దుర్బోధలకు జవాబు

రచయిత: డి. యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 48 నిమిషాలు
ఆడియో

Article Release long Apostles min

విషయసూచిక

  1. పరిచయం
  2. అపొస్తలుని ఆరు గుర్తులు
  3. మొదటి గుర్తు, అపొస్తలుడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడయ్యుండాలి.

    రెండవ గుర్తు, అపొస్తలుడు స్వయంగా యేసు క్రీస్తు చేత నియమించబడిన వాడయ్యుండాలి.

    మూడవ గుర్తు, అపొస్తలుడు యేసుక్రీస్తును స్వయంగా చూసిన ప్రత్యక్ష సాక్షి అయ్యుండాలి.

    నాలుగవ గుర్తు. అపొస్తలుడు దేవుడు అనుగ్రహించిన విశిష్టమైన శక్తి సామర్థ్యాలను కలిగినవాడయ్యుంటాడు.

    ఐదవ గుర్తు, అపొస్తలుడు తన బోధ చేత సంఘానికి పునాది వేసే వాడయ్యుంటాడు.

    ఆరవ గుర్తు, అపొస్తలులు భవిష్యత్తులో గొప్ప స్థానాల్లో ఉంచబడతారనీ, గొప్పగా గౌరవించబడతారనీ వాగ్దానం చెయ్యబడింది.

  4. పదమూడుమందేనా లేక కొత్త నిబంధనలో ఇంకెవరైనా అపొస్తలుడిగా గుర్తించబడ్డారా?
  5. అపొస్తలీయ వారసత్వం
  6. ఎదుర్కోవాల్సిన ఆరోపణలు - లేఖనానుసారమైన సిద్ధపాటు
  7. ముగింపు

పరిచయం

2 కొరింథీ 12:11-13 లో అపొస్తలుడైన పౌలు తన అపొస్తలత్వాన్ని సమర్థించుకుంటున్నట్లు చదువుతాము. పౌలును అపొస్తలుడిగా అంగీకరించడానికి కొరింథు సంఘానికి మొదట్లో ఎటువంటి ఇబ్బందీ లేదు. దాదాపుగా రెండు సంవత్సరాల పాటు పౌలు వారితో కూడా ఉండి, వారికి బోధించి, అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ తరువాత కూడా వారికి పత్రికలు రాస్తూ ఉండేవాడు. 

కొంత కాలానికి, కొందరు అబద్ధబోధకులు, అబద్ధప్రవక్తలు సంఘంలో చొరబడి అనేకులను మోసగించారు. సాతాను అనుచరులు కొందరు సంఘంలోకి ప్రవేశించి, పౌలు అపొస్తలత్వంపై దాడి చెయ్యడం మొదలుపెట్టారు. పౌలు అసలు అపొస్తలుడే కాదనీ, ఒక అబద్ధికుడనీ, మోసగాడనీ,తామే నిజంగా దేవుని చేత పంపబడినవారమనీ, తాము చెప్తున్నది మాత్రమే సత్యము అనీ చెప్పి, ఇటువంటి సంగతులన్నీ కొరింథీ సంఘస్థులకు నూరిపోసి వారిని తమ బోధ వైపు తిప్పుకున్నారు. 

ఇలా తనను విమర్శించినవారికి జవాబుగా పౌలు తన అపొస్తలత్వాన్ని సమర్థించుకుంటున్నాడు. అసలు కొరింథీయులకు ఈ పత్రిక రాయడానికి ఇది కూడా ఒకానొక ముఖ్య కారణం. అయితే కొరింథీయులకు మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఈ పత్రిక చదువుతున్న భక్తులందరికీ కూడా పౌలు తాను అపొస్తలుడనని అనేక రుజువులతో తెలియపరుస్తూ ఉన్నాడు. 

11వ అధ్యాయం మొదలుకొని పౌలు అనేక రీతులుగా తన అపొస్తలత్వాన్నీ, తన యథార్థతనూ సమర్థించుకుంటూ వస్తాడు. అయితే ప్రాముఖ్యంగా 2 కొరింథీ 12:12వ వచనంలో అపొస్తలుని చిహ్నాల గురించి ప్రస్తావిస్తాడు. "సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను."

పౌలు అంటున్నాడు - 'నా అపొస్తలత్వము నిజమైనదని మీరు అంగీకరించడానికి దోహదపడే మరొక రుజువు ఏంటంటే నేను మీ మధ్య చేసిన సూచకక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలే. వీటిని పౌలు 'అపొస్తలుని చిహ్నాలు' అంటున్నాడు. అంటే ఇవి అందరూ చెయ్యగలిగేవి కావన్నమాట. అందరూ చెయ్యగలిగితే ఇక అవి అపొస్తలుని చిహ్నాలు ఎలా అవుతాయి? అందరూ చెయ్యలేరు అనడం కంటే, సందర్భంలో పౌలు తనకూ, అబద్ధఅపొస్తలులకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలియజెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి, ఆ అబద్ధ అపొస్తలులు ఈ విధంగా అద్భుతాలూ, మహత్కార్యాలూ చెయ్యలేరు అని చెప్తున్నాడు. ఇది అపొస్తలునికి మాత్రమే చెందిన గుర్తు. మరో విధంగా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు - దేవుడు తాను అపొస్తలులుగా నియమించినవారికి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసే సామర్థ్యం అనుగ్రహించడం ద్వారా ఫలానావారే నిజమైన అపొస్తలులు అని ధృవీకరించాడు. 

ఈ రోజుల్లో చాలామంది బోధకులు తమంతట తాము అపొస్తలులమని ప్రకటించుకుంటున్నారు, అలాగే చలామణీ అవుతున్నారు. మరి కొన్ని క్రైస్తవశాఖలకు చెందినవారు ఇలా వాదిస్తుంటారు - 'ప్రతి క్రైస్తవుడూ ఒక అపొస్తలుడే. ప్రతి ఒక్కరూ అపొస్తలులు చేసినవన్నీ చెయ్యాలి. అపొస్తలులు కనపరిచిన ఆ మానవాతీత శక్తినీ, ప్రభావాన్నీ కనపరచాలి'. ఈ అభిప్రాయంతో విభేధించేవారి గురించి చేసే ఆరోపణలు ఏంటి అంటే - 'అపొస్తలులు  చేసినవన్నీ, ఖచ్చితంగా వారు చేసిన విధంగానే చెయ్యాలని మీరు ఒప్పుకోవడం లేదంటే, మీరు వేరే దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. తన శక్తినీ, ప్రభావాన్నీ కోల్పోయిన చేతగాని దేవుడు ఆయన. అలా తన శక్తి సామర్థ్యాలను కోల్పోయిన దేవుణ్ణి ఎవరైనా ఆరాధించాలనుకుంటారా? బైబిల్ లో తనను తాను మనకి ప్రత్యక్షపరుచుకున్న దేవుడు అలా తన శక్తిని కోల్పోయాడా? నిన్న, నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవునియందు మీకు విశ్వాసం లేదు. గత రెండు వేల సంవత్సరాలుగా ఎటువంటి అద్భుత కార్యాలు చెయ్యని దేవుణ్ణి ఆరాధించడం మీకు ఇష్టమా?'

ఇటువంటి ఆరోపణలన్నీ చేసి విశ్వాసుల్ని భయపెట్టి, 'అవును, నిజమే, దేవుడు మారనివాడు గనుక యేసుక్రీస్తు కాలంలోనూ, అపొస్తలుల కాలంలోనూ చేసిన కార్యాలన్నీ ఈ రోజు కూడా మన ద్వారా చెయ్యగలడు, చేస్తాడు. ఒకప్పుడు సూచకక్రియలు, అద్భుతాశ్చర్య కార్యాలు చెయ్యగలిగిన దేవుడు, ఇప్పుడు చెయ్యలేడా? ఖచ్చితంగా చెయ్యగలడు. ఇలా అందరు విశ్వాసులు చెయ్యగలగాలి. లేకపోతే మనం దేవుణ్ణి చేతగానివానిగానూ, అసమర్థుడిగానూ చిత్రీకరించినవారం అవుతాము' అని ఒప్పుకునేలా చేస్తారు. ఇటువంటి ఆరోపణలన్నీ ఎదుర్కొని సత్యం కోసం స్థిరంగా నిలబడటానికి వాక్యమనే ఆయుధాన్ని ధరించి పోరాడటానికి ప్రతి విశ్వాసీ సిద్ధంగా ఉండాలి.

టీవీ ప్రసంగాల్లోనూ, సామాజిక మాధ్యమాల ద్వారానూ ఈ బోధ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. ఈ తరంలోని అనేకులు ఈ విషయంలో 'ఏది సత్యం? ఏది అసత్యం?' అని నిర్ధారించుకోలేని గందరగోళ పరిస్థితులలో ఉంటున్నారు. లేఖనాల ఆధారంగా ఈ విషయంలో స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. 

ముందు అపొస్తలులు ఎవరు? వారి పాత్ర ఏంటి? వారు ఎందుకు నియమించబడ్డారో తెలుసుకోవడం ప్రాముఖ్యం? 'అపొస్తలుడు' అంటే 'పంపబడినవాడు' అని అర్థం. 'దూత', 'సందేశకుడు' అని కూడా అనొచ్చు. ఏదైనా ఒక పనిమీద పంపబడిన ఎవ్వరినైనా అపొస్తలుడు అని అనొచ్చు. యేసు క్రీస్తు కూడా దేవుని చేత ఒక పని మీద పంపబడినవాడు గనుక ఆయన కూడా హెబ్రీ 3:1 లో 'అపొస్తలుడిగా' చెప్పబడ్డాడు. 

కానీ కొత్త నిబంధనలో ఈ ప్రత్యేకమైన బిరుదు యేసు ప్రభువు వారితో పాటు మరో 14 మందికి కూడా ఇవ్వబడింది. ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ 14 మందికి మాత్రమే ఈ పేరు పెట్టబడింది. అవును, నేను 14 మంది అనే చెప్తున్నాను. 'అదేంటీ, అపొస్తలులు పన్నెండుమందే కదా' అని మీరు అనొచ్చు? నిజమే, లూకా 6:13 లో "ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను." అని చదువుతాము. అయితే యూదా యేసును మోసం చెయ్యడం ద్వారానూ, ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడం ద్వారానూ అపొస్తలుడిగా ఉండటానికి అనర్హుడయ్యాడు. అతని స్థానంలో మత్తీయ నియమించబడ్డాడు (అపొ.కార్య. 1:15-26). దేవుడు యూదా స్థానంలో మత్తీయని పన్నెండవవానిగా ఎంపిక చేసి మిగిలిన పదకొండుమందితో చేర్చడం ద్వారా అపొస్తలులు పన్నెండు మంది ఉండాలని దేవుడు ఉద్దేశించినట్లు స్పష్టం అవుతోంది. తరువాత ఈ బిరుదు పౌలుకి కూడా ఇవ్వబడింది. కాబట్టి కొత్త నిబంధనలో మొత్తంగా ఈ 14 మందికి మాత్రమే 'అపొస్తలుడు' అనే బిరుదు ఇవ్వబడింది. యూదాకి ఈ బిరుదైతే ఇవ్వబడింది కానీ అతను ఆ స్థానంలో కొనసాగడానికి అనర్హుడయ్యాడు కాబట్టి నిజమైన భావంలో కేవలం 13 మంది మాత్రమే అపొస్తలులు. అందులోనూ పన్నిద్దరు మాత్రమే గొర్రెపిల్ల అపొస్తలులుగా చెప్పబడ్డారు. వారి పేర్లే నూత యెరూషలేము పట్టణ ప్రాకారముల యొక్క పునాదులపైన కనబడతాయి. (ప్రకటన 21:1,2,14). పౌలు ఈ గొర్రెపిల్ల అపొస్తలులతో కూడా లెక్కించబడడు ఎందుకంటే 1 కొరింథీ 15:8-9 లో పౌలు ఇలా అంటాడు - "8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను (పునరుత్థానుడైన యేసు క్రీస్తు); 9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను." పౌలు ఒక ప్రత్యేకమైన పని కొరకు, ప్రేత్యకంగా ఎన్నుకోబడిన అపొస్తలుడని స్పష్టమవుతోంది. 

కాబట్టి రెండు కోవలకు చెందిన అపొస్తలులుగా ఈ 13 మందిని విభజించబచ్చు. మొదటిగా పన్నిద్దరు గొర్రెపిల్ల అపొస్తలులు (పన్నెండవ వాడు మత్తీయ), రెండవదిగా ప్రత్యేకంగా అపొస్తలుడిగా నియమించబడిన పౌలు.

దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడంలో వీరిని వాడుకున్న విధము చాలా ప్రత్యేకం. దేవుడు వీరికి ఒక ప్రత్యేకమైన పని అప్పగించాడు.అది వీరు మాత్రమే చేసి ముగించారు. ఇక ఆ తరువాత ఆ పని చేసే వారి అవసరమూ లేదు, తరువాతి తరంలో ఇంకెవరైనా పేతురు చెప్పిన అర్హతలు కలిగియుండే అవకాశమూ లేదు. ఎప్పటికీ వీరు మాత్రమే నిజమైన భావంలో అపొస్తలులు.

లేఖనాలను పరిశీలించినప్పుడు మిగిలినవారి నుండీ వీరిని ప్రత్యేకపరచగలిగే లక్షణాలనూ, గుర్తులనూ గమనించగలము. అటువంటివి కనీసం ఓ ఆరు ఉంటాయి. ఆ గుర్తులు వీరికి మాత్రమే చెందినవి, ఇంకెవరిలోనూ కనిపించవు. అవేంటో చూద్దాం.

అపొస్తలుని ఆరు గుర్తులు

మొదటి గుర్తు, అపొస్తలుడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడయ్యుండాలి.

ఎవరో కొంతమంది చర్చించుకొని, ఫలానా వ్యక్తి అపొస్తలుడైతే బాగుంటుంది, అతను అయితే ఈ పని సమర్థవంతంగా చెయ్యగలుగుతాడని చెప్పి, అందరూ కలిసి అతనిని అపొస్తలునిగా నియమించడం కాదు. లేదా ఓట్ల పద్ధతిలో ఎవరికి అత్యధిక ఓట్లు వస్తాయో వారిని అపొస్తలుడుగా నియమించడం కూడా కాదు. ఒక వ్యక్తిని అపొస్తలునిగా నియమించడం అనేది మనుషులు చేసే పని కాదు. దేవుడే స్వయంగా ఒక వ్యక్తిని అపొస్తలునిగా ఏర్పరచుకుంటాడు. 

1 కొరింథీ 1:1లో "దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబ"డ్డానని పౌలు చెప్తాడు. ఇదే విషయాన్ని  2 కొరింథీ 1:1, ఎఫెసీ 1:1, కోలస్సీ 1:1, & 2 తిమోతీ 1:1లో కూడా చెప్తాడు. గలతీ 1:15,16లో ఇంకాస్త వివరంగా చెప్తాడు. "అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని  ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు". అంటే ఈ విషయంలో సమస్త ఘనత దేవునికే ఆరోపిస్తున్నాడు. అతను పుట్టకముందే, తన తల్లి గర్భంలో ఉండగానే అతన్ని క్రీస్తు చెంతకు పిలిచి, తన పని కొరకు ప్రత్యేకపరచి, అన్యజనులకు అపొస్తలుడిగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నది దేవుడే. 1 తిమోతి 1:1లో పౌలు తనను తాను ఇలా కూడా పరిచయం చేసుకున్నాడు - "మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు,....". 

యూదాతో సహా దేవుడు అనాదికాలంలోనే ఈ 14 మందిని ఎన్నుకున్నాడు. యూదా గురించి అయితే పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా కూడా చెప్పబడింది. దేవుడే స్వయంగా తన సార్వభౌమ్య అధికారంతో అపొస్తలులను ఎన్నుకున్నాడు అన్నది స్పష్టం అవుతోంది. ఇది మొదటి గుర్తు. 

రెండవ గుర్తు, అపొస్తలుడు స్వయంగా యేసు క్రీస్తు చేత నియమించబడిన వాడయ్యుండాలి. 

ఎన్నుకున్నది దేవుడే, నియమించేది మాత్రం యేసుక్రీస్తు. మార్కు 3:14లో, యేసు తనతో ఉండటానికి పన్నెండు మందిని నియమించాడు. 16-19 వరకూ ఉన్న వచనాలలో వారి పేర్లు కూడా నమోదు చెయ్యబడ్డాయి. వీరు అపొస్తలులుగా ఉండుటకు దేవుని చేత ఎన్నుకోబడినవారే. యేసు నరావతారిగా వచ్చిన దేవుడే కాబట్టి ఆయనకు అన్నీ తెలుసని చదువరులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. దేవుని ఎన్నిక గురించి సంపూర్ణ జ్ఞానం కలిగిన యేసు, ఆ ఎన్నికలో ఉన్నవారినే అపొస్తలులుగా ఉండటానికి నియమించాడు.

ఒకసారి యేసు ఇలా అన్నాడు - "మీరు నన్ను ఏర్పరచుకొనలేదు;....నేను మిమ్మును ఏర్పరచుకొని (దేవుడు గనుక) నియమించితిని." అపొ.కార్య. 20:24లో పౌలు తన పరిచర్యనుద్దేశించి మాట్లాడుతూ "నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్య" ఇది అని అంటాడు. అలాగే రోమా 1:6లో ప్రభువైన యేసుక్రీస్తు నుండే తన అపొస్తలత్వాన్ని పొందుకున్నట్లు చెప్తాడు. లూకా 6:13లో "ఉదయమైనప్పుడు ఆయన (యేసు) తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను" అని చదువుతాము.

ఒక వ్యక్తిని అపొస్తలుడు అని అనాలి అంటే ముందుగా అతను దేవుని చేత ఎన్నుకోబడిన వాడయ్యుండాలి (క్రీస్తు ఆ ఎన్నికోబడిన వారెవరో ఎరిగినవాడు). రెండవదిగా, దేవుని సార్వభౌమ్య ఎన్నిక చొప్పున క్రీస్తే స్వయంగా నియమించాలి. 

మూడవ గుర్తు, అపొస్తలుడు యేసుక్రీస్తును స్వయంగా చూసిన ప్రత్యక్ష సాక్షి అయ్యుండాలి. 

అంటే ఆయనతో పాటు సహవాసం చేసినవాడయ్యుండాలి. అయితే యేసు క్రీస్తు ఏర్పరచుకున్న పన్నెండుమంది చివరి వరకూ నమ్మకంగా కొనసాగలేదు. అందులో ఒకరు యేసును మోసం చేయాలనుకున్నారు. అతనే ఇస్కరియోతు యూదా. అపొస్తలులతో కలిసి ఉన్నప్పటికీ, అతను అవిశ్వాసే. ప్రభువును వెంబడిస్తున్నట్లే అనిపించినప్పటికీ, అతను దుష్ట హృదయము గలవాడు. అతడొక లోభి. అతను ధనాన్ని, అధికారాన్ని ఎక్కువగా ప్రేమించాడు. యేసు మెస్సీయా కాబట్టి యేసు రోమా సామ్రాజ్యాన్ని కూల్చి, ఇశ్రాయేలుకి విమోచన అనుగ్రహించి, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకున్నాడు. యేసే రాబోయే రోజుల్లో యెరూషలేములోని సింహాసనాన్ని అధిష్టించి రాజుగా ఇశ్రాయేలును పరిపాలిస్తాడు కాబట్టి యేసు ద్వారా తనకేదైనా ప్రయోజనం ఉంటుందని అపొస్తలుల గుంపులో చేరి ఉండొచ్చు. యూదా గురించి యేసు ఒకసారి ఇలా అన్నాడు - "అందుకు యేసు - నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను" (యోహాను 6:70). యూదా ఎప్పుడూ మారుమనస్సు పొందలేదు, ఎప్పుడూ యదార్థంగా యేసుకు తనను తాను సమర్పించుకోలేదు. 

కానీ యూదా యేసును మోసం చేసిన తరువాత అతని హృదయం పశ్చాత్తాపంతో, అపరాధభావంతో నిండిపోయింది. అందుకని అతను ఇశ్రాయేలు పెద్దల యొద్ద నుండీ తీసుకున్న 30 వెండి నాణాలను వారికి తిరిగి ఇచ్చెయ్యబోగా వారు తీసుకోవడానికి నిరాకరించారు. దానితో వాటిని అక్కడే దేవాలయంలో పారేసి, వెళ్లి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఆ వెండి నాణాలు రక్తం చిందించడం కోసం ఖర్చుపెట్టినవి గనుక ఇశ్రాయేలు పెద్దలు వాటిని ముట్టుకోలేదు. వాటితో ఒక పొలము కొన్నారు, ఆ పొలము రక్తపు పొలము అని పిలువబడింది. 

పన్నెండుమందిలో ఒకరు తగ్గారు కాబట్టి అతని స్థానాన్ని భర్తీ చెయ్యాలి. ఆ ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం అపొ. కార్య. 1వ అధ్యాయంలోని సంగతులను పరిశీలించాలి. దాదాపుగా 120 మంది కూడియుండగా పేతురు వారి మధ్య నిలబడి ఇలా అన్నాడు - "సహోదరులారా, యేసును పట్టుకొనినవారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను" అన్నాడు. యూదా గురించి పాత నిబంధనలోనే ప్రవచనాత్మకంగా చెప్పబడింది (కీర్తన41:9). "అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను" (వ. 17). "ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను.... " అంటే నిజంగా యూదానే కొన్నాడని కాదు గానీ యూదా ఇశ్రాయేలు పెద్దలకు తిరిగి ఇచ్చేసిన వెండి నాణాలతో కొన్న పొలం అని అర్థం చేసుకోవాలి. అతను వెళ్లి ఉరేసుకున్నాడు. అంతమాత్రమే కాదు చెట్టు కొమ్మ విరగడం వల్లనో, లేక తాడు తెగడం వల్లనో "అతడు తలక్రిందుగా" పడ్డాడు. కింద రాళ్ళేవైనా ఉండి, చాలా ఎత్తునుండీ పడిపోయి ఉండొచ్చు అతను "......నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను"(వ. 18). అతని దుర్మార్గం ఎంత గొప్పదైయుండెనో, అతను చావు అంత ఘోరంగా ఉండింది. 

"ఈ సంగతి యెరూషలేములో కాపురమున్నవారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము." దీని గురించి కీర్తన 109:8లో ఇలా రాయబడింది - "అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక". 

ఈ ప్రవచనం సంపూర్ణంగా నెరవేరవలసి ఉందని పేతురు భావించి ఉండొచ్చు అందుకనే పేతురు "కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను". 

కాబట్టి ఒక వ్యక్తి అపొస్తలుడుగా నియమించబడాలి అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మము ఇవ్వడం మొదలుకొని యేసు పునరుత్థానుడై ఆరోహణమయ్యేంత వరకూ ఆయనతోనే ఉండినవాడయ్యుండాలి. అంటే యేసు పరిచర్య చేసిన కాలమంతా యేసుతో పాటే ఉన్న వ్యక్తి అయ్యుండాలి. 

"అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థనచేసిరి". ఏమని ప్రార్థించారు అంటే - "నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి." మళ్ళీ మొదటి నియమాన్ని ఈ ప్రార్థన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని అపొస్తలుడుగా ఎన్నుకునేది దేవుడే. ఇద్దరూ మంచి వ్యక్తులే కానీ దేవుని ఏర్పాటులో ఎవరు ఉన్నారో తెలియపరచమని దేవుణ్ణే వేడుకుంటున్నారు - "అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి. అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.

అయితే దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి నేటి విశ్వాసులు కూడా ఈ పద్దతిని అవలంభించాలో లేదో తెలుసుకోవడం కోసం ఈ కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా 'దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ - 1 & దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ - 2 చదవండి.

ఇక యూదా విషయానికొస్తే, యూదా యేసు జీవించిన కాలం అంతా ఆయనతో పాటు ఉన్నాడు కానీ, యేసు పునరుత్థానాన్ని మాత్రం చూడలేదు. యేసు జీవించినంతకాలము ఆయనతోపాటు ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని అపొస్తలుడు అని అనొచ్చు. కానీ అతను చివరివరకూ కొనసాగలేదు. అతని స్థానంలో మత్తీయని దేవుడు నియమించాడు కాబట్టి మరలా అపొస్తలుల సంఖ్య 12 అయ్యింది. అందరూ యేసు జీవితమంతటికీ, పునరుత్థానానికీ ప్రత్యక్ష సాక్ష్యులే.

పేతురు అపొ.కార్య. 10లో ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రసంగిస్తూ "అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము (అనగా అపొస్తలులుగా నియమించబడిన మేము) సాక్షులము". మేము ఎల్లప్పుడూ యేసుతో పాటే ఉండి, అంతటినీ కళ్లారా చూసినవాళ్ళము అని చెప్తున్నాడు. "ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడాయనను మూడవ దినమున లేపి  ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే," కనిపించాడు. 

నిజమే, పునరుత్థానుడైన యేసు అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్ష్యులకే కనిపించాడని పేతురు చెప్పడాన్ని బట్టి తాము దేవుని చేత ముందుగానే ఏర్పరచబడినవారమని చెప్తున్నట్లు అర్థం అవుతోంది. దేవుడు భూమి పునాదులు వేయకముందే తన సార్వభౌమ్య చిత్తంలో వీరు ఇంకా పుట్టకముందే వీరిని అపొస్తలులుగా ఏర్పరచుకున్నాడు. వీరిని యేసు పిలిచి, అభిషేకించాడు. వీరు "ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను."

కాబట్టి ఒక వ్యక్తి అపొస్తలుడిగా పిలువబడాలి అంటే - ముందుగా దేవుని చేత ఎన్నుకోబడినవాడయ్యుండాలి, యేసు చేత నియమించినబడిన వాడయ్యుండాలి. మూడవదిగా, యేసు జీవించినంత కాలము, ఆయన పరిచర్యనీ, పునరుత్థానాన్నీ చూసిన ప్రత్యక్ష సాక్షయ్యుండాలి. 

మరి పౌలు సంగతి ఏంటి? అతను కూడా అపొస్తలుడే కదా. ఈ నియమాలన్నీ అతనికి వర్తించవా? ఖచ్చితంగా వర్తిస్తాయి. మత్తీయ పదమూడవ వాడు కాగా, పౌలు పదునాలుగవవాడు. 1 కొరింథీ 15:4-8లో "లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. (సమాధి నుండీ బయటికి వచ్చెను) ఆయన కేఫాకును, (ఇది పేతురు యొక్క మరో పేరు) తరువాత పండ్రెండుగురికిని కనబడెను. (అంటే ముందు పేతురు ఒక్కడికీ కనిపించాడు, తరువాత మొత్తం పన్నెండు మందికీ కనిపించాడు) అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, (ఇతను యేసు క్రీస్తు సహోదరుడు) అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

అప్పుడు పౌలు అపొస్తలుడే కదా. వ్యక్తిగతంగా పునరుత్థానుడైన యేసును అనగా తిరిగి లేచిన క్రీస్తును పౌలు చూసాడు. ఒక వ్యక్తి అపొస్తలుడుగా పిలవబడటానికి కావాల్సిన యోగ్యతలన్నీ పౌలుకి ఉన్నాయి. పౌలు యేసుని ఇశ్రాయేలు దేశంలో గానీ, యెరూషలేములో గానీ చూడలేదు. యేసు పరిచర్య చేసిన కాలమంతా అనగా బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మము ఇవ్వడం మొదలుకొని ఆరోహణం వరకూ మిగిలిన అపొస్తలులు ఎలాగైతే యేసును చూస్తూ వచ్చారో అలా పౌలు యేసును చూడలేదు. కానీ చూసాడు, చాలా ప్రత్యేకమైన రీతిలో పౌలు పునరుత్థానుడైన యేసును చూసాడు. 

పౌలు తాను "అకాలమందు పుట్టినట్టున్న"వాడిని అని చెప్పడంతో పాటు "నేను అపొస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.  అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను" అని అంటాడు. 

కాబట్టి బ్రతికున్న పన్నెండుమందితో పాటు, ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అపొస్తలుడు చేరాడు. ఆ పనికి పౌలు యోగ్యుడుగా ఎంచబడు నిమిత్తం ప్రభువు తనను తాను అతనికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అపొ.కార్య. 9లో మనం చదువుతున్నట్లుగా దమస్కు మార్గంలో తనని తాను పౌలుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. పౌలు క్రైస్తవులను హింసించడం కోసం దమస్కు మార్గంలో వెళ్తుండగా దేవుడు సింహాసనాసీడైయున్న క్రీస్తును పౌలు యొద్దకు పంపగా, క్రీస్తు పౌలుకి ప్రత్యక్షం అయ్యాడు. పౌలు పునరుత్థానుడైన క్రీస్తుని చూసాడు. పౌలు ఈ ఒక్కసారి మాత్రమే గాక, మొత్తంగా మూడుసార్లు క్రీస్తును చూసినట్లు అపొస్తలుల కార్యముల గ్రంథంలో చదువుతాము.

అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే అసలు అపొస్తలుడు అని ఎవరిని అనాలి? ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి, క్రీస్తు చేత నియమించబడి, ప్రత్యక్షంగా పునరుత్థానుడైన క్రీస్తును చూసుంటారో వారిని మాత్రమే అపొస్తలులు అని అనగలం.

నాలుగవ గుర్తు. అపొస్తలుడు దేవుడు అనుగ్రహించిన విశిష్టమైన శక్తి సామర్థ్యాలను కలిగినవాడయ్యుంటాడు. 

ఇప్పటివరకూ ఈ పద్నాలుగు మంది మాత్రమే ఎందుకు అపొస్తలులుగా గుర్తించబడ్డారో చూసాము. ఇక వీరు మాత్రమే చెయ్యగలిగిన, చేసిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని బట్టి కూడా ఒక వ్యక్తిని అపొస్తలుడు అని గుర్తించవచ్చు. పరిచర్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు వీరికి అప్పగించబడ్డాయి. 

A) మార్కు 3:14లో ఇలా చదువుతాము - "వారు తనతో కూడ ఉండునట్లు....ఆయన పండ్రెండు మందిని నియమించెను." మనం ఇది వరకే అపొస్తలుల కార్యాల గ్రంథంలో చదివినట్లుగా అపొస్తలుడైనటువంటి వాడు క్రీస్తుతో కూడా ఉండాలి. ఆయనతో పాటు నడవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో పాటు తినాలి, జీవితంలోని అన్ని రకాల పరిస్థితుల్లో ఆయనతో కూడా ఉండాలి, ఆయనను దగ్గరగా గమనించాలి, వెంబడించాలి, అనుసరించాలి. ఆయనను పోలి ఎలా జీవించాలో నేర్చుకోవాలి. వారి జీవితాలు ఆయన జీవితాన్ని ప్రతిబింబింప చెయ్యాలి. పౌలు కూడా క్రీస్తు యొక్క మహిమతో కూడిన మూడు ప్రత్యక్షతలు చూసాడు. చాలా ప్రత్యేకమైన రీతిలో పౌలు కూడా ప్రభువుతో మంచి ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తును గురించిన ఆత్మీయ జ్ఞానంలో అతను వర్థిల్లడానికి ప్రభువుతో అతనికున్న వ్యక్తిగత సంబంధమే ఒక ప్రధానమైన కారణం. మిగిలిన అపొస్తలులు ఎలాగైతే దాదాపు మూడు సంవత్సరాలు వ్యక్తిగతంగా ప్రభువుతో సహవాసంలో ఉండి అపొస్తలీయ పరిచర్యకు సిద్ధపరచబడ్డారో అలాగే పౌలు కూడా దాదాపు మూడు సంవత్సరాలు అరేబియా ఎడారుల్లో ప్రభువుతో సహవాసంలో ఉండి అపొస్తలీయ పరిచర్యకు సిద్ధపరచబడ్డాడు (గలతీ 1:15-17). అపొస్తలుడు చెయ్యాల్సిన మొదటి పని - ప్రభువుతో పాటు ఉంటూ, ఆయనను పోలి ఎలా నడుచుకోవాలో నేర్చుకోవడం.

B) మార్కు 3:15 - "సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను." సువార్త ప్రకటన అనేది అపొస్తలుని రెండవ బాధ్యత. మత్తయి 28 ప్రకారం వారు సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి. క్రీస్తు వారికి బోధించిన సంగతులను అందరికీ బోధించాలి. మార్కు 16:20లో కూడా అదే విషయం చెప్పబడింది. "సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితివిు" అని రోమా 1:5లో పౌలు చెప్తాడు. 

ఈ ఆజ్ఞకు తగినట్లుగా అపొస్తలులు క్రీస్తు కృపను ప్రచురపరిచారు. క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని ప్రకటించారు. ఇదే సువార్త. సువార్త గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ "ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడితిని" (2 తిమోతి 1:11) అని అంటాడు

C) అపొస్తలులకు మాత్రమే ప్రత్యేకంగా అనుగ్రహించబడిన మరో అధికారము ఉంది. అదే దయ్యముల పైన అధికారము. ఇది ఒక అద్భుతమైన, విశేషమైన అధికారం. మార్కు 3:15 - "దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను." మత్తయి 10:1 - "....అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను." అలాగే  లూకా 9:1 - "ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి". కాబట్టి లేఖనాలను సమగ్రంగా పరిశీలిస్తే అపొస్తలులకి సమస్త దయ్యాలపైన అధికారం అనుగ్రహించబడినట్లు స్పష్టమవుతుంది. ఇది ఒక అద్భుతమైన గుర్తు. 

సమస్త దయ్యముల పైన సంపూర్ణ అధికారం. సాతానుతో సహా అన్ని రకాల దయ్యములపై సంపూర్ణ అధికారం. ప్రజలు దయ్యముల నుండీ విడుదల కావాలనుకున్నా, కావాలనుకోకపోయినా ఏ మనిషిలోనుండైనా దయ్యాలను వెళ్లగొట్టగలిగే అధికారం అపొస్తలులలకి అనుగ్రహించబడింది. ఇలా దయ్యాలు వెళ్లగొట్టడం కోసం ఏ మంత్రమూ జపించాల్సిన అవసరం లేదు. దయ్యములు పట్టినవారు ఎటువంటి ఒప్పుకోలు ప్రార్థనలు, పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ప్రార్థనలు చెయ్యాల్సిన అవసరం లేదు, చేసే పరిస్థితిలో కూడా ఉండరు. రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుపడే ఏ దయ్యం పట్టినవాడినైనా చూసి అతనిలో ఉన్న దయ్యంతో 'అతనిని విడిచిపొమ్మని' ఆజ్ఞాపించగల అధికారం ప్రభువు అపొస్తలులకు అనుగ్రహించాడు. 

అపొస్తలుని ఆజ్ఞకు లోబడని, అతని మాట వినని, అతని అధికారంతో కూడిన ఆజ్ఞకు కట్టుబడని దయ్యమే లేదు అంటే అతిశయోక్తి కాదు. బైబిల్ లో ప్రస్తావించబడిన చరిత్ర అంతటిలో ఇటువంటి అధికారము, శక్తి మనుషులు కలిగి ఉండటం గురించి ఎక్కడా చదవము. ప్రభువుకీ, ఆయన అపొస్తలులకీ తప్ప ఇటువంటి అధికారం ఏ మనిషికీ ఇవ్వబడలేదు. సమస్త దయ్యములపైన సంపూర్ణ అధికారం కలిగి ఉండటం అనేది సాధారణ విషయం కాదు. కానీ అపొస్తలులకి అటువంటి అధికారం అనుగ్రహించబడింది. వారు పరిచర్య నిమిత్తం వెళ్ళు ప్రతి చోట, దయ్యం పట్టినవారందరిలో నుండీ దయ్యములను వెళ్లగొడుతూ వచ్చారు. అపొస్తలులకి ఇవ్వబడిన అధికారం అటువంటిది. 

ఇది మాత్రమే గాక లూకా 9 & మత్తయి 10 ప్రకారం వ్యాధులను స్వస్థపరచు శక్తి కూడా అపొస్తలులకు అనుగ్రహించబడినట్లు తెలుస్తోంది. కేవలం అతీంద్రియ ఆత్మలు, అందులోనూ పడిపోయిన లేదా పాపంచేయడం ద్వారా పడద్రోయబడిన ఆత్మలపై అధికారం అనుగ్రహించబడటం మాత్రమే కాదు గానీ భౌతిక సృష్టిలో మానవ శరీరాలను బాధపెట్టే రోగాలను స్వస్థపరచగల అధికారం కూడా ప్రభువు అపొస్తలులకు అనుగ్రహించాడు. పాపం కారణంగా దేవుడు సృష్టించిన ఈ సృష్టి కూడా శాపానికి లోనై, మానవాళి వ్యాధికీ, బాధకీ, నొప్పికీ, చివరికి మరణానికి కూడా లోనయ్యింది. సమస్త వ్యాధులను తక్షణమే, ఉన్నచోటనే స్వస్థపరచగల అధికారాన్ని దేవుడు అపొస్తలులకు అనుగ్రహించాడు. ఈ రోజుల్లో అనేకులు మాకు స్వస్థపరిచే వరం ఉందనీ, దయ్యములను వెళ్లగొట్టే వరం ఉందనీ చెప్పుకుంటున్నారు. అటువంటివారు వేసే పిచ్చివేషాలకూ, అపొస్తలులకు నిజంగా అనుగ్రహించబడిన అద్భుతమైన శక్తి సామర్థ్యాలకూ పొంతనే లేదు. కేవలం నోటి మాట ద్వారా ఏ రోగినైనా నయం చెయ్యగల విశేషమైన అధికారం అపొస్తలులకు మాత్రమే అనుగ్రహించబడింది. ఇలా సమస్త దయ్యములపైనా అధికారం కలిగి ఉండటం, సమస్త వ్యాధులను స్వస్థపరచగలిగే అధికారం కలిగి ఉండటం ఒక నిజమైన అపొస్తలుని గుర్తులైయున్నవి. 

D) వీటితో పాటు కొత్త నిబంధన పుస్తకాలను రాసే బాధ్యత కూడా ప్రధానంగా అపొస్తలులదే. ఆ బాధ్యత అపొస్తలులైన వారికి అప్పగించబడింది. కొత్త నిబంధనలోని చాలా పుస్తకాలకు అపొస్తలులే గ్రంథకర్తలు. కొన్ని పుస్తకాలు మాత్రం అపొస్తలుల పర్యవేక్షణలో వారి పరిచర్యలో వారితోపాటు సహచరులుగా ఉన్నవారు రచించారు. ఉదాహరణకు లూకా సువార్త, అపొస్తలుల కార్యములు, ఈ రెండు పుస్తకాలను లూకా రచించాడు. లూకా పునరుత్థానుడైన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షి అయిన పౌలు యొక్క సహచరుడు, అతనికి అత్యంత సన్నిహితుడు. లూకా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినవాడై ఈ పుస్తకాలను రచించాడు. యాకోబు పత్రికను రాసింది యాకోబే. ఇతను అపొస్తలుడైన యాకోబు కాదు గానీ మన ప్రభువు సహోదరుడైన యాకోబు. యేసుక్రీస్తు జీవితమంతటినీ దగ్గర్నుండీ చూసినవాడు, పునరుత్థానుడైన క్రీస్తును కళ్లారా చూసినవాడు ఈ యాకోబు (1 కొరింథీ 15). యూదా పత్రికను యూదా రచించాడు. ఇతడు కూడా మన ప్రభువు సహోదరుడే. ఇతడు కూడా ప్రభువుకు అత్యంత సన్నిహితుడు. అపొస్తలుల పర్యవేక్షణలో ఉంటూ ఈ పత్రికను రాసాడు. మార్కు సువార్త - అపొస్తలుడైన పేతురు యొక్క జ్ఞాపకాల్లోని విషయాలను మార్కు తన సువార్త పుస్తకంలో పొందుపరిచాడు. మార్కు పేతురు యొక్క అపొస్తలీయ అధికారం కింద ఉంటూ ఈ గ్రంథాన్ని రచించాడు. కాబట్టి ఈ పుస్తకంలో యేసు క్రీస్తు జీవితాన్ని పేతురు చూసిన కోణంలో నుండీ చూడొచ్చు. 

కాబట్టి కొత్త నిబంధనలోని పుస్తకాలు, అయితే నేరుగా అపొస్తలుల చేత రాయబడి ఉండాలి ఉదాహరణకు - మత్తయి, యోహాను, పౌలు రాసిన 13 పత్రికలు, పేతురు రాసిన ప్రత్రికలు, యోహాను రాసిన పత్రికలు, యోహాను రాసిన ప్రకటన గ్రంథం లేదా అపొస్తలీయ బోధను మనకు లిఖితపూర్వకంగా అనుగ్రహించడం కోసం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన అపొస్తలుని సహచరులు ఎవరైనా రాసుండాలి.

ఈ అంశాన్ని ఇంకా లోతుగా ధ్యానించడం కోసం కింద ఇవ్వబడిన లింక్ ద్వారా "66 పుస్తకాలు మాత్రమే దేవుని వాక్యామా" అనే వ్యాసాన్ని చదవండి.

అయితే ఇలా దేవుని ప్రత్యక్షతను గ్రంథస్థం చేసే విషయంలో సహాయం చేస్తానని దేవుడు ఎప్పుడైనా వాగ్దానం చేశాడా? చేసాడు. మేడపైన గదిలో యేసు క్రీస్తు శిష్యులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడని వాగ్దానం చేసిన సందర్భంలో ఇలా అంటాడు- "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును"(యోహాను 14:26). తాను మత్తయి సువార్త రాయడంలో సాయం చేస్తానని దేవుడు మత్తయికి ఇచ్చిన వాగ్దానం ఇది. పరిశుద్ధాత్మ అతనిని ప్రేరేపించి, అన్ని సంగతులూ అతనికి జ్ఞాపకం చేసాడు. అలాగే యోహాను సువార్త రాయునట్లు పరిశుద్ధాత్మ యోహానుని కూడా ప్రేరేపించి, అతనికి కూడా అన్ని సంగతులు జ్ఞాపకం చేసాడు. పేతురు అన్ని సంగతులు జ్ఞాపకం ఉంచుకొని, మార్కుకు చెప్పేలా అలాగే మార్కు అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని మార్కు సువార్త రూపంలో వాటిని గ్రంథస్తం చేసేలా పరిశుద్ధాత్మ వారికి సాయం చేస్తాడని చెప్పి ప్రభువు ఇస్తున్న వాగ్దానం ఇది. లూకా సువార్తనూ, అపొస్తలుల కార్యముల గ్రంథాన్నీ రచించడంలో పరిశుద్ధాత్మ పౌలుని ప్రేరేపించి, పౌలు లుకాకి అన్ని సంగతులు తెలియజేయునట్లు సహాయం చేసాడు.

యోహాను 15:26 - "తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును." 'పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడతాడు. ఆయన నన్ను గురించి సాక్ష్యమిస్తాడు' అని యేసు చెప్పాడు. ఆ సాక్ష్యమే కొత్త నిబంధనలోని 27 పుస్తకాల ప్రత్యక్షత. యోహాను 16:13 - "అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని". ఇదే కొత్త నిబంధన పుస్తకాలను రచించడం గురించి యేసు తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానం. ఎందుకంటే సంఘానికి కావాల్సిన సర్వసత్యము కొత్త నిబంధనలో బయలుపరచబడింది. అంతకు మించిన సత్యం ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ సర్వసత్యములోకి నడిపించబడతారన్న వాగ్దానం ఈ కొత్త నిబంధన మనకిచ్చిన అపొస్తలుల ద్వారా నెరవేరిందని రూఢి చేసుకోవచ్చు.

ఇంతవరకూ మనం చూస్తూ వచ్చిన గుర్తులన్నింటినీ బట్టి అపొస్తలులు చాలా ప్రత్యేకమైనవారని అర్థం అవుతోంది. ప్రత్యేకమైన పనుల కోసం, ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలూ, ప్రత్యేకమైన వాగ్దానాలూ వారికి అనుగ్రహించబడ్డాయి.

ఐదవ గుర్తు, అపొస్తలుడు తన బోధ చేత సంఘానికి పునాది వేసే వాడయ్యుంటాడు.

ఎఫెసీ 2:20 - "క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు." ఏ భవనానికైనా నిర్మాణ ప్రారంభంలోనే పునాది వేస్తారు. ఆ పునాదిపైనే మిగిలిన భవనం అంతా కట్టబడుతుంది. అంతేగానీ మధ్యమధ్యలో పునాది వెయ్యడం అనేది జరగదు. అపొస్తలులు కూడా పునాదులవంటివారే. అందుకే ప్రారంభంలోనే సంఘానికి వారు అనుగ్రహించబడ్డారు. ఎఫెసీ 4:13 - "పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను,.....నియమించెను." అపొస్తలులు సంఘానికి పునాది వేశారు. పునాది అంటే? వారి బోధే. వారి బోధే వారు వేసిన పునాది. సంఘము అపొస్తలీయ బోధ అనే పునాది పైన కట్టబడింది. 

మొట్టమొదటిసారి విశ్వాసులు సంఘంగా కూడుకోవడం అనేది సంఘం ప్రారంభించబడిన అదే రోజున, పెంతెకొస్తు దినాన జరిగింది. ఆ ఆదిమ సంఘం గురించి ఇలా చెప్పబడింది - "వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి" (అపొ. కార్య. 2:42). సంఘానికి సత్యమే పునాది అయ్యుండాలి. అపొస్తలీయబోధ రూపంలో ఆ సత్యమే అపొస్తలుల నోట పలికింది, వారి కలం ద్వారా కాగితంపై ఒలికింది. ఆ విధంగా అపొస్తలులు సంఘానికి పునాది వంటివారు. వీరి బోధపైనే సంఘం కట్టబడింది. మరో విధంగా చెప్పాలంటే 27 పుస్తకాల కొత్త నిబంధనలోని సత్య సువార్త బోధ పైనే సంఘం కట్టబడింది. కొత్త నిబంధన అంటే అపొస్తలీయ బోధ, అపొస్తలీయ బోధ అంటే కొత్త నిబంధన. ఈ పునాది అపొస్తలులు ఒక్కసారి వేశారు. ఇక మళ్ళీ మళ్ళీ ఎవరూ పునాది వేయాల్సిన అవసరం లేదు. అనగా ఇక అపొస్తలుల అవసరం కూడా లేదు. కొత్త అపొస్తలులు వచ్చి కొత్త పునాదులు వేయాల్సిన అవసరం లేదు. యేసు చెప్పాడు "...నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను"(మత్తయి 16:18). ఈ సంఘానికి క్రీస్తు మూలరాయి, అపొస్తలీయ బోధ పునాది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ పునాదిని సరిగ్గా వేయించాడు. అదే ఈ రోజున పరిశుద్ధ గ్రంథం రూపంలో మన చేతుల్లో ఉంది. దీనిపైనే ప్రభువు తన సంఘాన్ని కట్టుకుంటానని చెప్పాడు. 

ఆరవ గుర్తు, అపొస్తలులు భవిష్యత్తులో గొప్ప స్థానాల్లో ఉంచబడతారనీ, గొప్పగా గౌరవించబడతారనీ వాగ్దానం చెయ్యబడింది. 

ఈ విధంగా కూడా అపొస్తలులు చాలా ప్రత్యేకమైనవారు. "పేతురు - ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా  యేసు వారితో ఇట్లనెను - (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు" (మత్తయి 19:27,28). యేసు తన రాజ్యాన్ని స్థాపించి,  సింహాసనాసీనుడై పరిపాలించాలి అని శిష్యులు కోరుకున్నారు. అయితే అదంతా వెంటనే జరిగిపోవాలని ఆశించారు. కానీ వారి కోరిక క్రీస్తు యొక్క రెండవ రాకడలో మాత్రమే నెరవేరుతుంది. అయితే అలా జరిగినప్పుడు మాత్రం ఈ పన్నెండుగురు పన్నెండు సింహాసనాల మీద కూర్చుంటారు అని యేసు చెప్పాడు. పన్నెండు సింహాసనాలు, పన్నెండు గోత్రములు, అంతే. ఈ పన్నెండుమందిలో మత్తీయ కూడా ఉంటాడు. అపొస్తలుడైన పౌలు ఈ పన్నెండుమందికీ వేరుగా నియమించబడిన ప్రత్యేకమైన అపొస్తలుడు గనుక అతను ఈ పన్నెండుగురితో కూడా లెక్కించబడడు. ఈ పన్నెండుగురు మాత్రం సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలను పరిపాలిస్తారని వాగ్దానం చేయబడింది.

అంత మాత్రమే కాదు, ప్రకటన 21:1,2,14 - "అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.......14. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి." పన్నెండు పునాదులపైన ఈ పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉండడాన్ని బట్టి నిత్యత్వంలో కూడా వీరు గొప్పగా గౌరవించబడతారు అనీ, ఘనంగా ఎంచబడతారు అనీ అర్థం అవుతోంది. ఆ పునాదుల మీద కేవలం ఈ పన్నెండుమంది పేర్లు మాత్రమే ఉంటాయి అంటే వీరు ఎంత ప్రత్యేకమైనవారో అర్థం చేసుకోవాలి.  

ఈ రోజుల్లో చాలామంది నేను అపొస్తలుడిని అని ప్రకటించుకుంటున్నారు. అటువంటివారు తమకన్నా ఎంతో ప్రత్యేకమైన పన్నెండుగురు అపొస్తలులు మాత్రమే కలిగి ఉన్న అధికారమూ, హోదా, గౌరవమూ, తమకు కూడా కావాలని, తమని ఆ పన్నెండుగురితో సమానంగా ఎంచుకునే ప్రయత్నమే చేస్తున్నట్లు. కానీ దేవుడు ఈ పన్నెండుమందినీ, పౌలునూ తప్ప ఇంకెవ్వరినీ అపొస్తలుడిగా ఎంచడు. 

లూకా 6:13లో యేసు పన్నెండుమందిని ఏర్పరచుకొని, వారికి అపొస్తలులు అని  పేరు పెట్టాడు. అలా 'అపొస్తలులు' అని పేరు పెట్టినప్పుడు యేసు ఏం చేస్తున్నాడు అంటే - వారిని ఒక పని కోసం తన ప్రతినిధులుగా నియమిస్తున్నాడు. నియమిస్తున్న వ్యక్తికి ఎంత అధికారం ఉంటుందో, ఆ ప్రతినిధికి కూడా అంతే అధికారం ఉంటుంది. యేసు ఈ పన్నెండుమందిని మాత్రమే తన ప్రతినిధులుగా నియమించాడు. యూదులు అపొస్తలుడిని లేదా ప్రతినిధిని, పంపించిన వ్యక్తే స్వయంగా తమ దగ్గరకు వచ్చి, ఆ మాటలు చెప్తున్నట్లుగా పరిగణించేవారు. అందుకే యేసు పన్నెండుమంది శిష్యులకు 'అపొస్తలులు' అని పేరు పెట్టిన తరువాత ఇలా చెప్తాడు - "మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును"(మత్తయి 10:40). 

హెబ్రీ 3:1లో యేసు దేవుని అపొస్తలుడు అని చెప్పబడింది. 'అపొస్తలుడు' అన్న మాట యొక్క పై నిర్వచనం ప్రకారం యేసు దేవుని అపొస్తలుడు కాబట్టి నువ్వు యేసుతో వ్యవహరిస్తున్నావు అంటే ఒక భావంలో దేవునితోనే వ్యవహరిస్తున్నట్లు. అలాగే అపొస్తలులు యేసు యొక్క ప్రతినిధులు కాబట్టి నువ్వు అపొస్తలులతో వ్యవహరిస్తున్నావు, అంటే స్వయంగా యేసుతోనే వ్యవహరిస్తున్నట్లు. 

పదమూడుమందేనా లేక కొత్త నిబంధనలో ఇంకెవరైనా అపొస్తలుడిగా గుర్తించబడ్డారా?

కొత్త నిబంధనలో మరికొందరు వ్యక్తులు కూడా అపొస్తలులుగా పిలువబడ్డారు. మరి వారి సంగతేంటి? వీరు సంఘము యొక్క అపొస్తలులు. ప్రభువు యొక్క గొర్రెపిల్ల అపొస్తలులకు ఉన్న అధికారము గానీ శక్తి గానీ వీరికి అనుగ్రహించబడలేదు. "అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను" అని అపొ.కార్య. 2:43 & 5:12లో చదువుతాము. సంఘము ద్వారా పంపబడినవారు అన్న భావంలో మాత్రమే వీరు అపొస్తలులుగా పిలువబడ్డారు. (2 కొరింథీ 8:23). బర్నబా అపొ.కార్య.13:1లో ప్రవక్తగా, బోధకుడిగా చెప్పబడ్డాడు. అలాగే పౌలుకి అత్యంత సన్నిహితుడు అయిన ఇతను అపొస్తలుడిగా కూడా చెప్పబడ్డాడు.(అపొ.కార్య.14:14). బర్నబా కూడా 2 కొరింథీ 8:23లో చెప్పబడిన విధంగానే సంఘము యొక్క అపొస్తలులలో ఒకడు. 

అలాగే కొందరు అపొస్తలులు కాకపోయినా అద్భుత కార్యములు చేసినట్లు చదువుతాము. ఉదాహరణకి, అపొ.కార్య. 8:13లో ఫిలిప్పు గురించి చదువుతాము. అపొస్తలుడైన ఫిలిప్పు కాదు, సువార్తికుడైన ఫిలిప్పు. అలాగే అపొ.కార్య.7:6లో స్తెఫను గురించి చదువుతాము. వీరు ఇరువురు సూచకక్రియలు, అద్భుతాలు చేశారు. ఎలాగైతే కొత్త నిబంధన పుస్తకాలను అపొస్తలులతో పాటు, వారి సహచరులు కూడా రచించారో, అలాగే అద్భుతాలు, సూచక క్రియలు చెయ్యగలిగే శక్తి కొంత మేరకు అపొస్తలుల ద్వారా వారి సన్నిహిత సహచరులకు కూడా అనుగ్రహించబడింది. 

అపొస్తలీయ వారసత్వం

యూదా మినహా మిగిలిన పన్నెండుమంది మాత్రమే గొర్రెపిల్ల యొక్క అపొస్తలులు. పౌలు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన పదమూడవ అపొస్తలుడు. వీరి తరువాత వీరి వారసత్వం ఎవరికీ అందించబడలేదు. ఈ పరిచర్య అటువంటిది కాదు. యోహాను ఈ పన్నెండుమందిలో చివరిగా చనిపోయినవాడు. అతను క్రీ.శ. 96లో ప్రకటన గ్రంథాన్ని రచించాడు. అదే సంవత్సరం చనిపోయాడు. యోహాను చనిపోవడంతో అపొస్తలుల కాలం ముగిసింది. కొత్త నిబంధన ఎలాగైతే మరల రాయబడదో, అలాగే అపొస్తలులు మరలా నియమించబడరు. అపొస్తలులు, వారి పరిచర్య ఎంత ప్రత్యేకమైనవో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో విశ్వాసులను గందరగోళానికి గురి చేసి మోసం చెయ్యడం కోసం అనేకులు బయల్దేరారు, జాగ్రత్త. 

ఎదుర్కోవాల్సిన ఆరోపణలు - లేఖనానుసారమైన సిద్ధపాటు 

ఈ విషయంలో చాలా ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటికి ధీటుగా జవాబు చెప్పే విధంగా సిద్దపడాల్సి ఉందని ప్రారంభంలో చెప్పాను. వాటి గురించి మరోసారి ఆలోచిద్దాము. అబద్ధ బోధకులు ఏం చెప్తారు అంటే - 'అపొస్తలులు చేసిన ప్రతి పని సరిగ్గా అదే విధంగా మనం కూడా చేయాలి. ఒకవేళ అలా చెయ్యలేకపోతే, అప్పుడు మనం తన శక్తినీ, మహిమనీ కోల్పోయిన అసమర్థుడూ, చేతగాని వాడూ అయిన వేరొక దేవుణ్ణి ఆరాధిస్తున్నవాళ్ళం అవుతాం. అపొస్తలులలాగే మనకు కూడా కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహించబడతాయి. మనకు కూడా దేవుడు దయ్యములపైన అధికారం అనుగ్రహిస్తాడు. స్వస్థతలు చేసే వరం అనుగ్రహిస్తాడు. ఇవన్నీ చెయ్యకపోతే, దేవుడు మన ద్వారా పని చేయడాన్ని మనమే అడ్డగిస్తున్నట్లు. ఆయన ఓడిపోవడానికీ, విఫలమవ్వడానికీ మనమే కారకులం అవుతాము. దేవుణ్ణి ఒక చేతగానివానిగా చిత్రీకరిస్తున్నవారం అవుతాము'. ఇలా రకరకాలుగా అబద్ధ బోధకులు అనేకులపై ఒత్తిడి తీసుకొచ్చి, బలవంతంగానో, భయపెట్టో తాము చెప్తుంది సత్యమే అని ఒప్పిస్తున్నారు.

కానీ సంఘ చరిత్రను పరిశీలిస్తే అనగా సంఘ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదివితే, రెండవ శతాబ్దంలో సంఘం యొక్క స్థితిగతులు, అది పని చేసిన తీరు చాలా భిన్నంగా ఉంటుంది. అది మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంలా ఉండదు. అది పూర్తిగా వేరే ప్రపంచం. చాలా భిన్నమైన రీతిలో సంఘం తన ఉనికిని కలిగి ఉందని గుర్తిస్తాము. ఒకవేళ ఇరవై ఒకటో శతాబ్దపు విశ్వాసులు ఒకసారి టైం మెషిన్ లో రెండవ శతాబ్దానికి వెళ్లి చూస్తే అవాక్కవుతారు కాబోలు. 'ఇదేంటి! మొదటి శతాబ్దపు సంఘం ఇలా లేదు కదా. అందులో అపొస్తలులు, ప్రవక్తలు ఉండేవారు కానీ ఈ సంఘంలో వాళ్ళెవరూ లేరేంటి. ఆ కాలంలోలాగా అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలను వెళ్లగొట్టడంవంటివి తరచుగా జరగడం లేదు ఏంటి?' అని ఆశ్చర్యపోక తప్పదు. అంతలా సంఘంలోని స్థితిగతులు మారుతూ వచ్చాయి. 

సామ్యూల్ గ్రీన్ అనే చరిత్రకారుడు సంఘ చరిత్రకు సంబంధించిన తన పుస్తకంలో ఇలా రాసాడు - 'సంఘం రెండవ శతాబ్దంలోకి అడుగుపెట్టేనాటికి, అది ఎన్నో మార్పులూ చేర్పులకు లోనయ్యింది. ఆ సంఘంలో అపొస్తలీయ అధికారం అంటూ ఏదీ లేదు. అపొస్తలులు చేసిన అద్భుతాలు, స్వస్థతలు మొదలైనవి వారితోపాటే గతించాయి'. అయితే ఒక ఖచ్చితమైన ఉద్దేశ్యంతో దేవుడే ఇలా చేసాడు అని అనుకోవచ్చు. దేవుడు వాటిని ఆ కాలానికి మాత్రమే పరిమితం చెయ్యాలనుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆ శక్తి సామర్థ్యాలూ, వరాలూ అపొస్తలులకు అనుగ్రహించబడ్డాయి. సంఘానికి పునాది వెయ్యడం ద్వారా దేవుడు వారికి అప్పగించిన పని వారు పూర్తి చేశారు. అందుకే తరువాత సంఘాన్ని కట్టే బాధ్యతను కొనసాగించడానికి అపొస్తలుల వారసులుగా కొత్త అపొస్తలులును నియమించకుండా, కాపరులకూ సువార్తికులకూ ఆ పని అప్పగించబడింది.

అపొస్తలులు కూడా ఎప్పటికీ అద్భుతాలూ, సూచక క్రియలూ చేస్తూ ఉండినారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అపొస్తలులు తమ వరాలను ఉపయోగించి అద్భుత కార్యాలు చెయ్యడం క్రమేపి తగ్గుతూ వచ్చినట్లు అపొస్తలుల కార్యాల గ్రంథంలో గమనించవచ్చు. ఉదాహరణకు అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలో యేసు క్రీస్తు ఆరోహణమైన తరువాత జరిగిన సంఘటనల గురించి చదువుతాము. రెండవ అధ్యాయంలో సంఘం యొక్క ఆవిర్భావం గురించి చదువుతాము. ఆ తొలి దినాల్లో లేదా ప్రారంభ దశలో అపొస్తలులు ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు చేస్తూ వచ్చారు. అపొ. కార్య. 5:16లో "వారందరు స్వస్థత పొందిరి" అని చదువుతాము. కానీ ఇరవై అయిదు సంవత్సరాల తరువాత, అపొస్తలులందరిలోకెల్లా గొప్పవాడైన పౌలు - "నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను" (2 కొరింథీ 12:7) అని అన్నాడు. పౌలు ఈ ముల్లును తన శరీరంలో నుండి తీసేసుకోలేపోయాడు. ముల్లును తీసివేయమని ప్రభువును వేడుకుంటాడు కానీ ప్రభువు దానిని తీసెయ్యడు. చివరి దినాల్లో తన ప్రియ మిత్రుడైన తిమోతి తరచూ అనారోగ్యం పాలవుతున్నాడని పౌలుకి తెలుస్తుంది. వెంటనే ఏదైనా చేసి అతనిని స్వస్థపరచకుండా, అతనికి పత్రిక రాస్తూ కొంత ద్రాక్షారసాన్ని ఔషధంలాగా తీసుకోమని సూచిస్తాడు. 'అసలేం జరుగుతుంది ఇక్కడ' అని అనిపిస్తుంది. పౌలు తొలి దినాల్లో ఎంతో మందిని స్వస్థపరిచాడు కదా. చాలామంది దయ్యం పట్టినవారి నుండి దయ్యాలను తోలివేశాడు. మరి ఇప్పుడేంటి ఇలా చేస్తున్నాడు? ఇలా వ్యాధిగ్రస్తుడైన తిమోతిని స్వస్థపరచకుండా వదిలెయ్యడం ఏంటి? 

తరువాత పౌలు మిలేతుకి వెళ్లినట్లు 2 తిమోతి 4:20లో చదువుతాము. అప్పుడు కూడా తన స్నేహితుడొకడు తీవ్ర అనారోగ్యం పాలైతే పౌలు ఏం చేసాడో చూడండి. "త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని" (2 తిమోతి 4:20). ఏమిటేమిటి, అపొస్తలుడైన పౌలు, తన స్నేహితుడు అస్వస్థతకు గురైతే, తక్షణమే స్వస్థపరచకుండా, అదే స్థితిలో అతనిని విడిచి వచ్చేసాడా? అవును. 

అపొస్తలుల కార్యముల గ్రంథం ప్రారంభ అధ్యయాలు చదివితే క్రీస్తును ప్రకటించే ఏ సువార్తికుడు చనిపోయినట్లు చదవము. అసాధారణ వ్యక్తులుగా వారు కనబడతారు. కానీ అపొ. కార్య. 7వ అధ్యాయం వచ్చేసరికి స్తెఫను రాళ్లతో కొట్టి చంపబడతాడు. ఆ తరువాత యాకోబుకు మరణ శిక్ష విధించబడి చంపబడతాడు. ‘అసలేం జరుగుతుంది’ అని ఆలోచిస్తే పరిస్థితులు మారుతున్నాయి అని అర్థం అవుతుంది.

మీరు గమనిస్తే, అపొస్తలులు చేసే అద్భుత కార్యాలు క్రమేపి తగ్గుతూ ఒకానొక సమయంలో మొత్తానికే కనుమరుగైపోయాయి. ఇక చివరిదశలో అపొస్తలులు చాలామంది ఒక్కొక్కరుగా హతస్సాక్షులవ్వడం కూడా చూస్తాము. పౌలు శిరచ్ఛేదనము చేయబడ్డాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో బంధించబడ్డాడు. 

ఆదిమ సంఘంలో ఇలా అపొస్తలులు సూచక క్రియలు చెయ్యడం తగ్గిపోతూ వచ్చినట్లు గమనించారా! అంత మాత్రాన దేవుని శక్తి తగ్గిపోయినట్లా? కానే కాదు. కొత్త నిబంధన లేఖనాలు పూర్తిగా గ్రంథస్తం చెయ్యబడ్డాయి. అప్పటికి అపొస్తలులు ఎవరో సంఘం ఖచ్చితంగా నిర్ధారించుకోగలిగింది కాబట్టి వారి పత్రికలను మాత్రమే దేవుని చేత ప్రేరేపించబడిన అధికారిక లేఖనాలుగా సంఘం అంగీకరించింది. ఇలా కొత్త నిబంధన పూర్తిగా గ్రంథస్థం చెయ్యబడిన తరువాత ఇక సూచనలతో పనేముంది. 

అపొస్తలీయ కాలంలో జరిగినవి సాధారణ సంఘటనలు కావు. మొదటి శతాబ్దానికి ముందు గానీ తరువాతగానీ అటువంటివి ఎన్నడూ జరగలేదు. జరగబోవు. అయితే అద్భుతాలు, సూచక క్రియలు చెయ్యడం ద్వారా తాము దేవుని చేత పంపబడిన అపొస్తలులమని ధృవపరుస్తూ వారు ప్రకటించిన సత్యాన్ని మనం గట్టిగా హత్తుకోవాలి. ఆ అపొస్తలీయ బోధను శ్రద్ధగా చదవాలి, గైకొనాలి. 

దేవుని పరిశుద్ధ లేఖనాలు మనకు చాలినవి. ఆయన అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ మనకు చాలినవాడు. "దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది" (2 తిమోతి 3:16 & 17). 

యేసే క్రీస్తని దేవుడు మరలా ధృవీకరించాల్సిన అవసరం లేదు. అలాగే పేతురు, యోహాను మొదలగు పన్నెండుమంది మాత్రమే తాను స్వయంగా నియమించిన అపొస్తలులని దేవుడు మరలా ధృవీకరించాల్సిన అవసరం లేదు. అలాగని దేవుడు గడచిన రెండు వేల సంవత్సరాలలో ఎటువంటి అద్భుత కార్యాలూ చెయ్యలేదని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఆయన అనేకులను తన సువార్త చేత రక్షించుకున్నాడు. ఎంతో మంది ప్రార్థనలకు జవాబు దయచేసాడు. మరెంతో మందిని ఇంకెన్నో రకాలుగా దీవించాడు. ఇంకా ఇటువంటి అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఇటువంటి కార్యాలు చెయ్యడానికి అపొస్తలులు ఉండాల్సిందే, వారి ద్వారా మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు అన్న నియమం మనుషులు కల్పించినదే గానీ వాక్యంలో అటువంటి నియమం ఏదీ మనకు కనిపించదు.

ముగింపు

పైన చెప్పినవాటన్నింటినీ సమగ్రంగా అర్థం చేసుకొని ఆలోచిస్తే తేలిన ఫలితార్థం ఇదే. అపొస్తలుడు అంటే పంపబడినవాడు అన్న భావం వస్తుంది కాబట్టి లేఖనాలంతటిలో మనకు నాలుగు కోవలకు చెందిన అపొస్తలులు మాత్రమే కనిపిస్తారు.

  1. తండ్రి చేత పంపబడిన కారణాన్ని బట్టి యేసు క్రీస్తు 'అపొస్తలుడు' అని పిలువబడ్డాడు. (హెబ్రీ 3:1)
  2. యేసుక్రీస్తు చేత పంపబడిన పన్నెండుమంది 'గొర్రెపిల్ల అపొస్తలులు' అని పిలువబడ్డారు.
  3. యేసుక్రీస్తు చేత పౌలు ప్రత్యేకంగా పంపబడినవాడు గనుక అతను కూడా ఒక ప్రత్యేక హోదాలో 'అపొస్తలుడు' అని పిలువబడ్డాడు.
  4. సంఘం చేత పంపబడినవారు కూడా 'పంపబడినవారు' అన్న భావంలో 'అపొస్తలులు' అని పిలవబడ్డారు.

 

ఈ రోజు మహా అయితే పైన చెప్పిన నాల్గవ కోవకు చెందిన అపొస్తలులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే వారికి కూడా మొదటి మూడు కోవలకు చెందినవారికి వలే అధికారాలూ, సామర్థ్యాలూ ఉండవు కానీ సంఘం వారికి అప్పగించిన బాధ్యతకు మాత్రమే వారి అపొస్తలత్వము పరిమితం.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.