దుర్బోధలకు జవాబు

రచయిత: యం. రవీందర్ మరియు జి.బిబు
చదవడానికి పట్టే సమయం: 13 నిమిషాలు
ఆడియో

g1PoysqI min

గమనిక: ఈ రచన బి.జాన్ గారి ప్రసంగం ఎంత వరకు సత్యము అని పరిశీలించడానికి మాత్రమే ఉద్దేశించినది. ఇది పరిశుద్ధాత్ముని గూర్చిన పూర్తి వివరణ ఇచ్చే రచన కాదు. కొందరు IBT సహోదరులు ఇలా జాన్ గారి దుర్బోధలను బహిర్గతం చేయడం, వ్యక్తిగత విమర్శ అంటున్నారు. డా|| జాన్ గారి దగ్గరికి వచ్చే సహోదరులు జాన్ గారి బోధలను ఏమాత్రం పరిశీలించకుండానే అంగీకరించి వాటినే ఇతరులకు బోధిస్తున్నారు. ఇది బెరయ సంఘస్తుల మాదిరి కాదు. మా మనవి ఏంటంటే - ఆలోచించాలి, ఆలోచించాలి అని పదే పదే చెప్పే జాన్‌గారు చేసే బోధలను మీరూ ఆలోచించండి. వాక్య సారాంశాన్ని ఆలోచించండి.మాకు జాన్ గారు అంటే ఎలాంటి కోపంగాని, అసూయగాని లేవు. ఆయన చెప్పే బోధలను తప్పు అని చూపినప్పుడు సరిదిద్దుకోకపోతే అతనిలో యథార్థత లేదని అర్థం. సరిదిద్దుకొని తిరిగి బోధిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది. అలాగు చేస్తే ఆయన తప్పక మాకు క్రీస్తునందు సహోదరుడే. తన ఈ ప్రసంగంలో జాన్ గారు లేఖనములను వక్రీకరిస్తూ, పరిశుద్ధాత్మను గూర్చి ఎన్నో సారహీనమైన మాటలు పలికాడు. పరిశుద్ధాత్మ దేవుడని లేఖనములు స్పష్టంగా బోధిస్తుండగా, జాన్ గారు మాత్రము అట్టి లేఖనభాగములను కనీసం ప్రస్తావనకు కూడా తేకుండా తనకు నచ్చిన వచనములను తనకు తోచిన విధముగా వ్యాఖ్యానిస్తూ ఏవేవో చెప్పసాగారు. ఈ వ్యాసంలో మేము జాన్ గారి ప్రసంగములోని దుర్బోధలను స్పష్టంగా గుర్తించగలుగు కొన్ని విషయములను మొదట ఉన్నదున్నట్లుగా ఆయన మాటలలో మీముందుంచి, దాని క్రింద మా సద్విమర్శలను పొందుపరిచాము. దేవుని ఎదుట యథార్థతతోను వాక్యపు వెలుగులో వివేచనతోను వీటిని పరిశీలించగలరని మనవి.

1. డా॥ బి. జాన్ - “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపుఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగినవారమై మనము - అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.” (రోమా 8: 14, 15). పరిశుద్దాత్మకు మరో పేరు దత్తపుత్రాత్మ! ఇది అసలు సంగతి. మనము దత్తపుత్రాత్మను కలిగి ఉండి “అబ్బా, తండ్రీ' అని మొఱ్ఱపెట్టుచున్నాము. అనగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ “అబ్బా,తండ్రీ” అని మొఱ్ఱపెట్టుచున్నాడు. అంటే దేవునికి పరిశుద్ధాత్మ “అబ్బా,తండ్రీ” అని మొఱ్ఱపెట్టుచున్నాడు. అంటే దేవునికి పరిశుద్ధాత్ముడు కుమారుడు. కాని కుమారుడైతే కనాలి కదా. యేసుక్రీస్తును కన్నాను అన్నాడు. మరి ఈయనను కన్నట్లు ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఆయనకు మరో టైటిల్ ఇచ్చాడు. అదే దత్తపుత్రాత్మ అంటే. ఆయనను దత్తత తీసుకున్నట్లు పరిచయం చేశాడు. ఇది కుమారుడుగా చెప్పాలంటే మనకు మరో సాక్ష్యం దొరికింది. గలతీ 4:6, 7 ......... మరియు మీరు కుమారులైయున్నందున.................. తన కుమారుని ఆత్మ ......... అంటే ఆయన కుమారుని ఆత్మనే మనలోనికి పంపాడు, కాబట్టి పరిశుద్దాత్మ దేవుడు కూడా మనకు బ్రదరే (సహోదరుడే).

మా సద్విమర్శ: ఇదే డా|| బి. జాన్ గారు ప్రసంగంలో కీలకమైన అంశం. ఇక్కడ తన మొదటి గుండీ (button) తప్పుగా పెట్టుకుని మిగిలిన గుండీలు (buttons) తప్పుగా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్ముడు దేవునికి దత్తపుత్రుడు అని తద్వారా మనకు సహోదరుడు (బ్రదర్) అవుతాడని ఎవరూ (పౌలు కూడా) చెప్పని క్రొత్త విషయం చెప్పారు. డా|| జాన్ గారి బోధల్లో ఉన్న ఒక ప్రధానలోపం తెలుగుభాషను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం.

ఎ) "దత్తపుత్రాత్మను పొందితిరి” ఇంగ్లీషు బైబిల్ లో ఈ మాటకు "Spirit of adoption” అని వుంది కాని "adopted Spirit” అని లేదు. మనము దత్తపుత్రులమగుటకు ఈ పరిశుద్ధాత్మయే సాధనమని ఇది సూచిస్తుంది. అంతేకాని ఇది పరిశుద్ధాత్మయే దత్తత తీసుకోబడిన కుమారుడని సూచిస్తుందని చెప్పడం కేవలం ఆయన దైవత్వాన్ని, తండ్రీకుమారులతో ఆయనకు గల సమానత్వాన్ని తారుమారు చేయడానికి స్వయంగా సాతాను చేత ప్రేరేపింపబడిన దుర్భోధ మాత్రమే.

బి) “ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా, తండ్రీ అని మొఱ్ఱపెట్టుతున్నాము” ఇక్కడ స్పష్టముగా అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టేది “మనము” అని చెప్పబడినప్పటికీ, ఆత్మ సహాయం చేత మనము ఆలాగు చేయగలుగుచున్నామని మాత్రమే ఈ మాటలు సూచించినప్పటికీ పరిశుద్ధాత్మ కూడా దేవునికి “అబ్బా తండ్రీ” అని మొఱ్ఱపెడుతున్నాడని జాన్ గారు చెప్పడం, తన దుర్బోధను సమర్థించుకోవడానికి ఎంత వక్రీకరణకైనా తెగిస్తారనేందుకు నిదర్శనము. పరిశుద్ధాత్మ, అబ్బా తండ్రీ అని దేవునికి మొఱ్ఱపెట్టుకుంటున్నట్లు బైబిల్ లో ఒక్క వచనము కూడా మనకు కనిపించదు. గలతీ 4:6 లో కూడా నాయనా,తండ్రీ అని మొట్టపెట్టేది పరిశుద్ధాత్మ అని చెప్పబడలేదు గాని నాయనా, తండ్రీ అని మొఱ్ఱపెట్టే ఆయన "కుమారుని"(మార్కు 14:36) ఆత్మను మనలోనికి పంపాడని మాత్రమే చెప్పబడివుంది.

సి) అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టేది పరిశుద్ధాత్మ కాదు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనే ఊహ కేవలం ఆధారరహితమైనది. ఇక ఆయన కన్నకుమారుడా? లేదా దత్తత తీసుకోబడ్డాడా అనే ప్రశ్నలకు తావేది!

డి) పరిశుద్ధాత్ముడు దత్తపుత్రుడన్న ఆధారరహితమైన తన ఊహను సమర్థించుకోవడానికి జాన్ గారు పరిశుద్దాత్మను ఎంత దిగజార్చి మాట్లాడారో మీరే స్వయంగా చదవండి.

2. డా|| బి.జాన్ - ఇంతకీ ఆయన దత్తపుత్రాత్మా? ఇది కొందరికి అర్థం కాలేదు. దత్తాపుత్రాత్మ అంటే ఏమిటండి, దత్తపుత్రుడు అంటే ఎవరి నుండి దత్తత తీసుకున్నాడు? ఈయన ఎవరికి పుట్టాడు? అన్నాడు ఒకడు. అంతేకదా మరి, ఆయన పుట్టుక గురించి చెప్పలేదు. యేసుక్రీస్తును గురించి అయితే నేను కన్నాను అన్నాడు. ఈయన గురించి అయితే “నా ఆత్మ” అని చెప్పాడు కాని ఎప్పుడు కన్నాడో చెప్పలేదు. దేవునికి ప్రారంభములేనట్లే దేవుడు ఎప్పుడు పుట్టాడో చెప్పలేదు. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడు పుట్టాడో చెప్పలేదు. కాని నేను ఉన్నప్పటి నుంచి నా ఆత్మ వుంది. దేవుడు ఉన్నప్పటినుంచి దేవుని ఆత్మ ఉంది. That is most important కాబట్టి దేవునికి ప్రారంభము లేదు పరిశుద్దాత్మకు ప్రారంభము లేదు. దేవుడు ఉన్నప్పటి నుండి ఈయన కూడా వున్నాడు యేసుక్రీస్తు అయితే ఆది యందు పుట్టాడు. ఇంతకీ దత్తత తీసుకోవాలంటే దత్తత ఇవ్వడానికి ఎవడైన ఉండాలి కదా అని అంటాడు ఒకడు. నేను ఒక ప్రశ్న వేశాను అతనికి, ఎవరినైనా దత్తత తీసుకోవాలంటే తల్లిదండ్రుల నుండి తీసుకోవాలి లేదా ఆనాథ ఆశ్రమము నుండి అయినా తీసుకోవాలి. తల్లిదండ్రులు తెలియదు, ఆనాథ ఆశ్రమములో లేరు అనుకోండి, ఒక రోడ్డు మీద దొరికాడు, ఏం చేస్తాము తీసుకొచ్చుకొని పెంచుకుంటాము. వాన్ని ఏమంటాము? నా పెంపుడు కొడుకు లేదా దత్తపుత్రుడు అంటాము.”

మా సద్విమర్శ: పై మాటలకు ఏ లేఖనాధారము లేదని, వాటిని నమ్మాలనుకున్నవారు కేవలం జాన్ గారి మాటలను ఆధారము చేసుకొనే నమ్మాలని, వేరే చెప్పనక్కరలేదు. ఆయన సెలవిచ్చిన పై మాటల నుండి తేలే ఫలితార్థములు గమనించండి;

ఎ) జాన్ గారు తన ప్రసంగములో చెప్పినట్లు, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అయితే దేవుడు ఆయనను దత్తత తీసుకున్నట్లయితే, ఆలాగు దత్తత తీసుకొనకమునుపు దేవునికి ఆత్మ లేదన్నమాట. ఇది వినడానికే విడ్డూరంగా లేదూ!

బి) పుట్టుపుర్వోత్తరాలు తెలియదన్న నెపంతో, నిత్యుడగు పరిశుద్ధాత్మ దైవాన్ని రోడ్డు మీద దొరికిన ఆనాథతో పోల్చి పొంతన లేని ఉదాహరణలు చెప్పి దేవుని ఆత్మను అవమానించిన డా|| బి.జాన్ గారు దుర్బోధకుడు కాకపోతే మరేమిటి?

3. డా|| బి.జాన్ - "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు"(రోమా 8:14). దేవుని ఆత్మను కలిగి ఉండి అంటే పరిశుద్దాత్మను కలిగి ఉండి ఆయన చేత నడిపింపబడితే దేవునికి కుమారుడవు అవుతావు. అంటే నీకు, దేవునికి, తండ్రికుమారుల సంబంధం ఉంటుంది. యేసుక్రీస్తు దేవునితో తండ్రికుమారుల సంబంధం (Relationship) ఎలా కలిగి ఉన్నాడని అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండి (లూకా 4:17, యెషయా 4:2.). యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను కలిగి ఉండి దేవుణ్ని “నా తండ్రీ” అని పిలిచాడు.

మా సద్విమర్శ: ఇక్కడ యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మను కలిగి ఉండటం వలననే దేవునితో తండ్రీకుమారుల సంబంధం కలిగి ఉన్నాడని చెప్పారు డా||జాన్ గారు. ఆ తరువాత కొద్దిసేపటికే దేవుడు యేసు క్రీస్తును కన్నాడు గాని పరిశుద్ధాత్మను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తపుత్రుడు అని చెప్పారు, స్వంత కుమారుడు తండ్రిని "తండ్రీ” అనాలంటే ఆయన దత్తపుత్రుని ఆత్మను కలిగి ఉండాలా?! ఇది ఎంత వరకు సమంజసమో, ఎందుకు హాస్యాస్పదం కాదో డా||బి.జాన్‌ గారే చెప్పాలి!

4. డా|| బి.జాన్ - 'పరిశుద్ధాత్మను ఆత్మ అన్నాడు గనుక శక్తి. 'అది' అనొచ్చు. 'ఆయన' అన్నపుడు వ్యక్తి. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆత్మ అంటే ఒకచోట ఏమన్నాడు, “నేను సర్వశక్తిమంతుడను” శక్తి అన్నపుడు (power) 'అది' కిందికొస్తుంది. నేను వ్యక్తిని అన్నపుడు 'తండ్రి'..

మా సద్విమర్శ: ఇదెక్కడి లాజిక్? ఆయన శక్తిమంతుడైతే ఆయనే శక్తి అని జాన్ గారు తప్ప బహుశ ఇంకెవరూ అనరు. 'నేను ధనవంతుడను' అని చెప్పుకుంటే, నాకు ఎంతో ధనం వుంది అని భావం వస్తుందే తప్ప నేనే ధనాన్ని అని భావము రాదు కదా? అలాగే ఆయన శక్తిమంతుడు అన్నప్పుడు, ఆయన శక్తిగల వ్యక్తి అని భావము వస్తుందిగాని, ఆయన శక్తి అని ఏ లేఖనాధారము లేకుండా ఎవరైనా ఎలా చెప్పగలరు? డాక్టరేట్లు పొందినవారు ఈ ప్రాథమిక పాఠాలు సైతం మాతో చెప్పించుకోవడం బహుశోచనీయం.

5) డా|| బి.జాన్ - "మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” (1 కొరింథి 3:16) పరిశుద్ధాత్ముడు సర్వమానవాళిలో నివసించటానికి భూమి మీదికొచ్చాడు. ప్రత్యేకంగా క్రైస్తవులలో ఉండటానికి వచ్చాడు.

మా సద్విమర్శ: సర్వమానవాళిలో నివసించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడనే గొప్ప మర్మం IBT Version (Per-version)లో తప్ప మరెక్కడ మనకు కనిపించదు. డా|| బి.జాన్ గారి ఈ మాటలను బైబిల్ లోని అపోస్తలుడైన జాన్ గారి మాటలు ఎలా కొట్టిపారేస్తున్నాయో మీరే చదవండి. “లోకము ఆయనను (పరిశుద్దాత్మను)చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు;మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.” (యోహాను 14:17). ఇక ఏ జాన్ మాటలు సమర్థిస్తారో పాఠకులే నిర్ణయించుకోవాలి.

6. డా|| బి.జాన్ - "శరీరమొక్క ........” (ఎఫె 4:4) అందరికీ తండ్రియైన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే మనకు, యేసు ప్రభువుకు, సమస్త సృష్టికి....... పరిశుద్ధాత్మకు తండ్రిని పో అన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. యేసుక్రీస్తులో, పరిశుద్ధాత్మలో ఉన్నాడు. అందరిలో అందరిగా ఉన్నవాడు దేవుడు. దేవుడు త్రియేక దేవుడు కాదు. ఏక దేవుడు. ఒక్కడే. అనేక దేవుడు, ఏక దేవుడు. త్రియేక దేవుడు అంటే దేవుడు ముగ్గురిలోనే ఉన్నాడు. అందరిలో లేడని బైబిలుకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు బైబిలు బోధకులు. ఆయన అందరిలో ఉన్నాడు. అందరిగా ఉన్నాడు.

మా సద్విమర్శ:

ఎ) ఎఫెసీ 4వ అధ్యాయమును మేము కూడా చదివాము కాని అక్కడ మాకు మాత్రం దేవుడు తాను పరిశుద్దాత్మకు కూడా 'తండ్రిని పో' అని చెప్పిన మర్మము ఎక్కడా కానరాలేదు. పాఠకులకేమైనా కనిపిస్తే మాకు తెలియజేయగలరని విన్నపం !!!

బి) ఇక్కడ దేవుడు "అనేక దేవుడు” ఎట్లాగో/అంటే ఏమిటో డా||జాన్ గారు వివరించాలి? అలాగే అందరిగా ఉన్నాడు అంటే ఏమిటో వివరించాలి?

సి) త్రియేక దేవుడు అంటే దేవుడు ముగ్గురిలోనే ఉంటాడని బైబిలు బోధకులు అంటున్నారని జాన్ గారు అన్నారు. ఎవరన్నారు? ఎక్కడైనా వింటే జాన్ గారు దయచేసి తెలియజేయండి. వారిని కూడా మా వెబ్ సైట్ లో జాన్ గారితో పాటు బహిర్గతం చేస్తాము. ఇంతకీ ముగ్గురెవరు?

డి) తండ్రి విశ్వాసులందరిలో ఉన్నాడు (ఎఫె 4:6). పరిశుద్ధాత్ముడు విశ్వాసులందరిలో ఉన్నాడు (యోహాను 7:39, 1 కొరింథీ 3:16) యేసుక్రీస్తు విశ్వాసులందరిలో ఉన్నాడు (రోమా 8:10, గలతీ 4:6 కొలస్సి 3:11)) ఈ ముగ్గురు ఒక విశ్వాసిలో ఉంటారు. ఈ ముగ్గురు ఎందుకుండాలి? ఆలోచించండి. దేవుడు త్రియేకుడైయున్నాడనే సత్యం కనుగొంటారు.

ముగింపు: ఇందుమూలముగా డా|| బి.జాన్ గారికి ఆయన అనుంగుసహవాసులకు తెలియజేయడమేమనగా : పరిశుద్దాత్ముడు దేవునికి దత్తపుత్రుడు కాదు అని, మనకు సహోదరుడు (బ్రదర్)కూడా కాదు అని తెలియజేస్తున్నాము. మేం చెప్పిన ఈ విషయాలు తప్పైతే లేఖన ఆధారాలతో నిరూపించండి. లేని పక్షమున మీ తప్పును మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి. డాక్టర్ జాన్ గారి 'పరిశుద్ధాత్ముడు ఎవరు' అన్న పూర్తి ప్రసంగం కావాలంటే మాకు ఇ-మెయిల్ పంపండి. మేము ఇ-మెయిల్ ద్వారా దానిని మీకు పంపిస్తాము.

దేవుడు మీ మనోనేత్రములను తెరచి సర్వసత్యములోనికి నడిపించాలని మా ప్రార్థన.

ప్రభువు నందు మీ సహోదరులు యం.రవీందర్ మరియు జి.బిబు

 

గమనిక ః ఈ వ్యాసం పరిశుద్ధాత్మ గురించి పూర్తి వివరణాత్మక విశ్లేషణ కాదు కానీ కొన్ని దుర్బోధలకు లేఖనాత్మకంగా చేసిన సూటి సద్విమర్శ మాత్రమే. 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.