దుర్బోధలకు జవాబు

రచయిత: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 10 నిమిషాలు

 

26-6-2021 రోజున "బైబిల్ కావాలా బైబిల్ మిషన్ కావాలా" అనే శీర్షికతో ఒక పుస్తకం ఈ వెబ్ సైట్ ద్వారా నేను విడుదల చేసిన విషయం మీలో చాలామందికి తెలుసు. ఆ పుస్తకంలో బైబిల్ మిషన్ వారు ప్రచురించే బోధలు, అనుభవాలు, ఆలోచనలు బైబిల్ బోధకు ఎంతో వ్యతిరేకమైనవని, అందుకే బైబిల్ మరియు బైబిల్ మిషన్ ఈ రెండింటిలో ఏదో ఒకటే ఎంచుకోవాలని, ఆ రెండు కావాలనుకోవడం సాధ్యం కాదని నిరూపించాను. ఒకవేళ ఆ పుస్తకం చదవనివారు మీలో ఎవరైనా ఉంటే, ఇక్కడ ఇవ్వబడిన లింక్ ద్వారా ఆ చిరు పుస్తకాన్ని తప్పక చదవండి.

బైబిల్ కావాలా బైబిల్ మిషను కావాలా?

ఆ పుస్తకంలో బైబిల్ ఆధారంగా బైబిల్ మిషన్ బోధలను ఎండగడుతున్న క్రమంలో వారికి నేను ఒక సవాలు విసిరి, దానిని ఎదుర్కోవడం ద్వారా వారి నిజాయితీ నిరూపించుకోవడానికి నిన్నటి వరకు, అంటే 31-12-2021 వరకు గడువు ఇచ్చాను. దేవదాసు అయ్యగారి జీవిత చరిత్రలో బైబిల్ మిషన్ వారు ప్రచురించుకున్న ఒక ప్రకటన ఆధారంగా వారికి ఈ సవాలు విసరడం జరిగింది. వారి ప్రకటనతో పాటు, నేను వారి ముందు ఉంచిన సవాలును యథాతథంగా ఇక్కడ మీ సౌలభ్యం కొరకు మళ్ళీ పెడుతున్నాను, శ్రద్ధగా చదవగలరని మనవి:

"ఆట్మనమ్మ గారు వ్రాతలున్నవి. అవి ఎప్పుడు తీస్తారు. ఎప్పుడు అచ్చువేస్తారు? అని వారు ప్రభువును అడిగినవారు. ఆ పుస్తకము ఎప్పుడు అచ్చువేస్తారు. ఆ గది తాళము తీయడానికే ఇంకా తండ్రి సెలవు రాలేదు. ఆ తాళము ఎవరైనా విప్పితే వారికి హాని. దైవ సన్నిధి, దైవ వ్రాతలు; ఏర్పాటు ఉంటే తప్ప ఇతరులు వెళ్లితే చనిపోతారు" (జీవిత చరిత్ర పేజి నెం. 61, 2006).

ఇలా ఇతరులు వెళితే చనిపోతారు అని చెప్పిన ఆ గది ఎక్కడుందని అడుగుతున్నాను. బైబిల్ చదువుతున్న అన్యులు చనిపోనప్పుడు, కేవలం ఆట్మనమ్మగారి రచనలు ఉన్న గదిలోకి వెళితేనే ఎవ్వరైనా ఎందుకు చనిపోతారు? ఈ రచనలు బైబిల్ కంటే గంభీరమైనవి, పవిత్రమైనవి, ప్రతిష్ఠితమైనవి అని చెప్పదలిచారా? నేను చావటానికైనా తెగిస్తాను కాని సత్యనిర్థారణ నుండి వెనుకకు తగ్గను. నాకు చావంటే భయం లేదు. కాబట్టి నేను బైబిల్ మిషనువారికి విసిరే సవాలేమిటంటే, నిజంగా అలాంటి గది ఒకటుంటే అది ఎక్కడుందో చూపించండి. చూపించలేకపోతే, మీ ప్రచురణలలో చెప్పుకున్నవన్నీ ఇలాంటి అభూతకల్పనలు మాత్రమే అని ఒప్పుకొని క్రైస్తవ సమాజానికీ, దేవునికీ క్షమాపణ చెప్పండి. మీ రచనలన్నిటినీ ఉపసంహరించుకోండి. మీ రచనలలో సత్యముందా, లేక నా రచనలలో సత్యముందా అనేది దీనిని బట్టి అందరి ముందు రుజువౌతుంది.

నేను మీకు సవాలు చేస్తున్నాను. మీ నిజాయితీ నిరూపించుకోవటానికి ఇదో సువర్ణ అవకాశం. సాకులు చెప్పి వెనుకకు తగ్గితే అదే మీ ఓటమిగా అందరూ అర్థం చేసుకుంటారు. మీరు అబద్ధికులని అందరూ తెలుసుకుంటారు. అలా కాకుండా, ఆ గది నిజంగానే ఉంటే, కాస్త అది ఎక్కడుందో చెబితే, అందులోనికి వెళ్లి నేను చనిపోతే, మీరు చెప్పింది నిజమే అని ప్రపంచం గుర్తిస్తుంది. ఈ సవాలు నా గర్వము వల్లనో, అత్యుత్సాహం వల్లనో, అధికసాహసం వల్లనో చేయటం లేదు. బైబిల్ తప్ప దేవుడు ప్రత్యక్షపరచిన ఏ రాతలూ, ఎక్కడా లేవు అనే స్థిరమైన, బలమైన, విశ్వాసం ఆధారంగా మాత్రమే ఈ సవాలు చేస్తున్నాను. బైబిల్ మాత్రమే దేవుని ప్రత్యక్షత అని నిరూపించటానికి ఈ సవాల్. ఈ సవాలు నేను జూన్ 2021లో ప్రచురిస్తున్నాను. ఆట్మనమ్మగారి రచనలున్న గది అడ్రస్ నాకు 31డిసెంబర్ 2021 వరకూ ఇవ్వకపోతే, అందులోనికి నేను మీడియాముఖంగా ప్రవేశించి చనిపోకపోతే, బైబిల్ మిషను మొత్తం బూటకమని తేలిపోతుంది."

నిన్నటి వరకూ కాదు, ఎన్నటి వరకూ వేచి చూసిన బైబిల్ మిషనవారు ఈ సవాలుకు నిలబడలేరు. లేని అడ్రస్ పాపం వారు కూడా ఎక్కడనుండి తెస్తారు! ఈ సవాలులో ఓడిపోయి బైబిల్ మిషన్ అబద్ధాలు ప్రచురించి ప్రజలను మోసగించిన సంస్థగా నిరూపించబడింది.

'దేవుణ్ణి చూసారు', 'దయ్యాన్ని చూసారు', 'పరలోక భక్తులతో వారి గది నిండిపోయింది', 'పరలోక భక్తులకు వారు కొత్త-కొత్త సంగతులు బోధిస్తున్నారు', 'పరిచర్య కోసం అప్పుడప్పుడూ పాతాళానికి కూడా వెళ్ళొస్తుంటారు', ఇలాంటి చిత్రవిచిత్ర ప్రకటనలు వారి అయ్యగారి కొరకు చేస్తుంటే, ఇక మనం వాటిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం నిర్థారించుకోగలిగే ఒక భౌతికమైన గది విషయంలోనే ఇంత అబద్ధం ఆడినప్పుడు, నిర్థారించుకోలేని మానవాతీతమైన అనుభవాలను ఎందుకు నమ్మాలి. ఒక భౌతిక చిరునామా విషయంలో అబద్ధాలు ప్రచురించుకున్న వాళ్ళు పరలోకసంబంధమైనవి చెబితే ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం కాగలదు. అబద్ధాలాడి, మోసగించాల్సిన కర్మ బైబిల్ మిషన్ వాళ్లకేం పట్టింది? అలా చేయడం వల్ల వారికి ఏం ప్రయాజనం? ఈ ప్రశ్న సమంజసమే, న్యాయమే. అయితే ఈ ప్రశ్న, ప్రశ్నగానే మిగిలిపోవాల్సిన పని లేదు. ఇందుకు జవాబు బైబిల్ మిషన్లకే చెందిన ఒక వర్గంవారు, మరో వర్గంవారికి వ్యతిరేకంగా విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారా ఇట్టే పసిగట్టేయవచ్చు.

ఆ శ్వేతపత్రాన్ని ఫోటో తీసి ఇమేజ్ రూపంలో ఇక్కడ పొందుపరచడమైనది.

1     4

 

2

 

3

ఇందులో న్యాయస్థానాలు చెప్పిన తీర్పులకు సంబంధించిన రెఫరెన్సులతో సహా ఆధారపూర్వకంగానే అన్ని విషయాలూ కూలంకషంగా నిరూపించబడ్డాయి. బైబిల్ మిషన్ సెక్రటరీగారి సంతకంతో విడుదలైన ఈ అధికారిక ప్రకటనలో అక్షరాలా పదికోట్ల రూపాయలు స్వాహా చేయబడిన ఒకపెద్ద కుంభకోణాన్నే బహిర్గతం చేశారు. దీని ప్రకారం, ఒకప్పుడు బైబిల్ మిషన్ లో ఒక అధికార పదవిలో ఉండి, ప్రస్తుతం బహిష్కరించబడిన తరువాత కూడా తానే బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న  జె. శామ్యూల్ కిరణ్ గారు, అదేనండి అందరి చేత ముద్దుగా 'కిరణ్ బాబు గారు' అని పిలవబడే బైబిల్ మిషన్ జె. శామ్యూల్ కిరణ్ గారు, వారి ముఠాతో కలిసి ఇలా ప్రభువు సేవ కొరకు కానుకగా సమర్పించిన ప్రజాసొమ్మును దిగమింగి, మూతి తుడుచుకుని, తనకేమి తెలియదన్నట్లు, తానే‌ బైబిల్ మిషన్ కు ప్రెసిడెంట్ అన్నట్లు ఇంకా అమాయక జనాలను మోసగిస్తున్నారట.

వారిని బైబిల్ మిషను నుండి వెలివేసిన తీర్మానాన్ని న్యాయస్థానాలు సైతం ఆమోదించిన తరువాత కూడా తాను ఇంకా బైబిల్ మిషన్ లోనే ఉన్నట్లు, ప్రెసిడెంట్ గానే కొనసాగుతున్నట్లు, ఇప్పటికీ అందరిని మభ్యపెడుతున్నారని ఆ శ్వేతపత్రం విడుదల చేసినవారు వాపోయారు.

సంవత్సరం వెంబడి సంవత్సరం, భారీ ఎత్తున మహాసభలు ఏర్పాటు చేసి, వారం వెంబడి వారం స్వస్థత కూటాలు నిర్వహించి, అమాయక ప్రజలనుండి ఎన్నో సంవత్సరాలు దండుకున్న కొల్లసొమ్ములో ఓ పది కోట్ల రూపాయల కుంభకోణం మాత్రమే ఇప్పటికీ బయట చెప్పుకుంటున్న లెక్క. లోలోపల, ఎవరెవరు, ఎంతెంత కుమ్మేస్తున్నారో దేవునికే ఎరుక.

ఇంతకాలం జరిగింది ఇప్పుడు జరగటం లేదనడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? సరే, అది అలా ఉంచితే, మనం మొదట లేవనెత్తిన ప్రశ్నకు మాత్రం ఇక్కడ సమాధానం దొరికినట్లే. కల్లబొల్లి కథలు చెప్పి, బూటకపు స్వస్థతలు వాగ్దానం చేసి, అమాయక జనాన్ని మోసగించడం వల్ల బైబిల్ మిషన్ లో ఉన్నవారికి తప్పక ప్రయోజనమే. ఇచ్చేవాడికి లేని నొప్పి దోచేవాడికేంటట! వారి రచనలు చదివి, దొంగ సాక్ష్యాలకు ఆకర్షితులై, ఇంకా పట్టుకెళ్ళి పోసి రండి.

కానీ ప్రభువు నామానికి అవమానం తెచ్చే ఇలాంటి దొంగలకు దానం చేసి, ప్రభువుకు కానుక ఇచ్చామని మాత్రం ఎవ్వరూ భ్రమపడొద్దు. సువార్తను కూలద్రోయడానికే తప్ప, సువార్త పురోగతికి ఇలాంటి సంస్థలు ఎప్పుడూ దోహదపడలేవు. వారికి ఇచ్చి, వారి పాపంలో మీరు కూడా పాలుపంపులు కలిగున్నారని, అందుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇవ్వక మానడని మరచిపోవొద్దు. సంతోషకరమైన విషయమేమిటంటే, ఈ సంస్థలో ఉన్న ఒక వర్గంవారు నిజాయితీగా లోపల జరుగుతున్న సంగతిని బహిర్గతం
చేసి ప్రజలకు గొప్ప మేలు చేసారు. వారి యథార్థత అభినందనీయమైనది.

అయితే వారు అధికారికంగా ప్రకటించాల్సిన మరో సంగతి కూడా ఉంది. ఇప్పటివరకూ బైబిల్ మిషన్ సంస్థను నడిపిస్తూ వచ్చింది సదరు దొంగల ముఠాయే కాబట్టి, వారు దేవదాసు అయ్యగారి పేరుతో ప్రచురిస్తూ వచ్చిన రచనలు కూడా దొంగ రచనలే అని, కేవలం ప్రజలకు మూఢభక్తి నూరిపోసి వారిని దోచుకునే ఉద్దేశంతోనే ఈ ప్రచురణలు, మహాసభలు, స్వస్థతల బూటకాలు, తదితర మోసకరమైన కార్యకలాపాలన్నీ జరుపుతూ వచ్చారని, అవేమీ నిజానికి ప్రస్తుతం బైబిల్ మిషన్ ఆమోదించడం లేదని మరో శ్వేతపత్రం విడుదల చేయండి. ఇది వరకూ ప్రచురిస్తూ వచ్చిన బైబిల్ మిషన్ రచనలన్నీ ఉపసంహరించుకుంటన్నామని, ఎలాగైతే సదరు దొంగల ముఠాకు బైబిల్ మిషన్లతో సంబంధం లేదో, అలాగే వారు ప్రచురిస్తూ వచ్చిన రచనలకు, ఇతరేతర కార్యకలాపాలకు కూడా బైబిల్ మిషన్లతో సంబంధం లేదని ప్రకటించండి.

బైబిల్ మిషన్ ను స్థాపించింది తన తండ్రి సెల్వరాజ్ గారే అని న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ప్రబుద్ధులు, ప్రజలను మాత్రం తప్పుదోవ పట్టించడానికి ఎందుకు వెనకాడతారు? కానీ వారి మోసంలో మీకు పాలు లేదంటున్నారు కాబట్టి, మీ నిజాయితీని పూర్తిగా నిరూపించుకోడానికి నేను ఇక్కడ కోరుతున్న అధికారిక ప్రకటన మీకో సువర్ణ అవకాశంగా పరిణమిల్లగలదు. యథార్థంగా బైబిలును అనుసరించేవారు, మళ్ళీ బైబిల్ మిషన్ ను ఆదరించేలా చేయడానికి ఇదే ఒక మంచి అవకాశం. ఒకవేళ ఈ బైబిల్ విరుద్ధమైన, మోసపూరితమైన రచనలను బైబిల్ మిషన్ వారు ఖండించి వాటిని ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించకపోతే, వాక్యపు వెలుగులో వాటిని ఖండించి ప్రజలను చైతన్యవంతులు చేసే మా పరిశీలనలు మీ ప్రచురణలపైన కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే మీరు శ్వేతపత్రం విడుదల చేసి కొందరి కార్యకలాపాలను బహిర్గతం చేయడం మీ యథార్థత వలన కాదని, అందుకు మీ అంతర్గత విభేదాలో, జరిగిన కుంభకోణంలో మీ వాటా మీకు రాకపోవడమో, లేదా మీకు ప్రధానత్వ అవకాశాలు రావట్లేదనో, ఇలా ఎన్నెన్నో కారణాలు ఉండి మాత్రమే అలా చేసారని భావించవలసి ఉంటుంది.

ప్రజలు మోసగించబడకూడదనే సదుద్దేశంతోనే మీరు ఇదంతా చేసి ఉంటే, మోసం చేస్తూ వంచించారని మీరు బహిర్గతం చేసిన వ్యక్తులను మాత్రమే కాదు, మోసానికి సాధనాలుగా వారికి ఉపకరించిన బైబిల్ విరుద్ధ రచనలను, కార్యకలాపాలను కూడా ఖండించి తీరాల్సిందే. అలాగే మీరు తప్పక చేస్తారని, ప్రభువు మరియు ప్రజల ఎదుట మీ నిజాయితీని నిరూపించుకునే ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడచుకోరని విశ్వసిస్తున్నాము, ఆశిస్తున్నాము. మా నమ్మకాన్ని వమ్ము చేయరు కదా?

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.