దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 32 నిమిషాలు

 

 was jesus christ created by god the father

యేసుక్రీస్తు నిత్యుడు కాడు, ఆయనను తండ్రియైన దేవుడు అన్నిటికంటే ముందుగా సృష్టించాడు అనే దుర్బోధను మొట్ట మొదటిసారిగా "ఏరియస్" అనేవాడు క్రీస్తు శకం 250-336వ సంవత్సరంలో సంఘంలోకి ప్రవేశపెట్టాడు. ఈ "ఏరియస్" ఈజిప్టులోని అలగ్జాండ్రియా సంఘానికి చెందిన సంఘపెద్దలలో ఒకడు. సంఘపెద్దగా తనకు ఉన్న పలుకుబడిని వాడుకుంటూ ఆ సంఘంలో ఈ దుర్బోధను వ్యాప్తిచెయ్యడం ద్వారా తక్కువ కాలంలోనే ఈ బోధను అనుసరించే ఒక గుంపును అతను తయారుచేయగలిగాడు.

ఈ గుంపును "Arianists" అని పిలుస్తారు‌. ఈ "ఏరియస్"  దేవుడు సృష్టించినవారిలో యేసుక్రీస్తు మొదటివాడనీ, దేవుడు ముందుగా ఆయనను సృష్టించి ఆయన ద్వారా సమస్తసృష్టినీ చేసాడని బోధించాడు. ఆ సమయంలో  "council of nicea"  ఈ దుర్బోధపైన స్పందించి అది వాక్యవిరుద్ధమైన బోధయని ఆధారాలతో రుజువు చేసింది. అయినప్పటికీ ఆ దుర్బోధ నేటికీ తన ఉనికిని‌ చాటుకుంటూనే ఉంది. మన తెలుగు క్రైస్తవ సంఘాలలో కూడా ఈ దుర్బోధను అనుసరించేవారు/బోధించేవారు ఎంతోమంది తయారయ్యారు.

కాబట్టి, నేను ఈ వ్యాసంలో "యేసుక్రీస్తు తండ్రి చేత ముందుగా సృష్టించబడినవాడని" చెయ్యబడుతున్న బోధ వాక్యానికి ఎలా వ్యతిరేకమో వివరించి, అది దుర్బోధ అని నిరూపించి, ఆ బోధకు ఆధారంగా వక్రీకరించబడుతున్న వాక్య భాగాలలో "యేసుక్రీస్తు తండ్రిచేత ముందుగా సృష్టించబడ్డాడనే" భావం లేదని ఒప్పింపచేస్తాను.

మొదటిగా; ప్రభువైన యేసుక్రీస్తు ఉనికి లేఖనాలలో రాయబడిన మాటలు చూడండి.

యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యేసుక్రీస్తు (Messiah) గురించి రాయబడిన ఈ ప్రవచనంలో ఆయన "నిత్యుడగు" తండ్రి అని మనకు కనిపిస్తుంది.  నిత్యుడు అంటే, తన ఉనికికి ప్రారంభం కానీ, ముగింపు కానీ లేనివాడు అని అర్థం. లేఖనాలలో తండ్రియైన దేవుని ఉనికి గురించి అవే మాటలు ఉపయోగించబడడం మనం చూస్తాం.

ఆదికాండము 21: 33 అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థనచేసెను.

యెషయా 40: 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

రోమీయులకు 16: 25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను-

మరొక సందర్భాన్ని చూడండి;

ఫిలిప్పీయులకు 2:6,7ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు దైవమానవుడిగా ఈ లోకంలోకి రాకముందు దేవుని స్వరూపం కలిగి, దేవునితో సమానంగా ఉన్నాడని రాయబడింది. యేసుక్రీస్తు ఒకానొక సమయంలో తండ్రియైన దేవుని చేత సృష్టించబడినవాడే, ఐతే ఆయన దేవునితో సమానంగా ఉండడం అసాధ్యం. సృష్టించబడింది ఏదీ కూడా సృష్టికర్తతో సమానం కాలేదు.

కొందరు యేసుక్రీస్తును తండ్రి హెచ్చిస్తున్నట్టుగా రాయబడిన కొన్ని వచనాలను చూపించి (ఫిలిప్పీ 2:10,11, హెబ్రీయులకు 1:6-9)  యేసుక్రీస్తుకు ఆ సమాన హోదాను, ఘనతనూ దేవుడే ప్రసాదించాడని వాదిస్తుంటారు. కానీ వారు చూపించే ఆ సందర్భాలన్నీ యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి, చనిపోయి తిరిగిలేచిన తరువాత జరిగినదాని గురించి చెబుతున్నాయి. కానీ మనం చూసిన లేఖనంలో ఆయన మానవుడిగా ఈ భూమిపైకి రాకముందే దేవునితో సమానుడిగా ఉన్నాడని స్పష్టంగా రాయబడింది. దీనినే యేసుక్రీస్తు కూడా తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు.

యోహాను 17:5 తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము.

ఈ సందర్భంలో లోకం పుట్టకముందే (ఆయన లోకంలోకి రాకముందే) తండ్రితో పాటుగా ఆయన  సమాన మహిమను కలిగియున్నాడనీ ఆయనే చెబుతున్నాడు.

యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమిపైకి ఆయనకున్న దైవస్వభావంతో పాటుగా మానవస్వభావాన్ని కూడా ధరించుకుని, దేవునిగా ఆయన పొందే భాగ్యాన్ని మాత్రం తండ్రి దగ్గర విడచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు. ఈలోకంలో ఆయన జీవించి, మరణించి తిరిగిలేచిన తరువాత, తండ్రి యొద్ద విడచిపెట్టి వచ్చిన ఆ మహిమను, భాగ్యాన్ని మరలా తండ్రి దగ్గరనుండి పొందుకున్నాడు. 

యేసుక్రీస్తు ఈరోజు ఏవిధంగా ఐతే మహిమతో, ఘనపరచబడుతూ ఉన్నాడో మానవుడిగా పుట్టకముందు కూడా అదేవిధంగా మహిమతో, ఘనపరచబడుతూ ఉన్నాడు.  ఆవిధంగా, తండ్రి యొద్దనుండి మరలా ఆ మహిమనూ, ఘనతనూ తీసుకునే సందర్భాల గురించే ఫిలిప్పీ పత్రికలోనూ, హెబ్రీ పత్రికలోనూ పౌలు ప్రస్తావిస్తున్నాడు. 

అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన పరిచర్య కాలంలో తండ్రి నాకంటే గొప్పవాడు, ఈ అధికారాన్ని నాకు తండ్రే అనుగ్రహించాడంటూ తనను తాను తండ్రికన్నా తక్కువవానిగా ప్రస్తావించిన మాటలు మనకు కనిపిస్తుంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమిపైకి తనను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు కాబట్టి సమస్త విషయాలలోనూ తండ్రికి లోబడుతూ ఆ విధంగా మాట్లాడాడు. అదేవిధంగా, బైబిల్ గ్రంథం తండ్రీ కుమారుడూ పరిశుద్ధాత్ముడూ ముగ్గురూ సమానులే అని చెబుతూ, వారిద్దరూ తండ్రికి లోబడుతున్నట్టు, ఆయనను ఘనపరుస్తున్నట్టు కూడా వివరిస్తుంది. ఇది వారిమధ్య ఉన్న ప్రేమను సూచిస్తుంది.

మరొక సందర్భాన్ని చూడండి;

యోహాను సువార్త 1:1-3 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

యేసుక్రీస్తు ఒకానొక సమయంలో తండ్రిచేత సృష్టించబడిన (కలిగించబడిన) చిన్న దేవుడనే దుర్బోధకు ఈ వచనాలు గొడ్డలి పెట్టులాంటివి. ఎందుకంటే కలిగియున్న సమస్తమూ ఆయన మూలంగానే కలిగిందనీ, కలిగియున్నదేదీ ఆయన లేకుండా కలగలేదని ఇక్కడ రాయబడింది. ఒకవేళ యేసుక్రీస్తు ఒకానొక సమయంలో తండ్రిచేత కలిగించబడినవాడని ఎవరైనా బోధిస్తుంటే అయనలేకుండా ఆయనెలా కలిగాడనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసివస్తుంది. అదేవిధంగా,

ప్రకటన గ్రంథం 22:13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.

ఈ వచనాలలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తన ఉనికి గురించి తెలియచేస్తూ నేను మొదటివాడను కడపటివాడను అంటున్నాడు. ఆయన ఒకానొక సమయంలో సృష్టించబడినవాడే ఐతే ఈ మాటలను ఆయన పలకడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈమాటలు సాక్ష్యాత్తూ పాతనిబంధనలో యెహోవా దేవుడే తన ఉనికిని చాటుకోవడానికి పలికినట్టు మనం చూస్తాం.

యెషయా 44: 6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.

యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో పాటుగా నిత్యత్వంలో ఉనికిలో ఉన్నవాడైతేనే తండ్రి తన ఉనికి గురించి పలికిన అవే మాటలను తనకు ఆపాదించుకోగలడు. మనకందరికీ, యెహోవా అనే పేరుకు "ఉన్నవాడు" అని అర్థం వస్తుందని తెలుసు. పాతనిబంధనలో తండ్రియైన దేవుడు యెహోవా అనే నామంతో పిలవబడినట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యెహోవా అనే నామంతో పిలవబడ్డాడు.

జెకర్యా 2:5-11 నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసివగు సీయోనూ, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు.

ఈ వచనాలలో యెహోవా మాట్లాడుతూ (నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును..), అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని ఆయనకు  జనులౌతారని,  యెహోవా తనను పంపాడని వారు తెలుసుకుంటారని అంటున్నాడు. మనమధ్యకు వచ్చి నివాసం చేసిందీ (హెబ్రీ 2:14-16, ఫిలిప్పీ 2:6-8) అన్యజనులు  తండ్రియైన యెహోవాను హత్తుకునేలా (రాజ్యంగా - ప్రకటన 5:9,10)  చేసిందీ ప్రభువైన యేసుక్రీస్తే కదా! కాబట్టి ఈ వచనాలలో యెహోవా అనే నామంతో మాట్లాడుతుంది ఆయనే.

యెషయా గ్రంథము 48:11-17 నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును. ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెన.నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

ఈ వచనాలలో కూడా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా మాట్లాడుతూ, ఆయనను మరొక యెహోవా, ఆయన ఆత్మ కలసి పంపినట్టు చెబుతున్నాడు. తండ్రి నిర్ణయం చొప్పున (గలతీ 4:4, 1 యోహాను 4:9,10), పరిశుద్దాత్మ చేసిన అద్భుతం కారణంగా (లూకా 1:35, యెషయా 11:1,2) దైవమానవునిగా ఈ భూమిపైకి వచ్చింది (పంపబడింది) యేసుక్రీస్తు ప్రభువే కదా!

ఇవే కాకుండా పాతనిబంధనలో మరెన్నో సందర్భాలు  యేసుక్రీస్తు యెహోవాగా ప్రత్యక్షమైనట్టు సాక్ష్యం ఇస్తున్నాయి వాటిగురించి మరింత‌ వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.

యెహోవా దూత ఎవరు?

దీనిప్రకారం, తండ్రియైన యెహోవావలే యేసుక్రీస్తు ప్రభువు కూడా నిత్యత్వంలో ఉన్నవాడే తప్ప మధ్యలో సృష్టించబడినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు నిత్యుడని చాటిచెప్పే మరొక వచనాన్ని చూద్దాం.

మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయైయున్నాడు)

యోహాను ఈ సందర్భంలో తండ్రియైన దేవుని గురించి ఆయన "ప్రేమయై" ఉన్నాడని వర్ణిస్తున్నాడు. మనమంతా ప్రేమిస్తాం తప్ప ప్రేమయై యుండలేము కానీ ఆయన ప్రేమస్వరూపిగా ఉన్నాడు. దీనిప్రకారం నిత్యుడైన దేవుడు ప్రేమయై (ప్రేమస్వరూపిగా) ఉండాలంటే ఆయన ప్రేమించడానికి నిత్యత్వంలో కచ్చితంగా వ్యక్తులను కలిగియుండాలి.  ఒకవేళ ఆయన మొదట ఒంటరిగా ఉండి, తరువాత ఒక వ్యక్తిని సృష్టించి ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఆయన ప్రేమాస్వరూపిగా‌ ఎలా ఉన్నాడు?

కాబట్టి దేవుడు నిత్యత్వంలో తనతో పాటుగా తన కుమారుడైన యేసుక్రీస్తునూ, పరిశుద్ధాత్మనూ ప్రేమిస్తూ ప్రేమస్వరూపిగా (ప్రేమయై) ఉన్నాడు.

ఇంతవరకూ యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో పాటుగా నిత్యుడని లేఖనాల ఆధారాలను మనం చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు నిత్యడు కాదని చెప్పేందుకు వక్రీకరించబడున్న వాక్యభాగాలను కూడా చూద్దాం.

సామెతలు 8:1,22-31- జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడనుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.

మనం చూసిన ఈ లేఖనభాగంలో జ్ఞానం మాట్లాడుతూ అదే జ్ఞానం 22వ వచనం నుండీ తనను దేవుడు అన్నిటికంటే ముందుగా సృష్టించాడని, తనకు పుట్టుక ఉన్నట్టుగా తెలియచేస్తుంది.

యేసుక్రీస్తు నిత్యుడు కాదు అని చెప్పేవారు మొదటిగా ఈ వాక్యభాగాన్ని చూపించి తరువాత మరోదానిని దీనికి ఆపాదించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ లేఖనం కూడా చూడండి.

మొదటి కొరింథీయులకు 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

ఈ వచనంలో పౌలు‌ యేసుక్రీస్తు దేవుని జ్ఞానం, శక్తియైయున్నాడని చెబుతున్నాడు. కాబట్టి వారు ఈ మాటల ఆధారంగా సామెతలు గ్రంథంలో దేవుడు నన్ను అన్నిటికంటే ముందుగా సృష్టించాడని తనగురించి సాక్ష్యమిస్తున్న జ్ఞానం మరెవరో కాదు యేసుక్రీస్తు ప్రభువే అని ఆయనను అన్నిటికంటే ముందు పుట్టినవాడిగా చిత్రీకరిస్తారు.

కానీ,  పౌలు అక్కడ యేసుక్రీస్తు గురించి ఆయన దేవుని జ్ఞానమైయున్నాడని ఎందుకు పరిచయం చేస్తున్నాడో అర్థం కావాలంటే ఆ పై వచనాలను కూడా చదవాలి.

మొదటి కొరింథీయులకు 1:22-24 యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

ఈ వచనాలలో పౌలు రెండు జాతుల ప్రజలను ఉద్దేశించి ఈ మాటలను చెబుతున్నాడు.

1) "యూదులు" సూచకక్రియలు చేయమని అడుగుతున్నారు. దేవునిచేత తనప్రజలుగా పిలవబడి, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందిన ప్రజలు ఎక్కువగా దేవుడు చేసే సూచకక్రియలపైన మక్కువతో ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా వీరు ఒక సూచకక్రియ చేయమని శోధించినట్టు మత్తయి 12:38లో మనం చూస్తాం.

2) "గ్రీకుదేశస్తులు" కొరింథీపట్టణం కూడా గ్రీకుదేశంలో భాగమే, ఇక్కడ నివసిస్తున్న ఎక్కువశాతం ప్రజలు గ్రీకులే. వీరు ఎక్కువగా తత్వజ్ఞానాన్ని (ఫిలాసఫీ) నమ్ముతుంటారు; ప్రపంచంలో పేరుగాంచిన అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో వంటి తత్వజ్ఞానులందరూ ఈ గ్రీకుదేశానికి చెందినవారే. వీరు దేవుని దగ్గరకు చేరాలంటే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించాలనే నమ్మకంతో జీవించేవారు‌.

అపోస్తలుడైన పౌలు మనం చూసిన సందర్భంలో ఈ రెండు భావజాలాలు కలిగిన ప్రజలకూ యేసుక్రీస్తు గురించి ఆయనే మనల్ని దేవుని దగ్గరకు చేర్చే జ్ఞానమనీ (కొలస్సీ 2:3) ఆయనే సూచకక్రియలను చేసే దేవుని శక్తియనీ వారికి అర్థమయ్యేలా చెబుతున్నాడు.

మొదటి కొరింథీయులకు 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా "ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను".

ఈ సందర్భంలో పౌలు యేసుక్రీస్తును వారికి జ్ఞానంగా మాత్రమే పరిచయం చెయ్యడం లేదు కానీ, ఆయన దేవుని శక్తియనీ, నీతియనీ, పరిశుద్ధతయనీ, విమోచనయనీ ఇన్ని విధాలుగా ఆయన ద్వారా విశ్వాసులకు కలిగే భాగ్యం గురించి వివరిస్తున్నాడు. కాబట్టి సామెతలు 8వ అధ్యాయంలో మాట్లాడుతున్న జ్ఞానం, ఇక్కడ పౌలు చెబుతున్న జ్ఞానం ఒకటి కాదు.

సొలోమోను సామెతల గ్రంథాన్ని జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి రచిస్తూ అందులో జ్ఞానాన్ని ఒక వ్యక్తి (స్త్రీ) గా చిత్రీకరించాడు. ఆ మొత్తం గ్రంథమంతటిలో జ్ఞానం అనే పదం ఉన్నచోట హీబ్రూ భాషలో వాడినపదం חָכְמָ֥ה . ఈ పదాన్ని తెలుగులో పలకడం కాస్త కష్టమే.

హీబ్రూ ఇంగ్లీష్ కలపి ఉండే parallel బైబిల్ లో కూడా ఆ పదాన్ని ఇంగ్లీష్ లో హుక్మా అని రాసారు కానీ కచ్చితంగా ఆ పదాన్ని ఇంగ్లీష్ లో రాయాలంటే CHAK-MAH అని రాయాలి. అది స్త్రీ లింగాన్ని సూచిస్తుంది.

సామెతలు గ్రంథంలోనే దీనికి స్పష్టమైన ఆధారం కనిపిస్తుంది చూడండి.

సామెతలు 7:4 జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.

ఈ వచనంలో సామెతలు గ్రంథంలో మనకు కనిపిస్తున్న జ్ఞానాన్ని మనం "అక్క" అని పిలవాలని రాయబడింది. దీని ప్రకారం, సామెతలు 8వ అధ్యాయంలో మాట్లాడుతున్న జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువేయని బోధించేవారు యేసుక్రీస్తును అక్క అని పిలుస్తారా?

Proverbs 7: 4 Say unto wisdom, Thou art my sister; and call understanding thy kinswoman

కాబట్టి సొలోమాను ఇశ్రాయేలీయులు, దేవుని స్వభావ లక్షణమైన జ్ఞానాన్ని నిర్లక్ష్యపెట్టి జీవిస్తున్న తరుణంలో ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని  వారికి వివరించడానికి దానిని స్త్రీగా చిత్రీకరిస్తూ రాసిందే ఈ సామెతల గ్రంథం. ఆ జ్ఞానమే, 8వ అధ్యాయం 22 వ వచనం నుండీ దేవుడు కూడా నా ద్వారానే ఈ సమస్త సృష్టినీ చేశాడని తనయొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటుంది.

అదేవిధంగా, ఈ జ్ఞానం తనగురించి, దేవుడు నన్ను సృష్టించెను, నేను పుట్టితిని, నన్ను కలుగచేసెను అని పలికినప్పుడు కూడా ఆ జ్ఞానం అన్నిటికంటే ముందునుండీ ఉనికిలో ఉందనీ, దేవుడు దాని ద్వారానే ఈ సృష్టిని చేసాడని (సామెతలు 3:19, యిర్మియా 10:12) అర్థం చేసుకోవాలే తప్ప,  నిజంగానే ఆ జ్ఞానం ఒకానొక సమయంలో పుట్టింద‌ని మనం భావించకూడదు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని దేవుడు ఒకానొక సమయంలో పుట్టించుకుంటే అంతకుముందు ఆయన జ్ఞానం లేనివాడిగా ఉన్నాడా అనే ప్రశ్న వస్తుంది.
అది అసాధ్యం ఎందుకంటే జ్ఞానం అనేది ఆయన స్వభావ లక్షణం.

యోబు 12: 16 బలమును "జ్ఞానమును" ఆయనకు స్వభావలక్షణములు. 

దేవునికి స్వభావ లక్షణాలు మధ్యలో పుట్టవు ఆయన ఉన్నప్పటినుండీ (నిత్యత్వంలో) ఆయనలోనే ఉంటాయి‌, ఆయన మార్పులేనివాడు.

ఇప్పుడు సామెతలు 8వ అధ్యాయంలో మాట్లాడుతున్న జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువే అని వక్రీకరించేవారు అక్కడ ప్రస్తావించే మరోమాటను చూద్దాం.

సామెతలు 8:35,36 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.

ఈ వచనంలో జ్ఞానం నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడని తనగురించి పలుకుతుంది. వారు ఈ మాటలను కుడా యేసుక్రీస్తు ప్రభువు "నేనే జీవమును" ని  పలికిన మాటలకు జతచేసి (యోహాను 14:6) ఈ ఇద్దరూ ఒకరే అని వాదించే ప్రయత్నం చేస్తారు. ఒకే మాట రెండు వేరువేరు సందర్భాల్లో కనిపించినంత మాత్రాన రెండు సందర్భాలలో మాట్లాడుతున్నది ఒకరే అనుకోవడం అజ్ఞానం. ఆ విధంగా కలిపి చెరిపితే, దేవుడు సృష్టిని చేసినప్పుడు "జీవము కలిగి చలించువాటిని సముద్రము పుట్టించునుగాక" అని పలికినట్టు రాయబడింది (ఆదికాండము 1:20). ఆ జీవమూ యేసుక్రీస్తు మాట్లాడుతున్న నిత్యజీవమూ ఒకటేనా? హవ్వ జీవము గల ప్రతివానికీ తల్లియని రాయబడింది (ఆదికాండము 3:20), ఆ జీవమూ ఆత్మీయ జీవమూ ఒకటేనా? అక్కడ సొలోమోను జ్ఞానం లేనివాడు నాశనం ఔతాడని చెప్పడానికి ఆ మాటలు రాస్తున్నాడు ఆ క్రింది మాటల్లోనే అది శారీరక జీవం, మరణాల గురించని స్పష్టంగా ఉంది.

సామెతలు 8:36 నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.

మరొక వక్రీకరణను  చూద్దాం.

కొలొస్సయులకు‌ 1:14,15 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

కొలస్సీ సంఘానికి పౌలు రాస్తున్న ఈ పత్రికలో ఆయన యేసుక్రీస్తును ఆదిసంభూతుడిగా సంబోధించడం మనం చూస్తాం. గ్రీకులో ఇక్కడ వాడినటువంటి పదం "πρωτότοκος" (prōtotokos). ఈ పదానికి మొదటిగా మొదట జన్మించినవాడు అని అక్షరార్థంగా అర్థం వస్తుంది. అందుకే మన ఇంగ్లీష్ బైబిల్ లో ఈ పదం ఉన్నచోటల్లా "firstborn" అని తర్జుమా చేశారు. మనం ప్రారంభంలో ప్రస్తావించుకున్న "ఏరియస్" అనేవాడు ఈ వచనం ఆధారంగానే యేసుక్రీస్తు దేవునిచేత ముందుగా సృష్టించబడినవాడని బోధించాడు. కానీ ఈ పదానికి మొదటపుట్టినవాడు అనే అర్థమేకాకుండా, అందరికన్నా ప్రాముఖ్యత గలవాడు, అందరికన్నా శ్రేష్ఠుడు అనే అర్థం కూడా వస్తుంది.

ఉదాహరణకు; 

కొలొస్సయులకు 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

ఈ వచనంలో కూడా తెలుగులో ఆదిసంభూతుడు అని తర్జుమా చేసిన చోట అదే పదాన్ని వాడారు‌.

నిర్గమకాండము 4:22,23 అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు; నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.

పాతనిబంధనను గ్రీకులోకి తర్జుమా చేసిన సెప్టువజింటు (LXX) లో ఇక్కడ ఇశ్రాయేలు నా జ్యేష్ఠకుమారుడని రాయబడినప్పుడు అదే "πρωτότοκος" (prōtotokos) పదాన్ని వాడారు. కానీ  ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి అందరికంటే ముందుగా పుట్టినవారనే భావంలో ఈ పదాన్ని వాడలేదు. వారికి దేవుని దృష్టిలో ఉన్న ప్రాముఖ్యత, శ్రేష్ఠత్వాన్ని సూచించడానికే ఈ పదాన్ని వాడారు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గ్రీకుభాషలో కచ్చితంగా ముందు పుట్టినవాడనే అర్థాన్ని ఇవ్వడానికి "πρωτόκτιστος" (prōtoktistos) అనే పదాన్ని వాడతారు. యేసుక్రీస్తు గురించి ఆదిసంభూతుడని తెలుగులో తర్జుమా చెయ్యబడిన ఏ చోటా కూడా దీనిని వాడలేదు.

పౌలు ఆ సందర్భంలో యేసుక్రీస్తును  ఆదిసంభూతుడు అన్నప్పుడు, సర్వసృష్టిలో ఆయనకున్న ప్రాముఖ్యతను తెలియచెయ్యడానికే ఆ పదాన్ని వాడాడని ఆ సందర్భమే స్పష్టంగా రుజువు చేస్తుంది చూడండి-

కొలొస్సయులకు 1:15-18 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

ఒకవేళ పౌలు యేసుక్రీస్తు గురించి ఆ మాటను పలకడం వెనుక ఉద్దేశం "యేసుక్రీస్తు ముందుగా పుట్టినవాడనేదే" ఐతే, యేసుక్రీస్తు తండ్రితో పాటుగా నిత్యుడని మనం చూసిన లేఖనాలను ఆయన తూలనాడుతున్నాడా? (ఒకే పరిశుద్ధాత్మ పౌలు లేఖనాలనూ, మిగిలినవారి లేఖనాలనూ ప్రేరేపించిన కారణంచేత ఇలా అయ్యే అవకాశం లేదు).

మరొక వక్రీకరణను చూద్దాం.

ప్రకటన గ్రంథము 3:14 లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా-

ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన దేవుని సృష్టికి "ఆదియైనవాడు" అని రాయబడింది. వీరు ఈ వచనాన్ని కూడా వక్రీకరించి దేవుని సృష్టికి ఆదియైనవాడు అంటే దేవుని చేత ముందుగా సృష్టించబడినవాడని బోధిస్తారు‌. అయితే ఈ వచనంలో దేవుని సృష్టికి ఆదియైనవాడు అంటే అర్థం అది కానేకాదు. మనకు బైబిల్ గ్రంథం "ఆదియందు" దేవుడు భూమ్యాకాశములను సృజించెను అనే మాటతో ప్రారంభమౌతుంది (అదికాండము 1:1). మనం పైన చూసిన వచనంలో యేసుక్రీస్తు దాని గురించే ప్రస్తావించి ఆ ఆదిని/ప్రారంభకుడిని నేనేయని చెబుతున్నాడు. ఆయన దేవుని సృష్టికి ఆది మాత్రమే కాదు అంతం కూడాయని అదే ప్రకటన గ్రంథంలో రాయబడింది.

ప్రకటన గ్రంథము 22:13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునైయున్నాను.

కాబట్టి, ఆయన దేవుని సృష్టికి ఆదియైనవాడు అన్నప్పుడు, దానిని వక్రీకరించి "దేవుని సృష్టిలో మొదటిగా సృష్టించబడినవాడనే" భావం చెబితే ఆయన నేనే "అంతమునైయున్నాను" అన్నప్పుడు ఏం అర్థం చెబుతారు మరి? ఆ మాటలకు అసలు అర్థం. ఈ సృష్టికి ప్రారంభకుడినీ, అంతం చేసేవాన్ని నేనే (యేసుక్రీస్తు). ఆయన రాకడలో అదే జరగబోతుంది. 

2పేతురు 3:10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

మరొక వక్రీకరణను చూద్దాం.

కీర్తనల గ్రంథము 2:7 కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.

యేసుక్రీస్తు గురించి రాయబడిన ఈ ప్రవచనంలో, యెహోవా దేవుడు ఆయనను "నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నానని" పలకడం మనం చూస్తాం. ఈమాటల ఆధారంగా కూడా వారు యేసుక్రీస్తును దేవుడు మొదటిగా కన్నాడని చెబుతుంటారు. 

హెబ్రీగ్రంథకర్త కూడా తన పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాటలను ప్రస్తావించడం మనకు కనిపిస్తుంది. 

హెబ్రీయులకు 1:5 ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?

అయితే ఆ సందర్భాలు ఏవీ కూడా తండ్రియైన దేవుడు అందరికంటే ముందు యేసుక్రీస్తు ప్రభువును కన్నాడని చెప్పడం లేదు కానీ, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా మరియ గర్భాన జన్మించి మృతిని గెలవడం గురించే చెబుతున్నాయి.

హెబ్రీయులకు 1:2-5 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను  నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా?

ఆ మాటలను ఇంకా చూడగలిగితే; 

కీర్తనల గ్రంథము 2:8-12 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

ఇదంతా యేసుక్రీస్తు భూమిపైన దేవుని కుమారుడిగా జన్మించిన తరువాత జరిగే సందర్భాలే. ఇవే మాటలను సంఘం తమకు యూదులనుండీ, పిలాతు నుండీ ఆపద తలెత్తినప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా రాయబడింది.

అపొస్తలుల కార్యములు 4:25-28 అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను  భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

కాబట్టి కీర్తనలు గ్రంథంలోని ఆ మాటలు  యేసుక్రీస్తును దేవుడు ముందుగా కన్నాడని భావం వచ్చేలా రాయబడలేదు‌. ఆయనను తండ్రి మృతులలోనుండి లేపడం గురించే అలా రాయబడ్డాయి (ఆపో.కార్యములు 17:31, రోమా 6:4, హెబ్రీ 13:20, 1 పేతురు 1:20, 1 థెస్సలొనిక 1:10, ఎఫెసీ 1:20). అదేవిధంగా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని రాయబడినప్పుడు ఆయన దేవునికి పుట్టినవాడని భావించకూడదు. మానవ సంబంధాల్లో కుమారుడు/కుమార్తె అంటే వారికి పుట్టినవారనే అర్థమే వస్తున్నప్పటికీ, దేవుడు మానవసంబంధాలకు అతీతుడని మనం గుర్తుంచుకోవాలి. 

కాబట్టి మన సంబంధాల్లో ఉన్నవాటిని తీసుకెళ్ళి ఆయనపై ఆపాదించకూడదు. ఎందుకంటే ఆయన మనకంటే ముందుగా ఉన్నవాడు. ఒకవేళ యేసుక్రీస్తు దేవుని కుమారుడని రాయబడినప్పుడు మన బంధాల కోణంలో దానిని అర్థం చేసుకుంటే, మనం పెళ్ళిచేసుకుని ఒక స్త్రీతో కలసి కుమారుడిని కంటాం. మరి దేవుడు ఎవర్ని పెళ్ళిచేసుకుని యేసుక్రీస్తును కన్నాడు?

కాబట్టి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని రాయబడినప్పుడు అది ఆయన కలిగియున్న పరిపూర్ణ దేవుని స్వరూపం (గుణలక్షణాలు), దేవునితో సమానత్వం గురించీ తెలియచేస్తుందని భావించాలి. ఈ మాటలు చూడండి.

కొలొస్సయులకు 1:15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

హెబ్రీయులకు 1: 3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు-

ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని-

ఈ వచనాలు అన్నిటిలోనూ యేసుక్రీస్తు దేవుని స్వరూపమని స్పష్టంగా రాయబడింది. దీనిపై మరింత స్పష్టత కోసం ఈ మాటలు చూడండి.

యోహాను సువార్త 5:17,18  అయితే యేసు నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు తాను దేవుని కుమారుడను అని చెబితే  యూదులకు ఆయన దేవునితో సమానంగా చేసుకున్నాడని అర్థమైందే తప్ప, ఆయన దేవునికి ముందుగా పుట్టాడని కాదు. యూదులకే కాదు ఈ మాటలు రాస్తున్న యోహాను కూడా ఆయన చెప్పినమాటకు అదే అర్థమని ఒప్పుకుంటున్నాడు.

కాబట్టి ఆయన దేవుని కుమారుడంటే దేవుని గుణలక్షణాలూ, ఆయనతో సమానత్వం, ఆయన స్వరూపం కలిగినవాడని అర్థం. ఇదంతా పక్కన పెట్టేసి, కుమారుడు అంటే దేవునికి పుట్టినవాడే అని బోధలు చేసేవారు. ఈ క్రింది మాటలకు వివరణ ఇవ్వాలి.

అపో.కార్యములు 4:36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు (ఆదరణ పుత్రుడు) అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి.

ఈ వచనంలో అపోస్తలులు యోసేపు అనే వ్యక్తికి హెచ్చరిక పుత్రుడు అనే పేరును పెట్టినట్టుగా  మనం చూస్తాం. దీనిని బట్టి యోసేపు హెచ్చరికకు పుట్టాడని అర్థమా? కాదు కదా! యోసేపు హెచ్చరించే/ఆదరించే లక్షణాన్ని కలిగియున్నాడని మాత్రమే అర్థం.

యోహాను 17: 12 నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.

ఈ వచనాలలో యేసుక్రీస్తు ప్రభువు ఇస్కరియోతు యూదాను నాశనపుత్రుడని సంబోధిస్తున్నాడు. దీనిని బట్టి ఇస్కరియోతు యూదా నాశనానికి పుట్టాడని అర్థమా? కాదు కదా! ఇది ఇస్కరియోతు యూదా స్థితిని తెలియచేస్తుంది.

యోహాను 8: 44 మీరు మీ తండ్రియగు అపవాది  సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.

ఈ వచనంలో యేసుక్రీస్తు యూదులను ఉద్దేశించి మీ తండ్రి అపవాది అంటున్నాడు. దీనికి యూదులు అపవాదికి పుట్టారని అర్థమా కాదు కదా! ఈ మాటలు అపవాది క్రియలతో వారికున్న సంబంధాన్ని సూచిస్తున్నాయి. 

కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నప్పుడు మన సంబంధాల నుండి కాకుండా,  లేఖనపరిధిలో ఆలోచిస్తూ ఆయన  దేవుని స్వరూపమని, దేవునితో సమానుడని అర్థం చేసుకోవాలి.  ఈ నిర్వచనాలకు ఇప్పటికే నేను ఆధారాలను చూపించాను.  

చివరిగా, యేసుక్రీస్తు మాత్రమే కాదు పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడని బైబిల్ చెబుతుంది.

హెబ్రీయులకు 9:14 "నిత్యుడగు ఆత్మ" ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

తండ్రీ, కుమారుడూ, పరిశుద్ధాత్ముడు ఒకే దైవత్వాన్ని సమానంగా కలిగిన నిత్యులు, వారు ముగ్గురూ ఒకే దేవుడు. త్రిత్వసిద్ధాంతం అర్థమైనవారెవరికైనా ఈ విషయంలో ఎటువంటి గందరగోళం ఉండదు. ఇది అర్థం కాకే "ఏరియస్" మరియు మరికొంతమంది యేసుక్రీస్తు గురించీ, పరిశుద్ధాత్మ గురించీ భిన్నమైన సిద్ధాంతాలు కట్టే ప్రయత్నం చేసారు.

ఈమధ్య కాలంలో పరిశుద్ధాత్ముడి గురించి కొందరు చేస్తున్న హాస్యాస్పదపు బోధను విన్నాను. "గలతీ 4:6వ వచనంలో" పౌలు పరిశుద్ధాత్మను ఉద్దేశించి "తన కుమారుని ఆత్మ" అని సంబోధించడం మనం చూస్తాం. దీని ఆధారంగా కొందరు యేసుక్రీస్తు దేవునికి పెద్ద కొడుకైతే, పరిశుద్ధాత్ముడు చిన్న కొడుకని బోధిస్తున్నారు. నవ్వు వస్తుంది కదూ! ఇంతకూ పౌలు అక్కడ పరిశుద్ధాత్మను "తన కుమారుని ఆత్మ" అంటున్నాడా? లేక కుమారుడైన ఆత్మను అంటున్నడా? పరిశుద్ధాత్ముడు లేఖనాలలో "యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మగా కూడా సంబోధించబడ్దాడు.

అపో.కార్యములు 16:7 "యేసు యొక్క ఆత్మ" వారిని వెళ్లనియ్యలేదు.

రోమీయులకు 8:9 దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను "క్రీస్తు ఆత్మ" లేనివాడైతే వాడాయనవాడు కాడు.

గలతీ 4:6లో పౌలు పరిశుద్ధాత్మను "తన కుమారుని ఆత్మ" అని ఆయనను  దేవుని కుమారుని క్రీస్తు/యేసు ఆత్మ అనే భావంలోనే అలా సంబోధించాడు. ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా సిద్ధాంతాలు కట్టేసే ఘనులు మన తెలుగు క్రైస్తవ్యంలో తగలడడం నిజంగా మన దురదృష్టం. నేను పైన చెప్పినట్టుగా "త్రిత్వ సిద్ధాంతంపై" అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి దుర్బోధలన్నీ వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.

త్రిత్వ సిద్ధాంత నిరూపణ

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.