బైబిల్

రచయిత: యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 21 నిమిషాలు
ఆడియో

Article Release 66 books min

66 పుస్తకాలను మాత్రమే 'దేవుని వాక్యమని' ఎందుకు అంటున్నామో మీరెప్పుడైనా ఆలోచించారా?

ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే రోమన్ కాథలిక్ చర్చివాళ్ళు ఈ 66 పుస్తకాలతో పాటు కొన్ని అప్రమాణిక (అపొక్రిఫల్) పుస్తకాలు కూడా దేవుని చేత ప్రేరేపించబడిన లేఖనాలే అని నమ్ముతారు. అపొక్రిఫల్ పుస్తకాలు పాత నిబంధన కాలానికీ, కొత్త నిబంధన కాలానికీ మధ్యలో రాయబడ్డాయి. రోమన్ కాథలిక్స్ పరిస్థితి ఇలాగుంటే మోర్మోన్స్ ఏమో 'ది బుక్ అఫ్ మోర్మాన్', 'ది డాక్ట్రిన్స్ అండ్ కవెనంట్స్', 'ది పెర్ల్ అఫ్ గ్రేట్ ప్రైస్' వంటి పుస్తకాలను బైబిల్ తో జత చేస్తూ, అవి కూడా దేవుని లేఖనాలే అని విశ్వసిస్తారు. మరికొందరేమో బైబిల్ లో ఏ పుస్తకాలుండాలో కాన్స్టాంటిన్ (Constantine) చక్రవర్తి వంటివారు నిర్ణయించారు అని చెప్తారు.

ఇలా ఒక్కో గుంపువారు ఒక్కో అభిప్రాయం కలిగి ఉన్న నేపథ్యంలో ఈ 66 పుస్తకాలు మాత్రమే సంపూర్ణమైన దేవుని లేఖనాలు అని మనం ఎలా చెప్పగలం? అపొక్రిఫల్ పుస్తకాలు ఎందుకు లేఖనాలు కావు? ఏవి లేఖానాలో, ఏవి కావో ఎవరు నిర్ణయిస్తారు? అసలు మనం అనుదినం ధ్యానిస్తూ ఉన్న ఈ బైబిల్ గ్రంథము సంపూర్ణంగా దేవుని వాక్యమేనా? మనకు ఆ విషయం ఎలా తెలుస్తుంది?

ఈ సంగతులను తెలుసుకోవడానికి మనం కొన్ని వారాలపాటు కదలకుండా ఒక దగ్గర కూర్చొని ఈ 'బైబిల్ కానోనిసిటీ' అనే సిద్ధాంతం గురించి, బైబిల్ లో ఉన్న ఆధారాలను, చారిత్రక వివరాలను పరిశీలించినట్లైతే పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు సహాయపడే పుస్తకాలు, వనరులు కావలసినన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ వ్యాసంలో మనం ఏం చూస్తాం అంటే చాలా క్లుప్తంగా బైబిల్ ని ఆధారం చేసుకొని పైన చదివిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

లేఖన ప్రమాణాన్ని రోమన్ కాథలిక్ చర్చి నిర్ణయించలేదు. కాన్స్టాంటిన్ (Constantine) చక్రవర్తి, జోసెఫ్ స్మిత్ వంటివారు, సంఘ పెద్దలు, పాలకులు, గొప్ప వేదాంతవేత్తలు, అటువంటి వారెవరూ నిర్ణయించలేదు. లేఖన ప్రమాణము (బైబిల్ కానోనిసిటీ) అన్న సిద్ధాంతము కేవలం మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలపైన స్థాపించబడిన సిద్ధాంతము. ఏవి లేఖానాలో నిర్ణయించే అధికారం కేవలం సంఘానికి ప్రభువైనటువంటి క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆయన అధికారంపైనే ఈ సిద్ధాంతం ఆధారపడి ఉంది. ఒకవేళ మనం ఆయనయందు విశ్వాసం ఉంచితే, ఆయన మాటలయందు కూడా విశ్వాసం ఉంచుతాము. అప్పుడు ఆయన అధికారానికీ, మాటకీ లోబడతాము.

ముందుగా పాత నిబంధన గురించి చూద్దాము

యేసు క్రీస్తే పాత నిబంధన లేఖన ప్రమాణాన్ని ధృవీకరించారు.

యేసు క్రీస్తు జీవించిన కాలంలో యూదుల గ్రంథాలు ఏవైతే వాడుకలో ఉన్నాయో వాటిని లేఖనాలుగా ఆయన ధృవీకరించారు. అవే మన బైబిల్ లోని పాత నిబంధన గ్రంథాలు. లెక్కకు 39 ఉంటాయి.

ఒకానొక సందర్భంలో సంపూర్ణ పాత నిబంధన లేఖన సముదాయం గురించి యేసు క్రీస్తు మాట్లాడుతూ ఇలా అన్నాడు.

మత్తయి 5: 17 - 18 -

"17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. 18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ఇలా యేసు పరిచర్య చేసిన కాలం అంతా పాత నిబంధన గ్రంథాలన్నీ దైవప్రేరిత లేఖనాలని అనేక విధాలుగా ధృవీకరించినట్లు సువార్త గ్రంథాల్లో చదువుతాము.

 

# 1. చారిత్రాత్మకంగా, పాత నిబంధన లేఖనాలు నమ్మదగినవి.

ఈ విషయాన్ని అనేక సంధర్భాలలో యేసు క్రీస్తు ధృవీకరించారు. మత్తయి 10:15 ; 19:3-5 ; 12:40; 24:38-39

అలాగే ప్రవచనాల విషయంలో కూడా పాత నిబంధన లేఖనాలు ఖచ్చితమైనవి అని యేసు క్రీస్తు పలుమార్లు ధృవీకరించారు. ఉదాహరణకు -

మత్తయి 26:49-56 -

"49. వెంటనే యేసునొద్దకు వచ్చి - బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. 50. యేసు - చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీదపడి ఆయనను పట్టుకొనిరి. 51. ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. 52. యేసు - నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. 53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? 54. నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. 55. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. 56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి."

 

# 2. సరిపోయినవి, చాలినవి 

పాత నిబంధన లేఖనాలు సరిపోయినవి, చాలినవి అని కూడా యేసు ధృవీకరించారు. ఉదాహరణకు -

లూకా 16: 27-31

"27. అప్పుడతడు - తండ్రీ, ఆలాగైతే నాకయిదుగురు సహోదరులున్నారు. 28. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. 29. అందుకు అబ్రాహాము -వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా 30. అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. 31. అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను."

 

# 3. ఐక్యత

పాత నిబంధన లేఖనాలలో ఎటువంటి వైరుధ్యమూ లేదని, అవన్నీ మంచి సమన్వయాన్నీ, ఐక్యతనూ కలిగి ఉన్నాయని యేసుక్రీస్తు తన మాటలలో తెలియజేశాడు.

లూకా 24: 27,44

"27. మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను."

"44. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను".

 

# 4. దోషరహితమైనవి, పొరబడజాలనివి.

పాత నిబంధన లేఖనాలు చాలినవి, సరిపోయినవి మాత్రమే కాదు, అవి దోషరహితమైనవి అని కూడా యేసు క్రీస్తు ఒక సంధర్భంలో చెప్తాడు. ఉదాహరణకు -

మత్తయి 22:24-29 -

"24. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పెను; 25. మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. 26. రెండవవాడును మూడవవాడును ఏడవవానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. 27. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. 28. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. 29. అందుకు యేసు - లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు."

అంటే మనుషులు పొరబడే అవకాశం ఉంది కానీ లేఖనములు (అనగా పాత నిబంధన లేఖనములు) పొరబడజాలనివి, దోషరహితమైనవి అని యేసు క్రీస్తు ఈ సంధర్భంలో ధృవీకరించాడు.

యోహాను 17:17 -

"17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము."

 

# 5. అధికారము కలిగినవి

మత్తయి 21:13,16,42  -

"13. నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. 16. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి" 42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?"

'వ్రాయబడియున్నది', 'లేఖనములలో ఎన్నడును చదువలేదా', 'ఆ మాట మీరెన్నడు చదువలేదా' - ఇటువంటి మాటలను బట్టి పాత నిబంధన లేఖనాలు అధికారం కలిగినవి అని అర్థం అవుతోంది.

పాత నిబంధన అంతా దేవుని వాక్యమే, పరిశుద్ధ లేఖనాలే అని యేసు ధృవీకరించిన సంధర్భాలు కలవు -

మత్తయి 15: 6 -

"6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు."

మార్కు 7:13 -

"13. మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను."

ఈ వచనాలలో పాత నిబంధన లేఖనాలను ఉద్దేశించి, అవి 'దేవుని వాక్యము' అని యేసు క్రీస్తు ధృవీకరిస్తున్నారు.

రోమన్ కాథలిక్స్ యొక్క అపొక్రిఫల్ పుస్తకాలను మొదటి శతాబ్దపు యూదులు లేఖనాలుగా పరిగణించలేదు. యేసు కూడా వాటిని దేవుని పరిశుద్ధ లేఖనాలుగా పరిగణించలేదు. యూదుల లేఖనాలు మాత్రమే సంపూర్ణమైన పాత నిబంధనగా యేసు క్రీస్తు చేత ధృవీకరించబడ్డాయి. యేసు అపోక్రిఫా పుస్తకాలను అస్సలు ధృవీకరించలేదు సరికదా వాటిలోని విషయాలను ఎప్పుడూ ఉటకించలేదూ, ఎక్కడా ప్రస్తావించనూలేదు. యేసు మాత్రమే కాదు కొత్త నిబంధన గ్రంథకర్తలెవ్వరూ ఈ పుస్తకాల గురించి తమ రచనలలో ప్రస్తావించలేదు.

ఇక కొంతమంది లేవనేత్తే అభ్యంతరం ఏంటి అంటే యూదా పత్రికలో హనోకు పుస్తకాన్ని గురించిన ప్రస్తావన ఉంది కదా అని. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది అపోక్రిఫా పుస్తకాలకు చెందినది కాదు. యూదుల రచనలలో చాలా ప్రసిద్దిగాంచిన పుస్తకం. యూదా ఒక ఉదాహరణ కోసం ఆ పుస్తకం గురించి ప్రస్తావించాడు. ఏదో నాలుగైదు వాక్యాలు ఉటంకించినంత మాత్రాన, లేదా పుస్తకం పేరు తీసుకున్నంత మాత్రాన ఆ పుస్తకమంతా దేవుని చేత ప్రేరేపించబడిన లేఖనం అయిపోతుందా?  కాదు. అలా చూస్తే పౌలు కూడా అపో. కార్య. 17లో అన్యుల కవీశ్వరులు చెప్పిన మాటలను ప్రస్తావిస్తాడు, అంత మాత్రాన ఆ కవీశ్వరులు చెప్పినవన్నీ లేఖనాలని అనుకుందామా? కాదు కదా. ఎంత వరకూ ఉటంకించబడిందో, అంతవరకే దేవుని వాక్యము.

 ప్రొటెస్టెంట్స్ అపొక్రిఫా పుస్తకాలను ఎందుకు అంగీకరించరు? ఎందుకు లేఖనాలుగా పరిగణించరు?

ఎందుకంటే యేసు వాటిని లేఖనాలని ధృవీకరించలేదు కాబట్టి. కనీసం అపొస్తలులైనా వాటి గురించి ప్రస్తావించలేదు. ఆ రచనలు ఉపయోగకరమైనవే అయ్యుండొచ్చు కానీ అంత మాత్రాన ప్రతీ గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా పరిగణించలేము.

సంఘ ప్రారంభ కాలంలోని చాలా మంది సంఘ పితరులు (church fathers) సైతం అపొక్రిఫా గ్రంథాలను ప్రామాణిక గ్రంథాలుగా పరిగణించలేదు. ఇందుకు 5వ శతాబ్దానికి చెందిన జెరోమ్ ఒక మంచి ఉదాహరణ.

 

ఇక కొత్త నిబంధన విషయానికొస్తే

మనం పాత నిబంధనకు అన్వయించిన నియమమే కొత్త నిబంధనకు కూడా వర్తిస్తుంది. యేసు క్రీస్తు యూదుల లేఖనాలను (అంటే పాత నిబంధనను) దేవుని వాఖ్యం అని ధ్రువీకరించడం మాత్రమే కాకుండా తాను కట్టబోయే తన సంఘానికి అవసరమైన అదనపు ప్రత్యక్షతను తన అధికారిక ప్రతినిధులైన అపొస్తలులకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసాడు.

యేసు తాను మరణించే ముందు రోజు, తన శిష్యులతో ఈ సంగతులు చెప్పారు.

యోహాను 14: 25-26 -

"25. నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. 26. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును."

లేఖన ప్రమాణము అన్న సిద్ధాంతానికి చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ వచనంలోని చివరి మాటలు - "నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును." ఎవరు జ్ఞాపకం చేస్తారు అంటే - పరిశుద్ధాత్మ.

చాలా అద్భుతమైన వాగ్దానం ఇది, ఈ వాగ్దానం యొక్క నెరవేర్పే కొత్త నిబంధనలోని మొదటి నాలుగు సువార్త గ్రంథాలు. యేసు క్రీస్తు చేసిన అద్భుత కార్యాలు, స్వస్థతలు, ఆయన బోధ, ప్రసంగాలు మొదలైనవన్నీ ఈ గ్రంథాలలో పొందుపరచబడ్డాయి.

ఇదే సందర్భంలో ఓ రెండు అధ్యాయాల తరువాత యేసు అపొస్తలులతో మాట్లాడుతూ, పరిశుద్దాత్మ ద్వారా వారికి అదనపు ప్రత్యక్షతను కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేసాడు.

యోహాను 16: 12-15 -

"12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. 13. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. 14. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. 15. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని."

కొత్త నిబంధనలోని మిగిలిన గ్రంథాలు లేక పత్రికలే ఆ అదనపు ప్రత్యక్షత. క్రీస్తు ఆత్మ అపొస్తలులను ప్రేరేపించగా దేవుడు వారి ద్వారా సంఘానికి అనుగ్రహించిన సత్య లేఖనాలే కొత్త నిబంధనలోని మిగిలిన గ్రంథాలన్నీ కూడా.

ఈ లోకంలో తనకు సాక్ష్యులుగా ఉండమని యేసు అపొస్తలుల్ని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా క్రీస్తు కొత్త నిబంధనను ముందే ప్రమాణీకరిస్తున్నాడు. పాత నిబంధన ప్రవక్తలు ఎలాగైతే పరిశుద్దాత్మ చేత ప్రేరేపించబడి రాసారో అలాగే క్రీస్తు యొక్క అధికారిక ప్రతినిధులు కూడా పరిశుద్దాత్మ చేత ప్రేరేపించబడి రచించారు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథాలను లేఖనాలుగా, దేవుని వాక్యముగా అంగీకరిస్తున్నాము, హత్తుకుంటున్నాము, వాటికి మాత్రమే లోబడతాము.

ఈ సంగతులన్నీ మనసులో ఉంచుకొని ఈ కొలమానాన్ని కొత్త నిబంధన పుస్తకాలన్నిటికీ వర్తింపజేసే ప్రయత్నం చేద్దాం.

 మత్తయి, యోహాను సువార్తలు - అపొస్తలుల చేత రాయబడినవి.

 మార్కు సువార్త - అపొస్తలుడైన పేతురు యొక్క జ్ఞాపకాల్లోని విషయాలను ఈ గ్రంథంలో పొందుపరిచారు. మార్కు పేతురు యొక్క అపోస్తలీయ అధికారం కింద ఉంటూ ఈ గ్రంథాన్ని రచించాడు.

లూకా సువార్త, అపొస్తలుల కార్యముల గ్రంథము ఎలా రాయబడ్డాయో లూకా సువార్త ప్రారంభ వచనాల్లో చెప్పబడింది.

"2. ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు 3. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట..."

ఈ 'తెలుసుకోవడం' అనేది ఆరంభము నుండి ఆ సంగతులను కన్నులార చూచిన వాక్యసేవకులైనవారి (అపొస్తలులు)" నుండే జరిగింది.

అంత మాత్రమే కాదు లూకా అపొస్తలుడైన పౌలు యొక్క సువార్త ప్రయాణాల్లో అతనికి సహచరుడుగా ఉన్నాడు. అలా లూకా పౌలు యొక్క పర్యవేక్షణలో ఈ గ్రంథాలను రచించడం జరిగింది.

అంతే కాకుండా పౌలు లూకా సువార్తను 'లేఖనము' అని సంబోధించినట్లుగా 1 తిమోతీ 5:18 లో చదువుతాము.

"లేఖనం ఇలా అంటుంది గదా: “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు”. “పనివాడు తన జీతానికి యోగ్యుడు."  (గ్రేస్‌ మినిస్ట్రీస్‌ వారి వాడుక భాష అనువాదం).

ఇక్కడ ఉటంకించిన మాటలు లూకాలో తప్ప (లూకా 10:7 - పనివాడు జీతానికి యోగ్యుడు) ఇంకెక్కడా యథాతథంగా ప్రస్తావించబడలేదు కాబట్టి లూకా రచనలనే పౌలు లేఖనము అంటున్నాడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది లూకా సువార్తతో పాటు లూకా రాసిన అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని కూడా లేఖనము అని ధృవీకరిస్తుంది.

పౌలు రాసిన పత్రికలు - అంటే రోమా పత్రిక నుండీ ఫిలేమోను పత్రిక వరకూ - అపొస్తలుడైన పౌలే రచించాడు.

పౌలు రాసిన పత్రికలు 'పరిశుద్ధ లేఖనాలే' అని పేతురు కూడా ధృవీకరిస్తాడు -

2 పేతురు 3:15-16 -

"15. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు. 16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ............."

హెబ్రీ పత్రిక - గ్రంథకర్త ఎవరన్నది ఖచ్చితంగా తెలీదు కానీ సంఘ చరిత్రలో చాలా మంది పౌలే ఈ గ్రంథాన్ని రచించి ఉండొచ్చని అభిప్రాయపడతారు, విశ్వసిస్తారు. ఒకవేళ పౌలే స్వయంగా ఈ గ్రంథాన్ని రాయనప్పటికీ, ఖచ్చితంగా పౌలు పరిచర్యను చాలా దగ్గరగా చూసినవారెవరో రాశారు అనడానికి ఆ పత్రికలోనే ఆధారాలు ఉన్నాయి. హెబ్రీ 13: 23-25 ప్రకారం హెబ్రీ గ్రంథ కర్త తిమోతీతో సహదాసుడు అని తెలుస్తోంది. అంతే కాకుండా లూకా వలె ఈ గ్రంథకర్త కూడా హెబ్రీ 2:4 లో ఇలా అంటున్నాడు.

"4. .........వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను."

అంటే లూకా లాగానే హెబ్రీ గ్రంథకర్త కూడా ప్రభువు బోధిస్తుండగా వినినవారు అనగా అపొస్తలులైనవారి నుండి సేకరించిన విషయాలనే ఈ పత్రికలో మనకు తెలియజేస్తున్నట్లు అర్థం అవుతోంది. కాబట్టి ఈ పత్రిక అపోస్తలీయ అధికారం కిందనే రాయబడింది.

సాధారణ పత్రికలు

యాకోబు - ఈ పత్రికను అపొస్తలుడైన యాకోబు రాసుండే అవకాశం లేదు, ఎందుకంటే అతను తొలి దినాల్లోనే హతస్సాక్షి అయిపోతాడు (అపో. కార్య. 12:2 ). క్రీస్తు సహోదరుడైన యాకోబే ఈ పత్రికను రాసుండాలి. అతను మొదట్లో యేసే మెస్సీయా అని విశ్వసించనప్పటికీ, ఆ తరువాతి కాలంలో యేసుక్రీస్తును మెస్సీయాగా అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు యెరూషలేము సంఘములో ఒక కీలక నాయుకుడు అవుతాడు. (అపో. కార్య. 12:17 ; 15:13; 21:18). అపొస్తలుల సహవాసంలో ఉంటాడు. అపో. కార్య. 15:29 . "ఈ అవశ్యమైనవాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను." ఈ వచనంలో 'మాకును తోచెను' అని తనని తాను అపొస్తలులతో కలిపి సంభోదిస్తూ చెప్పిన మాటలను బట్టి యాకోబు అపొస్తలుల సహవాసంలో ఉన్నాడనీ, వాళ్ళ పక్షంగా అధికారిక ప్రకటనలు చేశాడనీ అర్థం అవుతోంది. సంఘానికి స్తంభములుగా ఎంచబడిన కేఫా యోహానులతో పాటు యాకోబు కూడా ఒక స్తంభంగా చెప్పబడ్డాడు. (గలతీ 2:9 ). 

మన ప్రభువు సహోదరుడునూ, సంఘానికి స్తంభముగా ఎంచబడినవాడునూ, సంఘ నాయకుడునూ, పునరుత్థానుడైన క్రీస్తును కళ్లారా చూసినవాడునూ (1 కొరింథీ 15:7 ), అపొస్తలులతో సహవాసం కలిగిన వాడునూ అయిన యాకోబు అపోస్తలీయ ఆమోదం కింద, వారి పర్యవేక్షణలో ఈ పత్రికను రాసాడు.

పేతురు, యోహాను పత్రికలు - వీటిని కూడా అపొస్తలులు రాసారని ఆ గ్రంథాల పేర్లు చదివితేనే తెలిసిపోతుంది.

యూదా పత్రిక - ఈ యూదా, తాను అపొస్తలులో ఒకడిని కానని పరోక్షంగా ఒక సంధర్భంలో చెప్తాడు (యూదా 17 ). ఈ పత్రిక యేసుక్రీస్తు సహోదరుడైన యూదా చేత రాయబడింది (యూదా 1 ). అతను తన సహోదరుడైన యాకోబు మరియు ఇతర అపొస్తలుల సహవాసంలో ఉంటూ (అపో. కార్య. 1:12-14 ; 1 కొరింథీ 9:5 ), అపోస్తలీయ అధికారం కింద, అపొస్తలుల పర్యవేక్షణలో ఈ పత్రిక రాయటం జరిగింది.

 

చివరి పుస్తకము ప్రకటన గ్రంథం - అపొస్తలుడైన యోహాను చేత రాయబడింది.

కాబట్టి కొత్త నిబంధనలోని ప్రతి పుస్తకము అపోస్తలీయ అధికారం కింద రాయబడినదే. ఎక్కువ శాతము నేరుగా అపొస్తలులు రచించినవే కాగా మిగిలినవి అపొస్తలుల పరిచర్యలో పాలి భాగస్తులైనవారు అపోస్తలీయ ఆమోదంతో రచించినవి. క్రీస్తు యొక్క అధికారిక ప్రతినిధుల దగ్గరి నుండీ వచ్చినవి కాబట్టి ఈ పుస్తకాలకు మనం లోబడుతున్నాము. వీటికి లోబడటం ద్వారా మన ప్రభువుకే మనం లోబడుతున్నాము.

లేఖన ప్రమాణం ముగించబడింది అని మనం ఎందుకు అంటున్నాం అంటే యేసు క్రీస్తు ఎవరినైతే తనకు అధికార ప్రతినిధులుగా నియమించాడో, వారు జీవించిన కాలం మట్టుకే ఆ ప్రత్యక్షత వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత వారికి వారసులుగా ఎవరైనా నియమించబడతారని గానీ, ఆ వారసుల ద్వారా కూడా కొత్త ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అని గానీ లేఖనాలలో ఎక్కడా ఆధారాలు లేవు. కాబట్టి చివరి అపొస్తలుడి జీవిత కాలం ముగిసే లోపు ఏదైతే ప్రత్యక్షత అనుగ్రహించబడిందో అది మాత్రమే లేఖనము. ఆ తరువాత కొత్త ప్రత్యక్షలు రావడం గానీ, దైవావేశం చేత పుస్తకాలు రాయబడటం గానీ జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇంకా కొత్త ప్రత్యక్షతలు వస్తున్నాయి అనేవారి వాదనని లేఖనాల వెలుగులో తేలిగ్గా కొట్టిపారెయ్యొచ్చు.

 

కాబట్టి ఎందుకు 66 పుస్తకాలు మాత్రమే?

యేసుక్రీస్తు యొక్క అధికారమే, బైబిల్ సంపూర్ణ దేవుని వాక్యము అన్న మన విశ్వాసానికి ఆధారమైయున్నది. కాబట్టి యేసు లేఖనాలుగా ధృవీకరించినవాటిని, ఆయన అధికార ప్రతినిధులైన అపొస్తలుల స్వయంగా రాసినవాటిని, ఇతర భక్తులు అపొస్తలుల ఆమోదంతో, వారి పర్యవేక్షణ కింద రాసినవాటిని మాత్రమే లేఖనాలు అంటున్నాము. అందుకనే 66 పుస్తకాలు మాత్రమే దైవప్రేరిత పరిశుద్ధ లేఖనాలు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.