సువార్త

రచయిత: అజ్ఞాత క్రైస్తవుడు
చదవడానికి పట్టే సమయం: 5 నిమిషాలు
ఆడియో

Article Release long richman కోటీశ్వరుడు గొంగలిపురుగు min

ఈరోజు కోటీశ్వరులుగాను, పారిశ్రామికవేత్తలుగాను పేరు సంపాదించిన చాలామంది ఒకప్పుడు పేదవాళ్ళుగా జీవితాన్ని ప్రారంభించినవారే. అలాంటివారిలో సర్ టైటస్ సాల్ట్ (Sir Titus Salt) ఒకరు.‌  ఇతను ఇంగ్లాండు దేశంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో బాలకార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. కష్టపడి పనిచేయాలనే సంకల్పం, చురుకైన మనస్సు కలిగున్న టైటస్ ముతక ఉన్నిని (Coarse Wool) నాణ్యమైందిగా మార్చే ప్రక్రియను కనిపెట్టాడు. దీని ద్వారా రష్యా నుండి దిగుమతి చేసుకున్న ముతక ఉన్నిని నాణ్యమైందిగా మార్చేసి లక్షలాది పౌండ్లు సంపాదించి పెద్ద పారిశ్రామికవేత్త అయ్యాడు. టైటస్ కు తెలుసుకోవాలనే ఆసక్తి  అంతటితో ఆగలేదు. రాత్రింబగళ్ళు కష్టపడి 'అల్పాకా' (Alpaca) అనే ఇంకో ప్రక్రియను కనిపెట్టి పారిశ్రామికరంగంలో శిఖరాన్ని చేరుకున్నాడు. కోట్లకు కోట్లు సంపాదించిన టైటస్ సాల్ట్ తన పేరుతో కార్మికులకు ఒక ఆదర్శ పారిశ్రామికవాడను నిర్మించాడు. అదే ప్రస్తుతం "సాల్టేర్" పట్టణంగా పిలవబడుతుంది, ఆ తర్వాత ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అతని అన్వేషణలు, అభ్యుదయ భావాలు పరిశ్రమల అభివృద్దికి ఎంతగానో ఉపకరించాయి కాబట్టి విక్టోరియా రాణి ఆయనకు "సర్" అనే బిరుదును ఇచ్చి "బారన్" (Baron) హోదాతో సత్కరించింది.

ఇలాంటి ఘనత సంపాదించి‌న  సర్ టైటస్ సాల్ట్ నిజమైన సంతోషాన్ని కనిపెట్టాడా? "చూచుటచేత కన్ను తృప్తి పొందకున్నది వినుటచేత చెవికి తృప్తి కలుగుటలేదు" (ప్రసంగి 1:8) అని పూర్వం గొప్పజ్ఞానియైన సొలోమోను చెప్పినట్టు యీ కోటీశ్వరుడు కూడా హృదయంలో ఆనందం కానీ తృప్తి కానీ లేనివాడిగా ఉన్నాడు. ధనం వల్ల కలిగే భోగాలెన్నిటినో అనుభవించినా, దేశదేశాల్లోని వినోదాలన్నీ వీక్షించినా హృదయం మాత్రం ఎండిన ఎడారిలా ఉన్నది. మనస్సుకు విశ్రాంతి లేక టైటస్ సాల్ట్ విచారగ్రస్థుడిగా ఉన్నాడు.

ఇలా ఉండగా ఒక ఆదివారం చర్చిలో బోధకుడు గొంగళిపురుగు గురించి చెబుతుంటే టైటస్ విన్నాడు. ఆ బోధకుడు 'అలంకారం కోసం నా తోటలో అక్కడక్కడ కొన్ని కొయ్యలను పాతి వాటికి వేరు వేరు రంగులు వేయించాను. ఒకరోజు గొంగళిపురుగు ఒకటి వేగంగా వచ్చి రంగువేసిన ఒక కొయ్య పైకి ఎక్కి తినడానికి ఏదైనా దొరుకుందేమోనని ఆశతో అటూ, ఇటూ చూసింది. కన్నులకు చాలా అందంగా ఉన్నందుకు మేలైన ఆహారం అక్కడ తప్పక ఉంటుందని ఆ పురుగు ఆశపడ్డది కానీ అక్కడ దానికేమీ దొరకలేదు.  నిరాశతో క్రిందికి దిగిన పురుగుకు ఇంకో అందమైన కొయ్య కనిపించింది. ఈసారైనా ఆశ తీరకపోతుందా అనుకుని పైకెక్కి చూసింది కానీ, కళ్ళను భ్రమపరచేలా రంగు తప్ప అక్కడ మరేమీ లేదు. అదేవిధంగా ఆ తోటలోని ప్రతిరంగు కొయ్యనూ ఎక్కి ప్రయత్నించిన పురుగుకు ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లోకంలో రంగులు వేసుకున్న కొయ్యలు ఎన్నో ఉన్నాయి. ధనం, కీర్తి, సౌఖ్యం, వినోదం, అధికారం మొదలైన రంగులకొయ్యలు నరులను ఆశపెడుతూ ఆకర్షిస్తున్నాయి. ఆశతో పైకెక్కుతూ ఆయా రంగాలలో ఎంత పైకి వెళ్ళినా హృదయానికి తృప్తి, మనస్సుకు విశ్రాంతి దొరుకడం లేదు. ఎందుకంటే అవన్నీ రంగువేసిన వట్టి కొయ్యలే' అని చెబుతూ ముగించాడు.

తరువాతి రోజు బోధకుడి ఇంటి తలుపు ఎవరో కొడుతున్నారు. తలుపు తీయగానే ఘనుడైన టైటస్ నిలబడి ఉన్నాడు. టైటస్ ఆ బోధకునితో 'అయ్యా, రాత్రి మీ సభకు హాజరయ్యాను. నేను కూడా రంగువేసిన కొయ్యలను ఎక్కుతూ, దిగుతూ చాలా ప్రయాసపడుతున్నాను. నా మనస్సుకు నిజమైన విశ్రాంతి ఎలా కలుగుతుందో దయచేసి వివరించగలరా?' అని అడిగాడు. అప్పుడు ఆ బోధకుడు  "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును" అని జీవితమనే ఎడారి యాత్రలో అలసి సొమ్మసిల్లిన నరులను ప్రేమతో పిలిచిన రక్షకుడైన యేసుక్రీస్తు గురించి చెప్పాడు. 

"హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది" (యిర్మీయా 17:9).  ఆ వ్యాధి పాపం. అది హృదయంలో నుండి తొలగిపోతేనే కానీ నిజమైన సంతోషముండదు. "రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు" "దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును" (1 యోహాను 1:9). టైటస్ తన పాపాలు ఒప్పుకుని రక్షకుడైన యేసును హృదయంలో నమ్మాడు. నమ్మిన అతని హృదయంలోకి యేసుప్రభువు ప్రవేశించి పాపాన్ని కడిగి హృదయశుద్ధిని కలిగించాడు. పాపం యొక్క భారాన్ని (వేదన) తొలగించి “చెప్పశక్యం కాని మహిమాయుక్తమైన సంతోషాన్ని" అతనికి అనుగ్రహించాడు. ఆ కోటీశ్వరుడు జీవితంలో మొదటిసారిగా మనశ్శాంతిని, దైవిక సంతోషాన్ని పొంది ఇలా పొగిడాడు:

"ఉన్నపాటున యేను, నన్ను దరిచేరగా

కౌగలించావు కరముల చాపి -

వదలించుకోలేని పాపమూటల బరువు తీసి

కడిగావు ఎదలోని పంకిలాన్ని

పొందాను పరలోక సంతసాన్ని"

ప్రియస్నేహితుడా, నీవు కూడా నిజమైన తృప్తినివ్వలేని రంగువేసిన కొయ్యలను ఎక్కుతున్నావా? దేవునికి దూరంగా గడుపుతూ ఇహలోక భ్రమల చేత మరలుకొల్పబడుతున్నావా? లేఖనాలు ఇలా హెచ్చరిస్తున్నాయి.

"యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము. నీ కోరిక చొప్పునను. నీ దృష్టి యొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును" (ప్రసంగి 11:9).

టైటస్ వలే యేసుక్రీస్తును నీ హృదయంలో నమ్మి ఆయనే రక్షకుడని ఆశ్రయించు. పాపక్షమాపణ, ఆత్మరక్షణ, హృదయశాంతిని నీవు పొందుతావు.

"తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు" అని ఒక గొప్ప రాజు (దావీదు) పలికెను. (కీర్తన 32:1).

"ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము : అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు" (అపొ.కార్య. 16:31).

"ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము" (2 కొరింథీ 6:2).

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.