సంఘము

రచయిత: డి. యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 19 నిమిషాలు
ఆడియో

స్త్రీలు మౌనంగా ఉండవల్సిందేనా min

1 కొరింథీ 14:33-35 ; 1 తిమోతి 2:11-12 చదవగానే 'స్త్రీలు ఏ కారణం చేతనైననూ, ఎప్పటికీ, సంఘంలో మాట్లాడకూడదని చెప్తున్నాడా పౌలు?' అన్న సందేహం కలుగుతుంది. కానీ సందర్భానుసారంగా ఈ వాక్యభాగాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.

1 కొరింథీ 14:33-35 -
"33. ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
35. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము."

కొరింథీ సంఘంలో ఉన్న ఒక సమస్య గురించి పౌలు ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు. కొరింథీయులు సంఘంగా కూడుకున్నప్పుడు అల్లరి చేస్తున్నారు (వ. 33). ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు, ఎవరికి ఏది కావాలంటే అది చేస్తూ పోతున్నారు. ఒక క్రమం అనేదే లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. భాషల వరం ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతుండగా, ఆ భాషకి అర్థం చెప్పేవారు లేకపోగా, అదే సమయంలో ప్రవచన వరం ఉన్న మరో వ్యక్తి దేవుని ప్రత్యక్షతను బిగ్గరగా అరుస్తూ ప్రకటిస్తున్నాడు. ఆ కూడిక జరిగే చోట ఎటువంటి వాతావరణం ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏదీ సరిగ్గా వినపడక, అర్థం కాక, అంతా గందగోళంగా ఉంటుంది. ఇటువంటి కూడికలకు హాజరైనవారికి ఎటువంటి క్షేమాభివృద్ధి కలుగదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసమే పౌలు ఈ అధ్యాయంలోని మాటలను కొరింథీ సంఘానికి రాసాడు. ఆ కారణంగానే 'సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి'(వ.40) అని చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగించాడు. అయితే పౌలు ప్రధానంగా ముగ్గురిని మౌనంగా ఉండమంటున్నాడు.

మొదటిగా, భాషతో మాట్లాడే వ్యక్తిని. ఒకవేళ ఆ సమయంలో వేరెవరైనా మాట్లాడుతున్నప్పుడూ అలాగే అర్థం చెప్పేవారు లేనప్పుడూ, ఈ రెండు సందర్భాలలో భాషలతో మాట్లాడే వ్యక్తి మౌనంగా ఉండాలి (వ.27-28). రెండవదిగా, ప్రవక్త. ఒక ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు, మిగిలిన ప్రవక్తలు మౌనంగా ఉండాలి (వ.29-31). మూడవదిగా స్త్రీలు. స్త్రీలు లోబడియుండవలెను. అందుకు తగిన విధంగా సంఘంగా కూడుకున్నప్పుడు మౌనంగా ఉండవలెను (వ.34,35).

స్త్రీలు మౌనంగా ఉండడం గురించి ఆలోచిద్దాము. కొరింథు సంఘములో పరిస్థితి బాలేదు కాబట్టి పౌలు కేవలం కొరింథు సంఘాన్నే ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 33వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు - "33. ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు." అంటే పౌలు అన్ని సంఘాలను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ అభిప్రాయాన్ని బలపరిచే విధంగా 1 కొరింథీ 4:17 లో కూడా - "...అతడు (తిమోతి) క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును." అని అంటున్నాడు. అంటే పౌలు ఒక్కో సంఘానికి ఒక్కో నియమం కాకుండా, అన్ని సంఘాలలో ఒకే బోధ చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. పౌలు మాటలను ఇలా కూడా అర్థం చేసుకోవచ్చేమో - 'మిగిలిన సంఘాలవాళ్లంతా మర్యాదగానూ, క్రమంగానూ జరిగిస్తుంటే, మీరు (కొరింథులోని మీరు) మాత్రం దేవుని క్రమాన్ని మీరి, అధికారంతో బోధించే పరిచర్య చెయ్యడానికి స్త్రీలను అనుమతిస్తున్నారు'. కాబట్టి ఈ నియమము అన్ని స్థానిక సంఘాలకు వర్తిస్తుంది అని గ్రహించాలి.

ఈ వాక్య భాగంలో స్త్రీలు మౌనంగా ఉండాలనే నియమాన్ని కొరింథు సంఘానికి పౌలు సూచిస్తున్నాడు. సంఘంగా కూడుకున్నప్పుడు స్త్రీలు ప్రవచించే పరిచర్య గానీ, భాషతో మాట్లాడే పరిచర్య గానీ చెయ్యడానికి వీల్లేదని చెప్తున్నాడు. ఈ నియమాన్ని సూచించిన తరువాత, దీని వెనుక ఉన్న కారణాలను తెలియజేస్తూ సంఘంలో ఉండాల్సిన దేవుని క్రమం గురించి చెప్తున్నాడు. "వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది." ఈ నియమం ముందుగా పాత నిబంధనలోనే ఇవ్వబడింది. దానినే కొత్త నిబంధనలో మరలా అపొస్తలులు ధృవీకరించారు. పాత నిబంధనలోనే లేదా ధర్మశాస్త్రంలోనే చెప్పబడింది కాబట్టే యూదులు వారి సమాజమందిరాలలో సైతం ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేవారు. సమాజమందిరాలలో స్త్రీలు వాక్యపఠనం చేయడాన్ని కూడా అనుమతించేవారు కాదు. చదవగలిగే సామర్థ్యం ఉన్న పిల్లలకైనా అవకాశం ఉండేది కానీ స్త్రీలు ఆ పని చేయడానికి మాత్రం అనుమతించేవారు కాదు.

ఆది 3:16 - 'నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.' ఇది దేవుడు హవ్వకి ఇచ్చిన శాపం. దీని భావం - 'నువ్వు నీ భర్తను ఏలాలని చూస్తావు, అతనిపై అధికారం చెయ్యాలని చూస్తావు కానీ అతనే నిన్ను ఏలతాడు లేదా అతను నిన్ను అణగద్రొక్కి, నిన్ను అతని గుప్పెట్లో పెట్టుకోవాలనీ, నిన్ను పరిపాలించాలనీ చూస్తాడు.' ఈ శాపం గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ఆదికాండము 3 వ అధ్యాయం కామెంటరీని చదవండి.

ఈ శాపానికి భిన్నంగా స్త్రీలు పురుషులకు లోబడాలి అని దేవుడు ధర్మశాస్త్రములో చెప్పాడు. అదే విషయాన్ని పౌలు కూడా జ్ఞాపకం చేస్తూ, సమాజంగా కూడుకున్నప్పుడు ఉపదేశించడము లేదా బోధించడము అధికారంతో చేసే పని కాబట్టి అటువంటి పరిచర్య స్త్రీలు చెయ్యొద్దు, పురుషులు మాత్రమే చెయ్యాలి అని అంటున్నాడు. బైబిల్ లో దేవుడు కొంతమంది స్త్రీలను నిలబెట్టి ఆయా సమయాలలో అసాధారణంగా వారిని తన పనిలో వాడుకున్నట్లు చూడొచ్చు. ఉదాహరణకు దెబోరా, హుల్దా, అన్న. వీరెవరూ సంఘంలో బోధించే పరిచర్య చేసినవారు కాదు గనుక సంఘంలో స్త్రీ బోధించవచ్చా? బోధించకూడదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి వీరి ఉదాహరణలను ప్రామాణికంగా తీసుకోలేము.

1 తిమోతి 2:11-14లో కూడా ఆదికాండము మొదటి మూడు అధ్యాయాలలో ప్రస్తావించిన అవే సంగతులను పౌలు జ్ఞాపకం చేస్తూ ఈ నియమాన్ని ధృవపరిచే ప్రయత్నం చేసాడు. ఆ వాక్యభాగాన్ని తరువాత ధ్యానిద్దాము.

అచ్చం కొరింథు సంఘంలోలాగానే నేడు చాలా చర్చీలలో స్త్రీలు బోధించడాన్ని అనుమతిస్తున్నారు. ఇదేదో యాదృచ్చికంగా జరిగినది కాదు. అటువంటి చర్చీలను, అవాంతర శాఖలను స్థాపించేవారిలో చాలామంది స్త్రీలు ఉండటం గమనార్హం. ఇలా చెయ్యడం, దేవుడు పురుషునికి మాత్రమే ఇచ్చిన పాత్రను, స్థానాన్ని స్త్రీ అపహరించడం లేదా ఆక్రమించడమే అవుతుంది. అది పూర్తిగా వాక్యవిరుద్ధమైన విధానం. అది మరెన్నో వాక్య విరుద్ధ కార్యకలాపాలకు దారి తీస్తుంది. సంఘంలోని కొందరు స్త్రీలు అత్యద్భుతంగా బోధించే సామర్థ్యం కలిగినవారయ్యుండొచ్చు, ఇంకా అనేక ఇతర వరాలు కలిగి ఉండొచ్చు, ప్రజలను నడిపించే నైపుణ్యం, నాయకత్వపు లక్షణాలు ఉండి ఉండవచ్చు కానీ వాటన్నింటినీ సంఘంగా కూడుకున్నప్పుడు పురుషులపై వినియోగించడానికి వీల్లేదు.ఇలా చెయ్యడం ఆమెకు 'అవమానము' అని కూడా చెప్తున్నాడు పౌలు. ఆ స్త్రీకి మాత్రమే కాదు, అటువంటి సంఘాలలోని సంఘపెద్దలూ, సభ్యులందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం అది.

అలాగే 'వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను..'.ఏదైనా ప్రవచనం గురించి ఏవైనా ప్రశ్నలు లేదా అభ్యంతరాలు ఉంటే, వాటిని సరైన విధంగా అడగటమూ, నేర్చుకోవటమూ జరగడంలేదు కొరింథు సంఘంలో. కాబట్టి స్త్రీలు ఏదైనా నేర్చుకోవాలి అన్న ఉత్సుకతను, ఆసక్తిని కనపరుస్తుంటే, అది అభినందించాల్సిన విషయమే అయినప్పటికీ, సమాజం అంతటినీ అభ్యంతరపరిచే విధంగా సంఘంగా కూడుకున్నప్పుడు ప్రశ్నలు అడగకుండా, 'ఇంటికి వెళ్లిన తరువాత తన భర్తను అడిగి అతని దగ్గరి నుండి నేర్చుకోవాలి(వ.35) అని చెప్తున్నాడు పౌలు. ఈ మాటలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్త్రీలు ఎప్పటికీ అసలే ప్రశ్నలు అడగకూడదు అని చెప్పడం లేదు. సంఘంగా కూడుకున్నప్పుడు అలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు. సాధారణంగా అన్ని శాఖలకు చెందిన సంఘాలలో ఆదివారం కాకుండా వేరే రోజుల్లో బైబిల్ స్టడీస్ లాంటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో స్త్రీలు ప్రశ్నలు అడగడంలో ఇబ్బందేమీ లేదు. అలాగే తన భర్తను అడిగి నేర్చుకోవలెను అని పౌలు చెప్తున్నప్పుడు, భర్తలు వాక్య సత్యాలను సరిగ్గా అర్థం చేసుకొని, తమ భార్యలకు నేర్పించ సమర్థులు అయ్యుండాలని చెప్పకనే చెప్తున్నాడు. ఇది అందరు భార్యభర్తలకూ వర్తించే ఒక సాధారణ నియమం. ఒకవేళ భార్య తెలుసుకోవాలనుకుంటున్న విషయంలో భర్తకి సరైన అవగాహన లేకపోతే ఆమె పాస్టర్ ని గానీ, సంఘపెద్దని గానీ లేక వాక్యజ్ఞానం కలిగిన ఇతర పురుషులను సంప్రదించడంలో కూడా ఎటువంటి ఇబ్బందీ లేదు. నేర్చుకుంటే భర్త దగ్గరే నేర్చుకోవాలి లేకపోతే నేర్చుకోవడమే మానెయ్యాలి అన్న నిషేధాజ్ఞ ఏదీ ఇవ్వడం లేదు పౌలు. దేవుణ్ణి ఆరాధించడం కోసం సంఘమంతా కూడియున్నప్పుడు మాత్రం స్త్రీ బోధించకుండా, అధికారంతో చేసే పరిచర్యలలో పాల్గొనకుండా, మౌనంగా ఉండాలి అని చెప్తున్నాడు.

ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుతూ - '36. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా?' అని అడుగుతున్నాడు. కాదు, సువార్త ప్రకటించబడటం ముందుగా యూదయలో ప్రారంభం అయ్యింది. అపొస్తలులు మొదటిగా యూదులకే సువార్త చెప్పారు, తమ సొంత దేశములోనే మొదట సంఘాలను స్థాపించారు. ఆ తరువాతే అన్యుల దగ్గరికి సువార్త తీసుకెళ్లారు. కాబట్టి ఆ మొదట స్థాపించబడిన సంఘాలు ఏ క్రమంలో నడుచుకుంటున్నాయో, ఆ క్రమాన్ని చూడమని కొరింథు సంఘానికి చెప్తున్నాడు పౌలు. స్త్రీలు బోధించడం వంటివాటిని ఆ మొదట స్థాపించబడిన సంఘాలు అనుమతించనప్పుడు, మీరు ఎందుకు అనుమతిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. "మీయొద్దకు మాత్రమే వచ్చెనా?" సువార్త కేవలం మీ ఒక్కరి దగ్గరికే వచ్చిందా? ఖచ్చితంగా కాదు. ఇంకా అనేకుల ఇతర జనాంగాలకూ, పట్టణాలకూ, సంఘాలకు కూడా సువార్త వ్యాపించింది. మరి ఎవ్వరూ, ఏ సంఘంలోనూ అనుమతించని ఆచారాలను, పద్ధతులను మీరు ఎందుకు అనుమతిస్తున్నారు? మిగిలినవారందికీ భిన్నంగా చెయ్యాలని ఎందుకు కోరుకుంటున్నారు? మిగిలిన సంఘాలలోనివారికి కూడా వరాలు ఉన్నాయి అయినా వారు క్రమం తప్పి, ఇటువంటి కొత్త పద్ధతులను సంఘంలో ప్రవేశపెట్ట సాహసించనప్పుడు, మీరెందుకు అపోస్తలీయ బోధకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు? అని పౌలు ప్రశ్నిస్తున్నాడు.

1 కొరింథీ 11:5 లో 'ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో.......' అని ఉంది కాబట్టి స్త్రీలు సంఘంలో ప్రార్థించడాన్నీ, ప్రవచించడాన్నీ పౌలు సమర్థిస్తున్నాడని చెప్తారు కొందరు. కానీ సంఘంగా కూడుకున్నప్పుడు పాటించాల్సిన నియామాల గురించే పౌలు అక్కడ ప్రాస్తావిస్తున్నాడు అని చెప్పడానికి ఆ 11వ అధ్యాయం అంతటిలో ఏ ఆధారమూ లేదు. బహుశా బహిరంగ ప్రదేశాలలో ప్రార్థించడం, ప్రవచించడం గురించి పౌలు మాట్లాడుతూ ఉండొచ్చు.

అలాగే అపో.కార్య. 2:17ని చూపించి మరి కొందరు, ఈ వచనంలో కుమార్తెలు కూడా ప్రవచిస్తారు అని చెప్పబడింది కదా అని అంటారు. "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు ....". నిజమే, కుమార్తెలు లేదా స్త్రీలు ప్రవచించారు. స్త్రీలు అసలే ప్రవచించలేదు అని చెప్పడానికి వీలు పడదు. ఫిలిప్పు కుమార్తెలకు(అపో. కార్య. 21:9)వలె కొందరు స్త్రీలకు ప్రవచించే వరం ఉండి ఉండొచ్చు కానీ సంఘంగా కూడుకున్నప్పుడు, పురుషుల సమక్షంలో, వారిపై అధికారం చేస్తున్నట్లుగా ప్రవచించకూడదని పౌలు చెప్తున్నాడు.

మరో ప్రాముఖ్యమైన విషయం గురించి చెప్పకుండా ఈ వ్యాసాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. స్త్రీలైనా పురుషులైనా ఏం ప్రవచించారు? భాషల వరమూ, ప్రవచన వరమూ (కొత్త ప్రత్యక్షతలు బయలుపరిచే భావంలో) అపోస్తలీయ కాలంతో నిలిచిపోయాయి కాబట్టి ఆ కాలంలో ఎవరు ప్రవచించినా, భాషలతో మాట్లాడినా అవన్నీ అపోస్తలీయ బోధ యొక్క పరిధిలోనే జరిగి ఉండాలి. ఎందుకంటే సంఘానికి అవసరం అని దేవుడు తలంచి విశ్వాసులకు అనుగ్రహించిన ఏ సత్యమూ మనకు అందకపోవడం జరగలేదు. మనకు అనుగ్రహించబడిన 66 పుస్తకాల బైబిల్ గ్రంథం సంపూర్ణ దైవప్రత్యక్షత. అది మనకు చాలినది, సరిపోయినది, సంపూర్ణమైనది. దేవుని ప్రత్యక్షత సంపూర్ణమైనది, అపోస్తలీయ కాలంలోనే ఆ సంపూర్ణ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది కాబట్టి ఈ రోజు కూడా దేవుడు కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహించాల్సిన అవసరం లేదు. అందుకే ఆ వరాలు కూడా నేడు సంఘంలో ఎవ్వరికీ అనుగ్రహించబడటం లేదు, అవి నిలిచిపోయాయి. అలా కాకుండా ప్రవచించడం అంటే అప్పటికే అనుగ్రహించబడిన ప్రత్యక్షతను ప్రకటించడం లేదా బోధించడం అన్న భావంలో కూడా కొత్త నిబంధలో పలు చోట్ల 'ప్రవక్తలు', 'ప్రవచిస్తున్నారు' అన్నట్లు చెప్పబడింది. ఏ భావంలో తీసుకున్నా సంఘములో స్త్రీ ప్రవచించడాన్ని లేదా బోధించడాన్ని మాత్రం వాక్యం అనుమతించదు.

1 తిమోతి 2:11-12 -
"11. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
12. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను."

సంఘంగా కూడుకున్నప్పుడు ఉపదేశించే పని ఎవరు చెయ్యాలి అన్న దాని గురించి పౌలు ఈ వాక్యభాగంలో స్పష్టంగా తెలియజేశాడు. సంఘంలో ఉన్న పురుషులకు స్త్రీ బోధించకూడదు. ఆమె మౌనంగా ఉంటూ, పురుషుని అధికారానికి విధేయత కనపరుస్తూ నేర్చుకొనవలెను. దీని అర్థం మొత్తం కూడిక సమయం అంతటిలో స్త్రీలు ఏమీ మాట్లాడకూడదు అని కాదు. సంఘంగా కూడుకున్నప్పుడు స్త్రీలు ప్రార్థన చెయ్యవచ్చు, పాటలు పాడవచ్చు, సాక్ష్యాలు చెప్పవచ్చు. అలాగే స్త్రీలు ఎప్పుడూ బోధించకూడదు అని కూడా కాదు. స్త్రీలు తోటి స్త్రీలకు లేదా యవ్వనస్త్రీలకు బోధించవచ్చు (తీతుకు 2:3-4); వ్యక్తిగత పరిచర్యలో భాగంగా అకుల్లా ప్రిస్కిలాలు అపొల్లోకు బోధించినట్లు బోధించవచ్చు (అపో. కార్య. 18:26); పిల్లలకు బోధించవచ్చు, స్త్రీల కూటాలలో కూడా బోధించవచ్చు.

ఆ తరువాతి వచనాలో స్త్రీలు సంఘంలో ఎందుకు మౌనంగా ఉండాలో కారణాలు కూడా తెలియజేశాడు పౌలు.

"13. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
14. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను."

దేవుడు మొదట మనుషులను సృష్టించినప్పుడు పాటించిన క్రమాన్ని ఆధారం చేసుకొనే స్త్రీలు మౌనంగా ఉండాలనే నియమాన్ని సూచిస్తున్నాడు పౌలు. అంతేగానీ ఎఫెసు పట్టణస్థుల యొక్క సంస్కృతిని ఆధారం చేసుకొని పౌలు ఈ నియమాన్ని చెప్పడం లేదు లేక తానే సొంతగా కలిపించినది కూడా కాదు. ఈ నియమం సృష్టి క్రమములోనే ఉంది. ఇదే సత్యాన్ని పౌలు కొరింథు సంఘానికి కూడా చెప్తాడు (1 కొరింథీ 11:8-9).

"ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను." - ఈ సంఘటన గురించి ఆదికాండము 3వ అధ్యాయంలో చదువుతాము. కేవలం దేవుడి మాటకు లోబడకపోవడం మాత్రమే కాదు, దేవుడు నియమించిన స్త్రీ పురుషుల పాత్రలను సైతం వారు అతిక్రమించారు. ఎలాగంటే హవ్వ ఆదాము యొక్క నాయకత్వపు అధికారాన్ని తిరస్కరించి, సాతాను చెప్తున్న విషయాలను ఆదాము దృష్టికి తీసుకెళ్లకుండా తనంతట తానే పండు తినాలనే నిర్ణయం చేసుకుంటుంది. అలాగే హవ్వ తినమన్న పండు తినడం ద్వారా ఆదాము హవ్వను అనుసరించి, ఆమె మాటకు లోబడి తన నాయకత్వపు బాధ్యతను విస్మరించాడు. అందుకే దేవుడు ఆదాముని శపిస్తూ 'నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి' అని ఆ కారణాన్ని బట్టే శపిస్తాడు. అంటే సృష్టిక్రమంలోనూ, దేవుడి ఆజ్ఞకు వారు అవిధేయత చూపించడంలోనూ, దేవుడు వారిని శపించే సందర్భంలోనూ, వీటన్నింటిలోనూ దేవుడు నియమించిన స్త్రీపురుషుల పాత్రలు ఏంటో మనకు స్పష్టంగా అర్థం అవుతున్నాయి. అధికారం కలిగి, పరిపాలించే పాత్రను దేవుడు పురుషుడికి ఇచ్చాడు అన్నది ఆదికాండము మొదలుకొని బైబిల్ చాల స్పష్టంగా బోధిస్తున్న విషయం. 'స్త్రీ మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.' అని వాక్యం స్పష్టంగా చేస్తుంది.

"స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను" అన్నప్పుడు ఆమె ఒక్కత్తే కాదు గానీ సమస్త మానవజాతి ఆమె ద్వారా ఆత్మీయ పతనానికి లోనయ్యింది. అందుకు మొదటి స్త్రీ అయిన హవ్వే బాధ్యురాలు. ఆ అపకీర్తి, అవమానం, కళంకం ఆమె తరువాతి స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే దానికి పరిష్కారం లేకపోలేదు. ఆ కళంకం నుండీ స్త్రీలు ఏలా తప్పించబడతారో లేదా రక్షించబడతారో పౌలు చెప్తూ - "15. అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును." ఇక్కడ రక్షణ అంటే పిల్లల్ని కనడం ద్వారా స్త్రీలు తమ పాపశిక్ష నుండి రక్షించబడి నిత్యజీవము పొందుతారని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనుషులందరికీ ఒకటే రక్షణ మార్గం. విశ్వాసం ద్వారా కృప చేతనే మాత్రమే రక్షణ.

ఒక స్త్రీ మానవజాతి పతనమవ్వడానికి కారణమయ్యింది, ఈ కళంకం నుండీ స్త్రీలు రక్షించబడటం అనేది శిశుప్రసూతి ద్వారా జరుగుతుందని చెప్తున్నాడు పౌలు. అదెలా సాధ్యం అని మీరు అడగొచ్చు? స్త్రీలు తమ పిల్లల్ని దైవభక్తిలో పెంచడం వల్ల మనుషులను పాపం నుండి తప్పించినవారవుతారు గనుక తమపై ఉన్న ఆ కళంకం నుండీ తప్పించబడతారు. పిల్లలు తల్లి గర్భంలో రూపుదాల్చడం మొదలుకొని, ప్రసవించడం నుండీ, పసిపిల్లలుగా ఉన్నప్పటి నుండీ తల్లితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అటువంటి అనుబంధం తండ్రితో ఉండదు. దైవభక్తిలో పిల్లల్ని పెంచే బాధ్యత ప్రధానంగా తల్లిపైనే ఉంటుంది. పిల్లల యొక్క ఆత్మీయ స్థితిగతులపై కూడా ఆమె పెంపకం యొక్క ప్రభావం తప్పక ఉంటుంది. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే ఒక స్త్రీ మానవజాతిని పాపంలోకి నెట్టింది, అయితే మనుషులను పాపంలో నుండీ దైవభక్తిలోనికి నడిపించే భాగ్యము స్త్రీలకు కలిగింది. దీని అర్థం పిల్లలు రక్షించబడటం అనేది పూర్తిగా తల్లి పెంపకం పైనే ఆధారపడి ఉంది అనుకోవడానికి వీల్లేదు, అలాగని పిల్లలపై తల్లి ప్రభావం ఉండదు అని గానీ, వారు రక్షించబడటం కోసం ఆమె చెయ్యాల్సింది ఏమీ ఉండదు అని గానీ, ఆమె పాత్ర అంత ప్రాముఖ్యమైనది కాదని గానీ అనలేము. అలాగే పిల్లలను కనే పరిస్థితి లేని (ఆరోగ్యపరంగా)  స్త్రీలు కూడా  తప్పకుండా పిల్లల్ని కనాల్సిందే  అన్న  నియమం కూడా పౌలు సూచించడం లేదు. స్త్రీలు తమపైకి వచ్చిన కళంకాన్ని తొలగించుకోవడం కోసం తమ పిలుపుకు తగినట్లుగా దైవభక్తిగల పిల్లల్ని పెంచాలి అని సాధారణంగా స్త్రీలందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. అయితే ఆ పని చెయ్యడానికి మొదట - 'వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండ'వలెను అని చెప్తున్నాడు. ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీ వీటియందు నిలకడగా ఉండాలి. అప్పుడే ఆమె దైవభక్తిలో ఎదుగుతూ, పిల్లల్ని కూడా దైవభక్తిలో పెంచగలుగుతుంది.

దేవుడు ఈ వాక్యభాగం అంతటిలో తారుమారు అయిపోయిన స్త్రీ పురుషుల పాత్రలను సరిచేస్తున్నట్లు మనం చూస్తున్నాము. పురుషులు అధికారం కలిగి బోధించే సంఘనాయకులుగా, కుటుంబ నాయకులుగా ఉండాలి. స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి, బోధించకూడదు, ఉపదేశించకూడదు, అలాగని ఆమెను తక్కువగా ఎంచడానికి కూడా వీల్లేదు ఎందుకంటే పిల్లల జీవితాలను తన దైవభక్తిగల జీవితంతో ప్రభావితం చెయ్యాల్సిన విశిష్టమైన బాధ్యత ఆమెకు అనుగ్రహించబడింది. ఈ క్రమం నుండి సంఘం తొలగిపోకుండా జాగ్రత్తపడాలని మనవి.

 అయితే స్త్రీలు మౌనంగా ఉండాలని, పురుషునికి ఉపదేశించడానికైననూ, అతనిపై అధికారము చెయ్యడానికైననూ సెలవియ్యనని పౌలు చెబుతున్న మాటల్ని ఆధారం చేసుకొని ఇది స్త్రీపై చూపబడుతున్న వివక్షగా కొందరు ఆరోపిస్తుంటారు. కానీ అటువంటి ఆరోపణకు ఇక్కడ ఎంత మాత్రం ఆస్కారం లేదని మేము ఇది వరకే వివరించడం జరిగింది. ఈ కింది లింక్ ద్వారా సూచించిన వ్యాసంలో మీరు దాన్ని చదవొచ్చు.

బైబిల్ దేవుడికి‌ స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.