క్రైస్తవ్యం మరియు చట్టం

రచయిత: కండె ప్రసాదరావు

ఆడియో

 

ఇండియాలో క్రైస్తవ ప్రచారం చేసే హక్కు

కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మైనార్టీలు, ప్రాథమిక హక్కులు, తదితర అంశాలపై సలహాలు ఇచ్చిన అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా, ఏ మతాన్నయినా నమ్మి, ఆచరించి, అభివృద్ధి చేసే స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా మన భారతీయ రాజ్యాంగ డ్రాఫ్టులో ప్రతిపాదించి, తీర్మానం జరిగే క్రమములో “అభివృద్ధి అనేది” క్రైస్తవ సమాజం కొరకు మాత్రమే తల పెట్టినదని ఎత్తిచూపించబడినప్పటికీ దానిని ఆమోదింపజేసిన సర్దార్ వల్లభాయి పటేల్ గారికి అంకితం.

ముందుమాట !

భారత్ తన మత స్వాతంత్య్రము మరియు పరమత సహనం కారణంగా ఎంతగానో ప్రశంసించబడుతోంది. శతాబ్దాల ఈ పరంపరను కాపాడుతూ, ఏ మతాన్నయినా నమ్మి, ఆచరించి, అభివృద్ధి చేసే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది.

అయితే, మత అభివృద్ధికి భారత రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కు కొత్త విశ్వాసులను తయారు చేసే హక్కని చాలా మందికి అర్థం కావటం లేదు. క్రైస్తవేతరులను క్రైస్తవులుగా మార్చే యేసు క్రీస్తు సందేశం విని వారు హింసాత్మకంగా ప్రతిఘటిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ ప్రాంతంలో సంజీవయ్య అనే సువార్తికుడు హత్యకు గురిచేయబడడం ఇలాంటి అక్కసుకు ఒక ఉదాహరణ.

భారత రాజ్యాంగం కల్పించిన మతాభివృద్ధి హక్కు కొత్త విశ్వాసులను తయారు చేసే హక్కని అందరు గుర్తెరిగేలా చేయటమే ఈ చిరుపుస్తక ఉద్దేశం. ప్రతులు అవసరమున్న స్థలాలకు పంపడమైనది. ఇండోర్ లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన మేడం సావిత్రిగారు యేసు క్రీస్తును నమ్మి, తన వద్దకు ప్రార్థనలకు వచ్చే తన పనివారిని మతమార్పిడి చేస్తున్నారని కొందరు వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసారు. "ది హిందూ” దినపత్రికలో విజయవాడ ఎడిషన్లో ఈ వార్త ప్రచురించబడింది.

అప్పుడు నేను ఇండోర్ జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఈ పుస్తక ప్రతులను పంపించి, భారత రాజ్యాంగం కల్పించిన మతాభివృద్ధి హక్కు కొత్త విశ్వాసులను తయారు చేసే హక్కని సగౌరవంగా వారికి విన్నవించే ప్రయత్నం చేసాను. ఆ ఫిర్యాదు కొట్టివేయబడింది.

సర్దార్ వల్లభాయి పటేల్ గారిని సగౌరవంగా సాదరంగా జ్ఞాపకం చేసుకునే క్రైస్తవులు, న్యూయార్క్ నగరంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి రెట్టింపు నిడివితో నర్మదా నదితీరాన నిర్మించబడిన ఆయన స్మారక విగ్రహాన్ని బట్టి హర్షిస్తున్నారు.

-కండె ప్రసాద రావు.

ఇండియాలో క్రైస్తవ ప్రచారం చేసే హక్కు

భారత రాజ్యాంగ పీఠిక 26-01-1950 అమలులోనికి వచ్చినప్పుడు అది భారత దేశాన్ని ఒక లౌకిక దేశంగా ప్రకటించలేదు. ఐనప్పటికీ రాజ్యాంగంలోని అంశాలు లౌకికమైనవిగానే ఉండినవి.

ఏ మతాన్నయినా నమ్మి, ఆచరించి, అభివృద్ధి చేసే హక్కును ప్రతి భారత పౌరునికి ప్రాథమిక హక్కుగా కల్పించటం, భారత గణతంత్రం లౌకిక దేశమే అని బిగ్గరగా, బహుస్పష్టంగా తెలియచెప్పింది.

26-01-1947వ తేదీన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు మైనార్టీలు, ప్రాథమిక హక్కులు తదితర అంశాలపై సూచనలు ఇచ్చే ఒక అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయటమయ్యింది. ఈ కమిటీకి చైర్మన్‌గా సర్దార్ వల్లభాయి పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో మైనార్టీలకు సంబంధించి ఒక సబ్ కమిటీ మరియు ప్రాథమిక హక్కులకు సంబంధించి మరొక కమిటీని సిద్ధం చేసారు.

ప్రాథమిక హక్కులకు సంబంధించిన తన నివేదికలో, మత స్వేచ్ఛకు సంబంధించి అడ్వయిజరీ కమిటీ ఈ క్రింది ప్రతిపాదనలు చేసింది :

13. శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి, ఈ అధ్యాయంలోని ఇతర ప్రతిపాదనలకు విఘాతం కలగనంత మేరకు ఏ మతాన్నయినా నమ్మి, ఆచరించి, అభివృద్ధి చేసుకునే మనస్సాక్షికి సంబంధించిన స్వేచ్ఛ ప్రజలందరికి కల్పించబడిన హక్కు.

17. బలవంతంగా లేక అక్రమ ప్రభావాల ద్వారా ఒక మతం నుండి మరో మతంలోనికి మార్చటానికి చట్టం ఆమోదించదు.

మత వ్యాప్తి చేసుకునే క్రైస్తవం వంటి మతాలకు తమ మత విశ్వాసాలు ప్రచారం చేసుకునే అనుమతి ఉండాలనే ఉద్దేశంతో, మతాభివృద్ధి హక్కును అడ్వయిజరీ కమిటీలో సభ్యులుగా ఉన్న శ్రీ యం.రుత్నస్వామి గారి సూచన మేరకు 13వ ప్రతిపాదనలో కలపబడింది.

13 మరియు 17వ ప్రతిపాదనలను సర్దార్ వల్లభాయి పటేల్ 1-5-1947వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టారు.

శాసనసభ 13వ ప్రతిపాదనను ఆమోదిస్తూ, “ఈ అధ్యాయంలోని ఇతర ప్రతిపాదనలకు” అనే మాటను “ఈ భాగంలోని ఇతర ప్రతిపాదనలకు” అని సవరణ చేసింది.

శాసనసభ 13వ ప్రతిపాదనను డ్రాఫ్టింగ్ కమిటీ ముందు పెట్టింది. డ్రాఫ్టింగ్ కమిటీ దానిని స్వల్ప సవరణలతో, పదాల కూర్పులో కొన్ని మార్పులతో 19(1)వ ప్రతిపాదనగా రాజ్యాంగ డ్రాప్టులో ఈ క్రింది విధంగా చేర్చింది:

“శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి, ఈ భాగంలోని ఇతర ప్రతిపాదనలకు విఘాతం కలగనంత వరకు, మనస్సాక్షికి సంబంధించిన స్వాతంత్య్రం మరియు స్వేచ్ఛగా ఏ మతాన్నయినా నమ్మి, ఆచరించి, అభివృద్ధి చేసుకునే హక్కు, ప్రజలందరికి సమానంగా కల్పించబడింది”.

రాజ్యాంగ డ్రాఫ్టులో ఉన్న 19(1)వ ప్రతిపాదన మీద 3 మరియు 6 డిసెంబర్ 1948 తేదీలలో శాసనసభ చర్చించింది.

శాసనసభ సభ్యులైన తాజ్ ముల్ హుస్సేన్ (బిహార్), ప్రొఫెసర్ కె.టి. షా (బిహార్), శ్రీ గణ్ శ్యాం సింగ్ గుప్తా (సి.పి. & బెరార్), శ్రీ లోకనాథ్ మిశ్రా (ఒరిస్సా), శ్రీ హెచ్.వి. కామత్ (సి.పి. & బెరార్) మరియు శ్రీ రోహిణి కుమార్ చౌదరి (అస్సాం), మతాభివృద్ధి స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో భాగంగా గుర్తించాలనే ప్రతిపాదనను అంగీకరించకపోయినప్పటికీ, మిగిలిన సభ్యులందరూ ఆ ప్రతిపాదనను సమర్ధించారు.

6-12-1948 రోజున ఆర్టికల్ 19(1) మీద జరిగిన చర్చలో మాట్లాడుతూ శ్రీ ఎల్. క్రిష్ణస్వామి భారతి (మద్రాస్) గారు ఇలా అన్నారు: “మతాభివృద్ధి" అనే మాట ఉండాల్సిందే. "మతాభివృద్ధి” అనే మాట క్రైస్తవ సమాజం కొరకే ఉద్దేశించబడిందన్నది అందరికి విధితమే. తమ మతబోధలను వ్యాప్తి చేయటంలో క్రైస్తవులు న్యాయసమ్మతమైన హద్దులను మీరకుండా ఎంతో సబబుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పదం ఒకేఒక మతానికి, అనగా క్రైస్తవ సమాజానికి మాత్రమే పరిమితమన్నది సామాన్య భావన. ఈ అంశం దశలవారీగా మైనార్టీ కమిటీలో కూడా కూలంకుషంగా  చర్చించబడిందని సభకు జ్ఞాపకం చేస్తున్నాను. రిజర్వేషన్లు కాని ప్రత్యేక ఆధిక్యతలు కాని కోరకుండా, సమసమాజంతో మిళితమవ్వటానికి సంసిద్ధంగా ఉన్న ఈ గొప్ప క్రైస్తవ సమాజానికి, ఇండియాలోని మిగతా మతాలకులాగే తమ మతాన్ని వ్యాప్తి చేసుకునే అనుమతి ఇవ్వాలని వారు తీర్మానం చేశారు. కాబట్టి నేను ఈ ప్రతిపాదనలో ఉన్న “మతాభివృద్ధి” అనే మాటను బలంగా సమర్ధిస్తున్నాను.”

క్రైస్తవులు తమకు రిజర్వేషన్లు వద్దన్నది శాసనసభలో మాత్రమే. ముస్లింలు మరియు సిక్కులు డిమాండ్ చేసి శాసనసభలో తమకు రిజర్వేషన్లు సంపాదించుకున్నారు.

కాని క్రైస్తవులు అడగలేదు కాబట్టి వారికి శాసనసభలో రిజర్వేషన్ దక్కలేదు. అయితే క్రైస్తవులు షెడ్యూల్డ్ కుల సభ్యుల రిజర్వేషన్లు కూడా నిరాకరించారన్న వదంతి ఒకటి ప్రచారంలో ఉంది. కాని ఇది ముమ్మాటికీ అబద్దం .

1950వ సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చబడిన షెడ్యూల్డు కులాల ఆర్డర్ లోని పేరా 3 ప్రకారం “హిందు మతం కాకుండా ఏ ఇతర మతాన్నయినా నమ్మే వారు షెడ్యూల్డు కులంలో సభ్యులు కారు”. అంటే, షెడ్యూల్డు కులం వర్గాలుగా గుర్తించబడిన వారెవ్వరైనా సిక్, బౌద్ధ, క్రైస్తవ సమాజాలలో ఉంటే, వారు షెడ్యూల్డు కుల సభ్యులుగా గుర్తించబడరని దీని అర్ధం .

అయితే, 1956లో ఆ వర్గాలకు చెందిన సిక్ మతస్తులకు షెడ్యూల్డు కుల హోదాను విస్తరణ చేస్తూ "హిందూ మతం కాకుండా” అనే మాటలను "హిందూ మరియు సిక్ మతాలు కాకుండా” అని సవరించారు. అలాగే 1990లో ఆ వర్గానికి చెందిన బౌద్ధ మతస్తులకు కూడా షెడ్యూల్డు కుల హోదాను విస్తరణ చేస్తూ "హిందూ మరియు సిక్ మతాలు కాకుండా” అనే మాటలను “హిందూ, సిక్ మరియు బౌద్ధ మతాలు కాకుండా” అని సవరించారు.

చివరికి షెడ్యూల్డు కులంగా గుర్తించబడిన వర్గాలలో ఉన్న క్రైస్తవ మతస్తులకు మాత్రమే షెడ్యూల్డు కుల హోదా, వారు ఎప్పుడు నిరాకరించకపోయినా వారికి నిరాకరించబడుతుంది.

2004వ సంవత్సరంలో, మాజీ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రాగారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్, రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్డు కుల ఆర్డర్ లోని పేరా 3ను కొట్టివేయమని సిఫారసు చేసింది.

షెడ్యూల్డు కుల ఆర్డర్ లోని పేరా 3ను కొట్టివేయాలని సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ నెం.180 ఆఫ్ 2004 దాఖలా చేయబడింది. అయితే, భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని కారణంగా ఆ పిటిషన్ పై ఎలాంటి తీర్మానం జరగలేదు.

లోకసభలో శ్రీ జి.యం.బనత్ వాలా గారిచే 28-5-1990 నాడు ప్రస్తావించబడి, పార్లమెంట్ హౌజ్ లో కేటలాగ్ నెం. 301. 440954గా నమోదు చేయబడిన “ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ ఫర్ హరిజన్స్ ఇన్ ఇండియా” అనే తన పుస్తకంలో డాక్టర్ కండె ప్రసాద్ రావు గారు కూడా సరిగ్గా ఇదే సలహా, అంటే రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్డు కుల ఆర్డర్ లోని పేరా 3ను కొట్టివేయమనే, అది కూడా ఎప్పుడో 1990వ సంవత్సరంలోనే సలహా ఇచ్చారు. ఇదే అంశం మీద డాక్టర్ కండె ప్రసాదరావు గారు సుప్రీంకోర్టులో తన వ్యక్తిగత హోదాలో రిట్ పిటిషన్ నెం.180 ఆఫ్ 2004 కూడా దాఖలు చేసారు.

రాజ్యాంగ డ్రాఫ్టులో ఆర్టికల్ 19(1)పై చర్చలో పాల్గొని 6-12-1948నాడు పండిట్ లక్ష్మీ కాంత మైత్ర (వెస్ట్ బెంగాల్) గారు ఇలా అన్నారు :

- "మనం అలాంటి భావనలతో వెళ్లిపోతే భారత దేశంలో ఉన్న క్రైస్తవ సమాజానికి గొప్ప అన్యాయం చేసినవారమౌతాం. యావత్ భారత దేశంలో, భారతీయ క్రైస్తవ సమాజమే అత్యంత శాంతియుతమైన వర్గం. అది నా వ్యక్తిగత అభిప్రాయం. దాని సవాలు చేసిన వారెవ్వరు నాకు తెలియదు. ఏతావాతా నా వాదన ఏమిటంటే, చాలా మంది చిత్రీకరించి ఆరోపించేలా అమితాసక్తి మరియు ఉన్మాదంతో క్రైస్తవులు మతపరివర్తనలకు పాల్పడటంలేదు. అలాంటి అపార్థాన్ని తొలగించాలని నేను వెంపర్లాడుతున్నాను. కాబట్టి నా అభిప్రాయంలో ఈ హక్కును తీసివేయకూడదు. “మతాభివృద్ధి” అనే మాటను ఉంచాలని, అది తొలగించకూడదని నేను ఒప్పించబడ్డాను. ఈ ప్రతిపాదనకు ఉన్నదున్నట్టుగా నేను నా హృదయపూర్వకమైన మద్దతు తెలుపుతున్నాను”.

రాజ్యాంగ డ్రాఫ్టులో ఆర్టికల్ 19(1)పై చర్చలో పాల్గొని 6-12-1948నాడు శ్రీ కె.యం. మున్షి (బొంబాయి) గారు ఇలా అన్నారు :

“మతాభివృద్ధి” అనే మాటపై వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి కొన్ని మాటలే చెప్పదలిచాను. ఈ మాటపైనే భారతీయ క్రైస్తవ సమాజం ఎక్కువ నొక్కి వక్కాణించిందని నాకు తెలుసు. అదేదో ఎక్కువ మందిని ఉదృతంగా మతమార్పిడి చేయించాలని కాదు కానీ, అది వారి విశ్వాసంలో ఒక మౌలిక సూత్రం కాబట్టి. ఒకవేళ ఈ మాట లేకపోయినా, రాజ్యాంగం ఇచ్చే భావప్రకటన స్వేచ్ఛ క్రింద ఒకరి మతంలోనికి మరొకరిని ఆకట్టుకునే హక్కు ఎలాగో ఉండేది.

గత సంవత్సరానికి ముందు మైనార్టీస్ కమిషన్ వారు అందజేసిన తమ నివేదికలోని దాదాపు అన్ని ప్రతిపాదనలకు ఏకగ్రీవ మద్దతు పొంది గొప్ప విజయాన్ని ప్రదర్శించారు. ఈ ఏకగ్రీవత్వం అధిక సంఖ్యాక వర్గాలలో సమన్వయం మరియు ధైర్యాన్ని అందించే వాతావరణాన్ని కలుగజేసింది. కాబట్టి, ఇంత గొప్పగా మైనార్టీ కమిషన్ సంపాదించిన సంఘీభావం భంగపడకుండా ఉండటానికి ఈ ప్రతిపాదనలో ఉన్న మతాభివృద్ధి అనే మాటను ఉంచాల్సిందే”.

రాజ్యాంగ డ్రాప్టులో ఆర్టికల్ 19(1)పై చర్చలో పాల్గొని 6-12-1948నాడు శ్రీ టి.టి. క్రిష్ణమాచారి (మద్రాస్) గారు ఇలా అన్నారు:

"ఆర్టికల్ 19(1)ను ఆమోదించే ఈ చర్చను నేను సమర్ధిస్తున్నాను. మన స్వంత భావాలు మరియు దృక్పథాలపై క్రైస్తవం చూపిన ప్రభావం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. కాబట్టి వారు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోకుండా వారించాలని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ఈ ఆర్టికల్ ని నేను ఉన్నదున్నట్లుగా సమర్ధిస్తున్నాను”.

రాజ్యాంగ డ్రాఫ్టులో ఉన్న ఆర్టికల్ 19(1)ను శాసనసభ 6-12-1948వ తేదీన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25(1) గా అంగీకరించింది.

డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదన :

శాసనసభ డ్రాఫ్టింగ్ కమిటీ ప్రవేశపెట్టిన 17వ ప్రతిపాదన ఈ విధంగా ఉంది :

“ఒక మతము నుండి మరొక మతంలోనికి బలవంతంగా కాని అక్రమప్రభావాల ద్వారా కాని చేసే మార్పిడులు చట్టరీత్యా ఆమోదించబడవు”.

అయితే క్రైస్తవ మతంలోనికి మార్పిడిలు బలవంతంగా కానీ అక్రమ ప్రభావాల ద్వారా కాని జరగటం లేదని శాసనసభలో ఉన్న క్రైస్తవేతర సభ్యులు అదివరకే సభల్లో స్పష్టత ఇచ్చారు.

రాజ్యాంగ డ్రాఫ్టులో ఆర్టికల్ 19(1)పై చర్చలో పాల్గొని 6-12-1948నాడు శ్రీ టి.టి. క్రిష్ణమాచారి (బాంబే) గారు ఇలా అన్నారు :

"పాత ప్రభుత్వంలో క్రైస్తవ మిషనరీలకు ప్రత్యేకంగా బ్రిటీష్ మిషనరీలకు పరిస్థితులు అనుకూలించాయి. కానీ నేనుంటున్న బాంబే ప్రాంతంలో 1938వ సంవత్సరం నుండి రాజకీయ పలుకుబడి వల్ల వారికున్న ప్రభావం కనుమరుగైపోయిందని నాకు తెలుసు. అప్పటి నుండి ఆ ప్రాంతంలో జరిగిన మతమార్పిడులన్నీ ఒప్పింపబడి జరిగినవే తప్ప ప్రలోభాలకు లోనై జరిగినవి కావు.

శాసనసభలో ఉన్న క్రైస్తవ సభ్యులు డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనను తొలగించడానికి, క్రైస్తవేతర సభ్యుల మాటలను అదునుగా చేసుకోలేదు. అందుకు భిన్నంగా వారు 17వ ప్రతిపాదనకు ఉన్నదున్నట్లుగా పూర్తి మద్దతు తెలియజేశారు.

డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనపై చర్చలో పాల్గొని శ్రీ ఎఫ్. బి. ఆంథోని (బెంగాల్ జనరల్)గారు ఇలా అన్నారు :

"అక్రమ ప్రభావాల క్రింద మతమార్పిడి, బలవంత మతమార్పిడి, గలిబిలి చేసి మతమార్పిడి వంటివి చట్టం ఆమోదించకూడదన్న మాటతో నేను ఏకీభవిస్తున్నాను”.

డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనలో సవరణ డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనను ఈ క్రింది విధంగా సవరించమని శ్రీ కె.యం.మున్షి గారు ప్రతిపాదించారు :

"ఒక మతము నుండి మరొక మతములోనికి బలవంతంగా కాని అక్రమప్రభావాల ద్వారా కాని, మోసయుక్తంగా కాని, 19 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మైనర్లపట్ల కాని, చేసే మార్పిళ్ళు చట్టరీత్యా ఆమోదించబడవు.”

శ్రీ కె.యం. మున్షి గారు ప్రతిపాదించిన ఈ సవరణను శాసనసభ సభ్యులు అంగీకరించలేదు.

డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనపై చర్చలో పాల్గొని రెవ. జె.జె.యం.నికోలస్ రాయ్ (అస్సాం జనరల్) గారు ఇలా అన్నారు :

"అడ్వయిజరీ కమిటీ వారి వద్దనుండి వచ్చిన ప్రతిపాదన సరిపోయేదిగా ఉన్నది, దానిని సవరించాల్సిన అవసరమే లేదని నా అభిప్రాయం. 18 సంవత్సరాలకు తక్కువ వయసున్న ఓ యవ్వనస్తుడికి దేవుని యెదుట మనస్సాక్షి లేదని, కాబట్టి అతడు తన విశ్వాసాన్ని ప్రకటించుకోలేదని తలంచటం సరికాదు. ఈ కోణాన్ని తగిన విధంగా పరిశీలించాలి. ఈ సభ పరిగణలోనికి తీసుకోవాల్సిన ఒక ఆత్మీయ కోణం కూడా మత పరివర్తనలో ఉంది. మత పరివర్తన అంటే కేవలం ఒక మతాచారానికి బదులు వేరొకటి అలవర్చుకోవటమో, లేక ఒక మతం పేరు స్థానంలో వేరొక మతం పేరు పెట్టుకోవటమో (ఉదాహరణకు ఒక హిందూ క్రైస్తవుడవ్వడం) మాత్రమే కాదు. ఇందులో మానవ ఆత్మ దేవునితో సంబంధంలోనికి రావటం వంటి ఆత్మీయ కోణాలు ఉన్నాయి. అవి ఈ సభ అలక్ష్యపెట్టకూడదు. ఒక పిల్లవాడికి తాను వేరొక విశ్వాసాన్ని అవలంభించడానికి దేవుని చేత పిలువబడ్డాడని అనిపిస్తే దానిని నిరోధించే ఎలాంటి చట్టము ఉండకూడదు.

ఎందరో యవ్వనస్తులు క్రైస్తవంలోనికి మారిన సంగతి మనందరికి క్రైస్తవ చరిత్ర నుండి తెలుసు. అలా ఎందరో యువకులు మారి, తమ విశ్వాసం కొరకు ప్రాణాలు సహితం పెట్టేంతగా అన్నిటిని నష్టపోవడానికి సిద్ధపడిన ఎందరో యవ్వనస్తులు నాకు తెలుసు. నేను కూడా నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడే మారాను. నన్ను పిలిచిన దేవుని స్వరాన్ని విని నేను మరణించడానికి సహితం సిద్ధమయ్యాను. డాక్టర్ అంబేడ్కర్ గారు 18 సంవత్సరాలలోపు ఉన్న అనాథ పిల్లల విషయాన్ని పేర్కొన్న చర్చ నేను చూడలేదు. 17వ ప్రతిపాదనను సూచించిన విధంగా సవరించి అమలు చేస్తే అనాథ పిల్లలకు ఎలాంటి మతోపదేశం అందే అవకాశముండదని వారు ఎత్తి చూపించారు. వారు ఇలా అన్నారు :

"తల్లిదండ్రులు కాని చట్టరీత్యా గార్డియన్లు కాని లేని పరిస్థితిలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు మతమార్పిడి నిషేధించే ఈ ప్రతిపాదనను అమలు చేస్తే మరి అనాథ పిల్లల సంగతేమిటి? వారికి మతమనేదేమి ఉండదా? వారిపై జాలితో శ్రద్ధ చూపించేవారు వారికి ఎలాంటి మతబోధ చేయకూడదా? నాకనిపిస్తుంది ఏమిటంటే, మున్షి గారు చెప్పినట్లు ఒకవేళ 18 సంవత్సరాలకు తక్కువ ఉన్న పిల్లలకు మత మార్పిడి నిషేధం అన్న సవరణను అంగీకరిస్తే, చట్టరీత్యా యే గార్డియన్లు లేని పిల్లలకు ఎలాంటి మతబోధను పొందే అవకాశం ఉండదు. అలాంటి పర్యవసానాన్ని ఈ సభ కోరటం లేదని నేను నమ్ముతున్నాను. కాబట్టి మున్షీగారి సవరణను అమలు చేస్తే అలాంటి ఒక వర్గం ఉనికిలోనికొస్తుందని మనం అనుమానించాలి.”

డాక్టర్ అంబేడ్కర్ గారు మతాంతరం చెందిన తల్లిదండ్రులకున్న మైనర్ పిల్లల పరిస్థితిని కూడా ప్రస్తావించారు. వారిలా అన్నారు :

“వేరొక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుంటే, మతాంతరం చెందిన తల్లిదండ్రుల పిల్లల సంగతిని ఆలోచించినప్పుడు, మనం చాలా క్లిష్టమైన సందిగ్ధాన్ని ఎదుర్కోవాలి. తల్లిదండ్రులు 18 సంవత్సరాలు దాటిన మేజర్లు కాబట్టి వారు మతాంతరం చెందినా, వారి పిల్లలు వారి పిల్లలే అయినా 18కి తక్కువ వయసున్న మైనర్లు కాబట్టి వారి తల్లిదండ్రులతో పాటు మారకూడదని మీరంటే, మరి ఆ పిల్లల కొరకు మనం ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న ప్రశ్నను మనం పరిగణలోనికి తీసుకోవాల్సి వస్తుంది.”

ఒకవేళ తల్లిదండ్రులు క్రైస్తవ్యానికి మారారనుకుందాం. వారి మైనర్ పిల్లవాడు చనిపోయాడనుకుందాం. వారు క్రైస్తవ విశ్వాసంలో ఎదిగినవారు కాబట్టి అతనికి వారు క్రైస్తవ పద్దతుల ప్రకారం అంతిమసంస్కారాలు చేస్తే అది చట్టరీత్యా నేరమైపోతుందా?

ఇంకొక పరిస్థితిని తీసుకోండి. మతాంతరం చెందిన క్రైస్తవ తల్లిదండ్రులకు ఒక కుమార్తె ఉందనుకుందాం. వారు ఆమెకు క్రైస్తవ పద్దతులననుసరించి వివాహం జరిగించారనుకుందాం. దాని పర్యవసానం ఏమిటి? ఆ వివాహానికికున్న హోదా ఏమిటి? ఆ వివాహం చట్టబద్ధమైనదా చట్టవిరుద్ధమైనదా?

పిల్లలు మతాంతరం చెందకూడదని మీరనుకుంటే, తమ పిల్లల మతపరమైన జీవితాన్ని ప్రభావితం చేసి రూపుదిద్దే తమ తల్లిదండ్రుల హక్కును నిరోధించే వేరొక గార్డియన్ షిప్ చట్టాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

తల్లిదండ్రులు క్రైస్తవాన్ని కానీ తమదికాని వేరే ఏదైనా మతాన్ని కాని తీసుకున్నారన్న కారణంతో తమ ఐదేండ్ల పిల్లవాడిని వారినుండి వేరుచేయాలన్న పరిస్థితిని ఈ సభ అంగీకరించగలదా అని నేను ప్రశ్నిస్తున్నాను.

ఈ ఇబ్బందులను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ సవరణను ప్రాథమిక హక్కుల కమిటీ కాని, అల్పసంఖ్యాకుల కమిటీ కాని, సలహాదారుల కమిటీ కాని త్రోసిపుచ్చడానికి కారణాలు ఇవే. 18కి తక్కువ వయసున్న పిల్లలను మతపరివర్తన చేయకూడదన్న సవరణను అంగీకరిస్తే ఎన్నో రుగ్మతలకు, దుష్పరిణామాలకు దారి తీస్తుందని గుర్తించాము కాబట్టి దానిని పూర్తిగా తొలగించటమే మంచిదని నిర్ణయించామని వారు తెలియజేసారు.

డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనపై చర్చలో పాల్గొని శ్రీ డి. ఎన్. దత్త గారు ఇలా అన్నారు :

"అధ్యక్ష , ఈ 17వ ప్రతిపాదనంతా ప్రాథమిక హక్కుల కమిటీ వారికి పంపించాలని నాకనిపిస్తుంది. దానిని పూర్తిగా తొలగించగలిగితే నేను హర్షిస్తాను”.

డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనపై చర్చలో పాల్గొని రెవ. జెరోమ్ డి'సౌజా (మద్రాస్ జనరల్) గారు ఇలా అన్నారు : - "అధ్యక్ష, శ్రీ మున్షి గారు సూచించిన పూర్తి సవరణను నేను వ్యతిరేకిస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన వక్తతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ, ఈ ప్రతిపాదనలోని ప్రతి మాటను జాగ్రత్తగా బేరీజు వేయటానికి సలహాదారుల కమిటీకి పంపించాలని సభను కోరుతున్నాను”.

17వ ప్రతిపాదనను 3 కమిటీలు ఇదివరకే సవివరంగా జాగ్రత్తగా విశ్లేషించి దానిని తొలగించటమే మంచిదని సూచించారు. కాబట్టి, పునపరిశీలనకు వారికి తిరిగి పంపాల్సిన అవసరత లేదని డాక్టర్ అంబేడ్కర్ క్రింద ఉన్న ప్రాథమిక హక్కులు మరియు మైనార్టీల సలహాదారుల బృందం, 25-8-1947వ తేదీన సమర్పించిన వారి నివేదికలో ఈ క్రింది విధంగా సూచించారు :

“ఈ ప్రతిపాదన వ్యక్తపరుస్తున్న సిద్దాంతం అందరికీ విధితమే కాబట్టి దానిని రాజ్యాంగంలో చేర్చటం అనవసరం. దానిని పూర్తిగా తొలగించమని మా సలహా'. ప్రాథమిక హక్కులు మరియు మైనార్టీల సలహాదారుల బృందం చేసిన ఈ సూచనను 30-8-1947వ తేదీన శాసనసభ ఆమోదించి, డ్రాఫ్టింగ్ కమిటీ వారి 17వ ప్రతిపాదనను, దానికి సూచించబడిన సవరణతోపాటు పూర్తిగా కొట్టి వేసారు. దీని ఫలితంగా డ్రాఫ్టింగ్ కమిటీ చేసిన 17వ ప్రతిపాదనకు భారత రాజ్యాంగంలో స్థానం లభించలేదు.

కొన్ని రాష్ట్రాల చట్టాలు శాసనసభ అమలులోనికొచ్చిన తర్వాత 17వ ప్రతిపాదనలో ఉన్న అంశాలను నియంత్రించడానికి అవసరమైన చట్టాలను పార్లమెంట్ తయారు చేయవచ్చని 6-12-1948వ తేదీన డాక్టర్ అంబేడ్కర్ గారు శాసనసభలో స్పష్టం చేశారు. ఆయన ఇలా అన్నారు:

"ప్రాథమిక హక్కులకు సంబంధించి మనం 17వ ప్రతిపాదనలో ఉన్న అంశాలను ప్రస్తావించ లేదన్నంత మాత్రాన శాసనసభ అమలులోనికొచ్చిన తర్వాత ఆ విషయంలో ఏదైన చట్టం చేయడానికి అది అడ్డంకి ఎంత మాత్రము కాదు”.

1952వ సంవత్సరంలోనే లోకసభ ప్రారంభం అవటంతో శాసనసభ ఉనికిలోనికి వచ్చింది. అయితే పార్లమెంట్ లో ఈ అంశానికి సంబంధించిన ఏదైన చట్టం చేయాలనే ప్రతిపాదనను లోకసభలో నేటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు.

అయితే, శ్రీ ఓ.పి. త్యాగి గారు, 'బలవంతపెట్టి, ప్రలోభపెట్టి లేదా మోసగించి ఒక మతము నుండి మతము మార్చటాన్ని నిషేధించే చట్టం చేయమని', మతస్వాతంత్ర బిల్లు 1978 (బిల్ నెం. 178/1978)ను 22-12-1978వ తేదీన ఒక ప్రయివేటు మెంబర్ బిల్లుగా లోక్ సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లులోని 3వ విభాగం ప్రకారం : "ఏ వ్యక్తయినా మరొకరిని నేరుగానైనా మరెవిధంగానైనా ఒక మతము నుండి మరో మతములోనికి బలవంతంగా కాని, ప్రలోభాల ద్వారా కాని, మోసగించటం ద్వారా కాని, మార్పిడి చేయటం కానీ, ఏ వ్యక్తియినా, ఎలాంటి మతమార్పిడులకు సహకరించటం కాని చేయకూడదు”.

4వ విభాగం ప్రకారం : 3వ విభాగాన్ని అతిక్రమించే ఏ వ్యక్తయినా ఒక సంవత్సరం కారాగార శిక్ష లేదా 3000 రూపాయల జరిమానా, లేదా ఈ రెండూ విధించబడాలి".

పైగా 4వ ప్రతిపాదన ప్రకారం : "ఈ నేరం ఒక మైనర్, స్త్రీ, లేదా ఒక షెడ్యూల్డు కులాలు/ షెడ్యూల్డు తెగలకు చెందిన వ్యక్తి విషయంలో చేసిన వారికి 2 సంవత్సరాల కారాగార శిక్ష, లేదా 5000 రూపాయల జరిమానా లేదా ఈ రెండూ విధించాలి”.

5వ క్లాజ్ ప్రకారం : “ప్రతిపాదించబడిన ఈ చట్టం ప్రకారం చేయబడిన ఏ నేరమైనా కాగ్నిజబుల్ నేరంగా పరిగణించబడుతుంది”.

స్వచ్ఛందంగా, స్వేచ్ఛతో జరిగే మత మార్పిడులను ప్రశ్నించకూడదని ఒప్పుకుంటే, బెదిరించి, ప్రలోభపెట్టి, మోసగించి, లేదా తప్పుడు విధానాలలో ప్రభావితం చేసి జరిగించే మార్పిడుల నుండి చట్టపరమైన సంరక్షణ అవసరమని, అలాంటి సంరక్షణ ఎస్సీ, ఎస్టీలకు మరి ముఖ్యంగా అవశ్యకమని ఈ బిల్లు యొక్క ఉద్దేశాలలో వ్యక్తం చేయబడింది.

పార్లమెంట్ తన జ్ఞానం చొప్పున శ్రీ ఓ.పి. త్యాగి గారు 1978లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆమోదించలేదు. నాటి నుండి నేటి వరకు అలాంటి ఏ బిల్లు అయినా ప్రభుత్వం తరపున గానీ ప్రయివేటు మెంబర్ల తరపున గాని మళ్లీ ఎప్పుడూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడటం జరగలేదు.

పాకిస్తాన్ లో దైవదూషణ చట్టం క్రైస్తవులపై వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి దుర్వినియోగపడుతున్నట్లే, శిక్ష విధించే అధికారాన్నిచ్చే అలాంటి ఏ చట్టమైనా, క్రైస్తవులతో వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి దుర్వినియోగపరచబడే ప్రమాదం ఉంది. పాకిస్తాన్లో దైవదూషణ చట్టం ఆ విధంగా క్రైస్తవుల మీద దుర్వినియోగ పరచబడిందని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఒకానొక నివేదికలో వెల్లడి చేసిందని ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితమే.

ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏ శాసనసభ అయినా, ఈ అంశానికి సంబంధించిన ఎలాంటి చట్టాన్నయినా, ప్రత్యేకంగా శిక్ష విధించే ఎలాంటి చట్టాన్నయినా తయారు చేయాల్సిన అవసరమేమి లేదు. అయితే 17వ ప్రతిపాదనలో ఉన్న ఆలోచనను అమలులోనికి తెచ్చే చట్టం అవసరమని పార్లమెంట్ కు తోచకపోయినా, తమిళనాడుతో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో శిక్షకు లోను చేసే కొన్ని చట్టాలను తయారు చేశాయి. అయితే, ఆ చట్టం దుర్వినియోగపరచబడే అవకాశముందని గుర్తించి, తమిళనాడు శాసనసభ దానిని కొట్టి వేస్తూ మరో చట్టం తయారుచేసింది. తమిళనాడు రాష్ట్రం చూపించిన ఈ మంచి మాదిరిని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయని ఆశిస్తున్నాము.

ఇక్కడ ప్రస్తావించదగిన విశేషమేమిటంటే, డాక్టర్ కండె ప్రసాదరావు గారు రాసిన "Conversion by Fraud, force and undue influence" అనే పుస్తక ప్రతులను తమిళనాడు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి మేడం జయలలిత గారితో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అలాగే తమిళనాడు రాష్ట్ర శాసనసభకు అప్పటి స్పీకర్ శ్రీ హెన్రీ పాండియన్ గారితో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లకు పంపించటం జరిగింది.

మత ప్రచార హక్కుకొట్టివేత ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చకపోయినా, తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే, ఒక మతము నుండి మరో మతములోనికి మార్చడాన్ని నిషేధిస్తామని కొందరు నాయకులు ప్రకటనలు చేస్తుంటారు. అలాంటి ప్రకటనలు విని, ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తే చాలు, మతమార్పిడులను నిషేధించొచ్చని సామాన్య జనం అనుకుంటారు. అయితే ప్రభుత్వం మతమార్పిడులను ఆపటానికి జీవోలు జారీ చేస్తే సరిపోవు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే, పార్లమెంట్ దృష్టికి తేకుండానే భారత ప్రభుత్వం జీవోలు జారీ చేయగలదు.

అలాగే, ఒక చట్టం చేయటం ద్వారా కూడా మతమార్పిడులు ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే, ఒక చట్టం చేయడానికి ఉభయ శాసనసభలలో, అంటే లోకసభ మరియు రాజ్యసభలో సాధారణ మెజారిటీ ఉంటే చాలు. ఉదాహరణకు, ఉభయ శాసనసభలలో అలాంటి సింపుల్ మెజారిటీ ద్వారా తయారు చేసిన చట్టంతోనే ఆంధ్రప్రదేశ్ ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ తయారు చేసింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1)లో ఇవ్వబడిన ప్రచార హక్కును తొలగించేంత వరకు, ఒక మతము నుండి మరో మతానికి మార్పిడులు చేయటాన్ని నిషేధించడం సాధ్యం కాదు. కాబట్టి మతమార్పిడులు నిషేధించడమనేది ఉభయ శాసనసభలలో 2/3వ వంతుల మెజారిటీ ద్వారా జరిగే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.

ఒక రాజకీయ పార్టీ గెలుపు పొందిందంటే వారికి శాసనసభలో సాధారణ మెజారిటీ లభించిందని అర్థం. దాని ద్వారా మత మార్పిడులు నిషేధించడం సాధ్యం కాదు. అందుకే, తమ పార్టీని గెలిపిస్తే మతమార్పిడులు నిషేధిస్తామని చేసే రాజకీయ నాయకుల ప్రకటనలు సాధారణ ప్రజలను తప్పుత్రోవ పట్టించే మోసయుక్తమైన మాటలు మాత్రమే. ఇప్పటిలో ఉభయ శాసనసభలలో మాట అలా ఉంచితే, ఒక్క శాసనసభలో కూడా 2/3వ వంతు మెజారిటీ సంపాదించుకునే పార్టీ ఏదీ లేదు. కాబట్టి, మత మార్పిడుల నిషేధం కనీసం ఇప్పటిలో సాధ్యపడేది కాదు.

ప్రచార హక్కును కొట్టివేసే ప్రయత్నం, మన రాజ్యాంగకర్తలైన పెద్దలను, ముఖ్యంగా ఖండోపఖండాలుగా వేరైన రాజ్యాలను సంయుక్త భారతంలో విలీనం చేసి ఈ దేశ నిర్మాణానికి ఎంతో కృషి చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ వంటి మహనీయులను అగౌరవపరచడమే అవుతుంది.

ప్రాథమిక హక్కులు మరియు అల్పసంఖ్యాకుల కమిటీలకు అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌గా, మతప్రకటన, ఆచరణ, మరియు ప్రచార హక్కును రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయాసపడిన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయి పటేల్ గారి పట్ల భారత క్రైస్తవ సమాజం ఎంతో కృతజ్ఞతాభావాన్ని కలిగియుంది.

మత ప్రచార హక్కు యొక్క అమలు

భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా గుర్తించబడిన మతస్వాతంత్య్ర హక్కు రాజ్యాంగంతో పాటే 26-1-1950వ తేదీన అమలులోనికి వచ్చింది. అయితే, ఇండియా ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశమని ప్రకటించే విధంగా రాజ్యాంగ పీఠికలో చేసిన సవరణ మూలాన 18-1-1976వ తేదీ నుండి ఆ హక్కు మరింత బలంగా అమలులోనికి వచ్చింది.

మతబోధ చేయడానికి మత ప్రచారం చేయడానికి వ్యత్యాసముంది. మత బోధ చేయటమంటే ఒక మతంలోని సందేశాన్ని సూత్రాలను ప్రకటించడమే. అయితే ప్రచారం చేయడమంటే, ఆ మతంలోనికి నూతన విశ్వాసులను సంపాదించుకోవడం. మత ప్రచారం చేసే వ్యక్తి కేవలం సందేశాన్ని సూత్రాలను వినిపిస్తే సరిపోదు కాని ఆ మతానికి సంబంధించిన సూత్రాలను, ఆచారాలను, విధులను పాటించడానికి కొత్తగా మతంలో చేరిన వారిని నడిపించేవాడిగా ఉండాలి.

బాప్తిస్మము అంటే యేసు క్రీస్తు ప్రభువుపై ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని ప్రకటించే ఆచారం. ఒక వ్యక్తి తనకు తానే బాప్తిస్మము ఇవ్వలేడు. యేసు క్రీస్తు సందేశాన్ని బోధించినవాడికే, తన బోధను విని యేసు క్రీస్తు ప్రభువును నమ్మినవారికి బాప్తిస్మము ఇచ్చే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినంత వరకు యేసు క్రీస్తు ప్రభువును నమ్మినవారికి వారి కోరిక మేరకు బాప్తిస్మమివ్వడం కూడా మత ప్రచారంలో భాగమే.

మత ప్రచారం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది కాబట్టి, భారత దేశంలో యేసు క్రీస్తు ప్రభువు సందేశాన్ని ప్రకటించడాన్ని ఆటంకపరచే ఎలాంటి ప్రయత్నమైనా, లేదా భారత దేశంలో యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించినవారికి బాప్తిస్మమివ్వడాన్ని ఆటంకపరచే ఎలాంటి ప్రయత్నమైనా, అది భారతదేశ అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగ అతిక్రమణగా పరిణమిల్లుతుంది.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.