విమర్శలకు జవాబు

రచయిత: Marie Prasanth Perikala

Article Release long Jesusswife min

King

ఈమె పేరు కారెన్ లీ కింగ్ (Karen Leigh King). ఈమె హార్వర్డ్ డివినిటీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పని చేసున్న చరిత్రకారిణి. "Harvard’s Hollis Chair of Divinity" ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ. బ్రౌన్ యూనివర్సిటీ నుండి "History of Religions" అనే అంశంలో డాక్టరేట్ పొందారు. క్రొత్త నిబంధన మరియు ప్రాచీన క్రైస్తవ చరిత్ర అనే అంశాలలో ఈమె నిపుణురాలు. 2012 సెప్టెంబరు నెలలో రోమ్ నగరంలో జరిగిన ఒక సమావేశంలో, ఈమె ఒక సంచలన ప్రకటన చేశారు. తన దగ్గర ఉన్న ఒక ప్రాచీన "Papyrus fragment" ని, ఆమె ఆ రోజు అందరికీ చూపించారు. ఆ చిన్న పేపర్ ముక్కలో, ప్రాచీన ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో వ్రాయబడిన ఓ ఎనిమిది అసంపూర్ణ వాక్యాలు ఉన్నాయి. అయితే అందులోని ఒక వాక్యం సంచలనానికి కేంద్ర బిందువు అయ్యింది. “యేసు వారితో చెప్పెను, నా భార్య…” అని అసంపూర్తిగా ఉన్న ఆ వాక్యం నిజంగానే పెద్ద సంచలనం.

యేసు క్రీస్తుకి పెళ్లి అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించే ప్రాచీన లేఖనాలు ఏవీ కూడా అంతకు ముందు వరకు లభించలేదు. ఈ పత్రంలో ఉన్న వాక్యాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ, యేసు ప్రభువు తన భార్య కూడా ఒక శిష్యురాలిగా ఉండుటకు అర్హురాలు అని, మిగతా శిష్యులకు చెబుతున్నట్టుగా ఇందులోని వాక్యాలున్నాయి.

Manuscript

మరి ఈ చిన్న "fragment" ఆధారంగా యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అని మనం చెప్పొచ్చా? లేదు చెప్పలేం. యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అనడానికి ఈ fragment ని ఆధారంగా తీసుకోలేము అని స్వయంగా కారెన్ లీ కింగ్ గారు కూడా అభిప్రాయపడ్డారు. కారణం- ఇది ప్రత్యక్ష సాక్షులు రాసింది కాదు. యేసు ప్రభువు యొక్క శిష్యులు రాసింది కాదు. ప్రత్యక్ష సాక్షుల నుండి వివరాలు సేకరించి రాసింది కూడా కాదు. యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించిన తరువాత కొన్ని వందల సంవత్సరాలకి కాప్టిక్ భాషలో ఇది వ్రాయబడింది. కాబట్టి దీనిని ఆధారంగా తీసుకోలేము. అయితే, ఈ “manuscript” ని ఆధారం చేసుకొని, ఆ రోజుల్లో కొంతమంది యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అని నమ్మేవారు అని మాత్రం చెప్పొచ్చు అనేది కారెన్ లీ కింగ్ గారి అభిప్రాయం.

ఒక ఎటిఎం కార్డు సైజు కంటే కూడా చిన్నగా ఉన్న ఈ “fragment” కి కారెన్ లీ కింగ్ పెట్టిన పేరు - “The Gospel of Jesus’s Wife”. యేసు క్రీస్తు యొక్క భార్య సువార్త అనేది, పెద్ద పుస్తకమేమి కాదు. ఇందులో బోలెడు అధ్యాయాలు గానీ, బోలెడు వచనాలు గానీ ఏమీ లేవు. ఇది కేవలం ఒక చిన్న “tiny fragment” అనే విషయాన్ని గమనించగలరు. అసలు ఇంతకీ ఇది నిజంగా ప్రాచీన పత్రమేనా? తల తోక లేని ఈ చిన్న పేపర్ ముక్కను పట్టుకుని ఇందులో ఉన్న విషయాలు నిజమే అని మనం నమ్మవచ్చా? దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ సంచలన ప్రకటన చేయడానికి కొన్ని వారాల ముందు, కొంతమంది వార్తా పత్రికల ప్రతినిధులతో, కారెన్ లీ కింగ్ గారు సమావేశమయ్యి, ఈ "fragment" గురించిన విషయాలను వారికి వివరించారు.వారిలో ఏరియల్ సబర్ అనే విలేకరి ఒకరు. ఈ మొత్తం వ్యవహారాన్ని కవర్ చేయడానికి "స్మిత్సోనియన్ మ్యాగజీన్" వారు ఏరియల్ సబర్ ని నియమించారు. స్మిత్సోనియన్ సంస్థ అనేది ఏదో చిన్న సంస్థ కాదు. "Smithsonian Institution" అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాంప్లెక్స్. ఇందులో మొత్తం పంతొమ్మిది మ్యూజియంలు ఉన్నాయి. "Gospel of Jesus’s Wife" అనే "fragment" భూటకం అని, చివరికి కారెన్ లీ కింగ్ గారు కూడా ఒప్పుకోవడానికి కారణం, ఏరియల్ సబర్ గారు చేసిన పరిశోధనాత్మక జర్నలిజం.

Ariel Sabar

కారెన్ లీ కింగ్ గారు మొదటగా ఈ papyrus fragment ని తన సహచరులకు చూపించినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది నమ్మలేదు. చాలా మంది పండితులు దీని గురించి వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. 2012 వ సంవత్సరంలో హార్వర్డ్ థియోలాజికల్ రివ్యూ వాళ్ళు దీనిని "peer reviewers" కి పంపారు. ఈ fragment లో ఉన్న వాక్యాలలో వ్యాకరణానికి సంబంధించిన తప్పులు ఉన్నాయి అని, చేతి వ్రాతలో కూడా తేడాలు ఉన్నాయి అని వాళ్ళు గుర్తించారు. ఇది నిజమైన పత్రమే అయ్యుంటే గనక వ్యాకరణ దోషాలు ఎందుకు ఉంటాయి అనేది ఒక ప్రశ్న. ఇందులోని వాక్యాలు, "గాస్పెల్ అఫ్ థామస్" అనే మరొక కాప్టిక్ "Gnostic Text" నుండి తీసుకుని కాపీ పేస్ట్ చేసినట్లున్నాయి అని మరికొంత మంది గుర్తించారు. కీలకమైన విషయం ఏంటంటే, 2002 వ సంవత్సరంలో, "గాస్పెల్ అఫ్ థామస్" ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ online edition లో ఒక అచ్చు తప్పు ఉంది. Typographical Error, అంటే టైపింగ్ లో పొరపాటు వలన ఒక చోట తప్పుగా ముద్రణ అయ్యింది. ఆశ్చర్యకరంగా అదే అచ్చు తప్పు "Gospel of Jesus’s Wife fragment"లో కూడా ఉంది. అంటే, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న గాస్పెల్ అఫ్ థామస్ లోని ఒక వాక్యభాగాన్ని తీసుకుని, అందులో అచ్చు తప్పు ఉంది అనే విషయం తెలియక, అదే వాక్యాన్ని వాడుకుని, ఎవరో కావాలని ఈ fragment ని తయారు చేశారు అనే వాదనకు ఇది బలాన్నిస్తోంది.

కొంతకాలానికి ఈ fragment కి సంబంధించిన కార్బన్ - డేటింగ్ పరిశోధనలు, ముల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్, ఇంకా ఇతర పరీక్షల ఫలితాలను హార్వర్డ్ వారు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో తేలింది ఏంటంటే, ఈ fragment సుమారు క్రీస్తు శకం 8 వ శతాబ్దానికి చెందినది అని. ఇంకా ఇందులో వాడిన సిరా కూడా పురాతనమైనదే. అయితే వీటిని ఆధారం చేసుకుని, ఈ fragment అసలైనదే అని చెప్పడానికి వీలు లేదు. ప్రాచీన కాలానికి సంబంధించిన ఖాళీ papyrus sheets ని సంపాదించటం పెద్ద కష్టమేమి కాదు. eBay లాంటి సంస్థలు వీటిని తరచూ వేలం వేస్తూ ఉంటాయి. ప్రాచీన కాలంలో సిరా యొక్క తయారీ విధానం గురించి తెలిసిన వాళ్లకి అది తయారు చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. వీటిని ఉపయోగించి, కాప్టిక్ భాషలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా, నకిలీ పత్రాన్ని సృష్టించే అవకాశం ఉంది. 1980లలో Mark Hofmann అనే వ్యక్తి ఈ విధంగానే పురాతన కాలానికి సంబంధించిన papyrus, సిరా, ఇంకా కొన్ని రకాల రసాయన మిశ్రమాలను ఉపయోగించి నకిలీ పత్రాలను సృష్టించి నిపుణులను సైతం బోల్తా కొట్టించాడు. అతని మోసం బయట పడేలోగా, ఈ నకిలీ పత్రాల ద్వారా ఇరవై లక్షల డాలర్లను సంపాదించాడు. లండన్ లోని "ది బ్రిటిష్ మ్యూజియం", న్యూయార్క్ లోని "ది మెట్రోపాలిటన్ మ్యూజియం అఫ్ ఆర్ట్", పారిస్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం "లోవే" - లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలనే ఫోర్జరీ చేసే వాళ్ళు మోసగించారు అనే విషయం గమనించదగినది.

అందువలన కారెన్ లీ కింగ్ గారికి, ఆమెను విమర్శించేవారికి మధ్య వాదోపవాదాలు జోరుగా సాగాయి. అందరూ కూడా papyrus fragment గురించి, అందులో వాడిన సిరా గురించి, అందులో వ్రాయబడిన వాక్యాలు గురించే పరిశోధనలు చేస్తున్నారు కానీ, ఏరియల్ సబర్ గారు మాత్రం, అసలు ఈ fragment ఎక్కడి నుండి వచ్చింది? దాని పూర్వాపరాలు ఏమిటి? ఇది ఎవరెవరి చేతులు మారింది? మొట్టమొదటిగా భూమిలో నుండి తవ్వి బయటకు తీసినది ఎవరు? కారెన్ లీ కింగ్ చేతిలోకి రాక ముందు ఈ fragment ఎవరి దగ్గర ఉంది? అనే కోణంలో పరిశోధన మొదలు పెట్టారు.

ఈ papyri ని కారెన్ లీ కింగ్ కి ఇచ్చిన వ్యక్తి, తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టొద్దు అని కోరడంతో కింగ్ ఆ వ్యక్తి గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ అతనితో జరిపిన ఇ-మెయిల్ సంభాషణల వివరాలను కింగ్, ఏరియల్ సబర్ కి పంపించారు. తన దగ్గరకు ఈ papyri ఎలా వచ్చింది అనే విషయాలను ఆ అజ్ఞాత వ్యక్తి ఈ ఇ-మెయిల్స్ లో వివరించారు. అయితే అతను చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉన్నాయి అని ఏరియల్ సబర్ గారు గుర్తించారు.

ఈ papyrus fragment తన దగ్గరకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చింది అనే దాని గురించి ఈ అజ్ఞాత వ్యక్తి, కారెన్ లీ కింగ్ కి ఒక కథ చెప్పాడు. Hans-Ulrich Laukamp అనే వ్యక్తి 1963వ సంవత్సరంలో అప్పటి తూర్పు జర్మనీ దేశంలోని Potsdam అనే పట్టణంలో కొన్ని papyri లను సంపాదించాడనీ… అతని దగ్గర నుండి, 1999వ సంవత్సరం నవంబర్ నెలలో తాను ఆరు కాప్టిక్ papyri లను కొనుగోలు చేశాననీ… దానికి సంబంధించిన సేల్స్ కాంట్రాక్టు యొక్క ఫొటో కాపీని అతను కారెన్ లీ కింగ్ కి ఇచ్చాడు. ఒరిజినల్ సేల్స్ కాంట్రాక్టు కాకుండా "ఫోటో కాపీని" ఇచ్చిన విషయాన్ని గమనించగలరు. అయితే మరొక ఇ-మెయిల్ లో ఈ papyri లను తాను 1997వ సంవత్సరంలో కొనుగోలు చేశానని పొంతన లేని మాటలు చెప్పాడు.

Laukamp

అంతేకాకుండా, జర్మనీ లోని, బెర్లిన్ నగరంలో ఉన్న "ఫ్రీ యూనివర్సిటీలో" ప్రొఫెసర్ గా పని చేసిన egyptologist - పీటర్ మున్రో గారు 1982లో Laukamp కు ఒక ఉత్తరం రాశారనీ, దాని యొక్క ఫోటో కాపీని కూడా ఈ అజ్ఞాత వ్యక్తి కారెన్ లీ కింగ్ కు ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఉన్న దాని ప్రకారం, మున్రో గారి సహచరుడు ఒకరు, ఈ papyri లను పరిశీలించగా, ఒక papyrusలో యోహాను సువార్త లోని వచనాలు ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు మరొక ఉత్తరం యొక్క ఫోటో కాపీ కూడా ఉంది. ఆ ఉత్తరం ప్రకారం, ఒక చిన్న papyrus fragment లో ఉన్న వాక్యాలను బట్టి, అందులో యేసు ప్రభువు తన భార్య గురించి ప్రస్తావించారనీ, యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అని అనడానికి ఇది ఆధారంగా ఉపయోగపడుతుంది అని, మున్రో గారి సహచరుడు భావించారు. అయితే ఈ ఉత్తరం చేత్తో రాసిన ఉత్తరం. దీని మీద సంతకం కానీ, తేదీ కానీ లేకపోవడం గమనార్హం.

మరొక విషయం ఏమిటంటే, ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఈ కథలో ఉన్న వారెవరు కూడా ఇప్పుడు లేరు. అందరూ చనిపోయారు. పీటర్ మున్రో గారు 2009 లో మరణించారు. ఈ papyri లను పరిశీలించాడు అని చెప్పబడుతున్న మున్రో గారి సహచరుడు 2006లో మరణించారు. Hans-Ulrich Laukamp 2002 లో చనిపోయాడు. కాబట్టి, ఈ అజ్ఞాత వ్యక్తి చెప్పిన కథ, నిజమో కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే Laukamp అమెరికాకు వలస వెళ్ళినప్పుడు, తనతో పాటు ఈ papyri లను తీసుకొచ్చాడు అని ఒక ఇ-మెయిల్ లో ఉంది. దాన్ని బట్టి Laukamp అమెరికాలో నివసిస్తున్నప్పుడే ఈ papyri లను ఈ అజ్ఞాత వ్యక్తికి అమ్మినట్లు తెలుస్తోంది.

ఏరియల్ సబర్ గారు పబ్లిక్ డాక్యుమెంట్స్ అన్నీ వెతగ్గా, 1997వ సంవత్సరంలో Hans-Ulrich Laukamp దంపతులు, జర్మనీ నుండి అమెరికాలోని ఫ్లోరిడాకి వచ్చి, ఒక ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు అని తెలిసింది. అక్కడికి వెళ్లి, Laukamp గురించి విచారణ చేస్తే, ఆ దంపతులిద్దరూ chain smokers అనీ, వారు ఎక్కువగా ఒంటరిగా ఉంటూ ఉండేవారనీ, Laukamp భార్య లాండ్రీ షాప్ లో పని చేసేదనీ, Laukamp ఒక tool-maker అనీ, అతను పెద్దగా చదువుకోలేదనీ, హై స్కూల్ విద్య కూడా పూర్తి చేయలేదని తెలిసింది. ఈ విషయాలు తెలుసుకున్న ఏరియల్ సబర్ గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే, సాధారణంగా ఒక "manuscript collector" కి ఉండాల్సిన నేపథ్యం ఇది కాదు.

అసలు Laukamp జర్మనీ లోని బెర్లిన్ లో ఉన్న తన చిన్న అపార్ట్మెంట్ ని వదిలి అమెరికా వచ్చి ఉండే వాడే కాదు. అయితే 1995లో Laukamp తన స్నేహితుడైన Axel Herzsprung తో కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టాడు. ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ BMW నుండి brake components తయారు చేసే కాంట్రాక్టు దక్కడంతో వారి వ్యాపారం బాగా సాగింది. సంవత్సరానికి $250,000 లాభం పొందే స్థాయికి ఎదిగారు. దానితో, Laukamp దంపతులు అమెరికాలోని ఫ్లోరిడాకి మకాం మార్చారు. వారు అక్కడే స్థిరపడిపోవాలి అని అనుకున్నారు. అయితే వారు ఫ్లోరిడా వెళ్లిన కొంత కాలానికే వారి కలలు ఆవిరైపోయాయి. అతని భార్యకి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉంది అనే విషయం బయటపడింది. దానితో Laukamp భార్యను తీసుకుని తిరిగి జర్మనీ వెళ్ళిపోయాడు. 1999 డిసెంబర్ నెలలో అతని భార్య మరణించింది. 2002 ఆగష్టు నెలలో అతని కంపెనీ దివాళా తీసింది. మరో నాలుగు నెలలకి Laukamp కూడా చనిపోయాడు.

అతని కంపెనీ పత్రాలను పరిశీలించిన ఏరియల్ సబర్ గారికి కొన్ని కీలకమైన విషయాలు తెలిశాయి. అవేమిటంటే, Laukamp భార్య మరణించిన నాలుగు రోజులకి వారి కంపెనీకి సంబంధించి అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక శాఖను స్థాపించారు. ఈ అమెరికా శాఖకు డైరెక్టర్స్ గా Laukamp, అతని స్నేహితుడు Axel Herzsprung తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ మూడో వ్యక్తి పేరు, వాల్టర్ ఫ్రిట్జ్. ఇతను కూడా జర్మనీ నుండి ఫ్లోరిడాకి వచ్చి స్థిరపడినవాడే. అయితే అమెరికాలో శాఖను ప్రారంభించిన కొంత కాలానికే కంపెనీ పత్రాలలో నుండి మిగతా ఇద్దరి పేర్లు తీసేసి వాల్టర్ ఫ్రిట్జ్, తాను ఒక్కడే అమెరికా శాఖకు డైరెక్టర్ గా కొనసాగాడు.

వాల్టర్ ఫ్రిట్జ్ ఇప్పటికీ ఫ్లోరిడాలోనే ఉంటున్నాడు. ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిట్జ్ గురించి విచారణ చేసి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు తీశారు. 1995వ సంవత్సరంలో వాల్టర్ ఫ్రిట్జ్ "నేఫ ఆర్ట్" అనే కంపెనీని స్థాపించాడు. "నేఫ" అనేది ఈజిప్షియన్ పదం. ఈ పదానికి అర్థం — అందం. ఈజిప్షియన్ కళలతో అనుబంధం కలిగిన ఒకానొక వ్యక్తి Laukamp కి సన్నిహితుడు అంటే, ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కాప్టిక్ భాష కూడా ఐగుప్తుకు సంబంధించిన భాషే. ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిట్జ్ గురించి మరింత లోతుగా పరిశోధిస్తున్న క్రమంలో ఒక విషయం ఆయన దృష్టికి వచ్చింది. అదేమిటంటే, 1991వ సంవత్సరంలో వాల్టర్ ఫ్రిట్జ్ అనే పేరు గల వ్యక్తి, "ప్రాచీన ఐగుప్తీయుల సంస్కృతి" అనే అంశం మీద, ప్రఖ్యాత జర్మన్ జర్నల్ ఒక దాంట్లో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ఆ జర్నల్ లో ఉన్న వివరాలను బట్టి చుస్తే, ఆ వ్యాసాన్ని ప్రచురించిన వ్యక్తి బెర్లిన్ లో ఉన్న "ఫ్రీ యూనివర్సిటీ" లోని Egyptology Institute కి చెందినవాడు. ఇంతకు ముందు మనం చెప్పుకున్న పీటర్ మున్రో, అలాగే 1982వ సంవత్సరంలో Hans-Ulrich Laukamp దగ్గర ఉన్న papyri లను పరిశీలించాడు అని చెప్పబడుతూ ఉన్న మున్రో గారి సహచరుడు, ఇద్దరూ కూడా ఫ్రీ యూనివర్సిటీకి చెందిన వారే.

జర్మన్ జర్నల్ లో వ్యాసాన్ని ప్రచురించిన వాల్టర్ ఫ్రిట్జ్, అలాగే ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న, Hans-Ulrich Laukamp మాజీ వ్యాపార భాగస్వామి అయిన వాల్టర్ ఫ్రిట్జ్ - ఇద్దరూ ఒక్కరేనా అనేది తెలియాల్సి ఉంది. తరువాతి రోజు ఉదయం ఏరియల్ సబర్ గారు, వాల్టర్ ఫ్రిట్జ్ కి ఫోన్ చేసి, తాను Laukamp గురించి, Jesus's Wife papyrus గురించి, పరిశోధన చేస్తున్నాను అని చెప్పి, ఈ విషయమై మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని వాల్టర్ ఫ్రిట్జ్ కి చెప్పారు. అయితే, ఏరియల్ సబర్ ని కలవడానికి వాల్టర్ ఫ్రిట్జ్ నిరాకరించాడు. ఫ్రీ యూనివర్సిటీలో తాను ఎప్పుడు కూడా ఈజిప్టాలజీ మీద అధ్యయనం చేయలేదనీ, జర్మన్ జర్నల్ లో ఎటువంటి వ్యాసాన్నీ ప్రచురించలేదనీ చెప్పాడు. Laukamp మరియు Herzsprung ల వ్యాపారానికి సంబంధించి అమెరికాలోని శాఖకు తాను అధ్యక్షుడిని అని Website లో ఉన్నప్పటికీ, తాను కేవలం ఒక Consultant ని మాత్రమే అని, వారు అమెరికాలో కంపెనీ నెలకొల్పడానికి కేవలం సహాయం మాత్రమే చేశానని చెప్పుకొచ్చాడు. అసలు Laukamp తో పరిచయం ఎలా ఏర్పడిందో కూడా తనకు గుర్తులేదని చెప్పాడు. "The Gospel of Jesus's Wife papyrus" కి యజమాని మీరేనా అనే ప్రశ్నకి, తాను కాదు అని జవాబిచ్చాడు.

తనను కలవడానికి వాల్టర్ ఫ్రిట్జ్ నిరాకరించిన తరువాత, ఏరియల్ సబర్ గారు "North Port Sun" అనే వార్తా పత్రిక వారి ద్వారా వాల్టర్ ఫ్రిట్జ్ యొక్క ఫోటోని సంపాదించగలిగారు. అంతకుముందు అక్కడ స్థానికంగా జరిగిన ఒక ఉద్యమంలో వాల్టర్ ఫ్రిట్జ్ కీలకమైన పాత్ర పోషించడం వలన, ఆ వార్తను ప్రచురించిన North Port Sun అనే వార్తా పత్రిక వాళ్ళ దగ్గర వాల్టర్ ఫ్రిట్జ్ ఫోటో ఉంది. ఆ తరువాత ఏరియల్ సబర్ గారు, బెర్లిన్ ఫ్రీ యూనివర్సిటీలో Egyptologist గా పని చేసిన Karl Jansen Winkeln అనే వ్యక్తిని సంప్రదించి, 1991లో జర్మన్ జర్నల్ లో వ్యాసాన్ని ప్రచురించిన వాల్టర్ ఫ్రిట్జ్ గురించి ఏమైనా తెలుసా అని విచారణ చేశారు. వాల్టర్ ఫ్రిట్జ్ తనకు తెలుసనీ, అతను 1988 నుండి 1991 వరకు యూనివర్సిటీలో Masters Degree విద్యార్థి అని, కానీ ఆఖరి సంవత్సరం పరీక్షలకు హాజరవ్వకుండానే వెళ్లిపోయాడనీ, 1992 తరువాత అతనిని నేను చూడలేదని Jansen Winkeln గారు చెప్పారు. North Port Sun వార్తాపత్రిక వాళ్ళ దగ్గర సంపాదించిన ఫోటోని Jansen Winkeln కి చూపించగా - ఈ ఫోటోలోని వ్యక్తి బెర్లిన్ యూనివర్సిటీలో Egyptology చేసిన వాల్టర్ ఫ్రిట్జ్ లాగానే ఉన్నాడని Winkeln గారు చెప్పారు. దానితో వాల్టర్ ఫ్రిట్జ్ తనతో ఫోనులో మాట్లాడినప్పుడు అబద్ధం చెప్పాడని ఏరియల్ సబర్ గారు నిర్ధారించుకున్నారు.

పబ్లిక్ రికార్డులను పరిశీలించగా, 1992లో జర్మనీలో మాయమైన వాల్టర్ ఫ్రిట్జ్, 1993లో ఫ్లోరిడా చేరుకున్నాడనీ, 1995లో "నేఫ ఆర్ట్" అనే కంపెనీని స్థాపించాడని తెలుస్తోంది. అంతే కాకుండా ఆగష్టు 26, 2012 - అంటే ఈ papyrus గురించి కారెన్ లీ కింగ్ ప్రకటన చేయడానికి సుమారు 3 వారాల ముందు, www.gospelofjesuswife.com అనే Domain Name ని వాల్టర్ ఫ్రిట్జ్ రిజిస్టర్ చేయించాడని ఏరియల్ సబర్ గారు గుర్తించారు. ఈ papyrus కి గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనే పేరు పెట్టబోతున్నట్టు, కారెన్ లీ కింగ్ కి బాగా దగ్గరగా ఉండే కొద్ది మందికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. మరి వాల్టర్ ఫ్రిట్జ్ కి ఎలా తెలిసింది? దీన్ని బట్టి చూస్తే, కారెన్ లీ కింగ్ కి ఈ papyrus ని ఇచ్చిన వ్యక్తి వాల్టర్ ఫ్రిట్జ్ అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మరింత సమాచారం సేకరించడానికి ఏరియల్ సబర్ గారు జర్మనీ వెళ్లారు. అక్కడ, Laukamp కుమారుడు అయిన René Ernest, మరియు అతని భార్య గాబ్రియేల్ ను ఏరియల్ సబర్ గారు కలుసుకున్నారు. ఈ papyrus కి Laukamp కి ఉన్న సంబంధం గురించి విన్నప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు.

వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం, Laukamp బాల్యంలో తూర్పు జర్మనీలోని Potsdam లో జీవించాడు. అతనికి 18 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు, జర్మనీ రెండుగా విడిపోగా, అక్టోబరు నెల 1961వ సంవత్సరంలో, సరిహుద్దులలో ఉన్న ఒక నదిని ఈదుకుంటూ Laukamp పశ్చిమ జర్మనీకి చేరుకున్నాడు. అలా అతను పశ్చిమ జర్మనీకి వట్టి చేతులతో కేవలం స్విమ్ సూట్ తో వచ్చాడు. కాబట్టి వాల్టర్ ఫ్రిట్జ్, కారెన్ లీ కింగ్ కి చెప్పినట్లుగా, Laukamp 1963లో Potsdam లో ఆరు కాప్టిక్ papyri లను కొనుగోలు చేశాడు అనే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు అని తెలుస్తోంది. 1961లో అప్పటికే ఒకసారి చట్టవిరుద్ధంగా తూర్పు జర్మనీ నుండి పశ్చిమ జర్మనీకి పారిపోయి వచ్చిన వ్యక్తి, తన స్వేఛను తన ప్రాణాలను పణంగా పెట్టి, 1963లో తిరిగి Potsdam కి వెళ్లి అక్కడ papyri లను కొనుగోలు చేసి, మళ్ళీ చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటి పశ్చిమ జర్మనీకి వచ్చే సాహసం చేయడం అనేది దాదాపు అసంభవం అనే చెప్పాలి.

అంతేకాకుండా 1990లలో Axel Herzsprung తో కలిసి వాహనాల విడిభాగాల వ్యాపారం ప్రారంభించక ముందు వరకు కూడా Laukamp ఒక మామూలు tool-maker. అతనికి manuscripts లాంటివి సేకరించే అలవాటేమీ లేదు. ఒకవేళ నిజంగా అతని దగ్గర ఈ manuscript ఉండి ఉంటే, దానిని ఎప్పుడో అమ్మి వేసేవాడనీ, లేదా పబ్ లో కూర్చుని మూడు పెగ్గులు తాగిన తరువాత అందరికీ ఈ manuscript గురించి చెప్పేవాడనీ, కనీసం ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచేవాడు కాదని అతని కోడలు గాబ్రియేల్ అభిప్రాయపడింది. ఈ papyrus యజమాని ఎవరైతే ఉన్నారో, అతను కారెన్ లీ కింగ్ కి ఒక ఉత్తరం ఇచ్చాడనీ, ఆ ఉత్తరంలో ఉన్న దాని ప్రకారం ఈ papyrus విషయమై Laukamp ఫ్రీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన పీటర్ మున్రోని సంప్రదించారనీ, యూనివర్సిటీ Egyptologist ఎవరినైనా Laukamp సంప్రదించిన విషయం మీకు తెలుసా అని ఏరియల్ సబర్ గారు Ernest దంపతులను అడగగా… వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పెద్దగా నవ్వి, జర్మనీ చట్టాల ప్రకారం కనీసం ఎనిమిదవ తరగతి వరకు చదవాలి కాబట్టి Laukamp ఎనిమిదవ తరగతి వరకు చదివాడనీ, అతనికి బాగా తాగే అలవాటు ఉందనీ, వీధి చివరలో ఉన్న బార్ అతనికి రెండవ ఇల్లు వంటిదనీ, ఎప్పుడూ అక్కడే కూర్చుని మందు తాగుతూ ఉండేవాడనీ, ఆ బార్ అతనికి చాలా ఇష్టమైన ప్రదేశమనీ, అంతే కానీ నగరంలో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ కాదని వారు చెప్పడం జరిగింది.

Munro

ఇదే విషయమై ఏరియల్ సబర్ గారు పీటర్ మున్రో భార్యని కూడా సంప్రదించగా, ఆమె కూడా ఇందులో వాస్తవం ఉండి ఉండకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. 1982లో పీటర్ మున్రో గారు Egyptology లో డాక్టరేట్ చేస్తున్న సమయంలో కాప్టిక్ భాష గురించి, అలాగే కొన్ని papyrus ల మీద పరిశోధనలు చేశారనీ, అలాంటి ఆసక్తికరమైన papyrus అతని దృష్టికి వచ్చి ఉంటే గనుక, ఖచ్చితంగా నాకు చెప్పేవారనీ, కానీ అటువంటిదేమీ జరగలేదని పీటర్ మున్రో గారి భార్య చెప్పారు. మరి papyrus కి సంబంధించిన సేల్స్ కాంట్రాక్టు మీద Laukamp సంతకం ఎలా వచ్చింది అని ఏరియల్ సబర్ గారు ప్రశ్నించగా, Laukamp చాలా తేలికగా అందరినీ నమ్మేసేవాడనీ, కంపెనీకి సంబంధించిన పత్రాల మీద సంతకం కావాలి అని వాల్టర్ ఫ్రిట్జ్ అడిగి ఉంటాడనీ, Laukamp ఆ పత్రాలను చూడకుండానే సంతకం చేసి ఉంటాడని గాబ్రియేల్ అభిప్రాయపడింది.

బెర్లిన్ లో మరికొంత మందిని ఇంటర్వ్యూ చేసిన తరువాత, వాల్టర్ ఫ్రిట్జ్ ఎలాంటివాడో ఏరియల్ సబర్ గారికి బాగా అర్ధమయ్యింది. ఒకప్పుడు Laukamp వాళ్ళ కంపెనీతో వ్యాపారం చేసిన Peter Biberger అనే వ్యక్తి ఏరియల్ సబర్ గారితో ఏమన్నాడంటే - "వాల్టర్ ఫ్రిట్జ్ ని నువ్వు పట్టుకోలేవు. ఈల్ చేపలాగా నీ చేతి వేళ్ళ సందులో నుండి జారిపోగలడు. అంతటి మాయగాడు వాల్టర్ ఫ్రిట్జ్" అని అతను చెప్పాడు. ఆ తరువాత, ఏరియల్ సబర్ గారు Laukamp స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన Axel Herzsprung గారిని కలిశారు. వాల్టర్ ఫ్రిట్జ్ బాగా మాటకారి అనీ, అతను Laukamp ని చాలా సులభంగా ప్రభావితం చేయగలిగాడనీ, Axel Herzsprung కి Laukamp కి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసాడనీ, అసలు వాల్టర్ ఫ్రిట్జ్ ని మేము మా జీవితంలో ఎప్పుడూ కలవకుండా ఉండి ఉంటే చాలా బాగుండేదని Axel Herzsprung తన ఆవేదనను వెలిబుచ్చారు. 2002లో మా కంపెనీ దివాలా తీయడానికి కూడా అతనే కారణం అనీ, BMW కాంట్రాక్టును మా కంపెనీ నుండి "APG Automotive Parts" అనే వేరొక కంపెనీకి అతను తీసుకువెళ్లాడని Herzsprung చెప్పారు.

Axel

అయితే 2008 ఫిబ్రవరి నాటికి, APG Automotive Parts అనే కంపెనీ కూడా మూతపడింది. దానితో వాల్టర్ ఫ్రిట్జ్ నార్త్ పోర్ట్ లో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. రెండు సంవత్సరాలైనా కూడా అది అమ్ముడుపోకపోవడంతో 2010 ఫిబ్రవరిలో ఆ ఇంటి ధరను సుమారు 35% తగ్గించి అమ్మాకానికి పెట్టాడు. ఆర్ధిక మాంద్యం ప్రభావం వల్లనో ఏమో, ఆ ఇంటిని కొనడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. అదే సమయంలో 2010 జులై నెలలో, తన దగ్గర కొన్ని ఆసక్తికరమైన కాప్టిక్ papyrus fragments ఉన్నాయి అని వాల్టర్ ఫ్రిట్జ్ మొట్టమొదటిసారి కారెన్ లీ కింగ్ కి ఇ-మెయిల్ పంపాడు. ఈ విషయాలన్నిటిని బట్టి చుస్తే, Jesus’s Wife papyrus ని సృష్టించగల నైపుణ్యం మరియు తెలివితేటలు వాల్టర్ ఫ్రిట్జ్ కి ఉన్నాయి. అతను Egyptology చదివాడు. కాప్టిక్ భాష గురించి అతనికి తెలుసు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని సులభంగా ప్రభావితం చేసి వాళ్ళను ఒప్పించగల నైపుణ్యం అతనికి ఉంది. 2010 నాటికి అతను ఆర్ధికంగా కూడా ఇబ్బందులలో ఉన్నాడు. అయితే, వాల్టర్ ఫ్రిట్జ్ ఈ papyrus లను నిజంగానే ఫోర్జరీ చేసి ఉంటే, కేవలం డబ్బు కోసమే చేశాడా లేక ఇంకేదయినా కారణం ఉందా అని ఏరియల్ సబర్ గారు తెలుసుకునే ప్రయత్నం చేయగా నిర్ఘాంతపోయే విషయాలు బయటపడ్డాయి.

2003వ సంవత్సరం నుండి, వాల్టర్ ఫ్రిట్జ్ వరుసగా కొన్ని పోర్నోగ్రాఫిక్ వెబ్-సైట్లను ప్రారంభించాడు. అంటే అశ్లీలమైన సినిమాలను చూపించే వెబ్-సైట్లు. తన సొంత భార్య పరాయి పురుషులతో, అందులోనూ ఎక్కువ శాతం, ఒకరి కంటే ఎక్కువ మందితో ఒకేసారి శృంగారంలో పాల్గొంటుండగా, వాటిని చిత్రీకరించి ఆ చిత్రాలను తన పోర్న్ వెబ్-సైట్లలో ప్రసారం చేసేవాడు. ఈ తరహా శృంగారం ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడతాయి అనే విషయాలను తెలియచేస్తూ, ఆసక్తిగల పురుషులు తమను సంప్రదించాలి అని ప్రకటనలు కూడా ఇచ్చేవాడు. అలా వచ్చిన వారి వద్ద నుండి శృంగారంలో పాల్గొన్నందుకు డబ్బు వసూలు చేసేవారు కాదు కానీ, ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రూపంలో చిత్రీకరించడానికి అంగీకరించాలి అనే షరతు మీద వారిని శృంగారంలో పాల్గొనటానికి అనుమతించేవారు. ఏరియల్ సబర్ గారు ఈ విషయాలను తన భార్యకు చెప్పగా, ఆమె "ది డావిన్సీ కోడ్" అనే పుస్తకం ఒకసారి చదవండి, అప్పుడు మీకు వాల్టర్ ఫ్రిట్జ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటో అర్ధం అయ్యే అవకాశం ఉంది అని ఒక సలహా ఇచ్చింది.

స్త్రీవాదాన్ని సమర్ధించే కొంతమంది పండితులు ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనల ఆధారంగా, డాన్ బ్రౌన్ అనే వ్యక్తి "ది డావిన్సీ కోడ్" అనే ఒక కాల్పనిక నవలను రచించాడు. ప్రాచీన కాలంలో కొన్ని సంస్కృతులలో శృంగారం అంటే చాలా పవిత్రమైనదనీ, అది దైవకార్యం అనే భావన ఉండేది. ప్రజలంతా సామూహికంగా శృంగారంలో పాల్గొనే కొన్ని ఆచారాలు, పండుగలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేవి. మన దేశంలో కూడా వీటికి సంబంధించి బోలెడు ఆధారాలు ఉన్నాయి. తాపీ ధర్మారావు గారు రాసిన "దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?" అనే పుస్తకం చదివితే ఈ విషయం బాగా అర్ధం అవుతుంది. మొదట్లో క్రైస్తవులలో కూడా కొంతమందికి ఇలాంటి భావనలు ఉండేవి అని, "ది డావిన్సీ కోడ్" పుస్తక రచయిత చేసిన ఒక ఆరోపణ. అయితే రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు శృంగారం అంటేనే పాపమనీ, మతాధికారులందరూ బ్రహ్మచర్యం పాటించాలనీ, స్త్రీలు పురుషులతో సమానం కాదు అంటూ చేసిన కొన్ని బోధనలను అప్పటి క్రైస్తవులు కొందరు వ్యతిరేకించారనీ, అటువంటి వారిని రోమన్ క్యాథలిక్ చర్చి ఉద్దేశపూర్వకంగా అణచివేసింది అనేది ఆ పుస్తక రచయిత చేసిన ప్రధాన ఆరోపణ. అలా కొంతమందిని అణచివేసే క్రమంలో, యేసు క్రీస్తుకు మగ్దలీనా మరియతో పెళ్లయ్యింది ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు అని తెలియచేసే కొన్ని ఆధారాలను రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు నాశనం చేసే ప్రయత్నం చేశారు అనే ఒక థియరీని ఆ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రోమన్ క్యాథలిక్ చర్చి వారి ఈ ప్రయత్నాన్ని నిలువరించడానికీ, యేసు క్రీస్తు వారి వంశస్థులను కాపాడటానికీ, అలాగే శృంగారాన్ని పవిత్రంగా భావించే నాటి ఆచారాలను కాపాడటానికి ఒక సమాజం ఏర్పడింది అని ఊహాజనితమైన ఒక కాల్పనిక కథను ఆ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, ఆ పుస్తకంలోని ఒక కీలమైన సన్నివేశంలో ఈ సమాజంలోని సభ్యులందరూ కలిసి సామూహిక శృంగారంలో పాల్గొంటారు.

ఈ పుస్తకం నుండి వాల్టర్ ఫ్రిట్జ్ దంపతులు ప్రేరణ పొందారేమో అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే "ది డావిన్సీ కోడ్" పుస్తకం ప్రచురింపబడిన నెల రోజులకు, 2003 ఏప్రిల్ నెలలో వాల్టర్ ఫ్రిట్జ్ దంపతులు తమ మొట్టమొదటి పోర్న్ వెబ్-సైటును ప్రారంభించారు. 2015లో వాల్టర్ ఫ్రిట్జ్ భార్య “Universal Truths” అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం దైవ ప్రేరేపితమనీ, దేవుడు మరియు దేవుని ప్రధాన దూత అయిన మిఖాయేలు తన ద్వారా మాట్లాడతారు అని ఆమె ప్రకటించింది. బహుశా దేవుడు తమ ద్వారా కార్యం జరిపిస్తున్నారు అనే భ్రమలో వారు ఉండి ఉండవచ్చు. "ది డావిన్సీ కోడ్" యొక్క కాల్పనిక గాథను నిజం చేయాలంటే భౌతికపరమైన ఆధారం ఒకటి ఉంటే సరిపోతుంది. నకిలీ manuscript ని సృష్టించాలనుకోవడం వెనుక ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.

Fritz

ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిట్జ్ కి మళ్ళీ ఫోన్ చేశారు. తాను సేకరించిన ఆధారాలను గురించి వాల్టర్ ఫ్రిట్జ్ కి చెప్పారు. వాల్టర్ ఫ్రిట్జ్ కి విషయం అర్ధం అయ్యింది. నువ్వు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని ఏరియల్ సబర్ ని అడిగారు. Papyrus గురించి నిజం తెలియాలి అని చెప్పారు ఏరియల్ సబర్. ఆ papyrus కి యజమానిని నేను కాదు అని మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, చివరికి తానే ఆ papyrus కి యజమానిని అని వాల్టర్ ఫ్రిట్జ్ ఒప్పుకున్నాడు. అయితే ఏరియల్ సబర్ కి మరో కథ వినిపించాడు. 1990లలో ఒక ప్రముఖ స్విస్ రచయిత, బెర్లిన్ లో నిర్వహించిన ఒక సమావేశంలో తాను మొదటిసారి Hans Ulrich Laukamp ని కలిశాననీ, ఆ తరువాత ఇద్దరమూ మంచి స్నేహితులమయ్యాము అనీ, ఈ papyrus ల గురించి Laukamp తనకు చెప్పగా 1999లో ఫ్లోరిడాలో ఉన్న సమయంలో 1500 డాలర్లకు కొనుగోలు చేశానని చెప్పాడు. ఆ తరువాత 2009లో వ్యాపారం పని మీద లండన్ వెళ్ళినప్పుడు తనకు తెలిసిన ఒక ఆర్ట్ డీలర్ ని కలిసి ఈ papyrus లను 5000 డాలర్లకు అమ్మాలనుకున్నాననీ, అయితే అతను ఈ papyrus లను పరీక్షించి 50,000 డాలర్లు ఇస్తానన్నాడనీ, దానితో తనకు అనుమానం వచ్చి ఈ papyrus లను పరిశీలించి చెప్పమని కారెన్ లీ కింగ్ ని సంప్రదించాను అని చెప్పుకొచ్చాడు.

వాల్టర్ ఫ్రిట్జ్, కారెన్ లీ కింగ్ కి పంపిన ఇ-మెయిల్స్ లో, 1980లలో జర్మనీలో ఎవరో ఈ papyrus లను తర్జుమా చేశారు అని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు అని ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిట్జ్ ని అడిగితే, తాను కారెన్ లీ కింగ్ కి అబద్ధం చెప్పాననీ, ఎవరూ తర్జుమా చేయలేదనీ, కాప్టిక్ నిఘంటువును మరియు వ్యాకరణ పుస్తకాన్ని ఉపయోగించి తానే తర్జుమా చేశానని వాల్టర్ ఫ్రిట్జ్ ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు మీరు నాతో చెప్పిందంతా నిజమే అని నిర్ధారించుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లండనులో మీరు కలిసిన ఆర్ట్ డీలరు కానీ, లేదా Laukamp కి manuscripts సేకరించే అలవాటు ఉంది అని తెలిసిన వాళ్ళు కానీ, లేదా స్విస్ రచయిత నిర్వహించిన సమావేశంలో మిమ్మల్ని మరియు Laukamp ని చుసిన వాళ్ళు కానీ, ఇలా ఏదయినా ఆధారం ఉందా అని వాల్టర్ ఫ్రిట్జ్ ని ఏరియల్ సబర్ అడిగారు. "లేదు, నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు" అని వాల్టర్ ఫ్రిట్జ్ సమాధానం ఇచ్చాడు. అంటే, ఇది కూడా కట్టు కథే అని తెలుస్తోంది. ఫోర్జరీ చేసేవాళ్ళకి నకిలీ పత్రాలను సృష్టించడం చాలా తేలికైన విషయమే. కానీ, ఆ manuscript ని ఎప్పుడు ఎక్కడ ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు మొదలయిన విషయాలను ఫేక్ చేయడం చాలా కష్టం.

Laukamp నుండి తాను papyri లను కొనుగోలు చేశానని చెబుతూ వాల్టర్ ఫ్రిట్జ్ ఇచ్చిన సేల్స్ కాంట్రాక్టు లో నవంబర్ 12, 1999 అనే తేదీ ఉంది. ఈ లావాదేవీ ఎక్కడ జరిగింది అని వాల్టర్ ఫ్రిట్జ్ ని అడిగితే, "ఫ్లోరిడాలోని Laukamp ఇంట్లో" అని చెప్పాడు. కానీ, Laukamp కొడుకు కోడలు చెప్పిన దాని ప్రకారం, తన భార్యకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి ఉంది అని తెలిసిన వెంటనే 1999 అక్టోబరు నెల కంటే ముందే Laukamp జర్మనీ తిరిగి వచ్చేశాడు. డిసెంబరు నెలలో తన భార్య చనిపోయేవరకు ఆమె పక్కనే ఉండి చూసుకున్నాడు. అంటే అసలు 1999 నవంబరు నెలలో Laukamp ఫ్లోరిడాలోనే లేడు. జర్మనీలో ఉన్నాడు. ఇక 1982లో పీటర్ మున్రో గారు Laukamp కి ఇచ్చారు అని చెప్పబడుతూ ఉన్న ఉత్తరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, అందులో ఉన్న Laukamp ఇంటి చిరునామా అసలైనది కాదనీ, అసలు ఆ చిరునామాయే నకిలీదనీ, అటువంటి చిరునామా ఎక్కడా లేదు అనే విషయం బయటపడింది. అంతే కాకుండా 1980 నుండి 1995 వరకు మున్రో గారు రాసిన ఉత్తరాలను పరిశీలిస్తే, ఆ ఉత్తరాలన్నిట్లో Sharp S [In German, the letter ß is known as the eszett or scharfes (sharp) S] అనే ఒక ప్రత్యేకమైన జర్మన్ అక్షరం కనిపిస్తుంది. కానీ వాల్టర్ ఫ్రిట్జ్ ఇచ్చిన ఉత్తరంలో ఆ ప్రత్యేకమైన "Sharp S (ß)" అనే అక్షరానికి బదులు మామూలు "S" ఉంది. అంటే ఆ ఉత్తరం జర్మన్ టైపు రైటరు మీద కాకుండా వేరే టైపు రైటరు మీదా టైపు చేసి ఉండాలి. లేదా 1996లో జర్మనీ భాషలో మార్పులు జరిగిన తరువాత అయినా టైపు చేసి ఉండాలి. ఆ ఉత్తరంలో వాడిన లెటర్ హెడ్ కూడా 1980లలోనిది కాదు. యూనివర్సిటీ Egyptology Institute వాళ్ళు ఆ లెటర్ హెడ్ ని 1990 ఏప్రిల్ నెల నుండే వాడటం మొదలుపెట్టారు. వాల్టర్ ఫ్రిట్జ్ తాను యూనివర్సిటీలో Egyptology చదివే సమయంలో ఆ లెటర్ హెడ్ ని సంపాదించి ఉంటాడు. ఈ ఆధారాలను బట్టి చుస్తే, పీటర్ మున్రో గారు ఇచ్చారు అని చెబుతున్న ఉత్తరం కూడా నకిలీదే అనీ, దానిని వాల్టర్ ఫ్రిట్జ్ సృష్టించాడు అనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఏరియల్ సబర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్ లో స్పష్టంగా తెలిసిన విషయాలు ఏంటంటే, వాల్టర్ ఫ్రిట్జ్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే. తానే ఒక నకిలీ papyrus ని సృష్టించి, Laukamp దగ్గర నుండి కొన్నాను అని చెబుతూ నకిలీ సేల్స్ కాంట్రాక్టును, ఇంకా పీటర్ మున్రో గారు ఇచ్చారు అని చెబుతూ కొన్ని నకిలీ ఉత్తరాలను సృష్టించాడు. మహా మాటకారి - తన మాటలతో అందరినీ ఒప్పించగలడు. నమ్మిన వారిని నట్టేటా ముంచేసే రకం. సొంత భార్యతో కలిసి సామూహిక శృంగారంలో పాల్గొంటూ వాటిని సినిమాలుగా చిత్రీకరించి అశ్లీలమైన వెబ్-సైట్లలో ప్రసారం చేసేవాడు. ఇలాంటి దరిద్రమైన వ్యక్తిత్వం ఉన్నవాడు యేసు ప్రభువు గురించి ఏదో ఒక కట్టు కథ అల్లితే, అదే నిజమని నమ్మేవాళ్ళు కూడా ఉండటం మన దౌర్భాగ్యం.

Gospel of Jesus's Wife అనే papyrus fragment ని దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కారెన్ లీ కింగ్ సమర్ధిస్తూ వచ్చింది. కానీ ఏరియల్ సబర్ గారు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన నిజాలను తెలుసుకున్నాక ఆమె కూడా ఈ fragment నకిలీది అయ్యుండొచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు. ఆమె స్వయంగా ఏరియల్ సబర్ గారికి ఫోన్ చేసి, మీరు వెలికితీసిన వాస్తవాలు నిజంగా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పారు. "వాల్టర్ ఫ్రిట్జ్ తో అనేక ఇ-మెయిల్ సంభాషణలు జరిపాను. 2011 డిసెంబరులో వ్యక్తిగతంగా కూడా కలిశాను. కానీ అతను ఫ్రీ యూనివర్సిటీలో Egyptology Institute లో చదువుకున్న విషయం కానీ, తనకు కాప్టిక్ భాష వచ్చు అనే విషయం కానీ, సొంత భార్యతో కలిసి అశ్లీలమైన చిత్రాలు తీసిన విషయం కానీ... నాకు ఎప్పుడూ చెప్పలేదు. అతను నాకు అన్ని అబద్దాలే చెప్పాడు" అని కారెన్ లీ కింగ్ గుర్తు చేసుకున్నారు.

ఏరియల్ సబర్ గారు ఇన్వెస్టిగేట్ చేసి వెలికి తీసిన ఈ విషయాలన్నిటిని "ది అట్లాంటిక్" మ్యాగజీన్ వారు ప్రచురించారు. అలాగే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక కారెన్ లీ కింగ్ గారు ఏమని స్పందించారో కూడా ఇదే మ్యాగజీన్ లో ప్రచురితం అయ్యింది. ఒకవేళ మీరు వాటిని చదవాలి అని అనుకుంటే గనక ఇక్కడ క్రింద ఇవ్వబడిన వెబ్-సైటు లింకులను క్లిక్ చేసి చదవవచ్చు.

The Unbelievable Tale of Jesus’s Wife -

https://www.theatlantic.com/magazine/archive/2016/07/the-unbelievable-tale-of-jesus-wife/485573/

Karen King Responds to ‘The Unbelievable Tale of Jesus’s Wife’ -

https://www.theatlantic.com/politics/archive/2016/06/karen-king-responds-to-the-unbelievable-tale-of-jesus-wife/487484/

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.