ఏదైనా ఒక వస్తువును కానీ, పదార్ధాన్ని కానీ ఒక పేరుతో మనం పిలవాలంటే, అది మొదటిగా పిలవబడ్డప్పుడు కలిగిఉన్న లక్షణాలనే కలిగియుండాలి. ఉదాహరణకు, క్రీ. పూ. 4000 సంవత్సరాల క్రితం తూర్పు ఐరోపా ప్రాంతంలో ఒక విచిత్రమైన మెరుస్తున్న లోహాన్ని కనుకగొన్నారు, దానికి బంగారం అని పేరు పెట్టారు. అలాంటి లోహం ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ కనబడ్డా దానిని బంగారం అనే పిలుస్తారు. అదేవిధంగా దేవుడు అపొస్తలుల ద్వారా ఒక సంఘాన్ని స్థాపించి (మత్తయి 16:18) , దానిని దేవుని సంఘం అని పిలిచాడు. మానవ పాప విమోచన కొరకు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తు ద్వారా ప్రణాళికను సిద్ధపరచి, ఆ ప్రణాళికను సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు. ఆ విమోచించబడిన ప్రజలందరూ ఆయనను ఆరాధించడానికి, ఆయనను గురించి సాక్ష్యమివ్వడానికి, ఆయన మహిమ కొరకు జీవితాలను రూపించుకోడానికి ఒక దైవీక మానవ వ్యవస్థను దేవుడే నియమించాడు. దానినే సంఘం అని పిలుస్తాము. ఆ మొట్టమొదట ప్రారంభించబడ్డ సంఘాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో అపో. కా. 2 వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలం. అలాంటి లక్షణాలున్న వ్యవస్థ ఉన్న ప్రజలను ప్రపంచంలో మరి ఎక్కడ చూసినా వారిని దేవుని సంఘం అని పిలువవచ్చును.
సంఘం అంటే దేవుని ప్రజలే తప్ప స్థలంకాని మరేది కాని కాదు. ఆ మొదటి సంఘం కలిగియున్న లక్షణాలను ఒకసారి పరిశీలించి, ఈనాడు దేవుని సంఘాలు అని పిలువబడుతున్న సంఘాలు నిజంగా ఆ లక్షణాలు కలిగిఉన్నాయా? ఇవి నిజమైన దేవుని సంఘాలేనా అనే విషయాలను విశ్వాసులంగా పరిశీలించి అలాంటి సంఘంలోనే మనం కొనసాగాలి. ఈ పరిశీలన కొరకు అపో. కా. 2:41-47 వచనాలను ధ్యానం చేద్దాం.
I. నిజమైన, స్థిరమైన విశ్వాసులు
(వ. 41): "కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి"
ఆ మొదటి సంఘంలోని సభ్యులందరూ నిజమైన విశ్వాసులు. అనగా, అపొస్తలులు ఏసుక్రీస్తును గురించిన రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు, ఆ సువార్తను నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాక హృదయపూర్వంగా అంగీకరించి, విశ్వాసించినవారు. వారు ఏ ప్రలోభాలకు గురికాకుండా, ఏ బౌతిక మేలులూ ఆశించకుండా, మారుమనస్సు పొంది, వాక్యాన్ని విశ్వసించి, బాప్తీస్మం తీసుకోవడం ద్వారా వారి సాక్ష్యాన్ని రూఢి పరచి, సంఘంగా ఆయన శిష్యులతో చేర్చబడినవారు. సంఘంలో చేర్చబడిన నాటి నుండి వారి మారుమనస్సుకు తగిన ఫలాలను ఫలిస్తూ, విశ్వాసంలో క్రియా రూపంగా ఎదుగుతూ, వెనుదిరిగి చూడకుండా, స్థిరంగా ఉండడాన్ని ఈ వచనాలలో స్పష్టంగా మనం గమనించగలం. ఈనాటి సంఘాలలో ఉన్న సభ్యులు ఈ విధంగానే ఉన్నారో లేదో మనం తెలికగానే గమనించగలం. ఇలాంటి సభ్యులు ఉంటే ఆ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అది నిజమైన దేవుని సంఘమనడానికి ఇది ఒక రుజువు అని గ్రహించవచ్చు. లేకపోతే, సంఘ సభ్యులను నిజ విశ్వాసులుగా మార్చడానికి ప్రయాసపడాలి.
II. అపొస్తలుల బోధయందు స్థిరంగా ఉన్నారు
(వ42): "వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి"
యేసుక్రీస్తు చేత ప్రత్యక్షంగా ఏర్పరచబడిన అపొస్తలులు ప్రకటించిన బోధయందు, ఆనాటి సంఘమంతా స్థిరంగా ఉన్నారు. ‘didace’ (డిడాఖే) అంటే అపొస్తలుల బోధ అని రాయబడింది. అపొస్తలులు యేసుక్రీస్తు జననం, ఆయన పరిశుద్ధ జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం మరియు ఆయన రెండవ రాకడ ను గురించి మాత్రమే ప్రాధమికంగా బోధించారు. క్రీస్తు వారికి బోధించినవి (మత్తయి 28:18-20, లూకా 24:45-48), మరియు పాత నిబంధన లేఖనాలనుండి క్రీస్తును స్పష్టంగా కనపరుస్తూ బోధించారు. వారి స్వంత తెలివితేటలతో వారి జ్ఞానాన్ని కాని, తత్వశాస్త్రాలను కాని, కల్పనా కథలను కాని బోధించక, ప్రతి మానవుని అతి ప్రముఖ్యమైన అవసరతయైన, స్వచ్ఛమైన రక్షణ సువార్తను మాత్రమే ప్రకటించారు (1 కొరి 2:1, 2 పేతు 1:18). స్వచ్ఛమైన సువార్త మాత్రమే ప్రకటించబడింది ఆ సువార్తకు మాత్రమే వారు అంటుకట్టబడియున్నారు. ఈనాటి మన సంఘాలలో ఆ స్వచ్ఛమైన అపొస్తలుల బోధ మాత్రమే జరుగుతుందా, దానికి మాత్రమే విశ్వాసులు కట్టుబడి స్థిరంగా ఉన్నారా? పరిశీలన చేసుకుందాం!.
III. ప్రార్ధన చేయుటయందు స్థిరంగా ఉన్నారు
(వ. 42): "వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి"
ప్రార్ధన దేవునితో సహవాసమని, ప్రార్ధన చేయడం దేవునితో సంభాషించడమని వారు బాగా తెలిసిన వారై ప్రార్ధనలో ఎడతెగక ఉన్నారు (కీర్తన 145:18, 73:28). పితరులు ప్రార్ధనలో ఏ విధంగా కొనసాగారో, క్రీస్తు ప్రార్ధన చేయడంలో ఎలా మాదిరిగా ఉన్నాడో వారు ఎరిగిన వారై ప్రార్ధన ఆవశ్యకతను గుర్తించి అన్ని పరిస్థితులలోనూ అన్నీ సమయాలలోనూ ప్రార్ధనలో ఎడతెగక యున్నారు (యోహాను 16:34). సంఘమంతా శ్రమలలోనూ, నిందలలోనూ, అవమానాలలోనూ, హింసలలోనూ, చెరసాలలోనూ, సంతోషంలోనూ, ప్రతీ అవసరతలోనూ, ఏకాత్మతోను, ఏక మనస్సుతోనూ, పరిశుద్ధాత్మ నడిపింపుతోను, వాక్యానుసరమైన ప్రార్ధన (మత్తయి 18:20, హెబ్రీ 7:19) అనుభవంలో వారు కొనసాగడం తర్వాత అధ్యాయాల్లో గమనించగలం (అపో 12, 16). వ్యక్తిగత ప్రార్ధన ద్వారా దేవుని సహవాసాన్ని, సంఘ ప్రార్ధన ద్వారా దేవుని శక్తిని అనుభవించగలిగారు. ఈనాటి మన ప్రార్ధన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మన ప్రార్ధన విధానం ఏమిటో మనం పరిశీలన చేసుకోవాలి.
IV. రొట్టె విరచుటయందు స్థిరముగా ఉన్నారు
(వ.42): "వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి"
క్రైస్తవ విశ్వాసానికి రెండే రెండు కట్టుబాట్లు ఉన్నాయి, వాటిని సంఘ కట్టుబాట్లు/ప్రతిష్టిత ఆచారాలు (Sacraments/Ordinances) అంటారు. అవి ప్రభు రాత్రి భోజనం, బాప్తిస్మం. సంఘంలో సభ్యులుగా చేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఆదిమ సంఘాన్ని పోలి, సువార్తకు ప్రతి స్పందనగా పశ్చాత్తాపం, మారుమనస్సు, క్రీస్తునందు విశ్వాసం వల్ల బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడినవారు తప్పక ప్రభు రాత్రి భోజనంలో పాల్గోవాలి. ఈ కార్యక్రమంలో పాల్గోవడం వ్యక్తిగత ఆత్మీయ అనుభవం. ప్రతి విశ్వాసి తన పాప విమోచనం కొరకు ప్రాణాన్ని వెలగా చెల్లించిన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చెయ్యాలి (లూకా 22:19, మార్కు 14:22). ప్రతీ విశ్వాసి వ్యక్తిగత విమర్శ, సిద్ధపాటు కలిగి తప్పనిసరిగా ఆయన రాకడ వరకు సంఘంలో ప్రభు రాత్రి బోజనం చేయవలసిందే (1 కొరి 11:23-31). ఈనాటి సంఘాలు నిజంగా, అర్ధవంతంగా వారి రక్షకుణ్ణి జ్ఞాపకం చేసుకోడానికి, సాక్ష్యామివ్వడానికి, పరిశుద్ధ సిద్ధపాటు కలిగి దానిని ఆచారిస్తున్నాయా? ఆలోచించాలి!.
V. సహవాసమునందు స్థిరముగా ఉన్నారు
(వ. 42-47): "వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి"
సంఘం అంటే లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి బయటకు పిలవబడిన ప్రజల సహవాసమని అర్ధం. ఈ సహవాసం భూమిపైన ఉన్న మరే సహవాసానికీ పోల్చి చెప్పలేని మధురమైన, అద్భుతమైన సహవాసం. సాటిలేని పరమ తండ్రి పిల్లల సహవాసం, ఆయన స్వభావ లక్షణాలను కనపరచి, ఆచరించే సహవాసం. ఆచారాలతో కూడిన, వేషధారణ కాని నిష్కల్మషమైన భక్తి, అన్నిటినీ సహించి మేలు చేసే నిష్కపటమైన ప్రేమ, సంతోషంలోనూ, దుఃఖంలోనూ వెంటనిలిచే త్యాగపూరిత శ్రద్ధ, ఏ పరిస్థితులలోనూ ఎడబాటును కోరని పరిశుద్దమైన ఐక్యత, లింగ, వర్ణ, ప్రాంత, ఆర్థిక వ్యత్యాసాలు లేని ఖశ్చితమైన సమానత్వం, నిస్వార్ధమైన సహోదర భావం కలిగిన సహవాసంగా సంఘం ఉంటుంది. ఈనాటి మన సంఘాలలో ఈ విధమైన సహవాసం ఉంటుందా? గమనించండి!
ముగింపు: “నా సంఘమును నేను కట్టుదును” – మత్తయి 16:18. ఇటుకలతోనూ, ఇనుముతోనూ కట్టబడింది సంఘం కాదు వాక్య విలువలతో కట్టబడిందే దేవుని సంఘం, నిజమైన సంఘం. ఆదిమ సంఘమే మనకు మాదిరి సంఘం. పైన ఆదిమ సంఘంనుండి ధ్యానించి, తెలుసుకున్న లక్షణాలు ఈనాడు మన సంఘాలలో ఉన్నాయా? విమర్శనాత్మకంగా పరిశీలించండి. పరిశుద్ధ లేఖనాల్లో సంఘాన్ని గురించిన మరిన్ని విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. ఈ లేఖనభాగంలో మనం పరిశీలించినవి కొన్ని ప్రాధమికమైన అంశాలు మాత్రమే. లేఖనాలను క్షుణ్ణంగా చదివి వాక్యానుసారమైన సంఘాలను భాద్యతగా ప్రతి సేవకుడు కట్టాలి. మనిషిని మాత్రమే మనిషి అనగలం, మనిషిని పోలి ఉన్న మరి దేనిని మనిషి అనలేము. మనిషి అవయవాలు కాని లక్షణాలు గాని ఉన్న మిగతా జీవులను కూడా మనిషి అనలేము. అలాగే, సంఘం లాగా పైకి కనిపిస్తేనో, ఒకటో రెండో లక్షణాలు కనిపిస్తేనో దానిని దేవుని నిజ సంఘం అనలేము. వాక్యానుసారమైన, మొదటి సంఘాన్ని పోలిన అన్నీ లక్షణాలు అది కలిగి ఉండాలి. మీ సంఘం అలా ఉంటే దేవునికి స్తోత్రం! ఆ అద్భుతమైన సహవాసంలో చివరివరకూ కొనసాగండి లేకపోతే అలా మారడానికి ప్రారంభించి, ప్రయాసపడండి. త్రియేక దేవుని ప్రేమ, కృప, సహవాసాలు మీకు తోడైయుండును గాక!
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.