బైబిల్ లో ఉన్న యెహోవా, ఖురాన్ లో ఉన్న అల్లాహ్, ఇద్దరూ ఒక్కరేనా లేక వేరు వేరా? యెహోవా - అల్లాహ్, ఇద్దరూ ఒక్కరే అని ముస్లింలు చాలా బలంగా విశ్వసిస్తారు. ఎందుకంటే, బైబిల్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడి పేరు యెహోవా. అలాగే ఖురాన్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడి పేరు అల్లాహ్. అందువలన ముస్లింలకు వేరే మార్గం లేదు. అల్లాహ్, యెహోవా ఇద్దరూ ఒక్కరే అని వారు మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి మూడు భిన్న వాదనలను ఈ రోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా, ప్రముఖ ముస్లిం మతప్రచారకుడు డాక్టర్ షబ్బీర్ అలీ గారి వాదన ఏమిటో చూద్దాం.
షబ్బీర్ అలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు:
"బైబిల్ ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు. ఇంకో దేవుడు లేడు. ఖురాన్ కూడా అబ్రహాము దేవుడు, అంటే బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెబుతుంది. కాబట్టి ఖురాన్ లో ఉన్న దేవుడు బైబిల్ లో ఉన్న దేవుడు ఇద్దరూ ఒక్కటే. ఖురాన్ లో దేవుడిని అల్లాహ్ అని అంటారు. అల్లాహ్ అనేది అరబిక్ భాషలో దేవుని పేరు. అరబిక్ భాష మాట్లాడే యూదులు, క్రైస్తవులు కూడా దేవుడిని అల్లాహ్ అనే పేరుతోనే పిలుస్తారు. నిజానికి అరబిక్ బైబిల్ లో కూడా అల్లాహ్ అనే పదాన్ని వాడారు. కాకపోతే యెహోవా అనే పదానికి బదులుగా కాదు కాని, “ఎలోహీమ్” అనే హీబ్రూ పదాన్ని అల్లాహ్ అని తర్జుమా చేశారు. ఖురాన్ చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటి అంటే, ముస్లిములు, క్రైస్తవులు మరియు యూదుల దగ్గరికి వెళ్లి, మీ దేవుడు మరియు మా దేవుడు ఇద్దరూ ఒక్కరే అని చెప్పాలి. కేవలం ఒక్కడే దేవుడు ఉన్నాడు అని ఖురాన్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఆ దేవుడు ఇంకెవరో కాదు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే నిజమైన దేవుడు అని కూడా ఖురాన్ గుర్తిస్తుంది. ఈ దేవుడినే, అంటే బైబిల్ దేవుడినే ఆరాధించాలి అని ఖురాన్ మనల్ని ఆదేశిస్తోంది" అని షబ్బీర్ అలీ గారు చెప్పారు.
ఇక్కడ నేను షబ్బీర్ అలీ గారితో ఒక విషయంలో ఏకీభవిస్తాను. అదేమిటంటే, కేవలం ఒక్కడే దేవుడు ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే నిజమైన దేవుడు. అందరూ కూడా యెహోవానే ఆరాధించాలి. ఈ విషయంలో నేను షబ్బీర్ అలీ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే, ఖురాన్ కూడా అబ్రహాము దేవుడే నిజమైన దేవుడు అని చెబుతుంది కాబట్టి, యెహోవా అల్లాహ్ ఇద్దరూ ఒక్కటే అనే వాదన సరైన వాదన కాదు. ఎందుకంటే, బైబిల్ లో ఉన్న చాలా మంది వ్యక్తుల పేర్లు ఖురాన్ లో కనిపిస్తాయి కానీ, బైబిల్ లో చెప్పబడిన వివరాలతో పోలిస్తే ఖురాన్ లోని విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అంతే కాకుండా బైబిల్ లో దేవుడి పేరు యెహోవా. కానీ ఖురాన్ లో దేవుడి పేరు అల్లాహ్. యెహోవా అనే పదాన్ని ఖురాన్ లో ఒక్కసారి కూడా ఉపయోగించలేదు. అయితే, ఇక్కడ షబ్బీర్ అలీ గారి వాదన ఏమిటంటే, అరబిక్ భాష మాట్లాడే యూదులు, క్రైస్తవులు కూడా దేవుడిని అల్లాహ్ అనే పేరుతోనే పిలుస్తారని, అరబిక్ బైబిల్ లో కూడా అల్లాహ్ అనే పదాన్ని వాడారనీ, అందువల్ల యెహోవా అల్లాహ్ ఒక్కరే అనేది వారి వాదన.
పైకి చూడటానికి ఈ వాదన హేతుబద్దంగానే ఉన్నప్పటికీ, ఈ వాదనలో ఉన్న లోపాల గురించి మనకి తెలియాలంటే, మనకి ముందుగా అల్లాహ్ అనే పదం గురించి, అలాగే అల్లాహ్ అనే పదాన్ని అరబిక్ బైబిల్ లో ఎందుకు వాడారు, ఏ విధంగా వాడారు అనే విషయాల గురించి కొంత అవగాహన ఉండాలి. ఇప్పుడు హిందీ మాట్లాడే క్రైస్తవులు దేవుడిని “పరమేశ్వర్” అని అంటారు. హిందీ బైబిల్ లో కూడా పరమేశ్వర్ అనే పదాన్ని వాడారు. హిందీ మాట్లాడే హిందువులు కూడా తమ దేవుడిని పరమేశ్వర్ అనే అంటారు. మరింత స్పష్టత కోసం మరొక ఉదాహరణ చెబుతాను చూడండి. తెలుగు మాట్లాడే క్రైస్తవులు దేవుడిని “దేవుడు” అని అంటారు. తెలుగు బైబిల్ లో కూడా దేవుడు అనే పదాన్ని వాడారు. తెలుగు మాట్లాడే హిందువులు కూడా తమ దేవుళ్ళని దేవుడు అనే అంటారు. అంత మాత్రాన, బైబిల్ లో ఉన్న యెహోవా, హిందువుల దేవుళ్ళు అంతా ఒక్కటే అని ఎవరైనా అంటారా? అనరు కదా!!! కానీ, మన షబ్బీర్ అలీ గారు చెప్పింది ఇలాగే ఉంది. ఎందుకంటే, “אל (ఎల్)”, “אלוה (ఎలోహ)”, “אלוהים (ఎలోహీమ్)”, "God", "పరమేశ్వర్", "దేవుడు" - అనే పదాలు “Proper Personal Names” కాదు. వీటిని “Common Nouns” అంటారు. "ఎలోహీమ్" అనే హీబ్రూ పదాన్ని, ఇంగ్లీష్ బైబిల్ లో “God” అని, హిందీ బైబిల్ లో “పరమేశ్వర్” అని, తెలుగు బైబిల్ లో “దేవుడు” అని ఏ విధంగా అయితే తర్జుమా చేశారో, అదే విధంగా అరబిక్ బైబిల్ లో “అల్లాహ్” అని తర్జుమా చేశారు.
అయితే, ఇక్కడ మన ముస్లిం సోదరులు ఒక అభ్యంతరం లేవనెత్తుతారు. అదేమిటంటే, Common Noun అయిన “దేవుడు” అనే పదాన్ని వాడటానికి అరబిక్ భాషలో “إله (ఇలాహ్)” అనే మరొక పదం ఉంది. కాబట్టి అల్లాహ్ అనేది Common Noun కాదు, అది Proper Personal Name అని వారు వాదిస్తారు. ఈ విషయం గురించి స్పష్టంగా తెలియాలంటే మనం అల్లాహ్ అనే పదం యొక్క “etymology” ని పరిశీలించాలి. హీబ్రూ భాషలో “ఎల్” లేదా “ఎలోహ” అంటే “దేవుడు” అని అర్ధం. ఇదే పదాన్ని “అరామిక్” భాషలో “אלה (ఎలాహ్)” అని అంటారు. అరామిక్ భాష నుండే “అరబిక్” భాష వచ్చింది. అరబిక్ భాషలో ఈ పదాన్ని “ఇలాహ్” అని అంటారు. కాబట్టి, అరబిక్ భాషలో “ఇలాహ్” అంటే దేవుడు అని అర్ధం. భాష ఏదయినా కానీ, ఆయా సందర్భాన్ని బట్టి, దేవుడు అనే పదాన్ని వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. నిజ దేవుడిని ఉద్దేశించి వాడొచ్చు, లేదా ఒక విగ్రహాన్ని కానీ, లేదా ఒక రాయిని కానీ, ఒక చెట్టుని కానీ, లేదా మనుషులు పూజించే ఏదయినా ఒక వస్తువుని ఉద్దేశించి దేవుడు అనే పదం వాడొచ్చు. అయితే, monotheistic religions లో “false gods” నుండి “True Living God” ని వేరు చేసి చెప్పడానికి, లేదా తాము ఏ దేవుడినైతే నిజ దేవుడు అని నమ్ముతున్నారో, ఆ దేవుడి గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఆ విషయం చదివేవారికి, వినేవారికి కూడా స్పష్టంగా అర్ధం అవ్వడం కోసం రకరకాల పద్ధతులు వాడతారు. అందులో ఒక పద్దతి “definite article” ని వాడటం. ఇంగ్లీష్ భాషలో అయితే, “the” అనే పదాన్ని definite articleగా వాడతారు. అలాగే హీబ్రూ భాషలో అయితే, “ה (హ)” అనే పదాన్ని definite article గా వాడతారు. “The God” లేదా “ה אלוהים (హ ఎలోహీమ్)” అని అన్నప్పుడు, బైబిల్ పరిభాషలో నిజదేవుడైన యెహోవాని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని మనకి అర్ధం అవుతుంది. అదే విధంగా, అరబిక్ భాషలో “అల్” అనే పదాన్ని definite article గా వాడతారు. “ال(అల్)” మరియు “إله(ఇలాహ్)” అనే రెండు పదాలని కలిపితే మనకి “الله(అల్లాహ్)” అనే పదం వస్తుంది. కాబట్టి అల్లాహ్ అంటే “The God” అని అర్ధం. ఏ దేవుడైతే నిజ దేవుడు అని ఖురాన్ ప్రకటిస్తూ ఉందో, ఆ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఖురాన్ లో అల్లాహ్ అనే పదాన్ని వాడారు. “The God” అన్నా, “హ ఎలోహీమ్” అన్నా లేదా “అల్లాహ్” అన్నా... ఇవన్నీ కూడా Common Nouns యే కానీ, Proper Personal Names కాదు. బైబిల్ లో దేవుడు, నా పేరు “యెహోవా” అని చాలా స్పష్టంగా చెప్పాడు. యెహోవా అనే పదం బైబిల్ లో సుమారు ఏడువేల సార్లు వాడారు. అరబిక్ బైబిల్ లో సైతం మనకు యెహోవా అనే పదం కనిపిస్తుంది. ఒకవేళ యెహోవా అల్లాహ్ ఇద్దరూ ఒక్కటే అయ్యుంటే గనుక, ఖురాన్ మొత్తంలో ఒక్కసారి కూడా తన పేరు యెహోవా అని ఖురాన్ దేవుడు ఎందుకు చెప్పలేదు అనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్న.
అంతే కాకుండా, ఇస్లాం పుట్టకముందు, మొహమ్మద్ ప్రవక్త పుట్టక ముందు, అరేబియా ప్రాంతంలో పరిఢవిల్లిన ఇతర మాతాలలోని దేవుళ్ళని కూడా “అల్లాహ్” అనే పేరుతో పిలిచేవారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. The Oxford Handbook Of Late Antiquity అనే పుస్తకంలో అరేబియా ప్రాంతం యొక్క చరిత్రకు సంబంధించి అనేక విషయాలను మనం చూడొచ్చు. ఈ పుస్తకంలోని విషయాల ప్రకారం, ఇస్లాం అనేది ఆవిర్భవించక ముందు అరేబియా ప్రాంతంలో బహుదేవతారాధన ఉండేది. కొన్ని తెగలవారు ఆరాధించే దేవీదేవతల్లో ఒక దేవుడి పేరు అల్లాహ్. బహుశా వారు పూజించే దేవుళ్లందరికి అధిపతి అయిన పెద్ద దేవుడిని ఉద్దేశించి అల్లాహ్ అనే పదం వాడి ఉండవచ్చు.
కాబట్టి, అరబిక్ భాష మాట్లాడే యూదులు క్రైస్తవులు, అల్లాహ్ అనే పదాన్ని ఒక Common Noun లాగా వాడతారు కానీ, Proper Personal Name లాగా వాడరు. కానీ, మన ముస్లిం సోదరులు మాత్రం అల్లాహ్ అనే పదాన్ని Proper Noun లాగ వాడుతూ, వాళ్ళు confuse అవ్వడమే కాకుండా అందరినీ confuse చేస్తూ ఉంటారు. వాళ్లు ఎంతగా confuse అయ్యారంటే, ఒకసారి షేక్ జలాల్ గారి మాటలు వింటే మీకే అర్ధం అవుతుంది.
షేక్ జలాల్ గారు ఒక ఇస్లామిక్ స్కాలర్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, Common Noun అయిన “God” అనే ఇంగ్లీష్ పదాన్ని కూడా వారు Proper Personal Name లాగా వ్యవహరించారు. హీబ్రూ బైబిల్ లో “God” అనే పదం లేదు, కానీ క్రైస్తవులు మాత్రం తమ దేవుడిని “God” అనే పేరుతో పిలుస్తున్నారు అనేది వీరి ఆరోపణ. పదిహేనవ శతాబ్దంలో క్రైస్తవులు బైబిల్ ని జర్మనీ మరియు ఇతర ఐరోపా భాషలలోకి అనువదించేటప్పుడు “God” అనే కొత్త పేరుని తీసుకునివచ్చారట.
అసలు “God” అనే ఇంగ్లీష్ పదం హీబ్రూ బైబిల్ లో ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? హీబ్రూ బైబిల్ లో “ఎలోహీమ్” అనే పదం ఉంటుంది. దానిని ఇంగ్లీష్ భాషలోకి “God” అని తర్జుమా చేస్తారు. ఎందుకంటే “ఎలోహీమ్” అనే పదం Proper Personal Name కాదు, అది ఒక Common Noun కాబట్టి. ఈ మాత్రం అవగాహన లేనివారు, పుస్తకాలు రాస్తూ కెమెరాల ముందు కూర్చుని ఏవేవో మాట్లాడుతున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యంతో పాటు దిగ్భ్రాంతి కూడా కలుగుతుంది.
ఇక్కడ షేక్ జలాల్ గారు ఒక పచ్చి అబద్దం కూడా చెప్పారు. అదేమిటంటే, అల్లాహ్ అనే పదంలోని అక్షరాలనే కొంచెం అటుఇటు మార్చితే యెహోవా అనే పదం వస్తుందంట. కాబట్టి, యెహోవా అన్నా అల్లాహ్ అన్నా ఒక్కటే అని వీరు తీర్మానించారు. ఇది ఎంత పచ్చి అబద్దమో చూడండి. యెహోవా అనే పదంలో నాలుగు అక్షరాలు ఉంటాయి. అవి యుద్-హే-వావ్-హే (יהוה). అల్లాహ్ అనే పదంలో ఆలిఫ్-లామ్-లామ్-హ అనే అక్షరాలు ఉంటాయి. మరి అల్లాహ్ అనే పదంలోని అక్షరాలను అటుఇటు మారిస్తే యెహోవా అనే పదం ఎలా వస్తుంది?
ఎలోహీమ్ అన్నా అల్లాహ్ అన్నా ఒక్కటే కాబట్టి, యెహోవా అల్లాహ్ ఇద్దరూ ఒక్కటే అని షబ్బీర్ అలీ గారు చెప్పే ప్రయత్నం చేస్తే, అసలు యెహోవా అన్నా అల్లాహ్ అన్నా ఒక్కటే అని షేక్ జలాల్ గారు బుకాయించే ప్రయత్నం చేశారు. ఇక జనాబ్ రఫీ ఖాన్ అనే మరొక ముస్లిం మత ప్రచారకుడు అయితే ఏకంగా బైబిల్ లో యెహోవా అనే పదమే లేదు అని ఒక వింతయిన కొత్త వాదనను తెర మీదకు తెచ్చారు.
ఒక పబ్లిక్ డిబేట్ లో జనాబ్ రఫీ ఖాన్ గారు మాట్లాడుతూ, “క్రీస్తు శకం మూడు నాలుగు శతాబ్దాలకు చెందిన “Septuagint Codex” లో అసలు యెహోవా అనే పేరే లేదు... తరువాత ఎప్పుడో పది పదకొండు శతాబ్దాలకు చెందిన “Aleppo Codex” మరియు “Leningrad Codex” లో యెహోవా అనే పదాన్ని కొత్తగా చేర్చారు” అని ఒక ఆరోపణ చేశారు. వాస్తవానికి Septuagint అనేది manuscript పేరు కాదు. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో హీబ్రూ భాషలో ఉన్న లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. 70 మంది యూదా పండితులు కలిసి చేసిన తర్జుమా కాబట్టి, దానిని Septuagint అంటారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు రెండువేల పైచిలుకు mansuscripts లభ్యమయ్యాయి. వీటిలో, మూడవ శతాబ్దం తరువాతి కాలానికి చెందిన గ్రీకు manuscripts లో యెహోవా అనే పదానికి బదులు “కిరియోస్” అనే పదం వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే, దేవుని నామాన్ని వ్యర్థముగా పలుకరాదు అనే యూదా సంప్రదాయాన్ని అనుసరించి యెహోవా అనే పదానికి బదులు కిరియోస్ అనే పదం వాడేవారు. కిరియోస్ అనే గ్రీకు పదానికి “ప్రభువు” అని అర్ధం. అయితే ఎక్కువ శాతం గ్రీకు manuscripts లో Theos (దేవుడు), Kyrios (ప్రభువు), Iesus (యేసు), Kristos (క్రీస్తు) అనే ఈ నాలుగు పదాలను పూర్తిగా రాయకుండా abbreviated form లో అంటే మొదటి అక్షరం మరియు చివరి అక్షరం మాత్రమే రాసి, పైన ఒక గీత గీసేవారు. ఉదాహరణకు, క్రింద ఉన్న manuscript ని చూడండి. ఇది క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందిన “Codex Sinaiticus” అనే manuscript లోని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే, అయిదవ లైన్లోని మొదటి రెండు అక్షరాలు, KY అని రాసి పైన ఒక గీత గీశారు. ఇది ΚΥΡΙΟΥ (కిరియో) అనే పదానికి abbreviated form. అలాగే ఏడవ లైన్లో abbreviated form లో ఉన్న ΘΕΟΥ (థియో) అనే పదాన్ని కూడా మీరు చూడొచ్చు.
ఇక మూడవ శతాబ్దం కంటే ముందు ఉన్న గ్రీకు manuscripts లో అయితే, యెహోవా అనే పదాన్ని ఉన్నది ఉన్నట్లుగా Paleo - Hebrew Script లో రాసేవారు. ఇక్కడ క్రింద ఉన్న Papyrus Fragment క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి చెందినది. ఇందులో, యోబు గ్రంథం 42వ అధ్యాయానికి సంబంధించిన వాక్యభాగం ఉంది. ఇక్కడ అక్షరాలన్నీ గ్రీకు భాషలో ఉన్నప్పటికీ, యెహోవా అనే పదాన్ని మాత్రం హీబ్రూ భాషలో రాయడాన్ని మీరు గమనించవచ్చు.
అలాగే, Nahal Hever అనే ఒక నదీ పరివాహక ప్రాంతంలో గ్రీకు భాషలో ఉన్న కొన్ని manuscript fragments దొరికాయి. ఇవి, క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దానికి చెందినవి. ఇక్కడ క్రింద ఉన్న manuscript fragment హబక్కూకు గ్రంథంలోని ఒక వాక్యభాగం. ఇందులో కూడా అక్షరాలన్నీ గ్రీకు భాషలో ఉన్నప్పటికీ, యెహోవా అనే పదాన్ని మాత్రం హీబ్రూ భాషలో రాశారు.
ఇంకొంచెం ముందుకు వెళితే, క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన Dead Sea Scrolls లో కూడా యెహోవా అనే పదాన్ని Paleo-Hebrew Script లో రాశారు. ఇక్కడ క్రింద ఉన్నది Qumran Caves లోని పదకొండవ గుహలో దొరికిన కీర్తనల గ్రంథానికి సంబంధించిన ఒక scroll.
ఇంకొంచెం ముందుకు వెళితే, Ketef Hinnom Amulets అని కొన్ని ఉన్నాయి. Amulet అంటే ఒక చిన్న గొలుసులాంటిది. వెండి రేకులను ఒక చుట్టలాగా చుట్టి గొలుసులకి ఒక లాకెట్ లాగా ఉంచిన రెండు Amulets ని Ketef Hinnom Valley లో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందినవి.
పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ వెండి రేకులను తెరిచి చూడగా, వాటి మీద హీబ్రూ భాషలో సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం 24 నుండి 26 వచనాలలో ఉన్న Priestly Benediction ఉంది. ఈ వాక్యాలు మనందరికీ సుపరిచితమే. ప్రతి ఆదివారం చర్చిలో పాస్టర్ గారు మనల్ని ఆశీర్వదిస్తూ చెప్పే మాటలు.
“యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;
యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ” అనే వాక్యాలు, ఆ వెండి రేకులలో ఉన్నాయి. ఒక వెండి రేకు మీద పన్నెండవ లైనులో, పదిహేనవ
లైనులో, ఇంకా పదిహేడవ లైనులో మొత్తం మూడు సార్లు యెహోవా అనే పదాన్ని మనం చూడొచ్చు. అలాగే రెండవ వెండి రేకు మీద కూడా రెండు, ఆరు, ఇంకా ఎనిమిదవ లైన్లలో మొత్తం మూడు సార్లు యెహోవా అనే పదాన్ని మనం చూడొచ్చు.
ఇవి కాకుండా ఇంకా ఎన్నో పురాతన శాసనాల మీద యెహోవా అనే పదం ఉంది. ఈ పదానికి ఇంత చరిత్ర ఉంటే, మన జనాబ్ రఫీ ఖాన్ గారు మాత్రం కేవలం పది పదకొండు శతాబ్దాలలోనే యెహోవా అనే పేరుని కొత్తగా సృష్టించారు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే, క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాలలో యెహోవా అనే పదం నుండి కిరియోస్ అనే పదానికి మారుతూ ఉన్న సమయంలో, అక్కడ ఏ పదం రాయాలో తేల్చుకోలేక కొంత మంది scribes అక్కడ ఖాళీ వదిలిపెట్టారు. ఇలాంటి కొన్ని manuscripts ని పరిగణనలోకి తీసుకున్న జనాబ్ రఫీ ఖాన్ గారు, ఆ తరువాతి కాలానికి, ఇంకా ముందు కాలానికి చెందిన manu-scripts ని కావాలనే విస్మరించారు అనిపిస్తోంది.
కాబట్టి మిత్రులారా, అబ్రహాము దేవుడి పేరు ముమ్మాటికీ యెహోవానే. అల్లాహ్ కానే కాదు. యెహోవా అల్లాహ్ ఇద్దరూ ఒక్కటే అని మిమ్మల్ని నమ్మబలికేవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి మాయ మాటలను నమ్మి మీరు మోసపోకండి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments
దేవుడు మీ ప్రయాస ను { పరిచర్యను } ఇంకనూ ఆశీర్వదించును గాక... ఆమేన్ ఆమేన్ ఆమేన్