రక్షణ

రచయిత: జి. బిబు
ఆడియో

Article Release False true faith min

“ఆయనతో కూడా సహవాసముగలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనము అబద్దమాడుచూ సత్యమును జరిగింపకుందుము” (1 యోహాను 1:6)

యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినవారందరూ రక్షణలో ఉన్నారా? ఈ ప్రశ్న వివాదాస్పదమైనదని నాకు తెలుసు. ఐనా ఇది అనేకుల రక్షణకు సంబంధించిన ప్రశ్న కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే నిజమైన విశ్వాసంలాగే కనిపిస్తూ భ్రమపరిచి, మోసగించే ఒక నకిలీ విశ్వాసం కూడా ఉందని బైబిల్ హెచ్చరిస్తుంది. “ప్రభువా,ప్రభువా” అని పిలిచేవారందరూ పరలోకవారసులు కారని, అనేకులకు బోధించి భ్రష్టులైపోయే అవకాశముందని, ఆయన నామమందు ప్రవచించి, దయ్యములను వెళ్లగొట్టి, అనేక అద్భుతాలు చేయటం పరలోక ప్రవేశానికి అర్హతలు కానక్కరలేదని, ఇలా అనేక విధాలుగా పైన నేను చెప్పిన సత్యాన్ని బైబిల్ నిర్థారిస్తుంది. కాబట్టి విశ్వసించింది యేసునే అయినా, అందులో కూడా రక్షణార్థమైనది, రక్షణార్థం కానిది అనే రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయి. అన్ని విశ్వాసాలూ రక్షణకు దారితీసేవి కావు. గెహాజీ, యూదా, దేమా, వీరందరూ ఒకప్పుడు విశ్వాసులే. అలాంటి నకిలీ విశ్వాసులకు నేటి సంఘంలో కూడా కొరతేమీ లేదు.

నకిలీ అంటేనే, అసలుదానిలా కనిపించి, మోసగించేది అని అర్థం. అలాగే ఈ నకిలీ విశ్వాసానికి కూడా నిజమైన విశ్వాసంతో ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయి. మనకున్నది నిజవిశ్వాసమే అని భ్రమపరచేవి ఈ పోలికలే. కాబట్టి ఆ పోలికలేమిటో జాగ్రత్తగా గమనించండి.

'నేను యేసు నామమందే విశ్వసించాను కాబట్టి నేను దేవుని బిడ్డనే' (యోహాను 1:12) అననుకుంటున్నావేమో! అయితే అనేకులు ఆయన నామమందు విశ్వసించారు కాని ఆయన తనను వారి వశం చేసుకోలేదని, వారి హృదయంలో ఏముందో ఆయనకు తెలుసన్నదే అందుకు కారణమని రాయబడుంది (యోహాను 2:23-24). వారు విశ్వసించారు, కాని వారి విశ్వాసమందు ఆయనకు విశ్వాసం లేదు. అలాగే, విశ్వసించామని చెప్పుకునే మన హృదయాలలో కూడా ఆయన తనను మన వశం చేసుకోటానికి అడ్డగించేవెన్నో ఉండే ప్రమాదం లేకపోలేదు.

'కాని నేను వాక్యం విని నమ్మాను;నాది వినుటవలన కలిగిన విశ్వాసం' (రోమా 10:17) అని అంటావేమో! రాతినేలను పోలిన వ్యక్తి కూడా వాక్యమే విని నమ్మాడు. అయినా అతనిది కేవలం శోధనకాలమందు తొలిగిపోయే విశ్వాసమే; అంతం వరకు నిలిచియుండే విశ్వాసం కాదు (మత్తయి 13:20-21).

'నేను ప్రభువులో చెప్పనశక్యం కాని సంతోషాన్ని అనుభవిస్తున్నాను;ఇది నిజ రక్షణకు రుజువు కాదా??' (రోమా 14:17) అని నువ్వు అడగవచ్చు. అయితే, రాతి నేలను పోలిన వ్యక్తి కూడా వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించాడని వ్రాయబడుంది. భావోద్రేకాలు రక్షణకు రుజువులు కానేరవు.

'నేను పరిశుద్ధాత్మలో పాలివాడనని నాకు తెలుసు:నాది మాత్రం నిజరక్షణే' అని నువ్వు ఊరట పడుతున్నావా? అయితే పరిశుద్దాత్మలో పాలివారైన తర్వాత తప్పిపోయి మళ్లీ మారుమనస్సు పొందనేరరని చెప్పబడినవారి గురించిన హెచ్చరికను గుర్తు చేసుకో (హెబ్రీ 6:4-6).

 'నేనైతే ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురుచూసే వ్యక్తిని,కాబట్టి నాకేం ఢోకా లేదు' అననుకుంటున్నావా? పెండ్లికుమారుని కోసం ఎదురుచూసిన ఐదుగురు బుద్ధిగల కన్యకలతోపాటు, చివరికి విడువబడిన అయిదుగురు బుద్ధిలేని కన్యకలు కూడా ఉన్నారని మరచిపోవద్దు (మత్తయి 25:1-12, ఆమోసు 5:18).

నిజవిశ్వాసిలో ఉండాల్సిన పై అయిదు లక్షణాలు తరచూ ఒక నకిలీవిశ్వాసిలో కూడా కనబడే అవకాశముందని వాక్యం హెచ్చరిస్తుంది. ఇరువురూ నమ్మింది యేసు నామమందే, ఇరువురూ వాక్యం వినే నమ్మారు;

ఇరువురిలో సంతోషముంది; ఇరువురూ పరిశుద్ధాత్మలో పాలివారే; ఇరువురూ ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురుచూసేవారే. మరి ఇన్ని దగ్గర పోలికలుంటే, మనకున్నది నిజవిశ్వాసమా నకిలీవిశ్వాసమా అని ఎలా తెలుసుకోవాలి?
అది తెలసుకోవటం అంత కష్టతరమేమీ కాదు. నిజవిశ్వాసానికీ నకిలీవిశ్వాసానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించటం వల్ల స్వీయపరిశీలన చేసుకోవటం సులభమౌతుంది. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించండి.

 ఒక నకిలీవిశ్వాసి తనను నరకము నుండి కాపాడే రక్షకుడు కావాలనుకుంటాడు. కాని యేసు దేని నుండి రక్షించే రక్షకుడని లేఖనాలు పరిచయం చేస్తున్నాయి? తన ప్రజలను తమ పాపాల నుండి రక్షించే రక్షకునిగా లేఖనాలు యేసును పరిచయం చేస్తున్నాయి (మత్తయి 1:21). యేసు నిన్ను నిజంగా రక్షిస్తే, నీ పాపాల నుండి రక్షిస్తాడు. పాపమాలిన్యము నుండి, పాపబంధకాల నుండి, పాపపు ఏలుబడి నుండి నిన్ను రక్షిస్తాడు, కాబట్టి పాపశిక్ష నుండి అనగా నరకము నుండి కూడా రక్షిస్తాడు. అయితే పాపశిక్ష నుండి మాత్రమే రక్షించి, పాపమాలిన్యములోనే కొనసాగించే రక్షణను బైబిల్ బోధించటం లేదు. యేసుక్రీస్తు నీ పాపాలలో నిన్ను రక్షించడు కాని నీ పాపముల నుండి నిన్ను రక్షిస్తాడు. యేసు నిన్ను రక్షించి పాపంలో కొనసాగనిస్తున్నాడని అనడం, దేవునిపై నీ తిరుగుబాటులో నీతో యేసు చేతులు కలుపుతున్నాడనడమే. అట్టి దైవదూషణ మనకు దూరమగును గాక. యేసు పాపానికి పరిచారకుడు కాదు.

యేసు నీ పాపాల నుండి నిన్ను రక్షించాడా? పాపం పట్ల నీ వైఖరిలో మార్పేమైనా జరిగిందా? ఏవో కొన్ని అలవాట్లు మానేయటం కాదు, ప్రతివిధమైన పాపాన్ని అసహ్యించుకునే మన:స్థితిని నీలో చూడగలిగావా? దేవుడు ప్రేమించేవాటిని ప్రేమించి ఆయన ద్వేషించేవాటిని ద్వేషిస్తున్నావా? అలాగని రక్షింపబడినవారు పాపం చేసే అవకాశమే లేదని నేననటం లేదు (1యోహాను 1:8). కాని బుద్ధిపూర్వకంగా పాపం చేసి, అందులోనే కొనసాగే మన:స్థితి గలవారికి రక్షణ అంటే ఏమిటో తెలియదు (1యోహాను 3:9).

'కృపచేత, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుందే తప్ప క్రియలమూలంగా కాదు కదా (ఎఫెసీ 2:8-9), పాపంలో కొనసాగితే రక్షణే లేదన్నట్లు మాట్లాడతారేమిటి?' అని మీరు అడుగవచ్చు. అయితే మీరు రక్షణ ఎలా వస్తుందో చెబుతున్నారు, నేను రక్షణ వస్తే ఏమి జరుగుతుందో చెబుతున్నాను (ఎఫెసీ 2:10). క్రియల వలన రక్షణ రాదు కాని రక్షణ వలన క్రియలు తప్పక వస్తాయి (తీతు 2:14). సత్క్రియలు మన రక్షణకు ఫలం, మూలం కాదు. రక్షణార్థమైన విశ్వాసం మృతమైనది కాదు, అది క్రియ ద్వారా తన ఉనికిని నిరూపించుకునే ఒక సజీవ నియమం (యాకోబు 2:14-19). రక్షణ ఉచితమే కాని ఖాళీ చేతులతో మనం దానిని అందుకోవాలి. పాపాన్ని, స్వయాన్ని, లోకాన్ని విడిచిపెట్టని చేతులతో రక్షణను అందుకోవడం సాధ్యం కాదు. మనం వెలుగు సంబంధులమైతే మనలో వెలుగు ఫలాలు కనిపిస్తాయి (ఎఫెసీ 5:8-14). అప్పుడు మనం లోకానికి వెలుగునిస్తాం, తేజోవాసులతో స్థిరనివాసాన్ని కలిగుంటాం. అట్టి నిశ్చయతను ఇవ్వగల పరిశుద్దజీవితాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక, ఆమెన్.

Add comment

Security code
Refresh

Comments  

# RE: నిజ విశ్వాసం, నకిలీ విశ్వాసంRaghavulu 2021-01-27 07:44
Good
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.