నిజ క్రైస్తవ జీవితం

రచయిత: యశ్వంత్ కుమార్

క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యం

వివాహం అంటేనే కష్టంతో కూడుకున్నది. సాధారణంగా సగటు వ్యక్తి రోజుకి 7 నుండీ 9 గంటలు పని చేస్తాడు. అలా లెక్కిస్తే వారానికి 40 నుండీ 60 గంటలు పని చేస్తాడు. కానీ వివాహ బాంధవ్యం కోసం ప్రతి ఒక్కరూ వారానికి 168 (24x7) గంటలూ, అలా 365 రోజులూ పని చెయ్యాల్సి ఉంటుంది. వివాహ బాంధవ్యానికి సెలవులు ఉండవు. అయితే 'కష్ట పడటం' అంటే భారంగా, అయిష్టంగా, తప్పక, దుఃఖంతో పని చేయడమనేది నా ఉద్దేశ్యం కాదు. అటువంటిదాని గురించి కాదు నేను మాట్లాడేది. వివాహ బాంధవ్యం గురించి కష్టపడటం అంటే వివాహ సంబంధాన్ని జాగ్రత్తగా పట్టించుకోవడం. తోటి భాగస్వామికి త్యాగపూరితంగా సేవ చెయ్యడం కోసం, వారిని ప్రేమించి, ఆదరించి, బలపరిచి, ఎదిగించడం కోసం నిన్ను నువ్వు సమర్పించుకోవడం. ఇది ప్రేమతో, ఇష్టంతో చేసేటువంటి పని.

కొంత మంది వివాహ బాంధవ్యం కోసం ఏ మాత్రమూ కష్టపడరు. వివాహ సమయంలో ప్రమాణాలు అయితే చేసేస్తారు కానీ క్రీస్తునీ, ఆయన వధువునీ పోలిన వివాహ బాంధవ్యాన్ని కలిగి ఉండడం కోసం ఏమీ కష్టపడరు (ఎఫెసీ 5:22-33). వారికి అసలు ఆ ఉద్దేశ్యమే ఉండదు. వివాహ బాంధవ్యము అనేది కేవలం నీ కోరికలు, నీ ఇష్టాలు తీర్చుకోవడం కోసం కాదు. నీకు కావాల్సినట్లుగా బ్రతకడం కోసం కాదు. నీకు కావాల్సిందేదో సంపాదించుకోవడం కోసం కాదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వివాహం చేసుకున్న భార్యాభర్తలిద్దరూ క్రీస్తు రక్తం చేత విమోచించబడినవారే అయితే ఆయన ఆత్మను పొందుకున్న వారిద్దరూ, కలిసి ఆయనను వెంబడిస్తూ, ఆయనను మహిమపరుస్తూ బ్రతకడమే నిజమైన క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యం.

అటువంటి జీవితము ఎలా ఉంటుంది? అటువంటి క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యం గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి?

1. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి క్రీస్తును అనుసరిస్తారు

ఒక జంట వివాహం చేసుకొని, వారి వివాహ సంబంధం విషయమై ప్రయాసపడుతూ, ఒకరికొకరు సేవ చేస్తూ, మంచి స్నేహ సంబంధము కలిగి, చివరి వరకూ కలిసిమెలిసి జీవించవచ్చు. అయినంత మాత్రాన అది క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యం అవ్వదు. 'కేంద్రిత' అన్న మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భూమీ మరియు ఇతర గ్రహాలూ ఎలాగైతే సూర్యుడి చుట్టూ నిర్దిష్టమైన కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయో, అలాగే భార్యాభర్తల వివాహ బాంధవ్యం కూడా యేసు క్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉండాలి. మీరిద్దరూ వివాహంలో జతపరచబడటం అనేది దేవుని ఆలోచన అనీ, అందుకు దేవునికి ఒక ఉద్దేశ్యం ఉందనీ మొదట గ్రహించాలి. నడతలోనూ, మాటలోనూ, వ్యక్తిత్వంలోనూ మీరిద్దరూ క్రీస్తు స్వారూప్యంలోకి మార్పు చెందే దిశగా కలిసి అడుగులు వెయ్యాలి. పిల్లల్ని పెంచే విషయంలోనూ, ఉద్యోగాల వల్ల తలెత్తే సమస్యల విషయంలోనూ, బంధుమిత్రుల నుండీ వచ్చే ఇబ్బందులలోనూ, ఇంకా అనేక కష్టతరమైన పరిస్థితులన్నిటిలో యేసు వైపు చూచుచూ, కలిసి ముందుకు కొనసాగాలి.

కలిసి క్రీస్తును ఆరాధించాలి, కలిసి క్రీస్తు నామాన్ని హెచ్చించాలి, కలిసి క్రీస్తును మహిమపరచాలి, కలిసి క్రీస్తును వెంబడించాలి, కలిసి క్రీస్తును అనుసరించాలి, కలిసి క్రీస్తు సువార్తను ప్రకటించాలి, కలిసి క్రీస్తుకు మంచి సాక్ష్యులుగా బ్రతకాలి.

2. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు పరిచర్య చేసుకుంటారు

సేవ లేదా పరిచర్య విషయంలో యేసుక్రీస్తును మించిన మాదిరి ఇంకెవరిలోనూ కనిపించదు. మనిషి రూపంలో పుట్టిన దేవుడు అని తనకు తెలిసినప్పటికీ, సిలువలో చనిపోయి, సమాధి చేయబడి సజీవుడిగా లేచుట ద్వారా తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళిపోబోతున్నానని తెలిసినప్పటికీ, ముందు రోజు రాత్రి భోజన సమయంలో శిష్యుల పాదాలను కడగడానికి సమయం తీసుకున్నాడు యేసుక్రీస్తు (యోహాను 13:1-17). పేతురు అభ్యంతరపడటంలో ఆశ్చర్యం లేదు. 'నా వంటి నీచుడి మురికి పాదాలను ప్రభువు కడగడం ఏంటి' అని పేతురు అనుకొని ఉండొచ్చు. అవును, శిష్యులకు మాదిరిగా ఉండడం కోసమే యేసు క్రీస్తు అలా చేసాడు. వివాహ బాంధవ్యంలో కూడా భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఉపచారము చెయ్యాలి. ఒకరికొకరు సేవ చెయ్యాలి. అయితే వారి సేవ యేసుక్రీస్తు సేవని ప్రతిబింబింపజెయ్యాలి. ఈ పని కష్టంతోనూ, తగ్గింపుతోనూ కూడుకున్నది. బద్ధకమూ, అహంకారమూ వివాహ బాంధవ్యాన్ని బలహీనపరుస్తాయి, క్రమేpi నాశనం చేస్తాయి. తగ్గింపుతో కూడిన పరిచర్యే ఒక వ్యక్తి తన భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తు.

3. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ దీనమనస్సు కలిగి ఉంటారు

యేసు ఒకానొక సందర్భంలో ఇలా అన్నాడు - "నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను...."(మత్తయి 11:29). దీనమనస్సు విషయంలో కూడా ఆ సిలువ వేయబడిన యేసే మనకు మాదిరిగా ఉన్నాడు. ఎంతసేపూ నువ్వే ప్రాముఖ్యమైనవాడివి / దానివి అనుకుంటూ, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ, నీ కోరికలు, ఇష్టాలు నెరవేర్చుకోవడం ద్వారా తృప్తి చెందుతూ బ్రతకడం కాదు. దీనమనస్సు అంటే నీ భాగస్వామి నీకంటే ప్రాముఖ్యమైనవాడు/ ప్రాముఖ్యమైనది అని ఎంచి, వారికి విలువిస్తూ, వారి ఇష్టాలనూ, కోరికలనూ గౌరవిస్తూ, వారు చెప్పేది కూడా జాగ్రత్తగా వినాలి. వారి ఆలోచనలు పంచుకోవడానికి వారికి అవకాశం ఇవ్వాలి, తద్వారా వారిని ఎలా సేవించగలవో అనుదినం నేర్చుకోవాలి. క్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సును కలిగి ఉండటానికి దంపతులందరూ అనుదినం ప్రయాసపడాలి.

4. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు క్షమించుకుంటారు

క్రైస్తవ వివాహంలో జతపరచబడే వారిద్దరూ విమోచించబడిన పాపులే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలాసార్లు నీ భాగస్వామి యొక్క మాటలు, చూపులు, చేష్టలు, కొన్నిసార్లయితే వారి మౌనం కూడా నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. వాటి తాలూకా కోపాన్నీ, ద్వేషాన్నీ మనసులో పెట్టేసుకుంటే, అవి పెరిగి పెరిగి, నీ వివాహ సంబంధాన్ని నాశనం చేస్తాయి. ఇక ఆ వివాహ సంబంధం ముందుకు కొనసాగదు. "ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి." (ఎఫెసీ 4:32) - క్రీస్తు శరీరంలోని అవయవాలుగా చెప్పబడిన విశ్వాసులనే లేఖనాలు ఇలా ఆజ్ఞాపిస్తుంటే, విశ్వాసులు అయ్యుండటంతో పాటు వివాహ బాంధవ్యం కూడా కలిగి ఉన్న భార్యాభర్తల విషయంలో ఈ నియమం ఇంకెంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి.

5. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో త్యాగపూరితమైన ప్రేమ ఉంటుంది

యేసు తనని తాను త్యాగపూరితంగా మరణానికి అప్పగించుకోవడం ద్వారా మనందరికీ మంచి మాదిరిని కనపరిచాడు. కానీ ఇక్కడ విషయం, నీ భాగస్వామి కోసం ప్రాణం పెట్టడం మాత్రమే కాదు. కొంతమంది తన భాగస్వామి కోసం చావడానికైనా సిద్ధమే అని బడాయికి పోతుంటారు. చావడం తేలికే, కలిసి బ్రతకడమే కష్టం. అందుకు భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు యేసుక్రీస్తు వలె త్యాగపూరితంగా ప్రేమించడం నేర్చుకోవాలి. త్యాగపూరితమైన ప్రేమ తన భాగస్వామికి ఏది మంచిదో, ఏది మేలైనదో, ఏది ఆరోగ్యకరమైనదో అది మాత్రమే చేస్తుంది. ఉదాహరణకు- యేసుక్రీస్తు తన త్యాగపూరితమైన ప్రేమను బట్టి సంఘాన్ని తన ఎదుట "నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను .... నిలువబెట్టుకొనవలెనని" తన్ను తాను అర్పించుకున్నాడు (ఎఫెసీ 5:27). నువ్వు కూడా వెళ్లి అలాగే చెయ్యి. యేసుక్రీస్తు వలె నీ భాగస్వామికి నువ్వు మంచి మాదిరిని కనపరుస్తూ, వారు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడడం కోసం నిన్ను నీవు అర్పించుకోవాలి. ఈ విషయమై నీ వంతు కృషి నువ్వు చెయ్యడం ద్వారా కూడా నువ్వు నీ భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నావని తెలుస్తుంది.

6. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు తరచూ సంభాషించుకునేవారిగా ఉంటారు

ఒక క్రైస్తవుని సహవాసము క్రీస్తుతోనూ అలాగే తోటి విశ్వాసితోనూ ఉంటుంది అని అపొస్తలుడైన యోహాను చెప్తాడు(1 యోహాను 1:3). క్రీస్తుతో సహవాసం చెయ్యడం గురించి ఇంతక ముందే చూసాము, తోటి విశ్వాసులతో (ముఖ్యంగా నీ భాగస్వామితో) సహవాసం కలిగి ఉండటం గురించి కొన్ని మాటలు పంచుకోవాలి అనుకుంటున్నాను. సహవాసం చెయ్యడం లేదా కలిసి జీవించడంలో భాగంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది అత్యంత కీలకం. అనుదిన జీవితంలో జరిగే సంభాషణలలో భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడేవారిగానూ, ఇద్దరూ వినేవారిగానూ ఉండాలి. ఎప్పుడూ ఒకరే మాట్లాడటం, ఎప్పుడూ ఒకరే వినడం మంచి అలవాటు కాదు. ఈ విషయంలో చాలా మంది విఫలం అవుతుంటారు. భార్యతో ప్రేమగా, సాత్వికముతో మాట్లాడటం పురుష లక్షణమే కాదనుకుంటారు కొందరు ప్రబుద్ధులు. కానీ ప్రతి భర్త తన భార్య మాటలు వినడానికి ఇష్టపడాలి, ఆమెతో మాట్లాడటానికి సమయం వెచ్చించాలి. చొరవ తీసుకొని మరీ సంభాషించడమూ, ఆ మధురమైన సహవాస సమయాన్ని ఆస్వాదించగలగడమూ, అది! అసలైన పురుష లక్షణము. పురుషులను మాత్రమే అన్నానని స్త్రీలు - 'ఇది మాకు వర్తించదులే' అని అనుకోవడానికి వీలు లేదు. ఇటువంటి ప్రబుద్ధులు స్త్రీలలో కూడా లేకపోలేదు. కాబట్టి పైన చెప్పిన విషయాలు స్త్రీలకు కూడా వర్తిస్తాయి. మరో విషయం - 'విస్తారమైన మాటలలో దోషముండక మానదని....' పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది (సామెతలు 10:19). కాబట్టి మీ వివాహ బాంధవ్యము ఆరోగ్యకరంగా ఉండటం కోసం మీ సంభాషణలూ, మీ సహవాసమూ ఆరోగ్యకరంగా ఉండులాగున తగు జాగ్రత్తలు తీసుకోండి. "....మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి (కోలస్సీ 4:6).

7. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యతలో వర్ధిల్లుతూ ఉంటారు

ఈ పని మనం క్రీస్తుతో కూడా చేస్తాము. క్రీస్తు యొక్క కృపలోనూ జ్ఞానములోనూ ఎదగాలన్నది ప్రతి విశ్వాసి యొక్క కోరిక. ఎఫెసీ సంఘము క్రీస్తుతో ఐక్యపరచబడాలనీ, ఇంకా ఎక్కువగా ఆయనకు దగ్గరవ్వాలని పౌలు ప్రార్థించాడు. (ఎఫెసీ 1:14-19). ఇలా జరగడం ద్వారా క్రీస్తు మహిమపరచబడతాడు. అయితే దాంపత్యము లేదా సంసారము అనేది వివాహానికి మాత్రమే సంబంధించినది (ఆది 2:24; హెబ్రీ 13:4). భార్యాభర్తలు ఇద్దరూ వారి దాంపత్య జీవితంలో మరీ ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాల్సిన అన్యోన్యత విషయంలో వర్థిల్లడాన్ని బట్టి కూడా క్రీస్తు మహిమపరచబడతాడు. చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి భార్యాభర్తల అన్యోన్యత అంత ప్రాముఖ్యమైనది కాదని భావిస్తుంటారు. కానీ విశ్వాసివైన నువ్వు ఈ సత్యాన్ని గ్రహించి నీ భాగస్వామితో అన్యోన్యంగా మెలిగే విషయంలో వర్ధిల్లడం ద్వారా క్రీస్తును మహిమపరచాలి.

8. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలిద్దరూ క్రీస్తునందలి నిరీక్షణతో కలిసి జీవిస్తారు

మీ దృష్టి ఎంత సేపూ పిల్లలపైనా, వారి చదువుల పైనా, ఇంటి పైనా, కార్ల పైనా, భవిష్యత్తు ప్రణాళికలపైనా, బ్యాంకు బ్యాలన్స్ పైనా కాకుండా మీ దృష్టిని క్రీస్తు వైపు కేంద్రీకృతం చెయ్యాలి. మీరు ఆయనయందునూ, ఆయన వాగ్దానములయందునూ నిరీక్షించేవారిగా ఉండాలి. మీ పిల్లల జీవితాలు మీరు ఆశించిన రీతిలో లేవని మీరు గుర్తించినప్పుడు, ఉద్యోగం కోల్పోయినప్పుడు, బ్యాంకు బ్యాలన్స్ చెక్ చేసుకున్నప్పుడు మీరు నిరాశ చెందే అవకాశం ఉండొచ్చు గానీ, యేసు క్రీస్తునందు నిరీక్షించేవారు ఎన్నటికీ నిరాశపరచబడరు (రోమా 10:11; 1 యోహాను 3:3). అత్యంత కష్టతరమైన పరిస్థితులలో కూడా క్రీస్తునందలి నిరీక్షణ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కోలస్సీ 1:24-27 - "మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని.." ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ మీ మనసును తాత్కాలికమైనవాటిపై నుండీ తీసివేసి, క్రీస్తునందు మీరు కలిగి ఉన్న నిరీక్షణకు బట్టి ఎక్కువగా సంతోషించడం నేర్చుకోండి.

9. క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ సంఘముతో అంటుకట్టబడి ఉంటారు

క్రీస్తు సంఘము కోసమే ప్రాణం పెట్టాడు కాబట్టి, క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యము కూడా సంఘానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. మనము క్రీస్తునందు ఎదుగుతూ పరిపక్వతను పొందుకోవడానికీ, తోటివారికి ప్రేమపూర్వకంగా సేవ చెయ్యడానికీ, మన వరాలనూ, తలాంతులనూ సంఘం అంతటి క్షేమాభివృద్ధి నిమిత్తం వినియోగించడానికీ, కలిసి ఆరాధించడానికీ, త్యాగపూరితమైన జీవితాలు ఎలా ఉంటాయో నేర్చుకోవడానికీ, జీవితం గురించీ, భక్తి గురించీ మన అవగాహనను లేఖనానుసారంగా పెంచుకోవడానికీ, క్రీస్తును ఎదుర్కోవడం నిమిత్తం సిద్దపడటానికీ మనకు సంఘం అవసరం. ఖచ్చితంగా దేవుని దృష్టిలో సంఘమే వివాహం కంటే ప్రాముఖ్యమైనది (యేసు వివాహం కోసం చనిపోలేదు). కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ సంఘానికి అంటుకట్టబడి, క్రీస్తు శరీరములోని అవయవాలవలె వారి పాత్రలను సరిగ్గా పోషించడం చాలా ప్రాముఖ్యం.

క్రీస్తు కేంద్రిత వివాహ బాంధవ్యం గురించి ఇంతవరకూ చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టడం అంత సులువేమీ కాదు. వాటిని ఆచరణలో పెట్టాలి అంటే చాలా కష్టపడాలి, ఆయన ఆత్మ సహాయం కావాలి. అన్ని విషయాల్లోనూ (మరీ ముఖ్యంగా వివాహ జీవితం ద్వారా) క్రీస్తును మహిమపరచాలి అన్న దృఢమైన, లోతైన కోరిక ఉండాలి. మీ వివాహ జీవితానికి క్రీస్తును కేంద్రంగా చేసుకోవడం ద్వారా వచ్చే లోతైన సంతృప్తిని ప్రతి జంట పొందుకోవాలనేదే నా ప్రార్థన.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.