నిజ క్రైస్తవ జీవితం

రచయిత: డి. యశ్వంత్ కుమార్
వీడియో

 

"వివాహము అన్ని విషయములలో ఘనమైనది...." (హెబ్రీ 13:4) అని వాక్యం చెబుతోంది. పాస్టర్ బిబుగారు ఒక పెళ్ళిలో ప్రసంగిస్తూ వివాహం ఎందుకు ఘనమైనదో ఓ పది కారణాలు చెప్పారు. అవే సంగతులను ఈ వ్యాసం రూపంలో మీ ముందుంచుతున్నాను. ఆ పది కారణాలు ఏంటంటే ...

మొదటి కారణం

వివాహాన్ని తయారుచేసినవాడూ, దానిని రూపొందించినవాడూ దేవుడే.

వివాహ వ్యవస్థ దేవుని ఆలోచనల్లో నుండి ఆవిర్భవించింది. ఇది మనిషి ఆలోచనల్లో నుండి పుట్టినది కాదు. 'నేను పెళ్లి చేసుకుంటే బాగుండు, నువ్వు నా గురించి ఆలోచించవా?' అని ఆదాము దేవునికి ఫిర్యాదు చేసినట్లుగా గానీ, దేవుణ్ణి అడిగినట్లుగా గానీ మనం చదవము. దేవుడే ఆదామును చూసి "నరుడు ఒంటరిగానుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను" (ఆది. 2:18) అని చదువుతాము. వివాహము అనేది దేవుని మనసులో నుండి పుట్టిన ఆలోచన. మానవుల మేలు నిమిత్తం దేవుడే ఈ వివాహ వ్యవస్థను సంకల్పించాడు. దేవుడు దేనినైతే తయారుచేస్తాడో లేదా ప్రారంభిస్తాడో దానిని మంచిది అని అంటాడు. "దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగనుండెను" (ఆది. 1:31). అంటే దేవుడు స్థాపించినదేదైనా అది మంచిదయ్యుంటుంది. కాబట్టి వివాహము మంచిది, ప్రశస్తమైనది, ఘనమైనది. ఘనుడైన దేవుడు దాన్ని తయారు చేసాడు గనుక వివాహము ఘనమైనది. ఇది మొదటి కారణం.

రెండవ కారణం

ప్రతీ వివాహములోనూ జతపరిచే కార్యం దేవుడే చేస్తున్నాడు.

యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఈ మాట సెలవిచ్చాడు. ఒక సందర్భంలో శాస్త్రులూ, పరిసయ్యులూ వచ్చి ఏ కారణాన్ని బట్టైనా ఒక పురుషుడు తన భార్యను పరిత్యజించవచ్చా? అని అడిగారు. ఇది విడాకుల గురించిన ప్రశ్న. ప్రతీ సందర్భంలోనూ విడాకులు ఇవ్వొచ్చా లేక విడాకులు ఇవ్వడానికి ప్రత్యేకమైన కారణాలు ఏవైనా ఉండాలా? అని అడుగుతున్నారు. ఆయనను శోధించడానికి అలా అడుగుతున్నారు. వాళ్ళు విడాకుల గురించి అడిగారు కానీ ఆయన తన సమాధానం వివాహాన్ని నిర్వచించడంతో మొదలుపెట్టాడు. అందులో భాగంగా ఆయన ఏమన్నాడు అంటే - ".....దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను" (మత్తయి 19:6). దీని భావం - ప్రతీ వివాహంలోనూ జతపరిచే కార్యాన్ని దేవుడే చేస్తున్నాడు. ఇది మానవులు చేసే కార్యం కాదు. ఇది దేవుడే చేసే కార్యం. వివాహము ఏ పద్ధతిలో జరిగింది అన్నది ప్రశ్న కాదు. అది క్రైస్తవ వివాహమా, హిందూ వివాహమా, ముస్లిం వివాహమా లేక నాస్తిక వివాహమా అన్నది విషయం కాదు. అలాగే వివాహం చర్చ్ లో జరిగినా, గుడిలో జరిగినా, మసీదులో జరిగినా లేక రెజిస్ట్రార్ ఆఫీసులో జరిగినా, ఎక్కడ జరిగినా వివాహం అనేది ఒకటి జరిగుంటే, అక్కడ జతపరిచే కార్యం దేవుడే చేస్తున్నాడు. కాబట్టి వివాహము ఘనమైనది.

మూడవ కారణం

ప్రతి వివాహానికీ యెహోవాయే సాక్షిగా ఉన్నాడు.

మలాకీ 2:14 సందర్భంలో కొందరు అన్యాయంగా తాము పెళ్లి చేసుకున్న భార్యలను పరిత్యజించారంట."యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా" (మలాకీ 2:14). ఒక వివాహము జరిగింది అంటే, ఆ వివాహానికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. సంఘము కాదు, మనుషులెవ్వరూ కాదు దేవుడే సాక్షిగా ఉన్నాడు. పెళ్లిలో సాక్షి సంతకాలు పెట్టేవారు కూడా కాదు, ప్రతీ వివాహానికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. మిగతా సాక్షులందరూ చట్టపరంగా లేదా సామాజికంగా అవసరమే కానీ లెక్క అప్పజెప్పే విషయానికొస్తే ప్రతి వివాహానికీ దేవుడే సాక్షి. స్త్రీపురుషులు ప్రమాణాలు చేసి వివాహబంధంలోకి ప్రవేశిస్తుంటారు. దానికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. దేవుడు దేనికి సాక్షిగా ఉన్నాడో దానిని మనం ఘనమైనదిగా, గౌరవమైనదిగా ఎంచాలి. ఎవరైనా దాన్ని అగౌరవపరిస్తే వారు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినవారు అవుతారు. మూడవ ఆజ్ఞను అతిక్రమించినవారు అవుతారు - "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగానుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగానుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు." (నిర్గమ 20:7). ప్రతీ వివాహానికీ యెహోవాయే సాక్షిగా ఉన్నాడు గనుక వివాహము ఘనమైనది.

నాలుగవ కారణం

మానవ సంబంధాలన్నింటిలో వివాహాన్ని శ్రేష్ఠమైనదిగా, ఉన్నతమైనదిగా దేవుడు పరిగణించాడు.

ఆది 2:24లో "పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు" అని ఉంటుంది. తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్యన ఉండే బాంధవ్యం కంటే శ్రేష్టమైన సంబంధం ఇంకొకటి ఉందా? అని అడిగితే మనలో చాలామంది లేదు అని చెప్పొచ్చు. కానీ దేవుడు వివాహాన్ని దానికంటే శ్రేష్టమైన, ఉన్నతమైన బాంధవ్యంగా చేశాడు.

ఇది మన దేశంలో ఎక్కువగా కనపడకపోవచ్చు. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒక అన్యాయమైన వ్యవస్థ కనపడుతుంది. స్త్రీ మాత్రమే తన ఇంటివారందరినీ విడిచిపెట్టి పురుషుడి ఇంటికి వెళ్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది - "పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ...." అంటే పురుషుడు పెళ్లి చేసుకున్నాక ఇల్లరికం అల్లుడిగా వెళ్ళాలి అని బైబిల్ చెప్తుందా? అస్సలు కాదు. ఇదే బోధ బైబిల్ స్త్రీలకు కూడా చేస్తుంది. కీర్తన 45:10 - "కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము." ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అంటే - వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు ఇరువురూ ఒక ప్రత్యేకమైన కుటుంబము. వారిరువురు ఒకరినొకరు హత్తుకొని, ఏకశరీరంగా ఉండాలి. వారిరువురి మధ్యలో ఎవ్వరూ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. సహజంగానే తమ పిల్లలతో ఎంతో సాన్నిహిత్యంగల తల్లిదండ్రులు సైతం భార్యాభర్తల మధ్యలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. దేవుడు వివాహాన్ని అన్ని మానవ సంబంధాల్లోనూ అత్యున్నతమైనదిగా పరిగణించాడు కాబట్టి వివాహము ఘనమైనది.

ఐదవ కారణం

దేవుడు తనకూ తన ప్రజలకూ, క్రీస్తుకీ సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని సాదృశ్యపరచడానికి వివాహాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు.

దేవుడే తనకున్న ప్రేమను అలంకారప్రాయంగా వ్యక్తపరచడానికి వివాహాన్ని ఒక ఉదాహరణగా వాడుకున్నాడు అంటే దేవుని దృష్టిలో వివాహం అనేది ఎంత శ్రేష్ఠమైనదయ్యుండాలి. అంతేకాకుండా "ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది ...." అని రాయబడినది (ప్రకటన 19:6). ప్రభువు తన సంఘాన్ని కొనిపోవడానికి వచ్చే తన రాకడను గొర్రెపిల్ల వివాహోత్సవం అని అభివర్ణించడం ద్వారా వివాహాన్ని మరింత ఘనపరిచాడు.

ఆరవ కారణం

భార్యాభర్తలు ఎలా ఉండాలో నేర్పించే సందర్భంలో క్రీస్తుకూ సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని మాదిరిగా తీసుకోవాలి అని ఉపదేశించబడింది.

ఎఫెసీ 5:22-33లో ఈ సంగతులను చాలా స్పష్టంగా చూడగలము. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించి, దాని కోసం తన్ను తాను అప్పగించుకున్నాడో అలా భర్త త్యాగపూరితంగా తన భార్యను ప్రేమించాలి అని చెప్పబడింది. అలాగే భార్య తన భర్తకు ఎలా లోబడాలి అంటే సంఘము ప్రభువుకు ఎలా లోబడుతుందో అలాగే లోబడాలి అని చెప్పబడింది. క్రీస్తుకూ సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని మాదిరిగా చూపిస్తూ స్త్రీపురుషుల మధ్యనున్న వివాహ బాంధవ్యం కూడా అలాగే ఉండాలి అని చెప్పబడింది అంటే, వివాహము ఎంత ప్రశస్తమైనదో కదా. కాబట్టి వివాహము శ్రేష్టమైనది, ఘనమైనది.

ఏడవ కారణం

యేసుక్రీస్తు జారత్వము వల్ల పుట్టినవాడు అన్న అపవాదు నుండి ఆయనను కాపాడటానికి దేవుడు వివాహాన్ని సాధనంగా వాడుకున్నాడు.

యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరికి పుట్టాడు? కన్యకకు పుట్టాడు. అయితే ఆ విషయాన్ని ఈ లోకం అర్థం చేసుకోలేదు. అసలు ఆ విషయం మొదట మరియకు మాత్రమే తెలుసు. యోసేపు కూడా దేవుని దూత స్వయంగా కలలో కనపడి చెప్పిన తరువాతే నమ్మాడు. లేకపోతే నమ్మేవాడు కాదు. అతను అనుకున్న విధంగా రహస్యంగా ఆమెను విడనాడి ఉండేవాడు. లోకం దృష్టిలో యేసుప్రభువు కన్యక కుమారునిగా కాకుండా జారత్వము వల్ల పుట్టినవాడు అన్న అపవాదుకు లోనయ్యేవాడు. అలా జరగకుండా తన సొంత కుమారుణ్ణి ఆ అపవాదు నుండి కాపాడటానికి దేవుడు వివాహాన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు. మత్తయి 1:18-25 చూస్తే "....కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము..." అని చెప్పి దేవుడు ఆ వివాహాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా, దాన్ని ఒక సాధనంగా వాడుకొని ఈ లోకం తన కుమారునిపై మోపగలిగే అపవాదు నుండి ఆయనను తప్పించాడు.తరువాత ఒకానొక సందర్భంలో "ఇతడు వడ్లవాని కుమారుడు కాడా?" (మత్తయి 13:55) అని కొందరు అనుకోవడంలో ఇబ్బందేమీ లేదు. కానీ ఇతను ఒక జారిణి కుమారుడు కాదా? అని అనుంటే అది దేవుని కుమారునికి అవఘనత అయ్యుండేది. అటువంటి ఒక అవఘనత తన కుమారుడి మీద పడకుండా దేవుడు వివాహాన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి వివాహానికి మరింత ఘనత చేకూరింది.

ఎనిమిదవ కారణం

యేసుక్రీస్తు స్వయంగా తన సాన్నిధ్యాన్ని ఒక వివాహంలో ఉంచడం ద్వారా వివాహాన్ని ఆమోదించాడు

యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు తన మొట్టమొదటి అద్భుతాన్ని కానాలోని ఒక వివాహవిందులో చేశాడు. తన సాన్నిధ్యాన్ని బట్టి వివాహాన్ని తాను ఆమోదిస్తున్నాడని తెలియజెయ్యడం మాత్రమే కాకుండా, తన శక్తిసామర్థ్యాలను బట్టి, తన కనికరాన్ని బట్టి ఆ వివాహ విందులో ఏర్పడిన కొరత తీర్చడం ద్వారా వివాహాన్ని ఆయన మరింత ఆమోదించినట్లుగా మనకు తెలియజేశాడు. కాబట్టి వివాహము ఘనమైనది.

తొమ్మిదో కారణం

దేవుడు వివాహానికి ప్రత్యామ్న్యాయాలను నిషేధించాడు.

ఉదాహరణకు, సహజీవనం. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం. దేవుడు సహజీవనాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాడు. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నాడు. పాత నిబంధనలో అయితే అటువంటివారిని రాళ్లతో కొట్టి చంపేవారు. అలాగే స్వలింగ సంపర్కము అనే పాపాన్ని కూడా దేవుడు నిషేధించాడు. ఇటువంటివాటిని మన చట్టం, మన సంస్కృతి ఆమోదిస్తుందేమో కానీ బైబిల్ గ్రంథం ఆమోదించదు. వివాహానికి ప్రత్యామ్నాయాలను దేవుడు నిషేధించాడు, శిక్షించాడు ఎందుకంటే వివాహము మాత్రమే ఆయన దృష్టిలో ఘనమైనది.

పదవ కారణం

వివాహానికి వ్యతిరేకంగా చేసే పనులను దేవుడు ఎంతో తీవ్రమైన పాపాలుగా పరిగణించాడు. వాటిని బట్టి శిక్షిస్తాను అని కూడా హెచ్చరించాడు.

హెబ్రీ 13:4 - "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును." అలాగే మత్తయి 19:9 - "......వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను." ఇది యేసుక్రీస్తో, అపొస్తలులో ప్రవేశపెట్టిన కొత్త బోధ కాదు. మలాకీ 2:15,16 - "15. కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ......కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, ¸యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి........భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు......కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుకాకుడి." దేవుడు వివాహానికి వ్యతిరేకమైన పాపాలను ఖండించి, దాన్ని నాశనం చేసే దుష్కార్యాలను శిక్షార్హంగా ప్రకటించడం ద్వారా వివాహం ఎంతో ఘనమైనది అని మనకు తెలియజేశాడు. విడాకులకు కొన్ని న్యాయమైన కారణాలను బైబిల్ అనుమతిస్తుంది. అందులో కూడా ఎవరైతే ఆ పరిస్థితులకు కారకులు అయ్యారో వారిని నేరస్థులుగా, దేవునిబిడ్డలు కానివారిగా, కఠినహృదయులుగా, కొంచెమైనా దేవుని ఆత్మ లేనివారిగా పరిగణించిన తరువాతే బైబిల్ ఆ అనుమతిని ఇచ్చింది అని జ్ఞాపకం ఉంచుకోవాలి.

ఈ పది కారణాలను బట్టి, అనగా

  1. దేవుడే వివాహ వ్యవస్థను తయారు చేశాడు కాబట్టి,
  2. దేవుడే ప్రతి వివాహంలోనూ జతపరిచే కార్యం చేస్తున్నాడు కాబట్టి
  3. దేవుడే ప్రతి వివాహానికి సాక్షిగా ఉన్నాడు కాబట్టి
  4. మానవ సంబంధాలన్నింటి కంటే వివాహాన్ని ఘనమైనదిగా దేవుడు పరిగణించాడు కాబట్టి
  5. తనకూ తన ప్రజలకూ మధ్య ఉన్న సంబంధాన్ని సాదృశ్యపరచడానికి దేవుడు వివాహాన్ని ఉదాహరణగా వాడుకున్నాడు కాబట్టి
  6. క్రీస్తుకీ సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని మాదిరిగా తీసుకొని వివాహంలో స్త్రీపురుషులు వారి పాత్రల విషయమై ఒకరియెడల ఒకరు ఎలా నడుచుకోవాలో నేర్పించబడ్డారు కాబట్టి
  7. యేసుక్రీస్తు ప్రభువు రాకడకు దేవుడు వివాహాన్ని ఒక సాదృశ్యంగా వాడుకున్నాడు కాబట్టి
  8. యేసుక్రీస్తు స్వయంగా తన సాన్నిధ్యాన్ని ఒక వివాహంలో ఉంచడం ద్వారా వివాహాన్ని ఆమోదించాడు కాబట్టి
  9. వివాహానికి ప్రత్యామ్న్యాయాలను దేవుడు ఖండించి, తిరస్కరించాడు కాబట్టి
  10. వివాహానికి వ్యతికరేకంగా చెయ్యగలిగే పాపాలను దేవుడు శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించాడు కాబట్టి


"వివాహము అన్ని విషయములలో ఘనమైనది......." (హెబ్రీ 13:4). అందుకే వివాహము అన్నిట్లో ఘనమైనది అని కాకుండా "వివాహము అన్నీ విషయములలో ఘనమైనదిగా .... ఉండవలెను" అని ఆ వచనం చెప్తుంది. దేవుడు ఇన్ని నిదర్శనాలు ఇచ్చి ఘనమైనదిగా ఎంచినదానిని దేవునిబిడ్డలు కూడా ఘనమైనదిగానే ఎంచుతారు. యేసుక్రీస్తు దేన్నైతే ప్రేమించాడో, ఆమోదించాడో, ఘనపరిచాడో దాన్ని ఆయనకు చెందిన ఆయన శిష్యులు కూడా ప్రేమిస్తారు, ఆమోదిస్తారు, గౌరవిస్తారు, ఘనపరుస్తారు. దేవుడు ద్వేషించేవాటిని, వారు కూడా ద్వేషిస్తారు. ఇది దేవుని బిడ్డలకు ఉండే ఒక ఖచ్చితమైన లక్షణం. దేవుడు వివాహాన్ని ప్రేమించి దాన్ని ఘనమైనదిగా, ప్రశస్తమైనదిగా ఎంచాడు కాబట్టి దేవుని బిడ్డలు కూడా దాన్ని అలాగే ఎంచాలి. దేవుడు పరిత్యజించుటను అసహ్యించుకున్నాడు కాబట్టి దేవునిబిడ్డలు కూడా పరిత్యజించుటను అసహ్యించుకొని, వివాహం యొక్క ఘనతను తమ జీవితాంతము వరకూ కాపాడుకునేవారిగా ఉంటారు. అటువంటి కృప క్రీస్తునందున్న ప్రతి కుటుంబానికీ దేవుడు అనుగ్రహించును గాక.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప హితబోధ ఎప్పుడూ, ఎవ్వరి నుండీ ఆర్థిక సహాయం అంగీకరించదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.