దుర్బోధలకు జవాబు

రచయిత: Truth for Christ Ministries

 ప్రియమైన క్రైస్తవ సహోదరీ సహోదరులకు మహాదేవుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. బైబిల్ ముందుగా హెచ్చరించినట్లుగానే ఈ అంత్యకాలంలో అనేకమంది అబద్ద ప్రవక్తలు వచ్చి కోట్లమంది క్రైస్తవుల్ని తప్పుమార్గంలోనికి నడిపిస్తున్నారు. ఇలా మోసగించిన అబద్ద ప్రవక్తల్లో 'విలియం మారియన్ బ్రెన్‌హాం' అతి ముఖ్యుడు. ఇతడు 1909 సం||లో కెంటక్కి (అమెరికా) అనే ప్రాంతంలో జన్మించాడు. 1943లో విలియం హీలింగ్ మినిస్ట్రీని ఇతడు ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే విస్తారమైన పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అనేక దేశాలు తిరిగాడు. ఒకప్రక్క క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడుబోధల్ని ఖండిస్తూ మరోప్రక్క మరింత తప్పుడు బోధలు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఆదిమ సంఘానికి పౌలు ఎలాగో ఈ చివరి సంఘానికి తాను అలాంటివాడు అనీ, తనని ప్రవక్తగా అంగీకరించకుంటే రక్షణ దొరకదు అనీ, బైబిల్ లో అతని గురించి ముందుగానే ప్రవచింపబడింది అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

తాను పుట్టినప్పుడు అతని గదిలో ఒక వెలుగు ప్రకాశించి అతని తలకి పైగా నిలిచిందని, అతడు బాల్యంలో ఉండగా పక్షులు అతనితో మట్లాడాయని, అతని 7వ సంవత్సరంలో సుడిగాలిలో నుండి దేవుడు అతనితో మాట్లాడాడు అని చెప్పుకుంటూ అందరి దృష్టిలో ప్రవక్తగా ముద్ర వేయబడ్డాడు. బైబిల్ లోని మర్మాలను వివరించడానికి ఈ లవొదికయ యుగానికి దూతగా దేవుడు తనను పంపాడని చెప్పుకున్నాడు. ఏడు సంఘకాలముల కోసం, ఏడు ముద్రల కోసం పుస్తకాలు రాసి, ఒక దేవదూత తనతో ఉండి వీటన్నిటినీ తనకి బోధించేదని, ఆ దేవదూతే తన పరిచర్య అంతటినీ నడిపిస్తుందనీ చెప్పుకునేవాడు. కానీ నిజానికి అతడు 1919లో క్లేరెన్స్ లార్కిన్ విడుదల చేసిన 'ది బుక్ ఆఫ్ రెవలేషన్' మరియు చార్లెస్ రస్సెల్ రాసిన 'సంఘకాలములు' అనే పుస్తకాల ఆధారంగా ఈ విషయాలను వ్రాసాడు.

అయినా, నూతన నిబంధన ప్రజల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తాడు కానీ దేవదూత కాదు. అసలు దేవదూత దిగివచ్చి చెప్పినా మరొక సువార్తని అంగీకరించవద్దని వాక్యం హెచ్చరిస్తుంది ((గలతీ 1:8).) బ్రెన్‌హాం చెప్పిన చాలా ప్రవచనాలు, దర్శనాలు నెరవేరకపోయినప్పటికీ అతని అనుచరులు అతనిని వెంబడిస్తూనే ఉన్నారు. వీరిని బ్రెన్హమైట్స్ అంటారు. బ్రెన్‌హాం, బైబిలుకు ఎన్నో వచనాలు కలిపి, మరెన్నో వచనాలు తీసేసాడు. అతడు తప్పుమార్గంలో వెళ్తున్నాడని అతని సన్నిహితులు హెచ్చరించినా అతడు లెక్కచేయలేదు. చివరికి 1965 డిసెంబర్ 18న బ్రెన్‌హాం ప్రయాణించే కారు యాక్సిడెంట్ అయ్యి, తలకి తీవ్ర గాయమవడంతో అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయి డిసెంబర్ 24న చనిపోయాడు. రెండవ రాకడ వచ్చే వరకూ ఉంటానని చెప్పిన తమ ప్రవక్త ఇలా అకస్మాత్తుగా చనిపోవడాన్ని బ్రెన్హమైట్స్ నమ్మలేకపోయారు. అతడు ఖచ్చితంగా మళ్ళీ బ్రతుకుతాడని గ్రుడ్డి నమ్మకంతో అతని శవాన్ని సుమారు 4 నెలల పాటు జాగ్రత్త పెట్టి, ఇక చేసేది లేక 1966 ఏప్రిల్ 11న సమాధి చేసారు. ఇతడు వ్రాసిన పుస్తకాలు, చెప్పిన వాక్యపు  రికార్డింగులను బ్రెన్హమైట్స్ ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నారు. హ్యూస్టన్ ఇండోర్ స్టేడియంలోఇతనిని ఫోటో  తీసినప్పుడు వెనుక ఉన్న ఫ్లడ్ లైట్ మీద ఫ్లాష్ పడి ప్రింట్లో తెల్లని మచ్చలాగా  వచ్చింది. సాధారణంగా చాలా ఫోటోలు అలా వస్తుంటాయి. ఆ ఫోటో తీసిన డగ్లస్ స్టూడియోవారు, వెనక ఉన్న లైట్ ఫోకస్ పడింది, క్షమించండి అని కూడా బ్రెన్‌హాంకి లెటర్ రాశారు. కానీ బ్రెన్‌హాం, అది తనను వెంబడిస్తున్న అగ్ని స్తంభం అని తన అనుచరుల్ని నమ్మించాడు.

బ్రెన్‌హాంవి అనేక ఫోటోలున్నాయి. ఏ ఫోటోలోనూ ఈ అగ్ని స్తంభం ఎందుకు కనిపించదు? కంటికి కనిపించని సహజాతీతమైనవాటిని కెమెరా ఎలా ఫోటో తియ్యగలుగుతుంది? ఇంతకు ముందు ఏ ప్రవక్తనైనా అగ్నిస్తంభం వెంటాడిందా? ఇవేం ఆలోచించకుండా, వారంతా ఆ ఫోటో తమ ఇళ్ళలో పెట్టుకుని అతనిని ఆరాధిస్తున్నారు. (మలాకీ 4:5,6)లో చెప్పబడిన ఏలీయా తానేనని చెప్పుకుంటాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ఈ ప్రవచనంలో సగమే నెరవేర్చాడని, మిగిలిన సగం నెరవేర్చడానికి ఏలీయా ఆత్మతో నేనొచ్చాను అంటాడు. నిజానికి యోహానులో ఆ ప్రవచనం సంపూర్ణంగా నెరవేరింది. గబ్రియేలు ఇలా చెప్పాడు "ఈ శిశువు ఇశ్రాయేలీయులలో అనేకులను దేవునివైపు త్రిప్పును. అవిధేయులను, నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పును (అనగా పిల్లల హృదయమును తండ్రుల తట్టుకు తిప్పుట), మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు త్రిప్పును" (మత్త 11:14; లూకా 1:16, 17), నిజానికి ఈ ప్రవచనం ఇశ్రాయేలీయుల కోసం వ్రాయబడింది. దేవుడు ఏలీయా వంటి ప్రవక్తను ఇశ్రాయేలీయులైన మీ వద్దకు పంపుతానని చెప్పాడు.(మలా 1:1), (మలా 4:4,5). ఆయన చెప్పినట్లుగానే యోహానును ఇశ్రాయేలీయుల వద్దకు పంపాడు.

ప్రకటన 10:7లో "7వ దూత పలుకు దినములలో" అని వ్రాయబడింది, ఆ దూత నేనే అన్నాడు బ్రెన్‌హాం. కానీ ఆ దూత పరలోకంలో బూరలు పట్టుకుని ఉన్న 7గురు దేవదూతలలో ఆఖరివాడు (ప్రక 8-10 అధ్యా), '7వ దూత శబ్దము చేయుటకు బూర ఊదబోవుచుండగా' అనేది అక్కడ వ్రాయబడిన వచనానికి అసలు తర్జుమా... బ్రెన్‌హాం మొదట తనని బాప్తిస్మమిచ్చు యోహానువంటివాడిగా చెప్పుకున్నాడు. అనేకులు తనని అనుసరిస్తుండగా తనను ఏలీయాగా చెప్పుకున్నాడు. 1964వ సం|| నుండి బ్రెన్‌హాం మరింత దుర్బోధ చెయ్యడం మొదలుపెట్టాడు. (లూకా 17:30)లో మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడని వ్రాయబడినది తన కోసమే అన్నాడు. సుమారు 32సార్లు తనని తాను మనుష్యకుమారుడను అని చెప్పుకున్నాడు. అనేకమంది అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభువు ముందుగా చెప్పినట్లుగానే బ్రెన్‌హాం రూపంలో మరో అబద్ధ క్రీస్తు వచ్చాడు ((మత్త 24:24)). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల మంది బ్రెన్‌హాంను అనుసరిస్తున్నారు. వీరంతా రాత్రీ పగలు శ్రమిస్తూ క్రైస్తవుల్ని బ్రెన్హమైట్లుగా మారుస్తున్నారు.

ఏదెను తోటలో సాతాను, హవ్వ శారీరకంగా కలిసి వ్యభిచరించడం వల్ల కయీను పుట్టాడు అనీ, ప్రవక్తని అంగీకరిస్తేనే రక్షణ అనీ, అన్యుల కోసం అవతరించిన మెస్సీయ బ్రెన్‌హామని వీళ్ళు బోధిస్తుంటారు. వీరి 'వర్తమాన సంఘాలలో' (Message Churches) బైబిల్ కన్నా ఎక్కువగా ఇతని బోధలే ప్రకటింపబడతాయి. క్రీస్తు కంటే ఎక్కువగా ఇతనినే ఆరాధిస్తుంటారు, ఇతనిని బట్టే అతిశయిస్తుంటారు. యేసుక్రీస్తు దేవుడు కాడని అన్నా వీరు సహిస్తారు కానీ, బ్రెన్‌హాం ప్రవక్త కాడు అంటే మాత్రం అస్సలు సహించరు. వీరి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి.

 

%MCEPASTEBIN%

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.