడదనుకునే ఏ పనీ చెయ్యవద్దు. దేవుడు వినకూడదనుకునే ఏ మాటనూ పలకవద్దు. దేవుడు చదవకూడదనుకునే ఏ పదాన్నీ రాయవద్దు. దేవుడు మిమ్మల్ని చూడకూడదనుకునే ఏ చోటికీ వెళ్లవద్దు. “నాకు చూపించు" అని దేవుడు అడిగితే చూపించడానికి నువ్వు ఇష్టపడని ఏ పుస్తకాన్నీ చదవవద్దు. "మీరు ఏం చేస్తున్నారు?” అని దేవుడు అడిగితే జవాబు చెప్పేందుకు మీరు ఇష్టపడని విధంగా మీరు మీ సమయాన్ని ఎన్నడూ గడపవద్దు.
(4) కృపలో ఎదిగేందుకు దేవుడు అనుగ్రహించిన మార్గాలన్నింటినీ అభ్యాసం చెయ్యడంలో శ్రద్ధగలవారిగా ఉండండి.
సంఘానికి హాజరవ్వడంలో క్రమంగా ఉండండి. సంఘంలో ప్రార్థన నిమిత్తం, వాక్యోపదేశం నిమిత్తం కార్యక్రమాలు జరిగిన ప్రతిసారి, మీకు హాజరవ్వగలిగే అవకాశం ఉంటే తప్పక హాజరవ్వండి. ప్రభువు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడంలో క్రమంగా ఉండండి, ఏడు రోజుల్లో ఒక రోజును అసలైన యజమానియైన దేవునికి ఎల్లప్పుడూ కేటాయించండి.
మీ మనసుల్లో తప్పుడు భావాలను నాటాలని నేను కోరుకోవడం లేదు. “సంఘానికి హాజరవ్వడమే క్రైస్తవ్యపు సారాంశం" అని నేను మీతో చెప్పినట్టు మీరు ప్రచారం చెయ్యకండి. నేను అలాంటి విషయాలు మీతో చెప్పను. మీరు నామకార్థ క్రైస్తవులుగానో పరిసయ్యులుగానో ఎదిగితే చూడాలన్న కోరిక నాకు లేదు. మీ శరీరాన్ని వారంలో ఒక ప్రత్యేకమైన రోజున కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఒక ప్రత్యేకమైన భవనం దగ్గరకు తీసుకెళ్ళడమే మిమ్మల్ని క్రైస్తవులుగా చేస్తుందని, దేవుణ్ణి కలుసుకోవడానికి మిమ్మల్ని సిద్ధంచేస్తుందని మీరు అనుకుంటే మీరు దారుణంగా మోసగించబడుతున్నారని నేను మీకు సూటిగా చెబుతున్నాను. హృదయపూర్వకంగా చెయ్యని సేవలన్నీ నిష్ప్రయోజన మైనవే వ్యర్థమైనవే. “ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించువారే నిజమైన ఆరాధికులు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు” (యోహాను 4:23).
కృపలో ఎదగడానికి దేవుడు అనుగ్రహించిన మార్గాలు మనల్ని రక్షించవు. అయినా వాటిని తృణీకరించకూడదు. బంగారం అనేది ఆహారం కాదు, దానిని మీరు తినకూడదు, అయితే అది నిరుపయోగమైనదని చెప్పి, మీరు దాన్ని బయట పారవేయరు. కృపలో ఎదిగేందుకు దేవుడు అనుగ్రహించిన మార్గాలపైన మీ ఆత్మల నిత్యక్షేమం ఖచ్చితంగా ఆధారపడి ఉండదు, అయితే వాటిని పాటించకపోతే మీ ఆత్మ క్షేమంగా ఉండదు అనేది సాధారణమైన నియమంగా చెప్పవచ్చు. ఏలీయాను అగ్ని రథంపై పరలోకానికి తీసుకువెళ్ళినట్టుగా రక్షించబడిన వారందరినీ దేవుడు పరలోకానికి తీసుకెళ్ళవచ్చు, కానీ ఆయన అలా చెయ్యడు. వాళ్ళందరూ లేఖనాలను చదవవలసిన అవసరం లేకుండా వాటిని ధ్యానించవలసిన అవసరం లేకుండా వాళ్లందరికీ దర్శనాల ద్వారా కలల ద్వారా అద్భుతాల ద్వారా ఆయన బోధించవచ్చు. కానీ ఆయన అలా చెయ్యడు. కారణమేంటంటే ఆయన కొన్ని మాధ్యమాల ద్వారా పనిచేసే దేవుడు. మనిషితో ఆయన వ్యవహరించే విధానాలన్నింటిలో కొన్ని మాధ్యమాలను ఉపయోగించడం ఆయన నియమమై, ఆయన చిత్తమై యున్నది. భవనాన్ని నిర్మించాలనుకున్న వ్యక్తి నిచ్చెనలు లేకుండా పరంజా లేకుండా దాన్ని కట్టాలనుకునేవాడు మూర్ఖుడే. అదేవిధంగా జ్ఞానం కలిగిన ఏ వ్యక్తీ మాధ్యమాలను తృణీకరించడు.
నేను ఈ విషయాన్ని నొక్కిచెబుతున్నాను, ఎందుకంటే భక్తిలో ఎదగడానికి దేవుడు నియమించిన మార్గాలకు విరుద్ధంగా వివిధ వాదనలతో మీ మనస్సులను నింపడానికి సాతాను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు. వాటిని అభ్యాసం చేస్తూ కూడా ఏ మాత్రమూ మార్పు చెందని అనేకమంది వ్యక్తుల మీదకి సాతాను మీ గమనాన్ని మళ్ళిస్తాడు. “చూడండి, సంఘానికి హాజరయ్యే వాళ్లు సంఘానికి దూరంగా ఉన్న వారి కంటే గొప్పగా ఏమీ లేరని మీరు గమనిస్తున్నారా?" అని వాడు మీ చెవుల దగ్గర గుసగుసలాడతాడు. అయితే ఈ విషయానికి మిమ్మల్ని కదిలించే అవకాశం ఇవ్వకండి. ఒక అంశాన్ని/వస్తువును సరిగ్గా ఉపయోగించనందువల్ల అది చెడ్డదే అని వాదించడం ఎన్నడూ న్యాయం కాదు. క్రైస్తవ్యంలోని అభ్యాసాలు చాలామందికి మేలు చెయ్యనంత మాత్రాన అవి ఎవ్వరికీ మేలు చెయ్యలేవనే వాదన సరికాదు. చాలామంది మందులు వేసుకున్న తర్వాత కూడా తమ అనారోగ్యం నుంచి బయటపడరు. అందువల్ల మందుల్ని తప్పు పట్టకూడదు. ఇతరులు సరిగ్గా తినట్లేదు తాగట్లేదు కాబట్టి నేను తినడం త్రాగడం మానేస్తాను అని ఆలోచించి ఎవ్వరూ కూడా తమను తాము అనారోగ్యంగా చేసుకోరు. భక్తిలో ఎదగడానికి దేవుడు నియమించిన మార్గాల విలువ వాటిని ఉపయోగించే విధానం పైనా వైఖరి పైనా ఆధారపడి ఉంటుంది.
నేను ఈ అంశాన్ని నొక్కిచెప్పడానికి మరొక కారణం, క్రీస్తు సువార్త ప్రకటనను ప్రతి యవ్వనస్థుడు క్రమంగా వినాలనే తీవ్రమైన ఆందోళన నేను కలిగి ఉండడమే. నేను దీన్నెంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానో మీకు చెప్పలేను. దేవుని ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని మార్చడానికి, క్రీస్తును గురించిన రక్షణార్థమైన జ్ఞానానికి మిమ్మల్ని నడిపించడానికి, క్రియలోనూ సత్యంలోనూ మిమ్మల్ని దేవుని బిడ్డగా మార్చడానికి సువార్త పరిచర్య ఒక మాధ్యమం అయ్యే అవకాశం ఉంది. ఇది నిజానికి నిత్యమైన కృతజ్ఞతకు కారణమౌతుంది. దేవదూతలు ఆనందించేంత ముఖ్యమైన సంఘటన ఔతుంది. ఒకవేళ అలా జరగకపోయినా సువార్త పరిచర్యలో బలీయమైన శక్తి, ప్రభావం ఒకటుంది. ప్రతి యవ్వనస్థుడు ఆ శక్తి కిందకి రావాలని నేను తీవ్రంగా అపేక్షిస్తున్నాను. సువార్త పరిచర్యలోని ఈ శక్తియే వేలాది మందిని దేవుని వైపుకు ఇంకా తిప్పనప్పటికీ అది వారిని దుష్టత్వం నుంచి కాపాడుతుంది. ఆ శక్తి వారిని ఇప్పటికింకా నిజమైన క్రైస్తవులుగా మార్చనప్పటికీ సమాజంలో ఎంతో శ్రేష్ఠులైన వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దింది.
సువార్తను నమ్మకంగా ప్రకటించడంలో ఒక నిర్దిష్టమైన, మర్మయుక్తమైన శక్తి ఉంది. తమ హృదయాల్లోనికి చేర్చుకోకుండానే దాన్ని వినే జనసమూహాల పైన అది ప్రభావాన్ని చూపిస్తుంది. సువార్త ప్రకటన చేసినప్పుడు పాపం యొక్క నీచత్వం బట్టబయలౌతుంది, పరిశుద్ధత హెచ్చించబడుతుంది, క్రీస్తు ఘనపరచబడతాడు, అపవాది యొక్క మాటలు ఖండించబడతాయి, పరలోక రాజ్యపు మహిమ వర్ణించబడుతుంది, లోకమూ దాని డొల్లతనమూ వెల్లడి ఔతుంది. ప్రతీ వారం ప్రతీ ఆదివారం ఈ సువార్త ప్రకటన వింటున్నప్పుడు అది ఆత్మపైన సత్ప్రభావం చూపించకపోవడం అరుదే. సువార్త ప్రకటన విన్నవాళ్ళు బయటకు వెళ్ళి దారుణమైన పాపాలకు ఒడిగట్టడం కష్టమే.
సువార్తను వినడం అనే చర్య మనిషి హృదయంపైన ఒక శ్రేయస్కరమైన నిఘా మాదిరిగా పనిచేస్తుంది. దేవుని వాగ్దానం మేలుగా మారే ఒక మార్గం ఇదేనని నేను నమ్ముతున్నాను. “నా నోటనుండి వచ్చు వచనము... నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును,” (యెషయా 55:10,11). “సువార్త చాలామందిని నరకం నుంచి తప్పించకపోయినా జైలుకు పంపకుండా ఉరి తీయబడకుండా కాపాడుతుంది" అని విట్ఫీల్డ్ చెప్పిన బలమైన మాటలో ఎంతో సత్యం దాగి ఉంది.
ఈ విషయానికి ఎంతో దగ్గరగా ముడిపడిన మరొక అంశాన్ని కూడా నేను చెబుతాను. ఆదివారం నాడు సంఘానికి హాజరవ్వడానికి, ప్రభువుకు ఆ దినాన్ని ప్రత్యేకంగా అర్పించడానికి అన్ని విధాలా మీరు ప్రయత్నించకపోతే మిమ్మల్ని క్రైస్తవునిగా మారమని శోధించే దేనికీ ఎన్నడూ అవకాశం ఇవ్వకండి.
ఒకవేళ మీరు క్రైస్తవులుగా మారాలనుకుంటే ఆదివారాలన్నింటినీ దేవునికి ఇవ్వడానికి దృఢనిశ్చయం చేసుకోవాలి. ఒక నిర్లక్ష్యపూరిత వైఖరి ఈ దినాన మన మధ్యన భయంకరమైన వేగంతో పెరిగిపోతోంది, యవనస్థుల మధ్యన ఇది తక్కువేమీ కాదు. ఆదివారం నాడు సంఘానికి హాజరై, ప్రభువును ఘనపరచడానికి బదులు విహారయాత్రలకు బంధువులను దర్శించడానికి విందు భోజనాలకు ఆదివారాన్ని వెచ్చించడం ఇంతకుముందు సంవత్సరాల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువౌతోంది, మనుషుల ఆత్మలకు చెప్పలేనంత హాని కలుగచేస్తోంది.
యవ్వనస్థులారా ఈ విషయంపై ఆసక్తి చూపండి. మీరు నివసిస్తున్నది నగరంలోనైనా పల్లెలోనైనా ఆదివారం నాడు సంఘానికి హాజరవడం దేవుని ప్రజలతో సహవాసం మానకూడదని తీర్మానించుకోండి. సహవాసం నుంచి ఆరాధన నుంచి మిమ్మల్ని దారి మళ్ళించే "మీ శరీరానికి విశ్రాంతి నిమిత్తం నిద్ర అవసరం" అనే హేతుబద్ధమైన వాదనకు, మీ చుట్టూ ఉన్న వాళ్లందరి ఆదర్శానికి, మీ సహచరుల ఆహ్వానానికి అవకాశం ఇవ్వకండి. "ఆదివారాలు ఉన్నది, దేవుణ్ణి ఘనపరచడానికే,
ఆయన ప్రజలతో సహవాసం చేయడానికే” అనే స్థిరమైన నియమం నుంచి మిమ్మల్ని తొలగించే ఈ విషయాల్లో దేనికీ మీరు అవకాశం ఇవ్వకండి.
మీ క్రైస్తవ జీవితంలో ఆదివారాలు ముఖ్యం కాదని, అవేమీ ప్రత్యేకమైనవి కాదని అనుకుంటే చివరికి మీరు మీ ఆత్మ గురించి శ్రద్ధ తీసుకోవడం మానేస్తారు. ఈ అభిప్రాయానికి నడిపించే దశలు సరళమైనవి, సాధారణమైనవి. ప్రభువు యొక్క దినాన్ని ఘనపరచడం మానేయండి. త్వరలోనే మీరు దేవుని ప్రజలను ఘనపరచడం మానేస్తారు, దైవ గ్రంథాన్ని ఘనపరచడం మానేస్తారు, కొంతకాలం గడిచేటప్పటికీ దేవుణ్ణి ఘనపరచడం మొత్తానికి మానేస్తారు. దేవుణ్ణి ఆరాధించడం యెడల, పరిశుద్ధులతో సహవాసం యెడల మర్యాదలేని పునాది వేసుకునే మనిషి, నాస్తికునిగా తన జీవితాన్ని ముగించినా నేను ఎన్నడూ ఆశ్చర్యపడను. “నేను కోర్టులో జడ్జిగా పని చేసినప్పుడు, తీవ్రమైన నేరాలు చేసి దోషులైన వ్యక్తుల్లో చాలామంది “తాము సంఘాన్ని, దేవుని ప్రజలను నిర్లక్ష్యం చెయ్యడం ద్వారానే తమ దుర్మార్గపు జీవితాన్ని ఆరంభించినట్టు విచారణలో ఒప్పుకున్నారు” అని సర్ మ్యాథ్యు హాలే అనే జడ్జిగారు చెప్పడం విశేషం.
యవ్వనస్థులారా, ప్రభువు దినాన్ని ఘనపరచడం మర్చిపోయే స్నేహితులు మీకు ఉన్నారేమో. అయితే దానిని ఎల్లప్పుడూ ప్రత్యేకమైన దినంగా ఆచరిస్తానని తీర్మానించుకోండి. సువార్త ప్రకటించబడే ఏదో ఒక చోట క్రమంగా హాజరవడం ద్వారా ప్రభువు దినాన్ని ఘనపరచండి. ఒక నమ్మకమైన పరిచర్యలో మీరు స్థిరపడండి, స్థిరపడిన తర్వాత సంఘంలో మీ స్థానాన్ని ఎన్నడూ ఖాళీగా ఉంచకండి. మీరు ఇలా చేస్తే ఒక ప్రత్యేకమైన దీవెనను పొందుకుంటారు. “నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహర మైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశముయొక్క ఉన్నత స్థలములమీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే” (యెషయా 58:13-14). ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితం. ఆదివారం గురించి, సహవాసం గురించి మీకున్న భావాలు పరలోకానికి మీకు అర్హత ఉందో లేదో నిర్ధారిస్తాయి. సహవాసం, ఆరాధన అనేవి పరలోకానికి ముందు రుచి లాంటివి. వాటిని ఒక ఆధిక్యతగా కాకుండా భారంగా చూసే వ్యక్తి యొక్క హృదయం గొప్పగా మారవలసిన స్థితిలో ఉంది.
(5) నువ్వెక్కడ ఉన్నప్పటికీ ప్రార్థిస్తానని తీర్మానించుకో!
నరుని ఆత్మకు ప్రార్ధన అనేది ఊపిరి లాంటిది. మనం జీవించడానికి ఒక పేరు ఉండవచ్చు, క్రైస్తవులుగా పరిగణించబడుతుండవచ్చు, కానీ ప్రార్థన లేకపోతే దేవుని దృష్టిలో మనం మృతులమే. కృపా కనికరాల కోసం మనం దేవునికి మొరపెట్టాలనే భావన రక్షణకు సూచనగా ఉంది. మన ఆత్మ యొక్క అవసరాలను ఆయన ముందు విన్నవించుకునే అలవాటే మనం దత్తపుత్రాత్మను కలిగి ఉన్నాం అనడానికి నిదర్శనం. మన ఆత్మీయ అవసరాల నిమిత్తం ఉపశమనాన్ని పొందేందుకు దేవుడు నియమించిన మార్గమే ప్రార్థన. ప్రార్థన, ఆశీర్వాదాల నిధిని తెరుస్తుంది. దీవెనల ఊటను ప్రవహింప చేస్తుంది. మనం దీవెనలు పొందట్లేదు అంటే మనం ప్రార్ధనలో అడగట్లేదని అర్థం.
మన హృదయాలపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడడానికి మార్గం ప్రార్ధనే. ఆదరణ కర్తయైన పరిశుద్ధాత్మను యేసు వాగ్దానం చేశాడు. ఆయన తన విలువైన వరాలన్నింటితోను, నూతనపరిచే పవిత్రపరిచే పరిశుద్ధపరిచే బలపరిచే సంతోషపరిచే ప్రోత్సహించే వెలిగించే ఉపదేశించే సర్వసత్యంలోనికి నడిపించే కార్యాలను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు అడిగే వరకు ఆయన ఎదురుచూస్తూనే ఉంటాడు.
అయితే నేను దుఃఖంతో ఈ మాట చెబుతున్నాను. ప్రార్థన విషయంలోనే మనుషులు దారుణంగా విఫలమౌతున్నారు. ప్రార్థించే వాళ్ళు ఎంతో తక్కువగా కనిపిస్తున్నారు. మోకరించి ఏవో కొన్ని మాటలను వల్లించేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రార్థించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవునికి మొరపెట్టేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, ప్రభువు నామాన ప్రార్థించేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, దొరికే వరకు వెదికేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, ఆకలి దప్పికలు తీరేవరకు తట్టేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, పోరాడేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, జవాబు కోసం దేవునితో ఆసక్తిగా పోరాడేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, ఆయనకు విశ్రాంతినివ్వని వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, ప్రార్థనలో కొనసాగేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థించేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, విసుగక ప్రార్థించేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ప్రార్థన ముఖ్యమైనదని అందరికీ తెలుసు, కానీ దానిని అభ్యాసం చేసేవాళ్ళు అరుదే. ప్రార్థన ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరికీ తెలుసు, అయితే ప్రార్థించేవాళ్ళే దాదాపుగా లేరు.
యవ్వనస్థులారా, మీ ఆత్మ రక్షించబడాలంటే మీరు ప్రార్థించాలి. దేవునికి మూగ పిల్లలు ఉండరు. మీరు లోకాన్ని శరీరాన్ని అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థించి తీరాలి. శ్రమల గడియలో బలం కోసం ప్రార్థించకపోతే అది దొరుకుతుందని ఆశపడడం వ్యర్థమే. ఎప్పుడూ ప్రార్థించని వారి మధ్యలోకి నువ్వు తోసివేయబడవచ్చు, దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ అడగని వ్యక్తి ఉన్న గదిలోనే నువ్వు నిద్రపోవలసిన అవసరం రావచ్చు. అయితే నా మాటలు గుర్తుపెట్టుకో! నువ్వు ప్రార్థించి తీరాలి.
ప్రార్ధన చెయ్యడమూ ప్రార్థించడానికి అవకాశాలను సమయాన్ని సరైన ప్రదేశాన్ని పొందడమూ నీకు కష్టంగా అనిపిస్తుంది. ఈ విషయాలపై నేను కఠినమైన నియమాలను పెట్టే సాహసం చెయ్యను. వాటిని నీ సొంత మనస్సాక్షికే వదిలేస్తున్నాను. పరిస్థితులను బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక కొండపైన ప్రార్థించాడు. ఇస్సాకు పొలాల్లో ప్రార్థించాడు. హిజ్కియా మంచంపైన పండుకొని గోడ వైపుకు తన ముఖాన్ని తిప్పుకుని ప్రార్థించాడు. దానియేలు నది ఒడ్డున ప్రార్థించాడు. పేతురు ఇంటి పైన ఉండి ప్రార్థించాడు. గుర్రపు శాలల్లో గడ్డిమేట్లలో ఉంటూ యవ్వనస్థులు ప్రార్ధించడం నేను విన్నాను. నా వాదన ఏంటంటే, "నీ గదిలోనికి వెళ్ళి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన” చెయ్యడం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి (మత్తయి 6:6). దేవునితో ముఖాముఖిగా మాట్లాడే సమయాలు నీ జీవితంలో ఉండాలి. ప్రతి రోజు నువ్వు ప్రార్థించే సమయాలు ఉండాలి. నువ్వు ప్రార్థించాలి.
ప్రార్థన లేకపోతే నా సలహాలు సూచనలు నిరుపయోగమే. ఎఫెసీ 6వ అధ్యాయంలో పౌలు వర్ణించిన సర్వాంగ కవచంలో అతడు ప్రస్తావించిన ఆఖరి విషయం ప్రార్థన గురించినదే. అయితే సత్యం ఏంటంటే విలువలోనూ ప్రాముఖ్యతలోనూ తొలి స్థానం మాత్రం ప్రార్థనదే. ఈ జీవితం అనే అరణ్యం గుండా సురక్షితంగా ప్రయాణించాలంటే నువ్వు అనుదినం తినవలసిన మాంసాహారం ఇదే. దేవుని పర్వతాన్ని నువ్వు ఎక్కాలంటే అది ప్రార్థన యొక్క బలంతోనే నీకు సాధ్యమౌతుంది. లోహాలను సానబెట్టేవారు, ఆ లోహాల రజను వారి ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళనివ్వకుండా ఉండడానికి, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అయస్కాంతపు కవచాన్ని ధరిస్తారని నేను విన్నాను. ప్రార్థన కూడా నువ్వు నిరంతరం ధరించవలసిన కవచం. లేదంటే పాపంతో నిండిన ఈ లోకపు అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నువ్వు అపాయంలో చిక్కుకుంటావు. కాబట్టి నువ్వు ప్రార్థించాలి.
యవ్వనస్థులారా, ఒక వ్యక్తి తన మోకాళ్ళపై గడిపే సమయం కంటే శ్రేష్ఠమైన రీతిలో గడిపే సమయం ఏదీ లేదని ఖచ్చితంగా తెలుసుకోండి. మీ ఉద్యోగం ఏదైనప్పటికీ ప్రార్థన కోసం సమయాన్ని వెచ్చించండి. ఇశ్రాయేలుకు రాజైన దావీదు గురించి ఆలోచించండి. అతడు ఏం చెబుతున్నాడు? “సాయం కాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టు కొందును. ఆయన నా ప్రార్థన నాలకించును” (కీర్తన 55:17). దానియేలు గురించి ఆలోచించండి. రాజ్యంలోని కీలకమైన బాధ్యతలను అతడు నిర్వర్తించవలసి వచ్చేది. అయినా అతడు రోజుకు మూడుసార్లు ప్రార్థించేవాడు. దుష్ట సామ్రాజ్యమైన బబులోనులో అతని భద్రతకు రహస్యాన్ని ప్రార్థనలోనే మీరు చూడాలి. సొలొమోను గురించి ఆలోచించండి. దేవుని సహాయ సహకారాలను అర్థిస్తూ అతడు తన పరిపాలనను ప్రార్థనతో ప్రారంభించాడు, అందువల్లనే అతనికి అద్భుతమైన ఐశ్వర్యం దక్కింది. నెహెమ్యా గురించి ఆలోచించండి. తన యజమానియైన అర్తహషస్త యొక్క రాజసభలో నిలబడినప్పుడు సైతం పరలోకమందున్న దేవునికి ప్రార్థించడానికి సమయాన్ని కనుగొన్నాడు. ఈ భక్తులు మీ ముందు విడిచిపెట్టిన ఆదర్శం గురించి ఆలోచించి, మీరు కూడా వెళ్ళి, అలాగే చెయ్యండి.
ప్రభువే మీకు సర్వకృపానిధియగు ఆత్మను అనుగ్రహించును గాక! "అయినను ఇప్పుడు నీవు నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు. నీవేయని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?” (యిర్మీయా 3:4). మీ హృదయాలపై ప్రార్థన యొక్క ప్రాధాన్యతను గురించిన బోధ ముద్రించబడితే అప్పుడు నేను చేసిన ఉపదేశమంతటిని మీరు మర్చిపోయినా నేను సంతోషంగా అంగీకరిస్తాను.
ముగింపు
ఇప్పుడు చివరి మాటలు చెప్పడానికి నేను తొందరపడుతున్నాను. చాలామంది ఇష్టపడని, స్వీకరించని అనేక విషయాలను నేను చెప్పాను. అయితే "ఆ మాటలు నిజం కాదా?” అని నేను మీ మనస్సాక్షులకు మనవి చేస్తున్నాను.
యవ్వనస్థులారా మీ అందరికీ మనస్సాక్షులున్నాయి. మనమందరం పాపంలో పడి దుర్నీతిపరులమైనా దుష్టులమైనా మనలో ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది. ప్రతి హృదయానికి ఒక మూలలో దేవుని నిమిత్తం ఒక సాక్షి ఆసీనురాలై ఉంది. మనం తప్పు చేసినప్పుడు ఈ సాక్షి మనల్ని నిందిస్తుంది, సరైనది చేసినప్పుడు ఇది మనల్ని ఆమోదిస్తుంది. “నేను చెబుతున్న విషయాలు సత్యం కాదా?" అని ఆ సాక్షికి ఈ రోజున నేను మనవి చేస్తున్నాను.
కాబట్టి యవ్వనస్థుల్లారా, మీ యవ్వన దినాల్లోనే మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి తీర్మానించుకోండి. కృప పొందే రోజు గడిచిపోవడానికి ముందే వయస్సును బట్టి మీ మనస్సాక్షి కఠినం కావడానికి ముందే పదేపదే మీ కాళ్ల కింద తొక్కడం వల్ల అది మరణించడానికి ముందే మీకు శక్తి సమయం అవకాశాలు ఉన్నప్పుడే ప్రభువుతో నిత్యమైన నిబంధన చేసుకోండి. పరిశు ద్ధాత్ముడు ఎల్లప్పుడూ వాదించడు. మీరు మనస్సాక్షిని ఎదిరిస్తూ కొనసాగిన ప్రతీ సంవత్సరం దాని స్వరం క్షీణించిపోతుంది, బలహీనమైపోతుంది. “నువ్వు చెప్పేది మరొక్కసారి వింటాము” అని ఏథెన్సు ప్రజలు పౌలుతో చెప్పారు, కానీ అతని మాటలు మరొక్కసారి వినే అవకాశం వాళ్ళకు రాలేదు (అపో.కా. 17:32). అందువల్లనే తొందరపడండి. ఆలస్యం చేయకండి. తడవు చేయకండి. ఇక ఏ మాత్రమూ సందేహించకండి!
మీరు నా ఉపదేశాన్ని అనుసరిస్తే మీ తల్లిదండ్రులకు బంధు మిత్రులకు మాటల్లో వర్ణించలేనంత ఆదరణ కలిగిస్తారు. దాని గురించి ఆలోచించండి. మిమ్మల్ని పెంచడానికి, మీరున్న స్థితికి మిమ్మల్ని తీసుకురావడానికి వాళ్ళు తమ సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని వెచ్చించారు. ఖచ్చితంగా వాళ్ళు మీరు కలిగించే ఆదరణకు అర్హులు. కేవలం యవ్వనస్థులు మాత్రమే పుట్టించగలిగే ఆనందాన్ని సంతోషాన్ని ఎవరు కలిగించగలరు? ఏశావు హోఫ్నీ ఫినేహాసు అబ్షాలోము లాంటి పిల్లలు కలిగించే ఆందోళన గురించి దుఃఖం గురించి ఎవరు చెప్పగలరు? (ఆది 25-27, 1 సమూ 1- 4, 2 సమూ 13). “జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును" అని సొలొమోను చెప్పిన మాట సత్యమే (సామె 10:1). ఈ విషయాలు ఆలోచించండి. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. “యవ్వన వయస్సు ఘోరమైన తప్పిదాలతో నిండినది. మధ్య వయస్సు పోరాటాలతో కూడినది. వృద్ధాప్యం ఎంతో దుఃఖంతో ఉండేది" అని చాలామంది చెబుతుంటారు. మీ గురించి ఈ మాట ఎవ్వరూ చెప్పకుండా చూసుకోండి.
మీరు యవ్వన వయసులోనే దేవుణ్ణి నమ్మితే లోకానికి మేలు చేసే సాధనంగా మీరు తయారౌతారు. దాని గురించి ఆలోచించండి. దేవుని పరిశుద్ధుల్లో అత్యంత శ్రేష్ఠులు ప్రభువును ఎక్కువ శాతం యవ్వన వయస్సులోనే నమ్ముకున్నారు. మోషే సమూయేలు దావీదు దానియేలు తమ యవ్వన వయస్సు నుంచే దేవునికి సేవచేశారు. యవ్వన సేవకులకు ప్రత్యేక ఘనతనివ్వడానికి దేవుడు ఆనందిస్తాడు. మన దేశానికి రాజైన ఎడ్వర్డ్ పై దేవుడు ఉంచిన ఘనతను జ్ఞాపకం చేసుకోండి. మన రోజుల్లోని యవ్వనస్థులు తమ జీవితాల్లోని వసంత కాలాన్ని దేవునికి ప్రతిష్టిస్తే ఎన్ని గొప్ప సంగతులు జరుగుతాయో ఆలోచించండి!
ఈ లోకంలో సాధించవలసిన గొప్ప పనులు మేలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ చెయ్యడానికి మనుషులే లేరు. సత్యాన్ని వ్యాప్తి చెయ్యడానికి ప్రతి విధమైన యంత్రాంగం ఉనికిలో ఉంది. అయితే దానిని ఉపయోగించే వ్యక్తులు లేరు. మేలు చెయ్యడానికి మనుషులు దొరికిన దానికంటే సులభంగా ధనం దొరుకుతోంది. కొత్త సంఘాలకు సేవకులు కొదువగా ఉన్నారు. సువార్త అందని ప్రాంతాలకు మిషనరీలు కొదువగా ఉన్నారు. నిర్లక్ష్యం చెయ్యబడిన ప్రాంతాలకు దార్శనికులు కొదువగా ఉన్నారు. నూతన పాఠశాలలకు ఉపాధ్యాయులు కొదువగా ఉన్నారు. చేయడానికి మనుషులు లేకపోవడం వల్ల, ఎన్నో మంచి కార్యాలు మధ్యలోనే నిలిచిపోయాయి. నేను ప్రస్తావించిన స్థానాలను భర్తీ చెయ్యడానికి భక్తిగల, నమ్మకమైన, విశ్వసనీయులైన వ్యక్తులు అవసరానికంటే చాలా తక్కువగా ఉన్నారు.
నేటి యవ్వనస్థుల్లారా దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. ఇది నిరంతర కృషి సలిపే యుగం. గతం తాలుకు మన స్వార్ధాన్ని మన నుంచి తొలగించుకుంటున్నాం. మన పూర్వీకులు ఇతరుల విషయంలో నిర్లక్ష్యంగా ఉదాసీనంగా ఉండేవారు. నేటి ప్రజలు ఇక ఏ మాత్రమూ అలా ఉండట్లేదు. “నా తమ్మునికి నేను కావలి వాడనా?” అని ప్రశ్నించిన కయీను మాదిరిగా ఆలోచించడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు (ఆది 4:9). మీరు చెయ్యడానికి ఇష్టపడితే ఎంతో ప్రయోజనకరంగా మారేందుకు విస్తారమైన పొలం మీ యెదుట సిద్ధంగా ఉంది. కోత విస్తారంగా ఉంది కానీ పనివాళ్ళు కొద్దిమందే ఉన్నారు (లూకా 10:2). సత్రియలు చేయుటయందు ఆసక్తి కలిగి ఉండండి. ప్రభువు యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి రండి.
క్లుప్తంగా చెప్పాలంటే, దేవుడు మంచివాడు మంచి పనులే చేస్తాడు. మీరు కూడా కేవలం మంచిగా ఉండడమే కాదు, మంచి చేయాలి. అలా చెయ్యడం అంటే దేవునిలా ఉండడమే (కీర్తన 119:68). మీ ప్రభువు రక్షకుడు నడిచిన అడుగుజాడలను అనుసరించటమే ఈ మార్గం: ఆయన మేలు చేయుచు ... సంచరించుచుండెను (అపొ.కా. 10:38). ఇది దావీదులా జీవించడమే. అతడు తన తరమువారికి సేవచేసెను (అపొ.కా. 13:36). మరణం లేని ఆత్మను అందమైనదిగా చేసేదే ఈ మార్గం. దీన్ని ఎవరు సందేహించగలరు? యోషీయా మరణించినప్పుడు యూదా వాళ్లందరూ, యెరూషలేము వాళ్లందరూ ప్రలాపించారు (2 దిన 34:24). అతనిలా మరణించాలని ఎవరు కోరుకోరు? యెహోరాము ఎవరికినీ ఇష్టము లేనివాడై చనిపోయాడు (2 దిన 21:20). అతనిలా మరణించాలని ఎవరు కోరుకుంటారు?
సోమరిలా నిష్ప్రయోజకునిగా ఉండడం శ్రేష్ఠమా? మీ స్వార్థం కోసం మీ కోరికల కోసం గర్వం కోసం జీవించడం శ్రేష్ఠమా? లేదా మీ తోటి మనుషుల ప్రయోజనార్థం వెచ్చించడానికి వెచ్చించబడడానికి జీవించడం శ్రేష్ఠమా? మీ దేశానికి లోకానికి దీవెనగానూ చెరసాలలో ఉన్న వారికి బందీలుగా ఉన్న వారికి స్నేహితునిగానూ అన్య దేశాల్లో వేలాదిగా ఉన్న మరణం లేని ఆత్మలకు ఆత్మీయ తండ్రిగానూ కాంతినిస్తూ కరిగిపోయే కొవ్వొత్తిలా అందరూ ఎరిగిన చదవగలిగిన క్రీస్తు పత్రికలా మీ మార్గంలోనికి వచ్చే ప్రతి క్రైస్తవ హృదయానికి ప్రేరణలా ఉండడం శ్రేష్ఠమా? ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో ఎవరికైనా ఒక్క క్షణమైనా సందేహం ఉంటుందా?
యవ్వనస్థులారా మీ బాధ్యతల గురించి ఆలోచించండి. మంచి చేసే విషయంలో ఉన్న ఆధిక్యత గురించి గొప్పతనం గురించి ఆలోచించండి. ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలని ఈ రోజే తీర్మానించుకోండి. వెంటనే మీ హృదయాలను క్రీస్తుకు అర్పించండి.
చివరిగా, మీరు దేవునికి సేవ చేస్తే, మీ జీవిత ప్రయాణం ముగిసినప్పుడు, మీ హృదయానికి కలిగే సంతోషం గురించి ఆలోచించండి. నీతిమంతులకు ఈ లోకంలో కూడా బహుమానం ఉంది. "ఈ లోకంలో నీతిమంతులకు ఎలాంటి మేలూ కలుగదు" అని కొందరు చెప్పిన వ్యర్ధమైన అభిప్రాయాలను కాక, నేను చెప్పే మాటను నమ్మండి. దైవభక్తి నిజానికి ఈ జీవితం గురించిన, రాబోయే జీవితం గురించిన వాగ్దానాన్ని కలిగి ఉంది. దేవుడు మీ స్నేహితుడు అనే భావనలో స్థిరమైన శాంతి ఉంది. మీరు ఎంత అయోగ్యులైనా క్రీస్తులో సంపూర్ణునిగా ఉన్నామనీ మీకు స్థిరమైన స్వాస్థ్యం ఉందనీ మీరు శ్రేష్ఠమైన భాగాన్ని ఎంచుకున్నారనీ అది మీ నుంచి తొలగించబడదనీ తెలుసుకోవడంలో నిజమైన సంతృప్తి ఉంది.
"భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును" (సామెతలు 14:14). లోకానుసారి జీవించిన కాలమంతట్లో ప్రతి సంవత్సరమూ అతని మార్గం అంతకంతకు అంధకారమౌతుంది. క్రైస్తవుని మార్గం ప్రకాశిస్తున్న వెలుగులా చివరి వరకు అంతకంతకు ప్రకాశిస్తూనే ఉంటుంది. లోకానుసారి యొక్క సూర్యుడు నిత్యమూ అస్తమిస్తుండగా క్రైస్తవుని సూర్యుడు నిరంతరం ఉదయిస్తూనే ఉంటాడు. లోకానుసారి యొక్క శ్రేష్ఠమైన సంగతులు అతని చేతుల నుండి జారిపోతూ గతించిపోతూ ఉండగా క్రైస్తవుని శ్రేష్ఠమైన సంగతులు నిరంతరం వికసిస్తూ వర్ధిల్లుతూ ఉంటాయి.
యవ్వనస్థులారా ఈ సంగతులన్నీ సత్యాలే. వాక్యోపదేశాన్ని వినండి. ప్రేరణ పొందండి. సిలువను ఎత్తుకోండి. క్రీస్తును అనుసరించండి. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.