నిజ క్రైస్తవ జీవితం

రచయిత: పి. శ్రావణ్ కుమార్

 

వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము (కీర్తన 119:37) అని, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక (కీర్తన 19:14) అని నేను ఎన్నో సార్లు ప్రార్ధన చేశాను. అయినప్పటికీ నా పాప హృదయం వ్యర్ధమైనవాటిని చూడమని, వాటినే ధ్యానించమని ప్రేరేపిస్తూనే ఉంది. నేను ప్రభువును నమ్మక ముందు ఘోరమైన పాప బంధకాలలో బ్రతికాను. వాక్యంలో చెప్పబడిన పాపాల జాబితాతో నా జీవితాన్ని పోలిస్తే బహుశా ఒకరకంగా అన్నిటిని నా జీవితంలో చూడొచ్చు. అయితే కరుణ సంపన్నుడైన దేవుడు నా మీద తన కృపను చూపి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. రక్షింపబడక ముందు నేను చేసే పనులకు కొన్ని సార్లు నన్ను నేనే క్షమించుకోలేకపోయే వాడిని. కానీ దేవుడు ఎంత దీర్ఘశాంతమంతుడో, ఎంత కరుణాసంపన్నుడో, ఎంత కృప చూపించేవాడో నాకు ప్రత్యక్షంగా తెలియజేసాడు.

నేను పడిపోయిన పాప ఉబులలో ఒకటి సినిమాలు చూడడం. అది ఒకానొక సమయంలో ఒక వ్యసనంగా మారింది. ఎంతగా అంటే, సినిమా విడుదలైన సమయానికి ఎదో ఒక రకంగా డబ్బులు సమకూర్చుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు అని మొదటి షో కి వెళ్ళేవాడిని. ఆ పాటలు పాడడం, డైలాగులు చెప్పడం, ఆ నటీనటులు ప్రవర్తించిన తీరులో ప్రవర్తించడం నాకు సర్వసాధారణం. అయితే వ్యభిచారం, అస్లీలత, కాముకత్వం మొదలగు పాపలు లేని సినిమాలు చాలా అరుదు. వీటికి అలవాటుపడ్డ ఎవరైనా అలాంటి వాటినే పదేపదే చూడాలి అని ఇష్టపడతారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా "భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి" అని చెప్తుంది. అయితే నేను కామాతురతకు తావిచ్చి, స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం అనే దేవుని కొలమానాన్ని బట్టి ఆయన ముందు వ్యభిచారిగా ఉన్నాను. చాలామంది క్రైస్తవులు వారికి లైంగిక విషయాలలో బలహీనతలు ఉన్నాయని చెప్పుకోడానికి లేదా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మనమేదో చులకనైపోతాం అనే భావం ఉంటుంది. దీనిని బట్టి లేని పరిశుద్ధతను ప్రదర్శించే సహోదరులు నేటి క్రైస్తవ సంఘాలలో చాలామందే ఉన్నారు. నేను నాకున్న బలహీనతలు చెప్పుకోవడానికి ఏమి వెనకాడట్లేదు. లైంగిక సంబంధమైన ఆలోచనల విషయంలో నేను పాపంతో పోరాడుతూనే ఉన్నాను.

ఈ రోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అనేకులు, అస్లీల దృశ్యాలు చూడడం, పర స్త్రీని మోహపు చూపుతో చూడడం, వ్యభిచరించడం లాంటి పనులు చేస్తూ, ఒకసారి మోకాళ్ళు ఒంగి దేవుణ్ణి క్షమించమని అడిగితే క్షమిస్తాడులే అని, నిశ్చింతగా ఉన్నారు. ప్రియా సహోదరుడా, సహోదరి నువ్వు ఒక వేళ ఇటువంటి పాపంతో పోరాడుతుంటే, ఈ వ్యాసం ద్వారా దేవుడు నిన్ను బలపరచాలి అని ప్రార్థిస్తున్నాను. నేను ఈ వ్యాసాన్ని ఇతరులకు బోధ చేయడానికి కంటే ఎక్కువగా నాకు నేను బోధ చేసుకోవడానికే రాస్తున్నాను.

దేవుడు లైంగిక వాంఛలను ఎందుకు ఇచ్చాడు? ప్రేమ అంటే ఏంటి? కామం అంటే ఏంటి? అని తెలుసుకోలేని వయసులోనే మనందరం ఈ ఆకర్షణలకు బందీలవుతున్నాం. పాప స్వభావం కలిగిన మనందరం అపవిత్రతను, కామాతురతను ప్రేమించి అలాంటి వాటిని చూడడానికి, ఆ విధంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాం. నేను అందుకు మినహాయింపు ఏమి కాదు, నేను అలాంటి పాపినే. నేను రక్షణ పొందని వారి గురించి మాట్లాడను ఎందుకంటే, దేవుని ఆత్మ శక్తి లేకుండా ఎవరూ పాపాన్ని జయించలేరు. కాబట్టి దేవునిని ఎరిగి, సువార్త సత్యాన్ని విని అంగీకరించి రక్షింపబడిన నా లాంటి ప్రియా సహోదరులతో మాట్లాడుతున్నాను.

ఎన్నోసార్లు దేవుని ముందు మోకాళ్లూని, ప్రభువా ఇలాంటి లైంగిక పాపంలో పడిపోయాను, ఇది తప్పు అని వాక్యం చెప్తున్న విషయం నాకు తెలుసు, నేను అలాంటి కార్యకలాపాలలో పాలుపంచుకోకూడదు అని కూడా తెలుసు, అయినప్పటికి నేను బలహీనుడిగా ఉన్నాను, నేను చేయకూడదు అని అనుకున్న వాటిని చేస్తున్నాను అని చెప్పావు. నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తో అనవసరమైన వాటిని వీక్షించి, వాటి ద్వారా ప్రేరేపించబడి, స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి ఎన్ని సార్లు పాపంలో పడిపోయావు? ఇలా పడిపోయిన ప్రతిసారి, నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయను అని దేవుని ముందు నిర్ణయించుకొని, మళ్ళి అదే పాపంలో పడిపోయినప్పుడు బలహీనుడిగా, ఏమి చేయలేని స్థితిలో అసలు నేను నిజంగా రక్షింపబడ్డానా అని ఎన్నిసార్లు నీ రక్షణను సందేహించుకున్నావు?

ఇలా జరగడం మనం జీవితాలలో చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం. నాకు దేవుని గురించి తెలుసు, దేవుని వాక్యం తెలుసు, నేను వాక్యాన్ని కూడా బోధిస్తాను మరి ఆ వాక్యప్రకారం నడవడం ప్రత్యేకించి లైంగిక వాంఛలను అదుపు చేసుకోవడంలో ఎందుకు విఫలమౌతున్నాను అని సందేహపడుతున్నావా? ఇది అందరూ ఎదురుకుంటున్న సమస్య. నేను ఈ విషయంలో ఎన్నోసార్లు విఫలమయ్యాను, దేవుడు నన్ను ఇక మీద క్షమించడు అనే ఆలోచనకు కూడా తావిచ్చావా? అయితే నువ్వు నిజంగా క్రీస్తును నమ్మితే, దేవుడు ఈ పాపం నుండి నిన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ప్రభువా కరుణించు, సహాయం చెయ్యి, విడిపించు అని ప్రార్ధన చేస్తే, దేవుడు నీ మనవిని నిరాకరించడు. అయితే ప్రార్ధన చేసి తిరిగి పాత జీవితానికి వెళ్లిపోయే వారు చాలామంది ఉన్నారు, అలాంటి వారి కోసం నేను ఈ మాటలు రాయట్లేదు. ప్రార్ధన చేసి, దేవుని శక్తితో పోరాటం చేస్తాను, పాపాన్ని చంపుతాను అని నిశ్చయించుకున్న వాళ్ళు ఇంకా ముందుకు చదివి బలపడాలని కోరుకుంటున్నాను.

దేవుడు లైంగిక కోరికలను ఎందుకు సృష్టించాడు

మనం చాలా సార్లు దేవా అసలు ఈ కోరికలు నాలో ఎందుకు ఉన్నాయి, ఇలాంటి లైంగిక వాంఛలు నాలో లేకపోతే అసలు ఏ సమస్య ఉండదు నేను పరిశుద్ధునిగా ఉంటాను అని అనుకుంటాం. అయితే లైంగిక కోరికలు (sexual desires) చెడ్డవి కావు, వాటిని దేవుడే సృష్టించాడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేక అసలు ఇలాంటి కోరికలు ఉండడమే పాపం అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. నేను యౌవనునిగా ఉన్నప్పుడు ప్రతి లైంగిక కోరిక పాపమే అని, భార్య భర్తల మధ్య ఉన్న sexual relationship కూడా పాపమే అని అనుకునే వాడిని. అది సరైన అవగాహన కాదు.

దేవుడు మనకు ఇచ్చిన లైంగిక వాంఛలకు రెండు ఉద్దేశాలు ఉన్నాయి

   1. వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు ఏక శరీరమవ్వడం

   2. వారు అభివృద్ధి చెంది ఫలించడం (పిల్లలను కనడం)

“నీ ఊట దీవెన నొందును. నీ యవ్వనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము" సామెతలు 5:18,19

తన సొంత భార్యతో భర్త లైంగిక సంబంధం కలిగి ఉండడాన్ని దేవుడు మంచింది అంటున్నాడు. ఎందుకంటే ఆ సంబంధాన్ని, ఆ ఆకర్షణను, ఆ వాంఛను సృష్టించింది దేవుడే గనుక. దేవుడు మంచివాడు గనుక ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి మంచిదే. లైంగిక కోరికలు కూడా మంచివే. అయితే ఆ కోరికలు ఆ ఇష్టాలు భార్య మరియు భర్తకు మధ్య మాత్రమే ఉండాలి అని దేవుడు సరిహద్దులు విధించాడు. పర స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోవడం పాపం, పర స్త్రీని మోహపు చూపుతో చూడడం పాపం, బూతు బొమ్మలు చూడడం, అస్లీల దృశ్యాలు చూడడం పాపం. వేరొక పురుషుడు నీ భార్యను అస్లిలంగా చూస్తే నీకు కోపం రాదా, దానిని బట్టి నువ్వు సంతోషిస్తావా? అదే విధంగా వేరొకరిని (అది ఎవరైనా అవొచ్చు కాలేజీ ఆమ్మాయినో, సినిమా హీరోయిన్నో, పక్కవాడి భార్యనో) నువ్వు కామపు చూపుతో చూసినప్పుడు, వారి శరీరాన్ని ఆశించినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడా, ఎంత మాత్రం కాదు!

పిల్లల్ని కనడానికి మాత్రమే దేవుడు లైంగిక కోరికలను సృష్టించడలేదు, అందుకు భిన్నంగా నీ భార్య యందు సంతోషించమని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. వారు ఏక శరీరమవుతారు, వారు ఒకరియందు ఒకరు సంతృప్తి చెందుతారు, ఆవిధంగా వారు దేవుని మహిమ పరుస్తారు (1 కొరింథీ 6:18-20).

దేవుడు నీకిచ్చిన లైంగిక కోరికలను వివాహానికి వెలుపల ఉపయోగించకూడదు. అవి పరిశుద్దమైనవి, నీ జీవిత భాగస్వామికి మరియు నీకు మధ్య మాత్రమే ఉండవలసినవి. వివాహానికి బయట నెరవేర్చుకునే ఏ లైంగిక కోరినైనా వ్యభిచారమే. సహోదరులారా వ్యభిచరించొద్దు, దేవుడు నీ పాపాన్ని బట్టి నిన్ను అసహ్యించుకుంటాడు.

తప్పు దారి పట్టిన లైంగిక కోరికలు

లైంగిక కోరికలను దేవుడు ఎందుకు ఇచ్చాడో చూసాం. వివాహ సంబంధంలో పవిత్రంగా ఉపయోగించాల్సిన ఆశీర్వాదాన్ని బయట విచ్చలవిడిగా ఉపయోగించడం, ఆలా చేసినా తప్పు లేదు అని చెప్పే మన సమాజం యొక్క వింతను పోకడను మనం గమనించాలి. నిజానికి ఇది వింత ఏమి కాదు. దేవుడు పరిశుద్ధంగా సృష్టించిన ఆదాము హవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపించి ఈ లోకంలోకి పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తెచ్చారు అని మనందరికి తెలుసు. పాపానికి దాసుడైన మానవుడు జారత్వమును, అపవిత్రతను, కామాతురతను జరిగించడానికి ఏ మాత్రం వెనుకాడడని వాక్యంలో మొదటి నుండి మనం గమనించొచ్చు. పాత నిబంధనలో మనం చాలా ఉదాహరణలు చూడొచ్చు. తల్లితో, చెల్లితో, పక్క వాడి భార్యతో లైంగిక సంబంధాలు కలిగిన వాళ్ళు మనకు గుణపాఠాలాగా వివరించబడ్డారు.

ఇదంతా మనకు తెలుసు. నాకు కామపు కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి బ్రదర్, నేను ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆ కోరికల విషయంలో నియంత్రణ లేకుండా ఉన్నాను అని వాపోయే నిజమైన క్రైస్తవ సహోదరులు లేకపోలేదు. ఈ కోరికలను బట్టి బూతు సినిమాలు మరియు వీడియోలు చూసే వాళ్ళు కొందరైతే, వాటి చూడకూడదు అనే మనసాక్షి కలిగి వాటికంటే కొంచెం తక్కువ నగ్నత్వం ప్రదర్శించే సినిమాలు మరియు వీడియోలు చేసువారు మరికొందరు. ఈ రెండు చేయని కొందరు లైంగిక సంబంధమైన రచనలు చదివి వాటినుండి ఆనందం పొందుతుంటారు. లైంగిక కోరికలు కలిగినప్పుడు హస్తప్రయోగం చేయడం, అస్లీల దృశ్యాలు చూడడం సర్వసాధారణమని సమాజం నమ్మేసింది. మనం ఇప్పుడు చూస్తున్న అనేక సినిమాలలో ఇలాంటి ధోరణే కనబడుతుంది.

మానవుని హృదయం గురించి యేసు ప్రభువు మార్కు 7:21,22 లో ఇలా చెప్పాడు, "మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును". రక్షింపబడని ప్రతి మనిషి స్వభావమిదే - జారత్వము, వ్యభిచారము, కామవికారము (ఇక్కడ నేను లైంగిక పాపాల ప్రస్తావన మాత్రమే తీసుకుంటున్నాను) స్వాభావికంగా ప్రతి మనుష్యుని హృదయంలో ఉన్నాయి ఇవి పాప స్వభావం వలన మనం సంపాదించుకున్న ఆస్తి.

ఈ కాలంలో, పురుషుడు పురుషునితో కలవడం, స్త్రీ స్త్రీతో కలవడం వంటి కామ వికృత చేష్టలు సరైనవే అని, అది వారి స్వభావం, ఆ స్వేచ్ఛ మనం ఇవ్వాలి అని సర్వోన్నత న్యాయస్థానాలు చెప్పడం చూస్తున్నాం. ఇలాంటి చేష్టలను బట్టే దేవుడు సోదోమో గొమొఱ్ఱా పట్టణాలను సర్వ నాశనం చేయలేదా, వారందరు ఘోరమైన అగ్ని గంధకాలకు బలవ్వలేదా? రోమా పత్రిక మొదటి అధ్యాయంలో చూసినట్టు ఇలాంటి వారిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించలేదా?

ప్రియా సహోదరుడా/సహోదరి నీ లైంగిక కోరికలకు ఈ లోకం చూపించే పరిష్కార మార్గాలను ఎంచుకోకు. దేవుని ఆజ్ఞలు ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉన్నాయి, ఆయనను నమ్మిన మనం ఆవిధంగా నడవ బద్ధులమై ఉన్నాము. ఇంతవరకు నువ్వు ఈ వ్యాసాన్ని చదివుంటే, నువ్వు పడిపోయిన ఈ పాపం ఎలాంటిదో, దాని పర్యవసానం ఏంటో అర్ధమయ్యే ఉంటుంది.

కామ వికృత చేష్టలకు దేవుని తీర్పు

దేవుడు వ్యభిచరించొద్దు అనే ఆజ్ఞను ఇచ్చాడు, విధేయత చూపకపోతే కలిగే పర్యవసానాన్ని కూడా తెలియజేసాడు.

“ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు." ద్వితీయో 22:22

“కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి.......రాళ్లతో చావగొట్టవలెను" ద్వితీయో 22:24

“నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు." లేవీ 18:20

“వారిలో ( ఇశ్రాయేలీయులలో) కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి." 1 కొరింథీ 10:8

పై వచనాలను బట్టి, వ్యభిచరించొద్దు అనే దేవుని నియమాన్ని దాన్ని ఉల్లగించినందుకు మరణ శిక్షను దేవుడు అమలుచేసినట్టు చూస్తున్నాం. ఇంకా అనేక విషయాల గురించి మనం ప్రస్తవించొచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవుని ప్రజలు ఎవరితో లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలని దేవుడు మనకోసం చక్కగా గ్రంథస్థం చేయించాడు. ఇదే కొలమానంతో ఇప్పుడు మనకు దేవుడు తీర్పు తీరిస్తే క్రైస్తవులం అని చెప్పుకుంటున్న అనేకులు మరణ శిక్షకు పాత్రులవుతారేమో!

రోమా పత్రిక మొదటి అధ్యాయంలో, దేవుని అనుసరించకుండా సృష్టిని పూజించిన వారిని, "తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు ....... అపవిత్రతకు అప్పగించెను." అని చూస్తున్నాం. ఇది ఒక హెచ్చరికగా పౌలు చెప్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పుకుంటూ అపవిత్రమైన కామ చేష్టలతో నిండుకొని ఉంటే, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు.

మరి నేనేం చెయ్యాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి

యేసును నమ్మిన ప్రతి విశ్వాసి పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతాడు, దానికోసమే ప్రయత్నిస్తాడు. పాపాన్ని చంపకుండా పరిశుద్ధంగా ఉండడం సాధ్యపడదు. మనం పాపాన్ని చంపాలి, అనుదినం చంపాలి. ఎలా చంపాలి అంటే పరిశుదాత్మ శక్తితో చంపాలి అని వాక్యం చెప్తుంది. నువ్వు నిజమైన విశ్వాసివి కాకపోతే నీ కామ క్రియలు, పాపపు ఆలోచనలు, మోహపు చేష్టలు మారవు అని ముందుగా అర్ధం చేసుకో. దయచేసి సువార్తను అంగీకరించు, కన్యక గర్భాన జన్మించి క్రీస్తు పాపుల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించి, పాతిపెట్టబడి, మూడవ దినాన తిరిగి లేచాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో వారందరిని ఆయన పాపం నుండి పాప పర్యావసానమైన మరణం నుండి (నిత్యా నరకాగ్ని) విడిపిస్తాడు. ఇదే సువార్త. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, తమ పాపలు ఒప్పుకొని ఆయనను విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు.

నేను నిజంగా రక్షింపబడ్డాను అని చెప్పి జరత్వాన్ని చంపలేకపోతున్నావా? నీ మోహపు కోరికలను బట్టి నువ్వు వివాహేతర క్రియల ద్వారా నిన్నను నువ్వు తృప్తిపరచుకుంటున్నావా? ఆలా జరిగిన ప్రతిసారి, ప్రభువా క్షమించు ఇంకొకసారి ఇలా చేయను అని వాగ్దానం చేస్తున్నావా? అయితే ఈ విషయంలో పాపంతో పోరాడడానికి సిద్దపడు. దేవుడు మనకు తోడు. ఆత్మ ద్వారా నీ శరీరకార్యాలను చంపడానికి సిద్ధపడు.

ముందుగా రెండు విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. 1 కొరింథీ 6 వ అధ్యాయంలో కొన్ని కీలకమైన ప్రశ్నలను పౌలు లేవనెత్తాడు. మొదటిగా, "అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా?", "వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?" (1 కొరింథీ 6:9,16). ఈ రెండు ప్రశ్నలను జాగ్రత్తగా ఆలోచించండి. పాపంలో బ్రతికేవాడు పాపానికి దాసుడు, ఆ పాపంతో పోరాటం చేయకుండా, దేవుని నుండి సహాయం కోరకుండా ఉండేవాడు దేవుని బిడ్డ కాదు. అలాంటి వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. నేను క్రీస్తుకు చెందినవాడను అని చెప్పుకుంటూ వేశ్య సాంగత్యం చేస్తున్నావా. నేనే ఏ వేశ్య దగ్గరికి వెళ్లట్లేదు అని నువ్వు చెపొచ్చు. నువ్వు వెళ్లినా వెళ్లకపోయినా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అలాంటి విషయాలను ద్వేషిస్తున్నావా లేదా అలాంటి అవకాశం వస్తే బాగుంటుంది అని ఎదురుచూస్తున్నావా. నీ నిజమైన మనసు దేవునికి తెలుసు. నీ నిజస్వరూపం నీకు తెలుసు.

రెండవదిగా, పౌలు మన ముందు ఉంచుతున్న మరొక రెండు ప్రశ్నలను ఆలోచించండి. "మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? ", "మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా?". దీనిని బట్టి మనం క్రీస్తుకు చెందిన వారం, మనం క్రీస్తు మాదిరిగా జీవించాల్సిన వాళ్ళం. క్రీస్తు రక్తంతో వెలపెట్టి కొనబడ్డాం. రక్షించి పరిశుద్ధ పరచడానికి క్రీస్తు మనలని కొంటే, మనం మన దేహాలను మనల్ని కొన్న మన ప్రభువుకు కాకుండా, వేశ్యలకిచ్చి వారితో ఏక శరీరమవుతామా? ఆలా చేసే వారు తమ ప్రభువు గురించి ఆయన తమ కోసం చేసిన త్యాగం గురించి, ఆయన ప్రేమ గురించి కొంచమైనా అర్ధం చేసుకున్నారా? సహోదరులారా గమనించండి, రక్షించబడిన ప్రతి విశ్వాసి క్రీస్తుకు అవయవము. అందుకే పౌలు రోమా 6:13 లో "మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి." అని చెప్పాడు. మరియు రోమా 6:18 లో "పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము" అని అంటున్నాడు.

మనం క్రీస్తుకు అవయవాలు ఎలా అయ్యామంటే, మనలో పరిశుద్దాత్మ దేవుడు నివసిస్తున్నాడు అని పౌలు చెప్తున్నాడు. అందుకే పౌలు రోమా 8:9 లో "దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు" అని చెప్తున్నాడు. మన శరీరం దేవుని ఆలయం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. "మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?" (1 కొరింథీ 3:16).

నీ లైంగిక కోరికలు నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తునప్పుడు, నువ్వు ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. నేను దేవుని ఆలయం, నేను క్రీస్తు అవయవం. నేను వేశ్య సాంగత్యం చేయను. అలాంటి పనికి తావిచ్చే ఎలాంటి ఆలోచననైన చంపకుండా వదిలిపెట్టను. ఇలా ఆలోచించకుండా నీ సొంత శరీరాన్ని సుఖపెట్టుకునే ఆలోచన నీలో మొదలైనప్పుడు దానికే నువ్వు ప్రాధాన్యత ఇస్తూ పరిశుద్దాత్ముని ఒప్పింపును, నీ మనసాక్షిని పక్కన పెడితే కచ్చితంగా పాపంలో పడతావు, మళ్ళి మళ్ళి అలాంటి పనులే చేస్తావు.

ఆచరణాత్మక సూచనలు

ఇప్పటి వరకు అనేక విషయాలు తెలుకున్నావు గనుక. వీటన్నిటిని ఆచరణలో ఎలా పెట్టాలో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.

      A. నీ సమయాన్ని వృధా చేయకు

దేవుడు మనకు ఇచ్చిన సమయాన్ని పోనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల నివాసం అన్నట్టు, నీ మనస్సును ఖాళీగా ఉంచకుండా దేవుని వాక్యంతో నింపు. రోజూ ఒక ప్రణాళిక వేసుకో. ఇంట్లో ఉన్నాసరే, ఆఫీసుకి వెళ్లినా సరే, ప్రతి గంట ఏ విధంగా ఖర్చుపెట్టాలి అనే ఒక ప్రణాలికను నీ నోటుబుక్ లో రాసుకో. అదే విధంగా చేయడానికి ప్రయత్నించు. ఖాళీగా సమయాన్ని వృథా చేస్తున్నవారికి ఇలా చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినప్పటికీ నువ్వు దేవునిని సంతోషపెట్టాలి అనుకుంటే అనుదిన చర్యల ప్రణాళిక వేసుకో.

అది ఈవిధంగా ఉండొచ్చు

6 am - 6:30 am : నేనే నిద్రలేచి రెడీ అవుతాను లేదా నేను నిద్రలేచి వాక్యం చదువుతాను

6:30 am - 7:30 am : టిఫిన్ చేయడం, ఇంట్లో ఏదైనా అవసరమైన సహాయం చేయడం

7:30 am - 8:00 am : ప్రార్ధన చేయడం లేదా ఆఫీసికి బయలుదేరడం

ఇలా నీ రోజును ప్లాన్ చేసుకో. అదేంటి బ్రదర్ ప్రతిదీ ఇలా రాసుకోవాలా నాకు గుర్తుంటుందిగా అని నువ్వు అనుకోవచ్చు కానీ దయచేసి ఈ పనిని చేసి చూడు. నీలో ఒక క్రమబద్దత వస్తుంది. ప్రతి ఒక్కరికీ రోజువారీ ప్రణాళిక అవసరం. నీ సమయాన్ని దేనికి ఖర్చుపెట్టాలో ఏ విధంగా ఖర్చుపెట్టాలో నువ్వు నిర్ణయించుకొని ఆ విధంగా చేస్తున్నప్పుడు, అనవసరమైన ఆలోచనలకు ఎక్కువగా చోటుండదు. నువ్వు వేసుకున్న ప్రణాలికను ఆ రోజు పూర్తి చేసినప్పుడు దేవునికి కృతఙ్ఞతలు చెప్పు, చేయలేనప్పుడు క్షమించమని తర్వాత రోజు ఇంకొంచెం ఎక్కువగా ప్రయత్నించు.

      B. చెడ్డ ఆలోచనలను దేవుని వాక్యంతో భర్తీ చేయి

అనవసరమైన వీడియోలు చూడాలి అనిపించినప్పుడు, వినోదం కోసం సినిమాలు చూడాలి అనిపించినప్పుడు, మొదటిగా నో అని మనసులో మాత్రమే కాకుండా బయటకి చెప్పు, వెంటనే దేవుని వాక్యాన్ని తీసి చదువు. ఏ తప్పైతే చేయాలి అని నీ మనసు ప్రేరేపిస్తుందో అది తప్పు అని దేవుడు చెప్పిన లేఖన భాగాన్ని పదే పదే చదువు. ఆలా చదివిన తర్వాత కొంచెం సేపు ప్రార్ధనలో గడుపు. దేవుని వాక్యానికి సంబందించిన క్రైస్తవ రచనలు మరియు మిషనరీల చరిత్ర తెలియజేసే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకో.

      C. దైవభక్తిగల సహోదరులతో వారంలో కొన్నిసార్లైనా సహవాసం చేయడానికి ప్రయత్నించు

దేవుని ప్రజల మధ్య మనం ఉన్నప్పుడు, సహవాసాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం ప్రోత్సాహాన్ని పొందుతాం. వారితో మాట్లాడడం, దేవుని విషయాలు పంచుకోవడం, కలిసి ప్రార్ధన చేయడం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. దేవుడు మనల్ని ఒక పరిశుద్ధ సహవాసంలో ఉంచాడు మనం ఆయన ప్రజలం అనే ఒక గ్రహింపు నిన్ను అంటిపెట్టుకొని ఉంటుంది.

      D. క్రీస్తు నీకోసం చేసిన కార్యాన్ని, నీకు రాబోయే ప్రతిఫలాన్ని గుర్తుతెచ్చుకో

ప్రభువు తన ప్రాణాన్ని మనకోసం పెట్టాడు, ఉచితమైన రక్షణను ఇచ్చాడు. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని నియమించాడు. తిరిగి వస్తాను అని వాగ్దానం చేసి, తన కోసం బ్రతకమని ఆజ్ఞాపించాడు. ప్రభువు మాటకు విధేయత చూపించి మంచి పోరాటం పోరాడితే భళా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటావు. ప్రభువు నీ క్రియలకు బహుమానం ఇస్తాడు. "అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి" అని పౌలు 1 కొరింథీ 9:24 లో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకో.

      E. నిన్ను శోధనలోకి తీసుకుపోయే ఎటువంటి సాధనాన్నైనా విడిచిపెట్టు

తాగడం మానేసిన వ్యక్తి, వైన్ షాపులో కి వెళ్లి అక్కడ కూర్చొని దేవుడా నేను మందు తాగకూడదు నాకు సహాయం చెయ్యి అని ప్రార్థిస్తే ఏమవుతుంది. ఏమి కాదు, బాగా తాగి ఇంటికి వస్తాడు. వ్యభిచారానికి అలవాటు పడిన వాడు వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతూ నన్ను వ్యభిచారం అనే పాపంలో పడకుండా చెయ్యి అని ప్రార్ధన చేస్తే ఏమవుతుంది, అతను వ్యభిచారంలో పడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. బూతుబొమ్మలు ఉన్న వెబ్సైటులోకి (website) వెళ్లి నేను అవి చూడకుండా కాపాడు అని దేవునిని అడగడం మూర్ఖత్వం. నిన్ను పాపంలో పడేయగలదు అని తెలిసినపుడు ఆ సాధనానికి ఆ మాధ్యమానికి సాధ్యమైనంత దూరంగా ఉండు. సినిమాల ద్వారా నీకు అనవసరమైన లాంగిక కోరికలు కలుగుతుంటే, సినిమాలు చూడడం మానేయి దేవుడు సహాయం చేస్తాడు. నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే కళ్ళు మూసుకో అని దేవుడు చెప్పలేదు, ఆ కన్నును పీకి పారేయి అని చెప్పాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే పాపంలో పడకుండా ఆపలేవు, ఆ కన్నును పీకేస్తే అంటే నీ పాపానికి కారణమైన మూలాన్ని నువ్వు దాడి చేస్తే గెలుస్తావు.

సారాంశం

దేవునికి నీ బలహీనతలు తెలుసు, నీ జీవితంలో ఎంతవరకు శోధనలు అనుమతించాలో తెలుసు. ఈ శోధన నేను భరించలేనిది, ఈ పాపం నేను జయించలేనిది అని చెప్పకు. ప్రభువే అన్ని విషయాలలో మనకు సహాయం చేస్తాడు. "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును." 1 కొరింథీ 10:13.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.