మానవజీవిత పరమార్థమును గుర్తుచేస్తూ, ప్రగతిపథంలో నడిపించుటకై రూపొందించబడినవి ఆచారములు. మంచిపద్దతులతో మిళితమైయున్న ఆ ఆచారములను ఆచరణలో పెడుతూ భావితరాలవారికి అందించడమే వాటిని పాటించుటలోని ముఖ్యోద్దేశం.
సదాచారములు మానవశ్రేయస్సుకై, నాగరికత పురోభివృద్దికై తోడ్పడతాయి. గనుక వాటివిషయంలో ఆందోళన చెందవలసిన అవసరము లేదు. కాని సమాజాన్ని, వ్యవస్థను చెడగొట్టే చీడపురుగుల్లాంటి దురాచారముల విషయమై సీరియస్ ఆలోచించక తప్పదు, వాటిని నియంత్రించి నిషేధించుటలో గట్టి చర్యలు తీసుకోకతప్పదు.
ఆంతర్యం తెలియకపోయినప్పటికి ఆచారములను పాటించుచున్న మనుష్యులను మనం నేటి దినములలో కూడా చూడవచ్చు. వారియొద్దకు వెళ్ళి “అయ్యా, తమరు ఆచరిస్తున్న ఈ ఆచారంలోని అంతరార్థం మాకు తెలియజేస్తారా” అని అడిగితే, దానికి సమాధానంగా వారు - "మన పూర్వీకులు ఏదో ఒక మంచి ఉద్దేశంతోనో, లేక మేలు కొరకో, దీనిని ఏర్పాటు చేసి ఉంటారు” అని చెప్పి సమర్థించుకుంటారు తప్ప దాని పరమార్థం చెప్పరు. అసలు పరమార్థం ఉంటే కదా చెప్పడానికి. ఇలాటి అర్థం, పరమార్థం లేకుండా స్వార్థపరులచే నియమించబడినవే దురాచారాలు. వరకట్నం, దేవదాసీవ్యవస్థ, బాల్యవివాహాలు, వితంతువివాహనిషేధం, సతీసహగమనం, అనుగమనం మొదలైనవన్నియు సాంఘిక దురాచారముల క్రిందకే వస్తాయి. నిరంకుశమైన రాచరికపు దురాచారములను కూకటివేళ్ళతో సహా పెరికివేయుటకై కొంతమంది వైతాళికులు రంగంలో ప్రవేశించవలసి వచ్చింది. వారిలో రాజారామ్మోహన్ రాయ్, పండిత రమాబాయ్, గురజాడ అప్పారావు, ఈశ్వరచంద్రవిద్యాసాగర్, రామస్వామి పెరియార్ తదితరులు ఉన్నారు. వీరు చెప్పిన పలుకులు, నాటి సమకాలీన సమాజముపై గణనీయమైన ప్రగతిశీల ప్రభావాన్ని చూపాయి. వీరు తెచ్చిన విప్లవాన్ని బట్టి సదరు దురాచారములనుండి విడుదల పొంది సుఖంగా జీవిస్తున్నాము. కాని సమాజాన్ని, నాగరికతను పట్టి పీడిస్తూ, ఐక్యత లేకుండా చేస్తున్న వ్యవస్థ మరొకటి ఉన్నది, అదే కులవ్యవస్థ. కులం వంశపారంపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారంగా మనం పేర్కొనవచ్చు.
ఏ ఆచారమైనా సాంప్రదాయమైనా, విడిపోయి ఉన్న మనుష్యులను ఒక్క తాటిపై తెచ్చుటకు సహకరిస్తుంది. కాని కులవ్యవస్థ మాత్రం కలసివున్నవారిని చిన్నాభిన్నం చేస్తుంది; పగలూ, ప్రతీకారాలను సృష్టిస్తుంది. ఇదే దీనికి వున్న మౌలిక లక్షణం. తొలుత ఇది సాంఘిక నియమముగా ఏర్పడి ప్రజలందరిచేత ఆమోదింపబడుటకు మతరంగు పులుముకున్నది. అలా కొన్నాళ్లకు ఉగ్రరూపం దాల్చి చట్టబద్ధత కల్పించుకుని ఆర్థిక వ్యవస్థను బలంగా దెబ్బతీసింది. నేటి కాలానికి మనిషి నుండి వేరుచేయజాలని గట్టి బంధాన్ని ఏర్పరచుకున్నది. పైగా నేటి సమాజంలో దీనికి నియంత్రించజాలనంతటి వ్యతిరేకత రాకపోగా, గౌరవం పెరగటం అత్యంత శోచనీయమైన విషయం.
ఈ కుల వ్యవస్థ ఎలా పుట్టింది?
కుల వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలను గూర్చి సాంఘిక, సామాజిక నిపుణులు పలు రకాలుగా చెబుతారు. వృత్తిని బట్టి కులమేర్పడినదని, తమ కాళ్ల క్రింద ఇతరులను అణగదొక్కుటకు కొందరు స్వార్థపరుల ద్వారా ఇది స్థాపించబడినదని, ప్రాచీనకాలంలో జరుగుతుండే యుద్దాల కారణంగా ఉమ్మడిగా జీవించే ప్రజలు అనేక తెగలుగా, గుంపులుగా చీలిపోవుట వలన కులవ్యవస్థ రూపుదిద్దుకున్నదని చెబుతారు.
ఐతే కులవ్యవస్థ ప్రాదుర్భావానికి తిరుగులేని విధంగా వత్తాసు పలుకుతూ ఋగ్వేదంలో ఒక బలమైన ఆధారం సూత్రీకరించబడింది. అదే పురుషసూక్తం. కులవ్యవస్థను గూర్చి మనం పైన ప్రస్తావించుకున్న పలు కారణాలు విశ్వాసనీయమైనవి కావచ్చు. కాకపోవచ్చు. కాని ఋగ్వేదంలో ఉన్న ఆధారం మాత్రం తిరుగులేనిదిగా, ఎదురులేనిదిగా వున్నది.
'బ్రాహ్మణో అస్య ముఖమాసీద్, :
బాహూరాజన్య కృత :!
ఊరూత దస్యయద్ వైశ్య:
పద్ భ్యా శూద్రో అజాయత !”
ఋగ్వేదం 1:10:90.
అనగా బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు; తొడల నుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు జన్మించారని అర్థం. హైందవ మతమునకు ప్రామాణికముగా చెప్పబడుచున్న ఆదిమ వేదమైన ఋగ్వేదము కులవ్యవస్థ పుట్టుటకు గొంతెత్తి సాక్ష్యమిస్తున్నది. ఎలాంటి అధికారం లేనప్పటికీ, దౌర్జన్యాలు సాగించేవారికి అధికారం తోడైతే ఇక వారి ఆగడాలకు దురాగతాలకు పట్టపగ్గాలుండవు. ఇదే ఉపాయంతో 'కులం' అనే సామాజిక ఆయుధాన్ని తయారు చేసుకుని ఇతరులపై దయాదాక్షిణ్యాలు లేకుండా పాశవికంగా దాడి చేసేవారు. నేడు ఉనికిలో వున్న వందల కులాలు నాటి కాలములో లేకపోవచ్చు కాని ఇన్ని కులాలుగా చీలిపోవుటకు కారణం మాత్రం పురుషసూక్తమేనని తడబడకుండా, తడుముకోకుండా చెప్పవచ్చు. పైగా కులాల ఆవిర్భావమును గూర్చి తెలియజేసే ఊహాజనితమైన కథలన్నియు అవినీతికంపుతో నిండియున్నవి.
ఐతే నాటి కాలములో జీవించిన కొందరు స్వార్థపరులే ఇతరులను లొంగదీసుకుని గొడ్డుచాకిరి చేయించుకొనుటకు ఈ వర్ణవ్యవస్థను రూపొందించి ఋగ్వేదములో జొప్పించారే తప్ప వాస్తవానికి ఇది ఋగ్వేదములో లేదని కొందరు దార్శినికులు సమర్థించే ప్రయత్నం చేసారు.
ఒకవేళ అదే గనుక వాస్తవమైనట్లయితే, మానవాళి జీవిత పరమార్థమును ప్రభోదించవలసిన మనువు కులవ్యవస్థను ఎందుకు బలోపేతం చేస్తాడు?
".......... but a Sudra, whether bought or unbought, he may be compelled to do service work, for he was created to be the slave of a bramana. A Sudra, though emancipated by his master, is not released from servitude; since that is innate in him, who can set himfree from it?
మనుస్మతి 8:412.
అనగా, 'శూద్రుణ్ణి కొనుకున్నా కొనుక్కోకపోయినా బ్రాహ్మణుడు అతడిని దాస్యం చేయమని ఒత్తిడి చేయవచ్చు. ఎందుకనగా బ్రాహ్మణునికి సేవ, వెట్టిచాకిరి చేయుట కొరకే శూద్రుడు సృష్టించబడ్డాడు. ఆ శూద్రునికి దాస్యవిముక్తి కలిగిచినప్పటికీ, అతడెక్కడికి తప్పించుకోలేడు. ఎందుకంటే ఆ దాస్యవృత్తి అతడికి జన్మసిద్ధమైనది. ఆ దాస్యవృత్తి నుండి అతడిని ఎవరు తప్పించగలరు?
ఋగ్వేదంలో ఉన్న వర్ణవ్యవస్థను మనువు మరింత కఠినం చేయుటను బట్టి నిమ్నకులాల ప్రజలపై అగ్రకులాలవారు కన్నూమిన్నూ కానకుండా విరుచుకుపడ్డారు. ఒకవేళ హైందవ దార్శినికులు కులవ్యవస్థ ఋగ్వేదములో లేదని వాదించినట్లయితే మనువు దానిని ఎందుకు ఆమోదించినట్లు? పోనీ, కులవ్యవస్థను ప్రస్తావించుటకు మనువును పరిగణలోనికి తీసుకోకపోయినా భగవద్గీతను తప్పనిసరిగా మనం పరిగణలోనికి తీసుకోవాలి.
“చాతర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి
మాం విద్యకర్త మవ్యయమ్”
భగవద్గీత. 4:13.
అనగా, నాలుగు వర్ణాలు నా చేతనే సృష్టించబడ్డాయి అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు.
కులమనేది ఎలా పుట్టింది అనే ప్రశ్నకు గొప్ప గొప్ప చదువులు చదివిన విద్యావంతులైనను, చరిత్ర పరిశోధకులైనను ముక్కుసూటి సమాధానం చెప్పడానికి ససేమిరా ఇష్టపడరు. చూసీ చూడనట్టు వినీ విననట్లు వ్యవహరిస్తారు. కులవ్యవస్థపట్ల అమితమైన గౌరవం, అపారమైన ప్రేమ వీరికి ఉండుటయే దీనికి కారణం. సమాజాన్ని భ్రష్టుపట్టించే కులవ్యవస్థ గూర్చిన భ్రష్టత్వం వీరికి ఇంత తెలిసియుండి కూడా దానిని ఖండించకపోతే ఇక వీరిని ఏమనాలి?
తోటలో కలుపుమొక్కలను పెరికి పారేయకపోతే చివరాఖరుకి అవి పంటనంతటిని బలహీనపరుస్తాయి, పనికి రాకుండా చేస్తాయి. కులం కూడా అంతే. దాని ద్వారా సమాజం బాగుపడదు, అభివృద్ధిలోనికి రాదు. ఒకవేళ అభివృద్ధిలోనికి వచ్చినా మరొక ప్రక్క సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. కులం ద్వారా కొంతమంది తమలో తామే ఘనంగా ఊహించుకుంటూ వుంటారు. గొప్పగా అతిశయిస్తూ ఉంటారు. తమ పూర్వీకుల ద్వారా ఏదో తమకు సంక్రమించినదని, అది ఎదుటివారిలో లేనిదని ఊహించుకుని తెగ సంబరపడిపోతుంటారు. ఆ సంబరం ఎంత రెట్టింపు స్థాయిలో ఉంటుందంటే “మేము కూటికి పేదలమైనా కులానికి మాత్రం పేదలము కాదు' అనే విధంగా వుంటుంది. అవును అలవాటు పడిపోయిన ఆలోచనా విధానమును వదులుకోలేని బలహీనతే కులమును సమర్థించుకొనుటకు బలమైన కారణం. ఇలాటి వారు కులమనే సంకెళ్లనుండి విడుదల పొందనేరరు.
అగ్రకులస్థులు, హిందుమత సంస్కర్తలు కులంపట్ల ఎలా స్పందించారు?
బసవయ్య:
ఇతను బ్రాహ్మణకుటుంబములో జన్మించినప్పటికిని, కులభేదాలు లేవని, మనుషులందరు సమానమేనని చాటి చెప్పిన వ్యక్తి. తన 8వ యేటనే ఉపనయనాన్ని వ్యతిరేకించి, మూఢనమ్మకాలపై ధ్వజమెత్తాడు.
నారాయణగురు:
పుట్టింది బ్రాహ్మణ కుటుంబములో కాకపోయినా హైందవ సిద్ధాంతములను కాచివడపోసినవాడు. కులమనేది అమానుషమైనదని తెలియజేస్తూ, కులనిర్మూలనకై పాటుపడ్డాడు.
శంకరాచార్య:
బ్రాహ్మణ కులంలో జన్మించిన ఇతను కులవ్యవస్థపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. 'పుట్టుకతో బ్రాహ్మణడైన వాడికన్నా జ్ఞానముతో ప్రకాశించు నిమ్నకులస్థుడే నాకు గౌవవపాత్రుడు' అని శంకరాచార్య అన్నాడు.
పండిత రమాబాయ్:
ఈమె కూడా అగ్రకులంలో జన్మించినప్పటికి మనుషులందరు సమానమేనని చెప్పింది. స్త్రీలకు చదువు నేర్పించే అధికారమును ప్రవేశపెట్టుటలో బలంగా కృషి చేసింది, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించింది.
పుచ్చలపల్లి సుందరయ్య
ఈయన అసలు పేరు పుచ్చలపల్లి వెంకట సుందరరామి రెడ్డి. ఇతను కులవ్యవస్థను వ్యతిరేకించడం మాత్రమే కాక, “రెడ్డి అనే తన కుల చిహ్నమును తొలగించుకొని సుందరయ్యగా మార్చుకున్నాడు. చివరాఖరికి జైల్లో కూడా కులానికి వ్యతిరేకంగా పోరాడాడు.
ఇలా చెప్పుకుంటుపోతే వర్ణవ్యతిరేక విప్లవకారులు అనేకమందిని మనం చూడవచ్చు. కులం వలన మనకు ఒరిగేది ఏమి లేదు, జాతి కూడా వికసించదు, పైగా కలసి కట్టుగా జీవించాలనే కార్యాన్ని అది అడ్డగిస్తుంది, కుల స్పహ ఉండడం వలన పాత వివక్షతలన్ని గుర్తుకొస్తాయి, సమైక్యత ఆగిపోతుంది. కులం వంశపారంపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారం. అది నిరంకుశమైన రాచరికపు వ్యవస్థ. భారతదేశములో పురుడు పోసుకుని ప్రపంచ నలుమూలలకు తన విషప్రభావాన్ని చిమ్ముతూనే ఉంది. మన సంఘసంస్కర్తలు కులనిర్మూలనకై పాటుపడినంతగా మనం పాటు పడకపోయినా, కనీసం దానితో విభేదించాలి. దానిని నిరాకరించాలి. వర్ణవ్యవస్థను పటిష్టపరచడానికి అసంఖ్యాకమైన కల్పితకథలు పుట్టుకొచ్చాయి. ఏవి ప్రామాణికమైనవో ఏవి ప్రక్షిప్తాలో తెలుసుకోవడానికి కూడా అవకాశం లేనంతగా తికమకపెట్టాయి. చివరికిచేసేది లేక వర్ణవ్యవస్థ యొక్క డొక్కచించి డోలు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విప్లవవాదులు.
క్రైస్తవుడు కులం పట్ల ఎటువంటి వైఖరిని కలిగియుండాలి?
అగ్రకులాల వారు తమ తమ కులాన్ని బట్టి అతిశయిస్తున్నట్లు క్రైస్తవులు కూడా కులాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కులవ్యవస్థ పట్ల వారికివున్న వీరాభిమానాన్ని నెత్తికెక్కించుకుంటున్నారు. ఆ అతిశయం మరియు వీరాభిమానం వారి మాటల్లోను, వారి క్రియలలోను, వారు చెప్పే సాక్ష్యాలలోను మిళితమైయుంటుంది. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. 'చింత చచ్చినా పులుపు చావలేదు' అన్న విధంగా క్రీస్తును హృదయపూర్వకంగా అంగీకరించిన నేటి విశ్వాసులు సైతం తాము చెప్పే బహిరంగ సాక్ష్యాలలోనూ, ప్రసంగాలలోనూ తమ పేరు, ఊరుపేరుతో పాటు తమ కులంపేరును కూడా చెప్పుకుంటున్నారు.
ఇక్కడ గమనించవలసిన విషయమేమిటనగా, గొప్పకులం కలిగినవారు మాత్రమే తమకులాన్ని గూర్చి ఘనంగా చెప్పుకుంటారు. హీనమైన కులం కలిగినవారు తమ కులాన్ని గూర్చి చెప్పుకోరు. ఎన్నికలేని నన్ను దేవుడు తన కృపద్వారా రక్షించాడని చెప్పుటకు బదులు తమ కులానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇలా కులవ్యవస్థ చివరికి క్రైస్తవులను సహితం పాదాక్రాంతం చేసుకొన్నది. దీనిని బట్టి అన్యమతస్తులకంటే క్రైస్తవులలోనే కులపైత్యం ఎక్కువగా ఉన్నదని అర్థమవుచున్నది. చెప్పే సాక్ష్యాలలో లేదా ఉపన్యాసములలో తమ అగ్రకుల ప్రస్తావన తీసుకురాకపోయినట్లయితే ఏదో వెలితి చోటుచేసుకుంటుందని తలంచి కులం గూర్చి ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నారు నేటి క్రైస్తవ ప్రసంగీకులు. “మనుష్యులలో ఘనంగా ఎంచబడునది దేవుడు దృష్టికి అసహ్యము.” (లూకా 16:15)
బైబిలులోని బోధలు అనుభవపూర్వకముగా తెలియకపోయినప్పటికీ, హైందవ మతసంస్కర్తలు కులవ్యవస్థను తీవ్రంగా ఖండించడం ఇంతకు ముందే మనం చదువుకున్నాం. కనీసం వారిలో ఉన్న చైతన్యమైనా మన క్రైస్తవులలో లేదు.
ఇద్దరు క్రైస్తవ సోదరులు అప్పటి వరకు బాగానే మాట్లాడుకుంటారు. చక్కగా కలసిమెలసి ఉంటారు. కాని ఒకరి కులం మరొకరికి తెలిసేటప్పటికి మునుపు ఉన్న స్నేహం దారితప్పుతుంది, మాటల్లో మార్పు కనబడుతుంది, క్రియలలో లోటు ఏర్పడుతుంది, చివరికి వారి మధ్య వున్న సమైఖ్యత దెబ్బతింటుంది. ఇదే కులవ్యవస్థలో అంతర్లీనంగా దాగివుండే విషరూపం. ఐతే ఇలాటి సంఘటన చోటు చేసుకోకూడదని ముందుగా జాగ్రత్తపడే తెలివైన క్రైస్తవులు చేసే పనేమిటో తెలుసా? పరిచయం చేసుకోవాల్సిన సహోదరుని కులాన్ని మరొక వ్యక్తి ద్వారా పరోక్షంగా తెలుసుకుని పరిచయం చేసుకుంటారు.
దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా జీవించే మనం అన్యుల ఆచారమును గైకొనుట తగునా? ఒకవేళ దాని ద్వారా వచ్చే సత్పలితాలేమైనా ఉన్నట్లయితే దానిని పాటించవలసినదని, గైకొనవలసినదని దేవుడు మనకు చెప్పియుండెడివాడు కాని అలా వర్ణవ్యవస్థను ఆమోదించినట్లు బైబిల్లో కనీసం ఒక్క లేఖనమైనను వ్రాయబడి లేదు పైగా దానిని ఖండించినట్లు అనేకమైన దాఖలాలు ఉన్నవి. ప్రతిష్టించబడిన ఇశ్రాయేలీయులలో కొందరుఇశ్రాయేలీయులు అన్యుల ఆచారములను గైకొనుట వలన దేవునిఉగ్రతకు గురయ్యారు (కీర్తనలు 106:35), సొలొమోను రాజ్యము పతనమవుటకు కారణము అన్యఆచారములే (1రాజులు 11:4), అహాబు అకాల దుర్మరణమునకు కారణం కూడా అన్య ఆచారములే(1రాజులు 21:22-26, 22:29-40). అందుచేతనే అన్యజనుల వలన ప్రతిపాదించబడిన ఆచారముల జోలికి వెళ్లవద్దని మరీ మరీ ఖండితముగా హెచ్చరించాడు యిర్మీయా. (యిర్మియా. 10:2).
ఈనాటి సంఘ సమాజములో ఎంతోమంది ప్రసంగీకులుగా, దైవజనులుగా చెలామణి అవుతున్నారు. ఐతే కులవ్యవస్థను అమితంగా ఇష్టపడుతూ వారు దేవునికి చేస్తున్న ద్రోహం కొన్ని క్రియల ద్వారా మనం పసిగట్టవచ్చు.
ఉదాహరణకు అమ్మాయి అబ్బాయి ఇరువురు గాఢంగా ఇష్టపడతారు. ఆ విషయం తమతమ తలిదండ్రులకు తెలియపరుస్తారు. పిల్లల ఇష్టాన్ని కాదనలేక పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించి నిశ్చితార్థం జరిపిస్తారు. తీరా వివాహ సమయం సమీపించే సరికి జరిగేది కులాంతర వివాహమని తెలుసుకుని హఠాత్తుగా పెళ్లిని నిలిపివేస్తారు. ప్రత్యామ్నాయం లేని కారణంగా పెళ్లి జరిపించినా పెద్దవాళ్లు సరిగ్గా మాట్లాడుకోక పోవడమో, వధూవరులిద్దరి మధ్య చిచ్చు రగిలించడమో జరుగుతుంది. ఒకవేళ పెద్దవాళ్లు కులాంతర వివాహమునకు అంగీకరించినట్లయితే ఆ వివాహము ద్వారా వచ్చే లబ్దికి కకుర్తీపడి మాత్రమే అంగీకరిస్తారు తప్ప, దేవుని వాక్యానుసారంగానో స్వచ్చంధంగానో కానే కాదు..
ఆ మధ్య ఒక విశ్వాసురాలు తమ కుమార్తెకు మంచి సంబంధం చూడమని నాకు చెప్పింది. ఐతే ఆ అబ్బాయి మాత్రం తమ కులానికి చెందినవాడైయుండాలని షరతులు విధించింది. కులము అనే కట్లు చేత నిర్భందించబడిన ఆ విశ్వాసురాలు చెప్పే మాటలను నేను విన్నప్పుడు ఏ విధంగా స్పందించాలో అర్థంకాక నివ్వెరపోయాను. నేటి సంఘకాపరులలో, సంఘములో కూడా ఇదే ధోరణి కనబడుచున్నది. అసలు సిసలైన దైవనైతిక ప్రమాణాలను బోధించవలసిన కొందరు కాపరులు, విశ్వాసులకు బోధించి గద్దించి బుద్ది చెప్పు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అన్యసాంప్రదాయములు పాటించకూడదని తమకు తెలిసినప్పటికి వారు అంతర్గతముగా వాటిని సమర్థించుకుంటున్నారు, వాటిపట్ల చూచీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరింత సూటిగా చెప్పాలంటే చాలా మంది సంఘకాపరులలో ఇంకను కులరోగం చేత మంచానపడినవాళ్లు ఉన్నారు. తమ కులానికి చెందినవారితో మాత్రమే ఎక్కువగా మాట్లాడతారు, వారితోనే రాసుకుని పూసుకుని తిరుగుతారు, వారితోనే ఎక్కువ స్నేహం చేస్తారు. ఇలా చేస్తూ తమ కులబంధాన్ని మరింత పటిష్టపరచుకుంటారు. స్వయంగా సంఘకాపరులే ఇలాంటి కులపట్టింపులు కలిగివున్నట్లయితే ఇక సాధారణ విశ్వాసుల పరిస్థితి ఏమవ్వాలి? మరొక కఠినమైన వాస్తవమేమిటంటే ఏ కులానికి చెందిన విశ్వాసులు ఆ సంఘానికి మాత్రమే వెళుతున్నారు. అనగా ఈ కులస్థులకు ఈ సంఘం, ఆ కులస్థులకు ఆ సంఘం అనీ తమలో తాము విడిపోయి వేరైపోతున్నారు. చివరికి పరిస్థితి ఎంత ముదిరిపోయిందంటే ఏ విశ్వాసియైనా కొత్తగా సంఘానికి వెళ్లాలంటే తొలుత ఆ సంఘ కులమేమిటి అని అడిగి తెలుసుకుని వెళ్లే దుస్థితి ఏర్పడింది. ఏక శరీరముగా ఉన్న క్రీస్తుసంఘాన్ని కులవ్యవస్థపేరుతో ముక్కముక్కలుగా విడగొట్టేస్తున్నారు. క్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థనలో - “పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నామమందు వారిని కాపాడుము" (యోహాను. 17:11) అని వేడుకున్నాడు. ఐతే క్రీస్తు కలిగియున్న ఈ ఆశయానికి వ్యతిరేకంగా పనిచేసేదే కులవ్యవస్థ. ఓ విశ్వాసి నీవు వెళ్లే సంఘానికి అలాంటి దుస్థితి వుందా? అలాగైతే ఆ దుస్థితి నీకు పట్టకముందే ఆ సంఘము నుండి బయటకు రా !
మరొక విషయమేమిటంటే, విద్యా, ఉద్యోగం కొరకు పేర్లు మార్చుకుని జీవించే సహోదరీసహోదరులు మన మధ్యే తిరుగుతుంటారు, మనతోనే మాట్లాడుతుంటారు. అనగా ఆఫీసులో అన్యుడైన ఎల్లయ్యగా, సంఘంలో మాత్రం ఏలియా అనబడే క్రైస్తవునిగా కనబడతారు. క్రైస్తవ పేరు వ్రాస్తే ఉద్యోగానికి ఏ అంతరాయం, ఆటంకం ఏర్పడుతుందోనని భయపడి సర్టిఫికెట్స్లోను, డాక్యూమెంట్స్ లోను మరొక పేరు వ్రాసుకుంటారు. ఆకస్మిక తనిఖి చేయుటకు అధికారులు ఇంటికి వచ్చినప్పుడు కూడా క్రైస్తవునిగా కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అనగా క్రైస్తవ్యానికి చిహ్నముగా వుండే వస్తువులను మంచంక్రిందో అటకపైనో పెడతారు తనిఖీ అధికారులు ఇంటికి వచ్చి వెళ్లిపోయిన తర్వాత “హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకుంటారు. అనగా పరిసరాలను బట్టి రంగులుమార్చే ఊసరవెల్లిలాంటి మనస్తత్వాన్ని కలిగియుండి, బయట అన్యునిగాను లోపల క్రైస్తవునిగాను జీవిస్తుంటారు. ఇలాంటి వారి గూర్చి క్రీస్తు ముందే ఒక హెచ్చరిక జారీ చేసాడు. “మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును” (మత్తయి 10:32- 33).
ఇహలోక ఉద్యోగం కొరకో, ప్రమోషన్ కొరకో వెంపర్లాడుతూ తాను క్రైస్తవుడనే వాస్తవము బయటకు తెలియకుండా జీవించే వారు మనతోనే ఉంటారు, మనతో మాట్లాడతారు, మనతోనే సహవాసం చేస్తారు కాని బయటపడకుండా లోగుట్టుగా మసలుకుంటారు. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుట కంటే క్రీస్తు విషయమైన నిందలు శోధనలు అనుభవించుట మేలని ఎంచుకున్నాడు మోషే (హెబ్రీ 11:26). ఐతే తుచ్ఛమైన అవసరతల కొరకు క్రీస్తును తృణీకరించి దేవునిని దు:ఖపెడుతున్నారు నేటి నామకార్థ క్రైస్తవులు.
మోషేలాంటి స్వభావం, త్యాగశీలత మనలో లేకపోయినా, చెప్పాల్సిన అవసరత వచ్చినప్పుడు మాత్రం “నేను క్రైస్తవుడను' అని నిర్భయంగా చెప్పుకునే తెగింపు, తెగువ ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అంతే కాని ఉద్యోగం కొరకో, స్వలాభాపేక్ష కొరకో పేరు మార్చుకుని ఆఫీసులో అన్యునిగా, సంఘంలో విశ్వాసిగా జీవించే మాయలమారి జీవితం క్రైస్తవజీవితం అని అనిపించుకోదు. ఇహలోకంలో ఎవరైతే క్రీస్తును ఒప్పుకుంటారో వారిని క్రీస్తు, దేవుని యెదుట ఒప్పుకుంటాడు. ఐతే కొందరు నామకార్థ క్రైస్తవులు తమ్మును తాము సమర్థించుకొనుటకు - 'మేము వెళ్లే ప్రతి చోటను కూడా క్రైస్తవులమనే చెప్పు కుంటాము' అని అంటున్నారు. ఐతే మండల కార్యాలయంలో నీవు హైందవుడవని ఒప్పుకొననిదే అసలు కుల ధృవీకరణ పత్రమే ఇవ్వరు. ఆ కులధృవీకరణ పత్రము ద్వారా వచ్చే ప్రయోజనాలను పరిగణలోనికి తీసుకుని అక్కడ నీవు హైందవుడనని చెప్పుకుంటావు కాబట్టి నీవు వెళ్లే ప్రతిచోట క్రైస్తవుడవేననీ సాక్ష్యమిస్తున్నావనుట పచ్చి అబద్ధమే కదా! మరి దీనికి నీ సమాధానమేమిటి?
క్రైస్తవులమైన మనం దేవుని చేత ఎన్నిక చేయబడి వేరుపరచబడినవారము. మన విశ్వాసము, భక్తి జీవనవైఖరి దైవాంగీకారమైనదిగా ఉన్నప్పుడే మనలను బట్టి దేవుడు హర్షిస్తాడు. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు' ఎవరో ఏదో చేసారు కదా అని వారిని మనం అనుసరించకూడదు.
కులవ్యవస్థ అనేది బైబిలేతర సిద్ధాంతం. ఐకమత్యంగా జీవించే వారిని విడదీస్తుంది. వేర్పాటు వాదాన్ని సృష్టిస్తుంది. పైగా అది అత్యంత హేయమైనదిగా పరిగణింపబడి హైందవ సంఘసంస్కర్తలచే వ్యతిరేకించబడినదై యున్నది. కనుక క్రైస్తవులమైన మనం దానిని ఖండించాలి. మనుషుల చేత సిద్ధాంతీకరించబడిన సిద్ధాంతం మని దానిని భావించాలి. తుచ్ఛమైన ఘనత కొరకు ఆరాటపడి కులానికి కొమ్ము కాచినట్లయితే ఒక దినమున భారీమూల్యము చెల్లించుకోక తప్పదు, “మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యం.”
Comments