నిజ క్రైస్తవ జీవితం

రచయిత: జె.సి.రైల్
అనువాదం: ఎం.ఎం.రాజు
చదవడానికి పట్టే సమయం: 1 గంట 7 నిమిషాలు

 

వారు నిత్యము ప్రార్థన చేయుచుండవలెను – (లూకా 18:1) 

మనుష్యులు ప్రార్థన చేయవలెనని హెచ్చరించుచున్నాను – (1 తిమోతి 2:1)

నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అది మూడు పదాల ప్రశ్న. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అది నువ్వు తప్ప ఇంకెవరూ జవాబు చెప్పలేని ప్రశ్న. నువ్వు నీ సంఘకూడికకు వెళ్తున్నావా లేదా అనేది నీ సంఘకాపరికి తెలుస్తుంది. నువ్వు కుటుంబప్రార్థన చేస్తున్నావా లేదా అనేది నీ కుటుంబానికి తెలుస్తుంది. కానీ నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది కేవలం నీకు దేవునికి మాత్రమే తెలిసిన విషయం.

నేను ఇప్పుడు నీతో చెప్పబోయే విషయం మీద కాస్త శ్రద్ధ పెట్టమని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. నా ప్రశ్న మరీ సూటిగా ఉందని అనుకోవద్దు. దేవుని దృష్టికి నీ హృదయం సరైనదిగా ఉంటే ఇందులో నువ్వు భయపడటానికి ఏమీ లేదు. నేర్చుకున్న ప్రార్థనలేవో వల్లెవేస్తూ ఉంటానని దయచేసి చెప్పొద్దు. ప్రార్థనలు వల్లించడానికి మరియు ప్రార్థన చెయ్యటానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. నా ప్రశ్న అనవసరమైనదని దాటేయొద్దు. కొన్ని నిముషాలు వినగలిగితే ఈ ప్రశ్న అడగటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని చూపిస్తాను.

1. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడని చెప్పడానికి ప్రార్థన ఒక గుర్తుగా ఉంది. అందుకే అడుగుతున్నాను; ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన తప్పనిసరిగా అవసరం అని నేను అంటున్నాను. బాగా ఆలోచించుకునే ఈ మాటలు చెప్తున్నాను. ఇప్పుడు నేను చిన్నపిల్లల కోసమో లేదా మానసిక రోగుల కోసమో చెప్పట్లేదు. అన్యుల విషయం కూడా నేను ఎత్తట్లేదు. ఎందుకంటే ఎక్కడ కొంచమే ఇవ్వబడిందో అక్కడ కొంచమే లెక్క చెప్పాల్సి ఉంటుందని నాకు తెలుసు. కానీ మన దేశం లాంటి ఒక ప్రాంతంలో ఉంటూ క్రైస్తవులమని చెప్పుకునే మనవాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. అలాంటి స్త్రీపురుషులు ప్రార్థన చెయ్యకుండా రక్షించబడ్డట్లు భావించడం సాధ్యం కాదని నేను అంటున్నాను.

కృప ద్వారానే రక్షణ అని నమ్మేవాళ్లలో నేను ముందు ఉంటాను. లోకంలో ఉన్న అత్యంత ఘోరపాపికి కూడా పాపక్షమాపణ ఉంటుందని చెప్తాను. చావబోయేవాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ మంచం పక్కనే నించుని 'ఇప్పుడైనా యేసు క్రీస్తుని నమ్ముకోండి, రక్షింపబడతారు' అని చెప్పటానికి నేను ఏ మాత్రం వెనకాడను. కానీ, రక్షణ కోసం అడగకుండా ఒక వ్యక్తి రక్షింపబడతాడు అని బైబిల్ లో నాకు ఎక్కడ కనపడలేదు. పాపం ఒప్పుకోకుండా, మనస్ఫూర్తిగా ‘యేసు ప్రభువా, నాకు రక్షణ ఇవ్వు’ అని అడగకుండా, ఒక వ్యక్తి పాపాలు క్షమించబడతాయి అని కూడా బైబిల్ లో లేదు. ప్రార్థనల వలన మాత్రమే ఎవ్వరూ రక్షింపబడలేరని బైబిల్ లో ఉంది కానీ, ప్రార్థన చేయకుండా ఎవరైనా రక్షింపబడతారని ఎక్కడా లేదు.

ఒక వ్యక్తి రక్షింపబడటానికి బైబిల్ ఖచ్చితంగా చదవాలి అని ఏమీ లేదు. ఎందుకంటే ఎంతోమందికి చదువు రాదు. కొంతమందికి చూపు ఉండదు. కానీ వారి హృదయాల్లో క్రీస్తు ఉండవచ్చు. సువార్త కూడికలకు వెళ్తేనే ఒక వ్యక్తి రక్షింపబడతాడు అని కూడా లేదు. కొంతమంది సువార్త ప్రకటింపబడని చోట నివసిస్తున్నారు. కొంతమంది చెవిటివారున్నారు. మంచం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి హృదయాల్లో కూడా క్రీస్తు ఉండవచ్చు. ఎందుకంటే చదవటానికి, వినటానికి ప్రత్యామ్నాయాలు ఉండొచ్చేమో కానీ, ప్రార్థన విషయంలో మాత్రం ఇలా కాదు. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే అతను ఖచ్చితంగా ప్రార్థన చెయ్యల్సిందే.

ఆరోగ్యం, జ్ఞానం వీటి విషయాల్లో దొడ్డిదారులు ఉండవు. ప్రధానులు, రాజులు, బీదవాళ్లు, రైతులు వీళ్ళు ఎవరైనా సరే వారి మానసిక, శారీరక అవసరాలను వాళ్ళే చూసుకోవాలి. తమకు బదులుగా ఇంకొకరిని తినమని త్రాగమని నిద్రపొమ్మని ఎవ్వరూ ఎవ్వర్నీ కోరలేరు. నా బదులు వేరొకరు చదువు నేర్చుకుంటే నేను నేర్చుకున్నట్లు కాదు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు నేర్చుకుని, చేసుకోవలసినవే. లేదంటే వాళ్ళకి అవి ఇక రావు అనే చెప్పాలి.

మానసిక, శారీరక విషయాల్లాంటిదే ఆత్మ కూడా. ఆత్మ యొక్క ఆరోగ్యం, ఆలనా పాలనా చూసుకోవటానికి కూడా ఖచ్చితంగా చెయ్యాల్సిన కొన్ని పనులున్నాయి. ఎవరికోసం వాళ్ళు ఇవి తప్పకుండా చెయ్యాల్సిందే. ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ, మారుమనస్సు పొందాలి, క్రీస్తు వైపు తిరగాలి, ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చెయ్యాలి. ఇవన్నీ ఎవరికి వారు చెయ్యాలి కానీ మన కోసం వేరే వాళ్ళు చెయ్యలేరు. ప్రార్థన లేకుండా ఉండటం అంటే దేవుడు, క్రీస్తు, కృప, నిరీక్షణ, పరలోకం ఇవన్నీ లేకుండా ఉన్నట్టే, నరకానికి వెళ్ళే దారిలో ఉన్నట్టే(రక్షించబడనట్లే); ఇప్పుడు అర్థం అవుతుందా నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని ఎందుకు అడిగానో?

2. ప్రార్థించే అలవాటు నిజమైన క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండవలసిన లక్షణం. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని మళ్ళీ అడుగుతున్నాను? ఈ విషయంలో దేవుని పిల్లలందరూ సమానమే. దైవభక్తి వారిలో నిజంగా ప్రారంభమైన(రక్షించబడిన) క్షణం నుండే వారు ప్రార్థన చేస్తారు. ఈ లోకంలోకి ఒక శిశువు పుట్టగానే చేసే మొదటి పని శ్వాస తీసుకోవటం. అదే ఆ ప్రాణి ఉనికికి గుర్తు. అలాగే తిరిగి జన్మించిన తర్వాత ఒక విశ్వాసి మొదటిగా చేసే పని ప్రార్థన.

దేవుడు ఎన్నుకున్నవారందరిలో ఇది మనం చూసే గుర్తు. "వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తారు " (లూకా 18:1). వాళ్ళని నూతనసృష్టిగా చేసిన పరిశుద్ధాత్మ వారిలో పనిచేస్తూ , వారు దేవుని పిల్లలుగా స్వీకరించబడ్డారని వారిని ఒప్పించి అబ్బా తండ్రి అని మొరపెట్టేలా వారిని నడిపిస్తాడు (రోమా8:15). యేసుప్రభువు వారిని సజీవులుగా చేసినప్పుడు వారికి స్వరాన్ని నాలుకని అనుగ్రహించి ఇక మౌనంగా ఉండొద్దు అని సెలవిచ్చాడు. దేవునితో మాట్లాడని పిల్లలెవరూ దేవునికి ఉండరు. చంటిపిల్లవాడికి ఏడుపు, దేవుని పిల్లలకి ప్రార్థన స్వభావపూర్వకంగానే ఉంటాయి. వారికి కనికరము, కృప అవసరమని తెలుసుకుని, వారిలో ఉండే శూన్యత మరియు బలహీనత గుర్తిస్తారు. కాబట్టి వారు ప్రార్థించటం తప్ప మరేమీ చెయ్యలేరు.

బైబిల్ లో ఉండే భక్తుల జీవితాలను నేను క్షుణ్ణంగా పరిశీలించాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన లేని వ్యక్తిగా ఏ భక్తుడి జీవితాన్నీ నేను చూడలేదు. "మన తండ్రైన దేవుని నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించువారికి" (1 పేతురు 1:17). 'కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.'(1 కొరింథీయులకు1:2) అంటూ దేవుని పిల్లలు స్వభావికముగా ప్రార్థించటాన్ని బైబిల్ లో రాయబడటం చూశాను. "యెహోవాకు ప్రార్థన చెయ్యనివారు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు" (కీర్తన 14:4) అని ప్రార్ధన చెయ్యకపోవటం దుష్టుల లక్షణంగా రాయబడటం చూశాను.

బైబిల్ కాలం నుండి ఇప్పటి వరకూ ఎంతోమంది ప్రముఖ క్రైస్తవుల జీవితచరిత్రల్ని నేను చదివాను. వారిలో కొంతమంది డబ్బున్నోళ్ళు, కొంతమంది లేనోళ్ళు. కొంతమంది చదువుకున్నోళ్ళు, కొంతమంది చదువులేనోళ్ళు. వారిలో కొందరు బిషప్పులకు చెందినవాళ్ళు, కొందరు ఇతర పేర్లతో ఉన్న క్రైస్తవులు. కొంతమంది కాల్వినిస్టులు, కొంతమంది ఆర్మీనియనులు. కొంతమంది ప్రార్థనా పుస్తకాలు వినియోగించేవాళ్లు, మరి కొందరు అలాంటి విధానాలు వినియోగించనివాళ్లు. కానీ వాళ్లందరిలో ఒక్క విషయం మాత్రం సాధారణంగా చూశాను. వాళ్ళందరూ ప్రార్థనాపరులే.

మన కాలంలో ఉండే క్రైస్తవ మిషనరీ నివేదికలను కూడా నేను పరిశీలించాను. ప్రపంచ నలుమూలల్లో ఎంతోమంది స్త్రీపురుషులకి సువార్త అందుతుందని చూసి సంతోషిస్తున్నాను. ఆఫ్రికా, న్యూజిల్యాండ్, ఇండియా, చైనా దేశాల్లో ఎంతోమంది మారుమనస్సు పొందుతున్నారు. వారందరిలో దాదాపు అన్ని విషయాలలో వ్యత్యాసాలు కనబడటం స్వాభావికమే. కానీ అన్ని మిషనరీ కేంద్రాల్లోనూ నేను గమనించిన సమాన విషయం, మారుమనస్సు పొందిన వాళ్ళంతా ప్రార్థన చెయ్యటం. ఒక వ్యక్తి నిజాయితీ లేకుండా వ్యతిరేక హృదయంతో కూడా ప్రార్థన చేసే అవకాశముంది అనటాన్ని నేను కాదనను. ఒక వ్యక్తి ప్రార్థనే అతని ఆత్మీయజీవితం అంతటి గురించి నిరూపిస్తుందని నేను అనటంలేదు. ఇతర భక్తి క్రియలలో లాగే ఇందులో కూడా మోసం, వేషధారణ ఉండే ప్రమాదం ఉంది.

అయితే ప్రార్థన చేయకపోవటం ఒకడు నిజ క్రెస్తవుడు కాదనడానికి స్పష్టమైన రుజువు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వారి పాపాల్ని వారు గ్రహించరు, దేవుణ్ణి ప్రేమించలేరు, వారు క్రీస్తుకి ఋణస్థులని భావించరు. వారు పరిశుద్ధతను కోరలేరు. పరలోకంపై ఆశ కలిగి ఉండలేరు, వారు ఇంకా తిరిగి జన్మించలేదు, వారు ఇంకా నూతనసృష్టిగా చెయ్యబడలేదు. వారి ఎన్నిక, కృప, విశ్వాసం, నిరీక్షణ, జ్ఞానం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇతరుల్ని మోసం చేస్తారేమో కానీ వారు ప్రార్థన చెయ్యనివారైతే అవన్నీ వట్టి మాటలే.

ఇంకా చెప్పాలంటే యథార్థంగా ప్రార్థన చేసే అలవాటు ఒక వ్వక్తిలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తున్నాడు అనటానికి ఎంతో సంతృప్తికరమైన నిదర్శనం. కొంతమంది చెడ్డ ఉద్దేశాలతో కూడా బోధ చేయవచ్చు. పుస్తకాలు రాస్తూ, గొప్ప ప్రసంగాలు చేస్తూ, సత్క్రియలయందు ఆసక్తిగలవారుగా కనపడవచ్చు కానీ వాళ్లే యూదా ఇస్కరియోతులు అవ్వవచ్చు. అయితే ఒక వ్యక్తి యథార్థత లేకుండా తన గదిలోనికి వెళ్లి రహస్యంగా దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరించటం మాత్రం సాధ్యం కాదు. మారుమనస్సుకు నిజమైన ఆధారంగా ప్రార్థనపై దేవుడే తన ముద్ర వేసాడు. దమస్కులో ఉన్న సౌలు కోసం అననీయను పంపినపుడు పౌలు మారుమనస్సు పొందాడు అనటానికి ఆధారంగా "ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు" (అపొస్తలుల కార్యములు 9:11). అని తప్ప వేరే నిదర్శనమేమి చూపించ లేదు.

ఒక వ్యక్తి ప్రార్థన చేయటానికి ముందు అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు కలుగుతాయని నాకు తెలుసు. అతని హృదయంలో ఎంతో అపరాధ భావం ,ఎన్నో ఆశలు, కోరికలు, ఉద్దేశాలు, భావాలు, నిరీక్షణలు, నిర్ణయాలు, భయాలు ఉండవచ్చు. కానీ ఇవేవీ యథార్థతకు ఖచ్చితమైన నిదర్శనాలు కావు. ఇవన్నీ తరచుగా భక్తిహీనులలో కూడా కనబడతాయి. చాలాసార్లు అవి నిష్ఫలంగానే మిగిలిపోతాయి. చాలామట్టుకు అవి పొద్దున్నే వచ్చే మేఘంలాగ, అప్పుడే మాయమయ్యే మంచులాగా వెంటనే సమసిపోతాయి. అయితే విరిగినలిగిన హృదయం నుండి వచ్చే యథార్థమైన ప్రార్థన వీటన్నిటికంటే విలువైనది.

పాపులను వారి మార్గాల నుండి పిలిచిన పరిశుద్ధాత్మ వారిని క్రీస్తుతో సాన్నిహిత్యంలోనికి మెల్లి మెల్లిగా అంచెలంచెలుగా నడిపిస్తాడని నాకు తెలుసు. కానీ ఒక మానవుని కన్ను అది చూసినవాటిని బట్టి మాత్రమే తీర్పు తీర్చగలదు. విశ్వసించనిదే నీతిమంతునిగా తీర్చబడ్డాడని కానీ, ప్రార్థించనిదే విశ్వసిస్తున్నాడని కానీ ఎవరి గురించి నేను చెప్పలేను, మూగవిశ్వాసం అంటూ ఏది ఉండదు. దేవునితో మాట్లాడటమే విశ్వాసం చేసే మొదటి క్రియ. శరీరానికి ప్రాణం ఎలాంటిదో ఆత్మకు విశ్వాసం కూడా అలాంటిదే. శరీరానికి శ్వాస ఎలాంటిదో విశ్వాసానికి ప్రార్థన కూడా అలాంటిదే - ఒక మనిషి శ్వాస తీసుకోకుండా బ్రతకటం నా ఊహకి అందని విషయం అలాగే ఒక మనిషి ప్రార్థన చేయకుండా విశ్వాసిగా ఉండటం కూడా నా ఊహకి అందని విషయమే.

సువార్తీకులు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఎక్కువగా చెప్పినప్పుడు ఆశ్చర్యపోవద్దు. ఈ విషయాలను గురించి నిన్ను ఒప్పించటానికే వారు అలా చేస్తున్నారు. నువ్వు ప్రార్థస్తున్నావా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాక్యంపై నీకున్న అవగాహన సరిగ్గానే ఉండవచ్చు, ప్రొటెస్టెంట్ విశ్వాసాలపైనా నీకున్న ప్రేమ, పట్టుదల ఎంతో ప్రస్ఫుటంగా కడపడవచ్చు. కానీ అదంతా నీ మెదడుకు పరిమితమైన జ్ఞానం మరియు నీకు చెందిన శాఖ పైన ఉన్న అభిమానం మాత్రమే అయ్యుండే ప్రమాదం ఉంది. అందుకే మీకు కృపా సింహాసనంతో పరిచయం ఉందో లేదో, దేవుని గురించి మాట్లాడే అంతగా దేవునితో మాట్లాడగలవో లేదో వారు తెలుసుకోవాలి అనుకుంటున్నారు.

3. విశ్వాసి జీవితంలో వ్యక్తిగత ప్రార్థనకంటే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురైయ్యే బాధ్యత వేరొకటి లేదు కాబట్టి, నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతున్నాను? బహిరంగ విశ్వాసం బహుగా విస్తరించిన దినాల్లో మనం ఉన్నాం. ముందెన్నడూ లేనంతగా ప్రార్థనాకూటాలు జరుగుతున్నాయి. మునుపటి కంటే ఎంతో ఎక్కువమంది వాటికి హాజరవుతున్నారు. ఈ బహిరంగ భక్తి ఎంతగా విస్తరించినప్పటికీ వ్యక్తిగత ప్రార్థన ఎంతో నిర్లక్ష్యానికి గురి అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇది మనకి దేవుడికి మధ్యలో ఎవరూ చూడకుండా నడిచే ఒక రహస్య సహవాసం. ఇది ఇంకెవరూ చూసేది కాదు కాబట్టి దీనిని ఆలక్ష్యపెట్టే బలమైన శోధనగా చాలామందికి కలుగుతుంది.

వందల వేల మంది ఒక చిన్న మాట కూడా ప్రార్థన చేయకుండా ఉంటారని నేను నమ్ముతున్నాను. వారు తింటారు, త్రాగుతారు, పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, పనులకు వెళ్తారు, తిరిగి ఇళ్లకు వస్తారు, దేవుడిచ్చిన గాలినే పీలుస్తారు, ఆయన భూమిపైనే నడుస్తారు, ఆయన కనికరాన్నే అనుభవిస్తారు, మరణించే శరీరాలను కలిగి ఉన్నారు, తీర్పు, నిత్యత్వం వారి ముందు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడూ దేవునితో మాట్లాడరు, నశించిపోయే జంతువుల్లాగే జీవిస్తారు, ఆత్మలేని ప్రాణుల్లా ప్రవర్తిస్తారు. ఎవరి చేతుల్లో అయితే వారి ప్రాణం, శ్వాస, సమస్తం ఉన్నాయో, ఎవరి నోటి నుండి అయితే వారి చివరి తీర్పు వినబోతున్నారో ఆయనతో మాట్లాడటానికి వాళ్ళ దగ్గర ఒక్క మాట కూడా లేదు. ఇది ఎంత భయంకరమైన విషయం? కానీ మనుష్యుల రహస్యాలు రోజూ బయటకి తెలిస్తే ఇది ఎంతో సాధారమైన విషయం.

వందల వేల మంది కేవలం ఆచారంగా కొన్ని ప్రార్థనలు వల్లెవేస్తూ ఉంటారు. అర్థం కూడా ఆలోచించకుండా, కంఠతా చేసుకున్న మాటలను అలవాటుగా పలుకుతూ ఉంటారు. కొంతమంది చిన్నప్పుడు నేర్చుకున్న పదాలతో ప్రార్థన ముగించేస్తుంటారు. కొందరు కేవలం వారి విశ్వాస ప్రమాణాన్ని వల్లెవేయడంతో సరిపెట్టుకుని అందులో ప్రార్థన ఏమిలేదనే సంగతి మర్చిపోతారు. కొందరు దాని చివర పరలోక ప్రార్థనను జోడిస్తారు, కానీ అందులో ఉన్నగంభీరమైన విషయాలు నెరవేరాలనే కోరిక మాత్రం వారిలో ఉండదు.

కొందరు కంఠతా చేసుకున్న ప్రార్థనలు మంచివే అయినా, వారు రాత్రి పడుకుంటునప్పుడు లేదా ఉదయం హడావుడిగా తయారయేటప్పుడు మనస్సు పెట్టకుండా ఊరికే వాటిని నోటితో వల్లెవేస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా సరే దేవుని దృష్టిలో మాత్రం అది ప్రార్థన కాదు. హృదయం నుండి రాని మాటలు ఆటవికులు తమ విగ్రహాల ముందు వాయించే డప్పులలాగే మన ఆత్మకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చవు. హృదయపూర్వకంగా చేయకపోతే అది పెదవుల చేసే పని లేదా నాలుక చేసే పని మాత్రమే అవుతుంది కానీ ప్రార్థన అనిపించుకోదు. దమస్కుకి వెళ్ళే దారిలో ప్రభువు అతన్ని కలిసే ముందు సౌలు ఎన్నోసార్లు ప్రార్థనలు వల్లించి ఉంటాడు అనడంలో నాకు ఏ సందేహమూ లేదు. కానీ అతని హృదయము విరువబడేంత వరకు "ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు" అని ప్రభువు సాక్ష్యం ఇవ్వలేదు.

ఇది నీకు వింతగా ఉందా? నా మాట విను, నేను కారణం లేకుండా మాట్లాడట్లేదు అని నీకు చూపిస్తాను. నేను చెప్పే విషయాలు అతిగాను, అన్యాయంగాను ఉన్నాయని నువ్వు భావిస్తున్నావా? శ్రద్ధగా విను, నేను నీకు నిజమే చేప్తున్నానని ఇప్పుడే నీకు నిరూపిస్తాను. ప్రార్థంచటం ఎవ్వరికీ సహజగుణం కాదని మర్చిపోయావా? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. మనిషి హృదయాలోచన దేవునికి దూరంగా ఉండాలని ఆశ పడుతుందే గాని దేవునిసంబంధిగా ఉండాలనుకోదు. దేవుడంటే వాళ్ళకి భయమే తప్ప మరేం లేదు. పాపం మీద సరైన అవగాహన, ఆత్మీయ అవసరాలు, చూడనివాటి మీద నమ్మకం, పరిశుద్ధత, పరలోకం మీద ఆశ, ఇవేమీ లేనప్పుడు వాళ్ళు ఎందుకు ప్రార్థిస్తారు? వీటన్నిటి మీద ఎక్కువశాతం మందికి ఎటువంటి అవగాహన ,ఆశ ఉండదు. విశాలమార్గంలో నడిచేవారు అనేకులు అని నేను మర్చిపోలేను. అందుకే చాలా తక్కువమంది ప్రార్థన చేస్తారని ధైర్యంగా ప్రకటిస్తున్నాను.

ప్రార్థంచటం అనేది ఫ్యాషన్ కాదని మర్చిపోయావా? చాలామంది చెప్పుకోవటానికి సిగ్గుపడే విషయాల్లో ఇది ఒకటి. నిరసనలు తెలపటానికి, ప్రజాఉద్యమాలు నడిపించటానికి వందలమంది ముందుకొస్తారేమో కానీ, మాకు ప్రార్థించే అలవాటుందని బహిరంగంగా ఒప్పుకోవటానికి మాత్రం వారు జంకుతారు. పరిచయం లేనివారితో ఒకే గదిలో ఉండాల్సి వచ్చిన్నపుడు ప్రార్థన చెయ్యకుండానే నిద్రపోయేవారు వేల సంఖ్యలో ఉన్నారు. అందంగా డ్రస్ చేసుకోవటం, థియేటర్ కి వెళ్ళటం, అందరి మెప్పు పొందటం, తెలివిగా కనిపించాలనుకోవటం, ఇవన్నీ ఫ్యాషన్ అవుతాయి కానీ ప్రార్థన చెయ్యటం ఫ్యాషన్ కాదు. ఇది నేను మర్చిపోలేను. ఎక్కువమంది ఒప్పుకోవటానికి సిగ్గుపడే విషయాన్ని అందరికి ఉన్న సాధారణ అలవాటుగా నేను భావించలేను. అందుకే చాలా తక్కువమంది ప్రార్థన చేస్తారని నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను.

అనేకుల జీవితాలు ఎలా ఉన్నాయో నువ్వు మర్చిపోయావా? పాపంలోనే మునిగి తేలుతున్న మనుషులు రాత్రి, పగలు పాపానికి వ్యతిరేకంగా ప్రార్థిస్తున్నారని నిజంగా నమ్మగలమా? లోకాశలనే వెంబడిస్తూ,వాటికి వ్యతిరేకంగా ప్రార్థిస్తున్నారంటే నమ్మగలమా? దేవుని సేవ పట్ల ఎలాంటి ఆసక్తి లేనివారు సేవ కొరకు కృపను వేడుకుంటున్నారని నమ్మగలమా? ఏమాత్రం నమ్మలేము. ఇక్కడ చాల స్పష్టంగా తెలిసేదేమిటంటే, చాలామంది ప్రజలు దేవుని నుండి ఏమి అడగరు లేదా వారు ఏమి అడుగుతున్నారో అది వారి అసలు ఉద్దేశం కాదు; ఈ రెండు ఒక్కటే. ప్రార్థన, పాపం ఒకే హృదయంలో కలిసి ఉండలేవు. ప్రార్థన పాపాన్ని అణిచివేస్తుంది లేదా, పాపం ప్రార్థనని ఆటంకపరుస్తుంది. ఇది నేను మర్చిపోలేను. నేను వారి జీవితాల్ని చూస్తున్నప్పుడు చాల తక్కువమంది ప్రార్థన చేస్తారని ధైర్యంగా ప్రకటించగలను.

చనిపోయిన ఎంతోమంది చావుల్ని నువ్వు మర్చిపోయావా? మరణానికి చేరువై వారి చివరి గడియలో కూడా ఎంతమంది దేవుడికి పూర్తిగా అపరిచితులుగా ఉన్నారు. వారికి ఆయన సువార్త తెలియకపోవటమే కాదు ఆయనతో మాట్లాడే సామర్థ్యం కూడా లేక పోవటం ఎంతో బాధాకరమైన విషయం. ఆయనని చేరుకోవాలనే వారి ప్రయత్నాల్లో ఎంతో భయంకరమైన వికారం, సిగ్గు కనిపిస్తుంటాయి. వాళ్ళేదో కొత్త పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దేవుడికి వారికి ఏదో పరిచయం అవసరం అన్నట్టుగాను, ఇంతకు ముందెప్పుడూ ఆయనతో మాట్లాడలేదన్నట్టుగాను కనిపిస్తారు. ఒక విషయం నాకు గుర్తు వస్తుంది. చనిపోతున్న రోజుల్లో ఒక సువార్తికుడిని తన వద్దకు పిలిపించుకోవటానికి ఆతృత చూపింది ఒకామె. ఆ సువార్తీకుడు ఆమె కోసం ప్రార్థన చేస్తాడు అనుకున్నది. ఏమని ప్రార్థన చెయ్యమంటావమ్మా అని ఆ సువార్తికుడు అడిగాడు. ఆమెకి తెలియదు కాబట్టి ఏమీ చెప్పలేకపోయింది. తన ఆత్మకు దేవుని నుండి ఏమి అవసరమో ఆమె ఒక్కటి కూడా చెప్పలేకపోయింది. ఆమెకి కావాల్సిందల్లా ఒక పరిచారకుని లాంఛనప్రాయమైన ప్రార్థనలు మాత్రమే. నేనిది అర్థం చేసుకోగలను. చావు పడకలు రహస్యాల్ని బట్టబయలు చేస్తాయి. అనారోగ్యంతో చనిపోతున్నవారి దగ్గర నేను చూసినవి మర్చిపోలేను. చాలా తక్కువమందే ప్రార్థిస్తారు అని నేను నమ్మటానికి ఇవి నన్ను బలవంతపెడుతున్నాయి.

నేను నీ హృదయాన్ని చూడలేను. ఆత్మీయ విషయాల్లో నీ వ్యక్తిగత చరిత్ర నాకు తెలియదు. కానీ బైబిల్ నుండి నేను ఏమి చూశానో, బయట ప్రపంచంలో ఏమి జరగటం చూశానో దానిని బట్టి నేను నిన్ను ఇంతకంటే అవసరమైన మరో ప్రశ్న అడగలేను – నువ్వు ప్రార్థన చేస్తున్నావా?

4. ప్రార్థన గొప్ప ప్రోత్సాహం ఇవ్వబడిన భక్తి కార్యం. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతున్నాను? ప్రార్థనకు అనుకూల పరిస్థితులు అనుగ్రహించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అన్ని అడ్డంకులు ఆయనకు ముందే తెలుసు. ప్రతి సమస్యకు ఆయన వద్ద పరిష్కారం ఉంది. వంకరవి చక్కగాను కరుకైనవి సమానంగాను చేయ్యబడతాయి. ప్రార్థన చేయని వ్యక్తికి సాకులు చెప్పే అవకాశమే లేదు.

ఎంత పాపి అయిన సరే ఎంత అయ్యోగుడైన సరే ప్రతి ఒక్కరు తండ్రిని సమీపించడానికి ఒక మార్గం అందుబాటులో ఉంది. సిలువలో తను చేసిన త్యాగం ద్వారా యేసుక్రీస్తు ఆ మార్గాన్ని మనకోసం తెరిచాడు. దేవుని పరిశుద్ధత మరియు న్యాయం చూసి పాపులు భయపడి వెనక్కి వెళ్ళక్కర్లేదు. వారు యేసు నామంలో దేవుని వేడుకుంటే చాలు అయన తన కృపాసింహాసనం నుండి వారి మాటలు వినటానికి సంసిద్ధంగా కనిపిస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం చేసే ప్రార్థనలకి యేసునామం ఎప్పుడు తిరుగులేని పాస్పోర్ట్ లాంటిది. ఆ నామములో ఒక వ్యక్తి దేవున్ని ధైర్యంగా సమీపించి విశ్వాసంతో అడగవచ్చు. దేవుడు ఆ ప్రార్థన వింటానని వాగ్దానం చేసాడు. ఆలోచించు, ఇది గొప్ప ప్రోత్సాహం కాదా?

ఆయన ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళ ప్రార్థనలను దేవునికి చేరవెయ్యటానికి ఎల్లప్పుడూ ఎదురుచూసే ఒక విజ్ఞాపనకర్త , ఒక ఉత్తరవాది మనకు ఉన్నాడు. యేసుక్రీస్తే ఆ విజ్ఞాపనకర్త. ఆయన మన ప్రార్థనలను తన సర్వశక్తిగల మధ్యవర్తిత్వపు విజ్ఞాపనాధూపంతో కలుపుతాడు. అలా కలపబడి అవి ఇంపైన సువాసనగా దేవుని కృపా సింహాసనాన్ని చేరుకుంటాయి. మన ప్రధానయాజకుడైన ఆయన చేతిలో అవి ఎంతో బలమైనవి, శక్తిమంతమైనవిగా మారుతాయి. సంతకం లేని చెక్ విలువలేని తెల్ల కాగితంతో సమానం. కానీ దాని మీద పెన్నుతో పెట్టిన సంతకం దానికి విలువనిస్తుంది. ఆదాము యొక్క పేద సంతతివారి ప్రార్థన కూడా విలువలేనిదే కానీ, ఒకసారి ప్రభువైన యేసు క్రీస్తు హస్తం ద్వారా ఆమోదించబడిన తర్వాత అది ఎంతో విలువైనది అవుతుంది. రోమ్ నగరంలో పౌరులకు ఏ సహాయం కావాలన్నా చేయటానికి తన ద్వారాలు ఎప్పుడు తెరిచి వుంచేలా ఒక అధికారిని నియమించేవారు. అలాగే సహాయం కోసం అర్థించేవారి మొర వినటానికి ప్రభువైన యేసుక్రీస్తు చెవులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. వారికి సహాయం చెయ్యటానికి అయన నియమించబడ్డాడు. వారి ప్రార్థన ఆయనకి ఆనందం. ఆలోచించు, ఇది గొప్ప ప్రోత్సాహం కాదా?

ప్రార్థించటంలో మన బలహీనతను చూసి సహాయం చెయ్యటానికి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవునితో మాట్లాడటానికి మనం చేసే ప్రయత్నాల్లో మనకు సహాయం చెయ్యటం ఆయన చేసే ప్రత్యేక కార్యాలలో ఒకటి. ప్రార్థనలో ఏమి మాట్లాడాలో తెలియని భయంతో మనం నిరాశ చెందనవసరం లేదు. పరిశుద్ధాత్మే ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఆయనే మనలో నివసించే కరుణనొందించే ఆత్మ మరియు విజ్ఞాపన చేసే ఆత్మ కాబట్టి ప్రార్థన చేయటానికి ఆయనే సహాయం చేస్తాడు. దేవుని ప్రజల విజ్ఞాపనలు తప్పకుండా దేవుడు వింటాడని దీనిని‌ బట్టి నిరీక్షించవచ్చు. ఇది గొప్ప ప్రోత్సాహం కాదా?

ప్రార్థించేవారికి అమూల్యమును అత్యధికమును అయిన వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి “అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువారికి దొరుకును, తట్టువానికి తీయబడును” (మత్తయి 7:7,8) “మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినయెడల మీరు వాటన్నిటిని పొందుదురు” (మత్తయి 21:22). “మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును” (యోహాను 14:13,14) ఈ మాటలు చెప్పటంలో ప్రభువైన యేసు క్రీస్తు ఉద్దేశం ఏమిటి?

మొదటి యోహాను 5:13,14 - ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మనమెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. ఆయన స్వభావాన్ని బట్టి ప్రార్థించడానికి ఇవన్నీ మనకి ప్రోత్సాహంగా ఉన్నాయని అర్థం అవుతుంది.

ప్రార్థనాశక్తిని చూపించే అద్భుతమైన ఉదాహరణలు లేఖనాలలో ఎన్నో ఉన్నాయి. దైవామోదిత ప్రార్థనలు సాధించలేనంత గొప్పవి, కఠినమైనవి, కష్టమైనవి, ఏమి లేవు. అసాధ్యమైనవి మరియు అందుకోలేనివి అనిపించేవెన్నో దైవామోదిత ప్రార్థన సాధ్యపరచింది. నీరు, నిప్పు, గాలి, నేల పై కూడా ప్రార్థన విజయాలు సాధించింది. ప్రార్థన ఎర్రసముద్రాన్ని పాయలు చేసింది. ప్రార్థన బండ నుండి నీటిని, ఆకాశం నుండి ఆహారాన్ని తెచ్చిపెట్టింది. ప్రార్థన సూర్యుడిని నిలిచిపోయేలా చేసింది. ప్రార్థన వల్ల ఏలియా ఇచ్చిన బలికి ఆకాశం నుండి అగ్ని దిగింది. ప్రార్థన అహీతోపేలు ఆలోచనను చెడగొట్టింది (2 సమూయేలు 15:31). ఆలోచించు, ఇటువంటి సంఘటనలన్నీ ప్రార్థనకు గొప్ప ప్రోత్సాహం కాదా?

ప్రార్థన గురించి నేను మీకు చెప్పిన సంగతుల కంటే దైవభక్తిలో ముందడుగు వేసేలా ఒక వ్యక్తిని ఏం ప్రోత్సహించగలదు? ఒక పాపి కరుణాపీఠం వద్దకు రావటానికి అవరోధాలన్నీ తొలగించి మార్గం సరాళం చెయ్యటానికి ఇంత కంటే ఏం చేయగలం? ఒకవేళ నరకంలో ఉన్న దెయ్యాలకి ఇలాంటి ద్వారం తెరువబడితే పాతాళమే మారుమోగేలా వారు ఆనందంతో గంతులు వేసుండేవారు. ఇటువంటి అద్భుత ప్రోత్సాహాలను నిర్లక్ష్యం చేసిన వ్యక్తి చివర్లో తన తల ఎక్కడ దాచుకుంటాడు? ఇంత చెప్పినా కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేయకుండా చనిపోతే ఇక ఏం చెప్పగలం? నువ్వు ఆ వ్యక్తి కాకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అని తప్పకుండా అడుగుతాను.

5. ప్రార్థనకు చూపించే శ్రద్ధ లోతైన పరిశుద్దతకు రహస్యం. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతున్నాను? నిజమైన క్రైస్తవుల్లో ఎన్నో బేధాలున్నాయి అనటం వివాదాస్పదం కాదు. దేవుని సైన్యంలో ముందు వరుసలో ఉన్నవారికీ మరియు వెనుక నడిచేవారికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. వారందరూ మంచి పోరాటమే పోరాడుతున్నారు కానీ కొందరిని మించిన శౌర్యం మరికొందరిలో కనపడుతుంది. అందరూ దేవుని పని చేస్తున్నారు కానీ ఇతరుల కంటే కొందరు ఎక్కువ చేయగలుగుతున్నారు. వారందరు ప్రభునందు వెలుగై ఉన్నారు. కానీ కొందరు ఇతరుల కంటే ఎక్కువ వెలుగును ప్రసరింపజేస్తున్నారు. వారంతా ఒకే పందెంలో పరుగెడుతున్నారు. కానీ కొంతమంది ఇతరులకంటే ఎక్కువ వేగంగా పరుగెడుతున్నారు. వారంతా ఒకే ప్రభువుని,రక్షకుడిని ప్రేమిస్తున్నారు. కానీ ఇతరులకంటే కొంతమంది ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇలా జరుగుతుందా లేదా అని నేను నిజ క్రైస్తవులందరినీ అడుగుతున్నాను. ఇదంతా నిజం కాదా?

కొంతమంది, దేవుడు వారి రక్షణ కొనసాగించే క్రమంలో వారి బాధ్యత విషయంలో వెనకడుగు వేస్తుంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఎదిగేవారిగా కనబడతారు. వర్షం తర్వాత మొలిచిన గడ్డిలా పెరుగుతారు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల్లా వృద్ధి చెందుతారు. వారు గిద్యోనువలే ముందుకు సాగుతారు. ఒక్కోసారి సొమ్మసిల్లినా ముందుకే సాగుతారు. వారు కృప నుండి అధికకృపకు, విశ్వాసము నుండి అధికవిశ్వాసానికి విశ్వాసం కలుపుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళని ఎప్పుడు కలిసినా వారి హృదయం మరింత విశాలంగా, వారి ఆత్మీయ ఎదుగుదల మరింత ఎత్తుగా, బలంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వారు దైవభక్తిలో అధికం అవుతారు, అధికంగా దానిని అనుభవిస్తారు. వారి విశ్వాసాన్ని నిరూపించుకునే సత్క్రియలు చెయ్యటమే కాకుండా వాటియందు ఆసక్తి కూడా కలిగి ఉంటారు. వారు మంచి చేయటం మాత్రమే కాదు విసుగక మంచి చేస్తారు. గొప్పవాటికై ప్రయత్నిస్తారు, గొప్ప పనులు చేస్తారు. విఫలమైనప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తారు. పడిపోయినప్పుడు వెంటనే పైకి లేస్తారు. అయినప్పటికీ వారి గురించి వారు తక్కువగా, నిష్ప్రయోజకులైన దాసులుగా , ఏమి చెయ్యనివారిగా భావిస్తారు. ఇలాంటి వాళ్ళే దైవభక్తిని ఇతరుల కంటికి ఇంపుగా అందంగా కనిపించేలా చేస్తారు. వారు మారుమనస్సు పొందనివారి మన్ననలు సహితం పొందుతూ, లోకంలోని స్వార్ధపరుల దగ్గర కూడా మంచి అభిప్రాయాన్ని సంపాదించుకుంటారు. వారిని చూడటం , వారితో ఉండటం, వారి మాటలు వినటం మంచి అనుభూతినిస్తుంది. వారిని కలిసినపుడు ఇప్పుడే దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చిన మోషేను కలిసినట్లుగా అనిపిస్తుంది. మీ ఆత్మ అగ్ని పక్కనే ఉన్నట్టు వారి తోడు మీకు వెచ్చగా అనిపిస్తుంది. అలాంటి వారు చాలా అరుదు అని నాకు తెలుసు, కానీ అలాంటి వారు లేరా అని మాత్రమే అడుగుతున్నాను?

నేనిప్పుడు వివరించిన తేడాలకు కారణమేంటి? కొంతమంది ఇతర విశ్వాసుల కంటే ఎంతో పరిశుద్ధంగా, ప్రకాశంగా ఉండటానికి కారణమేంటి? 20 లో 19 సార్లు వ్యక్తిగత ప్రార్థన అలవాట్లే ఈ వ్యత్యసానికి కారణం అని నేను నమ్ముతాను.ఎక్కువ పరిశుద్ధత గలవారు ఎక్కువగాను ఎక్కువగాను, పరిశుద్ధత లేనివారు తక్కువగాను ప్రార్థిస్తారని నేను నమ్ముతున్నాను.

ఈ అభిప్రాయం వింటున్న కొందరిని ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుందని నాకు తెలుసు. గొప్ప పరిశుద్ధత అనేది ఒక ప్రతేక్య వరమని, కొందరు మాత్రమే దానిని సాధించగలరని చాలమంది నమ్ముతున్నట్లు నాకు తెలుసు. అలాంటి వారి గురించి పుస్తకంలో చదివి అభినందిస్తూ ఉంటారు. అలాంటివారు ఎవరైనా కనిపించినప్పుడు 'ఎంత బావుండో' అనుకుంటారు. కానీ అది తమలోనే ఎందుకు ఉండకూడదు అనే భావన మాత్రం వారికి రాదు. అదేదో కొంతమంది దేవునికి ఇష్టమైన భక్తులు మాత్రమే అనుభవించగలిగిన విషయంగానే అనుకుంటారు.

ఇది ఎంతో ప్రమాదకరమైన తప్పుడు అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. ఒక వ్యక్తి భౌతిక లేదా ఆధ్యాత్మిక గొప్పతనం చాలావరకు అతనికి అందుబాటులో ఉన్న వనరుల్ని ఎంత నమ్మకంగా ఉపయోగించాడనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అసాధారణ తెలివితేటల వరాన్ని పొందాలని కోరే హక్కు మనకు ఉందని నేను చెప్పట్లేదు. కానీ మారుమనస్సు పొంది దేవునిలో ఉన్న వ్యక్తి పరిశుద్ధతలో ఎదగటం అనేది దేవుని వనరులను ఎంత శ్రద్ధగా వినియోగించాడనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. క్రీస్తు సంఘంలో అనేకులను గొప్పవారిగా తీర్చిదిద్దింది ఆసక్తిగా ప్రార్థన చేసేవారి వ్యక్తిగత అలవాటే అని నేను చెప్పగలను. బైబిల్ లో కానీ బైబిల్ వెలుపల కాని దేవుని సేవకుల్లో ప్రకాశవంతులైన భక్తుల జీవితాలను చూడు. మోషే, దావీదు, దానియేలు, పౌలు గురించి ఏం రాయబడిందో చదువు. సంస్కర్తలైన లూథర్, బ్రాడ్ఫర్డ్ గురించి ఏం రాయబడిందో గమనించు. వైటీఫిల్డ్ , వెన్న్, సెసిల్, బీకర్స్టెత్, మెక్ ఛేన్ ల వ్యక్తిగత భక్తి జీవితాలను గమనించు. ఈ లక్షణం లేకుండా ఉన్న పరిశుద్ధులు, హత సాక్షుల సహవాసం ఏవైనా ఉంటే ఒకటి చెప్పగలవా? వాళ్ళంతా ప్రార్థనాపరులు.

ఆత్మ చేత నియంత్రించబడేవారంతా తప్పకుండా ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి హృదయంలో కృపాకార్యాన్ని ఆయనే మొదలుపెడతాడు. ఆయనే దాన్ని ముందుకు నడిపించి బలపరుస్తాడు. అయితే మనము ఆయనను వేడుకోవాలని పరిశుద్ధాత్మ ఇష్టపడుతున్నాడు. అధికంగా అడిగేవారు అధికంగా ఆయన ప్రభావాన్ని పొందుతారు. సాతానుని, సుళువుగా చిక్కులు పెట్టె పాపాలను ఎదిరించడానికి ప్రార్థనే ఖచ్చితమైన పరిహారం. హృదయపూర్వకంగా చేసే ప్రార్థన పాపంపై జయాన్ని‌ ఇస్తుంది. సాతానును పారద్రోలమని ప్రార్థన చేస్తే మనపై వాడు ప్రభుత్వం చేయలేడు. అయితే మనం ప్రతి రోజు ఈ విడుదల కొరకు మన పరిస్థితి అంతా మన పరమవైద్యుని ముందు ఉంచాలి.

నువ్వు కృపలో ఎదుగుతూ సమర్పణ కలిగిన క్రైస్తవుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నీకు నిజంగా ఆ కోరిక ఉంటే దీనికి మించిన ముఖ్యమైన ప్రశ్న మరొకటి లేదు – నువ్వు ప్రార్థన చేస్తున్నావా?

6. ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యటమే దైవభక్తికి దూరం అవటానికి పెద్ద కారణం, అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతున్నాను? ఒక వ్యక్తి తన భక్తి జీవితంలో మంచి పోరాటంతో కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత గలతీయుల్లాగా కొంతకాలం బాగానే పరుగెత్తి, తర్వాత అబద్దబోధకుల చేత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రజలు పేతురువలే బిగ్గరగా తమ విశ్వాసాన్ని ప్రకటించవచ్చు కానీ శ్రమల్లో వారి ప్రభువుని వారు తిరస్కరించవచ్చు. విశ్వాసులు ఇవ్వన్నీ చేసే అవకాశం ఉంది.

భక్తిలో దిగజారిపోవటం అనేది ఎంతో బాధాకరమైనది. ఒక వ్యక్తి ఎదుర్కునే బాధలన్నిటిలో ఇదే అత్యంత ఘోరమైనది. ఒంటరి అయిన ఓడ, రెక్కలు విరిగిన పక్షి, కలుపు మొక్కలతో నిండిన తోట, తీగలు తెగిన వీణ, నశించిపోయిన సంఘం, ఇవన్నీ విషాదకరమైన సన్నివేశాలే కానీ దిగజారటం/వెనకబడటం/పడిపోవటం అనేవి వీటన్నిటికంటే విచారకరమైనవి. గాయపడ్డ మనస్సాక్షి – అలసిన హృదయం– స్వీయ నిందాజ్ఞాపకాలు-దైవ బాణాలతో చీల్చి కుట్టబడిన హృదయం– అంతరంగ ఆరోపణలతో విరిగిన ఆత్మ- ఇవన్నీ నరకానుభూతులు. ఇది భూమిపైనే నరకం. జ్ఞాని చెప్పిన సామెత ఎంతో అర్థవంతమైనది. “భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును” (సామెతలు 14:14).

అయితే భక్తిలో దిగజారటానికి కారణమేంటి?సాధారణంగా, వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చెయ్యటమే దీనికి ముఖ్యకారణం. పడిపోవటం వెనక ఉన్న అసలు కారణాలు చివరిరోజు వరకు తెలుసుకోలేము అన్నది నిజమే. క్రీస్తు సువార్తీకునిగా, హృదయం ఎరిగినవానిగా నేను కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్పగలను. అదే అభిప్రాయాన్ని నేను విస్పష్టంగా మళ్ళీ చెప్తున్నాను. భక్తిలో దిగజారటం అనేది వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యటంతో మొదలవుతుంది. ప్రార్థన లేకుండా చదవబడిన బైబిళ్ళు, ప్రార్థన లేకుండా వినబడిన ప్రసంగాలు, ప్రార్థన లేకుండా చేయబడిన పెళ్ళిళ్లు, ప్రార్థన లేకుండా కొనసాగించిన ప్రయాణాలు, ఆత్రంగా ముగించిన లేదా హృదయ ప్రమేయం లేని అనుదిన ప్రార్థనలు, ఇవే ఎంతోమంది క్రైస్తవులు అధ్యాత్మికంగా పడిపోవటానికి లేదా దేవుడు వారిని పూర్తిగా పడిపోయే స్థితికి తీసుకురావటానికి దారితీసే జారుడు మెట్లు.

బహిరంగంగా పడిపోవటానికి ముందు వ్యక్తిగతంగా పడిపోతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. వారు లోకం ఎదుట దిగజారే ముందు మోకాళ్ళ మీద దిగజారుతారు. వారు మొదట పేతురువలె, మెళకువగా ఉండి ప్రార్థించమనే ప్రభు హెచ్చరికను నిర్లక్ష్యం చేసి శక్తిని కోల్పోతారు; శోధన ఘడియల్లో వారి ప్రభువుని తిరస్కరిస్తారు. లోకం వారి పతనాన్ని గమనిస్తుంది. బిగ్గరగా దెప్పిపొడుస్తుంది. కానీ లోకానికి అసలు కారణం తెలియదు. నిజానికి నువ్వొక క్రైస్తవుడివైతే భక్తిలో వెనుకంజ ఎప్పుడూ వెయ్యవని నమ్ముతాను. కానీ నువ్వు భక్తి విడిచే క్రైస్తవుడి(నామకార్థపు)గా ఉండకూడదు అనుకుంటే మాత్రం నేను అడిగే ఈ ప్రశ్న గుర్తుంచుకో – నువ్వు ప్రార్థన చేస్తున్నావా?

7. సంతోషం, సంతృప్తి ఇచ్చే వాటిలో అత్యుత్తమమైనది ప్రార్థన. అందుకే నువ్వు ప్రార్ధన చేస్తున్నావా అని చివరిసారి అడుగుతున్నాను? ఎన్నో బాధలు ఉండే లోకంలో మనం జీవిస్తున్నాం. పాపం వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి. బాధ లేకుండా పాపం ఉండటం సాధ్యం కాదు. పాపాన్ని లోకం నుండి పారద్రోలకుండా బాధను తప్పించుకోవాలి అనుకోవటం వ్యర్థమే. కొంతమందికైతే ఇతరులతో పోలిస్తే ఎక్కువ బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎదో ఒకరూపంలో బాధ అనుభవించనివారు ఎంతో అరుదు. మన శరీరాలు, ఆస్తులు , కుటుంబం, పిల్లలు, బంధాలు, పనివాళ్లు, స్నేహితులు, పొరుగువాళ్లు, లోకపరమైన బాధ్యతలు ఇవన్ని చింత కలిగించే ఊటలే. అనారోగ్యం, మరణం, నష్టాలు,నిరాశలు, ఎడబాట్లు, విడిపోవటాలు, కృతజ్ఞతారాహిత్యాలు , అపనిందలు ఇవన్ని షరామామూలే. ఇవి లేకుండా జీవితంలో ముందుకు వెళ్లలేము. ఒకరోజు కాకపోతే ఇంకోరోజు ఇవి మనకి ఎదురవుతాయి. అప్యాయతలు ఎక్కువ అయ్యే కొద్దీ శ్రమలు ఎక్కువ అవుతాయి. ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంతా ఎక్కువ బాధ పడాల్సి ఉంటుంది.

ఇలాంటి లోకంలో సంతోషాన్ని పొందే ఉత్తమమైన మార్గం ఏంటి? బాధలల్లో ఆదరణను, వాటిగుండే వెళ్లగలిగే శక్తిని పొందేది ఎలా? అలవాటుగా ప్రార్థనలో అన్నిటిని దేవుని ముందుకు తీసుకురావటం కంటే శ్రేష్ఠమైన మార్గం మరొకటి లేదు.

పాత మరియు కొత్త నిబంధనలలో బైబిల్ ఇచ్చే ఆజ్ఞ ఇదే. కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు? “ఆపత్కాలమున నువ్వు నన్ను చూసి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించెదను నువ్వు నన్ను మహిమ పరచెదవు”(కీర్తనలు 50:1).

"నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు”(కీర్తనలు 55:22).

అపోస్తలుడైన పౌలు ఏమి చెప్తున్నాడు? “దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” (ఫిలిప్పీ 4:6,7)

అపోస్తలుడైన యాకోబు ఏమి చెప్తున్నాడు: “మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్ధన చేయవలెను.”(యాకోబు 5:13).

లేఖనాల్లో చరిత్ర నమోదు చేయబడిన పరిశుద్ధులందరూ చేసింది ఇదే. తన సోదరుడైన ఏశావుకి భయపడినప్పుడు యాకోబు చేసింది ఇదే. అరణ్యంలో ప్రజలు రాళ్ళు రువ్వటానికి సిద్దపడినప్పుడు మోషే చేసింది ఇదే. హాయి సైన్యంతో ఇశ్రాయేలు ఓడిపోయినప్పుడు యెహోషువా చేసింది ఇదే. కేలియా లో ఆపద సమయంలో దావీదు చేసింది ఇదే. సన్హారీబు నుండి లేఖ అందుకున్నప్పుడు హిజ్కియా చేసింది ఇదే. పేతురు ఖైదు చేయబడినప్పుడు సంఘం చేసింది ఇదే. ఫిలిప్పీలో చెరసాలలో వేయబడగానే పౌలు చేసింది ఇదే.

ఇలాంటి లోకంలో నిజంగా ఆనందంగా ఉండటానికి ఒకే ఒక మార్గం మన చింతలన్నీ దేవునికి అప్పగించటమే. ఎవరి భారాలు వాళ్లే మోయాలనీ చూడటమే విశ్వాసులు బాధపడటానికి కారణం. వారి భారాలు దేవుడికి చెప్పగలిగితే అప్పుడు దేవుడే సమ్సోనుకి గాజా పట్టణపు ద్వారబంధములు ఎత్తటంలో సహాయం చేసినట్టు వారికి సహాయం చేస్తాడు. ఒకవేళ వారి భారాలను వారే మోయాలనుకుంటే ఒకానొక రోజు వారికి చిన్న మిడత కూడా బరువుగా అనిపిస్తుంది.

మనం మనస్సు విప్పి మన బాధల్ని పంచుకుంటే ఎల్లపుడూ సహాయం చేయటానికి ఒక స్నేహితుడు ఎదురుచూస్తున్నాడు. అతడు భూమిపై జీవించినప్పుడు రోగులు, బాధల్లో ఉన్నవాళ్ళు మరియు బీదలపై కరుణ చూపించిన స్నేహితుడు. మనలో ఒకడిగా ముప్పై మూడు సంవత్సరాలు బతికి మనుష్యుల హృదయాలు ఎరిగిన స్నేహితుడు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించినవానిగాను అతడు బాధల్లో దుఖపడువారితో కలిసి దుఖించగల స్నేహితుడు. ఆయన నయం చేయలేని బాధ భూమిపై లేదు కనుక మనకు సహాయపడే స్నేహితుడు. ఆ స్నేహితుడే యేసుక్రీస్తు. సంతోషంగా ఉండటానికి మార్గం ఆయనకు మన హృదయాల్ని ఎల్లప్పుడూ తెరిచి ఉంచటమే. బాధించినప్పుడు, బెదిరించినప్పుడు 'నేనంతా ప్రభువుకు చెప్తాను 'అని చెప్పిన ఆ పేద క్రైస్తవ బానిసవలే మనముందుము గాక!.

ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ ఆయనను నమ్మి మొరపెట్టినవారిని యేసు సంతోషపెట్టగలడు. చెరలో ఉన్నవారికి మనశ్శాంతి, పేదరికంలో ఉన్నవారికి సంతృప్తి, పోగొట్టుకున్నవారికి ఆదరణ, సమాధి అంచులో ఉన్నవారికి సంతోషం ఆయన ఇవ్వగలడు. ప్రార్థనలో అడిగిన వారందరికీ ఇవ్వదగిన సర్వ సంపూర్ణత ఆయన దగ్గర ఉంది. సంతోషం అనేది బాహ్య పరిస్థితులపై కాకుండా హృదయ స్థితి పై ఆధారపడి ఉంటుందని వారు అర్థం చేసుకుంటే ఎంత మేలు.

ప్రార్థన ఎంత బరువైన శ్రమలనైనా తేలిక చెయ్యగలదు. వాటిని భరించటానికి మనకు సహాయం చెయ్యగల ఆయనకు మనల్ని మరింత సన్నితంగా తీసుకెళ్లగలదు. మన మార్గాలు మూసివేయబడినపుడు ప్రార్థన ద్వారం తెరువగలదు. మన భూసంబంధమైన అవకాశాలు చీకటిపాలైనపుడు ప్రార్థన ఆశాకిరణాన్ని అందించగలదు. “నిన్ను విడువను. ఎడబాయను” అని చెప్పిన ఆయనకు మనల్ని మరింత చేరువ చేయగలదు. మనం ఎంతగానో ప్రేమించిన వాళ్ళు మనకు దూరమై, మనం వెలితిని అనుభవించినపుడు ప్రార్థన మనకు ఉపశమనం ఇవ్వగలదు. మన హృదయాలను తనతోనే నింపి, అంతరంగ అలలను గద్దించే ఆయనకు ప్రార్థన మనల్ని దగ్గర చేస్తుంది.

నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఉపయోగపడే ప్రశ్నను మరొకటి అడగలేనని నాకు తెలుసు: నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు ఈ అంశాన్ని ముగించే సమయం వచ్చింది. తీవ్రంగా పరిగణించాల్సిన విషయాలన్నీ నీ ముందుకు నేను తీసుకొచ్చానని నమ్ముతున్నాను. ఈ పరిశీలన నీ ఆత్మకు ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను.

ప్రార్థన చెయ్యనివారి కొరకు నన్ను చివరిగా కొన్ని మాటలు చెప్పనివ్వండి. ఇంతవరకు ఈ మాటలు చదివిన వాళ్ళందరూ ప్రార్థించేవారే అని నేను భావించలేను. నువ్వు ప్రార్థన చెయ్యని వ్యక్తి అయితే దేవుని తరపున నన్ను నీతో మాట్లాడనివ్వు. ప్రార్థన చేయని నిన్ను నేను కేవలం హెచ్చరించగలను. కానీ చాలా గంభీరంగా హెచ్చరిస్తున్నాను. నువ్వు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఉన్నపాటుగా నువ్వు చనిపోతే నశించిన వాడివి అవుతావు. శాశ్వత దుఃఖాన్ని అనుభవించటానికే నువ్వు తిరిగి లేస్తావు. మేము క్రైస్తవులమని చెప్పుకునేవారికి ఏ మినహాయింపు లేదు. ప్రార్థన లేకుండా జీవించటానికి నువ్వు ఒక్క కారణం కూడా చూపించలేవు.

ప్రార్థించటం రాదని చెప్పి తప్పించుకోలేవు. భక్తిలో ప్రార్థనే అతి తేలికైన పని. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. దీని కోసం నేర్పరితనం, తెలివితేటలు, పుస్తకజ్ఞానం ఏమీ అక్కర్లేదు. దీనికోసం కేవలం హృదయం మరియు ఆసక్తి ఉంటే చాలు. అతి బలహీనంగా ఉండే శిశువు కూడా ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు. అతి బీదవాడైన భిక్షగాడు కూడా చేతులు చాచి అడగగలడు; మంచి పదాల కోసం ఆగడు. కేవలం ఆలోచన ఉంటే చాలు, ఎంత అమాయకునికైనా దేవునితో చెప్పటానికి ఏదో ఒకటి ఉంటుంది.

ప్రార్థన చేయటానికి సరైనా స్థలం లేదని చెప్పి తప్పించుకోలేవు. మనస్సు ఉంటే చాలు ఎవరికైనా ఒక రహస్య ప్రదేశం దొరక్కపోదు. మన ప్రభువు కొండమీద ప్రార్థించాడు. పేతురు ఇంటి పైకప్పు మీద, ఇస్సాకు పొలంలో, నతనయేలు అంజూర చెట్టు కింద , యోనా తిమింగలం కడుపులో ఉండి ప్రార్థన చేశారు. ఏ ప్రదేశమైనా దేవుని సమక్షంలో ఒక గదిగాను, ఆలయంగానూ, బేతేలుగానూ మారగలదు.

సమయం లేదని చెప్పి తప్పించుకోలేవు. మనం తలుచుకుంటే ఎంతో సమయం ఉంటుంది. సమయం తక్కువే కావొచ్చు కానీ ప్రార్థించటానికి అది సరిపోతుంది.దానియేలు చేతిలో రాజ్యపు వ్యవహారాలు ఉండేవి, అయినా రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసేవాడు. ఒక గొప్ప దేశానికి దావీదు మహారాజు. అయినా, “సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును” (కీర్తనలు55:17) అన్నాడు. కావాలనుకుంటే సమయం ఎప్పుడైనా దొరుకుతుంది.

నూతన హృదయం, విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేము కాబట్టి వాటికోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నానని చెప్పి తప్పించుకోలేవు. అది పాపానికి పాపం కలపటమే అవుతుంది. మారుమనస్సు పొందకుండా నరకానికి పోవటమే భయంకరం అనుకుంటే, అయినప్పటికీ, నేను కృప కోసం వేడుకోను ' అని చెప్పటం మరీ ఘోరం. ఈలాంటి వాదనలకు లేఖనాలు తావివ్వవు. “యెహోవా దొరకు కాలమునందు ఆయనను వెదకుడి” (యెషయా 55:6) అని యెషయా అన్నాడు.“మాటలు సిద్దపరచుకుని యెహోవా వద్దకు తిరగుడి” (హోషేయ 14:1) అని హోషేయ అన్నాడు. “మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకొనుము”(అపొస్తలుల కార్యములు 8:22) అని పేతురు సీమోనుతో అన్నాడు.  విశ్వాసము నూతన హృదయం కావాలంటే వెళ్లి దేవునికి మొరపెట్టుకో. ప్రార్థన చేయాలనే ప్రయత్నం తిరిగి జన్మించటంతోనే ప్రారంభం అవుతుంది.

ఓ ప్రార్థన చేయని చదువరి! దేవునిని ఏమి అడగకుండా ఉండటానికి నువ్వెవరివి? మరణం, నరకం అన్నవాటితో నువ్వు నిబంధన చేసుకున్నావా? అగ్నితో నీ ప్రాణం సంధి కుదుర్చుకుందా? నీ పాపం‌ క్షమించబడాల్సిన అవసరత లేదా? నిత్యయాతన అంటే నీకు భయం లేదా? పరలోకం మీద ఆశలు లేవా?

నీ అంత్యదశను గురించి ఆలోచించుకో. లేచి దేవునికి మొరపెట్టుకో. అయ్యో! “ప్రభువా, ప్రభువా,మాకు తలుపులు తెరువుము” అని అనేకులు బిగ్గరగా అరిచే రోజు రాబోతుంది. అలాంటి వారికి ప్రేమతో ఆలోచన చెప్పాలి అనుకుంటున్నాను.

ప్రతి ప్రయాణానికి మొదటి అడుగు వేయటం అవసరం. కూర్చున్న స్థానం నుండి కదలటానికి స్థానబ్రంశం కావాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకి చేసిన ప్రయాణాలు చాలా దూరమైనవి, అలసటతో కూడినవి. యోర్దాను దాటే ముందు 40 యేళ్ళు గడిచిపోయాయి. అయినా రామా నుండి సుక్కోతుకి నడిచినవారిలో మొదటి అడుగు వేసినవారు ఒకరు ఉన్నారు. ఒక వ్యక్తి పాపం మరియు లోకం నుండి బయటకు రావటానికి తొలి అడుగు ఎప్పుడు వేస్తాడు? అతడు మొదట హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన రోజే అది జరుగుతుంది. ప్రతి కట్టడంలోనూ మొదటి రాయి వేయాల్సిందే. దానిపై మొదటి దెబ్బపడాల్సిందే. ఓడ నిర్మాణం 120 సంవత్సరాలు జరిగింది, అయినా నోవహు ఈ నిర్మాణం కొరకు మొదటి చెట్టును నరికిన రోజు ఒకటి ఉంది. సొలోమోను దేవాలయం ఎంతో గొప్ప కట్టడం.అయితే దానికోసం మోరియా కొండపైన మొదటి పునాదిరాయి పాతిన రోజు ఒకటి ఉంది. ఒక వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ కట్టే కట్టడం ప్రారంభం అయిందని ప్రస్ఫుటంగా ఎప్పుడు కనబడుతుంది? మనం అతడు మొదట ప్రార్థనలో తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించినప్పుడే అని‌ మనం నిర్థారించవచ్చు.

రక్షణ కావాలి కాని దానికోసం ఏంచేయాలని నువ్వు ఆలోచిస్తున్నట్లైతే వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకి వెళ్ళి మొదట కనుగొన్న రహస్య ప్రదేశంలో హృదయపూర్వకంగా నీ ఆత్మను రక్షించమని ప్రార్థన చెయ్యమని నేను సూచిస్తున్నాను. ఆయన పాపులను చేర్చుకునేవాడని నువ్వు తెలుసుకున్నట్లు, తండ్రి చేత ఆకర్షించబడి నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను”అని ఆయన చెప్పిన మాటలు నువ్వు విన్నట్లు ఆయనతో చెప్పు. నువ్వొక ఘోర పాపివని, నువ్వు నీఛునిగా, నిస్సహాయునిగా, నిరీక్షణలేని స్థితిలో ఉన్నావని పూర్తిగా నిన్ను నువ్వు ఆయన చేతులకు అప్పగించుకుంటున్నావని, ఆయన నిన్ను రక్షించకపొతే నీకు వేరే రక్షణాధారం ఏమిలేదని మొరపెట్టుకో. పాపపు దోషం, ప్రభావం మరియు పర్యవసానాల నుండి తప్పించమని బతిమాలుకో. తన స్వరక్తంలో నిన్ను కడిగి క్షమించమని వేడుకో. నూతన హృదయం ఇచ్చి ఎల్లప్పుడూ ఆయన శిష్యుడిగా సేవకుడిగా ఉండే కృప, విశ్వాసం, మనస్సు మరియు శక్తిని ఇవ్వమని అడుగు. నీ ఆత్మపై నీకు నిజంగా శ్రద్ధ ఉంటే ఈ రోజే వెళ్ళి ప్రభువైన యేసు క్రీస్తుతో ఈ విషయాలన్నీ చెప్పు.

నీ సొంత పద్ధతిలో నీ సొంత పదాలతోనే ఆయనకు చెప్పు. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నీ దగ్గరకి ఒక డాక్టర్ వస్తే నీకు ఎక్కడ నొప్పి ఉందో చెప్తావు కదా.అలాగే ఆత్మీయ ఆనారోగ్యాన్ని నువ్వు గుర్తెరిగితే క్రీస్తుకు చెప్పుకోవటానికి కూడా నీ దగ్గర ఎదో ఒకటి ఉంటుంది. నీవొక పాపివనే కారణంతో నిన్ను రక్షించాలనే ఆయన ఇష్టాన్ని అనుమానించొద్దు. పాపులను రక్షించటం ఆయన పని.“నేను పాపులను పిలువ వచ్చితినని” (లూకా 5:32) అని ఆయనే స్వయంగా చెప్పాడు.

నువ్వు యోగ్యుడవు కావని ఆలస్యం చేయవద్దు. దేనికోసం తడవు చేయొద్దు. ఎవరికోసమూ ఆగిపోవద్దు. ఆలస్యం చెయ్యటం అనేది సాతాను నుండే వస్తుంది. ఉన్నపాటుగా క్రీస్తు దగ్గరకి వెళ్ళు. నువ్వు ఎంతగా చెడిపోయి ఉంటే అంతగా ఆయనను వేడుకో. ఆయనకి దూరంగా ఉన్నంతకాలం నిన్ను నువ్వు బాగు చేసుకోలేవు. నీ ప్రార్థన తడబడుతుందని, నీ మాటలు బలహీనంగా ఉన్నాయని, నీ భాష స్పష్టంగా లేదని భయపడకు. యేసు నిన్ను అర్థం చేసుకోగలడు. శిశువు యొక్క అస్పష్టమైన మాటల్ని తల్లి అర్థం చేసుకున్నట్టే మన రక్షకుడు పాపులను అర్థం చేసుకోగలడు. నీ ప్రతి సైగనీ చదవగలడు, ప్రతి మూలుగును అర్థం చేసుకోగలడు. వెంటనే సమాధానం రాలేదని నిరాశపడకు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు యేసు వింటున్నాడు. ఆయన ఆలస్యం చేయటానికి యుక్తమైన కారణాలు ఉంటాయి. నీ యదార్థతను పరీక్షించడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. తప్పకుండా సమాధానం వస్తుంది. ఆలస్యం అవుతున్నా సరే ఎదురుచూడు. తప్పకుండా సమాధానం వస్తుంది. నీకు రక్షింపబడాలని కోరిక ఏ మాత్రం ఉన్నా ఈ రోజు నేను నీకు ఇస్తున్న సలహాని గుర్తు పెట్టుకో. నిజాయితీగా, మనస్ఫూర్తిగా అలాగే చేయి, అలా నువ్వు రక్షింపబడతావు.

చివరిగా ప్రార్థన చేసేవారికి కొన్ని మాటలు చెప్తాను. ఈ శీర్షిక చదివేవాళ్ళలో కొంతమందికి ప్రార్థన అంటే అవగాహన ఉందని, వారు దత్తపుత్రాత్మను పొందారని నమ్ముతున్నాను. అలాంటి వారందరికీ సహోదరప్రేమతో కొన్నిహెచ్చరికలు చేస్తున్నాను. మందిరంలో అర్పించే ధూపం ఒక ప్రతేక్యమైన విధంగా చేయాలనీ ఆజ్ఞాపించబడింది. అన్ని ధూపాలు అర్పణకు తగినవి కావు. ఇది మనం గుర్తుంచుకుని మన ప్రార్థన విధివిధానాల్లో జాగ్రత్తగా ఉందాం.

ప్రార్థన చేసే సహోదరులారా, ఒక క్రైస్తవుని హృదయం గురించి నాకు తెలిసిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే మీరు మీ సొంత ప్రార్థనలతో విసుగు చెందుతారు. కాబట్టి “మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది” అనే అపోస్తలుని మాట గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. ఎంత ఎక్కువ నువ్వు మోకాళ్ల మీద సమయం గడిపితే అంతగా "వ్యర్థమైన ఆలోచనలను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము " అన్న దావీదు మాటల్ని అర్థం చేసుకోగలవు. “దేవా, నా శత్రువుల నుండి నన్ను విడిపించు, నేను అనే చెడ్డ వాని నుండి రక్షించు” అని ప్రార్థన చేసిన ఒకానొక విశ్వాసి మనస్సుతో నువ్వు కూడా ఏకీభవించగలవు. కొంతమంది దేవుని పిల్లలు ప్రార్థనా సమయాన్ని పోరాట సమయంగా భావించరు. మనలను మోకాళ్ళ మీద చూసినప్పుడే సాతాను మన మీద ప్రత్యేకమైన కోపం కలిగి ఉంటాడు. అయితే అలాంటి ఇబ్బందులేవీ లేని ప్రార్థనలు అనుమానించదగ్గవే అని నా అభిప్రాయం. మన ప్రార్థనలను పరిశీలించే అంత అనుభవం మనకి లేదని నేను నమ్ముతాను. మనకి తక్కువ ఆనందం ఇచ్చిన ప్రార్థన దేవునికి ఎక్కువ ఆనందం ఇవ్వగలదు. క్రెస్తవ యుద్ధంలో నీతో సహవాసిగా నీకు కొన్నిహెచ్చరికలు చేయనివ్వు. మనం తప్పకుండా ప్రార్థన చేయాలని నిర్ణయించుకోవాలి. మనం దానిని మానకూడదు. అందులో మనం కొనసాగాలి.

ప్రార్థనలో భక్తి మరియు వినయం యొక్క ప్రాధాన్యతను నేను మీ ముందు ఉంచుతున్నాను. మనం ఎవరమై ఉన్నామో , దేవునితో మాట్లాడటం ఎంత గంభీరమైన విషయమో ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని ముందుకు తేలికభావంతోనూ, అజాగ్రత్తగానూ వెళ్లకుండా జాగ్రత్తపడదాం. ఇది పరిశుద్ధస్థలమని మనతో మనం చెప్పుకుందాం. ఇది పరలోకద్వారం కంటే ఎంతమాత్రం తక్కువ కాదు. నేను చెప్పేది మనస్ఫూర్తిగా చెప్పకపోతే దేవుడిని చులకన చేసినట్టే ." నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును ”. సొలోమోను చెప్పిన ఈ మాటను కూడా మనస్సులో ఉంచుకుందాం. “నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను” (ప్రసంగి 5:2). అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు “నేను ధూళి, బూడిద వంటి వాడను” అన్నాడు. యాకోబు దేవునితో మాట్లాడినపుడు “నేను నీఛుడను” అన్నాడు. మనము కూడా అలాగే చేద్దాము.

ఆత్మీయంగా ప్రార్థించడం యొక్క ప్రాముఖ్యతను నేను మీ ముందుకు తెస్తున్నాను. అంటే నా ఉదేశ్యం, మనం మన ప్రార్ధనల్లో పరిశుద్ధాత్మ నుండి నేరుగా సహాయం పొందాలి. అన్నిటికంటే ముఖ్యంగా పద్దతులు/సూత్రాలు పాటించకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన విషయంలో అలవాటుగా ఒక పద్దతిని పాటించడం ఆధ్యాత్మికత కాదు. వ్యక్తిగత ప్రార్థనకు ఇది మరి ముఖ్యంగా వర్తిస్తుంది. ప్రార్థనలో గొప్ప గొప్ప పదాలను ఆనాలోచితంగా వాడుతూ కొన్ని లేఖనాలను కూడా అలవాటుగా వల్లేవేస్తూ ఉంటాం. మనస్సు పెట్టకుండా అదే పద్ధతిని అలవాటుగా రోజూ పాటిస్తాం. ఈ అంశాన్ని కొంచెం జాగ్రత్తగా, సున్నితంగా చెప్పదలచుకున్నాను. మనకు రోజువారి ఎన్నో అవసరాలు ఉంటాయని నాకు తెలుసు. వాటన్నిటిని ఒకే పదాలతో రోజు ఒకే పద్ధతిలో ఆడగకూడదని నేను అనట్లేదు. సాతాను లోకం మరియు మన సొంత హృదయం రోజూ ఒకేలా ఉంటాయి. వాటిని ఎదుర్కోవటానికి ప్రతి రోజు మనం కృప కొరకు వేడుకోవాలి. కానీ ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రార్థన యొక్క ఆకారము, రూపం రోజూ ఒకేలా ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మన ప్రార్థనలను అలంకరించటానికి ప్రయత్నిద్దాం. మన వ్యక్తిగత ప్రార్థనలకు కూడా ప్రార్థన పుస్తకాలు వాడటం మెచ్చుకోదగ్గ అలవాటు కాదు. పుస్తకం చూడకుండా మన శారీరక స్థితి గురించి ఒక డాక్టర్ కి మనం చెప్పగలిగినప్పుడు, మన ఆత్మీయస్థితిని కూడా దేవునికి చెప్పగలగాలి. కాలి ఎముక విరిగిన ఒక వ్యక్తి కోలుకుంటున్న సమయంలో ఊతకర్ర సాయం తీసుకోవటం మంచిదే. నడవటం మానేయటం కంటే ఊతకర్ర సహాయం తీసుకోవటం నయమే కానీ వారి జీవితం అంతా ఊతకర్ర సాయంతోనే నడిస్తే అది అభినందించదగిన విషయం కాదు. వారి ఊతకర్రను పక్కన పడేసి సొంతంగా నడవగలిగే శక్తి పొందాలని ఆశిస్తాం.

ప్రార్థనని ఒక నిరంతర అలవాటుగా మార్చుకోవటం యొక్క ప్రాముఖ్యతను మీ ముందు ఉంచుతున్నాను. రోజులో ప్రార్థన కొరకు ప్రతేక్య సమయం కేటాయించాల్సిన అవసరత గురించి, దాని విలువ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన దేవుడు క్రమం కలిగిన దేవుడు. యూదుల దేవాలయంలో ఉదయకాల అర్పణలు మరియు సాయంకాల అర్పణల కొరకు ప్రత్యేక సమయాలు కేటాయించబడటం ఒక అర్థం లేని ఆచారం కాదు. క్రమం లేకపోవటం పాపపు ఫలాల్లో ఒకటి. అలా అని నేను ఎవర్ని బంధకంలోనికి నడిపించాలనుకోవటం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నీ జీవితంలోని ప్రతి ఇరవై నాలుగు గంటల పనిలో ప్రార్థనకి కూడా ఒక భాగం కేటాయించడం నీ అత్మీయ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. తినటానికి, నిద్రపోవటానికి, పనికి, మిగతావాటికి ఎలా సమయం కేటాయిస్తావో ప్రార్థనకి కూడా అలాగే సమయం కేటాయించాలి. దానికోసం నీకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకో. ఉదయం లోకంతో మాట్లాడే ముందు దేవునితో మాట్లాడు. లోకంతో పని పూర్తి అయిన తర్వాత రాత్రి దేవునితో మాట్లాడు. కానీ ప్రార్థన ప్రతి రోజు చేయాల్సిన గొప్ప పని అని నీ మనస్సులో స్థిరపరచుకో. దాన్ని ఒక మూలకి తోసేయ్యకు. నీ సొంత పనిలో పడి ప్రార్థనను నిర్లక్ష్యపెట్టకు. ఎలాంటి పని ఒత్తిడిలో వున్నా ప్రార్థన చెయ్యటం మానవద్దు.

ప్రార్థనలో కొనసాగటం యొక్క ప్రాముఖ్యతను మీ ముందు ఉంచుతున్నాను. ఒకసారి అలవాటు అయిన తరువాత ఎప్పటికీ దాన్ని విడిచిపెట్టకు. 'కుటుంబ ప్రార్థనలో ఉన్నావు కదా ఇప్పుడు వ్యక్తిగత ప్రార్థన చెయ్యకపోతే వచ్చే నష్టం ఏముందిలే?' అని కొన్నిసార్లు నీ హృదయం అంటుంది . 'ఒంట్లో బాలేదు, నిద్ర వస్తుంది, అలసిపోయి ఉన్నావు కాబట్టి ప్రార్థన చెయ్యక్కర్లేదు' అని కొన్నిసార్లు నీ శరీరం చెప్తుంది. 'ఈ రోజు నీకు ముఖ్యమైన పనుంది; నీ ప్రార్థనను కుదించు' అని కొన్నిసార్లు నీ మనస్సు చెప్తుంది. అలాంటి సలహాలన్నీ సాతాను నుండి కూడా వస్తాయని అర్థం చేసుకోవాలి. అవి 'నీ ఆత్మను నిర్లక్ష్యం చేయి' అని చెప్పటంతో సమానం. ప్రార్థనలు ఎల్లప్పుడూ ఒకే వ్యవధిలో ఉండాలని చెప్పను కానీ ఏ ఒక్క కారణం చేతనైనా ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు అని మాత్రం చెప్తాను. ”ప్రార్థనయందు నిలకడగా ఉండమని, ఎడతెగక ప్రార్ధించమని" పౌలు చెప్పినప్పుడు, ఎల్లప్పుడూ మోకాళ్ళ మీదే ఉండమని ఆయన ఉద్దేశం కాదు కానీ, నిత్యము అర్పించే దహనబలిలా, కాలక్రమంలో ఎడతెగకుండా వచ్చే విత్తుకాలం - కోతకాలం, శీతాకాలం - వేసవి కాలంలా, బలిని దహించని సమయంలో కూడా ఎప్పుడు బలిపీఠంపై వెలుగుతూ ఉండే కాగడాల్లా ప్రతి దినం స్థిరంగా ప్రార్థనను కొనసాగించాలని ఆయన ఉద్దేశం. ఉదయం మరియు సాయంత్రపు ప్రార్ధనలను మధ్యలో చేసే చిన్న చిన్న ప్రార్థనల గొలుసుతో కలిపి ఉంచవచ్చు అని మర్చిపోవద్దు. అర్తహషస్త ప్రాంగణంలో నెహెమ్యా చేసిన విధంగా కంపెనీలో, బిజినెస్ లో, వీధుల్లో, ఇలా నిశ్శబ్దంగా చిన్న రెక్కలు కట్టిన సందేశాల్ని దేవుకిని పంపవచ్చు. దేవునికి ఇచ్చిన సమయం ఎప్పుడు వృధా అని అనుకోవద్దు. ప్రభు దినాన్ని పాటించటం కోసం ఏడు దినాల వారంలో ఒక దినం ప్రభుకిస్తే దేశానికొచ్చే నష్టమేమీ లేదు. ఒక క్రైస్తవుడు ప్రార్థనలో కొనసాగటం వలన ఏమీ నష్టపోలేదని దీర్ఘకాలంలో తెలుసుకుంటాడు.

ప్రార్థనలో ఆసక్తి కలిగియుండటం యొక్క ప్రాముఖ్యతను నీ ముందుకు తెస్తున్నాను. ఒక వ్యక్తి ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉన్నాడని నిరూపించటానికి అతడు బిగ్గరగా ప్రార్థన చెయ్యటం, గట్టిగా అరవటం, బోరున ఏడ్వటం చేయనవసరం లేదు. కానీ మనం మనస్ఫూర్తిగా, ధ్యాస ఉంచి, ప్రార్థన చేసేవాటి మీద ఆసక్తి కలిగి ఉండటం అవసరం. మనఃపూర్వకమైన ప్రార్థనే బహుబలమైనదిగా ఉంటుంది. వాక్యంలో ప్రార్థన గురించి వాడబడిన మాటలు ఈ సత్యాన్నే మనకు వ్యక్తపరుస్తున్నాయి.ఇది “మొర్రపెట్టడం, తట్టడం, పెనుగులాడటం, ప్రయాసపడటం, పోరాడటం” అనే మాటలతో పిలువబడింది. వాక్యంలో ఉన్న ఆదర్శాలు ఈ పాఠాన్నే మనకు నేర్పిస్తున్నాయి. యాకోబు పెనుయేలునందు దూతతో ఇలా అన్నాడు, ” నువ్వు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనివ్వను”(ఆదికాండం 31:26). దానియేలు అయితే దేవుణ్ణి ఎలా బతిమాలాడో చూడండి: “ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము” - దానియేలు 9:19. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇలా రాయబడింది, “శరీరధారియై యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి ” హెబ్రీ 5:7. అయ్యో, వీటితో పోలిస్తే మన ప్రార్థనలు ఎంత భిన్నముగా ఉన్నాయి. పోల్చిచూస్తే మనం చేసేవి ఎంత నులివెచ్చగా ఉన్నాయి? 'మీరు వేటి కోసం ప్రార్థిస్తున్నారో అవి నిజంగా మీకు అవసరం లేదు' అని దేవుడు మనతో అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు? ఈ లోపాన్ని సవరించుకునే ప్రయత్నం చేద్దాం. యాత్రికుని ప్రయాణంలో కనికరం అనే పాత్రలాగే ఆయన వినకపోతే మనం నశించిపోతామన్నట్టుగా కృపాద్వారం వద్ద బిగ్గరగా అరుద్దాం. ఈ చల్లారిన ప్రార్థనలు అగ్నిలేని బలిఅర్పణల వంటివని మర్చిపోవద్దు. డెమోస్థెనీస్ ది గ్రేట్ కథని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకడు ఆయన వద్దకు సహాయం కోసం వచ్చాడు. ఆసక్తి లేకుండా చెప్పాడు కాబట్టి అతన్నిపెద్దగా పట్టించుకోలేదు. ఇది గమనించి అతడు నేను చెప్పేది నిజమే అని బోరుమంటే అప్పుడు డెమోస్థెనీస్ 'ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను' అన్నాడు.

విశ్వాసంతో ప్రార్థన చెయ్యటం యొక్క ప్రాముఖ్యతను మీ ముందుకు తెస్తున్నాను. మన ప్రార్థనలు దేవుడు వింటాడని మనం నమ్మాలి. ఆయన చిత్తానుసారముగా ఏమి అడిగినా మనకు సమాధానం ఇస్తాడని విశ్వసించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు సూటిగా మనకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే. “ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి: అప్పుడు అవి మీకు కలుగును” (మార్కు 11:24). బాణముకు వెనుక ఈక వంటిదే ప్రార్థనకు విశ్వాసం. విశ్వాసం లేకుండా ప్రార్థన గురిని తాకటం సాధ్యం కాదు. మన ప్రార్థనల్లో దేవుని వాగ్దానాల్ని ఎత్తి పట్టుకుని ప్రాధేయపడటం అలవాటు చేసుకోవాలి. ఇది యాకోబు, దావీదు మరియు మోషేల అలవాటు. 119వ కీర్తన అంతా “నీ వాక్య ప్రకారమే” అని అడగటంతోనే నిండి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రార్థనలకి సమాధానాలను ఆశించటం అలవాటు చేసుకోవాలి. సముద్రంలోకి తన ఓడల్ని పంపిన వ్యాపారిలా మనం ఓపికతో ఎదురుచూడాలి. సమాధానం కోసం పట్టుదలతో ప్రార్థన చేయాలి. అయ్యో,ఈ విషయంలో క్రైస్తవులు ఎంత వెనకబడి ఉన్నారు! పేతురు చెరసాలలో ఉన్నప్పుడు యెరుషలేము సంఘం ఎడతెగక ప్రార్థన చేసింది. కానీ సమాధానం వచ్చినప్పుడు వారు నమ్మలేకపోయారు.(అపొస్తలుల కార్యములు 12:15). రాబర్ట్ ట్రైల్ ఒక గంభీరమైన మాట చెప్పాడు. 'సమాధానం పట్టించుకోకుండా ప్రార్థన చేయటం కంటే ప్రార్థనని చులకన చేసేది మరొకటి లేదు'.

ధైర్యంగా ప్రార్థించటం యెక్క ప్రాముఖ్యతని మీ ముందు ఉంచుతాను. కొంతమంది ప్రార్థనలో తీసుకునే ఎక్కువ చనువును అసలు మెచ్చుకోలేము. కానీ పరిశుద్ధమైన ధైర్యం అనేది ఒకటి ఉంది. అది ఎంతో కోరదగినది. అటువంటి ధైర్యంతో మోషే ఇశ్రాయేలీయులను నాశనం చేయొద్దని దేవుని వేడుకున్నాడు. “కొండలలో చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొనిపోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్లుకొనుము” (నిర్గమ 32:12). అటువంటి ధైర్యంతో హాయి పట్టణస్తుల ఎదుట ఇశ్రాయేలీయులు ఓడిపోయినప్పుడు యెహోషువా దేవునికి మొరపెట్టుకున్నాడు. “ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువు” (యెహోషువా 7:9). ఇలాంటి ధైర్యాన్ని బట్టి లూథర్ పేరొందాడు. ఆయన ప్రార్థిస్తుండగా చూసిన వ్యక్తి ఇలా అన్నాడు. 'అతని ప్రతి భావంలోను ఎంతో ఆత్మీయత, ధైర్యం ఉన్నాయి.దేవునితో మాట్లాడుతున్న గౌరవంతో పాటు ప్రేమించే తండ్రి లేదా స్నేహితునితో మాట్లాడే నిశ్చయత మరియు నిరీక్షణతో ప్రార్థన చేసేవాడు'. ఈ ధైర్యమే పదిహేడో శతాబ్దపు స్కాట్లాండుకి చెందిన బ్రూస్ అనే భక్తుని, ప్రతేక్యపరిచింది. ఇందులో మనం వెనకబడి ఉన్నామని నేను భయపడుతున్నాను. ఒక విశ్వాసికి ఉన్న అధిక్యతలను మనం పూర్తిగా తెలుసుకోలేదు. 'దేవా, మేము నీ ప్రజలము కదా, మమ్మల్ని పరిశుద్ధుల్ని చెయ్యటం నీకు మహిమ కదా, నీ సువార్త ప్రకటింపబడటం నీకు గౌరవం కదా' అని మనం ఎక్కువగా ప్రార్థించము.

ప్రార్థనలో సంపూర్ణత యొక్క ప్రాముఖ్యతను మీ ముందు ఉంచుతాను. మన ప్రభువు వేషధారణతో సుదీర్ఘ ప్రార్థనలు చేసే పరిసయ్యుల మాదిరిని అనుసరించొద్దని చేసిన హెచ్చరికను నేను మర్చిపోలేను. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటల్ని వచింపవద్దు అని ప్రభువు ఆజ్ఞాపించాడు. అయితే రాత్రంతా ప్రార్థన చేయటం ద్వారా సుదీర్ఘ ప్రార్థనలు అనుమతించిన ఆయన సొంత మాదిరిని కూడా నేను మర్చిపోలేను. ఏ విషయం కోసమైనా ఎక్కువ ప్రార్థన చేసి తప్పు చేయం కానీ ఈ తరంలో తక్కువ ప్రార్థన చెయ్యటమే మనందరం చేసే తప్పు అని భయపడాల్సి ఉంది. మొత్తం మీద ప్రార్థన కోసం విశ్వాసులు కేటాయించే సమయం చాలా తక్కువ కాదా? ఈ ప్రశ్నలకి సంతృప్తినిచ్చే సమాధానం ఇవ్వలేమని నాకు తెలుసు.‌ చాలామంది చేసే వ్యక్తిగత భక్తి కూడా చాలా చిన్నదిగా ఉందని బయపడుతున్నాను. కేవలం వారింకా బ్రతికే ఉన్నారని నిరూపించుకోవటానికే తప్ప మరేం లేదు. వారికి నిజంగా దేవుని నుండి పెద్దగా ఏమి అక్కర్లేదు అనిపిస్తుంది. దేవుని దగ్గర చెప్పుకోవటానికి, దేవుణ్ణి అడగటానికి , ఆయనకు కృతజ్ఞతలు చెప్పటానికి వారి దగ్గర పెద్దగా ఏమిలేదు. అయ్యో, ఇది పూర్తిగా తప్పు. వారికి దేవుడి నుండి సమధానం రావట్లేదు అని విశ్వాసులు ఫిర్యాదులు చెయ్యటం, అవి మనం వినటం కంటే సాధారణ విషయం మరోటి లేదు. ఆశించినట్టుగా కృపలో ఎదగలేకపోతున్నామని వారు చెప్తారు. నిజానికి వారెంత అడుగుతున్నారో అంతే కృపను కలిగి ఉన్నారని అనుమానించక తప్పదు. వారి బలహీనతకు కారణం కుదించబడిన, తగ్గించబడిన, తేలికైన, తొందరతో కూడిన, చల్లారిన ప్రార్థనలే.

ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన ప్రాముఖ్యత గురించి మీ ముందు ఉంచుతాను. మనం సాధారణ ప్రార్థనలతో తృప్తి పడకూడదు. కృపాసింహాసనం ఎదుట మనం మన అవసరాలు నిర్దిష్టంగా చెప్పాలి. మనం పాపులం అని మాత్రమే ఒప్పుకుంటే సరిపోదు, మన మనస్సాక్షికి తప్పు అనిపించే ప్రతీ పాపం ఒప్పుకోవాలి. పరిశుద్ధత కోసం అడగటం మత్రమే సరిపోదు. ఏ మంచి విషయాల్లో కొదువగా ఉన్నామో వాటిని పేరుపేరున చెప్పాలి. మనం సమస్యల్లో ఉన్నాం అని దేవునికి చెబితే సరిపోదు. మన సమస్యల్ని అందులో విషయాలని వివరంగా చెప్పాలి. తన సోదరుడు ఏశావుకి భయపడినప్పుడు యాకోబు అలాగే చేసాడు. అతను దేనికి భయపడ్డాడో దేవునితో సూటిగా చెప్పాడు (ఆదికాండం 32:11). ఎలియాజరు అతని యజమాని అబ్రహాము కొడుకు ఇస్సాకుకి భార్యని వెతికినప్పుడు అదే చేసాడు. అతనికి ఏమి కావాలో దేవుని ముందు స్పష్టంగా చెప్పాడు 'నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము.'ఆదికాండం 24:12 తన శరీరంలో ముళ్ళు విషయమై పౌలు ఇలాగే చేసాడు. అతను ముమ్మారు ప్రభువుని బతిమాలుకున్నాడు 'అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని  -  కొరింథీయులు 12:8. అదే నిజమైన విశ్వాసం మరియు దైర్యం. దేవుని ముందు చెప్పుకోవటానికి చిన్నది అనేది ఏమి లేదని మనం గుర్తుంచుకోవాలి. ఆయనతో ఎటువంటి దాపరికాలు లేకుండా ఉందాం. మన హృదయాలు విప్పి ఆయనతో అన్నీ చెబుదాం.

ప్రార్థనల్లో మధ్యవర్తిత్వం యొక్క ప్రాధాన్యత గురించి మీ ముందుంచుతాను. మనం స్వభావరీత్యా స్వార్థపరులం. మనం విశ్వాసులుగా మారిన తర్వాత కూడా మన స్వార్థం మనలను విడిచిపోదు. మన సొంత ఆత్మలు, మన ఆత్మీయ ఆటుపోట్లు, విశ్వాసంలో మన సొంత ఎదుగుదల కోసం మాత్రమే అలోచించి ఇతరుల్ని మర్చిపోయే తత్వం మనలో ఉంది. మనందరం జాగ్రత్త పడాలి, పోరాడాలి, మరిముఖ్యంగా ప్రార్థన విషయంలో దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతరులకి ఉపయోగపడే వ్యక్తిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కృపాసింహాసనం ఎదుట చెప్పటానికి మన పేరుతో పాటు ఇతర పేర్లు కూడా ఉండాలి. ప్రార్థన ద్వారా నన్ను ప్రేమించేవారే నిజంగా నన్ను ప్రేమించేవారు.

మన ఆత్మీయ ఆరోగ్యం కోసం ఇలా చెయ్యాలి. ఇది మన సహానుభావాన్ని పెంచి మన హృదయాల్ని విశాలపరుస్తుంది. ఇది సంఘ సంక్షేమం కోసం దోహదపడుతుంది. సువార్తని విస్తరించటానికి ఉపయోగపడే సాధనాల్లో ప్రార్థన ఒకటి. ఒక సంఘాన్ని ఎంచుకునే అవకాశం నాకుంటే ప్రార్థన చేసేవాళ్ళని నాకు ఇవ్వండి అని అడుగుతాను.

ప్రార్థనలో కృతజ్ఞత యొక్క ప్రాధాన్యత మీ ముందు ఉంచుతాను. ప్రార్థన చెయ్యటం, స్తుతించటం ఈ రెండు వేరువేరని నాకు తెలుసు. కాని ఈ రెండిటికి బైబిల్ లో ఉన్న దగ్గర సంబంధాన్ని గుర్తించినప్పుడు స్తుతి అర్పణ లేని ప్రార్థనను నేను అసలు ప్రార్థన అని పిలిచే సాహసం చేయలేను. పౌలు కూడా అదే చెప్పాడు. “ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” (ఫిలిప్పి 4:6) .“ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి” కొలస్సి 4:2. ఆయన కనికరం వల్లే మనం నరకంలో పడిపోలేదు. ఆయన కనికరం వల్లే మనకు పరలోక నిరీక్షణ ఉంది.ఆయన కనికరం వల్లే మనం ఆత్మీయ వెలుగు పొందగలిగే దేశంలో ఉన్నాం. ఆయన కనికరం వల్లే మన సొంత మార్గాల పర్యవసానాలు అనుభవించకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనం పిలువబడం. ఆయన కనికరం వల్లే మనం ఇంకా జీవిస్తూ ఉచితమైన ఆయన కృపకు, నిరంతరం ఉండే ఆయన కృపకు మహిమ తెచ్చే అవకాశాలను కలిగి ఉన్నాం. కృతజ్ఞతాభావంతో నిండుకోని భక్తులెవరూ మనకు కనబడరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంతో మొదలుపెట్టకుండా పౌలు ఏ పత్రికను రాయలేదు. గత శతాబ్దపు వైట్ ఫీల్డ్, మనం కాలపు బికర్ స్టెత్ ఆ కృతజ్ఞతాభావం పుష్కలంగా కలిగి ఉన్నారు. మనం ప్రకాశమానంగా ఉండే జ్యోతులుగా ఉండలనుకుంటే మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మన ప్రార్థనలలో కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉందాం.

ప్రార్థనల్లో మెలకువగా ఉండటం యొక్క ప్రాధాన్యతను మీ ముందు ఉంచుతాను. భక్తి జీవితంలో ప్రార్థనే అత్యంత జాగ్రత్త వహించాల్సిన విషయం. నిజమైన భక్తి ప్రారంభం అయ్యేది ఇక్కడే. అది అభివృద్ధి చెందేది ఇక్కడే. అది కృశించిపోయేది కూడా ఇక్కడే. ఒక వ్యక్తి ప్రార్థనలు ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. అతని ఆత్మీయస్థితి ఎలా ఉందో నేను మీకు చెప్పగలను. ప్రార్థన ఆత్మీయతకు నాడి. దానితో ఆత్మీయ ఆరోగ్యపరీక్ష చెయ్యవచ్చు. ప్రార్థన ఆత్మీయతని కొలిచే భారమితి. దానితో ఒక వ్యక్తి ఆత్మీయస్థితి బాగుందో, లేదో చెప్పేయొచ్చు. మన వ్యక్తిగత భక్తిని నిరంతరం ఓ కంట కనిపెట్టుకుంటూ ఉందాం. మన క్రైస్తవ నడవడికకు మార్గం, ఆయువుపట్టు ఇందులోనే ఉంది. ప్రసంగాలు, పుస్తకాలు, కూడికలు, మంచి విశ్వాసుల సహవాసం, ఇవన్నీ మంచి విషయాలే కానీ వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం పెట్టటం వల్ల కలిగే నష్టాన్ని అవి పరిష్కరించలేవు. దేవునితో నీ సహవాసాన్ని తెంచి నీ ప్రార్థనల్ని ఆటంకపరిచే స్థలాలను, స్నేహాలను, సహవాసాలను పసిగట్టి వాటి విషయంలో జాగ్రత్తపడు. నీ ఆత్మను మెరుగైన స్థితిలో ఉంచి, దేవునితో నీ సంభాషణని పెంచే పనుల్ని, స్నేహాలను క్షుణ్ణంగా గమనించి వాటికి కట్టుబడి ఉండు. నీ ప్రార్థనల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ ఆత్మకి ఎలాంటి కొదువ ఉండదు.

నువ్వు వ్యక్తి గతంగా ఆలోచిస్తావని నీకు ఈ విషయాలు చెప్తున్నాను. ఇదంతా నేను దీనమనస్సుతోనే చెముతున్నాను. నాకంటే ఎక్కువగా ఇవి గుర్తుచేయబడాల్సిన వారెవ్వరూ నాకు తెలియదు. కానీ ఇదంతా దేవుని సత్యమని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను మరియు నేను ప్రేమించేవారందరూ వీటి విషయమై మరింత శ్రద్ధ వహించేవారిగా ఉండాలని కోరుతున్నాను.

మనం జీవించే కాలాలు ప్రార్థన సమయాలుగా ఉండాలని కోరుతున్నాను. నేటి క్రైస్తవులంతా ప్రార్థించే క్రైస్తవులుగా ఉండాలని కోరుతున్నాను. సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలని కోరుతున్నాను. ప్రార్థనను ప్రోత్సహించటమే ఈ రచనను మీకు అందించటం వెనుక నా కోరిక మరియు ప్రార్థన. ఇప్పటి వరకు ప్రార్థన చెయ్యనివారు ఎవరైనా ఉంటే, వారు లేచి దేవునికి మొరపెట్టుకోవటమే నాకు కావాలి. ప్రార్థన చేసేవారు ఉంటే వారు చేసేది వ్యర్థమైన ప్రార్థన కాకుండా జాగ్రత్తపడటమే నాకు కావాలి.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.