రక్షణ

రచయిత: జోనాథన్ ఎడ్వర్డ్స్
అనువాదం: టీ.ఆర్. కిరణ్
చదవడానికి పట్టే సమయం: 42 నిమిషాలు
 

ఇది జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు 1741,జులై 8న మసాచూసెట్స్లో చేసిన అద్భుతమైన ప్రసంగం

ద్వితి.కాండం 32:35 'వారి కాలు జారు కాలమున' అవిశ్వాసులైన, దుర్మార్గులైన ఇశ్రాయేలీయుల మీద దేవుని ఉగ్రత వస్తుందని ఈ వచనంలో హెచ్చరించబడింది, దేవుని నిబంధనాప్రజలుగా దేవుని కృపామాధ్యమాలన్నీ కలిగి జీవిస్తూ, దేవుడు వారికి చేసిన ఆశ్చర్యకార్యాలెన్నో చూసినప్పటికీ వీరు "ఆలోచన లేని జనముగా" ( ద్వితి.కాండం 32:28 వ వచనం) , వివేచన లేని ప్రజగా వున్నారు.

ఈ వాక్యభాగానికి ముందు ఉన్న రెండు వచనాలలో చెప్పబడిన విధంగా, దేవుని సేద్యం క్రింద ఉండి కూడా వారు చేదైన, విషపూరితమైన ద్రాక్షలనే ఫలించారు; ఈ దుష్టులైన ఇశ్రాయేలీయులకు రాబోయే శిక్షకు, నాశనానికి సంబంధించి, ఈ వాక్యంలో నుండి నేను తీసుకున్న "వారి కాలు జారు కాలమున " అనే మాట ఈ కింది అర్థాలను ఇస్తుంది.

1) కాలు జారే చోట నిలుచునే లేదా నడిచే వ్యక్తిలా వారు ఎప్పుడూ నాశనానికే గురై ఉన్నారు. వారి మీదకు రాబోతున్న నాశనాన్ని కాలు జారటంతో పోల్చడం ద్వారా ఇది సూచించబడింది , ఇదే తలంపు కీర్తనలు 73:18లో కుడా వ్యక్తపరచబడింది -" నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచియున్నావు"

2)కాలుజారే చోట నడిచే వ్యక్తి ఏ క్షణాన్నైనా పడిపోయే ప్రమాదంలో ఉన్నట్లే; వారెల్లప్పుడూ ఊహించని ఆకస్మిక నాశనానికి గురై ఉన్నారని ఇది సూచిస్తుంది. మరుక్షణంలో అతడు నించుటాడో, పడిపోతాడో ఏ కొంచెమైనా అంచనా వేయలేని స్థితిలో ఉన్నాడు; అతడు పడినప్పుడు ఏ హెచ్చరిక లేకుండా హఠాత్తుగా పడిపోతాడు, ఇదే తలంపు కీర్తనలు 73:18లో కుడా వ్యక్తపరచబడింది -" నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచియున్నావు "

3) ఇంకెవరి ప్రమేయం లేకుండా వారంతట వారే పతనానికి గురై ఉన్నారన్నది ఇక్కడున్న మరో తలంపు; ఎందుకంటే కాలు జారే చోట నిలబడే లేదా నడిచే వ్యక్తి క్రింద పడటానికి తన స్వంత బరువు తప్ప మరేమీ అవసరం లేదు

4)వారి కాలుజారు "కాలమున" అని చెప్పబడింది కాబట్టి, వారి నిర్ణీత కాలము ఇంకా రాలేదన్నదే వారింకా పడిపోకుండా ఉండటానికి కారణం; అయితే ఆ కాలం వచ్చినప్పుడు వారు తమ స్వంత భారము చేతనే పడిపోతారు. అప్పుడు దేవుడు ఈ కాలు జారే చోట వారిని పడిపోకుండా పట్టుకోడు, వారిని వదిలేస్తాడు. ఒక గోతి అంచున జారు నేలపై నుంచున్న వ్యక్తి ఎలాగైతే తనంతట తాను నిలబడలేడో , విడువబడగానే ఎలాగైతే పడిపోయి నాశనమౌతాడో అలాగే నిర్ణీత కాలము వచ్చిన ఆ క్షణమే వారు నాశనములో పడిపోతారు.

ఈ మాటల అదారంగా నేను నొక్కి చెప్పేదేమిటంటే , దుష్టులను ఏ క్షణమైనా నరకంలో పడకుండా ఆపేది దేవుని అభీష్టము తప్ప మరేమి కాదు, దేవుని అభీష్టమని నేను అంటున్నప్పుడు దేని చేత ప్రభావము చేయబడని , దేని పైనా ఆధారపడని ఆయన సార్వభౌమ్య అభీష్టమని నా భావం. అంటే వారు భద్రంగా ఉన్న ఏ క్షణములోనైనా వారిని నరకములో పడవేయడానికి అడ్డొచ్చేలా ఎలాంటి అవరోధాలు దానిని ప్రభావితం చేయలేదని కేవలం ఆయన అభీష్టం మాత్రమే అందుకు కారణమని నా భావం. ఈ మాటలు నిజమని ఈ క్రింది పరిశీలనల వల్ల నిర్ధారించుకోవచ్చు

1) దుష్టులను నరకంలో పడవేయడానికి దేవుని శక్తిలో కొరతేమీ లేదు. దేవుడు లేచినప్పుడు మనుషుల చేతులు 'బలం' ప్రయోగించలేవు. ఆయన్నెదిరించే శక్తి అతి బలవంతుల్లో సహితం లేదు , ఆయన చేతి నుండి విడిపించగలిగేవారు ఎవరూ లేరు. ఆయన దుష్టులను పడద్రోయగలడని మాత్రమే కాదు , చాలా సులభంగా ఆ పని చేయగలడు. ఒక కోట నిర్మించుకుని తన అనుచరులతో తన బలాన్ని పెంచుకున్న ఒక తిరుగుబాటుదారుడుని మట్టుపెట్టడానికి ఈ లోక అధిపతులు కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ దేవునికి అలాంటిదేమి ఉండదు. ఆయన శక్తి నుండి కాపాడే కోట ఏదీ లేదు. ఎన్ని చేతులు కలిసినా, జనసమూహంతా ఒక్కటైనా వారు సులభంగా విరవబడతారు. వారు సుడిగాలి ముందు కుప్పలు కుప్పలుగా పడున్న పొట్టులాంటి లేదా దహించే మంటలు ముందు ఎక్కువ పరిమాణంలో పేర్చబడిన ఎండుగడ్డిలాంటివారు. నేల మీద ప్రాకే ఒక పురుగుని కాళ్ళ క్రింద నలిపేయడం మనకు ఎంత సులభమో , సన్నని దారాన్ని ఎంత సునాయాసంగా కత్తిరిస్తామో , దేవుడు కూడా తనకిష్టమైనప్పుడు తన శత్రువులను నరకములో అంతే సులువుగా పడేస్తాడు. ఎవరు గద్దిస్తే భూమి కంపిస్తుందో, ఎవరి ముందు పర్వతాలు తత్తరిల్లుతాయో ఆ దేవుని ఎదుట నిలవడానికి మనమేపాటివారము.

2) వారు నరకంలో పడవేయబడటానికి అర్హులు. కాబట్టి దేవుని న్యాయం అందుకు అడ్డురాదు, దేవుడు తన శక్తిని ఉపయోగించుకుని వారిని నాశనం చేయడానికి దేవుని న్యాయం అడ్డు చెప్పదు. అందుకు బదులుగా దేవుని న్యాయం వారి పాపాలకు నిత్యశిక్ష పడాలని ఘోషిస్తుంది. సోదామా ద్రాక్షలు కాసే చె ట్టును గురించి "దీనిని నరికివేయుము , దీని వలన భూమి ఏల వ్యర్థమైపోవలెనని--లూకా 13:7 " దేవుని న్యాయం చెబుతుంది. వారికి శిక్ష రాకుండా దేవుని కనికరం మరియు ఆయన చిత్తం వాయిదా వేస్తుంటే ఆయన న్యాయార్థమైన ఖడ్గం మాత్రం ప్రతీక్షణం శిక్ష పడాలనే శాసిస్తుంది.

3) ఇదివరకే వారికి నరక శిక్ష విధించబడింది. అందులోనికి పడవేయబడటం వారికి న్యాయంగా రావాల్సిన శిక్ష మాత్రమే కాదు దేవుని చట్టపరమైన తీర్పు, అంటే , దేవునికి మనుష్యులకు మధ్య నిత్యతం నుండి మార్పు చేయలేని విధంగా స్థిరపరచబడిన నీతినియమం వారికి వ్యతిరేకంగా బయలువెళ్ళి వారికి విరుద్ధంగా నిలబడుతుంది . కాబట్టి వారు ఇదివరకే నరకానికి చెందినవారు. 'విశ్వసింపనివానికి ఇంతకమునుపే తీర్పు తీర్చబడెను యోహాను  3:18 ', కాబట్టి మారుమనస్సు పొందని ప్రతి వ్యక్తి న్యాయంగా నరకానికే చెందుతాడు.' వారు క్రిందవారు - యోహాను 8:23 వారు దానికే చెందినవారు . అది వారిపట్ల దేవుని న్యాయం , దేవుని వాక్యం మరియు మార్పు చెందని దేవుని ధర్మశాస్త్ర తీర్పు వారికై విధించిన స్థలం.

4) నరకయాతనలో వ్యక్తపరచబడే దేవుని కోపానికి మరియు ఉగ్రతకు వారు పాత్రలు. వారు నరకానికి పోని ప్రతిక్షణంలోను, ఇదివరకే నరకానికి వెళ్లి యాతన అనుభవిస్తున్న అనేకుల కంటే దేవుడు వీరిపై తక్కువ ఉగ్రతను కలిగివున్నాడని అర్థం కాదు. అవును , దేవుడు ఈ భూమి పై ఉన్న అనేకుల మీద ఇంకెక్కువ కోపాన్ని కలిగున్నాడు. ఇప్పుడు నిశ్చింతగా నా మాటలు వింటున్న మీలో కూడా కొందరిపై ఇప్పుడు నరకములో ఉన్న వారికంటే ఆయన ఎక్కువ కోపంగా ఉండవచ్చు. ఆయన చేయి విడిచిపెట్టినవారిని నిర్మూలము చేయకుండా ఉండడానికి కారణం వారి దుష్టత్వాన్ని ఆయన పట్టించుకోవట్లేదనో, దాని విషయమై ఆగ్రహించడం లేదనో కాదు. వారనుకున్నట్లు దేవుడు వారిలాంటివాడు కాదు. దేవుని ఉగ్రత వారి మీద రగులుతుంది, వారి నాశనం కునికి నిద్రపోదు. పాతాళం వారి కొరకు సిద్ధం చేయబడింది. మంటలు సిద్ధం చేయబడ్డాయి, కొలిమి వేడి చేయబడి వారిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది, ఇప్పుడు మంటలు ఎగసి మండుతున్నాయి. మండుతున్న ఖడ్గం పదును పెట్టబడి వారి మీదకు దూయబడింది, వారి క్రిందనే పాతాళం దాని నోరు తెరిచింది.

5) సాతాను వారిపైబడి వారిని ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అనుమతించిన క్షణాన వారు వాడి వశమైపోతారు. వారి ఆత్మలు వాడి ఆదీనంలో వాడి సొత్తుగా ఉన్నాయి. వారు వాడి సొత్తని వాక్యం చెబుతుంది ( లూకా 11:21 ). వారి పక్కనే, వారి కుడిపక్కనే ఉంటూ, ఆకలితో తమ ఎరను చీల్చితినడానికి సిద్ధంగా ఎదురుచూస్తున్న సింహాలవలె, దయ్యాలు వారిని కనిపెడుతుంటాయి. కానీ ప్రస్తుతానికి అవి ఆపి వేయబడ్డాయి. ప్రస్తుతం వాటిని అడ్డగిస్తున్న తన హస్తాన్ని దేవుడు తొలగిస్తే, అవి క్షణమాత్రంలో వారి ఆత్మలపై ఎగిరిపడతాయి.ఆ ఆదిఘటసర్పం వారి కొరకు ఆవురావురమంటుంది. వారిని మ్రింగివేయడానికి నరకం పెద్దగా నోరు తెరచుకుని వుంది. దేవుడు అనుమతిస్తే , వారు వెంటనే మ్రింగివేయబడి నశిస్తారు.

6) దేవుడే గనక ఆపకపోతే, దుష్టుల హృదయంలో వున్న నరకపు నియమాలు జ్వలించి రగిలిపోయే నరకాగ్నిలా మారతాయి. శరీరసంబంధుల స్వభావములోనే నరకయాతనలకు తగిన పునాది వేయబడియుంది. ఆ నరకాగ్ని బీజాలు వారిని ఏలుతున్న అవినీతి నియమాలుగా వారిలో ఉంటూ వారిని స్వాధీనపరచుకున్నాయి. దేవుడే గనక ఆపకపోతే, నశించినవారి హృదయములో హింసాత్మక స్వభావం కలిగిన ఆ చురుకైన, శక్తివంతమైన నియమాలు వారిలో రగిలే యాతన తరహాలోనే , అదే శత్రుత్వంతో, అదే అవినీతితో త్వరలోనే చెలరేగుతాయి. లేఖనాలలో భక్తిహీనులు కదులుతున్న సముద్రంతో పోల్చబడ్డారు. ఎగిసిపడే ఆ సముద్రపు అలలతో "నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ( యోబు 38:11 )" చెప్పి నియంత్రిస్తున్నట్టుగా, ప్రస్తుతం దేవుడు తన శక్తి ద్వారా వారి దుష్టత్వాన్ని అదుపు చేస్తున్నాడు. దేవుడు తన అదుపు చేసే హస్తాన్ని తీసివేస్తే సముద్రం ముందు అన్నీ తుడుచుపెట్టుకుపోతాయి. ఆత్మను నాశనానికి , కష్టానికి గురి చేసేదే పాపం. దాని స్వభావమే నాశనకరమైనది. మరియు దేవుడు దానిని అదుపు చేయకుండా ఉంటే , ఆత్మను దౌర్భాగ్యస్థితికి గురి చేయడానికి మరింకేమి అవసరంలేదు. మనిషి హృదయంలో ఉన్న అవినీతి దాని ఉద్రేకంలో అపరిమితమైనది మరియు అనంతమైనది. దుష్టులు భూమిపైన జీవిస్తున్నపుడు వారిలో ఉన్న పాపం ప్రకృతి చేత అదుపు చేయబడిన మంటలాంటిది. హృదయం ఇప్పుడు పాపంలో మునిగిపోయినందున, పాపం నిరోధించబడకపోతే, అది వెంటనే ఆత్మను మండుతున్న పొయ్యిగా లేదా అగ్ని గంధకపుకొలిమిగా మారుస్తుంది.

7) మరణం దరిదాపుల్లో కనిపించకపోయినంతమాత్రాన దుష్టులు ఏ క్షణమైనా భద్రంగా ఉన్నారని అర్థం కాదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన, ఏదైనా ప్రమాదం వల్ల ఈ లోకం నుండి అప్పుడే పోయే సూచనలేమి కనిపించనంతమాత్రాన , కనిపించే అపాయమేమి ఏ కోశానా లేనంత మాత్రాన తన ప్రస్తుత పరిస్థితులు అతనికి ఎలాంటి భద్రతను ఇవ్వవు. మనుష్యులు సాధారణ అనుభవాలను బట్టి చూస్తే ప్రస్తుతమున్న ఆరోగ్యం, భద్రత మరుక్షణము వారు నరకంలోకి అడుగుపెట్టకుండా ఆపుతాయనడానికి రుజువేమీలేదు. మనకు కనిపించని, ఊహించలేని అనేక విధాలుగా అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెడతాం. రక్షింపబడని వ్యక్తులు, నరకం మీద కప్పబడిన ఒక కుళ్ళిన గవిసెన మీద నడుస్తున్నారు. ఈ గవిసెనలో అసంఖ్యాక స్థలాలు చాలా బలహీనంగా ఉన్నాయి, అవి మనిషి బరువుని భరించలేవు , ఎవరూ వాటిని చూడలేరు. పగటివేళ మరణకరమైన బాణాలు కనబడకుండా ఎగురుతాయి. పదునైన దృష్టి వాటిని గుర్తించదు, దుర్మార్గులను లోకం నుండి బయటకు తీసుకెళ్ళి నరకానికి పంపటానికి మనం అన్వేషించలేని అనేక రకాల మార్గాలు దేవునికి ఉన్నాయి. ఆ పని చేయడానికి దేవునికి ఒక అద్బుతం గానీ , ఆయన సాధారణ ఏర్పాటు కంటే భిన్నంగా ఏదైనా చేయడం గాని అవసరం లేదు. ఈ ప్రపంచం నుండి పాపులను బయటకు తీసే అన్ని సాధనాలు దేవుని చేతిలో ఉన్నాయి, అవి ఖచ్చితంగా ఆయన శక్తి మరియు సంకల్పానికి లోబడి ఉన్నాయి.

8) మనుష్యులు తమను తాము భద్రపరచుకోవడానికి చూపించే వివేకం మరియు శ్రద్ధ లేదా తమను భద్రపరచడానికి ఇతరులు వారిపై చూపించే శ్రద్ధ వారిని ఒక్క క్షణమైనా కాపాడజాలదు. దీనికి, దేవుని ఏర్పాటు మరియు సార్వత్రిక అనుభవం సాక్ష్యమిస్తాయి. మనుష్యుల సొంతజ్ఞానం వారికి మరణం నుండి భద్రత కల్పించదని స్పష్టమైన ఋజువు వుంది. అలా అయ్యుండకపోతే, అకస్మిక, అకాల మరణాన్ని తప్పించుకోవడంలో జ్ఞానవంతులకు, ఇతరులకు మధ్య తేడా కనిపించి ఉండాల్సింది. " జ్ఞానులు మృతి పొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి పొందు విధమట్టిదే - ప్రసంగి 2:16".ఇది ఎలా సాధ్యం?

9)నరకం నుండి తప్పించుకోవడానికి దుష్ట మనుష్యులు ఎన్నిపాట్లు పడినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, వారు ఇంకా క్రీస్తును తిరస్కరిస్తున్న కారణంగా దుష్ట మనుష్యులుగానే మిగిలిపోతారు కాబట్టి, అవేవీ వారిని క్షణమాత్రమైన నరకం నుండి తప్పించలేవు. నరకాన్ని గురించి వినే ప్రకృతిసంబంధమైన ప్రతి మానవుడు తాను నరకము నుండి తప్పించుకోగలడని తనకు తాను నమ్మబలుకుతాడు. తాను చేసిన, చేస్తున్న, చేయబోయేవాటి గురించి గొప్పలు చెప్పుకుంటూ తన భద్రత కొరకు వాటినే ఆధారం చేసుకుంటాడు. నాశనాన్ని ఎలా తప్పించుకోవాలో ప్రతి ఒక్కరు తమ మనసుల్లో అంచనాలు వేసుకొని తమ ఉపాయాలు, పథకాలు విఫలం కావని తమకు తాము సర్దిచెప్పుకుంటారు. కొందరే రక్షింపబడతారని, ఇంతకుముందు మరణించినవారిలో ఎక్కువ శాతం మంది నరకానికే పోయారని వారు వింటుంటారు. అయితే తన మట్టుకు తాను మాత్రం ఇతరులు చేసినదానికంటే మెరుగ్గా తన పథకాలను అమలు చేసి తప్పించుకోగలడని ప్రతివాడు అనుకుంటాడు. ఆ యాతన అనుభవించే స్థలానికి వెళ్లాలని అతనికుండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని అవసరమైన విధంగా చక్కపెట్టుకొని విఫలమవ్వకుండా శ్రద్ధ వహిస్తున్నానని అనుకుంటాడు. కానీ మూర్ఖపు మనుష్యులు తమ సొంతపథకాలతో, స్వంత జ్ఞానంతో, స్వశక్తి పైన ఆధారపడటంతో తమను తాము మోసగించుకుంటారు. వారు నమ్మేది నీడను మాత్రమే తప్ప మరేం కాదు. ప్రస్తుతం చనిపోయినవారిలో అనేకులు మనకు అందుబాటులో వున్న కృపాసాధనాలే కలిగివుండి కూడా నరకానికే వెళ్లారు. వారు మనకంటే తక్కువ జ్ఞానవంతులేమీ కాదు; వారు తప్పించుకోవడానికి అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోలేదనేం కాదు. వారితో మాట్లాడటానికి మనకు అవకాశం కుదిరి, మీరు 'బ్రతికున్న సమయంలో నరకం గురించి విన్నప్పుడు అలాంటి యాతనలకు మీరు ఎప్పుడైనా గురౌతారని అనుకున్నారా?' అని వారిలో ఒక్కొక్కరిని అడిగితే " లేదు లేదు ఇక్కడికి వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు, నా మనసులో అంతా వేరేలా ఉహించుకున్నాను, నేను బాగానే శ్రద్ధ వహిస్తున్నానని , నేను వేసుకున్న పథకాలు మంచివేనని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని అనుకున్నాను , కానీ అది నా మీదకు అకస్మాత్తుగా వచ్చింది, ఆ సమయంలో ఆ విధంగా వస్తుందని నేను ఊహించలేదు. అది దొంగవలె వచ్చింది , మరణం నన్ను, నా అంచనాలను తారుమారు చేసింది. అయ్యో! నా అవివేకమా! దేవుని ఉగ్రత నా మీదకు వచ్చిందే. ఈ జీవితం తర్వాత నేను ఇలా ఉంటాను, అలా ఉంటానంటూ వ్యర్థమైన కలలు కంటూ నన్ను నేను మోసగించుకున్నాను. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటుండగా, ఆకస్మికంగా నాకు నాశనం తటస్థించింది" అని వారంతా వాపోతారు.

10) ప్రకృతిసంబంధి ఐన వ్యక్తిని ఒక్క క్షణం కూడా నరకం నుండి దూరంగా ఉంచడానికి దేవుడు తనను తాను బద్దునుగా చేసికున్న వాగ్దానమేమి లేదు. ఎవరియందు దేవుని వాగ్దానాలన్నీ అవునన్నట్టుగా ఉన్నాయో ఆ క్రీస్తునందు చేయబడిన కృపానిబంధనలో ఉన్న వాగ్దానాలు తప్ప, నిత్యజీవమిస్తానని గాని, నిత్య మరణం నుండి తప్పిస్తానని గాని, భద్రపరుస్తానని గాని దేవుడు ఎవరికీ ఎక్కడా వాగ్దానం చేయలేదు. ఆ కృపా నిబంధనలో ఉన్న ఏ వాగ్దానాలను నమ్మక, ఆ నిబంధనా మధ్యవర్తిని లక్ష్యపెట్టక, ఆ నిబంధనకు పాత్రులు కానీ వారెవ్వరికి ఆ వాగ్దానాల వల్ల ప్రయోజనమేమి ఉండదు. కొందరు ఊహిస్తునట్టు ప్రకృతి సంబంధి ఐన వ్యక్తి కూడా యథార్థంగా వెతకటం మరియు తట్టటం ద్వారా ఆ వాగ్దానాలు అతనికి కూడా చెందుతాయని ఎంత నొక్కి చెప్పినా, అతడు క్రీస్తును విశ్వసించేంతవరకు దైవభక్తిలో అతను ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థన చేసినా అతనిని నిత్యనాశనం నుండి కాపాడాల్సిన బాధ్యత దేవునికి లేదు. ప్రకృతి సంబంధి ఐన వ్యక్తిని నరకపు గొయ్యి మీదుగా దేవుడు ఏత్తి పట్టుకున్నాడు. వారు ఆ నరకాగ్నికి పాత్రులు, వారు ఇదివరకే ఆ తీర్పు పొందారు. దేవుని ఉగ్రత వారిపై భయంకరంగా రగులుకుని వుంది. ఇదివరకే నరకంలో ఆయన ఉగ్రతను అనుభవిస్తున్న వారి పట్ల కనబరిచే అదే ఉగ్రతను వీరియెడల కూడా ఆయనకలిగి వున్నాడు. వారు ఆ కోపాన్ని శాంతింపజేయటానికి లేదా తగ్గించడానికి ఏమి చేయలేదు. వారిని ఒక్క క్షణమైనా కాపాడటానికి దేవుడు తన్ను బాధ్యునిగా చేసే వాగ్దానమేమి చేయలేదు. సాతాను వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. నరకము వారి కొరకు నోరు తెరచుకుని ఉంది. అగ్నిజ్వాలలు వారి మీదుగా ఎగసిపడుతున్నాయి. సంతోషంగా వారిని పట్టుకొని మ్రింగివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వారి హృదయాల్లో అణచబడిన మంటలు బయటకు రావడానికి పాటుపడుతున్నాయి . వారిని కాపాడగలిగే మార్గమేమి లేదు. క్లుప్తంగా చెప్పాలంటే వారికి ఆశ్రయమేమి లేదు, పట్టుకోవడానికి ఏమి లేదు. ఏ క్షణమైనా వారిని కాపాడేది ఎలాంటి నిబంధనకు, వాగ్దానానికి కట్టుబడని తన ఉచితమైన చిత్తం పైన మాత్రమే ఆధారపడిన ఉగ్రుడైన దేవుని దీర్ఘశాంతం మాత్రమే.

అన్వయం :

ఈ విషాదకరమైన అంశం మార్పుచెందని మనుష్యుల మేలుకొలుపు కొరకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మీరు విన్నదే క్రీస్తు వెలుపల వున్న ప్రతి ఒక్కరి పరిస్థితి. ఆ యాతన ప్రపంచం, ఆ గంధకములతో మండుతున్న అగ్నిగుండం మీ క్రిందే విస్తరించి వుంది. అది దేవుని ఉగ్రత యొక్క మండుతున్న జ్వాలల గొయ్యి. ఆ నరకం విశాలంగా నోరు తెరచి ఉంది. మీకు నిలబడటానికి ఆధారం ఏమీ లేదు. మీకూ, నరకానికీ మధ్య గాలి తప్ప మరేమీ లేదు. మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్నది దేవుని శక్తి మరియు ఆయన చిత్తం మాత్రమే.

దీని గురించి బహుశా నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఇప్పుడు నరకంలో లేవని నీకు తెలుసు, అయితే అందులో దేవుని హస్తాన్ని చూడట్లేదు; కానీ నీ ఆరోగ్యాన్ని, నీ కోసం నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలను, నువ్వు నీ సంరక్షణ కోసం ఉపయోగించే సాధనాలు అనే ఇతర విషయాలను చూస్తున్నావు. అయితే ఇవన్నీ ఏపాటివి? గాలిలో వేలాడుతున్న వ్యక్తిని గాలి ఎత్తి పట్టుకోలేనట్లే, దేవుడు తన చేతిని ఉపసంహరించుకుంటే అవేవీ నిన్ను పడిపోకుండా ఆపలేవు.

నీ దుష్టత్వం నిన్ను సీసమంత బరువుగా చేస్తుంది. ఆ గొప్ప భారం మరియు ఒత్తిడి నిన్ను నరకంలోకి బలవంతంగా నెట్టివేస్తుంది. దేవుడు నిర్ణయించినప్పుడు నువ్వు వెంటనే వేగంగా దిగి అట్టడుగున వున్న అగాధంలో మునిగిపోతావు. సాలెగూడు ఒక పెద్ద బండరాయిని ఆపలేనట్లే నీ ఆరోగ్యం, జాగ్రత్తలు, శ్రద్ధ, ప్రణాళికలు, నీ స్వనీతి ఇవేవి నిన్ను నరకంలో పడకుండా ఏమాత్రమూ కాపాడలేవు. దేవుని సార్వభౌమ చిత్తం కాకపోతే భూమి నిన్ను ఒక్క నిమిషం కూడా భరించదు. నువ్వు భూమికి భారం. సృష్టి నీతో కూడా మూలుగుతుంది. సృష్టి అంతా అయిష్టంగా నీ అవినీతికి గురైంది. నీ యొక్క పాపానికి మరియు సాతానుకు కాంతినిస్తూ సేవ చేయడం సూర్యుడికి ఇష్టం లేదు. నీ వాంఛలను తీర్చడానికి తన ఫలాన్ని ఇవ్వడం భూమికి ఇష్టం లేదు. నీ దుర్మార్గపు చర్యలను తన మీద జరిగించడం భూమికి ఇష్టం లేదు. నువ్వు దేవుని శత్రువుల సేవలో ఉండగా నిన్ను బతికించడం, నీకు శ్వాసనివ్వడం గాలికి కూడా ఇష్టం లేదు. దేవుని సృష్టి చాలా మంచిది. వాటిని వినియోగిస్తూ మనిషి దేవుని సేవించాలని అవి చేయబడ్డాయి, ఇది తప్ప వేరొక ఉద్దేశాన్ని వాటి యొక్క స్వభావానికి విరుద్ధంగా అవి నెరవేర్చవు. దేవుని సార్వభౌమ హస్తమే కనుక లేకపోతే ఈ ప్రపంచం నిన్ను బయటకు ఉమ్మివేసి ఉండేది. దేవుని ఉగ్రత యొక్క నల్లని మేఘాలు ఉరుముతూ భయంకరమైన తుఫానుగా నేరుగా నీ తలపై ఆవరించి ఉన్నాయి. వాటిని దేవుని హస్తం ఆపి ఉండకపోతే అవి వెంటనే నీ మీద విరుచుకుపడి ఉండేవి. ప్రస్తుతం దేవుని సార్వభౌమ చిత్తం తన ప్రచండమైన గాలిని ఆపకపోతే అది రౌద్రంతో నీ మీదకు వస్తుంది. నాశనం నీ మీదకు సుడిగాలి వలే వస్తుంది. దాని ముందు నువ్వు కళ్లములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టువలె ఉంటావు.

దేవుని కోపం ప్రస్తుతానికి నిగ్రహించబడిన గొప్ప జలాల వంటిది. బయటకు పోయే మార్గం లేనంత వరకు వాటి పీడనం, వాటి మట్టం పెరుగుతూనే ఉంటుంది. ఎంత ఎక్కువసేపు ఆపితే అది అంత వేగంగా, శక్తివంతంగా బయటకు వస్తుంది. ఇప్పటివరకు నీ దుష్టత్వం పైన తీర్పు అమలు చేయబడలేదనేది నిజమే. దేవుని శిక్షాప్రవాహం ప్రస్తుతానికి ఆపు చేయబడింది. ఈలోగా నీ అపరాధం అలా పెరుగుతూనే వుంది. ప్రతిరోజూ ఉగ్రతను కూడగట్టుకుంటున్నావు. ఆ ఉగ్రతాజలాలు నిరంతరం పెరుగుతూ మరింత శక్తివంతమౌతున్నాయి. ఆగడానికి ఇష్టపడని, కేవలం ముందుకు మాత్రమే వెళ్లే ఆ ఉగ్రతాజలాలను దేవుని చిత్తం మాత్రమే ఆపుతుంది. దేవుడు ఆ వరదను ఆపే ద్వారాల నుండి తన చేతిని ఉపసంహరించుకుంటే అది వెంటనే తెరుచుకుని, దేవుని కోపం, ఉగ్రత యొక్క భయంకరమైన వరదలు ఊహించలేని తీవ్రతతో ముందుకు వెళ్తాయి, సర్వశక్తితో నీ మీదకు దూసుకువస్తాయి. ఒకవేళ నీ బలం నరకంలో ఉన్న బలసిన, బలమైన దెయ్యం కంటే పదివేల రెట్లు ఎక్కువున్నా సరే అది ఆ ఉగ్రతా వరదను ఆపడానికి, భరించడానికి ఏ మాత్రం పనికిరాదు.

దేవుని ఉగ్రత యొక్క విల్లు వంచబడింది; బాణం ఎక్కుపెట్టబడింది. న్యాయం దానిని సూటిగా నీ హృదయానికి గురిపెట్టింది. ఏ వాగ్దానం చేయని, దేని చేత బద్ధుడు కాని ఆ ఉగ్రుడైన దేవుని చిత్తం మాత్రమే ఆ బాణం ప్రస్తుతం నీ రక్తం తాగకుండా ఆపుతుంది. దేవుని శక్తివంతమైన ఆత్మ కలిగించే గొప్ప హృదయమార్పు ఎన్నడూ అనుభవించని మీరందరు, ఎప్పుడూ తిరిగి జన్మించి నూతనసృష్టిగా చేయబడని మీరందరు, పాపంలో చనిపోయి తిరిగి లేవక, నూతన స్థితికి రాక, ఇంకా కొత్త జీవాన్ని వెలుగును అనుభవింపక ఉన్న మీరందరూ ఈ విధంగా ఉగ్రుడైన దేవుని చేతిలోనే ఉన్నారు. అయితే నువ్వు నీ జీవితాన్ని చాలా విషయాల్లో సరిచేసుకుని ఉండొచ్చు, నీకు విశ్వాససంబంధమైన చాలా విషయాల్లో ఆసక్తి ఉండొచ్చు. పైకి దైవభక్తి గలవానిగానే నీ కుటుంబంలోను, నీ ఇంట్లోనూ, దేవుని ఇంట్లోనూ చలామణి అవుతుండొచ్చు. అయినా ప్రస్తుతం నువ్వు నిత్యనాశనానికి గురి అవ్వకుండా దేవుని చిత్తం తప్ప మరేదీ నిన్ను తప్పించట్లేదు. దీని విషయంలో నువ్వు ప్రస్తుతం ఒప్పించబడకపోయినా రానురాను నీకే తెలుస్తుంది. ఒకప్పుడు నీలాగే ఆలోచించిన చాలామంది ఇప్పుడు ఈ సంగతులను గుర్తిస్తున్నారు. ఎందుకంటే నాశనం వారి మీదకు రాదని, నెమ్మదిగా ఉన్నదని అనుకుంటున్నపుడే నాశనము వారి మీదకు అకస్మాత్తుగా వచ్చింది. వారు ఆధారపడ్డ విషయాలన్నీ కూడా గాలి, ఖాళీ నీడ లాంటివని వారికి తేటతెల్లమైంది.

ఒకడు ఒక సాలెపురుగును కానీ హేయమైన కీటకాన్ని కానీ మంటపై పట్టుకున్నట్టుగా నరకపు గోతిపై నిన్ను పట్టుకున్న దేవుడు నిన్ను అసహ్యించుకుంటున్నాడు, నీ మీద భయంకరమైన ఉగ్రతతో రగులుతున్నాడు. నీ పట్ల ఆయన ఉగ్రత అగ్నిలా రగులుతుంది. ఆయన నిన్ను కేవలం నరకంలో వేయడానికి తప్ప దేనికి యోగ్యుడివి కాదన్నట్లుగా చూస్తాడు. ఆయన కనుదృష్టి నీ దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది.

మన దృష్టికి అత్యంత ద్వేషపూరిత, విషపూరిత పాము కంటే నువ్వు ఆయన దృష్టిలో పదివేల రెట్లు ఎక్కువ అసహ్యంగా ఉన్నావు. ఒక రాజును ఎంతో తీక్షణంగా వ్యతిరేకించే తిరుగుబాటుదారుడికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా నువ్వు ఆయనను ఎన్నోసార్లు దుఃఖపరిచావు. అయినప్పటికీ ప్రతిసారి నువ్వు ఆ అగ్నిలో పడకుండా ఆపేది కేవలం దేవునిహస్తం మాత్రమే. గతరాత్రి నువ్వు నరకంలో పడకుండా ఉండటానికి, నిద్రపోయిన తర్వాత నరకంలో పడకుండా ఉండటానికి,నిద్ర లేచిన తర్వాత కూడా ఇప్పటివరకూ నరకంలో పడకుండా ఉండటానికి కారణం కేవలం నిన్ను ఎత్తి పట్టుకుంటున్న దేవునిహస్తం మాత్రమే. ఆయన దయ తప్ప మరే కారణం కాదు. ఈ క్షణంలో నువ్వు ఇంకా నరకంలో పడకుండా ఉండటానికి కారణం కేవలం ఆయన దయ మాత్రమే.

ఓ పాపి, నువ్వు ఉన్న భయంకరమైన అపాయాన్ని గుర్తించు. ఇది ఉగ్రత యొక్క మహాకొలిమి. ఇదో వెడల్పయిన అడుగనేదే లేని అగాధం. ఇప్పుడు నరకంలో కాలుతున్న వారి మీద దేవుడు ఎంత కోపంతో రగులుతున్నాడో, ఆ మంట పైనే నిన్ను పట్టుకొని నీ మీద కూడా అంతే కోపంతో రగులుతున్నాడు. నువ్వు ఒక సన్నని దారం మీద వేలాడుతున్నావు, దాన్ని తెంచి కాల్చడానికి దేవుని ఉగ్రతాజ్వాలలు ప్రతిక్షణం దాని చుట్టూ ఎగసిపడుతున్నాయి. ఎవరూ మధ్యవర్తిగా ఉండటానికి నీకు అర్హత లేదు. దేన్ని పట్టుకున్నా నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఏది కూడా నిన్ను ఆ అగ్నిజ్వాలల నుండి తప్పించదు. నీకు కలిగిఉన్నదేదీ, నువ్వు చేసుకున్నదేదీ, నువ్వు చేసుకోగలిగేదేదీ కూడా నిన్ను దేవుని నుండి కాపాడలేదు; ప్రత్యేకంగా వీటిని గమనించండి -

1) ఇది ఎవరి ఉగ్రత ? ఇది అనంతుడైన దేవుని ఉగ్రత. ఇది కేవలం ఒక మానవుడి కోపమై ఉంటే, అతిశక్తివంతుడైన రాజు కోపమై ఉండినా సరే దేవుని కోపంతో సరిపోల్చలేము. రాజుల కోపం, మరి ముఖ్యంగా తన ప్రజల ప్రాణాలు తన చేతిలోనే ఉంచుకొని తన ఇష్ట ప్రకారం దాన్ని తీసే అధికారాన్ని కలిగిన నిరంకుశుడైన నియంత కోపం ఎంతో భయం పుట్టించేదిగా ఉంటుంది. "రాజు వలని భయం సింహ గర్జనవంటిది రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణ మోసం తెచ్చుకుందురు." సామెతలు 20:2. నిరంకుశుడైన రాజు కోపాన్ని రేపినవాడు మనుష్యులు కల్పించి విధించగలిగే అత్యంత క్రూరమైన శిక్షలకు తనను తాను పాత్రుడిగా చేసుకుంటాడు. అతి శక్తివంతమైన భూరాజులు వారి అత్యున్నతమైన ఘనతలో, బలములో, అతి క్రూర ప్రవృత్తిని ధరించుకున్నవారు కూడా మహోన్నతుడైన సర్వశక్తివంతుడైన సృష్టికర్తతో, పరలోకానికి, భూమికి రాజైయున్నవానితో పోల్చుకున్నప్పుడు వారు బలహీనులు, తుచ్ఛమైన మట్టిపురుగులవంటివారే. వారు ఎంతో కోపంగా ఉన్నప్పుడు, వారు తమ రౌద్రాన్ని గరిష్టంగా చూపించినప్పుడు కూడా వారు చేయగలిగేది చాలా తక్కువే. భూరాజులందరూ దేవుని ఎదుట మిడుతలవలే ఉన్నారు. వారు శూన్యం, శూన్యం కంటే తక్కువ, వారి ప్రేమకు గానీ, ద్వేషానికి గానీ ఏ విలువా లేదు. రాజులకు రాజైనవాడి ఘనత వారి ఘనత కంటే ఎలాగ ఎక్కువో అలాగే వారి ఉగ్రత కంటే ఆయన ఉగ్రత ఎంతో ఎక్కువ. "నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా - దేహమును చంపిన తర్వాత మరేమియు చేయనేరని వారికీ భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను" - మత్తయి 10:28

2) ఆయన తీవ్రమైన కోపానికి నువ్వు గురైయున్నావు, ఆ తీవ్రత గురించి మనం లేఖనాల్లో చదువుతాం - "వారి క్రియలను బట్టి ఆయన ప్రతి దండన చేయును తన శత్రువులకు రౌద్రం చూపును. తన విరోధులకు ప్రతీకారం చేయును - యెషయా 59:18" ---" ఆలకించుడి, మహా కోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపంగా వచ్చుచున్నాడు. " ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును - ప్రకటన 19:15" . ఇవి ఎంతో భయంకరమైన మాటలు.  "ఉగ్రత" అని అన్నా భయంకరంగా ఉండేది, కానీ అది చాలదన్నట్టు ఇక్కడ చెప్పబడిన తీక్షణమైన ఉగ్రతా రౌద్రం యెహోవా యొక్క రౌద్రమని చెప్పబడింది, అది ఎంత భయంకరంగా ఉంటుందో! ఈ మాటల్లో ఉన్న భావాల్ని ఎవరు చెప్పగలరు, ఎవరు ఊహించగలరు! అయితే ఇక్కడ తీక్షణం, రౌద్రం అనే మాటలు మాత్రమే వాడబడలేదు, సర్వశక్తుని యొక్క తీక్షణమైన రౌద్రం అని చెప్పబడింది. మనుష్యులు తమ కోపంలో తమ శక్తిని ఎలాగైతే ప్రయోగిస్తారో, అలాగే సర్వశక్తుడైన దేవుడు తన రౌద్రంలో సర్వశక్తిని వ్యక్తపరుస్తాడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో ? నిస్సహాయులైన పురుగులాంటి మానవులు దాన్ని ఎలా భరిస్తారో? ఎవరి చేతులు బలంగా దీనిని అడ్డుకోగలవు, ఎవరి గుండె దీనిని తట్టుకోగలదు, భయంకరమైన, అనూహ్యమైన, వర్ణించలేని ఈ యాతనను బలహీన జీవులు ఎలా తట్టుకోగలవు. ఇంకా తిరిగి జన్మించని స్థితిలో ఉన్న మీరు దీని గురించి ఆలోచించండి. దేవుడు తన తీక్షణమైన ఉగ్రతను కొంచం కూడా దయ లేకుండా కనపరుస్తాడు. మీ అసమర్థ పరిస్థితిని దేవుడు చూసినప్పుడు, నీ యాతన నువ్వు తట్టుకోగలిగే శక్తికి ఎంతో మించిందని చూసినప్పుడు, నీ నిస్సహాయమైన ఆత్మ ఎలా నలిగిపోతుందో, అనంతమైన దుఃఖంలోకి అది ఎలా మునిగిపోతుందో చూసినప్పుడు, దేవుడు తన ఉగ్రతను కనపర్చడం ఏమాత్రం నిలిపివేయడు, లేశమాత్రమైన తన బరువైన హస్తాన్ని ఉపసంహరించడు. ఎలాంటి ఊరట, ఎలాంటి కనికరం దయచేయబడదు. తన ప్రచండమైన ఉగ్రతా తుఫానును ఏమాత్రం ఆపడు. నీ క్షేమాన్ని గూర్చి అసలు పట్టించుకోడు. మరింకేవిధంగా ఐనా బాధపడతావని ఆయన తన ఉగ్రతను చూపించే విషయంలో ఏమాత్రం జాగ్రత్తపడడు. న్యాయం కోరేదంతా నువ్వు భరించాలనే తప్ప, నువ్వు భరించలేవన్న కారణంతో తీవ్రత ఏమాత్రం తగ్గించబడదు.

"కాబట్టి కటాక్షం లేకయు కనికరం చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింపకుందును - యెహెఙ్కేలు 8:18" ఇప్పుడు నిన్ను దేవుడు కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే కృపాకాలం, ఆయన కనికరిస్తాడనే నిరీక్షణతో ఇప్పుడు నువ్వు  ఆయనకు మొరపెట్టుకోగలవు. ఈ కృపాకాలం ముగిసిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, విలపించినా  అంతా వ్యర్థమే. దేవుడు నిన్ను పూర్తిగా విసర్జించి నశింపజేస్తాడు, నీ క్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోడు. ఆయన చేత నువ్వు యాతన అనుభవించడానికి తప్ప దేనికి పనికిరావు. నిన్ను ఉనికిలో ఉంచడానికి అది తప్ప మరేకారణం ఉండదు. నీవు నాశనానికే ఏర్పరచబడిన ఉగ్రతాపాత్రగా మిగిలిపోతావు. ఈ పాత్ర ఆయన ఉగ్రత కనబరచడానికి తప్ప మరి దేనికి పనికిరాదు. నువ్వు ఏడ్చి, విలపించినప్పుడు ఆయన కనికరం చూపించకపోగా, నవ్వి అపహాస్యం చేస్తాడు. "నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను, భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.  నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు" - సామెతలు1:24-32. ఆ గొప్ప దేవుని ఈ మాటలు ఎంత భయంకరమైనవి.  "ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను" - యెషయా 63:3. అసహ్యం, ద్వేషం, కోపోగ్రత అనే ఈ మాటల తీక్షణతను వ్యక్తపరిచే పదాలను కనుక్కోవడం మన పరిమితుల్లో సాధ్యం కాదు. ఒకవేళ నువ్వు కనికరం కొరకు దేవున్ని అర్థిస్తే, నీ బాధలో అయన నిన్ను కనికరించేది పోయి, నీ పైన జాలిపడేది పోయి అయన తన కాలి క్రింద నిన్ను తొక్కుతాడు. సర్వశక్తుడు నిన్ను తన పాదాల క్రింద తొక్కే బరువును నువ్వు భరించలేవని తెలిసినా ఏ మాత్రం కనికరించకుండా నిన్ను నలిపివేస్తాడు. అయన నీ రక్తం పైకి చిమ్మేలా  నిన్ను నలిపి, దానితో తన వస్త్రాన్ని మరక చేసుకుంటాడు. నిన్ను ద్వేషించడం మాత్రమే కాదు, అత్యధికంగా నిన్ను అసహ్యించుకుంటాడు. వీధిలో బురదలా నిన్ను తన పాదాల క్రింద తొక్కడం తప్ప వేరే ఏ స్థానం నీకు తగినదిగా ఎంచబడదు.

3) మీరు పడే యాతనకు మిమ్మల్ని గురిచేసేది దేవుడే , ఆలా చేయడం ద్వారా దేవుడు  యెహోవా ఉగ్రత ఏమిటో చూపిస్తాడు. దేవుడు తన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, తన ఉగ్రత ఎంత భయంకరమైనదో మానవులకు, తన దూతలకు చూపించాలనుకున్నాడు. కొన్నిసార్లు భూరాజులు తమ కోపం ఎంత భయంకరంగా  ఉంటుందో  చుపించాలనుకుంటారు, తీవ్రమైన శిక్షల ద్వారా వారిని రెచ్చగొట్టే వారిపై వారి కోపాన్ని కనబరుస్తారు. కల్దీయుల సామ్రాజ్యానికి శక్తిమంతుడైన  అహంకారచక్రవర్తి నెబుకద్నెజరు, షడ్రక్ , మేషాక్, అబేద్నగోల మీద రగులుకొని తన కోపాన్ని చూపించాలనుకొని ఆ మండుతున్న కొలిమిని ఏడురెట్లు ఎక్కువగా చేయాలని ఆదేశించాడు; మానవులు పెంచగలిగే అత్యధిక స్థాయికి ఇది ఎక్కువ చేయబడింది. అయితే మహాదేవుడు తన శత్రువులు అనుభవించే విపరీతమైన యాతన ద్వారా తన ఉగ్రతను చూపించి, తన ఔన్నత్యాన్ని, తన శక్తి యొక్క ఘనతను మహిమపరచుకోవాలని అనుకుంటున్నాడు. "ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? " - రోమా 9:22. పలచన చేయబడని, చిక్కని, అదుపు చేయబడని యెహోవా ఉగ్రతను చూపించడం దేవుని ఉద్దేశం కాబట్టి ఆయన నిర్ణయించినట్టుగానే చేస్తాడు. అక్కడ జరిగేది చూడడానికి భయంకరంగా ఉంటుంది. ఆ మహాదేవుడు కోపంతో పాపిపై తన భయంకరమైన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి లేచినప్పుడు, ఆ దౌర్భాగ్యుడు ఆ కోపం యొక్క అనంతమైన శక్తిని, బరువుని అనుభవిస్తున్నప్పుడు, దేవుడు తన ఔన్నత్యాన్ని, శక్తిని చూడడానికి విశ్వమంతటినీ పిలుస్తాడు.

"యెహోవా ఇట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసికొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను, మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును, దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్తులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి. సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?" - యెషయా 33:10-14. మీరు మారుమనస్సు లేని స్థితిలోనే కొనసాగితే, సర్వశక్తిమంతుడైన దేవుని అనంతమైన ఘనతాప్రభావములు శక్తిహీనులైన మీపై  బలవంతంగా చూపించబడుతుంది. మీరు ఈ యాతనను దేవదూతలు, గొర్రెపిల్ల సమక్షంలో అనుభవిస్తారు. నువ్వు ఇలా యాతన అనుభవిస్తున్న సమయంలో సర్వశక్తుడైన దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి, పరలోకంలో ఉన్న తేజోవాసులందరూ బయలువెళ్లి ఆ భయంకర దృశ్యాన్ని చూస్తారు. ఆ ఘనతాప్రభావం ఎదుట సాగిలపడి ఆరాధిస్తారు.

"ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు, వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును" - యెషయా 66: 23-24.

అది నిత్యమైన ఉగ్రత. సర్వశక్తుని ఉగ్రత ఒక్క క్షణం అనుభవించడమే ఊహించలేనంత  భయంకరమైనది. అయితే అది నువ్వు నిత్యమూ అనుభవించాల్సి ఉంటుంది. ఈ భయంకరమైన యాతనకు అంతమనేదే ఉండదు.  నువ్వు ముందుకు చూసినప్పుడు,  అది నిరంతరమూ ఉంటుందని, శాశ్వతకాలముండేదని  చూసినప్పుడు అది నీ ఆలోచనలను మింగివేస్తుంది, నీ ఆత్మను అబ్బురపరుస్తుంది. విడుదల కానీ, అంతం కానీ, ఉపశమనం కానీ, విరామం కానీ వస్తుందన్న ఆశే ఉండదు. సర్వశక్తివంతమైన కనికరం లేని ప్రతీకారాన్ని నువ్వు ఎదుర్కొంటూ, సుదీర్ఘమైన యుగాలు, కోటానుకోట్ల యుగాలు వెళ్లదీయాల్సి ఉంటుందని నువ్వు  తెలుసుకుంటావు. ఇదంతా అనుభవించిన తర్వాత, ఎన్నో యుగాలు ఈ విధంగా గడిచిపోయినా తర్వాత నువ్వు ఇప్పటివరకు అనుభవించింది ఇంకా మిగిలి ఉన్నదానిలో ఒక చుక్క మాత్రమే అని తెలుసుకుంటావు. ఈ విధంగా నీ శిక్ష నిజంగా నిత్యముండే శిక్ష. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మనస్థితి ఎలా ఉంటుందో ఎవరు వర్ణించగలరు. మనం దాని గురించి వ్యక్తపరచగలిగేదంతా  కేవలం బలహీనమైన, మందమైన వర్ణన మాత్రమే. ఇది వివరించలేనిది, ఊహకు అందనిది. దేవుని ఉగ్రత యొక్క శక్తిని ఎవరు తెలుసుకోగలరు. ప్రతి దినము, ప్రతి గడియ అంతం లేని ఈ ఉగ్రతను, యాతనను అనుభవించేవారి పరిస్థితి ఏమిటో ఎవరు వివరించగలరు? ఎంత నీతిగా, నిష్టగా, సద్బుద్ధితో, జ్ఞానంతో  మెలిగేవారైనా సరే,  తిరిగి జన్మించకపోతే ప్రతి ఒక్కరి దయనీయమైన పరిస్థితి ఇదే!

యవ్వనస్తులేమీ, వృద్ధులేమి దీని గురించి ఆలోచిస్తారని ప్రాధేయపడుతున్నాను. ఈ మహిమాన్విత సువార్తను విని కూడా మీలో కొందరు ఈ భయంకరమైన ఉగ్రతకు గురౌతారని భయపడుతున్నాను. వాళ్లెవరో మనకు తెలీదు, ఇప్పుడు వారికేమి ఆలోచనలు ఉన్నాయో తెలీదు, పెద్దగా కలవరపడకుండా, హాయిగా వారు ఈ విషయాలు వింటూ ఉండవచ్చు. అది మనం కాదులే అని, మనం తప్పించుకుంటామని తమని తాము నమ్మబలుక్కుంటూ ఉండవచ్చు. ఈ యాతనకు ఫలానా వ్యక్తి గురి ఔతాడని ఏ ఒక్క వ్యక్తి గురించైనా మనకు తెలిస్తే, ఆలోచించడానికే అది ఎంత భయంకరంగా ఉంటుంది! ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే  అతన్ని చూడటం కూడా ఎంత కలచి వేసే దృశ్యంగా ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు వాని కొరకు ఎంతగా విలపించి ఏడుస్తాడు! కానీ, అయ్యో ! ఒక్కరు కాదు, నరకంలో ఇక్కడ విన్న తలంపులను గుర్తు చేసుకునేవారు ఎంతమంది ఉండబోతున్నారో! అతి తక్కువ సమయంలో అంటే ఈ సంవత్సరం ముగిసేలోపే కొందరు నరకంలో ఉండవచ్చు, ఇక్కడ శ్రోతల్లో ఆరోగ్యంగా భద్రముగా ఉన్న కొంతమంది రేపు ఉదయమే నరకంలో ఉండవచ్చు. మీరు ఇంకా ఆ నరకానికి వెళ్లకుండా ఉండి ఉంటే అతి త్వరలో మీరు వెళ్లే అవకాశాలు వున్నాయి. 'నీ నాశనము కునికి నిద్రపోక ' మీలో చాలా మంది పైకి ఆకస్మికంగా వస్తుంది. నువ్వు ఇంకా నరకంలో పడలేదేంటని ఆశ్చర్యపడుతుండొచ్చు.  ఎందుకంటే  నీకు తెలిసినవారిలో నరకానికి నీకంటే తక్కువ అర్హులైనవారు, ఈనాటికీ సజీవంగా ఉండుండాల్సినవారు, నీకంటే ముందే శాశ్వత నరకానికి వెళ్లి ఏ నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు. వారు తీవ్రమైన దుఃఖంలో, తీవ్ర నిరాశతో ఏడుస్తున్నారు. కానీ నువ్వైతే ఇంకా బైబిళ్లు, ప్రభువు దినాలు, పరిచారకులు వంటి  రక్షణకు నడిపించే సాధనాలు అందుబాటులో ఉన్న సజీవుల దేశంలోనే ఉన్నావు. నీకు ఇప్పుడు అందుబాటులో వున్న అవకాశాలు ఒక్క దినం పాటైనా అనుభవించడానికి ఆ నశించిన ఆ దయనీయమైనవారు ఏమివ్వడానికైనా వెనుదీయరు. కాబట్టి ఈ దినం నీకున్న అవకాశం ఎంతో అసాధారణమైనది, ఇది తన కనికరపు ద్వారాల్ని వెడల్పుగా తెరచి పాపులను రమ్మని క్రీస్తూ బిగ్గరగా కేకలు వేస్తూ పిలుస్తున్న దినం. అనేకులు ఆయన వద్ద బారులు తీరి దేవునిరాజ్యంలోకి బలవంతంగా దూసుకుపోయే దినం. ప్రతి రోజు అనేకులు తూర్పుపడమర ఉత్తరదక్షిణ దిక్కుల నుండి వస్తున్నారు. మొన్నటివరకు నీలాంటి దయనీయ స్థితిలోనే ఉన్న అనేకులు ఇప్పుడు ఎంతో సంతోషంగా తమను ప్రేమించి తమ పాపాలను తన స్వరక్తంలో కడిగినవానిని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ  దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నారు. వారు సంతోషంగా విందులో ఉంటే నువ్వు వెనుకబడి నశించిపోవడం ఎంత బాధాకరం. వారు  హృదయానందము చేత కేకలు వేస్తుంటే నువ్వు మాత్రం చింతాక్రాంతుడవై ఏడుస్తూ మనోదుఃఖంచేత ప్రలాపించడమెందుకు? ( యెషయా 65:14 )  అలాంటి  పరిస్థితిలో నువ్వు ఒక్క క్షణమైనా ఎలా ఉండగలవు. దినదినము క్రీస్తును చేరే ఆత్మల్లా మీ ఆత్మలు కూడా ప్రశస్తమైనవి కావా?  ఈ లోకంలో ఎంతో కాలం జీవించినా, తిరిగి జన్మించి ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక, వారు బ్రతుకుదినాల్లా నీటిలో ఉగ్రతను సమకూర్చుకోవడం తప్ప ఏమీ చేయనివారెందరో ఈ లోకంలో లేరా ?  

అయ్యలారా ! మీ పరిస్థితి మరింత ప్రమాదకరమైంది, మీ అపరాధం, హృదయ కాఠిన్యం చాలా గొప్పవి. మీలా దేవుని కనికరం పొందకుండా మీ సమవయస్కులెందరో విడిచిపెట్టబడడం మీరు చూడలేదా? నిద్ర నుండి మేల్కొని మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరముంది. అనంతుడైన దేవుని తీక్షణమైన ఉగ్రతను నువ్వు భరించలేవు. ఓ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, నీ వయస్సులోనే ఉన్న ఎంతోమంది, వ్యర్థమైన యవనేచ్ఛలన్నిటిని విసర్జించి క్రీస్తువైపుకు తిరుగుతుంటే నువ్వు మాత్రం ఈ సదవకాశాన్ని జారవిడుచుకుంటావా? ఇప్పుడు నీకు విశేషావకాశం అందుబాటులో ఉంది కానీ దానిని నిర్లక్ష్యం చేస్తే నీ యవ్వనమంతా పాపంలోనే గడిపి ఇప్పుడు భయంకరంగా గుడ్డితనానికి, హృదయ కాఠిన్యానికి లోనైనవారిలాగే నీ పర్యవసానం కూడా ఉంటుంది. మారుమనస్సు పొందని చిన్నపిల్లలారా, రాత్రింబగళ్లు మీతో కోపంగా ఉన్న దేవుని ఆ ఉగ్రతకు గురవ్వడానికి మీరు నరకానికి వెళ్తున్నారని మీకు తెలియదా? ఎంతోమంది పిల్లలు  రాజులకు రాజు యొక్క  ఆనందంతో నిండిన పరిశుద్ధలైన పిల్లలుగా మారుతుంటే, మీరు మాత్రం ఇంకా సాతాను యొక్క పిల్లలుగానే మిగిలిపోతారా? మీరు ముసలివారైనా, యౌవనస్తులైనా, పిల్లలైనా, పురుషులైనా, స్త్రీలైనా, ఎవరైనా సరే క్రీస్తుకు వెలుపల నరకపు గోతి మీదుగా వ్రేలాడుతున్న మీరందరూ, దేవుని యొక్క వాక్యము మరియు ఆయన ఏర్పాట్లు బిగ్గరగా కేకలు వేసే స్వరాన్ని వినండి. అనేకులకు కనికరం చూపించి ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించే ఈ దినం, మిగిలినవారికి నిస్సందేహంగా దేవుని ప్రతీకార దినంగా మారుతుంది. ఈలాంటి ఒక దినాన తమ ఆత్మల స్థితిని నిర్లక్ష్యం చేసుకునే వారి హృదయాలు కఠినపడి, వారి దోషం రెట్టింపు ఔతుంది. రక్షణ పొందటం కోసం ఏ కాలంలోను ఇన్ని మాధ్యమాలు అందుబాటులో లేవు. ఒకవేళ వీటిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు శాశ్వతంగా నీ పుట్టినదినాన్ని శపించుకుంటావు. నిస్సందేహంగా ఈ దినం కూడా బాప్తిస్మమిచ్చు యోహాను దినాలలాగే " గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును" - (మత్తయి 3:10). కాబట్టి క్రీస్తుయేసులో లేనివారందరూ ఇప్పుడే నిద్ర నుండి  మేల్కొని రానై ఉన్న ఉగ్రతను తప్పించుకోండి. సర్వశక్తుడైన దేవుని ఉగ్రత మారుమనస్సు పొందని ప్రతి పాపి మీద వేలాడుతుంది, అందరూ సోదామా నుండి పారిపోండి. మీ ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోండి. వెనుకకు చూడకండి. దహించి వేయబడకుండా ఆ పర్వతానికి పారిపోండి. 

 

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.