నిజ క్రైస్తవ జీవితం

రచయిత: డి. యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 11 నిమిషాలు

ఆడియో

"పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక....." (మత్తయి 6:9).

ప్రపంచవ్యాప్తంగా సంఘచరిత్ర అంతటిలో ఎన్నిసార్లు ఎంతమంది ఈ ప్రార్థన చేశారో లెక్కలేదు. ప్రభువు నేర్పిన ఈ ప్రార్థనను చాలామంది చేసుండొచ్చు కానీ ప్రార్థన ఎలా చెయ్యకూడదో కూడా ప్రభువు నేర్పించారు. ఇంకా చెప్పాలి అంటే మొదట ఎలా ప్రార్థించకూడదో చెప్పి, ఆ తరువాత ఎలా ప్రార్థించాలో చెప్పారు.

పరిసయ్యుల ప్రార్థన - ప్రదర్శనగా చేసే ప్రార్థన

మొదటిగా పరిసయ్యునిలోని వేషధారణను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ 'పరిసయ్యుడు ప్రార్థించినప్పుడు ప్రార్థన చెయ్యాలనేది అతని కోరిక కాదు గానీ అందరూ తనని చూడాలన్నది అతని కోరిక' అని చెప్పాడు. ఒక పక్షి తోటి పక్షితో జత కట్టడం కోసం దాన్ని మెప్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగా కొన్ని పక్షులు పాడతాయి. మరి కొన్ని నాట్యం చేస్తాయి. అయితే ఎక్కడో పాడితే, ఇంకెక్కడో నాట్యం చేస్తే ఎలా? జతకట్టబోయేదాని ముందే ఆ విన్యాసాలన్నీ చెయ్యాల్సి ఉంటుంది. అచ్చం అలాగే పరిసయ్యులు కూడా ప్రజలంతా ఎక్కడ గుమికూడి ఉంటారో అక్కడ, అలాగే ఏ మార్గం గుండా ఎక్కువగా ప్రజలు తిరుగుతూ ఉంటారో, ఆ వీధి మూలల్లో నిలబడి అందరూ చూడాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ప్రార్థన చేస్తుంటారు. ఇది ప్రదర్శనగా చేసే ప్రార్థన. వీరిని చూపించి ప్రార్థన ఎలా చెయ్యకూడదో చెప్తూ -

"మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము..." అని అన్నాడు.

ఇలా పరిసయ్యుల లాగా ప్రార్థన చేసేవారు, ప్రజలు ప్రశంసించాలనీ, మెచ్చుకోవాలనీ, పొగడాలనీ చేస్తారు కాబట్టి తమ భాషా ప్రావీణ్యాన్నంతటినీ ఉపయోగించి, వీలైతే స్టేజీపైన, ఇంకా వీలైతే మైకులోనే తమ ప్రతిభనంతటినీ ప్రదర్శించడానికి దోహదపడే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా, భలే భక్తుపరుడు లేదా భక్తిపరురాలు అన్న పేరు సంపాదించుకోవడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇటువంటి వారు తమ భక్తి చేష్టలతో చూసేవారిని భ్రమపరచవచ్చేమో గానీ పై వాడిని మోసం చెయ్యలేరు.

ఇటువంటి ప్రార్థనకు యేసుప్రభువు వారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు.

"ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి - దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను" (లూకా 18:10-12).

ఈ పరిసయ్యుడు చుట్టూ ప్రజలు లేకపోయినా తనని తాను ఎంత హెచ్చించుకుంటున్నాడో చూసారా. అతని ప్రార్థన ఇలా ఉంది - 'దేవా, నీ దృష్టికీ, నా దృష్టికీ నేనెంత గొప్పగా కనబడుతున్నానో కదా. ఈ సుంకరిని అందరూ అసహ్యించుకుంటారు. యూదులేమీ, అన్యులేమీ అందరూ వీడిని ద్వేషిస్తారు. వీడిలా కాకుండా  నన్ను ఒక అద్భుతంలాగా చేసావు ప్రభువా. వారానికి కనీసం రెండు సార్లైనా నీ కోసం నా కడుపు ఆకలితో అలమటిస్తుంది. పుదీనాలోనూ, సోపులోనూ, జీలకర్రలోనూ తప్పక దశమభాగం ఇస్తాను.' ఇది ఆ పరిసయ్యుని ప్రార్థన.

అయితే "పాపినైన నన్ను కరుణించుమని" ప్రార్థించిన సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇటువంటి నీతిమంతులంతా 'నీతిమంతులు' అనే ఊరిలో ఉన్నారు అనుకుందాము. ఈ ఊరికి ఆ పరిసయ్యుడు ఉన్న ఊరు చాలా దూరంలో ఉంటుంది. చాలా మైళ్ళ దూరంలో ఉన్న 'స్వనీతిపరులు' అనే ఊరిలో పరిసయ్యులు ఉన్నారు. ఈ ఊరికీ ఆ ఊరికీ చాలా దూరం ఉంది. పరిసయ్యుడు ఆ ఊరిని విడిచి, క్రీస్తును ఆశ్రయిస్తే తప్ప ఈ 'నీతిమంతుల' ఊరికి చేరుకోలేడు.

ప్రియ చదువరీ, నీ ప్రార్థనాజీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. ఇతరులను మెప్పించాలి అని, మనుషుల దృష్టికి గొప్పగా భక్తి చేస్తున్నట్లు కనపరచుకోవాలన్న ఆరాటంతో ఉన్నావా? నీ రహస్య ప్రార్థనా జీవితం సంగతేంటి? సంఘంలోనూ, ఇతర కూడికలలోనూ నిలబడి ప్రార్థించేటప్పుడు నీ హృదయవైఖరి ఎలా ఉంటోంది? ఇతరులు గమనించాలని ఆశపడుతున్నావా? యేసుప్రభువు వారు చెప్తున్నారు - ఆ పరిసయ్యుల లాగా, ఆ వేషధారులలాగా ఉండకూడదు. ఎందుకంటే - 'వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను' (మత్తయి 6:5-6). ఇక వారికి ప్రభువు ఇవ్వాల్సింది ఏమీ మిగల్లేదు అనమాట. వారు పొందుకోవాలనుకున్నది ఏంటి - ప్రజల నుండి మెప్పు. దాన్ని వారు ఈ లోకంలోనే పొందుకొని ఉన్నారు. మరి అప్పుడు ప్రభువు దగ్గరి నుండి వారింకేం ఆశించగలరు. ఇలా కాకుండా "నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును" (మత్తయి 6:6).

అన్యుల ప్రార్థన - అర్థంలేని ప్రార్థన.

కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ చేస్తూ చివరికి ఆమెన్ చెప్పి ముగించిన తరువాత ఇంతకీ నువ్వు ఏ అంశాల గురించి ప్రార్థించావో మర్చిపోయిన సందర్భాలు కలవా? అప్పుడు నువ్వు కేవలం నీ పెదవులతో మాత్రం ప్రభువు ఘనపరిచినట్లు, నీ హృదయం దేవునికి దూరంగా ఉంది. ఏదో పాఠం అప్పజెప్పినట్లు చెప్పేసావు అంతే. నువ్వు ఎలా ప్రార్థన చెయ్యకూడదో యేసు ఇంకా చెప్తూ, 

"మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;"

అన్యులు వ్యర్థమైన మాటలు వచిస్తారు అని చెప్పబడింది. 'వ్యర్థమైన మాటలు' అంటే మూల భాషలో 'అర్థం లేని మాటలు' అన్న భావం వస్తుంది. అన్యులు ఎలాగైతే మంత్రాలు జపిస్తుంటారో, వాటి అర్థం తెలియకపోయినా ఎలా పదే పదే వాటిని వల్లిస్తుంటారో అలా క్రైస్తవులు ప్రార్థనలు వల్లిస్తుంటారు. ఇటువంటి ప్రార్థన ఒకటి 1 రాజులు 18:26లో చూస్తాము. 'ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు - బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి.'

ఇలాగ మనం ప్రార్థించకూడదని యేసు కోరుకుంటున్నాడు. మనం రాళ్ళకీ, రప్పలకీ, పుట్టలకీ చెట్లకీ, సూర్యుడికీ, దిక్కులకూ మొక్కకపోయినా, మనం ఆరాధిస్తుంది నిజమైన దేవుణ్ణే అయినా, అది వ్యర్థమైన మాటలతో చెయ్యకూడదు. చాలాసార్లు భోజనం గురించి ఇటువంటి ప్రార్థన చేస్తుంటాము. నీ పెదవులు ఏవో భక్తి మాటలు పలుకుతాయి కానీ నీ మనస్సు ఎక్కడో ఉంటుంది. అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు, అసలు అది ప్రార్థనే కాదు.

ఇటువంటి ప్రార్థనల్లో ఉన్న మరో కోణం ఏంటి అంటే - పదే పదే అడగడం వల్ల దేవుడు తమ మొర ఆలకిస్తాడు అనీ, తమ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడనీ అనుకోవడం. అన్యులకు వారి దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో, ఆయన ఎలా ఆలోచిస్తాడో తెలియదు గనుక వారు రకరకాల పద్ధతుల్లో ప్రార్థిస్తుంటారు. ఘోర తపస్సే చేస్తారా, కఠోర దీక్షే చేస్తారా, ఉపవాసాలే చేస్తారా, జపమే చేస్తారా, ఏదో ఒకటి చేసి తమ దేవుడు తమ మొర వినేలా, ఆయన దృష్టి వారిపై పడేలా చెయ్యాలని కిందామీదా పడుతుంటారు. అందుకని వారి ప్రార్థనలు విస్తారంగా ఉంటాయి. అసలు దేవుడికి నా మొర వినబడుతుందో లేదో అన్న అభద్రతాభావం వారికి ఉంటుంది. చాలాసార్లు ప్రార్థన చేస్తే, ఎప్పటికైనా దేవుడికి నా మొర వినబడుతుంది అని ఆశిస్తారు. "విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;" కానీ యేసు చెప్తున్నాడు - "మీరు వారివలె ఉండకుడి." ఎందుకో కారణం కూడా చెప్తూ "మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును"(మత్తయి 6:8). నీ తండ్రి సింహాసనం దగ్గరికి నువ్వు ఇంకా వెళ్లకముందే, ఆయనకు తెలుసు. ఆయన నీ అక్కరలన్నీ బాగుగా ఎరిగినవాడు. ఆయన దృష్టి నీ మీద నుండీ తొలిగిపోదు. అన్యులు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తారు, కానీ నీవు నీ పరమతండ్రిని ఆరాధిస్తున్నావని జ్ఞాపకం ఉంచుకో.

ఈ విధంగా ఎలా ప్రార్థించకూడదో తెలిపిన పిదప, ఎలా ప్రార్థించాలో నేర్పించారు ప్రభువు.

క్రైస్తవుల ప్రార్థన - క్రీస్తు మెచ్చే ప్రార్ధన

"కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి," అని మొదలుపెడుతూ ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పడం ప్రారంభించారు. అయితే ఇంతకముందు పరిసయ్యుల లాగా చెయ్యొద్దని, అన్యుల లాగా చెయ్యొద్దని చెప్పిన ప్రభువు, ఖచ్చితంగా అందుకు పూర్తి భిన్నంగా ప్రార్థించమనే చెప్పుంటాడు కాబట్టి ఆ కోణంలోనే ప్రభువు నేర్పిన ఈ ప్రార్థనను అర్థం చేసుకుందాము.

ముందుగా, వేషధారుల ప్రార్థనకు భిన్నంగా ఇలా ప్రార్థించమని బోధించాడు,

"పరలోకమందున్న మా తండ్రీ,

నీ నామము పరిశుద్ధపరచబడు గాక,

నీ రాజ్యము వచ్చుగాక,

నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక," (మత్తయి 6:9-10).

ఈ ప్రార్థనలో 'నీ నామము'; 'నీ రాజ్యము'; 'నీ చిత్తము' అన్న మాటలను బట్టి యేసు తన శిష్యులకు నేర్పించాలనుకుంటున్న విషయం ఏంటి అంటే - ఎంత సేపు నువ్వు కాదు, నీ గురించి కాదు, దేవుణ్ణి ఎక్కువుగా మహిమపరచడం నేర్చుకోవాలి. ఎంత సేపు మనల్ని మనం హెచ్చించుకోవడం, మన రాజ్యాలు కట్టుకోవడం గురించీ, మన నీతిని ఘనపరుచుకుంటూ, దానిని బట్టి అతిశయపడటం కాకుండా దేవుణ్ణి ఎక్కువగా ఘనపరచడం, ఆయనను స్తుతించడం చెయ్యాలి. కేవలం నోటి మాటలతో, పెదవులతో కాకుండా హృదయంలో నుండీ రావాలి మన ప్రార్థన. అటువంటి ప్రార్థన వింటున్న వేషధారులు సైతం ప్రభువును ఆరాధించేవారిగా రూపాంతరంగా చెందవచ్చు. మన ప్రార్థన ఎంత సేపూ మన చుట్టూ కాకుండా దేవుని చుట్టూ తిరగాలి. ప్రభువును మాత్రమే మహిమ పరచాలి అన్న యథార్థమైన కోరిక నిజంగా నీకుంటే, రహస్య ప్రార్థనను కూడా నువ్వెంతో ప్రేమిస్తావు.

రెండవదిగా, అన్యుల ప్రార్థనకు భిన్నంగా ఇలా ప్రార్థించమని చెప్పాడు యేసు -

"మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము

మా ఋణములు క్షమించుము.

మమ్మును శోధనలోకి తేక

దుష్టునినుండి మమ్మును తప్పించుము" (మత్తయి 6:11-13).

గురకపెట్టి నిద్రపోతున్న దేవుణ్ణి లేపుతున్నట్లుగా కాక, తెలియని దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా కాకుండా, నీ పరలోక తండ్రిని అడుగుతున్నట్లుగా ప్రార్థించాలి. ఎక్కువసార్లు అడిగితే నేను అడిగింది ఇచ్చేస్తాడేమో అన్నట్లుగా కాకుండా, పదే పదే విస్తారంగా మాట్లాడి దేవుణ్ణి మెప్పించాలన్నట్లుగా కాకుండా చిన్న పిల్లల వలె, మనం చేసే క్లుప్తమైన ప్రార్థనలను సైతం దేవుడు లక్ష్యపెడతాడు (గ్రీకులో మత్తయిలోని ఈ ప్రార్థన మొత్తంగా 57 పదాలు, లూకా సువార్తలోని ఈ ప్రార్థన మొత్తంగా 38 పదాలు). ఆయన ముందుగానే మన అవసరతలన్నీ ఎరిగియున్నాడని మరువకండి. అయితే తన పిల్లలు వారి అవసరాల కోసం, తమ మనస్సులో ఉన్న కోరికలు, బాధలు చెప్పుకోవడం కోసం తన వద్దకు రావాలనీ, తనను అడగాలనీ ప్రభువు కోరుకుంటున్నాడు.

ముగింపు

ఎలా ప్రార్థించాలో బాగా తెలుసుకోవాలి అంటే ఎలా ప్రార్థించకూడదో కూడా తెలుసుకోవాలి. మనల్ని మనం హెచ్చించుకునే విధంగా కాకుండా, రహస్యంగా, దేవుణ్ణి హెచ్చిస్తూ ప్రార్థిద్దాము. ఆయనను మాత్రమే మహిమపరుద్దాము. వ్యర్థమైన మాటలతో, విస్తారమైన మాటలతో కాకుండా మన అనుదినాహారం కోసమూ, పాపక్షమాపణ కోసమూ ప్రార్థిద్దాము. దేవుడు మన అవసరాలన్నీ ఎరిగినవాడూ, మనకు క్రీస్తు నందు పాప క్షమాపణ అనుగ్రహించియున్నాడు అన్న గ్రహింపు కలిగి ప్రార్థిద్దాము.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.