బైబిల్

రచయిత: జాషువ జూడ్

 

విషయసూచిక

ఉపోద్ఘాతం

బైబిలులో వ్రాయబడిన వాటి కంటే లెక్కకు మించిన అద్భుతాలు మన ప్రభువైన యేసు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ బైబిలులో వ్రాయబడలేదు గాని వ్రాయబడినవి ఎందుకు వ్రాయబడ్డాయో యోహాను 20:31లో ఉంది. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” ఆయన చేసిన అద్భుతాలు మనలో ఆయనపట్ల విశ్వాసం పుట్టించాలి (యోహాను 2:11,231 దేవుని గొప్ప కార్యాల్ని పశుప్రాయులు గ్రహించరు. అవివేకులు వివేచించరు (కీర్తన 92:6). ప్రభువు అనేక అద్భుతాలు వారి ముందు చేసినప్పటికీ యూదులు అనేకులు ఆయనలో విశ్వాసముంచలేదు (యోహాను 12:37). దేవుడు తన కుమారుడైన యేసుచేత అద్భుతాలు చేయించి, ఆయనను తనవలన మెప్పు పొందినవానిగా ప్రజలకు కనుపరిచాడు (అపొ.కా. 2:22). ప్రభువు చేసిన అద్భుతాలే తండ్రి ఆయనను పంపాడని ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి (యోహాను 5:36). ప్రభువు ఇలా అన్నాడు, “తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రియందు నేనును, నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి” (యోహాను 14:10, 11).

తాను చేసిన అద్భుతాల ద్వారా తనకు ఈ సృష్టి పై, వ్యాధులపై, అపవిత్రాత్మలపై, మరణముపై అధికారమున్నదని ప్రభువు ఋజువు చేశాడు. ఆయనను విశ్వసించడానికి ఆయన ఇంకేమి చెయ్యాలి? ఇంకా ఏమి చేస్తే ఆయనను నమ్ముతారు? పాపులమైన మనకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇన్ని అద్భుతాలు చేసినా యేసు ప్రభువుని నమ్మనివారి పాపానికి మిష లేదు. అందుకే ప్రభువు ఇలా అన్నాడు, “నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారిమధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు” (యోహాను 15:22,24).

ఈ చిన్న గ్రంథంలో ప్రభువు చేసిన అద్భుతాలను ధ్యానించడం ద్వారా అందరూ ఆయనను నమ్మాలనీ, నమ్మినవారు విశ్వాసంలో ఎంతో బలపడాలని కోరుతూ ...
రచయిత

1. తుపానును నిమ్మళపరచడం

మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు సాటిలేనివి. యోహాను సువార్త 5:36 లో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, “నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకిచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.” యోహాను 14:10, 11 లలో ప్రభువు మరలా ఇలా సెలవిచ్చాడు, “తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.” తాను చేసిన అద్భుతాలను చూసి ఆయనను నమ్మనివారిని గూర్చి ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చాడు, “నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారిమధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును, నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు” (యోహాను 15:22-24).

నిజంగానే ప్రభువు చేసిన క్రియలు ఎవడూ, ఎన్నడూ చేయలేదు. అటువంటి అద్భుతాలను ఆయన చేసినా ఆయనను నమ్మకపోవడం మూఢత్వమే అవుతుంది. యోహాను 7:31లో ఇలా వ్రాయబడి ఉంది, “మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చునపుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా? అని చెప్పుకొనిరి.” ఎన్ని అద్భుతాలు చేసినా ఆయనను నమ్మకుంటే ఇంక ఏం చేస్తే ప్రభువుని నమ్ముతారు? ఒకప్పుడు కొందరు వచ్చి ప్రభువుని శోధిస్తూ ఒక సూచక క్రియ చేయమన్నారు. అప్పుడు ప్రభువు వారితో ఇలా అన్నాడు, “వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచకక్రియను అడుగు చున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గానీ మరి ఏ సూచక క్రియయెనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనెవే వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నేనెవేవారు ఈ తరమువారితో నేరసాపన చేతురు. ఇదిగో యోనాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు (మత్తయి12:39-41).

తనను సూచక క్రియ చేయమని అడిగిన శాస్త్రులు, పరిసయ్యులతో ఆయన తాను చనిపోయి మూడు రోజులకు తిరిగి లేవడమే వారికి గొప్ప సూచక క్రియగా ఉంటుందని చెప్పాడు. అయితే ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత  సమాధిని కావలి కాసిన సైనికులు ప్రభువు తిరిగి లేచిన సత్యాన్ని యాజకులకు చెప్పారు. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతి ప్రధాన యాజకులకు తెలియజేసింది ప్రభువు శిష్యులు కాదు, రోమా సైనికులే. స్పష్టంగా ప్రభువు పునరుత్థానాన్ని గూర్చి ప్రధాన యాజకులకు తెలిపినప్పటికి గొప్ప సూచక క్రియను బట్టి కూడా వారు ప్రభువును నమ్మలేదు. అందుకే ప్రభువు ఇలా అన్నాడు, “ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు.”

ప్రభువు చేసిన అద్భుత కార్యాలు ధ్యానించడం ద్వారా ఆయన దేవుడనీ, దేవుని ఏకైక అవతారమనీ, ఆయన ఒక్కడే అద్భుత కార్యాలు చేయగల శక్తిమంతుడనీ ఆయన తప్ప మనలను రక్షించే నామం మరొకటి లేదనీ నమ్మండి. ఆయనను నమ్మడానికి తాను చేసిన అద్భుత కార్యాలను మనకు ఆధారంగా ఇచ్చినా నమ్మకపోతే మనం నిరుత్తరులమే. ఈ చిన్న గ్రంథంలో ప్రభువు చేసిన కొన్ని అద్భుతాలను వరుసగా ధ్యానించి, వాటిలోని ఆత్మీయ పాఠాలను నేర్చుకొని మన జీవితాలను ఫలవంతం చేసుకుందాం.

మత్తయి 8:23-27 - "ఆయన దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి - ప్రభువా, నశించిపోవుచున్నాము మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన-అల్ప విశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి - ఈయన యెట్టివాడో ఈయనకు గాలియు, సముద్రమును లొబడు చున్నవని చెప్పుకొనిరి."

  • ప్రభువు చేసిన ఈ అద్బుతంలోని కొన్ని ఆత్మీయ పాఠాలు

మొదటి పాఠం : ప్రభువు మాటతో తుఫానును గద్దించి నిమ్మళపరిచేసరికి శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎలాంటివాడో, ఈయనకు గాలి, సముద్రము లోబడుతున్నాయని చెప్పుకున్నారు. కొన్ని వచనాల ద్వారా మన ప్రభువు ఎట్టివాడో తెలుసుకుందాం. “ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడైయున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు” (కొలస్సీ 1:15, 16, 17). “దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది” (కొలస్సీ 2:9). "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను . . . ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొన లేదు” (యోహాను 1:1,2,3, 10). ఈ వచనాల ద్వారా యేసుక్రీస్తు దేవుడు అని స్పష్టముగా బోధపడుతున్నది. అంతేకాదు, ఆయనే సృష్టినంతటినీ కలుగజేసినవాడని గ్రహించగలం. చాలామంది యేసుక్రీస్తు ఎలాంటివాడో తెలియక ఆయన ఏదో ఒక మత గురువనీ, మహా పురుషుడనీ, ప్రవక్త అనీ, దైవ అవతారాల్లో ఒక అవతారమనీ, ఒక మంచి బోధకుడనీ తలుస్తున్నారు. కాని యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త అని బైబిలు స్పష్టంగా బోధిస్తున్నది.

ప్రభువు గద్దించగానే గాలి, సముద్రం లోబడ్డాయి. తుఫాను ఆగిపోయింది. చూశారా, మన ప్రభువు సృష్టిపై ఎంత అద్భుతమైన శక్తి ప్రభావాలు కలిగినవాడో! ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టిపై సర్వాధికారాలు కలిగినవాడు. "ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచున్నాడు” (హెబ్రీ 1:3,4).

మన ప్రభువు ఎలాంటివాడో మరి రెండు విషయాలు తెలుసుకుందాం. దోనె తుఫానులో అలలతో కప్పబడింది. శిష్యులు నశించిపోతామేమోనని భయపడుతున్నారు. ప్రభువు మాత్రం నిద్రపోతున్నాడు. మన ప్రభువును ఏదీ భయపెట్టలేదు. ఆయనకు భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేది ఏదీ లేదు.

తుపానును నిమ్మళపరిచి, శిష్యుల భయాన్ని పోగొట్టి, రక్షించమని మొరకు జవాబిచ్చి, వారిని గట్టుకు చేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఉన్న తుఫానువంటి కష్టాలను పోగొట్టి, నీకు శాంతిని, నిమ్మళమైన జీవితాన్ని ఇచ్చి నీ ప్రార్థనలు విని నిన్ను మోక్షం చేరుస్తాడు.

యేసుక్రీస్తు ప్రభువు ఎట్టివాడో గ్రహించావా? ఆయనే దేవుడు. సృష్టినంతటినీ అధికారంతో పరిపాలించేవాడు. నిన్ను రక్షించి ఒడ్డుకు చేర్చేవాడు.

రెండవ పాఠం : ప్రభువు ఆ దోనెలో ఉన్నాడు కాబట్టి తుపాను నుండి రక్షించి దరికి చేర్చాడు. ఆ దోనెలో శిష్యులకు ప్రభువు తప్ప మరేమి ఉన్నా వృథాయే కదా! ఒక కేజీ బంగారం ఉన్నా, ఎంతమంది బంధువులు, పెద్దమనుషులు ఉన్నా తుపానును నిమ్మళపరచగలరా? వారి ఆపద తొలగించి నెమ్మది ఇవ్వగలరా?

మీ జీవితమనే ఓడలో ప్రభువును కలిగి ఉన్నారా? ఆయన లేకుండా మీరు లోకమంతా కలిగిఉన్నా వృథాయే. నీ ఆస్తి, పేరు ప్రఖ్యాతలు, కులం, చదువు పదవి నిన్ను రక్షించలేవు కదా! అందుకే రక్షకుడైన యేసు ప్రభువును నీ జీవితంలోనికి ఆహ్వానించు. అప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది.

మూడవ పాఠం : ప్రభువును కలిగి ఉన్న శిష్యుల దోనె మీద కూడా తుపాను వచ్చింది. చాలామంది ప్రభువును నమ్ముకుంటే అంతా హాయిగా ఉంటుంది, ఏ కష్టాలూ, అనారోగ్యాలు రావు అనుకుంటారు. సముద్రం మీద తుఫాను, అలలు రాక తప్పవు. అలాగే శరీరంతో ఉన్నంతకాలం రోగాలు రాకతప్పవు. 'మరి ప్రభువును నమ్ముకుంటే మేలేంటి?' అంటారేమో. ప్రభువు దోనెలో ఉన్నందువల్ల వారిని రక్షించాడు. అలాగే ప్రభువు కష్టాలలో మనకు తోడైయుండి రక్షిస్తాడు. శ్రమలను మేలుగా మారుస్తాడు. ఆ తుఫాను రావడం ద్వారానే ఆయన తుఫానును నిమ్మళపరచ గల శక్తిమంతుడని తెలిసింది. ఈ విధంగా శ్రమల్లో దేవుని శక్తినీ, ప్రేమనూ మనం అనుభవించగలం.

నాలుగవ పాఠం : అంత తుపానులో కూడా ప్రభువు నిద్రపోయాడు. తండ్రిని నిస్సందేహంగా నమ్మాడు. నిజ విశ్వాసం శ్రమల్లో భయపడదు. ఆందోళన చెందదు దుర్వార్తకు జడవదు. అందుకే భయపడిన శిష్యులను చూసి ప్రభువు "అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని” అన్నాడు. అల్ప విశ్వాసం శ్రమలను చూస్తుంది, భయపడుతుంది. విశ్వాసం దేవుణి, ఆయన అపారమైన శక్తి ప్రేమలను, వాగ్దానాలను చూస్తుంది. వారి భయం అనవసరమైనది, అర్థం లేనిది. లూకా 8:22లో వ్రాయబడినట్టు, ప్రభువు శిష్యులతో 'అద్దరికి వెళదాము' అన్నాడు. అంటే వారు అద్దరికి తప్పక వెళతారు కదా, మునిగిపోతారని ఎందుకు భయపడ్డారు? అయినా ఆ తుఫాను వారిని, వారితోపాటు ప్రభువును కూడా ముంచివేస్తుందా? గొప్ప ప్రభువును కలిగి ఉండి కూడా భయపడడంలో అర్థం లేదే! ప్రభువు వారిని పిలిచి సేవకు ప్రత్యేకించుకున్నాడు. అయినా చనిపోతామేమో, సముద్రంలో మునిగిపోతామేమోనని అనవసరంగా భయపడ్డారు.

ఈ విధంగా విశ్వాసులమైన మనం భయపడడం దేవుని శక్తిని, వాగ్దానాలను గట్టిగా నమ్మనట్లే. విశ్వాసులమని పిలువబడే మనలో నిజవిశ్వాసం ఉందా అసలు?

అయిదవ పాఠం : భయపడినప్పటికీ శిష్యులు రక్షించు ప్రభువా అని ప్రార్థించారు. తుఫానును గద్దించగలడని వారు ఊహించనప్పటికీ ఎలా రక్షిస్తాడో తెలియకపోయినా సరే, వారు మొరపెట్టారు. ఓ భక్తుడు ఇలా అన్నాడు, “దేవుడు సహాయం ఏ రీతిలో చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో తెలియదు గానీ, సహాయం చేయకుండా మాత్రం ఉండడని తెలుసు.” నిజమే, నీ పరిస్థితులు నీ శక్తికి మించిపోయినపుడు దేవునికి మొరపెట్టు; ఆయన అద్భుతంగా నిన్ను విడిపిస్తాడు.

ఆరవ పాఠం : సముద్రం మీద తుపానును గద్దించి నిమ్మళపరిచేముందు శిష్యులలో చెలరేగిన భయం, అల్పవిశ్వాసం అనే తుపానును ప్రభువు గద్దించాడు. మన బయటి పరిస్థితులు మారాలంటే ముందు మనం మారాలి. మొదట మనలోపల ఉండే భయం, కోపం, స్వార్థం, కామాతురత, ధనా పేక్ష అనే తుపానులు తగ్గాలి. అప్పుడే మన బయటి తుపానువంటి కష్టాలు పోగలవు. ఒక సంఘస్తురాలు పాస్టరుగారితో తన భర్త మార్పు గురించి ఎన్నో ప్రార్థనలు చేయిస్తూ ఉండేది. అతడు ఎంతకీ మారకపోయేటప్పటికి పాస్టరుగారు, "అమ్మా, ఒకవేళ అసహనంతో ఉన్న నీ ప్రవర్తన మార్చుకుంటే నీ భర్త మారతాడేమో” అన్నారు. ఆమె సహించడం, ప్రేమించడం మొదలు పెట్టింది. ఆశ్చర్యపడిన ఆమె భర్త “నిన్ను మార్చగలిగాడంటే నీ దేవుడు నిజంగానే గొప్పవాడు. నేను ఆయన్ని నమ్ముకుంటాను” అన్నాడు. నిజమే, మనం ముందు మారాలి; అప్పుడే మన ఇంటివారు, బయటివారు మారతారు.

మనలో ఉన్న ఏ తుపానునైతే ప్రభువు ఇప్పుడు గద్దిస్తున్నాడో గమనించి సరి చేసుకుందాం.

2. మల్కు చెవి

లూకా 22:47-52 - "ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండు మందిలో యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు - యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించు చున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరుగబోవుదానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి, వాని కుడిచెవి తెగనరికెను. అయితే యేసు - ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.”

యోహాను 18:3-11 - "యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారి వద్దకు వెళ్ళి, మీరెవరిని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు - ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. మరల ఆయన - మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో - నేనే ఆయనని మీతో చెప్పితిని. గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను. సీమోను పేతురు నొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు - కత్తి ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.”

చదవబడిన వాక్యభాగాలలో ప్రభువు సిలువ వేయబడడానికి ముందు ఆయనను పట్టుకోవడానికి వచ్చిన సైనికుల ఎదుట ప్రభువు రెండు అద్భుతాలు చేశాడు .

మొదటి అద్భుతం : ఆయుధాలతో వచ్చిన సైనికులను మీరు ఎవరిని వెదకు తున్నారని ప్రభువు అడిగినపుడు నజరేయుడైన యేసునని వారు బదులిచ్చారు. అందుకు ప్రభువు ఆయనను నేనే అని వారితో చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేలమీద పడ్డారు. సైనికులు ఆయుధాలతో ఆయనను పట్టుకోవడానికి వచ్చి ఆయన మాటలోని ప్రభావాన్ని బట్టి నేలమీద పడ్డారు. ప్రభువు మాటలోని ప్రభావం ఎంత గొప్పదో చూశారా!

రెండవ అద్భుతం : ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన ప్రధాన యాజకుని బంట్రౌతులలో ఒకనిని పేతురు కత్తిదూసి కొట్టి అతని కుడిచెవి తెగనరికాడు. అయితే ప్రభువు నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొనువారందరు కత్తిచేతనే నశింతురు అని పేతురును గద్దించి మల్కు అను ఆ ప్రధాన యాజకుని దాసుని చెవి ముట్టి బాగుచేశాడు. ఆయనను పట్టుకోవడానికి వచ్చిన సైనికుని చెవిని ముట్టి బాగుచేసి శత్రువుకు కూడా ప్రభువు మేలు చేశాడు. ఈ రెండు అద్భుతాలను ఆ సైనికులందరూ కన్నులారా చూసి కూడా ఆయనను నమ్ముకొనలేదు.

ఈ రెండు అద్భుతాలను గూర్చి కొద్దిగ ధ్యానించుకుందాం. నేనే ఆయనను అని ఆయనను వెదుకుతున్న సైనికులతో ఆయన చెప్పినపుడు వారు వెనక్కి తగ్గి నేలమీద పడ్డారు. ఆయనను బంధించడానికి ఆయుధాలతో వచ్చినవారు నేనే ఆయనను అనగానే నేలమీద పడ్డారు. మీరు వెదకుతున్న ఆయనను నేనే అని ప్రభువు అనడంలో నిర్గమ 3:14లో దేవుడు తెలియజేసిన ఆయన నామం ప్రతిధ్వనిస్తుంది. నేను ఉన్నవాడను అనువాడనై యున్నానని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. ఆ దైవనామాన్ని యేసు ప్రభువు చాలా పర్యాయాలు తనకు ఆపాదించుకున్నాడు. నేనే ఆయనను అని సైనికులతో పలికినపుడు ప్రభువు తన దైవత్వాన్ని, దైవ ప్రభావాన్ని బయలుపరిచాడు. తాను దేవుని నామం గలవాడనని తనను గూర్చి తాను తెలియజేసిన మరికొన్ని సందర్భాలను తెలుసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రాహాము పుట్టకమునుపే తాను ఉన్నానని ప్రభువు సెలవిస్తూ, “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉంటిని” అనకుండా “నేను ఉన్నాను” అని అన్నాడు. నేను ఉన్నాను అనే దైవనామాన్ని ప్రభువు తన గురించి చెప్పుకునేటప్పుడు వాడాడు. యోహాను 8:28లో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, “మీరు మనుష్య కుమారుని పైకెత్తినపుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.” యోహాను 6:35లో ప్రభువు ఇలా అన్నాడు, “జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.” ప్రభువు ఇలా సెలవిచ్చాడు, “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను” (యోహాను 8:12). " గొర్రెలు పోవు ద్వారముమును నేనే. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల రకింపబడినవాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును (యోహాను 10:8, 9). “నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరిగా కొరకు తన ప్రాణము పెట్టును” (యోహాను 10:11). "పునరుత్థానమును, జీవములు నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును” (యోహాను 11:25). “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు” (యోహాను 14:6). ఈ రీతిగా సెలవిచ్చిన ప్రభువు సైనికుల ఎదుట తాను దేవుని నామం, మరియు ప్రభావం కలిగియున్నాడని రుజువు చేసిన సరే, వారు ప్రభువును నమ్మలేదు. క్రింద పడి తిరిగిలేచి ఆయనను పట్టుకున్నారేగానీ ఆయన ప్రభావాన్ని చూసి మారుమనస్సు పొంది ఆయనను నమ్మలేదు.

అలాగే మల్కు అనే ప్రధాన యాజకుని బంట్రౌతు చెవిని పేతురు తెగనరికినప్పుడు సైనికులందరి ఎదుట ప్రభువు అతణ్ణి బాగుచేసినా వారు పశ్చాతాపపడలేదు ప్రభువును అంగీకరించలేదు. ఆయన పట్ల కృతజ్ఞత చూపనూలేదు. శత్రువుగా తనను బంధించడానికి వచ్చిన మల్కును ప్రభువు అతడు అడగకుండానే బాగుచేసినా మల్కు గానీ, అతని తోటి బంట్రౌతులు గానీ ప్రభువును నమ్మలేదు. శత్రువుల పట్ల ప్రభువు చూపించే ప్రేమ, శత్రువుకు మేలుచేసే ఆయన దయ, తెగిపోయిన చెవిని తిరిగి అతికి స్వస్థపరచిన ఆయన గొప్ప శక్తిని కళ్ళారా చూసి కూడా ఆ సైనికులు ప్రభువును నమ్మలేదు. మానవుని మూఢత్వం ఎంత భయంకరమైనదో కదా!

ప్రియులారా, యేసు ప్రభువు యొక్క అద్భుతమైన సాటి లేని శక్తిని, ప్రేమను ఆయన చేసిన అద్భుతాలలో గ్రహించారు గదా! మరి ఇలాంటి ప్రభువులో విశ్వాస ముంచారా? ఎవరూ చేయని అద్భుత కార్యాలను ప్రభువు చేయడాన్ని బట్టి ఆయనను నమ్మకపోతే మన పాపానికి అంతులేనట్టే. యేసు ప్రభువునందు విశ్వాసముంచండి, ఆయన ప్రేమను, ఆయన శక్తిని గ్రహించి ఆయనే అద్వితీయ దేవుడని, మనల్ని రక్షించే ఏకైక నామమని నమ్మి ఆయనను వెంబడించడానికి ఆశించండి. “నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విధింపబడును” (మార్కు 16:16). ప్రభువును నమ్మండి, రక్షణ పొందండి.

3. అర షెకెలు పన్ను

మత్తయి 17:24-27 - "వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి - మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి యెత్తి, సీమోనూ, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా? అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును. దానిని తీసికొని నా కొరకును, నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.

  • ఈ భాగం ద్వారా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి కొన్ని విషయాలు

మొదటిది, పన్ను వసూలు చేసేవారు ఇంటి బయట పేతురును కలిసారు. పేతురు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి మాట్లాడాడు. పేతురు మాట్లాడకముందే అతడు ఏమి మాట్లాడబోతున్నాడో ప్రభువు ఎరుగును. ఆయనకు మన హృదయ రహస్యాలు తెలుసు. కీర్తన 139:1-4లో ఇలా వ్రాయబడి ఉంది, “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.” దేవునికి సమస్తము తెలుసు. ఆయన సర్వజ్ఞాని. లోకంలో ఆయనకు మరుగైనదేదీ లేదు. ప్రభువు పేతురుతో సముద్రములో గాలంవేసి మొదట పైకివచ్చిన చేప నోటిలో ఒక షెకెలు నాణెం ఉంటుంది. దానితో పన్ను చెల్లించమని చెప్పాడు. సముద్రంలో కోటానుకోట్ల చేపలుంటాయి. ఏ చేప కడుపులో ఏముందో ఎవరు చెప్ప గలరు? అయితే ప్రభువు సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి గాలం వేస్తే మొదట వచ్చే చేప నోటిలో ఒక షెకెలు నాణెం ఉంటుందని చెప్పగలిగాడు. ఆహా! ప్రభువు జ్ఞానం ఎంత విసారమైనది, మీ గురించి ఆయనకు సమస్తము తెలుసు. మీ కష్టాలు, చింతలు, భయాలు తలంపులు ఆయనకు తెలుసు. ఆయనలాగా మన గురించి సమస్తాన్ని ఎరిగినవారు ఇంకెవ్వరూ లేరు.

ప్రభువును గూర్చి మనం తెలుసుకోవలసిన రెండవ విషయం : ఆయనకు సర్వసృష్టిపై సర్వాధికారం ఉన్నది. పేతురు సముద్రంలో గాలం వేసినపుడు ఏ చేప ముందు రావాలో ఆయన నిర్ణయించాడు. కీర్తన 50: 10-12 లో ఆయన ఇలా సెలవిచ్చాడు, “అడవి మృగములన్నియు వేయి కొండల మీద పశువులన్నియు నావే గదా. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే.” యోబు 41:11లో దేవుడు ఇలా సెలవిచ్చాడు, “నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా.” యోబు 12:10లో ఇలా వ్రాయబడి ఉంది, “జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.” సర్వసృష్టి ఆయన అధికారంలోనే ఉన్నదని గ్రహించగలం. అంతేకాదు, మన జీవితాలు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. “నా కాలగతులు నీ వశములో నున్నవి” (కీర్తన 31:15). దానియేలు 5:23లో ఇలా వ్రాయబడి ఉంది, “చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కట్ట, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.” ప్రియులారా, యేసు ప్రభువు సర్వాన్ని సృష్టించి తన మహత్తు గల మాటచేత సర్వసృష్టిని నిర్వహిస్తున్నాడు. ఆయన శక్తి ఎంత గొప్పదో గ్రహించగలం.

ప్రభువును గురించి మనం తెలుసుకోవలసిన మూడవ విషయం : పేతురు అడగకముందే, తన ఊహకు మించి పేతురు తన కొరకు పన్ను కట్టడానికి కూడా ప్రభువే సిద్ధపరిచాడు. మన ప్రభువు మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటి కంటే అత్యధికముగా చేసేవాడు.

ఈ అద్భుతం ద్వారా ఇప్పుడు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం.

1) యేసు ప్రభువు దేవుడు గనుక పన్ను కట్టనక్కరలేదు. కాని వారికి అభ్యంతరం కలుగచేయకుండేలా పన్ను చెల్లించాడు. మనము ఇతరులకు అభ్యంతరం కలుగచేయకూడదు. అందుకోసం మన హక్కులను కూడా అవసరమైతే త్యాగం చెయ్యాల్సివస్తే త్యాగం చెయ్యాలి. చాలామంది తమ హక్కుల కొరకు పోరాడుతుంటారు. విశ్వాసులమైన మనం ఇతరులకు అభ్యంతరం కలుగచేయకుండేలా మన హక్కుల విషయంలో త్యాగభరితులంగా జీవించాలి.

2) ప్రభువు పేతురుతో సముద్రం ఒడ్డుకు వెళ్ళి గాలం వెయ్యి, మొదట పైకి వచ్చిన చేప నోటిలో ఒక షెకెలు ఉంటుంది. దానితో నీ కోసం, నా కోసం పన్ను కట్టు అన్నాడు. పేతురు దానిని నమ్మాడు. సముద్రంలో ఎన్నో కోట్ల చేపలుంటాయి. ఏ చేపలో ఏముంటుందో ఎలా తెలుస్తుంది? షెకెలు నాణెం ఉన్న చేపే పడుతుందని ఏముంది? అని మాత్రం సందేహించలేదు. ప్రభువు మాటను పూర్తిగా నమ్మాడు. ఆయనకు సమస్తం తెలుసునని, సమస్త సృష్టిపై ఆయనకు సమస్త అధికారం ఉన్నదని నమ్మాడు. అలాగే మనం కూడా అన్ని పరిస్థితులలో ప్రభువుకు సమస్తం తెలుసునని, ప్రపంచం ఆయన అధికారంలోనే ఉన్నదని నమ్మాలి.

3) పేతురు ప్రభువు మాటను నమ్మడమే కాదు, ఆ మాటకు లోబడ్డాడు. ప్రభువుకు లోబడకుండా ఆయనను నమ్మాను అనడం వట్టిది. క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచలేమని యాకోబు 2:18లో చదువగలం. విశ్వాసంతో ప్రభువుకు లోబడడం ఎంతో ఆనందకరమైనది. సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదటి చేప నోటిలో షెకెలు నాణెం తెమ్మన్నప్పుడు పేతురు ఎంతో ఆత్రుతతో, ఆనందంతో వెళ్ళి ఆ అద్భుతాన్ని అనుభవించి ఉంటాడు. అలాగే మనం కూడా ప్రభువు మాటను నమ్మి ఆయనకు అన్ని విషయాలలో లోబడితే అద్భుతాలు తప్పక చూడగలం.

4) ప్రభువు చెప్పినట్లు పేతురు లోబడ్డాడు. కనుక పేతురు పన్ను కూడా ప్రభువే కడుతున్నాడు. మనం ప్రభువు పనిచేస్తే, మరి మన పని ఎవరు చేస్తారు? అవి ఆగిపోతాయి అనుకుంటూ ఉంటాం. ప్రభువునకు లోబడడం మన కర్తవ్యం. దేవుడే మన అవసరాలన్నీ తీరుస్తాడు. మత్తయి 6:33లో ఆయన ఇలా సెలవిచ్చాడు, “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” మన ప్రభువు సమస్తాన్ని ఎరిగినవాడు, సర్వజ్ఞాని, ప్రపంచమంతా ఆయన అధికారంలో ఉన్నదని తెలుసుకున్నాం. ఇటువంటి ప్రభువును నమ్మి ఆయనకు సంపూర్ణంగా లోబడి మేలు పొందగలం.

4. పదిమంది కుష్ఠరోగులు బాగుపడుట

లూకా 17:11-19 - "ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవుచు సమరయ, గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక గ్రామములోనికి వెళ్ళుచుండగా పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి - యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి - మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా శుద్దులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు - పదిమంది శుద్దులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగివచ్చిన వాడెవడును అగపడ లేదా? అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.”

ఈ అద్భుతంలోని కొన్ని ఆత్మీయ పాఠాలు

యేసు ప్రభువు కుష్ఠరోగులను ఉచితముగా, సంపూర్తిగా స్వస్థపరిచాడు. వారు యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని చేసిన ప్రార్థనను విని వారిని స్వస్థపరిచాడు. ప్రభువు మన ప్రార్థన అంశాలను కృతజ్ఞతాంశాలుగా మార్చేవాడు. తమ అనారోగ్యం చేత ఆ పదిమంది తమ కుటుంబాలకు, సమాజానికి, ఇంటికి దూరంగా నిరాశగా ఉంటున్నవారిని ప్రభువు స్వస్థపరచుట ద్వారా తమ కుటుంబాలతో, సమాజంతో వారిని కలిపాడు. అట్లే మనం కూడా ప్రభువు ద్వారా మేలు పొందగలం. కుష్ఠరోగం మానవులందరికీ ఉన్న పాప రోగానికి సాదృశ్యంగా ఉంది. కుష్ఠరోగం ఎలాగైతే మనిషి అవయవాలన్నిటినీ క్రమంగా తినివేసి మనిషిని మరణానికి గురిచేస్తుందో, పాప రోగం కూడా మానవుని జీవితాన్ని పాడుచేసి ఆఖరికి మరణానికి, నరకానికి గురిచేస్తుంది. పాపం అంతటి భయంకరమైనది. ఇట్టి పాపరోగాన్నుండి మనల్ని స్వస్థపరిచేవాడు యేసు ప్రభువు ఒక్కడే. ఆ పదిమంది ప్రభువు ద్వారా ఏ రీతిగా మేలు పొందారో, మనం కూడా ప్రభువు ద్వారా ఏ రీతిగా మేలుపొందగలమో తెలుసుకుందాం.

మొదటిది, వారు ప్రభువులో విశ్వాసముంచారు. బాగుపడిన తరువాత కృతజ్ఞతతో తిరిగి వచ్చిన సమరయుని చూచి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని ప్రభువు చెప్పాడు. విశ్వాసం ద్వారానే మనం కూడా ప్రభువు వలన మేలు పొందగలం.

రెండవది, వారు యేసుప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేశారు. ప్రభువునందలి విశ్వాసం మన ప్రతి అవసరతలోనూ ఆయనను ఆశ్రయించేలా చేస్తుంది. ఆయనను ఆశ్రయించే వారు ఆయనను ఎలుగెత్తి ప్రార్థిస్తారు. ప్రభువును విశ్వసించడంలో మన బలహీనతలను, అసమర్థతలను గుర్తించి మన అవసరతలు అన్నిటిని ప్రభువు తీర్చగలడని ఆయన శక్తి మీద ఆధారపడడం ఇమిడి ఉంది. ప్రభువును ప్రార్ధించనివారు తమ స్వశక్తి మీదా, లేదా ఇతరుల మీద ఆధారపడేవారే. ప్రభువు వలె మన అవసరతలన్నీ తీర్చగల శక్తిమంతుడు ఇంకెవరూ లేరు. కాబట్టి విశ్వాసంతో ప్రభువును ప్రార్థించాలి.

మూడవది, ఆ పదిమంది ఐక్యతతో ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువు తమ్మును కరుణించాలని వేడుకున్నారు. ఐక్య ప్రార్థనను ప్రభువు ఘనపరుస్తాడు. నెబుకద్నెజరు రాజు కలనీ, దాని భావాన్ని తెలియజెప్పవలసి వచ్చినపుడు దానియేలు తాను ఒక్కడే ప్రార్థించక, షద్రక్, మేషాకు, అబేద్నెగో అనే తన స్నేహితులను కూడా ప్రార్థించమని హెచ్చరించాడు. విశ్వాసులంగా కలిసి దేవుని ప్రార్థించాలని నేర్చుకుంటున్నాము.

నాలుగవది, ప్రభువు వారిని మీరు వెళ్ళి 'మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని' వారితో చెప్పాడు. వారు వెళుతుండగా శుద్ధులయ్యారు. వారు ప్రభువుకు లోబడినట్లు చూడగలం.

నిజానికి వారు గ్రామాలలోకి వెళ్ళాలంటే తమ రోగంతో వెళ్ళలేరు. "ప్రభువా, నీవు ముందు మమ్మల్ని స్వస్థపరచు. అప్పుడు నువ్వు చెప్పినట్లు యాజకులకు మమ్మును కనపరుచుకుంటాం” అని ప్రభువుకు ఎదురు చెప్పలేదు. వెంటనే లోబడ్డారు. ప్రభువుపై నిజమైన విశ్వాసం వారిని ఆయనకు లోబడేలా చేసింది. ప్రభువు వెళ్ళమన్నాడు. ఆయనకు లోబడితే తప్పక బాగుచేస్తాడు అని వారు నమ్మి వెళ్ళారు. విశ్వాసంతో కూడిన వారి విధేయత ద్వారా వారు స్వస్థపరచబడ్డారు. విశ్వాసం, విధేయత ఒకే నాణానికి ఉండే రెండు ప్రక్కలలాంటివి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది. విధేయత విశ్వాసాన్ని బట్టే సాధ్యపడుతుంది. మీ విశ్వాసం విధేయతతో కూడినదేనా? విధేయత లేని విశ్వాసం నిష్పలమైనది, మృతమైనది. “విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసెనని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని” అబ్రాహామును గూర్చి యాకోబు 2:22లో వ్రాయబడి ఉంది. మన విశ్వాసం, విధేయత ద్వారా పరిపూర్ణం కావాలి. ఆ పదిమంది వారు బాగుపడక ముందే ప్రభువుకు లోబడ్డారు. మేలు పొందడానికి ముందే మనం విధేయతను కనుపరచాలి ప్రభువుకు లోబడడం ద్వారా మేలు పొందగలం.

స్వస్తత పొందిన తరువాత వారేం చేసారో ఇప్పుడు తెలుసుకుందాం.

1) వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమ పరుస్తూ తిరిగివచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. కృతజ్ఞత అతణ్ణి ప్రభువు దగ్గరకు తిరిగి వచ్చేలా చేసింది. ఆయనను స్తుతించి ఆయన పాదాల మీద సాగిలపడేలా చేసింది. ఇటువంటి కృతజ్ఞతను ప్రభువు అంగీకరించి అభినందించాడు. ప్రభువు దృష్టికి కృతజ్ఞత ఎంతో ప్రీతికరమైనదని వాక్యంలో చూడగలం. “కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలును గల కోడెకంటెను అది యెహోవాకు ప్రీతికరము” (కీర్తన 69:30,31). దేవునికి బలులకంటే, కానుకలకంటే కృతజ్ఞతే ప్రీతికరం. అయితే చాలామందిలో ఇటువంటి కృతజ్ఞత కనబడడం లేదు. పదిమంది బాగుపడినా ఒక్కడిలోనే గానీ తొమ్మండుగురిలో కృతజ్ఞత లేదు. పదిమందిలోనూ విశ్వాసం ఉంది. పదిమందీ ప్రార్ధనాపరులే. కృతజ్ఞత విషయానికొస్తే తొమ్మండుగురిలో మేలు పొందినా కృతజ్ఞత లేదు. మనం కూడా చాలాసార్లు శ్రమలో ఎంతో ప్రార్థిస్తాం గానీ, శ్రమ నుండి ప్రభువు మనల్ని విడిపించిన తరువాత ప్రార్ధించినంతగా స్తుతించం. ఆశీర్వాదాలు సాధారణమే గానీ కృతజ్ఞత సాధారణం కాదు. ప్రభువు ద్వారా ఎంతో మేలు పొందుతున్న మనం కృతజ్ఞత ప్రభువునకు తగినంతగా చెల్లించకపోవడం లోపమే అవుతుంది. కృతజ్ఞత తప్ప మన ప్రభువుకు మనం ఇంకేమివ్వగలం! "కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటయందు విస్తరించాలని” కొలస్సీ 2:7లో వ్రాయబడి ఉంది. "ప్రతి విషయ మందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” (1 థెస్స 5:18). కృతజ్ఞత కలిగి ఉండాలని తీర్మానించుకుందాం.

2) గొప్ప శబ్దంతో ఆ సమరయుడు దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చాడు. ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడంలో అతడు సిగ్గుపడక, ధైర్యంగా, బహిరంగంగా అందరి యెదుట దేవుని స్తుతించాడు. “యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము” (కీర్తన 147:1). ప్రభువును స్తుతించే మంచి పని ధైర్యంగా, బహిరంగంగా చేయాలి. “మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయనయందు భయ భక్తులు గలవారి యెదుట నా మొక్కుబడులు చెల్లించెదను” (కీర్తన 22:25).

3) తన ఇంటికి వెళ్ళి కుటుంబికులను, స్నేహితులను చూడడంకంటే తన స్వస్థతకు కారణమైన ప్రభువును స్తుతించడమే ఆ సమరయుడు ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. మనం అనుభవించే శ్రేష్టమైన ప్రతి యీవి, సంపూర్ణమైన ప్రతి వరమూ తండ్రియైన దేవుడిచ్చినవే గనుక ఇవ్వబడిన మేలు కంటే, ఆ మేలు చేసిన దేవునికి ప్రాముఖ్యతను, మొదటి స్థానాన్ని ఇవ్వాలి.

4) అందరం వెళ్ళి ప్రభువుకు కృతజ్ఞత చెల్లిద్దామని ఆ సమరయుడు మిగిలిన తొమ్మండుగురితో అన్నప్పుడు వారు ఒప్పుకోకపోయినా ఒంటరిగానైనా ప్రభువు దగ్గరకు తిరిగి వచ్చాడు. తొమ్మండుగురికి ప్రభువు ఇచ్చే మేలు కావాలే గానీ, ప్రభువు అక్కరలేదు. అటువంటివారు తనతో రాకపోయినా నిరుత్సాహపడక వారందరూ రానప్పుడు నేను కూడా ఎందుకులే అనుకోకుండా ఒంటరిగానైనా ప్రభువును స్తుతించాడు. ఇశ్రాయేలీయులు అందరూ ఎవరిని పూజించినా, యెహోషువ - “నేనును, నా యింటివారును యెహోవాను సేవించెద”మన్నట్లు మనం కూడా ప్రభువు కొరకు ఒంటరిగానైనా నిలబడాలి. ఇట్టి కృపను ప్రభువు మనకు అనుగ్రహించును గాక!

5.ఐదు రొట్టెలు, రెండు చేపలు

మతయి 14:13-21 - "యేసు ఆ సంగతి విని దోనె ఎక్కి అక్కడనుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారిమీద కనికరపడి వారిలో రోగులైనవారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి - ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు - వారు వెళ్ళనక్కరలేదు. మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు, ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన - వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చికమీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు పంచిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండా ఎత్తిరి. స్త్రీలును, పిల్లలునూ గాక తినినవారు ఇంచుమించు ఐదు వేలమంది పురుషులు."

ఈ అద్భుతం ద్వారా తనను వెంబడించేవారికి ప్రభువు చేసే మేళ్ళను గురించి నేర్చుకుందాం

మొదటి మేలు: బాప్తిస్మమిచ్చే యోహాను మరణవార్త విని ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు ప్రభువు. ఇది విని వేలకొలది ప్రజలు దోనెలు లేకపోయినా, చుట్టూ తిరిగి కాలినడకన ఆయన వద్దకు వచ్చారు. వారిని చూసి ప్రభువు కనికరపడ్డాడు. 'నా ఏకాంత సమయాన్ని పాడుచేసారే, వెళ్లండి' అని అనలేదు. తనవద్దకు వచ్చేవారిని ప్రభువు ఎంతమాత్రం త్రోసివేయడు. వారిపట్ల కనికరం, జాలి, ప్రేమ, కృప కనుపరుస్తాడు. "నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనైయున్నాన”ని దేవుడు నిర్గమ 20:6 లో సెలవిచ్చాడు. దేవుడు కరుణా కటాక్షాలు గలవాడు. ఆయనను వెంబడిస్తే అపారమైన ఆయన ప్రేమను పొందగలం.

రెండవ మేలు: ఆయనను వెంబడించిన వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. మానవుని కలుగజేసినవాడు కనుక మానవుని బలహీనతలు ఎరిగినవాడు. కనికరం గలవాడు కాబట్టి తన శక్తితో రోగులను స్వస్థపరిచాడు.

మూడవ మేలు: శిష్యులు ఆయనతో ప్రజలను భోజన పదార్థాలు కొనుక్కోవడానికి పంపివేయమంటే ప్రభువు “వారు వెళ్ళనక్కరలేదు” అని సెలవిచ్చాడు. శిష్యులు - ప్రభువు స్వస్థపరచగలడు, వాక్యం చెప్పగలడు గానీ ఇన్ని వేలమందికి అరణ్యంలో భోజనం పెట్టలేడు అనుకున్నారు. కాని ప్రభువు తనను వెంబడించేవారు ఆయన దగ్గర ఏదైనా మేలు కొదువైనట్లు ఎక్కడికీ వెళ్ళనక్కర లేదని చెప్పాడు. అంటే మానవుని అన్ని అవసరాలు తీర్చగలడన్నమాట. అన్ని మేళ్ళు చేయగల సమర్థుడు. అయితే చాలామంది ఒక్కో రకం మేలు కోసం ఒక్కో దేవతను సేవిస్తున్నారు. అంటే ఏ ఒక్క దేవతా మానవుని అవసరాలన్నిటినీ తీర్చలేదన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు సర్వ కృపానిధి, సర్వశక్తిమంతుడు. ఆయనను వెంబడించు, నీకు ఏ మేలు కొదువ ఉండదు.

నాలుగవ మేలు: ఆ వేలాదిమంది ప్రజలకు ఆ సమయంలో అవసరమైనది ఆహారం. గనుక వారికి ఆహారం పెట్టాడు. ప్రభువే మానవులందరిని పోషించేవాడు. తినడానికి పనికిరాని మట్టిలోనుండి మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు మొలిపిస్తున్నాడు. వర్షం కురిపించి భూమిని తడిపి పంటలు పండిస్తున్నాడు. "సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహార మిచ్చెదవు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు” (కీర్తన 145:15, 16). "ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆకలిగొనినవాని ప్రాణమును మేలుతో నింపియున్నాడు” (కీర్తన 107:9). ఇశ్రాయేలీయులను అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు అద్భుతంగా పోషించాడు. “వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి” (నెహెమ్యా 9:15). ఆయన “ఆకలి గొనినవారికి ఆహారము దయచేయును” (కీర్తన 146:7).

ప్రభువుని వెంబడించేవారికి కలుగు అయిదవ మేలు: 'వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలనిండా ఎత్తిరి.' యేసు ప్రభువు అరణ్యములో ఐదు వేలకంటే ఎక్కువ ఉన్న ప్రజలకు ఆహారమిచ్చి వారిని తృప్తి పరిచాడు. ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి, సర్దుకోండని కొంచెం కొంచెం ఇవ్వలేదు. కడుపునిండా ఆహారమిచ్చి తృప్తిపరిచాడు. నీ జీవితం ఒకవేళ అరణ్యంలా ఎండిపోయినట్టున్నా, ప్రభువు నిన్ను తృప్తిపరచగలడు. లోకంలో దొరకని తృప్తిని నీవు దేవునిలోనే పొందగలవు.

ఆరవ మేలు: అన్ని వేలమంది తినగా కూడా 12 గంపల రొట్టెలు మిగిలాయి. అంటే ప్రభువు వారికి అంత సమృద్ధిగా ఇచ్చాడన్నమాట. ఇశ్రాయేలీయులు అరణ్యంలో దప్పిగొన్నప్పుడు “అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను” అని కీర్తన 78:15 లో చదవగలం. నీ జీవితం అరణ్యంలా ఉందా? నీకు ప్రభువే సమృద్ధి నివ్వగలడు.

ఏడవ మేలు: ఐదు రొట్టెలు, రెండు చేపలను ఐదువేలమందికి పంచి తృప్తిపరచడం. ఆయనను వెంబడించిన వారిపట్ల ప్రభువు ఇట్టి అద్భుతం చేశాడు. నీవు కూడా ఆయనను వెంబడిస్తే నీ జీవితంలో నీవు ఊహించని అద్భుతకార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు.

ఈ భాగం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు:

మొదటి పాఠం: ఆ గొప్ప జనసమూహం ప్రభువుని వెంబడించినందువల్లే మేలు పొందారు. అరణ్యంలో అయినా, దూరమైనా, కాలినడకన ప్రభువును వెంబడించారు. అరణ్యంలో ఏ సదుపాయాలు ఉంటాయి, భోజనం ఎలా? అని వారు అనుకోకుండా క్రీస్తు ప్రభువును వెంబడించడమే ముఖ్యమని ఎంచుకున్నారు. ప్రభువును వెదకడమే ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. అందుకే అన్ని వేళ్ళు పొందారు. మత్తయి 6:33 లో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహించబడును.” ప్రభువును వెంబడిస్తే పోషణ, వ్యాపారం, పిల్లల పెళ్ళిళ్లు ఎలా అని సందేహించకుండా అన్నీ ఆయనే చూసుకుంటాడని మొదట ఆయనను వెదకండి, మేలు పొందండి.

రెండవ పాఠం: శిష్యులు ప్రభువు దగ్గరకు వచ్చి ప్రజలను భోజనం కొనుక్కోవడానికి పంపివేయమని చెప్పారు. కాని ప్రభువు వారితో మీరే వారికి భోజనం పెట్టుడని సెలవిచ్చాడు. శిష్యుల దగ్గర ఆ వేలాదిమందికి భోజనం పెట్టడానికి సరిపడిన ఆహారం లేదని తెలిసి కూడా ప్రభువు వారికి ఈ ఆజ్ఞ ఎందుకిచ్చాడు? ఈ ఆజ్ఞ కఠినంగా ఉన్నట్టు లేదా? మన జీవితంలో కూడా దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు కఠినంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా! కాని సత్యమేమిటంటే ప్రభువు ప్రజలందరికీ భోజనం పెట్టడానికి శిష్యులను బలపరచనున్నాడు కాబట్టి మీరే భోజనం పెట్టండి అన్నాడు. ప్రభువు ఏదైనా ఆజ్ఞ ఇస్తే దానిని పాటించడానికి కావలసిన బలం కూడా ఆయనే ఇస్తాడు. మన బిడ్డకు ఏదైనా బజారు పని చెప్పామనుకోండి, నీవే డబ్బు సంపాదించి వస్తువులు కొనుక్కురా అని చెప్పం కదా. మనం చెప్పిన పనికి సరిపడిన డబ్బులు, సంచి మొదలైనవన్నీ ఇచ్చి పని చెబుతాం. అలాగే ప్రభువు ఆజ్ఞలను నెరవేర్చడానికి ఆయనే బలపరుస్తాడు.

మూడవ పాఠం: శిష్యులు మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప మరేమియు లేవని ప్రభువుతో అన్నారు. ఎదురుగా గొప్ప ప్రభువును కలిగి ఉండి మా దగ్గర ఏమీ లేదన్నారు. మనం కూడా నాకేముంది, నేనేం పని చెయ్యగలను అంటుంటాం. రక్షింపబడిన మనకు దేవుడే స్వాస్యం. ద్వితీ 33:29 లో దేవుడు ఇలా సెలవిచ్చాడు, “ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది, యెహావా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?” నిజమే, ప్రభువును కలిగియున్న, రక్షింపబడిన మనం లోకంలో సాటి లేనివారమే!

నాలుగవ పాఠం: ప్రభువు ఆ ఐదు రొట్టెలను, రెండు చేపలను నా యొద్దకు తెండని చెప్పాడు. శిష్యులు వాటిని ప్రభువు చేతిలో పెట్టారు. అంతే! అవి వారికే కాదు, ఆ జన సమూహమంతటికీ సమృద్ధిగా చేయబడ్డాయి. అలాగే నీ కొంచెం ప్రభువు చేతిలో పెట్టు, అద్భుతాలు చూస్తావు. నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, నీ తలాంతులు, నీ జీవితం ప్రభువుకు అప్పగించు. అద్భుతాలు చూస్తావు.

అయిదవ పాఠం: ప్రభువు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలను ఆశీర్వదించకముందే ప్రజలను పచ్చికమీద భోజనానికి కూర్చోమన్నాడు. ఐదు రొట్టెలే ఉన్నాయి కదా, ఎంతమందికి పెడతాడు అని అనుకోకుండా ప్రజలు విశ్వాసంతో కూర్చున్నారు. అద్భుతం జరగకముందే నమ్మాలి. 'అద్భుతం జరిగితే దేవుణ్ణి నమ్ముతాను' అంటారు కొంతమంది. కాని నమ్మితేనే దేవుని మహిమను చూడగలం.

ఆరవ పాఠం: తన దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలే అయినాసరే, ప్రభువు ఆకాశంవైపు చూసి దేవుణ్ణి స్తుతించాడు. రొట్టెలు ఆశీర్వదించబడ్డాయి. నిజంగానే స్తుతిలో గొప్ప అభివృద్ధి, జయం, ఆశీర్వాదం ఉన్నాయి. దేవుడు నీకు కొంచెమే జీతం లేదా పొలం, పంట ఇచ్చాడనుకున్నా ఆ కొంచెం కొరకై ఆయనను స్తుతించు. దేవుడు ఆ కొంచెమునే ఆశీర్వదించి నిన్ను తృప్తిపరుస్తాడు. ఆకాశంవైపు చూడు, అంటే దేవుని శక్తిని, వాగ్దానాన్ని, ఆయన ప్రేమను దేవుని మహిమైశ్వర్యాన్ని చూడు. ఆయనను అన్ని పరిస్థితుల్లో స్తుతించగలవు.

ఏడవ పాఠం: మిగిలిన ముక్కలను ప్రభువు వృథా చేయకుండా గంపల్లో ఎత్తమన్నాడు. ప్రభువు దేనినీ వృథా చేయడు. అనవసరంగా ఆయన ఏ మాటా పలుకలేదు. అలాగే మనం కూడా దేనినీ వృథా చేయకూడదు. డబ్బు, బలం, సమయం, నోరు వృథా చేయకూడదు. యేసు ప్రభువును వెంబడిస్తే కనికరం, స్వస్థత, పోషణ, తృప్తి, సమృద్ధి, అద్భుతాలు పొందగలం. ఇట్టి ప్రభువును కాక ఇంకెవరిని వెంబడిస్తే ఈ మేళ్ళు పొందగలం? గనుక నేడే ప్రభువును వెంబడించడానికి తీర్మానించుకుందాం.

6.ప్రభువు నీళ్ళమీద నడచుట

మత్తయి సువార్త 14:22-33 - 'వెంటనే ఆ జససమూహములను తాను పంపి వేయునంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ యెక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురై నందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముచేత కేకలు వేసిరి. వెంటనే యేసు - ధైర్యము తెచ్చుకొనుడి. నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు - ప్రభువా నీవే అయితే నీళ్ళమీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళమీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసీ, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.”

ఈ అద్భుతం ద్వారా కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుందాం.

మొదటి పాఠం: ప్రభువు ప్రార్థన చేయడానికి ఏకాంతముగా కొండ ఎక్కాడని వ్రాయబడి ఉంది. వేలాదిమందికి పరిచర్య చేస్తున్నప్పటికీ ఏకాంత ప్రార్థనకు ప్రభువు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు చూడగలం. పనుల ఒత్తిడిని బట్టి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. గొప్ప సంస్కరణకర్త మార్టిన్ లూథర్ అనుదినం రెండు గంటలు ప్రార్థించేవాడు. కాని, పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఎంతసేపు ప్రార్థించేవాడో తెలుసా? ఎక్కువ పనులు ఉన్నప్పుడు దేవుని సహాయం ఎక్కువ అవసరమని గుర్తించి మూడు గంటలు ప్రార్థించేవాడు. ప్రభువువలె ఏకాంతంగా ప్రార్థించుట ప్రాముఖ్యంగా ఎంచుకుందాం.

రెండవ పాఠం: శిష్యులను తనకంటే ముందుగా దోనె ఎక్కి అద్దరికి వెళ్ళాలని ప్రభువు బలవంతం చేశాడు. ప్రభువు మాటనుబట్టి శిష్యులు సముద్రం మీద దోనెలో ప్రయాణిస్తుండగా వారికి తుఫాను ఎదురైంది. కేవలం ప్రభువు ఆజ్ఞనుబట్టి ఆయన చిత్తానుసారంగా శిష్యులు బయలుదేరినప్పటికీ వారికి తుపాను ఎదురైంది. చాలామంది మేము ఎంత భక్తిగా ఉంటున్నా కష్టాలు వస్తున్నాయి అంటారు. భక్తి జీవితంలో కష్టాలు, శ్రమలు సహజమే అని గుర్తించాలి. యోహాను 16:33లో ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చాడు, "నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించియున్నాననెను.” సముద్రం మీద తుఫాను శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికే ప్రభువు అనుమతించాడు. సముద్ర తరంగాల మీద ప్రభువు నడుచుకుంటూ వచ్చి శిష్యులను తుపాను నుండి రక్షించాడు. ప్రభువు నీళ్ళమీద కూడా నడవగలడనే విషయం వారికి ఆ శ్రమ ద్వారానే తెలిసింది. ప్రభువు కోరినట్లు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే శ్రమలు మన విశ్వాసం అభివృద్ధి చెందడానికీ, మన మేలు కొరకేననీ మనం గ్రహించాలి. ప్రభువు వారిని విడిపించినట్లు మనల్ని కూడా విడిపిస్తాడు. “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తన 34:19).

మూడవ పాఠం: ప్రభువు సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు భయపడి భూతమని చెప్పుకొని కేకలు వేశారు. వెంటనే ప్రభువు "ధైర్యము తెచ్చుకొనుడి. నేనే, భయపడవద్దు” అన్నాడు. శిష్యులు అనవసరంగా భయపడ్డారు. ప్రభువు వారిని రక్షించడానికి వస్తే వారు గ్రహించలేకపోయారు. ప్రభువు ఆయనను వెంబడించేవారిని విడిచిపెట్టడు. ఆదుకుని రక్షిస్తాడు. నీళ్ళ మీద సహా నడుచుకుంటూ వచ్చి వారిని రక్షించాడు. మనము కూడా ప్రభువు తప్పనిసరిగా మన కష్టాలన్నిటి నుండి విడిపిస్తాడని ధైర్యంగా ఉండాలే తప్ప అనవసరంగా భయపడకూడదని నేర్చుకుంటున్నాం.

నాలుగవ పాఠం: ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ రావడం చూసి పేతురు తాను కూడా నీళ్ళమీద నడిచి ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి సెలవిమ్మని ప్రభువును అడిగాడు. ప్రభువు సెలవివ్వగానే పేతురు దోనె దిగి నీళ్ళమీద నడిచాడు. ఆహా! పేతురు విశ్వాసం ఎంత గొప్పది! నీళ్ళమీద నడిచిన ఏకైక మానవుడు పేతురే. ప్రభువు నీళ్ళమీద నడవగలిగితే నన్ను కూడా నడిపించగలడు అని ప్రభువు శక్తి మీద గొప్ప విశ్వాసం ఉంచాడు. దోనెలో ఉండడానికి అప్పటివరకు భయపడిన పేతురు ప్రభువును చూచి దోనెలోనుండి నీళ్ళలోకి దిగాడు. విశ్వాసపు అడుగు వేశాడు. పాఠకులారా, ప్రభువు శక్తిపై ఇట్టి గొప్ప విశ్వాసం ఉన్నదా మీకు?

ఐదవ పాఠం: పేతురు మొదట్లో గొప్ప విశ్వాసాన్ని కనుపర్చినా, గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. మొదట్లో ఉండే గొప్ప విశ్వాసం కోల్పోయాడు. అందుకే ప్రభువు 'అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు' అన్నాడు. చాలామంది భక్తిని చక్కగా ప్రారంభిస్తారే గానీ చక్కగా కొనసాగించి చక్కగా ముగించరు. భక్తిని చక్కగా ప్రారంభిస్తే సరిపోదు. భక్తిని అంతం వరకు గట్టిగా చేపట్టాలి. మన పరుగు కడముట్టించి పౌలు భక్తునివలె విశ్వాసం చివరి వరకూ కాపాడుకోవాలి.

ఆరవ పాఠం: పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ప్రభువు మీద దృష్టి ఉంచినంత సేపూ నీళ్ళమీద సహితం నడవగలిగాడు. దృష్టి ప్రభువు మీదనుండి తుఫానువైపు మళ్ళించగానే మునిగిపోబోయాడు. మనం కూడా శ్రమలను, కష్టాలను చూస్తుంటే భయం, సందేహం కలిగి భక్తిలో వెనకబడతాం. ప్రభువును, ఆయన శక్తిని, ఆయన వాగ్దానాలను, ఆయన మనకొరకు సిద్ధపరిచే ఆయన రాజ్యాన్ని దృష్టిస్తే కష్టాలనే అలలను జయించగలం. శ్రమలను చూస్తూ చూస్తూ భరించలేం. చిన్న ఇంజక్షన్‌ను కూడా చూస్తూ చేయించుకోలేం. అందుకే శ్రమలను చూడకుండా ప్రభువునే చూడాలి. "సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది” (కీర్తన 16:8,9).

ఏడవ పాఠం: తుఫానును చూసి భయపడి మునిగిపోసాగినా, ప్రభువా నన్ను రక్షించుమని పేతురు కేకలు వేశాడు. పడిపోవడం, సందేహపడడం, భయపడడం మానవరీతిగా సహజమే కావచ్చు. కానీ తిరిగి లేవకపోవడం అవివేకమే అవుతుంది. పేతురు భయపడినా, రక్షించమని ప్రభువును వేడుకున్నాడు. వెంటనే ప్రభువు చెయ్యి చాపి అతణ్ణి పట్టుకొని లేవనెత్తి మళ్ళీ నీళ్ళమీద నడిపించుకుంటూ దోనెలోనికి తీసుకు వచ్చాడు. చాలామంది తాము పడిన స్థితిలోనే స్థిరంగా ఉండిపోతుంటారు. ఎలాగూ పడ్డాంకదా అని అదే పాపస్థితిలో ఉండడం అజ్ఞానమే కదా! వర్షాకాలం రోడ్డుమీద నడుస్తూ నీళ్ళతో నిండిన గోతులను గుర్తించక వాటిలో పడి, లేవకుండా ఉంటామా? ఎవరన్నా ఒక వ్యక్తి అలా పడి గోతిలోనే ఉంటే పిచ్చివాడే కదా! పాఠకులూ, కొన్ని పాప వ్యసనాలలో పడి ఇక విడుదల పొందలేమని మీరు పడిన స్థితిలోనే ఉండి పోతున్నారా? పేతురువలె ప్రభువా, రక్షించు అని ప్రార్థించి ప్రభువిచ్చే రక్షణను, విడుదలను పొందండి. పేతురు తన మొదటి విశ్వాసాన్ని కోల్పోయినా, ప్రభువు తిరిగి బలపరచి నీళ్ళమీద మరలా నడిపించాడు. తిరిగి పడిపోకుండా బలపరిచాడు.

అలాగే మిమ్మల్ని కూడా ప్రభువు తిరిగి లేవనెత్తి బలపరచగలడు. కాబట్టి వెంటనే పేతురు వలె ప్రార్థించండి. ప్రభువు ఇచ్చే జయాన్ని పొందండి.

ఈ అద్భుతం ద్వారా ప్రభువు తన బిడ్డలు శ్రమలో ఉన్నప్పుడు వారిని తన శక్తితో అద్భుతంగా రక్షిస్తాడని నీళ్ళమీద నడువగల శక్తిమంతుడనీ, తుఫానును, గాలిని అణచివేయగలవాడనీ గ్రహిస్తున్నాం. అద్భుతకరుడైన ప్రభువు పై స్థిరమైన విశ్వాసం కలిగి ఉండేలా మనకందరికీ ఆయన తన కృపను అనుగ్రహించును గాక!

7. ఇద్దరు గ్రుడ్డివారు చూపునొందుట

మత్తయి సువార్త 9:27-31 - "యేసు అక్కడనుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి - దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు - నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు - నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తిని ప్రచురము చేసిరి.”

ప్రభువు చేసిన ఈ అద్భుతం ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకుందాం. గ్రుడ్డివారు ప్రభువును ఆశ్రయించినపుడు ఆయన వారి కన్నులు తెరచి దృష్టి ఇచ్చాడు. ఇందులో గ్రుడ్డివారికి చూపును ఇవ్వగల ప్రభువు శక్తిని మరియు గ్రుడ్డివారి దీనస్థితిని చూసి జాలిపడి మేలు చేసే ఆయన విస్తారమైన ప్రేమను చూడగలం. తన శక్తిచేత గ్రుడ్డివారి చీకటిని పోగొట్టి వారి జీవితాలలో ఎవరూ చేయలేని మేలు చేశాడు. గ్రుడ్డితనం వల్ల వారు ఇతరుల మీద ఆధారపడేవారు. దృష్టి కలుగజేయుట ద్వారా ప్రభువు వారిని స్వతంత్రులుగా చేశాడు. తన ప్రేమ చేత గ్రుడ్డివారు మమ్మును కరుణించుమని కేకలు వేసినప్పుడు వారిని కరుణించాడు. తన ప్రేమ చేత ఉచితముగా వారికి దృష్టినిచ్చాడు. తన ప్రేమను బట్టి గ్రుడ్డివారి కన్నులను ముట్టాడు. మన ప్రభువు ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమ గలవాడో చూశారా? మానవులమైన మనందరమూ ఆత్మీయంగా దేవుని ఎరుగని గ్రుడ్డితనంలో ఉన్నాం. మన చీకటిని, అంధత్వాన్ని పోగొట్టి దైవజ్ఞానాన్ని ఇచ్చి మన మనోనేత్రాన్ని వెలిగించేవాడు ఆయనే. అయితే గ్రుడ్డివారు ప్రభువు ద్వారా మేలు పొందడానికి ఏమి చేశారు?

ప్రభువు ద్వారా మేలు పొందడానికి ఏమి చెయ్యాలి?

మొదటి విషయం : ఆ గ్రుడ్డివారు దృష్టి పొందడానికి ప్రభువు వెంట వెళ్ళారు. ఎవరైనా ప్రభువు ద్వారా మేలు పొందాలి అంటే ప్రభువును వెంబడించాలి. ఆ గ్రామంలో ఎంతోమంది గ్రుడ్డివారు ఉండి ఉండవచ్చు. కాని ప్రభువును వెంబడించిన వారే మేలు పొందారు. మేలు చేసే ప్రభువును వెంబడించకుండా ఆయన ద్వారా ఎలా మేలు పొందగలం? కనుక శక్తిమంతుడు, ప్రేమా స్వరూపియైన ప్రభువును వెంబడించండి.

రెండవ విషయం: దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని ఆయనను వేడుకున్నారు. మనం కూడా ప్రభువు కృప కొరకై ఆయనను ప్రార్థించాలి. “ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును” అని ప్రభువు యోహాను 16:24లో సెలవిచ్చినట్లు ఆయనను అడగడం ద్వారా పొందగలం.

మూడవ విషయం: గ్రుడ్డివారు మమ్మును కరుణించుమని కలిసి ప్రార్థించారు. మత్తయి 18:19లో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, “మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.” తన బిడ్డలు ఐక్యతతో తనను ప్రార్థించాలని దేవుని ఉద్దేశం. ఐక్యతతో కలసి ప్రార్థించడంలో ఎంతో బలముంది. ఒక గుర్రానికి బండి కడితే అది 6 టన్నుల బరువు లాగగలిగితే, రెండు గుర్రాలకు కలిపి బండి కడితే అవి 32 టన్నులు లాగగలవు. ఐక్యతలో ఎంత అద్భుతమైన శక్తి ఉన్నదో చూశారా? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కలసి ఆసక్తితో ప్రార్థించగా దేవుడు పేతురును చెరసాల నుండి అద్భుతంగా విడిపించాడు. ఐక్యతతో ప్రార్థిద్దాం. అద్భుతమైన మేళ్ళను పొందుదాం.

నాలుగవ విషయం : ప్రభువు వారికి వెంటనే సమాధానం చెప్పకపోయినా, ఆయన ఇంట ప్రవేశించినపుడు ఆయన దగ్గరకు వెళ్ళారు. దీనిలో వారి పట్టుదలను చూడగలం. పట్టుదలతో ప్రభువును వెంబడించడం భక్తిలో ఎంతో ప్రాముఖ్యం. ప్రభువు తప్ప తమకు దృష్టి ఇవ్వగలవారు ఇంకెవ్వరూ లేరని గ్రహించి, ఆయన వారిని కరుణించేవరకూ పట్టుదలతో ఆయన వెంటే ఉన్నారు. అలాగే మనం కూడా పట్టుదలతో ప్రభువును వెంబడించాలి.

ఐదవ విషయం : నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని ప్రభువు వారిని అడిగినప్పుడు వారు 'నమ్ముచున్నాము ప్రభువా' అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడ్డాయి. ప్రభువు దృష్టి ఇవ్వగలడు అని వారు నమ్మారు. గ్రుడ్డితనం వల్ల ప్రభువును చూడలేకపోయినప్పటికీ ప్రభువు శక్తిని వారు చూశారు. ప్రభువు వారిలో కోరింది నమ్మికే. వారి నమ్మిక చొప్పున వారికి కలుగుగాక అని ప్రభువు అన్నాడు. ప్రభువు ద్వారా మేలు పొందడానికి ప్రభువునందు నమ్మిక ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. “దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” (హెబ్రీ 11:6). విశ్వాసము ద్వారానే మేలు పొందగలం. యాకోబు 1:6, 7, 8 లలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, “ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైననూ దొరుకునని తలంచుకొనరాదు.” మత్తయి 21:22లో ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చాడు, “మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినయెడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను.” ప్రభువు తన స్వదేశానికి వెళ్ళినప్పుడు తన స్వంత ప్రజలు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. కాబట్టి వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదని మత్తయి 13:58లో వ్రాయబడి ఉంది. ప్రభువునందు విశ్వాసం వలన అసాధ్యమైన కార్యాలు సాధ్యపడతాయి. అవిశ్వాసం వలన అనేకమైన అద్భుతాలు పోగొట్టుకుంటాం. ప్రభువులో స్థిరమైన విశ్వాసాన్ని కలిగి, అనేకమైన అద్భుతాలను అనుభవిద్దాం.

ఆరవ విషయం : యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. ప్రభువు వారికిలాంటి ఆజ్ఞనివ్వడానికి కారణం, ఆయన కీర్తి వ్యాపించడంవల్ల తాను పట్టణాలలో బహిరంగంగా తిరిగి వాక్య పరిచర్య చేయడానికి ఆటంకం కలుగుతుందని. యోహాను 6:15లో ఈ రీతిగా ఉంది, “రాజుగా చేయుటకు వారు వచ్చి బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు యెరిగి, మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను.” ప్రభువు రూపాంతరం పొందిన తరువాత వారు కొండ దిగి వస్తుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచు వరకూ ఈ దర్శనము మీరు ఎవ్వరితోనూ చెప్పకుడని యేసు వారికి ఆజ్ఞాపించినట్లు మత్తయి 17:9లో చూడగలం. ప్రభువు పునరుత్థానుడైన తరువాత 'మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి' అని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రభువును గురించి సర్వలోకానికి చాటాలి.

ఏడవ విషయం : కన్నులు తెరవబడినవారితో ఇది ఎవరికిని తెలియకుండా చూచు కొమ్మని ఖండితంగా ఆజ్ఞాపించినా, వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేశారు. కీర్తిని, ఘనతను ప్రభువు కోరుకొనకపోయినా అధికమైన కీర్తిని పొందాడు. ఘనత అనేది మన నీడలాంటిది. మన నీడను పట్టుకోవాలని దాని వెంట వెళితే అది ఎప్పుడూ దూరమవుతూనే ఉంటుంది. నాకు వద్దు అని వెనుతిరిగితే మన నీడనుండి మనం తప్పించుకోలేం. అది మన వెంటే వస్తుంది. ఘనతను కూడా కోరుకుంటే దూరమవుతుంది. వద్దనుకుంటే దానినుండి తప్పించుకోలేం. ఎంతోమంది స్వఘనత కోరి పేరు కోసం ప్రాకులాడతారు. గౌరవం కోసం డిగ్రీలు కొనుక్కొని మరీ తగిలించుకుంటూ తమ్మును అందరూ తమ పదవులను బట్టి, డిగ్రీలను బట్టి పిలవాలనీ, గౌరవించాలని తాపత్రయపడుతున్నారు. అందువల్లే దేవుడిచ్చే నిజమైన, స్థిరమైన ఘనతను పోగొట్టుకుంటూ భక్తిలో ఎదగలేకపోతున్నారు. స్వఘనతను కోరుకొనరాదని నేర్చుకుంటున్నాము. గ్రుడ్డివారు పట్టుదలతో కలసి నమ్మికతో ప్రార్థించినట్లు మనమును చేయుదుము గాక!

8. పక్షవాయువు గలవానికి స్వస్థత

మార్కు 2:1-12 - "కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూము లోనికి వచ్చెను. ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి. కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక, ఆయనయున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్తులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవ్వడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని - మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని, వారందరి యెదుట నడిచిపోయెను గనుక, వారందరూ విభ్రాంతినొంది - మనమీలాటి కార్యములు ఎన్నడునూ చూడలేదని చెప్పుకొనుచూ దేవుని మహిమపరచిరి.”

ఈ అద్భుతం ద్వారా ప్రభువును గూర్చిన విషయాలు నేర్చుకుందాం

1) పాపాలు క్షమించడానికి భూమి మీద తనకు అధికారం కలదని శాస్తులు తెలుసుకోవాలని ప్రభువు చెప్పాడు. మనమంతా జన్మ, కర్మపాపాలు కలిగి ఉన్నాం. పాపానికి జీతం మరణమని దేవుడు సెలవిచ్చాడు. మన పాపానికి క్షమాపణ పొందకపోతే మనకు శిక్ష తప్పదు. అంటే మరణించిన తరువాత నరకాగ్ని గుండంలో మానవులందరూ తమ పాపాన్నిబట్టి నిరంతరం శిక్ష అనుభవించాలి. అయితే దేవుడు ప్రేమా స్వరూపి కాబట్టి మన పాపాన్ని పరిహరించడానికి తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపి సిలువలో ఆయనపై మన పాప శిక్షనంతటినీ మోపి, పాపాన్ని నిర్మూలించాడు. కాబట్టి మన పాపాలు క్షమించడానికి ప్రభువుకు అధికారం కలదు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప మన పాపాల కొరకు ప్రాణం పెట్టి, ప్రాయశ్చిత్తం చేసిన నామం మరొకటి లేదు. యేసుక్రీస్తే పాప పరిహారకుడు. చాలామంది తమ పాపాలను పరిహరించుకోవాలనే ఉద్దేశముతో ఎన్నో మతాచారాలు, పుణ్యకార్యాలు చేస్తున్నారు. గంగ స్నానాలు, యజ్ఞ యాగాదులు, దానధర్మాలు మన పాపాలను తీసివేయగలిగితే దేవుని గొప్పేముంది? దేవుడు అవసరం లేదు కదా! అయినా పాపమనేది దేవునికి వ్యతిరేకంగా చేసేది. కాబట్టి దేవుడొక్కడే క్షమించగలడు. మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అది మనం తీర్చలేని పరిస్థితుల్లో లోకమంతా జాలిపడి, మనం తీర్చనక్కరలేదు అన్నా అది చెల్లదు. అదే మనకు అప్పు ఇచ్చిన ఆ వ్యక్తి లోకమంతా ఒప్పుకోకపోయినా 'మీ అప్పు తీర్చనక్కర్లేదు, నేను క్షమిస్తున్నాను' అంటే సరిపోతుంది. మన పాపక్రియల జాబితా అంతా దేవుని దగ్గర ఉంది. కాబట్టి దేవుడు మనల్ని క్షమించి, మన పాపాలను తుడిచివేయాలి. మన రుణపత్రం మనకు రుణమిచ్చిన వ్యక్తి దగ్గర ఉండగా, మన రుణాలను మనమే కొట్టివేసుకోవడం కుదరదు కదా! బూడిదను గంగలో కలపడంవల్ల పాపాలు ఎక్కడికి పోతాయి? యేసు ప్రభువు ఒక్కడే మన పాపాలను క్షమించగలడు. ఆయనలో విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందగలమని అపొస్తలుల కార్యాలు 10:43లో చూడగలం.

2) పక్షవాతం గలవానిని చూసి, నీ పాపాలు క్షమింపబడినవి అని ప్రభువు చెప్పినప్పుడు అక్కడున్న శాస్త్రులు 'దేవుడొక్కడే కదా పాపాలు క్షమించేది. ఈయన ఎందుకు ఇలా అంటున్నాడు' అని తమ హృదయాలలో ఆలోచించుకున్నారు. వెంటనే యేసు తన ఆత్మలో ఆ సంగతి తెలుసుకున్నాడు. యేసుప్రభువు మానవుల హృదయాలోచనలు ఎరిగినవాడు. ఆయన మానవుల హృదయాంతరంగాలను పరిశోధించే వాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. యోహాను 2:24,25 లలో ఇలా ఉంది, “యేసు అందరినీ ఎరిగినవాడు. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు గనుక ఎవ్వడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు.” యేసు ప్రభువు మన గురించి సమస్తాన్ని ఎరిగినవాడని తెలుసుకొంటున్నాము.

3) పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని మాటలో లేవనెత్తాడు. ఇంత అద్భుతమైన శక్తి కలిగినవాడు ఇంకెవ్వరూ లేరు. నలుగురిచేత మోసికొని రాబడిన వ్యక్తిని పూర్తిగా అప్పటికప్పుడే ఉచితంగా స్వస్థపరచి తన మంచాన్ని తానే మోసుకొనిపోగలిగేలా చేశాడు. మోసికొని రాబడినవాడు ఇప్పుడు మోసికొని వెళుతున్నాడు. దీన్నిబట్టి ప్రభువు ఎంత శక్తిమంతుడో అర్థమవుతున్నది.

4) పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని చూసి, 'నా కుమారుడా' అని ప్రభువు పలకరించాడు. ఆ మాటలలో ఎంతో దయ, జాలి కనబడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ నా జీవితం ఇక ఇంతే అని చింతలో ఉన్న ఆ వ్యక్తిని కుమారుడా అని పిలిచి చేరదీసి ప్రభువు ఆదరించాడు. అనారోగ్యంతో మురికిగా ఉన్న ఆ వ్యక్తిని త్రోసివేయకుండా చేరదీసి అంగీకరించాడు. ప్రభువు ప్రేమ ఎంత గొప్పదో కదా!

ఈ భాగం ద్వారా మనం నేర్చుకొనే ఆత్మీయ పాఠాలు

1) స్వస్థత పొందాలని ప్రభువు దగ్గరకు తేబడిన ఆ వ్యక్తిని శారీరకంగా స్వస్థపరిచే కంటే ముందు ప్రభువు అతని పాపాలు క్షమించాడు. పాపక్షమాపణ శరీర స్వస్థత కంటే ఎంతో ముఖ్యమని గ్రహించాలి. ఈ రోజుల్లో ఎంతోమంది శరీర స్వస్థతలకే ప్రాధాన్యతనిచ్చి పాపక్షమాపణను, రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రభువు ద్వారా స్వస్థపరచబడి పాపక్షమాపణ పొందకపోతే అతని గతి నరకమే గదా! శరీర స్వస్థత ఈ లోకానికే గాని పాపక్షమాపణ పరలోకానికి మనలను అర్హులను చేస్తుంది. కనుక యేసు ప్రభువును ఏదో ఒక ఉచిత వైద్యునిగా వాడుకోవడం మాని, ఆయనిచ్చే పాప క్షమాపణ పొంది పరలోకానికి వారసులం అవ్వాలి.

2) యేసు వారి విశ్వాసాన్ని చూసి అతణ్ణి స్వస్థపరిచాడు. ప్రభువు మనలో చూసేది, ఆశించేది విశ్వాసమే. మన చదువు, పదవి, కులం, అంతస్తు ప్రభువు చూడడు. ఆయన మనుష్యులను లక్ష్యపెట్టడు. దేవుని ద్వారా మేలును విశ్వాసం ద్వారానే పొందగలం. వారి విశ్వాసం ఎంతో పట్టుదలతో కూడినదిగా చూడగలం. ప్రభువు ఉన్న ఇంటిలో అనేకులు కూడి వచ్చినందున ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి వీలు లేకపోయినా సరే, వారు నిరుత్సాహపడలేదు. ఆయన ఉన్నచోటికి పైగా ఇంటికప్పు విప్పి సందుచేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపారు. ఇటువంటి స్థిరమైన, దృఢమైన విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి.

3) కొందరు ఆ పక్షవాయువు గలవానిని నలుగురిచేత మోయించుకొని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఆ రీతిగా అతనికి ఎంతో మేలు చేశారు. అతనిపట్ల వారికున్న శ్రద్ద ప్రశంసనీయమైనది. పాఠకులూ, మీ కుటుంబికులపట్ల, స్నేహితులపట్ల, ఇరుగుపొరుగు వారిపట్ల మీకిటువంటి శ్రద్ధ ఉందా? ఉంటే వారిని రక్షకుడైన ప్రభువు దగ్గరకు తీసుకు వస్తారు. ఇప్పటివరకూ ఒకరినైనా ఈ రీతిగా ప్రేమించి ప్రభువు భక్తిలోకి తీసుకొచ్చారా? విశ్వాసులమైన మనల్ని ఇతరులకు సువార్తను ప్రకటింపక పోతే వారి ప్రాణాలకు ఉత్తరవాదులుగా దేవుడు ఎంచుతాడు. “అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి' అని యూదా పత్రిక 23వ వచనంలో ఉన్నట్టు కొందరిని ప్రభువు వద్దకు నడిపించాలి.

4) బాగుపడిన తరువాత ఆ వ్యక్తి లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి వెళ్ళగా అందరూ విభ్రాంతినొంది దేవుణ్ణి మహిమపరిచారు. అతడు అందరి ఎదుట పరుపెత్తుకొని ధైర్యంగా నడిచివెళ్ళాడు. దేవుడు మహిమపరచబడ్డాడు. మనం కూడా దేవుని కొరకు బహిరంగ సాక్షులుగా ప్రభువు ఇచ్చిన మార్పును లోకానికి కనుపరుస్తూ ప్రభువు కొరకు సాక్షులుగా జీవించాలి. “మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి” (మత్తయి 5:16). మన ద్వారా మన దేవుడు మహిమపరచ బడాలి. అందుకు ఆయన కొరకు కొండమీదుండే పట్టణంలా బహిరంగ సాక్షులుగా జీవించాలి. చాలామంది ప్రభువును ఈ లోకంలో ఒప్పుకోవడానికి సిగ్గుపడుతూ రహస్య క్రైస్తవులుగా జీవిస్తున్నారు. “వ్యభిచారమును, పాపమును చేయు ఈ తరమువారిలో నన్ను గూర్చియు, నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను” (మార్కు 8:38). కాబట్టి ప్రభువు కొరకు ధైర్యంగా, ఆయన సాక్షులముగా జీవిద్దాం.

5) ఏ గృహంలోనైతే ఆ రోగి ఇప్పటివరకూ భారంగా ఉన్నాడో బాగుపడిన తరువాత ప్రభువు ఆ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడ ఇంతవరకూ భారంగా జీవించాడో అక్కడ ఇప్పుడు ఆశీర్వాదకరంగా జీవించాడు. అలాగే మనం కూడా లోకంలో ప్రభువు ఇచ్చిన మార్పును ఋజువుచేస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, సహాయకరంగా జీవించాలి. ప్రభువు మనకిట్టి కృపను అనుగ్రహించును గాక!

9. కనాను స్త్రీ

మత్తయి 15:21-28 - "యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి - ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక మాటైననూ చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి - ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయు చున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయన - ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని, మరి ఎవరి యొద్దకును నేను పంప బడలేదనెను. అయిననూ ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన - పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె - నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినునుగదా అని చెప్పెను. అందుకు యేసు - అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనొందెను.”

ఈ అద్భుతం ద్వారా వెల్లడైన ప్రభువు యొక్క మహిమ

కనాను స్త్రీ యొక్క మొరను ప్రభువు ఆలకించి జవాబిచ్చాడు. ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు. ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. మాటతో స్వస్థపరిచాడు. ఎక్కడో దూరంగా ఉన్న ఆ బిడ్డను తానున్న చోటనుండే మాటతో బాగుచేశాడు. కనాను స్త్రీ నన్ను కరుణించు అని ప్రార్థించింది. ప్రభువు ఆమె బిడ్డను స్వస్థపరచడంలో ఆమె కోరినట్లు ఆమెను కరుణించాడు. ఆమె కష్టాలలో ఆమెపై జాలి చూపించాడు. ప్రభువు కరుణా కటాక్షాలు గలవాడు. కృపాసమృద్ధి గలవాడు. కనాను స్త్రీ కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుండేది. ప్రభువు ఆమెను దయ్యంనుండి విడిపించాడు. దీనిలో ప్రభువు యొక్క మహాశక్తిని గ్రహించగలం. బహు బాధల నుండి ఆమెను, ఆమె కుమార్తెను విడిపించాడు. ప్రభువు మన బాధలన్నిటినుండి విడిపించేవాడు. నీవు కోరినట్టే నీకు అవునుగాకని ప్రభువు కనాను స్త్రీ యొక్క కోరికను తీర్చాడు. తన కుమార్తె దయ్యం నుండి విడిపింపబడాలని, బహు బాధలో నుండి విడిపింప బడాలని, స్వస్థత నొందాలని, ప్రభువు తనను కరుణించాలని ఆమె కోరింది.

ప్రభువు ఆమె కోరినట్టు ఆమెకు జరిగించాడు. ప్రభువు మన హృదయ వాంఛలను కూడా తీర్చగల ప్రేమ మరియు శక్తి గలవాడు. మేలు పొందాలని, రక్షింపబడాలని, మార్పు చెందాలని మన గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, స్నేహితుల గురించి కలిగి ఉన్న కోరికను ప్రభువు తీరుస్తాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని ఆమె విశ్వాసాన్ని అభినందించాడు ప్రభువు. కనాను స్త్రీ అని, అన్య స్త్రీ అని త్రోసివేయక ఆమె విశ్వాసాన్ని అంగీకరించాడు. ఆమెను అమ్మా అని పిలిచాడు. ఆమె విశ్వాసం గొప్పదని ఆమె కోరినట్టు ఆమెకు సహాయం చేశాడు. తనయందు విశ్వాసముంచి తన దగ్గరకు వచ్చేవారిని ప్రభువు ఎంతమాత్రమునూ త్రోసివేయడు.

ప్రభువు గొప్పతనాన్ని, మహిమను, ఆయన ప్రేమను, ఆయన చేసే మేళ్ళను గూర్చి తెలుసుకొన్నాం.

ఈ అద్భుతం ద్వారా నేర్చుకొనే కొన్ని పాఠాలు

కనాను స్త్రీ ఈ మేళ్ళన్నీ పొందడానికి ఏంచేసింది? అలాగే మనం కూడా ప్రభువు ద్వారా ఇట్టి మేళ్ళు పొందాలంటే ఏం చెయ్యాలి?

మొదటి పాఠం: ఆమె ప్రభువు వద్దకు వచ్చింది. అందుకే మేలు పొందింది. ఎంతోమంది ఎన్నో బాధలలో ఉండి కూడా ప్రభువు వద్దకు రానందువల్ల మేలు పొందలేకపోయారు. ప్రభువు ద్వారా మేలు పొందడానికి ఆయన మార్గాలలోనికి, ఆయనలో విశ్వాసంలోనికి, ఆయన సన్నిధికి రావాలని నేర్చుకుంటున్నాం.

రెండవ పాఠం: ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని ప్రార్థించింది. అందుకే మేలు పొందింది. యాకోబు 4:2 లో దేవుని అడుగనందున మీకేమియు దొరుకదు అని వ్రాయబడి ఉంది. మనము కనాను స్త్రీలాగా దేవుణ్ణి అడగాలి. మన ప్రార్థనలు, విన్నపాలు, యాచనలు, విజ్ఞాపనలు దేవునికి తెలియజెయ్యాలి. అప్పుడే మేలు పొందగలం. ప్రార్థించక, దేవుని అడగక ఎన్నో మేళ్ళు పోగొట్టుకుంటున్నాము. దేవుణ్ణి ఇప్పటికే అడిగి ఉండుంటే ఎన్నో మేళ్ళు పొంది ఉండేవారం కదా. ఇకనైనా దేవుణ్ణి అడుగుదాం. మేలు పొందుదాం.

మూడవ పాఠం : కనాను స్త్రీ తన బిడ్డను గూర్చి మొరపెట్టింది. ప్రభువు ద్వారా బిడ్డను బ్రతికించుకుంది. తల్లులుగా, తల్లిదండ్రులుగా మన బిడ్డల రక్షణ నిమిత్తం మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మన బిడ్డల బాధ్యత మనదేకదా! మనమే మన బిడ్డల కొరకు ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? బిడ్డలు అన్ని విధాలుగా బాగు పడాలంటే తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత. మన బిడ్డలు దేవుని ద్వారా మేలు, స్వస్థత, అభివృద్ధి, రక్షణ పొందేలాగున దేవుణ్ణి ఆశ్రయించుదముగాక.

నాలుగవ పాఠం: ఆ స్త్రీ ప్రభువును అడిగిన వెంటనే ప్రభువు సమాధానం చెప్పలేదు. శిష్యులు కూడా 'ఈమె మనవెంట వచ్చి కేకలు వేస్తుంది. ఈమెను పంపివేయుమని' ఆయనను వేడుకున్నా ఆయన వెంటనే సహాయం చేయలేదు. అయినా సరే, ఆమె నిరుత్సాహపడలేదు. వెనక్కి వెళ్ళిపోలేదు. ప్రభువు వెంబడే వెళ్ళింది. అట్లాగే మనం కూడా నిరుత్సాహాన్ని నిర్లక్ష్యపెట్టాలి. అన్ని పరిస్థితుల్లో ప్రభువును వెంబడించాలి.

ఐదవ పాఠం: తన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే ప్రార్థించడం మానివెయ్య లేదు. 25వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, “అయిననూ ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.” ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు ఆమె మరలా ప్రార్థించింది. ఆయనను సమీపించి ఆయనకు మ్రొక్కి ప్రార్థించింది. అలాగే మనం కూడా ఇంకా ఎక్కువగా, ఇంకా బాగా ప్రార్థించాలి. మనం విసుగక నిత్యమూ ప్రార్థన చేయాలని, దివారాత్రులు తనను గూర్చి మొర పెట్టాలని దేవుని ఉద్దేశం. ఒకామె వజ్రాలహారం ధరించుకుని కళ్యాణ మండపానికి ఒక కార్యక్రమానికి వెళ్ళింది. తిరిగి ఇంటికి వచ్చాక గమనిస్తే వజ్రాలహారం పోయిందని తెలుసుకుంది. వెంటనే కళ్యాణ మండపానికి ఫోన్ చేసి 'వజ్రాలహారం ఏదైనా దొరికిందా?” అని అడిగింది. అక్కడివాళ్ళు 'ఏ వజ్రాలహారం దొరకలేదు. అయినా లైన్లో ఉండండి, వెతుకుతాం' అని చెప్పి కళ్యాణ మండపం అంతా వెదికారు. వజ్రాలహారం దొరికింది. 'అమ్మా, నీ వజ్రాలహారం దొరికింది” అని సంతోషంతో ఆమెకు చెప్పడానికి ఫోన్ ఎత్తేసరికి ఆమె పెట్టేసి ఉంది. మరలా ఫోన్ చేస్తుందేమోనని కనిపెట్టారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినా ఆమె మరలా ఫోన్ చేయలేదు. ఆమె ఎవరో వీళ్ళకు తెలియదు. వజ్రాల హారం దొరికినా ఆమె పొందలేకపోయింది. కొద్దిసేపు ఓరిమి పట్టలేక పోయింది ఆమె. విసుగుదల చెంది, కనిపెట్టలేకపోయింది. కనాను స్త్రీ కూడా విసుగుదల చెంది వెనక్కి వెళ్ళిపోయి ఉండుంటే మేలు పొందియుండకపోనుగదా! "అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడూ పొందును. వెదకువానికి దొరకును. తట్టువానికి తీయబడును" అని దేవుడు మత్తయి 7:7 లో సెలవిచ్చాడు. కనుక మనం అడిగింది పొందేవరకూ అడగాలి, దొరికేవరకూ వెదకాలి. తీసేవరకూ తట్టాలి. రోమా 12:12 లో వ్రాయబడినట్లు ప్రార్థనయందు పట్టుదల కలిగియుండండి.

ఆరవ పాఠం: ప్రభువు ఆమెతో పిల్లల రొట్టె తీసుకుని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పినపుడు ఆమె, 'నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి పడు ముక్కలు తినునుగదా' అన్నది. తాను ప్రభువు ద్వారా మేలు పొందడానికి అపాత్రురాలనని గుర్తించింది. తన్నుతాను తగ్గించుకొన్నది. దీనులు అన్నీ మంచిగానే తీసుకుంటారు. ప్రభువు తనను కుక్కపిల్లతో పోల్చాడని అనుకోకుండా చిన్న రొట్టెముక్కంత కొద్ది కృపను దేవుడు చూపించిన చాలు అని ప్రభువు మీద పూర్తిగా ఆధారపడి ఉంది. అలాగే మనం కూడా దేవుని ప్రేమకు అపాత్రులమని గుర్తించి ఆయన కృపమీదే ఆధారపడాలి.

ఏడవ పాఠం: అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ప్రభువు ఆమెను ఎంతగానో ప్రశంసించాడు. ఆమెకున్న ఆ గొప్ప విశ్వాసం ద్వారా ప్రభువు ఆమె కోరినట్టు ఆమెకు చేశాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది. ఆమె విశ్వాసం గొప్పది అని ప్రభువు అనడానికి కారణం ప్రభువు ఆమెను పరీక్షించినప్పుడు ఆమె పరీక్షకు నిలిచింది. నిజమైన విశ్వాసం బంగారంలాగా అగ్నివంటి పరీక్షలలో ఇంకా శుద్ధి అవుతుందే గాని నశించదు. భక్తుడైన యోబు కూడా తన జీవితంలో ఎన్ని పరీక్షలు, శ్రమలు, శోధనలు సంభవించినప్పటికీ దేవునిలో విశ్వాసం నుంచి తొలగిపోలేదు. కనాను స్త్రీ ప్రభువు తప్ప తన బిడ్డను దయ్యాన్నుండి, బాధల నుండి విడిపించగలవారు ఇంకెవ్వరూ లేరని నమ్మి ప్రభువు ఎంత పరీక్షించినా ఆయన మీదే ఆధారపడింది. ఆయన సహాయం చేసేవరకూ పట్టుదలతో అడిగింది. నిజమైన విశ్వాసం దేవుడే దిక్కు అని, ఆయనతప్ప సహాయకుడు, రక్షకుడు మరొకడు లేరని సహాయం చేసినా, చేయకపోయినా దేవుని మీదే ఆధారపడుతుంది. ఈ రీతిగా పరీక్షకు నిలిచే విశ్వాసమే గొప్ప విశ్వాసం. ఇటువంటి గొప్ప విశ్వాసమే మనం కోరినట్టు ప్రభువు ద్వారా మేలు కలుగజేస్తుంది. ప్రభువు ఇట్టి గొప్ప విశ్వాసాన్ని అందరికీ అనుగ్రహించును గాక!

10. పేతురు - విస్తారమైన చేపలు

లూకా 5:4-11 - "ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను - ఏలినవాడా, రాత్రి అంతయూ మేము ప్రయాసపడితిమి. గాని మాకేమియు దొరుక లేదు. అయినను నీమాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారాలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవు చుండగా, వారు వేరొక దోనెలో తమ పాలివారు వచ్చి సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి - ప్రభువా, నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపలరాశికి అతడును అతనితో కూడ నున్నవారందరును విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారుడగు యాకోబును యోహానును (విస్మయమొందిరి). అందుకు యేసు - భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడుగా యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోనెలను దరికి చేర్చి, సమస్తమును విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి.”

ఈ గొప్ప అద్భుతం ద్వారా ప్రభువుని గూర్చి కొన్ని విషయాలు

మొదటిది: మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వజ్ఞాని. రాత్రంతా ప్రయాసపడినా పేతురు, మిగిలిన జాలరులు చేపలేమీ పట్టలేకపోయినా ప్రభువు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయుమని సీమోనుకు చెప్పినప్పుడు వారలా చేసి విస్తారమైన చేపలు పట్టారు. ప్రభువు సమస్తాన్ని ఎరిగినవాడు. సముద్రంలో విస్తారమైన చేపలు ఎక్కడ, ఎప్పుడు ఉంటాయో ఆయనకు తెలుసు. యోహాను 1:47-48 లో ఈ రీతిగా ఉంది, “యేసు, నతనియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇతనియందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నీవు నన్ను ఏలాగు ఎరుగుదువని నతనియేలు ఆయనను అడుగగా యేసు - ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. మన ప్రభువు సమస్తాన్ని ఎరిగినవాడని, సర్వజ్ఞాని అని గ్రహించగలం. యేసు ప్రభువు సర్వశక్తిమంతుడని కూడా ఈ అద్భుతం ద్వారా ఋజువవుతున్నది. ఆయన చెప్పినట్టు వలలు వేసిన సీమోనుకు విస్తారమైన చేపలు వలలో పడేలా చేశాడు. తన అద్భుతమైన శక్తితో రెండు దోనెలు చేపలతో నింపివేశాడు. జాలరులు రాత్రంతా ప్రయాసపడినా వారికేమీ దొరకలేదు. ప్రభువు వారికి విస్తారమైన చేపలు ఇచ్చాడు. ప్రభువు సర్వసృష్టికి అధికారి. చేపలకు ఆజ్ఞ ఇచ్చి వాటిని రప్పించాడు. ఇంతటి సర్వశక్తిమంతుడు ఇంకెవరూ లేరు. యేసుప్రభువు ధారాళంగా అనుగ్రహించువాడని ఈ అద్భుతం ద్వారా గ్రహించగలం. ఎన్నడూ లేనంతగా రెండు దోనెలు నిండిపోయే అన్ని చేపలు వారికి అనుగ్రహించాడు. అడుగువాటన్నిటికంటే, ఊహించువాటన్నిటికంటే అత్యధికంగా చేయశక్తి గలవాడు. పేతురు ఇతర జాలరులెవ్వరూ అడగకుండానే వారి ఊహకు మించి ఉచితంగా విస్తారమైన చేపలు ఇచ్చాడు.

యేసుప్రభువు యొక్క సర్వశక్తిని, సర్వజ్ఞానాన్ని, ఆయన దాతృత్వాన్ని గ్రహించాము. ఇపుడు పేతురు జీవితం ద్వారా మనం కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుందాం.

ఆత్మీయ పాఠాలు

పేతురు, అతని సహోదరుడైన అంద్రియ మేము మెస్సయ్యను కనుగొన్నామని చెప్పి ప్రభువు దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు ప్రభువు అతనితో నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా అనబడతావని చెప్పాడు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. పేతురుపట్ల ప్రభువుకున్న ఉద్దేశాన్ని ఆయన అతనికి తెలియజేసినా పేతురు ఆయనను అనుసరించకుండా తన చేపలు పట్టే వృత్తికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇతర జాలరులతో కలసి రాత్రంగా ప్రయాసపడినా వారికేమీ దొరకలేదు. ప్రభువు ఏర్పాటుకు దూరంగా ఉండి మనం ఏమీ సాధించలేమని గ్రహించాలి. ఆయన ఏర్పాటుకు దూరంగా ఎంతోమంది కలసి రాత్రంతా ప్రయాసపడ్డా సరే, వారేమీ సంపాదించలేక పోయారు. అలాగే ప్రభువు నీ పట్ల కలిగి ఉన్న ఏర్పాటుకు, ఉద్దేశానికి నీవు దూరంగా ఉంటే నీ జీవితంలో నీవెంత ప్రయాసపడినా ఏమీ సాధించలేవు. యోహాను 15:45లో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, “నాయందు నిలిచి యుండుడి. మీయందు నేనును నిలిచి యుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని, తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనేగానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను. తీగెలు మీరు. ఎవ్వడు నాయందు నిలిచి యుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును.

నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.” ఈ సంగతిని పేతురులా కూడా గ్రహించక ప్రభువుకు దూరంగా స్వప్రయత్నాలు చేసి విఫలమవుతున్నాం. అయితే పేతురు ప్రభువు తన దగ్గరకు వచ్చి నీవు దోనెను లోతునకు నది చేపలు పటుటకు మీ వలలు వేయుడని చెప్పినపుడు సిమోను - "ఏలిన రాత్రంతయు మేము ప్రయాసపడితిమి. కానీ మాకేమియు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పి ఆలాగు చేసి విసారమైన చేపలు పట్టెను.” అప్పటివరకు తాము ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా పట్టలేకపోయినా ప్రభువు మాట నమ్మి ఆయన చెప్పినట్టు చేయడం ద్వారా రెండు దోనెల నిండా విస్తారమైన చేపలు పొందారు. ప్రభువు మాటకు లోబడడం ద్వారా పేతురు గొప్ప అద్భుతాన్ని, విస్తారమైన మేలును, సమృద్ధిని ఉచితంగా పొందాడు. తాము ఎంతో అనుభవాన్ని, చేపలు పట్టడంలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నా సరే, ప్రభువు మాటను బట్టి వలలు వేశారు. నిజానికి వారి అలవాటును బట్టి చేపలు రాత్రివేళ అది కూడా తక్కువ లోతులో వలలు వేసి పట్టేవారు కాని, ప్రభువు పగటిపూట దోనెను లోతుకు నడిపించి వలలు వేయమన్నాడు. ప్రభువు మాట జాలరుల అలవాటుకు, సంప్రదాయానికి ఎంత భిన్నంగా, అనుభవం లేనిదిగా ఉన్నట్టున్నా పేతురు ప్రభువు చెప్పినట్టు వలలు వేశాడు. అందుకే గొప్ప అద్భుతాన్ని, విస్తారమైన మేలును పొందాడు.

పేతురుకి చేపలు. పట్టడంలో ఉన్న నైపుణ్యం కంటే అననుకూల పరిసితులో ప్రభువు చెప్పినట్లు చేసే అతని విశ్వాసమే నెగ్గింది. మనం కూడా ప్రభువు మాటకు లోబడడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ విశ్వాసంతో ఆయనకు లోబడాలి. అప్పుడే అద్భుతాలను చూడగలం. పేతురు అంత విస్తారమైన చేపలను చూసి, ప్రభువు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, “ప్రభువా, నన్ను విడిచి పొమ్ము. నేను పాపాత్ముడన”ని చెప్పాడు. ప్రభువు మహిమను పేతురు చూడగానే ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. తన పాపస్థితిని ఒప్పుకున్నాడు. ఇంతకుముందే తనపట్ల ఆయనకున్న ఏర్పాటును ప్రభువు తెలియజేసినా, పేతురు ప్రభువును వెంబడించలేదు. తన పాపాన్ని, అయోగ్యతను ఇప్పుడు ప్రభువు దగ్గర ఒప్పుకున్నాడు. మహిమ గల ప్రభువును ఎదుర్కొన్న వారెవరైనా తమ పాపస్థితిని ఒప్పుకోవలసిందే. అప్పుడు ఆయన పేతురుతో - 'భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టు చెప్పాడు. తాను పాపినని ఒప్పుకున్నప్పుడు, పేతురు జీవితాన్ని ఆయన మార్చివేశాడు. ఆయన శిష్యునిగా, ఆయన కొరకు మనుష్యులను సంపాదం మార్పు చెందాడు. చేపలను పట్టి, తినేవాడు. ఇక మనుష్యులను ప్రభువు మనుష్యులను ప్రభువు కొరకు పట్టి వారిని జీవమార్గంలోకి తెచ్చేవాడిగా మార్పు చెందాడు. చదువరీ, మనం కూడా పాపులమని ఆయన దగ్గర ఒప్పుకుంటే, మన పాపాన్ని క్షమించి, మన జీవితాలను కూడా ప్రభువు మార్చగలడు.

తరువాత వారు దోనెలను దరికి చేర్చి, సమస్తాన్ని విడిచి పెట్టి ఆయనను వెంబడించారు. అంత విస్తారమైన చేపలరాశిని, దోనెలను, తమ వృత్తిని విడిచి ప్రభువును వెంబడించారు. ఆయనే కదా, ఇన్ని చేపలను ఇచ్చింది. పెద్ద చేపల వ్యాపారాన్ని పెడదామని వారనుకొనలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే ఆ చేపలు ఎన్ని రోజులు రావుకదా! అయితే ఇలాంటి అద్భుతాలు చేసే ప్రభువునే కలిగి ఉండి, ఆయన్నే వెంబడిస్తే ఎన్నడూ కొదువ ఉండదు. ఎప్పుడూ తాజా అద్భుతాలు అనుభవించవచ్చు. అందుకే వారు జ్ఞానంతో సమస్తాన్ని విడిచి పెట్టి ఆయననే వెంబడించారు. పాఠకులూ, ప్రభువు ఇచ్చిన ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, ఆస్తినో నమ్ముకుని ఇవన్నీ ఇచ్చిన ఆయనను వెంబడించడం మానివేస్తారా? నిర్లక్ష్యపెట్టారా? సృష్టికర్తను విడిచి సృష్టిని ప్రేమించి పూజిస్తున్నారా? ఎప్పటికైనా ఇవ్వబడినదానికంటే, దానిని ఇచ్చినవాడే గొప్పవాడు. మేలు ఎంత గొప్పదైనా, దానిని ఇవ్వగలవాడు అంటే, ఇచ్చినవాడు దానికంటే గొప్పవాడైతేనే కదా, దానిని ఇవ్వగలడు! మనం అనుభవిస్తున్న ప్రతి మేలు కంటే, దానిని అనుగ్రహించిన ప్రభువే మన ప్రేమకు, ఆరాధనకు పాత్రుడు. కనుక లోకంలో ఉన్న సమస్తం కంటే ప్రభువునే ప్రేమించి, వెంబడించాలి. ఆయనను వారు వెంబడించారు గనుకనే ఆయన వారిని లోకాన్ని తల్లక్రిందులు చేసేటంతవారిగా తన కొరకు బలపరచి వాడుకున్నాడు. ప్రభువును వెంబడించేవారికి ఏ మేలు కొదువ ఉండదు. నిజానికి ఆయనను వెంబడించడం చెప్పలేనంత గొప్ప ధన్యత. చదువరీ, ప్రభువు మీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఈరోజే గ్రహించు.

11. సేన దయ్యం పట్టినవాడు బాగుపడుట

మార్కు 5:1-16 - "వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు. సంకెళ్ళతో నైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతుల కును సంకెళ్ళు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి, కాలి సంకెళ్ళు తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోను కేకలు వేయుచు, తన్నుతాను రాళ్ళతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొని వచ్చి, ఆయనకు నమస్కారము చేసి - యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధించకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన - నీ పేరేమని వాని నడుగగా వాడు - నా పేరు సేన. ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుక ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తికొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణము లోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి.”

ఈ అద్భుతం ద్వారా ప్రభువులో మనకు కలిగే మేళ్ళు

మొదటి మేలు: అపవిత్రాత్మ పట్టినవానిని ఎవ్వరూ సాధుపరచలేకపోయారు. సంకెళ్ళు కూడా అతనిని బంధించలేకపోయాయి. అయితే యేసు ప్రభువు దురాత్మను గద్దించి అతనిని విడిపించాడు. ఎవరివల్లా, ఏ పద్ధతివల్లా కలుగని విడుదల ప్రభువువల్ల అతనికి కలిగింది. సర్వాధికారి అయిన ప్రభువు సాతానుని గద్దించి దూరపరిచాడు. మానవులమైన మనం సైతాను అధికారం క్రింద ఉండి సతమతమవుతున్నప్పుడు ఏ కట్టుబాటు, ఏ నిష్ణా, మరి ఎవ్వరూ ఇవ్వలేని విడుదలను యేసుప్రభువు ఒక్కడే ఇవ్వగలడు. ఎఫెసీ 2:1,2 లో ఇలా ఉంది, “మీ అపరాధములచేతను, పాపముల చేతను మీరు చచ్చినవారై యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచు కొంటిరి.” యేసుక్రీస్తు ప్రభువే అపవాది యొక్క అధికారము నుండి మానవులను విడిపింపగల సమర్థుడు. ఎన్నిసార్లు సంకెళ్ళతో బంధించినా ఆ దయ్యములు పట్టినవాడు సంకెళ్ళను తెంపి సాధుపడనట్లు మానవుడు ఎన్ని మత కట్టుబాట్లను, ఆచారాలను, నిష్ఠలను అనుసరించినా సాతాను నుండి, పాప బానిసత్వాన్నుండి ఎన్నటికీ విడుదల పొందలేడు. యేసు ప్రభువు ఒక్కడే రక్షకుడు. మరి ఎవనివలనా రక్షణ కలుగదు. "ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను” (అపొ.కా. 4:12).

రెండవ మేలు: అపవిత్రాత్మ పట్టినవాడు దిగంబరిగా ఉండేవాడు. ప్రభువు అతనికి బట్టలు ధరింపజేశాడు. అలాగే మానవులమైన మనం మన పాపాన్ని బట్టి దేవుని దగ్గరకు రాలేని పాపడాగులతో, మలినంతో ఉన్నాము. యేసు ప్రభువు మనల్ని రక్షణ వస్త్రంతో అలంకరిస్తాడు. "శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగానూ, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లికుమార్తె రీతిగానూ ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు. నీతి అను పై బట్టను నాకు ధరింప జేసియున్నాడు” (యెషయా 61:10).

మూడవ మేలు: దయ్యములు పట్టినవాడు తన్ను తాను రాళ్ళతో గాయపరచుకుంటూ ఉండేవాడు. ప్రభువు అతణ్ణి స్వస్థపరిచాడు. సాతాను మనల్ని మనం గాయపరచు కునేలా చేస్తాడు. త్రాగుడు, వ్యభిచారం, జూదం, పొగత్రాగడం, మాదకద్రవ్యాలు మొదలైన దుర్వ్యసనాలకు బానిసలైనవారు ఈ దుర్వ్యసనాలనే రాళ్ళతో తమ్మును తామే గాయపరచుకుంటూ తమ ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, కుటుంబాన్ని, క్షేమాన్ని, భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు. యేసు ప్రభువు మన జీవితాలను పాపము వ్యసనాల నుండి విడిపించి, నష్టపోయిన, గాయపడిన మనల్ని స్వస్థపరుస్తాడు. పోగొట్టుకున్న ఆరోగ్యం, గౌరవం, క్షేమం తిరిగి రెండింతలుగా ఇస్తాడు.

నాలుగవ మేలు: అపవిత్రాత్మ పట్టినవాడు తన ఇంటి దగ్గర సమాజంతో ఉండ కుండా, సమాధులలో నివాసం చేసేవాడు. ప్రభువు అతన్ని రక్షించి, స్వస్థపరచి, సాధుపరచి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అలాగే మనం కూడా దేవునికి దూరస్తులమును, నిర్జీవమైన స్థలాల్లో మరణచ్చాయలలో జీవిస్తున్నాము. ప్రభువు మనల్ని రక్షించి, సాధు పరచి, జీవం కలిగిన ఆయన సంఘంలో రేపు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో కూర్చుండబెడతాడు. ఆయనతోపాటు పరలోకంలో ఉండడం అనేది ఎంత గొప్ప ధన్యత!

ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకొనే పాఠాలు

మొదటి పాఠం: దయ్యాలు ప్రభువు ఆజ్ఞకు గడగడ వణుకుతూ అతణ్ణి విడిచి పెట్టాయి. ప్రభువు సెలవు లేనిదే అవి పందులలో కూడా ప్రవేశించలేవు. అటువంటి సర్వాధికారి యైన ప్రభువు నీకుండగా సాతాను నిన్ను ఏమీ చేయలేడు. దేవుడు ఆయన ప్రజల చుట్టూ కంచె వేసి సాతాను వారిని ముట్టకుండా కాపాడతాడు. “నీవు అతనికిని, అతని ఇంటివారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా! నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది” (యోబు 1:10).

రెండవ పాఠం: దయ్యాలు మరియు ఆ ఊరివారు ప్రభువును బ్రతిమాలితే, ప్రార్థిస్తే ప్రభువు విన్నాడు. కాని దయ్యాల నుండి విడిపింపబడిన అతడు మాత్రం ఆయనతో ఉండడానికి సెలవిమ్మని బ్రతిమాలినపుడు ప్రభువు సెలవివ్వలేదు. ఎందుకు ఒక్కోసారి మన ప్రార్థనలు ప్రభువు తిరస్కరిస్తాడు? ఎందుకు ఒక్కోసారి మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతోంది? ప్రతి యోగ్యమైన ప్రార్థనకు ప్రభువు నాలుగు రకాల జవాబులలో ఏదో ఒకటి ఇస్తాడు.

1) 'అలాగే' అని అడిగింది ఇస్తాడు.

2) 'కాదు' అని అడిగింది ఇవ్వడు.

3) 'ఆగు' అని కొంతకాలానికి అడిగింది ఇస్తాడు.

4) మనం అడిగింది కాకుండా 'వేరేది' ఇస్తాడు.

మన ప్రార్థనకు ఆయన ఏ రకమైన జవాబు ఇచ్చినా మనకు మేలే. అవును అని మనం అడిగింది. ప్రేమతో మనకిచ్చే ప్రభువు మనకు హానికరమైనది మనము అడిగినప్పుడు 'కాదు' అని ప్రేమతో మనకు ఇవ్వడు. చిన్నబిడ్డ బ్లేడు అడిగితే ఇవ్వం. ఎందుకు? అది ఆ బద్దకు హాని కనుక. లాజరును బాగుచేయడానికి ప్రభువు ఆలస్యంగా రావడమే మేలైంది. ఈ దయ్యం పట్టిన వ్యక్తి ప్రార్ధన కూడా ప్రభువు కాదనడం నల్ల అతను వెళ్ళి అనేకమందిని రక్షణలోకి తేగలిగాడు. ఇప్పుడు మనకు ఎందుకు మన ప్రార్ధనలు నెరవేరడం లేదో, లేక ఆలస్యమవుతున్నాయో అర్థం కాకపోవచ్చు. పరలోకం వెళ్ళిన తరువాత నెరవేరిన ప్రార్థనల కంటే, ఆలస్యమైన లేక నెరవేరని ప్రార్ధనలకే ఎక్కువగా ప్రభువును స్తుతిస్తామని నీకు తెలుసా?

మూడవ పాఠం: ప్రభువు ప్రేమ ఎంత గొప్పదో చూద్దాం. ఆయనను వెళ్ళిపొమ్మని తోసివేసిన ఆ ఉరివారి యొద్దకే ప్రభువు అతణ్ణి సాక్ష్యం చెప్పడానికి పంపాడు. అలాగే మనం కూడా ప్రభువుని వ్యతిరేకించేవారు, దూషించేవారు నరకంలో పడాలని వారిని ద్వేషించక వారికోసం ప్రార్థించి వారికి సువార్త చెప్పాలి.

నాలుగవ పాఠం: ప్రభువు తనపట్ల కనికరపడి చేసిన అద్భుతకార్యాలను ఆ వ్యక్తి దెకపొలి అనే ఆ పది గ్రామాలలో ప్రకటించాడు. సాక్ష్యం చెప్పాడు. మనం కూడా మొదట మార్పుచెంది ప్రభువు కొరకు సాక్షులుగా జీవించాలి. ఆయన మహిమను, ప్రేమను లోకానికి చాటాలి. ఐదవ పాఠం: అతడు ప్రభువు కార్యాలు ప్రకటించేటపుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. అతనిలో మార్పును ప్రజలు చూశారు. అలాగే మనం కూడా మన జీవిత మార్పును లోకానికి కనుపరచాలి. మీరు మారుమనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఈ రీతిగా లోకాన్ని ఆశ్చర్యపరచాలి. చదువరులూ, మీ జీవితం, సేవ, సాక్ష్యం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తున్నాయా? లోకాన్ని ఆశ్చర్యపరిచే సాక్ష్యజీవితాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక!

12. కుష్ఠరోగి శుద్ధియగుట

మత్తయి 8: 1-1 - "ఆయన ఆ కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్టరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి - ప్రభువా, నీకిష్టమైతే నన్ను ముద్దునిగా చేయగలననెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్దుడవు కమ్మని చెప్పగా తక్షణమే నాని కుష్ఠరోగము శుద్దియాయెను. అప్పుడు యేసు - ఎవరితోనూ ఏమియూ చెప్పకు సుమీ. కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని నానితో చెప్పెను."

ఈ అద్భుతం ద్వారా యేసుప్రభువును గూర్చి తెలిసీ కొన్ని విషయాలు

యేసుప్రభువు భయంకరమైన కుష్ఠరోగాన్ని బాగుచేసిన శక్తిమంతుడు. ఆయన శక్తి అపరిమితమైనది. “ఎవ్వడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు” (యోబు 9:10), కుష్టరోగి తన యొద్దకు వచ్చి స్వస్థత కోరినప్పుడు ప్రభువు వానిని ముట్టి స్వస్థపరిచాడు. అతనిని ముట్టడంలో ప్రభువు అద్భుతమైన ప్రేమ కనబడుతుంది. “దేవుడు ప్రేమ స్వరూపియై యున్నాడు” (1 యోహాను 4:16). "యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు” (కీర్తన 103:8). "యెహోవా దయాళుడు, నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు” (కీర్తన 116:5). "ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను” (కీర్తన 22:24). అతని రోగాన్ని బట్టి ప్రభువు అతణ్ణి త్రోసివేయలేదు. అతని బంధువులు, స్నేహితులు అతణ్ణి విడిచి పెట్టేశారు. వారే అతణ్ణి ప్రేమతో ముట్టుకోరు. అలాంటిది ప్రభువు అతణ్ణి ముట్టాడు. ఆ రోగి వచ్చి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్దునిగా చేయగలవని అన్నప్పుడు ఆయన నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి అతణ్ణి శుద్ధి చేశాడు. అతడు బాగుపడడం తనకిష్టమని ప్రభువు తెలియజేశాడు. ప్రభువు మన మేలును, క్షేమాన్ని కోరేవాడు. ఆయన కోరేది మనం దారితప్పి, చెడిపోయి, నష్టపోవాలని కాదు. మనం బాగుపడడమే ఆయనకు ఇష్టం. "దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము” (యెహెజ్కేలు 18:23). “నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును” (యెహెజ్కేలు 33:11). మనం బాగుపడడం, క్షేమంగా, సంతోషంగా జీవించడమే దేవునికి ఇష్టం. తన సేవకుని క్షేమమును చూచి దేవుడు ఆనందించునని కీర్తన 35:27లో వ్రాయబడి ఉంది. ప్రభువు నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అతనితో చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయింది. ఈ రీతిగా ప్రభువు మాటతో అతణ్ణి స్వస్థపరిచాడు. ప్రభువు మాట మహత్తు కలిగింది. తన వాక్కుతో ప్రపంచాన్ని నిర్మించి అట్టి తన మహత్తుగల మాటతో సర్వాన్ని నిర్వహిస్తున్నాడు. మాటతో రోగులను బాగుచేసి అపవిత్రాత్మలను గద్దించి వెళ్ళగొట్టాడు. ప్రభువు తన మాటతో తుఫానును గద్దించి సముద్రాన్ని నిమ్మళపరిచాడు.

ఒక శతాధిపతి ప్రభువు దగ్గరకు వచ్చి తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఇంటిలో పడియున్నాడని చెప్పినప్పుడు ప్రభువు అతని ఇంటికి వచ్చి స్వస్థపరుస్తానన్నాడు. అప్పుడు ఆ శతాధిపతి 'ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడినవాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పనిచేయమంటే చేయును” అని అన్నాడు. ఒక సైనికాధికారి మాటే ఇంతగా నెరవేరుతుంటే దేవాది దేవుడైన ఆ ప్రభువు మాట ఇంకెంతో ఖచ్చితంగా నెరవేరుతుంది గదా. అందుకే ప్రభువు ఆ శతాధిపతితో 'ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక' అని చెప్పగా ఎక్కడో దూరంగా ఉన్న అతని దాసుడు ఆ గడియలోనే స్వస్థతనొందాడు. చనిపోయిన లాజరును, యాయీరు కుమార్తెను మాటతో బ్రతికించాడు. 29వ కీర్తనలో దేవుని స్వరము, ఆయన మాట ఎంత ప్రభావము కలిగిందో వ్రాయబడి ఉంది. ఆయన మాటవల్లే ఉరుము ధ్వని పుడుతుంది. ఆయన మాటవల్లే భూకంపాలు, అడవులను తగులబెట్టే అగ్నిజ్వాలలు కలుగుతాయి. ఆయన ఆజ్ఞనుబట్టి పంటలు, ఋతువులు, సంతాన అభివృద్ధి కలుగుతున్నాయి. చదువరీ, దేవుని మాట ఎంత బలము గలదో, ఎంత ప్రభావము గలదో గ్రహించారా?

ప్రభువు చేసిన ఈ అద్భుతం ఎంతో ప్రాముఖ్యమైనది. కుష్టరోగం ఒక వ్యక్తిలో వ్యాపించి చివరికి అతణ్ణి ఎలా నాశనం చేస్తుందో పాపం కూడా మానవుణ్ణి నాశనానికి, నరకానికి గురిచేస్తుంది. మానవులమైన మనమందరమూ పాపులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ భేదమునూ లేదు, అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. (
రోమా 3:23). “నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు వద్దుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు. నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు, పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా” (యోబు 25:4,5,6). ఆ కుష్టరోగి ప్రభువు ద్వారా శుద్దుడైనట్లు, మనమందరమూ పాప రోగాన్నుండి ప్రభువు ద్వారా విడుదలను, చరిని, స్వస్థతను పొందాలి. లేకపోతే మరణమే, నరకమే. ప్రభువు ఆ రోగిని ప్రేమించి ఉచితంగా స్వస్థపరిచినట్లు ఆయనలో విశ్వాసముంచిన వారినందరినీ పాపం నుండి శుద్ధిచేస్తాడు. అందుకే ఆయన సిలువపై ప్రాణం పెట్టి పాపాన్ని పరిహరించాడు.

ప్రభువు ద్వారా మనం పొందే మేళ్ళు

మొదటిది: ఆ కుష్ఠరోగి ప్రభువు దగ్గరకు వచ్చాడు. అలాగే ప్రభువు ద్వారా మేలు పొందాలంటే ప్రతీ ఒక్కరూ ప్రభువు దగ్గరకు రావాలి. "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును" అని ప్రభువు మత్తయి 11:2లో సెలవిచ్చినట్లు మనం ప్రభువు దగ్గరకు వస్తే మేలు పొందగలం.

రెండవది: అతడు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కాడు. మనం కూడా ప్రభువే మన ఆరాధనకు పాత్రుడని ఆయనకే మ్రొక్కి నమస్కరించాలి. సృష్టిలో కిరీటంలాంటి దేవుని పోలికలో సృష్టించబడిన మనం మన కోసం సృష్టించబడిన సృష్టిలో దేనికీ యొక్కకూడదు. మనకంటే పైనున్న దేవునికే మొక్కాలి. ఆయన ఒక్కడే మన ఆరాధనకు యోగ్యుడు.

మూడవది: అతడు, 'ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్దునిగా చేయగలవు' అన్నాడు. ప్రభువు తనను బాగుచెయ్యగలడు అని నమ్మాడు. ప్రభువు శక్తిమీద గొప్ప విశ్వాసం కనుపర్చాడు. మనం కూడా ప్రభువు మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని ప్రభువు యోహాను సువార్త 11:40లో సెలవిచ్చాడు. పాఠకులారా, మీకిలాంటి విశ్వాసం, నమ్మిక ఉన్నదా?

నాలుగవది: 'నీకిష్టమైతే' అని ప్రభువు చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుడు అన్ని మేళ్ళు చేయగల శక్తిమంతుడు గాని, ఆయన తన చిత్తాన్నే జరిగిస్తాడు. 'ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవని యెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును” అని రోమా 9:15 లో సెలవిచ్చాడు. కాబట్టి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలని నేర్చుకుంటున్నాం. అయితే కొంతమంది ప్రభువు తాము కోరినట్లు జరిగిస్తేనే ఆయనను నమ్ముతారు. దేవుని చిత్తానికి తాము లొంగడానికి బదులు, తమ ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాలి అనుకుంటారు. దేవుని చిత్తమే మనకు శ్రేష్టం. కనుక ఆయన చిత్తానికి లోబడం . ప్రభువు అతణ్ణి బాగుచేసిన తరువాత ఎవరితోనూ ఏమీ చెప్పకు కాని వెళ్ళి సాక్షార్థమై నీ దేహాన్ని యాజకునికి కనుపరచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమన్నాడు. ప్రభువు స్వస్థపరిచాడన్న విషయం అధికంగా వ్యాపిస్తే ఆయన వాక్యపరిచర్యకు ఆటంకమవుతుందని అలా చెప్పాడు. మార్కు 1:45 లో ఉన్నట్టు, బాగుపడిన ఆ కుష్ఠరోగి తన స్వస్థతను గూర్చి విస్తారంగా ప్రకటించడం మొదలు పెట్టాడు గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉన్నాడు.

అయితే ఇప్పుడు మనం మాత్రం సర్వలోకానికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలి. యాజకునికి తన దేహాన్ని సాక్షార్థమై కనుపరచుకోవడం ద్వారా తాను శుద్దియైనట్లు సమాజానికి రుజువు చెయ్యాలి. ధర్మశాస్త్ర ప్రకారం మోషే నియమించిన కానుకను సమర్పించమన్నాడు. ప్రభువు ద్వారా మేలు పొందే మనం ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తూ కృతజ్ఞతతో మన సమయాన్ని, బలాన్ని, ధనాన్ని, తలాంతులను ఆయనకు కానుకగా సమర్పించాలి.

13. గ్రుడ్డి బిక్షగాడు

మార్కు 10:46-52 - "వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యుల తోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కనే కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా, యేసూ నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడు - బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు - నీవు వెళ్ళుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను.”


యేసుప్రభువు గ్రుడ్డివానికి లోకంలో ఎవ్వరూ చేయలేని మేలు చేశాడు. అతని గ్రుడ్డితనం పోగొట్టి అతనికి దృష్టి కలుగజేశాడు. గ్రుడ్డితనం వల్ల అతని జీవితమంతా చీకటి, విచారం, అజ్ఞానం, అయోమయంలో నిండి ఉండేది. దృష్టి కలుగజేయుట ద్వారా ప్రభువు అతని జీవితాన్ని వెలిగించి, సంతోషంతో, జ్ఞానంతో నింపాడు. బర్తిమయివలె మానవులమైన మనమందరము ఆత్మీయమైన గ్రుడ్డితనంతో ఉన్నాము. “దేవుని స్వరూపియై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను” (2 కొరింథీ 4:4). "వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను. గ్రహింప కుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవ్వరునూ ఆలోచన చెయ్యరు. చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవ్వడును ఆలోచింపడు. యోచించుటకు ఎవ్వనికి తెలివి లేదు, వివేచన లేదు” (యెషయా 44:18, 19). ఈ ప్రవచనముల ద్వారా మానవులు నిజదేవుణ్ణి, సత్యాన్ని ఎరుగని ఆత్మీయమైన గ్రుడ్డితనంలో, చీకటిలో, అజ్ఞానంలో ఉన్నారని తేటపడుతుంది. నలుగురు గ్రుడ్డివారు ఏనుగును తడిమి చూసి చెవిని తడిమినవాడు ఏనుగంటే చేటరా అని, తోకను తడిమినవాడు ఏనుగంటే త్రాడురా అని, కాలును తడిమినవాడు ఏనుగంటే స్తంభమురా అని, ఏనుగు ప్రక్కవైపున తడిమినవాడు ఏనుగంటే గోడరా అని అన్నారట. మనం కూడా నిజదేవుని చూడలేని గ్రుడ్డివారమై బొమ్మను, రాతిని దేవుడంటున్నాము. క్రీస్తు ప్రభువు బర్తిమయి గ్రుడ్డితనాన్ని పోగొట్టినట్లు మన ఆత్మీయ అంధత్వాన్ని కూడా పోగొట్టి జ్ఞానోదయం కలిగిస్తాడు. గ్రుడ్డితనం వల్ల బర్తిమయి భిక్షకుడై ఇతరుల మీద ఆధారపడి బ్రతికేవాడు. మనం కూడా నిజదేవుని ఎరుగని గ్రుడ్డితనంవల్ల వ్యర్థమైన జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తాలు మొదలైన మూఢ నమ్మకాలు, ఆచారాలపై ఆధార పడుతున్నాం. దృష్టి పొందడం ద్వారా బిక్షాటన మానేసిన బర్తిమయి వలె ప్రభువు ద్వారా దృష్టి పొంది స్వతంత్రులం కాగలం. బర్తమయి త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షాటన చేసేవాడు. దృష్టి పొందాక త్రోవలో ప్రభువు వెంట వెళ్ళాడు. మనం కూడా వెలిగింపబడి ప్రభువును వెంబడించుట ద్వారా జీవమార్గంలో నడవగలం. పాఠకులూ, మీరు కూడా ప్రభువు ద్వారా ఇటువంటి మేలు పొందాలని ఆశిస్తున్నారా? అయితే బర్తిమయి చూపు పొందడానికి ఏమి చేశాడో చూద్దాం.

బర్తిమయి చేసిన పనులు

మొదటి పని: అతడు ప్రభువు గురించి విన్నాడు. మనం కూడా వాక్యం వినాలి. ప్రభువును గూర్చి బాగా తెలుసుకోవాలి. విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. “కాగా వినుటవలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును” (రోమా 10:17).

రెండవ పని: దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణించుమని మొట్టపెట్టాడు. మనం కూడా ప్రభువు కృప కొరకు ఆయనను వేడుకోవాలి.

మూడవ పని: ప్రజలు అతణ్ణి ఊరకుండుమని గద్దించినా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. రోజూ భిక్షం వేసేవాళ్ళు ప్రభువును ప్రార్థించవద్దని గద్దిస్తున్నారు. వారి మాట వినకపోతే రేపటి నుంచి భిక్షం వెయ్యరని వారికి భయపడలేదు. మనుష్యులు భిక్షం వెయ్యగలరేమో గాని, ప్రభువైతే అతని గ్రుడ్డితనాన్ని పోగొట్టగలడు అని వారికి బెదరలేదు. మనుష్యులు అడ్డు వచ్చి నప్పుడు వెనుకంజ వేసి, ప్రార్థించడం మాని ఉండుంటే అతని చూపు పొందకపోయే వాడు కదా. అలాగే ప్రభువు భక్తిలో మనకు చాలా అడ్డులు, ఆటంకాలు వస్తాయి.

అయినా భక్తిని కోరుకుని అనుసరించేవారే చూపు. దీవెన పొందగలరు. అంతేకాదు ముందు గద్దించినవారే ప్రభువు అతణ్ణి పిలిచేసరికి ధైర్యం తెచ్చుకో, ప్రభువు నిను పిలుస్తున్నాడు. లెమ్మని అతడి ప్రోత్సహించారు. మనం కూడా పట్టుదలతో భక్తిని అనుసరిస్తే మొదట అడ్డు వచ్చినవారే భక్తిలోకి వెళ్ళిన తరువాత మనం మంచిగా, నీతిగా, ఆరోగ్యంగా ఉన్నామని గుర్తించి, భక్తిలోనే కొనసాగమని మనల్ని ప్రోత్సహిస్తారు. అదే రీతిగా మనం స్థిరంగా ప్రభువును ఆశ్రయిస్తే మనమూ మేలు పొందుతాము. మనకు అడ్డు వచ్చినవారు కూడా మనలో మార్పు చూసి వారు కూడా ప్రభువును నమ్ముకుంటారు. ప్రజలకు భయపడి ప్రభువును విడిచిపెడితే పరలోకాన్నే పోగొట్టుకుంటాం. కాబట్టి ఎంతమంది అడ్డువచ్చినా ప్రభువును విడిచిపెట్టకూడదు.

నాలుగవ పని: ప్రభువు ద్వారా మేలు పొందడానికి అతడు ప్రభువునందు విశ్వాస ముంచాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచిందని ప్రభవు అతనితో అన్నాడు. అలాగే మనం కూడా యేసు ప్రభువే రక్షకుడని మన జీవితాలలో అద్భుతాలు చెయ్యగలడని విశ్వసించాలి.

ఐదవ పని: ప్రభువు తనను పిలుస్తున్నాడని వినగానే భిక్షాటన కొరకు తన ముందు పరచుకున్న చెట్లను పారవేశాడు. ప్రభువు నాకు చూపు దయచేస్తాడు. ఇప్పుడు జ ఈ మురికి గుడ్డతో అడుకునే దుస్థితి ఉండదని నమ్మి దానిని పారవేశాడు. ప్రక్కన దాయలేదు. చంకన పెట్టుకుని ప్రభవు దగ్గరకు రాలేదు. అంతేకాదు, చూపు పొందాక బట్టను పారవేయడం కాకుండా, ముందే విశ్వాసంతో పారవేసి వచ్చాడు. నిజ విశ్వాసం దేవునికి ఇష్టంకాని వాటిని పారవేస్తుంది. విగ్రహాలు, వ్యసనాలు, ప్రతివిధమైన పాపాన్ని విడిచి పెట్టాలి. ప్రథవు బాగుచేస్తే ఇవన్నీ విడిచిపెడతాననడం కాదు. ముందు విడిచిపెట్టు, అప్పుడు దేవుడు నీ నిజవిశ్వాసాన్ని బట్టి ఆయన మహిమను కనుపరుస్తాడు.

ఆరవ పని: ప్రభువు పిలవగానే దిగ్గున లేచి ప్రభువు దగ్గరకు వచ్చాడు. ప్రభువు పిలుపుకు వెంటనే లోబడ్డాడు. అలాగే మనం కూడా ప్రభువు పిలుపును బట్టి ఆయన భక్తిలోనికి రావాలి. మనం ఉన్న పాపస్థితిలోనుండి వెంటనే లేచి ప్రభువు దగ్గరకు రావాలి. పాఠకులూ, ఇంకెంత కాలం అజ్ఞానంలో, చీకటిలో, పాపంలో జీవిస్తారు? నా యొద్దకు రండి. మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభువు పిలుస్తున్నాడు. బర్తిమయి వలె వెంటనే ప్రభువు దగ్గరకు రండి.

ఏడవ పని: ప్రభువు "నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావ”ని అడిగినప్పుడు బర్తిమయి, నాకు దృష్టి కలుగజేయమని అడిగాడు. ఎందువలనైతే అడుక్కునే దుస్థితి వచ్చిందో, ఆ గ్రుడ్డితనం పోగొట్టమని వేడుకున్నాడు. అలాగే మనం కూడా మన మనోనేత్రాలు వెలిగింపబడాలని, పాపాలు క్షమింపబడి, రక్షింపబడాలని ప్రార్థించాలి. రక్షణ కలిగితే అన్ని మేళ్ళు పొందగలం. ఈ రోజుల్లో చాలామంది రక్షణ, పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుణ్ణి వాటి కోసం ప్రార్థించకుండా, శరీర స్వస్థతలు ఇహలోక మేళ్ళు కోసం ప్రార్థిస్తున్నారు. బర్తమయి గ్రుడ్డివాడైనా తనకు అత్యంత అవసరమైన దానినే అడిగాడు. మనం కూడా అత్యవసరమైన రక్షణ కొరకై అడగాలి.

ఎనిమిదవ పని: ఆఖరుగా గ్రుడ్డివాడు చూపు పొందిన తరువాత ప్రభువునే వెంబడించాడు. మరి తిరిగి బట్టపరచుకుని త్రోవ ప్రక్కన అడుక్కోలేదు. ప్రభువునే అనుసరించాడు. ఉచితంగా ఎవ్వరూ ఇవ్వలేని దృష్టిని ఇచ్చిన ప్రభువును కాకుండా ఇంకెవ్వరిని అనుసరించగలడు? అంత మేలు చేసిన ప్రభువును వెంబడిస్తే ఏ లోటూ ఉండదని గ్రహించాడు. నిజమే, రక్షకుడైన ప్రభువును వెంబడించడమే ఎంతైనా న్యాయం, జ్ఞానం, ఉత్తమం. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువునే వెంబడించాలి. లోకాన్ని, శరీరాన్ని, లోకాచారాలు, మూఢ నమ్మకాలను అనుసరించ కూడదు. ప్రభువును వెంబడించు. నిన్ను కాపాడి దీవిస్తాడు. ఆయనలోనే నీకు క్షేమం.

14. దయ్యం పట్టిన స్త్రీ

లూకా 13:10-17 - "విశ్రాంతి దినమున ఆయన యొక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి, ఆమె మీ చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి జసమూహమును చూచి పని చేయదగిన ఆరు దినములు కలపు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు - వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైననూ, గాడిదనైననూ గాడి యొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్ళు పెట్టును గదా. ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్లనుండి విడిపింపతగదా? అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే సమూహమంతయూ ఈయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను."

ఈ అద్భుతం ద్వారా నేర్చుకొనదగిన కొన్ని ఆత్మీయ పాఠాలు

ఈ సందర్భంలో ప్రభువు యొక్క గొప్ప శక్తిని చూడగలం. పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీ నడుము వంగిపోయి ఎంతమాత్రమూ చక్కగా నిలబడలేకుండెను. సాతాను ఈ రీతిగా బంధించిన ఈ స్త్రీని ఆ కట్లనుండి యేసు ప్రభువు విడిపించాడు. పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న ఆ బలహీనతలను ఒక్క క్షణంలో పోగొట్టాడు. నడుము వంగిపోయి ఎంత చక్కగా నిలబడలేని ఆమెమీద చేతులుంచి ప్రభువు ఆమెను స్వస్థపంచం నిలబడేలా చేశాడు. నడుము వంగిపోయి అదే రీతిగా నడవడం ఎంత మైనది. ప్రభువు ఆ బాధనుండి ఆమెను విడిపించాడు. చక్కగా, నిటారుగా నిలబడడం జంతువుల కంటే మానవులకు దేవుడిచ్చిన గొప్ప ఘనత, అయితే బలహీనపరుచు దయ్యం ఆమెను పట్టినందువల్ల ఆమె నడుము వంగిపోయి ఏమాత్రం చక్కగా నిలబడలేక పోయింది. ఈ రంగా మానవులకు దేవుడిచ్చిన ఘనతను, స్వేచ్ఛను, అధికారాన్ని, ఆశీర్వాదాలను, ఆరోగ్యాన్ని శత్రువు పోగొడుతున్నాడు. పద్దెనిమిది సంవత్సరాలు అపవాది అమెను అతిగా బంధించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు శత్రువు బలమంతటి మీద అధికారం గలవాడు. కనుక అపవాది బంధకాల నుండి ఆ స్త్రీని విడిపించాడు. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు. సకల దేవతలూ ఆయనకు నమస్కారం చేస్తాయని కీర్తన 977లో చూడగలం. అపవాది అనేక పర్యాయాలు యేసు ప్రభువుకు నమస్కారం చేసి 'యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలు నేశాయి. అపవాదికంటే ప్రభువు గొప్ప శక్తిమంతుడని గ్రహించగలం. ఆ స్త్రీ సాతాను కట్లలో పద్దెనిమిది సంవత్సరాలు ఉంది. వైద్యం గాని, తన స్వప్రయత్నాలు గాని ఆమెను బాగుచేయలేకపోయాయి. యేసుప్రభువు ఆమెను విడిపించాడు.

మానవుల మైన మనం కూడా సాతాను బంధకాల్లో ఉన్నాం. పాప మరణాల నియమం క్రింద ఉన్నామని రోమా 8:2లో చూడగలం. ఇటువంటి బంధకాల నుండి యేసు ప్రభువు ఒక్కడే మనలను విడిపించగలడు. ఆ స్త్రీ ప్రభువును అదగకుండానే ప్రభువే ఆమెను చూసి జాలిపడి ఆమెను రమ్మని పిలిచి, ఆమె మీద తన చేతులుంచి స్వస్థపరిచాడు. ఉచితంగా, సంపూర్ణంగా వెంటనే ఆమెను విడిపించాడు. ఇందులో ప్రభువు గొప్ప ప్రేమను, దయను, మానవుల దీనస్థితిని కటాక్షించే ఆయన కృపను చూడగలం. ప్రియులారా, ఈ రీతిగా మన కష్టాలు, శ్రమలు, అపవాది బంధకాలు చూసి మనల్ని విడిపించగల శక్తిగలవాడు యేసు ప్రభువు తప్ప ఇంకెవ్వరున్నారు? ఆయన మన మేలు కోరి, మనలను విడిపించడానికి శక్తి, ప్రేమలు గలవాడు.

సాతాను, దయ్యములు, దేవతలూ మనల్ని బలహీనపరచి బాధపరుస్తాయే కాని మేలు చేయవు. మనుషులు కూడా దేవుడు చేయగలిగిన మేలు మనకు చేయలేరు, చేయరని గ్రహించగలం. ఆ స్త్రీని ప్రభువు విడిపించినందుకు ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి విశ్రాంతి దినాన్న స్వస్థత పొందడానికి రావద్దని ప్రజలను గద్దించాడు. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి అపవాది ద్వారా పీడింపబడుతూ ఉండి విడిపింపబడినందుకు అతడు సంతోషించాల్సింది బదులు స్వస్థపరిచినందుకు ప్రభువును ఎదిరించాడు. కాబట్టి దేవతలుగానీ, మనుషులుగానీ మన బాధల నుండి మనల్ని ఎవ్వరూ విడిపించరు, విడిపించలేరు. యేసు ప్రభువే మన రక్షకుడు.

మనం కూడా ఏ రీతిగా సాతాను కట్లనుండి విడిపింపబడగలం?

మొదటిది: బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీ నడుము వంగిపోయి చక్కగా నిలబడలేనప్పటికీ సమాజ మందిరానికి వెళ్ళింది. అక్కడే ఆమెకు స్వస్థత, విడుదల దొరికింది. దేవుని ద్వారా మేలు పొందాలనుకునేవారు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆ స్త్రీ సమాజ మందిరానికి వెళ్ళింది కాబట్టి అడగకుండానే మేలు పొందింది. ఆ స్త్రీ తన బాధలోనే వంగిపోయిన స్థితిలోనే సమాజ మందిరానికి వెళ్ళింది. అలాగే మనం కూడా ప్రభువు సన్నిధికి ఎలాంటి పరిస్థితిలోనైనా వెళ్ళి మేలు పొందగలం. . చాలామంది చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైతే చాలు, మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యపెడతారు.

రెండవది: ఆ స్త్రీ సమాజ మందిరానికి ఆత్మీయ మేలు పొందడానికి వచ్చింది. కాబట్టి ఆత్మీయ మేలుతో బాటు శారీరక మేలు, స్వస్థత కూడా పొందింది. “కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. అప్పుడవన్నియు మీకు అనుగ్రహింప బడును” (మత్తయి 6:33).

మూడవది: ప్రభువు ఆమెను చూచి, రమ్మని పిలిచినప్పుడు ఆమె ప్రభువు దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ప్రభువు ఆమెమీద చేతులుంచి 18 సంవత్సరాలనుండి సాతాను బంధకాలలో ఉన్న ఆమెను విడిపించాడు. అలాగే మనం కూడా ప్రభువు పిలుపుకు లోబడితే మేలు పొందుతాము. ప్రభువు ఆ స్త్రీని మేలు చేయడానికి పిలిచినట్లు మానవులందరిని విశ్రాంతి పొందడానికి తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. “ప్రయాస పడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును” (మత్తయి 11:28). “దప్పిగొనిన వానిని రానిమ్ము.

ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అని ప్రకటన 22:17లో ప్రభువు సెలవిచ్చాడు. యోహాను 7:37,38 లలో ప్రభువు పిలుపును చూడగలం. “ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవ్వడైననూ దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.” ఎవరైతే ప్రభువు ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన దగ్గరకు వస్తారో, ఆయన భక్తి విశ్వాసాలలో ప్రవేశిస్తారో వారు ప్రభువు ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని పొందగలరు.

ప్రభువు ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమ పరచింది. తాను అడగకుండానే తన ఊహకు మించి ప్రభువు చేసిన మేలును బట్టి ఆమె కృతజ్ఞతతో దేవుని మహిమపరచింది. అలాగే మనం కూడా ప్రభువు ద్వారా పొందిన మేళ్ళనుబట్టి ఆయనను మహిమపరచాలి. దావీదు భక్తుడు కృతజ్ఞతతో దేవుని స్తుతించాడు. “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున ఉన్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” (కీర్తన 103:1,2). ప్రభువు విశ్రాంతి దినాన ఆమెను స్వస్థపరచి నందుకు ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి విశ్రాంతి దినాన్న సమాజ మందిరానికి రావద్దని అన్నాడు. అయితే ప్రభువు అతణ్ణి గద్దించి విశ్రాంతి దినమైనా ప్రతీవారు తన ఎద్దును గాని, గాడిదను గాని విప్పి తోలుకెళ్ళి నీళ్లు పెడతారు కదా. అలాటిది 18 సంవత్సరాల నుండి సాతాను బంధించిన స్త్రీని విశ్రాంతి దినాన్న విడిపింపతగదా? అని చెప్పాడు. అప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు. ప్రభువును, ఆయన మాటలను, ఆయన కార్యాలను ఎదిరించకూడదని, ఎదిరిస్తే సిగ్గుపరచబడతామని మనం నేర్చుకుంటున్నాం. ఆయన మీద కోపించిన వారందరూ సిగ్గుపడుదురని యెషయా 45:24లో చదవగలం. పాఠకులారా, ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా ప్రభువును, ఆయన చిత్తాన్ని ఎదిరిస్తున్నారా? దేవుణ్ణి ఎదిరించి మనమేమీ జయించలేం. ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయనను నమ్మినవారిని హింసించిన సౌలుతో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, "సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టము.” ప్రభువును, ఆయన చిత్తాన్ని ఎదిరించకుండా ఆయనకు లోబడేలా ప్రభువు మనందరికీ సహాయం చేయును గాక!

15. కానా పెండ్లి విందు

యోహాను 2:1-11 - "మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినపుడు యేసు తల్లి - వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు అమెతో- అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి - ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి, మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు -ఆ బాసలు నీళ్ళతో నింపుమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడినుండి వచ్చెనో ఆ నీళ్ళు ముంచి తీసుకొనిపోయిన పరిచారకులకే తెలిసినది గాని, విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినపుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి - ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.”

యేసు ప్రభువు చేసిన ఈ మొదటి సూచక క్రియ ద్వారా ఆయన తన మహిమను బయలుపరిచాడు. అద్భుత కార్యాల ద్వారా మనం దేవుని మహిమా ప్రభావాలను చూడగలం. ప్రభువు చేసిన అద్భుత కార్యాలు ఆయన దైవత్వాన్ని ఋజువుచేస్తున్నాయి. చదువబడిన వాక్యభాగంలో యేసుప్రభువు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. దేవుడొక్కడే సృష్టించగలడు. ద్రాక్షరసాన్ని సృష్టించడంలో యేసుప్రభువు తన దైవశక్తిని కనుపరిచాడు. అందువల్ల శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు. ప్రభువు చేసిన అద్భుతాల ద్వారా మనం కూడా ప్రభువు మహిమను గ్రహించి ఆయనలో విశ్వాసముంచాలి. ఆ వివాహ విందులో ద్రాక్షరసం అయిపోయింది.

ఇటువంటి పరిస్థితి పెండ్లి కుమారునికి ఎంతో ఇబ్బంది కరమైంది. ఎంతో అవమాన కరమైంది. యేసుప్రభువు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం ద్వారా ఆ విందులోని లోటును పూడ్చి ఇబ్బంది, అవమానం పోగొట్టి మొదటి ద్రాక్షరసం కంటే మంచి ద్రాక్షరసాన్ని వారికి అనుగ్రహించాడు. ప్రభువు మన జీవితాలలో ఉండే లోటును కూడా పోగొట్టి సమృద్ధిని అనుగ్రహిస్తాడు. “యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు” (కీర్తన 23:1). "యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తుల ఉంచువానికి ఏమియు కొదువలేదు. సింహపు పిలలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువేయుండదు” (కీర్తన 34:9, 10). "యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయకమానడు” (కీర్తన 84:11). ప్రభువు మనకు ఏ మేలు కొదువ చేయడని గ్రహించగలం.

ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లియైన మరియ వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పింది. యేసుప్రభువు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయమింకనూ రాలేదనెను.' కొంతమంది ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దేవుని ద్వారా మనకేమన్నా మేలు కలగాలంటే మరియమ్మకు ప్రార్థిస్తే ఆమె ప్రభువుకి చెబుతుంది అంటారు. కానీ, ప్రభువు ఆమెతో, “అమ్మా, నాతో నీకేమి పని?” అని ఆమెను గద్దించాడే గాని, ఆమెను మనుష్యులకూ తనకూ మధ్యవర్తిగా ఎంచలేదు. మరియ కూడా మనలాంటి మానవమాత్రురాలేనని గ్రహించాలి. మరియ తనకు కూడా దేవుడు తన రక్షకుడని, తనకును రక్షణ అవసరమని ఒప్పుకున్నది. 'అపుడు మరియ ఇట్లనెను - నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను” (లూకా 1:46-48). ప్రభువు కూడా మరియకు ఇతర విశ్వాసుల కంటే ఉన్నత స్థానాన్ని ఆపాదించలేదు. ఒకప్పుడు ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయనతో మాట్లాడాలని వెలుపల నిలుచున్నారు. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు, నీ సహోదరులును నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన, “నా తల్లి ఎవరు? నా సహోదరులెవరు? అని చెప్పి, ఇదిగో నా తల్లియు, నా సహోదరులును. పరలోక మందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు, నా తల్లియు అనెను” (మత్తయి 12:46-50). లూకా 11:27,28లో ఈ రీతిగా ఉంది, “ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన - అవునుగానీ, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.” ఈ వచనాల ద్వారా మరియు ఆరాధనకు పాత్రురాలు కాదని దేవుని వాక్యాన్ని విని గైకొనువారే ఆమెకంటే ధన్యులని గ్రహించాలి. మరియమ్మకు దండం పెట్టడం, తలనీలాలు ఇవ్వడం, ఆమెకు ప్రార్థించడం వాక్యవిరుద్ధమని గ్రహించగలం. 1తిమోతి 2:5 లో ఈ రీతిగా ఉంది. “దేవుడొక్కడే. దేవునికిని, నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తుయేసను నరుడు." దీనినిబట్టి యేసుక్రీస్తే మన మధ్యవర్తి అని, దేవుని సమీపించడానికి మరియ యొక్క మధ్యవర్తిత్వం పనికిరాదని గ్రహించగలం.

పాఠకులారా, మీలో ఎవరైనా మరియమ్మకు మ్రొక్కుకొని కొండకు వెళ్తున్నారా? మీరు పాపం చేస్తున్నారని తెలుసు కోండి. కానా అనే ఊరిలో జరిగిన ఆ వివాహానికి యేసును, ఆయన శిష్యులును పిలువబడ్డారు. బహుశా ఆ వివాహము మరియ బంధువులదై యుండవచ్చు. యేసు ప్రభువును వివాహానికి ఆహ్వానించారు. అందుకే ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి ఆ లోటును తీర్చాడు. అలాగే మన జీవితాలలోకి ప్రభువును ఆహ్వానిస్తే నీళ్ళవంటి అంత విలువలేని మన జీవితాలను మధురమైన ద్రాక్షరసము వలె మారుస్తాడు. మన జీవితాలను మార్చగలిగింది. ఆ ప్రభువే. చదువరీ, నీ జీవితంలో ప్రభువుని కలిగియున్నావా? ఈ జీవితం మధురమైన ద్రాక్షరసం వలే మార్పు చెందిందా? పాపజీవితం పరిశుద్ధంగా, చీకటి బ్రతుకు వెలుగుమయంగా మారిందా? పరిచారకులు రాతి బానలను నీళ్ళతో నింపమని ప్రభువు చెప్పినప్పుడు వారు వాటిని అంచులమట్టుకు నింపారు. ప్రభువు చెప్పినట్లు వారు చేశారు కాబట్టి అద్భుతాన్ని చూడగలిగారు. ప్రభువు చెప్పినట్టు చేయడం మనకెంతో శ్రేయస్కరం. “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్రము తరంగముల వలెను ఉండును” (యెషయా 48:18). "అయ్యో, నా ప్రజలు నా మాట వినినయెడల, ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు! అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కెదను. వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును” (కీర్తన 81:13-16). చాలామంది ప్రభువును నమ్మాం అంటారే గాని, ఆయనకు లోబడరు. అందుకే ఆయన లూకా 6:46లో ఇలా అన్నాడు, “నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఆయనకు లోబడి మేలులు పొందుదుముగాక. పాలస్తీనాలో ద్రాక్షరసము త్రాగుట విందులలో జరిగేది.

నీళ్ళలో ద్రాక్షరసాన్ని కలిపి దాహం తీర్చడానికి త్రాగేవారు. ద్రాక్షరసం తాగకూడదని బేబిల్ లో వ్రాయబడలేదు గాని, ద్రాక్షరసంతో మత్తుగా ఉండవద్దని వ్రాయబడి ఉంది. తాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరని వాక్యంలో వ్రాయబడి ఉంది. 1 కొరింథీ 6:9,10 - "అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి,జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” 2 పేతురు 4:3లో ఇలా వ్రాయబడి ఉంది, “మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, అన్య జనుల ఇషము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును.” ఎఫెసీ 5:18 లో ఇలా ఉంది, "మద్యముతో మత్తులై యుండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై యుండుడి.”

ఆ వివాహానికి ప్రభువును ఆహ్వానించినట్టే ప్రతి వివాహ జీవితంలోనూ ప్రభువుకు ప్రత్యేక స్థానం ఇవ్వాలి. ప్రతి వివాహ బంధంలో ముగ్గురు వ్యక్తులు ఉండాలి. భర్త, భార్య, యేసు ప్రభువు. ఆయన వివాహ వ్యవస్థను నిర్మించినవాడు మాత్రమే కాదు. వివాహ జీవితాన్ని కాపాడి స్థిరపరిచేవాడు కూడా. కాబట్టి నీ వివాహ జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించు. దైవభయంవల్లే భర్త తన భార్యను
ప్రేమించవలసినంతగా ప్రేమించగలడు. దైవభయంవల్లే భార్య తన భర్తకు అన్ని విషయాలలో లోబడగలదు. కాబట్టి ప్రభువు కుటుంబ జీవితానికి ఎంత కీలకమైన వాడో గుర్తించగలం. ప్రభువు చేసిన ఈ మొదటి సూచక క్రియలను చూసి శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు. ఆయన అద్భుతాల ద్వారా ఆయన మహిమను గ్రహించిన మీరు ఆయనలో విశ్వాసముంచారా? ఇప్పుడే ఆయనలో విశ్వాసముంచి ఆయనకు లోబడడం ద్వారా ద్రాక్షరసం లాంటి మధురమైన మేలును పొందండి. ప్రభువు కృప మీకు కలుగునుగాక!

16. దయ్యం పట్టిన చిన్నవానిని విడిపించుట

మార్కు 9:17-29 - “జనసమూహములో ఒకడు - బోధకుడా, మూగ దయ్యము పట్టిన కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. ఇప్పుడు వాడు నురుగు కార్చుకుని, పండ్లు కొరుక్కొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన - విశ్వాసము లేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారాయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను. గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన - ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రినడుగగా అతడు - బాల్యము నుండియే, అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను, నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి - నమ్ముచున్నాను, నాకు అపనమ్మక ముండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి - మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము. ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించు చున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను. గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యిపట్టి లేవనెత్తగా వాడు నిలుచుండెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి. అందుకాయన - ప్రార్థన వలననే గాని మరి దేనివలననూ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.”

ఈ వాక్యభాగంలో బయలుపడిన ప్రభువు దైవత్వం

ఈ భాగంలో ప్రభువు తన దైవత్వాన్ని రెండు రీతులుగా బయలు పరిచాడు.

మొదటిది: దయ్యం పట్టిన ఆ చిన్నవానిని ప్రభువు దయ్యము నుండి విడిపించుట ద్వారా ప్రకృతికి అతీతమైన ఆత్మ సామ్రాజ్యంపై తనకున్న అద్భుత శక్తిని బయలు పరిచాడు.

రెండవది: మూగతనం, చెవిటితనం అనే ఆ బాలుని రోగాల నుండి వానిని విడిపించడం ద్వారా ప్రభువు ప్రకృతిపై తనకున్న దైవశక్తిని బయలుపరిచాడు. దురాత్మలు, దయ్యాలు మనుష్యులను, జంతువులను పట్టి పీడిస్తూ చివరకు సర్వనాశనం చేస్తాయి. ఈ చిన్నవానికి మూగ, చెవుడు అతనికి పట్టిన దయ్యం వలననే కలిగాయి. అంతేకాదు, ఆ దయ్యం ఎక్కడ వానిని పట్టునో అక్కడే వానిని పడద్రోస్తుంది. అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుక్కుని, మూర్చ పోతాడు. ఆ చిన్నవానిని దయ్యం బాల్యం నుండి పట్టి వానిని నాశనం చెయ్యాలని తరచుగా అగ్నిలోనూ, నీళ్ళలోనూ పడద్రోస్తూ ఉంటుంది. ఇంత హానికరమైనవి ఈ అపవిత్రాత్మలు.

దురాత్మలు, దయ్యాలు

అసలు ఈ దురాత్మలు, దయ్యాలు ఎక్కడివి? పరలోకంలో దేవుని యెదుట ఆయనచేత సృష్టింపబడి, ఆయనను నిత్యం సేవించే కోట్లాది దేవదూతలు ఉన్నారు. ఒకప్పుడు వారికి లూసీఫర్ అనే దూత ప్రధానదూతగా ఉండేవాడు. దేవుడు తనకిచ్చిన సౌందర్యాన్ని, ఆధిక్యతను చూసుకొని గర్వించి తన్ను తాను దేవునితో సమానునిగా ఎంచుకున్నాడు. లూసీఫర్ అనే ఆ ప్రధాన దూతతోపాటు మరికొందరు దేవదూతలు ఈ రీతిగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి దేవుని చేత పరలోకాన్నుండి క్రిందకు త్రోసివేయబడ్డారు. ఆ లూసీఫరే సైతానుగా, అపవాదిగా, వాయుమండల అధిపతిగా పిలువబడుతున్నాడు. వాడి అనుచరులైన పతనమైన మిగిలిన దేవదూతలే అపవిత్రాత్మలు, దయ్యాలు, దేవతలు. మనుష్యులు పూజించే దేవతలూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పడద్రోయబడిన దయ్యాలే. “అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను” (1 కొరింథీ 10:20). ఈ దేవతలు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూ మానవులు దేవుని నమ్మకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తూ, దేవుణ్ణి పూజించకుండా తమ్మును పూజించేలా చేసి దేవుని మహిమను అపహరిస్తున్నాయి. పాపం చేసేలా మానవుని ప్రేరేపించి, శోధించి, దేవుని మీద తమవలె వారు కూడా తిరుగుబాటు చేసేలా చేస్తున్నాయి. అంతేకాదు, మానవులను పాపం, అనారోగ్యాల ద్వారా, శత్రుభేదాల ద్వారా, విగ్రహారాధన ద్వారా నాశనం చేయం ప్రయత్నిస్తున్నాయి. మానవులు తమవలె దేవునికి విరోధంగా తిరుగుబాటు - తమతోపాటు దైవోగ్రతను, నరకాగ్నిగుండంలో నిత్యశిక్షను పొందాలని ఆశిస్తున్నాయి కాబట్టి దేవతలను పూజించడం నిజదేవుణ్ణి విడిచి దేవునికి శత్రువైన సైతానును వాని అనుచరులను పూజించినట్టే.

యేసు ప్రభువుకు, దేవతలకు ఎంత తేడా ఉందో గమనించండి. ఆ చిన్నవానిని పట్టిన దయ్యం వానిని నాశనం చెయ్యడానికి చూస్తుంది. అయితే ప్రభువు ఆ చిన్నవానిని, ఆ దురాత్మనుండి విడిపించి ఆ దురాత్మ వల్ల కలిగిన మూగతనం, చెవిటితనం, మూర్చ పోగొట్టి వానిని బాగుచేశాడు. ప్రభువు ప్రేమించేవాడు, ఆరోగ్యమిచ్చేవాడు, పిశాచి బంధకాల నుండి విడిపించి సహాయం చేసేవాడు. ఆ చిన్నవాని తండ్రి తన బిడ్డ బాగుపడాలనే వానిని ప్రభువు దగ్గరకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో యేసు ప్రభువు కొండమీద రూపాంతరం చెందడానికి వెళ్ళాడు. అందుకా చిన్నవాని తండ్రి ఆయన శిష్యులను అడిగితే వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. కొండమీద నుండి దిగివచ్చిన తరువాత ప్రభువు ఆ సంగతి విని 'విశ్వాసం లేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును? ఎంత వరకు మిమ్మును సహింతును? అని వారిని గద్దించాడు. విశ్వాసం లేని తరమువారు అంటే ఆయన శిష్యులు, చిన్నవాని తండ్రి, శిష్యులతో తర్కించిన శాస్త్రులు, మిగిలిన ప్రజలు. వారిలో ఆయనపట్ల విశ్వాసం లేనందుకు ఆయన వారిని గద్దించాడు.

చాలా పర్యాయాలు ప్రజలలో విశ్వాసం లేనప్పటికీ ప్రభువు వారిపట్ల అద్భుతాలు చేశాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తిద్దాం. ప్రభువు చిత్తప్రకారం తన సార్వభౌమ అధికారాన్ని బట్టి తానే చొరవ తీసుకుని అద్భుత కార్యాలు చేసిన సందర్భాలలో ఎవరికైతే అద్భుతాలు చేశాడో వారికి ఆయన పట్ల విశ్వాసం లేనప్పటికీ వారిపట్ల అద్భుతాలు చేశాడు. ఆయన అద్భుతాలు చేయ సంకల్పించినపుడు ప్రజల యొక్క అవిశ్వాసం ఆయనకు అడ్డు రాలేదు. ఉదాహరణకు, నాయీను అను ఊరిలో చనిపోయిన విధవరాలి కుమారుని ఎవరూ అడగకుండానే, వారిలో ఆయన బ్రతికిస్తాడనే విశ్వాసం లేకపోయినా ఆయనే కరుణించి, జాలిపడి చనిపోయిన బిడ్డను బ్రతికించాడు. బేతెస్ధ అను కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధి గలవానిని అతడు అడగకుండానే తానెవరో అతనికి తెలియకపోయినప్పటికీ అతణ్ణి బాగుచేశాడు. అయితే బాగుపడాలని ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనకు మొఱ్ఱపెట్టిన వారికి ఆయన పట్ల నమ్మిక, విశ్వాసాన్ని బట్టే మేలు చేశాడు. ప్రభువు ద్వారా మనం మేలు పొందాలని ఆశిస్తే ఆయన పట్ల సందేహము లేని విశ్వాసం తప్పనిసరిగా కలిగి ఉండాలి. మరొక విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఆయనను శోధించడానికి అద్భుతాలు చేయమని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు అలాంటి సందర్భాలలో సూత్రం ఆయన ఏ అద్భుతమూ చేయలేదు. మార్కు 8: 1 1 -13 లో ఈ విషయాన్ని చూడగలం, హేరోదు రాజు కూడా ప్రభువును బంధించి తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఏదైనా ఒక సూచక గ్రియ చేయగా చూడాలనుకున్నాడు. అక్కడ కూడా ప్రభువు ఏ అద్భుతాన్ని చేయలేదు. లూకా 23:8-11 వరకు ఈ విషయాన్ని చూడగలం.

కాబట్టి ప్రభువు ద్వారా మేలు పొందడానికి విశ్వాసం ఉండాలి. అందుకే దయ్యం పట్టిన చిన్నవాని తండ్రి ప్రభువుతో తన ఎద్ద దుస్థితిని గూర్చి చెప్పి ఏమైనా నీవలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఆయనను అడిగినపుడు ఆయన నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమూ సాధ్యమే' అని అతనితో చెప్పాడు. ఆ తండ్రి తెలియక అవిశ్వాసంతో ఏమైనా నీవలనైతే సహాయం చేయమని ఆయనను అడిగాడు. ఇక్కడి విషయం ప్రభువు చేయగలడా? లేదా? అన్నది కాదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము చేయగలవాడు. ఇక్కడ విషయం ఆ తండ్రి ప్రభువు సమస్తాన్ని చేయగలడు అన్న నమ్మకం కలిగి ఉన్నాడా? లేదా? అనేదే. మన విషయం కూడా అంతే. ఆయన చేయగలడా? లేదా? అనేది ఎన్నటికీ సమస్యే కాదు. మనలో విశ్వాసం ఉన్నదా? లేదా? అనేదే సమస్య. ప్రభువు మాటనుబట్టి నమ్మడం మనవలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యమే. ఆ చిన్నవాని తండ్రి, నమ్ముతున్నాను ప్రభువా, నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయుమని బిగ్గరగా చెప్పాడు. మనం కూడా మన విశ్వాసాన్ని బలపరచమని, అవిశ్వాసం పై జయమిమ్మని దేవుని ప్రార్థించాలి. ప్రభువు శిష్యులు - మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతంలో ఆయన నడిగారు. అందుకాయన - ప్రార్థన వలనను, ఉపవాసము వలననే గాని మరి దేని వలననూ ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. శిష్యులు అంతకు ముందు అపవిత్రాత్మల మీద ప్రభువు వారికిచ్చిన అధికారాన్ని బట్టి దయ్యములను వెళ్ళగొట్టినా, ఈసారి వెళ్ళగొట్టలేకపోయారు. వారు తమ బలం ఎప్పుడూ ప్రభువు దగ్గర నుండే రావాలన్న సత్యాన్ని నిర్లక్ష్యపెట్టారు. ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ దేవుని బలాన్ని, జీవాన్ని పొందాలి. మనకు ఇవ్వబడిన తలాంతులు, వరాల మీద ఆధారపడకుండా ప్రార్థన, ఉపవాసాల ద్వారా ఎల్లప్పుడూ దేవుని మీదే ఆధారపడి జీవించాలని పాఠం నేర్చుకుంటున్నాం. ప్రభువు మనకు ఇట్టి కృపను అనుగ్రహించునుగాక!

17. లాజరు బ్రతుకుట

యోహాను 11:1-44 - “మరియ, ఆమె సహోదరియైన మార అనువారి గ్రామమైన బేతనియలో నున్న లాజరు అను ఒకడు రోగియాయెను. ఈ లాజరు ప్రభువునకు, అతరు పూసి తలవెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు - ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించ రోగియై యున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానిమలలో మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే యింక రెండు దినములు నిలచెను ... యేసు - లాజరు చనిపోయెను. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమితము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళెదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. .."

యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను... యేసు మరల తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది యొక గుహ, దాని మీద రాయి పెట్టి యుండెను. యేసు - రాయి తీసి వేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరి అయిన మార్త - ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనగొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు - నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి .

.. ఆయన ఆలాగు చెప్పి - లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్ళు, చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి యుండెను. అంతట యేసు - మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.”

యేసుక్రీస్తు దైవత్వ నిరూపణ

అపొస్తలుడైన యోహాను తన సువార్తలో ప్రభువు చేసిన ఏడు అద్భుతాలను వివరించాడు. వీటన్నిటిలోనూ శిఖరాగ్రం లాంటి అద్భుతం చనిపోయిన లాజరును నాలుగవ రోజున బ్రతికించడం. చనిపోయిన యాయీరు కుమార్తెను, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించడం కంటే నాలుగు రోజుల తరువాత దేహం కుళ్ళిపోవడం ప్రారంభమైన లాజరును బ్రతికించడం అత్యద్భుతమైనది. యూదులలో ఒక మూఢనమ్మకం ఉండేది. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత అతని ఆత్మ మళ్ళీ అతనిలో ప్రవేశించే నిరీక్షణతో మూడు రోజుల వరకూ అతని శరీరం వద్దే ఉండేదని నమ్మేవారు. ఈ మూఢ నమ్మకాన్ని బట్టి లాజరు చనిపోయి నాలుగు రోజులు అయ్యింది. కాబట్టి ఇక అతడు తిరిగి బ్రతకడం అసాధ్యమని యూదులు అనుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు తన దైవశక్తితో లాజరును బ్రతికించి తన దైవత్వాన్ని బయలుపరిచాడు. లాజరు రోగిగా ఉన్నాడనే వార్త ప్రభువు విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడేలా దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. 14వ వచనంలో ప్రభువు తిరిగి తన శిష్యులతో ఇలా అన్నాడు, 'లాజరు చనిపోయెను. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించు చున్నాను.” ఈ వచనాలను బట్టి లాజరు వ్యాధి ప్రభువు మహిమపరచబడడానికీ, చనిపోయిన నాలుగు రోజుల తరువాత లాజరును బ్రతికించుట ద్వారా శిష్యులు, మిగిలిన వారందరూ ప్రభువునందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండడానికి వచ్చింది. మన జీవితాలలో కొన్ని శ్రమలు, అనారోగ్యాలు ప్రభువు మహిమ కొరకు మన విశ్వాసం బలపడడానికే మనకు సంభవిస్తాయి. ఈ రీతిగా మనకొచ్చే శ్రమలు, అనారోగ్యాలు మన శక్తికి మించినవే అయినా మనల్ని విడిపించి మన విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభువుకు అవే గొప్ప అవకాశాలు. కాబట్టి శ్రమల్లో మనం బెదిరిపోకుండా ప్రభువు శ్రమలను మేలుగా మారుస్తాడని గ్రహించాలి.

లాజరు రోగిగా ఉన్నాడని యేసుప్రభువు విన్నప్పుడు తానున్న చోటే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు. ఒక దిన ప్రయాణం తరువాత ఆయన బేతనియకు చేరుకున్నాడు. అప్పటికి నాలుగు రోజులు గడిచాయి. మరియ, మార్తలు - ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే మా సహోదరుడు చావకుండును అన్నారు. అంటే వారి ఉద్దేశం ప్రభువు రావడం ఆలస్యమైనందువల్ల తమ సహోదరుడైన లాజరు చనిపోయాడని, ఇప్పుడు ప్రభువు వచ్చినా అంత ప్రయోజనం లేదని. కాని వారి దగ్గరకు రావడానికి ప్రభువు ఆలస్యం చేయడమే మేలైంది. ఎంతోమంది రోగులకు స్వసపరిచిన ప్రభువు లాజరును కూడా రోగిగా ఉన్నప్పుడే స్వస్థపరిచి ఉంటే అద్భుతానికి తావు ఉండేది కాదు. చనిపోయిన నాలుగు రోజుల తరువాత కూ ప్రభువు బ్రతికించగలడు అని అప్పటివారికే గాని, మనకే గాని తెలిసి ఉండక సోయది. ప్రభువు అత్యవసరంగా బేతనియకు రావాలని మరియ, మార్తలు ఆయనకు కబురు చేసినా, ఆయన కావాలనే ఆలస్యం చేశాడు. మరియ, మార్తలు ప్రభువు ఆలస్యం చేయడంలోని మేలును మొదట గ్రహించకపోయినప్పటికీ తరువాత ఆయన సుసానును, శక్తిని చూసి ఆయనను స్తుతించారు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మన అత్యవసర ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతూ ఉంటుంది. మన ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తే ఆయన మనకు మేలు చేశాడని ఎంతో సంతోషిస్తాం. కాని జనాలు ఆలస్యంగా రావడం కూడా మన మేలుకే అని సంతోషించాలి. ప్రభువు ఎన్నడూ ఏ పొరపాటూ చేయడు, అనవసరంగా ఆలస్యం చేయడు. ఆయన సహాయం ఆలస్యమైంది అంటే దాని అర్థం ఇంకా ఎక్కువ సహాయం చేయడానికే అని గుర్తించాలి. 'దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున సిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము” (రోమా 8:28)."

"పునరుత్థానమును, జీవమును నేనే” అని ప్రభువు ఈ సందర్భంలో సెలవిచ్చినట్లు ప్రభువు తాను ఏమైయున్నాడో అనే సత్యాన్ని ఏడు రీతులుగా నెలనిచ్చినట్లు యోహాను సువార్తలో చూడగలం. 1) 6:35 లో ప్రభువు ఇలా అన్నాడు, "జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. 2) 8:12 లో ఆయన ఇలా అన్నాడు, "నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును. 3) 10:8, 9 లలో ఆయన మరలా ఇలా అన్నాడు, "గొర్రెలు పోవు ద్వారము నేనే. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు, బయటికి వచ్చుచూ మేత మేయుచునుండును.” 4) 10:11, 14 లో ఆయన ఇలా అన్నాడు, "నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును." 5) 11:23లో ఆయన ఇలా సెలవిచ్చాడు, "పునరుతానమును, జీవమును నేనే.” 6) 14:6 లో ఆయన ఇలా సెలవిచ్చాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.” 7) 15:5 లో ఆయన మళ్ళీ తిరిగి ఇలా అన్నాడు, “ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. , ఎవ్వడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు వించియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు."

ప్రభువు పలికిన ఏడు మాటలలోని తీవ్రమైన సత్యాన్ని అర్థం చేసుకుందాం. 1) జీవాహారము నేనే' అని పలికిన ప్రభువును నిరాకరిస్తే నిత్యజీవాన్ని ఆనాటుకుంటాం. 2) 'నేను లోకమునకు వెలుగును' అన్న ప్రభువును నిరాకరిసే జీవపు వెలుగును కోల్పోయి చీకట్లో జీవించాలి. 3) 'నేనే ద్వారమును' అని సెలవిచ్చిన ప్రభువును నిరాకరిస్తే రక్షణ పొందలేము. 4) 'నేను గొర్రెలకు మంచి కాపరిని' అన్న ఆ యేసు ప్రభువును కాదంటే కాపరి లేని గొర్రెలవలె భద్రతను, కాపుదలను, నడిపింపును, సహవాసమును, సమృద్ధిని పోగొట్టుకుంటాం. 5) పునరుత్థానమును, జీవమును నేనే' అన్న ప్రభువును త్రోసివేస్తే మొదటి పునరుత్థానమైన జీవ పునరుత్థానంలో పాలుపొందలేము. తీర్పు పునరుత్థానములో తిరిగి బ్రతికింపబడి తీర్పు పొంది నరక శిక్ష అనుభవిస్తాం. 6) 'నేనే మార్గమును, సత్యమును, జీవమును' అని సెలవిచ్చిన యేసుప్రభువును నమ్మకుంటే పరలోకమే పోగొట్టుకుంటాం. అసత్యంలో ఉండి నశిస్తాం. 7) 'నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు' అన్న ప్రభువుకు దూరమైతే మన ఆధారమునే కోల్పోయి ఏమీ చేయలేక నిష్ఫలుల మవుతాం. యేసుప్రభువును నమ్మండి. ఆయన ద్వారా నిత్యజీవం, వెలుగు, రక్షణ, పరలోకం పొందండి.

లాజరు సమాధి వద్ద అందరి ఏడుపు చూచి ప్రభువు కన్నీళ్లు విడిచాడు. పాప ఫలితమైన మరణాన్ని మానవుడు పొందుతున్నాడని చూసి దేవుడు విచారించాడు. మానవులను రక్షించాలని సంకల్పించాడు. అందుకే ఆయన ప్రేమతో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమను గ్రహించారా? మార్తతో ఆయన 'నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువ”ని అన్నాడు. ఆమె నమ్మింది. లాజరును బ్రతికించిన దేవుని మహిమను చూసింది. మీరు నమ్మండి, మీ జీవితంలో కూడా గొప్ప గొప్ప దైవకార్యాలు చూడగలరు.

తన సహోదరుడైన లాజరును బ్రతికించినందుకు మరియ కృతజ్ఞతతో విందుచేసి, మిక్కిలి విలువైన అత్తరు ప్రభువు పాదాలకు పూసి ఆయనను ఘనపరచింది. ఇల్లు అత్తరు వాసనతో నిండినట్లు మన హృదయాలు కూడా కృతజ్ఞతతో నిండియుండును గాక!

18. యాయీరు కుమార్తెను బ్రతికించుట

మార్కు 5:22-24, 35-42 - "ఆయన సముద్రతీరమున ఉండగా, సమాజ నుందిరపు అధికారులలో యాయీరు అనునొకడు వచ్చి ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి -నా చిన్న కుమార్తె చావనై యున్నది. అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడ వెళ్ళెను. సమాజ మందిరపు అధికారి ఇంటనుండి కొందరు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది. నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక - భయపడకుము, నమ్మికమాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి, లోపలికి పోయి, మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అవహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తల్లిదండ్రులను, తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయిపట్టి తలితాకు మీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి."

ప్రభువు చేసిన ఈ అద్భుతం ద్వారా ఆయనకు మరణంపై అధికారం కలదని ఋజువవుతున్నది. యేసుప్రభువు అనారోగ్యాల పై, అపవిత్రాత్మలపై, ప్రకృతిపై, మరణంపై అధికారం గలవాడని ఆయన చేసిన అద్భుతాలన్నీ ఋజువు చేస్తున్నాయి. మానవుడు జయించలేని మరణాన్ని యేసుప్రభువు జయించి తిరిగి లేచాడు. ఈ అద్భుతాన్ని రెండు భాగాలుగా ధ్యానించుకుందాం. మొదటి భాగంలో ప్రభువు యాయీరుకు, అతని కుమార్తెకు చేసిన మేలును, రెండవ భాగంలో తన బిడ్డను బ్రతికించుకోవడానికి యాయీరు చేసిన దాని గురించి ధ్యానించుకుందాం.

మొదటి భాగం : ప్రభువు చేసిన మేళ్లు

చనపోయిన యాయీరు కుమార్తెను ప్రభువు బ్రతికించాడు. ప్రభువు యోహాను 11:25 లో ఇలా సెలవిచ్చాడు, "పునరుత్థానమును, జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.” మానవులందరికీ మరణము నియమింపబడియున్నది. "మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని తరువాత తీర్పు జరుగును” (హెబ్రీ 9:27). మానవులందరికి తమ యెన నరకాగ్ని గుండం రెండవ మరణం. మొదటి మరణం శరీర మరణం. లోకాన్ని బంధువులను విడిచిపెట్టడం జరుగుతుంది. రెండవ మరణంలో తమన నిత్య నివాసమైన దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకొని రకాగ్ని గుండంలో నిరంతరం నశించుట. యేసుప్రభువులో విశ్వాసముంచడం ద్వారా ఈ రెండవ మరణమైన నరకాగ్ని గుండం నుండి తప్పింపబడి నిత్యజీవము అంది పరలోకం పొందగలం. యాయీరు కుమార్తె చనిపోయినపుడు అక్కడివారు రాలుగా నుండి చాలా ఏడుస్తూ ప్రలాపించారు. ప్రభువు ఆ చిన్నదానిని బ్రతికించుట ద్వారా వారి ప్రలాపాన్ని విస్మయంగా, సంతోషంగా మార్చాడు. ప్రభువులో విశ్వాసముంచడం ద్వారా మన దుఃఖాన్ని, వేదనను సంతోషంగా మారుస్తాడు. “నా పాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోష వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు” (కీర్తన 30:11, 12). "దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు” (యెషయా 61:2,3).

మీ దుఃఖాన్ని, జీవితంలో మీరు పొందే వేదనను యేసుప్రభువు ఒక్కడే తీసివేసి మిమ్మల్ని గొప్ప సంతోషంతో, నిజమైన ఆనందంతో నింపగలడు. యాయీరు ప్రభువు దగ్గరకు వచ్చి నా బిడ్డను బాగుచేయుమని బ్రతిమాలినపుడు ప్రభువు అతని ప్రార్థన విని అతని ఇంటికి వెళ్ళి బిడ్డను బ్రతికించాడు. అలాగే ప్రభువు మన ప్రార్థనలు విని మనల్ని ఆదుకొంటాడు. బిడ్డ చనిపోయిందని వార్త వచ్చినపుడు యాయీరు భయపడకుండా, అవిశ్వాసపడకుండా ప్రభువు అతనితో, భయపడకుము. నమ్మిక మాత్రముంచుమని ధైర్యపరిచాడు. ప్రభువు మన విశ్వాసాన్ని బలపరచి, మనల్ని ధైర్యపరుస్తాడు. యేసుప్రభువే మన విశ్వాసానికి కర్త, మరియు దానిని కొనసాగించేవాడు. యాయీరు విశ్వాసాన్ని ప్రభువు ఘనపరచి అతని విశ్వాసానికి ప్రతిఫలంగా చనిపోయిన అతని బిడ్డను బ్రతికించాడు. విశ్వాసం నిష్ఫలం కాదు.

రెండవ భాగం : యాయీరు చేసిన పని

యాయీరు ప్రభువు దగ్గరకు వచ్చాడు. అతడు సమాజమందిరపు అది అయినా సర్వాధికారియైన ప్రభువు దగ్గరకు వచ్చాడు. మనమెంతటివారమే తగ్గించుకొని ప్రభువు దగ్గరకు రావాలి. అప్పుడే ఆయన ద్వారా మేలు పొందగలం యాయీరు ప్రభువు దగ్గరకు బహిరంగంగానే వచ్చాడు. సమాజమందిరపు అధికారి అయినా, ఇతర యూదులకు బెదరక బిడ్డను బ్రతికించుకోవడానికి ప్రభువు దగ్గరకు వచ్చాడు. అలాగే మనం కూడా లోకానికి బెదరకుండా ప్రభువు దగ్గరకు రావాలి. యాయీరు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన పాదాలమీద పడ్డాడు. అధికారి అని తన హోదానుబట్టి అతిశయించలేదు. నిజానికి సృష్టికర్తయైన ప్రభువు ఎదుట మానవులమైన మనము ఎంతో అల్పులం కదా! ఆయన పాదాలమీద పడడంలో ఆయనను ఆశ్రయించినట్టు గ్రహించ గలం. అలాగే మనం కూడా కులగర్వాన్ని, ధనగర్వాన్ని విడిచి పెట్టి దీనులంగా ప్రభువు శక్తిని ఆశ్రయించాలి. నా చిన్న కుమార్తె చావనైయుంది. అది బాగుపడి బ్రతికేలా నీవు వచ్చి దానిమీద నీ చేతులు ఉంచవలెనని యాయీరు మిగుల బ్రతిమాలుకొన్నాడు. చావనైయున్న తన కుమార్తె పై ప్రభువు చేతులుంచితే చాలు, ఆమె బాగుపడి బ్రతుకు తుందని యాయీరు నమ్మాడు. ప్రభువు శక్తిమంతుడని, ప్రభావం గలవాడని, మరణం తప్పించి జీవం పోయగలడని నమ్మాడు. యాయీరు ప్రభువు తన ఇంటికి వచ్చి తన బిడ్డను బాగుచేయాలని చాలా బ్రతిమాలాడు. మనం కూడా ప్రభువు ద్వారా మేలు పొందడానికి ఆయనను పట్టుదలతో ప్రార్థించాలి. ప్రభువుతో కలిసి తన ఇంటికి వస్తున్నప్పుడు తన ఇంటనుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినదని నీవు బోధకుని ఎందుకు శ్రమ పెడతావని అన్నారు.

అయితే ప్రభువు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, 'భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని' యాయీరుతో చెప్పాడు. యాయీరు అలాగే భయపడకుండా నమ్మక ముంచాడు. ప్రభువు పట్ల మనకున్న ఆసక్తిని కూడా ప్రజలు, పరిస్థితులు నిరుత్సాహపరచ వచ్చు. నిరుత్సాహపు మాటలను లక్ష్యపెట్టనిదే నిజమైన విశ్వాసం. ప్రభువు యాయీరు ఇంటికి వచ్చి ఏడుస్తున్నవారిని చూచి చిన్నది చనిపోలేదని, ఎందుకు ఏడుస్తున్నారని అన్నప్పుడు వారు ఆయనను అపహసించారు. ప్రభువు వారిని అందరిని బయటకు పంపివేశాడు. వారి అవిశ్వాసాన్నిబట్టి తాను చేయబోయే అద్భుతాన్ని చూసే ఆధిక్యతను వారు కోల్పోయారు. ప్రభువు శక్తిని గ్రహించక, ఆయన మాటను నమ్మక వారు ఆయనను హేళన చేశారు. అలాగే చాలామంది ప్రభువు గొప్పతనాన్ని ఎరుగక ఆయనను, ఆయనను నమ్మినవారిని అపహసిస్తున్నారు.

అయితే ప్రభువు చిన్నబిడ్డను బ్రతికించిన తరువాత వారు సిగ్గుపడి విస్మయం చెందారు. అలాగే ప్రభువును ఇప్పుడు హేళన చేసేవారందరూ ప్రభువు లోకానికి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు విస్మయం చెంది రొమ్ము కొట్టు కుంటారు. ప్రతి మోకాలు ఆయన పేరట వంగుతుంది, ప్రతి నాలుకా ఆయన ప్రభువని ఒప్పు కొంటుంది. ప్రభువు మాటను ఎన్నడూ అపహాస్యం చేయకూడదని ఇందునుబట్టి నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువు చనిపోయిన వారిని బ్రతికించిన మూడు సందర్భాలలోనూ వారిని మనుష్యులుగా పేరుపెట్టి పిలిచాడే గాని వారిని మృతులుగా చూడలేదు. ఆయన మృతులను సజీవులుగా చేయువాడు, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. యేసు ప్రభువును గెరాసేనుల దేశంవారు తమ దేశం విడిచిపొమ్మంటే, యాయీరు ఇంటివారు ఆయనను చేర్చుకుని మేలు పొందారు. మనం కూడా ప్రభువునందు విశ్వాసముంచి మరణంలోనుండి జీవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి దాటింపబడుదుము గాక!

19. రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ బాగుపడుట

మార్కు 5:25-34 - "పండ్రెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి, తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసునుగూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి, జనసమూహము వైపు తిరిగి - నా వస్త్రము ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా? అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన - కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.”

ఈ అద్భుతాన్ని 4 భాగాలుగా ధ్యానించుకుందాం. మొదటి భాగం, ఆ స్త్రీ యొక్క దుస్థితి. రెండవ భాగం, ప్రభువు ద్వారా స్వస్థత పొందడానికి ఆమె ఏమి చేసింది? మూడవ భాగం, ప్రభువు ఆమెకు ఏమేమి మేళ్ళు చేశాడు? నాలుగవ భాగం, బాగుపడిన తరువాత ఆమె ఏమి చేసింది?

మొదటి భాగం - ఆ స్త్రీ దుస్థితి ఎంతో దయనీయమైనది

పండ్రెండు సంవత్సరాల నుండి రక్తస్రావరోగంతో బాధపడింది. ఎంతో రక్తాన్ని కోల్పోయి బలహీనపడి మరణానికి దగ్గరయ్యింది. ఏదైనా అనారోగ్యం ఇన్ని సంవత్సరాలు పట్టి పీడిస్తే ఎంత బాధే కదా! బాగుపడాలనే ఉద్దేశంతో అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది. రకరకాల వైద్య పద్ధతులతో చికిత్స చేయించుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఒక వైద్యుని దగ్గరనుండి మరొక వైద్యుని దగ్గరకి తిరిగి తిప్పలు పడింది. వైద్యులు కూడా మానవులే గనుక తమ సర్వ ప్రయత్నాలు చేసి ఫలితం లేక ఊరుకున్నారు. తనకు కలిగినదంతా వైద్యం కోసం ఖర్చు చేసేసింది. ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా వెనుకాడలేదు. తన ఆస్తి అంతా ఖర్చు పెట్టేసింది. అటు ఆరోగ్యమూ కలుగలేదు. ఇటు ఆస్తి కోల్పోయింది. చివరకు వెద్యంవల్ల, తన ప్రయత్నాలవల్ల ఎంతమాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడింది. బాగుపడే అవకాశమే లేకుండా అయిపోయింది. ఇక మరణమే గతి. మానవులైన మన దుస్థితి కూడా ఈ రీతిగానే ఉంది. పాపమనే ఘోరమైన వ్యాధిని బట్టి మరణానికి, నరకానికి గురవుతున్నాం. "హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడు ఎవడు?” (యిర్మీయా 17:9). ఆ స్త్రీ వలె మనం కూడా ఈ పాప రోగాన్ని పోగొట్టుకోవాలని, పాపంవల్ల వచ్చిన బాధలన్నీ తప్పించుకోవాలని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి, ఎన్నో పూజా పురస్కారాలు చేస్తూ ఎన్నో తిప్పలు పడుతున్నాం. అయినా ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత పాపులమవుతున్నాం. ఏ మతమూ మన పాపాన్ని తీసివేయలేదు. “ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యమూ బ్రతుకునట్లు దాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికిని తీరక అట్లుండ వలసినదే” (కీర్తన 49:7,8,9). అది మానవుల దుస్థితి.

రెండవ భాగం - బాగుపడడానికి ఆమె ఏం చేసింది?

ఆమె యేసును గూర్చి విన్నది. ప్రభువులో శక్తి, ప్రభావం ఉన్నాయని ఆయన ప్రేమతో అనేకమందిని స్వస్థపరుస్తున్నాడని విన్నది. అట్లే మనం కూడా ప్రభువుని గూర్చి వినాలి. చాలామంది ప్రభువు వాక్యం వినరు. ప్రభువు తెల్లవాళ్ళ దేవుడని, తక్కువ కులస్థుల దేవుడని చెడ్డ అభిప్రాయాలతో ప్రభువు సువార్తను వినరు. భక్తిలో మొదటి మెట్టే ప్రభువుని గూర్చి వినడం. ప్రభువును గూర్చి విన్న ఆమె ప్రభువునందు విశ్వాస ముంచింది. ప్రభువు ఆమెను బాగుచేసిన తరువాత, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని' చెప్పాడు. ప్రభువులో ఆమెకున్న విశ్వాసము చాలా గొప్పది. ప్రభువు శక్తిమంతుడు గనుక ఆయన వస్తపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడ గలదని నమ్మింది. ఒక స్త్రీగా తన బాధను అందరి ఎదుటా ప్రభువుకు చెప్పలేక ఆయన వెనుకనుండి ఆయన వస్త్రాన్ని ముట్టినా బాగుపడగలదని నమ్మింది. అప్పటివరకూ ప్రభువు వస్త్రాన్ని ముట్టి ఎవరూ బాగుపడిన సందర్భం లేకపోయినా, ఆమె అంతగా నమ్మింది. అందుకే ఆయన వెనక్కి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. చాలామంది ఆయనను వెంబడిస్తున్నా, ఆందరిలో ఇంత విశ్వాసం లేదు. ఆమె ఏదో ప్రభువును గూర్చి విని విశ్వసించి ఊరుకోలేదు. ఆమె నిజ విశ్వాసం ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనను ముట్టి స్వస్థపడేలా చేసింది. క్రియలు లేని విశ్వాసము మృతం కదా! కాబట్టి ఏదో నమ్మామంటే నమ్మామని కాకుండా ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనిచ్చే జీవం, మార్పు, రక్షణ పొందాలి.

మూడవ భాగం - ప్రభువు ఆమెకు చేసిన మేళ్ళు

ఆమె ప్రభువు వస్త్రం ముట్టగానే ఆమె రక్తధార కట్టింది. ఆమె బాధ నివారణ అయ్యింది. ఆమె స్వస్థపడింది. అనేక వైద్యులవల్ల, ఎన్నో ప్రయత్నాలవల్ల తన ఆస్తంతా ఖర్చు చేసినా కలగని స్వస్థత ప్రభువు ఉచితంగా, వెంటనే, సంపూర్ణంగా ఇచ్చాడు. పన్నెండు సంవత్సరాల బాధ ప్రభువు దగ్గర నివారణ అయ్యింది. ఆమె విశ్వాసానికి గొప్ప ప్రతిఫలం దొరికింది. ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడని 1 పేతురు 2:6లో చూడగలం. ప్రభువు ఆమెతో, 'కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది. సమాధానము గలదానవై వెళ్ళు' అన్నాడు. ప్రభువు ఆమెకు గొప్ప సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించాడు. ఆమె బాధలను బట్టి ఎంతో అశాంతికి, నిరాశకు లోనైన ఆమె ప్రభువు ద్వారా స్వస్థతనొంది నెమ్మదిని పొందింది. చదువరీ, ఎన్నో సంవత్సరాల నుండి శాంతిలేక తిప్పలు పడుతున్నారా? యేసు ప్రభువును నమ్మండి. లోకం ఇవ్వలేని శాంతి, సమాధానాలు పొందగలరు.

నాలుగవ భాగం - బాగుపడిన తరువాత ఆమె ఏమి చేసింది?

నా వస్త్రమును ముట్టినదెవరని ప్రభువు అడిగినపుడు ఆమె భయపడుతూ వణకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా ఆయనతో చెప్పింది. ప్రభువు ఎదుటకు వచ్చిన ఆమె ఆయనకు సాగిలపడింది. త్రోవలో జనసమూహం ఎదుట ఆమె ప్రభువుకు సాగిలపడి ఆయనను ఘనపరచింది. ఆమెలో గొప్ప కృతజ్ఞత చూడగలం. చాలామంది ప్రభువు ద్వారా మేలు పొందుతారు గానీ, ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండరు. ప్రభువు చేసిన మేళ్ళను, ఆయన చూపిన ప్రేమను మరచి పోతారు. కృతజ్ఞతా భావం భక్తి జీవితంలో ఎంతో విలువైనది. ప్రభువుకి అంతకంటే ఇంకేం ఇవ్వగలం? అందరి ముందు ప్రభువుకు సాగిలపడి, తన సంగతంతా ఆయనతో చెప్పింది. మొదట భయపడినా తర్వాత ప్రభువు చేసిన మేలును అందరి ఎదుటా ఒప్పుకున్నది. దావీదు భక్తుడు కూడా ఈ రీతిగా దేవుణ్ణి అందరి ఎదుటా ఘనపరిచినట్టు కీర్తన 22:22,25లలో చూడగలం. “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.” మనం కూడా కృతజ్ఞతతో ప్రభువును ఘనపరుద్దాం. ఈమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఏమాత్రం ప్రయోజనంలేక మరింత సంకటపడి, అప్పుడు ప్రభువు వద్దకు వచ్చింది. అయితే అంతా నష్టపోయాక రావడంకంటే ఇప్పుడే ప్రభువు దగ్గరకు రావడం మేలు.

పాఠకులారా, ప్రభువులోనే దొరికే సమాధానాన్ని, రక్షణను, పాపక్షమాపణను ప్రభువుకు దూరంగా లోకంలో ఇంకెంతకాలం వ్యర్థంగా వెదకుతారు? వెంటనే యేసుప్రభువునందు విశ్వాసముంచి ఇప్పటికైనా మేలు పొందండి.

20. 38 ఏండ్లు వ్యాధిగలవాడు

యోహాను 5:2-16 - “యెరూషలేములో గొట్టెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్థ అనబడిన యొక కోనేరు కలదు. దానికి అయిదు మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్ళు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లు నుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని యెరిగి, స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా, ఆ రోగి - అయ్యా, నీళ్ళు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు - నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా; నీవు నీ పరుపెత్తుకొనతగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు - నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పెననెను. వారు - నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందినవానికి తెలియలేదు. ఆ చోటను గుంపుకూడి యుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.”

యేసుప్రభువు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని విపులంగా తెలుసుకుందాం. 38 ఏండ్ల నుండి వ్యాధితో పడియున్న వ్యక్తిని ఆయన ఉచితంగా, సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఎవరూ చేయలేని మేలును ప్రభువు అతని జీవితంలో అతను అడగకుండానే ఉచితంగా చేశాడు. దీనిలో ప్రభువు విస్తారమైన ప్రేమను చూస్తున్నాం.

38 సంవత్సరాల వ్యాధిని అప్పటికప్పుడే సంపూర్ణంగా పోగొట్టగల శక్తిని ప్రభువులోనే చూడగలం. ప్రభువు సమస్త అనారోగ్యంపై అధికారం గలవాడు. ఈ స్వస్థత కార్యం ద్వారా ప్రభువు తన మహిమను బయలుపరచి తాను దేవుడనని మరొకసారి ఋజువు చేసుకున్నాడు. దేవుడు పాపులను రక్షించడంలో ఆయనే చొరవ తీసుకుని రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ సందర్భంలో యేసుప్రభువు 38 ఏండ్లనుండి బాధపడుతున్న రోగి దగ్గరకు తానే వెళ్ళి స్వస్థపడగోరు చున్నావా అని ఆయనే కలుగజేసికొని అడిగాడు. రోగికి తానెవరో తెలియనప్పటికీ, తనపట్ల రోగికి విశ్వాసం లేనప్పటికీ రోగిని ఉచితంగా అప్పటికప్పుడే బాగుచేశాడు. ఇందులో దైవత్వాన్ని స్పష్టంగా చూడగలం. 6వ వచనంలో ఉన్నట్టు ఆయన ఆ రోగి పడి ఉండడం చూసి వాడు అప్పటికి చాలా కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇది కూడా ఆయన దైవత్వాన్ని ఋజువు చేస్తున్నది. ఆ రోగి పూర్వస్థితిని గూర్చి ఎవరూ చెప్పకుండానే ఆయనకు తెలుసు. ఆ రోగి అడగకుండానే ఆయన బాగు చేశాడు. చాలా మేళ్ళు మనం అడగకుండానే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. “వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను” (యెషయా 65:24). ఆ రోగి ప్రభువులో విశ్వాసముంచకపోయినా ప్రభువు అతణ్ణి స్వస్థపరిచాడు. ప్రభువు స్వస్థ పరచడానికి ఆ రోగిలో విశ్వాసం లేకపోవడం ఆయనకు అడ్డు కాలేదు. అంతేకాదు, బేతెస్ధ అనబడిన ఆ కోనేరు దగ్గర ఉన్న ఐదు మంటపాలలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నా ప్రభువు తన సార్వభౌమ అధికారంతో, స్వేచ్చతో, తన చిత్తానుసారంగా ఈ రోగిని స్వస్థపరిచాడు. “ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడల జాలి చూపుదును. కాగా పొందగోరువాని వలనైనను, ప్రయాసపడువాని వలన నైనను కాదు గానీ, కరుణించు దేవుని వలననే అగును” ( రోమా 9:5,16).

ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఈలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరి వానికి అధికారము లేదా?” ఆ విధంగా దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించినవాడై నాశనానికి సిద్ధపడిన ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? (రోమా - 9:20-22). పాఠకులూ, గమనించండి. ఆయన ఏర్పాటు, ఆయన చిత్తమును బట్టి ,
కలుగుతుంది. “తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును - తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును” (యోహాను 5:21). ఇందులో దైవ - లక్షణమైన సర్వాధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని ప్రభువు కలిగియున్నట్లు చూడగలం.

ఈ అధ్యాయంలోనే యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి బోధిస్తూ ఐదు విషయాలలో తాను దేవునితో సమానుడనని బోధించాడు.

మొదటిగా, 17వ వచనంలో 'నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు. నేనునూ చేయుచున్నానని, వ్యక్తిగా తండ్రితో తనను తాను సమానుడన'ని చెప్పాడు.

రెండవదిగా, క్రియలలో తాను దేవునితో సమానుడనని 19, 20 వచనాలలో బోధించాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ, తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చూచునో వాటినే కుమారుడునూ అలాగే చేయును.

మూడవదిగా, 21వ వచనంలో మృతులను బ్రతికించుటలో అనగా శక్తి ప్రభావాలలో దేవునితో సమానుడని చెప్పాడు.

నాలుగవదిగా, తీర్పు తీర్చడంలో తాను దేవునితో సమానుడనని 22వ వచనంలో సెలవిచ్చాడు.

ఐదవదిగా, ఘనత విషయంలో దేవునితో సమానుడనని 23వ వచనంలో సెలవిచ్చాడు. తండ్రిని ఘనపరచునట్లే అందరూ కుమారుని ఘనపరచాలని, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

క్రీస్తు దైవత్వాన్ని ఆయన చేసిన ఈ అద్భుతంలో మరొక రీతిగా కూడా చూడగలం. 38 ఏండ్లనుండి వ్యాధిగల మనుష్యునితో నీవు లేచి నీ పరు పెత్తుకొని నడువుమని ప్రభువు చెప్పగానే వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచాడు. సృష్టిని నోటి మాటతో కలుగజేసినవాడే రోగిని మాటతో బాగుచేశాడు. స్వస్థపరచిన తరువాత ఆ రోగిని చూచి, 'ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని” ప్రభువు చెప్పాడు. పాపానికి ఖచ్చితమైన తప్పించుకోలేని శిక్ష ఉంది. చాలా శాతం అనారోగ్యాలు చేసిన పాపాన్ని బట్టే కలుగుతాయి. ఈ సందర్భంలో బాగుపడిన వ్యక్తి తాను అనుభవించిన వ్యాధి తన పాపంవల్లే కలిగిందని స్వస్థత పొందిన తరువాత కూడా పాపం చేస్తే మరి ఎక్కువ కీడు కలుగుతుందని ప్రభువు సూచించాడు. చదువరీ, పాపంవల్ల కీడు, అనారోగ్యాలు, అశాంతి, ఆఖరుకి మరణం, నరకం కలుగుతాయని గ్రహించారా? పాపాన్నిబట్టి ఇప్పటికే ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు, అవమానం పొంది ఉంటారు. ఆయన ద్వారా మేలు, విడుదల పొంది ఇంకా పాపం చేస్తే ఇంతకుముందు కంటే మరి ఎక్కువ కీడు పొందవలసి ఉంటుంది. ఎందుకు కీడు కోరి తెచ్చుకోవాలి? చాలామంది తప్పుచేసి, శిక్ష తప్పించుకోగలమని అజ్ఞానంగా తలంచి, తమను తామే మోసం చేసుకుంటున్నారు. దావీదు భక్తుడు కీర్తన 40:12 లో ఏమన్నాడో చూడండి, “లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తలవెంట్రుకలకు మించియున్నవి. నా హృదయము అధైర్యపడియున్నది.” కీరన 38:3,4,5 లలో దావీదు మరల ఇలా అన్నాడు, “నా పాపమునుబట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.”

గలతీ 6: 7,8 లో ఇలా వ్రాయబడి ఉంది, “మోసపోకుడి, దేవుడు వెక్కిరింప బడడు. మనుష్యుడు ఏమి వితునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంటకోయును.”

రోమా 6:23 లో వ్రాయబడినట్టు, పాపానికి జీతం మరణం. బాగుపడిన ఆ వ్యక్తితో ప్రభువు పలికిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, “ఇదిగో స్వస్థత నొందితివి. మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము.”

యేసు ప్రభువు ఆ రోగిని విశ్రాంతి దినాన స్వస్థపరచినందుకు యూదులు ఆయనను హింసించారు. బాగుపడిన వ్యక్తి ప్రభువు చెప్పిన మాటను బట్టి తన పరుపెత్తుకొని నడిచి వెళ్తుంటే, యూదులు - ఇది విశ్రాంతి దినం గదా, నీవు నీ పరు పెత్తుకొన తగదే అన్నారు. దేవుడు సెలవివ్వని ఆచారాలు ప్రజల మీద మోపి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసారు. “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశము లని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు” (మత్తయి 15:9). దైవోపదేశాలేవో, మనుష్యులు కల్పించిన పద్దతులేవో పరీక్షించి, దైవోపదేశాలనే గైకొనాలని నేర్చుకుంటున్నాం.

యేసుక్రీస్తు దైవత్వాన్ని ఈ అద్భుతం ద్వారా గ్రహించాం. ఇకను పాపం చేసి కీడు పొందకుండేలా, ఆయనను విశ్వసించి, పాపాన్ని విడిచిపెట్టి నీతిగా జీవించ డానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక!

21. ఊచచెయ్యి గలవాడు

12:9-14 - "ఆయన అక్కడనుండి వెళ్ళి వారి సమాజమందిరములో సరించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గల వాడొకడు కనబడెను. వారాయన మీద తీరము మోపవలెనని - విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి. అందుకాయన - మీలో ఏ మనుష్యునికైనను నొక గొట్టెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? కొలెకంటే మనుష్యుడెంతో శ్రేష్టుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట దరమే అని చెప్పి ఆ మనుష్యునితో - నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.”

శాస్త్రులు, పరిసయ్యుల దుష్టత్వం

ఈ సందర్భంలో క్రీస్తు ప్రభువు ఊచచెయ్యి గలవాడిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి ఆయనను అడగకుండానే తన దయా సంకల్పాన్నిబట్టి ప్రభువే అతణ్ణి బాగుచేశాడు. ప్రభువు అతణ్ణి స్వస్థపరచడం పరిసయ్యులు వ్యతిరేకించినప్పటికీ ప్రభువు అతణ్ణి బాగుచేశాడు. ప్రభువు చేసిన స్వస్థతలు సంపూర్ణమైనవి. ఊచచెయ్యిగా ఉన్న ఆ చెయ్యిని ప్రభువు బాగుచేసినపుడు అతని రెండవ చేయివలె అది బాగు పడింది ఈ అద్భుతం ద్వారా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన గొప్ప ప్రేమను గ్రహించ గలం. పరిసయ్యులు విశ్రాంతి దినమున ప్రభువు రోగులను స్వస్థపరచడం చూచి, విశ్రాంతి దినాచారాన్ని మీరాడని ఆయనను సంహరించడానికి ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. పరిసయ్యలకు ఒక రోగి బాగుపడడం కంటే విశ్రాంతి దినాచారాన్ని అనుసరించడమే ప్రాముఖ్యంగా ఉండేది. విశ్రాంతి దినాన్న స్వస్థపరిచి నందుకు ప్రభువును దోషిగా ఎంచిన పరిసయ్యులు, ఆ కార్యం చేసినందుకు ఆయనను చంపడానికి ఆరోజే కుట్ర చేయడం తప్పుగా ఎంచలేదు. పరిసయ్యులు కేవలం స్వనీతిపరులు. ధర్మశాస్త్రాన్ని వారు కలిపి చెరిపి దానికి తమ స్వంత భాష్యాన్ని చెప్పేవారు. ధర్మశాస్త్రాన్ని అక్షరాను సారంగా తీసుకునేవారే కాని, దానిలోని దైవ ఉద్దేశాన్ని, ఆత్మీయ అర్థాన్ని తీసుకునేవారు కాదు. పరిసయ్యుల గురించి ప్రభువు ఈ రీతిగా అన్నాడు, “శాస్త్రులును, పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గానీ చేయరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గానీ, తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు” (మత్తయి 23:2-4).

ధర్మశాస్త్రానికి శాస్త్రులు, పరిసయ్యులు, మనుష్యులు కల్పించిన పద్ధతులను కలిపి వాటిని దైవోపదేశాలుగా బోధించేవారు. అందుకే ప్రభువు పరిసయ్యులను ఇలా అడిగాడు, “మీరు మీ పారంపర్యాచారం నిమితమె దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమించుచున్నారు? మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరరకము చేయుచున్నారు” (మత్తయి 16:3,6). పరిసయ్యులు ఆయన మీద 300 మోపాలని విశాంతి దినమున స్వసపరచడం న్యాయమా? అని ఆయనను అడిగారు. యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినాన్న ప్రాణాపాయ స్థితిలో తప్ప వైద్యం చేయడం తప్పుగా పరిగణింపబడేది. కాని, నిజానికి ధర్మశాస్త్రం ప్రకారం స్వస్థపరచడం, వైద్యం చేయడం, దయతో ఇతరులకు సహాయం చేయడం ఎన్నడూ తప్పుకాదు. మేలు చేయడం ఎల్లప్పుడూ వాక్యానుసారమే. అయితే శాస్తులు, పరిసయ్యులు తమ స్వంత పద్దతులను వాక్యం కంటే ఎక్కువగా ఆచరించేవారు. విశ్రాంతి దినమున ప్రభువు ఊచచెయ్యి గలవానిని స్వస్థపరచడం కూడా వారి దృష్టికి మరణకరమైన పాపంగానే తోచింది. పరిసయ్యుల వేదాంతం ఎంత లోపంతో కూడిందో ప్రభువు తెలియజేశాడు. ఆయన పరిసయ్యులతో “మీలో ఏ మనుష్యునికైనా ఒక గొట్టె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొళ్లెకంటే మనుష్యుడెంతో శ్రేష్టుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే” అని చెప్పాడు.

పరిసయ్యులు విశ్రాంతి దినాన ఒక జంతువు క్షేమం కోరినంతగా జంతువుకంటే శ్రేష్ఠుడైన, దేవుని పోలికగా సృష్టింపబడిన ఒక మనిషి మేలు కోరేవారు కాదు. అసలు విశ్రాంతి దినమును దేవుడు ఏర్పాటు చేసిందే మానవులకు పని భారాన్నుండి వారంలో ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలని. అయితే పరిసయ్యులు విశ్రాంతి దినాన్ని భారమైన, కష్టమైన ఆచారాలతో నింపి అవిశ్రాంతి దినంగా మార్చేశారు. తద్వారా దేవుని అసలైన ఉద్దేశ్యమే వారు కొట్టివేశారు. విశ్రాంతి దినాన్న జీవనోపాధి సంబంధమైన పనిచేయకుండా విశ్రాంతి ఉండి దేవుణ్ణి ఆరాధించమని ధర్మశాస్త్రంలో ఉండగా పరిసయ్యులు విశ్రాంతి దినాన్న ఏమేమి పనులు చేయకూడదో బోధిస్తూ 39 రకాల పనులు నిషేధించారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏండ్ల నుండి వ్యాధితో ఉన్న రోగిని యేసు ప్రభువు స్వస్థపరచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పాడు. వాడు తన పరుపెత్తుకొని నడవడం యూదులు చూసి ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరుగెత్తుకొన తగదే అన్నారు. ఒకడు బాగుపడి తన పరుపుతో తన ఇంటికి వెళ్ళడం కూడా వారి ఆచారం తప్పుగా పరిగణించింది. మత్తయి 12: 5,6,8 లో ప్రభువు ఇలా అన్నాడు, "యాజకులు విశ్రాంత దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిరోషులైయున్నారని మీరు ధర్మశాస్త్రములో చదువలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై యున్నాడనెను.”

పాఠకులూ, మనుష్యులు పెట్టిన ఆచారాలను దైవోపదేశాలుగా ఎంచకూడదని నేర్చుకుంటున్నాం. ఈ రోజుల్లో మరికొంతమంది మనం కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అంటారు. అంటే శనివారమే దేవుని ఆరాధించాలి అంటారు. ప్రభువు సిలువ వేయబడక ముందువరకూ బలులు అర్పించుట, సున్నతి, విశ్రాంతి దినాన్ని ఆచరించడం మొదలైనవి అవసరమై యుండేవి. మనం నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చి, ఆ నీతిని మనకిచ్చి మన పాపాన్ని సిలువలో తాను మోసాడు. మత్తయి 5:17,18 లలో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, “ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గానీ, కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గానీ, ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకూ, దాని నుండి ఒక పొల్లయినను, సున్నయైనను తప్పిపోదని ప్రభువు అన్నాడు. అంటే ధర్మశాస్త్రమంతా నెరవేరిన తరువాత తప్పిపోతుందని అర్థం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఆయన వచ్చానని చెప్పాడు. అంటే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్నంతటినీ నెరవేర్చాడు. కాబట్టి ఇక ధర్మశాస్త్రంలోని బలి అర్పణలు, విశ్రాంతి దినం (శనివారం) ఆచరించడం, సున్నతి చేయించుకోవడం మొదలైనవి ఆచరించనవసరం లేదు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడడం చేత ఆ చిత్రాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. “మరియు ప్రతి యాజకుడు దినదినమూ సేవచేయుచూ, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికీ అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఒక్క అర్పణచేత పరిశుద్ధపరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు” (హెబ్రీ 10:10-14). అందుకే మనం ఇక బలులు అర్పించనవసరం లేదు. క్రీస్తు సిలువే సదాకాలము నిలుచు బలి. అయితే ఇప్పుడు ధర్మశాస్తాన్నేమీ అనుసరించనక్కర లేదా? అనే ప్రశ్న ఎదురవుతుంది. ధర్మశాస్త్రం మూడు భాగాలుగా అన్నట్టు గుర్తించాలి. మొదటిది, ఆచారబద్ధ ధర్మశాస్త్రం (Ceremonial Law). అడవది, సాంఘిక ధర్మశాస్త్రం (Civil Law), మూడవది, నైతిక ధర్మశాస్త్రం (Moral Law). ఆచారబద్ధ ధర్మశాస్త్రం క్రీస్తు ప్రభువు సిలువలో సంపూర్తి చేసేవరకే నియమించబడింది. సాంఘిక ధర్మశాస్త్రం ఉదాహరణకు కంటికి కన్ను, పంటికి పన్ను న్యాయాధిపతులకు వర్తించేది. పరిపాలకులకు, అధికారులకు సంబంధించినది. కంటికి కన్ను, పంటికి పన్ను అంటే వ్యక్తిగతంగా పగతీర్చుకోవడానికి కాదు గానీ, న్యాయాధిపతులు, అధికారులు చేయబడిన తప్పుకు సమానమైన, లేదా తగిన శిక్షే విధించాలి. నైతిక ధర్మశాస్త్రం అంటే నీతిపరమైన ఆజ్ఞలు. ఈ నైతిక ధర్మశాస్త్రం అందరికీ, అన్ని యుగాలలో వర్తిస్తుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలోని నైతిక ఆజ్ఞలన్నింటినీ మనమెప్పటికీ గైకొనవలసిందే.

ఈ భాగం ద్వారా మరొక పాఠాన్ని నేర్చుకుందాం. పరిసయ్యులను ప్రభువు చూసి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా? కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా? ప్రాణహత్య ధర్మమా? అని అడిగెను. అందుకు వారు ఊర కుండిరి. అపుడు ప్రభువే విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఊచచెయ్యి గలవానిని బాగుచేశాడు. యాకోబు 4:17 ప్రకారం “మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.” అదే విధంగా విశ్రాంతి దినమైనా సరే, రోగిని స్వస్థపరచగలిగి ఉండి కూడా స్వస్థపరచకపోతే దోషము అవుతుంది. అందుకే పరిశుద్దుడైన ప్రభువు స్వస్థపరచకుండా ఉండలేకపోయాడు. మార్కు 3:5 లో ప్రభువు పరిసయ్యుల హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డాడని ఉంది. పరిసయ్యుల హృదయం రోగికి ప్రభువు మేలు చేస్తే సహించలేనిది. అద్భుతక్రియల ద్వారా ప్రభువు తన మహిమను వెల్లడి చేసినా ఆయనను మెస్సీయగా అంగీకరించనంత కఠినమైనది వీరి హృదయం. వారి కఠిన హృదయాన్ని బట్టి ప్రభువు దుఃఖపడ్డాడు. పాఠకులూ, మీ హృదయస్థితి ఏ రీతిగా ఉంది? ప్రభువుకు లోబడే మెత్తని హృదయమేనా మీది? ఒకవేళ మీ హృదయం ఆయనకు లోబడనంత కఠినమైనదైతే ఆయనను దుఃఖ పెట్టినట్లే. అందుకే హెబ్రీ 3:8లో పరిశుద్దాత్మ ఇట్లు సెలవిచ్చాడు, “నేడు మీరాయన శబ్దమును వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి.” దేవుడు ఆయనకు లోబడే మెత్తని హృదయాలను మనకు అనుగ్రహించునుగాక!

22. పుట్టు గ్రుడ్డివాడు

యోహాను 9:1-7 - 'ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డియైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు - బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు - వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి - నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.”

మన ప్రభువు చేసిన ఈ అద్భుతంలో ఒక పుట్టుగ్రుడ్డివానికి ఆయన చూపు ఇచ్చాడు. గ్రుడ్డివానికి దృష్టి ఇవ్వడం దేవుని అవతారమైన క్రీస్తు, లేక మెస్సీయ చేసే పనులలో ఒకటి. యెషయా 35:4,5,6 లలో ఈ రీతిగా వ్రాయబడింది, “ఆయన వచ్చి, తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరువబడును. చెవిటి వారి చెవులు వినబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును. మూగవాని నాలుక పాడును.” ప్రభువు చేసిన ఇటువంటి అద్భుతాలు ఆయనే దేవుని అవతారమని మరి ఎక్కువగా ఋజువు చేస్తున్నాయి. ఆ పుట్టుగ్రుడ్డివానిని చూసి ప్రభువు శిష్యులు వీడు గ్రుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడా, వీని కన్నవారా? అని ఆయన్ని అడిగారు. యూదులలో ఉండే ఒక నమ్మకాన్ని శిష్యులు వ్యక్తపరిచారు. యూదులు పాపం లేకుండా మరణం గానీ, శ్రమలు గానీ రావు అనీ, తల్లిదండ్రుల పాపశిక్ష పిల్లలు భరిస్తారని అభిప్రాయపడేవారు. పుట్టు గ్రుడ్డివానిని చూచి వీని గ్రుడ్డితనానికి వీని పాపమే కారణమా? అని శిష్యులు ప్రభువుని అడిగారు. ఈ మాటలో యూదులు మరొక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి పుట్టకముందే పాపం చేయడం సాధ్యం అనుకునేవారు. మన దేశ దురభిప్రాయం కూడా పూర్వజన్మలు ఉన్నాయనీ, ఆ జన్మలలో చేసిన పాప ఫలితం మరొక జన్మలో అనుభవిస్తారని, అయితే యేసుప్రభువు శిష్యుల అభిప్రాయాన్ని కొట్టివేశాడు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గానీ, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను అని ప్రభువు అన్నాడు. శ్రమలకు కారణం పాపమే. యోహాను 5:14; సంఖ్యాకాండము 12వ అధ్యాయం; 1కొరింథీ 11:30; యాకోబు 5:15 ప్రకారం పాపంవల్ల దేవుని ఉగ్రత ఉన్నదని స్పష్టంగా అర్థమవుతున్నది. అయినప్పటికీ, ప్రతీ శ్రమకు పాపమే కారణం కాదు. యోబు విషయంలో కలిగిన శ్రమలు అతడు చేసిన పాపాన్ని బట్టి కాదు. గలతీ 4:13 ప్రకారం పౌలుకి కలిగిన శరీర దౌర్భల్యం, 2కొరింథీ 12:7 ప్రకారం పౌలు శరీరంలో ఉన్న ముల్లు ప్రతి శ్రమ పాపాన్ని బట్టే కాదు అని ఋజువు చేస్తున్నాయి. ప్రభువు అన్నట్టుగా, దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి ఆయన చిత్తాను సారంగా ఆయన మహిమ కొరకు కొన్ని శ్రమలు సంభవిస్తాయి.

మన వాక్యభాగంలోని గ్రుడ్డివాని గ్రుడ్డితనం దేవుని మహిమ కొరకే వచ్చింది. ప్రభువు అతణ్ణి బాగుచేయడం ద్వారా ఆయన మహిమపరచబడ్డాడు. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని శ్రమలు దేవుని కార్యాలు మనలో జరగడానికి, తద్వారా దేవుడు మహిమపరచబడడానికి వస్తాయని గ్రహించగలం. ప్రభువు ఈ మాట చెప్పి, నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి గ్రుడ్డివాని కన్నులమీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాడు. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాడు. ప్రభువు చేసిన అద్భుతాలు, స్వస్థతలు వివిధ రకాలుగా చేశాడు. బర్తలొమయి అను గ్రుడ్డి భిక్షకునికి మాటతో చూపు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇద్దరు గ్రుడ్డివారి కన్నులు ముట్టి వారికి చూపు అనుగ్రహించాడు. మన వాక్యభాగంలో గ్రుడ్డివాని కన్నులమీద బురదపూసి కడుగుకొనుమని చెప్పి ఆ రీతిగా అతనికి చూపు అనుగ్రహించాడు. మన ప్రభువు సర్వశక్తిమంతుడు. ఏ రీతిగానైనా బాగుచేయగలడు, మేలు చేయగలడు. ఆయన ఫలానా రీతిగానే స్వస్థపరుస్తాడని చెప్పలేం. ఆపరేషన్ లేకుండా బాగుచేయవచ్చు. ఆపరేషన్ ద్వారా బాగుచేయవచ్చు. అది ఆయన చిత్తం. వ్యక్తులను మార్చడం కూడా ప్రభువు వివిధ రీతులుగా చేస్తాడు. ఒక వ్యక్తిని శ్రమలో తనవైపు ఆకర్షించుకుంటే, మరొక వ్యక్తికి దర్శనమిచ్చి మార్చుకోవచ్చు. ఒక వ్యక్తికి ప్రభువు గొప్ప వెలుగు, దర్శనంలో కనుపర్చి తనవైపు తిప్పుకున్నాడు. అతడు, అందరూ ఆ రీతిగానే రక్షింపబడాలని, వెలుగు కనబడితేనే రక్షింపబడినట్టని ప్రజలను తొందర చేస్తున్నారు. ప్రభువు మార్గాలు గొప్పవి. తన వాక్యం ద్వారా తనయందు విశ్వాసముంచడానికి అనేకమందిని అనేక రీతులుగా ఆయన మార్చుకుంటాడు.

ఆయన చిత్తాన్ని మనం అంగీకరించాలే గాని ఫలాని రీతిలోనే జరగాలని ఆయనను నిర్బంధించ కూడదు. మత్తయి 9:32లో ఉన్నట్టు, “పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.” ఇంత గొప్ప అద్భుతం ప్రభువు చేసినా సరే, యూదులు ఆయనను నమ్మలేదు. చూపు పొందినవాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడై పుట్టిన మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూడగలుగుతున్నాడని వారిని అడిగారు. అందుకు వారు 'వీడు మా కుమారుడని, వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడని మేమెరుగుదుము. కానీ ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడో మేమెరుగము” అన్నారు. గ్రుడ్డివాడై యుండి చూపు పొందిన అతడు చెప్పిన సాక్ష్యము కూడా యూదులు నమ్మలేదు. వారి అవిశ్వాసం, లేదా అపనమ్మకం వారి ఇష్టపూర్వకమైనదే. ఈ రీతిగా కావాలని నమ్మనివారు నమ్మడానికి ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా నమ్మరు. ఇటువంటి అపనమ్మకం మరిన్ని సాక్ష్యాధారాలు కావాలంటుంది. కానీ, ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా చాలవు అంటుంది. అపనమ్మకం లేదా అవిశ్వాసం పరిశోధన చేసినా, వ్యక్తిగత అభిప్రాయాలతోనే చేస్తుంది. అపనమ్మకం నిజాలను నిరాకరిస్తుంది. అపనమ్మకం స్వార్థపూరితమైనది, స్వీయ కేంద్రీకృతమైనది. యూదులు, పరిసయ్యులు ప్రభువు పుట్టుగ్రుడ్డివానికి కండ్లు ఇచ్చినా, ఆ నిజాన్ని నమ్మక దృష్టి కలిగినవాడు ఒకప్పటి గ్రుడ్డి భిక్షకుడు కాదని, వాని పోలియున్న మరియొకడని అన్నారు. ఈ రీతిగా ఆ అద్భుతం జరగలేదని కొట్టిపారేయడానికి చూశారు. అద్భుతం ఋజువైన తరువాత కూడా, వారు ప్రభువును నమ్మలేదు. అవిశ్వాసం ఎంత మూఢత్వంతో కూడుకున్నదో లూకా 16:31లో చూడగలం. "అందుకతడు - మోషేయు, ప్రవక్తలును చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను.”

పాఠకులారా, మూర్ఖత్వంతో కూడిన సాక్ష్యాధారాలను నిరాకరించే అపనమ్మకాన్ని విడిచిపెట్టాలని పాఠం నేర్చుకుంటున్నాము. దృష్టి పొందినవాని తల్లిదండ్రులు వారి కుమారుడు దృష్టి ఎలా పొందాడో వారికి తెలియదని యూదులతో అబద్దమాడారు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని అవతారమని ఒప్పుకుంటే యూదులు వారిని వెలి వేస్తారని యూదులకు భయపడ్డారు. ఎవ్వరూ ఇవ్వలేని రీతిగా యేసు ప్రభువు వారి కుమారుడైన పుట్టుగ్రుడ్డివానికి దృష్టి కలుగజేసినా, వారు ఆయనను అంగీకరించలేదు. ఆయనను బహిరంగంగా ఒప్పుకోవడానికి భయపడ్డారు. ఆయన చేసిన మేలు యూదులంతా కలిసినా చేయలేరు కదా. అలాంటప్పుడు యూదులకు భయపడి ప్రభువును ఒప్పుకోక పోవడం కృతజ్ఞత లేకపోవడమే. మార్కు 8:38లో ఇలా ఉంది, “వ్యభిచారమను పాపము చేయు ఈ తరమువారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో, వానిని గూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునపుడు చెప్పెను." లోకానికి, లోక నిందలకు భయపడకుండ రకకు బహిరంగముగా ఒప్పుకోవాలని పాఠం నేర్చుకుంటున్నాం. ఆ గ్రుడి బియ పొందిన తరువాత తనకు చూపు దయచేసిన యేసుప్రభువు పక్షంగాను యూదులు అతనిని వెలివేశారు. అయినా సరే, అతడు ప్రభువు ఉంచాడు. మనం కూడా మన ప్రభువు కొరకు ఎన్ని నిందలు, శ్రమలు భరి వచ్చినప్పటికీ విశ్వాసంలో నుండి తొలగిపోకూడదు. మత్తయి 5:10-12లో ఇలా సెలవిచ్చాడు, “నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద ఈ చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పలు మందు మీ ఫలము అధికమగును.”

బాగుపడిన ఆ గ్రుడ్డివాడు - ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కాడు. ప్రభువులో విశ్వాసం ఆయనకు కృతజ్ఞతతో మ్రొక్కేలా చేసుంది చదువరీ, ప్రభువు నందు విశ్వాసముంచావా? ఆయనకు మ్రొక్కుతున్నావా? ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? అపనమ్మకం వీడి ప్రభువును నమ్మి ఆయనను బహిరంగంగా ఒప్పుకోవడానికి దేవుడు నీకు సహాయపడును గాక!

23.అంజూరపు చెట్టు

మత్తయి 21:18-22 - "ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న యొక అంజూరపు చెట్టును చూచి, దాని వద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు. కనుక దానిని చూచి - ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి - అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు - మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపు చెట్టునకు జరిగినదానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన యెడల ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయు నప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరికినవని) నమ్మిన యెడల మీరు వాటి నన్నింటిని పొందుదురని వారితో చెప్పెను.”

ప్రభువు చేసిన ఈ అద్భుతం ద్వారా ఆత్మీయ ఫలాలు లేని ఇశ్రాయేలీయుల మీద దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో చూపించాడు. పాత నిబంధన గ్రంథంలో అంజూరపు చెట్టు యూదా దేశానికి సాదృశ్యంగా వాడబడింది. ఉదాహరణకు, హోషేయ 9:10 - “అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి.” మన వాక్యభాగంలో ప్రభువు అంజూరపు చెట్టును శపించక మునుపు యూదులు ఆయనను మెస్సీయగా అంగీకరించలేదు. హోసన్న అని పిల్లలు ప్రభువును ఘనపరుస్తూ ఉంటే ప్రధాన యాజకులు కోపంతో మండిపడ్డారు. ఈ రీతిగా మెస్సీయను అంగీకరించకపోవడమే లేక నిరాకరించడమే ఇశ్రాయేలీయుల యొక్క సిగ్గుకరమైన, ఫలాలు లేని జీవితం. ఈ రీతిగా ఆత్మీయ ఫలాలు లేనివారిని అంజూరపు చెట్టువలె ఎండిపోయేలా చేసేది దేవుని ఉగ్రతే. ఈ అంజూరపు చెట్టు ఆకులతో నిండి ఉంది. కానీ, ఒక్క కాయ కూడా లేదు. సాధారణంగా అంజూరపు కాయలు ఆకులతోనే పెరుగుతాయి. మార్కు 11:12 లో చూస్తే అది అంజూరపు పండ్లకాలం కాకపోయినప్పటికీ శపింపబడిన ఆ చెటు మాత్రం కాలానికి ముందే అభివృద్ధి చెంది ఆకులతో నిండి ఉంది. సారవంతమైన భూమిలో ఉన్న ఆ చెట్టు ఆ కాలానికి ముందే ఆకులతో నిండి ఉన్నట్టు ఫలాలతో కూడా నిండి ఉండాలి. చూడడానికి ఆకులతో పచ్చగా ఉన్న ఆ చెట్టు నిజానికి ఫలాలు ఏమాత్రం లేకుండా ఉంది. అందుకే ప్రభువు ఆ చెట్టును శపించాడు.

ఇశ్రాయేలీయులు కూడా పైకి ఎంతో ఆత్మీయమైనవారుగా, భక్తి గలవారుగా కనిపించేవారే గానీ దేవుడు కోరిన ఆత్మీయ ఫలాలు వారిలో ఉండేవి కావు. ఆ అంజూరపు చెట్టువలె పైకి భక్తి గలవారివలె ఉండి, వేషధారులైన వారిని దేవుడు తప్పక శిక్షిస్తాడనేది పాఠం. ఫలింపని అంజూరపు చెట్టుకు నీరు, ఎరువు పెట్టి ఫలిస్తుందేమో అని మరొక సంవత్సరం అవకాశమిచ్చి అప్పటికీ ఫలింపకపోతే నరికివేయబడుతుందని ప్రభువు చెప్పాడు. ప్రభువు ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరకు వస్తే అది ఆయన ఆకలి తీర్చలేదు. అలాగే విశ్వాసులమని పిలువబడుతున్న మనం కూడా చాలాసార్లు ప్రభువు ఆశను, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని బాప్తిస్మమిచ్చు యోహాను బోధించాడు. పాఠకులూ, ఆత్మీయంగా ఫలించడం ఎంత ప్రాముఖ్యమో గుర్తించారా? ఆ అంజూరపు చెట్టుకు నిండా ఆకులే గానీ, కాయలు లేనట్టు మనం కూడా పైకి ఎంతో భక్తిగా కనిపిస్తూ ఎంతో సేవ చేస్తూ కూడా దేవుడు కోరిన విధేయత, దీనత్వం, ప్రేమ, పవిత్రత లేకుండా ఉంటూ ఉంటాము. అందుకే ప్రభువు లూకా 6:46లో ఇలా అన్నాడు, “నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు?” ఆత్మఫలాలు, నీతిఫలాలు, వెలుగు ఫలాలు, మారుమనస్సుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. లేకపోతే అంజూరపు చెట్టు ఎండిపోయినట్టు మనం కూడా దేవుని ఉగ్రతను పొందవలసి ఉంటుంది. ఆత్మీయ ఫలాలతో ప్రభువు మనందరిని నింపునుగాక!

24. యేసుక్రీస్తు పునరుత్థానం

మత్తయి 28:1-10 - "విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి, రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి - మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన సలము చూచి త్వరగా వెళ్ళి, ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. వారు భయముతోను, మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు - భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుమనెను.”

మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఈ రీతిగా ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేవడం క్రొత్త నిబంధనకే పునాది వంటిది. క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి అత్యంత కీలకమైనది. క్రొత్త నిబంధనలో 104 సార్లు ఈ సత్యం ప్రస్తావించబడింది. దాదాపు క్రొత్త నిబంధనలోని గ్రంథాలన్నీ ప్రభువు యొక్క పునరుత్థానాన్ని గూర్చి ప్రస్తావించాయి. అపొస్తలుల కార్యములు గ్రంథములోని వర్తమానాలన్నీ క్రీస్తు పునరుత్థానాన్ని చాటేవే. ప్రభువు పునరుత్థానం రెండు గొప్ప ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని ఇస్తున్నాయి.

మొదటి ప్రశ్న: దేవుడు ఉన్నాడా?

ఏ మానవునికి సాధ్యము కాని రీతిలో క్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా దేవుడు ఉన్నాడనీ, ఆయన ఈ లోకంలో అవతరించాడనీ, మానవుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడనీ ఋజువు అవుతున్నది.

రెండవ ప్రశ్న: మరణం తరువాత జీవం ఉన్నదా?

క్రీస్తు పునరుత్థానం మరణం అంతం కాదని, ఆత్మకు చావు లేదని ఋజువు చేసు ప్రభువు తాను చెప్పినట్టే మృతులలో నుండి తిరిగి లేచాడు. ఒక సూచక చేయమని పరిసయ్యులు ఆయనను శోధిస్తూ అడిగినప్పుడు ప్రభువు ఈ రీతిలో అన్నాడు, “వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. మన అయిన యోనాను గూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియలో వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపు ఏలాగు ఉండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగరము ఉండును” (మత్తయి 12:39,40). మార్కు సువార్త 10:32-34లో ఇలా వ్రాయణ ఉంది, “అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్ప నారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్తులకును అప్పగించబడును. వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.”

సమాధిని చూడగానే వచ్చిన స్త్రీలతో దేవదూత ఇలా అన్నాడు, “సిలువ వేయ బడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు.” మన ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేవడం అంత నమ్మశక్యం కాని విషయం ఏమీ కాదు. అద్భుతకరమైన జీవితాన్ని జీవించి చనిపోయిన వారిని సహితం బ్రతికించి ఆయన తాను మరణించి తిరిగి లేవకుండా అలాగే ఉండిపోతే ఆశ్చర్యపడాలి. ప్రభువు తిరిగి లేచాడు. ఇదే గొప్ప అద్భుతం. ప్రభువు తిరిగి లేచి ఉండకపోతే సువార్తకు ఆఖరి అధ్యాయం లేనట్టే. అంతేకాదు, సువార్త సువార్తె కాకపోవును. అందుకే పౌలు భక్తుడు ఈ రీతిగా అన్నాడు, “క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుష్యులందరి కంటే దార్భాగ్యులమై యుందుము” (1 కొరింథీ 15:17-19). అయితే ప్రభువు తిరిగి లేచాడు. ఆయన సమాధిని చూడడానికి వెళ్ళిన ఆయన శిష్యులు, స్త్రీలు సమాధి ఖాళీగా ఉండడం చూశారు. దానికి కారణం, ముందుగా చెప్పినట్టే ప్రభువు మృతులలో నుండి లేచియున్నాడని దేవదూత వారితో చెప్పాడు. అయితే సమాధిని కావలి కాసిన సైనికులు ఆయన తిరిగి లేచిన విషయాన్ని ప్రధాన యాజకులతో చెప్పారు. అయితే ప్రధాన యాజకులు ఆ సైనికులకు చాలా డబ్బు ఇచ్చి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడని వారితో చెప్పారు. ఆ సైనికులు అలాగే ప్రచారం చేశారు. ఆ మాటే యూదులలో వ్యాపించింది. ఇప్పటికీ కొంతమంది యేసు ప్రభువు సిలువలో మరణించలేదనీ, ఆయన చనిపోయి తిరిగి లేవలేదనీ ప్రచారం చేస్తున్నారు. అంతా వారి వృథా ప్రయాసే. ఎందుకంటే ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేచాడని ఒప్పుకుంటే మానవుల పాపం కొరకు ప్రాణం పెట్టిన నామం యేసుప్రభువే అని, ఆయన తప్ప మరణాన్ని జయించి తిరిగిలేచి ఇప్పుడు సజీవంగా ఉన్న నామం ఏదీ లేదు అని తప్పక ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే వారు ఈ సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభువు సమాధి ఖాళీగా ఉండడమే క్రైస్తవ్యం యొక్క గొప్ప అతిశయ కారణం. యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన సమాధి ఖాళీగా ఉండడానికి మూడే మూడు అవకాశాలు ఉన్నాయి.

మొదటిది : ప్రధాన యాజకులు, సైనికులు చెప్పినట్లు కాపలా ఉన్నా సైనికులు నిద్రిస్తున్నప్పుడు ప్రభువు శిష్యులు ఆయనను ఎత్తుకొనిపోయి ఉండాలి. ఇది ఎంత అసాధ్యమో, అసత్యమో చూద్దాం. ప్రభువును పట్టుకున్నప్పుడు ఆయన శిష్యులందరు ఆయనను విడిచి పెట్టి పారిపోయారు. ప్రభువు బ్రతికియుండగానే ఆయనను విడిచి పెట్టి పారిపోయిన శిష్యులు ఆయన మరణించాక ఆయన దేహాన్ని తెగించి తీసుకువెళ్ళగలరా? అంతేకాదు, సైనికులందరు కాపలా కాయకుండా ఒకేసారి నిద్రిస్తారా? ఒకవేళ నిద్రించి యుంటే రాయిని పొర్లించి శిష్యులు ప్రభువును ఎత్తుకొని పోతున్నప్పుడైనా ఒక్క సైనికునికైనా మెలకువ రాదా? ఒకవేళ సైనికులకు మెలకువ రాలేదే అనుకుందాం. ప్రభువును శిష్యులు తీసుకువెళ్ళారో, ప్రధాన యాజకులే తీసుకువెళ్ళారో నిద్రిస్తున్నవారికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ వారు చెప్పినట్టు ప్రభువు శిష్యులే ఆయన దేహాన్ని అపహరించి ఉండి ఉంటే ప్రభువు తిరిగి లేచాడని ఎందుకు బోధిస్తారు? ఆ విషయమై ఎందుకు ప్రాణాలకు తెగిస్తారు? అవన్నీ ఆలోచిస్తే సమాధి ఖాళీగా ఉండడానికి ప్రభువును, ఆయన శిష్యులు ఎత్తుకుపోలేదని ఏ మాత్రం తెలివి ఉన్నవారైనా గ్రహించగలరు.

రెండవది : సమాధిని నిరంతరం కాపలా కాయలేక ప్రధాన యాజకులు, సైనికులే ఆయన దేహాన్ని ఎతుకొనిపోయి ఉండాలి. కాని శిష్యులందరు ప్రభువు తిరిగి లేచాడని చాటుతూ ఉంటే, వేలకు వేలు ప్రజలు ఆయనను నమ్ముకుంటూ ఉంటే ఏమీ చేయలేక శిష్యులను హింసించారే తప్ప ప్రభువు దేహాన్ని తెచ్చి ఆయన తిరిగి లేవలేదని, శిష్యులు అబధికులని ఋజువు చేసేవారే కదా! ప్రధాన యాజకుల నిస్సహాయ స్థితి వారు ప్రభువు దేహాన్ని ఎత్తుకుపోలేదని ఋజువు చేస్తుంది.

మూడవది : ఇంకా సమాధి ఖాళీగా ఉండడానికి ఒక అవకాశమే మిగిలింది. ఇదేమిటంటే యేసు ప్రభువు అద్భుత రీతిలో మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తాను చెప్పినట్టే మూడవరోజు తాను తిరిగి లేచాడు. తరువాత 40 రోజులు తన శిష్యులకు అనేకసార్లు కనబడి తాను తిరిగి లేచాడని అనేక ఋజువులు చూపించాడు పాఠకులారా! యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? నమ్మకపోతే మీకు రక్షణ లేనట్టే. రోమా 10:9 చూడండి, “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు.” కాబట్టి ఇప్పుడే మీ హృదయములో యేసు ప్రభువు మీ పాపాలకై ప్రాణం పెట్టి, తిరిగి లేచాడని విశ్వసించండి. మీరు రక్షణ పొందగలరు. యేసు ప్రభువు పునరుత్థానుడైతే ఇప్పుడు ఆయన సజీవుడే. అంటే నీవు ఆయనను కలుసుకొనగలవు. ఆయనకు ప్రార్ధించి జవాబు పొందగలవు. ఆయనతో సంబంధం, సహవాసం కలిగి ఉండగలవు. ప్రభువు తిరిగి లేచాడు. కాబట్టే మరణం తరువాత జీవం ఉన్నదని ఋజువు అవుతున్నది. యోహాను 5:28, 29లలో ఇలా ఉంది, “ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలోనున్న వారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు.” ప్రభువును నమ్మండి. తీర్పును, నరకశిక్షను తప్పించుకొని జీవం, మోక్షం చేరగలరు. ఇప్పటికే ప్రభువునందు విశ్వాసముంచి, రక్షింపబడిన చదువరులూ, మీ స్థానంలో మీకు బదులు ప్రభువు ప్రాణం పెట్టాడు గదా. అలాగే ఇప్పుడు మీకు బదులు ఆయనే మీలో జీవించాలి. పౌలు గలతీ 2:20 లో ఇలా అన్నాడు, “నేను క్రీస్తుతో కూడ సిలువవేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.” ప్రభువు మనలో జీవించునుగాక!

25. నాయీను విధవరాలి కుమారుని బ్రతికించుట

లూకా 7:11-17 - 'వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన - చిన్నవాడా, తెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అతని నప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ యందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను."

ప్రభువు సాటిలేని మహిమ

ప్రభువు చేసిన ఈ సాటిలేని అద్భుతం ద్వారా ఆయన తన మహిమను కొద్దిగా గ్రహించడానికి ప్రయత్నిద్దాం.

మొదటిగా, ప్రభువు మరణంపై అధికారం గలవాడని తెలుస్తుంది. చనిపోయిన చిన్నవాడిని బ్రతికించాడు. తన మహత్తుగల మాటతో బ్రతికించాడు. ఏమానవుడికి మరణంపై అధికారం లేదు. ఎంత గొప్పవాడైనా నైపుణ్యం కలిగిన వైద్యుడైనా, రాజైనా, ప్రభుత్వమైనా మరణాన్ని తప్పించలేరు. మరణం ఎదుట ఎంతటివారైనా తల వంచ వలసిందే గాని యేసుక్రీస్తు సామాన్య మానవుడు కాదు. దేవుని అవతారం. కాబట్టి దైవశక్తితో మరణించినవారిని బ్రతికించగలిగాడు. ఇటువంటి శక్తి ఏ నామంలోనూ చూడలేము.

రెండవదిగా, ప్రభువు కనికరం గలవాడు. విధవరాలి ఒక్కడే అయి ఉన్న కుమారుడు చనిపోగా ఆమె దుఃఖంలో ఉండి ఎంతో ఏడుస్తూంటే ఆయన ఆమెను చూచి ఆమెపై కనికరపడ్డాడు. తన అపారమైన కనికరాన్ని బట్టి ఆ విధవరాలి దుఃఖాన్ని వేదనను తొలగించాడు. కుమారుడు లేని లోటును పూడ్చాడు. ఆయన కు ఎంత గొప్ప మేలు చేస్తుందో కదా. మానవులు కనికరపడ్డా అంత ప్రయోజనం ఉండదు. సర్వశక్తి ప్రభావాలు కలిగిన ప్రభువు కనికరపడితే ఎంతటి మేలెనా చేయగలడు. ప్రభువు కనికరాలు మితిలేనివి.

మూడవదిగా, ప్రభువు సార్వభౌమత్వం కలిగి తన దయాసంకల్పం చొప్పున తన చిత్త ప్రకారం పనిచేస్తాడు. ఆ విధవరాలు అడగకుండానే ఆమెలో తన బిడను ఆయన బ్రతికించగలడనే విశ్వాసం లేకపోయినాసరే, ఆయనే కలుగజేసుకొని కనికరపడి ఆమె బిడ్డను బ్రతికించాడు. కీర్తన 135:6 - "ఆకాశమందును, భూమియందును, సముద్రములయందును, మహాముద్రములన్నిటియందును, ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు.” ఎఫెసీ 1:12లో ఈ రీతిగా ఉంది, “ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించు చున్నాడు. ” చనిపోయిన వారినందరిని బ్రతికించలేదు గాని తన నిర్ణయ ప్రకారం, తన చిత్త ప్రకారం కొందరిని బ్రతికించాడు. చాలామంది వారిని గూర్చి 'వీరిని దేవుడు బాగుచేశాడు, నన్ను బాగుచేయలేదు' అని అనుకుంటారు. 'అప్పుడు బ్రతికించాడు కదా ఇప్పుడు ఎందుకు బ్రతికించకూడదు' అనుకుంటారు. ప్రభువు సార్వభౌమత్వం గలవాడు. తన చిత్రాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయన ఇష్టం.

నాలుగవదిగా, ప్రభువు ఆదరించేవాడు. తన బిడ్డ చనిపోయాడని ఆ విధవరాలు ఏడుస్తూ ఉంటే ఆయన ఆమెను చూచి ఆమెయందు కనికరపడి, ఏడ్వవద్దని ఆమెతో చెప్పి చనిపోయిన ఆమె బిడ్డను బ్రతికించి ఆమెకు అప్పగించాడు. ఆమె దుఃఖాన్ని పోగొట్టి ఆమెను ఆదరించాడు. ఇలా ఎవరు ఆదరించగలరు చెప్పండి! ప్రభువులోనే మానవులకు నిజమైన ఆదరణ లభిస్తుంది. ఆయన వలె మన కష్టాలు పోగొట్టి, మన కన్నీటిని తుడిచేవారు ఇంక ఎవరూ లేరు. యెషయా 66:13 లో ఇలా సెలవిచ్చాడు, “ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను.”

చదువరులారా, మీరు ఏ విషయములోనైనా దుఃఖిస్తున్నారా? ప్రభువు సమస్త ఆదరణకు కర్త. ఆయన నీ కష్టదినాలు పోగొట్టి నీకు నెమ్మదిని ఇవ్వగలడు. ఆయనను ఆశ్రయించి ఆదరణను పొందండి. కీర్తన 94:19లో ఏముందో చూడండి. “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” ప్రభువు ఆదరించేవాడు.

ఐదవదిగా, ఆయన ప్రభావంతో కూడిన పరిశుద్దుడు. ఏ రకమైన అపవిత్రత ఆయనకు అంటదు. ఆయన పాడెను ముట్టాడు. ధర్మశాస్త్రం ప్రకారం పాడెను ముట్టువాడు అపవిత్రుడు. కాని ప్రభువుకు అపవిత్రత కలుగలేదు. ఆయన శక్తి అపవిత్రతను, మరణాన్ని తొలగించివేసింది. రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్తపు చెంగు ముట్టింది. ఆమె రోగం తొలగిపోయింది. పాపాత్మురాలు అయిన స్త్రీ కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ఆయన పరిశుద్ధతను బట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి 'నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు' అని అన్నప్పుడు ఆయన అతనిని ముట్టి బాగుచేశాడు. ప్రభువు ఈ విధంగా అపవిత్రత అంటనంత పరిశుద్ధుడు.

ఆరవదిగా, ప్రభువు సహాయపడేవాడు. దిక్కులేనివారిని, అనాధలను ఆదుకునేవాడు. ఆమె విధవరాలు. తన ఒక్కడైయున్న కుమారుడు కూడా చనిపోయాడు. ఆమె నిరాధారం అయిపోయింది. ఒంటరిదైపోయింది. ఇలాంటి వారికి ఎవరు సహాయం చేస్తారు చెప్పండి. ఆమె అడగకుండానే ప్రభువు ఆమెకు సహాయం చేశాడు. “పరిశుద్ధాలయమందు ఉండు దేవుడు తండ్రిలేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు” (కీర్తన 68:5,6). “ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేనివారిని విధవరాండ్రను ఆదరించువాడు” (కీర్తన 146:5,9).

ఏడవదిగా, ప్రభువు మృతులను పిలిచి బ్రతికించేవాడు. చనిపోయిన చిన్నవారిని చిన్నవాడా లెమ్మని పిలిచాడు. ప్రభువు చనిపోయినవారిని బ్రతికించిన మూడు సందర్భాలలో కూడ మృతులను పిలిచి బ్రతికించాడు. యాయీరు కుమార్తెను చిన్నదానా లెమ్మన్నాడు. లాజరు చనిపోయిన నాలుగవరోజు లాజరూ, బయటకు రమ్మని పిలిచి బ్రతికించాడు. ఆత్మకు చావు లేదు గనుక దేవుని దృష్టిలో మృతులు సజీవులే. అపొస్తలుల కార్యములు 10:42లో ప్రభువు సజీవులకును, మృతులకును న్యాయాధిపతి అని వ్రాయబడి ఉంది. మృతులను సహితం బ్రతికించి ఆయన తీర్పు తీర్చనైయున్నాడు. పాఠకులారా, మన ప్రభువు ఎంత గొప్పవాడో గుర్తించారా! అలాంటి ఆశ్చర్యకరుడైన యేసుప్రభువును నాయీను ఊరి ప్రజలు స్తుతించి, ఆయన ప్రఖ్యాతిని ప్రచారము చేసినట్లు మనమును స్తుతించి చాటుదాం.

26. ప్రభువు మాటపై విస్తారమైన చేపలు పట్టుట

యోహాను 21:1-6, 9-12 - "అటుతరువాత యేసు తిబెరియ సముద్ర తీరములు శిష్యులకు మరల తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనను ప్రత్యక్రమం కొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు గలి లోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమాళ్ళును ఆయన శిష్యులతో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు - నేను చేసే పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో వచ్చెదమనిరి. వారు వెళి, దోనె ఎక్కిరి గాని ఆ రాత్రి యేమియు పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు - పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైనా ఉన్నదా? అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారాలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. యేసు - మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను. అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు - రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.”

మన ప్రభువు పునరుత్థానుడైన తరువాత తన శిష్యులకు తనను తాను ప్రత్యక్ష పరచుకున్న ఒక సందర్భాన్ని చదువుకున్నాం. ప్రభువు తిరిగి లేచిన తరువాత శిష్యులు గలిలయకు వెళ్ళాలని, అక్కడ వారు ఆయనను చూస్తారు అని చెప్పాడు. అలాగే శిష్యులు గలిలయకు వెళ్ళి ఆయన కోసం చూశారు. ఆయన కోసం కనిపెట్టి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. చేపలు పట్టడం వారిలో కొంతమంది పాత వృత్తి. తన శిష్యులుగా ఉండడానికి ప్రభువు వారిని పిలిచినప్పుడు వారు చేపలు పట్టి తమ వృత్తిని విడిచి ప్రభువును వెంబడించారు. ప్రభువు వారిని మనుష్యులను పట్టే జాలరులుగా మార్చాడు. అయితే ప్రభువు సిలువ వేయబడిన తరువాత ఆయన ఇంక వారికి దూరమైపోయాడని అనుకున్నారేమో. తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. కాని ప్రభువు పిలుపుకు, ఏర్పాటుకు దూరంగా వెళ్ళి, రాత్రంతా ప్రయాసపడినా వారు చేపలేమీ పట్టలేకపోయారు. ప్రభువు ఏర్పాటుకు దూరంగా ఉండి మనమేమీ సాధించలేమని పాఠం నేర్చుకోవాలి. వారు చేపలు పట్టే వృత్తిలో ఎంత అనుభవం, నైపుణ్యం కలిగినవారైనా దోనెలు, వలలు వారికి ఉన్నా చాలామంది కలసి రాత్రంతా ప్రయాసపడినా వారికేమీ దొరకలేదు. అందుకే ప్రభువు యోహాను సువార్త 16:4,5 లలో ఇలా సెలవిచ్చాడు, “నాయందు నిలిచి యుండుడి. మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి యుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.” గమనించారా, ఒకవేళ దేవుడు మిమ్మల్ని తన సేవకు పిలుస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నారా? మీరేమీ ఫలించలేరు. యోనావలే దేవుని చిత్రానికి దూరంగా పారిపోలేరు. ఆయన పిలుపుకు లోబడండి.

ఈ సందర్భంలో మొత్తం ఏడుగురు శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. వారిని చేపలు పట్టడానికి వెళ్ళేలా ప్రోత్సహించినవాడు సీమోను పేతురు. పేతురు నాయకత్వ లక్షణాలు గలవాడు. మొదటినుండి శిష్యుల పక్షంగా తానే మాట్లాడేవాడు. ఇలాంటి నాయకుడు 'నేను చేపలు పట్టబోతున్నాను' అని మిగిలిన శిష్యులతో అన్నప్పుడు వారు తమ నాయకుణ్ణి వెంబడించారు. యధా రాజా తథా ప్రజా అన్నట్లు నాయకుని బట్టి అతని అనుచరులు ఉంటారు. ప్రతి నాయకుడు తన అనుచరులను అయితే బాగుచేయ గలడు, లేకపోతే పాడుచేయగలడు. నాయకుని చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం తన మాదిరికరమైన జీవితమే. నాయకుడు ఏంచేస్తే అతని అనుచరులు అదే చేస్తారు. సువార్త పరిచర్యలో నాయకులు మాదిరికరమైన భక్తి జీవితాన్ని జీవిస్తే వెనకాలవారు వారిని అనుసరిస్తారు. నాయకులు దారి తప్పితే వారి వెనకున్నవారు కూడా దారితప్పే ప్రమాదం ఎంతైనా ఉంది. నాయకుడు దేవుని వాక్యానికి బదులు కలలకు, దర్శనాలకు ప్రాధాన్యతనిస్తే అతణ్ణి అనుసరించేవారు కూడా దేవుని వాక్యం కంటే తమ కలలకు, దర్శనాలకే ఎక్కువ విలువ ఇస్తారు. నాయకుడు అక్రమంగా డబ్బు సంపాదిస్తూ, అపవిత్రంగా జీవిస్తుంటే వారు కూడా అదే చేస్తారు. మనకు లేనిది ఇతరులకు ఇవ్వలేం కదా. అందుకే నాయకులైనా భక్తితో ఇతరులకు మాదిరిగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. శిష్యులు రాత్రంగా చేపలు పట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సూర్యోదయాన ప్రభువు వచ్చి, 'పిల్లలారా భోజనానికి మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా?” అని వారిని అడిగితే వారు లేవు అన్నారు. అపుడు ఆయన వారిని దోనె కుడిప్రక్క వల వేయమన్నాడు. వారు అలా చేశారు. అంతే 153 గొప్ప చేపలు వలలో పడ్డాయి. ప్రభువుకు దూరంగా వారు ఏమీ పట్టలేకపోయారు. వారు చెప్పినట్టు చేశారు. విస్తారంగా వల పిగిలిపోయేటన్ని చేపలు పొందారు.

చూశారా! ప్రభువుకు లోబడితే ఎంత విస్తారమైన మేలు ఉందో. నిజానికి చేపలు పట్టడంలో శిష్యులకే అనుభవం, నిపుణతలు ఉన్నాయి. వారు రాత్రంతా ప్రయత్నించినా ఏమీ పట్టలేదు. ప్రభువు వచ్చి దోనె కుడిప్రక్క వల వేయమన్నాడు. చేపలకు దోనె కుడిప్రక్క, ఎడమప్రక్క అని ఏమీ ఉండదు కదా! ప్రభువు ఇలా చెప్పుతున్నాడేమిటి అని వారు వ్యతిరేకించకుండా ఆయన మాటలు లోబడ్డారు. అంతే అద్భుతంగా విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభువు ఆజ్ఞలు నీకు అనుకూలంగా, మేలుకరంగా అనిపించినా, అనిపించకపోయినా ఆయనకు లోబడు. అద్భుతాలు చూడగలవు. ఆయనకు దూరంగా ఉండి ఏమీ సాధించలేరని శిష్యులు తెలుసు కోవాలనే ఆ రాత్రి చేపలకు పేతురు దొనె దగ్గరకు రావద్దని ప్రభువు సెలవిచ్చాడు. తనకు లోబడితే ఎంత ఆశీర్వాదమో వారికి తెలియజేయడానికి చేపలను పేతురు దోనె కుడిప్రక్కకు రమ్మని తరువాత ఆజ్ఞాపించాడు. ప్రభువు ద్వారం తెరిస్తే ఎవరూ మూయలేరు. ఆయన ద్వారం మూస్తే ఎవరూ తెరవలేరు. కనుక ఆయనకు లోబడడమే శ్రేష్ఠం. ప్రభువు వారికి భోజనం సిద్ధపరిచాడు. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఏమీ పొందలేదు. వారు దరికి రాగానే అక్కడ నిప్పులు, రొట్టె, చేపలు ఆయన సిద్ధపరిచాడు. ఆయన నిన్ను ఆదరించేవాడు. ఏ సమయానికి నీకు ఏమి అవసరమో దాన్ని ముందుగానే సిద్దపరుస్తాడు. వారు భోజనం చేసిన తరువాత ప్రభువు పేతురును మూడుసార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించాడు. 3 సార్లు ప్రభువు ఎవరో తెలియదని బొంకిన పేతురును ఆయన తిరిగి పునరుద్ధరించాడు. వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన పేతురును అడిగాడు. నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేను ఎప్పుడూ అభ్యంతరపడనని పేతురు అంతకుముందు అన్నాడు. మరి నిజంగానే మిగిలిన శిష్యులు ప్రభువును ప్రేమించినదానికంటే ఎక్కువగా తాను ఆయనను ప్రేమిస్తున్నాడా? అంతేకాదు, వీరి కంటే ఎక్కువగా, అంటే చేపలు, వలలు, దోనెలు. ఆ వృత్తిలోని ఇతర జాలరులకంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నాడా?

ఎక్కువగా పాఠకులూ, మనం ప్రభువునే లోకం కంటే, ఆఖరికి మన ప్రాణం కంటే ప్రేమించాలి. మనకోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభువే సంపూర్ణ ప్రేమకు పాత్రుడు. ఆయననే ప్రేమిద్దాం. 'ఎవడైననూ ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక' అని 1 కొరింథీ 16:22లోనూ, “మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువారికందరికిని కృప కలుగును గాక” అని ఎఫెసీ 6:24లోనూ చదవగలం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న పేతురుతో నా గొర్రెలను మేపుము అని ప్రభువు చెప్పాడు. ప్రభువును ప్రేమించేవారు గొర్రెలవంటి ఆయన బిడ్డలను వాక్యం ద్వారా మేపుతారు. ఆయన సంఘాన్ని కాస్తారు. ప్రభువు సంఘ క్షేమాభివృద్ధిని కోరుతున్నాడు. పేతురుతో ఆయన 'నీవు నా నిమిత్తం సిలువ వేయ బడతావు' అని చెప్పి 'నన్ను వెంబడించు' అన్నాడు. ప్రభువును మనం వెంబడించాలి. ఆయనను వెంబడించ డానికి ఎంత త్యాగమైనా చేయాలి. మన కోసం ప్రాణమే పెట్టిన ప్రభువు కోసం మనం ఎంత త్యాగమైనా చేయాలి. మన కోసం ప్రాణమే పెట్టిన ప్రభువు కోసం మనం ఎంత త్యాగం చేసినా న్యాయమే. మన మరణం కూడా దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి. నన్ను వెంబడించు అని ఆయన పేతురుతో చెబితే, పేతురు ఆయనను వెంబడించడానికి బదులు వెనక్కి తిరిగి తనవెంట వస్తున్న యోహానును చూసి "ప్రభువా, ఇతని సంగతి ఏమగునని' ఆయనతో అన్నాడు. అందుకాయన 'నేను వచ్చువరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు' అన్నాడు. మనం కూడా చాలాసార్లు ఇతరులతో పోల్చుకుంటూ నాకు కష్టం, రోగం వచ్చింది. మరి వారికి రాలేదేంటి అని అనుకుంటాం. ఎవరి విషయంలో దేవుని చిత్తం ఎలాగుందో దానిని ఆయన నెరవేరుస్తాడు. మన కర్తవ్యం ఎంతసేపూ ఇతరులతో పోల్చుకోకుండా ఆయనను వెంబడించడమే. ఆయనను ప్రేమించి, త్యాగమనస్సుతో ఆయనను వెంబడించడానికి ప్రభువు మనకందరికీ సహాయపడును గాక!

27. రూపాంతరం

మత్తయి 17:1-9 - "ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు - ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. కిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను. ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టి - లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా - మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకూడదని యేసు వారికాజ్ఞాపించెను.”

ఇక్కడ జరిగిన అద్భుతం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఎవరో, ఆయన మహిమ ఎంత గొప్పదో చూడగలం. ఆయన తన శిష్యుల యెదుట రూపాంతరం చెందాడు. ఆయన ముఖం సూర్యునివలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి. పాత నిబంధనలోని భక్తులైన మోషే, ఏలీయాలు వచ్చి ఆయనతో ఆయన సిలువపై పొందబోయే మరణాన్ని గూర్చి మాట్లాడారు. ఈయనే దేవుని కుమారుడని దేవుని స్వరం శిష్యులు విన్నారు. ఎంత స్పష్టంగా యేసు ప్రభువు మహిమ బయలు పరచబడిందో గదా! మానవుడిగా పుట్టిన యేసుప్రభువు సామాన్య మానవుడు కాదు. ఆయన మానవాకారం దాల్చిన దేవుడు. ఆయనను గూర్చి బైబిల్ లో ఇలా వ్రాయబడి ఉంది, “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యున్నాడు” (హెబ్రీ 1:3). "ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడై యున్నాడు” (కొలస్సీ 1:15). “దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది” (కొలస్సీ 2:9). ఈ విషయాన్ని శిష్యులు గ్రహించాలనే ఆయన వారి యెదుట రూపాంతరం చెందాడు. ఆయన ముఖం సూర్యునివలె ప్రకాశించింది. ఆయన నిజంగానే నీతిసూర్యుడు. ఆయన పుట్టుకకు 400 సంవత్సరాల క్రితమే మలాకీ ప్రవక్త ఇలా ప్రవచించాడు, “నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ జేయును” (మలాకీ 4:2). “ఆయన మహిమా ప్రభావములు గలవాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడైయున్నాడు” (1తిమోతి 6:16).

రూపాంతరం చెందడానికి ప్రభువు ఒక ఎత్తయిన కొండమీదికి తన శిష్యులలో అతి సన్నిహితులైన ముగ్గురిని ఏకాంతంగా తీసుకు వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను అను ఈ శిష్యులు పండ్రెండుమంది శిష్యులలో కూడా ప్రభువుకు అత్యంత సన్నిహితంగా, సమీపంగా ఉండేవారు. అందుకే ప్రాముఖ్యమైన సందర్భాలలో ప్రభువుతో పాటు వారు ఉండగలిగారు. యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు ఆయన ఈ ముగ్గురు శిష్యులనే తనతోపాటు గదిలోనికి తీసుకువెళ్ళి, వారి యెదుట ఆ పాపను బ్రతికించాడు. గెత్సెమనే తోటలో కూడా ఈ ముగ్గురు శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళి దుఃఖపడడానికి, చింతాక్రాంతుడవడానికి మొదలు పెట్టాడు. ఈ విధంగా ప్రభువుతో వారు సన్నిహితంగా ఉండడంవల్ల ఇటువంటి ఆధిక్యత వారికి కలిగింది. మనం కూడా ప్రభువుకు మనకు మధ్య ఏ పాపం అడ్డు రాకుండా ఆయనతో సన్నిహితంగా ఉండడానికి ఆశిద్దాం. చాలామంది దేవునిని దూర దూరంగా, అంటీ అంటనట్టు వెంబడిస్తూ ఉంటారు. కాని ఆయనతో అన్యోన్యంగా ఉండడం ఎంతో గొప్ప భాగ్యం కదా!

ప్రభువు ఆయనతో సన్నిహితంగా ఉండే ఆ ముగ్గురు శిష్యులను ఎత్తయిన ఒక కొండమీదికి ఏకాంతంగా తీసుకువెళ్ళి వారి యెదుట రూపాంతరం చెందాడు. ప్రభువు మహిమను చూడాలి అంటే ఆయనతో ఏకాంతంగా గడపాలి. దినచర్యలలో మునిగిపోయి, ఐహిక విచారాలలో ఉంటే దేవునితో సహవాసాన్ని అనుభవించలేము కదా! అందుకే ఏకాంత ప్రార్థనను ప్రాముఖ్యంగా ఎంచాలి. ప్రశాంతంగా ఉండే ఉదయకాలం ఏకాంతంగా దేవునితో గడపడానికి మంచి అనుకూల సమయం. ప్రభువుతో ఏకాంతంగా గడిపేవారే భక్తిలో ఉన్నత శిఖరాలకు ఎదగగలరు. పాఠకులూ! ఈ రోజు నుండి ప్రభువుతో ఏకాంతంగా ప్రార్థనలో గడపడానికి తీర్మానించుకుంటారా?

ప్రభువు వారిని ఎత్తయిన ఒక కొండమీదికి తీసుకువెళ్ళాడు. ఇక్కడే వారు ఆయన మహిమను చూశారు. లోక ఆశలకు, భ్రమలకు, ఆకర్షణలకు దూరంగా పైనున్నవాటిని వెదకుతూ ఉంటేనే ప్రభువుకు దగ్గరగా ఉండగలం. మోషే, ఏలీయాలు దిగివచ్చి ప్రభువుతో ఆయన పొందబోయే సిలువ మరణాన్ని గూర్చి మాట్లాడారు. మోషే ధర్మశాస్త్రానికీ, ఏలీయా ప్రవక్తలకూ ప్రతినిధులుగా ఉన్నారు. వారు ఇరువురూ యేసుక్రీస్తు గురించి ముందుగానే ప్రవచించారు. యూదులు చాలామంది ప్రభువు ధర్మశాస్త్రం ప్రవక్తలు ప్రవచించిన మెస్సీయ కాదని, ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడని ఆయనను నిరాకరించారు. అలాంటి యూదులు కూడా గ్రహించడానికి మోషే, ఏలీయాలు దిగివచ్చి ప్రభువుతో మాట్లాడారు. పాత నిబంధన గ్రంథంలోని మెస్సీయను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తే. పేతురు - ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకిష్టమైతే నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి మూడు పర్ణశాలలు కడతాను అన్నాడు. పేతురు రూపాంతరం చెందిన ప్రభువుతోను, మోషే, ఏలీయాలతోనూ ఉండిపోవడమే మంచిది అనుకున్నాడు. వారున్న కొండ క్రింద జనసమూహం ప్రభువు కోసం ఎదురుచూస్తుంటే ప్రభువుకు ఎంతో పరిచర్య ఉండగా కొండమీద ఉండిపోవడం మంచిది అన్నాడు. చిన్నపిల్లలు బంధువుల ఇంటికి వెళ్ళినపుడు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. కాని అది సాధ్యం కాదుకదా. మనం కూడా చాలాసార్లు ఎప్పుడూ పగలే ఉంటే బాగుంటుందని, ఏ భారాలు, బాధ్యతలు లేకుండా ప్రతిక్షణం హాయిగా ఉంటే బాగుంటుదని తలుస్తుంటాము. బాధ్యతలు, మన కర్తవ్యాలు మరువకూడదని పాఠం నేర్చుకోగలం. పేతురు చేసిన మరొక పొరపాటు మోషే, ఏలీయాలను యేసుప్రభువుతో సమానంగా ఎంచాడు.

చాలామంది మంచి దైవ సేవకులను, బాగా వాక్యం చెప్పేవారిని ప్రభువుతో సమానంగా గౌరవిస్తూ ఉంటారు. దేవుడంతటి వారు అని మనుషులను గూర్చి అంటూ ఉంటారు. మరికొంతమంది ప్రభువు వాక్యం కంటే బోధకుల స్వంత బోధలను, ప్రమాణాలను అంగీకరించి వాటినే అనుసరిస్తూ ఉంటారు. ఇది తప్పు. ప్రభువు ప్రభువే. మనుష్యులు ఎంతటి వారైనా మనుష్యులే. ప్రభువుతో ఎవరినీ సమానం చేయకూడదు. పేతురు ఇంకా మాట్లాడుతుండగానే ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని 'ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి' అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టింది. పేతురు మాటలను అడ్డుకుంటూ అతడు ఇంకా మాట్లాడుతుండగానే దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తే దేవుని కుమారుడని వారికి తెలుపుతూ, ఈయన మాట వినుడని దేవుడు చెప్పాడు. పేతురు చెప్పినటు ప్రభువు విని కొండమీద పర్ణశాలలో ఉండిపోవడం కాదు. ప్రభువు చెప్పినట్లు పేతురును, మానవులు అంతా వినాలనేదే తండ్రి అయిన దేవుని ఉద్దేశం. చాలామంది ప్రభువుకు సలహాలు ఇస్తూ ఉంటారు. దేవా, అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని ఆయనకే బోధిస్తూ ఉంటారు. కాని జ్ఞానంగా ప్రభువు మాట వినుటయే శ్రేష్ఠం. ఆయన మాట వినడం అంటే కేవలం చెవులతో వాక్యం వినడమే కాదు, ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయన మాటకు లోబడాలి. తల్లిదండ్రులు మా అబ్బాయి మా మాట వినడం లేదు అంటూ ఉంటారు. అంటే అర్థం వారి మాటకు అతడు లోబడుట లేదు అనే కదా! యాకోబు 1:22లో ఇలా ఉంది, “మీరు వినువారు మాత్రమే అయి యుండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్యప్రకారము ప్రవర్తించువారై యుండుడి." ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొని ఆ మేఘములో నుండి దేవుని స్వరము వారికి వినబడినప్పుడు వారు మిక్కిలి భయపడి బోర్లపడ్డారు. ప్రభువు మహిమను చూసిన భక్తులందరూ సాధారణంగా ఇదే రీతిలో స్పందించారు. ప్రకటన 1:18లో ఉన్నట్లు పరలోక దర్శనము పొంది ప్రభువు మహిమను చూసిన యోహాను చచ్చినవానివలే ఆయన పాదాల యొద్ద పడ్డాడు. దేవుని ప్రభావ దర్శనాన్ని పొందిన యెహెజ్కేలు ప్రవక్త కూడా సాగిలపడ్డాడు. యెషయా ప్రవక్త కూడా దేవుని ప్రభావాన్ని చూసి, “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని” అనుకొన్నాడు (యెషయా 6:5). దేవుని గూర్చి ఎక్కువగా తెలిసినవారు ఆయన యెదుట తగ్గించుకుంటారే గాని తమ భక్తిని బట్టి గానీ, తమకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి గానీ అతిశయించరు. అతిశయించేవారు దేవుని ప్రత్యక్షత సరిగా పొందనివారే. ప్రభావ మహాత్మ్యములు కలిగిన భీకరుడైన దేవుని యెదుట సాగిలపడాలి. పాఠకులూ, ప్రభువు బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై ఉండేలా దేవుడు మనకు సహాయము చేయునుగాక!

28. ప్రధాని కుమారుడు బాగుపడుట

యోహాను 4:46-53 - “తాను నీళ్ళు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని - ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోజు యుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆ యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయన వచ్చి అతని స్వసపరచవలెనని వేడుకొనెను. యేసు - సూచక క్రియలను మహాత్కార్యములు చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ పని - ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు - నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి యున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింక వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినపుడు వారు - నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రి తెలుసుకొనెను. కనుక అతడును, అతని ఇంటివారందరును నమ్మిరి.”

అద్భుతమైన శక్తి, ఆశ్చర్యమైన ప్రేమ

మన ప్రభువు చేసిన ఈ అద్భుతంలో ఆయన అద్భుత శక్తినీ, ఆశ్చర్యకరమైన ప్రేమనూ చూడగలం. దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంగా కపెర్నహూములో జ్వరంతో చావసిద్ధంగా ఉన్న ప్రధాని కుమారుని కానా అను ఊరిలో నుండి ప్రభువు స్వస్థపరిచాడు. అంత దూరంలో ఉన్న రోగిని మాటతో స్వస్థపరచి, బ్రతికించాడు. ఇందులో ప్రభువు మహా శక్తి ప్రత్యక్షమవుతున్నది. మన ప్రభువు మహాత్మ్యము గలవాడు. ఆయన కార్యాలకు సాటియైన కార్యాలు లేవు. ప్రభువు చేసిన ఈ అద్భుతంలో ఆయన అపరిమితమైన దయను, ప్రేమను కూడా చూడగలం. ప్రధాని ఆయన దగ్గరకు వచ్చి తన కుమారుని బ్రతికించుమని వేడుకొన్నప్పుడు ఆయన ఆ బిడ్డను ఉచితంగా సంపూర్ణంగా వెంటనే స్వస్థపరచి బ్రతికించాడు. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. జాలి, కనికరాలతో నిండి ఉన్నవాడు. ఆయనవలె ప్రేమ కలిగి ఉచితంగా, అద్భుతంగా మేలుచేసే నామం మరొకటి లేదు. మన వాక్య భాగంలో గలిలయుల అవిశ్వాసాన్ని ప్రభువు గద్దించాడు. సూచక క్రియలను, మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు అన్నాడు. ఈ 4వ అధ్యాయంలోనే ఆయన సమరయుల ప్రాంతంలో రెండు దినాలుండి ఏ అద్భుతం చేయకుండానే అనేకమందిని రక్షించాడు. సమరయ స్త్రీ జీవితాన్ని మార్చి ఆ ఊరి వారందరిని తనవైపు ఆకర్షించుకున్నాడు. సమరయులు సూచక క్రియలను చూడక పోయినప్పటికీ ప్రభువు నిజముగా లోక రక్షకుడని తెలిసికొని ఆయనయందు విశ్వాసముంచారు. అక్కడినుండి తన స్వదేశమైన గలిలయకు వెళ్ళినపుడు అక్కడివారైన తన ప్రజలు యెరూషలేములో అద్భుతకార్యాలు చూడాలనీ, అనుభవించాలనీ వాటి కోసమే ఆయనను చేర్చుకున్నారు గానీ, ఆయనను మెస్సీయగా, రక్షకునిగా చేర్చుకో లేదు. అందుకే ప్రభువు అతనితో 'సూచక క్రియలు, మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మర'ని అన్నాడు. అద్భుతాలు చేస్తేనే ప్రభువును నమ్మితే అది నిజమైన విశ్వాసం కాదు. ఆయన అద్భుతాలు చేయగలడు. అయితే ఆయన అద్భుతాలను చేస్తేనే ఆయనను నమ్మడం సరికాదు. ఆయన దేవుడు, రక్షకుడు గనుక ఆయనను నమ్మాల్సిందే.

నిజమైన విశ్వాసం

షడ్రకు, మేషాకు, అబెద్నెగో అనే యౌవనులు తాము సేవిస్తున్న దేవుడు మండుతున్న వేడిమిగల అగ్నిగుండములో నుండి తమ్మును తప్పించి, రక్షించడానికి శక్తిమంతుడని, రాజు వశమున పడకుండా వారిని రక్షిస్తాడని, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా తాము దేవతలను పూజింపమనీ రాజు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనీ ప్రతిజ్ఞ చేశారు. ఇదే నిజమైన విశ్వాసం. ప్రభువు స్వస్థ పరిచినా, స్వస్థపరచకపోయినా, అభివృద్ధిపరచినా, అభివృద్ధిపరచకపోయినా ఆయన దేవుడే. కాబట్టి అన్ని పరిస్థితుల్లోనూ ఆయనను విశ్వసించడమే జ్ఞానం. చాలామంది ప్రభువు స్వస్థపరిస్తేనే ఆయనను నమ్ముతారు. అలా కాకుండా ప్రభువు మేలు చేసినా, చేయకపోయినా ఆయన దేవుడు గనుక ఆయనను నమ్మాలి. మన విశ్వాసం కేవలం సూచక క్రియల మీద, అద్భుతాల మీదే ఆధారపడకూడదు. భక్తిహీనులు ఆయనను నమ్మడానికి ఎప్పుడూ సూచక క్రియలను కోరతారు. మత్తయి 27:41,42లో ఇలా ఉంది, “శాస్త్రులును, పెద్దలును, ప్రధాన యాజకులును కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను. తన్ను తానే రక్షించుకొన లేడు. ఇశ్రాయేలు రాజు కదా? ఇప్పుడు సిలువ మీదనుండి దిగిన యెడల వానిని నమ్ముదుము.” సిలువ మీదనుండి దిగడం ఆయనకేమీ కష్టం కాదు. ఒకవేళ ఆయన అలా దిగినా వారు ఆయన్ను నమ్మేవారు కాదు. ఆయన మరణించి తిరిగి బ్రతికినా వారు ఆయన్ను నమ్మలేదు కదా. 'ఆయన వారి యెదుట అన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి' అని యోహాను 12:37లో చూడగలం. మన విశ్వాసం సూచక క్రియల మీదే ఆధారపడకూడదని సమరయుల వలె ఆయన వాక్యం విని ఆయనలో విశ్వాస ముంచాలని పాఠం నేర్చుకుంటున్నాం.

వినుట, విశ్వసించుట, ప్రార్థించుట

కపెర్నహూములోని ప్రధాని ప్రభువు గురించి విని, ఆయన వద్దకు వెళ్ళి తన యింటికి వచ్చి తన కుమారుని బ్రతికించాలని వేడుకున్నాడు. ప్రభువు ద్వారా మేలు పొందాలంటే ఆయన వాక్యం విని, ఆయనయందు విశ్వాసం ఉంచి, ఆయన సన్నిధికి, ఆయన భక్తిలోనికి వచ్చి ఆయనను ప్రార్థించాలి. ప్రధాని పదే పదే ఆయను వేడు కున్నాడు. మనం యేసుకు అనునిత్యం ప్రార్థించి మేలు పొందగలం. ప్రభువు ఆ ప్రధానితో - నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగా ప్రభువు మాట అతడు నమ్మి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతని కుమారుడు బ్రతికాడు. తాను కోరినట్టు ప్రభువు తన ఇంటికి వచ్చి బిడ్డను స్వస్థపరచకపోయినా, ప్రభువు చిత్తాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన మాటను అంగీకరించి నమ్మి వెళ్ళిపోయాడు. బిడ్డ బ్రతికాడు. మనం కూడా మనకు నచ్చిన మార్గంలో ప్రభువు చేయాలని పట్టుపట్టకుండా ప్రభువు చిత్తాన్ని అంగీకరించాలి. ఆయన మాటను సంశయం లేకుండా పూర్తిగా నమ్మాలి. ప్రభువు చెప్పిన సమయంలోనే పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లవాడు స్వస్థపడ్డాడని ప్రధాని, అతని ఇంటివారు తెలుసుకొని, అతడును, అతని ఇంటివారందరూ ప్రభువును నమ్మారు.

కుటుంబ సమేతమైన విశ్వాసం

ప్రభువునందు విశ్వాసం వ్యక్తిగత విషయమైనప్పటికీ కుటుంబ సమేతంగా అందరూ ఆయనను నమ్మడం అత్యవసరం. చాలా కుటుంబాలలో ఎవరో ఒకరే ప్రభువును నమ్మి ఉంటారు. ఇంటిలో ఎవరో ఒకరు అన్నం తింటూ, ఊపిరి పీల్చుకుంటే సరిపోదు కదా. అందరికీ ఆహారం, ఊపిరి ఎలా అవసరమో, దేవుడు, ఆయనిచ్చే ఆత్మ రక్షణ కూడా అందరికీ అవసరం. అపొ.కా. 16వ అధ్యాయంలో లూదియ, చెరసాల నాయకుడు వారి వారి ఇంటి వారందరితో ప్రభువునందు విశ్వాసముంచి బాప్తిస్మం తీసుకున్నారు. కుటుంబమంతా ప్రభువును నమ్మి బాప్తిస్మం తీసుకోవడం ఎంత ధన్యత! ఈ లోకంలో కలిసి ఉండడమే కాదు, ఒక్కరూ నశించకుండా పరలోకంలో కూడా కుటుంబికులంతా ఉండడం గొప్ప భాగ్యం. మీ కుటుంబమంతా ప్రభువును నమ్మారా? బాప్తిస్మం తీసుకున్నారా? లేకపోతే మొదట మీ ఇంటి వారి రక్షణకై ఉపవాస ప్రార్థనలు చేయండి. వారికి ప్రేమతో సువార్త చెప్పండి. అందరూ రక్షింపబడాలని కోరండి. ప్రభువు మీ కుటుంబమంతటినీ రక్షించును గాక!

 

Add comment

Security code
Refresh

Comments  

# RE: యేసుక్రీస్తు చేసిన అద్భుతాలుGnana 2021-05-10 18:52
Good works
Reply
# Super studayT.vishnu vardhan 2021-11-26 10:25
Good
Reply