సేవకులు తమ ప్రసంగాలలోనూ అలాగే మన Bible Studies లో కూడా పేతురు మరియు యూదా రాసిన పత్రికలకు సాధారణంగా మనం చాలా తక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. వీటి గురించి మనం అంత ఎక్కువగా మాట్లాడకపోవటానికి అలాగే వీటి గురించి మనం అంత ఎక్కువగా ఆలోచించకపోవటానికి గల కారణాలలో ఒక కారణం బహుశా ఈ పత్రికలలోని కొన్ని వాక్యభాగాలను ఈ తరం వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ఒక కారణం అయ్యుండొచ్చు. కానీ మొదటి శతాబ్దంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ కాలంలో వారికి అందుబాటులో ఉన్న ప్రాచీన యూదా సాహిత్యం అలాగే అప్పటి క్రైస్తవుల రచనలను మనం పరిశీలించినట్లయితే యూదా రాసిన పత్రికను అలాగే పేతురు రాసిన పత్రికలను మనం మరింత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం మొదటి హనోకు గ్రంథం అని దేనినైతే పిలుస్తున్నారో ఆ పుస్తకం అప్పటి ప్రాచీన యూదా సాహిత్యంలో చాలా ముఖ్యమైన పుస్తకం. బైబిల్ లోని పుస్తకాలను అలాగే Biblical Theology ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మొదటి హనోకు గ్రంథం లాంటి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి అని అప్పటి యూదులు అలాగే క్రైస్తవులు కూడా భావించేవారు. యూదా మరియు పేతురు కూడా దానికి మినహాయింపేమీ కాదు. వాళ్లిద్దరూ కూడా తాము రాసిన పత్రికలలో మొదటి హనోకు గ్రంథం లోని విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు యూదా పత్రిక 14-15 వచనాలను చూసినట్లయితే, అవి నేరుగా మొదటి హనోకు గ్రంథంలో నుండి తీసుకున్నవే.
"ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను - ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను." అని యూదా పత్రికలో ఉంటుంది. "ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను" అని చెప్పడం ద్వారా, తాను ఈ వాక్యాన్ని హనోకు గ్రంథం నుండి తీసుకున్నాను అని యూదా చాలా స్పష్టంగానే చెబుతున్నాడు. ఈ వాక్యభాగాన్ని యూదా ఎక్కడినుండి తీసుకున్నాడంటే, మొదటి హనోకు గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో నుండి తీసుకున్నాడు. నిజానికి ఈ వాక్యభాగంలోని విషయాలు మనకు పాతనిబంధనలోని మూడు వేరు వేరు వాక్యభాగాల్లో కూడా కనిపిస్తాయి. యిర్మియా గ్రంథం 25వ అధ్యాయం 30 నుండి 31వ వచనం వరకు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 15 నుండి 16వ వచనం వరకు, అలాగే జెకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం - ఈ మూడు వాక్యభాగాలలోని విషయాలను క్రోడీకరించి మొదటి హనోకు గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్పబడింది. అయితే పాతనిబంధనలోని ఈ మూడు వాక్యభాగాలను ప్రస్తావించడానికి బదులు యూదా తాను వ్రాసిన పత్రికలో నేరుగా మొదటి హనోకు గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని ఉటంకించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే పాతనిబంధనలోని ఈ మూడు వాక్యభాగాలను అలాగే మొదటి హనోకు గ్రంథంలోని వాక్యభాగాన్ని యూదా ఏ విధంగా interpret చేస్తున్నాడు అనేది చాలా ఆసక్తికరమైన అంశం.
మీరు మొదటి హనోకు గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు చదివినట్లయితే, "అంత్య దినములలో అందరికీ తీర్పు తీర్చడం కోసం, మహా పరిశుద్ధుడు నిత్యుడైన దేవుడు తన అసంఖ్యాకమైన పరిశుద్ధుల పరివారముతో, ఈ భూమి మీదకు సీనాయి పర్వతం మీదకు వస్తాడు" అని ఉంటుంది. అంటే ఈ వాక్యభాగం ప్రకారం వేవేల పరిశుద్ధుల పరివారముతో ఈ భూమి మీదకు రానైయున్నవాడు, అలాగే అంత్య దినములలో అందరికీ తీరు తీర్చేవాడు ఎవరు అని అంటే, మహా పరిశుద్ధుడును నిత్యుడు అయిన దేవుడు - The Holy Great One and the Eternal God. యిర్మియా గ్రంథం 25వ అధ్యాయంలోనూ, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలోనూ, అలాగే జెకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్న వాక్యభాగాలు కూడా యెహోవా గురించే మాట్లాడుతున్నాయి. అయితే ఈ సంఘటనను అంటే - అంత్య దినములలో తన అసంఖ్యాకమైన పరిశుద్ధుల పరివారముతో దేవుడు ఈ భూమి మీదకు వచ్చి అందరికి తీర్పు తీర్చే సన్నివేశం ఏదైతే ఉందో దానిని యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడగా యూదా అభివర్ణించాడు. ఒక్క యూదా మాత్రమే కాదు, థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రికలో పౌలుగారు అలాగే మార్కు సువార్తలో స్వయంగా యేసు క్రీస్తు కూడా ఇదేవిధంగా మాట్లాడారు.
"మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు" అని థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటారు. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో శిష్యులతోనూ జనసమూహముతోనూ మాట్లాడుతూ స్వయంగా యేసు క్రీస్తు ఏమన్నారంటే, "వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడును" అని అన్నారు. వేవేల పరిశుద్ధుల పరివారముతో రానైయున్నవాడు అని చెప్పడం ద్వారా యేసు క్రీస్తే ఇశ్రాయేలీయుల దేవుడు అని యూదా చెప్పకనే చెప్పాడు. మొదటి హనోకు గ్రంథంలోని వచనాన్ని ఇక్కడ ప్రస్తావించడం ద్వారా పాతనిబంధనలో మనకు కనిపించే second YHWH figure అంటే మానవ రూపంలో మనుష్యులకు ప్రత్యక్షమైన దేవుడు ఇంకెవరో కాదు ఆయన యేసు క్రీస్తే అని యూదా చాలా సమర్ధవంతంగా ప్రకటించాడు.
పేతురు కూడా తాను వ్రాసిన పత్రికలలో మొదటి హనోకు గ్రంథంలోని అనేక విషయాలను ప్రస్తావించారు. మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయంలోని దాదాపు 20 అంశాలు మనకు పేతురు వ్రాసిన మొదటి పత్రికలో కనిపిస్తాయి. మీరు మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయాన్ని అలాగే పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, యేసు క్రీస్తు విషయమై అనేక శ్రమలు బాధలు అనుభవిస్తున్న విశ్వాసులకు ఆదరణ కలగడం కోసం, వారు తమ విశ్వాసంలో మరింత బలపడటం కోసం, యేసు క్రీస్తును విడువక ఆయన మార్గంలో ప్రయాణించాలి అని వారిని ఉత్తేజపరచడం కోసం, పేతురు మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయంలోని వాక్యభాగాన్ని ఏ విధంగా ఉపయోగించారు అనేది మనకు అర్థం అవుతుంది. ఈ రెండు వాక్యభాగాలు కూడా విశ్వాసులు తమ విశ్వాసంలో పట్టుదలతోనూ నిరీక్షణతోనూ ఉండాలి అని వారిని ప్రోత్సహించే విధంగా ఉంటాయి. అయితే మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయం ప్రకారం, వెండి బంగారములను కాదు కానీ దేవుడిని ప్రేమిస్తూ దేవుని కోసం తమ శరీరమును శ్రమలకు అప్పగించి భౌతికపరమైన సుఖాల కోసం వెంపర్లాడకుండా దేవుని వాక్యం ప్రకారం జీవించి, శోధనలచేత పరీక్షకు నిలబడినవారు అంతిమంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. వారికి దేవుని పట్ల ఉన్న ప్రేమను దేవుని కోసం వారు చేసే కార్యములను చూడాలి అని దేవదూతలు కోరుకుంటారు. అయితే యూదా లాగానే పేతురు కూడా మొదటి హనోకు గ్రంథంలోని వాక్యభాగాన్ని తీసుకుని, అక్కడ దేవుడ్ని ప్రేమించాలి దేవుడి కోసం శ్రమపడాలి, శోధనలను తట్టుకుని నిలబడాలి అని ఉంటే, ఇక్కడ పేతురు - యేసు క్రీస్తును ప్రేమించాలి యేసు క్రీస్తు కోసం శ్రమలను అనుభవించాలి, నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్న రీతిగా, దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలబడాలి, అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతాయి అని చెబుతున్నాడు. ఈ విధంగా చెప్పడం ద్వారా దేవుడైన యేసు క్రీస్తును వెంబడించాలి అని పేతురు యూదులకు బోధిస్తున్నాడు.
మొదటి హనోకు గ్రంథానికి అలాగే యూదా మరియు పేతురు వ్రాసిన పత్రికలకు మధ్య ఉన్న సారూప్యతను మనం గమనించినట్లయితే, పేతురు మరియు యూదా ఇద్దరూ కూడా పాతనిబంధనలో మానవ రూపంలో మనుష్యులకు కనిపించిన second YHWH figure - తమకు ప్రత్యక్షమైన ఇశ్రాయేలీయుల దేవుడైన యేసు క్రీస్తును తమ పాఠకులందరూ కూడా వెంబడించాలి, ఆ విషయంలో వారిని బలపరచాలి అని భావించారు అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి హనోకు గ్రంథం లాంటి పుస్తకాలు దైవావేశం వల్ల కలిగిన పుస్తకాలు అని నేను అనను కానీ ఇలాంటివి చదవడం వల్ల మనం బైబిల్ కి సంబంధించిన cultural background ని అక్కడున్న context ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇవి కొంత సహాయపడతాయి అని మాత్రం నేను చెప్పగలను. అంతేకాకుండా బైబిల్ రచయితల ఆలోచనల మీద వారి థియోలజీ మీద ఇటువంటి పుస్తకాలు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.