రక్షణ

రచయిత: కె. నరసింహుడు

ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను గురించిన విస్తారమైన దుర్బోధలను మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా అవేంటంటే;

1. రక్షణ పొందితే సరిపోదు, పరిశుద్ధాత్ముడి కోసం కొంతకాలం కనిపెట్టి ఆయనను పొందుకోవాలి. దాని కోసం ప్రార్దన చేయాలి. లేకపోతే దైవజనుడు హస్త నిక్షేపణ చేయాలి. అలా చేసి పరిశుద్ధాత్మను పొందుకుంటేనే తప్ప సంపూర్ణ సువార్తను నమ్మినట్టు కాదు.

2. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కచ్చితంగా బాషలతో మాట్లాడాలి. ఇంకా అనేకమైన మనవాతీతమైన అద్భుతవరాలను కలిగి ఉండాలి.

ఇలాంటి దుర్బోధలు మనం చాలా చూస్తుంటాం. అందుకే వాటన్నిటికీ బైబిల్ నుండి సమాధానం‌ పొందుకునే క్రమంలో పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా? అనే అంశాన్ని ఇప్పుడు చర్చించుకుందాం. నిజానికి పరిశుద్ధాత్మను పొందుకోవడం అన్నా లేక పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అన్నా రెండూ ఒక్కటే. ఆవిధంగా ఈ అంశంలో మనం చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను చూస్తాం.

మొదటిగా : పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి?
రెండవదిగా : సంఘ ప్రారంభ దినాలలో అనగా అపోస్తలుల కాలంలో ఉన్న పరిశుద్దులు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకున్నారు?
మూడవదిగా : ఇప్పుడు ఈ కాలంలో ఉన్న పరిశుద్దులు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకుంటున్నారు?

1. పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి?

"మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను" (మత్తయి 3:11).

ఈ వాక్యభాగంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను నేనైతే మీకు నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెబుతున్నాడు. గమనించండి. ఇక్కడ రెండు రకాల బాప్తీస్మాలను చూస్తున్నాం. ఒకటేమో ఆత్మ బాప్తిస్మం అంటే యేసు ప్రభువునందు విశ్వాసముంచే వారందరూ కూడా ఈ ఆత్మ బాప్తిస్మాన్ని పొందుతారు. ఆయనయందు రక్షణకరమైన విశ్వాసముంచి, పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉండే వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇలా నమ్మడానికి ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి.

"నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు" (యోహాను 7:38,39).

ఈ సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా తన యందు విశ్వాసముంచే వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుతారు. లేదా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని చెబుతున్నాడు. ఇంకా 39వ వచనం రెండవ భాగాన్ని గమనిస్తే "యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు" అంటూ అది ఎప్పటి నుండి జరుగుతుందో కూడా స్పష్టంగా సూచించబడింది. ఆ మాటల ప్రకారం; యేసుప్రభువు సర్వమానవాళి కోసం ప్రాయశ్చిత్తం చేసి, దేవుని న్యాయాన్ని తృప్తిపరచి, మరణించి, తిరిగి లేచిన తర్వాత అనగా ఆయన మహిమపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు.

ఇక రెండవదిగా యోహాను ఆయన అగ్నితో కూడా బాప్తిస్మం ఇస్తాడు అని చెబుతున్నాడు. చాలామంది ఈ అగ్ని బాప్తిస్మం మరియు పరిశుద్దాత్మ బాప్తిస్మం ఒక్కటే అని పొరబడుతుంటారు. కానీ అసలు ఈ అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో యోహాను గారే 12వ వచనంలో స్పష్టతను ఇస్తున్నారు చూడండి "ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను" (మత్తయి 3:12).

ఇక్కడ ఆయన గోధుమలను కొట్టులో పోయడం అని విశ్వాసుల భద్రతను ఉద్దేశించి, అలానే ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని అవిశ్వాసులు పడద్రోయబడే నరకాగ్నిని ఉద్దేశించీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కేవలం రెండు వర్గాల ప్రజలే ఉన్నారు. మొదటి వర్గమేమో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటే రెండవ వర్గమేమో అగ్ని బాప్తిస్మాన్ని పొందుకుంటారు. ఆవిధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలు ఈ రెండింటిలో ఏదో ఒక బాప్తిస్మాన్ని కచ్చితంగా పొందుకుంటారు. ఇక మూడవ వర్గమంటూ ఏదీ ఉండదు. ఈ వాక్యభాగాలు చూడండి.

రోమీయులకు 8:9
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

యోహాను 14:17
లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

ఈ వాక్యభాగాల ప్రకారం; పరిశుద్దులు అందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు.‌ కానీ లోకం ఆయనను కలిగి ఉండదు. ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు అనంటే అసలు అతను దేవుని సంబంధే కాదు అని అర్థం. అతను చనిపోతే నిత్య నరకానికే పోతాడు. ఇది మన నిత్యత్వానికి సంబంధించింది కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైనదని గ్రహించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వ్యక్తి మాత్రమే నిత్య రాజ్యంలో ఉంటాడు.

2. సంఘ ప్రారంభదినాల్లో అనగా అపోస్తలుల కాలంలో ఉన్న పరిశుద్దులు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకున్నారు?

అపొస్తలుల కార్యములు 1:4-8
ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయందురని వారితో చెప్పెను.

ఇవి యేసు ప్రభువు తన ఆరోహణానికి ముందుగా తన శిష్యులతో పలికిన మాటలు. ఇందులో ఆయన యోహాను‌ ఐతే నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చాడు కాని మీరైతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని అందుకోసం కనిపెట్టమని చెబుతున్నాడు. ఇక్కడ యెరుషలేములోనే ఉండి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని ఎవరికి చెబుతున్నాడు? అందరికీ చెబుతున్నాడా? ఒకవేళ అందరికీ ఐతే, రక్షణ పొందాక కూడా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టేవారంతా యెరుషలేము వెళ్ళాలిగా మరి? కాబట్టి ఆయన కేవలం అక్కడ ఉన్న 120 మంది శిష్యులతోనే ఈ మాటలు చెబుతున్నాడు. అంతేకాకుండా మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తితో మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకూ నాకు సాక్షులయి ఉంటారు అని కూడా చెబుతున్నాడు.

ఈమాటలను మనం బాగా పరిశీలిస్తే మూడు గుంపుల ప్రజలను ఇక్కడ చూస్తున్నాం.

1. యెరూషలేము యూదయ (ఈ గుంపులో ఉన్న వారందరూ కూడా ఇశ్రాయేలీయులు).
2. సమరయ (ఈ గుంపులో ఉన్న వారందరూ సమరయులు అంటే సగం యూదులు మరియు సగం అన్యులు).
3. భూదిగంతముల వరకు (ఈ గుంపులో ఉన్న వారందరూ అన్యులు).

ఈ అపొస్తలుల-కార్యముల గ్రంథంలోనే మనం ఈ మూడు గుంపుల ప్రజలూ పరిశుద్ధాత్మను పొందుకోవడాన్ని చూస్తాం.

మొదటి గుంపుయైన ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్బం గురించి అపొస్తలుల-కార్యములు 2:1-4 లో మనం చూస్తాం.

"పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి"

వీరందరూ కూడా యేసుప్రభువు పరిచర్య ద్వారా రక్షణ పొంది ఆయన చెప్పిన విధంగా యెరుషలేములో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారిలో పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్నవారు ఒక్కరు కూడా లేరు, అందరూ పొందుకున్నారు. దీని తర్వాత వీరి పరిచర్య ద్వారానే ఇశ్రాయేలీయులు చాలామంది రక్షణ పొందారు. గమనించండి వారందరూ కూడా విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. విశ్వాసముంచి, రక్షణ పొంది ఇంకా పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్న ఇశ్రాయేలీయుడు ఒక్కరు కూడా లేరు.

రెండవ గుంపుయైన సమరయులు పరిశుద్దాత్మను పొందుకున్న సందర్బం గురించి అపొస్తలుల-కార్యములు 8:16 -17 లో మనం చూస్తాం.

"అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండ లేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి"

ప్రారంభంలో విశ్వాసులందరూ యెరుషలేము లోనే ఉండేవారు. అయితే యెరూషలేములోని సంఘానికి గొప్పహింస కలిగినప్పుడు, అపొస్తలులు తప్ప మిగిలిన అందరూ ఆయా ప్రాంతాలకు చెదరి పోయారు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకూ వెళ్ళి సువార్త ప్రకటించాడు. వెంటనే అనేక మంది నమ్మి బాప్తిస్మం పొందారు. కానీ వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. “అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు” ఇక్కడ వారు అంటే ఎవరు? సమరయులు. వారు పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోలేదు అంటే ఆ కార్యం అపోస్తలుల సమక్షంలోనే జరగాలి, వారు మాత్రమే నిర్ధారణ చెయ్యాలి కాబట్టి అపొస్తలులు వచ్చే వరకూ కూడా పరిశుద్ధాత్మ వారిలో ఎవరి మీదికీ దిగియుండలేదు. ఎప్పుడైతే పేతురు యోహానులు సమరయకు వెళ్ళి వారి మీద చేతులు ఉంచి ప్రార్ధించారో సమరయలో ఉన్న ఆ విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడం చూస్తున్నాం.

గమనించండి. ఇక్కడ కూడా సమరయ విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారిలో కొందరు పొందుకోవడం, కొందరు పొందుకోకపోవడం వంటిది జరగలేదు. యెరుషలేము యూదయ విశ్వాసులకు ఏవిధంగానైతే జరిగిందో వీరికి కూడా అదేవిధంగా జరిగింది. ఈవిధంగా ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు మరియు సమరయులు కూడా పొందుకున్నారు.

ఇక మూడవ గుంపుయైన అన్యజనులు పరిశుద్ధాత్మను పొందుకునే సందర్భం గురించి అపొస్తలుల-కార్యములు 10 వ అధ్యాయంలో మనం చూస్తాం.

"పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను"

ఈ సందర్భాన్ని పరిశీలిస్తే; కైసరయలో కొర్నేలీ అనే ఒక శతాధిపతి ఉంటాడు. ఇతను భక్తిపరుడే కానీ రక్షించబడినవాడు కాదు. ఇతని భక్తి లూదియాలా యూదా మతసంబంధమైనది (అపొ.కా 16:13,14). అందుకే దేవుడు ఒక దూతను ఇతని దగ్గరికి పంపించి ఏ మాటల ద్వారా ఐతే కొర్నేలీ రక్షణ పొందుతాడో ఆ మాటలు చెప్పే పేతురును పిలిపించుకోమంటాడు. వెంటనే కొర్నేలీ తన పని వారిని పంపించి పేతురును తీసుకురమ్మంటాడు. ఈలోగా అతను తన బందువులందరినీ పిలిపించుకుని పేతురు రాగానే ఆయన చెప్పే వాక్యం వినడానికి సిద్దంగా ఉంటాడు. పేతురు వస్తాడు. పేతురు వచ్చి పాప క్షమాపణ గురించి బోధించగానే ఆ బోధ విన్నవారందరి మీదకూ పరిశుద్ధాత్ముడు దిగివస్తాడు. ఇక్కడ విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్ముడు అన్య విశ్వాసులందరిలోకి దిగి రావడం చూస్తున్నాం. సమరయుల విషయంలో మాత్రమే వారు విశ్వాసముంచిన సమయానికి మరియు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మధ్య కొంచెం సమయం పట్టింది (దానికి కారణం కూడా వివరించుకున్నాం). ఇక్కడైతే అలాంటిదేమీ చూడము. ఆ అన్యజనులు వాక్యం విన్నారు. వింటూ ఉండగానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎందుకంటే ఇది ఒక అపోస్తలుని సమక్షంలో జరిగింది. ఇక్కడ కూడా విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కొందరు పొందుకోవడం, కొందరు పొందుకోకపోవడం, కనిపెట్టడం అనేది జరగలేదు. అలానే సమరయులు కూడా ఆయనకోసం కనిపెడితే వారిపైకి దిగిరాలేదు. అపోస్తలులు చేతులుంచగానే దిగివచ్చాడు.

ఈ విధంగా మూడు గుంపుల ప్రజలకూ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడటం చూస్తున్నాం. మొదటిగా ఇశ్రాయేలీయులు, రెండవదిగా సమరయులు, మూడవదిగా అన్యజనులు. మొదటిగా ఇశ్రాయేలీయులులందరూ అపోస్తలులతో సహా వారి సమక్షంలోనే అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. రెండవదిగా సమరయులు బాప్తిస్మం పొందిన తర్వాత అపోస్తలుల సమక్షంలోనే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మూడవదిగా అన్యజనులు బాప్తిస్మం కూడా పొందకుండానే అపోస్తలుని సమక్షంలోనే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వాక్యంలో పరిశుద్ధాత్మను పొందుకున్న ఇంకొక సందర్బాన్ని కూడా చూస్తాం. వారు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా మారుమనస్సు పొందిన వారు. ఇప్పుడు వీరు మాత్రమే మిగిలిపోయారు. వీరి విషయంలో కూడా దేవుడు పౌలు యొక్క అపోస్తత్వాన్ని నిర్దారించడానికే అలా అనుమతించాడు. అలానే వీరికి యేసు ప్రభువు మరణపునరుత్థానాల గురించి కాని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి కాని తెలియదు.

అపొస్తలుల-కార్యములు 19:1-6
అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి. అందుకు పౌలుయోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.

పౌలు తన‌ సువార్త పరిచర్యలో భాగంగా అనేక ప్రదేశాలు తిరుగుతూ ఎఫెసునకు వచ్చాడు. అక్కడ కొంతమంది యోహాను శిష్యులు ఉన్నారు. వీరిలో ఇశ్రాయేలీయులు ఉండవచ్చు, అన్యులు కూడా ఉండి ఉండవచ్చు. పౌలు వారిని చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు. అయితే వారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని చెప్పారు. ఈ మాటలను బట్టి చాలామంది అసలు వారికి పరిశుద్ధాత్ముని ఉనికే తెలియదని, వారు అవిశ్వాసులని పొరబడుతూ ఉంటారు. నిజానికి పౌలు ఆ స్థలానికి రాకముందే వారు నిజమైన దేవునియందు విశ్వాసముంచారు అని రాయబడి ఉంది. అందుకే పౌలు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని ప్రశ్నించాడు. అంతేకాకుండా వీరు బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు. యోహాను బోధల్లో కూడా మనం పరిశుద్ధాత్ముని గురించి చదువుతాం.

మత్తయి 3:11-12
ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.

యోహాను రాబోయే క్రీస్తు గురించి ముందుగానే తన శిష్యులకు పరిచయం చేస్తూ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని బోధించేవాడు. కాబట్టి ఈ విషయాలన్నీ యోహాను శిష్యులకు తెలుసు కానీ అది ఎప్పుడు నెరవేరిందో అది వారికి తెలియదు. అందుకే వారు ఆ మాటలను ఆయన మన మధ్యలోనే ఉన్నాడనే సంగతి మాకు తెలియదనే భావంలో పలికినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాతనిబంధనలో కూడా చాలా చోట్ల పరశుద్ధాత్ముని యొక్క ప్రస్తావనను మనం చూస్తాం. అయితే వారికి కేవలం యోహాను బోధలు మాత్రమే తెలుసు. దేవుని వాగ్దానం నెరవేరిన సంగతి తెలియదు కాబట్టి వారు అపోస్తలుని సమక్షంలో పరిశుద్ధాత్మను పొందవలసిన అవసరత ఉంది. అప్పుడు పౌలు పరిశుద్ధాత్మ గురించి వారికి బోధించి ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం ఇచ్చి వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్ముడు వారిమీదికి దిగి వచ్చాడు. ఈవిధంగా అక్కడున్న యోహాను శిష్యులు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నారు.

ఇలా మూడు గుంపుల ప్రజలూ అలాగే మిగిలి ఉన్న యోహాను శిష్యులు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నారు. ఈ ప్రపంచంలో ఈ మూడు రకాల ప్రజలే ఉంటారు కాబట్టి ఈ మూడు సందర్భాల్లో వేరువేరుగా వీరందరూ అపోస్తలుల సమక్షంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పౌలు కూడా పేతురు వంటి అపోస్తలుడే అనడానికి కూడా ఈ ఎఫెసులోని యోహాను శిష్యుల సంఘటన మంచి ఆధారంగా ఉంచబడింది (గలతీ 2:8, 2 కొరింథీ 12:12). అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడిన సంగతి వారికి ఎలా అర్థమైంది? అనే సందేహం వస్తుంది. మొదటి శతాబ్దంలో మనవాతీతమైన సూచనల ద్వారా దేవుడు వారికి రూఢి పరచేవాడు. అందులో భాగంగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే వారు అన్యబాషలతో మాట్లాడేవారు. ఇదే వారికి సూచనగా ఉండేది. ఆ నిర్థారణ కూడా అపోస్తలుల సమక్షంలోనే జరగాలి అందుకే అపోస్తలుల సమక్షంలోనే ఈ మూడు రకాల ప్రజలూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు.

ఇంతవరకూ మనం పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలో, అలానే సంఘప్రారంభంలో ఉన్న మూడు గుంపుల విశ్వాసులూ ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్నారో కూడా చూసాం. ఇప్పుడు;

3. ఈ కాలంలో ఉన్న విశ్వాసులు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకుంటున్నారు? అనే దానిని కూడా చూద్దాం.

గమనించండి. ఎప్పుడైతే ఒక గుంపుకి చెందిన ప్రజలు అపోస్తలుల సమక్షంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ తర్వాత నుండి ఆ గుంపులోని ఇతర ప్రజలు ఎవరైనా రక్షణ పొందినప్పుడు వారు విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకునేవారు. ఇక దానికి అపోస్తలుల సాక్ష్యం అవసరం లేదు. ఉదాహరణకు పౌలు నేరుగా ప్రభువైన యేసు ద్వారా సువార్త విని రక్షణను పొందాడు. అతను ఇశ్రాయేలీయుడు, ఇంతకుముందే ఈ గుంపు వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు కాబట్టి పౌలు విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. తాను ఈవిధంగా విశ్వసించిన వెంటనే పరిశుద్దాత్మను పొందుకున్నాడు కాబట్టే ఎఫెసులో ఉన్న యోహాను శిష్యులను “మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని ప్రశ్నించాడు. అంతేకాకుండా పౌలు ఎఫెసు పత్రిక రాస్తూ అందులో మనం ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటామో కూడా వివరిస్తున్నాడు.

ఎఫెసీయులకు 1:13
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

ఈ మాటల్లో అతను ఎంతో స్పష్టంగా విశ్వాసులు రక్షణ సువార్త విని, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటారని చెబుతున్నాడు. బాప్తిస్మం తర్వాత సేవకుడు (పాస్టర్) చేతులుంచి ప్రార్థన చేస్తే అప్పుడు పొందుకుంటారు అని చెప్పడం లేదు. లేదా వారు రక్షణ పొందిన తర్వాత కనిపెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడడానికీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మధ్య ఎలాంటి సమయం ఉండదు. విశ్వాసముంచడం, రక్షణ పొందటం, తిరిగి జన్మించడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం అన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇది అంతరంగంలో జరిగే దేవుని కార్యం. అయితే మన అంతరంగంలో జరిగిన ఆ కార్యానికి నిదర్శనంగా మనం దేవుని వాక్యానికి విధేయత చూపించాలి అనే తీర్మానం ప్రతీ విశ్వాసిలోనూ ఉంటుంది. పరిశుద్ధమైన జీవితం అప్పటి నుండి ప్రారంభం ఔతుంది. అంతేతప్ప బాప్తిస్మం తర్వాత కాదు. వాక్యానికి విధేయత చూపడంలో భాగంగానే, రక్షణ పొందిన వారు నీటి బాప్తిస్మం ద్వారా సాక్ష్యమివ్వాలి అని వాక్యం చెబుతుంది కాబట్టే నీటి బాప్తిస్మం తీసుకుంటాం తప్ప పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కాదు‌ (ఈ వ్యాసం చదవండి - బాప్తిస్మం ద్వారా రక్షణ వస్తుందా?).

అంతేకాకుండా పౌలు ఆయా సంఘాలకు‌ పత్రికలు రాస్తున్నప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నవారిగానే వర్ణించాడు. అందుకే కొరింథీ వారిని "మీరు దేవుని ఆలయమై యున్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని" (1 కొరింథీ 3:16) ఆ కారణాన్ని బట్టి వారు పరిశుద్ధంగా జీవించాలని హెచ్చరించాడు. థెస్సలోనిక వారిని మీరు పాపం చేస్తే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఖపడతాడని (ఎఫెసీ 4:30) కాబట్టి పాపం చెయ్యవద్దని బోధించాడు. యోహాను కూడా తన పత్రికలో “మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు” (1 యోహాను 4:4) అని పరిశుద్ధాత్ముడి గురించి చెప్పడం చూస్తాం. పౌలు ఐనా యోహాను ఐనా మరెవరైనా సరే విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నవారిగానే చూసారు. ఒకవేళ రక్షణతో పాటుగా ఆయనను పొందుకోకపోతే, ఆయనకోసం‌ మళ్ళీ ప్రత్యేకంగా కనిపెట్టవలసి వస్తే వారు కచ్చితంగా చెప్పి ఉండేవారు కదా!. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఒక వ్యక్తి నిత్యత్వానికి సంబధించింది కాబట్టి, రక్షణ పొందితే సరిపోదు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, ప్రార్దన చెయ్యండి అని తప్పకుండా చెప్పేవారు. కానీ వారు అలా చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ఒకవ్యక్తి విశ్వసించిన వెంటనే పరిశుద్దాత్మను పొందుకుంటున్నాడు.

కాబట్టి ఈ కాలంలో ఉన్న పరిశుద్ధులు కూడా విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. వారు బాషలతో మాట్లాడవలసిన అవసరం లేదు. మళ్ళీ అపోస్తలుల సమక్షంలో సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం అంతకన్నా లేదు.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప హితబోధ ఎప్పుడూ, ఎవ్వరి నుండీ ఆర్థిక సహాయం అంగీకరించదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.