దేవుడు

రచయిత: జాన్ జి.రీసింగర్
అనువాదం: సుహాసిని ముఖర్జీ
చదవడానికి పట్టే సమయం: 1 గంట 30 నిమిషాలు
ఆడియో

విషయసూచిక

  1. ఉపోద్ఘాతము
  2. మొదటి సూత్రం - దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నది
  3. రెండవ సూత్రం - దేవుడు సమస్తాన్ని ఎల్లప్పుడూ తన అదుపులోనే ఉంచుకుంటాడు
  4. మూడవ సూత్రంః దేవుడు తన ప్రణాళికను సాధించడానికి ప్రతి ఒక్కరినీ, చివరికి అపవాదిని సైతం తన ఆధీనంలో ఉంచుకుని వాడుకుంటాడు.
  5. నాల్గవ సూత్రం - దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి వాడబడేవారు దురుద్దేశంతో ప్రవర్తిస్తే వారిని శిక్షిస్తాడు.
  6. ఐదవ సూత్రం - సమస్త కీడులకూ అపవాదే మూలం
  7. ఆరవ సూత్రం - అన్ని రకాల శ్రమలూ శిక్ష కాదు

ఉపోద్ఘాతము

''ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌'' (రోమా 11:36).

ఏర్పాటునందు దేవుని సార్వభౌమత్వము అనే అంశంలో ఆరు మూలసూత్రాలున్నాయి. అవి దేవుని వాక్యమంతటిలో కనిపిస్తూ అందులో ఉన్న రక్షణ వర్తమానాన్ని అల్లుకొని ఉన్నాయి. దేవుని గురించి, కృపాసహితమైన ఆయన సర్వాధికారం గురించి, వీటికి సంబంధించిన దైవశాస్త్రమును గురించి, వాక్యానుసారంగా గ్రహించటానికి ఈ ఆరు సూత్రాలను తెలుసుకోవటం ఎంతో అవసరం. ఈ సూత్రాలను గ్రహించి నీ అనుదినజీవితానికి ఈ సత్యాలను అన్వయించుకోవటమే దేవునియందలి నిజమైన ఆనందానికి నడిపించే వాక్యానుసారమైన నిరీక్షణకు ఆధారం. నేటి ఉన్మాద ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఈ ఆరు బైబిలు సూత్రాలను తెలుసుకోకపోతే భద్రత మరియు నిశ్చయత కలిగి ఉండటం కష్టం.

నిరీక్షణ మరియు కృపలను గురించి దేవునివాక్యంలో ఉన్న సందేశాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా లేక దానినంతటిని ఒక అర్థవంతమైన పద్దతిలో రూపొందించుకోవటం నీకు కష్టంగా అనిపిస్తుందా? బైబిలు సత్యాలు నీ అనుదినజీవితపరిస్థితులతో సంబంధం కలిగి ఉన్నట్లు చూడగలుగుతున్నావా లేక వాక్యములోని సిద్ధాంతాలు నీ నిజజీవితపరిస్థితులకు అప్రస్తుతమనిపిస్తున్నాయా? ఈ రెండు రంగాలలో నీకు స్పష్టమైన సహాయాన్ని అందించే ముఖ్యోద్దేశంతో ఈ చిన్న పుస్తకాన్ని వ్రాస్తున్నాను. బైబిలు నిజంగా ఏమి చెబుతుందో, దాని అర్థమేమిటో నువ్వు గ్రహించి, ఆ సందేశాన్ని నిజజీవితపరిస్థితులకు అన్వయించుకోవటానికి సహాయపడేలా ఈ పుస్తకం రూపొందించబడింది.

'ఏర్పాటునందు దేవుని సార్వభౌమత్వము' అనే సిద్ధాంతం యొక్క ఆరు మూలసూత్రాలు ఈ క్రింది విధంగా ప్రస్తావించబడ్డాయి.

1. ఈ లోకాన్ని గురించి దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మరియు ఉద్దేశము ఉన్నాయి యోబు 23:13, ఎఫెసీ 1:8-12.

2. దేవుడు అన్ని సమయాలలోను, అన్ని విషయాలను తన ఆధీనములో ఉంచుకొని తన ప్రణాళికను సంపూర్ణము చేయడానికి నిత్యము పనిచేస్తూ ఉంటాడు హబక్కూకు 1:1-11 యెషయా 10:5,6.

3. దేవుడు తన ప్రణాళికను సాధించడానికి ప్రతిఒక్కరిని, చివరికి అపవాదిని సహితం తన ఆధీనంలో ఉంచుకొని, వాడుకుంటాడు యెషయా 10:7-11  కీర్తన 76:10).

4. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చటానికి వాడుకున్నవారు దురుద్దేశంతో ప్రవర్తిస్తే వారిని శిక్షిస్తాడు (యెషయా 10:12-16 అపొ.కా. 2:23,24 మత్తయి 27:15-26).

5. సమస్తమూ దేవుని నుండే కలుగుతాయి, అయితే సమస్త కీడులకు అపవాదే మూలం 2 సమూ. 24:1  1 దిన. 21:1.

6. రోగాలు, శ్రమలు దైవచిత్తంలో భాగమైనప్పటికీ, అవి ఆయన ఆధీనంలో ఉన్నప్పటికీ, ప్రతీ రోగాన్నీ మరియు శ్రమనీ పాపానికి శిక్షగా తలంచవలసిన అవసరము లేదు యోబు 1:1, యోబు 1:6 - 2:10 యోబు 13:15

ఈ ఆరు సూత్రాలను మనము పరిశీలించబోయే ముందు, మిమ్మల్ని సిద్ధపరచటానికి నేను ఒక దృష్టాంతాన్ని ఇవ్వగోరుతున్నాను. ఇది మీ ప్రాథమిక లేఖనజ్ఞానాన్ని పరీక్షించటం మాత్రమే కాకుండా నిజజీవితపరిస్థితులకు వాటిని అన్వయించగలిగే మీ సామర్ధ్యాన్ని సహితం కొలవగలదు. దేని గురించైనా తీవ్రంగా ఆలోచించటం, ముఖ్యంగా కొత్త విషయాలను గురించి ధ్యానించటం మనకు అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. బండి చక్రములోని కమ్ములవలె మనము ఒకే పరిధిలో చుట్టూ తిరుగుతుంటాము కాబట్టి, మిమ్మల్ని నిజంగా ఆలోచింపచేయాలని నేను కోరుతున్నాను.

రాబోయే ఆదివారం ఉదయం నువ్వు గడ్డం గీసుకుంటూ వార్తలు వింటున్నావనుకుందాం, ఆ వార్తలను చదివేవాడు ఆ ముందు రాత్రి, 'ప్రతి వ్యభిచారపు ఇల్లు, పేకాడు ప్రతివాని గృహము, పాపమునకు కేంద్రములైన ప్రతి భవనము విచిత్రముగా కుప్పకూలి, పూర్తిగా నాశనమైనవ'ని చెప్పాడనుకుందాం. అది విన్న నువ్వు బహుశ 'దేవునికి స్తోత్రము' అని చెబుతావేమో.నువ్వు సండేస్కూలుకు వెళ్ళినప్పుడు 'దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమి జరిగిందని తలుస్తున్నావు?' అని నిన్ను ప్రశ్నిస్తే, 'అది తప్పక దేవుని హస్తము చేసిన కార్యమే' అని జవాబిస్తావని నా నమ్మకం. నీ సమాధానం సరైనదే. అవిశ్వాసులు నీ మాటను అంగీకరించకపోవచ్చు వార్తాపత్రికలు, టి.వీ.లో వార్తలు అందించేవారు రకరకాల విశ్లేషణలు ఇవ్వవచ్చు కానీ నువ్వు మాత్రం ఇదంతా దేవుని వలన సంభవించిందని, ఆయన సార్వభౌమాధికారము క్రింద జరిగిందని ఆనందిస్తావు.

ఆ తర్వాత వచ్చే ఆదివారం ఉదయం, నువ్వు మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకుంటున్నపుడు వార్తలు చదివేవాడు 'గత మధ్యరాత్రి, ఈ దేశములో బైబిలును విశ్వసించు ప్రతి సంఘము అతి విచిత్రముగా కూలి సర్వనాశనమైనది' అని చెప్పాడనుకుందాం.అప్పుడు నువ్వేమంటావో! క్రైస్తవులలో చాలామంది, 'దేవునికి వందనాలు' అని చెప్తారా? లేక 'ఇది సాతాను చేసిన కార్యమే' అని అంటారా?

మొదట జరిగిన సంఘటనకు (చెడ్డ పనులు జరిగే స్థలాల నాశనానికి) దేవునిని నిందించటం లేదా స్తుతించటం, ఆ తర్వాత, సంఘాలను కూలద్రోసిన విషయాన్ని బట్టి సాతాన్ని నిందించటం ఎందుకు? మనము రోమా 11:36,  8:28 మొదలగు వాక్యభాగాలను సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ రెండు సంఘటనలలోను దేవుని హస్తముందని అంగీకరించక తప్పదు. దేవుడు తన సర్వాధికారంతో, ప్రతి ఒక్క సంఘటననూ- అది మంచిదైనా, చెడ్డదైనా- తన ఆధీనములో ఉంచుకుంటాడని బోధించటమే ఈ చిన్న పుస్తకము యొక్క ముఖ్యోద్దేశం. ప్రతి సంఘటన మరియు ప్రతి విషయం వెనుక ఏదో ఒక రీతిలో దేవుని హస్తం ఉంటుంది. దీనినే 'ఏర్పాటునందు దేవుని సార్వభౌమత్వము' అని అంటారు. ఇది వాస్తవం కాకపోతే, కలవరం నిండిన ఈ తరంలో నిశ్చలమైన నిరీక్షణ కలిగి ఉండటం మనకు సాధ్యం కాదు.

'ద్వైతము' ఒక దుర్బోధ

మంచినంతా దేవునికి, చెడునంతా అపవాదికి ఆపాదించేవారు ద్వైతము అనే ఒక ప్రాచీన దుర్భోద విషయమై దోషులౌతున్నారు. ఈ 'ద్వైతము' ప్రాథమికంగా దేవుడు, సాతాను (మంచి, చెడు) - ఈ రెండూ స్వతంత్రసార్వభౌమ్య శక్తులని, అవి ఈ లోకాన్ని తమ ఆధీనంలోనికి తెచ్చుకోవటానికి సర్వదా పోరాడతాయని చెబుతుంది. మన పక్షమే గెలుస్తుందని మనం ఆశిస్తాం కానీ కొన్నిసార్లు అలా జరగదు. విచారకరమైన విషయమేంటంటే నేటి క్రైస్తవులనేకులు ఇలాంటి దుర్బోధనే విశ్వసిస్తున్నారు. ఆరోగ్యభాగ్యాలు ప్రతి క్రైస్తవుని జన్మహక్కు అని, వారి సంతోషానికి అడ్డు తగిలే ప్రతిదానికి అపవాదే కారణమని చెప్పేవాళ్ళందరూ చేసే పొరపాటు ఇదే. ఇది ద్వైత మతబోధలోని అతి నికృష్టభాగం.

యథార్థవంతులైన క్రైస్తవులు సహితం ఇలా ఎందుకు చేస్తున్నారు? తమకు తెలియకుండానే దేవుని సార్వభౌమాధికారాన్ని కాదనేలా వారు మంచినంతా దేవునికి, చెడునంతా సాతానుకు ఎందుకు ఆపాదిస్తున్నారు? బహుశ వారు దేవునిని సంరక్షించానికి ఈ విధంగా చేస్తున్నారేమో. దేవునిని విశ్వసించి ప్రేమించటం సులభసాధ్యం చేయటానికి చెడ్డగా అనిపించే ప్రతిదాని నుండి దేవునిని తొలగించి, సమస్త మంచిని ఆయనకు ఆపాదిస్తున్నారేమో! ఒక ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో పనిచేస్తున్న ఒక నర్సు ఇలా అన్నది - ఆ పట్టణంలో ఉన్న ఒకానొక సంఘసభ్యుడు ప్రమాదానికి లోనైనపుడు ఆ సంఘకాపరి అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తాడు. ఆయన ఆ కుటుంబ సభ్యులను చూడగానే, 'ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ సంఘటనతో దేవునికి ఏ మాత్రమూ సంబంధం లేదు' అని చెబుతాడు. ఒకవేళ దేవునితో సంబంధముందని చెబితే వారు విశ్వాసాన్ని వదిలివేస్తారేమోనని అతడు భయపడి ఉండవచ్చు. నువ్వు ఆ బోధకుని మాటలను ఒక్కసారి పరిశీలిస్తే దానిలోని పొరపాటును గ్రహించగలవు. అతను దేవునిని సంరక్షించటానికి ప్రయత్నించాడేమో కానీ వాస్తవానికి అతడు నిరాశ మరియు అవిశ్వాసానికి పునాది వేస్తున్నాడు. అతడు గాయపడిన ఆ వ్యక్తిని సాతానుకు లేదా విధికి పూర్తిగా అప్పగిస్తున్నాడు. గాయపడిన ఆ వ్యక్తికి దేవుని సార్వభౌమాధికారమునందు గల నిశ్చయత అత్యవసరమైన ఆ సమయంలో, తనకు తెలియకుండానే ఆ పరిస్థితి నుండి ఆ సంఘకాపరి దేవునిని దూరం చేస్తున్నాడు.

ఒకానొక సాయంకాలము, ఒక వ్యక్తి తన సాక్ష్యము పంచుకుంటూ సైనిక విమాన ప్రమాదములో తన స్నేహితుడు మరణించిన విషాద సంఘటనను గురించి చెప్పాడు. మరణించిన తన స్నేహితుని తల్లిని ఓదార్చటానికి సైనికాధికారి వచ్చి ఇలా చెప్పాడు:

'ఈ సంఘటన సంభవించటం దురదృష్టకరము. ఇలా జరుగుతుందని ఎవరికీ ముందుగా తెలియదు, ఊహించనూలేరు. వీటిని ఆపగలవారు లేరు, దీనికి ఏ వివరణా లేదు'.

ఈ మాటలను విన్న ఆ తల్లి అతనికి ఈ విధంగా జవాబు చెప్పింది:

'అయ్యా, నా కుమారునితో పాటు దేవుడు ఆ విమానములో ఉన్నాడనే విషయాన్ని మీరు నమ్మకపోవచ్చేమో కానీ నేను నమ్ముతున్నాను. ఇలా జరగడానికి ఆయన ఎందుకు సెలవిచ్చాడో నాకు తెలియదు కానీ, ఇది దేవుని సర్వాధికార ఏర్పాటులో ఒక భాగమని నేను విశ్వసిస్తున్నాను. ఆయన విమానాన్ని, వాతావరణాన్ని, నా కుమారుని ప్రాణాన్ని తన చేతిలో, ఆధీనములో ఉంచుకున్నాడని నమ్ముతున్నాను.'

గాయపడిన వ్యక్తికి సంఘకాపరి చెప్పిన మాటలకు, మరియు ఆ తల్లికున్న నిరీక్షణ మరియు దైవశాస్త్ర జ్ఞానమునకు ఎంత వ్యత్యాసమున్నదో మనము గమనించగలము.

దేవుడు ఎంత శక్తిమంతుడు?

నువ్వు ఒక ప్రమాదానికి గురయ్యి బాధతో ఉన్నావనుకుందాం. ఆ సంఘకాపరి చెప్పిన వేదాంతంగాని, ఓదార్పు మాటలుగాని నీకు సహాయపడతాయా? జరిగిన ఆ సంఘటనతో దేవునికి ఎటువంటి సంబంధమూ లేదని చెబితే నువ్వేమనుకుంటావు? 'ఇది సంభవించినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఎందుకు దానిని ఆపలేదు? ఈ పరిస్థితులలో సాతాను దేవునికన్నా బలంగా పనిచేశాడా? నాకు ఈ అపాయము కలగకుండా చేయటానికి దేవుడెంతగా ప్రయత్నించినా సాతాను దీన్ని చేయటంలో నిజముగా సఫలమయ్యాడా?' అనే ఇలాంటి ప్రశ్నలన్నీ నీలో ఉదయించటానికి ఎంత సమయం పడుతుంది? త్వరలోనే నువ్వూ-నేను, 'దేవునిని నమ్మి పొరపాటు చేశామా?' అని ఆలోచించటం ప్రారంభిస్తాం. ఆ బోధకుడు చెప్పింది సరియైనదైతే బహుశ దేవుడు నేను అనుకున్నంత బలవంతుడు కాడేమో . . . అని నాకు వచ్చిన సందేహం నీకూ కలగటం సహజం.

దేవుడు మేలు, కీడులను ఒకే రీతిగా తన ఆధీనంలో ఉంచుకోగలిగినంత గొప్పవాడు కాకపోతే మనం గొప్ప ప్రమాదంలో ఉన్నట్లు నువ్వు గ్రహించగలుగుతున్నావని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో మేలు కన్నా కీడు అధికంగా సంభవించటం చూసినప్పుడు మనం ఓటమి పాలౌతున్నామనిపిస్తుంది. మనమున్న పక్షము బలహీనమైనదిగా అనిపిస్తుంది. నీవు గ్రహించినా, గ్రహించకపోయినా నేటి క్రైస్తవులలో పుడుతున్న ఆలోచనలు ఇలాంటివే. ఈ తరము, దేవుని సార్వభౌమత్వాన్ని మరచి మానవుని స్వేచ్ఛాచిత్తాన్ని గొప్పదిగా చేస్తోంది. మనము దేవుని పరిశుద్ధతను మరచి మానవుని సంతోషమే సువార్త యొక్క ముఖ్య గురి మరియు దాని విధి అనుకుంటున్నాము. మనము, మనలోనూ మన సొంత ఆనందములోనూ ఎంతగా లీనమయ్యామంటే మన హృదయమాశించే వాటినన్నిటిని ఇవ్వటానికే దేవుడున్నాడని అనుకుంటున్నాం. మన సొంత ఆశలు అనే సూటుకేసును మోసేవానిగా దేవునిని భావిస్తూ, దానిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలని అనుకుంటే, అక్కడికి తీసుకెళ్ళాలని కోరి, దానిని ''విశ్వాససహితమైన ప్రార్థన'' అని పిలుస్తాం. మనమాశించినది మనకు దొరకనపుడు మన విశ్వాసం లోపించిందని అనుకుంటాం . లేదా, దేవుని వాగ్దానాలలో (మనము వాగ్దానాలని తప్పుగా భావించినవాటిలో) నమ్మకాన్ని కోల్పోతాం.

అహం ఎంతగా చెలరేగుతుందో, మానవుని పాపభూయిష్ట, స్వార్థపూరిత స్వభావం ఎంత మేరకు చెలామణీ అవుతుందో అంతే ఎక్కువగా దేవుడు బలహీనపడి, నిస్సహాయుడై ఓటమిని ఎదుర్కొంటున్నట్లుగా కనపడుతుంది. ఈ తరంలో కనిపించే నిరాశ, నిస్పృహలకు కారణం, అన్ని విషయాలపైనా దేవుడు సర్వాధికారము కలిగుండటాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటమే. ఇక్కడ మరొక కారణాన్ని కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. 'నువ్వు ధనవంతునిగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు' అన్న సువార్తే ఈ తరంవారు విశ్వాసాన్ని కోల్పోవటానికి ప్రాథమిక కారణం. నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చవలసిన ప్రేమగల దేవుడు, కోరుకున్న ఈవులను ఇవ్వకపోతే నువ్వు అసహ్యించుకుని, ఆయనను అపహాస్యం చేస్తావు.

ఈ దుష్టకాలంలో జీవిస్తున్న క్రైస్తవుడు, లేఖనాలను అర్థం చేసుకుని ఉంటే అతడు బేస్‌బాల్‌ ఆడుతున్న చిన్న బాలుని వంటివాడే. ఒకతను ఆ దిక్కుగా వచ్చి ఆ బాలునితో, 'స్కోర్‌ ఎంత?' అని అడిగితే ఆ పిల్లవాడు 'నలభై' అన్నాడు. 'ఎవరు గెలుస్తున్నారు?' అని అతను మళ్ళీ ప్రశ్నించాడు. 'ఎదుటి జట్టువారే' అని ఆ బాలుడు చెప్పాడు. అది విన్న ఆ పెద్దమనిషి 'పాపం, మీరు చాలా నిరుత్సాహపడుతున్నారని అనుకుంటున్నాన'న్నాడు. వెంటనే ఆ చిన్న పిల్లాడు, 'మేము ఎంత మాత్రం నిరుత్సాహపడట్లేదు. మేమింకా 'బ్యాట్' చేయటం మొదలుపెట్టనేలేదు' అన్నాడు!

నిజమైన క్రైస్తవుడు వార్తాపత్రికల్లోని శీర్షికలు చూడడు, నిపుణులు చెప్పే మాటలు వినడు, జ్యోతిష్యులు లేక అబద్ధప్రవక్తలు చెప్పే మాటలు నమ్మడు, లేఖనాలను అర్థం చేసుకున్న దేవునిబిడ్డ ఆ లేఖనాలలో స్పష్టంగా బయలుపరచబడిన దేవుని సార్వభౌమాధికారము వైపునే దృష్టి నిలుపుతాడు. జ్ఞానవంతుడైన విశ్వాసి లౌకిక స్కోర్‌బోర్డు ఏమి చూపిస్తున్నా తాను విజయం పొందుతున్న జట్టులోనే ఉన్నానన్న నిశ్చయతను కలిగివుంటాడు. ఈ లోకంలో కానీ, తన వ్యక్తిగత జీవితంలో కానీ, ఏమి జరుగుతున్నా, యేసుక్రీస్తు ప్రభువైయున్నాడని అతనికి తెలుసు. చిట్టచివరికి, సమస్తం తన మేలు కొరకే దేవుని మహిమ నిమిత్తం జరుగుతుందనే నిశ్చయత కలిగి ఉంటాడు.

కల్వరి విజయవంతమైన రోజు

పాపులు తమకు తెలియకుండానే దేవుని ప్రణాళిక నెరవేరుస్తూ మన రక్షకుని సిలువనెక్కించిన రోజున కూడా, యేసుక్రీస్తు సర్వాధికారము గల ప్రభువుగానే ఉన్నాడు. ఆయన తండ్రి, ఆ రోజు సైతం అన్ని సంఘటనలనూ తన ఆధీనంలో ఉంచుకునే ఉన్నాడు. మన ప్రభువు సిలువపై వేలాడుతున్నపుడు, ''నీ దేవుడెక్కడ? నీవు దేవుని కుమారుడవైతే సిలువ నుండి దిగిరమ్మని'' ఆ మనుష్యులు అపహాస్యం చేసినప్పుడు సైతం ఆయన సార్వభౌమాధికారాన్ని, శక్తిని కలిగిన దేవునిగా సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఒక వేళ నువ్వూ నేనూ ఆ రోజు సిలువ చెంత నిలిచి ఆ సన్నివేశాన్ని చూసి ఉన్నట్లయితే దేవుడు నిజంగా మన ప్రభువగు యేసు తండ్రేనా అని ఆలోచించేవాళ్ళం. దేవుడు ఆయనకు తండ్రి ఐతే ఎందుకు దిగి వచ్చి సహాయం చేయలేదు? తండ్రి తన ప్రియకుమారుని ఇటువంటి శ్రమలకు ఎందుకు గురిచేశాడు? దీని అర్థం మనకు బయలు పరచబడకపోతే ఆ రోజు ఆ గడియ దిశగానే ఆదాము పాపము చేసిన రోజు నుండి దేవుడు కదులుతున్నాడనే సత్యాన్ని గ్రహించలేం.

కల్వరిలో క్రీస్తు మరణించిన రోజు కన్నా, దేవుని శక్తి, ప్రేమ మరియు పరిశుద్ధతలు జయము పొందిన రోజు ఇంకొకటి లేదు. యేసుక్రీస్తు హతసాక్షి కాదు, బాధితుడూ కాదు. గొల్గొతాపై ఆ రోజు దేవుడు ఓటమి పొందలేదు కానీ విజయధ్వజము ఎగురవేశాడు. ఆ సంఘటనలో ప్రతి సన్నివేశాన్ని దేవుడే నడిపించాడు. దేవుని ప్రణాళిక, ఆయన చిత్తం భంగపడ్డాయని లోకం, అపవాది అనుకుని ఉండవచ్చు గాని, అది గొప్ప పొరపాటు. కల్వరిరోజు- సార్వభౌమాధికారపు కృపకు మహిమనిచ్చిన విజయం. తమ తలంపులు, కార్యములు, దేవుని చిత్తమునే నెరవేరుస్తున్నాయని ఎరుగక పాపులు గర్వముతో విర్రవీగి ఆయనను అపహాస్యం చేశారు.

మహిమకరమైన ఈ సత్యాలు దేవుని వాక్యంలో ఏ ఆరు సూత్రాలపై ఆధారపడ్డాయో, వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

మొదటి సూత్రం - దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నది

మొదటి సూత్రం దేవునితోను, ఆయన ఉద్దేశాలతోను మొదలౌతుంది. ఈ లోకం పట్ల దేవునికొక స్థిరమైన ప్రణాళిక, ఉద్దేశమూ ఉన్నాయి (యోబు 23:13) (ఎఫెసీ 1:8-12).

 ఈ సత్యం గురించి క్లుప్త సారాంశాన్ని, కొన్ని లేఖనభాగాలలో చూద్దాం.

''ఆయన ఏక మనస్సుగలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనదేదో అదే చేయును'' (యోబు 23:13).

దేవునికొక ప్రణాళిక ఉన్నది. ''ఆయన ఏకమనస్సు గలవాడు.... తనకిష్టమైనదేదో అదే చేయును''

దేవుని ప్రణాళిక మార్చలేనిది. ''ఆయనను మార్చగలవాడెవడు?''

దేవుని ప్రణాళిక తప్పక నెరవేరుతుంది. ''ఆయనకిష్టమైనదేదో అదే చేయును''

జరుగబోయేవన్నీ దేవుని ప్రణాళికలో ఉంటాయి.

''....తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు'' (ఎఫెసీ. 1:12).

''దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము (లేదా ప్రణాళిక) చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి'' (రోమా 8:28).

దేవునికొక ప్రణాళిక ఉందనే మాటను అంగీకరించనివాడు పెలేజియస్‌, ఆర్మీనియస్‌ లాంటి దుర్బోధకుల కోవకు చెందినవాడు. ఆ ప్రణాళిక స్పష్టమైనది కాదనీ, అందులో సమస్తమూ ఇమిడి ఉండవనీ అతడు చెబుతాడు. కానీ విశ్వాస ప్రమాణం ఇలా చెబుతుంది, 'దేవుడు నిత్యత్వము నుండి తన అత్యంత వివేక, పరిశుద్ధ, స్వేచ్ఛాయుతమైన ప్రణాళిక మరియు స్వచిత్త ప్రకారము స్వతంత్రముగానూ, మార్చలేని విధముగానూ జరగవలసిన వాటినన్నిటినీ ముందుగానే నిర్ణయించెను'. దీనిని దృఢపరిచేలా ఈ క్రింద కొన్ని వాక్యభాగాలు ఉన్నాయి.

దేవుడు తన చిత్తానుసారంగా సమస్తాన్ని చేస్తున్నాడు. (కీర్తన 115:3)

దేవుడు తనకిష్టమైనదంతా జరిగించువాడు (కీర్తన 135:6)

దేవుడు తన నిత్య వివేకము, శక్తి, కోరిక చొప్పున సమస్తాన్ని చేస్తాడు (యెషయా 46:10) (అపొ.కా.15:18).

పైన చెప్పినవాటిని నువ్వు త్రోసిపుచ్చాలనుకుంటే మరికొన్ని కఠినమైన లేఖనాలను చూడవలసిందిగా కోరుతున్నాను (ద్వితీ. 2:30, 1 సమూ.16:14, రోమా 9). ఈ వాక్యభాగాలతో నీ దైవశాస్త్రాన్ని పోల్చుకో. తన చిత్తాన్ని నెరవేర్చటంలో దేవుని సార్వభౌమాధికారానికి శ్రేష్ఠమైన ఉదాహరణ 2 సమూ 17:1-15 వచనాలలో కనిపిస్తుంది.

1-3 వచనాలలో మంచి సలహా ఇవ్వబడింది.

4వ వచనంలో అబ్షాలోము ఆ విధంగా చేయడానికి సిద్ధపడ్డాడు.

5-13 వచనాలలో బుద్ధిపూర్వకంగా చెడుసలహా ఇవ్వబడింది.

14వ వచనంలో అబ్షాలోము అబద్ధాన్ని నమ్మేలా దేవుడు చేశాడు.

నేనింతకముందు చెప్పిన విధంగా దీనిని మరింత వివరించవలసిన అవసరం ఉంది. దీనిని 'దేవుని ఆదేశాలు' (గాడ్స్‌ డిక్రీస్‌) అనే అంశం క్రింద వివరిస్తాను. ఈ అంశం ప్రత్యేకమైనది కనుక దీనిని వివరించానికి ఇక్కడ స్థలం లేదు. కాబట్టి మనం రెండవ సూత్రాన్ని పరిశీలిద్దాం.

రెండవ సూత్రం - దేవుడు సమస్తాన్ని ఎల్లప్పుడూ తన అదుపులోనే ఉంచుకుంటాడు

రెండవ సూత్రం మొదటిదాని నుంచే ఉద్భవించి, దాని కొనసాగింపుగా ఉంటుంది, మొలిచి దానిననుసరిస్తుంది. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉండటం మాత్రమే కాక దానిని కొనసాగిస్తాడు కూడా. రెండవ సూత్రం ఏమిటంటే, దేవుడు సదా సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని తన ప్రణాళికను నెరవేర్చడానికి నిత్యమూ పనిచేస్తాడు (హబక్కూకు 1:1-11 యెషయా 10:5,6).

కొన్నిసార్లు దేవుని ప్రణాళిక ఉజ్జీవం కొరకు పిలుపునిస్తుంది. తత్ఫలితంగా ఒక పెంతెకోస్తు వంటి రోజున మూడు వేలమంది ఆత్మలు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. మరికొన్ని సందర్భాలలో ఆయన ప్రణాళిక తీర్పుకొరకు పిలుపునిస్తుంది. యెషయా 10వ అధ్యాయం చూస్తే, దేవుని తీర్పులో అనేకమంది నశించిపోయారు. అయినా అది దేవుడు చేసిన కార్యమే. వేలాది ప్రజలు మారుమనస్సు పొంది రక్షింపబడు ఒక పెంతెకోస్తు దినము ఉన్నట్లే మానవజాతి అంతా జలప్రళయంలో నిత్యనాశనానికి కొట్టుకొనిపోయే ఒక తీర్పుదినం కూడా ఉంటుంది. ఆయా సందర్భాలలో దేవుడు ఒక సంఘటనకు ఎలా కారకుడో మరొక సంఘటనకు కూడా అలాగే కారకుడని మనం గ్రహించాలి. అది పెంతెకోస్తు దినమైనా, జలప్రళయమైనా, అది అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలోని సంఘటనైనా లేదా ఆదికాండము 6వ అధ్యాయంలోని సంఘటనైనా, దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని తన ప్రణాళికను జరిగించుకుంటున్నాడు. వర్షము, పంటలు, కరువు మరియు ఖాళీ గాదెలు దేవుని సార్వభౌమ హస్తాల నుండే కలుగుతాయి. ఈ రెండు పరిస్థితులలోనూ ఆయనను స్తుతించటం మనం నేర్చుకోవాలి (హబక్కూకు 3:17-19).

దేవుని నిశబ్దము

ఈ సత్యాన్ని తెలియచేయటానికి మనం చూడబోయే మొట్టమొదటి లేఖనభాగం హబక్కూకు గ్రంథంలో ఉంది. వాక్యానుసారంగా చరిత్రను అర్థం చేసుకోవడానికే హబక్కూకు గ్రంథం ప్రాథమికంగా వ్రాయబడింది. నేడు అధికంగా మనం కనుగొంటున్న సమస్యనే ప్రవక్త ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దుష్టులు నీతిమంతులపై విజయం పొందడానికి పరిశుద్ధుడైన దేవుడు ఎలా అనుమతిస్తాడు అన్న ప్రశ్నకు ప్రవక్త ఇక్కడ జవాబు ఇస్తున్నాడు. దుష్టులు తప్పక జయమొందుతున్నారు. నీతిమంతులను బాధిస్తూ వారు జయమొందుతున్నారు. మనము ఈ ప్రశ్నను మరొక విధంగా కూడా అడగవచ్చు. 'కష్టములలోను, కరువులలోను తన ప్రజలు మొఱ్ఱపెట్టుచుండగా దేవుడు కొన్నిసార్లు వారి ప్రార్థనలను పెడచెవిని పెట్టినట్లు ఎందుకు అనిపిస్తుంది?' ఈ  ప్రశ్నకు జావాబుకై  దైవవాక్యాన్ని పరిశీలిద్దాం.

''ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొఱ్ఱ పెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱ పెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి. జగడమును, కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యమును జరిగింతును. అలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వ విధులను తమ యిచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడెళ్లకంటెను అవి చురుకైనవి వారి రౌతులు దూరము నుండి వచ్చి తాలున జొరపడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు'' (హబక్కూకు 1:1-8).

నువ్వు ఈ వాక్యభాగాన్ని చదువుతున్నప్పుడు 2వ వచనాన్ని గమనించు. హబక్కూకు దేవునిని ప్రార్థిస్తూ తన ప్రార్థన వినటం లేదని, తన మొఱ్ఱకు జవాబు ఇవ్వటం లేదని ఆయనను నిందిస్తున్నాడు. ఉజ్జీవం పంపమని అతడు దేవునికి మొఱ్ఱపెట్టగా దేవుడు ఏమీ చేయనట్లుగానూ, పైగా పరిస్థితులు మరింత దిగజారుతున్నట్లుగానూ అతనికి అనిపించింది. హబక్కూకు చూసినపుడు చుట్టూ హింస, అవినీతి, అన్యాయం జరుగుతున్నట్లుగానూ, దేవుడు దాని గురించి ఏమీ చేయనట్లుగానూ కనిపించాడు. ఉజ్జీవం రావాలని హబక్కూకు ఆశిస్తే, అధర్మం అధికమౌతున్నట్లు అతను చూసాడు.

దేవుడు ఆ భయంకర దృశ్యాన్ని చూడమని హబక్కూకును బలవంతం చేస్తున్నట్లు 3వ వచనం చెబుతుంది. అన్ని వైపులా ఉన్న హింసను అతను చూసి, దానిని గుర్తించాలని దేవుడు గట్టిగా చెబుతున్నట్లు అనిపిస్తుంది. 'నేను సమాజంలో అన్ని వైపులా అన్యాయాన్ని, దుర్మార్గాన్ని చూస్తున్నాను. మనుషులు దేవదూషణ చేయటం వింటున్నాను. అన్నిటికంటే భయంకరమైనదేమిటంటే దేవుడు దీని గురించి ఏమీ చేయనట్లు కనిపిస్తుంది.' 4వ వచనంలో హబక్కూకు ''కావున న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను'' అని చెబుతున్నాడు. సమాజంలో అధర్మం పెచ్చు మీరినట్లు అతను వర్ణిస్తున్నాడు. ఆ చోట దుష్టుడు ఏ దుర్మార్గాన్ని చేసినా, వాడు ధనవంతుడైతే తప్పించుకోగలడు. హబక్కూకు వర్ణించిన పరిస్థితి ఈనాడు మన సమాజానికి సరిపోలి ఉన్నది. మొదటి నాలుగు వచనాలలో అతను దేవునిని నిందిస్తున్నాడు. 'నిందించటం' అన్న పదం ఇక్కడ ఉపయోగించటం సబబు. దేవుడు చెవిటివాడైనట్లూ, లేదా తన ప్రార్థన విని జవాబు ఇచ్చే శక్తి లేనివాడైనట్లు అతను ఆయనను నిందిస్తున్నాడు. సమాజంలో ఉన్న భయంకరమైన ఈ దుస్థితిని బాగుచేయటానికి దేవుడు అశక్తుడై ఉన్నాడు లేక అయిష్టంగా ఉన్నాడన్నట్లు అనిపిస్తుంది. మరియు హబక్కూకు, ప్రార్థనలో తన సమయాన్ని వృథా చేస్తున్నట్లు కనిపిస్తుంది.

5వ వచనంలో, దేవుడు హబక్కూకు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తున్నాడు కాని ఆయన జవాబు ఆయన మౌనం కన్నా కఠినంగా ఉంది. ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హబక్కూకు దేవుని స్వజనులైన వాగ్దానప్రజల గురించి ప్రార్థిస్తున్నాడు. అతను ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో దేవుడు ''మీ దినములలో నేనొక కార్యమును చేయుదును'' అని చెప్పటం ప్రత్యేకంగా గమనించండి. పిదప 6వ వచనంలో దేవుడు - ''ఇదిగో నేను కల్దీయులను రేపుచున్నాను'' అంటున్నాడు. అనగా దేవుడు హబక్కూకుకు జవాబిస్తూ, 'నేను కార్యాన్ని జరిగిస్తున్నాను, నేను చెవిటి, గ్రుడ్డివాడిని కాను, లేదా నిస్సహాయుణ్ణి కాను' అంటున్నాడు. 5వ వచనం వింతగా అనిపిస్తుంది - ''మీ దినములలో నేనొక కార్యమును జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు'' అని దేవుడు చెబుతున్నాడు. నిజంగానే తాను చేయబోయే కార్యాన్ని ఆయన హబక్కూకుకు తెలిపినపుడు అతను మునుపు కన్నా మిక్కిలి కలవరపడ్డాడు. ఇదివరకు దేవుడు పనిచేయటం లేదని చూసి భయపడిన హబక్కూకు ఇప్పుడు దేవుడు తాను చేయబోయే కార్యాన్ని ప్రకటించినప్పుడు మరింత భయపడ్డాడు. దేవుని ఉద్దేశాలు ఆయన మౌనం కన్నా భయంకరంగా కనిపించాయి. అసలు దేవుడు వాస్తవంగా ఏమి చేస్తున్నాడు? సరిగ్గా ఆ సమయంలోనే దేవుడు కల్దీయులను ఇశ్రాయేలు దేశంపై దండెత్త బలపరుస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను దండించడానికి కల్దీయులను సాధనాలుగా ఉపయోగించుకోబోతున్నాడని ఈ వాక్యభాగం నుండి స్పష్టమౌతుంది. కల్దీయులు దండెత్తి వస్తున్నారు. వారిని పంపిస్తున్నది దేవుడే.

'దీనిని అపవాదే జరిగించాడు!'

ఈనాడు టి.వి. సువార్తీకులలో కొందరు - ఇది అసత్యం, ఎందుకంటే దేవుడు మంచివాడు. ఈ దినము ఏదో ఒక మంచి నీకు జరుగబోతుంది! అనవచ్చు. కల్దీయుల దండయాత్రను ఆయన మంచి ఉద్దేశం కొరకే వాడుతున్నాడు. నిజం చెప్పాలంటే భయంకరమైన ఆ దినాలు ప్రజలలో పశ్చాత్తాపాన్ని కలిగించే సాధనాలుగా ఉంటాయి. ఇది ఉజ్జీవం కొరకు హబక్కూకు చేసిన ప్రార్థనకు జవాబు. ఈ విధానంలో పనిచేసే ఈ దేవుడు, నేడు సాధారణంగా అంగీకరించబడే దేవుడు మరియు ఆయన సార్వభౌమత్వాన్ని గురించిన తలంపులకు సరిపోడు. కల్దీయులు మనపైకి వచ్చినపుడు 'వారిని పంపిన వాడు అపవాది కాదు' అనీ, దేవుడే వారిని పంపాడని మనము గ్రహించాలి. మన జీవితాలలో మనలను కలవరపెట్టేది ఏది జరిగినా అందులో దేవుని హస్తమున్నది, లేనట్లయితే అలా జరిగివుండేది కాదు. ఏదో ఒకదానిని నెరవేర్చడానికి ఆయన ఆ పరిస్థితిని కల్పించాడు. మనం అపవాదిని నిందించే బదులు, దేవుని సన్నిధిని వెదకి ఈ వ్యథల ద్వారా ఆయన మనకు నేర్పించాలనుకున్న పాఠాన్ని నేర్చుకునే కృపనిమ్మని ఆయనను ప్రార్థించాలి.

మనకు కలిగిన కష్టాలన్నిటికీ అపవాదిని నిందించటం, మన స్వనీతిని, స్వాతిశయాన్ని బలపరచ్చుకోవటమే అవుతుంది. ఆధ్యాత్మికంగా బహు ఉన్నత దశలో ఉన్న క్రైస్తవులమైన కారణాన సాతాను ఇంత బలంగా మనలను ఎదిరిస్తున్నాడని మనము అనుకోవచ్చు. ప్రతి విషయంలోనూ దేవుని హస్తాన్ని చూడనంత వరకూ నువ్వు దేవునిని మరియు సమస్యలను కలుగజేయటంలో ఆయన ఉద్దేశాన్ని ఎదిరిస్తూనే ఉంటావు. తన సొంత బుద్ధిహీనతకు కలిగిన ఫలితానికి అపవాదిని నిందించే ఒక మంచి విశ్వాసి మాటలను వినటం కంటే విషాదకరమైనది వేరొకటి లేదు. అంతే కాదు - తాను ఎంతో భక్తిపరుడు కాబట్టి సాతాను ఆ విధంగా చేశాడని అతడు తలంచటం మరింత శోఛనీయం! బహుశా దేవుడెన్నడూ వాగ్దానం చేయనిదానిని నమ్మి అది జరుగుతుందనుకుంటున్నానేమో అన్న ఆలోచన అతనికి కలగదు. పైగా ఆ పరిస్ధితిని కల్పించినవాడు దేవుడే అని అతడు అర్థం చేసుకోడు. ఈ సమస్యకు రెండు కారణాలు ఉన్నాయి. అతనికి తెలిసిన తప్పుడు దైవశాస్త్రం, తన పరీక్ష ద్వారా మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని విననీయదు. పైగా అతడు తన కృత్రిమభక్తిలో మరింత కఠినుడవుతాడు.

అయితే ఈ వాక్యభాగం ఏమంటుందో గమనించారా? ''నేను (అపవాది కాదు) ఒక కార్యమును జరిగింతును.'' ఆ కార్యము ఒక న్యాయ తీర్పు. 6వ వచనాన్ని గమనించండి. ''నేను (అపవాది కాదు) కల్దీయులను రేపుదును.'' తన ప్రజల మీదికి ఆ భయంకర జనాంగాన్ని పంపుతున్నవాడు దేవుడే. ఆ అధ్యాయంలో ఆ తరువాత కల్దీయులు చేసినదానికి, వారికి కూడా తీర్పు తీర్చబోతున్నానని దేవుడు చెబుతున్నాడు. అయితే దీని విషయమైన విశ్లేషణ మరొక సూత్రం క్రింద చేద్దాం.

దేవుడు సమస్తాన్ని, ఎల్లప్పుడూ తన ఆధీనంలో ఉంచుకుంటాడన్న ఈ రెండవ సూత్రం ఎంతో ప్రాముఖ్యమైనందు వలన, ఇది తరువాత మనం చర్చించబోయే సూత్రాలకు పునాది అవ్వటం వలన, ఇదే సత్యాన్ని బోధించే మరొక వాక్యభాగాన్ని చూపించాలనుకుంటున్నాను. యెషయా 10వ అధ్యాయంలో మనం పరీక్షించాలనుకుంటున్న సూత్రాలలో కనీసం మూడింటిని చూడగలం. మనం ఇప్పుడు చర్చించే ఈ రెండవ సూత్రం 5, 6 వచనాలలో కన్పిస్తుంది.

''అష్షూరీయులకు శ్రమ. వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలోనున్నది. భక్తి హీనులగు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి వారి కాజ్ఞాపించెదను'' (యెషయా 10:5-6).

కల్దీయులకు మారుగా దేవుడిప్పుడు అష్షూరీయులను వాడుకుంటున్నాడు. 5వ వచనంలో అష్షూరు వారి చేతిలో ఉన్న దండము వాస్తవానికి ఆయన దండమేనని దేవుడు సెలవిస్తున్నాడు. దాడి చేసేది అష్షూరీయులు కావచ్చు (15 వ). అయితే వారి వెనుక ఉన్న హస్తము మరియు ఉద్దేశము దేవునివి. 6వ వచనంలో ''భక్తి హీనులగు జనముల మీదికి నేను వారిని (అనగా అష్షూరీయులను) పంపెదను'' - అని దేవుడు చెబుతున్నాడు. ఇశ్రాయేలీయుల పైకి అష్షూరీయులను పంపువాడు దేవుడే కాని సాతాను కాదు. ''నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి వారికాజ్ఞాపించెదను'' అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు నిత్యం తన ఆధీనంలో సమస్తాన్ని ఉంచుకుంటాడన్న సూత్రాన్ని ఈ వాక్యభాగం స్పష్టంగా బోధిస్తుంది. ఏది జరిగినా ఎవరు జరిగించినా అది సర్వాధికారియైన దేవుడు చేసే కార్యమే. సమస్తమూ ఆయన ఆధీనంలో ఉన్నాయి మరియు ఆయన తన ప్రణాళికను ఎల్లప్పుడూ నెరవేరుస్తున్నాడు. శోధన, శ్రమల సమయంలో సదుద్దేశంతో చెప్పినా, తప్పు త్రోవ తొక్కించే వారి మాటలు వినటం ప్రమాదకరం. తరచూ వారు 'నా దేవుడు ప్రేమామయుడు, కృపాసంపన్నుడు కాబట్టి ఈ విధంగా చేయడు' అని చెప్తారు. ఒక విధంగా చూస్తే అతని మాట సరైనదే కావచ్చు. 'అతని దేవుడు' అలాగ చేయకపోవచ్చు, ఎందుకంటే 'అతని దేవుడు' లేఖనాలలో బయలుపరచబడిన వాడు కాదు. అతని దేవుడు అతని సొంత భావోద్వేగాల నుండి ఉద్భవించినవాడు.

మూడవ సూత్రంః దేవుడు తన ప్రణాళికను సాధించడానికి ప్రతి ఒక్కరినీ, చివరికి అపవాదిని సైతం తన ఆధీనంలో ఉంచుకుని వాడుకుంటాడు.

ఇది మూడవ సూత్రం. తన సొంత ప్రణాళికలను నెరవేర్చానికి దేవుడు ప్రతి ఒక్కరిని ఉపయోగించుకుంటాడు. సాతానుని కూడా. మొదటిలో ఇది కొందరిని దిగ్భ్రాంతికి గురి చేయవచ్చు: 'ఏమిటీ ! దేవుడు సాతానుని ఉపయోగించుకుంటాడా?' అవును, ఇది ఖచ్చితమైన సత్యం. సాతానుతో సహా ప్రతివాడూ దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తారు. బానిస పళ్లు కొరుకుతూ తన యజమానిని సేవించవచ్చు. సేవ చేయానికి అతడిష్టపడకపోవచ్చు. అయినా అతడు సేవ చేయవలసిందే. సాతాను పరిస్థితి కూడ ఇదే. వాడు దేవుని పట్ల ప్రేమతో కానీ విధేయతతో కానీ ఒక్క పనీ చేయడు. బుద్ధిపూర్వకంగా దేవునికి మహిమ తీసుకురావాలని ఎన్నడూ వాడేమీ చేయడు. అపవాది సదా దేవుని ద్వేషిస్తూ ఆయన ఉద్దేశాలని భంగపరచడానికే సమస్తాన్ని చేస్తాడు. అయినా, చివరికి వాడు చేసే ప్రతి కార్యమూ తప్పకుండా దేవుని చిత్తం నెరవేరటానికే తోడ్పడుతుంది. సమస్తమూ కోల్పోవటానికి పుట్టినవాడెవడైనా ఉంటే అది సాతానే. సాతాను ఒక్కసారైనా జయం పొందలేదని అంత్యదినమున బయలుపడుతుంది. అందులో ఏదేను వనం కూడా ఉంది!

యెషయా 10వ అధ్యాయంలో చెప్పబడిన ఈ సత్యాన్ని గమనిద్దాం:

''అయితే అతడు (అష్షూరీయుడు) ఆలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలెననియు చాలా జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు - నా అధిపతులందరు మహా రాజులు కారా? . . . విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటె ఎక్కువైనవి గదా? షోమ్రోనునకును దాని విగ్రహములకును చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా?'' (యెషయా 10:7-11).

ఈ వాక్యభాగం ఎంతో స్పష్టంగా ఉంది. దేవుడు తలంచినట్లు అష్షూరీయుడు తలంచటం లేదు. నిజం చెప్పాలంటే అతడు దేవుని గురించి ఏ మాత్రమూ ఆలోచించటం లేదు. గర్విష్ఠుడైన ఆ అష్షూరీయుడు తలంచేదంతా మరొక దేశాన్ని నాశనం చేసి దాని సంపదను కొల్లగొట్టటమే. అయినప్పటికీ అష్షూరీయునికి ఏ మాత్రం తెలియకుండా దేవుడే పరిస్థితులన్నిటినీ నిర్దేశిస్తున్నాడు. దేవుడు అతని మనస్సునూ, ఉద్రేకాలనూ రేపుతున్నాడు. ఇశ్రాయేలుపై తీర్పు విధించే తన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి సర్వాధికారియైన దేవుడు అష్షూరీయుని ప్రతి కదలికనూ నియంత్రిస్తున్నాడు.

నరుని ఆగ్రహం దేవునికి మహిమ కలిగిస్తుంది

కీర్తనలు 76:10 ఇదే సూత్రాన్ని ఉదహరించే ఒక ఆసక్తికరమైన వచనం: ''నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును'' అని చెబుతూ ''ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు'' అని ఈ వచనం కొనసాగుతుంది. మరో విధంగా చెప్పాలంటే నరుడు దేవునికీ ఆయన అధికారానికీ విరోధంగా క్రోధంతో నిండియున్నాడు. దేవుడు అతనిలో ఆ ఆగ్రహాన్ని ఉంచలేదు. లేదా ఆ కోపాన్ని ప్రకటించే పనులను చేయమని ప్రేరేపించలేదు. నరుని స్వేచ్ఛాచిత్తము, తిరుగుబాటు చేసే అతని స్వభావానికి బానిసై అతని హృదయంలోగల పాపానికి, కోపానికి అదే పూర్తిగా బాధ్యత వహిస్తుంది. అయినా మానవహృదయాన్ని దేవుడే పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి దోహదపడేంత వరకు మాత్రమే మానవుని కోపం పైకి రావటానికి అనుమతించబడి అది ఆయన చేత వాడబడుతుంది. అయితే ఆయన ఉద్దేశంలో ఇమడని క్రోధం మానవ హృదయంలో ఎంతో మిగిలి ఉంది. కాబట్టి అలా 'మిగిలిన' కోపంపై ఆయన ఒక బిరడా బిగించి దానిని పైకి రానీయడు. రెండు విధాలుగా దేవుడే మానవుని కోపాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఆ కోపం ఎప్పుడు, ఎంత ప్రదర్శింపబడాలో దేవుడు నిర్ణయించి అది తన ప్రణాళికలో కొంత భాగాన్ని నెరవేర్చేలా దానిని వాడుకుంటాడు.

'దేవుని సేవకులందరిలో సాతానే మిక్కిలి కష్టపడి పనిచేయువాడు!' ఈ మాట మొదట విన్నప్పుడు నేనెంత ఆశ్చర్యపడ్డానో నాకు జ్ఞాపకముంది. అయినప్పటికీ దేవుడు తన సంపూర్ణ సర్వాధికారాన్ని గురించిన సత్యాన్ని నాకు చూపించిన క్షణంలోనే ఆ మాటలోగల యథార్థతను గ్రహించగలిగాను. సాతాను తాను చేసే పనులన్నిటినీ ద్వేషంతోనే చేస్తాడన్నది వాస్తవమైనప్పటికీ దేవుడు దానంతటినీ తన ఆధీనంలో ఉంచుకుని తన ప్రణాళికను పూర్తి చేయానికి వాడుకుంటాడు. దీనిని అర్థం చేసుకోవటానికి ఒక దృష్టాంతం సహాయపడగలదు.

సార్వభౌమత్వాన్ని గురించిన దృష్టాంతం

ఒక ధనవంతునికొక అందమైన తోట ఉంది. దానిలో వివిధ రకాల పళ్లచెట్లున్నాయి. అతనికి స్త్రీలంటే ఇష్టం లేకపోవటం వలన వివాహము చేసికోకుండా బ్రహ్మచారిగా ఉన్నాడు. అతనికి జంతువులంటే ఇష్టం లేకపోవటం చేత పెంపుడు జంతువులను పెంచలేదు. అతను తన చెట్లనే పెంపుడు జంతువుల్లా చూసుకున్నాడు. అతను ప్రతి చెట్టుకూ ఒక పేరు కూడ పెట్టాడు. ఆ ధనవంతునికి ఒక చెట్టంటే చాలా ఇష్టం. అయితే విచారకరమైన విషయమేమిటంటే అతనికొక శత్రువున్నాడు. అతను ఆ ధనవంతుడిని ద్వేషించి అతన్ని బాధించాలనుకున్నాడు కాని తన దుష్టప్రణాళికలను కొనసాగించలేకపోయాడు. ఒక రాత్రి ధనవంతుడిని బాగా గాయపరచటానికి దుర్మార్గుడైన ఆ శత్రువు ఒక పన్నాగం పన్నాడు. అతడు ధనవంతుని తోట చుట్టూ ఉన్న కంచెను దూకి అతనికి అతి ప్రియమైన చెట్టును నరకటానికి వెళ్లాడు. ఆ చెట్టు నరకబడటం చూసినపుడు ధనవంతుడెంత బాధపడతాడో అన్న ఆలోచన అతనికి ఇంకా బలమిచ్చింది. అతడు మరింత కష్టపడి దాన్ని నరకగా చివరికి అది నెమ్మదిగా నేలపైకి ఒరగసాగింది. ఇది చూసి ఆ దుష్టుడు సంతోషంతో ప్రక్కకు తప్పుకోవాలని ఒళ్లు తెలియక పరుగెత్తుతుండగా ఆ చెట్టు అతనిపై పడి అతనిని నేలకు బిగించివేసింది.

తెల్లవారిన తరువాత ఇద్దరు వ్యక్తులు నేలకొరిగిన ఆ చెట్టువైపు రావటం దుష్టుడు చూసాడు. 'నేను పట్టుపడ్డాను. నాకు శిక్ష తప్పదు. అయినా నేను లెక్క చేయను. నేను నీకు ప్రియమైన చెట్టును నరికాను.' ఆ దుష్టుడు మిక్కిలి ద్వేషంతో నిండి 'నేను నీ చెట్టును నాశనం చేశాను. నాశనం చేశాను' అని చెబుతూనే ఉన్నాడు. అప్పుడు ధనవంతుడు అతని వైపు చూసి 'నాతో వచ్చిన ఈ వ్యక్తి, భవనాలను నిర్మించే కాంట్రాక్టరు. నా తల్లిదండ్రులకు ఒక వేసవి గృహాన్ని నిర్మించటానికి నేనొక చెట్టును నరికివేయాలి. ఆ ఇంటిని సరిగ్గా ఇక్కడే కట్టించదలిచాను. నేను ఏ చెట్టును నరకాలనుకున్నానో చూపించటానికే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. చెట్టును నువ్వే నరికి నా పనిని తేలిక చేసినందుకు నీకు ధన్యవాదాలు'' అని చెప్పాడు.

విషయం మీకు అర్థమైందనుకుంటాను. సాతాను చేసేదంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికే ఎల్లప్పుడూ దోహదపడుతుంది. దేవుడు తన ఉద్దేశాలను ఈ పాపభూయిష్టమైన లోకంలో నెరవేర్చుకుంటాడని గుర్తుంచుకో. యోసేపు అన్నలు ద్వేషంతో అతనికి కీడు చేశారు, అయితే ''..... అది మేలుకే దేవుడు ఉద్దేశించెను'' (ఆది. 50:20). అష్షూరీయులు, కల్దీయులు అధికారదాహంతోను, ధనాశతోను ఇశ్రాయేలీయులపై దండెత్తియుండవచ్చు. కాని దేవుడు ఇది కూడా తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు.

నాల్గవ సూత్రం - దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి వాడబడేవారు దురుద్దేశంతో ప్రవర్తిస్తే వారిని శిక్షిస్తాడు.

మనము న్యాయమని తలంచే దానిని బట్టి ఈ నాల్గవ సూత్రాన్ని అంగీకరించటం బహుశా మిక్కిలి కష్టమని చెప్పవచ్చు. తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు ఉపయోగించిన ప్రజలు, దురుద్దేశంతో ఆయనను గురించిన ఆలోచన లేకుండా ప్రవర్తించినపుడు ఆయన వారిని శిక్షిస్తాడు.

యెషయా 10వ అధ్యాయాన్ని మరొకసారి పరిశీలిద్దాం.

''కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. అతడు - నేను వివేకిని. నా బాహు బలము చేతను నా బుద్ధి చేతను ఆలాగు చేసితిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొందును. మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని...'' (యెషయా 10:12, 13).

అష్షూరు రాజు గర్వాన్ని, అవిశ్వాసాన్ని, స్వాతిశయాన్ని మనమిక్కడ చూడగలం. తన వివేక బలంతో సమస్తాన్ని సాధించానని అతడు నిజంగా భావిస్తున్నాడు. అతనికి దేవుని గురించిన ఆలోచన ఎంత మాత్రమూ లేదు. నిజంగా జరిగిందేమిటో మనమతనికి తెలిపితే బహుశా అతడు పగలబడి నవ్వి అతనికంటే బలవంతుడొకడున్నాడని చెప్పినందుకు మనలను సంహరింపవచ్చు. ఆ తరువాత వచనం అతని అతిశయాన్ని చక్కగా చిత్రీకరిస్తుంది.

''పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్థి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును'' (యెషయా 10:14).

ఇక్కడ అహంకారియైన రాజు నిస్సహాయమైన పక్షుల గూళ్లను దొంగలించే ఒకనితో తన్ను తాను పోల్చుకొంటూ తనకున్న గొప్ప బలము వలన అతడు రాజ్యముల సైన్యములను, నావికా బలమును చూసి అపహాస్యం చేస్తున్నాడు. అతనిని అడ్డగించే మాట అటుంచి నోరు విప్పి వ్యతిరేకించటానికి కూడా ఎవ్వరూ సాహసించరు. ఒక్క క్షణం ఆగి వేరెవరో మాట్లాడుతున్నారు వినండి. ఇశ్రాయేలు రాజ్యంపై దండయాత్ర ఎందుకు జరిగిందో, ఇపుడు అష్షూరుకు ఏమి సంభవించబోతుందో దేవుడు చెబుతున్నాడు వినండి. 5, 6 వచనాలలో ఇశ్రాయేలును శిక్షించటానికి తాను అష్షూరును ఉపయోగిస్తానని దేవుడు సెలవిచ్చాడు. 12వ వచనంలో తాను నిజంగానే అష్షూరును ఉపయోగించానని చెప్పి ఆ తరువాత ఇలా అంటున్నాడు - ''అష్షూరు రాజు యొక్క హృదయగర్వమును బట్టి .... అతని శిక్షింతును.'' వారు చేసిన దానిని బట్టి దేవుడిప్పుడు అష్షూరీయులతో తగిన రీతిలో వ్యవహరించబోతున్నాడు! వారు ఇప్పుడు దేవుడు అప్పగించిన పనిని (తెలియకుండానే) సంపూర్తి చేసినప్పటికీ ఆయన వారిపై ఎందుకు ఆగ్రహిస్తున్నాడో 15వ వచనం తెలియజేస్తుంది. ఈ మాటలు నీ మనసులోనికీ హృదయంలోనికి ఇంకి నీ దైవశాస్త్రం ఆయన వాక్యానుసారంగానే రూపుదిద్దుకొననివ్వు.

''గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా? కోల తన్నెత్తు వానిని ఆడించినట్లును దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును గదా?'' (యెషయా 10:15).

పై వచనాన్ని ఏ విధంగా చూసినా దాని అర్థం ఒకే రీతిగా ఉంటుంది. దేవుడు తన తీర్పును అమలు జరుపటానికి అష్షూరీయులను ఉపయోగించుకొని ఆ తరువాత వారు చేసిన దానికి వారిని శిక్షించటం అన్యాయంగా కనిపిస్తుందా? సరిగ్గా బోధనొందని క్రైస్తవులు దేవుని సార్వభౌమత్వాన్ని విశ్వసించటం కష్టమనుకోవటానికి గల ముఖ్యకారణం ఈ సత్యాన్ని గ్రహింపకపోవటమే. వారు మానవుని 'స్వేచ్ఛా చిత్తం'తో బైబిలు సిద్ధాంతమైన మానవ 'స్వేచ్ఛా ప్రమేయాన్ని' కలిపి కలవరపడుతున్నారు. వీటి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించకపోవటం వలన ఈ క్రింది రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయనుకొని పొరబడుతున్నారు. (1) మానవుడు పూర్తిగా స్వేచ్ఛా జీవి (చివరికి దేవుని శక్తి కూడ మానవుని సర్వ చిత్తము యొక్క ఆధీనంలో ఉంటుంది) లేదా (2) మానవుడు మరమనిషి (Robot). మానవుడు దేవుని సర్వాధికారం చేత నియంత్రించబడి జీవిస్తాడు గనుక అతడు చేసే పనులకు అతడు బాధ్యుడు కాదు.

దేవుడు సర్వాధికారి - మానవుడు బాధ్యుడు

మనం పరిశీలించిన వాక్యభాగాలు పై రెండు ప్రత్యామ్నాయాలు అసత్యమని చూపిస్తున్నాయి. దేవుడు తాను ముందే ఏర్పరచిన తన ప్రణాళికను నెరవేరుస్తున్నప్పుడు ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని తన సర్వాధికారంతో తన ఆధీనంలో ఉంచుకుంటాడని మొదటి నుండి చివరి వరకు దేవుని వాక్యం బోధిస్తుంది. అదే దైవ వాక్యం ప్రతి మానవుడు తాను చేసే ప్రతి కార్యానికి పూర్తిగా బాధ్యుడని కూడ బోధిస్తుంది. పరిమితమైన మన జ్ఞానము దీని పట్ల అభ్యంతరపడి ఇది పరస్పర వైరుధ్యం కలిగినదని భావించవచ్చు. అయితే ఈ రెండూ నిజమేనని లేఖనాలు ప్రకటిస్తున్నాయి. సత్యంలోని ఈ రెండు కోణాలు నిజమా కాదా అనేది మనము వాటిని అర్థం చేసుకోవటం మీద కాని అర్థం చేసికొనకపోవటం మీద గాని ఆధారపడి ఉండదు. ఈ రెండిటినీ దేవుడు తన వాక్యంలో బయలుపరిచాడు కాబట్టి ఈ రెండూ సత్యమేనని అంగీకరించాలి. దేవుడు సర్వాధికారి. ఆయన తన ప్రణాళికలోని ప్రతి భాగాన్ని జరిగిస్తాడు. మానవుడు తన ఆలోచనలు, మాటలు, పనులు అన్నిటికీ తానే పూర్తిగా బాధ్యుడు.

దేవుడు ఇశ్రాయేలను దండించి జయించడానికి అష్షూరును తన ఆధీనంలో ఉంచుకొని వారి పైకి పంపాడని యెషయా 10:5,6,12 వచనాల్లో స్పష్టంగా ఉందా? 7-11, 15 వచనాలలో అష్షూరీయులు చేసినదంతా వారి దుష్ట హృదయము, గర్వాతిశయం వల్లనే చేశారని ఉందా? 12, 15 వచనాలు అష్షూరీయులు చేసినదంతా దేవుని చిత్తానుసారంగా ఆయన శక్తి, ఆధ్వర్యం క్రిందనే జరిగించినప్పటికీ ఆయన బుద్ధిపూర్వకంగా వారిని శిక్షించాడని గట్టిగా బోధిస్తున్నాయా?

ఇదే సత్యాన్ని బోధించే మరికొన్ని వాక్యభాగాలను పరిశీలిద్దాం.  అపొస్తలుల కార్యములు 2:23 దీనికొక మంచి ఉదాహరణ. ఈ వాక్యభాగం సర్వాధికారి అయిన దేవుని శాసనాలను, బాధ్యతగల మానవుల స్వేచ్ఛా కార్యాలను సమన్వయపరుస్తుంది. 22వ వచనంలో క్రీస్తే వాగ్దానం చేయబడిన మెస్సీయ అనేందుకు అన్ని నిదర్శనాలు ఉన్నాయని పేతురు యూదులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత మనమీ మాటలు చదువుతాం -

'దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను... ''

మరొక అనువాదంలో (NIV) ఇలా ఉంటుంది: ''దేవుని చిత్త సంకల్పము, భవిష్యద్‌ జ్ఞానము వలన ఈ మనుష్యుడు మీ చేతికి అప్పగింపబడెను ....''

కొన్ని వారాలకు ముందు ''వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము'' అని అరచిన ఆ యూదులు ఇప్పుడు పేతురు ఆ కల్వరి సంభవం దేవుని సంకల్పానుసారంగానే జరిగిందని చెప్పినప్పుడు ఏమనుకొని ఉంటారో ఊహించగలవా? వారొక నిట్టూర్పు విడిచి మనస్సు తేలిక పడినవారై ''యేసు మరణానికి మనమే బాధ్యుల మనుకున్నాం. అయితే ఇప్పుడు మనము దోషులం కామని గ్రహించాం. అలా చేసింది దేవుడే కాని మనం కాదు'' అని చెప్పుకొని ఉండవచ్చు. ఆ భయంకర సంఘటనకు మేము బాధ్యులం కామని తప్పించుకోవటానికి ప్రయత్నించి ఉంటారు. విచారకరమైన విషయమేమిటంటే ఆర్మీనియన్‌ దుర్భోద సరిగ్గా ఇలాంటి అపార్థానికే తావిస్తుంది. అయినా ఆ వచనంలో మిగిలిన భాగాన్ని గమనించు:

''. . . ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి'' (అపొ.కా. 2:23).

పేతురు ఇలా చెబుతున్నాడు 'క్రీస్తును సిలువకు అప్పగించాలన్నది దేవుని సర్వాధికార చిత్తం అన్నది సత్యమే కాని అంతమాత్రాన మీరు ఏ విధంగానూ నిర్దోషులు కారు! మీరు మీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని బట్టి ఇలా చేశారు గనుక ఆయన రక్తం మీ మీద ఉన్నది!' ప్రియ పాఠకులారా, మాటలు ఇంతకన్నా స్పష్టంగా ఉండలేవు. దేవుడు తన శాసనాలను నెరవేర్చటానికి దుష్టులను ఉపయోగించుకొని, వారు చేసిన దుష్టకార్యాలకు వారినే బాధ్యులుగా చేశాడని ఈ వచనం చూపిస్తుంది. ఈ రెండు విషయాలూ ఎలా నిజం కాగలవో మనం గ్రహించలేం కాని దేవుని వాక్యం ఈ రెండూ నిజమని చెబుతుండగా దానిని కాదనలేం. 'హైపర్‌-కాల్వినిజం' ఒక దానినీ ''ఆర్మీనియనిజం'' మరొక దానినీ తృణీకరించవచ్చు కాని, మేమైతే ఈ రెండిటినీ నమ్మి రెండిటినీ బోధిస్తున్నాం.

దేవుని శాసనాలు - మానవుని 'స్వతంత్ర చిత్తం'

ఒక ప్యూరిటను చేసిన ఓ శ్రేష్టమైన వ్యాఖ్య ఆధారంగా ఈ సత్యాన్ని చూద్దాం. 'నిత్యత్వంలో దేవుడు తన సర్వాధికారంతో దేనిని శాసించునో దానినే మానవుడు తగిన సమయమున స్వచ్ఛందంగా కోరును.' దేవుడు తన సర్వాధికారంతో ఏర్పాటు చేసినదానినే మానవుడు తన స్వతంత్ర చిత్తంతో స్వేచ్ఛగా ఎన్నుకుంటాడు. తద్వారా దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. అయినప్పటికీ మానవుడు తన పాపభూయిష్టమైన క్రియలకు తానే బాధ్యత వహించాలి. ఈ సత్యం మత్తయి 27లో ఉన్నంత స్పష్టంగా మరెక్కడా కనిపించదు. ఆ అధ్యాయమంతటిలో మానవుడు తన బాధ్యత నుండి తప్పించుకోవటానికి చేసిన వ్యర్థప్రయత్నాలను చూడగలం. మొట్టమొదట, యూదా క్రీస్తు నిర్దోషని చెప్పి ముప్పై వెండి నాణేలను ప్రధాన యాజకునికి, పెద్దలకు తిరిగి అప్పగించటం ద్వారా తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వారు దానికి ''దానితో మాకేమి? నీవే చూచుకొనుమని'' జవాబిచ్చారు. అయితే క్రీస్తు నిర్ధోషియా లేక ఆయన మరణ పాత్రుడా అని నిశ్చయంగా తెలిసుకోవటం వారి బాధ్యత కాదా? నిశ్చయంగా అది వారి బాధ్యతే!

యేసు పిలాతు యెదుట నిలిచినప్పుడు పిలాతు తన బాధ్యతను తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం స్పష్టంగా వర్ణించబడింది. యేసు నిర్దోషి అని పిలాతుకు బాగా తెలుసు. అయినా అతడాయనను శిక్షించి చట్టాన్ని, న్యాయాన్ని పూర్తిగా కాలరాసాడు. ఆపై తాను చేసిన దోషానికి బాధ్యత వహించటానికి బదులు దాని నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఏది ఏమైనా ప్రజలు తమ 'స్వతంత్ర చిత్తంతో' చేసిన నిర్ణయంతో పిలాతు ఏకీభవించటాన్ని మత్తయి స్పష్టంగా వివరించాడు. తాము కోరిన ఖైదీని విడిపించే శక్తి, అధికారం వారికి ఉందని జ్ఞాపకముంది కదా? అది పూర్తిగా వారి ఇష్టమే. ఇక్కడ ఆ వాక్యభాగంలోని మాటలను జాగ్రత్తగా గమనించండి:

''జనులు కోరుకొనిన యొక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక'' (మత్తయి 27:15).

నిర్ణయం పూర్తిగా జనుల స్వతంత్ర చిత్తానికే విడిచి పెట్టబడింది. వారు మంచి చెడ్డలు తెలిసినవారై ఉండి కూడా, బుద్ధిపూర్వకంగా దోషి, దుర్మార్గుడని పేరుపొందిన నేరస్థుడైన బరబ్బ అను వానిని విడుదల చేయమని కోరారు. తన భార్య, తన మనస్సాక్షి, చివరికి రోమన్‌ హెబ్రీ చట్టాలు సైతం అభ్యంతరపెట్టినా లెక్కచేయక ఆ అన్యాయాన్ని అరికట్టడానికి పిలాతు ప్రయత్నించలేదు. ప్రజల కేకలకు అతడు లొంగిపోయాడు. 'క్రీస్తు అనబడిన యేసును ఏమి చేయదలచితిరని'' అతడు వారినడిగినపుడు జన సమూహము ఏక కంఠముతో 'సిలువ వేయుమని అరిచారు. పిలాతు ప్రజల మనస్సును మార్చేందుకు తనకు తెలిసిన ప్రతి ఉపాయాన్ని ఉపయోగించినా వారు ''సిలువ వేయుమని'' మరి బిగ్గరగా అరిచారే గాని లాభం లేకపోయింది.

వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి దోషులయ్యారు 

చివరికి పిలాతు జనసమూహం ఎదుట తన చేతులు కడుక్కోవటం ద్వారా తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ''ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి'' అని అన్నాడు. జనులు నిరభ్యంతరంగా సంతోషంగా దాని బాధ్యతనంతా తీసుకున్నారు. వారు గర్వంతో ఏమాత్రం భయం లేకుండా ''వాని రక్తము మామీదను మా పిల్లల మీదను ఉండుగాక'' అన్నారు. ఇంతకంటే ఘోరమైన పాపాన్ని వేరెవరైనా చేయగలరా? అయినా దేవుని రహస్యచిత్తాన్ని (తెలియకుండానే) పిలాతు మరియు ఈ జనసమూహాల కన్నా వేరెవరైనా ఇంత ఖచ్చితంగా నెరవేర్చగలరా?

సామాన్యమైన రెండు ప్రశ్నలనూ, మత్తయి 27లో వాటికి గల స్పష్టమైన జవాబులను జాగ్రత్తగా పరిశీలించండి.

(1) సర్వశక్తిమంతుడైన దేవుడు తన కుమారునికి సరిగ్గా ఏమి సంభవించాలని నిత్యత్వంలో నియమించాడు? ఆయన సిలువ వేయబడాలని. ఉన్మాదంతో ఆ జనసమూహం ఏమి జరగాలని పట్టుబట్టారు? క్రీస్తును సిలువ వేయుమని.

నిత్యత్వంలో దేవుడు దేనిని శాసించాడో సరిగ్గా దానినే తగిన సమయంలో మానవుడు స్వేచ్ఛగా ఎన్నుకుంటాడు.

(2) పాప ప్రాయశ్చిత్తముగా పరిశుద్ధుడైన దేవునిని తృప్తిపరచగలిగిన ఒకే ఒక్కటి ఏది? చిందింపబడిన యేసుక్రీస్తు రక్తము! ఉన్మాదులైన ఆ జన సమూహము యొక్క ఉద్రేకాన్ని, ద్వేషాన్ని తీర్చగల ఒకే ఒక్కటి ఏది? చిందింపబడిన యేసు రక్తము.

నిత్యత్వంలో దేవుడు దేనిని శాసించెనో సరిగ్గా దానినే తగిన సమయంలో మానవుడు స్వేచ్ఛగా ఎన్నుకుంటాడు.

ఈ అంశాన్ని అర్థం చేసుకోవటానికి ఒక దృష్టాంతం బహుశా సహాయపడవచ్చు. రైలు పట్టాల మీద రెండు రైళ్లు నడుస్తున్నప్పుడు అవి ఎదురెదురుగా వచ్చే సమయానికి స్విచ్‌ వేసి ఆ పట్టాలను మార్చవలసిన బాధ్యత ''స్విచ్‌ మేన్‌''పై ఉంటుంది. ఒకవేళ అతడు తాగి మత్తులో పడి స్విచ్‌ వేయవలసిన సమయానికి వేయకపోవడం వల్ల ఆ రెండు రైళ్లు ఢీకొని వందమందికి పైగా ప్రయాణికులు మరణించారునుకోండి. వారి మరణానికి అతడు కారణమని అనవచ్చునా? అనవచ్చుననే మనం ఒప్పుకుందాము. అయితే తాగి పడి ఉన్న ఈ మనిషికి తెలియకుండానే హఠాత్తుగా వరద వచ్చి వంతెన కొట్టుకుపోయిందనుకొందాము. ఇతడు తాగిన మత్తులో ఉండుట వలన స్విచ్‌ వేయనందున మరియు వంతెన కొట్టుకుపోయినందున భయంకరమైన రైలు ప్రమాదం తప్పిపోయింది. దీని కారణంగా అతడు త్రాగి స్విచ్‌ వేయనందుకు అతనికి బహుమానం ఇవ్వడం న్యాయమేనా?

ఇపుడు స్పష్టంగా ఆలోచించండి. పై రెండు సందర్భాల్లో ఎప్పుడతడు ఎక్కువగా దోషం చేశాడనవచ్చు? అతని పాప కార్యము ప్రమాదాన్ని కలిగించినప్పుడా లేక అదే కార్యము ప్రమాదాన్ని తప్పించినప్పుడా? దీనికి జవాబు అతి సామాన్యమైనది. అతడు తన విధిని నెరవేర్చడాన్ని బట్టి మాత్రమే తీర్పు తీర్చినట్లయితే ఆ రెండు సందర్భాలలోనూ అతడు దోషే అవుతాడు. బహునీచమైన పాపాల ద్వారా దేవుడు గొప్ప మేలును సాధిస్తాడు. కాని ఆ వ్యక్తిని మాత్రం ఆ పాపకార్యానికి బాధ్యునిగా చేస్తాడు. కల్ధీయులు, అష్షూరీయులు, క్రీస్తును సిలువ వేసిన తిరుగుబాటుదారులు దీనికి ఋజువులుగా వున్నారు. మనం చేసే పనుల ద్వారా దేవుడు జరిగించుకునే కార్యాల ఫలితాలకు మనము బాధ్యులము కాము గాని మనం చేసిన పనులకు మాత్రమే మనము బాధ్యులమవుతాం. దేవుడు మనతో వ్యవహరించే తీరు దీనిపై ఆధారపడి ఉంటుంది.

తరువాతి సూత్రాన్ని పరిశీలించే ముందు ఇప్పుడు మనం చర్చిస్తున్న అంశం మన వ్యక్తిగత జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుందో నొక్కి చెప్పాలనుకుంటున్నాను. భక్తిహీనుల చేతిలో మనము పావులమని గాని, బాధితులమనిగాని మనం ఎన్నడూ భావించకూడదు. ప్రతి పరిస్థితీ మన పరలోకపు తండ్రి చేతిలో ఉన్నదని ఎల్లప్పుడూ గుర్తించాలి. దుష్టులు జయించినప్పుడు సైతం దేవుడు దానిని తన మహిమ కొరకు మన మేలు కొరకు జరిగిస్తున్నాడని గ్రహించాలి.

యాభై ఏళ్లుగా పరిచర్యలో ఉన్న నేను సాధారణంగా నా తోటి పనివారితో చక్కగా కలిసి పని చేయగలిగాను. కాని ఆ సమయంలో నేనొక డీకను (సంఘపెద్ద)తో ఆ విధంగా పని చేయలేకపోయాను. అతడు నన్ను ఎంతో ద్వేషించినట్లు అనిపించేది. అతడు తప్పించుకోగలిగితే నాకు గొప్ప అపాయాన్ని కలిగించి ఉండేవాడే. నేనతన్ని ''షిమీ'' అని పిలిచేవాణ్ణి (నేను నా భార్యతో మాట్లాడేటప్పుడు మాత్రమే). మీకు షిమీ గుర్తుండే ఉంటాడు. దావీదు రాజ్యాన్ని అబ్షాలోము హస్తగతం చేసుకొన్నప్పుడు అతడు తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి పారిపోతున్న సమయంలో షిమీ దావీదును శపిస్తూ ''నరహంతకుడా, నీ మోసములో నీవే చిక్కుపడి యున్నావు'' అన్నాడు. దావీదు సేవకులలో ఒకడు వాని తల నరుకుతానని అన్నప్పుడు దావీదు ''నన్ను శపింపుమని యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి'' అని జవాబిచ్చాడు. దావీదు దేవుని హస్తాన్ని గుర్తించాడు.

నా డీకను స్నేహితుడు కూడ షిమీ వంటివాడే. బోర్డు మీటింగులో, నేను చేసిన చిన్న పొరపాటును కూడ అతడు ఎక్కువగా చేసి మంచి పనులను గురించి ఒక్కమాటైనా చెప్పేవాడు కాదు. 'అతడు నన్ను మరణము వరకు తరిమెను.' అయితే ఇందులోని విశేషం ఏమిటంటే, నేను మంచి సంఘకాపరిగా ఉండటానికి ఇతడు నాకు ఇతర సంఘపెద్దలందరికంటే ఎక్కువగా సహాయపడ్డాడు. ఎలాగంటే, అతడు సంఘ కమిటీలలో సభ్యునిగా ఉన్నప్పుడు నేను చేయాల్సిన పనులన్నిటినీ (చివరికి అతి స్వల్పవిషయాలను కూడా) ఎంతో జాగ్రత్తగా చేశాను. కొన్ని పనులను చివరి నిమిషం వరకు వాయిదా వేసే అలవాటు నాకు ఉంది. కొన్నిసార్లు చివరిలో చిన్నచిన్న విషయాలు మరచిపోయేవాడిని. అయితే ''షిమీ'' కమిటీలో ఉన్నప్పుడు ఏ చిన్న విషయాన్నీ విడిచిపెట్టేవాడను కాను. చివరికి దాని కొరకై యథార్థంగా దేవుని స్తుతించగలిగాను. నాకు కొంత సహాయం అవసరమని దేవునికి తెలుసు కాబట్టి దాని కొరకు ఆయన ''షిమీ''ని ఉపయోగించుకొని నన్ను మంచి కాపరిగా చేశాడని నాకు తెలుసు. అయితే అతడు నాకిచ్చిన 'సహాయమంతటికీ' దేవుడతన్ని శిక్షిస్తాడని కూడ నాకు తెలుసు.

'దేవునికి సహాయపడినందుకు' శిక్ష

ఆ సత్యాన్ని గ్రహించావా? అతడు చేసినదంతా నామీద ఉన్న ద్వేషంతోనే చేశాడు. దేవుని మీద ప్రేమతో గాని సంఘం పట్ల శ్రద్ధ వలన గాని అతడు ఆ విధంగా చేయలేదు. అతడు కేవలం నన్ను శ్రమపెట్టడానికే అలా చేశాడు. అయినా దేవుడు అతని ద్వారా నాకు సహాయం చేశాడు. అతని వల్లనే నేను చిన్న చిన్న విషయాలలో కూడ జాగ్రత్త వహించగలిగాను. ప్రతివాడును దేవుని ఆధీనంలోనే ఉన్నాడని విశ్వాసులమైన మనం నమ్మాలి. మనకు ఏదైనా ఒకదానిని నేర్పించమని దేవుని ప్రార్థించినపుడు ఆ పనిని చేసే వ్యక్తులను ఆయన మన జీవితంలోనికి పంపుతాడు. మనము ఆ వ్యక్తులను ఎదిరిస్తే నిజంగా దేవునిని ఎదిరించిన వారమవుతాం. చాలాసార్లు దేవుడు పంపిన ఆ వ్యక్తులనూ వారి ద్వారా నేర్పించే గుణపాఠాలను కూడ ఎదిరిస్తాం. అలా చేసినపుడు ఆ పాఠాలను నేర్చుకోలేం. ఆయా పనులను చేయటానికి దేవుడే తగిన వ్యక్తులను పంపిస్తాడు.

ఐదవ సూత్రం - సమస్త కీడులకూ అపవాదే మూలం

రెండు విషయాలను గ్రహించటానికి ఈ ఐదవ సూత్రం మనకు అవసరం. అపవాది నిజంగా ఉన్నాడు మరియు అతడు నిర్విరామంగా పనిచేస్తున్నాడు. దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని తన ఉద్దేశాలను నెరవేర్చటానికి ప్రతివారినీ ఉపయోగించుకుంటాడని మనం చూశాం. రోగాలు, శ్రమలు దేవుని హస్తం నుండి వచ్చినా సమస్త కీడును జరిగించేవాడు సాతానుడే. మరొక విధంగా చెప్పాలంటే ఒకే సమయంలో అపవాది హస్తాన్ని, దేవుని హస్తాన్ని మనం చూడగలగాలి. స్వేచ్ఛావాదియైన ఒక బోధకుడు రాసిన ''బైబిల్లోని అరవై ఐదు తప్పులు'' అనే పుస్తకం నా దగ్గర ఉంది. వాస్తవానికి అలాంటి పుస్తకాన్ని రాయడమే మహాతప్పని నేను భావిస్తున్నాను. అతడు బైబిలులో కనుగొన్న ఒకానొక ''తప్పు''ను ఈ క్రింద ఉదహరిస్తున్నాను -

''యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి- నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ యిచ్చెను'' (2 సమూ 24:1).

''తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించెను" (1 దిన. 21:1).

ఈ రెండు వచనాలూ ఒకే సంఘటన గురించి ప్రస్తావిస్తున్నాయన్నది స్పష్టమే (జన సంఖ్య వ్రాయించుటను బట్టి ఇశ్రాయేలు, దావీదు శిక్షింపబడినపుడు). ఒక వాక్య భాగం దావీదును దేవుడు ప్రేరేపించాడని చెప్పగా, రెండవది అతన్ని సాతాను ప్రేరేపించాడు అంటుంది. దీనిలో ఏది సరియైనది? నేను చెబుతున్న సూత్రాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మరియు సాతాను ఇద్దరూ ఇందులో పని చేశారని స్పష్టమవుతుంది. ఇది (సాతాను ఎరుగని) దేవుని చిత్తం. సాతాను ద్వేషం దేవుని పనిని సాధించి పెట్టింది (దానిని దేవుడు ఉపయోగించుకున్నాడు). దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకోవటానికి దావీదు గర్వాన్ని, సాతాను ద్వేషాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. సాతాను కీడును తెచ్చేవాడని మనం గ్రహించాలి. అయినా దేవుని హస్తం సర్వాధికారము కలదై ఆ పనిని తన ఆధీనంలోనే జరిగించుకుంటుందని మనం గ్రహించాలి. ఈ సూత్రాన్ని ఒక కథ ద్వారా వివరించాలనుకుంటున్నాను.

అన్నిటినీ పంపించేది దేవుడే!

ఒక వృద్ధురాలు తెరిచిన కిటికీ యెదుట మోకరించి గట్టిగా ప్రార్థిస్తూ ఉంది. ఆమెకు ఆహారం కాని ధనం కాని లేనందున తినటానికి ఏమైనా దయచేయమని ఆమె దేవుని బ్రతిమాలుతూ ఉంది. ఇద్దరు యువకులు ఆ ప్రార్థన విని ఆమె విశ్వాసాన్ని హేళన చేయాలనుకున్నారు. వారు దుకాణానికి వెళ్లి ఒక రొట్టెను, కొంచెం పాలు కొని తెచ్చి, వాటిని రహస్యంగా కిటికీ గుండా లోపల పెట్టారు. ఆమె కళ్లు తెరిచి ఆహారాన్ని చూసి తన ప్రార్థనను ఆలకించి దానిని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించింది. వెంటనే ఆ యువకులు కిటికీ నుండి తలలు లోనికి పెట్టి ''అమ్మా, నీవు బుద్ధిహీనురాలవు. అవి దేవుడు ఇచ్చినవి కావు. మేమే వాటిని అక్కడ ఉంచాం. నీవెంత తెలివిలేనిదానవో తెలియచేయడానికే మేమిది చేసాం. ఆ రొట్టె, పాలు దేవుడు తేలేదు, మేమే తెచ్చాం'' అని చెప్పారు.

ఇలాంటి సందర్భాలలో నువ్వు ఏమని జవాబిస్తావు? ఆ వృద్ధురాలు మాత్రం చిరునవ్వుతో వారికి వందనాలు చెప్పి ''బహుశా ఇవి సాతానే తెచ్చి ఉండవచ్చునేమో కాని వీటిని పంపినవాడు దేవుడే'' అన్నది. దీనిలోని అర్థం గ్రహించారని నమ్ముతున్నాను. కరెంటు బిల్లు ఇచ్చేవాడు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు తీసుకొస్తే మనం వానిపై కోపపడం. ఎందుకంటే అది అతడు పంపింది కాదు. కేవలం అతడు దానిని తీసుకొచ్చాడు. మనం ఎదుర్కొనే ప్రతి కష్టంలోను ఈ సూత్రాన్నే వాడాలి. థామస్‌ వాట్సన్‌ అనే ''ప్యూరిటను'' గొప్ప సత్యాలను ఎంతో క్లుప్తంగా చెప్పగల నేర్పరి. ఈ క్రింది వ్యాఖ్యను మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఈ పుస్తకంలోని పూర్తి సారాంశం లభించినట్టే.

''పాపంలో జరుగు కార్యమునందు దేవుని హస్తము ఎల్లప్పుడు ఉంటుంది కాని ఆ కార్యంలో గల పాపమునందు మాత్రము ఆయన హస్తము ఎన్నడును ఉండదు.''

ఏమి జరిగింది, ఎక్కడ ఎప్పుడు, ఎవరికది సంభవించింది అనే వాటితో నిమిత్తం లేదు. అది సంభవిస్తే దానిలో దేవుని హస్తం ఉన్నట్లే. దానిని ఆయనే తన నియంత్రణలో ఉంచుకొనియున్నాడు. అయినా ఆ పరిస్థితికి లేక ఆ దోషానికి హేతువైన మానవ హృదయంలో ఉన్న పాపానికీ ద్వేషానికీ దేవుడు కారకుడు కాడు.

మన క్రైస్తవ జీవితంలో ఈ సూత్రం ఎంత ముఖ్యమైందో గ్రహించేవారు చాలా అరుదు. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై యుండులాగున మనలను మనం అప్పగించుకోవాలని లేఖనం ఉపదేశిస్తుంది(1పేతురు 5:6; యాకోబు 4:7). అయినా ''అపవాదిని ఎదిరించుమని'' వాని కుతంత్రాలకు, శోధనలకు లొంగవద్దని కూడ లేఖనాలు బోధిస్తున్నాయి. ఈ రెండు విషయాలకు మధ్య ఉన్న భేదాన్ని వివేచించగలగటమే గొప్ప సమస్య. చాలా మంది క్రైస్తవులు ''సాతాను నెదిరించు''ట అనే ముసుగులో దేవుని సర్వాధికారాన్ని మరియు ఆయన ఏర్పాటును ఎదిరిస్తూ ఉండవచ్చు. అలాగే మరి కొందరు విశ్వాసులు ''సమస్తమును దేవునికి అప్పగించు చున్నామను'' భక్తి ముసుగులో దేవుని కట్టడలకు లోబడి శోధనను ఎదిరించుట అనే తమ బాధ్యతను బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ ఉండవచ్చు. సాతాను హస్తాన్ని, దేవుని హస్తాన్ని చూడగలగటం నేర్చుకునే వరకూ సాతానును ఎదిరిస్తున్నామనుకుంటూ దేవునితో పోరాడటమూ, దేవునికి లోబడుతున్నామని భ్రమపడి సాతానుతో చేతులు కలిపే ప్రమాదమూ ఉన్నాయి.

ఆరవ సూత్రం - అన్ని రకాల శ్రమలూ శిక్ష కాదు

సువార్తనూ, దాని స్థిరమైన వాగ్దానాలను ఇరవయ్యో శతాబ్దం తప్పుగా అర్థంచేసుకుంది. ఆరవ సూత్రం ఈ పొరపాటును సూటిగా ఎదుర్కుంటుంది. అన్ని రోగాలు, బాధలు దేవుని ఆధీనంలో ఉండటం, అవి ఆయన చిత్తంలో భాగమై ఉండటం సత్యమే అయినా, ఇవన్నీ పాపానికి శిక్షగా వచ్చాయనటం నిజం కాదు. కొన్ని శ్రమలు ఖచ్చితంగా పాపం విషయమై మనలను క్రమశిక్షణలో పెట్టడానికి పంపబడతాయన్నది నిజమే. మనము పశ్చాత్తాపపడి మార్పు పొందడానికి అవి పంపబడతాయి. అయితే అన్ని సందర్భాలలో అది నిజం కాదు. కొన్నిసార్లు తన కృపకు గల శక్తిని ప్రదర్శించడానికి దేవుడు తన ప్రజలను శ్రమపడనిస్తాడు. శ్రమ కలిగినప్పుడెల్లా తన పాపానికి ఫలితంగా శ్రమను పంపి దేవుడు శిక్షిస్తున్నాడని క్రైస్తవుడు తలంచటం పొరపాటు. దేవుడు ఈ రెండింటిలో ఒక చోట మాత్రమే పాపాన్ని శిక్షిస్తాడు: 1) ఆయన దానిని సిలువలో శిక్షించి, ఆ ఋణాన్ని సంపూర్ణంగా దానిలో తీర్చివేశాడు లేదా 2) పాపిని నరకానికి పంపించి శిక్ష విధిస్తాడు. క్రమశిక్షణగా శ్రమ మనకు కలిగినా అది శిక్షగా మాత్రం కాదు (అనగా అది దేవుడు తీర్పరిగా మనకు విధించినది కాదు). కాని అది మనలను గుణపరచడానికి ప్రేమామయుడైన పరలోకపు తండ్రి నుండి కలిగినది. మన తండ్రి మనలను క్రమపరచడానికే శ్రమలను పంపుతాడు కాని ఆయన మనలను ఎన్నడూ శిక్షించడు.

యోబు జీవితం

హబక్కూకు, యెషయా గ్రంథాలలో ప్రజలు పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడాలని, వారికి ఉజ్జీవం కలిగించాలని దేవుడు శ్రమను ఉపయోగించినట్లు మనం చూడవచ్చు. యోబు గ్రంథం కూడ శ్రమ గురించి మ్లాడుతుంది. అయితే ఇది హబక్కూకు, యెషయా గ్రంథాలలో ప్రస్తావించబడిన శ్రమలకు పూర్తిగా భిన్నమైనది. యోబు శ్రమను పరిశీలించి ఈ ఆరవ సూత్రాన్ని నేర్చుకుందాం. ముందుగా ఈ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. యోబు స్వనీతిపరుడనీ, దేవుడు అతన్ని దీనునిగా చేయడానికి శ్రమను పంపాడని అనేక మంది అభిప్రాయపడతారు. కాని ఇదే సంగతిని యోబు స్నేహితులు కూడ నొక్కి చెప్పినప్పుడు ఇది నిజం కాదని యోబు మరియు దేవుడు సయితం చెప్పాడని వారికసలు జ్ఞాపకానికే రాదు. యోబు కొన్ని బుద్ధిహీనమైన మాటలు పలికాడన్నది నిజమే. అయినా చివరికి అతడు మునుపెన్నడూ ఎరుగని విధంగా దేవుని మరింత ఎక్కువగా అర్థం చేసుకున్నాడని గ్రహించగలం. కాని ఇవేవీ ఆ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన సత్యాన్ని మార్చవు. యోబును గురించి దేవుడు స్వయంగా యేమి చెబుతున్నాడో గమనించండి:

''ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు'' (యోబు 1:1).

ఈ వాక్యాన్ని చదివిన తరువాత ఎవరైనా యోబు స్వనీతిపరుడని నిందించగలరా? అలాంటి అభిప్రాయాన్ని అంగీకరిస్తే, ఈ గ్రంథం యొక్క అర్థాన్ని, యోబు శ్రమలలో గల ఉద్దేశాన్ని గ్రహించటం అసాధ్యం. యోబు 1:1లో ఉన్న మాటలు సాక్షాత్తు దేవుడు స్వయంగా ప్రకటించిన తన సొంత అభిప్రాయం కాదని మీరు భావిస్తే, యోబు 1:8 చదివి దానికి 2:3 కలిపి చూడండి. అవి దేవుడు స్వయంగా పలికిన మాటలు. ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. యోబుకు కలిగిన శ్రమలు అతని పాపానికి శిక్షగా పంపబడినవి కావు. మనం ఇంకొంచెం ముందుకు ఆలోచిస్తే తనకు కలిగిన శ్రమలు తాను చేసిన పాపం వల్లనే కలిగాయని అతడు తలంచటమే అతడు ఎదుర్కొన్న అతి గొప్ప శోధన. ఆ తర్వాత అతడు దానిని జయించాడు. అదే ఈ గ్రంథం యొక్క ముఖ్యాంశం. తనకు సంభవించినదంతా దేవుని హస్తము నుండే వచ్చిందని అంగీకరిస్తూనే యోబు ఇంకా దేవుని నమ్మి ఆయనను ఆరాధిస్తాడా? దేవునికీ సాతానుకూ మధ్య జరిగిన వివాదం సరిగ్గా ఈ ప్రశ్న గురించే. దీనికి జవాబు స్పష్టమే. తనకు సంభవించేవాటన్నిటికి జవాబులు గాని వివరణలు గాని లేనప్పుడు సైతం, యోబు తనకున్న సమస్తాన్నీ పోగొట్టుకున్నాడే కాని తన దేవుణ్ణి మాత్రం విడువలేదు.

సవాలు, ప్రతి సవాలు

యోబు గ్రంథం సాతానుకు దేవునికి మధ్య జరిగిన వాదనతో ప్రారంభమవుతుంది. అందులో దేవుడు చేసిన సవాలు, దానికి ప్రతిగా సాతాను విసిరిన సవాలు ఉన్నాయి. ఈ క్రింది వచనాలలో దీనిని గమనించండి.

''దేవ దూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు (సాతాను) వారితో కలిసి వచ్చెను. యెహోవా- నీవెక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది- భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యదార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు, అని అడుగగా అపవాది - యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని, అతని యింటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్థి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని యెహోవాతో అనగా యెహోవా - అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లెను'' (యోబు 1:6-12).

10వ వచనంలో యోబు దేవుని హస్తంలో భద్రంగా ఉన్నాడని స్పష్టంగా ఉంది. వాస్తవానికి దేవుడతని చుట్టూ వేసిన కంచె మూలంగా అతనికి హాని చేయటం అసాధ్యమని సాతానుడే నిందవేస్తున్నాడు. 11వ వచనంలో సాతాను - ''ఇప్పుడు నీవు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల .....'' అని దేవునితో సవాలు చేయగా ఆయన - ''అతనికి కలిగిన సమస్తమును నీ చేతిలో (సాతాను) ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు'' అని జవాబిచ్చాడు. ఇపుడు యోబు సాతాను చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు యోబు దేవుని చేతిలో ఉన్నాడా? లేక సాతాను చేతిలో ఉన్నాడా? నువ్వు ఈ వచనాలను చక్కగా అర్థం చేసుకుంటే అతడు ఇద్దరి చేతుల్లోనూ ఉన్నాడని గ్రహించగలవు. అయినా దేవుని హస్తము సాతాను చేతికి పైగా ఉన్నట్టు కూడ నీవు చూడగలవు. గనుక దేవుడు అనుమతించిన దానిని మాత్రమే సాతాను చేయగలడు. నిజంగా యోబును సాతాను పరీక్షిస్తున్న సమయంలో కూడ ఎప్పటిలాగే అతడు దేవుని చేతిలోనే ఉన్నాడు. వ్యత్యాసమంతా దేవుడు యోబు చుట్టూ వేసిన కంచెను ఎంత మేరకు తీసివేయదలచాడో అన్న దానిపై ఆధారపడి ఉంది.

ఇదంతా దేవుని నుండే కలిగింది!

ఈ కథలో తరువాత ఏం జరిగిందో మనకు తెలుసు. యోబు సేవకులలో ఒకడు వచ్చి షెబాయీయులు అతని ఎద్దులను గాడిదలను అన్నిటిని దొంగిలించి వాటిని మేపుతున్న పనివాళ్లనందరినీ చంపారని తెలియజేశాడు. అతడు ఇంకా మట్లాడుతుండగా మరొక సేవకుడు వచ్చి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి గొర్రెల నన్నిటిని, వాటి కాపరులను చంపివేసిందని చెప్పాడు. వెంటనే మూడవవాడు వచ్చి కల్ధీయులు ఒంటెలనన్ని దొంగిలించి అక్కడ ఉన్న సేవకులను సంహరించారని కబురు తెచ్చాడు. మూడవవాడు మాటలాడుట ముగియక ముందే నాల్గవ సేవకుడు వచ్చి యోబు పిల్లలందరూ విందు చేసుకుంటున్న సమయంలో పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటిపై కొట్టగా అవి కూలి అతని పిల్లలందరూ మరణించారన్న వర్తమానం తెచ్చాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులకు యోబు ఎలా ప్రతిస్పందించాడో ఆ తరువాతి వచనాలు మనకు తెలియజేస్తాయి.

''అపుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తన వెంట్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను - నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము జేసెనని చెప్పలేదు.'' (యోబు 1:20-22).

యోబు సాతాను గురించి ఏమీ ప్రస్తావించకపోవటాన్ని గమనించండి. యోబు దీనినంతటినీ దేవుని హస్తమే చేసిందని ఒప్పుకుంటున్నాడు. దేవుడే అతనికి గొర్రెలను, ఎద్దులను, ఒంటెలను, గాడిదలను యిచ్చాడు, దేవుడే వాటినన్నిటిని తీసివేయుటకు నిశ్చయించాడని యోబు చెప్పాడు. అయితే తన పిల్లల గురించి అతడు ఏమన్నాడు? వారి జనన మరణాలు దేవుని హస్తము నుండే వచ్చాయని యోబు చెబుతున్నాడు. అతని ప్రపంచం పూర్తిగా కూలిపోయినా యోబు దేవుని సర్వాధికారము మరియు ఆయన నిబంధన వాగ్దానాల పట్ల తనకున్న విశ్వాసాన్ని మాత్రం విడువలేదు.

యోబు జీవితంలో సంభవిస్తున్నదేమిటో మనం అర్థం చేసుకోవాలి. సాతానుకూ దేవునికీ మధ్య జరిగిన పోరాటం ఫలితంగా యోబు జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయని లేఖనము స్పష్టము చేస్తుంది. అయినా ఈ విషయం యోబుకు ఏ మాత్రము తెలియదని మనం గుర్తుంచుకోవాలి. తెర వెనుక జరిగిన వాటిని బైబిలు మనకు తెలియజేస్తున్నందుకే మనకు ఈ విషయం తెలిసింది. మనమీ సవాలును, ప్రతిసవాలును కూడ చూసి, వినగలుగుతున్నాం. అయితే యోబు దీనిని చూడ లేదు, వినలేదు. యోబు హృదయము మరియు జీవితము ఈ యుద్ధానికి కదనరంగం అని మనకు తెలుసు. యోబు జీవితంలో పరీక్షలు, శోధనలు ఎన్ని కలిగినా అతని జీవితంలో దేవుని కృప విజయాన్ని సాధిస్తుందా? మనము ఈ కథ చదువుతూ యేమి జరుగుతుందో గ్రహించగలం. కానీ యోబుకు ఇదేమీ తెలియదు. సాతానుకూ దేవునికీ మధ్య జరిగిన యుద్ధానికి తన హృదయం ఒక రణరంగంగా వాడబడిందని అతనికి ఏమాత్రమూ తెలియదు. తనకు సంభవించే కష్టాలను వివరించడానికి గల కారణం గాని దైవశాస్త్ర వివరణ గాని యోబుకు తెలియలేదు. అతనికున్నదంతా సర్వాధికారి మరియు పరిశుద్ధుడైన దేవుని పట్ల గల నమ్మకమే.

''ప్రథమరంగము'' (మొదటి అధ్యాయం) దేవుని కృపకు గల శక్తిని ప్రదర్శిస్తుంది. యోబు తన విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని కొనసాగించాడు. ''ద్వితీయ రంగము'' కూడ సాతానుకు దేవునికీ మధ్య అదే వాదనతో ప్రారంభమవుతుంది. రెండవసారి దేవుడు సాతానును సవాలు చేసినప్పుడు భయంకరమైన శ్రమలు అనుభవించినా, యోబు నమ్మకంగా ఉన్నాడని దేవుడు ఎంతో ఆనందించాడు. రెండవ అధ్యాయం మూడవ వచనం యోబు గ్రంథానికి అతి ముఖ్యమైన తాళపుచెవిని మనకిస్తుంది.

''అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యదార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడు'' (యోబు 2:3).

ఈ వచనం ఏమి చెబుతుందో జాగ్రత్తగా గమనించు. మొదటిగా, యోబు మీదికి ఈ శ్రమలను పంపినవాడు దేవుడే. సాతాను శ్రమలను తీసుకొస్తాడన్నది నిజమే అయినా, వాటిని పంపేది దేవుడే. అలాగే ఈ వాక్యభాగంలోని రెండవ సత్యాన్ని చూడటం కూడా ఎంతో ముఖ్యం. యోబులో ఏ దోషమూ లేకపోయినా దేవుడు అతనికి వ్యతిరేకంగా పనిచేశాడు. యోబుకు వచ్చిన శ్రమలకూ అతని పాపానికీ ఏ సంబంధమూ లేదు. తనకేమి సంభవిస్తుందో యోబుకు తెలియకుండానే అతడు ''పరీక్షకు మాదిరి''గా వాడబడ్డాడు. వివరింపజాలని శ్రమలలో అతడు దేవుని కృపాసమృద్ధిని నిరూపించి, ప్రదర్శించాడు.

తనకు కలిగిన ఇతర నష్టాలతో పాటు యోబు తన వేదాంతాన్ని కూడా కోల్పోయాడు. దేవుడు ''మంచిని'' ఆశీర్వదించి ''చెడు''కు తీర్పు తీరుస్తాడని యోబు నమ్మి బోధించేవాడని అతని మిత్రులు గుర్తు చేశారు. అది నిజమే! అయితే, యోబు తన ప్రస్థుత పరిస్థితిని ఏమని వివరించగలడు? యోబు తనకు సంభవించినదానిని వివరించలేకపోవటమే కాక తనకు తెలిసిన వేదాంతంతో దానికి పొంతన కుదర్చలేకపోయాడు. దీనిని గురించి ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. ''సాంప్రదాయ వేదాంతం తాను పరిష్కరించలేనంత పెద్ద సమస్యతో తలపడిన సంఘటనను యోబు గ్రంథం తొలిసారిగా నమోదు చేసింది.''

కొన్ని సమయాల్లో సమస్తమూ కుప్పకూలి, మనం ఆధారపడడానికి దేవుడు తప్ప మరేదీ దొరకదు. మనము ఆయన గుణాన్ని, ఆయన నిబంధనను ఎరిగినవారమై వాటిపై ఆధారపడతాం. దేవుని మార్గాలను వివరించడానికి మన వేదాంతము, మన అనుభవము సరిపోవు. మనం అర్థం చేసుకోలేకపోయినా, దేవుడు మన పట్ల జరిగించే సమస్తంలోనూ పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, నమ్మకస్థునిగా ఉంటాడని మనం నమ్మవచ్చు. యోబు విశ్వాసం కూడా అలాంటిదే. భయంకర పరిస్థితులలో యోబు విశ్వాసం యదార్థమైనదని రుజువయ్యింది. యోబు యొక్క విశ్వాస నిరీక్షణలకు దేవుడు మరింత తగినవాడని రుజువైంది.

దేవుని కృపయందు యోబుకు ఉన్న నమ్మకాన్ని వమ్ముచేయలేని సాతానును చూసి దేవుడు అతిశయించినప్పుడు సాతాను ఇలా ప్రతిస్పందించాడు. ఈ రెండవ వాదన ఉన్న వాక్య భాగాన్ని పరిశీలిద్దాం:

''అపవాది-చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్త్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.'' అందుకు యెహోవా - అతడు నీ వశముననున్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్లు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదలో కూర్చుండెను'' (యోబు 2:4-8).

యోబు వేషధారే అని సాతాను ఇప్పటికీ భావిస్తున్నాడు. ఈ పోటీలో యోబు శరీరానికి బాధ కలిగించకుండా దేవుడు అతనిని భద్రపరచటం అన్యాయమని వాదించాడు. 'వస్తువులను' కోల్పోవటం, ఇతరులు శ్రమపడుతుంటే చూడటం ఒక ఎత్తైతే దివారాత్రులు ఎడతెగని వేదన అనుభవించటం మరొక ఎత్తని అతడు వాదించాడు. 5వ వచనంలో సాతాను దేవునితో మాట్లాడుతూ ''. . . ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తిన యెడల . . .'' అని చెప్పాడు. 6వ వచనంలో దేవుడు సాతానుకు జవాబిస్తూ ''. . . అతడు నీ వశముననున్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.''దేవుడు కంచెను ఇంకాస్త క్రిందికి దించినప్పటికీ స్పష్టమైన సరిహద్దులను నియమించినట్లు చూస్తాం. ఇప్పుడు కూడ సమస్తమూ దేవుని చేతిలోనే ఉంది. సాతాను కేవలం శ్రమను కలిగించేవాడు మాత్రమే. సమస్తమూ దేవుని హస్తము నుండే వచ్చిందనే విషయాన్ని యోబు ఎప్పుడూ సంశయించలేదు.

7-8 వచనాలలో యోబు ఒక చిల్ల పెంకు తీసుకొని తన కురుపులతో నిండిన శరీరాన్ని గోకుకుంటున్నట్లు చూడగలం. కురుపులు ఎంతో బాధాకరమైనవి. యోబు కూర్చున్నా, నిలబడినా, పండుకున్నా వాటి వల్ల ఎంతో బాధ కలుగుతుంది. బూడిద మెత్తగా ఉంటుంది కనుక అతడు దానిలో కూర్చున్నాడు.

' "దేవుని దూషించి మరణముకమ్ము"

9, 10 వచనాలు మనకు చక్కని ఉపదేశాన్నిస్తున్నాయి. వెలిచూపును బట్టీ నడిచే బలహీనమైన విశ్వాసానికీ, దేవుని సర్వశక్తిగల హస్తాన్ని ప్రతి సంభవంలో చూసే అత్యద్భుతమైన బలమైన విశ్వాసానికీ మధ్యగల వ్యత్యాసాన్ని ఇవి చూపుతున్నాయి. ఈ క్రింది మాటలు నీకు చెబితే నువ్వెలా ప్రతిస్పందిస్తావు?

''అతని భార్య వచ్చి- నీవు ఇంకను యదార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు- మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు'' (యోబు 2:9,10).

యోబు భార్య మాటలు ఒక అవిశ్వాసి లేదా ఒక బోధనొందని క్రైస్తవుని మాటల వలె ఉన్నాయి. అలాంటివారు దేవుడు మనుష్యులతో వ్యవహరించే విధానం ప్రేమరహితమని భావించి సత్యాన్ని త్రోసివేస్తారు. యోబు మాటలో మనము ఇక్కడ చర్చిస్తున్న సూత్రాలను (యోబు కూడ వీటిలోనే నిరీక్షణ కలిగి ఉన్నాడు) ప్రకటించినట్లయితే, ఈనాడు కూడా యోబు భార్య లాగే కోపంతో ప్రత్యుత్తరమిచ్చే అనేకులను మనం చూడగలం. ''ఈ శ్రమలతో ఏదోవిధంగా దేవునికి సంబంధం ఉందని నువ్వు అంటున్నావా? అలాంటి దేవుణ్ణి నేను ప్రేమించను, సేవించను'' అని వారు ప్రతిస్పందిస్తారు. యోబు భార్యలాగా తమ భావోద్రేకాలను వ్యక్తపరచేంత సాహసం అందరూ చేయలేకపోయినా వారి మనోభావాలలో మాత్రం అనేకులు ఆమెతో ఏకీభవిస్తారనేది వాస్తవం. 'నాకు కావలసిన (నన్ను సంతోషపెట్టానికి అవసరమైన) వాటిని ఇస్తున్నంత వరకు నేను దేవుని నమ్మి ప్రేమిస్తాను. అయితే ఆయన ఇలాంటి శ్రమలను పంపితే మాత్రం నేనాయన్ని విశ్వసించను.' శోధనలకూ శ్రమలకూ గురైన పరిశుద్ధుల చెవుల్లో సాతాను ఇటువంటి దేవదూషణను (దేవుని దూషించి మరణము కమ్మని) ఎన్నిసార్లు ఊదలేదు? అయితే అది తన భార్య నోట నుండి రావటం యోబును మరింత క్షోభకు గురిచేసింది.

అయితే ఆమెను కఠినంగా విమర్శించక ముందు ఆమె యోబుకు పరిచర్య చేస్తూ, అతని మూల్గులను వినవలసి వచ్చిందని జ్ఞాపక ముంచుకో. అది చాల కష్టమైన పని! చనిపోయిన బిడ్డలందరూ తన రక్త మాంసాలే, కోల్పోయిన ఆస్థిలోనూ ఆమెకు సమాన భాగం ఉంది.

విశ్వాస సారం

యోబు యిచ్చిన జవాబు ఎంతో శ్రేష్టమైనది. మనం దేవుని నుండి మేలును మాత్రమే పొంది కష్టాన్ని అనుభవించకూడదా? యోబు రెండు పడవలపై కాలుపెట్టే అసత్య బోధను అనుసరించేవాడు కాడు. మేలైనా కీడైనా అన్నిటికీ కర్త దేవుడే అని అతడు నమ్మాడు. రోగం, కష్టాల పట్ల యోబుకున్న అభిప్రాయాలను బట్టీ చూస్తే, అతను నేటి ''సంపద సువార్తకు'' చాలా దూరంగా ఉండేవాడని చెప్పవచ్చు. ఈరోజుల్లో ఆదివారం టి.వి. తెరపై ఎక్కువగా కనపడుతున్న ''ఆరోగ్యం, ఐశ్వర్యా''లను ప్రకిటించే బోధకులను యోబు సమర్థించేవాడు కాదనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తనకు సంభవిస్తున్న వాటి వివరాలేవీ యోబుకు ఇప్పటికీ తెలియదు. అతనికి తెలిసినదంతా (1) దేవుడే తన ప్రతి శ్రమను కలిగించాడు (2) దానికి కారణం ఏమిటో తనకు తెలియకపోయినా దానిని కలుగజేయటంలో దేవునికి ఏదో మంచి కారణం తప్పక ఉండి ఉంటుంది. ప్రియ మిత్రుడా, సర్వాధికారము కనికరముగల దేవుని పట్ల వాక్యానుసారమైన విశ్వాస సారాంశమిదే. యోబు విశ్వాసము యొక్క శిఖారాగ్రం యోబు 13:15లో కనిపిస్తుంది. ఆ పూర్తి సందర్భాన్ని గమనించు.

''నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులై యుండుడి. నా మీదికి వచ్చునది ఏదో అది వచ్చుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను? ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును .... నేను నిర్ధోషిగా కనబడుదునని నాకు తెలియును'' (యోబు 13:13-18).

తాను నిర్ధోషిగా నిరూపించబడతాడని, దేవుడు పాపం నిమిత్తం తనను తీర్పు తీర్చటం లేదని నిర్ధారించబడుతుందని యోబు దృఢంగా విశ్వసించాడు. ఈ మధ్య కాలంలో ఏది సంభవించినా దేవుణ్ణి నమ్మటానికి యోబు సిద్ధంగా ఉన్నాడు. యోబు ''ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కొనిపెట్టుదును'' అని చెప్పినప్పుడు అతడేమంటున్నాడంటే, ''నా గొర్రెలను, గాడిదలను, ఒంటెలను, నా పిల్లలందరిని, నా ఆరోగ్యాన్ని తీసుకున్నవాడు చివరికి నన్ను చంపినా (అలా చేసే అధికారం ఆయనకు ఉంది గనుక) సరే, నేనాయనను నమ్మి, అలా చేయటంలో ఆయనకేదో మంచి కారణం ఉందని విశ్వసిస్తాను. ఈ శ్రమల్లో ఆయన నన్ను శపిస్తున్నాడని ఆయనను విడువను. ఎందుకనగా ఒకానొక దినాన నేను తప్పక నిర్దోషిగా కనపడతాను.

''ఇక్కడ ఒక క్షణం ఆగి యోబు శోధనలో తరచు సులువుగా తప్పిపోయే ఒక కోణాన్ని పరిశీలిద్దాం. కేవలం ఒక్క విషయాన్ని నిరూపించటానికే ముఖ్యంగా సాతాను యోబుపై దాడి చేశాడు. దేవుని ప్రేమించే యధార్థవంతుడైన విశ్వాసి 'ఒక్కడైనా లేడు' అని సాతాను వాదన. తమ మేలు కొరకే మనుషులు దేవుని ఆరాధిస్తారని, అది వారికి దొరకనప్పుడు వారు ముఖం మీదనే ఆయన్ని దూషించి విడిచిపెడతారని సాతాను నిరూపించేందుకు ప్రయత్నించాడు. యోబు శోధనలోని ఈ కోణాన్ని మనం సులువుగా గ్రహించవచ్చు. అయినా దీనిని మించిన బోను వేరొకటి యోబు కొరకు కాచుకొని ఉంది. దేవుడు లోకమంతటినీ పరిపాలించు సర్వాధికారి అని యోబు విశ్వాసం. తాను దేవున్ని నమ్మకంగా సేవించాడని, మరి ముఖ్యంగా తాను రుజువర్తనము కలవాడనని అతడు నమ్మాడు. యోబు తాను పాపరహితుడనని అనటం లేదు కాని, తాను మంచిమనసుతో దేవుని ప్రేమించి అనుసరించానని చెప్పాడు. ఇదే నిజమైతే, తనకు కలిగిన శ్రమలను అతడు ఎలా వివరించగలడు? అవి తనకు ఎందుకు సంభవించాయో వివరించటం ప్రారంభించలేడని స్పష్టమౌతుంది.

దేవుణ్ణి కాపాడే ప్రయత్నం

ఈ కష్టాలను తనపైకి అన్యాయంగా పంపాడనే నింద నుంచి దేవుణ్ణి తప్పించటం కోసం తాను పాపం చేయకపోయినా చేశానని ఒప్పుకోవటమే యోబు ఎదుర్కొన్న గొప్ప శోధన. అతడు ఆవిధంగా చేసినట్లయితే, ''దేవుడు న్యాయవంతుడు, యదార్థపరుడై మంచి వారికి మంచి చేసి దుర్మార్గులను శపిస్తాడన్న మాట స్థిరపరచబడుతుంది గదా!'' తద్వారా దేవుడు ఆ కష్టాలను (ఇప్పుడవి దేవుని తీర్పు లేదా శిక్షగా కనిపిస్తున్నాయి) ఎందుకు పంపినాడో అనే ప్రశ్నకు యోబుకొక వేదాంతపరమైన వివరణ దొరుకుతుంది. అప్పుడు తన స్నేహితులు అతనిని యథార్థంగా ప్రోత్సహించి, ''అతడు తన రహస్యపాపము నొప్పుకొనెను గనుక అతడు క్షమాపణను పొంది తిరిగి లేవగలడని'' చెప్పగలరు. కాని ఇక్కడ సమస్య ఏమిటంటే అప్పుడు యోబు అబద్ధమాడినవాడౌతాడు. దానికంటే భయంకరమైన పరిస్థితి ఏమిటంటే యోబు అబద్ధికుడు, వేషధారియై తన వరుస కష్టాలకు మారుగా మేలును పొంద ప్రయత్నించేవాడని సాతాను నిరూపించినట్లు అవుతుంది. వాస్తవికతను పట్టుకొని వ్రేలాడటం కంటే కంటికి కనిపించేదానికి లోబడటం యోబుకు వేయిరెట్లు సులభంగా ఉండేది. వివరింపశక్యం కాని వాస్తవాలను యదార్థతతోను దేవునిపై చలించని విశ్వాసంతోను ఎదుర్కొనటం కంటే కొన్ని వినయపూర్వక పలుకులతో దేవుని కాపాడటం యోబుకు ఎంతో సులువుగా ఉండేది.

సిలువలోని తొట్రిల్లచేయు బండ కూడా ఇటువంటిదే కాదా? దేవుని ప్రియకుమారుడు అంతటి వేదన సహిస్తుంటే, తండ్రి తన చేయి చాచి సహాయం చేయకుండా ఎలా ఉన్నాడు? అసలు ఈ ప్రశ్నను మరోలా అడగాలి. పరిశుద్ధుడు, నీతిమంతుడు మరియు ప్రేమామయుడైన పరలోకపు తండ్రి తన స్వహస్తాలతో నిర్ధోషియైన తన కుమారునికి ఎలా గాయం చేయగలిగాడు? యూదులు ఈ సత్యాన్ని గ్రహించకపోవటం వలన వారు ఆయన క్రీస్తునని చెప్పినప్పుడు అది దేవదూషణ అని నిందించారు. 'నజరేయుడైన యేసు అలా శ్రమపొందటానికి కారణం అతడు తప్పక దోషియై ఉంటాడు, ఎందుకంటే దేవుడు నిర్ధోషులను శిక్షించడు' అని వారు భావించారు.

స్తెఫనును ఆ దుర్మార్గులు రాళ్లతో కొట్టి చంపిన రోజున అక్కడ నువ్వు ఉన్నావనుకో. ఒకడు నీ చెవిలో ''ఈ సంఘటన సర్వశక్తిమంతుడైన దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు రహస్యమైన తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ దుష్టులను ఉపయోగించుకుంటున్నాడు'' అని గుసగుసలాడితే నువ్వు దానికి ఏమని చెప్పిఉంటావు? కాని స్తెఫను అలాగే నమ్మాడు! అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపబడినా, అతడు తన నిరీక్షణను నిశ్చయతను ప్రకటించాడు.

దేవుని యేర్పాటు ఒక మర్మం

దేవుడు తన పరిశుద్ధులలో కొందరిని హింసలు, శ్రమలు అనుభవించేలా ఎందుకు అనుమతిస్తాడో నేను వివరించలేను. అయినప్పటికీ ఇదే వాస్తవమని బైబిలూ మరియు చరిత్ర తెలియజేస్తున్నాయి. దేవుని వాక్యంలో యోబు, దావీదు, యోసేపు, స్తెఫను ఇందుకు ఉదాహరణగా కనిపిస్తున్నారు. ఈ సత్యానికి ఫ్యానీ క్రాస్‌బి, జోని ఎరిక్సన్‌, ఇంకా అనేకమంది సోదరీ సోదరులు సాక్షులుగా ఉన్నారు. ''ఇది ఎందుకిలా ఉంది?'' అని దేవుని ప్రశ్నించటం మన పని కాదు. లేదా మనకు నచ్చని సత్యాలను బోధించే లేఖనభాగాలను కాదనటం సరికాదు. కొన్ని సత్యాలను మనం అర్థం చేసుకోలేకపోయినా దేవుని కృపను శక్తిని అంగీకరించటమే మన విధి.

ఒక టి.వి. ఛానల్‌లో హాస్యాస్పదమైన ఒక వ్యాపార ప్రకటన ప్రసారమయ్యేది. అది విపుల్‌ అనే ఒక దుకాణదారుని గురించినది. టాయిలెట్లో వాడే టిష్యూపేపర్‌ ఎంత మెత్తగా ఉందో పరీక్షించడానికి స్త్రీలు వాటిని నొక్కితే అతను వారిని గద్ధించేవాడు. సరుకుల దుకాణాల్లో స్త్రీలు ఆ విధంగా చేయటం నేనెప్పుడూ చూడలేదు గాని నిమ్మకాయలు, నారింజకాయలు మెత్తబడి పాడైపోయాయేమో అని పరీక్షించటం చూశాను. దేవుని ప్రజలకు జరిగేది ఇదే అని నా నమ్మకం. మనం ఎలాంటివారిమో కనుగొనటానికి లోకం మనమీద ఒత్తిడి తెచ్చేందుకు ఆయన అనుమతిస్తాడు. కాని అద్భుతమైన ఆయన కృపను పొందటానికి ఆయన నీ హృదయాన్ని తెరిచినప్పుడు నువ్వు నీ నోరు తెరిచి సాక్ష్యమివ్వటం మొదలుపెడతావు. ఆకలిగొన్న నీ ప్రాణాన్ని తృప్తిపరచి, నీ జీవితంలోకి నిజమైన ఆనందాన్ని తెచ్చే రొట్టెను కనుగొన్నానని నువ్వు అతిశయంతో చెబుతావు. అయినా కొన్నిసార్లు మనుష్యులు అనుమానంతో, నువ్వు నిజంగా ఎంత ''తృప్తి'' కలిగి ఉన్నావో చూడాలని నిన్ను పరీక్షిస్తారు.

దేవుడు రెండింతల కృప చేత తన సర్వాధికారాన్ని గురించిన సత్యాన్ని మనకు బోధించినప్పుడు మనం తరచుగా నోళ్లు తెరచి ప్రతి వ్యక్తిని, ప్రతి సంభవాన్ని తన ఆధీనంలో ఉంచుకునే మన దేవుని గురించి అతిశయంతో మాట్లాడతాం. బహుశ ఆర్మీనియన్ల బలహీనుడైన దేవుణ్ణి అపహాస్యం కూడ చేస్తాం. ''మా దేవుడు మానవునిపై గాని అతని చిత్తముపై గాని ఆధారపడేవాడు కాడు. మా జీవితంలో సంభవించే ప్రతి పరిస్థితిని సర్వాధికారముగల మా దేవుడే తన ఆధీనంలో ఉంచుకుంటాడు'' అని చెబుతాం. అయితే లోకం నిజంగా అపనమ్మకం కలదై ''వీరు నిజంగా దేవుని సర్వాధికారాన్ని నమ్ముతున్నారో లేదో మాకు అనుమానంగా ఉంది. మనం వాళ్లని వ్యతిరేకించి, దానికి వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారో చూద్దాం'' అనుకుంటారు. నువ్వు కోరినదానిని పొందే అర్హత నీకున్నప్పుటికినీ ఒక అహంకారి, నీచుడు దానిని నీకు దక్కకుండ చేసినప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు?

నేనొక నేర్పరియైన చిత్రకారుడినైతే, మంచి నీటిగ్లాసు లోపల నిమ్మరసం ఉన్నట్టు దానిపై రంగులు వేయగలను. అయినా, నేనా గ్లాసును అటు ఇటు కదిపితే వాస్తవంగా దానిలో ఉన్నది బైట పడుతుంది. అది నిమ్మరసంతో ఉన్నట్టు కనపడినా అందులో పాలు వుండివుండవచ్చు. అలజడి చేసే ప్రక్రియ వలన లోపల వున్నది బయటకు వస్తుంది.

నీవు నేను ఆర్మీనియనులను అపహసించి మనలను మనం రకరకాల కాల్వినిస్టు బిరుదులతో పిలుచుకోవచ్చు. అయినా మనం అలజడికి గురైనప్పుడు, మన అభీష్టం నెరవేరనప్పుడు, మనం ఎలా ప్రవర్తిస్తామో దానిని బట్టి సర్వాధికారియగు దేవునియందలి మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఇలా నీకు సంభవించినప్పుడు నీలో కనబరచబడేది ఏది? దేవుని సర్వాధికార కృపా లేక నిరంకుశమైన నీ స్వయంచిత్తమా? సరియైన దైవశాస్త్ర మొక్కటే సరిపోదు. యోబు వాస్తవానికి తన దైవశాస్త్రాన్ని కోల్పోయాడు. అతని స్నేహితులు అతని దైవ శాస్త్రంతోనే అతన్ని దెబ్బతీసారు. 'యోబూ, దేవుడు నీతిమంతుని ప్రార్థన విని జవాబిస్తాడని, పాపి ప్రార్థనను వినేందుకు నిరాకరిస్తాడని నీవు మాకు బోధించావు. ఇపుడు నీ పట్ల, నీ శ్రమల పట్ల దేవుడు మౌనం వహించినపుడు కూడ నీవు నీతిమంతుడవే అని అంటావా? నీవు పాపివైన వేషధారివి. నీవు నీ పాపాన్ని ఒప్పుకొనక దేవదూషణ చేస్తున్నావు. నీ దైవశాస్త్రంతో నీ కష్టాలను ఎలా సమన్వయపరుస్తావు?' ఇలాంటి అవహేళనలకు యోబు ఎలా జవాబీయగలడు? వారన్నట్లే తాను నమ్మి ఉపదేశించే వాస్తవాన్ని కాదని అతడు చెప్పజాలడు. అలాగని చెయ్యని పాపాన్ని చేశానని చెప్పనూలేడు. యోబు చెప్పగలిగిందల్లా ఒకటే, ''నేను చెప్పజాలను''. నోరుమూసుకొని దేవుని గురించి కనిపెట్టటమే అతడు చేయగలడు. '

'ఇది న్యాయం కాదు!''

అన్యాయంగా వేధింపులకు గురైన ఎంతోమందికి సలహా ఇస్తూ నేను తరచూ వారికి వాక్యపరిచర్య చేస్తుంటాను. వారు కన్నీటితో 'పాస్టరు గారూ, నాకు జరిగింది చాలా అన్యాయం!' అని విలపిస్తారు. ఇటీ వలే నేను ప్రేమించి నమ్మిన క్రైస్తవులు కొందరు అధికార పదవులలో కొనసాగేందుకు బుద్ధిపూర్వకంగా మోసగించి అబద్ధమాడిన పరిస్థితి గుండా నేను వెళ్లాను. వారి ప్రవర్తన లోకసంబంధమైన రాజకీయాల కన్నా హీనంగా ఉంది. నా క్రైస్తవజీవితంలో ఇది చాలా కష్టతరమైన అనుభవం. 'అయితే ప్రభువా, వాళ్లు అబద్ధమాడుతున్నారని వాళ్లకు తెలుసు. ఇది చాలా ఘోరం, అన్యాయం' అని కేకలు వెయ్యాలనిపించింది.

అన్యాయం జరిగినప్పుడు మనకు దొరికే ఒకే ఒక ఆదరణ ఏమి? మొదటిగా ఈ జీవితంలో అన్నీ న్యాయంగా ఉంటాయని దేవుడెన్నడూ సూచించలేదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి! వాస్తవానికి మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాని సందేశాన్ని జాగ్రత్తగా గ్రహించినట్లయితే, భక్తిహీనులు న్యాయం చేస్తారని భావించకూడదని తెలుసుకుందాం.

యిర్మీయాను వారు గోతిలో పడవేయటం న్యాయం కాదు. యోసేపును తన అన్నలు బానిసగా అమ్మటం న్యాయం కాదు. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపటం కాని, వేలాది మంది క్రైస్తవులను సింహాలకు ఆహారంగా నీరో వేయటం గాని న్యాయం కాదు. అనేక మంది క్రైస్తవులు ఎదుర్కొన్న పరిస్థితులు అత్యంత క్రూరమైనవి, అన్యాయమైనవి అని మనకు తెలుసు (హెబ్రీ 11 చూడండి). అయినా మనకన్నీ న్యాయంగా జరగాలన్న ఆలోచన మనకెక్కడ నుంచి వచ్చింది? ఏ విధంగా చూసినా ఈ లోకం దైవకృపకు నేస్తం కాదు. మత్తయి 10:16-42 చదివి, అప్పుడు 'ఇది ఎందుకు న్యాయం కాదు?' అని ప్రశ్నించే సాహసం చేయండి.

అవును, మనం నలుగగొట్టబడతాం. అయితే మనం సహించగలిగినదాని కంటే అధికంగా శోధించబడం. దేవుడు మనలను కొలిమిలో పుటం వేయబడటానికి అనుమతిస్తే మంచి సైనికుల వలె సహించి ఆయన కృపా శక్తిని ప్రదర్శిద్దాం. మనం కూడ యోబు వలె విశ్వసించి ''దేవుని చేతి నుండి మేలును మాత్రమే అనుభవించెదమా, కీడును అనుభవించదగదా?'' అని చెప్పటానికి కావలసిన కృప కోసం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో ఉన్న ఈ ఆరు సూత్రాలను మనం గ్రహించి అన్వయించుకుంటే అవి మనం ఇలా చేయటానికి దోహదపడతాయి.

దీని శక్తిని ఎల్లప్పుడూ అనుభవించగలిగిన విధంగా ఈ సత్యాన్ని మన హృదయాలపై లిఖించినట్లయితే మనం ప్రతి పరిస్థితిలోను ''క్రీస్తునందు అత్యధిక విజయమును'' పొందగలము. అన్నిటిలోనూ దేవుని హస్తాన్ని చూడగలిగి సర్వాధికారముగల ఆయన కృప, ప్రేమ అన్నిటినీ నియంత్రిస్తుందని గ్రహించగలం. మనం పరిశీలించిన ఈ ఆరు సూత్రాలు ''జిబ్రాల్టరు బండ'' వలె మన పాదాల క్రింద స్థిరంగా నిలుస్తుంది. 'నాకేమి సంభవించినను- అది మేలైనదే అనుట నీవు నాకు నేర్పితివి' అని అనగలం.

క్రైస్తవుడా, సార్వభౌముడు, సర్వాధికారి, ప్రేమగలవాడు అయిన ఈయనే నీ దేవుడు- ధైర్యము తెచ్చుకొని నిరీక్షణ కలిగియుండు. ఆయన రెక్కల క్రింద నీవు మిక్కిలి భద్రంగా ఉన్నావు. నీ దేవుడు మునుపే పూర్తి విజయం పొందాడు గనుక నీవు కూడ పొందుతావు! చివరిగా ఒక మాట.

ఒకవేళ నువ్వు క్రైస్తవుడవు కానట్లయితే, నువ్వు తిరుగుబాటు చేస్తున్నది ఇలాంటి సార్వభౌముడైన దేవుని పైనే అని గుర్తుంచుకో. బుద్ధిపూర్వకంగా నీవాయన అధికారాన్ని విసర్జించి ఆయన కృపను విస్మరిస్తున్నావు. నీవిప్పటివరకూ ఈ గొప్ప దేవునికి నీ హృదయాన్ని, చిత్తాన్ని పశ్చాత్తాప విశ్వాసాలతో లోబరచకపోతే, నువ్వు ఎంతో దౌర్భాగ్యుడవు, బుద్ధిహీనుడవు అయినట్టే. ఇలాంటి దేవుని ఎదిరించి గెలవగలనని నువ్వెలా అనుకుంటున్నావు? విశ్వాసంతో ఆయన తట్టు తిరుగు. ఆయన ఎంత సార్వభౌముడో అంతే కృపగలవాడని తెలుసుకో.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.