రక్షణ

రచయిత: పీటర్ మాస్టర్స్
అనువాదం: శామ్యూల్ బొప్పూరి
చదవడానికి పట్టే సమయం: 48 నిమిషాలు

7 ఖచ్చితమైన గుర్తులు

రక్షణ నిశ్చయతకు దారి చూపే 7 గుర్తులు మరియు ఆత్మీయ నాయకుల సహకారి

విషయసూచిక

  1. పాపపు ఒప్పుకోలు
  2. లేఖనాలను (బైబిల్) అర్థం చేసుకోవడం
  3. కుటుంబ బంధం
  4. ప్రార్థనను కనుగొనడం
  5. నూతన హృదయం
  6. ఆరంభ నిశ్చయత
  7. సాతాను యొక్క దాడులు

నిజమైన మార్పు సంభవించింది అనేందుకు గుర్తించదగిన సూచనలు ఏమైనా ఉన్నాయా? దేవుడు వారి హృదయాల్లో కార్యం జరిగిస్తే రక్షణను వెదకేవారు ఆ సంగతిని ఎలా చెప్పగలరు? మారుమనస్సు పొందానని చెప్పుకునే వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని ఒక కాపరి ఎలా గుర్తించగలడు? లేక బాప్తీస్మం కొరకు మరియు సంఘ సభ్యత్వం‌ కొరకు ధరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని ఎలా గుర్తించగలం?

బైబిల్ లోని అనేక భాగాలు చెబుతున్నట్టుగా మారుమనస్సుకు చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి. వాటినే మన పూర్వీకులు కృపాగుర్తులని పిలిచారు. ఈ గుర్తులను చాలా స్పష్టంగా 1 యోహానులో చూడగలం. కొంతమంది బైబిల్ వ్యాఖ్యాతలు ఈ పత్రికలోని ప్రధాన అంశాలను “జీవితంలో వచ్చే పరీక్షలు"గా వర్ణించారు. మన జీవితంలో కొన్ని నిజమైన మార్పుకు సంబంధించిన ఆధారాలను, ఋజువులను గమనించడం ద్వారా మనం నిజంగా ఆయనను ఎరిగి ఉన్నామని యోహాను నొక్కి‌ చెబుతున్నాడు. (1 యోహాను 2:3) . అలాగే రోమా 8వ అధ్యాయం కూడా అనేక స్పష్టమైన సూచనలను తెలియచేస్తుంది. ఒక కాపరికి ఉపయోగపడే విధంగాను, గుర్తించుకునేందుకు సులభంగాను అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ గుర్తులను గురించి క్లుప్తంగా రాయబడింది.

ఈ గుర్తులను మనం జాగ్రత్తగా ఆలోచించే ముందు మనకు మనమే అత్యవసరమైంది ఏంటో జ్ఞాపకం చేసుకుని వాటి మీదే మన దృష్టి అంతా కేంద్రీకరించాలి. ఒక్కసారి గమనిస్తే నేడు సువార్తీకరణ జరుగుతున్న విధానం కేవలం సువార్త వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ, పాపం, మారుమనస్సును గురించిన విషయాలను నిర్లక్ష్యపరుస్తుంది. నిజమైన మార్పును గుర్తించకుండానే తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడకుండానే అనేకమందిని క్రైస్తవ తీర్మానంలోకి నడిపించడం జరుగుతుంది. ప్రజలను త్వరగా క్రీస్తు కొరకు తీర్మానం తీసుకునేట్టు ఒప్పింపచేసి వెంటనే వారు రక్షించబడ్డారని ప్రకటించటం ఆనవాయితీగా మారింది.

మారుమనస్సు అంటే ఏమిటో తెలియకుండానే రహస్య పాపాన్ని విడిచి పెట్టకుండానే ఒక వ్యక్తి క్రీస్తు కొరకు తీర్మానం తీసుకుంటే ఏం జరుగుతుంది? స్వనీతిని సంపూర్తిగా విడిచిపెట్టకుండా క్రీస్తు నీతి, ప్రాయశ్చిత మరణాలపై యథార్థంగా ఆధారపడకుండా ఒక వ్యక్తి క్రీస్తు కొరకు తీర్మానం తీసుకుంటే ఏం జరుగుతుంది? దేవుడు ఒక వ్యక్తి హృదయంలో పాపపు ఒప్పుకోలు కలిగించకుండానే, దేవునికి ఆ వ్యక్తి సంపూర్తిగా లోబడకుండానే క్రీస్తు కొరకు తీర్మానం తీసుకుంటే ఏం జరుగుతుంది?

సువార్త అంటే సరైన అవగాహన లేని సువార్తికులు, పైన తెలియచేయబడ్డ సంగతులన్నిటినీ నిర్లక్ష్యపరుస్తున్నారు. వారు సువార్తీకరణే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని, మారుమనస్సుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రక్కకు నెట్టివేస్తున్నారు. నిశ్చయంగా దేవుని వాక్యం నుండి సువార్తను ఎలా ప్రకటించాలో నేర్చుకోవడం మన కర్తవ్యంగా ఉంది. తద్వారా నశించిన పాపుల హృదయాల్లో పరిశుద్ధాత్ముడు క్రియ చేసే విధాన్ని మనం గౌరవించగలం. ఇప్పుడు మనం నేరుగా మారుమనస్సుకుండే గుర్తులను అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూద్దాం.

పెంతెకోస్తు దినాన మారుమనస్సు పొందిన వేలాదిమంది ప్రజల్లో సంభవించిన గొప్ప మార్పు గురించి (అపోస్తలుల కార్యాలు 2:37-38)  మరియు 4:1-46 వచనాలలో లూకా అద్భుతంగా తెలియచేస్తున్నాడు.

“వారు ఈ మాట విని హృదయమములో నొచ్చుకొని - సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు- మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టెవిరుచుట యందును ప్రార్ధనయందును ఎడతెగకయుండిరి. మరియు వారేకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారైరి” (అపో.కా. 2:37-38, 42-46).

ఈ వాక్యభాగంలో దేవుని కృపకు సంబంధించిన ఆరు ప్రాముఖ్యమైన గుర్తులు మనకు కనబడుతున్నాయి. ఈ స్త్రీపురుషులు వ్యక్తిగతంగా లోతైన అనుభవాన్ని రుచి చూశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు మనస్సు, హృదయం పూర్తిగా మార్పు చెందాయి. ఇది వారి వల్ల కలిగింది కాదు, ప్రభువే వారికి పరివర్తనం కలిగించాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ కృపాగుర్తులను మనం గుర్తించే విధంగా రాయబడ్డాయి. మన స్వంత రక్షణ గురించి మనం శ్రద్ధ కలిగినవారమైతే మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. ప్రభువు యొక్క కార్యం మన జీవితంలో జరిగిందని ఈ గుర్తులను గమనించడం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నామా? ఈ గుర్తులే మన జీవితంలో కావలసిన ప్రోత్సాహాన్ని అందించగలవు. మనం ప్రభువు యొక్క కార్యాన్ని ఇంకొకరి జీవితంలో కనుగొనాలంటే ఈ గుర్తులను సందేహించకుండా వాటిని బాగా ఎరిగినవారమై వాటి విషయంలో శ్రద్ధ వహించాలి.

1.పాపపు ఒప్పుకోలు
ఈ వాక్యభాగంలో కృపకు చెందిన మొదటి గుర్తు ఏదంటే నిజమైన మారుమనస్సు దగ్గరకు నడిపించే పాపపు ఒప్పుకోలు అనుభవం (అపోస్తలుల కార్యాలు 2:37-38). ప్రజలు తమ హృదయాల్లో నొచ్చుకుని (లేక గ్రీకులో తెలియచేయబడ్డట్టు, హృదయం కోయబడినవారైతే) తరువాత తమ పాపజీవితాల విషయమై నిజంగా సిగ్గుపడి, క్షమాపణ కొరకు యథార్థమైన కోరిక కలిగున్నవారికి మాత్రమే బాప్తీస్మం ఇవ్వబడుతుంది.

మనం ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అభివృద్ధిని చూడాలంటే ప్రభువు అలక్ష్యం చేయని ఒక విరిగి, నలిగిన హృదయాన్ని గుర్తించాలి (కీర్తన 51). వాక్యసంబంధమైన జ్ఞానం కలిగుండి, కేవలం పెదవులతో పాపాన్ని ఒప్పుకుని, లోతులేని మారుమనస్సు కలిగుంటే, ఆ మారుమనస్సు నిజమైందా కాదా అని సందేహించాలి. ఆకలితో ఉన్నవారిని ప్రభువు తృప్తిపరుస్తాడు. అలాగే నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులని వాక్యం చెబుతుంది. (మత్తయి 5:6). మారుమనస్సు అనేది ఒక లోతైన అనుభవం. పాపాల విషయమై దుఃఖంగలవారై దేవుని క్షమాపణ కొరకు భారం కలిగిన వ్యక్తుల హృదయాల్లో నిజమైన కృపాకార్యం జరిగిందని ఆశించవచ్చు. పశ్చాత్తాపం గురించి చెప్పని సాక్ష్యాలు తీవ్రంగా అనుమానించదగినవి. కొన్నిసార్లు పేరుపొందిన కొంతమంది తారల యొక్క సాక్ష్యాలు విన్నప్పుడు అవి లోతులేనివిగాను, హాస్యాస్పదంగాను ఉంటాయి. వారు మారుమనస్సును నొప్పిలేని అనుభవంగా మారుస్తున్నారు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన కృపాగురుతని మరచిపోయారు. వారి సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, వారు కష్టాలలో ఉన్నప్పుడు, “యేసయ్యా! మమ్మల్ని ఆదుకోవయ్యా” అని అనగానే వెంటనే వారి జీవితాలు మారిపోయాయని చెబుతారు. కొన్నిసార్లు ఆయన వారితో ఈ స్టేజి మీద కూడా ఉన్నాడని చెబుతారు. యేసును పొందుకోవడం ద్వారా మీ జీవితాల్లో జయశీలులుగా ఏలా మారవచ్చో చెబుతారు. అయితే వారి జీవితాలు మాత్రం మార్పులేనివిగాను, లోకానుసారంగాను ఉంటాయి.

ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తిని తన పాపం నుంచి రక్షించే రక్షకుడుగా ఉన్నాడు. తర్వాతనే ఆ వ్యక్తికి ఏదైనా కాగలడు. ఒక వ్యక్తి కేవలం ఒక్క క్షణంలోనే క్రీస్తును స్వీకరించగలడు అనే ఆలోచన బైబిల్ లోని మారుమనస్సుకు సంబంధం లేనిదిగాను, వాస్తవం కానిదిగాను ఉంది. అనేక మంది ఈ విషయాన్ని నమ్మడం చాలా విచారకరం!

ఒక వ్యక్తి నిజమైన పాపపు ఒప్పుకోలు కలిగి విచారంతో దేవునియెదుట సాష్టాంగపడి, మనఃపూర్వకంగా క్షమాపణను, నూతన జీవాన్ని పొందుకోవడం చూడగలం. ఇటువంటి అనుభవం కొన్ని క్రైస్తవ జీవిత చరిత్రల్లో లేక ఉజ్జీవ చరిత్రల్లో మనం చదివినట్టుగా ఆయా వ్యక్తుల జీవితాల్లో కలిగినంత సిగ్గు, అవమానం, ఆత్మ సంబంధమైన దుఃఖం కనిపించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో ఎంతో కొంత విచారం, దేవుని ఎదుట విరిగి,నలిగిన మనస్సు కలిగియుండడం మనం చూడగలం. క్షమాపణ కొరకు కలువరి సిలువలో బలైన క్రీస్తును మాత్రమే విశ్వసించే విరిగి నలిగిన హృదయాన్ని వారు ఖచ్చితంగా కలిగియుంటారు.

మారుమనస్సు అంటే మనస్సును మార్చుకోవడం. అంటే పాపం నుండి వైదొలగి దేవుని వైపుకి తిరగడం. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి - పాపంయెడల మన వైఖరి, ప్రభువు పట్ల మన వైఖరి. పాపపు ఒప్పుకోలు బలంగా పనిచేసినప్పుడు, మనం మన పాపం విషయమై కేవలం సిగ్గుపొందడం మాత్రమే కాకుండా, పాపం కొరకైన ఆసక్తిని కూడా కోల్పోతాం. పాపాన్ని వదిలిపెట్టి ప్రత్యేకమైనవారంగా ఉండడానికి ఇష్టపడతాం. ఇదేకాక, ప్రభువు యెడల మన మనస్సును మార్చుకుని, ఆయననే రక్షకుడిగా వెదకుతూ, మన జీవితాలకు ఆయనను పరిపూర్ణ అధిపతిగా ఎంచి ఆయనకు మనల్ని అప్పగించుకుంటాం.

నేటి దినాల్లో వాక్యానుసారమైన క్రైస్తవులం అని చెప్పుకునే అనేకమంది ప్రజలు వాక్యానుసారమైన మారుమనస్సు గురించిన స్పష్టమైన బోధను బలహీనమైందిగా చేస్తున్నారు. ఇంతకుముందు జీవించిన పాపసంబంధమైన లోకజీవితంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోనవసరం లేదనే భావనను కల్పిస్తారు. యేసుక్రీస్తును గురించి కేవలం ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం మారటమే మారుమనస్సు అని వారు భావిస్తున్నారు. రక్షణ విషయంలో క్రీస్తు యొక్క అధికారానికి లోబడాల్సిన అవసరం లేదని చెబుతూ, సత్యమైన బోధకు మరింత నష్టం చేకూరుస్తున్నారు. మరొక మాటలో చెప్పాలంటే మారుమనస్సును అర్థం లేనిదానిగా మారుస్తున్నారు. అలాంటి వారు లోకానుసారమైన పద్ధతులు, అభిరుచులను వదిలి పెట్టకుండా ఉంటారనటంలో ఆశ్చర్యం లేదు. కాని క్రొత్త నిబంధన ప్రకారం ఇది నిజమైన మారుమనస్సు కాదు.

మనం మారుమనస్సు విషయమంతటినీ ఈ క్రింది విధంగా సంగ్రహపరచగలం. అవమానం లేకపోతే మారుమనస్సు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం కలువరి బలియాగం మీద ఆధారపడకుండా, పాత జీవితంతో తెగతెంపులు చేసుకోకుండా ఉంటే మారుమనస్సు అనేది ఆ వ్యక్తి జీవితంలో జరగలేదు. లోకం నుండి వేరుపడకపోతే, క్రీస్తు అధికారానికి లోబడకపోతే మారుమనస్సు లేదు. మనం సమాధానం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మారుమనస్సును వెదికేవారు పరిశుద్ధుడైన దేవునియెదుట తమ పాపం విషయమై లోతుగా సిగ్గుపొందినవారై, దౌర్భాగ్యులమని ఎప్పుడైనా అనుకున్నారా? వారు నిజంగా పశ్చాత్తాపపడి, వారి నిరీక్షణను కేవలం రక్షకుడైన యేసుప్రభువు చేసిన ప్రాయశ్చిత్త మరణం మీదనే కేంద్రీకరించారా? ఆయనను ప్రభువుగా, రక్షకుడిగా ఎంచి తమ్మును తాము పరిపూర్ణంగా ఆయనకు మాత్రమే అప్పగించుకున్నారా? ప్రభువుని సంతోషపరచడానికి శ్రద్ధ వహిస్తున్నారా? అనేటటువంటి ప్రశ్నల కోసం సమాధానం వెదకాలి.

మారుమనస్సు పొందిన వ్యక్తుల్లో ఖచ్చితంగా పైన పేర్కోబడ్డ ఋజువుల కోసం వెదకాలి. ఆ వ్యక్తులు తమ్మును తాము తగ్గించుకుని ,లోకంతో సంబంధం తెంచుకుని, ప్రభువుతో బంధం పెంచుకుని జీవించడం మనం చూడగలం. నిజంగా మారుమనస్సు పొందిన వ్యక్తుల్లో ఈ లక్షణాలు కనబడకుండా ఉండవు.

పైన తెలియచేయబడ్డ సంగతులన్నీ వారి జీవితాల్లో జరిగినప్పటికీ, కొన్నిసార్లు నిశ్చయత లేని కొంతమంది సహెూదరులను మనం ఎదుర్కొంటాము. వారు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు. అటువంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో గొప్ప మార్పు జరిగిందని వారికి తెలియచేయడం మన విధిగా ఉంది. వారు మారుమనస్సు అనే లోయను దాటి ఉన్నారని, దేవుని రాజ్యం అనే ప్రభువు యొక్క పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారని వారికి తెలియచేయాలి.

2.లేఖనాలను (బైబిల్) అర్థం చేసుకోవడం
కృప యొక్క రెండవ గుర్తుగా అపోస్తలుల కార్యాలు 2:4లో మనం చూస్తాం. “వారు అపోస్తలుల బోధయందు యెడతెగక యుండిరి". ప్రాచీన గ్రీకు భాషలో రాయబడింది‌ ఏంటంటే, వారు అపోస్తలుల బోధలో బలంగా అతుకబడ్డవారై (అంటుకట్టబడ్డవారై) కొనసాగారు. వారు ఈ బోధను సహించి దానిలో నిలకడగా ఉన్నారు. ఎప్పుడైనా ఒకరి మనస్సు దేవుని వాక్యాన్ని గ్రహించి, దేవుణ్ణి ప్రేమించేట్టుగా తెరువబడి, అతని హృదయంలో దేవుని వాక్యపు అధికారం స్థాపించబడినట్టైతే అది కృప యొక్క నిశ్చయమైన గుర్తు. నిజంగా మారుమనస్సు పొందిన ఒక వ్యక్తి దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి వాక్యంలో స్థిరుడై, దానిలో అంటుకట్టబడి వాక్యానికి విధేయుడై జీవిస్తాడు.

ఎందుకంటే 1 కొరింథీ 2:14 ప్రకారం ఇది మారుమనస్సుకు చెందిన నిశ్చయమైన గుర్తు. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా యున్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు". అవిశ్వాసులు బైబిల్ ను గూఢమైందిగానూ, అర్థం చేసుకోవడానికి కష్టతరమైందిగానూ భావిస్తారు. ఎప్పుడైతే వారు నిజంగా మారుమనస్సు పొందుతారో వారు బైబిల్ లోని వాక్యాలను సులభంగా అర్థం చేసుకుంటూ వారి హృదయాలు వాక్యం చేత పురికొల్పబడతాయి.

పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆవిధంగా లేఖనాలను గ్రహించేలా చేస్తాడు. క్రొత్తగా మార్పు చెందినవారు యెహెజ్కేలు, ప్రకటన గ్రంథం వంటి కష్టతరమైన పుస్తకాలను వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే వారు ఒకప్పుడు వాక్యానికి గ్రుడ్డివారుగా ఉన్నారు. ఇప్పుడు మారుమనస్సు ద్వారా వాక్యాన్ని చూడగలుగుతున్నారు. ఒకప్పుడు నిర్జీవంగా అనిపించే బైబిల్ లోని వాక్యాలు, ఇప్పుడు జీవం కలిగినవాటిగా కనిపిస్తాయి. వారు విశ్వాసులుగా తమ్మును తాము ప్రకటించుకున్నప్పటికీ వాక్య ధ్యానంలో ఆసక్తి లేనివారిగా ఉంటే వారిని మారుమనస్సు లేనివారుగా గుర్తించవచ్చు. ఇప్పుడు బైబిల్ చదవడం మీకు ఎంత ప్రాముఖ్యమైందిగా ఉందని క్రొత్తగా మారుమనస్సు పొందినవారిని మనం అడగాలి.

అది వారిని అకస్మాత్తుగా కదిలించిందో లేదో మనం తెలుసుకోవాలి. వాక్యం చేత వారి జీవితం పట్టబడిందా లేదా తెలుసుకోవాలి. నిజంగా మార్పు చెందినవారు బైబిలు ఏమి చెబుతుందో అదే చేయాలనుకుంటారు. వారు లెక్కలేనితనంతో బైబిల్ విషయాలపై వాదనలు చేయరు కానీ లేఖనాల చేత సవాలు చేయబడి నడిపించబడతారు. (ఈ విషయం 5వ గుర్తులో వివరించబడింది).

క్రొత్తగా మారుమనస్సు పొంది వాక్యం కొరకు ఆసక్తి కలిగినవారిలో నిలకడ అనే లక్షణం కోసం వెదకడం చాలా ప్రాముఖ్యం. గమనించండి! కొంతమంది కొన్ని వారాల పాటు సంఘంలో కనిపించకుండా పోయి, అకస్మాత్తుగా వచ్చి సంఘ సహవాసానికి (చర్చికి) ఎప్పుడు దూరంగా ఉండలేదన్నట్టుగా ఉంటారు. ఒక లైట్ స్విచ్ లా వారి ఆత్మీయ భావాలను ఆన్, ఆఫ్ చేస్తారు. వారు లోతుగా దేవుని వాక్యం చేత ప్రభావితం చేయబడినట్టు యథార్థమైన నమ్మకంతో నింపబడినట్టు కనబడతారు కానీ, దురదృష్టవశాత్తు వారు ఎంత త్వరగా సంఘంలో చేర్చబడతారో అంతే త్వరగా వెళ్ళిపోతారు. అయితే నిజమైన మార్పు కలిగిన వ్యక్తిలో నిలకడ అనేది శ్రేష్టమైన గుర్తు.

3.కుటుంబ బంధం
"వారు సహవాసమునందు ఎడతెగక ఉండిరి” అనేది అపోస్తలుల కార్యాలు 2:42లో మూడవ కృపా గుర్తుగా చూస్తున్నాం. ఇక్కడ సహవాసం అనే పదం కనిపిస్తుంది. పెంతెకోస్తు దినాన క్రీస్తునందు విశ్వసించినవారు వెంటనే దేవుని ప్రజలతో సహవాసమందు అంటుకట్టబడ్డారు. క్రైస్తవులతో ఉండాలని ఈ వింతైన, లోతైన కోరిక, రక్త సంబంధానికి మించిన బంధుత్వం నిజమైన మారుమనస్సుకు ఒక నిశ్చయమైన గుర్తుగా ఉంది. మనం 1 యోహాను 3:14లో నేర్చుకున్నట్టు - 'మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరిగియున్నాము'. మనకు బాగా తెలిసిన రూతు మాటల్ని చూస్తే (రూతు 1:16) "నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నువ్వు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించెదను, నీజనమే నా జనము నీ దేవుడే నా దేవుడు”.

ఎవరైనా ప్రార్థన కూడిక అనంతరం విశ్వాసులతో మాట్లాడాలని లేక సహవాసం కొరకైన ఆసక్తి ఉన్నవారుగా ఉన్నట్టైతే ఇది ఒక నిజమైన కృపాగుర్తుగా ఉంది. ఒక వ్యక్తి ఆత్మీయ సహవాసం కొరకు లోతైన ఆసక్తిని కనపరచినట్టైతే ఆ వ్యక్తిని తన స్వంత ఆత్మీయ కుటుంబంలోకి (సహవాసం) ప్రభువే నడిపించాడని తెలియచేస్తుంది. పరలోక రాజకుటుంబపు రక్తం నిజంగా మార్పు చెందినవారి నరనరాల్లో ప్రవహిస్తుంది. ఎందుకంటే వారు దేవుని గృహసభ్యులుగా, పరిశుద్ధులతో సహపౌరులుగా చేయబడ్డారు కాబట్టి. ఏదేమైనా మార్పుచెందానని ఊహించుకునే వ్యక్తి ఇంకా లోకంతో స్నేహానికే ప్రాధాన్యత ఇస్తే ఇది ఒక చెడ్డ గుర్తుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసులతో సహవాసంలో ఉండడో, ఆ వ్యక్తికి దేవుని సంగతుల పట్ల ఆసక్తి ఉండదు. అంటే ఆ వ్యక్తిలో నిజమైన మారుమనస్సు జరగకపోవచ్చు.

ఒక విశ్వాసి మరొక విశ్వాసిని అర్థం చేసుకునే ఆత్మీయబంధం ప్రతి నిజ క్రైస్తవుడికి మారుమనస్సు పొందినప్పుడే కలుగుతుంది. ఏ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని మనం పరిశీలిస్తున్నామో ఆ వ్యక్తి విశ్వాసులతో సహవాసంలో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నాడో లేదో గమనించాలి. నిజంగా మార్పు పొందినవారికి, వారి లోకానుసారమైన స్నేహితులకు మధ్య దూరం పెరుగుతున్నట్టుగా భావిస్తారు. నూతనంగా మార్పు చెందినవారికి ఇది బాధాకరమైన విషయమైనప్పటికీ, వారి హృదయంలో దేవుని కృప ఉంటే తమ లోక స్నేహితులతో ఎడబాటును తప్పించుకోలేరు. నిజమైన మార్పు పొందిన వ్యక్తి ప్రత్యేకమైన వాడిగా ఉంటూ బైబిలు సిద్ధాంతాలకు, పద్ధతులకు కట్టబడి ఉంటాడు. మారుమనస్సు వల్ల లోతుగా ప్రభావితం చేయబడి తనకున్న లోకానుసారమైన పాత సంబంధాలన్నీ తెగతెంపులు చేసుకుంటాడు. అయితే వారి పాత స్నేహితులంతా రక్షించబడాలనే భారం మాత్రం అతనిలో ఉంటుంది. ఈ వాస్తవం హృదయంలో ఆత్మకార్యం జరిగిందనడానికి నిదర్శనం.

ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యవ్వనస్తులు ఒకరి యెడల ఒకరు ఒక సహజమైన ఆసక్తిని కలిగి‌ ఉంటారు. నిజంగా మార్పు చెందినవారు యవ్వనస్తుల సహవాసాలకు (యూత్ మీటింగ్స్) బాగా స్పందిస్తారు. ఎప్పుడైతే యవ్వనస్తులు కొంతమంది చేస్తున్నట్టుగా బుద్ధిహీనమైన, ఆత్మ సంబంధం కానీ వినోద కాలక్షేప కార్యక్రమాలకి ఆకర్షితులౌతారో వారిని మార్పు చెందనివారిగా గుర్తించవచ్చు. మార్పుచెందనివారు ఇటువంటి గుంపులకు ఆకర్షితులౌతారు. మారుమనస్సు లేని యవ్వనస్తులు ఆత్మీయ సందేశాలకు కేవలం ఆకర్షితులైనట్టు కనిపిస్తారు కానీ వారికి వారి లోకస్నేహితుల స్నేహమే ప్రాముఖ్యం. అయితే నిజంగా మార్పు చెందినవారు ఆత్మీయంగా ఎదిగిన యవ్వనస్తులతో సహవాసాన్ని కలిగి ఉండటంతో పాటు, వయస్సులో పెద్దలైన విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉంటారు.

4. ప్రార్థనను కనుగొనడం
అపోస్తలుల కార్యాల్లోని వాక్యభాగంలో పేర్కోబడిన కృపకు చెందిన మరొక స్పష్టమైన గుర్తు ఏమిటంటే ప్రార్థనలో కొనసాగడం. యూదా మతంలో నుండి క్రొత్తగా ప్రభువును నమ్ముకున్నవారికి నిజమైన వ్యక్తిగత ప్రార్థన, ఆత్మ వివేకం కలిగి దేవుణ్ణి నేరుగా సమీపించడమంటే ఏంటో వారికి తెలియదు. వారికి బదులుగా సమాజ మందిరంలోని యాజకులు వారి కోసం ప్రార్థించేవారు. వారి దృష్టిలో వ్యక్తిగత ప్రార్థన అంటే వ్యర్థమైన మాటలను జపం లాగ వర్ణించడమే.

అయితే వారు నిజంగా మార్పు చెందిన తర్వాత సంఘంలో జరిగే ప్రార్థనలకు రాకుండా ఉండలేరు. ఇప్పుడు ప్రార్థన శక్తివంతమైందిగానూ, దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగానూ, అత్యాసక్తి గలదిగానూ వారు కనుగొంటారు. వారు దేవుని స్వంత పిల్లలై ఉన్నారని గ్రహించి, వారి గొప్ప ప్రధానయాజకుడు పరలోకంలో వారి ప్రతి మొరనూ వింటున్నాడని ఎరిగారు. వారు ప్రార్థించగా ఖచ్చితమైన సమాధానాలు పొందుకుని, వారి హృదయాలు సంతృప్తిపరచబడుతున్నాయి.

ప్రార్థనను కనుగొనడం ఒక అద్భుతమైన కృపాగుర్తుగా ఉంది. ఒక దేవుని బిడ్డగా బలమైన కోరికతో ఆయన సన్నిధిలోకి ప్రవేశించడమనేది ఆత్మకార్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. మీరు కుమారులైయున్నందున - “నాయనా తండ్రీ, అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను” (గలతీ 4:6).

ఈ వ్యక్తిగత ప్రార్థన అనుభవం గురించి ఏమీ చెప్పలేని వారిని మార్పు చెందనివారుగా గుర్తించి వారిని జాగ్రత్తగా గమనించాలి. దేవునితో వ్యకిగత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా అని మనం ప్రజల్ని అడగాలి. వారి ప్రార్థనలకు ప్రభువు ఎలా సమాధానమిస్తున్నాడో వారి స్వంత అనుభవాల్లో నుండి వినడానికి మనం ఎదురు చూడాలి. ఏ రకమైన సంగతుల గురించి వారు ప్రార్థిస్తారో, వాటిని మనం తెలుసుకోవాలి. మారుమనస్సు లేని ప్రజల వలే కేవలం స్వార్థంతో నిండిన లోతులేని మొరను విడిచిపెట్టి పాపం మీద జయం కొరకు, దీవెనకరమైన సాక్ష్యం కొరకు ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థించడం వారు నేర్చుకున్నారో లేదో చూడాలి.

నిజంగా మార్పు చెందినవారు ఆత్మ సంబంధమైన ప్రార్థనలను గురించిన గ్రహింపు కలిగి ఉంటారు. వారి కంటే కూడా రక్షించబడని వారి బంధువులు, స్నేహితుల కొరకు ఎక్కువ శ్రద్ధ గలవారై వారి నిమిత్తం ప్రార్థనలలో ప్రభువును వేడుకోవడం మనం చూడగలం. ప్రజలు మార్పు చెందామని బహిరంగంగా ఒప్పుకుంటూ వారి జీవితాల్లో కలిగే ప్రతి శోధనకు దిగులు, ఆందోళన గలవారైతే ఈ అమూల్యమైన, ఖచ్చితమైన కృపాగుర్తును వారు ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకోలేదని గుర్తించగలం. యథార్థంగా మార్పు చెందిన వారు కాలం గడుస్తున్న కొలదీ ప్రార్థనను కొనసాగించడంలో ఆసక్తి కోల్పోయేవారుగా ఉండవచ్చు. కానీ ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండడమనేది క్రైస్తవ జీవిత ప్రారంభ దశలో చాలా ప్రాముఖ్యత కలిగిన కృపాగుర్తుగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాంలో చూడగలం. నిజంగా మార్పు చెందినవారు వారికి సమస్యలు వచ్చిన వెంటనే ప్రార్థనలో ప్రభువు చెంతకు తీసుకువెళ్తారు, ఎప్పుడైతే వారు ఈ పని చేస్తారో, వారు నిజంగా ఆయనను కనుగొన్నారని మనం ఎరుగుతాం.

5.నూతన హృదయం
అపోస్తులుల కార్యాలు 24:6-47లో మరొక ముఖ్యమైన కృపకు చెందిన గుర్తు వర్ణించబడింది. పెంతెకోస్తు దినాన మార్పు చెందినవారు యథార్థమైన హృదయం, ఏక మనస్సును కలిగి ఉన్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే రక్షించబడ్డవారి అంతరంగ తలంపుల్లో గొప్ప మార్పు సంభవించి, దేవుని కార్యాల పట్ల గొప్ప ఆసక్తి కలిగి, ఆయన రాజ్యం కొరకు అంకితమైనవారుగా ఉంటూ పవిత్ర ఉద్దేశం కలిగి ఉంటారు. నిజంగా రక్షించబడ్డవారు దేవునికి ఇష్టులుగా ఉండేట్టు వారి జీవిత విధానాలను మార్చుకోవడానికి సంసిద్ధులుగా ఉంటారు. అంతే గానీ, ఒక ప్రక్క దైవాశీర్వాదాలు కోరుకుంటూ, మరో ప్రక్క పేరు ప్రఖ్యాతలు, సిరిసంపదలు, సుఖభోగాలు కోరుకోరు.

పౌలు చెప్పినట్టుగా “ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో సమస్తము క్రొత్త వాయెను”(2వ కొరింథీ 5:17). యెహెజ్కేలు 11:9 లో రాయబడినట్టుగా “నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి, వారికి మాంసపు గుండెను ఇచ్చెదను”అనే వాగ్దానం నిజమైన మారుమనస్సు పొందినవారిలో చూడగలం. మారుమనస్సు పొందినవారిలో హృదయ కాఠిన్యం తొలగించబడి, ప్రభువుతో వారికున్న సంబంధం విషయమై అత్యాసక్తిగలవారై ఆత్మీయ సంగతుల కొరకు పురికొల్పబడతారు. వారు బాధ్యతాయుతమైన హృదయం గలవారై క్రైస్తవ విధులను గైకొంటూ సున్నితమైన మనస్సాక్షి కలిగి దేవుని చిత్తానికి లోబడతారు. వారు క్రొత్త ప్రవర్తన గలవారై ఆత్మీయ ఉద్దేశాలు, అభిరుచులతో నింపబడతారు. లోకం, దాని యొక్క పాప భోగాలను అసహ్యించుకుని, ఇప్పుడు వారు శ్రేష్టమైన దేవుని సంగతులయందు ఆసక్తి కలిగియుంటారు. ప్రభువు “నీ ధనమెక్కడ ఉండునో, నీ హృదయము అక్కడ ఉండును” (లూకా 12:34) అని పలికాడు.

క్రొత్తగా మారుమనస్సు పొందినవాని ఆత్మీయ స్థితిని పరీక్షించడంలో మనం వెదకాల్సిన గుర్తులు ఏంటంటే అతని బాహ్య, అంతరంగిక పరివర్తలో కలిగిన మార్పు, నూతనంగా మార్పునొందినవాడు నేర్చుకోవడానికి ఆసక్తిగలవాడుగా, మలచబడడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు. గతంలో పొగరబోతుగా, అహంకారిగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ఆత్మీయ జీవితంలో తగ్గింపు కలిగి ఇతరుల నుండి సలహాను, నడిపింపును కోరుకుంటాడు. ఈ విధమైన మార్పును మనం ప్రజలలో చూసినప్పుడు ఆశ్చర్యపడక తప్పదు. వారి హృదయాలు సంపూర్తిగా మార్చబడి వారు ఆత్మీయంగా సరైనవాటినే చేస్తారు. కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా కఠిన హృదయం కలిగినవారుగా బయటకు కనిపించినప్పటికీ, నిజానికి మాత్రం దేవునికి పూర్తిగా లోబడతారు. ఒకప్పుడు అందరికీ దూరంగా అహంకారంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా దీనుడై, నేర్చుకునేవాడై ఉండడం శక్తివంతమైన కృపాగుర్తుగా ఉంది. ఇది నిజమైన మారుమనస్సు. ఈ రోజుల్లో ఒక ప్రక్క రక్షించబడ్డామని చెప్పుకుంటూ మరో ప్రక్క లోక ఆస్తిపాస్తులకు, లోకాచారాలకు, ఫ్యాషన్లకు, లోకానుసారమైన సినీ సంగీతానికి లేక రాక్ మ్యూజిక్ కు బానిసలుగా ఉంటున్నారు. అటువంటి వారిని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినా ఏ మాత్రం చలించనివారుగా ఉన్నట్టైతే వారు నిజంగా నూతన హృదయం పొందుకున్నారో లేదో అని అనుమానించక తప్పదు.

నూతన హృదయం పొందుకున్న వారిలో ప్రభువు ఎడల గొప్ప భక్తి, గౌరవం, ప్రేమ కలిగి ఉండడం చూడగలం. అపొస్తలుల కార్యాలు 2:43)లో 'అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను”అనే వాక్యాన్ని ఇక్కడ చూడగలం. ఇలాంటి భయం ప్రభువు యెడల ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. నూతన హృదయం దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత, దేవుని సన్నిధిని ఎరిగినదై దేవునికి లోబడడానికి సంసిద్ధమై ఉంటుంది. ఎంత మాత్రం దేవుని యెడల భయభక్తులు లేనివారు ఎప్పుడూ నూతన హృదయం పొందుకోలేరు. క్రీస్తు రాయబారుల వలె కాక క్రమం, భక్తిలేని సినిమా తారలవలె వ్యవహరిస్తూ వారు బహుశా నూతన హృదయాన్ని పొందనివారుగా ఉన్నారు. కొన్నిసార్లు కాలం గతిస్తుండగా విశ్వాసులు వారి మొదటి ప్రేమను కోల్పోయి, అవిధేయత, అనాసక్తి వంటివి వారి జీవితాల్లో చోటుచేసుకోగలవు. ఇది ఆత్మను ఆర్పే అవిధేయత. కాని మారుమనస్సు పొందిన ఆరంభదినాల్లో గొప్ప ఆసక్తిని, విధేయతను కలిగిన హృదయాన్ని చూడగలం. దీనిని ప్రధానమైన కృపాగుర్తుగా మనం గుర్తించాలి.

6.ఆరంభ నిశ్చయత
క్రైస్తవ జీవిత ఆరంభ అనుభవంలో నిశ్చయతను కలిగున్నట్టుగా (అపోస్తలుల కార్యాలు 2:41-47)లో చూస్తున్నాం. వారి ఆనందం (46వ వచనం) దేవుని పట్ల వారికున్న ప్రేమను, అంకిత భావాన్ని సూచిస్తుంది. నిజంగా మార్పు చెందినవారు సందేహాలు రేకెత్తించే సాతాను దాడుల వల్ల తమ నిశ్చయత బలహీనపడినప్పటికీ, తాము క్రీస్తుకు చెందినవారమని‌ గ్రహించి నిశ్చయత యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు.

మారుమనస్సు పొందిన సమయంలో విశ్వాసులందరూ నిశ్చయత అనే ముద్రను పొందారని బైబిల్ చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది. “మీరును సత్య వాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి” (ఎఫేసీ 1:13). ఇదే నిశ్చయత ఆశీర్వాదం. ఇదే విషయం (2 కొరింథీ 1:22) లో కూడా పేర్కోబడింది.

క్రీస్తులో నూతనంగా జన్మించిన శిశువుల నుండి గొప్ప నిశ్చయతను, పరిపూర్ణ నమ్మికను ఆశించే హక్కు మనకు లేదు కానీ వారి జీవితంలో ఆత్మ వేసిన ముద్రను మనం చూడవచ్చు. ఇది సత్యానికి సాక్ష్యమిచ్చే ముద్ర. ఎలాగంటే ఈ ముద్ర కరిగిన మైనంలో వేసిన ముద్ర వంటిది. ఇది ప్రాచీన కాలంలో జమీందారులు వారి దస్తావేజులను, ఉత్తరాలను నిజమైనవని రూఢిపరచడానికి వేసే ముద్రలాంటిది. ఇది విశ్వాసి మీద వేసే దేవుని యాజమాన్యపు ముద్ర. మార్పు చెందిన ప్రతి వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఒక బలమైన ముద్ర వేస్తాడు.

నిజమైన మార్పు పొందినవారు తాము ఇదివరకు తెలుసుకున్న అనుభూతుల కంటే పూర్తిగా భిన్నమైన అనుభూతులను పొందుకుంటారు. లోకం ఇవ్వలేని శాంతిని వారు అనుభవిస్తారు. ఇందులో క్షమాపణ పొందుకోవడమనేది ఒక భాగంగా ఉంది. బైబిల్ చెప్పేదేమిటంటే ముద్ర అనేది ఒక వాగ్దానం, క్రైస్తవుల యొక్క భవిష్యత్ స్వాస్థ్యం. దీని నుండి మనం ఏమి అర్థం చేసుకోగలమంటే నిజమైన మార్పును పొందినవారు పరలోక వారసులుగా ఉండే అద్భుతమైన అనుభూతిని కూడా ముందుగానే పొందుకుంటారు.

దేవుడు తన ముద్రను మారినవారిపై ముద్రించడం వల్ల వారిలో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైనది సంభవించిందని వారు ఎరుగుతారు. తమ కోరికలు మారటం, పాపం పట్ల ద్వేషం కలగటం, వారిని అదుపు చేసే పాపాలపై నూతన శక్తిని పొందుకోవటం వారు అనుభవిస్తారు. మారిన వారి హృదయాల్లో ఆత్మ ముద్ర ఉన్నందువల్ల వారి ప్రవర్తనలో మార్పు వారికి తెలియడం మాత్రమే కాకుండా చూసేవారికి కూడా కనిపిస్తుంది. ఎవరైతే వారి రక్షణ పట్ల అనుమానం కలిగున్నారో, వారికి ఈ విషయాలను తెలియచెయ్యడం ద్వారా వారు ఎన్నో మేలులు పొందుకుంటారు. నిశ్చయత కొరవడిన ఒక వ్యక్తిని ఈవిధంగా ప్రశ్నించవచ్చు. నువ్వు మార్పు చెందావనడానికి ఏదైనా నిశ్చయత కలిగున్నావా? ఏదో సమయంలో నువ్వు క్షమించబడి, నువ్వు ఒక నూతన వ్యక్తివి అనే భావన నీకు ఉందా? ఔను, నేను మొదట పశ్చాత్తాపపడి ప్రభువునందు విశ్వాసముంచినప్పుడు, నేను దృఢపరచబడ్డానని చెప్పడం సరైన సమాధానమై ఉంది.

ప్రజలు నిశ్చయత కొరకు వెదకుతున్నప్పుడు మనం గొప్ప శ్రద్ధ తీసుకోవలసి ఉంది. ఎందుకంటే నిజంగా మారుమనస్సు పొందిన చాలామంది బలమైన నిశ్చయత అనుభవం లేని వారైయున్నారు. వెస్ట్ మినిస్టర్ సిద్ధాంతాల పట్టిక చెబుతున్నట్టుగా నిశ్చయత అనేది వెంటనే విశ్వాసం వల్ల కలిగేది కాదుగానీ, ఒక విశ్వాసి నిశ్చయతను పొందుకోవడానికి ముందు చాలా కాలం నిశ్చయత కొరకు వేచి ఉండి అనేక కష్టాలను ఎదుర్కొన్న తర్వాత దాన్ని పొందుకుంటాడు. కాపరులు కలత చెందిన విశ్వాసులకు సలహా ఇచ్చేముందు తమ ఆత్మలకు దేవుడు ఇది వరకూ ఏంచేసాడో బాగా ఎరిగి ఉండాలి. ఎవరైతే వారి ఆత్మీయ జీవితం పట్ల సందేహాలు కలిగి, నిరాశతో జీవిస్తారో వారికి ఈ కృపాగుర్తుల గురించి చెప్పడం ద్వారా వారు ఆదరణను, నిశ్చయతను పొందుకుంటారు.

7. సాతాను యొక్క దాడులు
అపోస్తులుల కార్యాలు 2వ అధ్యాయంలో దీని గురించి రాయనప్పటికీ క్రొత్తగా మారుమనస్సు పొందినవారికి సాతాను యొక్క ఎదురుదాడులు కూడా ఒక ప్రాముఖ్యమైన రక్షణగుర్తుగా ఉంది. ప్రతివాది ఎల్లప్పుడూ అగ్ని బాణాలు వదులుతుంటాడు. నిజంగా మార్పు చెందిన వ్యక్తి మనస్సులో సందేహాలు, భయాలు కలుగుతాయి. తమ ఆత్మీయ అభివృద్ధి, సువార్త సత్యాల గురించి సందేహాలతో కొట్టబడినప్పుడు వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కృపతో కార్యం జరిగిస్తున్నాడు అనేది ఒక తిరుగులేని సత్యం. రక్షించబడనివాడు ఇంకా ఆత్మీయ దాస్యంలోనే ఉంటూ సాతాను కలగజేసే సందేహాలకు, భయాలకు ఏ మాత్రం కలత చెందనివాడుగా ఉంటాడు. (లూకా 11:21)లో ప్రభువైన యేసు ఈ సంగతి బోధించాడు “బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును". సాతానుడు ఆయుధాలు గల బలమైన యోధుడు. వాడు దౌర్జన్యం చేత అధికారం సంపాదించిన కౄరుడుగా కనిపించినా తన బానిసలను ఎంత మాత్రం బాధించక, గాయపరచని వాడై ఉన్నాడు. ఎందుకంటే వారంతా అతని కోటలోనే ఉన్న బంధీలు.

అయితే నిజంగా మారినవారు ఎంత మాత్రం కూడా సాతాను కోటలో బంధీలుగా ఉండరు. వారు దాస్యత్వం నుండి విమోచించబడ్డవారు కాబట్టి వారికి ఇక గొప్ప యుద్ధం ఆరంభమౌతుంది. వారిప్పుడు ప్రధానులతో పోరాడుతున్నారు (ఎఫెసీ 6:12). కాబట్టి వారు మానసిక కలతతో బాధించబడటం, తాము ఎక్కువ ద్వేషించే సందేహాలు కలగటం, తరచుగా అనిశ్చయత అనుభూతి కలగటం, ఇవన్నీ కూడా ప్రభువు నిశ్చయంగా వారిని రక్షించాడు అనేందుకు రుజువుగా ఉంది.

క్రొత్తగా మార్పు చెందినవారిపై సాతాను తనదైన శైలిలో దాడిచేసి వారిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వారి పై దాడి చేయడానికి తనకొక కారణం ఉందని, తన ఉనికిని వారికి ఋజువు చేస్తాడు. మారుమనస్సు పొందనివారిపై సాతాను తీవ్రంగా దాడి చేయకపోవటం అనేది సంవత్సరాలుగా నామకార్ధ క్రైస్తవులుగా జీవించేవారిలో స్పష్టంగా చూడగలం. వారు మారుమనస్సు పొందని సంవత్సరాల్లో అరుదుగా యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యను, బైబిల్ సంఘటనలకు చెందిన చారిత్రాత్మకు వాస్తవికతను అనుమానిస్తారు. ఎప్పుడైతే క్రీస్తువైపుకు త్రిప్పబడతారో వారికి వెంటనే సందేహాలు కలగడం ఆరంభమౌతాయి. అప్పటిదాకా కనబడి, కనబడనట్టుండే సైతాను వారి పై తన దాడిని ముమ్మరం చేస్తాడు. క్రోధంతో, పగతో సాతాను విశ్వాసుల మనస్సులపై అగ్నిబాణాలు విసిరినప్పుడు ఆత్మీయతలో ఎదిగినవారు క్రొత్తగా మారుమనస్సు పొందిన వారికి చేయూతను అందించాలి. సాతాను వారి రక్షణ తీసివేయలేడు కానీ విశ్వాసంలో వారికున్న ఆనందాన్ని, సమాధానాన్ని తన శాయశక్తులా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు.

సాతాను ఆయా వ్యక్తులను బట్టి తన పన్నాగాలు మార్చుతాడు. ఒకసారి విశ్వాసికి తన విశ్వాసం మీద సందేహాలు కలిగిస్తాడు. ఇంకొకసారి మరొక వ్యక్తిపై ఈ విధంగా దాడి చేస్తాడు. 'ఔను, బైబిల్ సత్యమే, విశ్వాసం సత్యమే, రక్షణ కూడా సత్యమే; కానీ నువ్వు మాత్రం నిజంగా మార్పు చెందలేదు, నువ్వు భ్రమలో ఉన్నావు' అని వణికిస్తాడు. త్వరగానో, ఆలస్యంగానో విశ్వాసి పాపంలో పడిపోతాడు, ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని సాతాను, 'ఇలాగైతే నువ్వు ఎలా దేవుని బిడ్డగా ఉండగలవు?' అని విశ్వాసిపై నేరారోపణ చేస్తాడు.

తాము నిజంగా రక్షించబడ్డామా లేదా అనే కలవరం విశ్వాసులకు కలగడమే రక్షణకు ఒక ఋజువై ఉంది. వారు నిజమైన క్రైస్తవులైనట్టైతే తమ జీవితాల్లో తమ ఆత్మీయ స్థితి వారికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం. వారి ఆత్మీయ స్థితే వారికి బహువిలువైంది. వారి ఆత్మీయ జీవితంలో ఉన్న చింతే వారు దేవుని పిల్లలనడానికి ఋజువుగా ఉంది. మార్పుచెందని ప్రజలు వారి ఆత్మీయ జీవితాల గురించి విచారపడరు, కృంగిపోరు. ఈ లోకసంగతుల కొరకే వారు ఎక్కువగా విచారిస్తారు. వారి ఆత్మీయ స్థితిని బట్టి వారికున్న విచారాన్ని ప్యూరిటన్లు దేవుని రాజ్యంలో పొందుకునే సంపదతో పోల్చారు.

7 గుర్తుల యొక్క సారాంశం

1. విరిగినలిగిన హృదయంతో కృప, కనికరాల కొరకు దేవుని వైపు చూడడమే నిజమైన మారుమనస్సుకు గుర్తు.

2. దేవుని వాక్యం పట్ల నూతన గ్రహింపు కలిగి వాక్యం యొక్క అధికారానికి లోబడడం ఆరంభమౌతుంది.

3. మనం దేవునికి చెందినవారమనే భావన హృదయంలో బలంగా కలుగుతుంది. తద్వారా మనం మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నామని తెలుస్తుంది.

4. ప్రార్థించడానికి అద్భుతమైన నూతన సామర్థ్యం పొందుకోవడం చూడగలం. అందులో స్తుతి, ఆత్మీయ విన్నపాలు మిళితమై ఉంటాయి. ప్రార్థనలకు సమాధానం కలుగుతుంది.

5. నూతన హృదయంతో పాటు నూతన ఆనందం, నూతన ప్రవర్తన, క్రొత్త కోరికలు కలుగుతాయి. ఎందుకంటే విశ్వాసి లోకంనుండి వేరు చేయబడ్డవాడై దేవుని సంగతుల వైపు మళ్ళించబడతాడు. నూతన హృదయంతో ప్రభువును సంతోషపెట్టాలని, ఆయనకు విధేయత చూపాలనే ఆశ కలుగుతుంది. ఈ నూతన హృదయంలో పరిశుద్ధపరచబడడమనే ప్రక్రియ ఆరంభమౌతుంది.

6. దేవుని సమాధానం, నిశ్చయత అనేవి పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో ప్రవేశిస్తాయి.

7. ఇప్పుడు సాతాను యొక్క తీవ్రమైన దాడుల వల్ల క్రొత్త శోధనలు, సందేహాలు భయాలు కలుగుతాయి. ఇక ఆత్మీయ పోరాటం మొదలైంది.

మారుమనస్సుకు చెందిన ఈ సూచనలన్నీ ఒకేసారి కనిపిస్తాయా?
బైబిల్ లో ఉన్న మారుమనస్సుకు చెందిన అనేక ఉదాహరణల నుండి మనం గ్రహించేది ఏంటంటే, మారుమనస్సు అనేది మానవపరంగా చూస్తే కొన్నిసార్లు అకస్మాత్తుగా జరిగిన అనుభవం గాను, కొన్ని సార్లు దీర్ఘకాలంగా జరిగిన ప్రక్రియగా ఉంది. పాపి, పాపపు ఒప్పుకోలు క్రిందకు వచ్చినప్పుడు క్రమక్రమంగా గ్రహింపు కలుగుతుంది. తర్వాత పాపి దీన్ని గ్రహించి ప్రభువు పాదాల యెదుట తగ్గించుకుంటాడు. హృదయంలో ఉన్న వ్యతిరేకత అంతా అణిచివేయబడక ముందు ఒక వ్యక్తి హృదయంలో అనిశ్చితి, అయోమయం ఉండవచ్చు. ఒక పాపి మారుమనస్సు కొరకు ప్రార్థించినప్పుడు అది హృదయాలను పరిశోధించే దేవునికి వెంటనే సంతృప్తి కలిగించకపోవచ్చు . అయితే ఒక పాపి తాను తిరిగి జన్మించానని తెలుసుకోడానికి ముందు తరచుగా పాపపు ఒప్పుకోలు ప్రార్థనలో కొనసాగవలసి ఉంటుంది.

పరిశుద్ధాత్మ హృదయంలో పనిచెయ్యడం ఆరంభించినప్పుడు మారుమనస్సుకు చెందిన కొన్ని సంకేతాలు చూడవచ్చు. తన జీవితంలో చీకటి పూర్తిగా తొలగించబడి వెలుగుమయం చేయబడ్డప్పుడే, తన దోషానికి క్షమాపణ కలుగుతుంది. అప్పుడు తన జీవితంలో మారుమనస్సుకు చెందిన సంకేతాలన్నీ తేటగా ప్రకాశిస్తాయి.

మారుమనస్సుకు చెందిన గుర్తుల పట్ల కాపరులు అవగాహన కలిగియుండడం
ఒక పాపి రక్షణ పొందకుండానే, రక్షణ పొందాడని తప్పుడు నిశ్చయతను కలగజేసే ప్రమాదం నుండి కాపాడడానికి మారుమనస్సుకు చెందిన గుర్తుల పట్ల కాపరులకు అవగాహన ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే ఆధునిక కాలంలోని క్రైస్తవ సంఘాల్లో 'తీర్మానం తీసుకోవడం' అనేది గొప్ప లోపంగా ఉంది. సాధారణంగా సువార్త సభల్లో ప్రజలు వెనువెంటనే తీర్మానం చేయడానికి ప్రేరేపించబడతారు. లేకపోతే సువార్తను కేవలం పెదవులతో మాత్రమే అంగీకరించేటట్టు ప్రోత్సహించబడతారు. వారు సువార్తకు స్పందించినట్టైతే వారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా వెంటనే వారు రక్షించబడ్డారని ప్రసంగీకులు ప్రకటిస్తారు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడనే ఋజువు లేనప్పటికీ కాపరి ఆ వ్యక్తితో నీ ఆత్మ రక్షించబడిందన్న ధృఢమైన నిశ్చయత ఇస్తే ఏమి జరుగుతుందో ఊహించుకుందాం. అలాంటి వ్యక్తి నిజాయితీపరుడైనా, అతని మారుమనస్సు లోతు లేనిదైనందువల్ల నూతనజన్మ వల్ల ప్రభువు అందించే ఆత్మీయ దీవెనలు పొందలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో తన కార్యం జరిగిస్తున్నట్టైతే, ఆ వ్యక్తి తగిన కాలంలో పాపం గురించి లోతుగా దుఃఖించి, అర్థవంతంగా పశ్చాత్తాపపడేటట్టు ఆయన చేస్తాడు. ఆ వ్యక్తి ఇదివరకే రక్షించబడ్డానన్న తప్పుడు నిశ్చయత ఎవరైతే కలిగిస్తారో వారు ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.

కొంత కాలమైన తర్వాత రక్షణను వెదికే వ్యక్తి తన జీవితంలో ఏ మార్పు కలగలేదనే వాస్తవాన్ని తెలుసుకుంటాడు. ఇది మరొక సమస్యకు దారి తీస్తుంది. కాపరి ఆ వ్యక్తితో నువ్వు రక్షించబడ్డావని ధృఢంగా తెలియచేసి, నువ్వు రక్షించబడడానికి ఇక చేయవలసింది ఏమీ లేదని మూర్ఖంగా చెప్పవచ్చు. ఆ వ్యక్తి యొక్క అభిప్రాయంతో సంబంధం లేకుండా తాను మారుమనస్సు పొందాడని అతనికి చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, రక్షణను వెదకే ఈ వ్యక్తి ఎంతో గలిబిలి చెంది, తన కాపరి మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతాడు. అంత మాత్రమే కాకుండా , కొంత కాలమైన తరువాత సువార్త సందేశాన్ని కూడా నమ్మడం మానేస్తాడు.

ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని వాక్యంలో రక్షణ పొందుకోవడానికి కొన్ని అర్హతలు రాయబడ్డట్టుగా రక్షణ పొందుకోవడానికి వారు అర్హులో కాదో మనం చూడాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ప్రభువును వెదకినట్టైతే ఆయనను నువ్వు కనుగొంటావు. అయితే ఇక్కడ “ప్రభువును వెదకినట్టైతే ” అనే ప్రాముఖ్యమైన మాటలను గమనించాలి.

ఈ విషయంలో కాపరి ఒక వ్యక్తితో నీ పూర్ణ హృదయంతో పశ్చాత్తాపపడి, కేవలం క్రీస్తుకు మాత్రమే నిన్ను నువ్వు అప్పగించుకోమని బ్రతిమాలితే, అప్పుడు ఎలాంటి గందరగోళం తలెత్తకుండా అతడు రక్షించబడతాడు. కాపరి ఒక వ్యక్తితో నువ్వు ఖచ్చితంగా రక్షించబడ్డావని నొక్కి చెప్పకపోతే, అప్పుడు అతనికి రాబోయే రోజుల్లో సహాయం చేసే అవకాశాన్ని కలిగుంటాడు.

ఒక వ్యక్తి తాను ఇంకా రక్షించబడలేదని గుర్తించినట్టైతే, తాను ప్రభువును సమీపించే తీరును పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ పరిస్థితిలో ఆత్మీయ సహాయం కొరకు కాపరి యొద్దకు తిరిగి వస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి సమీపించడంలో తాను చేసే కొన్ని పొరపాట్లను గురించి తెలియచేయడానికి కాపరికి అవకాశం కలుగుతుంది. తాను రక్షణ పొందడానికి ఏమీ చేయలేడని, కలువరిలో మాత్రమే నమ్మకముంచాలని కాపరి ఆ వ్యక్తితో చెప్పవలసి ఉంది. తన స్వంత కోరికలు, స్వచిత్తానికి విడిచిపెట్టి ప్రభువు యొక్క అధికారానికి తన్ను తాను అప్పగించుకోవాలని కాపరి బోధించాలి. ఒక వేళ ఆ వ్యక్తి పాపపు అలవాట్లను దాచిపెట్టి, వాటి విషయమై పశ్చాత్తాపపడకుండానే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తానని ఆశిస్తే ఆ వ్యక్తితో కాపరి యథార్థమైన మారుమనస్సు పొందావో లేదో ప్రశ్నించుకోమని సవాలు విసరాలి.

జ్ఞానంగల కాపరి పాపి యొక్క పాపాల వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడు కానీ తనకు తెలిసిన సమస్త పాప క్రియలను, విగ్రహాలను విడిచిపెట్టమని హెచ్చరిస్తాడు. రోమన్ క్యాథలిక్ ఫాదర్ లా ఒక వ్యక్తి యొక్క పాపాల వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపటం రెండు వినాశనకరమైన ఫలితాలకు దారి తీస్తుంది. మొదటి ఫలితమేంటంటే, కాపరి ఎదుట అనవసరంగా తన వ్యక్తిగత పాపాలు ఒప్పుకున్నానని భావించి బాగా విచారపడవచ్చు. రెండవదిగా సిగ్గుపడి ఇంకెప్పుడూ సంఘానికి రాకపోవచ్చు. విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ దుష్ఫలితాలు పాపాల యొక్క వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపే బుద్ధిలేని కాపరుల వల్ల కలుగుతుంది.

జ్ఞానం గల కాపరి ఒక వ్యక్తి యొక్క ఆత్మకు ఒక సహాయకారిగా అనేక రీతుల్లో ఉపయోగపడతాడు. మారుమనస్సు అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఆయన చేయాల్సిన పనిని కాపరులు చేయలేరని గ్రహించి రక్షణ కార్యాన్ని ఆయనకే విడిచి పెట్టాలి.

అయితే ఇంతకు ముందు చెప్పిన వాటికి వ్యతిరేకమైనవి మనం చేయకూడదు. ఒక వ్యక్తి నిజంగా పాపం ఒప్పుకుని, యథార్థంగా మారుమనస్సు పొంది హృదయమంతటితో తన్ను తాను ప్రభువుకు అప్పగించుకుంటే, ఆ వ్యక్తి తన మార్పులో దేవుని కృపను నిజంగా అనుభవించినవాడుగా మనం గమనించాలి. నిజంగా మార్పు చెందిన ఈ వ్యక్తి కొంత కాలమైన తరువాత నిశ్చయత లేనివాడై బాధపడడం మనం చూడగలం. తరువాత అతడు కాపరిని లేక సంఘపెద్దను సమీపించి తన సమస్యలను, సందేహాలను తెలియచేస్తాడు. ఈ మార్పు చెందిన వ్యక్తి క్రైస్తవేతర కుటుంబం నుండి రక్షించబడితే, అతడు ఆత్మీయ సంగతులను స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. దానిని బట్టి కాపరి ఆ వ్యక్తి మారుమనస్సు పొందలేదని ఊహించుకుని తిరిగి కలువరి దగ్గరకు వెళ్ళి పాపాలన్నిటినీ మరలా ఒప్పుకోమని అతనికి సలహా ఇవ్వటం అవివేకం.

నిజమైన మారుమనస్సు గుర్తించకుండా కఠినంగా సలహా ఇవ్వటం ద్వారా సంఘానికి గొప్ప నష్టం వాటిల్లుతుంది. నిశ్చయత పొందని విశ్వాసులు సహవాసం నుండి నెట్టివేయబడుతున్నారు. నిశ్చయత కొరవడిన ఒక వ్యక్తి జీవితంలో మారుమానస్సుకు చెందిన ఋజువు ఉందో లేదో నిర్ణయించాల్సిన బాధ్యత కాపరికి అప్పగించబడిందని ఇదివరకే తెలియపరచబడింది. ఒక వేళ మారుమనస్సు పొందినందుకు ఆధారాలు ఉంటే, సందేహంతో ఉన్న ఆత్మకు ఆ ఆధారాలను తేటతెల్లం చేయడమే కాపరి యొక్క పని. ప్రభువు ఇది వరకే వారి జీవితంలో చేసిన కార్యాన్ని వారికి గుర్తు చేయడం ద్వారా ప్రోత్సాహాన్ని, నిశ్చయతను అందించి సహాయపడాలి. నిజంగా మారుమనస్సు పొందినవారు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన రక్షణ కార్యం విషయమై కృతజ్ఞతలు చెల్లించకుండా, ప్రభువుకు చెందాల్సిన స్తుతులు అర్పించకపోవటం దొంగతనంతో సమానమని మనం తెలియపరచాలి.

కాపరులు జ్ఞానంగలవారై మారుమనస్సుకు చెందిన గుర్తులను బాగా ఎరిగినవారై ఉండడం అత్యంత ప్రాముఖ్యమైంది. వాక్యానుసారమైన బాధ్యతను నిర్వర్తించాలంటే మనం మారుమనస్సు పొందినవారినే సంఘ సభ్యత్వంలోకి తీసుకోవాలి. మారుమనస్సు పొందనివారిని సంఘ సభ్యత్వంలోకి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమైనట్టు సంఘ చరిత్ర నుండి గమనించగలం. గత వంద సంవత్సరాల్లో ప్రొటెస్టెంట్ డినామినేషన్ల నుండి సత్య సువార్త ఎందుకు వినబడడం లేదు? గత 40 సంవత్సరాలుగా లెక్కకు మించిన సువార్తిక (ఇవాంజిలికల్) సంఘాలు ఎందుకు తల్లక్రిందులయ్యాయి? ఈ ప్రశ్నలకు వాక్యపరమైన సమాధానం ఏమిటంటే నేటి సంఘాల్లో గడ్డి, కొయ్య, రాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. (అనగా మారుమనస్సు లేనివారిని సంఘంలో తీసుకోవడం వల్ల ఈ నష్టం వాటిల్లింది.)

మన సంఘాల్లో హెబ్రీ 12:15లో మనకు ఇవ్వబడిన విధిని మనం నిర్లక్ష్యపరిచాం. “మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో” అనే విషయాన్ని మరిచాం. దేవుని కృప విషయంలో తప్పిపోయిన వ్యక్తి నిజమైన మారుమనస్సు పొందనివాడు. అటువంటి వ్యక్తి సంఘంలో చేరితే ఆ వ్యక్తి సంఘంలో అవిశ్రాంతి నెలకొనడానికి, సంఘం యొక్క ఆత్మీయ పతనానికీ కారణం ఔతాడు. సరిగ్గా పరీక్షించకుండా ఏదైనా స్థానిక సంఘం సభ్యులను చేర్చుకుంటే దాని ద్వారా వచ్చే ఫలితమేమిటంటే ఆ సంఘమంతా మారుమనస్సు లేని ప్రజలతో నింపబడి ఆత్మీయ సమస్యలతో మునిగిపోతుంది. కొన్నిసార్లు క్రీస్తును పూర్తిగా విస్మరించే పరిస్థితికి కూడా చేరుకోవచ్చు.

సంఘ సభ్యులను చేర్చుకునే విషయంలో మనం కొన్నిసార్లు పొరపాట్లు చేసేవారంగా ఉంటాం. అయితే సంఘంలో సభ్యులను చేర్చుకోవటానికి మనం నిర్వహించే పరీక్షలు ఒక రక్షించబడ్డ వ్యక్తికి కఠినమైనవిగా, అసాధ్యమైనవిగా ఎప్పుడూ ఉండకూడదు కానీ, మనం చేయవలసినదంతా చేసి ఎవరైతే మారుమనస్సుకు చెందిన నిజమైన ఋజువులు కలిగుంటారో వారిని మాత్రమే సహవాసంలో చేర్చుకోవాలి. ఈ పని కొరకు మనకు కృపాగుర్తులును గురించి సంపూర్ణజ్ఞానం ఉండాలి.

మారుమనస్సుకు చెందిన అనేక గుర్తులు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. కానీ ఈ పుస్తకం మారుమనస్సు పొందినవారిని సులువుగా గుర్తించడానికి మాత్రమే రాయబడింది. అపోస్తులుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఇంకొక ప్రాముఖ్యమైన గుర్తు ఉంది. సమయాభావం వల్ల దాని గురించి ఎక్కువ ప్రస్తావించడం లేదు. పెంతెకోస్తు దినాన మారుమనస్సు పొందినవారు అపోస్తలుల బోధలో, రొట్టెవిరచడమందు నిలకడగా కొనసాగారని లూకా రాశాడు. నిజమైన మారుమనస్సు పొందినవారు నిజంగా ప్రభువును ఆరాధించాలని కోరతారనేది ఒక కృపాగుర్తుగా ఉంది. వారిని వెంటాడాల్సిన పనిలేదు, వారిని ఒప్పించాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు సంఘానికి వచ్చే చెడ్డ లక్షణం వారిలో కనిపించదు. సరైన కారణం లేకుండా ఎప్పుడూ వారు సంఘానికి రాకుండా ఉండలేరు. దీనిగురించి ఇంకా ఎక్కువ చెప్పవచ్చు. ప్రియ చదువరీ, దీన్ని నువ్వు 8వ గుర్తుగా భావించవచ్చు.

జ్ఞానం కలిగి అవసరతలో ఉన్నవారికి సహాయం చెయ్యడానికి దేవుడు మనకు సామర్థ్యం కలగజేయును గాక! మారుమనస్సు అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యమనే వాస్తవం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక! మనం ఏమి చేసినప్పటికీ ప్రభువుకు చెందిన ఘనత, అధికారం తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు.

మెట్రోపాలిటన్ టెబర్నికల్ సంఘ సంక్షిప్త చరిత్ర

Final Conscience Book Setting image

మెట్రోపాలిటన్ టెబర్నికల్ అన్న సంఘం లండన్ లోని ఎలిఫంట్ కాజెల్ లో ఉన్న ఒక పెద్ద స్వతంత్ర రిఫార్మడ్ బాప్టిస్టు చర్చి. ఇది 1861వ కల్లా అతిపెద్ద ఇండిపెండెంట్ (నాన్ కన్ ఫార్మిస్ట్) చర్చిగా రూపుదిద్దుకుంది. 1650వ సంవత్సరం నుండి టెబర్నికల్ సహవాసం ప్రభువును ఆరాధిస్తుంది. ఈ సహవాసానికి మొదటి సంఘకాపరి విలియమ్ రైడర్. ఇతర గుర్తించదగిన బోధకులు, సంఘకాపరులు ఎవరంటే బెంజమిన్ కీచ్, డాక్టర్.జాన్ గిల్, డాక్టర్.జాన్ రిప్పన్, చార్లెస్ స్పర్జన్. మెట్రోపాలిటన్ టెబర్నికల్ సంఘం ప్రస్తుత సంఘకాపరియైన డాక్టర్. పీటర్ మాస్టర్స్ గారి నడిపింపులో వాక్యానుసారమైన పునాదులు, సిద్ధాంతాలను కలిగి నేటికీ ప్రభువును ఆరాధిస్తుంది.

1650వ సం||లో ఇంగ్లీష్ పార్లమెంట్, స్వతంత్ర క్రైస్తవ సంస్థలన్నీ సమావేశమవటాన్ని నిషేధించటం వలన టెబర్నికల్ సహవాసం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది.1688వ సం|| వరకూ అనేక శ్రమలను, హింసలను ధైర్యంగా ఎదుర్కొన్న తరువాత బాప్టిస్టులు ఇంకొకమారు స్వతంత్య్రంగా ఆరాధించటానికి అనుమతి లభించింది. ఈ సమయంలో వారు మొదటి ప్రార్ధనాలయాన్ని టవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో నిర్మించుకున్నారు.

1720వ సం||లో డాక్టర్ జాన్ గిల్ గారు పాస్టరుగా ఎన్నుకోబడి 51 సంవత్సరాల పాటు సేవ చేశారు. 1771వ సంవత్సరంలో డాక్టర్.జాన్ రిప్పన్ గారు పాస్టర్ గా నియమించబడి 63 సంవత్సరాల పాటు సేవ చేశారు. ఈ సంవత్సరాలలో సంఘం గొప్పగా వృద్ధి చెంది, దేశంలోనే ఒక అతి పెద్ద సంఘంగా ఆవిర్భవించింది. ఆ తరువాత సంఘ పతనం ఆరంభమై 1850 నాటికి సంఘంలోని సభ్యుల సంఖ్య తగ్గిపోయింది.

1854వ సంవత్సరంలో మెట్రోపాలిటన్ సంఘంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పాస్టర్లలో ఒకరైన చార్లెస్ హెడెన్ స్పర్జన్ గారు తన యవ్వన ప్రాయపు 20వ సంవత్సరంలో సేవను ఆరంభించారు. ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బ్రిటిష్ బోధకునిగా ఆయన త్వరగా ఎదిగారు. స్పర్జన్ గారు సంఘకాపరిగా ఉన్నప్పుడు చర్చి న్యూపార్క్ స్ట్రీట్ చాపెల్ లో ఉండేది. కాని ఈ చర్చి త్వరగా పెద్దదై, ఆరాధనలు సర్రే గార్డెన్స్ మ్యూజిక్ హాల్ లో జరిగేవి.

స్పర్జన్ గారి పరిచర్య కాలంలో చర్చి శాశ్వతంగా అతి పెద్ద ప్రాగణంలోనికి మార్చబడాలని నిర్ణయించడమైనది. సౌత్ లండన్లో థేమ్స్ నది దగ్గర ఉన్న ఎలిఫెంట్ అండ్ కజెల్ (Elephant & Castle) అన్న స్థలాన్ని ఎంపిక చేసుకోవటం జరిగింది. అంతమాత్రమే కాకుండా, సౌత్ వార్క్ హతసాక్షులను కాల్చివేసిన స్థలంలోనే సంఘాన్ని నిర్మించడం జరిగింది. చర్చి బిల్డింగ్ విలియమ్ విల్మర్ పోకాక్ చే డిజైన్ చేయబడింది.

1861లో చర్చి బిల్డింగ్ పని ముగించబడి, మార్చి 18న ప్రతిష్టించబడింది. బోధకులకు, పరిచారకులకు తర్ఫీదు నిమిత్తమై స్పర్జన్ ఒక కాలేజ్ ని స్థాపించారు. ఇప్పుడు అది స్పర్జన్ కాలేజ్ గా పిలవబడుతుంది. స్పర్జన్ అనాథలైన బాలబాలికలకు అనాథాశ్రమాలను స్థాపించారు. స్పర్జన్ గారు అనేక క్రైస్తవ పుస్తకాలను రచించారు; అవి నేటికి కూడా ముద్రించబడుతున్నాయి.

డాక్టర్ పీటర్ మాస్టర్స్ - పీటర్ మాస్టర్స్ గారు 1970వ సంవత్సరం నుండి సంఘానికి కాపరిగా వ్యవహరిస్తున్నారు. ఆయన 25 కంటే ఎక్కువ క్రైస్తవ పుస్తకాలను వ్రాసారు. అవి అన్నీ కనీసము 23 ఇతర భాషలలోనికి అనువదించబడ్డాయి. అమ్ హారిక్, చైనీస్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, హంగేరియన్, ఇండోనేషియన్, కొరియన్, మాల్టిస్, నేపాలి, పర్షియన్, పోలిష్, పోర్చుగీసు, రోమేనియన్, రష్యన్, సెర్బియన్, షోనా, స్లోవాక్, స్పానిష్, తమిళ, తెలుగు, ఉర్దూ. ఆయన యొక్క రేడియో, టెలివిజన్ ప్రసంగాలు ఇంగ్లాండు, అమెరికా దేశాలలో ప్రసారం చేయబడుతున్నాయి.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప హితబోధ ఎప్పుడూ, ఎవ్వరి నుండీ ఆర్థిక సహాయం అంగీకరించదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.