దుర్బోధలకు జవాబు

రచయిత: యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 12 నిమిషాలు

 

భస్మ బుధవారం - శ్రమ దినాలలో ప్రారంభ దినం.

ఎవరు చేస్తారు?

తెలుగు క్రైస్తవ సమాజంలో ప్రధానంగా రోమన్ కాథలిక్కులు, లూథరన్లు, మెథడిస్టులు, సి.ఎస్.ఐ వారు, అలాగే ఇంకా అనేక ఇతర ప్రొటెస్టెంట్ సంఘాలవాళ్ళు కూడా శ్రమ దినాలని (లెంట్ డేస్) ఆచరిస్తారు. ఈ సంవత్సరం ఆ శ్రమ దినాలు నేటి నుండే (ఫిబ్రవరి 22, 2023) ప్రారంభం అవుతాయి. ఈ రోజును భస్మ బుధవారం అని అంటారు.

ఏ రోజు ఆచరిస్తారు?

ఆదివారాలు మినహా అనగా ఆదివారాలు లెక్కించకుండా ఈస్టర్ ఆదివారానికి 40 రోజుల ముందు ఈ శ్రమ దినాలు ప్రారంభం అవుతాయి.

ఎప్పుడు ఇది ప్రారంభం అయ్యింది?

ఈ శ్రమ దినాలను ఆచరించడం అనేది ఆదిమ సంఘ కాలంలో లేదు; యేసు క్రీస్తు గానీ, అపొస్తలులు గానీ దీనిని ఆచరించలేదు. సంఘ చరిత్రలో తరువాతెప్పుడో రోమన్ కాథలిక్కులు దీనిని సంఘంలోకి ప్రవేశపెట్టారు. కొందరేమో 4వ శతాబ్దంలో ప్రారంభం అయ్యిందనీ, మరికొందరేమో 11వ శతాబ్దంలో ప్రారంభం అయ్యిందనీ చెప్తారు.

ఎందుకు ఈ రోజుని భస్మ బుధవారం అన్నారు?

శ్రమ దినాలలో మొదటి రోజు ఎప్పుడూ బుధవారమే వస్తుంది. కాబట్టి ఈ రోజుని భస్మ బుధవారం అని అన్నారు. ఒకవేళ ఈ రోజు గురువారం వచ్చి ఉంటే, భస్మ గురువారం అనుండేవారేమో.

ఏం చేస్తారు & ఎలా చేస్తారు? 

ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారంగా ఆచరిస్తారు. యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయము అంటూ ప్రజలు ఆయనకు స్వాగతం పలికిన సంఘటనను ఆధారం చేసుకొని ఈ మట్టల ఆదివారాన్ని ఆచరిస్తారు. మన ప్రాంతాలలో ఖర్జూరపు మట్టలు దొరకకపోతే ఈత మట్టలు లేదా తాటి ఆకులు పట్టుకొని వాటికి పూలు గుచ్చి, హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతారు. అలా తిరిగిన తరువాత ఆ మట్టలను చర్చిలో ఉంచి, తరువాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మట్టలను తీసుకొని వెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు. ఆ మట్టలు ఇంట్లో ఉండటం శుభప్రదమని భావిస్తారు. కొందరు వాటితో సిలువను చేస్తారు. కొన్ని రోజుల్లో అవి ఎండి పోతాయి. ఆ ఎండిపోయిన మట్టలన్నీ ఒక దగ్గరకు చేర్చి, మంట వేసి కాల్చి బూడిద చేస్తారు. ఇలా కాల్చి బూడిద చేయడం అనేది కొందరు ఈస్టర్ ఆదివారానికి మరుసటి రోజే చేస్తే, ఇంకొందరు ఈస్టర్ నుండీ యాభైయ్యవ రోజున జరిగే పెంతెకోస్తు పండుగ దినాన చేస్తారు, మరి కొందరు భస్మ బుధవారానికి ముందు రోజే చేస్తారు. ఆ బూడిదను సేకరించి, నిలువ చేస్తారు. అలా నిల్వ చేసిన బూడిదను మరుసటి సంవత్సరం భస్మ బుధవారం రోజున ఉపయోగిస్తారు. పాస్టర్ గారు లేదా బిషప్ గారు ఆ బూడిదను సిలువ ఆకారంలో విశ్వాసుల నుదుటిపై పూయడం లేక వాళ్ళ తలపై చల్లటం చేస్తారు. అలా పూస్తూ - 'మన్నైన నీవు మరలా మంటికే చేరతావు గనుక నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది రక్షించబడమని' చెప్తారు. చాలా చర్చీల్లో ఈ పని బిషప్పులూ, పాస్టర్లే చేస్తారు, చాలా కొన్ని చోట్ల మాత్రం ఆ బూడిదని ఒక పాత్రలో ఉంచుతారు. విశ్వాసులే దానిని తమ నుదుటిపై రాసుకుంటారు. కొందరు నేరుగా బూడిదనే రాసుకుంటారు, మరి కొందరు ఈ బూడిదలో హోలీ వాటర్ అని చెప్పబడే నీళ్ళని, మరి కొందరు ఒలీవ నూనె ని కలిపి నుదుట పూసుకుంటారు.

ఎందుకు బూడిదతో ఈ విధంగా చేస్తారు?

పాత నిబంధనలో కొంత మంది కొన్ని ప్రత్యకమైన సందర్భాలలో గోనెపట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని విలపించినట్లు, దుఃఖించినట్లు చదువుతాం. ఆ సంఘటనలను ఆధారం చేసుకొనే ఈ ఆచారం చేస్తున్నామని చెప్తారు.

లేఖనాల వెలుగులో పరిశీలిద్దాం

అయితే ఈ ఆచారం గురించి తెలుసుకునే క్రమంలో తలెత్తిన కొన్ని అభ్యంతరాలకు వాక్యానుసారంగా స్పందిస్తూ ఈ కింది సంగతులను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు కూడా వీటిని ఒకసారి పరిశీలించాలని మనవి.

ఇలా శ్రమ దినాలను ఆచరించమని బైబిల్ లో ఎక్కడా చెప్పబడలేదు కదా. సంఘంగా విశ్వాసులు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా ఆరాధించకూడదో దేవుడే స్పష్టంగా తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లో తెలియజేశాడు. అందులో ఉన్నవి చేస్తే సరిపోతుంది, కొత్తవాటిని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అలా చేసే అధికారం కూడా దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ శ్రమ దినాలు (లెంట్ డేస్) అనే ఆచారం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించారు అని ఆలోచించినప్పుడు కూడా, ఈ ఆచారానికి యేసు క్రీస్తుతో గానీ, అపొస్తలులతో గానీ ఎటువంటి సంబంధమూ లేదని పైన చెప్పబడిన విషయాల వెలుగులో ఎవ్వరైనా ఇట్టే గ్రహించగలరు. దేవుడు చెయ్యమని చెప్పిందీ కాదు, ఆయన ప్రారంభించినదీ కాదు, తరువాతెప్పుడో ఎవరో కల్పించిన ఆచారం లేదా మనుషులు కల్పించిన ఆచారమే శ్రమ దినాలు. ఇటువంటి మనుషులు కల్పించిన ఆచారాల విషయమై యేసు ప్రభువు ఒక సందర్భంలో మాట్లాడుతూ - మత్తయి 15:6-9  "6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. 7. వేషధారులారా 8. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; 9. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి..." అని చెప్పారు.

శ్రమ దినాలు అనేది మనుషులు కల్పించిన ఆచారం అని అర్థం అయ్యింది గనుక, ఇటువంటివాటిని ఆచరించడం ద్వారా దేవునికి దగ్గర అవుతాము అని బోధించేవారి మాటలు పూర్తిగా అసత్యం అని గ్రహించాలి. వాటినే దైవోపదేశములు అని బోధించేవారు వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారని కూడా చెప్పబడింది. అలా మీలో ఎవ్వరూ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించేవారయ్యుండకూడదు అని ఈ సంగతులను మీ దృష్టికి తీసుకొస్తున్నాము.

ఈ భస్మ బుధవారాన్ని ఆచరిస్తూ నుదుట బూడిద పూసుకునేవారు బూడిద పశ్చాత్తాపానికీ, మారుమనస్సుకీ గుర్తు అనీ, అందుకే దీనిని ఆచరిస్తున్నాము అనీ చెప్తారు. పశ్చాత్తాపం చెందడం కోసం, మారుమనస్సు పొందడం కోసం ఒక రోజు కేటాయించాల్సిన అవసరం ఏం ఉంది? అలా చెయ్యమని వాక్యంలో ఎక్కడ చెప్పబడింది? ఏ మనిషైనా పాపం విషయంలో పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడినప్పుడు పశ్చాత్తాపంలోకి నడిపించబడతాడు, మారుమనస్సు పొందుకుంటాడు. అలా కాకుండా నుదిటిపై సిలువ ఆకారంలో బూడిద పూసినంత మాత్రాన ఒక వ్యక్తి పశ్చాత్తాపంలోకి వస్తాడా? మారుమనస్సు పొందుతాడా? అలాగని వాక్యం చెప్పడం లేదు. మరి ఎందుకు ఇవన్నీ చెయ్యడం. ఒక విశ్వాసి తన పాపం విషయమై పశ్చాత్తాపపడటం, మారుమనస్సు పొందటం అనేది నిత్యం చెయ్యాల్సిన పని. కానీ దాని కోసం ఒక రోజు కేటాయించి, ఆ రోజు మట్టుకు లేక ఆ నలభై దినాల మట్టుకూ ఆచార సంబంధమైనవేవో చేసేస్తే సరిపోతుంది అని చెప్పడం పశ్చాత్తాపం, మారుమనస్సు గురించి బైబిల్ లో చెప్పబడిన బోధకి పూర్తి విరుద్ధం.

2 థెస్స 2:15 - "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి."

అపోస్తలీయ బోధే సంఘంగా మనం ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో నిర్ధారించే ప్రామాణికం అయ్యుండాలి. అందులోనే నిలకడగా ఉండమని పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ బోధ వెలుపల మనుషులు కల్పించిన పద్ధతులూ, ఆచారాలు అనేకం ప్రతి రోజూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. సంఘం అటువంటి వాటన్నింటి విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అటువంటి వాటిని ఖండించి, వెలివేయాలి.

పాత నిబంధన భక్తులు ఇలా చేశారు కాబట్టే మేము కూడా చేస్తున్నాము అని చెప్తారు. ఇంతకీ పాత నిబంధన భక్తులు ఏం చేశారు -

ఎస్తేరు 4:1,3 "జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోదనముచేసి". "3. రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి,ఆనేకులు గోనెను బూడిదెను వేసికొని పడి యుండిరి."

యోబు 42:6 - కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను."

దానియేలు 9:3 - "అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని."

యోనా 3:5-6 - "5. నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. 6. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడి నప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి,తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను."

ఈ పైన పేర్కొన్నవారంతా ప్రత్యేకమైన సందర్భాలలో, ప్రత్యేకమైన కారణాలను బట్టి విలపిస్తూ, దుఃఖిస్తూ, పశ్చాత్తాపపడుతూ బూడిదలో కూర్చోవడంవంటివి చేశారు. ఆ సందర్భం ఏంటో, కారణాలు ఏంటో ఆ వాక్య భాగాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. అంతేగానీ పశ్చాత్తాపపడటం కోసం ఒక రోజు కేటాయించుకొని, అందరూ కూడుకుని పశ్చాత్తాపపడట్లేదు. అలా చెయ్యడంలో అర్థం ఉండదు. పశ్చాత్తాపపడి వ్యక్తి మాత్రమే తనంత తానుగా లేదా తమంతట తాముగా చేసిన పని అది. అంతేగానీ 'ఈ రోజు భస్మ బుధవారం కాబట్టి మనందరం ఒక దగ్గర కూడుకొని, కూర్చొని, కలిసి పశ్చాత్తాపడదాం' అని అనుకొని ఆ పని చేసినట్లుగా చెప్పబడలేదు. ఆ విధంగా పైన పేర్కొన్నవారెవరూ ఒక ఆచారంగా దీన్ని చెయ్యలేదు. పైగా నిజంగా పాత నిబంధన భక్తులు చేశారు కాబట్టే మేము చేస్తున్నాము అనే వాళ్ళు, వాళ్లకులాగానే గోనెపట్ట కట్టుకొని, బూడిదలో కూర్చోవచ్చు కదా. కేవలం నుదుటిపైన కొంచెం, లేక తలపై కొంచెం పూసుకుంటే సరిపోతుంది అని ఎవరు చెప్పారు? పైగా గత సంవత్సరం మట్టల ఆదివారం నాడు ఉపయోగించిన మట్టలను కాల్చినప్పుడు వచ్చే బూడిదనే వాడాలి. అలా ఎందుకు చేస్తున్నారు? పాత నిబంధన భక్తులకు లాగా మొత్తంగా బూడిదలోనే కూర్చుని పశ్చాత్తాపపడొచ్చు కదా. పాత నిబంధన భక్తులు చేసినట్లు చేస్తున్నాము అని చెప్తున్నారు కాబట్టి నేను ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాను అంతేగానీ వారికి లాగా చెయ్యమని నేను చెప్పడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కొత్త పద్ధతులనూ, ఆచారాలనూ కల్పించుకుంటూ, యేసు క్రీస్తునూ, అపొస్తలులనూ మించి ఇంకా గొప్పగా భక్తి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్న వేషధారుల జాబితాలో మీరు ఉండకుండా జాగ్రత్తపడమని చెప్తున్నాను. లేఖనాలను వాటి సందర్భంలో సరిగ్గా అర్థం చేసుకునే, అన్వయించుకునే జ్ఞానం ఇమ్మని ప్రభువుని మనమంతా వేడుకోవాలి.


యేసు ప్రభువు చేసిన 40 రోజుల ఉపవాసాన్ని ఆధారం చేసుకునే శ్రమ దినాలను ఆచరిస్తున్నాం అని చెప్తారు కొందరు. యేసు ప్రభువు వారు పరిచర్య ప్రారంభించే ముందు 40 దినాలు ఉపవాసం చేశారు. ఆ తరువాత మూడున్నర సంవత్సరాలకు సిలువపై మరణించారు. ఆయన మరణానికీ, 40 రోజుల ఉపవాసానికీ సంబంధమే లేదు. యేసు క్రీస్తు ఈ భూమిపై నివసించిన మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలం అంతటిలో కూడా ఎప్పుడూ ఇటువంటి ఆచారాన్ని చెయ్యలేదు. మరి యేసు క్రీస్తు చేసాడు కాబట్టే మేమూ చేస్తున్నాము అని ఎలా అనగలరు? వాఖ్యాధారంతో, దేవుని అనుమతితో నిమిత్తం లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బైబిల్ లోని వచనాలకు కొత్త భావాలను పులిమి, ఎవరికి నచ్చిన ఆచారాలను వాళ్ళు తయారు చేస్తూ పోతే, భవిష్యత్తులో సంవత్సరంలో 365 రోజులకు సరిపడా రోజుకో ఆచారం పుట్టుకొస్తుంది. కానీ వాటిని బట్టి గానీ, వాటిని ఆచరించేవారిని బట్టి గానీ దేవుడు ఎంత మాత్రమూ సంతోషించడు అని జ్ఞాపకం ఉంచుకోండి.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.