దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా, నాకు తెలిసిన ఒక మిత్రుడు నాతో ఏమన్నాడంటే, "ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేది. ఆరు వేల సంవత్సరాల నాటి రాముడు హనుమంతుడి బొమ్మలు ఇరాక్ లో బయటపడ్డాయి తెలుసా?" అని అంటూ WhatsApp లో నాకు కొన్ని ఫోటోలు కొన్ని వెబ్సైట్ల లింకులను పంపించాడు. ఆ తరువాత కూడా ఇవే ఫోటోలు నాకు సోషల్ మీడియాలో చాలా సార్లు కనిపించాయి. కొద్ది రోజుల క్రితం మన తెలుగు బాక్స్ ఆఫీస్ టీవీ ప్రేమచంద్ గారు కూడా ఒక వీడియోలో దీని గురించి మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పినదాని ప్రకారం - ఇరాకులో ఒక ఆలయం ఉండేదట, అది ఆరు వేల సంవత్సరాల క్రితం నిర్మించారట, ఇప్పుడు ఆ ఆలయంలో గోడ మాత్రమే మిగిలిందట, ఆ గోడ మీద రాముడు హనుమంతుడి బొమ్మలు ఉన్నాయట. ఒక వర్గం వారు పనిగట్టుకుని మరీ ఈ అబద్దాన్ని తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఇలా అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా అమాయక హిందువులను మభ్యపెట్టవచ్చునేమో కానీ, నిజం నిప్పులాంటిది. ఎదో ఒక రోజు అది బయటకు రాకుండా అయితే ఉండదు కదా!
సరే అసలు విషయంలోకి వెళితే, ఇవి నిన్న గాక మొన్న క్రొత్తగా బయటపడిన శిల్పాలు కాదు. ఫ్రెంచ్ భూగర్భ శాస్త్రవేత్త మరియు పురావస్తు శాస్త్రవేత్త అయిన Jacques De Morgan అనే పరిశోధకుడు 1895వ సంవత్సరంలోనే వీటిని ప్రపంచానికి పరిచయం చేశాడు. 1894 నుండి 1905వ సంవత్సరం వరకు, పదకొండు ఏళ్ల వ్యవధిలో ఈయన "Mission scientifique en Perse" అనే పేరుతో ఫ్రెంచి భాషలో మొత్తం పది పుస్తకాలను (Ten Volumes) ప్రచురించారు. వీటిల్లో నాలుగు పుస్తకాలు భూగర్భ సంబంధ విషయాల మీద చేసిన అధ్యయనాల గురించి (Geological Studies); రెండు పుస్తకాలు పురావస్తు సంబంధ విషయాల మీద చేసిన అధ్యయనాల గురించి (Archeological Studies); కుర్దిష్ మరియు ఉత్తర పర్షియా భాషల గురించి ఒక పుస్తకం; Mandaean texts, అంటే క్రీస్తు శకం నాలుగు ఐదు శతాబ్దాల కాలంలో పర్షియా ప్రాంతంలో Mandaeism అనే ఒక మతం ప్రాచుర్యంలో ఉండేది. ఆ మతానికి సంబందించిన మత గ్రంథం మీద ఒక పుస్తకం; అలాగే భౌగోళిక సంబంధ విషయాల మీద చేసిన అధ్యయనాల గురించి (Geographical Studies) రెండు పుస్తకాలను ప్రచురించారు. Mission scientifique en Perse - 2nd Volume అలాగే 4th Volume లో కూడా Jacques De Morgan గారు ఈ శిల్పాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అలాగే కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు The British Institute for the Study of Iraq అనే సంస్థతో కలిసి "Iraq" అనే పేరుతో ఒక Academic Journal ని ప్రచురిస్తూ ఉంటారు. 1966వ సంవత్సరంలో వీళ్ళు ప్రచురించిన Volume No. 28 లో C.J. Edmonds గారు "Some Ancient Monuments on the Iraqi-Persian Boundary" అనే పేరుతో ఒక Journal Article ని ప్రచురించారు. మీరు ఈ పుస్తకాలను చదివినట్లయితే గనక మీకు ఈ శిల్పాలకు సంబంధించిన ప్రామాణికమైన సమాచారం దొరుకుతుంది. అలాగే Edmonds గారి స్నేహితుడైన A.J. Chapman గారు ఈ శిల్పాలకు సంబంధించిన ఒక పెన్సిల్ స్కెచ్ ని కూడా గీశారు. ఆ పెన్సిల్ స్కెచ్ ని గనక మనం పరిశీలిస్తే ఈ శిల్పాలలో ఉన్న వివరాలన్నింటినీ కూడా మనం మరింత స్పష్టంగా చూడొచ్చు.
మన ప్రేమచంద్ గారు చెప్పినట్లుగా ఇవి ఆరు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంలోని గోడల మీద చెక్కిన శిల్పాలు కావు. ఇవి సుమారు క్రీస్తు పూర్వం 22వ శతాబ్దానికి చెందినవి. అంతేకాకుండా ఇక్కడ ఆలయం లాంటిదేమీ లేదు. ఇరాక్ మరియు ఇరాన్ సరిహద్దు ప్రాంతంలోని Darband-i-Belula అనే ఒక పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద చెక్కిన రాతి శిల్పం ఇది. దీనిని "Horen Shekhan Stone Relief" అని అంటారు.
చేతిలో విల్లును ధరించి ఠీవీగా నిలబడిన ఒక వ్యక్తి, అతని ముందు మోకరిల్లి ప్రణామం చేస్తున్నట్లుగా మరొక వ్యక్తి... చూడగానే నిజంగానే ఇది రాముడు హనుమంతుడి బొమ్మలేనేమో అని అనిపించేలాగానే ఉంటాయి. అయితే మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇక్కడ ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. చేతిలో ధనస్సును పట్టుకుని నిలబడిన వ్యక్తి తన కాలితో మరొక వ్యక్తిని తొక్కుతూ ఉన్నట్లుగా ఉంటుంది. అతను నేల మీద పడిపోయి ధనస్సును పట్టుకుని ఉన్న వ్యక్తి వైపు చూస్తూ ఉన్నాడు, అతని తల మీద ఒక టోపీ లాంటిది పెట్టుకొని ఉన్నాడు, నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని చుట్టుకొని ఉన్నాడు. అతని కాలికి చెప్పులు లాంటివి ఏమీ లేవు. వొట్టి కాళ్లతోనే ఉన్నాడు. అతని వెనుక మరొక వ్యక్తి తనను చంపొద్దు అనీ తనకు ప్రాణభిక్ష ప్రసాదించమనీ వేడుకొంటున్నట్లుగా ఉంది. ఇతను కూడా తల మీద ఒక టోపీ లాంటిది పెట్టుకొని ఉన్నాడు, నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని చుట్టుకొని ఉన్నాడు. కాళ్లకు చెప్పులు లాంటివి ఏమీ లేవు. వీళ్లిద్దరి వేషధారణను బట్టి చూస్తే వీళ్ళు "హుర్రియన్" అనే జాతికి చెందిన సైనికులు అయ్యుంటారు అనేది పరిశోధకుల అభిప్రాయం. ఇక్కడ మోకరిల్లి ఉన్న వ్యక్తినే మనవాళ్ళు హనుమంతుడు అని ప్రచారం చేస్తున్నారు. కానీ మీరు ఈ బొమ్మను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇతనికి హనుమంతుడిలాగా తోక లేదు. అలాగే ఇతని మూతి కూడా మాములుగానే ఉంది. కోతి మూతిలాగా ఏమీ లేదు. అలాగే హనుమంతుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక గద ఉంటుంది. కానీ ఈ బొమ్మలో మనకు అలాంటిదేమీ కనిపించడం లేదు. అలాగే హనుమంతుడు ధరించే కిరీటం కానీ, ఆభరణాలు కానీ అతని ఎడమ కాలికి ఉండే కడియం, ఇవేవీ కూడా మనకు ఈ బొమ్మలో కనపడటం లేదు. అలాగే హనుమంతుడి వొంటి మీద ఉండే జంధ్యం కూడా ఇక్కడ లేదు. మరి ఇతన్ని పట్టుకుని వీళ్ళు హనుమంతుడు అని అలా ఎలా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి.
ఇక ఈ బొమ్మలో ధనస్సును పట్టుకుని ఉన్న ప్రధానమైన వ్యక్తిని కూడా కొంచెం పరిశీలిద్దాం. నిజమే ఇతని చేతిలో ధనుస్సు ఉంది. అయితే చేతిలో ధనుస్సును పట్టుకుని ఉన్న ప్రతివాడూ రాముడు కాదు కదా. పూర్వ కాలంలో రాజులు అందరూ కూడా ధనస్సులనే ఉపయోగించేవారు. కేవలం చేతిలో ధనుస్సు ఉంది అనే ఒకేఒక్క కారణంతో ఇతను రాముడు అని ఎలా అంటారు? ఇక్కడ ఈ వ్యక్తి తల మీద కూడా ఒక టోపీ లాంటిది ఉంది. అరణ్యవాసంలో ఉన్న రాముడు అయ్యుంటే గనక జుట్టు ముడి వేసుకుని పూలు పెట్టుకుని ఉండాలి. లేదా కిరీటం పెట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదు. మేడలో కేవలం ఒక హారము ఉంది. ఆ హారానికి డిస్క్ ఆకారంలో గుండ్రంగా ఒక పెద్ద బిళ్ళ లాంటిది వేలాడుతూ ఉంది. అంతే, అంతకుమించి వేరే ఆభరణాలు కానీ, రుద్రాక్ష మాలలు కానీ పూల దండలు కానీ... ఇవేవీ కూడా లేవు. ఇలాంటి రాముడ్ని నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇతను ఎడమ చేతిలో ధనస్సును పట్టుకుని ఉన్నాడు, కుడి చేతిలో రెండు వైపులా పదునుగా ఉన్న ఒక చిన్న కత్తిని పట్టుకుని ఉన్నాడు. ఇంగ్లీషులో అయితే దీనిని Dagger అని అంటారు. సాధారణంగా రాముడి కుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక బాణం ఉంటుంది. కానీ ఇలా రెండు వైపులా పదునుగా ఉన్న కత్తిని పట్టుకుని ఉన్న రాముడ్ని నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ఇతను కూడా నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని ఉన్నాడు. సాధారణంగా మనం టవల్ ని చుట్టుకుంటాము చూడండి ఆ విధంగా చుట్టుకుని ఉన్నాడు. కానీ రాముడు అయితే పంచె కట్టుకుని ఉంటాడు అది కూడా అరికాలి వరకూ ఉంటుంది. ఇలా మోకాలి వరకు తువ్వాలు చుట్టుకుని ఉన్న రాముడ్ని నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇతని నడుము చుట్టూ ఒక బెల్టు లాంటిది ఉంది. అందులో ఒక గొడ్డలి ఉంది. ఇలా బొడ్డులో గొడ్డలి పెట్టుకున్న రాముడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నేను అయితే ఎప్పుడూ వినలేదు. ఇక ఇతని అంబులపొది నేల మీద ఉంది. కానీ సాధారణంగా రాముడి విగ్రహాలలో అతని అంబులపొది అతని భుజానికి వ్రేలాడుతూ ఉంటుంది. అలాగే ఇతని కాళ్లకు కూడా చెప్పులు కానీ లేదా పాదరక్షల వంటివేమీ లేవు.
ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాతి శిలలో కుడి వైపున Akkadian భాషలో వ్రాసిన ఒక శాసనం ఉంది. దీని ఆధారంగా ఇది క్రీస్తు పూర్వం 22వ శతాబ్దానికి చెందినది అని, ఇక్కడ ధనుస్సు పట్టుకుని నిలబడిన వ్యక్తి "లుల్లుబి" (Lullubi) రాజు అయిన IPSHACH MALA కొడుకు "TAR DUNNI" అని పరిశోధకులు గుర్తించారు. లుల్లుబి అనేది క్రీస్తు పూర్వం మూడవ సహస్రాబ్దిలో మెసొపొటేమియా ప్రాంతంలో వర్ధిల్లిన ఒక తెగ. కాబట్టి మిత్రులారా ఈ రాతి శిల్పంలో ఉన్నది రాముడు మరియు హనుమంతుడు కాదు. లుల్లుబి అనే ఒక తెగకు నాయకుడు అయిన IPSHACH MALA కొడుకు TAR DUNNI... యుద్ధంలో శత్రువులను ఓడించినప్పుడు ఆ శత్రు సైనికులు అతని ముందు మోకరించిన సందర్భానికి గుర్తుగా ఆ సన్నివేశాన్ని ఈ కొండ మీద ఒక రాతి శిల్పంలా చెక్కించడం అనేది జరిగింది. అదన్నమాట సంగతి!!!
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.