విమర్శలకు జవాబు

చదవడానికి పట్టే సమయం: 1 గంట 34 నిమిషాలు

Article Release long jesuscross auth min

పరిచయం

ఆగష్టు 1981 లో సౌత్ ఆఫ్రికా లోని డర్బన్ నగరంలో జోష్ మేక్డోవెల్ మరియు అహ్మద్ దీదాత్ మధ్య “క్రీస్తు సిలువ వేయబడ్డాడా” అనే అంశం మీద ఒక డిబేట్ (వాద ప్రతివాద కార్యక్రమం) జరిగింది.

ఆ  వాదప్రతివాదంలో  వారి మాటలను ఉన్నదున్నట్లుగా  తెలుగులో అనువాదం చేసిన ఒక ప్రతి మాకు దొరికింది. దానిని ఈ విధంగా  మీకు అందించగలిగేలా కృషి చేసిన వారందరిని ప్రభువు దీవించునుగాక.

ఈ  వాద ప్రతివాదంలో మూడు భాగాలుంటాయి. మొదట 50 నిమిషాల చొప్పున ఇరువురు వక్తలు చేసిన ప్రారంభవాదాలుంటాయి. తరువాత 10 నిమిషాల చొప్పున ఇరువురు చేసిన ప్రతివాదాలుంటాయి . చివరిగా 3 నిమిషాల చొప్పున ఇరువురు చెప్పిన ముగింపు సందేశాలుంటాయి.

క్రీస్తు సిలువ మరణంపై క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచి, దానిపై ఆధారపడిన సువార్త మన ముస్లిం మిత్రులు గ్రహించులాగున ఈ చిరు ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తే మాకంతే చాలు.

 ఈ ఒరిజినల్ డిబేట్ ఆంగ్లంలో వీక్షించాలి అనుకున్నవారు, ఇక్కడ ఇవ్వబడిన లింక్ ను https://youtu.be/cgUnalaJoTs ) క్లిక్ చేయగలరు.

విషయసూచిక

క్రీస్తు సిలువ వేయబడ్డాడా?

ప్రారంభవాదం-50 నిమిషాలు 

అహ్మద్ దీదాత్

మిస్టర్ చైర్మన్: లేడీస్ అండ్ జంటిల్మెన్: సిలువ వేయటమనే విషయాన్ని గురించి దేవుని చివరి గ్రంథమైన ప్రవిత్ర ఖురాన్ ముస్లిములకు ఆయన్ని వారు చంపలేదని, ఆయన్ని సిలువ వేయలేదని ఖచ్చితంగా చెబుతున్నది. కాని వారి కళ్లకు అలా కనబడింది. వాళ్ళు కేవలం ఊహాలను, తమకు తోచిన విషయాలను అనుసరిస్తున్నారు. నిజానికి వారు క్రీస్తును సిలువ వేయలేదు.

మిస్టర్ చైర్మన్, లేడీస్ అండ్ జంటిల్మెన్! ఎవరైనా ఇంత కంటే స్పష్టంగా ఇంతకంటే గట్టిగా, ఇంతకంటే మొండిగా ఈ నమ్మకాన్ని గురించి చెప్పగలరా? అలా చెప్పగలిగే అర్హత ఈ సృష్టికి ప్రభువు, సర్వజ్ఞుడు అయిన వానికే ఉంది.

ఈ అధికారపూర్వకమైన సందేశాన్ని ముస్లిం దేవుని సత్యవాక్కుగా విశ్వసిస్తాడు. అందువలన అతను ఎలాంటి ప్రశ్నలు అడగడు, ఋజువు కొరడు. “అక్కడ నా ప్రభువు మాటలున్నాయి, వాటిని నేను నమ్ముతాను, నిజమని నిశ్చయపరచుకుంటాను” అని అతను అంటాడు. కాని మన గౌరవనీయ అతిధిగారి మాటల్లో క్రైస్తవుడు ఎదురు సమాధానం ఇస్తాడు డాన్ స్టువర్డ్ తో కలిసి జోష్ మేక్దోవెల్ వ్రాసిన "కఠిన ప్రశ్నలకు జవాబులు” అనే పుస్తకం 116,117 పేజీలలో ముస్లిం రాజీపడని సందేశం పట్ల క్రైస్తవుని వైఖరి వివరంగా ఉంది. “అహ్మదుగారు చెప్పే వృత్తాంతాన్ని అంగీకరించటంలో పెద్ద సమస్య ఏమిటంటే అతని సాక్ష్యం అసలు సంఘటన జరిగిన 600 ఏళ్ల తరువాతది. క్రొత్త నిబంధనలోనైతే యేసుక్రీస్తు జీవితం, సేవల గురించి కళ్ళారా చూచిన వారి సాక్ష్యమే ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే యెరూషలేములో సిలువ సంఘటన జరిగిన స్థలానికి వెయ్యి మైళ దూరంలో 600ఏళ్ళ ఎడంలో ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోగలుగుతాడు? ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని మాటలు అని ముస్లిం జవాబిస్తాడు. అందువలన ఏం జరిగిందో దేవునికి తెలుసు. క్రైస్తవుడు సహాజంగా కారణం ఎరిగి ఖురాన్ దేవుని వాక్యమని అంగీకరిస్తే మన మధ్య తగాదాయే ఉండదు, పైగా మనమంతా ముస్లిములమే అవుతాము.

హోలీ బైబిల్ ముఖ్యంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో జరిగిన సంఘటనలను కళ్ళారా చూచిన, చెవులారా విన్న సాక్ష్యాలున్నాయి. సిలువను గురించిన ఊహ ఇది : రెండువేల ఏళ్ల క్రితం యేసు క్రీస్తును యూదులు సిలువవేసి చంపారట ఆ విధంగా యేసును చంపిన పాపము యూదులదే. ఆయన్ని వారు చంపనూలేదు. సిలువ వేయనూ లేదు గనుక యూదులు నిరపరాధులు అని ముస్లిములు నమ్ముతారు. ఆ ప్రకారంగా క్రైస్తవులు మోపుతున్న ఈ అభియోగంలోనేను యూదులను సమర్థించే హక్కు నాకు ఖురాన్ ఇచ్చింది. ఈ రోజు నేను యూదులను సమర్థించబోతున్నాను. ఎందుకంటే వారు నా దాయాదులని కాదు, కేవలం న్యాయం జరగాలి గనుకనే. యూదులతో మాకు వేరే విభేదాలున్నాయి. అది వేరే విషయం. ఈ మధ్యాహ్నం నా దాయాదులైన యూదులకు న్యాయం జరిగేలా నా శక్తి కొద్ది కృషి చేస్తాను.

ఇప్పుడు ఈ వాదంలో, ఈ తర్కంలో, ఈ చర్చలో జోష్ మేక్దోవెల్ యూదుల మీద ఫిర్యాదు దారుడుగా ఉండగా నేను వారి తరపున ప్రతివాదిగా ఉన్నాను. మరి మీరు న్యాయ నిర్ణేతలైన స్త్రీ పురుషులైయున్నారు. అందువలన మీరు సరిగ్గా కూర్చుని తీరికగా చివరలో మీకు మీరే మీ అంతరాత్మకు మీరే తీర్పు చెప్పుకొండి. క్రైస్తవులు మోపుతున్న అభియోగంలో యూదులు నిజంగా ముద్దాయిలేనా కాదా అని నిర్ధారించుకొండి.

ఇప్పుడు అసలు విషయానికొస్తాను. యూదుల తరపున ప్రతివాదిగా యూదులకు వ్యతిరేకంగా దాఖలు చేయబడిన ఈ వ్యాజ్యాన్ని కేవలం రెండు నిమిషాల్లో కొట్టివేయించగలను. ప్రపంచలోని ఏ నాగరిక దేశంలోని ఏ కోర్టులోనైనా కేవలం యూదుల తరపునుండి ఈ మత్తయి, మార్కు, లూకా,యోహానుల సాక్ష్యాలను కోరటం ద్వారా ప్రమాణపత్రాలతో ఇప్పుడున్న సువార్తలలో ఉన్నట్లుగానే వాటిని సమర్పించగానే వాటి మూలప్రతులతో సరిచూచి ధృవీకరించలేదని నేనంటాను. రుజువు ఏమిటంటే అధీకృత కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఏదైనా మీరు తీసుకొని చూడండి ఆ సాక్షపత్రం ఇలా మొదలవుతుంది: “పరిశుద్దుడైన మత్తయి ప్రకారం సువార్త, మార్కు ప్రకారం సువార్త, లూకా ప్రకారం సువార్త, యోహాను ప్రకారం సువార్త” న్యాయపీఠములోని స్త్రీ పురుషులారా! నేను అడుగుతున్నాను. “ ఈ ప్రకారం....... ప్రకారం ..... ప్రకారం...... ఏమిటి; దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? దాని అర్థం ఏమిటంటే మత్తయి, మార్కు లూకా, యోహాను వారు సంతకాలు చెయ్యలేదు కేవలం అది వాళ్లు వ్రాసిందే అయ్యుంటుందని ఊహించారు. అందువల్ల ఏ నాగరిక దేశంలోని ఏ కోర్టులోనైనా వాటిని రెండు నిమిషాల్లో విసిరి బయట పారేస్తారు.

అంతేకాదు. ఏ నాగరిక దేశంలోని ఏ కోర్టులోనైనా ఈ కేసును నేను రెండు నిమిషాల్లో రెండు సార్లు కొట్టిపారేస్తాను. రెండుసార్లు అని ఎందుకంటున్నానంటే మార్కు సువార్తలోని ఒక సాక్షి 14వ అధ్యాయం 50వ వచనంలో యేసు జీవితంలోని ఆ క్లిష్టసమయంలో ఆయన శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారని చెబుతాడు. “అందరూ” వాళ్లు అక్కడ లేకపోతే అక్కడ లేనివాళ్ల సాక్ష్యం కోర్టు విసిరి బయట పారేస్తుంది. నేను రెండు నిమిషాలన్నాను. అవును 120 సెకండ్లలోనే ఏ నాగరికత దేశంలోని ఏ కోర్టులోనైనా ఈ కేసు ముగుస్తుంది.

కాని ఇందులో వినోదం ఏముంటుంది? మీరు చాలా మంది వానకు తడుస్తూ ఎంతో దూరంనుండి వచ్చారు. ఇప్పుడు కేసు కొట్టి వేయబడింది. ఇళ్ళకు వెళ్ళిపొండి అని మీతో చెబితే ఇక ఇందులో మజా ఏముంటుంది? మీకు వినోదం కలిగించేందుకు నేను వాటిని చెల్లే పత్రాలుగానే సమ్మతిస్తాను. ఈ చర్చకోసం ఈ సాక్ష్యాలను మనం క్రాస్ ఎగ్జామినేషన్ కోసం బోనులోకి ఎక్కించబోతున్నాము సత్యమెక్కడుందో చూడమని మిమ్మల్ని కోరుతున్నాను.

నేను పిలువబోయే మొదటి సాక్షి సెయింట్ లూకా అయ్యాడు. ఈయనగారు గొప్ప చరిత్రకారుడని క్రైస్తవ పెద్దలు వర్ణిస్తారు. ఒక చరిత్ర పుస్తకంగా లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం తీసుకుందాం. ఆయన ఏం చెప్పాడో, లిఖితపూర్వకంగా ఏది వ్రాశాడో నేను మీకు చెప్పబోతున్నాను. అది ఆదివారం సాయంత్రమట, వారంలో మొదటిరోజు తన శిష్యులతో కలిసి యేసుక్రీస్తు మేడపై గదిలో చివరి భోజనం చేసిన రోజు అది.

ఇది సిలువ వేశారని చెప్పబడుతున్న దానికి మూడు రోజుల తరువాత జరింగింది. ఆయన లోనికెళ్ళి శిష్యులతో “మీకు శాంతి కలుగుగాక" అంటాడు. అది విని శిష్యులు దిగులుపడి భయాక్రాంతులవుతారు. ఇది నిజమా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. శిష్యులు ఎందుకు భయాక్రాంతులయ్యారో తెలుపమని లూకాను కూడా అడుగదల్చుకున్నాను. ఎందుకంటే ఎవడైనా తన చిరకాలగురువును, బోధకుడిని, తన తాతను, తన రబ్బీనీ కలుసుకంటే తూర్పు ప్రజలమైన మనము ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటాము. ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటాము. ఆయన శిష్యులు భయపడ్డారెందుకు? లూకా ఏం చెబుతున్నాడంటే, ఒక భూతం (ఆత్మ) కనబడిందని వారు భయపడ్డారట.

అతను చెప్పింది మాత్రమే నేను ఉదాహరిస్తున్నాను. ఇంటికెళ్ళి మీ సొంత బైబిళ్ళలో దీనిని పరిశీలించుకొండి. ఆయన ఒక భూతమనుకొని బెదిరిపోయారు, భయాక్రాంతులయ్యారు. నేను లూకాను అడుగుతున్నాను, ఆయన ఒక ఆత్మలాగా ఉన్నారా? లేడని అతను చెబుతున్నాడు. ప్రపంచంలోని క్రైస్తవులందరినీ ప్రతి చర్చీని, ప్రతి డినామినేషన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. మీ యజమాని మీకు ఆత్మలాగా కనబడుతున్నాడా? లేదు అంటున్నారు అందరు. అయితే నేను అంటాను, ఆయన ఒక ఆత్మలాగా లేకపోతే "మనిషి ఒక ఆత్మ” అని వారు ఆలోచిస్తారెందుకు?

అందరూ అయోయయంలో పడిపోయారు - జోష్ గారు వివరిస్తే తప్ప. ప్రతి క్రైస్తవుడు అయోమయంలో పడ్డాడు. యేసు ఆత్మలాగా కనబడకపోతే “మనిషి ఒక ఆత్మ” అని వారు ఎందుకు ఆలోచిస్తున్నారు? కారణం నేను చెబుతాను. యేసు శిష్యులు యేసు సిలువ మీద వ్రేలాడదీయబడ్డాడని ఒక వదంతి విన్నారు. వదంతి మాత్రమే వాళ్లు విన్నారు. ఆత్మను విడిచి పెట్టాడని విన్నారు. మరోమాటలో చెప్పాలంటే ఆయన ఆత్మ బయటికొచ్చేసింది. ఆయన చనిపోయాడు ఈ వదంతి ప్రకారమే ఆయన సమాధి చేయబడి మూడు రోజుల తరువాత లేస్తాడని విన్నారు. వాళ్ల జ్ఞానమంతా పుకార్ల వినికిడి నుంచి మాత్రమే వచ్చింది. ఎందుకంటే, నేను మొదటే చెప్పాను మార్కు 14:50 ప్రకారం యేసు జీవితంలోని అతిక్లిష్ట సమయంలో అతని శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారని, వారు అక్కడ లేరని మీ సాక్షి చెబుతున్నాడు.

కాబట్టి ఇదంతా పుకార్ల జ్ఞానమే, ఎవర్ని గురించైతే చెప్పుకుంటున్నారో ఆయన మూడు రోజుల నుండి చనిపోయి ఉన్నాడు. ఆయన సమాధిలో మునిగిపోయి ఉన్నాడని మీరు ఊహించుకొండి. అలాంటి మనిషిని మీరు చూస్తే భయంతో వణికిపోతారు. కాబట్టే యేసు తాను వాళ్లు ఆలోచిస్తున్న రీతిలో లేనని వాళ్ళకు రుజువు చేయదలుచుకున్నాడు. ఆయన మృతులలోనుండి వచ్చాడని వాళ్లనుకొంటున్నారు ఒక పునరుత్థానుడైన ఆత్మదేహి అనుకున్నారు. అందుకే ఆయన అన్నాడు “నా కాళ్ళు నా చేతులు చూడండి” లూకా చెప్పింది మాత్రమే నేను ఉదాహరించాను. “మీకేమయ్యింది? మీరెందుకు భయపడుతున్నారు. నేనే ఆయనను, తన్ను పట్టుకొని చూడండి. ఒక ఆత్మకు శరీరము ఎముకలు ఉండవు. నాకైతే దేహం ఉంది.” ఒక ఆత్మ “ఒక” అంటే ఏ ఆత్మ అయినా కావచ్చు. దానికి నాకున్నట్లుగా శరీరము, ఎముకలు ఉండవు. కాబట్టి నాకు శరీరము ఎముకలు ఉంటే నేను ఆత్మను కాను. నేను భూతాన్ని కాను, నేను ఒక పిశాచాన్ని కాదు. నేను చనిపోయానని పునరుత్థానుడనై, మృతులలోనుండి లేచి వచ్చానని,మీరనుకుంటున్నారు. తనకు దేహాము ఎముకలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? అది పునరుత్థానంకాని దేహామే. అది మార్పుచెందని దేహామేనన్నమాట, పునరుత్థానమైన దేహం ఆత్మగా మారుతుంది.

అలా ఎవరు చెబుతున్నారు? నా అధికారం యేసే. ఎక్కడ అంటారు మీరు లూకాలో అంటాను నేను:  మీరు మళ్లీ చూస్తారు 20వ అధ్యాయం 36వ వచనం. ఆయనేం చెబుతున్నాడు? యూదులు పొద్దాక ఆయన దగ్గరకు చిక్కు ప్రశ్నలు తెస్తుంటారు. “బోధకుడా మనము కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?” బోధకుడా మేము ఈ స్త్రీ వ్యభిచరిస్తుండగా చూచాము. ఈమెకు మేము ఏంచెయ్యాలి? బోధకుడా....... మళ్ళీ మళ్ళీ, ఈసారి వాళ్లొచ్చి అడిగారు. హెబ్రీ భాషలో “రబ్బీ" అంటే బోధకుడు. “ బోధకుడా మరో ఒక స్త్రీ ఉంది. ఆమెకు యూదుల ఆచారం ప్రకారం ఏడుగురు భర్తలు ఉన్నారు. యూదుల ఆచారం ఏమిటంటే ఓ మనిషి తన అన్న భార్యను తన భార్యగా చేసుకుంటాడు. అతను కూడా చనిపోతే అతని తమ్ముడు ఆమెను చేసుకుంటాడు ఇలా నాలుగవవాడు అయిదవవాడు ఏడవవాడు కూడా. ఏడుగురు అన్నదమ్ములు ఆమెను భార్యగా పొందారు. ఒకరి తరువాత మరొకరు పొందారు గనుక ఈ భూమిమీద ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. పరలోకంలో ఆమె ఎవరి భార్య అవుతుంది అనేదే ఇప్పుడు వాళ్ళు తెలుసుకొగొరారు. ఇంకొరకంగా చెప్పాలంటే పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే మనమంతా ఒక్కసారే పునరుత్థానులమౌతామని మనం నమ్ముతాం. మనమంతా ఒక్కసారే లేస్తాం. ఈ ఏడుగురు సోదరులు కూడా ఒక్కసారే లేచి ఈ స్త్రీని చూచి ఎవడికివాడే నా భార్య, నాభార్య అంటాడు ఈ ఒక్క స్త్రీ కోసం పరలోకంలో ఈ సోదరులమధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది.

అందుకే ఆమె ఎవరి పరం అవుతుందో చెప్పమని యూదులు యేసు వెంటపడ్డారు. (లూకా20:36)అందుకు యేసు పునరుత్థానులైన స్త్రీపురుషులు ఇక ఎన్నటికీ చావరు”అంటాడు అంటే ఒక్కసారి పునరుత్థానులైతేవారు అక్షయులౌతారు. ఇది క్షయశరీరం దీనికి కూడు, గూడు, గుడ్డ, విశ్రాంతి, కామం కావాలి. ఇవి లేకపోతే మానవజాతి నశిస్తుంది. ఆ దేహం మాత్రం అక్షయదేహం కూడు, గూడు గుడ్డ, విశ్రాంతి, కామం ఏదీ ఉండదు దానికి వాళ్ళు ఎన్నటికీ చావరు. వాళ్ళు దేవదూతలతో సమానం అంటున్నాడాయన. మరో మాటలో చెప్పాలంటే వాళ్లు దేవతీకరించబడతారన్న మాట. వాళ్ళు ఆత్మీకరించబడతారు. వాళ్లు ఆత్మ జీవులుగా ఉంటారు. వాళ్ళు ఆత్మలే! వాళ్ళు దేవదూతలకు సమానులుగాను, దేవుని పిల్లలు గాను ఉంటారు. పునరుత్థాన "ఆత్మ" అలాంటి పిల్లలుగా ఉంటుందని, “నాకులాగా చర్మము,ఎముకలు ఒకఆత్మకు ఉండవని అంటే నేను పునరుత్థానుణ్ని కాలేదు” అని ఆయన చెప్పాడు. అయినా వాళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో ఈ సంగతి నమ్మలేదట లూకా 24 చూడు మళ్లీ తరువాత ఏం జరిగింది?

ఈ మనిషి చనిపోయాడని బహుశా సమాధిలో మునిగిపోయి ఉన్నాడని మనం అనుకుంటున్నాం. కాని వాళ్ళు ఆత్మానందంతో నమ్మటం లేదట. ఏం జరిగింది అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారట. అందుకాయన మీదగ్గర కాల్చిన చేపగాని, మాంసంగాని , తేనెతుట్టెగాని తినటానికి ఏదైనా గాని ఉందా అంటాడు. వాళ్ళాయనకో రోట్టెముక్క ఇస్తే దాన్ని వాళ్ల కళ్ళముందే విరిచి తింటాడాయన.ఏమి నిరూపించటానికి ఈన్యాయసభలోని స్త్రీపురుషులందరినీ నేనడుగుచున్నాను. ఏమి ప్రదర్శించటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు? ఏమిటి? “నేను అదే మనిషిని, నేను మీరనుకుంటున్నట్లుగా లేను. మృతులలోంచి లేచి రాలేదు.”

ఇది సిలువ వేశారని చెప్పబడుతున్న రోజు తరువాత వచ్చిన ఆదివారం. మనం వెనక్కి వెళదాం. ఉదయాన్నే ఏం జరిగింది? మీ మిగతా సాక్షులు, యోహాను 20వ అధ్యాయం, 1వ వచనం అది ఆదివారం అని చెబుతున్నది. వారంలో మొదటి రోజు. మగ్దలేని మరియ యేసు సమాధిని చూడానికి వెళ్ళింది. నేను యోహానును అడుగుతున్నాను. ఆమె అక్కడికి ఎందుకెళ్ళింది? లేకపోతే మరోసాక్షి మార్కును అడుగుదాం. మార్కు16:1;) “ఆయన్ని అభిషేకించటానికి ఆమె వెళ్ళింది అంటాడు. అభిషేకించటాన్ని హెబ్రూలో “మస్సాహా” అంటారు. ఈ మాటలో నుంచే హెబ్రూ భాషలలోని రెంటికి మూలపదం ఒకటే. మసాహ్ అంటే రుద్దటం,పూయటం లేదా అభిషేకించటం.

మూడు రోజుల తరువాత శవాలకు సుగంధ ద్రవ్యాలు యూదులు పూస్తారా అని నేనడుగుతున్నాను. సుగంధద్రవ్యాలతో శవాలకు నలుగుపెట్టే అలవాటు మరి మీకుగాని ఉందా ఓ క్రైస్తవులారా? ఉందా మీకు? లేదనేదే సమాధానం. యూదుల ఆచారాలకు అతి దగ్గరగా ఉంటే, ముస్లీంలో లేదనేదే సమాధానం అయితే కుళ్ళిపోయిన మూడురోజుల నాటి శవానికి సుగంధాలు పూయాలని వాళ్ళేందుకు వెళతారు? కేవలం చనిపోయిన మూడు గంటలలోనే జీవకణాలు గట్టిపడిపోతాయని, దేహం బిగుసుకుపోతుందని, లోపలినుండి కుళ్లు బయలుదేరుతుందని మనకు తెలుసు. మూడురోజుల కాలంలో శరీరం బాగా చెడిపోతుంది. అలాంటి శరీరానికి మర్దన చేస్తే ముక్కలై పడిపోతుంది. మర్దన చేసేందుకో సజీవుణ్ని వెతుక్కోక, ఆమె చనిపోయిన దేహాన్ని ఎందుకు వెతుకుతున్నది? సిలువ మీదనుండి దించబడిన వికలాంగ దేహాంలో సజీవ చిహ్నాలను ఆమె చూచి ఉండవచ్చు. ఆ దేహానికి అంత్యక్రియలు జరుపటానికి అధికారం ఇవ్వబడిన నికోదేము, ఆరిమతయ యోసేపులతోపాటు ఉన్న ఒకే ఒక స్త్రీ ఈమె. ఆయన శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. వాళ్లక్కడ లేరు. కాబట్టి ఆయనలో ప్రాణమున్నట్లుగా ఈమె కనుగొంటే “ఆయన బ్రతికే ఉన్నాడు: బ్రతికే ఉన్నాడు! అని ఆమె అరవదు. అప్పుడాయన్ని నిజంగానే చంపుతారు.

మూడురోజుల తరువాత ఆమె వెళ్ళి ఆయన్ని అభిషేకించాలనుకొంటున్నది. ఆమె సమాధి దగ్గరకు వెళ్లగానే ఆరాయి తోలగించి ఉండటం చూసింది. దుస్తులు మడత పెట్టిన మూట లోపల ఉంది. కాబట్టి ఆమె ఏడ్వటం మొదలుపెట్టింది. ఆరాయి ఎందుకు తోలగించబడింది, ఆ నార బట్టలు ఎందుకు విడువబడ్డాయి అని నేనడుగుతున్నాను. పునరుత్థానం చెందిన దేహాం బయటికి రావాలంటే రాయిని దొర్లించనక్కరలేదు. ప్రేత వస్త్రాలను దేహం కదలేందుకు వీలుగా ఊడదీయనక్కర లేదు. భౌతిక శరీరానికే ఈ అవసరం ఉంటుంది. క్షయ శరీరానికి మాత్రమే ఈ అవసరం. ఒక కవి చెప్పాడు గదా,“బండరాళ్ల గొడ జైలుకాదు, ఇనుపకడ్డీల పంజరం బోను కాదు” అని. ఒక ఆత్మకు భూతానికి ఇలాంటివి అడ్డంకే కాదు. ఇనుపకటకటాలుగాని గొడలుగాని అది ఆయన భౌతిక శరీరం యొక్క అవసరత. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నా భూమిమీద ఉన్నా మరెక్కడున్నా ఆమెను కనిపెట్టి చూస్తూనే ఉంటాడు. ఈ సమాధి కూడా అరిమతయ యోసేపు యొక్క సొంత సమాధి. అతను పెద్ద ధనవంతుడై, మంచి గదిలాగా ఉండే సమాధిని ఒక పెద్ద రాయిలో తొలిపించుకున్నాడు. ఆ సమాధి గదిచుట్టూ అతని కూరగాయలతోట ఉంది. ఊరికి అయిదుమైళ్ళ అవతల ఇతర ప్రజల గొర్రెలు, మేకలు పడిమెయటానికి వీలుగా ఆయన అక్కడ కూరగాయలు పెంచేంత ధర్మాత్ముడని నాకు చెప్పవద్దు. అతను తన కూలీల కోసం, తన తోటలో పనిచేసే వాళ్లకోసం గదులు తప్పక కొని ఉంటాడు. లేదా బహుశా వారాంతపు శెలవుల్లో కుటుంబసభ్యులతో పాటు ఆ తోటలో గడిపి పోతూ ఉండేవాడు.

యేసు చనిపోయాడుగాని ఈమెను చూస్తున్నాడు. ఆమె ఎవరో ఆయనకు తెలుసు ఆమె అక్కడ ఎందుకుందో ఆయనకు తెలుసు. ఆయన ఆమె దగ్గరకు వెళ్లాడు ఆమె ఏడుస్తూ ఉండటం చూశాడు. “అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెదుకుతున్నావు”? అని ఆమె నడిగాడు. ఆయనకు తెలియదా? ఎంత చౌకబారు ప్రశ్న ఆయన ఎందుకువేశాడు? అని అడుగుతున్నాను. అది చౌకబారు ప్రశ్న కాదని మీకు చెబుతాన్నాను. ఆమెను చిక్కులో పెట్టటానికి ఆయన భావగర్భితంగా అడిగాడు. ఆయన తోటమాలి అని ఆమె అనుకుంటున్నది. ఆమె అలా ఎందుకనుకున్నది పునరుత్థాన దేహాలు తోటమాలిరూపంలో ఉంటాయా? ఆయన తోటమాలి వేషం వేసుకున్నాడు. తోటమాలి వేషం ఎందుకేసుకున్నాడు? ఆయన యూదులకు భయపడ్డాడు? ఎందుకంటే ఆయన చనిపోలేదు. ఆయన మరణాన్ని జయించలేదు. ఆయన చనిపోయినట్లయితే, మరణాన్ని జయించి ఉండినట్లయితే ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని? ఎందుకంటే పునరుత్థాన దేహం రెండోసారి చావదు.అలాగని ఎవరు చెప్పారు? బైబిలే. అది ఏం చెప్పింది. మనుషులంతా ఒక్కసారి మాత్రమే చస్తారని దాని తరువాత తీర్పు ఉంటుందని. రెండుసార్లు మీరు చావరు.

కాబట్టి ఆయన చావుని గెలిచినట్లయితే భయపడాల్సిన పనేలేదు. ఆయన చావలేదు. గనుక భయపడ్డాడు. ఆయన తోటమాలి అనుకుని ఆమె “అయ్యా నీవు ఆయన్ని మోసుకొనిపోతే ఎక్కడ ఉంచావో చెప్పు. నేనాయన్ని ఎత్తుకుపోతాను” అంది. ఎక్కడ పూడ్చేశావో చెప్పు అనటంలేదు. విశ్రాంతి కోసం, కోలుకోవటం కోసం ఆయన్ని ఎక్కడ ఉంచావో చెప్పు నేను మోసికెళతాను అంటున్నది. నేను ఒక్కదాన్నే ఒక స్త్రీ - ఒక బలహీనమైన యూదురాలు. నాకులాగా 200 పౌండ్లు కాకపోయినా కనీసం 160 పౌండ్ల బరువు ఉండే శవాన్ని ఒక స్త్రీ మోసుకుపోతాననటం ఊహించండి. కండలు తిరిగిన వడ్రంగి. పైగా కుర్రవాడు కనీసం 160 పౌండుంటాడు. ఆయన చుట్టూ మరోవంద పౌండ్ల బరువైన మందులు (యోహాను 19:39;) అన్నీ కలిపి 260.

ఈ యూదులు 260 పౌండ్ల బరువైన శవపుమూటను, గడ్డి మోపులాగా, అమెరికన్ హాస్య సాహిత్యంలోని సూపర్ ఉమన్‌గా మోసికెళ్లటాన్ని ఊహించండి. అతన్ని ఎక్కడికి తీసుకెళుతుంది? ఇంటికా? పరుపుకింద దాచి పెడుతుందా? అతన్ని ఆమె ఏంచేస్తుంది? అతన్ని ఊరగాయ వేసుకుంటుందా? కుళ్ళి మాగిపోయిన శవాన్ని ఆమె ఏమి చేసుకోదలిచింది. అని నేను మిమ్మల్నిఅడుగుతున్నాను.

యేసు “మరియా" అని పిలిచాడు. ఆ పిలుపుతోనే ఆయన యేసేనని ఆమె గ్రహించింది. ఆయన్ని పట్టుకోవాలనుకుంది. ఎందుకు? పట్టికరవటానికా కాదు? కాదు: గౌరవాన్ని తెలియజేయటానికి. తూర్పు దేశాల వాళ్లం మనమలానే చేస్తాం "నన్ను ముట్టుకోవద్దు" అన్నాడాయన. ఎందుకని ఆయన ఒక కరెంటు తీగల చూట్టా? ఒక బాంబా? ఆయన్ని ఆమె తాకితే షాకుకొట్టి చచ్చిపోతుందా? చెప్పండి. ఎందుకు తాకకూడదు? ఎందుకంటే అది బాధను కలిగిస్తుంది. ఇంకేదైనా కారణ ఉంటే చెప్పండి. “నేనింకా తండ్రి దగ్గరకు ఎక్కిపోలేదు గనుక నన్ను తాకవద్దు” ఆమె గుడ్డిదా? ఆమె పక్కన నిలబడ్డ మనిషిని చూడలేదా? ఆయన ఇక్కడ ఉండగానే "నేనింకా ఎక్కిపోలేదు” అనటంలో అర్థం ఏమిటి? యూదుల పరిభాషలో, యూదుమాండలికంలో "నేనింకా చనిపోలేదు” అని ఆయన చెబుతున్నాడు.

సమస్య మళ్ళీ తలెత్తింది. ఆ రాయిని ఎవరు తొలగించారు? ఆమె ఆయన దగ్గరకు ఎలా వెళ్ళింది? క్రైస్తవులు పుస్తకాల మీద పుస్తకాలు వ్రాసేస్తున్నారు. వారిలో ఒకడు ఫ్రాంక్ మోరిసన్, ఒక హేతువాద న్యాయవాది. ఆయన 192 పేజీల పుస్తకం వ్రాసాడు అందులో ఆరు ఊహాలు చేశాడు. పుస్తకం మొత్తం చదివినాక కూడ మీకు సమాధానం దొరకదు. ఆ రాయి ఎవరు దొర్లించారు? స్పష్టంగా కనబడే దాన్ని కూడా మీరు ఎందుకు చదువరు? చూడలేరో నాకు అర్థం కావడంలేదు. మీ పుస్తకాలు మీరు ఎందుకు చదువరు. ఈ సువార్తలు మీ మాతృభాషల్లోనే అతి స్పష్టంగా ఉన్నాయిగదా:

ఆంగ్లేయుడు ఆంగ్లంలో, ఆఫ్రికావాడు ఆఫ్రికన్లో, జులూవాడు జులూలో ప్రతి మనిషికీ అతని భాషలలోనే బైబిల్ అందుబాటులో ఉంది. అయితే అతను చదివేదానికి పూర్తిగా వ్యతిరేకమైనదానినే అతను అర్థం చేసికొనేలాచేయబడ్డాడు. అపార్థం చేసుకొవటం కాదు, ఖచ్చితంగా వ్యతిరేకమైన దానిని నమ్మడమే. నేను చెప్పింది తప్పయితే నిరూపించండి. మీ సాక్షులు చెప్పిన మాటనే నేను చెప్పాను. ఆ సాక్ష్యం నేటికి భద్రంగా దాచబడి ఉంది. వాళ్లు తప్పుడు సాక్షులని నేను చెప్పటం లేదు. మీ పుస్తకాన్ని మరొసారి చదవండి అని మాత్రమే కొరుకుతున్నాను. కళ్లగంతలు విప్పి మళ్ళీ చదవండి మీ భాష నాకెక్కడ అర్థం కావడంలేదో నాకు చెప్పండి. ఆంగ్లేయులారా, ఆఫ్రికవారలారా, జూలూలారా! ఈ వాదంలో మన గౌరవనీయ అతిథి విషయానికి న్యాయం చేకూర్చలేకపోయాడని భావిస్తే నన్ను పిలవండి. నేను ఎక్కడికైనా వచ్చి ఎవరితోనైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను.

రాయి ఎవరు దొర్లించారు? అని నేనడుగుతున్నాను. సమాధానం చాలా చిన్నది - అది దొర్లించటానికి 20 మంది కావాలని వాళ్ళే చెబుతున్నారు. అది ఎంతో పెద్దది. దాన్ని దొర్లించాలంటే అమెరికా నుండి సూనేర్ మాస్ రావాలి. ఒకటిన్నర నుండి రెండు టన్నుల బరువుంది. మార్కుగాని,మత్తయిగాని చదవండి అరిమతయి యోసేపు ఒక్కడే అంత పెద్దరాయిని సమాధి ద్వారానికి పొర్లించి వెళ్ళిపోయాడని ఉంది, ఒక్కడంటే ఒక్కడే దాన్ని మూత వేయగలిగినప్పుడు ఇద్దరు మనుషులు దాన్ని తొలగించలేరా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ సంఘటనలన్నీ ప్రవచనం ప్రకారం, విధి నిర్ణయమయ్యాయని మీకు తెలుసు. ఆ తరువాత ఏం జరుగుతుందో అంతా యేసు ముందుగానే మీకు స్పష్టంగా చెప్పాడు (మత్తయి 12:38:40;) మరొ కొత్త కోర్కెతో యూదులు యేసు వద్దకు వస్తారు. వాళ్లేమంటున్నారంటే "బోధకుడా, నీ వలన మేము ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము.” మేము ఎదురు చూచే మెస్సీయ నీవేనని నిరూపించుకోటానికి నీవు ఒక అద్భుతంచేసి మమ్మల్ని ఒప్పించు. నీళ్ళమీద నడవటంలాగా, పక్షివలెగాలిలో ఎగరటంలాగా ఏదో ఒకటి మానవాతీత శక్తిని ప్రదర్శించు. అప్పుడు మేము ఎదురు చూస్తున్న మెస్సీయవు నీవేనని, నీవు ఒక దైవజనుడవని మేము నమ్ముతాము.

అందుకు యేసు ఉత్తరమిచ్చాడు. “వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచనక్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచనక్రియయే గాని మరే సూచకక్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు దివారాత్రులు తిమింగలము కడుపులో ఏలాగుండెనో అలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యోనా సూచకక్రియ మాత్రమే ఆయన చూపటానికి సిద్ధమయ్యాడు. గుడ్డి బరులోమయికి చూపు నిచ్చాననలేదు. ఏళ్ళతరబడి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ నన్ను తాకగానే బాగుపడింది అని చెప్పలేదు. కొన్ని చేపలు రొట్టెముక్కలతోటి అయిదు వేలమందిని తృప్తి పరిచాను. ఈ అంజూరపు చెట్టును వేళ్ళతో సహా ఎండబెట్టాను అని వాళ్లకు గుర్తుచెయ్యలేదు. యోనా సూచనక్రియనే ఇస్తాను అన్నాడు అది ఏది?

యోనా గ్రంధంలోకి పదండి. అది ఒకే ఒక్క పేజీ ఉంటుంది. అందులో నాలుగు అధ్యాయాలున్నాయి. చదవటానికి రెండు నిముషాల కంటే ఎక్కువసేపు పట్టదు. ఆ పుస్తకాన్నివెయ్యిపేజీలలో ఆ పేజీని వెదికి పట్టుకోవటం కష్టమే. యోనా నీనెవే ప్రజల దగ్గరకు పంపబడ్డాడు వాళ్ళో లక్షమంది ఉంటారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకోని, బూడిదలో కూర్చోని పశ్చాత్తాపపడాలని హెచ్చరించటం కోసం యోనా పంపబడ్డాడు. ప్రభువుముందు వాళ్ళు వినయమనస్కులు కావాలి. ఇహలోక సంబంధమైన ఆ ముష్కరజనం అంటే యోనాకు గిట్టలేదు. “వాళ్లు నా మాటలు వినరు. పైగా ఎగతాళి ఇది. యెప్పేకు వెళ్ళి తర్షీషు పోయే ఓడ ఎక్కుతాడు. ఈ పేర్లు గుర్తుంచుకొనక్కరలేదు.

మార్గమధ్యంలో తుఫానొస్తుంది. ఆ జనం మూఢనమ్మకాల ప్రకారం దేవుని ఆజ్ఞను మీరి నడిచేవాడివల్లనే సముద్రంలో అల్లకల్లోలం కలుగుతుంది. కాబట్టి ఈతుఫానుకు బాధ్యుడెవడని ఆఒడలోని జనం ప్రశ్నించుకుంటున్నారు. దేవుని ప్రవక్త అయినా యోనా తాను ఒక దేవుని సైనికుడిని అనుకుంటాడు. తన స్వంత ఆలోచన చోప్పున పనులు చేసే అధికారం తనకు లేదనుకుంటాడు అందువలన ఆ దోషిని నేనే. దేవుడు నన్ను చంపదలిచాడు. అందుకే ఈ పడవ మునిగిపోతున్నది. అమాయకులైన మీరంతా చనిపోయేకంటే నన్ను నెత్తి ఈ సముద్రంలో పడెయ్యండి. దేవుడు నన్ను చంపాలని చూస్తున్నాడని అంటాడు. వాళ్లంటారు “కాదయ్యా నీవు చాలా మంచివాడిలాగున్నావు. బహుశా నీవు ఆత్మహత్య చేసుకోదలిచావేమో. అందుకు మేము సాయపడలేము. మంచి చెడులను తెలుసుకునేందుకు మాకో పద్ధతి ఉంది” అదే చీట్లు వేయటం. అందులో యోనా అపరాధిగా తేలుతాడు అప్పుడతన్ని ఎత్తి సముద్రంలో పడేస్తారు.

ఇప్పుడు మీకో ప్రశ్న వేస్తున్నాను. అతన్ని సముద్రంలో ఎప్పుడు పడేశారు? చనిపోయినాకా బ్రతికి ఉండగానేనా; మీరు సమాధానం చెప్పకముందే ఇది గుర్తుంచుకోండి. ఈ పనిని యోనా స్వచ్ఛంతంగా కోరుకున్నాడు. “నన్ను పడెయ్యండి” అన్నాడతను. అలాపడేసే ముందు అతన్ని పొడిచి చంపనక్కరలేదు. అతని కాళ్లు చేతులు విరుగ గొట్టనక్కరలేదు. నాతో మీరంగీకరిస్తారా? అతను కోరుకున్నాడు. అతనిని వాళ్లు పడేసినప్పుడు మీబుద్ధి మీకేం చెబుతున్నది? అతను బ్రతికున్నాడా చచ్చాడా? దయచేసి చెప్పండి మీ సహాయం కావాలి నాకు. అతను బ్రతికే ఉన్నాడా చనిపోయాడా? బ్రతికే ఉన్నాడు. మీకు దీని కోసం బహుమతేమీ రాదు. ఇది చాలా చిన్న ప్రశ్న. యూదులు, క్రైస్తవులు, ముస్లిములు కూడా ఆశ్చర్యకరంగా అతను బ్రతికే ఉన్నాడని చెబుతున్నారు. మిగతా విషయాల్లో కూడా మనమంతా ఏకీభవిస్తే ఇంకెంత బాగుంటుంది? కల్లోల సంద్రంలో విసిరివేయబడినపుడు యోనా బ్రతికే ఉన్నాడని మనమంత ఒప్పుకుంటాం అది కాకతాళీయం కావచ్చు ఒక చేప వచ్చి అతన్ని మింగేస్తుంది. బ్రతికినవాడినా చచ్చిన శవాన్నా? బ్రతికినా వాడినే:

ఆచేప కడుపులోంచి దైవ సహాయం కోసం అతను ప్రార్థిస్తాడు. చనిపోయినవాళ్లు ప్రార్థిస్తారా, ప్రార్థించరు. కాబట్టి అతను బ్రతికే ఉన్నాడు. మూడు రాత్రింబవళ్ళు ఆ చేప అతన్ని సముద్రమంతాతిప్పింది. బ్రతికుండగానా చనిపోతేనా ? బ్రతికుండగానే. యేసు క్రీస్తు ఏం చెప్పాడు "యోనా లాగానే” "యోనా ఉన్నట్లుగానే” మనుష్యకుమారుడు కూడా (తానే) ఉంటాడు. యోనా ఎలా ఉన్నాడు? సజీవంగానా? శవంగానా? క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు మూడు రాత్రులు యూడు పగళ్లు సమాధిలో ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? బ్రతికా చనిపోయా? చనిపోయి.

మన నమ్మకం ప్రకారం చనిపోయాడు. ఆయన యోనా లాగా లేడు నేను యోనాలాగా ఉంటానని ఆయన చెబుతుంటే, ప్రపంచంలోని 1002 మిలియన్ల క్రైస్తవులు ఆయన యోనాలాగా లేడని చెబుతున్నారు. నేనొక యూదుడినైతే ఆయన్ని యెస్సీయగా అంగీకరించను. కాని ఆయనే మెస్సీయ అని ఖురాన్ నాకు చెప్పింది, నేనుఅంగీకరిస్తాను.  ఆయన దేవుని సందేశ ప్రచారకుల్లో మహాశక్తిమంతుడైనవాడు, నేను అంగీకరిస్తాను. ఆయన అద్భుత జన్మను విశ్వసిస్తాను. దేవుని అనుమతితో ఆయన చనిపోయినవానికి జీవిచ్చాడని నమ్ముతాను. అలాగే ఆయన పుట్టుగుడ్డువారికి చూపునిచ్చాడు, కుష్టు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాడు. కాని నేనొక యూదుడినైనే, ఈ సూచననుబట్టి ఆయన విఫలమయ్యాడంటాను. యోనా సజీవుడు- అయితే యేసు నిర్జీవుడు. వారిద్దరు ఒకేలా లేరు. వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారని మీరు ఏ భాషలో చెప్పగలరో నాకు అర్థం కావటంలేదు.

మీ బైబిలు నాకు అర్థంకావటం లేదు. ఎందుకని? క్రైస్తవపండితులు, విద్వాంసులు ఇలా అంటారు. “దీదాత్, యేసుక్రీసు కాలాన్ని గురించి వత్తిపలికారు.” ఈ “మూడు” అనే మాటను ఆయన నాలుగుసార్లు చెప్పాడు.యోనా మూడు రాత్రులు మూడుపగళ్ళు ఉన్నట్లుగానే మనుష్యకుమారుడు కూడా మూడు రాత్రులు మూడుపగళ్ళు ఉంటాడు. ఆయన బ్రతికిఉంటాడా, చనిపోయి ఉంటాడా అనేది కాక“ఎంతకాలం”ఉంటాడు అనేదే ఆయన ఒత్తిపలికాడట, నొక్కివక్కాణించాడట. కాలవిషయంలో అద్భుతం ఏదీలేదు. చనిపోయిన మనిషి మూడు నిముషాలయినా, మూడు గంటలయినా, మూడు వారాలయినా అది ఒక అద్భుతం ఏమీకాదు.

అద్భుతం ఏదయినా ఉందంటే అది చనిపోయాడనుకున్న మనిషి చావకపోవటమే. యోనాను సముద్రంలో విసిరిపడేసినప్పుడు, అతను చనిపోతాడని అనుకున్నాం.కాని అతను చనిపోలేదు, అద్భుతం అంటే అదే. చేపవచ్చి అతన్ని మింగింది. అతను చనిపోవాలి. కాని చావలేదు. అదే అద్భుతం మరి: చేపకుడుపులోని వేడి, ఉక్కభరిస్తూ, మూడు రాత్రులు మూడు పగలు- అతను చచ్చితీరాలి. కాని చావలేదు. కాబట్టి అది అద్భుతం.

నీవు చస్తాడనుకున్న మనిషి చచ్చిపోతే, అందులో అద్భుతం ఏముంది? ఎవడన్నా తుపాకి తీసుకుని ఒకడి గుండెలోకి ఆరు గుండ్లు పేలిస్తే, అతను చనిపోతే అది అద్భుతమా? కాదు. కాని అతను ఆరు గుండ్లు దెబ్బలు తిని కూడా అపహసించి బ్రతికి మనతోవస్తే అరుతూటాలతని హృదయాన్ని ముక్కలుచేశాక అతను నవ్వాలి “హహహ” అతను బ్రతికే ఉండాలి. అదీ అద్భుతమంటే: చనిపోతాడనుకున్న మనిషి చావకపోవటం అద్భుతం. చస్తాడనుకున్న మనిషి చనిపోవటం అనద్భుతం.

యేసు చనిపోతాడనుకున్నాం. ఆయన చనిపోవటం అద్భుతం కాదు. అందులో ఏ సూచకక్రియాలేదు. ఆయన చావకపోతే ఓహె- అదే అద్భుతం. అందుకే వాళ్లంటారు- " అది కాలాన్ని గురించి” అని. మునిగిపోయేవాడు గడ్డిపరకనైనా పట్టుకుంటాడు. మునిగిపోయే ఆడమనిషైనా అంతే చేస్తుంది. "కాదు అది కాలాన్ని గురించి" అన్నారు. “సరే దాని నెరవేర్చాడా?” అన్నాను. “ఆయన నెరవేర్చాడు” అన్నారు. ఎలా అన్నాను? మాటలు చెప్పటం చాలా సుళువు. ఆయన్ని ఎప్పుడు సిలువ వేశారు? క్రైస్తవ ప్రపంచమంతా “మంచి శుక్రవారం” రోజున అంటారు. బ్రిటన్, ఫ్రాన్, జర్మనీ, లెసోతో, జాంబియా, దక్షిణాఫ్రికాలలో మనకు సెలవురోజుకూడ. మంచి శుక్రవారంలో ఏం “మంచి” ఉంది? అని అడుగుతున్నాను.

క్రైస్తవుడంటాడు. "క్రీస్తు మన పాపాలకోసం చనిపోయాడు. అదే మంచి కాబట్టి అని, కాబట్టి ఆయన మంచి శుక్రవారం రోజున సిలువ వేయబడ్డాడు. ఉదయమా, సాయంత్రమా? సాయంత్రమేనంటాడు క్రైస్తవుడు. సిలువ మీద ఎంత సేపున్నాడు? మూడు గంటలని కొంతమంది అంటే ఆరుగంటలని ఇంకొంతమంది అంటారు. మీతో వాదించదలుచుకోలేదు. మీరు ఏం చెప్పిన నేను అంగీకరిస్తాను. ఆయన్ని సిలువ వేయదలుచున్నప్పుడు వాళ్లు తొందరలో ఉన్నారని మీకు లేఖనంలో కానవస్తుంది. కేవలం 12 గంటలలోనే ఆయన ఆరు న్యాయవిచారణలను ఎదుర్కోవలసి ఉన్నదని, అందుకని వారెంతో తొందరలో ఉన్నారని “పునరుత్థానం” అనే పుస్తకంలో జోష్ అంటాడు.

ఇలాంటి విషయాలు సినిమాల్లోనే జరుగుతుంటాయి. 12 గంటల్లో ఆరు విచారణలు, అర్థరాత్రి నుండి తెల్లవారేదాకా అంటే సినిమాల్లోనే జరుగుతాయి. కాని మీరేం చెప్పినా వింటాను. ఏం చెప్పినా  అంగీకరిస్తాను. ఆయన్ని సిలువ నెక్కించాలని వాళ్లు తొందరపడుతున్నారు. ఎందుకో మీకు తెలుసా? యేసుక్రీస్తు యూదుడు ఆయన్ని సామాన్యజనం ప్రేమించారు. ఆ జనానికి భయపడి, ఆయన గుడ్డివాళ్లకు చూపునిచ్చాడు, రోగులు, కుష్టువ్యాధిగ్రస్తులు బాగయ్యారు, ఆయన మృతుల్ని లేపాడు. వేలమందికి రొట్టె చేపలిచ్చి పోషించాడు. ఆయనోక నాయకుడు. తమ నాయకుడి ప్రాణం ముప్పులో ఉందని తెలిస్తే సామాన్యజనం అలజడి చేస్తారు. అందుకే అర్థరాత్రి విచారణ, పొద్దున్నే పిలాతు దగ్గరకు తీసికెళ్ళారు. “ఈ కుంపటిని హేరోదు దగ్గరకు తీసికెళ్ళండి” అన్నాడు పిలాతు. “నాకిందులో ఆసక్తి లేదు. పిలాతు దగ్గరకే తిరిగి తీసికెళ్ళండి”అంటాడు హేరోదు. తొందర, తొందర, తొందర. 12 గంటల్లో 6 విచారణలు. ఇక వాళ్ళకి వేరేపని ఏదీలేనట్లు. అయినా మీరు చెప్పిందే నమ్ముతాను.

మీ సాక్షుల ప్రకారం వాళ్ళాయన్ని సిలువ ఎక్కించగలిగారు. ఎంత తొందరగా ఎక్కించారో అంత తొందరగానే దించాలని కూడా తొందరపడ్డారు. ఎందుకో మీకు తెలుసా? సబ్బాతు ఉంది గనుక. శుక్రవారం సూర్యాస్తమయం కాగానే ఆరుగంటలకు సబ్బాతు మొదలవుతుంది. యూదులు రాత్రిపగలు, రాత్రిపగలు అంటూ రోజుల్ని లెక్కిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు మన రోజుమొదలవుతున్నది.

సబ్బాతు రోజున ఎవడూ సిలువ మీద వ్రేలాడుతూ ఉండకూడదని ద్వితీయోపదేశకాండంలో యూదులకు చెప్పబడింది. గనుక సూర్యుడు అస్తమించేలోగా ఆయన దేహాన్ని శిలువ మీద నుంచి దించాలని వారు తొందరపడ్డారు. ఆ శవం దేశాన్ని కలుషితం చేస్తుందట. కాబట్టి త్వరగా, త్వరగా అంటూ దేహాన్ని దించి శవస్నానం చేయించి, వందపౌండ్డ సుగంధద్రవ్యాలు (మందు) పూసి, ఆ సమాధిగదిలో ఉంచారు. సమాధికాదు, సమాధిగృహం. భూమిపైనే ఉన్న ఒక పెద్దగది. అది సాయంత్రం. జోష్ గారి పుస్తకంలోనే కాలవివరాలున్నాయి. శవస్నానకార్యక్రమాలకు కనీసం ఓ గంటపైనపడుతుంది. అది మధ్యాహ్నం మూడుగంటలట, శవానికి స్నానసంస్కారాలు యూదులు ఎలా చేస్తారో మీరు చదివి తెలుసుకొండి. దానికి గంటపైనా పడుతుంది. తొందర తొందరలోనే వాళ్లు ఇదంతా చేయగలిగారు. 12 గంటల్లో 6 విచారణలు జరిపారు. ఇప్పుడు సమాధిలో ఉంచారు.

ఆయన్ని లోపల పెట్టేటప్పటికి అది సాయంత్రం. కాబట్టి గమనించండి. నా చేతివేళ్లను చూడండి. శుక్రవారం రాత్రి ఆయన సమాధిలో ఉన్నాడు, శనివారం పగలు సమాధిలో ఉ న్నాడు, శనివారం రాత్రికూడా. కాని ఆదివారం ఉదయం మగ్దలేని మరియ వెళ్ళేటప్పటికి సమాధి ఖాళీగా ఉంది. మీ సాక్షులు చెబుతున్నది ఇదే. ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు చెప్పండి. బహుశా బహుశా బహుశా.... ఎందుకనో తెలుసా? ఎందుకంటే వాస్తవంగా ఆయన ఎప్పుడు బయటికొచ్చాడొ బైబిలు చెప్పటం లేదు. ఆయన శుక్రవారం రాత్రే బయటికొచ్చి ఉండొచ్చు. ఎలా వచ్చాడొ బైబిలు చెప్పటం లేదు. కాబట్టి శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి. ఎన్ని రాత్రుళ్ళో, ఎన్నిపగళ్ళో చెప్పండి. రెండు రాత్రులు ఒక పగలు. యోనా లాగానే మూడు రాత్రులు మూడు పగళ్లు మనుష్యకుమారుడు ఉంటాడని యేసు చెప్పినట్లుగానే ఇది ఉందా? మూడుమూడు అదైతే రెండు ఒకటి ఇది. రెండూ ఒకటేనేమో చెప్పండి.

మీ స్వంత పుస్తకంలో అసలు మీరేం చదువుతున్నారు? యోనా సూచకక్రియ ఒక అద్భుతం ఆ ఒక్క అద్భుతం ఏమిటంటే చనిపోతాడనుకున్న మనిషి చనిపోలేదు. యేసుక్రీస్తు కూడా చనిపోతాడని మనం అనుకున్నాం. ఆయన చనిపోతే అదొక సూచకక్రియ కాదు. ఆయన చనిపోకపోతే అది ఒక సూచక క్రియ.

మిస్టర్ చైర్మన్, లేడీస్ అండ్ జంటిల్మెన్; ఒక పద్ధతి ప్రకారం మీకు బ్రెయిన్ వాష్ చెయ్యబడింది. మీరు మళ్ళీ మామూలు పద్ధతిలోనే మీ పుస్తకం చదువుతారు గాని అర్థం చేసికుంటూ చదువరు.

థాంక్యూ వెరీమచ్ లేడీస్ అండ్ జంటిల్మేన్.

సమాప్తము

సమాధానం: ప్రారంభం (50 నిముషాలు)

జోష్ మేక్డోవెల్

సభకు విచ్చేసిన స్త్రీ పురుషులందరికీ వందనాలు. సిలువ పునరుత్థానాల గురించి ఇస్లాం, క్రైస్తవ దృక్పథాలను వివరించే ఈ చర్చలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన దీదాత్ గారికి, అద్భుతమైన ఈ పట్టణ ప్రజలకు, ఈ దక్షిణాఫ్రికా దేశానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ చర్చకు సిద్ధపడటంలో నేను ఇస్లామిక్ దృక్పథంలో సిలువను గురించిన అనేక సిద్ధాంతాలను చెప్పవలసి వస్తుందని గమనించలేదు. మొదటిగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిములలో ఎక్కువమంది “బదులు సిద్ధాంతాన్ని” నమ్ముతారు. ఖురాన్లోని 4వ సూరాలో క్రీస్తుకు బదులుగా మరొకవ్యక్తి సిలువ ఎక్కించబడ్డారని యేసుక్రీస్తు ఆకాశానికి ఎత్తుకోబడ్డాడని ఉంది.

అంటే మరొవ్యక్తి సిలువ ఎక్కాడన్నమాట, ఆ వ్యక్తి గురించి ముస్లిములలోనే భిన్నాభిప్రాయాలు ఉండటం చూచాను. కొందరు ముస్లిం రచయితలు సిలువపై ఎక్కించబడిన వ్యక్తి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడని అన్నారు. తబారీ అనే మరొ ముస్లిం రచయిత ఇబ్నెఇస్ హాకను ఉదాహరిస్తూ, ఆ వ్యక్తి సార్గస్ లేక సెర్జియస్ అన్నాడు. బైదవి అనే ముస్లిం పండితుడైతే సిలువ వేయబడింది టిటానస్ అనే ఒక యూదుడికి అని వ్రాశాడు. సిలువ ఎక్కింది ఫలత యూనుస్ అనే యూదుడని అత్తలబి వాదించాడు. ఇంకా వహబ్ ఇబ్నెమనబ్బాహ్ అనే ముస్లిం మేధావి అయితే సిలువ వేసింది అష్మ ఉ అనే యూదల బోధకుడికి అని చెప్పాడు

ఒక అమాయకున్ని సిలువ వేయటం కొంచెం అన్యాయంగా ఉందని కొందరు అంటున్నారు గనుక అసలు సిలువ వేయబడింది యూదా ఇస్కరియోతు అయ్యుంటాడని కొందరి వాదం. ఇప్పుడు దీదాత్ గారు నాకు సరైన సమాధానం ఇవ్వగలరనుకుంటాను. కాని ఖురాన్ లో దానికి ఎలాంటి ఋజువులేదని నాకు తెలుసు. కాని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. యేసుకు బదులుగా మరొక వ్యక్తిని దేవుడు ఎందుకు బలికానిచ్చాడు? బదులు లేకుండానే యేసును దేవుడు ఆకాశానికి ఎందుకు ఎత్తుకోలేకపోయాడు?

దీనికి ఇతరులేమంటారంటే సిలువపునరుర్ధానాల అనంతరం యేసు కొంతకాలం బ్రతికి సహజమరణం పొందాడని. అయితే దీనిని ఎక్కువ మంది ముస్లిములు నమ్మరు మరొమాటలో చెప్పాలంటే “హటరత్ ఈసా (యేసు) చనిపోయాడు” అనేది ఇస్లాంలో ఈ మధ్య పెరుగుతున్న వాదం. ఇలాంటి వాదాలపట్ల నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటాను.

ఇదంతా ముఖ్యంగా వెంటూరిని అనే వ్యక్తి ప్రారంభించాడు, అతనేమన్నాడంటే “యేసుక్రీస్తు సిలువ మీద చనిపోలేదు. ఆయన సృహకోల్పోగానే సమాధిలో ఉంచి తరువాత బ్రతికించారు” ఇస్లాంలోని ఒక తీవ్రవాద తెగ అయిన అహ్మదీయాలది కూడా ఇదేవాదం. ఇది ఖారీయానీల సిద్ధాంతాలలో ఒకటి. దీనిని ఆ తెగ వ్యవస్థాపకుడు వాళ్ళ ప్రవక్త అని చెప్పబడుతున్న మీర్జాగులామ్ అహ్మద్ ప్రతిపాదించారు.

సిలువ వెయ్యడమంటే చనిపోవటమేనని కొందరంటారు. యేసు సిలువమీద చనిపోలేదు గనుక ఆయన్ని సిలువ వేయనట్లేనని వారంటారు. కాని వారి నిర్వచనం ఏ ఆధారంతో ఇస్తున్నారో నాకు తెలియదు. నేనుచేయవలసింది ఇది. మీ ముందు వాస్తవాలను ఉంచుతాను.నా గ్రంథాలలో నేను కనుగొన్న వాటిని మీకు తెలియజేస్తాను. విశాలహృదయులు, విజ్ఞులు అయిన మీరే వాటిని తేల్చుకొండి.

ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏ నేపథ్యంలో వచ్చాయంటే నేను విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా ఒక పుస్తకం రాయాలనుకున్నాను. నా తెలివితేటలతో ఆ మతాన్ని ఖండించాలనుకున్నాను. చివరికి నేను క్రైస్తవుడనే కాదలచుకున్నాను. రెండేళ్ళపాటు చేసిన పరిశోధన వల్ల ఎంతో డబ్బును సమయాన్ని వెచ్చించటం వల్ల నేను సత్యాలను కనుకున్నాను. కేవలం దేవుడు తన గ్రంథమైన బైబిల్ లో చెప్పిన సత్యాలనే కాదు, చరిత్ర పుటల్లో నిక్షిప్తం చెయ్యబడ్డ సత్యాలను కూడా కనుగొన్నాను. స్త్రీ పురుషులారా; క్రైస్తవ్యాన్ని ఖండించటానికి నేను కనుగొన్న సత్యాలు ఇవే. కాని నేను ఆపని చెయ్యలేకపోయాను.

మొదటి సత్యం ఏదంటే యేసు చావుకు భయపడలేదు. వాస్తవానికి ఆయన తన మరణ పునరుత్థానాలను ముందుగానే ప్రవచించాడు. ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు. “ఇదిగో, మనం యేరూషలేము వెళుతున్నాము. మనుష్యకుమారుడు చంపబడబోతున్నాడు. వాళ్ళు ఆయన్ని అన్యులకు అప్పజెబుతారు. ఆయన్ని అపహసించి కొరడాలతో కొట్టి సిలువ వేస్తారు. మూడవ రోజున ఆయన లేస్తాడు” (మత్తయి 20:18,19కు భావ విస్తరణ).

ఇంకో చోట తాను శాస్త్రుల చేతను, ప్రధానయాజకులచేతను, పెద్దలచేతను తిరస్కరించబడి చంపబడుతానని, మూడు రోజుల తరువాత తిరిగిలేస్తానని చెప్పాడు. (మత్తయి 20:18, 19).

మత్తయి 17లో యేసు వారితో ఇలా చెబుతాడు. “మనుష్యకుమారుడు మనుషులచేతికి అప్పగించబడతాడు. వారు ఆయనను చంపుతారు. ఆయన మూడవరోజున తిరిగి లేస్తాడు”

యేసు జీవితాన్ని చదువుతుండగా నేను తెలిసికొన్న రెండవ సత్యం ఏమిటంటే యేసు చనిపోవటానికి ఇష్టబడ్డాడు. మత్తయి 26లో ఆయన ఇలా అన్నాడు “నా తండ్రీ, సాధ్యమయితే ఈ గిన్నే నాయొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టప్రకారము కాదుగాని నీ చిత్త ప్రకారమే కానిమ్ము" (మత్తయి 26: 39).

ఇప్పుడు యేసు తనను దాచుకోవడం లేదు. తానెక్కడ ఉన్నాడో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన్ని వాళ్లు కనుక్కునే స్థలానికే ఆయన వెళ్ళాడు. అధికారులనుండి దాక్కొటానికి ఆయన ప్రయత్నించలేదు. ఏం జరుగబోతున్నదో ఆయనకు తెలుసు “యేసు తనకు జరగబోవు సంగతులన్నీ ఎరిగినవాడు......” (యోహాను 18:4) ఆయనకు తెలుసు, దానికాయన సిద్ధమే. “నేనీ సమయమున నా తండ్రిని వేడుకొనిన పక్షమున ఆయన పండ్రెండు సైన్యవ్యూహములకంటే ఎక్కువ మంది దూతలను (12 6000 మంది యోధులు) నాకు పంపడని నీవనుకొనుచున్నావా?” అంటాడు (మత్తయి 26:53) కాని ఆయన “నీ చిత్తమే నెరవేరాలి తండ్రీ” అని ప్రార్థిస్తాడు దేవుడు ఆయన ప్రార్థన విని ఆయన తన చిత్తాన్ని నెరవేర్చేలా అనుగ్రహిస్తాడు. “నేను దానిని మరల తీసుకొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసికొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను.” అని యేసు అన్నాడు. (యోహను 10:17-18) యేసు దేవమానవుడైయుండి,లోకపాపాలను మోసుకొనిపోవటానికి నిత్యవాక్కుగాను, కుమారుడైన దేవునిగాను వచ్చాడని మీరు గుర్తుంచుకోవాలి. హోలీ బైబిలులోని 2 కొరింథీ 5:21;)లో యేసును దేవుడు మనకోసం పాపంగా చేశాడని ఉంది. మీరు ఆ సమయంలో నిత్యవాక్కు, కుమారుడు అయిన యేసు అనుభవించిన వేదనను ఊహించగలరా?

నేను కనుగొన్న మూడవ సత్యం ఏదంటే యేసు క్రీస్తును సిలువ వేసిన పాపం యూదలది కాదు అనేది. నేను చాలా ఆశ్చర్యపోయాను మిస్టరు దీదాత్, యూదుల పక్షాన నీవే వాదిగా ఉండాలి. “మనం ఏరూషలేము వెళుతున్నాము. అక్కడవారు నన్ను పట్టుకొని హింసించి సిలువవేసి చంపుతారు. నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను” అని యేసు అన్నాడు, (మత్తయి 20:18;19) అపరాధి ఎవరైనా ఉంటే ఆయన యేసే. “నా ప్రాణం పెట్టటానికి, దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది (యోహాను 10:18).

ఇంకా మిస్టర్ దీదత్, నువ్వూనేను ఇద్దరం బాధ్యులమేనని నేననుకుంటున్నాను. ఎందుకంటే “ఏ భేదమును లేదు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు” అని బైబిల్ చెబుతున్నది (రోమా 3:23). మన పాపాలే యేసు క్రీస్తును సిలువపై ఎక్కించినాయి.

నేను నేర్చుకున్న నాల్గవ సత్యం ఏదంటే క్రైస్తవులు ఓ గుడ్డి విశ్వాసం వైపు కాదుగాని ఒక విజ్ఞానవంతమైన, తెలివైన విశ్వాసం వైపు పిలువబడ్డారు. మిస్టర్ అహ్మద్ దీదత్ వ్రాసిన “యోనా సూచన ఏది?" అనే చిన్న పుస్తకంలో వందకోట్లకు పైగా క్రైస్తవులు నజరేయుడైన యేసే క్రీస్తు అని గుడ్డిగా నమ్ముతున్నారని వ్రాసి ఉండటం చూచి నేను ఆశ్చర్యపోయాను. నేను కొద్దిగా ఆయోమయంలో పడ్డాను. ఎందుకంటే దీదాత్ గారూ, మీరు ఖురాన్లో నుండి దాన్ని చదివినట్లు, దాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. కాని మీకు సత్యాలు అక్కరలేదు, నిదర్శనాలు అంతకన్నా వద్దు. ఖురాన్లో చెప్పిందాన్ని మీరు తేలిగ్గా అంగీకరిస్తున్నారు. మళ్ళీ బైబిల్ లో యెహోవా చెప్పిందాన్ని (యేసుక్రీస్తుని) క్రైస్తవులు అంగీకరించినప్పుడు వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారని మీరే అంటారు. ముస్లిముల గ్రంథమైన ఖురాన్లోనే యేసుక్రీస్తుకు “అల్ - మసీహ్” అనే బిరుదు ఇవ్వబడింది ఆ పేరు 11 సార్లు చెప్పబడింది. ఖురాన్ను ఇంగ్లీషులోకి అనువదించిన యూసుఫ్లైలీ ముస్లిం అనువాదకుడు అల్-మసీహ్ అనే అరబిక్ మాటను ఇంగ్లీష్ లో క్రీస్తు” అని అనువాదం చేశాడు. యేసే క్రీస్తు అని గుడ్డిగా నమ్ముతున్నామని ఎందుకు మమ్మల్ని నిందిస్తారు?

నా దేశంలో హార్వార్డ్ విశ్వవిద్యాలయ ఖ్యాతిని పెంపొందించిన గొప్ప న్యాయవేత్త డాక్టర్ సైమన్ గ్రీలీఫ్. ఆయన యేసు-నిత్యవాక్కు పునరుత్థానము కాడని ఖండించటానికి పూనుకొని క్రైస్తవుడయ్యాడు. చివరికి యేసు పునరుత్థానం అనేది నాయస్థానాల ధార్మిక ఋజువుల ప్రకారం చరిత్రలో నిరూపితమైన ఒక గొప్ప సంఘటన అనే తీర్మానానికి వచ్చాడు.

మనకాలంలోని సాహితిమూర్తి అయిన సి.యస్. లెవిస్ మధ్యయుగాల సాహిత్య పునరుజ్జీవనం అనే విషయంలో ఆక్స్ఫలో ప్రొఫెసర్. ఆయన మేథస్సును గురించి ఎవరూ ప్రశ్నించలేరు. క్రొత్త నిబంధన నమ్మదగింది కాదని నిరూపించటానికి పూనుకొని చివరికి ఆయన క్రైస్తవుడయ్యాడు. "అయిష్టంగా క్రైస్తవులైన వాళ్లలో నేనొకణ్ణి. కాని నా మనసు నన్ను క్రీస్తు దగ్గరకు చేర్చింది” అన్నాడాయన.

ఇంగ్లాండు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి నలంకరించిన ప్రధానన్యాయమూర్తి లార్డ్ కాల్డ్ కోట్ "క్రైస్తవ్యానికి ఋజువులను పరీక్షించటానికి పూనుకున్న ప్రతిసారీ, అది వివాదాలకు అతీతమైన సత్యమేనని నేను గ్రహించాను” అంటాడు. థామస్ ఆర్నాల్డ్ విశ్వవిద్యాలయంలో 14ఏళ్ళు ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాడు. ఆయన చరిత్రకారుడు. 'రోమ్ చరిత్ర” అనే మూడు సంపూటాలు వ్రాశాడు. ఆయన “యేసుక్రీస్తు పునరుత్థానం లాగా ఋజువులతో సహా నిరూపించబడిన మరే సంఘటననూ నేను మానవజాతి చరిత్రలో ఎరుగను” అన్నాడు.

జర్మన్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ వెర్షన వాన్ బ్రౌన్ నా దేశానికి వలస వచ్చి, ఇక్కడ “అమెరికా అంతరిక్ష కార్యక్రమ” రూపకర్తల్లో ఒకరయ్యారు. ఆయన తాను యేసుక్రీస్తును తన స్వంతరక్షకునిగాను దేవునిగాను తెలుసుకోనంత వరకు ఒక నిజమైన శాస్త్రవేత్తను కాలేకపోయానని చెప్పాడు.

నేను కనుగొన్న అయిదవ సత్యం ఏదంటే బైబిల్, చరిత్రతో సరిగ్గా సరిపోతున్నది. కొత్త నిబంధన యొక్క నమ్మకత్వము, చరిత్రలో దాని పరిరక్షణ అద్వితీయం. దాని మూలప్రతుల అధికారం మీద ఎవరికీ సందేహం లేదు. మూలప్రతి అంటే చేతితో వ్రాయబడింది. ఒక్క కొత్త నిబంధనకే 24 వేల మూలప్రతులున్నాయి. మిస్టర్ దీదాత్, భాషాంతరాలు కాదు మూలప్రతులే, స్త్రీ పురుషులారా, సాహిత్యంలో మూలప్రతుల అధికారం కలిగి రెండవ స్థానాన్ని చరిత్రలో ఆక్రమిస్తున్నది హామర్ వ్రాసిన “ఇలియడ్" (కీ||శ|| 643).

సాహిత్య చరిత్రలో మూలప్రతుల గురించి అధికారపూర్వకంగా చెప్పటానికి సర్ఫ్రెడరిక్కెన్యన్,సమర్థతలోగాని, శిక్షణలోగాని మరెవరికీ తీసిపోడు, బ్రిటిష్ మ్యూజియంలో మాజీ డైరెక్టరు; క్యూరేటరు అయిన కెన్యన్ ఏమన్నాడంటే " ఈ లేఖనాలు మనకు యథాతదంగా, వ్రాయబడినట్లుగానే అందాయా అనే అనుమానానికి మిగిలివున్న చివరి పునాది తొలగించబడింది, కొత్త నిబంధనలోని పుస్తకాల యధార్థత, సాధారణ సమగ్రత ఎట్టకేలకు ఋజువయ్యాయి.

ఇక్కడ విషయం ఏమిటంటే, సాహిత్యం పట్ల చారిత్రక దృక్టథం లేని కొంతమంది మనుషులున్నారు. వాళ్ళేం చేస్తారంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులు వాళ్ల సువార్తల మీద సంతకాలు చెయ్యలేదని గోల చేస్తారు” స్త్రీ పురుషులారా వాళ్లాపని ఎలా చేశారో చూడటానికి దయచేసి మనం వెనక్కి చరిత్రలోకివెళదాం .

మొదటిగా ఆ మూలప్రతులు అధికార పూర్వకమైనవని చక్కగా అంగీకరించబడ్డాయి. ఎందుకంటే అవి ఎవరు వ్రాశారో అందరికి తెలుసు. వాళ్ల పేర్లు వాటిమీద వ్రాయవలసిన అవసరంలేదు.యేసుక్రీస్తును కేంద్రబిందువుగా చేయటమే రచయిత ఉద్దేశం, మత్తయి మార్కు , లూకా, యోహానుల రచనలు అపోస్తలుల యుగంలో జరిగాయి. అపోస్తలుల కాలంలో మొదటి శతాబ్దంలోనే వాటి యదార్థత నమ్మకత్వం పరిశీలించబడి, ఒప్పుకోబడ్డాయి. పూర్తిగా చదవకుండా పరిశీలన చేయకుండా ఉండిన కొందరు ప్రజలు ఈ మత్తయి, మార్కు, లూకా, యోహానులు వ్రాసిన సువార్తలు కేవలం కట్టుకథలేననీ, ఎందుకంటే ఆ రచయితలు యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు గాని, ఆయన తిరిగి లేచినప్పుడు గాని ప్రత్యక్ష సాక్షులుగా ఉండలేదని వాళ్ళంటారు.

ఇలాంటి జనం మార్కు 14:50ను చూపిస్తుంటారు. యేసు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారని అందువలన ఈ వాదాన్ని రెండు నిమిషాల్లో కొట్టిపారేయిస్తామని వాళ్లంటారు. కాబట్టి ప్రతిదీ వదంతే, కట్టుకథే, స్త్రీ పురుషులారా, ఇలాంటి ఆలోచన వ్యాజ్యంలోని వాస్తవాలను తెలుసుకునే సహజమైన తెలివిని నిర్లక్ష్యం చేస్తున్నది. ఉదాహారణకు దాని తరువాత నాలుగు వచనాలు చదవండి అక్కడేముంది “పేతురు ఆయన వెంట పోయెను” చూడండి దీదాత్ గారు, వాళ్ల గుంపుగా ఆయన్ని విడిచి వెళ్లారు, కాని ఒక్కొక్కరే తిరిగి వచ్చారు. 54వ వచనంలో "పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంటపోయెను” అని ఉంది. అతను అక్కడ బంట్రోతులతో పాటు కూర్చున్నాడు. బంట్రోతులతో పాటు కూర్చోని చలికాచుకోవటం, ప్రధాన యాజకుని ఇంటిముంగిట ఉండటం మీరు ఊహించగలరా? స్త్రీ పురుషులారా, మీరు లేఖనాలు చదివితే మార్కు తన సువార్తలో పేతురు ప్రత్యక్షంగా చూచిన సంగతులనే వ్రాశాడని గ్రహిస్తారు. పేతురు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు యోహాను 18:15కు వెళదాం. “సీమోను పేతురను మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటలోకి యేసుతో కూడా వెళ్ళెను.” యోహాను 19:26లో ఇలా ఉంది. “యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను” వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. వాళ్లక్కడే ఉన్నారు.

ఇక, న్యాయస్థానంలో ప్రవేశార్హత గురించి అనేక న్యాయవిషయాలలో మీరు ప్రాచీన పత్ర నియమం గురించి మాట్లాడుతారు. ఈ విషయాలను ధృవీకరించటానికి మీరు న్యాయశాస్త్రం వద్దకు వెళతారు. డాక్టరు జాన్ వార్విక్ మాంట్ గోమరి, సైమన్ గ్రీన్ లీఫ్ న్యాయ పాఠశాలలో డీన్ మరియు లాయర్, ఇంకా ఫ్రాన్స్ లోని స్టాన్బర్గ్ అంతర్జాతీయ వేదాంత కళాశాలలో ఉపన్యాసకుడు కూడా. ఆయన ఏమన్నాడంటే, “ప్రాచీనపత్ర నియమం కొత్త నిబంధనలోని పత్రాలకు, సువార్తలకు చక్కగా వర్తిస్తుంది.బాధ్యతాయుతమైన విమర్శలవల్ల అది మరింత బలపడుతుంది. ఏ న్యాయస్థానంలోనైనా ఈ నియమం దానికి అర్హతలను కలిగిస్తుంది.”

అతిగొప్ప ప్రత్యక్ష సాక్ష్యం సువార్తల్లో కానరాదు. అది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది క్రీ.శ. 55,56లలో వ్రాసింది. దీన్ని కాదనే ప్రఖ్యాత మేథావిని నేను ఇంకా కనుకొవాల్సి ఉంది. పౌలు తాను మారుమనస్సు పొందిన ఇరవై ఏళ్ళ తరువాత ఇది వ్రాసాడు. అతను నాయకులను కలిశాడు. యేరూషలేంలో యేసు సోదరుడైన యాకోబును కలిశాడు. ఆయన యేసు పునరుత్థాన్నాన్ని ప్రత్యక్ష్యంగా చూచిన వాళ్లు 500 మంది కంటే ఎక్కువ ఉ న్నట్లు తనకు తెలిసిందని అంటాడు. దీన్ని న్యాయస్థానంలోకి మీరు తీసికెళితే, ఒక్కొక్క ప్రత్యక్ష సాక్షికి ఆరునిముషాల సమయమిస్తే అందరికీ కలిపి 3000 నిముషాలు లేక 50 గంటలు పడుతుంది.

అయినా, ఇక్కడ అసలు విషయం అదికాదు. ఇదంతా అతనికివ్వబడిన ఉపదేశం. దాన్ని అతను వ్యక్తిగతంగా పరిశీలించుకున్నాడు. కాని పౌలు ఏం చెబుతున్నాడంటే వారిలో చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారట. ఉపదేశం తనకు అందిన నాటికి కాదు, తానామాట చెపుతున్న నాటికే స్త్రీ పురుషులారా, పౌలు చెబుతున్నాడు, “మీరు నన్ను నమ్మకపోతే, వాళ్లను అడగండి.

యేసుక్రీస్తు సందేశాన్ని అపోస్తలులు, శిష్యులు అందించగానే జనం కొత్త నిబంధనలో పాలుపంచుకున్నారు. స్వయంగా శ్రోతలలోనే శత్రువులు, వ్యతిరేక సాక్షులు ఉన్నారనే సంగతిని చాలామంది మరచిపోతున్నారు. చెప్పబడిన సాక్ష్యం నుండి ఎవరైనా తప్పిపోవటానికి ధైర్యం చేస్తే,వెనువెంటనే ఈ వ్యతిరేక సాక్షులు వారిని సరిచేసేవాళ్ళు. దీనినే న్యాయస్థానంలో “క్రాస్ ఎగ్జామినేషన్” (ఎదురు విచారణ) అంటారు. దీనికి బైబిల్లోనేగాకుండా ఇతర అనేక లౌకిక గ్రంథాలలో కూడా ఆధారాలున్నాయి. పోలీకార్ప్ అనే మనిషి అపోస్తలుడైన యోహాను శిష్యుడు. దాదాపు రెండు వేల ఏళ్ల వెనక్కు వెళుతూ అతను వ్రాశాడు “ఈ సువార్తలు ఆధారం చేసుకున్న పునాది చాల స్థిరమైనది. కట్టు కథలు సైతం వీటిని కొట్టి వేయలేకపోయాయి” వాళ్ళు తాము మొదట వినిన దానినుండే వదంతిని ఆరంభించారు, అప్పటికీ వారు యేసు అలా అనలేదని చెప్పలేకపోయారు. యేసు అలా చేయలేదు గనుక వారు అలా చేయలేదు. అందువలన వారు ఆయన చెప్పినది మొదట విని ఇక అక్కడ నుండి వదంతులు అభివృద్ధి చేశారు.

అనేక మంది మేధావులు చివరకు తేల్చింది ఏమిటంటే బైబిల్ మీద ప్రగాఢమైన విశ్వాసమే. మిస్టర్ మిల్లర్, బిని యేల్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగి. అతను ఏమన్నాడంటే, “క్రొత్తనిబంధన మూలగ్రంథం సరిగ్గానే అందజేయబడిందనే విషయం మీద నమ్మకం పెరిగిపోతున్నది.” డాక్టర్ హోవార్డ్ వాక్స్ ఒక పరిశోధకుడు, ఇంకా పురాతత్త్వ శాస్త్రజ్ఞుడు కూడా. ఆయన ఏమన్నారంటే, " సాహితీ సాక్ష్యం ప్రకారం, క్రొత్త నిబంధన యొక్క నమ్మకత్వం ప్రపంచంలోని మరే ఇతర గ్రంథముకంటే కూడా బలంగా ఉంది".

ఇక నేను కనుగొన్న ఆరవ సత్యం ఏమిటంటే యేసు శిలువ వేయబడ్డాడు. ఆధారపడదగిన చారిత్రక గ్రంథాలు ఏం చెబుతున్నాయి? కేవలం క్రైస్తవుల చారిత్రక గ్రంథాల నుండే కాదుగాని ఇతర లౌకిక మూలాల నుండి కూడా నేను వ్రాసిన “తీర్పు కోరుతున్న సాక్ష్యం” అనే పుస్తకంలో వీటిని ఉదాహరించాను. ఆయన తన సిలువ మరణాన్ని కేవలం ప్రవచించటమే కాదు. ఆయన నిజంగానే సిలువ వేయబడ్డాడు. ఆయన తాను కొరడాలతో కొట్టబడి సిలువ వేయబడతానని చెప్పాడు. యోహాను 19:17-18లో “వారాయనను తీసుకువెళ్ళారు.” ఆయన తన సిలువను మోస్తూ కపాలమనబడే చోటికి వెళ్ళాడు. అక్కడ ఆయన్ని సిలువ వేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని ఆయనకు రెండు వైపులా సిలువ వేశారు.”

నిజంగా ఏం జరిగిందో చూద్దాం. యేసును రోమీయులు కొరడాలతో కొట్టారు, అంటే అర్థం ఏమిటి?

రోమీయులు ముద్దాయిని నడుము వరకు దుస్తులు విప్పి న్యాయస్థానంలో కట్టి వేస్తారు. తరువాత ఒకటిన్నర అడుగుల పొడవుండే కొరడాకర్ర తీసుకుంటారు. ఆ కర్ర చివర నాలుగు తోళ్ళు ఎముకలతోగాని, సీసపు బంతులతో గాని వేలాడుతుంటాయి. వాటికి ముళ్లుంటాయి. అవి వేరు వేరు పొడవులతో ఉంటాయి ఒకేసారి ఇవన్నీ మనిషి వీపును మోదేలా రోమీయులు కొట్టేవారు. యూదులు కేవలం 40 దెబ్బలు మాత్రమే అనుమతించేవారు. లెక్కపెట్టడంలో ఏమైనా పొరపాటు జరుగుతేందేమోననే భయంతో ఎప్పుడూ 39 దెబ్బలు మించి కొట్టేవారుకాదు. రోమీయులు మాత్రం వాళ్లకిష్టమొచ్చినన్ని దెబ్బలు కొట్టేవారు. అందుకే రోమీయులు యూదుల్ని కొట్టేటప్పుడు వాళ్ళను రెచ్చగొట్టడానికి 41 గాని అంతకంట ఎక్కువ దెబ్బలుగాని కొట్టేవారు. కాబట్టి వారు యేసును కనీసం 41 దెబ్బలైనా కొట్టి ఉంటారు.

సిలువ శిక్షమీద చాలామంది వైద్యవేత్తలు పరిశోధన చేశారు. ఫ్రాన్స్ కు చెందిన డాక్టర్ బార్బట్, అరిజోనాకు చెందిన డాక్టర్ సి. ట్రూమన్ డేవిస్ వారిలో ఇద్దరు. ఆయన రోమీయుల కొరడా దెబ్బల గురించి ఇలా చెప్పారు.

“బరువైన కొరడాతో ఒక వ్యక్తి భుజాలు, వీపు, కాళ్లకు తగిలేలా బలంగా మళ్ళీ మళ్ళీ కొట్టేవారు. మొట్టమొదట దాని ముడులు చర్మాన్ని చీల్చేవి. తరువాత దెబ్బలు పడుతుంటే చర్మంలోపలి పొరల్ని చీలుస్తూ, రక్తనాళాలలోని రక్తం ధారగా ప్రవహించేది. చివరికి కండలలో ఉండే ధమనులలోని రక్తంకూడా వెలికి వచ్చేది సీసపు గుండ్లు లోతైన గాయాలు చేసేవి దెబ్బలు ఆ గాయాల్ని వెడల్పుగా చేసేవి. చివరికి వీపుపైని చర్మమంతా రిబ్బన్లలాగా వేలాడేది, ఆ ప్రదేశమంతా గుర్తించటానికి వీలులేని మాంసపు ముద్దలా మారేది.”

కొన్ని సార్లు వీపుపగిలి పేగులు కూడా బయటపడేవట. కేవలం కొరడా దెబ్బవల్లనే చాలామంది చనిపోయేవారు. కొరడాలతో కొట్టాక వారు యేసును సిలువ స్థలం వద్దకు తీసుకెళ్ళి ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు దించారు, శుక్రవారం సాయంత్రం మిగతా ఇద్దరు దొంగల కాళ్లు విరుగగొట్టారు కాని యేసు కాళ్లు విరుగ గొట్టలేదని ఉంది. వాళ్ల కాళ్లు ఎందుకు విరుగగొట్టారు? సిలువ మీద నీవు వేలాడేటప్పుడు లేదా వాలిపోయినప్పుడు వాళ్లు కాళ్ళ క్రిందనుంచి వంచి వాటిగుండా శీలలు ఊడగొట్టేవారు. సిలువ మీద నీవు చనిపోతే తరచుగా ఏమీజరుగుతుందంటే నీ ఊపిరి ద్వారానే నీవు చనిపోతావు శ్వాసకోశ కండరాలు బిగుసుకుపోయి నీవు గాలి వదల లేవు నీవు గాలి పీల్చగలవుగాని, వదలలేవు.

ఆ విధంగా నీవు అక్కడే వ్రేలాడుతూ ఊపిరి ఆడకుండా ఉంటావు. నీవు గాలి పీల్చాలంటే కాళ్ళను తోక్కిపట్టి పైకిలేవాలి. మనిషిని త్వరగా చంపాలనుకుంటే వాళ్ళు కాళ్ళు నరికేవారు, అంటే ఇక ఆ మనిషి పైకి లేవకుండా అలా సిలువ మీద వాళ్ళు చనిపోయేవారు. యేసు కాళ్ళు విరుగగొట్టలేదు. పరిశుద్ధుడైన దేవుడు, బైబిల్లో తన పరిశుద్ధవాక్యంలో “యేసు చనిపోయాడు” అని తెలియపరచాడు. స్త్రీ పురుషులారా, వాళ్ళు ఆయన కాళ్ళు విరుగగొడితే ఆయన మన మెస్సీయ కాడు. ఆయన “నిత్యవాక్యం” అయివుండేవాడు కాడు. ఎందుకంటే పాతనిబంధనలో యెహోవా దేవుడు, ఆయన కాళ్ళు విరుగగొట్టబడవని కీర్తనల గ్రంథంలో ప్రవచనమిస్తాడు. స్త్రీ పురుషులారా , దేవుడైనా యెహోవా ఏం జరుగుతాయని చెప్పాడొ వాటినే యేసు నెరవేర్చాడు.

ఆ తర్వాత నేను కనుగొన్న ఏడవ సత్యం ఏమిటంటే క్రీస్తు చనిపోయాడు స్త్రీ పురుషులారా, యెహాను 19:30 ;) చూడండి. యేసు తాను చనిపోవాలని కోరుకున్నాడు. అందుకే ఆయన ఎక్కువ సేపు తీసుకోలేదు. ఆయన చనిపోవటానికే వచ్చాడు. “నేను నా ప్రాణం పెడుతున్నాను” అన్నాడాయన. యోహాను 19లో "ఆయన తన తలవాల్చి తన ఆత్మను అప్పగించెను- సమాప్తమైనదని చెప్పి” అని ఉ౦ది. ఆయన చావును కోరుకున్నాడు. ఇప్పుడు యోహాను 9:34లో రక్తము, నీళ్ళ యొక్క సూచన మీకు ఉంది. (దీదాత్ గారు, యేసు క్రీస్తు చనిపోలేదు అనటానికి దీనినే తన పుస్తకంలో సాక్ష్యంగా పేర్కొన్నారు.

ఆయన సిలువ మీద ఉన్నాడు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వాళ్ళు గుర్తించారు. కాని మీరన్నట్లుగా చివరిగా ఒక చావు దెబ్బ కొట్టాలని అనుకొన్నారు. ఒక బల్లెం తీసుకొని ఆయన పక్కలోపొడిచారు. రక్తము, నీళ్ళు విడివిడిగా కారాయని కళ్ళారా చూచిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఈ ప్రక్రియ క్రీస్తు బ్రతికే ఉన్నాడనటానికి నిదర్శనమని దీదాత్ గారు తన పుస్తకంలో నచ్చజెప్పబోయారు. దీనికోసం 1949లో “తింక డైజెస్ట్"లో ఒక అనస్తీ సిలయాజిస్టు వ్రాసిన వ్యాసాన్ని ఉదహరించారు. ఈ విషయమై అనేకమంది నుండి నేను వైద్య పరిశోధనా వివరాలను సంపాదించగలిగాను.

కేవలం వాటిలో రెంటిని చెప్పటానికి మాత్రమే నాకు సమయం ఉంది. మొదటగా ఒక మేధావి దృక్టథంలో ఈ పత్రికలో వెలువడిన విషయాన్ని అనేక వైద్య, విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు చాలా పాత విషయంగా, నవీన వైద్య పరిజ్ఞానం సోకనిదానిగా ప్రకటించాయి

రెండవది వైద్య దృక్పథంలో: యేసుకు తగిలిన గాయం ఒక బ్రతికిన మనిషికి తగిలి ఉన్నట్లయితే, గాయం అలా తెరుచుకుని రక్తం కారేది కాదు. ముందు గుండె కుహరంలోకి ప్రవహించి అంతర్గత రక్తస్రావంగానే ఉండేది.గాయం తెరుపబడగానే ఆ రంధ్రంలోంచి రక్తం కారుతుండాలి. బల్లెం బయటకు రాగానే రక్తము, నీళ్ళు బయటికి కొట్టుకురావటానికి తగినంత ఖచ్చితమైన కాలువ తయారయ్యేలా పొడవటం సాధ్యం కాదు సిలువ వేయబడిన వ్యక్తిలోపలే ఎంతో నష్టం జరిగి ఉంటుంది. అప్పుడు గుండె ప్రాంతంలో బల్లెంతో పొడవటమంటే మనిషి వెంటనే చనిపోతాడు. యూదులు సమాధి చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది. అనే వివరాలలోకి ఇక వెళ్లాల్సిన అవసరం లేదు.

మసాసు చెట్స్ జనరల్ హాస్పిటల్ లో వైద్యులు చాలా ఏళ్ళపాటు గుండె పగిలి చనిపోయినవారి మీద పరిశోధనలు చేశారు, మామూలుగా గుండె పైపొదలలో 20 సి.సి.ల ద్రవం ఉంటుంది. దీనిని పెరికార్డియల ప్లూయిడ్ అంటారు. గుండె పగిలి చనిపోయిన మనిషికి ఇది 50 సి,సి లు ఉంటుంది. ఇది గడ్డకట్టిన రక్తం లాగా, ద్రవంలాగా బయటికి వస్తుంది. బహుశా దీనినే వాళ్ళు ఆ సమయంలో చూచి ఉండవచ్చు.

ఇక యూదులు సమాధి చివరి చావుదెబ్బ "యోనా సూచన ఏది?” అనే తన పుస్తకం 9వ పేజీలో అహ్మద్ దీదాత్ “యేసును యూదుల పద్ధతిలో శవస్నానం చేయించి, 100 పౌండ్ల బరువుతూగే కలబంద, సాంబ్రాణి ఆయనకు పూతపూశారని వ్రాశాడు. వీపు బద్దలయ్యేలా కొరడాలతో కొట్టబడి, శిలువ వేయబడి, నీ చేతులు కాళ్ళలో సీలలు కొట్టుబడి, నీపక్కలో బల్లెంతో పొడువబడిన తరువాత నిన్ను కిందికి దించి సిమెంటు లాగా అంటుకుపోయే సుగంధ ద్రవ్యాలు ఒక వంద పౌండ్ల ఎత్తు నీకు ప్లాస్టర్ వే....... అప్పుడు బ్రతకటం పునరుత్థానంకంటే గొప్ప అద్భుతం అవుతుంది.

ఇక రోమీయుల గొప్ప క్రమశిక్షణ. క్రీస్తు అప్పటికే చనిపోవటం. వారు వచ్చి దేహంకోసం అడగటం పిలాతును ఆశ్చర్యపరచింది. అతను ఒక శతాధిపతిని పిలిచి యేసు చనిపోయిన సంగతిని ఋజువు పరచుకొనిరాపో" అని పంపాడు. స్త్రీ పురుషులారా, ఈ శతాధిపతి వెర్రివాడు కాడు - తన భార్యను విధవరాలుగా వదిలిపోవటానికతను సిద్ధంగా లేడు.

శతాధిపతి ఎప్పుడైనా శిక్షను అమలు జరిపిన నలుగురినీ పరిశీలిస్తాడు. అది రోమీయుల ధర్మశాస్త్రము. శిక్షను అమలు జరపటానికి నలుగురు ఉండాలి. ఒకడు ఎవడైనా శిక్ష విధించటంలో కొద్దిగా లోపం చేస్తే మరొకడు వాడిని పట్టుకుంటాడు. మరణధృవీకరణ పత్రం మీద నలుగురు సంతకం చేస్తారు. గనుక అది ఖచ్చితమై ఉంటుంది. రోమీయులలో క్రమశిక్షణ చాలా తీవ్రము.

ఉదాహరణకు అపొస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో దేవదూత పేతురును చెరసాలలో నుండి బయటికి తెస్తే ఒక మనిషి తప్పించుకుపోవటానికి కారకులయ్యారని కాపలా వాళ్లందరిని హేరోదు ఉరితీయించాడు అదే 16వ అధ్యాయంలో పౌలు, సీలలు ఉన్న చెరసాల తలుపులు తెరవబడ్డాయి. వారి సంకెళ్ళు తెగిపడ్డాయి. ఇది చూడగానే కావలివారి అధిపతి కత్తిదూసి ఆత్మహత్య చేసుకోబోయాడు. “ఒక్క నిముషం ఆగు” అన్నాడు పౌలు. ఏం జరుగుతుందో చెరసాల అధికారికి తెలుసు.రోమీయులచేత ఉరితీయబడటం కంటే తనను తాను చంపుకొనటమే మేలని భావించాడు.

ఇక క్రీస్తు చనిపోయాడు. యూదుల చరిత్రకారుడైన ఫ్లెవియస్ జోసెఫస్ తాను క్రీ||శ||లో ఏరూషలేము వెళ్ళినప్పుడు, టైటస్ ఆ పట్టణాన్ని ధ్వంసం చేస్తుండగా, తన స్నేహితులు ముగ్గురిని సిలువ వేయడం ఆయన చూశాడు వారిని కొరడాలతో కొట్టారు. ఆయన అధికారి వద్దకు వెళ్ళి “వారిని విడిచిపెట్టండి” అని అడిగాడు. ఫ్లెవియస్ అనే పేరు జోసెఫనన్ను తన కుటుంబంలోకి తెచ్చుకోవటం ద్వారా రోమ్ చక్రవర్తి అతనికి ఆ పేరు పెట్టాడు. అందువలన యూదునిగా అతనికి పలుకుబడి వచ్చింది. వెంటనే రోమా అధికారి వారిని సిలువపై నుండి దింపించాడు. స్త్రీ పురుషులారా, అప్పటికే ఆ ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. కొద్దిసేపటి క్రితమే వారిని సిలువ వేసింది. వెంటనే దించారు కూడా. సిలువ శిక్ష అంత క్రూరమైనది.

యేసు చనిపోయాడని యూదులకు తెలుసు. మత్తయి 27లో వారు రోమా అధికారి వద్దకు వెళ్ళి “అయ్యా! అతను బ్రతికి ఉండగా....... అంటారు అంటే ఇప్పుడతను ఎలా ఉన్నాడు. చనిపోయి ఉన్నాడు. “అతను బ్రతికి ఉన్నపుడు - మూడు రోజుల తర్వాత నేను లేస్తానని అతను చెప్పాడు " యూదులు తాము పొరపాటు చేసినట్లు గ్రహించారని దీదాత్ తన పుస్తకాలలో వ్రాశారు. అతను నిజంగా చనిపోలేదు గనుక ఇక రెండో తప్పు చేయకూడదని వాళ్ళనుకున్నారు. అందుకే వారు వెళ్ళి ఒక కావలి బృందాన్నిఅక్కడ నియమింపజేశారు. సరే, ఆయన చనిపోయాడని యూదులే చెప్పారు “అతని దేహాన్ని ఎవరూ ఎత్తుకొని పోకుండా ఎలాంటి మోసం జరుగకుండా చూడాలనే మేము కోరుతున్నాము” అంటారు. ఎన్నో విషయాల గురించి యూదులను నిందిస్తారు. అయితే బుద్దిహీనత గురించి యూదులను ఎప్పుడూ నిందించలేదు. ఆయన చనిపోయాడని వారికి తెలుసు.

నేను తెలుసుకున్న మరో సత్యం యూదుల సమాధి విధానానికి సంబంధించింది. సబ్బాతు వస్తుంది గనుక అతన్ని సమాధి చేయటానికి వాళ్ళు తొందరపడుతున్నారు, అని కొందరంటారు. స్త్రీ పురుషులారా, నేనీ విషయం వివరంగా పరిశీలించాను. “పునరుత్థానమూలం” అనే నా పుస్తకంలో సమాధి కార్యక్రమము చాలా ముఖ్యమైనదని, వారాపని సబ్బాతునాడైనా చేయవచ్చునని వ్రాశాను. సబ్బాతు వచ్చిపడుతున్నదని వారు భయపడనక్కరలేదు. సబ్బాతు మొదలయ్యే సమయానికి శవం సిలువ మీద వ్రేలాడుతూ ఉండరాదని వారు కోరుకున్నారు.కాని ఆయన్ని సమాధి చెయ్యటానికి వాళు వీలైనంత సమయం తీసుకోవచ్చు. వాళ్ళాయన దేహాం చుట్టూ 100 పౌండ్ల సుగంధ ద్రవ్యాలను బంకలాంటి సిమెంటు పదార్ధంతో కలిపి పూస్తారు.

శవాన్ని వాళ్ళు నిటారుగా సాగదీస్తారు. 30 సెంటీమీటర్ల వెడల్పుగల ఒక నారవస్త్రం తీసుకుంటారు. కాళ్ళ దగ్గర నుండి చుట్టుకుంటూ వస్తారు. గుడ్డమడతల మధ్య ఆ సుగంధ సిమెంటును వేస్తారు. అలా చంకల దాకా చుట్టి, చేతులు క్రింద పెట్టి దాని వ్రేళ్ళ దగ్గర నుండి మళ్ళీ మెడదాకా చుట్టుకొస్తారు. తల చుట్టూ మరో గుడ్డ చుడతారు. ఈ పరిస్థితిలో, ఆ పొదుగు బరువు 1 17 నుండి 120 పౌండ్ల వరకు ఉండగలదని నా అంచనా.

యేసు క్రీస్తు సమాధి దగ్గర అతి తీవ్రమైన కాపలా ఏర్పాటు చేశారనేది నేను కనుగొన్న మరో సత్యం. సమాధి ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బండ దొర్లించి మూశారనేది ఒకటి. అది మహా పెద్దరాయి అని మార్కు అంటున్నాడు. 20 మంది మనుషులు కలిసి కూడా దాన్ని కదిలించలేరని మొదటి శతాబ్దంలోని ఒక చారిత్రక ఆధారం సూచిస్తున్నది. ఇది కొద్దిగా అతిశయోక్తేనని నేను అనుకొంటున్నాను. కాని రాయి పరిణామాన్ని గురించి ఆయన చెబుతున్నాడు ఈ రాతిని గురించి నేను చెప్పిన మాటలు విని ఇద్దరు ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు ఇశ్రాయేలు వెళ్ళారు. క్రైస్తవేతర ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు అయిన వీరు నాలుగున్నర నుండి అయిదడుగుల వరకు ఉంటే యూదుల సమాధుల ద్వారాలను మూయటానికి కావలసిన రాయి సైజును లెక్కగట్టారు ఆరాయి కనీసం ఒకటిన్నర నుండి రెండు టన్నుల బరువు ఉంటుందని నాకొక సవిరమైన లేఖ వ్రాశారు.

మిస్టర్ దీదాత్, తన పుస్తకాలలో ఎవడో ఒకడో ఇద్దరో ఆ రాయిని ద్వారానికి దొర్లించి పొయ్యారని వ్రాశాడు. కాబట్టి ఒకడో ఇద్దరో తిరిగి దాన్ని వెనక్కి దొర్లించవచ్చు. అరిమతయి యోసేపు దాన్ని ద్వారానికి దొర్లించాడని అంటారు. ఈనాటి సంభాషణలో మీరు చెప్పలేని విషయాలను బైబిలు మీదనో ఖురాన్ మీదనో రుద్దవద్దు. ఉదాహరణకు : నేను ఈ స్టేడియం దగ్గరకు వచ్చినపుడు ఒక సోదరుణ్ని ఈ కుర్చీలన్నీ ఎవరు ఇక్కడకు చేర్చారు? అని అడిగాను. “దీదాత్ తెచ్చారు” అని అతను చెప్పాడు. మిస్టర్ దీదాత్, ఈ 700 కుర్చీలు నీవు స్వయంగా మోసుకొచ్చావా? లేదు! ఇంకా ఎంతో మంది వాటిని తెచ్చారు. ఈ సమావేశం దీదాత్ గారే ఏర్పాటు చేశారని నేను చెప్పుకుంటూ వెళ్లవచ్చు.కాని ఈ ఏర్పాట్లలో సహాయపడిన వారు ఇంకా ఎందరో ఉండవచ్చని నేను అనుకొంటున్నాను.

ఫ్రాన్స్ ను హిట్లర్ జయించాడని చరిత్ర చెబుతున్నది. అతడి ప్రయత్నం ఫ్రాన్స్ లో మాత్రమే చేసి ఉండవచ్చు. కాని ఈ పని దక్షిణాఫ్రికాలో మాత్రమే అతను చేస్తాడని నేను అనుకోను.

అరిమతయియ యోసేపుకు సహాయపడిన వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు. ఇంకా సమాధులకు పల్లము వైపుగా ఓ గాడి ఉంటుంది. రాయిని ఆ గాడిలో ఉంచుతారు. దానికి అడ్డం ఉంటుంది. ఇక స్త్రీ పురుషులారా, ఆ రాయిని నా ఏడేళ్ళ కుమార్తె కూడా దొర్లించగలదు. దానికున్న అడ్డాన్ని తీసేస్తే సమాధి ముందుకు అదిదొర్లి వచ్చి ద్వారాన్ని మూసేస్తుంది.

తరువాత, అక్కడ కాపలా ఉంచబడింది. యూదులు రోమీయుల వద్దకు వెళ్ళి కావలి బృందము కావాలని అడిగారు. దీనికి గ్రీకు మాట "కుస్తోదియా” అంటే 16 మంది గల కావలి బృందం. అందులోని ప్రతివాడూ ఆరడుగుల నేలను రక్షించటానికి తగిన శిక్షణ పొంది ఉంటాడు ఆ విధంగా 16 మంది కలిసి 36 చదరపు గజాల నేలను రక్షించగలరు. ప్రతికాపలాదారుకు ఒంటి మీద నాలుగు ఆయుధాలుంటాయి. అతడొక పోరాడే యంత్రం - గుడి కాపలాదారులలాగానే దాదాపు ఇతనూ ఉంటాడు .

ఇంకా ఆ సమాధి మీద రోమా అధికార చిహ్నాలతో కూడిన ముద్రవేయబడింది. ఆ ముద్ర రోమా సామ్రాజ్య అధికారానికి గుర్తు. యేసుక్రీస్తు దేహం వంద పౌండ్ల కంటే ఎక్కువ బరువుగల సుగంధద్రవ్యాలతో సిమెంటు పేటిక లాగా చేయబడింది. ఒకటిన్నర నుండి రెండు టన్నుల బరువైన రాయి సమాధి ద్వారాన్ని మూసింది. 16 మంది కావలి వాళ్ళ బృందం అక్కడే ఉంది. ఇంకా రోమాముద్ర. అయినా ఏదో జరిగింది. ఇది చారిత్రక విషయం . మూడు రోజుల తరువాత సమాధి ఖాళీ అయినది. సమాధి ఖాళీ అయ్యిందని దీదాత్ అంగీకరించడం కోసం నేను వాదించనక్కరలేదు. కాబట్టి నా సమయాన్ని ఇక్కడ వ్యర్థం చెయ్యను.

యోనా సూచన - మీరు దీన్ని ప్రస్తావించినందుకు నాకు సంతోషంగా ఉంది, యోనా సూచన- ఇది అంత ప్రాధాన్యమైనది కాదు కాబట్టి ఎక్కువ సమయం వెచ్చించను. మీరు ఏదైనా చదివేటప్పుడు, దానిని ఆనాటి భాషలో ఆనాటి సంస్కృతిని కూడా చదవండి. ఇప్పుడు యూదుల భాషకు, ఆనాటియూదుల సంస్కృతికి తిరిగి వెళ్ళండి. ఈనాటిదికాదు. - దక్షిణాఫ్రికాది కాదు, ఇండియన్ ది కాదు అమెరికాది కాదు. ఆనాటి యూదు ఇశ్రాయేలీయుల సంస్కృతి.

మూడు రాత్రులు మూడు పగళ్ళు అంటే అర్థం ఏమిటో మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో - మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉపవాసం చేశారని ఉంది. కాని తరువాత, మూడవ రోజున వారు ఉపవాసం ముగించారు అని ఉంది. యూదుల భాషలో "మూడు రాత్రులు మూడు పగళ్ళు” అంటే “మూడవ రోజువరకు” అని లేదా “మూడవ రోజున” అని అర్థం. మత్తయి 12:40లో యేసు “ఆయన మూడు రాత్రులు మూడు పగళ్ళు సమాధి చేయబడతాడు" అని అంటాడు.

మత్తయి 20లో, ఆయన మూడవ రోజున తిరిగిలేస్తాడు అని యేసు చెప్పాడు- మూడు రోజుల తరువాత కాదు. యూదులు పిలాతు వద్దకు వచ్చి “అయ్యా ఆ వంచకుడు, మూడు రోజులైన తరువాత నేను లేస్తాను అన్నాడు” అంటారు. (మత్తయి 27:63). అందుకే కాపలా అడిగారు. ఇక్కడ భాషనుగమనించండి, “కాబట్టి మూడవ దినపర్యాంతము సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము” మూడవ దినము అయిన తరువాత కాదు. యేసు ఏం చెప్పాడో వారికి తెలుసు. మూడు రాత్రులు మూడు పగళ్ళు అంటే మూడవ దినం వరకు అని అర్థము. “అతని శిష్యులు వచ్చి అతన్ని ఎత్తుకొనిపోకుండా.”

శుక్రవారం ఆరు గంటలకు ముందు, ఆయన్ని సమాధి చేయటానికి వారికింకా మూడు గంటల కాలముంది. అది కేవలం ఒక గంటే పట్టింది. యూదుల తల్మూద్ ప్రకారం, బాబిలోనియా యెరూషలేం తల్మూద్ ప్రకారం, యూదులు రోజులోని ఒక భాగాన్ని (ఓనన్) కూడా పూర్తి రోజుగానే లెక్కిస్తారు. శుక్రవారం ఆరు గంటలకు ముందు అది ఒక నిముషమైనా అది ఒక పగలు ఒక రాత్రి అవుతుంది. శు క్రవారం రాత్రి ఆరుగంటల నుండి శనివారం రాత్రి ఆరుగంటల వరకు మరో రాత్రి మరోపగలు.

స్త్రీ పురుషులారా, యూదుల లెక్క ప్రకారం - మన లెక్క కాదు. శనివారం రాత్రి ఆరుగంటల అనంతరం ఒక్క క్షణం కూడా మరో పగలు రేయీ అవుతుంది. మా దేశంలో ఇదేపని మేము చేస్తాం డిశంబరు 31వ తేదీ అర్థరాత్రికి ఒక్క నిముషం ముందు నాకు కొడుకు పుడితే ప్రభుత్వానికి నా ఆదాయం పన్ను కట్టే విషయంలో నా కొడుకుకు ఒక పూర్తి సంవత్సరం అంటే 365 పగళ్ళు రాత్రులు కలిపి వేసే కాలసూత్రం అమలు చేస్తున్నాము.

రోమా కాపలాదారులు తమ విధులలో విఫలమయితే చంపబడతారు. వాళ్ళ బట్టలు ఊడదీసి వాటితోనే చితిని అంటించి వారిని సజీవంగా తగులబెట్టడం ఒక పద్ధతి. ముద్ర పగిలిపోయింది. ఆ ముద్రను పగులగొట్టిన వారి కోసం కావలివాళ్ళు వెదికారు. ముద్రను పగులగొట్టిన వారికి తలక్రిందులుగా సిలువ వేయటమే శిక్ష,

రాయి తొలగించబడింది. స్త్రీ పురుషులారా, దీనిని జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని దీదాత్ గారిని నేను అడుగుతున్నాను. ఒకటిన్నర నుండి రెండుటన్నుల బరువైన రాయి ద్వారం నుండి పక్కకుకాక, అసలు సమాధి ప్రాంతం నుండే లేపి అవతలకు విసిరివేయబడింది. యేసును బయటకు తేవాలంటే ఇంత చాకిరి ఎందుకు? కావాలి వాళ్ళు చెవుల్లో దూది పెట్టుకుని ఇదంతా వినకుండా నిద్రపోయి ఉంటారు.

తరువాత యోహాను 20లో మరియ సమాధి దగ్గరకు వెళుతుంది. ఆమె ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూయటానికి వెళ్ళిందనీ, పూయటం అంటే నలుగుపెట్టడమని దీదాత్ చెబుతున్నాడు. కాని అది నిజంకాదు. అదే నిజమయితే, ముస్లిములు చేసే పద్ధతి ఇదే అయితే, అది యేసును చంపుతుంది. నేను సిలువ వేయబడితే, నా చేతులు కాళ్ళలో మేకులు దిగగొడితే, నావీపు, పేగులు కనబడేలా చీల్చబడితే, నాపై 100 పౌండ్ల బరువుంటే, ఇంకా నాకు నలుగువేయటానికి ఎవ్వరినీ కోరను. పూయటము అంటే అభిషేకించటం. యాజకులు రాజులు పదవిలో అధిష్టించబడినపుడు అభిషేకించబడేవారని దీదాత్ గారే తన పుస్తకంలో చెప్పారు “నన్ను తాకవద్దు" అనియేసు అంటే “నేనుబాధపడుతున్నాను- నన్ను తాకవద్దు" అని అర్థమని దీదాత్ చెప్పాడు. దాని ప్రక్క వచనమే చదవండి. మిస్టర్ దీదాత్, నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను తాకవద్దు" అని అక్కడ ఉంది.

“నేను నా తండ్రివద్దకు ఎక్కిపోతున్నానని వెళ్ళి నా శిష్యులతో చెప్పు" అంటారాయన. తరువాత కొద్ది సేపటికే "నీవు నన్ను తాకవచ్చు నా కాళ్ళు పట్టుకోవచ్చు” అంటాడు, ఆయన అలా ఎందుకు చేశాడు? స్త్రీ పురుషులారా, ఇది ఒక అతి సుందరదృశ్యం. పాతనిబంధనలో, గుడారంలోని అతి పరిశుద్ధస్థలంలోకి యూదుల ప్రధాన యాజకుడు మాత్రమే వెళతాడు. ప్రజలు బయటే నిలబడాలి. దేవుడు వారి అర్పణలను అంగీకరించకపోతే యాజకుడు చస్తాడు.

యాజకుడు బయటికొచ్చేవరకు ప్రజలు వేచి చూస్తారు. యాజకుడు బయటికొచ్చాక, ప్రజలు ఆనందంతో అరుస్తారు. “దేవుడు మా అర్పణలను అంగీకరించాడు” అంటారు. “నన్ను తాకవద్దు... నేను తండ్రివద్దకు ఎక్కిపోలేదు” అన్నాడు. అప్పటికీ, ఇతరులు తనను తాకిన సమయానికీ మధ్యలో ఆయన తండ్రివద్దకు వెళ్లి వచ్చాడు. తననే అర్పణగా అర్పించాడు. దేవుడు ఈ అర్పణను అంగీకరించాడు. యేసు తిరిగిరాకపోతే, ఇతరులను తాక నివ్వకపోతే దేవుడు ఆయన్ని అంగీకరించలేదన్నమాట. కాని దేవునికిస్తోత్రం, ఆయన తిరిగొచ్చాడు “నేను అంగీకరించబడ్డాను. నన్ను తాకండి" అన్నాడు.

యేసు క్రీస్తు యొక్క భౌతిక - ఆత్మీయ శరీరాన్ని గురించి దీదాత్ గారూ మీరు మా లేఖనాలను మొదట చదవాలని నేననుకొంటున్నాను. మీ లేఖనాలను నేను ఎలా చదివానో మా లేఖనాలను మీరు అలా చదవాలి.
మొదటి కొరింథీ 15:44, 51 ;) మీరు చదవాలి. అందులో మహిమ పరుచబడిన, అమర్త్య దేహాన్ని గురించిన వివరణ ఉంది. అది ఒక ఆత్మదేహం. అతనికి ఆహారం అవసరం లేదు. అయినా అందులో పదార్థం ఉంది. అతనొక తలుపు గుండా నడువగలడు. వాళ్ల సన్నిధిలో ప్రత్యక్షం కాగలడు. అతనికి ఆహారం అవసరం లేదు అయినా అతను అన్నం తింటాడు. లేకపోతే “నీవు ఒక భూతానివి మాత్రమే” అని వారంటారు. కాదు, బైబిలు చెప్పినట్లు అతనికొక పునరుత్థాన, మహిమాన్విత, అమర్త్య, అక్షయదేహాం ఉంది. నేనాగదిలో ఉండి, తలుపులు మూసిన గదిలో, అకస్మాత్తుగా, సిలువ వేయబడి సమాధి చేయబడిన ఆయన, మా మధ్య ప్రత్యక్షమయితే, నేను కూడా భయపడే వాడినే. స్త్రీ పురుషులారా, యేసు క్రీస్తు మరణం నుండి లేచాడు! వందనాలు.

 

ప్రతివాదం (10 నిమిషాలు)

అహ్మద్ దీదాత్

అధ్యక్షా, న్యాయసభలోని స్త్రీ పురుషులారా! యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచివచ్చాడని శిష్యులు అనుకోవటమే పొరపాటని యేసు క్రీస్తు చెప్పిన స్పష్టమైన సందేశం, ఈ సమస్యలో చాలాముఖ్యమైనభాగం. “నాకున్నట్లుగా ఒక భూతానికి మాంసము, ఎముకలు ఉండవు” అని వారికాయన ధైర్యం చెప్పాడు. ఇది రాజుగారి ఇంగ్లీషు. ప్రాథమిక ఆంగ్లము. దీని అంతరార్థం ఏమిటో విప్పి చెప్పటానికి మీకు నిఘంటువుగాని, న్యాయవాదిగాని అవసరం లేదు.

 క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు ఆసాంతమూ చదివినా, అందులో ఎక్కడైనా ఒక్కసారైనా యేసుక్రీస్తు "నేను చనిపోయాను, మృతులలో నుంచి తిరిగి లేచివచ్చాను” అని చెప్పినట్లు లేదు. పునరుత్థానం అనే మాటను క్రైస్తవుడు సుత్తి కొడుతున్నాడు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి దాన్నే చెప్పటం ద్వారా అది సత్యమని ఋజువు చేయదలుస్తున్నాడు. నీవా మనిషిని చూస్తూ ఉంటావు. ఆయన భోజనం చేస్తుంటాడు నిజంగానే పునరుత్థానుడైన వానిలాగా. అతను పైగదిలో కనిపిస్తాడు. అతను పునరుత్థానుడయ్యాడు. కొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో ఒక్క సారికూడా యేసుక్రీస్తు "నేను చనిపోయి తిరిగి బ్రతికాను” అని చెప్పలేదు.

 ఆయనవారితో 40 రోజులున్నాడు. అయినా ఆ మాట అనలేదు. పైగా మరణం నుండి తప్పించుకున్న అదే పాత యేసునని పదేపదే వారికి ఋజువు పరచకోబోయాడు ఎందుకంటే ఆయనను వారు ఎంతకీ గుర్తించటం లేదు. ఎందుకంటే ఆయన మారువేషంలో ఉన్నాడు. ఆయన తనను బహిరంగంగా యూదులకు కనబరచుకోలేదు. వారికి ఆయన ఒక సూచన ఇచ్చాడు. “యోనా సూచన తప్ప మరొక సూచన మీకు ఇవ్వబడదు.” ఈ సూచన తప్ప ఇంకొకటిలేదు. " ఇదిగో నేనే” అని వారికి చెప్పలేదు అని వారికి చెప్పటం కోసం ఏరూషలేము దేవాలయానికి ఆయన ఎన్నడూ తిరిగి వెళ్ళలేదు. ఒక్కసారికూడా. ఎంతసేపటికి దాక్కునే ప్రయత్నంలోనే ఆయన ఉన్నాడు సరే, ఈ గడిచిపోయిన సంగతులను గురించి మేము మీకిప్పుడు సుత్తికొట్టబోవటంలేదు.

విశేషాలు ఏమిటంటే యేసుకు చనిపోవటం ఇష్టమే. అసలు అందుకే ఆయన వచ్చింది అంటున్నారు. ఇప్పుడు నేను చదివిన లేఖనాలు ఏం చెబుతున్నాయంటే ఆయన కేవలం చావటానికి ఇష్టపడకపోవటమే కాదు, యూదుల ముందు తన శక్తిని ప్రదర్శించటానికి కూడా సిద్ధపడ్డాడు. చూడండి, చివరి రాత్రి భోజన సమయంలో, ఆయన ఆత్మరక్షణ సమస్యను లేవనెత్తి శిష్యులకిలా చెప్పాడు “నేను మిమ్మల్ని సంచి,జాలె, చెప్పులు లేకుండా పంపినప్పుడు మీకేమైనా తక్కువయ్యిందా?” (లూకా 22:35)

వాళ్ళు మాకేమీ తక్కువ కాలేదన్నారు. కాని ఇప్పుడాయన వాళ్ళకేమి చెప్పాడంటే, "కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోవాలి” అని, మీరు మీ పై బట్టలు అమ్మి కత్తులు కొనుక్కోవాలి. ఆ కత్తులతో మీరు ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. యాపిల్ కాయల తోళ్ళువలుస్తారా? ప్రజల గొంతులు కోస్తారా? కత్తులతోటి మీరేం చేస్తారు? దానికి వాళ్ళలో ఒకడు “ప్రభువా; ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నాయి” అనగా 'చాలు' అన్నాడాయన.

తరువాత ఆయన 11మంది శిష్యుల్ని వెంటపెట్టుకొని వెళ్ళాడు. యూదా ఆయన్ని పట్టించటానికి అప్పటికే వెళ్ళిపోయాడు. పదకొండు మంది శిష్యులు, ఆయన, గెత్సెమనే తోటకి వెళ్లారు. గెత్సెమనే దగ్గర పుస్తకం చదవండి, మీ సువార్తలు చదవండి - దాని ద్వారం దగ్గర ఎనిమిది మంది శిష్యుల్ని యేసు నియమించినట్లు అవి చెబుతాయి. ఆయన ముందుగా గెత్సెమనే ఎందుకెళ్ళాడు? దాని ద్వారం దగ్గర ఎనిమిది మంది శిష్యుల్ని ఎందుకు నియమిస్తాడు? “మీరిక్కడే ఉండండి. నాతో పాటు మెళకువగా ఉండండి” అన్నాడు.

ఆయన అర్థం ఏమిటంటే, మీరు ఇక్కడ ఆగి, కాపలా కాయండి, దేనికి కాపలా? కాపలాకాయటానికి గెత్సెమనేలో ఏముంది? ఓతోట, ఒలీవ చెట్లు, ఖాళీస్థలం. వాళ్ళెవరు? శిష్యులు. పట్టణానికి ఐదుమైళ్ళ దూరంలోగల గెత్సెమనేకి కాపలా కాస్తున్నారు. ఆయన తనతో పాటు పేతురును, జెబెదయి ఇద్దరు కుమారుల్నీ వెంటబెట్టుకెళ్ళాడు. అందులో కనీసం ఇద్దరి దగ్గర కత్తులున్నాయి. ఆయన వారితో ఒక అంతర్ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని, “మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెళకువగా ఉండండి” అని చెప్పి నేను ఒక్కడినే కొంత దూరం పోయి ప్రార్థిస్తానని వెళ్ళాడు. ఆయన గెత్సెమనెకి ఎందుకెళ్ళాడని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయనక్కడికి ఎందుకెళ్ళాడు? ప్రార్థించటానికా? చివరిరాత్రి భోజనం చేసిన మేడపై గదిలోనే ఆయన ప్రార్థన చేయలేకపోయాడా? వారికి రాయి వేసినంత దూరంలోనే ఉన్న యెరూషలేము దేవాలయానికైనా వెళ్ళలేకపోయాడా? పట్టణానికి ఐదుమైళ్ళ అవతలకి ఎందుకెళ్ళాలి? ద్వారం దగ్గర ఎనిమిది మందిని ఎందుకుంచాలి? ఇంకా లోపల మరో ఆత్మ రక్షణ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఇంకా ఆయన కొంతదూరం సాగిపోయి నేలమీదపడి “నాయనా తండ్రి....... నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయుము” అని ప్రార్థించాడు. అంటే ఈ కష్టం నాకు రానియ్యవద్దు, అయినా నా ఇష్టప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే ఇది జరగాలి అని అర్థం. చివరికి ఈ విషయం నీకే వదిలేస్తున్నాను. కాని నన్ను రక్షించాల్సిందిగా నిన్ను కోరుతున్నాను. “ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువులవలె ఆయెను.” ఆత్మహత్య చేసుకోబోయే మనిషి ఇలాగే ప్రవర్తిస్తాడా? జగత్తుకు పునాది వేసిన నాటినుండి “త్యాగబలి” కోసం నిర్దేశించబడిన వ్యక్తి ఇలానేనా ప్రవర్తించేది అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను

వేదనవల్ల ఆయనకు చెమట పట్టిందట. మరింత ఆతురతతో ప్రార్థనచేస్తే అది రక్త బిందువుల్లాగా నేలమీద పడిందట. కరుణామయుడైన దేవుడు తన దూతను పంపాడని బైబిలు చెబుతోంది. ఆయన్ని బలపరచటానికి దూత వచ్చాడు. ఎలా? దేవుడు ఆయన్ని రక్షించబోతున్నాడని నమ్మకం కలిగించటం ద్వారా, అక్కడ నుండి జరిగిన ప్రతి సంఘటనలోను ఆయన్ని రక్షించటానికి దేవుడు పనిని వ్యూహాలు మీరు చూడవచ్చు. చూడండి. ఆయన యోనా లాగా ఉంటాడని ప్రవచనం ఉంది. కాని ఆయన యోనా లాగా లేడని మనకు తెలిసింది. ఆయన ఆ ప్రవచనాన్ని నెరవేర్చలేదు. యోనా బ్రతికాడు, యేసు చనిపోయాడు.

ఇక పొంతిపిలాతు యేసు చనిపోయాడని చెబితే ఆశ్చర్యపోయాడు. అతనికి తెలిసినంత వరకు సిలువ మీద ఏ మనిషీ మూడు గంటల్లోపల చావలేదు. సిలువ మీద చావు, చాలా నిదానంగా, తీసుకొని తీసుకొని చచ్చేలా ఉంటుంది. సిలువ శిక్ష ఉద్దేశమే అది. సంఘ వ్యతిరేక వ్యక్తిని కాల్చి చంపినట్లు, ఉరితీసినట్లు, కొరతవేసినట్లో ఉండదది. అది అతి నిదానము వేదనాభరితమైన చావు.

ఎముకలు విరుగగొట్టలేదని బైబిలు చెప్పింది. అది ప్రవచనం యొక్క నెరవేర్పు, చచ్చిపొయిన మనిషి యొక్క ఎముకలు విరుగగొట్టినా, విరుగగొట్టకపోయినా ఫలితం ఒక్కటే. ఎముకలు విరుగగొట్టకపోతే, ఆవ్యక్తి బ్రతికి ఉన్నప్పుడే ఆ పనిచెయ్యటానికి సరైన సమయంలేనట్లే. 2000సంవత్సరాల నుంచి ఇది ఒక నిరంతర కార్యక్రమం. ఈ మత కార్యక్రమసారమంతిటినీ పౌలు ఒక్కమాటలలో ఇలాచెప్పాడు. “క్రీస్తు లేపబడియుండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే" (1కొరింథీ 15:14) వ్యర్థమే. ఏం ప్రయోజనం లేదు. మీకు ఏమీ దొరకదు.

కాబట్టి ఇప్పుడు, మునిగిపోయే మనుషులు గడ్డిపోచ చిక్కినా పట్టుకున్నట్లుగా, క్రైస్తవులు తాము రక్షణ పొందటంకోసం, ఏదో ఒక విధంగా సిలువ మీద ఆయన చనిపోయాడని నిరూపించాలి. అధ్యక్షా న్యాయస్థానంలోని స్త్రీ పురుషులారా, మీరు వరుసన జాగ్రత్తగా ప్రవచనాలతో సరిచూసుకొని చదవండి. ఆయన చెప్పింది ఏమిటి, ఆయన ఎలా ప్రవర్తించింది గమనించండి. ఆయన సిలువ వేయబడలేదు అనటానికి అవే తిరుగులేని ఋజువులు.

 

ప్రతివాదం (10 నిముషాలు)

జోష్ మేక్డోవెల్

క్రొత్తనిబంధనలోని 27 పుస్తకాలలో ఎక్కడా యేసుక్రీసు “నేను చనిపోయాను ఇప్పుడు తిరిగిలేచాను” అని చెప్పలేదని మీరు చెబుతున్నారుగాని, నేనీ సంగతి ఎప్పుడూ వినలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. “ఆయన ఇట్లనెను. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను మృతుడనైతినిగాని, ఇదిగో, యుగయుగములు సజీవుడనై యున్నాను. “మిస్టర్ దీదాత్! ఆయన ఇంకా యూదులకు కూడా కనిపించాడు. క్రొత్త నిబంధన సంఘమంతా యూదులచేతనే ప్రారంభించబడింది. ఆయన యూదులలోని విరోధి, అపోస్తలుడైన పౌలుకు అతను తార్సులోని సౌలుగా ఉన్నప్పుడే కనిపించాడు.

కాని స్త్రీ పురుషులారా, యేసుక్రీస్తు పునరుత్థానము, క్రీస్తు నా జీవము, రక్షకుడు అనే అంశాలు నాకు అతి గొప్ప ఉత్తేజాన్నిస్తాయి. ఒక మనిషి క్రీస్తును క్షమాపణ అడిగినప్పుడు అతను ఆ సంబంధంలోకి ప్రవేశిస్తాడని దేవుడైన యెహోవా వాగ్దానం చేశాడు. క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. సమాధి చేయబడి మూడవరోజున తిరిగిలేచాడు. దేవుడు, పరిశుద్ధాత్మ పశ్చాతప్తునిలోకి ప్రవేశించి అతన్ని మారుస్తారు. దీనికి అతిగొప్ప నిదర్శనాలలో ఒకటి నా జీవితమే. యేసుక్రీస్తు ను నా ప్రభువుగాను, నా రక్షకునిగాను గుర్తించి నా చిత్తాన్ని ఆయనకు సమర్పించుకునప్పుడు, ఆయన్ని నమ్మినప్పుడు, స్త్రీ పురుషులారా, ఆరునెలల నుండి ఒక సంవత్సరంలో లేక ఒకటిన్నర సంవత్సరాలలో నా జీవితంలోని ప్రధానరంగాలు మారిపోయాయి.

మొదటిగా, నేనొక పవిత్రమైన దైవికమైన జీవితాన్ని గడపాలనే ఆశను పెంచుకున్నాను. రెండవదిగా, నేను శాంతిని నిజమైన ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టాను. అది నాలో సంఘర్షణ లేనందువల్ల గాదు - సంఘర్షణలోనే క్రీస్తు ద్వారా దేవుడు నా కనుగ్రహించిన శాంతి అది. మూడవదిగా, నేను నా కోప స్వభావాన్ని అణచగలిగాను. నేను యూనివర్శిటీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఓ కుర్రవాణ్ణి చావగొట్టాను. నేను పదేపదే ఉద్రేకం చెందేవాడిని. నేను యేసుని రక్షకునిగాను, ప్రభువుగాను నమ్మిన తరువాత నా కోపం మాయమైపోయింది.

నా స్నేహితులేగాక నా శత్రువులు గూడ దీన్ని గమనించారు. వాళ్ళు నాకు ఎంతో చేశారు. దేవుడు తండ్రి అయిన యెహోవా తోను, ఆయన కుమారుడు నిత్యవాక్యమైన క్రీస్తుతోను వ్యక్తిగత సంబంధం కలిగియున్న ఈ 22 ఏళ్ళలో కేవలం ఒకే ఒక్కసారి నేను కోపపడ్డాను. దీనిమీద నాకు ఆయన ఒక అద్భుతమైన బలాన్ని ప్రసాదించాడు.

స్త్రీ పురుషులారా, ఇక్కడ నేను కృతజ్ఞతాపూర్వకంగా మీతో పంచుకోగల గొప్ప విషయమేమిటంటే - అది దేవుని ప్రేమ. నా తండ్రి పెద్ద త్రాగుపోతు, ఆయన త్రాగకుండా ఉండగా నేనెప్పుడూ చూడలేదు. బడిలోని నా స్నేహితులు కూడా మా నాన్నను వెర్రివానిగా జమకట్టి నవ్వుకునే వారు. మేము పొలంలోనే నివసించే వాళ్ళం. కష్టంలో ఆవుల్ని కడిగే చోట పేడకుప్పల్లో పడి ఉండే మా అమ్మను చూడటానికి వెళ్ళేవాడిని మానాన్న చేతిలో విపరీతంగా తన్నులు తిని, మా అమ్మ కనీసం లేచి నడువలేకపోయేది.

మాకు స్నేహితులున్నారు. నేను మా నాన్నను తీసుకెళ్ళి, కారు ప్రక్కన ఆపి, కొట్టంలో కట్టేసే వాడిని. ఆయన ఒక ముఖ్యమైన వ్యాపార పర్యటనలో వెళ్ళవలసి ఉంది కాబట్టి నన్ను తొందర పెట్టవద్దని నా స్నేహితుల్తో చెప్పేవాడిని. ఆయన చేతుల్ని దూలాల గుండా దూర్చి, కట్టివేసేవాడిని. ఆయన మెడ చుట్టూ తాడు బిగించి దూలాల వరకు లాగేవాడిని. అదే తాడుతో కాళ్ళు కూడా కట్టేసేవాడిని ఆయన కాళ్ళు కదిపితే తనను తానే చంపుకుంటాడు.

ఒక సాయంత్రం, నేను హైస్కూల్ చదువు ముగించక రెండు నెలల ముందు ఇంటికొచ్చాను. ఇంటిలోకెళ్ళి చూస్తే అమ్మ తెగ ఏడుస్తున్నది. ఏమయ్యిందని అడిగాను. “మీ నాన్న నా గుండె పగుల కొట్టాడు నీవు పట్టబద్రుడవయ్యే దాకా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత వెంటనే చస్తాను"అంది.

మీకు తెలుసా? రెండు నెలల తరువాత నేను పట్టభద్రుడినయ్యాను, మరుసటి శుక్రవారం 13వ తేదీన మా అమ్మ చనిపోయింది. గుండె పగిలి నీవు చావలేవు అని నాన్నతో చెప్పవద్దు. మా అమ్మ చనిపోయింది. మా నాన్న దానిని పగులగొట్టాడు. నేను అంతగా ద్వేషించిన వ్యక్తి మరెవరూలేరు. కాని స్త్రీ పురుషులారా, దేవుడైన యెహెూవా తో ఆయన నిత్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సంబంధం కలిగిన కొద్దికాలంలోనే దేవుని ప్రేమ నా జీవితాన్ని తన అదుపులోకి తీసుకుంది. ఆయన నా లోని ద్వేషాన్ని తీసుకుని దొర్లించి వేశాడు.

మా నాన్న కళ్ళలోకి సూటిగా చూచి "నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పగలిగాను. అతిశుద్ధమైన సంగతి ఏమిటంటే నిజంగానే నేనామాట చెప్పాను మరో విశ్వవిద్యాలయానికి నేను బదిలీ అయ్యాను. ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నా కాళ్ళు చేయి, మెడ విరిగిపోయాయి. నేను ఇంటికీ చేర్చబడ్డాను. మా నాన్న రూములోకి వచ్చాడు. ఆయన నేను చనిపోయి ఉంటానని వెక్కివెక్కి ఏడ్చివచ్చాడు.“నాలాంటి తండ్రిని ఎలా ప్రేమించగలుగుతున్నావు” అని అడిగాడు. “నాన్న, ఆరునెలల క్రితం నిన్ను తిట్టాను. నిన్ను ద్వేషించాను” అని చెప్పాను. తరువాత, తండ్రియైన యెహోవా దేవుడు నిత్యవాక్యమైన తన కమారుని ద్వారా మన మానవాళికి తనను బయలుపరచుకున్న సంగతిని, నేను మానాన్నతో చెప్పాను. క్రీస్తు అనేక బాధలు అనుభవించి మన పాపాలకోసం చనిపోయాడు దీదాత్ గారూ!

ప్రపంచ పాపాలన్నిటినీ నీవు ఊహించగలవా? - నీ పాపాలు, నా పాపాలు చాలు. కాని ప్రపంచ ప్రజలందరి పాపాలు కుమారుని మీద మోపబడ్డాయి. ఇందులో ఎంతో వేదన ఉంది. “నాన్న, నన్ను క్షమించమని క్రీస్తును అడిగాను. నా జీవితంలోకి రక్షకునిగాను, ప్రభువుగాను ప్రవేశించమని ఆయన్ని కోరాను. నాన్న , దాని ఫలితంగా నిన్నే కాదు ఇతరులను కూడా ప్రేమించి అంగీకరించగలిగే శక్తిని నేను పొందాను” అని చెప్పాను.

దీదాత్ గారూ, నేను మీ వైపు చూచి "నేను మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను..... మిమ్మల్ని గురించిన ప్రేమ దేవుడు నాకిచ్చాడు....... మిమ్మల్ని నేనెంతగానో ప్రేమిస్తున్నాను. మీరు యేసుక్రీస్తును రక్షకునిగాను, ప్రభువుగాను తెలుసుకోవాలని కోరుతున్నాను” అని చెప్పగలను. మా నాన్న చివరికి అన్నాడు "కుమారుడా, నీ దేవుడు నీ జీవితంలో చేసిన మార్పు నా జీవితంలో కూడా చేయగలిగితే నేను ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నాను”.

అక్కడే మా నాన్న ఇలా ప్రార్థించాడు. “దేవా, నీవే దేవుడవైతే క్రీస్తే నీ కుమారుడు, నిత్యవాక్యమూ అయితే, నీవు నన్ను క్షమించి నా జీవితంలో ప్రవేశించి నన్ను మార్చగలిగితే, నేను నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకోదలుస్తున్నాను.”

స్త్రీ, పురుషులారా, నా జీవితం మౌలికంగా ఆరునెలల నుండి ఒకటిన్నర సంవత్సరంలో మారిపోయింది. నాలో దేవుడు మార్చవలసిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. కాని తరువాత మా నాన్నగారి విషయం చూడండి. ఆయన జీవితం నా కళ్ళముందే మారింది. మిష్టర్ దీదాత్, అది ఎవరోవచ్చి విద్యుద్దీపం వెలిగించినట్లుంది. మీకు తెలుసా, ఆ తరువాత ఆయన ఒక్కసారి మాత్రమే విస్కీ పుచ్చుకున్నాడు. అదీ పెదవులకు ఆనించుకున్నాడు. అంతే. దానిని ఇంకెప్పుడూ కోరలేదు. 14 నెలల తరువాత ఆయన చనిపోయాడు. 40 ఏళ్ళ పాటు త్రాగుతూ ఉన్నందున్న ఆయన కడుపు మూడువంతులు తీసెయ్యాల్సి వచ్చింది. కానీ స్త్రీ పురుషులారా, మీకు తెలుసా? ఈ 14 నెలల కాలంలో మా పట్టణంలోని చుట్టుపక్కల ఎంతోమంది వ్యాపారవేత్తలు ఈ మారిన త్రాగుబోతు జీవితాన్ని చూచి, నిత్యవాక్యమైన యేసుక్రీస్తు ద్వారా సజీవుడైన దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నారు.

నా భార్య డొట్టి ఈ విషయమై ఇలా అంది. “హానీ, క్రీస్తు మృతులలో నుంచి లేచాడు కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడై యున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఒక స్త్రీనిగాని పురుషునిగాని జీవితంలోకి ప్రవేశించి వారి అంతరంగాలను మార్చివేసే అపారశక్తిని కలిగియున్నాడు. అందుకే పునరుత్థానుడు సజీవుడు అయిన క్రీస్తు క్రొత్త నిబంధన లోని 27 పుస్తకాలలో ఒకదాంట్లో ఇలా అన్నాడు. “నేను చనిపోయాను. కాని ఇప్పుడు బ్రతికి ఉన్నాను.” “నేను ద్వారం దగ్గర నిలబడి తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికొస్తాను” అంటున్నాడు.”

ముగింపు సందేశం:

అహ్మద్ దీదాత్

అధ్యక్షా, న్యాయసభలోని స్త్రీ పురుషులారా: మనిషి స్వాభావికంగా పిరికివాడు. ఆదాము మొదలుకొని మీరు గుర్తుకు తెచ్చుకొండి. అంతా బాధ్యతనుండి తప్పుకున్నారు. “ఆ పనిచేసింది నేను కాదు ఈ స్త్రీ.” ఆ స్త్రీ- “నేను కాదు అది సర్పం.” మనిషి పిరికితత్వం గలవాడు. ఎవడో ఒకడొచ్చి మన బరువు మొయ్యాలని అనుకుంటాం. మనం రోగిష్టులమైయుండి మరెవడో మందు పుచ్చుకోవాలని కోరుతాం. మన చిన్నపేగు కుళ్ళిపోయి వుంటే మరొకడెవడిదొ తీసెయ్యాలని అడుగుతాం. సాధారణంగా మనిషి తత్త్వం ఇదే.

కాని యేసుక్రీస్తు చెప్పింది ఇది కాదు. ఆయన “నీవు నీ సిలువ నెత్తికొని నిన్ను నీవు సిలువ వేసికో” అని కోరాడు వినండి “తన సిలువ నెత్తికొని నన్ను వెంబడించని వాడు నావాడుకాడు” అన్నాడాయన. నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు మరో రకంగా చెప్పాలంటే, నిన్ను సిలువ వేసికో, కాదు, కాదు, కాదు, కాదు. ఆయన చెప్పినదాని అర్థం అదికాదు. ఆయన మాటల అర్థం ఏమిటంటే, నేను నా బాధ్యతను ఎలా మోస్తున్నానో మీరు అలాగే మోయండి అని. నేనెలా ఉంటానో మీరూ అలాగే ఉండండి. నాకు ఎలా సున్నతి చేయబడిందో, మీరూ అలాగే సున్నతి చేయించుకొండి. నేను చేసింది. మీరు చెయ్యండి. మీ బాధ్యత మీరు మోయండి.

ఆయన చెప్పింది ఇది. ఇది ఇస్లామిక్ వ్యవస్థ. ఇస్లాం బోధించేది ఇదే. చూడండి, సంవత్సరాలతరబడి త్రాగుబోతుగా ఉన్నాక నిన్ను రక్షించే వ్యవస్థ, చందాల పళ్ళెంలో నుంచి ఏళ్ళ తరబడి పది సెంట్ల లెక్కన కాజేసిన తరువాత, జోష్ గారి పుస్తకంలో మీరిది చదువుతారు ఆయన ప్రతి ఆదివారం చర్చి చందాల పళ్ళెంలో 25 సెంట్లు వేసి 35 సెంట్లు తీసుకొని పాలకోవా కొనుక్కునే వాడినని చెప్పాడు. తరువాత జీవితంలో బుద్ధిజ్ఞానాలు ఎంతగానో వికసించిన స్థాయిలో కూడా ఇదే పని జరుగుతుండడం మనం చూస్తున్నాము. కాని దీనిలోకి వెళ్ళే సమయం మనకు లేదు.

యేసు సందేశంతో నన్ను ముగించనివ్వండి. “శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికముకాని యెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను” అన్నాడాయన (మత్తయి 5:20). మీకు పరలోకం లేదు. ఇదే ఆయన చెప్పింది. ఇవి ఆయన మాటలు, ఏం జరుగుతోందంటే, మీరాయన మాటలు మీరటం లేదు. ఇదే ఇస్లాం! మీరు యూదులకంటే మంచిగా లేకపోతే మీకు పరలోకం లేదు.

అది రక్తం అని ఆయన చెప్పటం లేదు గాని మీ నీతి అంటున్నాడు. మీరు యూదులకంటే నీతిగా ఉండాలి. యూదులకంటే ఎక్కువగా ఉపవాసం ఉండాలి. యూదులకంటే ఎక్కువగా ప్రార్థించాలి. యూదుల కంటే ఎక్కువగా దానం చెయ్యాలి. అదే ఇస్లామ్!

కాబట్టి అధ్యక్షా, న్యాయసభలోని స్త్రీ పురుషులారా, “చరిత్రా లేక తమాషా?” అనే హెడ్డింగ్' అమెరికాలో జోష్ గారు ఉపదేశించే ఈ పునరుత్థానం గురించి నేను తీర్మానించేది ఏమిటంటే, వందకోట్ల మంది జనం సిలువ మీద స్వారీ చేస్తున్నారు. ఇక్కడ డర్బన్లో ప్రతి వారం గుర్రాలు వేలమందిని ఎక్కించుకొని స్వారీ చేయిస్తున్నాయి. ప్రతి గుర్రం. అయితే ఇక్కడ సిలువ మీద స్వారీ చేయడానికి మీరు కొనిపోబడుతున్నారు.

స్త్రీ పురుషులారా, మీకు ధన్యవాదాలు.

ముగింపు సందేశం:

జోష్ మేక్డోవెల్

మిస్టర్ దీదాత్, దేవుడు బయలుపరచిన క్రైస్తవ బైబిల్లో ఎక్కడా, క్రైస్తవుడు తనను సిలువ వేసుకోవాలనే ఆజ్ఞలేదు. మనం క్రీస్తులో ఇదివరకే సిలువ వేయబడినట్లు అంగీకరించాలని మాత్రం ఉంది.

అనాది నుండి నేటివరకు మాట్లాడుతున్న దేవుడు రోమా 8:32లో ఇలా అన్నాడు. “తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరికొరకు ఆయనను అప్పగించెను” నా దేశంలో ఓ యవ్వన స్త్రీ కారువేగంగా పోనిచ్చినందుకు పట్టుబడి, న్యాయమూర్తి ఎదుటికి తేబడింది. న్యాయమూర్తి ఆమెను "అపరాధివా నిరవరాధివా?” అని అడిగితే "అపరాధినే” అంది. అప్పుడా న్యాయమూర్తి, వందడాలర్లు జరిమానా లేక పది రోజుల జైలు శిక్ష విధించాడు. తరువాత ఓ అద్భుతం జరిగింది. న్యాయమూర్తి లేచి నిలబడ్డాడు. తన అంగీ తీసి కుర్చీకి తగిలించాడు, క్రిందికి దిగివచ్చి జరిమానా చెల్లించాడు. అతనొక ఖచ్చితమైన న్యాయమూర్తి. ఆయన కూతురే చట్టాన్ని అతిక్రమించింది.

ఆయన తన కుమార్తెను ఎంతగా ప్రేమించినా, వందడాలర్లు లేక పది రోజులు శిక్ష విధించక తప్పదు. కాని ఆయన ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక దిగివచ్చి ఆ శిక్షను తనపై వేసుకొన్నాడు. దేవుడైన యెహోవా తన పరిశుద్ధవాక్యం ద్వారా బయలుపరచిన దానికిది చక్కని స్పష్టమైన సాదృశ్యం. క్రీస్తు మనకోసం చనిపోయాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపానికి జీతం మరణమని బైబిలు తేటగా వివరిస్తుంది. కాబట్టి ఆ శిక్షను దేవుడు మనపై వెయ్యాలి.

కానీ స్త్రీ పురుషులారా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన తన న్యాయాధిపతి దుస్తులను విడిచి, మానవ రూపంలో యేసుక్రీస్తుగా మన మధ్యకు దిగివచ్చాడు. సిలువనెక్కి మనకోసం మూల్యం చెల్లించాడు., “నేను ద్వారం దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను” అని ఆయన అంటున్నాడు.

అవును. మిస్టర్ దీదాత్, వందకోట్ల క్రైస్తవులు సిలువ మీద స్వారీనే చేస్తున్నారు. స్వారీ చేయటానికి మేము కొనిపోబడుతున్నాము. తన కుమారుడు చిందించిన రక్తం ద్వారా, సిలువను పరలోకానికి  కొనిపోయే రథంగా దేవుడు ప్రసాదించాడని నేను నమ్ముతున్నాను.

స్త్రీ పురుషులారా; మరో దేశస్తుడినైన నేను ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్గించిన మీకు నా ధన్యవాదాలు మిస్టర్ దీదాత్, ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీకెంతగానే ఋణపడి ఉన్నాను. మీరు మా దేశం వస్తే మనం కలిసి భోజనం చేద్దాం. వందనాలు.

సమాప్తం.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.