విమర్శలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

ఆడియో

 బైబిల్ దేవుడు స్త్రీలపై వివక్ష చూపించాడనేందుకు ఆధారంగా, కొందరు స్త్రీవాదులూ మరియు బైబిల్ విమర్శకులు మోషే ధర్మశాస్త్రం నుండి వక్రీకరించే శీలపరీక్ష పద్ధతిని వివరిస్తూ గతంలో నేనో వ్యాసాన్ని రాయడం జరిగింది. ఈ క్రింది లింక్ ద్వారా మీరు దానిని చదవొచ్చు. 

స్త్రీకి శీలపరీక్ష బైబిల్ దేవుని వివక్షేనా?

ఈ వ్యాసంలో కూడా బైబిల్ దేవుడు స్త్రీలపై  వివక్ష చూపించాడనేందుకు ఆధారాలుగా  ప్రస్తావించబడుతున్న మరికొన్ని సందర్భాలకు వివరణ ఇవ్వబోతున్నాను. 

"రుతుస్రావం అపవిత్రమా"

ఆధునిక ప్రపంచం అభివృద్ధి చెందాక స్త్రీలను రుతుస్రావం సమయంలో అసహ్యభావంతో చూస్తున్నారని, కొన్ని మతగ్రంథాల ఆధారంగా వారిని ఆ సయయంలో దారుణమైన వెలివేతకు గురిచేస్తున్నారని, ఇది లింగవివక్షలో భాగమేయని పెద్ద వివాదమే చెలరేగింది.

ఈ భూమిపై ఒక జీవానికి జన్మనిచ్చే పక్రియలో భాగంగా స్త్రీకి దేవుడు పెట్టిన రుతుస్రావాన్ని బట్టి ఆ సమయంలో ఆమెను‌ అసహ్యించుకోవడం నిజంగా దారుణమైన విషయమేనని మానవత్వం కలిగిన ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అయితే అదే సమయంలో దీనిపై పోరాటం చేస్తున్న కొందరు రుతుస్రావంపై అతి చేస్తున్నారని కూడా ఒప్పుకోక తప్పదు. దానికి‌ ఒక నిదర్శనమే, పేపర్లలో, టీవీలలో కొందరు వారికి మొదటిసారి రుతుస్రావం ఎలా జరిగిందో గొప్పగా వివరించడం.

(ఒక విషయాన్ని‌ చులకనగా చూడడం, దానిని అతిగా చూడడం, రెండింటిలోనూ లో‌పం‌ ఉందని నేను‌ కొత్తగా చెప్పనవసరం లేదు‌)

ఈ క్రమంలో మరికొందరు బైబిల్ లో కూడా స్త్రీల రుతుస్రావం అపవిత్రమైనదనీ, ఆ సమయంలో వారిని వెలివెయ్యాలనీ రాయబడిందంటూ బైబిల్ దేవుడిని స్త్రీలపై వివక్ష చూపించినవాడిగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆధారంగా మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలను ఉదహరిస్తుంటారు. అవేంటో చూడండి -

లేవీయకాండము 15:19-23 స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును.

ఈ సందర్భంలో‌ వారు చెబుతున్నట్టుగానే, రుతుస్రావం సమయంలో స్త్రీ అపవిత్రమైనదిగానూ, ఆమె మాత్రమే కాదు ఆమె‌ తాకే ప్రతీదీ కూడా అపవిత్రమౌతుంద‌ని చెప్పబడడం వాస్తవమే. అయితే ఇక్కడ చెప్పబడుతున్న అపవిత్రత దేనికి సంబంధించిందో చూసేముందు దీనికీ లింగ వివక్షకూ ఏమైనా సంబంధం ఉందా అనేది మొదటిగా పరిశీలిద్దాం.

లేవీయకాండము 15:2-7 - మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము; వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.

పై వచనాలు స్త్రీల రుతుస్రావం గురించి రాయబడిన అదే అధ్యాయపు ప్రారంభంలో రాయబడ్డాయి. ఇందులో రుతుస్రావం గురించి చెప్పినట్టుగానే స్రావముగలవాడు అపవిత్రుడని అతను ఆ స్రావంతో ఉన్న దినాలన్నిటిలోనూ ఏది ముట్టుకున్నా అది కూడా అపవిత్రమౌతుందని రాయబడింది. అంటే దేవుడు ఇక్కడ స్రావం‌ కలిగిన పురుషులపై వివక్ష‌ చూపిస్తున్నాడా? ఒకవేళ ఇది రోగం కదా దీనిని రుతుస్రావానికి ఆపాదించలేమని ఎవరైనా వాదిస్తే ఈ వచనాలు కూడా కాస్త చూడండి -

లేవీయకాండము 15:16-18 ఒకనికి వీర్యస్ఖలనమైన యెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును. వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులై యుందురు.

స్త్రీ ఒకరికి జన్మనిచ్చే పక్రియలో భాగమైన రుతుస్రావాన్ని అపవిత్రంగా చూడడం ఆమెపై వివక్షే అని, అలా బైబిల్ దేవుడు కూడా చేసాడని విమర్శించేవారు ఈ వచనాలు చదివితే ఇక్కడ స్త్రీ ఒకరికి జన్మనివ్వడానికి మూలమైన వీర్యస్ఖలనాన్ని కూడా ఆయన అపవిత్రంగానే చెప్పడం జరిగింది మరి. అంటే ఇక్కడ బైబిల్ దేవుడు పురుషులపై కూడా వివక్ష చూపించినట్టేనా?

మోషే ధర్మశాస్త్రంలో అటు రుతుస్రావం, ఇటు వీర్యస్ఖలనం రెండూ కూడా అపవిత్రమని రాయబడినప్పుడు అది వివక్షే అయితే, ‌బైబిల్ దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరిపైనా వివక్ష చూపినట్టేగా? ఇక స్త్రీలపై మాత్రమే  వివక్ష చూపినట్టుగా కొందరు చేసే హడావుడికి తావెక్కడుంది?

అయితే  ప్రతీదానినీ వివక్షతో ముడిపెట్టి హడావిడి చేసేవారు కాస్త స్వచ్ఛమైన బుద్ధిని ఉపయోగించి ఈ సందర్భాలు చదివితే ఇక్కడ‌ చెప్పబడుతున్న అపవిత్రత, శారీరక పరిశుభ్రతకు సంబంధించిందే తప్ప వ్యక్తిత్వపరమైనది కాదని‌ అర్థమౌతుంది. ఉదాహరణకు, రుతుస్రావం సమయంలో స్త్రీలు కాస్త బలహీనంగా ఉంటారు కదా అది ఏ విధమైన బలహీనత? శారీరకమైనదా లేక వ్యక్తిత్వపరమైనదా? శారీరకమైనదే కదా! ఈ మాటలు చూడండి -

లేవీయకాండము 15:32,33 స్రావముగలవాని గూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవాని గూర్చియు, 'కడగానున్న బలహీనురాలిని గూర్చియు', స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.

స్త్రీ రుతుస్రావం సమయంలో అపవిత్రురాలని‌ చెప్పబడిన అదే సందర్భంలో పైవచనాల ప్రకారం ఆమె బలహీనురాలని కూడా చెప్పబడింది కాబట్టి ఆ అపవిత్రత శరీరసంబంధమైనదే.

‌మరో ఉదాహరణ చూడండి -

2సమూయేలు 11: 4 దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.

ఈ సందర్భంలో దావీదు బెత్షెబతో శయనించాక ఆమె‌ తనకు కలిగిన అపవిత్రతను పోగొట్టుకుందని రాయబడింది. అది ఏ అపవిత్రతో నేను‌ వివరంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా! కాబట్టి అపవిత్రత అనగానే ప్రతీసారీ దానిని వ్యక్తిత్వపరమైనదిగా భావించకూడదు.

ఈరోజు వ్యక్తిగత శభ్రతకు సంబంధించిన‌ ఎన్నెన్నో‌ సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ ఆ కాలంలో‌ ఇవి అంత స్థాయిలో‌ లేవు. తన ప్రజలు వ్యక్తిగత శుభ్రత విషయంలో నిష్ఠగా లేకపోతే వారు, వారి కుటుంబాలు రోగాల‌ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి  దేవుడు ఇలాంటి ఆచారాలను వారికి (ఇశ్రాయేలీయులకు) నియమించాడు. వాటికి ఇది మొదటి కారణం.

బైబిల్ దేవుడు రుతుస్రావం వచ్చిన స్త్రీలపై వివక్ష చూపించాడు అనేవారు, రుతుస్రావం శారీరకంగా అపవిత్రమైనదో కాదో వారే చెప్పాలి. అయితే ఈమధ్య కొందరు మన శరీరంలో ఒకచోట కోస్తే స్వచ్ఛంగా వచ్చే రక్తానికీ, స్త్రీలకు రుతుస్రావంలో వచ్చే రక్తానికీ ఏ తేడా ఉండదని చెబుతున్నారు (కొంచెం తేడా ఉంది). ఒకవేళ ఈ వాదన తీసుకున్నప్పటికీ  మనం చూసిన సందర్భాలలో స్వచ్ఛంగా విడుదలయ్యే వీర్యాన్ని కూడా దేవుడు అపవిత్రంగానే చెప్పాడు. ఎందుకంటే శరీరం నుండి బయటకు స్వచ్ఛంగా వచ్చిన రక్తమైనా, వీర్యమైనా కొంచెం సేపటికే పాడౌపోతాయి. గాలి చొరబడని ప్రదేశాలలో స్రవించే రక్తం ఇంకెంత తీవ్రంగా కలుషితం ఔతుందో ఆ అనుభవం ఉన్నవారికి బాగానే అర్థమౌతుంది. ఆ సమయంలో పరిశుభ్రతను పాటించకపోతే ఎటువంటి రోగాలు సంక్రమిస్తాయో గూగుల్‌ లో చెక్ చెయ్యండి.

ఇక మోషే ధర్మశాస్త్రంలో శారీరక అపవిత్రత విషయంలో‌ అటువంటి నియమాలు విధించడానికి రెండవ కారణం, మోషే ధర్మశాస్త్రంలో‌ ఇశ్రాయేలీయులకు విధించిన ఆచార సంబంధమైన ఆజ్ఞలన్నీ నూతననిబంధన విశ్వాసులకు‌ ఛాయగా ఉన్నాయి (కొలస్సీ 2:17 హెబ్రీ 10:1, 9:10). అందులో భాగంగానే వారి శరీరసంబంధమైన శుభ్రత, అపవిత్రతలు నేటి విశ్వాసుల ఆత్మీయ శుద్ధికి ఛాయగా చెప్పబడ్డాయి. అందుకే ఆ కాలంలో శరీర సంబంధమైన అపవిత్రత కలిగినవారు పరలోకానికి ఛాయగా ఉన్న దేవుని ఆలయంలో ప్రవేశించకూడదని ఆజ్ఞాపించబడ్డారు.
ఎందుకంటే నేటి విశ్వాసులు ఆత్మీయ అపవిత్రతలతో పరలోకం చేరలేరు.

హెబ్రీయులకు 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

అదేవిధంగా, ఇశ్రాయేలీయులలో శారీరక అపవిత్రత కలిగినవారినీ, వారి సామాగ్రినీ తాకినవారు కూడా అపవిత్రులు ఔతారనే మాటలు, ఇతరుల శారీరక కలుషితం వీరి శరీరాలకూ అంటుకోకూడదనే ఉద్దేశంతోనూ మరియు పరులపాపం (అపవిత్రత) లో పాలివారై యుండకూడదనే కట్టడకు కూడా ఛాయగా చెప్పబడ్డాయి.

1తిమోతికి 5: 22 - పరుల పాపములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.

అయితే ఇప్పటికీ కొన్ని సంఘాలలోని స్త్రీలు రుతుస్రావం సమయంలో చర్చికి హాజరుకాకపోవడం, బైబిల్ ని ముట్టుకోకపోవడం వంటిని చేస్తున్నారు. అటువంటి ఆచారాలు ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదు అవన్నీ కేవలం ఛాయమాత్రమే. 

"స్త్రీ సంఘంలో మౌనంగా ఎందుకుండాలి? పురుషుడిపై అధికారం ఎందుకు చలాయించకూడదు?"

1కోరింథీయులకు 14: 34, 35 - స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తలనడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.

మొదటి తిమోతికి 2:11,12 - స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

ఈ రెండు సందర్భాల్లోనూ కూడా పౌలు స్త్రీలు సంఘంలో‌ మౌనంగా ఉండాలని పురుషుడిపై అధికారం చెలాయించకూడదని చెబుతున్నాడు. ఇటువంటి మాటలు చెప్పినందుకే స్త్రీవాదులకు పౌలు అంటే విపరీతమైన ద్వేషం. కానీ ఆయన ఎందుకు‌ ఈ విధంగా చెబుతున్నాడో దానికి కారణం కూడా అక్కడే చెబుతున్నాడు చూడండి.

మొదటి తిమోతికి 2:13-15 - మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి, విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును.

బైబిల్ ప్రకారం దేవుడు మొదట పురుషుడిని సృష్టించి అతని పక్కటెముక ద్వారా స్త్రీని నిర్మించాడు, అదేవిధంగా ఆ స్త్రీ తనను సృష్టించిన దేవుని‌ అధికారం తనపై ఉండకూడదనే ఉద్దేశంతో తిరుగుబాటు చేసి అపరాధంలో పడింది. పౌలు ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకునే స్త్రీలను సంఘంలో‌ బోధించే‌ విషయంలోనూ, పురుషునిపై అధికారం‌ చేసే విషయంలోనూ మినహాయించాడు. హవ్వకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను (గర్భఫలం) అనుభవిస్తున్న స్త్రీలు ఆమె చేసిన అపరాధాన్ని బట్టి మౌనంగా ఉండాలని ఆదేశించబడడంలో ఎటువంటి అన్యాయమూ లేదు. పురుషులు‌ కూడా ఆదాము చేసిన అపరాధాన్ని బట్టి చెమటోడ్చి కుటుంబాన్ని పోషించాలని ఆదేశించబడ్డారు కదా! (ఆదికాండము 3:1-19).

ఇందులో ఏదైనా వివక్ష కానీ, స్త్రీని‌ తక్కువగా చూడడం కానీ ఉందా అనేది పరిశీలించే ముందు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అనేదాని విషయంలో కాస్త స్పష్టతను ఇస్తున్నాను. మనం పైన చూసిన కొరింథీ పత్రికలోని మాటలు సంఘ క్రమం గురించిన సందర్భంలో చెప్పబడ్డాయి. అక్కడ పౌలు స్త్రీలను సంఘంలో వాక్యోపదేశం చేసే విషయంలో మాత్రమే మినహాయిస్తున్నాడు తప్ప మౌనంగా ఉండడమంటే అసలు వాక్యపఠనం, ప్రార్థనలు కూడా చెయ్యకూడదనే అర్థం అందులో లేదు. అదేవిధంగా వ్యక్తిగత సువార్త విషయంలో, సువార్త పరిచర్యల విషయంలో స్త్రీలు మినహాయించబడలేదు. ఎందుకంటే కొందరు స్త్రీలు పౌలుతో కూడ కలసి సువార్తపరిచర్యలో పాల్గొన్నట్టు, పిస్క్రిల్ల కూడా తన భర్తతో కలసి క్రీస్తు మార్గాన్ని‌ బోధించినట్టు వాక్యంలో రాయబడింది.

అపొస్తలుల కార్యములు 18:26 - ప్రిస్కిల్ల అకులయు విని, అతని (అపొల్లోను) చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.

ఫిలిప్పీయులకు 4: 3 - అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నాయితర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడ ప్రయాస పడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి.

అదేవిధంగా ఫిలిప్పు కుమార్తెలు నలుగురు కూడా ప్రవచనవరం కలిగినవారుగా ఉన్నారు.

అపో.కార్యములు 21: 9 - కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.

కాబట్టి అక్కడ పౌలు స్త్రీలు, పురుషులు ఉన్నటువంటి సంఘంలో వాక్యోపదేశం చెయ్యడానిని మాత్రమే మినహాయించాడు తప్ప, వ్యక్తిగత సువార్త విషయంలో కాదు. వారు తమ తమ కుటుంబాలకు కూడా మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు.

కీర్తనలు 68: 11 - ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.

తీతుకు 2:4,5 - యౌవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము.

ఇక పౌలు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పడం వెనుక వివక్ష కానీ, స్త్రీ పురుషుడికంటే తక్కువదనే భావం కానీ ఏదైనా ఉందా అని పరిశీలిస్తే అది కేవలం బైబిల్ విమర్శకుల ఆపాదన మాత్రమే. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా స్త్రీపురుషులకు అప్పగించిన పాత్రలలో అసమానత ఉన్నప్పటికీ, అది వారికున్న పాత్రలలోనే అసమానత తప్ప వారికున్న విలువలో అసమానత కాదు కాబట్టి అది వివక్ష అవ్వదు. ఒకవేళ ఆయనే ఆ పనిని వారికి మినహాయించి,‌ మళ్ళీ వారు ఆ పని చెయ్యడం లేదు కాబట్టి పురుషులకంటే తక్కువవారని ఎంచుతున్నప్పటికీ, లేక ఆయన ఇచ్చే జీతం విషయంలో వారికి పురుషులకంటే తక్కువ చేస్తున్నప్పటికీ  అప్పుడు మాత్రమే అది వివక్ష ఔతుంది.

ఆయన వాక్యోపదేశం చేసే పురుషులకు ఎటువంటి జీతాన్నిస్తాడో, సంఘంలో మౌనంగా ఉండి విశ్వాసంలో ఎదుగుతున్న స్త్రీలకు కూడా అదే జీతాన్ని ఇస్తాడు. ఆయన కుటుంబాన్ని పోషించే పాత్రలో నియమించిన పురుషుడినీ, గృహపరిపాలన చేసే పాత్రలో నియమించిన స్త్రీని, ఇద్దరినీ సమానంగానే చూస్తున్నాడు ఇక‌ ఇందులో వివక్ష ఎక్కడుంది?

మొదటి కొరింథీయులకు 11:11,12 - అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.

ప్రకృతిసిద్ధంగా కూడా స్త్రీ పురుషులలో ఆయన వేరువేరు అసమానతలు పెట్టాడు. స్త్రీ గర్భం ధరించి పిల్లలను కనేట్టు పురుషుడు కనలేడు, అదేవిధంగా పురుషుడు స్త్రీని గర్భవతిని చేసేట్టు స్త్రీ పురుషుడిని గర్భవతి చెయ్యలేదు దీనిని కూడా వివక్షే అంటారా?. బైబిల్ విమర్శకులూ మరియు స్త్రీవాదులు సమస్తమైన కల్మషంతో, ద్వేషంతో నిండిపోయిన తమ మనస్సులను కాస్త శుభ్రం చేసుకుని చూస్తే మాత్రం ఇక్కడ ఎటువంటి వివక్షా కనిపించదు.

అదేవిధంగా పై భాగంలో ప్రస్తావించినబడిన వాక్యభాగాలలో మరో రెండు విషయాలకు కూడా నేను స్పష్టతనిస్తున్నాను. అందులో స్త్రీలు తమ భర్తలకు లోబడియుండాలని‌ ఉంది, అదేవిధంగా పురుషుడిపై అధికారం చెయ్యకూడదని కూడా ఉంది.

A: భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధానికి అర్థం తెలియని స్త్రీవాదులకు, స్త్రీలు తమ భర్తలకు లోబడియుండాలనే మాటలు జీర్ణం కాకపోవచ్చు, అది వివక్షగా అనిపించవచ్చు కానీ, అక్కడ చెప్పబడుతున్న లోబడడం ప్రేమకు సంబంధించిందే తప్ప‌ బానిసత్వానికి సంబంధించింది‌ కాదు. ఉదాహరణకు పిల్లలు కూడా తమ‌ తల్లితండ్రులకు‌ విధేయులైయుండాలని వాక్యం చెబుతుంది.

ఎఫెసీయులకు 6: 1 - పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.

ప్రాముఖ్యంగా తండ్రితో సమానుడైన క్రీస్తు కూడా ఆ తండ్రికి లోబడుతున్నాడు.

1కోరింథీయులకు 15: 28 - మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

ఎఫెసీయులకు 5:22-24 - స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

అదేవిధంగా తమకు లోబడే భార్యల‌ పట్ల భర్తలు కూడా ఎలా నడుచుకోవాలో వాక్యం స్పష్టంగా చెబుతుంది (తమ నేరాలు కప్పుకుంటూ, పురుషుల నేరాలపై స్త్రీవాదుల చేసే పోరాటాలలా బైబిల్ లో ఏకపక్ష ఆదేశాలు‌ ఉండవు సుమా).

ఎఫెసీయులకు 5:25-29 - పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.

1పేతురు 3: 7 - అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.

B: పురుషుడిపై స్త్రీ అధికారం చెయ్యకూడదు స్త్రీ పై పురుషుడు అధికారం చెయ్యొచ్చా? ఈ మాటలు చెబుతున్న పౌలు స్త్రీ పురుషుడిపై ఎందుకు‌ అధికారం‌ చెయ్యకూడదో ఆ క్రిందనే స్పష్టంగా వివరించాడు.

మొదటి తిమోతికి 2:12-14 - స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.

బైబిల్ బోధిస్తున్న ప్రారంభ మానవుల చరిత్ర ప్రకారం స్త్రీ ఏదేనులో దేవుని అధికారంపై తిరుగుబాటు చేసి ఆయన తినవద్దన్న పండును తిన్నాక, దానికి ప్రతిఫలంగా ప్రసవవేదనతో పాటు, తన భర్తను పరిపాలించాలనే వాంఛనూ, దానికి వ్యతిరేకంగా తన భర్తచేత పరిపాలించబడే పరిస్థితినీ తెచ్చుకుంది.

దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ లింక్ ద్వారా సూచించబడిన ఆదికాండము మూడవ అధ్యాయపు వ్యాఖ్యానం చదవండి.

ఆదికాండము 3:16 - ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

(హవ్వకు దేవుడుచ్చిన ఆశీర్వాదంలో పాలివారైన స్త్రీలు భర్తచేత పరిపాలించబడాలనే ఆమె విధిలో కూడా పాలివారవ్వడంలో అన్యాయమేమీ లేదని ఇప్పటికే జ్ఞాపకం చేసాను)

అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, బైబిల్ కోణంలో అధికారం‌ చెయ్యడమంటే వారి క్రింద ఉన్నవారిపై పెత్తనం చెలాయించడం కాదు, వారికి పరిచారం చెయ్యడం, సంరక్షించడం.

లూకా 22: 25,26 - ఆయన వారితో ఇట్లనెను అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను.

పురుషుడు తనకు లోబడే భార్యపై అధికారిగా ఉండడమంటే ఆమెను ప్రేమించి, సంరక్షించడమే అని పైన మనం చూసిన సందర్భంలో కూడా స్పష్టంగా రాయబడింది.

ఎఫెసీయులకు 5:28,29 - అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.

C: స్త్రీ తన భర్తకు లోబడుతూ, గృహపరిపాలన చేస్తూ, అధికారం చేసే స్థాయికి ఎదగకపోవడం వల్లే ఆమె పురుషుడికంటే తక్కువదనే చులకనభావం సమాజంలో ఏర్పడలేదా? స్త్రీలను అవే పాత్రలలో కొనసాగమని చెబుతున్న బైబిల్ పరోక్షంగా ఆమెను‌ తక్కువచేస్తున్నట్టే కదా?

దేవుడు స్త్రీ పురుషులను సంఘపరంగా, కుటుంబపరంగా వేరువేరు పాత్రలలో నియమించినప్పటికీ, వారు పాటించే బాధ్యతలలో అసమానతలు ఉండొచ్చు కానీ వ్యక్తులుగా ఎవరూ తక్కువ ఎక్కువలు కాదని ఇప్పటికే వివరించాను. ఉదాహరణకు కుటుంబంలో గృహపరిపాలన చేస్తూ తన భర్తనూ పిల్లలనూ సాకే భార్య లేకుంటే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటి గొప్ప పాత్రలో నియమించబడిన స్త్రీ పురుషుడికంటే తక్కువ ఎలా ఔతుంది.

ఒకవేళ ఎవరైనా స్త్రీ పాటించే పాత్రల విషయంలో ఆమెను పురుషుడికంటే తక్కువగా, చులకనగా చూస్తుంటే అది వారిలో ఉన్న జాడ్యమే తప్ప, స్త్రీలు పురుషులకంటే తక్కువగా చూపబడాలనే ఉద్దేశంతో మాత్రం దేవుడు వారిని అటువంటి పాత్రలలో నియమించలేదని గుర్తించుకోవాలి. నిద్రలేమితో బాధపడేవారికి వైద్యుడు నిద్రమాత్రలను ఇస్తూ వాటిని ఎలా వాడాలో కూడా జాగ్రతలు‌ చెబుతాడు. కొందరు అవే నిద్రమాత్రలను ఆత్మహత్యలు చేసుకోడానికీ, ఇతరులను నిద్రపుచ్చి వారిపై దాడులు చెయ్యడానికీ, కోరికలు తీర్చుకోడానికీ ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు సమస్య ఆ మాత్రలదా, వైద్యుడిదా, లేక వాటిని ఉపయోగించేవారిదా? వైద్యులు ఆ మాత్రలను కనిపెట్టిన ఉద్దేశం మంచిదే కానీ, నేరస్వభావం కలిగిన మనిషి వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు.

స్త్రీలు పాటించే పాత్రల విషయంలో కూడా గతంలో జరిగింది ఇదే. అయినప్పటికీ వారి ఆధిక్యత చెరగిపోలేదు, ఈ రోజుకూ కుటుంబంలో తండ్రికంటే తల్లినే పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తుంటారు, దానికి కారణం ఆమె చేస్తున్న గృహపరిపాలనే అని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. (వారిని‌ కనేటప్పుడు ఆమె పడిన ప్రసవవేదన గురించి తెలియని పిల్లలు కూడా ఆమె వారితో‌ గడుపుతున్న సమయాన్ని బట్టీ, తీసుకుంటున్న శ్రద్ధను బట్టీ ప్రేమిస్తుంటారు)

కాబట్టి స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని, గృహపరిపాలన చెయ్యాలని చెప్పబడడంలో ఎటువంటి వివక్షా లేదు. ఇంకా ఎవరైనా దీనిపై అతివాదన చెయ్యాలని చూస్తూ, బైబిల్ దేవుడు స్త్రీలను మాత్రమే అలాంటి పాత్రలలో ఎందుకు నియమించాడు పురుషులను నియమించొచ్చుగా అనే ప్రశ్నలు వేస్తే, నేను పైన చెప్పినదాని ప్రకారం స్త్రీలు పాటించే పాత్రలలో ఉన్న తక్కువేంటో ముందుగా చెప్పాలి. దేవుడు నిర్ణయించిన పాత్రలలో ఆయనకంటూ మంచి ఉద్దేశమే ఉన్నపుడు ఆయన ఎవరికోసమో వాటిని మార్చవలసిన అవసరం లేదు కదా?

"మగపిల్లాడు పుడితే 33 రోజులు, ఆడపిల్ల పుడితే 66 రోజుల ఎందుకు?"

లేవీయకాండము 12:2-5 - నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమె యేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కను బట్టి పురిటాలై యుండవలెను. ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనినయెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.

బైబిల్ దేవుడు స్త్రీలపై వివక్ష చూపించాడు అనేందుకు బైబిల్ విమర్శకులూ, స్త్రీవాదులూ మోషే‌ ధర్మశాస్త్రంలోని శీలపరీక్ష పద్ధతి తరువాత పరిగణలోకి తీసుకునే మరో ప్రాముఖ్యమైన సందర్భం ఇదే. మనం చూసిన ఈ వచనాలలో ఒక స్త్రీ బిడ్డను కన్న తరువాత ఆమెకు‌ కలిగే స్రావాన్ని‌ బట్టి కడగా ఉండవలసిన రోజుల గురించి చెప్పబడుతున్నాయి.

(స్రావాన్ని‌ బట్టి ఎందుకు కడగా ఉండాలో, ఆ సమయంలో వారు అపవిత్రులని‌ ఎందుకు చెప్పబడిందో రుతుస్రావం గురించిన సందర్భంలో నేను‌ వివరించడం జరిగింది)

అయితే‌ ఇక్కడ ఆమె కడగా ఉండవలసిన దినాల సంఖ్యలో మగపిల్లాడు పుట్టినప్పుడు ఒక వారం + 33 రోజులు, ఆడపిల్ల పుడితే మాత్రం రెండువారాలు + 66 రోజులు అనే‌ బేధం కనిపిస్తుంది. ఈ బేధాన్ని‌ బట్టి బైబిల్ దేవుడు స్త్రీపురుషులను కూడా అసమానంగా‌ చూస్తున్నాడ‌నీ, ఈ సంఖ్యలో ఆడపిల్ల పుట్టినపుడు ఆమె తల్లి ఎక్కువరోజులు కడగా ఉండాలి కాబట్టి ఆడపిల్ల పుట్టడాన్ని‌ ఆయన లోపంగా, తక్కువగా చేస్తున్నాడని వారు వాదిస్తుంటారు.

అయితే మనం చదివిన ఆ సందర్భంలో ఎక్కడా కూడా ఆడపిల్ల మగపిల్లాడికంటే తక్కువ కాబట్టి ఆమె‌ను కన్న తల్లి ఎక్కువదినాలు కడగా ఉండాలనే మాటలు కనిపించవు. అక్కడ అలాంటిది కనిపించప్పుడు, ఆ తల్లి ఎక్కువదినాలు కడగా ఉండాలని‌ చెప్పడంలో వేరే ఉద్దేశం కూడా ఉండియుండవచ్చుగా? ఉదాహరణకు ఆ రోజుల్లో ఆడపిల్లను కన్నతల్లిని కొందరు చులకనగా చూస్తున్నారు కాబట్టి దేవుడు ఆమెపై కరుణచూపిస్తూ ఎక్కువదినాలు విశ్రాంతిలో ఉంచాడానికే అలా చేసాడని ఎందుకు అనుకోకూడదు? (కడగా ఉన్న స్త్రీ విశ్రాంతిలోనే‌‌ ఉంటుంది). కారణమేంటో అక్కడ స్పష్టంగా రాయబడనప్పుడు బైబిల్ విమర్శకులూ, స్త్రీవాదులు దానిని‌ వివక్షకే ఎలా ఆపాదిస్తారు? ఇక్కడే మనం బైబిల్ విమర్శకుల మరియు స్త్రీవాదుల కల్మషబుద్ధిని అర్థం చేసుకోవాలి.

వారి వంకరబుద్ధికి మరో ఉదహరణ కూడా చూపిస్తున్నాను.‌ బైబిల్ లో మూడవ పుస్తకమైన లేవీకాండము 12వ అధ్యాయంలోని మాటలు‌ చదివి ఇక్కడ స్త్రీపై‌ వివక్ష ఉందంటూ హడావిడి చేస్తున్న వీరు, మొదటి పుస్తకమైన ఆదికాండము మొదటి అధ్యాయంలోనే ఉన్న మాటలు చదవకుండానే ఉన్నారా?‌ అక్కడ ఏమని రాయబడిందో‌ చూపిస్తున్నాను‌ చూడండి.

ఆదికాండము1:27 - దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

ఈ వచనంలో దేవుడు తన స్వరూపంలో స్త్రీనీ పురుషుడినీ సృజించాడని రాయబడింది. వారిద్దరూ సృజించబడిన విధానంలో తారతమ్యం‌ ఉన్నప్పటికీ వారు సమానంగా దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. దేవుని దృష్టికి‌ స్త్రీపురుషులు ఇద్దరూ సమానమే అనేదానిని ఈమాటలు నొక్కిచెబుతున్నాయి. అందుకే రక్షణ‌ విషయంలో‌ కూడా దేవుడు వారిమధ్య ఎటువంటి బేధాన్నీ చూపించలేదు.

గలతీయులకు 3:27,28 - క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

మొదటి కొరింథీయులకు 11:11 - అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు.

స్త్రీ పురుషులు సృజించబడిన విధానంలో తారతమ్యం ఉన్నప్పటికీ, వారికి నియమించబడిన పాత్రలు‌ వేరుగా ఉన్నప్పటికీ, వారిద్దరూ వ్యక్తులుగా సమానమేనని, వారికి దేవుడిచ్చే జీతం, రక్షణ ఒకటేయని‌ బైబిల్ ఇంత స్పష్టంగా బోధిస్తుంటే, ఆడపిల్లను కన్నతల్లి రెట్టింపు రోజులు కడగా ఉండాలని‌ చెప్పినంత మాత్రాన ఆయన ఆడపిల్లను తక్కువగా చూసినట్టా, స్త్రీలపై వివక్ష ఉన్నట్టా? నేను ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్టుగా  స్త్రీవాదులు స్వచ్ఛమైన బుద్ధితో‌ చదివితే అక్కడ అలాంటిదేమీ కనిపించదు. ఇంతకూ ఆడపిల్ల పుట్టినపుడు రెట్టింపు రోజులు తల్లి ఎందుకు కడగా ఉండాలో చూసేముందు మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డ మరో కట్టడను జ్ఞాపకం చేస్తున్నాను.

లేవీయకాండము 27:2-6 - నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలము యొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను. అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.

మ్రొక్కుబడికి సంబంధించిన ఈ కట్టడలో మగవాడికి ఎక్కువ వెల నిర్ణయించబడింది, ఆడదానికి తక్కువ వెల‌‌ నిర్ణయించబడింది. మగపిల్లాడు పుట్టినప్పటికంటే, ఆడపిల్ల పుట్టినపుడు ఆమె తల్లి ఎక్కువరోజులు కడగా ఉండాలి కాబట్టి బైబిల్ దేవుడు స్త్రీలపై‌ వివక్ష చూపించాడంటే, ఇక్కడ మ్రొక్కుబడిలో మగవాడు ఆడదానికంటే ఎక్కువ వెలను‌‌ చెల్లించవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఆయన మగవాళ్ళపై వివక్ష చూపిస్తున్నాడా? లేక ఇక్కడ మాత్రం బైబిల్ విమర్శకులూ, స్త్రీవాదులు వ్యతిరేక దిశలో ఆలోచించి, ఆడదానికి తక్కువవెలను నిర్ణయించాడు‌ కాబట్టి అదిగో ఇక్కడ కూడా స్త్రీలను పురుషులకంటే‌ తక్కువగా చూసాడంటారా? ఎలాగైనా బైబిల్ దేవుడుపై బురదచల్లాలి, అదేగా వారి ఆరాటం.

కానీ ఆకాలంలో స్త్రీలపై ఉన్న చులకన భావాన్ని‌ బట్టి, వారిపైనా వారి తల్లితండ్రులపైనా ఎక్కువభారం మోపకూడదనే ఉద్దేశంతోనే దేవుడు వారికి మ్రొక్కుబడి విషయంలో పురుషులకంటే తక్కువ వెలను నిర్ణయించాడు. నేనిలా చెప్పడానికి బైబిల్ దేవుడు స్త్రీ పురుషులను ఇద్దరినీ సమానంగా చూసాడనే లేఖనాలు, ఆయన ప్రజల స్థాయిని బట్టే వారిపై భారం మోపుతాడనే మరికొన్ని లేఖనాలు (బలుల విషయంలో సహా లేవీకాండము 5:7, 12:8, 14:21) ఆధారంగా ఉన్నాయి. కాదు కాదు ఆయన వివక్షలో‌ భాగంగానే ఇలాంటి తక్కువ ఎక్కువలు నిర్ణయించాడనడానికి స్త్రీవాదులకూ, బైబిల్ విమర్శకులకూ ఎలాంటి ఆధారాలున్నాయి? మనసు నిండా కల్మషం, ద్వేషం తప్ప (అయినా స్త్రీవాదులకు అనుకూలమైన మినహాయింపులంటే మక్కువేగా అందుకేగా స్త్రీలు ఎలాంటి తీవ్రమైన నేరం చేసినప్పటికీ వారిని పురుషులతో సమానంగా శిక్షించడాన్ని జీర్ణించుకోలేరు, ఆ  క్రూరచర్యలకు ఏదోలా కారణాలను చూపించి  నేరం చేసిన స్త్రీలను సమర్థించాలని చూస్తుంటారు. ఇలాంటి విషయాల్లో మాత్రం సమానత్వం వద్దు వీరికి).

ఇక విషయంలోనికి వెళ్తే, "శాస్త్రీయపరంగా ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమెను‌ కన్న తల్లికి మాత్రమే కాదు ఆ చిన్న బిడ్డకు కూడా 2-10 రోజులవరకూ గులాబీ రంగులో స్రావం ఔతుంది దీనిని Newborn vaginal bleeding అంటారు".
దీనికి సంబంధించి Seattle children's వారు విడుదల చేసిన వ్యాసం లింక్ ఇక్కడ పెడుతున్నాను చూడండి.

Vaginal Bleeding

ఇటువంటిది మగపిల్లాడికి ఉండదు కాబట్టి అతని తల్లికి మాత్రమే కలిగే స్రావాన్ని‌ బట్టి ఆమెను ఒక వారం + 33 రోజులు కడగా ఉన్నమన్నాడు. ఆడపిల్ల పుట్టినపుడు ఆ బిడ్డకూ + ఆమె తల్లికీ కూడా కలిగే స్రావాన్ని బట్టి ఆ రోజుల సంఖ్యను రెట్టింపు చేసాడు. ఇటువంటి ఆచారాలు ఇశ్రాయేలీయులకు వ్యక్తిగత శుభ్రత విషయంలో నిష్టను నేర్పించడానికీ, మరియు నూత‌న నిబంధన విశ్వాసుల ఆత్మీయ శుద్ధికి కూడా ఛాయగా చెప్పబడ్డాయని రుతుస్రావం గురించిన సందర్భంలో వివరించాను. కాబట్టి‌ ఇందులో స్త్రీపై చూపబడిన వివక్ష ఏమీ లేదు.

అయితే ఇక్కడ పుట్టిన ఆడపిల్లకు 2-10 రోజులలోపు మాత్రమే స్రావం అయితే ఆరోజులు మాత్రమే కాకుండా రెండువారాలు + 66 రోజులవరకూ ఎందుకు కడగా ఉండాలనే ప్రశ్నతలెత్తవచ్చు. కానీ, మోషే ధర్మశాస్త్రంలోని ఈ అపవిత్రతలకు సంబంధించిన ఆచారాలను మనం పరిశీలించినప్పుడు దాని తీవ్రతను వివరించడానికి శరీరం శుభ్రమైన తరువాత కూడా కొంత సమయం వరకూ వారిని అపవిత్రులుగానే పరిగణించడం మనకు కనిపిస్తుంది.

ఉదాహరణకు;
లేవీయకాండము 15:16,17 - ఒకనికి వీర్యస్ఖలనమైన యెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును.

ఈ సందర్భంలో వీర్యస్ఖలనం అయిన వ్యక్తి తన శరీరాన్ని శుభ్రపరచుకున్న తరువాత కూడా సాయంకాలం వరకూ అపవిత్రుడే అని రాయబడింది.‌ నీళ్ళతో‌ ఉదకబడిన అతని వస్త్రాలు కూడా అలానే పరిగణించబడ్డాయి.

లేవీయకాండము 15:18 - వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులై యుందురు.

ఈ సందర్భంలో భార్యభర్తలు, కలయిక తర్వాత స్నానం చేసినా కూడా సాయంకాలం వరకూ‌ అపవిత్రులుగానే పరిగణించబడ్డారు.

లేవీయకాండము 15:19 - స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన యెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరు సాయంకాలము వరకు అపవిత్రులగుదురు.

ఈ సందర్భంలో రుతుస్రావం సమయంలో స్త్రీ 7 రోజులు అపవిత్రురాలని చెప్పబడింది. కానీ దాదాపుగా స్త్రీలకు అన్ని రోజులు రుతుస్రావం అవ్వదు. కొందరికి తెలుపు స్రావం సమస్య ఉన్నప్పటికీ అది ఏడో రోజు వరకూ అవ్వకపోవచ్చు. కానీ దేవుడు అపవిత్రతల తీవ్రతను చూపించడానికే అక్కడ ఎక్కువ సమయాన్ని నిర్ణయించాడు. ఇవి నూతననిబంధన విశ్వాసుల ఆత్మీయ‌శుద్ధికి కూడా ఛాయగా విధించబడ్డాయి కాబట్టి, వాటిని చదివినప్పుడు మన ఆత్మకు కలిగే అపవిత్రత (పాపం) కారణంగా దాని విషయంలో మనం పశ్చాత్తాపపడినప్పటికీ కొన్నిసార్లు దాని పర్యవసానం చాలాకాలం కొనసాగుతుందని గుర్తిస్తాం. ఇందులో భాగంగానే ఆడపిల్లను కన్నతల్లి ఆ బిడ్డకు కూడా కలిగిన స్రావాన్ని బట్టి అది నిలిచిపోయాక కూడా రెట్టింపు రోజులు కడగా ఉండవలసి వచ్చింది.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.