దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

ఆడియో

మనం నివసిస్తున్న ఈ దేశంలో, అత్యధికంగా హిందూ మతస్తులే ఉన్నారనీ, వారికి ఎంతోమంది దేవీదేవతలు మరియు వారి చరిత్రలకు సంబంధించిన‌ ఎన్నో మతగ్రంథాలు  ఉన్నాయని మనందరికీ తెలుసు.

ఈ తరుణంలో, క్రైస్తవ సంఘంలో బోధకులుగా ప్రవేశించిన కొందరు అబద్ధప్రవక్తలు, దొంగ అపోస్తలులు ఈ దేశంలోని హిందువులు ప్రామాణిక గ్రంథాలుగా నమ్మే వాటిలో కూడా మన బైబిల్ దేవుని వాక్యం రాయబడిందనీ, వారి దేవుళ్ళ జీవితాలను ఆధారంగా చేసుకుని, వారిలో మన బైబిల్ దేవుని పోలికలు చూపించి, వారికి సువార్త ప్రకటించాలని బోధిస్తూ సంఘాన్ని హేయమైన బోధతట్టుకు నడిపిస్తున్నారు.

అలా అని ఆ గ్రంథాలన్నీ బైబిల్ దేవుని వాక్యంగానే మీరు స్వీకరిస్తారా, వారి దేవుళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సరైనవనీ, వాస్తవాలనీ మీరు విశ్వసిస్తారా అనే ప్రశ్నను కనుక వీరిముందు మనం ఉంచితే, దానికి వీరిచ్చే సమాధానం ఏమాత్రం నమ్మశక్యంగా, తర్కబద్దంగా అనిపించదు.

వీరిచ్చే సమాధానం ప్రకారం:

అన్యమత గ్రంథాలలో కొన్నిచోట్ల మాత్రమే మన బైబిల్ దేవుని వాక్యం రాయబడింది, వారి దేవుళ్ళ జీవితాలలో కొన్ని పోలికలు మాత్రమే మన దేవునికి ఆపాదించి సువార్త చేయాలి.
కొంచెం వివేకంగా ఆలోచించినా  వీరి సమాధానంలో ఉన్న లోపాలు మనకు స్పష్టంగా దొరికిపోతాయి.

ఈ వ్యాసం అంతటిలోనూ, వీరు చెప్పే బోధను బైబిల్ గంథం కనీసం 1% అయినా అంగీకరిస్తుందా అనేదానినీ,
వీరు తమ వాదన నిరూపించుకోవడానికి బైబిల్ గ్రంథం నుండి వక్రీకరించే సందర్భాలకూ వివరణ చూసే ప్రయత్నం చేద్దాం.

దీనికంటే ముందుగా, బైబిల్ ప్రకటించే త్రియేక దేవుని గురించి బైబిల్ ఇచ్చేటటువంటి సాక్ష్యాన్ని చూద్దాం.

నిర్గమకాండము 15: 11 యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు.

మనం చూసిన ఈ వచనం ప్రకారం, ఈ భూమిపై ప్రజలు దేవుళ్ళుగా కొలుస్తున్న వారిలో ఎవరూ కూడా బైబిల్ దేవునివంటివారు లేరు. ఆయన పరిశుద్ధతకూ, సర్వశక్తిమంతత్వానికీ, ఆయనలోని మిగిలిన  గుణలక్షణాలకూ ఎవరూ సమానం కాలేరు.
ఈ రోజు సంఘంలో చొరబడి అన్యమతాలకు చెందిన దేవుళ్ళలో మన దేవునికి పోలికలు చూపిస్తున్న అబద్ధ ప్రవక్తలూ, దొంగ అపోస్తలులంతా ఈ వాక్యభాగానికీ, మిగిలిన పూర్తి బైబిల్ బోధకు వ్యతిరేకులు, వారు కేవలం అపవాది అనుచరులు.

మొదటిగా, ఈ అబద్ద ప్రవక్తలు దొంగ అపోస్తలులు చెబుతున్నట్టుగా, భారత దేశం లోనే కాదు; మిగిలిన ప్రపంచంలోని  ఏ అన్యమత గ్రంథంలోనైనా, బైబిల్ దేవుని వాక్యం ఒక అక్షరమైనా ఆయన ప్రేరణతో రాయబడడం సాధ్యమౌతుందేమో బైబిల్ ప్రకారం చూద్దాం.

రోమీయులకు 3:1 అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతివలన ప్రయోజనమేమి?ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను.

ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు యూదులకు మాత్రమే చెందినటువంటి గొప్పతనం, ప్రయోజనాల గురించి వివరిస్తూ మొట్టమొదటిగా "దేవోక్తులు" యూదుల పరం చేయబడ్డాయని చెబుతున్నాడు. 
ఆదికాండం నుండి మలాకీ వరకూ ఉన్న, పాత నిబంధనలోని దేవుని వాక్యాన్ని రాసినవారంతా ఇశ్రాయేలీయులే తప్ప అన్యజనులు ఎవరూ కాదు.

అన్యమత గ్రంథాలలో కూడా దేవునివాక్కు రాయబడిందనే అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు ఈ వచనం ప్రకారం ఏయే అన్యమత గ్రంథాల్లో బైబిల్ దేవుని వాక్కు రాయబడిందని వీరు ప్రకటిస్తున్నారో ఆ గ్రంథాలు రాసినవారు యూదులా అనే ప్రశ్నకు  సమాధానం చెప్పాలి.

అన్యమత గ్రంథాలు రాసినవారెవరూ కూడా యూదులు కాదు, ఉదాహరణకు మన దేశంలోని మతగ్రంథాలు రచించినవారు ఆర్యులు, పౌలు చెప్పిన దానిప్రకారం యూదులు కాని వారెవరూ కూడా దైవప్రత్యక్షతను అందుకుని ఆయన వాక్యాన్ని రాయలేదు.

మరొక సందర్భాన్ని చూడండి;
కీర్తనల గ్రంథము 147:19,20 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.

ఈ వచనాల ఆధారంగా, దేవుడు తన వాక్యాన్నీ, న్యాయ విధులనూ ఇశ్రాయేలీయులకు మాత్రమే తన ప్రత్యక్షత ద్వారా తెలియచేసాడు; మిగిలిన ఏ ప్రజలకూ,  పాతనిబంధన కాలంలో ఆయన ఆ విధంగా ప్రత్యక్షతను అనుగ్రహించి వాక్యాన్ని రాయించలేదు.
ఇంతతిటో, అన్యమత గ్రంథాలలో దైవవాక్యం రాయబడిందనే బోధను‌ బైబిల్ 1% కూడా అంగీకరించదని‌ ఆధారాలు చూసాం.

ఇప్పుడు రెండవదిగా, అన్యమత గ్రంథాల్లో కూడా దేవుని వాక్యం రాయబడిందని ప్రకటిస్తున్న అబద్ధప్రవక్తలు దొంగ అపోస్తలులు తమ బోధను సమర్థించుకోవడానికి బైబిల్ గ్రంథం నుండి వక్రీకరిస్తున్న కొన్ని సందర్భాలకు సమాధానం చూద్దాం.

సంఖ్యాకాండము 22:5,6 కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో;  అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.

మనం చూసిన ఈ వచనాలలో బిలాము అనే వ్యక్తి కనిపిస్తున్నాడు, అతని గురించి ఈ అధ్యాయంలోనూ,
తరువాతి రెండు అధ్యాయాల్లోనూ వివరాలు రాయబడ్డాయి.
ఈ బిలాము ఒక అన్యుడైనప్పటికీ, అతనితో దేవుడు మాట్లాడినట్టుగానూ, బిలాము కూడా ఆయన ప్రవక్త వంటివానిగా జీవించినట్టుగానూ ఆ సందర్భాలలో మనకు అర్థమౌతుంది.

కాబట్టి, మనం మాట్లాడుకుంటున్న అబద్ధప్రవక్తలు అన్యుడైన బిలాముతో దేవుడు మాట్లాడినట్టే మిగిలిన అన్యులతో కూడా ఆయన ఎవరొకరిద్వారా మాట్లాడుతూ వాక్యాన్ని రాయించాడని వాదిస్తుంటారు.
అదే నిజమైతే,
రోమా పత్రిక లోనూ, కీర్తనల గ్రంథం లోనూ పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయని ఎందుకు రాశారో వీరే సమాధానం చెప్పాలి.

అదేవిధంగా ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది దేవుడు అన్యులతో మాట్లాడాడా లేదా అనేది కాదు వారిచేత వాక్యాన్ని రాయించాడా లేదా అనేదిమాత్రమే. పాతనిబంధనలో మరికొన్ని సందర్భాలలో కూడా  ఆయన అబ్రాహాము విషయంలో, అబీమెలెకుతోనూ, యాకోబు విషయంలో తన మామయైన లాబానుతోనూ మాట్లాడినట్టు అన్యరాజులైన ఫరో, నెబుకద్నెజరులకు కలలు అనుగ్రహించినట్టు రాయబడింది.

ఆ సందర్భాలను మనం మరింత జాగ్రతగా పరిశీలిస్తే వారందరితోనూ ఆయన తన భక్తుల నిమిత్తం, తన ప్రవక్తలను ఆయా రాజ్యాలలో గొప్పచేసే నిమిత్తం ఆ విధంగా చేసాడే తప్ప ఆ అన్యుల చేత గ్రంథాలు రాయించడానికో, లేక వారిని ఘనపరచడానికో అలా చేయలేదు. (బిలామును కూడా ఇశ్రాయేలీయులను అన్యులముందు ఘనపరచడానికే అతనిని వాడుకున్నాడు)

అదేవిధంగా దేవుడు వారితో  మాటలాడినప్పుడు యెహోవా అనే నామంతోనే  ఆయన మాట్లాడాడు. 
బిలాము కూడా యెహోవా దేవుని నామం పేరిటే ప్రవచించాడు.
బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు పలికినప్పుడు యెహోవా నామాన్ని చాటిచెప్పారు.
ఒకవేళ వీరు చెబుతున్నట్టుగా, అన్యమత గ్రంథాలను కూడా యెహోవా దేవుడే రాయిస్తే, ఆ గ్రంథాలలో ఆయన పేరు ఎందుకు కనిపించదు?

మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, 
దేవుడు బిలాముతో మాట్లాడినా, మిగిలిన అన్యులతో మాట్లాడినా వారు ఆయనకు విరుద్ధమైన మార్గంలో నడుస్తున్నపుడు, వారిని హెచ్చరించాడు.
బిలాము దురాశతో ఇశ్రాయేలీయులను శపించే ఉద్దేశంతో ఉన్నపుడు యెహోవా దూత  కత్తిదూసి త్రోవలో నిలబడ్డాడు.
అదే దేవుడు అన్యమత‌ గ్రంథాలు రాసినవారిని సైతం ప్రేరేపిస్తే ఆ రచయితలు ఆ గ్రంథాల్లో ఆయన అసహ్యించుకునే కొన్నిటిని  రాసేటపుడూ, వారి జీవితాలలో ఆయనకు నచ్చని కార్యాలు చేస్తున్నపుడు ఎందుకని హెచ్చరించలేదు.

ఎందుకంటే, వారికీ బైబిల్ దేవునికీ ఏ సంబంధం లేదు.
అపో.కార్యములు 17: 30
ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

ఇప్పుడు‌ వీరు చేసే మరొక వక్రీకరణకు సమాధానం చూద్దాం.

మత్తయి సువార్త 2:1,2 "రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.

ఈ వచనాలలో యేసుక్రీస్తు జన్మించినపుడు ఆయనను పూజించడానికి తూర్పుదేశపు జ్ఞానులు‌ నక్షత్రాన్ని చూసి వచ్చినట్టు రాయబడింది.
వీరు దానిని ప్రస్తావిస్తూ, వారికి ఆ నక్షత్రం యేసుక్రీస్తు జన్మను సూచిస్తుందని ఎలా తెలిసింది. ఆ విషయాన్ని దేవుడు వారి మతగ్రంథాలలో రాయించాడు కాబట్టే వారు దానిని గుర్తించి వచ్చారని చెబుతుంటారు.

కానీ, మన తెలుగు బైబిల్ లో ఈ తూర్పుదేశంనుండి వచ్చిన వారిని జ్ఞానులు అని తర్జుమా చేసిన చోట గ్రీకు భాషలో "magoi" అనే పదాన్ని వాడారు.
అరామిక్ భాషలో అయితే "magoshi" అని కనిపిస్తుంది. ఈ "magoi, magoshi" అనే పదాలు పర్షియా భాషలోని "maguš" అనే పదం నుంచి ఉద్భవించాయి.
దానియేలు కాలంలో జీవించిన దర్యావేషు తాను రాయించిన "బెహిస్తూన్" అనే శిలాఫలకంలో ఈ "maguš" అనే పదాన్ని వాడినట్టు, మనకు పురావస్తు ఆధారాలు లభించాయి.
ఈ "maguš" అనే పదంతో పర్షియా వారు తమ మతాధికారులనూ, జొరాస్ట్రియన్ మతాధికారులనూ, వారివారి ప్రాంతాల్లో న్యాయం తీర్చే పెద్దలనూ, అంతమాత్రమే కాకుండా Astrologers, astronomers లను కూడా పిలిచేవారు.
మనకి ఇంగ్లీషు భాషలోని "magic, magician, magistrate" అనే పదాలన్నీ ఈ పర్షియా పదమైన "maguš" నుంచి గ్రీకులోకి "magoi" గా మారినపదం నుంచి వచ్చినవే.

అరామిక్ భాషలో నుండి ఇంగ్లీషులోకి నూతన నిబంధనను తర్జుమా చేసి కామెంటరీ రాసిన, బైబిల్ పండితుడు "Andrew Gabriel roth" గారు ఈ తూర్పుదేశపు జ్ఞానులకు ఆ నక్షత్రం గురించి ఏ విధంగా తెలిసిందనే ప్రశ్నకు వివరణను ఇస్తూ, ఇశ్రాయేలీయులు పారశీకుల (పర్షియా) వారి చెరలోనికి ఉన్నపుడు వారిలో దానియేలు కూడా ఉన్నాడని మనకి బైబిల్ చెబుతుంది. అంతమాత్రమే కాకుండా ఈ దానియేలు దర్యావేషు రాజుతోనూ మంచి సంబంధాన్ని కలిగియున్నట్టు మనం దానియేలు గ్రంథంలో చూడగలం. 
ఈ దానియేలు ఆ దేశపు మిగిలిన రాజకీయ నాయకులు, జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులతో మంచి సంబంధాన్ని కలిగియుండి,
ఆయన తన గ్రంథంలో మనుష్య కుమారుడైన మెస్సీయ గురించిన ప్రత్యక్షతను రాసినప్పుడూ, ఆయన గురించి యూదులతో మాట్లాడినప్పుడూ, వారు దానిగురించి విని  దానియేలును ప్రశ్నించగా అతను మనుష్యకుమారుడు జన్మించినప్పుడు దానికి ఆనవాలుగా నక్షత్రం పుడుతుందని వారికి వివరించినట్టు, తదుపరి కాలంలో ఆ ఆనవాలు తమ తరాలకు వ్యాప్తి చెంది, తమ పూర్వీకులు చెప్పినటువంటి ఆనవాలుగా ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించగానే దానిని ఆధారం చేసుకుని ఆ "maguš" అనబడేవారు యేసుక్రీస్తును పూజించేందుకు యెరుషలేము వచ్చారని తెలియచేశాడు. "John gill" అనే బైబిల్ పండితుడు కూడా తన కామెంటరీలో ఈ జ్ఞానులు పర్షియా దేశంనుండి వచ్చినవారే అని తెలియచేశాడు. 
ఇది నమ్మడానికి మనకి ఎటువంటి అభ్యంతరమూ లేదు. అలాగే ప్రముఖ బైబిల్ కామెంటరియన్ "Matthew henry" గారు కూడా ఈ తూర్పుదేశపు జ్ఞానులకు ఆ నక్షత్రం గురించి ఎలా తెలిసింది అనేదానికి వివరణ ఇస్తూ బిలాము ప్రవచనాన్ని ప్రస్తావించారు.

సంఖ్యాకాండము 24:17 ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును.

ఈ బిలాము తూర్పు దేశానికి చెందినవాడు కాబట్టి బిలాము చెప్పిన ప్రవచనం ఆధారంగానే, నక్షత్రం ఇశ్రాయేలు దేశంలో కనిపించినప్పుడు బిలాము ప్రవచనం గురించి తెలిసిన ఆ దేశాలలోని జ్ఞానులు ఆ నక్షత్రాన్ని గురుతుపట్టి యేసుక్రీస్తును చూసేందుకు వచ్చారని ఆయన తెలియచేశారు.

కొంతమంది దీనిని వ్యతిరేకరిస్తూ, బిలాము ప్రవచించిన నక్షత్రం భౌతికంగా ఆకాశంలో ఉదయించే నక్షత్రమే అయితే అది ఇశ్రాయేలు దేశములో ఉదయించాలి.
కానీ తూర్పుదేశంలో ఎందుకు ఉదయించిందని ప్రశ్నిస్తారు. 
కానీ,  ఆ సందర్భాన్ని సరిగా చదివితే ఆ నక్షత్రం ఉదయించింది ఇశ్రాయేలు దేశంలోనే, ఎందుకంటే ఆ నక్షత్రం జ్ఞానులు‌న్న తూర్పు దేశంలోనే ఉదయిస్తే వారుదానిని చూసి వెంబడించినట్టుగా అక్కడ రాయబడలేదు కానీ, తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చామని జ్ఞానులు హేరోదుతో చెప్పినట్టుగా రాయబడింది.
జ్ఞానులు ఎక్కడనుండి ఆ నక్షత్రాన్ని చూసారో ఆ దిశగురించి మాత్రమే అక్కడ చెబుతున్నారు.
ఒకవేళ తూర్పుదేశంలోనే ఆ నక్షత్రం ఉదయించి వారికి దారిచూపిస్తే వారు హేరోదు దగ్గరకు ఎందుకు వెళ్తారు? వారు యెరుషలేముకు వచ్చి, హేరోదు దగ్గరకు వెళ్లిన తరువాతనే ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి దారి చూపించింది. 
దీని ప్రకారం తూర్పుదేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి రావడానికి బిలాము ప్రవచనం కూడా‌ మరో కారణమై ఉండవచ్చని మనకి అర్ధమౌతుంది.

ఈ అబద్ధప్రవక్తలు చేసే మరో వక్రీకరణను చూద్దాం.

1కోరింథీయులకు 9: 22 ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనై యున్నాను.

ఈ సందర్భంలో పౌలు ఏవిధంగానైనా కొందరిని రక్షించడానికి అందరికీ అన్నివిధాలవంటివాడిని అయ్యానని చెబుతున్నాడు.
వీరు దీనిని ప్రస్తావిస్తూ మేము కూడా హిందువులను రక్షించడానికి వారి వంటివారమై, వారి గ్రంథాలనుంచే యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నామని సమర్థించుకుంటుంటారు.
వీరు పౌలు చెప్పిన ఈ మాటలను మాత్రమే కాకుండా, ఆయన ఏథెన్సులో ప్రస్తావించిన కవీశ్వరులు, బలిపీఠం సందర్భాన్ని కూడా వక్రీకరించి మాది పౌలు పందా అంటూ ప్రజలను మోసగిస్తున్నారు.
పౌలు అక్కడ ఎందుకలా చేసాడో, ఆ బలిపీఠం, కవీశ్వరులు ఎవరో వివరిస్తూ మా వెబ్ సైట్ లో మరో వ్యాసాన్ని రాసాము ఈ క్రింది లింక్ ద్వారా మీరు దానిని చదవొచ్చు.
పౌలు చేసిన కవీశ్వరుల ప్రస్తావన సువార్తకు అన్యమతగ్రంథాలు అవసరమనే బోధకు ఆధారమా?

పౌలు కొరింధీ సంఘానికి రాసినపత్రికలో ఆయన పలికిన మాటల భావాన్ని చూసేముందు ఆయన రాసిన మరోమాట కూడా చూద్దాం.

తీతుకు 2: 8 నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.

ఏవిధంచేతనైనా అందరినీ రక్షించడానికి అందరికీ అన్నివిధాలవంటి వాడనయ్యానని కొరింథీయులతో చెబుతున్న పౌలే ఈ సందర్భంలో ఎటువంటి ఉపదేశాన్ని ప్రకటించాలో వివరిస్తున్నాడు.
ఆయన ఎక్కడా కూడా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి, ఎవర్నీ ప్రభువు వైపుకు తిప్పలేదు. 
ఆయన ఏ ఉద్దేశంతో కొరింథీ పత్రికలో ఆ మాటలు మాట్లాడుతున్నాడో, ఆ సందర్భమంతా చదివితే మనకు అర్థమౌతుంది.

మొదటి కొరింథీయులకు 9:19-22 నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

ఈ వచనాలను మనం పరిశీలిస్తే, పౌలు ఈ అబద్ధప్రవక్తలు చెబుతున్నట్టుగా అన్యమతస్థుల దగ్గరకెళ్లి వారితో కలసిపోయి వారి మతగ్రంథాలు కూడా మా దేవుడే రాయించాడని కానీ, మీ దేవుడు మా దేవుడు ఒకరే అని కానీ చెప్పడం లేదు. ఇక్కడ పౌలు యూదులకీ అన్యజనులకీ మధ్య ద్వేషంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనేదాని‌ విషయంలో అలా మాట్లాడుతున్నాడు.

యూదులను సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడినవాడిగా (ధర్మశాస్త్ర సారాంశం క్రీస్తే), అన్యులను సంపాదించుకోవడానికి క్రీస్తునందున్న విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరత లేనివాడిగా, బలహీనుల వద్ద బలహీనుడిగా మారి క్రీస్తును ప్రకటించి వారిని రక్షించే ప్రయత్నం చేశానని మాత్రమే పౌలు అక్కడ చెబుతున్నారు. 
కాబట్టి వారు కేవలం పౌలును అడ్డుపెట్టుకుని తమ‌ అన్యబోధను చేస్తున్నారే తప్ప పౌలు అలా చెయ్యలేదు (పౌలే కాదు భక్తులు ఎవ్వరూ అలా చెయ్యలేదు).

అన్యమత గ్రంథాలను కూడా మనదేవుడే రాయించాడని రుజువు చేసేందుకు అబద్ధప్రవక్తలు వక్రీకరిస్తున్న వాక్యపు సందర్భాలలో ఇప్పటివరకూ మనం చూసినవాటితో పోలిస్తే ఈ చివరి వక్రీకరణ మరింత దారుణంగా ఉంటుంది.
అది ఏమిటో చూద్దాం;

యోహాను 5: 39 లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు( లేక, పరిశోధించుండి), అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు యూదులతో మీరు పరిశోధిస్తున్న లేఖనాలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని పలికినమాటను వీరు వక్రీకరించి ఆయన ఆ మాటను హిందూమత గ్రంథాలతో కలపి చెబుతున్నాడనీ, అందుకే తాము హిందూ మతగ్రంథాలలో ఆయన గురించి సాక్ష్యమిస్తున్న పోలికలను వెలికితీసి సువార్త ప్రకటిస్తున్నామని చెబుతుంటారు.
ఈ సందర్భాన్ని వీరు కావాలనే తమ దుర్భోధను సమర్థించుకోడానికి దారుణంగా వక్రీకరిస్తున్నారని చెప్పడానికి చాలా స్పష్టమైన రుజువులు మనకు అక్కడే కనిపిస్తున్నాయి.

1 ఆ మాటను యేసుక్రీస్తు యూదులతో చెబుతున్నాడు; ఇంతకూ యూదుల లేఖనాలు మోషే ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల రచనలా లేక వాటితో హిందూ గ్రంథాలు కూడా‌నా?
ఈ ప్రశ్నను సండే స్కూల్ పిల్లాడిని అడిగినా కూడా మొదటిదనే చెబుతాడు. తన గురించి సాక్షమిస్తున్నాయని యేసుక్రీస్తు ఏ‌ లేఖనాల గురించైతే ఇక్కడ ప్రస్తావించారో ఆ లేఖనాలు ఏమేంటో ఆయనే మరోచోట స్పష్టతను ఇచ్చాడు చూడండి.

లూకా సువార్త 24:44-47 అంతట ఆయన 'మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోనూ' నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు 'వారు లేఖనములు గ్రహించునట్లుగా' ఆయన వారి మనస్సును తెరచి  క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు  యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

ఈ వాక్యభాగంలో యేసుక్రీస్తు తాను యూదులదగ్గర ప్రస్తావించిన లేఖనాలు ఏమేంటో స్పష్టంగా తన శిష్యులకు‌ వివరించాడు. ఆ వివరణలో మనకు ఎక్కడా కూడా ఈ అబద్ధ ప్రవక్తలు ప్రస్తావిస్తున్న హిందూగ్రంథాలు కనిపించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు కానీ, మిగిలిన అపోస్తలులు కానీ లేఖనాలు అని ఎక్కడ ప్రస్తావించినా అవి వారికి దేవుడు అనుగ్రహించిన లేఖనాల గురించే తప్ప హేయమైన రాతలుండే ఇతర మత గ్రంథాలగురించి కాదు.

మత్తయి సువార్త 21:42 మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?.

మత్తయి 26: 56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.

అపో.కార్యములు 15: 21 ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

2 ఆ సందర్భంలో యేసుక్రీస్తు యూదులతో మీరు లేఖనాలలో నిత్యజీవం కలదని తలంచుచూ వాటిని పరిశోధిస్తున్నారు అంటున్నాడు. ఇంతకూ, యూదులు తరచుగా పరిశీలించే లేఖనాలు ఏంటి? మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల రచనలా లేక హిందూ గ్రంథాలు కూడానా? ఈ వచనం చూడండి;

అపొస్తలుల కార్యములు 13:27 యెరూషలేములో కాపురముండువారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.

దీనిప్రకారం యూదులు పరిశీలించేది ప్రవక్తల ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన లేఖనాలు మాత్రమే. వారు వాటిని ఎంతో ఆసక్తితో చదువుతున్నప్పటికీ వాటిలో యేసుక్రీస్తును గురించి రాయబడినవి అర్థం చేసుకోలేక ఆయనను తృణీకరిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారికి అవి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని చెప్పాడు.

అపోస్తలులు కూడా యేసుక్రీస్తు‌ చెప్పిన మాట ప్రకారం ఆయన గురించి పాతనిబంధనలో ఎక్కడెక్కడ రాయబడిందో అవన్నీ వివరిస్తూ సువార్తను ప్రకటించారు. వారి సువార్తలలోనూ పత్రికలలోనూ ఆ లేఖనాలు ఏమేంటో మనకు కనిపిస్తాయి. వాటిలో మనకు ఎక్కడా కూడా ఇతరమత గ్రంథాల నుండి వారు ఆయన‌ గురించి చూపించినట్టు కనిపించదు. వారు ఉటంకించిన లేఖనాలన్నీ మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలులోనివే. 

అపొస్తలుల కార్యములు 28:23 అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.

కొంచెం సేపు వాదనకోసం మనం చూసిన వివరణ అంతా పక్కనపెట్టి, ఈ అబద్ధప్రవక్తలు చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు నా గురించి రాయబడ్డాయని చెప్పిన లేఖనాలలో హిందూ గ్రంథాలు కూడా ఉన్నాయి అనుకుందాం. అయితే, అక్కడ మరో సమస్య కూడ తలెత్తుతుంది. అదేంటంటే, ప్రస్తుతం హిందూ మతగ్రంథాలపై, అవి రాయబడిన సంస్కృత బాషపై పరిశీలన చేసిన కొందరి వాదనప్రకారం వాటిలో ఒకటి కూడా క్రీస్తుకు పూర్వంలో రాయబడలేదు. ఆ గ్రంథాలన్నీ కేవలం క్రీస్తు శకంలోనే అది కూడా 100 సంవత్సరాల తర్వాతనే రాయబడ్డాయి.
ఈ వాదన నిజమే అనేందుకు ఆ గ్రంథాలలో రాయబడిన కొన్ని సంఘటనలు కూడా సాక్ష్యంగా ఉన్నాయి. ప్రస్తుత మన అంశం అది కాదు కాబట్టి వాటిని మేమిక్కడ ప్రస్తావించడం లేదు.
హిందూ మతపెద్దలు వారి గ్రంథాలు లక్షల యేళ్ళక్రితం రాయబడ్డాయని పైపై మాటలు చెప్పినంత మాత్రాన సరిపోదు కదా! వాటికి ఆధారాలు చూపించాలి. కాబట్టి, క్రీస్తు జీవించే కాలానికి అసలు హిందూ మతగ్రంథాలే రాయబడనప్పుడు అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని యేసుక్రీస్తు ఎలా చెబుతాడు? పోని ఈ బోధను చేసే అబద్ధప్రవక్తలు హిందూ మతగ్రంథాలు క్రీస్తు పూర్వమే ఉనికిలో ఉన్నాయని ఆధారాలు చూపించగలరా?.

ఇప్పుడు వారి వాదనంతా వాక్యానుసారంగా వీగిపోయింది కాబట్టి వారు సెంటీమెంటల్ గా ఎలా తమ‌వాదనను కొనసాగిస్తారో దానిని కూడా చూద్దాం. వీరు దేవుడు పక్షపాతి కాదని బైబిల్ చెబుతుంది, పక్షపాతి కాని దేవుడు, యూదుల చేత మాత్రమే దైవగ్రంథాన్ని రాయించి, వారికి మాత్రమే దానిని అనుగ్రహించి, అన్యజనులకు అదే విధంగా రాయించి ఇవ్వకపోతే ఆయన పక్షపాతే ఔతున్నాడుగా అని ప్రశ్నిస్తూ కాబట్టి వారు ప్రకటించేదే వాస్తవమైనట్టుగా వాదిస్తుంటారు.

వాస్తవానికి దేవుడు యూదులచేత మాత్రమే లేఖనాలను రాయించి వారికి మాత్రమే వాటిని అనుగ్రహించినా ఆ లేఖనాలను అన్యులు చదవకూడదని కానీ, దానిప్రకారంగా నడుచుకోకూడదని కానీ ఎటువంటి షరతులూ ఆయన పెట్టలేదు. సంఖ్యాకాండము 9: 14 మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయ వలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.

ఒకవేళ వీరి తర్కం ప్రకారం దేవుడు యూదులచేత రాయించినట్టుగానే తన వాక్కును అన్యజనుల చేతకూడా రాయించని పక్షంలో ఆయన పక్షపాతి అయిపోతే, అందుకే ఆయన అన్యుల చేతకూడా తన వాక్యాన్ని రాయించి ఉంటే, యూదుల చేత రాయించిన లేఖనాల్లో ఉన్నట్టుగా అన్యమత గ్రంథాల్లో యెహోవా అనేనామాన్ని ఆయన రాయించలేదు‌, బైబిల్ లో ఆయన గురించీ, ఆయన బోధించే నైతికత గురించీ ఉన్నంత స్పష్టత మిగిలినవాటిలో మనకు కనిపించదు. దీనిప్రకారంగా కూడా ఆయన పక్షపాతే ఔతాడు కదా!

మనకున్న సెంటీమెంటల్ వాదనలు తీసుకెళ్ళి దేవునిపై పెట్టి ఆయన ఇలా చేస్తేనే పక్షపాతి కాకుండా ఉ‌ంటాడు, అలా చేయకపోతే పక్షపాతి ఔతాడని వాదిస్తే, మనం పెట్టిన కొలతల చొప్పున నడుచుకుని మనం అనుకున్నట్టుగా ఆడడానికి ఆయన మన ఇష్టానుసారంగా నడచుకోడు, మనమే ఆయన ఇష్టానుసారంగా నడచుకోవాలి, లేఖనాల్లో ఆయన రాయించింది‌ మాత్రమే నమ్మాలి.

ఇకపోతే యేసుక్రీస్తు దైవమానవుడిగా ఈ లోకంలోకి రాకముందు దేవుడు భూమిపైనున్న ప్రజలకు ముఖ్యంగా రెండు విధాలుగా తనను తాను తెలియచేసుకున్నాడు‌.

వాటిని 'సాధారణ ప్రత్యక్షత' (general revalation) 'ప్రత్యేకమైన ప్రత్యక్షత'(scriptural revalation) అంటారు. సాధారణమైన ప్రత్యక్షత అంటే దేవుడు తాను సృష్టించిన సర్వసృష్టి ద్వారా, మానవులల్లోని మనస్సాక్షి ద్వారా అందరికీ తనను తాను తెలియచేసుకుంటాడు.

రోమీయులకు 1:19,20  ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.

అపొస్తలుల కార్యములు 14:17 అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.

రోమీయులకు 2:14,15 ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారితలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

ఈ వచనాల ప్రకారం సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుడు తననుతాను సృష్టిలోని ప్రజలందరికీ బయలు పరుచుకున్నాడు దీనినే సాధారణ ప్రత్యక్షత అంటారు. వీటిప్రకారం ఏ మనిషైనా‌ దేవుణ్ణి కొంతమట్టుకు గ్రహించవచ్చు, తనలోని మనసాక్షి ద్వారా ఆయనకు ఇష్టుడిగా జీవించే ప్రయత్నం చేయవచ్చు.

ఇక ప్రత్యేకమైన ప్రత్యక్షత (Scriptural revalation) అంటే దేవుడు కొందరిని ఏర్పరచుకొని, వారికి ప్రత్యక్షమై తనవాక్కును రాయించడం, ఇది కేవలం ఇశ్రాయేలీయులకి మాత్రమే చెందింది.

కీర్తనల గ్రంథము 147:19,20 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.

దేవుడు ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతతో యూదులకి మాత్రమే తనను తాను బయలుపరచుకున్నప్పటికీ, సృష్టి ద్వారా మనస్సాక్షి ద్వారా దేవుని గురించి తెలుసుకున్న సామాన్య ప్రజలు యూదుల లేఖనాలు చదవవచ్చు, ఆయన పండుగలు ఆచరించవచ్చు.
దీనిప్రకారం చూసినా ఆయన పక్షపాతి అవ్వడం లేదు.

చివరిగా,
దేవునివాక్యాన్ని కలిపిచెరిపే ఈ అబద్ధప్రవక్తలకు, దొంగ అపోస్తలులకూ  హెచ్చరిక: తన సేవలో తాను ఆజ్ఞాపించని వేరొక అగ్నిని చేర్చినందుకు  అహరోను కుమారులకు జరిగిన శిక్షావిధిని జ్ఞాపకం‌చేసుకోండి. లేదా మీరు కూడా నరకంలో ఆరని అగ్నిలో‌ కాలక తప్పదు.

లేవీయకాండము 10:1,2 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగాయెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.

సంఖ్యాకాండము 3: 4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.