దుర్బోధలకు జవాబు

రచయిత: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 53 నిమిషాలు

1. ఇంతకు ఏమిటి వివాదము?

విశ్వాసుల ఐక్యతకు సాధనమైన బల్లారాధన, వారి మధ్య విభేదానికి హేతువు కావడం ఎంతో విచారకరం. కొందరు ఆ బల్లలోని పదార్థాలు అక్షరాలా యేసు శరీర రక్తాలుగా మారతాయని, కాబట్టి వాటిలో పాల్గొనే వారు స్వీకరించేది రొట్టె-ద్రాక్షారసాలు కావని, స్వయాన ప్రభువు శరీర-రక్తాలనే వారు భుజిస్తున్నారని భావిస్తున్నారు. 'ఇది నా శరీరం, ఇదీ నా రక్తం'( మత్తయి 26:26-28 , మార్కు 14:22-24 , లూకా 22:19-20 , 1కొరింథీ 11:23-26 ) అని రొట్టె-ద్రాక్షారసాలను ఉద్దేశించి యేసు చెప్పిన మాటల అక్షరభావాన్ని తమ ఈ అభిప్రాయానికి వారు ఆధారంగా తీసుకుంటారు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయే గదా; మనము విరుచు రొట్టెలోనిది తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే కదా? (1కొరింథీ 10:16) అని అపోస్తలుడు చెప్పిన మాటలను కూడా అక్షరభావములో తీసుకొని వారి ఈ ఆలోచనను మరింత సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. సులువుగా ప్రస్తావించగలిగేలా ఈ సిద్ధాంతాన్ని మన చర్చలో, ‘పదార్థాంతరవాదమని' లేదా 'అక్షరవాదమని పిలుచుకుందాం. రోమన్ కేథలిక్ సంఘంతో పాటు ఈనాడు కొన్ని ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా ఈ అక్షరవాద అభిప్రాయాన్నే సత్యమని విశ్వసిస్తున్నాయి. ఆ విధంగా నమ్మే ప్రొటెస్టెంట్ సంఘాల్లో, అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు స్థాపించిన ‘అగాపే ఫుల్ గాస్పెల్ సంఘం' ప్రముఖమైంది.

అయితే, పై అభిప్రాయముతో విభేదించేవారు, ప్రభు శరీర-రక్తాలకు ఆ రొట్టె-ద్రాక్షారసాలు సాదృశ్యాలని, “ఇదీ నా శరీరం', 'ఇది నా రక్తం' అనే ప్రభువు మాటలు కేవలం అలంకార ప్రాయంగా చెప్పబడ్డాయని, అపోస్తలుడు కూడా అదే అలంకారాన్ని పునరుద్ఘాటించాడని వాదిస్తారు. సులువుగా ప్రస్తావించ గలిగేలా ఈ సిద్ధాంతాన్ని మన చర్చలో, 'అలంకారవాదం' లేదా 'సాదృశ్యవాదం' అని పిలుచుకుందాం. ఎక్కువ శాతం ప్రొటెస్టంట్ సంఘాలు ఈ సాదృశ్యవాద భావాన్నే కలిగియున్నాయి.

'ఈ వివాదమంతా ఎందుకు? బల్లారాధన ద్వారా ప్రభువును జ్ఞాపకం చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్య విషయం కదా? రొట్టె-ద్రాక్షారసాలు ఆయన శరీర-రక్తాలు అనడం అక్షరార్థమని నమ్మినా, అలంకార ప్రాయమని నమ్మినా, ఏమిటీ సమస్య?' అని సరిపెట్టుకునే వారు కూడా కొందరుంటారు. అలాంటి వారు ఈ సమస్య ఎంత జటిలమైనదో బహుశ ఆలోచించక పోయుండవచ్చు. ఈ పరిశీలన ఎందుకు అవసరమో తెలియజేసే కొన్ని ముఖ్య కోణాలను ఇక్కడ ప్రతిపాదిస్తాను.

1) నిత్యజీవం పొందే విధానాన్ని అపార్థం చేసుకోకుండా జాగ్రత్తపడడానికి ఈ వివాదాన్ని పరిష్కరించడం అవసరం.

ప్రభువు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగిన వారికి మాత్రమే నిత్య జీవమని వాక్యం బోధిస్తోంది (యోహాను 6:53-56). ఇది బల్లలో పాల్గొనటం ద్వారా జరుగుతుందని అక్షరవాదులు నమ్ముతున్నారు. ఉదాహరణకు ఆధునిక తెలుగు ప్రొటెస్టెంట్ సంఘాలలో అక్షరవాద బోధను ప్రవేశపెట్టిన శ్రీ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇలా అన్నారు, యేసులో పాలుపొందడం అంటే ఆయన శరీరములోను, రక్తములోను పాలుపొందడమే. యేసు శరీరములోను రక్తములోను పాలు పొందడం అంటే ప్రభురాత్రి భోజన ద్రవ్యాలను భుజించి పానం చేయడమే' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 45)ఇదే నిజమైతే, ఈ సాదృశ్యవాదులు, యేసు శరీర-రక్తాలలో పాలు కలిగించే ఏకైక విధానాన్ని తృణీకరిస్తున్నారు. కేవలం చిహ్నప్రాయమైనదిగా దిగజార్చి, తెలిసో, తెలియకనో బల్లను వారు అవమానిస్తున్నారు.

అయితే ఒకవేళ అలంకారవాదమే నిజమైతే, ప్రభురాత్రి భోజనములో పాల్గొనడమే ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగడమని నమ్మేవారు పెద్ద పొరపాటే చేస్తున్నారు. నిత్య జీవం పొందగలిగే ఏకైక మార్గాన్ని వారు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభురాత్రి భోజనాన్ని గురించి ఈ రెండు అభిప్రాయాలలో ఏది లేఖన సమ్మతమో నిగ్గు తేల్చడం ప్రాముఖ్యతలేని అంశమని తలంచడం ఎంతో ప్రమాదకరం.

2) బల్లలో యోగ్యంగా పాల్గొంటున్నామో లేదో నిర్ధారించడానికి ఈ వివాదాన్ని పరిష్కరించడం అవసరం.

ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు"(1కొరింథి 11:29).  అయోగ్యంగా బల్లలో పాలుపొందడం అంటే ఏమిటి? అక్షరవాదాన్ని సమర్థిస్తూ ఓఫీర్ గారు 1కొరింథి 11:29వ  వచనాన్ని ఇలా వ్యాఖ్యానించారు, 'ఆ మాటలను గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రభువు రొట్టెను భుజించే విశ్వాసులు సరైన విధంగా భుజించకపోతే, వారికి శిక్షావిధి కలుగుతుందట. సరైన విధంగా భుజించడం అంటే ఏమిటి? ప్రభువు శరీరమని వివేచించి భుజించడమే యోగ్యంగా భుజించడం' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం , పేజి 5)

 అదే నిజమైతే, సాదృశ్యవాదులు బల్లలో పాల్గొంటున్న ప్రతిసారి ఎంత పాపానికి ఒడిగడుతున్నారు! ఆ పదార్థాలు చిహ్నాలు మాత్రమేనని నమ్మి కేవలం అయోగ్యంగా, శిక్షావిధి కొనితెచ్చుకోవడానికే వారు బల్లలో పాలుపుచ్చుకుంటున్నారు.

 కాని, సాదృశ్యవాదమే నిజమైతే, యోగ్యంగా బల్లలో పాల్గొనడమని పౌలు చెప్పిన ఉద్దేశాన్నే పదార్థాంతర వాదులు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. బల్లలో అయోగ్యంగా పాల్గొనే ప్రమాదాన్ని గురించి వారికేమి తెలియదు కాబట్టి వారు ఆ తప్పు చేసినా దానిని గుర్తెరిగే పరిస్థితిలో లేరు. యోగ్యంగా బల్లలో పాలుపుచ్చుకుంటున్నామో లేదో తెలుసుకోవాలనే బాధ్యత గలవారికి ఈ వివాదం పరిష్కరించబడడం అవసరం.

3) లేఖన బోధను అపార్థం చేసుకోకుండా జాగ్రత్త పడడానికి ఈ వివాదాన్ని పరిష్కరించడం అవసరం.

దేవుని వాక్యంలో పరస్పర విరుద్ధ బోధలు ఉండవు. రెండు పరస్పర విరుద్ధ బోధలు తలెత్తినపుడు వాటిలో ఏదైనా ఒకటే సత్యమైయుండాలి, లేదా రెండూ అబద్ధబోధలే అయ్యుండాలి, కాని ఆ రెండు సత్యమైయుండడం సాధ్యంకాదు. దేవుడు తన మాటకు తానే విరుద్ధంగా మాట్లాడడు కాబట్టి, ఒక వాక్యానికి చెప్పే భాష్యం, ఇతర ఏ వాక్యాలలో ఉన్న బోధతో విభేదించినా, ఆ భాష్యాన్ని మానవ కల్పిత బోధగా పరిగణించి తృణీకరించాలి. ఇది బైబిల్ భాష్యంలో అన్వయించాల్సిన మూల సూత్రం. మనం ప్రస్తుతం పరిశీలించే ఈ రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలలో, సమగ్ర లేఖనబోధతో ఏకీభవించే అభిప్రాయమే సత్యం. ఏ లేఖనముతోనైనా పొత్తుకుదరని అభిప్రాయం అపార్థం, అబద్దం. లేఖనాలను అపార్థం చేసుకునేవారు తమ స్వకీయ నాశనము కొరకే అలా చేస్తున్నారని పేతురు చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టినవారు మాత్రమే ఈ వివాదం విషయమై తటస్థ వైఖరిని కలిగియుంటారు . (2 పేతురు 3:16)

కాబట్టి ప్రార్థనా పూర్వకంగా, వాక్య వెలుగులో, ఈ వివాదానికి పరిష్కారం అన్వేషించడమే ఇరు పక్షాలవారికి మంచిది. తటస్థ వైఖరికి స్వస్తి చెప్పి, నిష్పక్షపాత వైఖరితో రండి, మనం కలిసి పరిశీలన చేద్దాం, సత్యమేమిటో తెలుసుకుందాం.

 

2. రొట్టె-ద్రాక్షారసాలు అక్షరాలా యేసు శరీర-రక్తాలే

అని నమ్మితే తలెత్తే సమస్యలు

బల్లలోని పదార్థాలను అక్షర భావంలో తీసుకుంటే, జవాబులేని ఎన్నో ప్రశ్నలకు, లేఖన విరుద్ధమైన ఎన్నో ఆలోచనలకు మరియు సరికొత్త దుర్బోధలకు తావిచ్చినట్లవుతుంది. అవేంటో క్లుప్తంగా గమనించండి;

1) ప్రభువు తనను తాను అనేక పోలికలతో వర్ణించుకుంటూ, ఎన్నో అలంకారాలతో సాదృశ్యపరచుకున్నాడు. అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి సర్పంతో, ద్వారంతో, కాపరితో, వెలుగుతో, మార్గంతో, ద్రాక్షావల్లితో, ఆయన తనను తాను పోల్చుకున్నాడు (యోహాను 3:14 , 10:9,11 , 12:8 , 14:6 , 15:1-2 ). ఈ సాదృశ్యాలను వాడినపుడు, ఇది అలంకారం మాత్రమే సుమ! అని ఎక్కడా వివరణ ఇవ్వలేదు. అయినా, ఆయన అక్షరభావంలో అవేవి కాదు కాబట్టి అవి అలంకారమే తప్ప అక్షరభావం అయ్యుండడానికి వీలు లేదని అర్థం చేసుకుంటాము కదా! మరి, అదే నియమం ప్రభురాత్రి భోజన పదార్థాల సందర్భంలో ఎందుకు అన్వయించకూడదు? కాబట్టి రొట్టె-ద్రాక్షారసాలు అక్షరాల యేసు శరీర రక్తాలే అని నమ్మేవారికి మొదటి ప్రశ్న, ఇతర సందర్భాలలో ప్రభువు తనను తాను పోల్చుకున్న వర్ణనలన్నీ అలంకారప్రాయమైనపుడు, రొట్టె-ద్రాక్షరసాలను తన శరీర-రక్తాలతో పోల్చిన ప్రభురాత్రి భోజన సందర్భాన్ని మాత్రం అక్షరభావంలోనే తీసుకోవాలన్న తర్కానికి ఏమిటి ఆధారం?”

2) ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని తాను కొట్టి వేయడానికి రాలేదని స్పష్టం చేస్తూ, ధర్మశాస్త్రంలో ఉన్న ఏ చిన్న ఆజ్ఞనైనా మీరడం తప్పుకాదని బోధించేవాడు, దేవుని రాజ్యంలో అత్యల్పుడు అని ప్రభువే స్వయంగా సెలవిచ్చాడు (మత్తయి 5:17-19). , (ద్వితీయోపదేశ కాండం 12:23-25) .ఒకవేళ ప్రభురాత్రి భోజనంలో యేసు తన శిష్యులకు త్రాగమని ఇచ్చింది అక్షరాల తన రక్తమైతే, ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞను మీరమని ఆయనే వారిని ప్రోత్సహించినట్లవుతుంది కదా? కాబట్టి రొట్టె-ద్రాక్షా రసాలు అక్షరాలా యేసు శరీర-రక్తాలని భావించేవారు ఎదుర్కోవలసిన రెండవ ప్రశ్న, 'యేసు తన రక్తం త్రాగమని ఆజ్ఞాపించి, ధర్మశాస్త్రాన్ని మీరేలా తన శిష్యులను బలవంతపెట్టాడని వారి అభిప్రాయమా? అంటే, ఇలా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించమని శిష్యులను ప్రోత్సహించిన ప్రభువు, దేవుని రాజ్యంలో అత్యల్పుడు అని కూడా ఒప్పుకోవడానికి వారు సిద్దమా?”

3) రక్తం త్రాగకూడదనే నిషేధం ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితం చేయబడలేదు. అది అన్యులకు కూడా వర్తిస్తుందని క్రొత్త నిబంధన స్పష్టం చేస్తుంది (అపో.కా. 21:25 ). ప్రభురాత్రి భోజనంలో ద్రాక్షారసం నిజంగా రక్తమైతే ఎదుర్కోవలసిన మూడవ ప్రశ్న, 'బల్లారాధనలో పాల్గొన్న ప్రతిసారి, ఒక విశ్వాసి రక్తపాన నిషేదాజ్ఞ విషయమై అపరాధిగా చేయబడడం లేదా? ఈ పాపానికి, ఇలాంటి ఆచారాన్ని ప్రవేశపెట్టిన ప్రభువేబాధ్యత వహించాలా? ప్రభువును అపనిందపాలు చేసే ఇలాంటి సిద్ధాంతాన్ని ప్రకటించడం న్యాయమా?”

4) యేసు క్రీస్తు ప్రభువు ఒక్కసారే అర్పించబడడాన్ని బైబిల్ పదే-పదే నొక్కి చెబుతుంది ( యోహాను 19:30, రోమా 6:10 , హెబ్రీ 7:26-27 , 9:11-12,26,28 , 10:10,12,14 , 1పేతురు 3:18 ) . బల్లారాధనలో విరువబడేది అక్షరాలా ప్రభువు శరీరమే అయితే, అది ఆచరించిన ప్రతిసారి ఆ అర్పణ పునరావృత్తమవుతుంది. కాబట్టి నాల్గవ ప్రశ్న ఏమిటంటే, 'మనము ఒక్కసారే అర్పించబడ్డాడని అపోస్తలులు ప్రకటించిన యేసును విశ్వసించాలా, లేదా రొట్టె-ద్రాక్షారసాలుగా మారి ప్రతి ఆరాధనలో అర్పించబడుతున్నట్లు అపోస్తలీయ బోధకు భిన్నముగా కల్పించబడిన ఈ “మరియొక యేసును” (2 కొరింథీ 11:4 ) విశ్వసించాలా?”

5) దేవుడు తన అభిషిక్తుని కుళ్లుపట్టనియ్యడని యేసు శరీర విషయమై వాగ్దానం చేసాడు (కీర్తనలు 16:10 , అపో.కా. 2:24-31 , 13:34-37 ). ప్రభురాత్రి భోజనం ఆచరించిన తరువాత మిగిలిన రొట్టె-ద్రాక్షరసాలు నిలువ ఉండనేరవు. అవి కుళ్లుపట్టడం ఖాయం. కాబట్టి రొట్టె-ద్రాక్షారసాలు ప్రభువు శరీర రక్తాలుగా మారుతాయని వాదించేవారికి ఐదవ ప్రశ్న ఏమిటంటే, 'దేవుడు యేసు శరీరాన్ని కుళ్లుపట్టనియ్యడని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ప్రతీ ప్రభురాత్రి భోజన సందర్భంలోను విఫలమవ్వడం లేదా? దేవుని వాగ్దానాన్ని సహితం నిరర్ధకం చేయజూసే ఈ బోధకు వత్తాసు పలికేలా వీరిని మోసం చేసింది ఎవరు??

6) ఇది నా శరీరం', 'ఇది నా రక్తం' అని రొట్టె-ద్రాక్షారసాలను ఉద్దేశించి యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు, ఆయన శరీరధారిగా వారి మధ్య కూర్చుని వారితో కూడా భోజనం చేస్తున్నాడు. కాబట్టి ఆరవ ప్రశ్న ఏమిటంటే, ‘ఆయన శరీరంతో వారి మధ్య కూర్చున్న అదే సమయంలో వారు తింటున్న రొట్టెగా కూడా అయ్యాడా? ఆయన ఈ మాటలు చెప్పి వారు తింటున్న రొట్టె-ద్రాక్షారసావతారీగా మారిపోయాడా, లేక వారు తింటున్నప్పుడు, తిన్న తర్వాత వారి మధ్యనే మానవావతారిగా కూర్చుని ఉన్నాడా? యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని శరీరాలను ధరించాడు?”

7) ఆరవ ప్రశ్నకు కొనసాగింపుగా తలెత్తే మరో ప్రశ్న, అనగా ఏడవ ప్రశ్న, 'యేసు శరీర-రక్తాలు రొట్టె-ద్రాక్షారసాల రూపంలో ఇంత సునాయాసంగా అర్పించబడడం సాధ్యమవుతే, ఆయన మానవ స్వరూపిగా జన్మించి, వేదన అనుభవించి, తన ప్రాణాన్ని ధారపోయవలసిన అగత్యమేమొచ్చింది? అలా శరీర-రక్తాలుగా మారిన పదార్థాలను క్రమం తప్పకుండా మనమే ప్రతిరోజు అర్పించేసుకుంటే సరిపోయేది కదా?”

8) శారీరక ఆహారాన్ని గురించి మాటలాడుతూ, “అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును...” (మార్కు 7:19 ) అని ప్రభువు సెలవిచ్చాడు. ఈ నేపథ్యంలో తలెత్తే ఎనిమిదవ ప్రశ్న, 'యేసు మన కొరకు అర్పించిన శరీర-రక్తాలను అక్షరాలా కడుపులోనికి పోయే ఆహారమని భావించడం, కేవలం ఆయన ఔన్నత్యాన్ని దిగజార్చి ఆయన ప్రశస్తమైన బలియాగాన్ని అవమానపాలు చేయడమే అవుతుంది కదా! కాదనడానికి కారణాలేమైనా ఉన్నాయా? 'నా శరీర-రక్తాలుగా మారిన రొట్టె-ద్రాక్షారసాలు, కడుపులోనికి కాక నేరుగా హృదయములోనికే పోవును' అని ప్రభువెక్కడైనా చెప్పాడా?”

9) తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహెూవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహెూవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. " (ద్వితీయోపదేశకాండం 12:31 ) అని దేవుడు ఖండితంగా హెచ్చరించాడు. తమ దేవతల పేరుతో అర్పించే ఆహారం, ఆ దేవతాంశాలుగా మారిపోతాయని, వాటిని తినేవారు తమ దేవతలనే భుజిస్తున్నారన్నది ప్రాచీన ఐగుప్త మరియు బబులోనీయ మతవిశ్వాసాలలో తేటగా కనిపిస్తాయి. అటు అన్యులను, ఇటు క్రైస్తవులను సమన్వయపరిచే క్రమంలో రోమన్ కేథలిక్ మత గురువులు, క్రైస్తవ లేఖన బోధలను వక్రీకరించి అన్య మతాచారాలతో వాటిని కలగలిపిన ఎన్నో ఉదంతాలలో ప్రభురాత్రి భోజన పదార్థాంతరవాదం కూడా ఒక ఉదాహరణ. ఇక్కడ తలెత్తే తొమ్మిదవ ప్రశ్న, 'దైవారాధనలో అన్యదేవతారాధన విధానాలు ప్రవేశపెట్టకూడదనే ద్వితీయోపదేశకాండ నియమాన్ని ఉల్లంఘించింది రోమన్ కేథలిక్కులా లేదా ప్రభువే ఆ విగ్రహారాధన పద్దతికి మరియు దైవాజ్ఞ అతిక్రమానికి బాధ్యత వహించాలా??

దేవుని ఆరాధన క్రమములోనికి అన్యాచారాలను ప్రవేశపెట్టడం సరికాదని ఓఫీర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఏమంటున్నారో గమనించండి; రాత్రివేళల్లో సమావేశమై పూజలు పునస్కారాలు జరుపుకోవడం సాతాను సంబంధమైన కొన్ని రహస్య సంస్థల, చీకటిమతాలవారి సాంప్రదాయం. ఇంగితం లేని కొందరు వ్యక్తులు, తామేదో సంఘాన్ని సంస్కరించేస్తున్నామని భ్రమపడిపోతూ, క్రీస్తు సంఘాన్ని ఎటువైపు లాగుతున్నారో గమనించండి' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజి 52)

 ప్రభురాత్రి భోజనాన్ని రాత్రి వేళ మాత్రమే ఆచరించాలని నమ్మేవారికి సరిగ్గానే బుద్ధి చెబుతూ వ్రాసిన ఈ మాటలు, ఆయన సమర్థించే పదార్థాంతరవాద కోణానికి కూడా వర్తిస్తుందని బహుశః ఓఫీర్ గారికి తెలియకపోవచ్చు!

10) చివరిదైనా, ఎంతో తర్కబద్ధమైన పదవ ప్రశ్న, 'రొట్టె-ద్రాక్షారసాలు ప్రభువు శరీర-రక్తాలుగా మారితే, రంగులో కాని రుచిలో కాని, వాసనలో కాని, పదార్థంలో కాని, ఆ మార్పు ఎందుకు కనిపించదు. రొట్టె-ద్రాక్షారసాలకు సహజంగా ఉన్న గుణాలలో ఎలాంటి మార్పులు చేర్పులు సంభవించకపోయినా, అవి అక్షరాలా ప్రభువు శరీర-రక్తాలుగా మారిపోయాయని ఎందుకు నమ్మాలి. అలా మారకపోయినా, వాటిని తన శరీర-రక్తాలని అభివర్ణించాడంటే, అది అలంకారం మాత్రమే అని ఒప్పుకోవడానికి ఏమిటి సమస్య?”

 

ఓఫీర్ గారి రచనలలో ఈ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయా?

ఓఫీర్ గారి బోధలను పై ప్రశ్నలలో కొన్నింటికి జవాబుగా కొందరు వినియోగించే ప్రయత్నం చేయవచ్చు. ప్రత్యేకంగా ఐదవ మరియు పదవ ప్రశ్నలు చర్చించేటప్పుడు ఓఫీర్ గారి కొన్ని వ్యాఖ్యలను మనం పరిశీలించడం అవసరం. అవేంటో గమనించండి;

“సరైన రీతిలో సిద్దపడి యోగ్యమైన రీతిలో విశ్వాసి ప్రభురాత్రి భోజనంలో పాలు పొందితే, అతడు చేతిలో పట్టుకున్న రొట్టె, అతడు మ్రింగగానే క్రీస్తు దేహమై అతడిలో జీర్ణమవుతుంది. అలాగే అతడు త్రాగిన ద్రాక్షారసం, సాక్షాత్తు క్రీస్తు రక్తమై అతడి శరీరంలో ప్రవహిస్తుంది' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజి 33)

ప్రభురాత్రి భోజన సమయంలో తీసుకునే రొట్టె-ద్రాక్షారసం ఒక వ్యక్తిలో వాస్తవంగా క్రీస్తు శరీరమై క్రీస్తు రక్తమై జీర్ణం కావాలంటే మొదట ఆ వ్యక్తి నూతన జన్మపొందిన వాడయ్యుండాలి' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 33).

 రక్షింపబడిన వ్యక్తి, ఏదో ఆచార రీత్యా ప్రభువు బల్లలో పాలుపొందినంత మాత్రానా అతడు తిన్న పదార్థం యేసు రక్తం కాదు, యేసు శరీరం కాదు అన్న విషయం ఎంత సత్యమో, రక్షింపబడిన వ్యక్తి తింటే అది నిజంగా అతడిలో యేసు శరీరంగా జీర్ణం అవుతుంది అన్న మాట కూడా అంతే సత్యం' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం , పేజీ 36)

“అదే విధంగా, మారుమనస్సుతో కూడిన బాప్తిస్మం పొంది, సరైన సిద్దపాటుతో, వివేచనతో యోగ్యంగా పాలుపొందే వారికి మాత్రమే ప్రభురాత్రి భోజన ద్రవ్యాలు వాస్తవంగా క్రీస్తు శరీరంగా క్రీస్తు రక్తంగా మారుతాయి' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 39)

 కాబట్టి ఓఫీర్ గారి బోధ ప్రకారం బల్లలో వినియోగించే రొట్టె-ద్రాక్షరసాలు పూర్తిగా క్రీస్తు శరీర-రక్తాలుగా మారవు. రక్షింపబడినవారు సేవించినంత మేరకు మాత్రమే, అది కూడా వారు సేవించిన తరువాతే అవి ప్రభువు శరీర-రక్తాలుగా వారిలో జీర్ణమవుతాయి. ఇదే నిజమైతే, మిగిలిపోయిన పదార్థాలు క్షయమైపోయినా క్రీస్తు శరీర-రక్తాలు కుళ్లుపట్టేలా దేవుడు ఎలా అనుమతిస్తాడనే ప్రశ్నకు తావుండదు. అలాగే బల్ల మీదున్న పదార్థాలు శరీర-రక్తాలుగా కనిపించకుండా, రొట్టె-ద్రాక్షారసాలుగానే ఎందుకు కనిపిస్తాయనే ప్రశ్న కూడా అడగలేము. కడుపు లోపలికి వెళ్లిన తరువాతే అవి ప్రభువు శరీర-రక్తాలుగా జీర్ణమౌవుతాయి కాబట్టి, పైన లేవనెత్తిన ఐదు మరియు పదవ ప్రశ్నలను కొట్టివేయాల్సొస్తుంది. కాని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే, కొట్టివేయాల్సింది ఆ ప్రశ్నలను కాదు, ఓఫీర్ గారు సృష్టించిన ఈ సంగ్ధిదాన్నే కొట్టివేయాలని మనకు అర్థమౌతుంది. ఇందుకు దోహదపడే కొన్ని ప్రశ్నలను ఇక్కడ లేవనెత్తుతున్నాను, గమనించండి:

ఎ) ప్రభువు, 'ఇది నా శరీరం” “ఇది నా రక్తం' అని శిష్యులు తినబోయే పదార్థాలను ఉద్దేశించి అన్నాడా, లేక వారు తిన్న తరువాత అవి అలా మారుతాయని అన్నాడా? సాదృశ్యవాదులకు హితవు పలుకుతూ “పాలుపుచ్చుకొనుటయే' అంటే 'పాలుపుచ్చుకొనుటయే' అనే చదువుకోవాలి కాని ‘పాలుపుచ్చుకొనుటతో సమానమైయున్నది గదా' అంటూ మన స్వంత కవిత్వం కలప కూడదు' అని ఓఫీర్గారు చెప్పిన నియమాన్ని వారు తమకు తామే అన్వయించుకోలేక పోయారు (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 5). ఆయన శరీరం అని ప్రభువు చెప్పిన రొట్టెను, అది తిన్న తరువాతే, అది కూడా ఫలానావారు తింటేనే ప్రభువు శరీరంగా జీర్ణమవుతుందంటూ తమ స్వంత కవిత్వాన్ని కలుపుకున్నారు. సాదృశ్యమని నమ్మినా, అక్షర భావంలో తీసుకున్నా, అందరు ఒప్పుకొని తీరాల్సిందేమిటంటే, శిష్యులు ఇంకా తినని రొట్టెను ప్రభువు 'ఇది నా శరీరం అని అంటుంటే 'ఇది ఫలానావారు తిన్న తరువాత ఆయన శరీరంగా వారిలో జీర్ణమవుతుందనే క్రొత్త భావాన్ని ఓఫీర్ గారు సృష్టించారు.

బి) తిన్న తరువాతే, అదికూడా ఫలానా వారు తింటేనే పదార్థాంతరం జరిగితే, మిగతా వారికి అది సాధారణ రొట్టె మాత్రమే కదా? అవుననే ఓఫీర్గారు కూడా ఒప్పుకున్నట్లు మనం ఇది వరకు చూసాం (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 33). అలాంటప్పుడు, అసలు ప్రభువు శరీరంగా మారని రొట్టెను పట్టుకొని, దానిని ప్రభువు శరీరమని వివేచించి తినాలంటూ పౌలు ఎందుకు హెచ్చరించినట్లు (1కొరింథీ 11:29 ). నేను పదార్థాంతరవాదాన్ని నమ్మకపోయినా, అలా నమ్మేవారు ఆలోచించుకుంటారని ఈ ప్రశ్న అడిగాను.

సీ) తిన్న తరువాతే, అదికూడా ఫలానావారు తింటేనే పదార్థాంతరం జరిగితే, మిగతావారికి అది సాధారణ రొట్టె మాత్రమే కదా? అలాంటప్పుడు, కొందరు 'అయోగ్యంగా పాలుపుచ్చుకోవడమంటూ ఏమీ లేదు. మాములు రొట్టె తిని, మామూలు ద్రాక్షారసం త్రాగడంలో యోగ్యమేంటి? అయోగ్యమేంటీ? ఎవరిలో అవి ప్రభువు శరీర-రక్తాలుగా జీర్ణమవుతాయో, వారు మాత్రమే యోగ్యంగా పాల్గొంటున్నారో లేదో చూసుకోవాలి. రొట్టె విరిచే ప్రతి ఒక్కరికీ 1కొరింథి 11:28-29 లో ఉన్న ఆ హెచ్చరిక మాటలు ఎందుకు?

డి) రొట్టె-ద్రాక్షారసాలు తిన్న తరువాత పదార్థాంతరం చెందుతాయనడానికి ఓఫీర్ గారు కాని, ఇంకెవ్వరైనా సరే, కనీసం ఒక్క లేఖన ఆధారాన్నయినా చూపించగలరా? ప్రత్యక్షంగా ఆ మాటలే చూపించమని అడగడంలేదు. కనీసం అన్యోపదేశంగానైనా ఆ విధంగా బోధించే ఏదైనా ఆధారం వాక్యంలో ఉందా అని మాత్రమే అడుగుతున్నాను. ఇది సవాలు విసరడానికి అడిగే ప్రశ్న కాదు. ఎలాంటి లేఖనాధారాలు లేకుండా ఎందుకు ఇలాంటి కొత్త బోధలు సృష్టిస్తున్నారనే బాధతో, భారంతో అడుగుతున్నాను. 'క్రైస్తవ సమాజంలో ఇదివరకే ఉన్న గందరగోళం చాలదన్నట్లు ఇదొక క్రొత్త గందరగోళం' అంటూ ఓఫీర్ గారు ఇంకెవరి మీదో విసిరిన వ్యంగం ఆయనకు కూడా వర్తించకుండా జాగ్రత్త పడితే మంచిది (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 53).

ఏది ఏమైనా, ఓఫీర్ గారీ ఈ అభిప్రాయం లేఖనానుసారం కాదు కాబట్టి అది నేను లేవనెత్తిన ఐదు మరియు పదవ ప్రశ్నలకు జవాబుగా ఎంత మాత్రం సరిపోదు.

 

3. ప్రభువు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగడం

బల్లలో పాలుపుచ్చుకోవడం ద్వారా, యోహాను ఆరవ అధ్యాయంలో ప్రభువు బోధించిన విధంగా ఆయన శరీర-రక్తాలను సేవించి, నిత్య జీవం పొందడానికి ప్రభువు అక్కడ ప్రస్తావించిన షరతును నిర్వర్తిస్తున్నారని అక్షరవాదులు భావిస్తున్నారు. అయితే నిజానికి యోహాను ఆరవ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాటలకు అర్థం ఏమిటి? ఆ మాటల అర్థాన్ని నిర్ధారించుకోవడం అవసరం. ఎందుకంటే, పదార్థాంతరవాదులు సాధారణముగా అపార్థం చేసుకునేది ఈ మాటలనే. ఉదాహరణకు ఈ మాటలు గమనించండి;

“కావున యేసు ఇట్లనెను-మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము”(యోహాను 6: 53-56 )

 తప్పకుండా తన శరీర-రక్తాలను తినమనే అంటున్నట్లు అనిపిస్తుంది కదా? అయితే, పూర్తి అధ్యాయ సందర్భ వెలుగులో విశ్లేషించినపుడు, ఈ మాటల వెనుక ప్రభువు ఉద్దేశించిన అసలు భావాన్ని గుర్తించడం సులభమే.

1) ఈ సంభాషణ ఎక్కడ మొదలైంది?

ఐదువేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో తృప్తిగా విందు చేయించిన అద్భుతంతో యోహాను ఆరవ అధ్యాయం ప్రారంభమవుతుంది. మరోసారి ఉచిత భోజనమొస్తుందని వారంతా మరుసటి రోజున కూడా వచ్చి కూర్చున్నారు. అప్పుడు, “యేసు-మీరు సూచనలను చూచుటవలన కాదు, గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను” (యోహాను 6:26-27 ). ఈ నేపథ్యంలోఆయన తనను తాను ఆహారంతో పోల్చుకుంటూ, తన అలవాటు చొప్పున ఆత్మీయ సంగతులను భౌతిక సాదృశ్యంతో వారికి బోధించసాగాడు.

2) విశ్వాసమే అసలు విషయం

యేసు నిత్యజీవమిస్తానని వారితో చెప్పినప్పుడు (27వ వచనం), వారు చేయవలసిన దేవుని పనేమిటని ఆయనను వారు ప్రశ్నించారు. అందుకు “యేసు-ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను” (యోహాను 6:29 ). ఇక్కడ ప్రభువు తినడం గురించి ఏమీ చెప్పలేదని, కేవలం విశ్వాసాన్ని గురించి మాత్రమే ప్రస్తావించాడని గమనించండి.

3) సాదృశ్యాన్ని స్పష్టం చేసిన ప్రభువు మాటలు

ఆ తరువాత వారు, మోషే తమ పితరులను మన్నా కురిపించి పోషించిన సంగతిని లేవనెత్తారు. అందుకు ఆయన, పరలోకము నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం తానేనని వారికి బదులిచ్చాడు (వ 32-33). అయితే ఒక ఆత్మీయ సంగతిని వ్యక్తపరచడానికి ఒక భౌతిక సాదృశ్యాన్ని ఆయన వినియోగిస్తున్నాడని అర్థం చేసుకోకుండా, తమకు ఆ రొట్టె కావాలంటూ యూదులు అడగసాగారు. అప్పుడు ప్రభువు, తన మాటల భావాన్ని వారికి స్పష్టం చేస్తూ ఇలా అన్నాడు- “జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు” (యోహాను 6:35 ). ఇక్కడ ప్రభువు భౌతిక ఆహారాన్ని గురించి మాట్లాడడం లేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే, భౌతిక ఆహారాన్ని తినేవారు మళ్లీ మళ్లీ ఆకలికి గురవుతారు. తాను ఆత్మీయ ఆహారమని, విశ్వాసంతో తనను గైకొనినవారికి ఆత్మీయ ఆకలి శాశ్వతంగా తీరిపోతుందని ఇక్కడ ప్రభువు ఉద్దేశం. గమనించండి; ఆకలి తీరాలంటే తినాలి, దాహం తీరాలంటే త్రాగాలి కదా. కాని తన వద్దకు వస్తే ఆకలి తీరుతుందని, తనను విశ్వసిస్తే దాహముగొనరని ప్రభువు ఎందుకు అన్నాడు? తనను తినడమంటే తన వద్దకు రావడమే; తనను త్రాగడమంటే తనయందు విశ్వాసముంచడమే అన్న నిర్వచనం, ప్రభువే స్వయంగా ఇచ్చిన ఈ వివరణలో తేటగా కనిపిస్తుంది.

4) ఆకలి, ఆహారం

ఇలా ఆకలిని, ఆహారాన్ని సాదృశ్యాలుగా వినియోగించడం, ప్రభువు ప్రకటించిన ఇతర సందేశాలలో కూడా మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు, “నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు” (మత్తయి 5:6 ). జీవాహారమైన ప్రభువునందు మన ఆత్మీయ ఆకలిదప్పులు తీరుతాయి. రొట్టె-ద్రాక్షరసాలు ఆ ఆకలిదప్పులను తీర్చలేవు. భౌతిక ఆహారం భౌతిక ఆకలిదప్పులను తీరుస్తుంది; ఆత్మీయ ఆహారం ఆత్మీయ ఆకలి దప్పులను తీరుస్తుంది.

అలాగే, “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని” యోహాను 4:14 లో చూస్తాము. ఇది కూడా శారీరక దప్పీగురించి మరియు దానిని తీర్చే నీటిని గురించిన ప్రస్తావన కాదని వేరే చెప్పనవసరం లేదు. ఆయన ఇచ్చే జీవజలము పరిశుద్ధాత్మ అని యోహాను 7:37-39 లో స్పష్టంగా చెప్పబడింది. అంతమాత్రాన పరిశుద్దాత్ముడు అక్షరాల నీటిలా ఉంటాడని లేదా తనను పొందిన వారిలో నీటిలా జీర్ణమౌతాడని భావిస్తే అది లేఖనాలకు ఎంత విరుద్దం! ప్రభురాత్రి భోజనాన్ని అక్షరాల ప్రభువు శరీర-రక్తాలని తలంచే వారు చేసే పొరపాటు కూడా సరిగ్గా ఇలాంటిదే.

5) ఎన్ని సార్లు స్పష్టం చేసినా అపార్థమే మిగిలింది

తనను విశ్వసించమన్నదే తన మాటల భావమని ప్రభువు పదే పదే వారికి జ్ఞాపకం చేసాడు. “మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని” యోహాను 6:36 ). "కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును” (యోహాను 6:40 ). నాలుగు సార్లు ఇదే సత్యాన్ని నొక్కి చెప్పినా, అవిశ్వాసులైన ఆ యూదులకు అర్థం కాలేదు. ఆయననే తినమంటున్నాడని, అదెలా సాధ్యమని పెద్ద రాద్దాంతమే చేసారు (యోహాను 6:42-43 ). అయినా, రొట్టె భూమి నుండి కలిగిన ధాన్యం నుండి వస్తుందేగాని, పరలోకము నుండి రాదుగదా, తనను తాను పరలోకము నుండి వచ్చిన రొట్టెగా పీలుస్తున్నాడు కాబట్టి ఇది సాదృశ్యమే అయ్యుంటుందని ఆలోచించే కనీస ఇంగితానికి కూడా వారు పని చెప్పలేదు. ఒకవేళ మన్నావలె పరలోకము నుండి అనుగ్రహించబడినా, రొట్టె ఒక సజీవమైన వ్యక్తిగా ఉండదు కదా, కాబట్టి ఇది అలంకారమే అయ్యుండాలని కూడా కనీసం ఆలోచించలేదు. తరచుగా ఉపమాన రీతిగా బోధించేవాడు కాబట్టి ఇది కూడా అంతే అయ్యుండవచ్చు కదా అనే తలంపు కూడా వారికి రాలేదు.

“విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే" (యోహాను 6:47-48 ) ఆయన వద్దకు వచ్చినవారికి నిత్యజీవముంటుందని, ఆ జీవాన్ని ఇచ్చే రొట్టె ఆయనే అని ఇక్కడ ప్రభువు మరోసారి ఈ సాదృశ్యభావాన్ని విడమరచి చెప్పాడు. ఇక్కడ రొట్టె-ద్రాక్షారసాలను గురించి కాని, తినడం గురించి కాని ఏమీ లేదు. భౌతిక జీవానికి రొట్టెకూ ఉన్న సంబంధమే నిత్యజీవానికి తనకూ కూడా ఉందని మాత్రమే ఈ సాదృశ్యభావము.

“మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే” (యోహాను 6:49–50 ). ఇక్కడ ప్రభువు వారికి భౌతిక ఆహారానికి మరియు ఆత్మీయ ఆహారానికి వ్యత్యాసాన్ని చూపిస్తూ, మన్నా అనే భౌతిక ఆహారాన్ని తిన్నవారు చనిపోయారు కాని, ఆత్మీయ ఆహారమైన తనను తిన్నవారు చనిపోలేరని మరింత వివరంగా చెప్పాడు. అలాగే, బల్లలోని రొట్టె-ద్రాక్షారసాలు తినినంత మాత్రాన ఎవ్వరూ నిత్యమూ జీవించరు కాని ప్రభువును విశ్వసించినవారే నిత్యము జీవిస్తారు.

 ఇంత స్పష్టంగా చెప్పినా, తమకు ఆత్మీయ భావాల వివేచన ఏ మాత్రం లేదని నిరూపిస్తూ, “యూదులు-ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి” (యోహాను 6:52 ). ఆయన నిత్యజీవానికి అవసరమైన ఆత్మీయ రొట్టె అన్నదే ఆయన భావమని ఏ మాత్రం గ్రహించకుండా, ఇంకా తమ పొట్టలను గురించే ఆలోచిస్తున్నారు. 'నీవు తిరిగి జన్మించాలని ప్రభువు చెప్పినపుడు, తిరిగి తల్లి గర్భములోనికి ప్రవేశించి పుట్టడం ఎలా సాధ్యమవుతుందని నికోదేముకు కలిగిన అపార్థం వంటిదే ఇక్కడ కూడా జరిగింది (యోహాను 5:3-8 ). శరీరానికి శారీరక జననము, ఆత్మకు ఆత్మీయ జననము. అలాగే, శరీరానికి భౌతికమైన ఆహారము, ఆత్మకు క్రీస్తు అనే నిత్యజీవాహారము.

6) యోహాను ఆరవ అధ్యాయాన్ని ప్రభురాత్రి భోజనముగా భావిస్తే తలెత్తే సమస్యలు

ఎ) యోహాను ఆరవ అధ్యాయ సందర్భము ప్రభు రాత్రి భోజనాన్ని గురించి కానే కాదని, రొట్టె కొరకు ప్రాకులాడుతూ ప్రభువును వెదుక్కుంటూ వచ్చినవారికి అవసరమైన అసలు రొట్టె ఏమిటో వివరించే సందర్భం మాత్రమే అని, ఆ అధ్యాయాన్ని ఎవరైనా విశ్లేషించి నిర్వివాదంగా నిర్ధారించుకోవచ్చు. తననే తిని త్రాగాలన్నమాటలను అపార్థం చేసుకున్నవారికి వివరణ ఇస్తూ, యేసు ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి వారికి ఇచ్చి, “ఇదిగో నా శరీరం, దీనిని తిన్నవారు నా శరీరంలో పాలుపుచ్చుకుంటారు' అని చెప్పలేదు. అలాగని, ఓఫీర్ గారు అనుకున్నట్లు 'జవాబు వినడానికి వారు యోగ్యులు కారు' కాబట్టి వారికి జవాబియ్యలేదు అనుకోవటం కూడా సరికాదు (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 8). చెప్పిన జవాబు మన ఆలోచనకు తగినట్లుగా లేనంత మాత్రాన జవాబు చెప్పలేదంటూ వాస్తవాల నుండి దృష్టి మళ్లించడం నిజాయితీ అనిపించుకోదు. తన శరీర-రకాలను తిని త్రాగడమంటే తన వద్దకు వచ్చి తన యందు విశ్వాసముంచడం అని తప్ప ఇంకే వివరణ అయినా ప్రభువు ఇచ్చినట్లు ఆ సందర్భంలో మనం చూడము. సంఘంతో ఆయన తర్వాత చేసిన ప్రభురాత్రి భోజన సందర్భాన్ని తీసుకొచ్చి, యూదులతో మాత్రమే జరిగిన ఈ సంభాషణకు జోడించడం పూర్తిగా అసందర్భ వ్యాఖ్యానమే అవుతుంది.

బి) “మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు” (యోహాను 6:53 ) అని ప్రభువు చెప్పిన మాటలను అక్షరభావములో తీసుకుంటే, తనతో పాటు సిలువ వేయబడిన దొంగకు నిత్యజీవాన్ని ఎలా వాగ్దానం చేయగలడు? (లూకా 23:43 ). ఆ దొంగ ప్రభురాత్రి భోజనం ద్వారా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి ఆ నిత్యజీవాన్ని సంపాదించుకున్నాడా? లేదని మనకు తెలుసు. అయినా, ప్రభువు శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితే తప్ప నిత్య జీవం లేదని ఆయన యూదులతో అన్నాడు కదా? ప్రభువు యూదులతో అబద్దమాడాడా, లేదా ఈ దొంగకే బూటకపు భరోసా ఇస్తున్నాడా? యోహాను 6:53-56 ను అక్షర భావంలో తీసుకోవడం ఈ విధంగా ప్రభువును అబద్దికునిగా చేయడమే అవుతుంది. ఇది ప్రభురాత్రి భోజనాన్ని గురించిన ప్రస్తావన అని నమ్మేవారు ఈ సమస్యను తప్పించుకోలేరు. కాని, ఆయనను విశ్వసించడమే ఆయనను తినడం అని యోహాను ఆరవ అధ్యాయ పూర్తి సందర్భం మనకు స్పష్టం చేస్తున్న దరిమిలా, ఈ భావంలో ఆ దొంగ తన కొరకు విరువబడిన ప్రభువు శరీరాన్ని తిని, తన కొరకు ధారపోసిన ప్రభువు రక్తాన్ని త్రాగాడు. అతడు యేసును విశ్వసించాడు. కాబట్టి అతనికి నిత్య జీవం ఉంది. ఈ వివరణ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం.

సిలువ మీది దొంగ సంఘటన సంఘస్థాపనకు ముందు జరిగింది గదా అని ఎవరైనా బదులిస్తే, యోహాను 3:16 లో నిత్య జీవం ఎలా కలుగుతుందో తెలియజేయబడిన వాగ్దానం, సంఘస్థాపన తరువాత రద్దు చేయబడలేదు, లేశమైనా సవరించబడలేదు అని వారికి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువును తిని-త్రాగని వానికి నిత్య జీవం లేదు (యోహాను 6:53-56 ). అయితే ఆయనను విశ్వసించినవాడు నశింపక నిత్య జీవం పొందుతాడు (యోహాను 3:16 ). ఎందుకంటే, ప్రభువును తిని త్రాగడమంటే ఆయనను విశ్వసించడమే.

సీ) ఒక వైపు రక్షణ పొందినవారు తింటేనే రొట్టె ప్రభువు శరీరంగా మారుతుందని బోధిస్తూ, మరో వైపు నిత్యజీవం పొందడం మనకు ప్రభురాత్రి భోజనం వలన కలిగే మొదటి ప్రయోజనం అని కూడా ఓఫీర్ గారు వ్రాసారు (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 12, 39). ఇంతకు రక్షణ ఉన్నవారికి నిత్యజీవం లేదా? ఉంటే, ప్రభురాత్రి భోజన సంస్కారం వలన వచ్చే నిత్య జీవం ఏమిటి? అంటే, నిత్య జీవం లేని రక్షణ కూడా ఉటుందా? బైబిల్ అలాంటిదేమీ బోధించడం లేదు. ఒకవేళ నిత్య జీవమిచ్చే ప్రభావమేదైనా ఆ సంస్కారంలో వుంటే, అది రక్షణ పొందనివారికి అందించాలి కదా! కాని లేఖనం అందుకు సమ్మతించదు. రక్షణ పొంది, ఆంటే విశ్వాసం ద్వారా నిత్యజీవం ప్రాప్తించిన వారే ప్రభువు బల్లలో చేయి వేయాలి. కాబట్టి, ప్రభురాత్రి భోజనం నిత్యజీవాన్ని ఇచ్చే ప్రభువు శరీర-రక్తాలలో పాలివారిగా చేయడానికి రూపొందించబడిన ఏర్పాటు ఎంత మాత్రముకాదు.

7) విస్పష్టమైన ముగింపు

యోహాను ఆరవ అధ్యాయంలో తన సందేశాన్ని ముగిస్తూ, తన ఈ మాటలను ఆత్మీయభావంలో తీసుకోవాలా లేక శారీరక భావంలో తీసుకోవాలా అన్న ప్రశ్నకు, ఎవ్వరికీ ఇంకే అనుమానానికి తావివ్వనంత స్పష్టమైన వివరణ ప్రభువే స్వయంగా ఇచ్చాడు. “ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి” (యోహాను 6:63), శారీరకంగా తిని త్రాగడం వలన ఎవ్వరికీ ఏ ఆత్మీయ మేలు రాదు. ఆత్మీయంగా ప్రభువును సమీపించి ఆయనను విశ్వసించడమే నిత్య జీవానికి ఏకైక మార్గం. సాదృశ్యాలను, ఆత్మీయ సంగతులను అర్థం చేసుకోలేని యూదులలా, మొండిగా, మూర్ఖంగా, అర్థంలేని ఆలోచనలకు తావివ్వకుండా మనం జాగ్రత్త వహించాలి.

 

4. కొరింథి పత్రికలో ఉన్న పౌలు మాటల భావం

“మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకొనుటయే కదా; మనము విరుచు రొట్టెలోనిది తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే కదా” (1కొరింథి 10:16) అని పౌలు స్పష్టంగా ప్రకటించాడు కదా! అలాగే, “ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు” (1కొరింథి 11:29) అని కూడా హెచ్చరించాడు. మరి బల్లారాధనలో తీసుకునే పదార్థాలు ప్రభువు శరీర-రక్తాలే అని నమ్మితే తప్పేమిటీ? అలా నమ్మడం ముమ్మాటికీ తప్పు. అయితే, తప్పు పౌలుది కాదు; పౌలు మాటలను అపార్థం చేసుకున్నవారిదే. మనం మొదట్లో చెప్పుకున్నట్లు, పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు, అందులో ఉన్న కొన్ని సంగతులు అర్థం చేసుకోవడం కష్టతరమని, విద్యావిహీనులు మరియు అస్థిరులైనవారు తమ స్వకీయ నాశనముకై వాటిని అపార్థం చేసుకుంటారని పేతురు చేసిన హెచ్చరికను జ్ఞాపకముంచుకోవడం అందరికి శ్రేయస్కరం (2 పేతురు 3:15-17 ).

1) 1కొరింథి 10:16 కు వివరణ

ఎ) సందర్భం :

ఇంతకు ఏమిటిక్కడ సందర్భం? విశ్వాసులు విగ్రహార్పిత భోజనం తినవచ్చా తినకూడదా అనే ప్రశ్నతో పౌలు ఈ సందర్భంలో వ్యవహరిస్తున్నాడు. 1కొరింథి ఎనిమిదవ అధ్యాయంలో ఈ చర్చను ప్రారంభించి, పదవ అధ్యాయ చివరి వరకు ఈ అంశాన్నే వివిధ కోణాలనుండి తర్కిస్తున్నాడు. విగ్రహాలలో కాని, విగ్రహార్పితాలలో కాని ఏమి లేదన్న జ్ఞానం మరియు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏదైనా తినగలిగే స్వేచ్ఛ మనకున్నప్పటికీ, బలహీనమైన మనస్సాక్షి కలవారికి అభ్యంతర కారణం కాకుండా మన స్వేచ్ఛను విడిచిపెట్టుకోవడం క్రైస్తవ సుగుణం అని పౌలు ఎనిమిదవ అధ్యాయంలో బోధిస్తున్నాడు. తాను కూడా అలాగే సువార్తకు అభ్యంతర కారణంకాకుండా దోహదపడేలా తనకున్న క్రైస్తవ స్వేఛ్చలనెన్నింటినో విడిచిపెట్టుకున్న ఉదాహరణలను తొమ్మిదవ అధ్యాయంలో పేర్కొన్నాడు. ఇప్పుడు పదవ అధ్యాయంలో, విగ్రహార్పితాలు తినే స్వేచ్ఛ ఉందనుకునేవారు పరిగణనలోనికి తీసుకోవాలసిన మరికొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నాడు.

బి) భావం:

విగ్రహార్పితాలు దయ్యాలకు అర్పించబడుతాయి కాబట్టి వాటి విషయమై జాగ్రత్త పడమని పౌలు హెచ్చరిస్తూ, ప్రభువు బల్లలో పాల్గొన్నవారు ప్రభువుతో ఏ విధంగా పాలివారవుతారో (10:16,17 ), బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠంతో ఏ విధంగా పాలివారవుతారో (10:18 ), దయ్యాలకు అర్పించినవాటిని తినువారు, దయ్యాలతో పాలివారవుతారని తర్కిస్తున్నాడు (10:19,20 ). ఇక్కడ ప్రస్తావించబడినవన్నీ ఆత్మీయభావంలో చెప్పబడ్డాయని గమనించగలము. బలి అర్పించినవి బలిపీఠంగా మారుతాయి కాబట్టి వాటిని తిన్నవారు బలిపీఠంతో పాలివారవుతారని అపోస్తలుడు అంటున్నాడా? దయ్యాలకు అర్పించినవి దయ్యాలుగా మారుతాయి కాబట్టి వాటిని తినేవారు దయ్యాలతో పాలివారవుతారన్నది అపోస్తలుని భావమా? ఆ విధంగా తలచడం ఎంత విడ్డూరం! వాటిని తినడం ద్వారా వారు ఆత్మీయంగా ఎవరికి సంబంధించినవారో లేదా, అపోస్తలీయ పరిభాషలో ఎవరితో 'పాలివారో? తెలియవస్తుందన్నదే తప్ప, ఆ రెండు సందర్భాలలోనూ పదార్థాంతరమేమి జరుగదు. అంటే, బలిపీఠంపై అర్పించిన పదార్థాలు బలిపీఠంగా మారడం, దయ్యాలకు అర్పించిన పదార్థాలు దయ్యాలుగా మారడం లాంటివేమైనా జరుగుతాయని అపోస్తలుని ఉద్దేశం కాదు. అలాంటప్పుడు, అదే సందర్భంలో, అదే క్రమంలో, అదే ధోరణిలో ప్రస్తావించబడిన ప్రభురాత్రి భోజన పధార్థాలు మాత్రమే అక్షరాలా ఆయన శరీర-రక్తాలుగా మారుతాయన్నది అపోస్తలుని ఉద్దేశమని చెప్పడం సందర్భరహిత స్వీయ వ్యాఖ్యానమే తప్ప మరేమి కాదు. ప్రభు బల్లలోనిది తిని ఆయన శరీర-రక్తాలలో పాలివారవుతున్న మనం, దయ్యాల బల్లలోనివి తిని ఆ దయ్యాలతో కూడా పాలివారమవ్వడం సరికాదన్నదే ఇక్కడ పౌలు సందేశం. ఈ రెంటిలో, ఒకటి ఆత్మీయం, మరొకటి అక్షరభావం అనడం వీలు పడదు. ఎందుకంటే ఒక దానికి సాదృశ్యముగా మరొకటి చెప్పబడలేదు కాని ఒకటి చేయకుండా ఉండేందుకు హేతువుగా మరొకటి చెప్పబడింది. కాబట్టి, అక్షరవాదులు ఈ భాగాన్ని వక్రీకరించి పదార్థాంతరవాదాన్ని సమర్థించుకోవడం అన్యాయం, వాక్య విరుద్ధం.

సి) ఒక్క రొట్టె ఒక్క శరీరం :

17వ వచనంలో అపోస్తలుడు “మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము” అంటున్నాడు. విశ్వాసులంతా తమ-తమ స్థానిక సంఘాలలో రొట్టె విరుస్తుంటే, వారందరు ఆ ఒక్కటే రొట్టెలో పాలుపుచ్చుకుంటున్నారని ఎలా చెప్పగలము? ఒక స్థానిక సంఘంలో ఉన్న సభ్యులందరు ఒక శరీరం అవుతారని దీని భావమా? అలాగైతే, కొరింథి స్థానిక సంఘాన్ని ఉద్దేశించి వ్రాస్తున్నపుడు, 'మీరు' అని కాక మనము' అని పౌలు తనను తాను కూడా కలుపుకోవడమేమిటి? అంటే, కలిసి రొట్టె విరిచిన కారణాన్ని బట్టి, పౌలు ఎన్ని సంఘాలు స్థాపించియుంటే, లేదా సందర్శించియుంటే, అన్ని సంఘాలతో అతను ఒక్క శరీరంగా ఉన్నాడా? ఒక్కో స్థానిక సంఘం ఒక్కో శరీరమౌతే, ఎన్నో శరీరాలతో పౌలు ఒక్క శరీరంగా చేయబడినట్లు మనం అర్థం చేసుకోవాలా? అది అలా ఉంచితే, ఎన్ని స్థానిక సంఘాలుంటే క్రీస్తుకు అన్ని శరీరాలు ఉంటాయా? సార్వత్రికంగా క్రీస్తు శరీరమని పిలువబడే సంఘం ఏ ఒక్క రొట్టె తినడం'ఒక్క శరీరం' అయ్యారు? అక్షరార్థ పదార్థాంతరవాదాన్ని విడిచిపెట్టి ఆత్మీయభావంలో ఆలోచించినప్పుడు ఈ చిక్కుముడి ఇట్టే విడిపోతుంది. ప్రభువు బల్లలో విరువబడే రొట్టెలన్నీ, అందరికొరకు విరువబడిన యేసు క్రీస్తు అనే ఆ ఒక్కరొట్టెను సూచిస్తున్నాయి. కాబట్టి, ఎన్ని స్థానిక సంఘాలున్నా, ఎన్ని రొట్టెలు విరువబడినా, మనమందరం ఆ ఒక్క రొట్టెలో ఒక్క శరీరం ఔతాము. దీనిని గ్రహించకుండా స్థానిక సంఘ విస్తారణ పరిమితి ఒక్క రొట్టెకు సరిపడా పరిమాణాన్ని బట్టి నిర్ధారించుకోవాలంటూ ఏవేవో వింత బోధలు పుట్టించడం లేఖన పరిణతి అనిపించుకోదని అలాంటి బోధలు చేసే పండితులు గుర్తిస్తే మంచిది (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 77)

డి) సమగ్ర లేఖన బోధ :

ఒకవేళ ఈ ప్రభురాత్రి భోజనంలో పదార్థాంతరం జరుగుతుందని ఇక్కడ పౌలు చెప్పియుంటే, మనమిదివరకే లేఖన వెలుగులో చర్చించుకున్న చిక్కుముడులన్నింటికి పౌలే కారకుడయ్యుండేవాడు. కాని పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసిన సంగతులు లేఖనాల సమగ్ర బోధకు అసంగతంగా ఉండడం సాధ్యంకాదు కాబట్టి ఈ వాక్యభాగం అక్షరవాదాన్ని సమర్థించదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

2) 1కొరింథీ 11:29 కు వివరణ :

“ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు"(1కొరింథి 11:29)

ఎ) ఓఫీర్ గారి వ్యాఖ్యానం :

ఈ వాక్యానికున్న అసలు భావాన్ని తెలుసుకునే ముందు, పదార్థాంతరవాదాన్ని సమర్ధించే ఓఫీర్ గారు ఈ మాటలను ఎలా విశ్లేషించారో గమనించండి:

'ఆ మాటలను గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రభువు రొట్టెను భుజించే విశ్వాసులు సరైన విధంగా భుజించకపోతే, వారికి శిక్షావిధి కలుగుతుందట. సరైన విధంగా భుజించడం అంటే ఏమిటి? ప్రభువు శరీరమని వివేచించి భుజించటమే యోగ్యంగా భుజించటం' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 5)

‘అలా వాస్తవంగా అది క్రీస్తు శరీరమేనని అర్థం చేసుకోకుండా ప్రభువు బల్లలో పాలుపొందటం చాలా ఘోరమైన తప్పిదం. ఆ తప్పు దేవునికి ఆగ్రహం కల్గిస్తుంది' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 5).

‘కొరింథి విశ్వాసులలో కొందరు అలాగే ప్రభువు భోజన ద్రవ్యాన్ని క్రీస్తు శరీరమని అర్థం చేసుకోకుండానే భుజించారు. తత్ఫలితంగా వారికి దేవుడు శిక్ష విధించాడు. నానా విధాలుగా దేవుడు వారిని శిక్షించాడు' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 6).

'వారు తాము తింటున్నది ప్రభువు స్వంత శరీరమని గ్రహించలేదు. ఏదో ఇది ఒక సాధారణమైన మానవ హస్తకృత్యమైన రొట్టె అనుకున్నారు. ఇది కేవలం సాదృశ్యం మాత్రమే. ఇది వాస్తవంగా ప్రభువు శరీరం ఎలా అవుతుంది? అని అనుకున్నారు. ఇది ప్రభువు శరీరం అని వారు అనుకోలేకపోయారు. ఆ ఘోరమైన నేరానికిగాను దేవుడు వారిలో చాలామందిని చంపి వేసాడు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. మనం విరిచే రొట్టె సాక్షాత్తు ప్రభువు శరీరమని గ్రహించకపోవడం మరణపాత్రమైన నేరం' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ6).

బి) సందర్భ సహిత వ్యాఖ్యానం :

ఓఫీర్ గారి వ్యాఖ్యానాన్ని అలా ఉంచి, 1కొరింథి 11 సందర్భాన్ని చూసినపుడు, వాస్తవానికి పదార్థంతరం జరిగిందని కాకుండా సాదృశ్యమని నమ్మడం ద్వారానే కొరింథి సంఘస్తులు అయోగ్యంగా బల్లలో పాలుపుచ్చుకున్నారనడానికి ఒక్క ఆధారం కూడా లేదు. బల్ల పూర్తి సందర్భంలో వారు చేసిన పొరపాటల్లా ఒకటే. అదేంటో అర్థం చేసుకుందాం. “మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునపుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను (1కొరింథి 11:20-22).

ప్రభువు మన కొరకు విరిచిన శరీరాన్ని, ధారపోసిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోడానికి అచరించే బల్లను, ఆదిమ సంఘంవారు ఒక ప్రేమ విందులో భాగంగా జరుపుకునేవారని ఈ సందర్భంలో చూస్తున్నాము. అయితే, కొరింథీయులు ఆ విందు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని ప్రక్కన పెట్టి, ఇతరులకు సరిపోతుందో లేదో చూడకుండా, ఇంటిలో భోజనం లేనట్లే తిండుబోతుతనానికి పాల్పడ్డారు. పేరుకు ప్రభువు శరీర-రక్తాలను జ్ఞాపకం చేసుకునే విందు, చేసే పని మాత్రం, ఆ శరీర-రక్తాల వలన ఒకే శరీరంగా చేయబడిన ఇతరుల పట్ల ఏ మాత్రం పట్టింపులేని తిండుబోతుతనం. అలా చేయడం ద్వారా వారు ప్రభురాత్రి భోజనాన్ని సాధారణ భోజనస్థాయికి దిగజార్చి, ప్రభువు శరీర-రక్తాల జ్ఞాపకార్థాలను అవమానిస్తున్నారని, అది బహుశిక్షార్హమైందని పౌలు అంటున్నాడు. ఇది సందర్భము నుండి ఎవరైనా తేటగా చూడగలిగే భావం..

సి) ప్రభువు శరీరమని వివేచించకపోవడం అంటే అర్థం :

ప్రభువు శరీరమని వివేచించకుండా బల్లలోనిది తినడం శిక్షార్హమని 1కొరింథీ 11:27-29 లో చదువుతున్నాము. ఇంటిలో ఆకలి తీర్చుకోవడానికి తినే సాధారణ భోజనంలా ప్రభురాత్రి భోజనంతో వ్యవహరించి కొరింథీయులు ఆ రెండింటికి మధ్య ఉన్న బేధాన్ని గ్రహించే వివేచన కోల్పోయారు. ఆ వివేచన లేని కారణంగా వారిలో అనేకులు శీక్షావిధికి లోనయ్యారని హెచ్చరిస్తూ, శిక్షావిధిలోనికి రాకుండా ఏమి చేయాలో కూడా పౌలు తెలుపుతున్నాడు. “కాబట్టి నా సూదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునపుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనిన యెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినపుడు మిగిలిన సంగతులను క్రమపరతును"(1కొరింథీ 11:33-34). 

పై వచనాలను బట్టి నడుచుకుంటే, శీక్షా విధినుండి తప్పించుకోగలిగే వివేచనను, అనగా ప్రభురాత్రి భోజనానికి సామాన్య భోజనానికి మధ్య ఉన్న తేడాను విచక్షించే వివేచనను వారు నిలుపుకోగలరని ఇక్కడ పౌలు మాటల భావం. గమనించండి, ఇక్కడ, మీరు ప్రభురాత్రి భోజనం అలంకారప్రాయమని నమ్మడం మాని, ఆ పదార్థాలు సాక్షాత్తు ప్రభువు శరీర-రక్తాలని నమ్మడం ద్వారా ప్రభు శరీర-రక్తాలని వివేచించి శిక్షావిధి నుండి తప్పించుకుంటారని పౌలు హెచ్చరించలేదు కాని, భోజనం చేయడానికి కూడా వచ్చినపుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టాలని, ఆకలి తీర్చుకోడానికి ఇంట్లో తినే భోజనంగా ఈ భోజనాన్ని పరిగణించకూడదని హెచ్చిరించినట్లు చూస్తాము.

డి) ఒకరికొరకు ఒకరు కనిపెట్టకుండా తింటే అది మరణశిక్ష పొందేంత పాపమౌతుందా?

ఒకరి కొరకు ఒకరు కనిపెట్టకుండా తినడం వలన ప్రభువు శరీరమని వారు వివేచించలేదని, అందుకు వారీలో అనేకులు రోగగ్రస్తులయ్యారని, కొందరు మరణించారని పౌలు కొరింథీయులను హెచ్చరించాడు. ఇతరుల కొరకు కనిపెట్టకుండా తింటే అది మరణ దండనకు పాత్రమైన నేరమా? ఈ ప్రశ్న, ప్రభురాత్రి భోజనము వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని తేటగా అర్థం చేసుకోవడానికి సహాయపడే అసలు సిసలైన ప్రశ్న.

కొరింథి సంఘము వారు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టకుండా తినడానికి, వారి మధ్య ఉన్న కక్షలే కారణమని పౌలు స్పష్టం చేసాడు (18వ వచనము). ఈ కక్షల కారణంగా వారు దేవుని సంఘాన్ని తిరస్కరించి, పేదలను అవమానపరచే విధంగా ఈ తిండుబోతుతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది (22వ వచనము). క్రీస్తు శరీరంగా 1కొరింథి 12:27 లో పౌలు వర్ణించిన సంఘాన్ని, ప్రభువు శరీరంగా వివేచించి గౌరవించడానికి ఈ విధంగా వారు విఫలమయ్యారు. ప్రభువు శరీరమైన సంఘాన్ని నిర్లక్ష్యం చేసి, ఆయన శరీర-రక్తాలను జ్ఞాపకం చేసే బల్లలోనివి తిని-తాగేవారికి, ఆయన శరీరాన్ని గురించిన కనీస వివేచనైనా ఉందని ఎలా భావించగలం? వారికి ఆ బల్లలో చేయివేసే యోగ్యత లేదన్నదే ఇక్కడ పౌలు మాటల భావమని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే, వారు కూడి రావటం ఎక్కువ కీడు కొరకే కాని మేలు కొరకు కాదని వారిని గద్దిస్తూ, ఈ పరిస్థితిలో ప్రభురాత్రి భోజనం ఆచరించడం వారికి సాధ్యం కాదని, ప్రేమ వలన మాత్రమే ఆయనకు చెందిన వారమౌతామని యోహాను 13:34-35 లో తెలుపబడిన నియమాన్ని తప్పి తింటున్న ప్రతిసారి వారు ప్రభువు శరీరమైన సంఘాన్ని తిరస్కరించి దానిని వివేచించకుండానే తింటున్నారు కాబట్టి అది బహుశిక్షార్హమని పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు.

పైన వివరించిన ఈ పాపం చేయకుండా స్వపరిశీలన చేసుకొని బల్లలోనిది తిని త్రాగాలని, లేని పక్షంలో అయోగ్యంగా బల్లలో చేయి వేసిన వారవుతారని పౌలు నాడు చేసిన హెచ్చరిక, నేటికి సంఘానికి వర్తిస్తుందని మనం మరచిపోకూడదు. ఇంకే పాపాన్ని బట్టి తమ మనసాక్షి నేరారోపణ చేసే తావివ్వకుండా జాగ్రత్తపడే వారు సహితం, సంఘంలో ఏ ఒక్కరిపై కక్ష లేదా ద్వేషం కలిగియుండి బల్లలో చేయి వేసినా అది అయోగ్యంగా బల్లలో పాల్గొనటమే అవుతుంది. అదే ప్రభువు శరీరాన్ని వివేచించకపోవడానికి సందర్భసహిత నిర్వచనం కాబట్టి, సందర్భంలో లేని కొత్త నిర్వచనాలను ప్రవేశపెడితే, అది ఈ పాపం విషయమై సంఘం దృష్టి మరల్చి, వారు స్వపరిశీలన చేసుకోవాల్సిన అసలు విషయం నుండి దారి మరల్చడమవుతుందని ఇప్పటికైనా గుర్తించడం పదార్థాంతరవాదులకు మంచిది. బల్లలో అయోగ్యంగా పాల్గొనే ప్రమాదాన్ని గురించి వారికేమి తెలియదు కాబట్టి వారు ఆ తప్పు చేసినా దానిని గుర్తెరిగే పరిస్థితిలో లేరన్నది ఎంత విచారమో, ఎంత ప్రమాదమో ఆలోచించండి.

ఇ) ప్రభురాత్రి భోజనానికి గల ప్రత్యేకత :

ప్రభురాత్రి భోజనానికి సామాన్య భోజనానికి మధ్య బేధాన్ని విచక్షించకుండా బల్లలో చేయ్యివేయడమే కొరింథీయులు చేసిన పాపమని చెప్పుకున్నాము కదా; ఇంతకు ఏమిటి ఈ ప్రభురాత్రి భోజనానికున్న ప్రత్యేకత? దానిని సాధారణ భోజనము నుండి వేరు చేసింది ఏమిటి? అందులోని పదార్థాలు ప్రభువు శరీర-రక్తాలుగా మారడమా? 'ప్రభువు శరీరమని వివేచించక' అంటే మరి అదేగా భావం? ఇతర వాక్యాల వెలుగులో ఆలోచించినపుడు అలా అనుకోవడం సాధ్యపడదని మనము ఇది వరకే చూసాము. మరేమిటి ఈ మాటల భావం?

ప్రభురాత్రి భోజనాన్ని పరిచయం చేస్తూ, “నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి” అని ప్రభువు ఆజ్ఞాపించాడు. అంతేకాని, 'నా బలిని పునరావృతం చేయుటకు మీరు దీనిని చేయుడి' అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి , బల్లలోని ఆ పదార్థాలు, మనకొరకు విరువబడిన ప్రభువు శరీరాన్ని, చిందించిన రక్తాన్ని స్మరణకు తెచ్చే జ్ఞాపికలు మాత్రమే తప్ప అసలు శరీర-రక్తాలు కావు. అయితే, అలా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి విఫలమై, ఆ పవిత్ర ఆచారాన్ని దుర్వినియోగం చేస్తే, వారు అగౌరవపరిచేది ఆ పదార్థాలను కాదు, అవి సాదృశ్యపరిచే ప్రభువు శరీర-రక్తాలనే అని ఇక్కడ పౌలు భావం. ప్రభువు శరీర-రక్తాలను సహితం లెక్కచేయకుండా వారు తలపెట్టిన తిండిబోతుతనం మరియు సంఘము పట్ల కలిగియున్న ప్రేమ రాహిత్యం శిక్షార్హమని, అలా మనలను కొన్న ప్రభు శరీర-రక్తాలను సహితం మరచిపోయి పాపం చెయ్యొద్దని ఇక్కడ పౌలు హెచ్చరిక వెనుక ఉన్న భావం. అంతే కాని, సమగ్ర లేఖన బోధను కూలదోసే విధంగా పౌలు ఇక్కడ పదార్థంతరవాదాన్ని ఎంత మాత్రము సమర్థించలేదు.

కాబట్టి కొరింథి సంఘం ఎదుర్కొన్నది, అక్షరవాదమా లేక అలంకారవాదమా అన్న సమస్య కానే కాదని, వారు ప్రభువు శరీరాన్ని వివేచించకపోవడానికి, ప్రస్తుత వివాదానికి ఎలాంటి సంబంధము లేదని సందర్భాన్ని నిష్పక్షపాతంగా చదివిన ఎవ్వరైనా ఇట్టే గుర్తిస్తారు.

 

5. ముగింపు

మన చర్చకు ముగింపుగా కొన్ని సంగతులను ప్రస్తావించి సెలవు తీసుకుంటాను.

1) ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరించాలి?

ఎ) ఆయనను జ్ఞాపకం చేసుకోడానికి ప్రభురాత్రి భోజనం అచరించాలి (1కొరింథీ 11:24-25 ).

బి) ఆయన మరణం ద్వారా సంప్రాప్తమైన సువార్తను లోకానికి ప్రచురపరచడానికి ప్రభురాత్రి భోజనం ఆచరించాలి (1కొరింథి 11:26 ).

సీ) స్వపరిశీలన చేసుకొని ప్రభువు సన్నిధిలో మనలను మనము పరిశుద్ధ పరచుకోవడానికి దోహదం చేసే ఒక అవకాశంగా ప్రభురాత్రి భోజనం ఆచరించాలి (1కొరింథీ 11:27-28 ). అంటే ఓఫీర్ గారు చెప్పినట్లు, వారమంతా చేసిన పాపాలను కడుక్కునే ఆత్మీయస్నానంగా బల్ల దోహదపడుతుందని నా భావం కాదు. ఈ రోజు నేను పాపం చేస్తే, ఈ రోజే ప్రభువు కృపాసింహాసనాన్ని ధైర్యంగా సమీపించి క్షమాపణ పొందే భాగ్యం ఉన్నప్పుడు, బల్ల కార్యక్రమం వరకు వేచి చూడాల్సిన అవసరమేంటి? మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు (1యోహాను 1:9 ), బల్ల తీసుకుంటే కాదు. అయినప్పటికీ, బల్లను నిజంగా గౌరవించే వారందరు యోగ్యంగా అందులో చేయి వేస్తారు కాబట్టి, శుద్దీకరణకు మరియు పునఃనిర్ణయాలకు అది తప్పకుండా ఒక ప్రత్యేక అవకాశమే.

డి) క్రీస్తునందు సంఘం ఒక్క శరీరంగా ఉన్న వాస్తవాన్ని అచరణలో పెట్టులాగున ఒకరినొకరు పురిగొల్పడానికి ప్రభురాత్రి భోజనం ఆచరించాలి (1కొరింథి 10:17 ).

ఇవి బల్లలో పాల్గొనడానికి లేఖనాలు నేర్పించే కారణాలు. అయితే, బల్లలో పాలుపంపులు పొందేది నిత్యజీవంపొందడానికి, అంత్య దినాన పునరుత్థానం గావించబడడానికి, వగైరా వగైరాల వంటివన్నీ అసమగ్ర లేఖన అవగాహన సుండి పుట్టిన అభిప్రాయాలే అని ఈ చర్చలో మనం నిర్ధారించుకున్నాము. కాబట్టి సరైన లేఖన అవగాహనతో ఈ పరిశుద్ద సంస్కారాన్ని అచరించమని పాఠకులకు ప్రేమతో మనవి చేస్తున్నాను.

2) ఓఫీర్ గారికి కొన్ని సలహాలు :

ఎ) ‘వాక్యానుసారమైన రక్షణానుభవం పొంది కూడా ప్రభురాత్రి భోజనపు ప్రాముఖ్యతను మహిమా ప్రభావాలను గ్రహించలేకపోతున్న వారికోసం మాత్రమే నేను ఈ గ్రంథాన్ని పరిశుద్దాత్మ ప్రేరణతో వ్రాస్తున్నాను' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 39).

ఓఫీర్ గారు ఇలా చెప్పుకోకుండా జాగ్రత్త పడాలి. ఆయన తెలిసో, తెలియకో చేసిన తప్పుడు బోధలకు పరిశుద్దాత్ముని బాధ్యునిగా చేయడం భయంకరమైన అపరాధమని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.

బి) దేవుడు పంపిన సంస్కర్తను వెంబడించకుండా ప్రతివాడు అహంకరించి తాను ఒక సంస్కర్త అయిపోవాలని వెంపర్లాడి, తన బుర్రకు తోచిన విధంగా దిద్దుబాటులను ప్రతిపాదిస్తే పరిస్థితి అలాగే అఘోరిస్తుంది' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 54).

ఓఫీర్ గారు ఈ విమర్శ తనకే ఎందుకు వర్తించదో తనను తాను పరిశీలించుకోవడం మంచిది.

సీ) ప్రభురాత్రి భోజన కార్యక్రమం సంఘ క్షేమాభివృద్ధి కోసం అత్యంత ప్రాముఖ్యమైన కట్టడ కనుక, సంఘ విరోధియైన సాతాను ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా పగబట్టాడు. ప్రభువు బల్ల విషయంలో వాడు విస్తారమైన గందరగోళాన్ని సృష్టించాడు. ఈ ఒక్క విషయంలో ఉన్నన్ని విభేదాలు భిన్నాభిప్రాయాలు బహుశః ఇంకే విషయంలోనూ లేవేమో' (ఓఫీర్, ప్రభురాత్రి భోజన రహస్యం, పేజీ 50).

ఇలా గందరగోళాన్ని సృష్టించే భిన్నాభిప్రాయాలను రెట్టింపు చేయడంలో సాతానుకు సహాయపడేలా ఓఫీర్ గారు అజాగ్రత్తగా పుస్తకాలు వ్రాయడం మానితే ఆయనకు మంచిది. ఆయన ఉద్దేశ పూర్వకంగా అలా చేస్తున్నారని నేను నిందించడం లేదు కాని, తెలిసి చేసినా, తెలియక చేసినా దాని పర్యవసానం మాత్రం మారదని సవినయంగా జ్ఞాపకం చేస్తున్నాను.

ఈ పుస్తకం ఓఫీర్ గారిని కించపరచడానికి ఉద్దేశించింది కాదు. అయితే, పదార్థాంతర వాదాన్ని సమర్థించే వాదనలను ఆయన పుస్తకంలో రెడీమెడీగా సేకరించగలిగాను కాబట్టి, ఆ అభిప్రాయం లేఖన సమగ్ర బోధకు ఎలా, ఎందుకు సరిపోదో ప్రదర్శించడానికి ఆయన మాటలను వినియోగించుకున్నాను. ఓఫీర్ గారికి, పాఠకులందరికి, రచయితకు కూడా, దేవుడు సిద్దపరచిన లేఖన బాటలో కలిసి నడిచే భాగ్యాన్ని ప్రభువు అనుగ్రహించును గాక. ఆమెన్.

Add comment

Security code
Refresh

Comments  

# Bro.Joe Ratnam 2019-05-21 09:08
Bro. it is very good commentary on the "Lord's Supper"
I like to have a commentary on "Pre-Millennial Rapture".
Mr. Ranjit Ophir says that the Rapture will take place "at the Last Trumpet sound (seventh angel) in the middle of Tribulation". It is one more false doctrine of this "false apostle" which has to be dealt with a right doctrine of "Pre-Millennial Rapture".
Thanks for your your bold and good commentaries in this "Hithabodha" series.
Reply
# ప్రభురాత్రిభోజన వివాదము దాని పరిష్కారంRaju 2020-11-27 11:47
చాలా చక్కగా వివరించారు సార్..... ఇంకనూ అనేక మంది కి ఈ విషయాలు తెలియబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.