దుర్బోధలకు జవాబు

రచయిత: హితబోధ నెట్వర్క్
చదవడానికి పట్టే సమయం: 11 నిమిషాలు

 

ఏదైనా ఒక భావజాలాన్ని విమర్శించాలంటే, దానిని ఉన్నది ఉన్నట్టుగా వివరిస్తూ విమర్శించాలన్నది వాదనలపై కనీస అవగాహన ఉన్నవారికి తెలిసిన విషయమే; ఈ విషయంలో సోదరులు ప్రవీణ్ పగడాలగారు పక్కదారి పట్టి వాక్యపునాది అనే తన వెబ్ సైట్ లో వక్రీకరణ పునాది వేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే ఆయన వెబ్సైట్ లో 'కాల్వినిజం' అనే భాగం కింద A W పింక్ గారిపైన రాసిన ఒక వ్యాసాన్ని ఖండిస్తూ మేము 'వాక్యపునాదా, వక్రపునాదా' అనే వ్యాసాన్ని ప్రచురించాము; అందులో తరువాయి భాగంగానే దీన్ని కూడా రాస్తున్నాము.

I. ప్రవీణ్ పగడాలగారు యోహాను సువార్త 10వ అధ్యాయం కాల్వినిజాన్ని దృవీకరిస్తుందా అనే తన వ్యాసంలో, యోహాను‌ సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు స్వస్థపడి నమ్మిన సందర్భాన్నీ, 10వ అధ్యాయంలో గొర్రెలకోసం మాట్లాడిన సందర్భాన్నీ కలిపి ఏదో వివరించే ప్రయత్నం చేసారు. చదివేవారికి ఆయన సందర్భసహితంగా వివరిస్తున్నట్టు అనిపించినా, నిజానికి అక్కడ కొండను తవ్వి ఎలుకని పట్టడం తప్ప చేసిందేమీ లేదు.

ఎందుకంటే , యోహాను సువార్త 9వ అధ్యాయానికీ, 10వ అధ్యాయానికీ చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం సుమారు మూడునెలల వ్యవధి ఉంది - గుడ్డివానిని ప్రభువు స్వస్థపరిచింది పర్ణశాలల పండుగలో కాగా గొర్రెల కోసం ఆయన మాట్లాడింది ఆలయ ప్రతిష్ట పండుగ సమయంలో.

II. ప్రవీణ్ పగడాలగారు, యోహాను 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు గొర్రెలు గురించి మాట్లాడిన ఆ సందర్భాన్ని చూపించి, ఇక్కడెక్కడైనా జగత్పునాది వేయబడక ముందే దేవుడు కొందర్ని ఏర్పరచుకున్నట్టుగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఆ మాటలు స్పష్టంగా కనిపించాలంటే, అవి రాయబడిన సందర్భంలోకి వెళ్తే  కనిపిస్తుంది. అంతేకానీ, ఆయన పట్టుకున్న వాక్యభాగంలో ఆ మాటలు లేవు కనుక అవి బైబిల్ లోనే లేవన్నట్టుగా మాట్లాడటం అమాయకత్వం కాకపోతే మరేంటంటారు! ఇప్పుడు ఆయన చూపించిన సందర్భంలో ఏం కనిపిస్తుందో, ఆయనకు కనిపించకుండా పోయినదేదో చూద్దాం.

అక్కడ యేసుక్రీస్తు, "నా గొర్రెలు" అని కొందర్ని, "మీరు నా గొర్రెలలో చేరినవారు కాదని" ఇంకొదర్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అదే సందర్భంలో(యోహాను 10:11) ఆ(తన) గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడుతున్నానని చెప్పి, తాను ప్రాణం పెట్టనివారు కూడా ఈ లోకంలో ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నాడు. దీన్ని కదా అక్కడ చూడాల్సింది. ఒకవేళ మీరు నా గొర్రెలలో చేరినవారు కాదని, ఆయన యూదుల్లోని పరిసయ్యులు, శాస్త్రులతోనే చెబుతున్నాడని ప్రవీణ్ గారంటే( నిజానికి ఆ సందర్భంలో ఆయన వారితోనే అంటున్నాడు) ఆ ప్రకారమైనా, యేసుక్రీస్తు ప్రాణం పెట్టినవారిలో ఆనాడు జీవిస్తున్న ప్రజల్లోనే కొందరు శాస్త్రులు, పరిసయ్యులు మినహాయించబడ్డారని ఒప్పుకోవాల్సిందే - కాల్వినిజం చెబుతుంది కూడా ఇదే కదా!

III. ఇకపోతే, యేసుక్రీస్తు ఆ సందర్భంలో తన గొర్రెలుగా ప్రస్తావిస్తున్నవారు, ఆయన్ని విశ్వసించారు కాబట్టి తన గొర్రెలు అయ్యారా, తన గొర్రెలు కాబట్టే విశ్వసించారా అన్నది మనం ఆలోచించాలి. వారు ఆయన గొర్రెలు కాబట్టే ఆయన్ని విశ్వసించారని ప్రభువే ఆ సందర్భంలో‌ స్పష్టం చేస్తున్నాడు. అందుకే 'మీరు నా గొర్రెలలో చేరినవారు కాదు కనుక మీరు నన్ను విశ్వసించరని' మిగిలినవారితో చెబుతున్నాడు. ప్రవీణ్ పగడాలగారు ఈ వాస్తవాన్ని తృణీకరిస్తూ తన వ్యాసాన్ని కొనసాగించారు.

అదేవిధంగా వారు(గొర్రెలు) రీజెనరేట్ అయ్యాకే ఆయన్ని విశ్వసిస్తారని కాల్వినిస్టులు తప్పకుండా చెబుతారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిని రీజెనరేట్ చెయ్యడానికి కారణం యేసుక్రీస్తు వారికొరకు మాత్రమే ప్రాణం పెట్టడమని, ఆయన వారికోసం ప్రాణం పెట్టడానికి కారణం తండ్రి వారిని మాత్రమే ముందుగా ఎన్నుకున్నాడని‌ కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి(ఎఫేసీ 1:4-6). కనుకనే కొందరు రీజనరేట్ అవుతున్నారు, వారే ఆయన గొర్రెలు, మరి కొందరు అవ్వట్లేదు, వారు ఆయన గొర్రెలు కాదు. కాబట్టి కాల్వినిస్టులు ఆ విధంగా చెప్పడంలో వాక్యానుసారంగా ఏ ఇబ్బందీ లేదు. ఉన్న ఇబ్బందల్లా కాల్వినిస్టులు చెబుతున్నదానిని విమర్శించాలనుకున్నపుడు, వారి పక్షాన్ని పూర్తిగా వివరించకుండా, వారిని తప్పుగా చిత్రీకరించే ప్రవీణ్ ‌గారిలోనే‌ ఉందని అర్థమౌతుంది.

IV. లోకంలో ఉన్న అందరూ యేసుక్రీస్తు గొర్రెలే అని ప్రవీణ్ పగడాలగారు కానీ ఇంకెవరైనా కానీ అంటే, యోహాను 10:26 లో యేసుక్రీస్తు కొందరితో మీరు నా గొర్రెలు కాదని ఎందుకు చెబుతున్నట్టు? తన గొర్రెలకు ఉంటాయని ప్రభువు చెప్పిన గుణలక్షణాలు అందరిలోనూ ఎందుకు లేవు? ఆయన స్వరాన్ని ఆయన గొర్రెలతో పాటుగా లోకంలో  అందరూ‌ విని ఎందుకని ఆయన్ని‌ వెంబడించడం లేదు? ఆయన‌ గొర్రెలు అన్యుని స్వరాన్ని ఏమాత్రమూ వినవు; మరి ప్రపంచంలో అందరూ ఆ విధంగా ఎందుకు లేరు? దీనికి ప్రవీణ్ పగడాలగారు సమాధానం చెప్పాలి. కాల్వినిస్టుల లేఖనానుసారమైన దృక్పథం ప్రకారం ఆయన్ని తన గొర్రెలు మాత్రమే విశ్వసిస్తాయి. ఆయన వారికోసమే దేవుని నిర్ణయం ప్రకారం తన ప్రాణం పెట్టాడు కాబట్టి వారిలో మాత్రమే ఆయన చెప్పిన గుణలక్షణాలు ప్రత్యక్షపరచబడతాయి.

V. కాల్వినిస్టుల భావజాలం ప్రకారం, దేవునికీ విశ్వాసులకీ అన్యోన్యసంబంధం ఉండదని ప్రవీణ్ పగడాలగారు విమర్శించే ప్రయత్నం చేసారు. ఆయనకు ఆ విధంగా ఏ కాల్వినిస్టు చెప్పాడో మాకైతే తెలీదు, ఎందుకంటే ఎవరూ ఆ విధంగా చెప్పరు మరి! బహుశా ఆయనకు ఆయన ‌నమ్మే వేరొక క్రీస్తు కనబడి మెల్లని స్వరంతో ఆ మాటలు చెప్పుండవచ్చు‌. దయచేసి ఆ మాటలు మాకు ఆపాదించొద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాల్వినిస్టుల లేఖనానుసారమైన బోధ ప్రకారం విశ్వాసికీ దేవునికీ అన్యోన్య సంబంధం ఉంటుంది, ఆ సంబంధం విశ్వాసి‌ తనంతట తానుగా సంపాదించుకోలేడు కానీ దేవుని మూలంగానే‌ అది కలుగుతుంది. కాల్వినిస్టులు చెప్పనివాటిని వారికి ఆపాదించి‌, వారిని జనాల్లో విలన్లుగా చిత్రీకరించాలనే ప్రవీణ్ పగడాలగారి వ్యాసాలు చదువుతుంటే, స్ట్రామెన్ ఆర్గ్యుమెంటేషన్ ఎలా చేయాలో తన శిష్యులకు నేర్పించడానికే ఈ విధంగా రాస్తున్నట్టు అనిపిస్తుంది.

VI. ప్రవీణ్ పగడాలగారి వ్యాసం ప్రకారం మనిషి తిరిగి జన్మించబడేదాకా దేవుని అద్భుతకార్యాలు గ్రహించలేక, చచ్చినవాడిగా, దైవోగ్రతకు పాత్రునిగా ఉన్నవాడు‌ కాదటండోయ్, అది కేవలం కాల్వినిస్టుల మూస అంట. ఒకసారి లేఖనాలలో అది కాల్వినిస్టుల‌ మూసో, లేఖనం చెప్పే సత్యమో చూడండి.

ఎఫెసీయులకు 2:1-4 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మము చొప్పున (మూలభాషలో - యుగము చొప్పున) మునుపు నడుచుకొంటిరి.  వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా 'దైవోగ్రతకు పాత్రులమై(మూలభాషలో-ఉగ్రత పిల్లలమై) యుంటిమి'.  అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.

రోమీయులకు 5:10 - ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

వీటి ప్రకారం, ప్రవీణ్ పగడాలగారు కాల్వినిస్టుల మూస అంటూ లేఖనాలను ఏ విధంగా తృణీకరిస్తున్నాడో అర్థం చేసుకోండి.

VII.   ప్రవీణ్ గారు ఇంకా మాట్లాడుతూ, కాల్వినిస్టుల మూసప్రకారం పతనస్థితిలో, చచ్చిన స్థితిలో‌ ఉన్న మనిషి తండ్రి‌బోధను ఎలా‌ వినగలుగుతాడు, యేసు దగ్గరకు ఎలా‌ రాగలుగుతాడు అని ప్రశ్నించారు. బహుశ ప్రవీణ్ పగడాలగారు తండ్రిచేత బోధించబడడం అంటే SOAP(School Of Apologetics and Polemics)క్లాసుల్లోనో, DTS(Discipleship Training School) క్లాసుల్లోనో కూర్చుని వీరి బోధలు వినడం అనుకుంటున్నారేమో. తండ్రి చేత‌ బోధించబడటం అంటే మొదటిగా ఆత్మీయంగా చచ్చిన స్థితి నుండి బ్రతికించబడడం అనీ, లేఖనాలు అర్థమయ్యేలా పరిశుద్ధాత్ముడు హృదయాన్ని తెరవడమని వాక్యం చెబుతుంది. దీనికి‌ సంబంధించి పైభాగంలో ఎఫెసీ పత్రిక నుండి లేఖనాన్ని చూసాము, కింది వచనాలు కూడా చూడండి.

అపొస్తలుల కార్యములు 16:14 - అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్యముంచెను.

ఎఫెసీయులకు 1:17 - మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో-

2 కొరింథీయులకు 4:5 - అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

ఆయన నిర్ణయంలో ఉన్నవారిని మాత్రమే యేసుక్రీస్తును విశ్వసించే విధంగా ఆత్మీయంగా చచ్చినస్థితి నుండి బ్రతికించి, మనోనేత్రాలు వెలిగించి, సువార్తను గ్రహించేలా హృదయాన్ని తెరిచినపుడు వారు యేసు దగ్గరకు వస్తారు. అందుకే, తండ్రిమాటలున్న లేఖనాలను‌ ప్రతీదినం ధ్యానించే శాస్త్రులు, పరిసయ్యులు ఎంతోమంది ఆయన బోధ గ్రహించలేక యేసుక్రీస్తు దగ్గరకు వెళ్లలేకపోయారు;‌ ప్రస్తుతం కూడా అందుకే అనేకులు సువార్తకు స్పందించలేకపోతున్నారు.

VIII. ప్రవీణ్ పగడాలగారు, యోహాను 6:45 ను ఊటంకించి పాతనిబంధన లేఖనాలలో తండ్రి స్వరాన్ని విన్నవారంతా యేసుక్రీస్తు స్వరాన్ని విని, ఇద్దరి స్వరమూ ఒకటే అని గ్రహించి ఆయన చెంతకు వస్తారు అని ప్రతిపాదించారు. అలా అయితే అప్పటి యూదులందరికీ పాతనిబంధన లేఖనాలు తెలిసినా వాళ్లంతా యేసుక్రీస్తును ఎందుకు నమ్మలేకున్నారో ఆయనే తెలియచేయాలి. యేసుక్రీస్తు దీనికి చెప్పిన సమాధానమైతే మాత్రం - వారు ఆయన గొర్రెలు కాదు కనుకే వారు గుర్తించలేకపోయారు.

అదేవిధంగా యేసుక్రీస్తును విశ్వసించినవాడికి ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగాలనే షరతులు ప్రభువే పెడుతున్నట్టు ప్రవీణ్ పగడాలగారు ఊటంకించారు. కానీ వాస్తవానికి, ఆయన శరీరాన్ని తినిత్రాగాలన్న అలంకారాలు, తనయందు విశ్వాసముంచాలన్న విషయాన్ని బోధించడానికే ఆ సందర్భంలో సాదృశ్యంగా వాడారని అక్కడే స్పష్టమౌతుంది.  గొర్రెలు మాత్రమే విశ్వసిస్తాయని మనమిదివరకే లేఖనాల వెలుగులో చూసాం. ఇక్కడ ప్రవీణ్ గారికి తెలియని ఇంకొక సత్యం ఏమిటంటే, అలా విశ్వసించే సామర్థ్యం కూడా దేవుడే తన గొర్రెలకు ఇస్తాడని వాక్యం‌ చెబుతుంది.

హెబ్రీయులకు 12:2 - మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు(మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.

ఈ వచనం ప్రకారం ఆయనే విశ్వాసానికి కర్త(పుట్టించేవాడు), ఆయనే దాన్ని కొనసాగించేవాడు. ఇది మనిషి తనంతట తాను పుట్టించుకునేది కాదు, దేవుని వరం. 

ఎఫెసీయులకు 2:8 - మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

దేవుని నుంచి ఈ రోజుకీ మనకి కొత్తకొత్త దర్శనాలు వస్తున్నాయని చెబుతూ మళ్ళీ, తూచ్ అవి ప్రత్యక్షతలు మాత్రం కాదు నడిపింపు అని లేబుల్ మార్చే ప్రవీణ్ పగడాల లాంటివారు లేఖనాలు ఇంత‌వివరంగా చెబుతున్న సత్యాన్ని కూడా గ్రహించకపోవడం బహుశోచనీయం.

వాస్తవానికి ప్రవీణ్ పగడాలగారు తన వ్యాసంలో మాట్లాడిన అతితక్కువ నిజాల్లో ఒకానొక నిజం ఏంటంటే, అబద్ధక్రీస్తులు, అబద్ధ మెస్సీయలు ఆ కాలంలో అనేకులు వచ్చారన్నదే. ఆ కాలంలోనే కాదు ఈ కాలం వరకూ కూడా అటువంటి అబద్ధ/వేరొక క్రీస్తులు వస్తూనే ఉన్నారు, ప్రకటించబడుతూనే ఉన్నారు; అందులో ప్రవీణ్ పగడాలగారు నమ్మే అర్మీనీయన్ల క్రీస్తు ఒకరు.

ఇంతటితో ఈ వ్యాసం సమాప్తం. 'వాక్యపునాదా,వక్రపునాదా' పార్ట్ 3లో‌మళ్ళీ కలుద్దాం.

 

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.