వాక్యానుసారమైన TULIP సిద్ధాంతాలను తెలుగు క్రైస్తవుల్లో తప్పుగా చిత్రీకరించేందుకు మన ప్రవీణ్ పగడాలగారు మరియు అతని బృందమూ కలసి, వారి హద్దుల్లేని వక్రీకరణ నైజాన్ని వాక్యపునాది అనే వెబ్ సైట్ లో ప్రచురిస్తూ వస్తున్నారని మనకు తెలిసిందే; ఆ వక్రీకరణలలో కొన్ని అంశాలను బహిర్గతం చేస్తూ ఇప్పటికే ఐదుభాగాలను మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ ఆరవభాగంలో కూడా అదే చేయబోతున్నాం. ఈ క్రింది లింక్ ద్వారా,'దేవుడే జరిగించిన హేయమైన అకృత్యాలు - కాల్వినిజం వింతబోధ' అంటూ ప్రవీణ్ పగడాలగారు రాసిన వ్యాసాన్ని మీరు చదవొచ్చు.
దేవుడే జరిపించిన హెయమైన అక్రుత్యాలు - క్యాల్వినిజం వింత బోధ
ప్రవీణ్ పగడాలగారు తన వ్యాసం ప్రారంభంలో, కాల్వినిజంలో దేవుడు పాపానికి కర్తనా, కాదా అనే విషయంలో రకరకాలుగా నమ్మేవారుంటారనీ, ఎవరైతే ఆయన పాపానికి కర్త, ఆయన నిర్ణయం చొప్పునే సమస్త పాపాలూ జరుగుతున్నాయని చెబుతుంటారో, వారికి మాత్రమే ఈ వ్యాసం వర్తిస్తుంది తప్ప ఆ విధంగా నమ్మని కాల్వినిస్టులకు వర్తించదని తెలియచేసారు. కేవలం కాల్వినిజంలోనే కాదు, ప్రతీ సైద్ధాంతిక వివాదం విషయంలోనూ ఒకే పేరుతో పిలవబడుతూ రకరకాలుగా నమ్మేవారుంటారు. ఉదాహరణకు మన తెలుగు క్రైస్తవ్యంలోనే 'త్రిత్వ సిద్ధాంతం' పేరుతో ముగ్గురు దేవుళ్ళున్నారని చెప్పేవారు, ఒకే వ్యక్తి మూడు పాత్రలు పోషించాడని చెప్పేవారు కూడా ఉన్నారు. అంతమాత్రాన త్రిత్వాన్ని నమ్మేవారంతా తమకు ముగ్గురు దేవుళ్ళని కానీ, ఒకే వ్యక్తి మూడు పాత్రలు పోషించాడని కానీ నమ్మరు కదా!
ఇక ప్రవీణ్ పగడాలగారు, యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గురించి, అటువంటి ఘోరమైన హింసను దేవుడే నిర్ణయించాడని జాన్ పైపర్ గారు మాట్లాడినదాన్ని ప్రస్తావిస్తూ, అది తప్పన్నట్టుగా వాపోయారు. దేవుని సంకల్పానికీ, భవిష్యత్తు జ్ఞానానికీ మధ్య ఉన్న తేడా ప్రవీణ్ గారికి తెలియదని ఆయన వ్యాసం చదివిన ఎవరికైనా అర్థమౌతుంది. ఇంతకూ దేవునికి భవిష్యత్తు జ్ఞానం తెలుసు కాబట్టి దానికి అనుకూలంగా తన సంకల్పాన్ని పుట్టించుకున్నాడా లేక ఆయన సంకల్పాన్ని బట్టే ఆయనకు భవిష్యత్తు జ్ఞానం తెలుసా? దీనికి ప్రవీణ్ పగడాలగారు సమాధానం చెప్పాలి.
దేవుడు నిశ్చయించిన సంకల్పము మరియు ఆయన భవిష్యత్తు జ్ఞానము ప్రకారమే యేసుక్రీస్తు దుష్టుల చేత సిలువ వేయబడ్డాడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది.
అపొస్తలుల కార్యములు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.
ఇక్కడ దేవుని ఉద్దేశమేమీ మారిపోలేదు, ఆయన యేసుక్రీస్తు ఎలా అయితే చనిపోవాలని తన సంకల్పంలో నిశ్చయించాడో, దానినే తన భవిష్యత్తు జ్ఞానంలో చూసాడు, దానినే చేసాడు. ఈవిధంగా ఆయన సంకల్పానుసారంగానే జరిగినప్పటికీ, తమ స్వేచ్ఛా చిత్తంతో(ఫ్రీవిల్ తో) ఈ ఘోరాన్ని జరిగించిన ఇస్కరియోతు యూదా మరియు మిగిలినవారు దోషులు అయ్యారు. అపో.కార్యములు 4:26-28 - 'ప్రభువు మీదను ఆయన క్రీస్తుమీదను(అనగా అభిషిక్తునిమీదను) భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.' అదేవిధంగా ప్రపంచంలో ఏ కీడు జరిగినా, ఆ కీడు చేసినవారు తప్పకుండా ఆయన ముందు దోషులే అయినప్పటికీ, దానివెనుక ఖచ్చితంగా దేవునికున్న చిత్తమేదో నెరవేరుతుంది. యేసేపు విషయంలో కూడా మనమిదే చూడగలం.
ఆదికాండము 50:19,20 యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
ఈ సందర్భంలో యోసేపు సోదరులు ఏదైతే ఉద్దేశించారో దానిని ప్రవీణ్ పగడాలగారు చెబుతున్నట్టు దేవుడు తన భవిష్యత్తు జ్ఞానం చూసి వాడుకోలేదు. ఆయన కూడా దానిని ఉద్దేశించి అనుమతించాడు/జరిగించాడు; అయినప్పటికీ వారు దోషులే, దానికి బాధ్యులే. ఆయన తన సంకల్పాన్ని బట్టి ఉద్దేశించడానికీ మరియు జరిగేదాన్ని ముందుగా తెలుసుకుని దానిని వాడుకోవడానికీ మధ్య ఉన్న తేడా అయ్యగారికి తెలీకపోతే అది కూడా కాల్వినిస్టుల తప్పేనా? ఇంతకూ భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు, ప్రవీణ్ పగడాలగారు చెబుతున్నట్టుగా మానవులందర్నీ ప్రేమించి, అందరికీ నిత్యజీవాన్ని ఇవ్వాలని కోరుకుంటుంటే, వారిలో కొందరు తమ ఫ్రీవిల్‌తో నరకానికి వెళ్తారని ఆయనకు ఖచ్చితంగా తెలుసు కదా? వారు యుగయుగాలు నరకంలో కాలతారని తెలిసిన దేవుడు వారికి ఫ్రీవిల్ ఇవ్వడం ప్రేమ ఎలా ఔతుందబ్బా? నేనైతే నా కుమారుడు గన్ తో కాల్చుకుంటాడని తెలిసి వాడి చేతికది ఇవ్వను. ఈ లెక్కన ప్రవీణ్ పగడాలగారు నమ్మే దేవునికి నాకున్నంత ప్రేమ కూడా లేదు.
ఇకపోతే, దేవుడు సార్వభౌముడు అనేది వాస్తవమే అని ప్రవీణ్ పగడాలగారు అంటూ ఆ సార్వభౌమత్వం ఎలా ఉంటుందో కూడా బైబిల్ చెబుతుందంటూ కీర్తనలు 115:16 వచనాన్ని చూపించారు.
కీర్తనల గ్రంథము 115:16 ఆకాశములు యెహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు.
ఈ వచనంలో దేవుడు భూమిని నరులకు ఇచ్చాడంటే, భూమిపై వారేం చేసినా ఆయన తన ప్రమేయాన్ని చూపడని, తన చిత్తం చొప్పున వారిని నడిపించడని కాదు, తన సార్వభౌమ అధికారం క్రిందనే వారికది ఇచ్చాడు. ఈ వచనాలు చూడండి.
సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును.
భూమిని నరులకు ఇచ్చేసి వారిష్టం వచ్చినట్లు జరిగిస్తుంటే చూస్తూ ఉండి, చివరిలో తీర్పు తీర్చేవాడే దేవుడని ప్రవీణ్ గారు చెప్పేది నిజమైతే, ఈ వచనంలో భూమిని పాలించే రాజు హృదయాన్ని సైతం తన చిత్తవృత్తి చొప్పున ఆయన త్రిప్పుతుంటాడని చెబుతుంది. ఇటువంటి వచనాలు మరెన్నో మనం బైబిల్‌లో చూడగలం.
సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.
సామెతలు 20:24 ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొనగలడు?
అదేవిధంగా ప్రవీణ్‌పగడాలగారు కాల్వినిస్టులు దేవునిలో రెండురకాల చిత్తాలు ఉన్నాయని చెబుతుంటారని, అది సరైంది కాదన్నట్టుగా చిత్రీకరించారు. వాస్తవానికి బైబిల్ ఇదే చెబుతుంది; ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనకు దేవుని చిత్తమేంటో తెలియచేయబడింది, అయినప్పటికీ ఇది మాత్రమే ఆయన పూర్తి చిత్తం, ఇది తప్ప ఆయనలో మరేమీ లేదని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ సృష్టిలో బైబిల్ లో తెలియచేయబడనివెన్నో జరుగుతున్నాయి.ఈ వచనాన్ని చూడండి.
ద్వితియోపదేశకాండము 29:29
రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.
దీనిప్రకారం దేవునిలో మనకు తెలియని మరో చిత్తముందని బైబిలే స్వయంగా సాక్షమిస్తుంది. దానిని అనుసరించి ఆయన ప్రపంచంలో జరిగే అన్నిటినీ ఎందుకు అనుమతిస్తున్నాడో, ఎందుకు ఉద్దేశిస్తున్నాడో ఆయనకు మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు యూదా గురించి మాట్లాడుతూ, 'ఆ మనుష్యుడు పుట్టనియెడల వానికి మేలు' అంటున్నాడు. ఇంతకూ యూదా ఎవరి చిత్తాన్ని బట్టి పుట్టాడు? దేవుని చిత్తమేనా లేక ప్రవీణ్ గారి సిద్ధాంతం ప్రకారం ఫ్రీవిల్ తో కానీ పుట్టేసాడా?
పాపం ప్రవీణ్ పగడాలగారు కాల్వినిజాన్ని తప్పుపట్టాలనే ఆరాటంలో బైబిల్‌లో స్పష్టంగా ఉన్న వచనాలు చదవడం మరచిపోతున్నారు, లేదా వక్రీకరిస్తున్నారు. కాల్వినిజాన్ని వ్యతిరేకరించే క్రమంలో ప్రవీణ్ పగడాలగారు బైబిల్ చదవకుండుట ఆయనకు మేలు, ఎందుకంటే చదివి దాన్ని వక్రీకరించకుండా ఉండలేకపోతున్నాడు.
ఇకపోతే ప్రవీణ్ పగడాలగారు మాట్లాడితే, 'చిన్నపిల్లలపై దాడులు దేవుడే నిర్ణయిస్తున్నాడా? ఘోరమైన ప్రతీ హింసనూ దేవుడే జరిగిస్తున్నాడా' అని సెంటిమెంట్ ట్రిక్స్ ప్లే చేసి కాల్వినిజాన్ని తప్పుగా చిత్రీకరించాలి అనుకుంటుంటారు.
ఆయన చెప్పేదాని ప్రకారం, జరిగే ఆ దారుణాలకు మానవ స్వేచ్ఛతో చేసే తప్పిదాలే కారణం తప్ప అవేమీ దేవుని ఉద్దేశాల్లో లేవు. ఇంతకూ చేసేవాడు తన స్వేచ్ఛతో చేస్తున్నాడు సరే, దానికి బలయ్యేవారు కూడా తమ స్వేచ్ఛతోనే బలౌతున్నారా? లేక తమ స్వేచ్ఛతో బ్రతకాలి అనుకుంటున్నారా?
దేవుడు నేరస్తుని స్వేచ్ఛను కాపాడటం కోసం బాధితుడు బలైపోడానికి అనుమతిస్తున్నాడన్నమాట! లేకపోతే ఎందుకు ఆపడం లేదంటారు? యేసుక్రీస్తు పుట్టే సమయంలో అనేకమంది మగపిల్లలు హేరోదు చేతిలో హతమవ్వడానికి ఆయన అనుమతించాడు కదా, ఎందుకు చంపటాన్ని ఆపలేదు. ప్రవీణ్ పగడాలగారు తన సెంటిమెంట్ ఇక్కడెలా చూపిస్తారో చూడాలి మరి. తన కళ్ళ ముందు ఎన్నో దాడులు జరుగుతున్నా, ప్రవీణ్ పగడాల వంటి మనుషులు కూడా ఎంతోమంది వాటిని చూసి చలించిపోతున్నా, అతను నమ్మే చేతకాని దేవుడు మాత్రం, వాటితో ఆయకేం సంబంధం లేదు, చివరిలో కుర్చీ వేసుకుని తీర్పు తీరుస్తాలే అంటూ కునుకేస్తుంటాడేమో. మేమైతే ఈ దాడుల వెనుక తప్పకుండా ఆయన రహస్య చిత్తమేదో ఉందనే అంటాము. అందుకే ఆయన వాటిని తన నిర్ణయం చొప్పున అనుమతించాడు. అయినప్పటికీ ఆయన బైబిల్ ప్రకారం పాపానికి కర్త కాడు. వాటిని చేసినవారే ఆ పాపానికి తగిన శిక్షను భరిస్తారు, ఎందుకంటే అది వారి ఉద్దేశం కూడా.
ముగ్గురు వ్యక్తులున్నప్పటికీ ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడే అంటూ బైబిల్ చెప్పేదానికి లాజిక్కులు ఉపయోగించకుండా నమ్మే ప్రవీణ్ గారు, దేవుడే తన సార్వభౌమత్వాన్ని అన్నిటిలోనూ చూపుతాడు, అయినప్పటికీ ఆయన పాపానికి కర్త కాడని బైబిల్ చెబుతుంటే మాత్రం, తన లాజిక్ ఉపయోగించి అదెలా సాధ్యమంటూ విస్మరిస్తున్నాడు. ఈ రెండు సిద్ధాంతాల్లోనూ ( త్రిత్వం, దేవుని సార్వభౌమత్వం) మానవ తర్కానికి అతీతమైన దేవుని జ్ఞానమేదో ఉందని విశ్వాసులు అర్థం చేసుకోగలరు.
సరే ప్రవీణ్ పగడాలగారికి మాదొక సూటి ప్రశ్న. భూకంపం, సునామీ, తుఫాను, మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ దేవుడు నిర్ణయిస్తేనే మనుషులను ఘోరంగా చంపుతున్నాయా లేక వాటంతట అవే జరుగుతున్నాయా? బైబిల్ అయితే అవన్నీ దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాయని చెబుతుంది.
కీర్తనలు 148:8 అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ..
ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ప్రవీణ్ గారు మాటిమాటికీ అడ్డుపెట్టుకునే 'చిన్నపిల్లలు కూడా ఘోరంగా చనిపోతున్నారు' అనే వాదనలో, వారలా చనిపోడానికి కారణం ప్రకృతి యొక్క నిర్ణయమా లేక దేవుని నిర్ణయమా? ఇదంతా దేవుని చిత్తమా లేక ఆయన నిర్ణయం లేకుండానే ఇదంతా జరిగిపోతుందా? దయచేసి చెప్పాలి.
వాస్తవానికి ప్రవీణ్ పగడాలగారు YWAMవారు సృష్టించిన 'కింగ్ డమ్ థియాలజీ' తప్ప మరేదీ నమ్మరు, అందుకే కాల్వినిజంపై అలా అక్కసు వెళ్ళగక్కుతున్నారు. తగిన సమయంలో ఆయన యొక్క 'YWAM కింగ్ డమ్ థియాలజీ' ఎంత డమ్మీ థియాలజీనో ఆధారాలతో నిరూపిస్తాం.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments
You are doing excellent job. The Truth always reign no matter how many members supress it. All glory to God.