రక్షణ

రచయిత: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 14 నిమిషాలు
ఆడియో

జన్మ పాపం min

విషయసూచిక

  1. ప్రశ్న
  2. ప్రశ్న
  3. ప్రశ్న
  4. ప్రశ్న
  5. ప్రశ్న
  6. ప్రశ్న
  7. ప్రశ్న
  8. ప్రశ్న

ఏ బేధము లేకుండా అందరూ పాపము చేస్తున్నారన్నది వాస్తవమైతే, పాపము ఓ అలవాటు కాదు, స్వభావమే అని వేరే చెప్పనవసరం లేదు. అందరిలో, అంతటా, అన్ని కాలాలలో కనిపించేదే పాపస్వభావము అన్న జోనాథన్ ఎడ్వర్డ్స్ గారి నిర్వచనం ఇక్కడ సమయోచితమైనది. మానవుడు స్వభావసిద్ధంగా పాపి అవ్వడానికి గల కారణాన్ని క్రైస్తవ దృక్పథంలో తెలియజేసే సిద్ధాంతమే 'జన్మపాప సిద్ధాంతము'. జన్మపాపం అంటే 'నా జన్మే పాపం' అని అర్థం కాదు కాని 'నేను జన్మతః పాపినని' అర్థం. మనం పాపం చేస్తున్నందుకు పాపులము కాదు కానీ పాపులం కాబట్టి పాపం చేస్తున్నామని ఈ సిద్ధాంతం వాక్యానుసారంగా నిర్ధారిస్తుంది. జన్మపాపం అనేది మనలో ఉన్న పాపానికి మూలం కాబట్టి దీన్ని 'మూలపాప'మని కూడా పిలుస్తారు. నేడు అనేకులు ‘జన్మపాపం' అనే మాటను ఆసరాగా చేసుకుని కల్పించిన అపార్థాల నేపథ్యంలో “మూలపాపం” అన్న పదం వాడటం మరింత సబబు. అదే 'ఒరిజినల్ సిన్' అని చారిత్రకంగా సంఘం వినియోగించిన మాటకు సరైన అనువాదం.

ఆదాము పాపం, తనతోపాటు తన సంతానాన్ని కూడా పతనానికి గురిచేసింది (రోమా 5:12-19). ఆదామును పోలి పాపము చేయని తన సంతతి వారందరికీ అతని పాపపర్యావసానమైన మరణం సంప్రాప్తించింది (వ.14). వారు స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులుగా తీర్చబడ్డారు (ఎఫెసీ 2:3). మనమికను పుట్టి మేలైనను కీడైనను చేయకుముందే క్రీస్తు మనకొరకు చనిపోయినప్పటికీ, మనం అప్పుడే భక్తిహీనులమని, పాపులమని, దేవునికి శత్రువులమని వాక్యము సెలవిస్తుంది (రోమా 5:6,8,10) భక్తిహీనులమైన మనం జన్మతః విపరీతబుద్ధి కలిగినవారమని, అబద్ధికులమని, త్రోవతప్పినవారమని (కీర్తన 58:3), ఇలా పాపములచేతను అపరాధములచేతను చచ్చిపుట్టిన మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడనిదే (ఎఫెసీ 2:1), అనగా తిరిగి జన్మించనిదే (యోహాను 3:3-6), దేవుని రాజ్యములో మనకు పాలు లేదని వాక్యము విస్పష్టంగా బోధిస్తుంది. ఇది సువార్తతో ముడిపడియున్న అంశమని, ఇక్కడ పొరపాటు చేస్తే సువార్త సత్యము నుండే తొలగిపోయే ప్రమాదముందని స్పష్టమౌతుంది. ఇదే నిజం కాకపోతే, జన్మతః మానవుడు నీతిమంతుడని, అతని స్వభావం పవిత్రమైనదని, సమాజంతోనో, సాతానుతోనో సంపర్కంలోనికి రాకుండా కాపాడబడితే అతడు క్రీస్తు నీతి అక్కరలేకుండా స్వతసిద్ధంగా నీతిమంతుడే అని ఒప్పుకొని తీరాలి. అయితే ఇలాంటి ఆలోచన, సువార్తను కూలదోయాలని చూస్తే అన్ని కుతంత్రాలలోకెల్లా అత్యంత ప్రమాదకరం.

ఈ కీలకమైన అంశాన్ని అపార్థం చేసుకున్నవారు తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలను ఇక్కడ లేవనెత్తి, వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కొన్ని అపోహలనైనా తొలగించి, మరింత జాగ్రత్తగా ఈ అంశాన్ని పరిశీలించటంలో కొందరికైనా సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

1)ప్రశ్న:

దేవుడే మనలను పాపులుగా పుట్టిస్తున్నాడని చెప్పడం ఎంత భయానకమైన బోధ? దేవుడే పాపానికి కర్త అని మీ ఉద్దేశ్యమా ?

జవాబు:

దేవుడు సృష్టించినప్పుడు మానవునిలో పాపము లేదు (ప్రసంగి 7:29). దేవుడు తన స్వరూపంలో, తన పోలికచొప్పున నరుని సృష్టించాడు (ఆదికాండము 1:26-27). అయితే అవిధేయత వలన మానవుడు ఆ పవిత్ర స్వరూపాన్ని నష్టపోయినవాడిగా తన పోలికలో, తన స్వరూపంలో పిల్లలను కన్నాడు (ఆదికాండము 5:3). స్వజాతి స్వజాతినే కంటుంది. కాబట్టి, పతనస్వభావం గల ఆ ప్రథమ దంపతుల వారసులమైన మనందరికీ వారి స్వభావమే సంక్రమించింది.

పిల్లలను పుట్టించేది దేవుడే (కీర్తన 127:3). కానీ వారిలో పాపస్వభావాన్ని ఉంచింది ఆయన కాదు. ఎందుకంటే ఆయన ఆదామును సృష్టించిన విధంగానే అందరినీ సృష్టించడం లేదు. పిల్లలను కనే సహజ నియమాన్ని దేవుడు మానవునిలో ఉంచాడు (ఆది. 1:28). చెట్టు చెడ్డదైతే దాని స్వభావానుగుణమైన ఫలాలనే ఇస్తుంది. మురికి ఊటల నుండి మంచి నీళ్ళు ఎలా రాగలవు? అలాగే పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టడం కూడా సాధ్యం కాదు (యోబు 14:4). ఆదాము అతిక్రమమే అందుకు కారణం. అది దేవుని పొరపాటు కాదు. అయినా దేవుడు ఎంతో కృపగలవాడు కనుకనే, ఇలా మానవుడు కోల్పోయిన దేవుని పవిత్రస్వరూపాన్ని తిరిగి పొందగల ఏర్పాటును క్రీస్తేసులో మనకు అనుగ్రహించాడు రోమా 8:29; ఎఫెసీ 2:10, ఎఫెసీ 4:21-24; కొలస్సీ 3:10, 1యోహాను 3:2. ఆదాములో మనకు కలిగిన సహజజన్మ వలన కాక క్రీస్తేసులో కలిగిన సహజాతీతమైన నూతనజన్మ వలన మాత్రమే మరలా మనం దేవుని స్వరూపాన్ని పొందాలి. అది నాకు పుట్టుకలో ఇవ్వకుండా యేసులో ఇవ్వటమేమిటని అభ్యంతరపడనివాడు ధన్యుడు.

2)ప్రశ్న:

పాపస్వభావం కారణంగా పాపం చేస్తున్నామని చెప్పడం, మానవుడు తన బాధ్యతను విస్మరించడానికి తావిస్తున్నది కదా? నేను పాపం చెయ్యడం నా తప్పు కాదని, నా స్వభావానుగుణంగా నేను ప్రవర్తిస్తున్నానని బుకాయించేలా ఈ సిద్ధాంతం అనేకుల హృదయాలను కఠినపరచదా?

జవాబు:

వాక్యసత్యాన్ని కొందరు సాకులుగా మలచుకుంటారని, వారికి తగ్గట్టుగా సిద్ధాంతాలను మార్చటం పొరపాటు. ఉదాహరణకు, మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని వాక్యం బోధిస్తుంది (1 యోహాను 1:9). అలాగే పాపం విస్తరించినప్పుడు కృప మరింత విస్తరిస్తుందని రోమా 5:20లో చదువుతాము. దీనిని కొందరు పాపం చేయటానికి ఆసరాగా చేసుకునే అవకాశం లేకపోలేదు. ఒప్పుకుంటే క్షమించే వెసలుబాటు ఉన్నప్పుడు పాపాన్ని మానేయడం కంటే చేసి ఒప్పుకోవడమే చాలామందికి సులభంగానూ, సుఖంగానూ అనిపించవచ్చు. అలా అని, ఈ వాక్యాలలో ఉన్న సత్యాలను ప్రకటించటం మానేద్దామా? అందరు సరిగ్గానే అర్థం చేసుకున్నారా, కొందరు స్వార్థపూరితంగా వక్రీకరించే ప్రమాదముందా అనే ప్రశ్నలు, ఒక సిద్దాంతం సత్యమా అసత్యమా అని నిర్ధారించే ప్రాతిపదికలు కాజాలవు. అన్ని సిద్ధాంతాలను పరీక్షించినట్లే 'జన్మపాపము'ను కూడా వాక్య సమగ్రబోధ వెలుగులోనే నిర్ధారించుకోవాలి. వాక్యం బోధిస్తే అది సత్యం. వాక్యబోధకు భిన్నంగా ఉంటే అది అసత్యం. అన్నట్లు, జన్మపాప సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారు, దేవుని కృపపై మరింత అధికంగా ఆధారపడతారు. స్వభావసిద్ధంగా నాలో ఉన్న పతనాన్ని అధిగమించడం నా సామర్థ్యానికి మించిన సాధన. స్వభావానికి అతీతంగా ప్రవర్తించడం ఎవరికి సాధ్యం? శరీరానుసారమైన మనస్సు కలిగి, దేవుని ధర్మశాస్త్రానికి లోబడే ఇష్టం కాని సామర్థ్యం కాని లేని మనం మారుమనస్సు పొందటం ఆయన ఉచితమైన కృపావరమే అని గుర్తించటం మన పతనస్వభావాన్ని ఎంత ఎక్కువ అర్థం చేసుకున్నామనే ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది.

3)ప్రశ్న:

మానవుడు పాపనైజాన్ని కలిగియున్నాడని, క్రియలేవీ చేయకముందే అతడు పాపి అని బైబిల్లో ఎక్కడ ఉంది?

జవాబు:

ప్రతివాడూ పాపం చేసేలా శోధింపబడటానికి అతని స్వకీయమైన దురాశ కారణం అని బైబిల్ చెబుతుంది. సాతాను మరియు లోకాకర్షణలు అతనిని శోధిస్తాయన్నది నిజమే కాని, పాపాన్ని గర్భము ధరించి కనేది మాత్రం మానవునిలో ఉన్న ఈ దురాశే అని బైబిల్ స్పష్టం చేస్తుంది (యాకోబు 1:13-14). పసిబిడ్డ నుండి పండుముసలి వరకు, వయస్సుకు తగ్గ పరిమాణంలో ఈ దురాశ అందరిలోనూ సహజంగా కనిపిస్తుంది. తిరిగి జన్మించినవానిలో ఈ పాపనియమానికీ, మరియు దేవుడు నాటిన నూతనస్వభావానికీ మధ్య జరిగే పోరాటాన్ని రోమా 7లో అపొస్తలుడు చక్కగా వివరించాడు. ఏది మేలో ఏది చెడో తెలిసినా, మంచి చేయకుండా అడ్డుపడి, కీడువైపుకే మొగ్గేలా బలవంతపెట్టే ఒక పాపనియామాన్ని తనలో అపొస్తలుడు గుర్తించాడు. దీనినే పాపనైజం అంటున్నాము. అంతరంగ పాపనైజమనేది ఒకటి లేకపోతే, మానవుడు కేవలం తన నిర్ణయ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచి పాపం చేస్తున్నాడని అనగలము. కాని పాపనియమమనేది ప్రకృతిసంబంధమైనదని బైబిల్ సెలవిస్తోంది. అందుకే ప్రకృతిసంబంధియైనవాడు దేవుని సంగతులు అర్థం చేసుకోడని, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయని చదువుతాము (1 కొరింథీ 2:14) (రోమా 8:7). దేవుడే కలగజేసుకోకపోతే స్వతఃసిద్ధంగా క్రీస్తునొద్దకు రాలేని అశక్తతలో మరియు అయిష్టతలో మానవుడు ఉన్నాడు (యోహాను 6:44) (యోహాను 3:19-20). మానవునికి స్వతంత్ర నిర్ణయాధికారమే ఉంటే,కేవలం సాతాను ప్రలోభాలో లేక ఇంకేవైనా బాహ్యపరిస్థితులో పాపాన్ని ప్రేరేపిస్తున్నాయన్నదే సంపూర్ణసత్యమైతే, యేసుక్రీస్తు మినహా, అందరూ పాపాన్నే ఎన్నుకోవటానికి కారణమేంటి? అంతరంగంలో ఉన్న పతన ప్రకృతికి సంబంధించిన బైబిల్ వివరణను కాదనేవారి వద్ద ఉన్న ప్రత్యామ్నాయ వివరణ ఏమిటి? నరుని ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే ఎందుకవ్వాలి (ఆది 6:5)? భక్తిహీనులకు విపరీతబుద్ధి పుట్టుక నుండే ఎందుకు ఉంటుంది (కీర్తన 58:3)? బెత్తం వాడేలా బలవంతపెట్టే మూఢత ప్రతి బాలునిలో ఎందుకుంటుంది (సామెతలు 22:15)? మనలను అపవిత్రపరచేవి ఎక్కడో బయట నుండి కాక మన హృదయం నుండే ఉబికే కారణమేమిటి (మార్కు 7:20-23)? లోకాకర్షణలు, సాతాను ప్రేరేపణలు అంటూ ఎన్ని చెప్పుకున్నా, మానవహృదయమే అన్నిటిలోకెల్లా మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలదని, దానిని ఎవ్వరూ పసిగట్టలేరని ఎందుకు చెప్పబడింది (యిర్మియా 17:9)? ఇలాంటి హృదయం, స్వభావం, నైజం, నియమం, లేదా దానికి ఇంకే పేరుపెట్టినా, పాపానికి పురిగొల్పేదేదో అంతరంగంలో ఉందని, అదే పాపానికి మూలమని తెలిపే ఈ వాక్యసత్యంతో విభేదించే ఏ సిద్ధాంతంలోనైనా పై ప్రశ్నలకు సరైన వివరణ ఉందా? ఇది ప్రశ్న మాత్రమే కాదు, సవాలు కూడా.

4)ప్రశ్న:

మానవులు పాపస్వభావం కలిగి పుడతారన్నది నిజమైతే, మానవుడిగా పుట్టిన యేసుప్రభువు కూడా పాపస్వభావాన్ని కలిగియున్నాడా?

జవాబు:

దేవుడు యేసుప్రభువును అందరిలా పుట్టించలేదు. ఏ మనుష్యుని పాపం వలన లోకములోనికి పాపం ప్రవేశించి అందరినీ దోషులుగా చేసిందో (రోమా 5:12), ఆ మనుష్య సంతానంగా ఆయన పుట్టలేదు ఆదికాండము 3:15 (గలతీ 4:4). ఏ మానవప్రమేయం లేకుండా దేవుడే ఆయనను మరియగర్భంలో పరిశుద్ధాత్మ వలన రూపించాడు. ఈ విధంగా నిత్యదేవుడైన దేవునికుమారునికి, దేవుడు సిద్దపరచిన శరీరం అమర్చబడింది (యోహాను 1:1,14,) (హెబ్రీ 10:5). కనుక ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడ్డాడు (లూకా 1:34-35). ఇలా ఆయన పాపశరీరాకారాన్ని ధరించాడు (రోమా 8:4) కాని పాపశరీరాన్ని కాదు (హెబ్రీ 7:26-27). ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడ్డాడు (ఫిలిప్పి 2:7) కానీ ఆయన శరీరధారియైన దేవుడు (యోహాను 1:14) కనుక సంపూర్ణంగా పాపరహితుడు (హెబ్రీ 4:15). నాలో పాపముందని మీలో ఎవరు నిరూపించగలరంటూ నాడు ఆయన విసిరిన సవాలు నేటికీ సవాలుగానే నిలిచియుంది (యోహాను 8:46).

5)ప్రశ్న:

ప్రతివాడు శోధింపబడటానికి తనలో ఉన్న దురాశ కారణం (యాకోబు 1:13-14). యేసుక్రీస్తు అన్ని
విషయాలలోను మనవలె శోధింపబడ్డాడు (హెబ్రీ 4:15). మరి మనవలె శోధింపబడాలంటే ఆయనలో కూడా స్వకీయమైన దురాశ ఉండితీరాలి కదా?

జవాబు:

(హెబ్రీ 4:15). నే ఆయన అన్ని విషయాలలో మనవలె శోధింపబడినప్పటికీ పాపము లేనివానిగా ఉన్నాడు అని స్పష్టం చేయబడింది. కాబట్టి, అంతరంగ పాపస్వభావంచేత ఈడ్వబడి మరలు గొలుపబడటంలో మినహా ఆయన అన్ని విషయాలలో మనవలె శోధింపబడ్డాడు. ఎందుకంటే ఆయనలో స్వకీయమైన దురాశే గనుక ఉండియుంటే, ఆయన పాపంలేనివానిగా ఉన్నాడనే మాటకు ఏ అర్థమూ ఉండదు. ఆయన పాపం చేయకుండా మాత్రమే కాదు, పాపము లేకుండా కూడా ఉన్నాడని ప్రత్యేకంగా గమనించండి. సాతాను ఆయనను శోధించాడు (మత్తయి 4:1-12). లోకం ఆయనను ఎన్నో ఒత్తిళ్ళకు గురిచేసింది (యోహాను 1:7). కాని వాటికి మొగ్గే లేదా లోంగే అంతరంగ ప్రవృత్తి ఆయనకు లేదు కాబట్టి ఆయన పాపం చేయలేదు.

6)ప్రశ్న:

యేసుప్రభువు పాపం చేయలేడని చెప్పడం కంటే, చేయగలడు కాని చేయకుండా పాపాన్ని జయించాడని చెప్పడం సబబు కదా? పాపం చేయలేనివాడు శోధింపబడటంలో గొప్పతనమేముంది?

జవాబు:

యేసుప్రభువు సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు సంపూర్ణ దేవుడు కూడా. దేవుడైయుండి శరీరధారిగా రావటం ఆయన గొప్పతనం.దేవుడు పాపం చేయలేడు (తీతుకు 1:2). యేసు పాపం చేయగలడని చెప్పడం ఆయన దైవత్వాన్ని తృణీకరించడమే. ఆయన పాపాన్ని జయించి పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాడని చెప్పడం కంటే, ఆయన స్వతఃసిద్ధంగానే పరిశుద్ధుడని చెప్పడం వెయ్యిరెట్లు గొప్ప అని గుర్తుంచుకోవాలి. గొప్పతనాన్ని ఆపాదిస్తున్నామంటూ ఆయన దైవత్వానికి గండికొట్టే దుర్బోధల విషయమై మనం అప్రమత్తంగా ఉండాలి.

7)ప్రశ్న:

మనలా పాపానికి ఆకర్షితమయ్యే ప్రవృత్తిని కలిగియుండి కూడా దానిని జయిస్తే యేసు మనకు మాదిరి అవ్వగలడు. అలా కాకుండా పాపానికి అతీతుడయ్యుంటే, ఆయనలా మనం పాపాన్ని జయించడం ఎలా సాధ్యం?

జవాబు:

పాపాన్ని జయించడంలో యేసు మనకు మాదిరికంటే ఎక్కువగా మనకు సమయోచితమైన సహాయాన్ని అందించగలవాడు అని ముందు గ్రహించాలి (హెబ్రీ 4:15). మాదిరి విషయానికొస్తే, ఎన్నడూ శరీరధారి కాని తండ్రియైన దేవుడు కూడా మనకు పరిశుద్ధత విషయంలో మాదిరిగా చెప్పబడ్డాడు (మత్తయి 5:48, 1 పేతురు 1:15-16 లేవీకాండం 11:44, లేవీకాండం 19:2, లేవీకాండం 20:7).దేవుని మాదిరిని మనమెలా ఆచరించగలం? అందుకు మనకు కావలసింది కేవలం ఒక మార్గదర్శి లేదా మాదిరి కాదు. ఆ పవిత్ర దైవికస్వభావంలోనికి మరలా మనలను మలిచే సమయోచితమైన సహాయకుడు మనకు కావాలి. ఆయన పరిపూర్ణమైన మాదిరిని అనుకరించి స్వతఃసిద్దంగా ఆ ప్రమాణాన్ని అందుకోలేమని గుర్తించినప్పుడు మనం నిజంగా ఆయన కృపాసింహాసనమునొద్దకు నడిపించబడతాం. ఆయన సమయోచితమైన సహాయంపై ఆధారపడతాం (హెబ్రీ 4:16). కడకు క్రీస్తుస్వరూపములోనికి, ఆయన పరిపూర్ణ పరిశుద్ధస్వభావములోనికి మనం మార్చబడతాం (రోమా 8:29, 1 యోహాను 3:2).

8)ప్రశ్న:

జన్మపాప సిద్ధాంతం తెలుసుకోకపోతే వచ్చే నష్టమేమిటి?

జవాబు:

జన్మపాప సిద్ధాంతం, పాపము యొక్క ఆవిర్భావాన్ని గురించి, అది మానవాళికి కలగజేసిన భ్రష్టతను గురించి, దాని నుండి రక్షింపబడటానికి దేవుడు క్రీస్తునందు మానవాళికి చేసిన కృపాసహిత ఏర్పాటును గురించి సౌవార్తిక సమగ్ర అవగాహన ఇస్తుంది. ఈ మూలపాఠం నేర్చుకోకుండా సువార్త సత్యాన్ని నేర్చుకోలేము. అందరూ సార్వత్రికంగా పాపం చేయడానికి గల కారణమేమిటి? యేసుక్రీస్తులో తప్ప ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేకపోవటానికి కారణమేమిటి? క్రైస్తవుని అంతరంగంలో జరిగే యుద్ధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి కీలకమైన ప్రశ్నలకు, జన్మపాప సిద్ధాంతం అందించే వాక్యానుసారమైన సమగ్రబోధను నష్టపోవడం, క్రైస్తవ్యాన్ని నష్టపోవడమే. ఈ సిద్ధాంతాన్ని నమ్మనివారు క్రైస్తవులే కారు. అది తీరని నష్టమే కదా?

ముగింపు:

ఆదాము తన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచి పాపం చేసాడు. దాని పర్యావసానంగా అతని సంతతి వారందరూ పాపులై అతనిలా మరణానికి లోనయ్యారు. ఈ పతనంలో నుండి పాపరహితుడు ఉద్భవించడం సాధ్యం కాదు కాబట్టి దేవాది దేవుడే నరావతారియై పాపానికి ప్రాయశ్చిత్తం చేసాడు (1 కొరింథీ 15:22,45-47). ఇదే జన్మపాప సిద్ధాంత సారాంశం. ఈ సువార్త కాక వేరొక సువార్తను ఎవ్వరు బోధించినా వారు శాపగ్రస్తులే (గలతీ 1:8-9).

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప హితబోధ ఎప్పుడూ, ఎవ్వరి నుండీ ఆర్థిక సహాయం అంగీకరించదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.