సంఘము

రచయిత: పీటర్ మాస్టర్స్
అనువాదం: శామ్యూల్ బొప్పూరి

 

1వ పాఠం

సంఘంలో చేరడమనేది వాక్యానుసారమైంది

క్రీస్తు తన ప్రజల కొరకు ఒక 'గృహాన్ని' లేక కుటుంబాన్ని తయారుచేసాడు. ఇలాంటి అద్భుతమైన దైవజ్ఞానం గురించి ఈ పేజీలలో రాయబడింది. ఇది మనమంతా ప్రభువు యొక్క పరిచర్యలో ఎదగడానికి ఉపయోగపడే అద్భుతకరమైన అంశం, అంతమాత్రమే కాకుండా, మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరమైనది మరియు ఆశీర్వాదానికి కారణమైనది కూడా. ఈ అంశం ఒకదానికొకటి సరిగ్గా అతికేటట్టు మనకు చక్కగా అర్థమవ్వడానికి అద్భుతమైన సాదృశ్యాలతో, ఉదాహరణలతో వివరించబడింది. ఒక విశ్వాసి ప్రభువుతో సన్నిహితంగా నడవడం తెలుసుకున్న తర్వాత విశ్వాససంబంధమైన మూలపాఠాలను అర్థం చేసుకున్న తరువాత 'సంఘ సభ్యత్వం' అనే అంశం ఆ విశ్వాసి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది.

అయితే ఒక వాక్యపరమైన సంఘం ఎలా ఉండాలి? ఆయా సభ్యుల యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలి? నిజంగానే ప్రభువును నమ్ముకున్న కొంతమంది విశ్వాసులు సంఘంలో సభ్యులుగా చేరాల్సిన అవసరం లేదనుకుంటుంటే, మరి కొంతమందేమో సంవత్సరాలు తరబడి ఏ సంఘానికీ కట్టుబడకుండా వారి సమయాన్ని వెళ్ళబుచ్చేస్తున్నారు.
కాబట్టి ప్రభువు యొక్క ఆజ్ఞానుసారంగా అపోస్తలలు సంఘం గురించి ఏదైతే బోధించారో, ఆ పద్ధతిని అనుసరించి మనం దీని గురించి తెలుసుకుందాం.

ఇంతకీ నూతన నిబంధన కాలంలో విశ్వాసులు దేనిలోనైనా చేర్చబడ్డారా? అని పరిశీలిస్తే నూతన నిబంధనలోని అనేక వాక్యభాగాలు నిస్సంకోచంగా అంటుకట్టబడి ఉండడం, లేక సభ్యులుగా ఉండడం అనే అంశాలను చెప్పడం స్పష్టంగా చూడగలం. సంఘం యొక్క ఆశయాలకు, సంఘ జీవితానికి, సంఘ క్రమశిక్షణకు ప్రతిజ్ఞ పూని సంఘానికి కట్టుబడి ఉన్నవారితో చేరడానికి దేవుని చేత సృష్టించబడ్డ ఒక ఆత్మీయ కుటుంబమే ఒక స్థానిక సంఘం.

లోపటివారు - బయటివారు

1 కొరింథీ 5:4-5లో మనం చూస్తే సంఘం పద్ధతి కలిగి క్రమశిక్షణ పాటించడానికి అనుకూలంగా మలచబడిన ఒక సమాజం. (జారత్వ విషయమై సంఘం నుండి ఒకరిని వెలివేయాలని చూస్తున్నాం).

ఇక్కడ పౌలు ఏమంటున్నాడో చూడండి - “ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను”

మొదట్లో ఈ వచనాలు చూసిన వెంటనే ఇవి సంఘ సభ్యత్వాన్ని నిరూపించడానికి అనువైన వచనాలుగా కనిపించవు. కాని ఒక భయంకరమైన పాపంలో పడ్డ వ్యక్తిని సహవాసం నుండి వెలివేయడానికి సంఘానికి అధికారం ఉందని మనం గ్రహించగలం. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ జరిగిన మీటింగ్ పబ్లిక్ మీటింగ్ లాంటిది కాదు. ఇక్కడ అవిశ్వాసులు, క్రైస్తవ్యాన్ని గురించి తెలుసుకుందామనేవారిగా లేనట్టుగా గమనించగలం. అయితే 1 కొరింథీ 14:24-25 వచనాలను చూస్తే, మిగతా ఆరాధనలకు అవిశ్వాసులు కూడా వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఈ మీటింగ్ మాత్రం ఒక ప్రత్యేకమైనది. ఇది కేవలం శిష్యులకే. ఇది కేవలం విశ్వాసులకు మాత్రమే. ఇది సహవాసం యొక్క మర్యాదను కాపాడటానికి జరిగిన ఒక అంతర్గత సమావేశం.

ఇక్కడ పౌలు “వానిని సాతానుకు అప్పగింపవలెను” అని రాసినప్పుడు ఆయన అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తి తిరిగి పశ్చాత్తాపం పొంది ఆత్మీయ స్పృహలోకి రావడానికి అతణ్ణి లోకంలో వదిలిపెట్టి, సంఘం నుండి ఎటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదాలు అందకుండా చేయడమే. ఇంకా - 1కొరింథీ 5:12-13లో విశ్వాసులు ఒక సహవాసానికి లేక సమాజానికి “చెందిన”వారని స్పష్టంగా, శక్తివంతంగా రాస్తున్నాడు. చూడండి! ఇక్కడ ఆయన ఏమంటున్నాడో, “వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గానీ” అని అంటున్నాడు.

ఇక్కడ వెలుపలివారెవరు? ఇక్కడ లోపలివారెవరు? ఇక్కడ విశ్వాసులు, అవిశ్వాసులు కలిసుండే ఆరాధన గురించి మాట్లాడుతున్నాడా? లేక ఒక ప్రత్యేకమైన విశ్వాసుల సముదాయం గురించి మాట్లాడుతున్నాడా? ఇక్కడ పౌలు కేవలం రక్షణ పొందిన విశ్వాసుల గురించి, ఒక అంతర్గత సహవాసంలో సభ్యులుగా ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. కేవలం ప్రభువును నమ్ముకున్న విశ్వాసులకు మాత్రమే ఇతర క్రైస్తవుల ప్రవర్తనను గూర్చి తీర్పు తీర్చే అధికారం ఉంటుందని గ్రహించాలి.

క్రొత్త నిబంధన కాలంలో కేవలం ఒక నిర్దేశితమైన సిద్ధాంతాలకు, పరిశుద్ధ జీవనానికి కట్టుబడిన విశ్వాసులను మాత్రమే సంఘం లేక సహవాసంలోనికి ఆహ్వానించినట్టు, ఎవరైతే ఈ విధమైన జీవనానికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగుంటారో వారికి సహవాసంలోనికి చేరటానికి అనుమతి లేనట్టు‌ గమనించగలం. ఈ విశ్వాసులు సహవాసంలో ఉండే ఇతర విశ్వాసుల స్నేహం కొరకు, పరిచర్య కొరకు, క్రమశిక్షణ కొరకు తమకు తామే స్వచ్ఛందంగా లోబడి, కట్టుబడి ఉన్నట్టు చూడగలం. వారు తమ ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించే తెగిన గాలిపటాలు కాదు.

ఏ విశ్వాసులైతే సహవాసానికి కట్టుబడి ఉండడానికి ఆసక్తి చూపించరో, వారు పై వాక్యభాగాలను వివరించడానికి ఇబ్బంది పడతారు. కొంతమంది ఏమంటారంటే, కొరింథీ సంఘంలో వెలివేయబడ్డవాడు, ప్రభువు బల్ల నుండి వెలివేయబడ్డాడని అంటారు. అయితే పౌలు ప్రభువు బల్ల గురించి మాట్లాడడం వాస్తవమే అయినా, ఇది ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో సగం మాత్రమే. 1 కొరింథీ. 5:7లో "పులిపిండిని తీసిపారవేయుడి” అన్న ఆజ్ఞ కేవలం ఒక వ్యక్తిని బల్లలో పాల్గొనకుండా చేయడానికి మాత్రమే కాదు గానీ, సహవాసంలో నుండి తీసివేయండని అర్థం. అలాగే 1 కొరింథీ. 5:13 “ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి” అని అంటున్నాడు. ఇక్కడ అపొస్తలుడు “వెలుపలివారు లోపలివారు” అన్న మాటలు ప్రభువు బల్లను ఉద్దేశించి రాసినవి కావు కానీ, ఒక సహవాసంలోని నిర్దిష్టమైన సభ్యుల గురించే రాసినవని గమనించగలం.

సంఘం (సహవాసం) క్రమశిక్షణ కొరకు నిర్దేశించబడింది

ఒక నిర్దిష్టమైన సంఘసభ్యత్వం గురించి మత్తయి 18లో కూడా వ్రాయబడింది. విశ్వాసుల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఒక నియమాన్ని ప్రభువే ఇక్కడ నెలకొల్పుతున్నాడు. ఈ అధ్యాయంలో ఈ నమస్యల గురించి లోతుగా ప్రస్తావించకపోయినప్పటికీ, కానీ విశ్వాసుల మధ్య వారు పరిష్కరించుకోలేని తీవ్రమైన తప్పిదాలు జరిగినప్పుడు, వారు వారి సమస్యను సంఘం యొద్దకు తీసుకుని రావాలని ఈ నియమం చెబుతుంది. అయితే ఆ వ్యక్తి సంఘం చెప్పే మాటలు పెడచెవిని పెట్టినట్టైతే, అతడు సహవాసం నుండి వెలివేయబడాల్సిందే. ఈ మాటలు చూడండీ, “అతడు వారి మాటయూ వినని యెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని యెడల, అతనిని నీకు అన్యునిగాను, సుంకరిగాను ఎంచుకొనుము”. ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే సంఘం అనేది ఒక నిర్దిష్టమైన పద్ధతి కలిగిన సిద్ధాంతాల పట్ల పరిపక్వత కలిగినదిగా ఉండాలి. ఇక్కడ నిర్ణయం తీసుకునే అధికారం సంఘానికి ప్రభువే ఇచ్చినట్లు చదువరులు గమనించగలరు. అంటే దానర్థం ఏమిటంటే ఒక సంఘం అనేది ఒక నిర్దిష్టమైందిగాను, వాక్యంపట్ల పరిపక్వత కలిగిందిగాను, నియమాలను అనుసరించేదిగానూ ఉండాలే తప్ప ఎవరు సభ్యులో తెలియక, ఎవరు సభ్యులు కారో తెలియక, తెగిన గాలిపటాల్లాగా ఉండకూడదు.

యెరూషలేము సంఘంలో చేరడం

ఒక సంఘంలో చేరడానికి సంబంధించిన వాక్యాలు అనేకమైనవి అపొస్తలుల కార్యములలో చూడగలము. అందులో ప్రధానమైనది అపొ.కా. 9:26-28లో చూడగలం - “అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నము చేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి - అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడ వచ్చుచూ, పోవుచుండెను”.

ఇక్కడ అసలు పౌలు ఎందులో లేక ఎవరితో చేరాలనుకున్నాడు? ఇక్కడ ఆయన కేవలం ఆదివారం ఆరాధనలకు హాజరవ్వాలనుకుంటున్నాడా? లేక వేరేదేమైనా ఉందా? సమాజంలో క్రీస్తుకు సాక్షులుగా ఉండటానికి క్రొత్త నిబంధనలో ఉన్న సంఘాలు విపరీతమైన తెగువను, ధైర్యాన్ని చూపాయి. ఆరాధనలు జరిగేటప్పుడు ప్రజలు కోకొల్లలుగా ఉండడం వల్ల వచ్చినవారిలో అనేకమంది అవిశ్వాసులు కూడా ఉండి ఉంటారు.

అయితే యెరూషలేము సంఘసభ్యులు పౌలు పేరు విని భయపడినప్పటికీ, వారు అతడిని ఆరాధనల్లో పాల్గొనకుండా చేశారని తలంచకూడదు. పౌలు వారితో సన్నిహితంగా మెలగాలని ఆశించినా, వారు అతని ఆత్మీయ పరిస్థితిని బట్టి అతనితో సన్నిహితమైన సంబంధం కుదరదని అనుకున్నారు. ఇక్కడ క్రీస్తును ఎవరైతే విశ్వసించి ఆయనే ప్రభువని ఒప్పుకుంటున్నారో వారితో చేరాలని పౌలు ఆరాటపడుతున్నాడు. అపొ.కా. 9:26-28 వచనాలలో మాటలను గమనిస్తే, పౌలు “శిష్యులతో” చేరాలని ఆశపడుతున్నాడు. శిష్యులు అంటే క్రీస్తును రక్షకునిగా విశ్వసించి నోటితో ఒప్పుకున్నవారు.
చివరికి బర్నబా పౌలు తరఫున మాట్లాడితే తప్ప అతడు వారిని కలిసే అవకాశం రాలేదు.

చేరడం అంటే అతుక్కోవడం

అపో. కార్యముల్లో వాడబడ్డ “చేరుట”అనే పదాన్ని మనం ఒక్కసారి గమనిద్దాం. రెండు వస్తువులను అతికించడం లేక పటిష్టపరచడమని దాని అర్థం. ఇది ఒక ధృఢమైన గట్టి బంధాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు తన ఆకలిని తీర్చుకోవడానికి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. ఇక్కడ ఇబ్బందిలో ఉన్న వ్యక్తి తన యజమానికి లోబడి అతనికి కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది. మనమింకా చూస్తే 1 కొరింథీ. 6:16లో వ్యభిచార సంబంధమైన పాపాలను ఉద్దేశించి, 'కలుసుకొనుట' అనే పదాన్ని వాడారు. “కలుసుకొనుట” అనే పదం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఒక వ్యక్తికి కట్టుబడి లోబడి ఉండడమే. ఇదే ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ముఖ్య లక్షణం. చూడండి! అందుకే పౌలు “ప్రభువును కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడని” అంటున్నాడు.

ఇకపోతే అపో. కార్యములు 8:29లో చూస్తే పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో ఇథియోపియా నపుంసకుడి రథాన్ని "కలిసికొనుము” అన్న మాటను చూడగలుగుతున్నాం. రక్షణ ఆ నపుంసకుడి హృదయంలో ఉదయించేంత వరకు పట్టుదలతో ఫిలిప్పు సాక్ష్యమిచ్చినట్టుగా చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో 'కలిసికొనుట' అనే పదానికి "కట్టుబడి లోబడియుండుట” అనే అర్థాన్ని మనం గమనించగలం. ఇది వ్యక్తుల మధ్య ఉండే పరస్పర బంధాన్ని తెలియజేస్తుంది.

అపో. కార్యములు 5:12-14లో అననియా, సప్పీరా దేవుని తీర్పును పొందుకున్న తరువాత, అనేకమంది సంఘంలో సభ్యులుగా చేరడానికి (కలుసుకోవడానికి) తెగించలేదని మనం చూడగలం; "ప్రజల మధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్యములును అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలోమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు. గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి”.

పై మాటల యొక్క అర్థం ఏమిటంటే సొలోమోను మంటపం లాంటి ప్రదేశాలకు అనేకమంది హాజరవుతున్నట్లుగా చూస్తున్నాం. కాని కడమవారితో అంటే మిగిలిన విశ్వాసులతో కలుసుకోవడానికి ఎవరూ తెగించలేనట్లుగా చూస్తున్నాం. ముఖ్యంగా అననియ, సప్పీరాల చావును చూసిన తర్వాత విశ్వాసుల్లో చేరడానికి భయపడుతున్నట్టుగా గమనించగలం. ఈ వాక్యభాగాలను పరీక్షించిన తరువాత క్రొత్త నిబంధనలో విశ్వాసుల సంఘసభ్యత్వం గురించి ఎంతో స్పష్టంగా తెలపబడ్డట్టు మనం చూడగలం. ఇదే పద్ధతిని మనం ఈ రోజు కూడా పాటించవలసిందే.

సంఘం అనేది ఒక నిర్దిష్టమైన నియమ నిబంధనలు కలిగిన సమాజం

ఒక సంఘంలో కట్టుబడి లోబడి ఉండే విశ్వాసులకు మాత్రమే సభ్యత్వం వర్తిస్తుందని మనం కొన్ని వాక్యభాగాలను చూద్దాం. “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి యుండుడి” అని ఎఫెసీ 5:21లో రాయబడి ఉంది. ఈ వాక్యభాగం యొక్క అర్థమేమిటంటే విశ్వాసులు తమకు తామే ఒక సహవాసంలో భాగంగా ఉన్నారని గ్రహించాలి. వారి స్వంత అవసరాలను, కోరికలను తీర్చుకునే ముందు సహవాసం అనేది ఒకటుందని మర్చిపోకూడదు.

“మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసువలన మనకు కలిగిన మన స్వాతంత్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది” అని గలతీ. 2:4లో రాయబడింది. ఈ వాక్యభాగాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే, విశ్వాసులకు మాత్రమే అనుమతి ఉండి, అందరూ హాజరవ్వలేని ఒక ఆంతరంగిక సమావేశం ఒకటుందని గ్రహించక తప్పదు. రహస్యంగా దొంగచాటుగా తప్ప బయటివారు ఈ సమావేశాలకు హాజరవ్వడం కుదరదు. ఎందుకంటే వారికి అలాంటి అనుమతి లేదు. అయితే ఈ సమావేశం దేనికి సంబంధించింది? ఎవరు దీనిలో పాల్గొంటున్నారు? కేవలం విశ్వసించిన సభ్యుల కొరకు మాత్రమే ఇది రూపొందించబడింది. అవిశ్వాసులు, సంఘానికి లోబడనివారు హాజరవ్వకూడని సమావేశాలేమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. అవే సంఘసభ్యుల సమావేశాలు.

సంఘసభ్యత్వం అనేది క్రొత్త నిబంధనలోని సంఘాల్లో లేకపోతే, బైబిల్లోని అనేకమైన వాక్యభాగాలకు అర్థం ఉండదు. ఉదాహరణకు సంఘ సభ్యత్వం అనేది లేకపోతే 1తిమోతి 3:1లో “ఎవడైనను అధ్యక్ష పదవిని (స్థానిక సంఘ నాయకుడు) ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది” అన్న మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ అధ్యక్షుడు అనే పదానికి మందను కాసేవాడు లేక గమనించేవాడని అర్థం. ఈ కాపరి లేక నాయకుడిపై సంఘంలో విశ్వాసులను కాయవలసిన ఆత్మీయ బాధ్యత ఉంది. ఇంతకీ ఈయన ఎవరిని కాయాలి? విశ్వాసులనా? అవిశ్వాసులనా? సంఘంలో విశ్వాసులు సంఘసభ్యులుగా లేకుండా కాపరి అన్న పదానికి అర్థం లేదు. ఇలాంటి సంఘాల్లో వాక్యానికి లోబడడం అసాధ్యం.

అలాగే 1తిమోతి 3:5లో కూడా ఒక కాపరికి ఉండవలసిన లక్షణాలను గమనించి నప్పుడు 'సంఘ సభ్యత్వం' అనేది ఎంత ప్రాముఖ్యమైందో నేర్చుకోవచ్చు. ఇక్కడ పౌలు “ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును” అని అంటున్నాడు. ఇక్కడ సంఘానికి ఒక కుటుంబానికి పోలిక చూడగలం. ఒక ఇంటిలో తండ్రికి ఎలాంటి బాధ్యతలుంటాయో అలాంటివే ఒక కాపరికి సంఘానికి సంబంధించిన బాధ్యతలుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఒక నిర్దిష్టమైన మరియు ఒక విలక్షణమైన బంధం ఉంటుంది. ఇకపోతే 1తిమోతి 5:17లో మనం చూస్తే “బాగుగా పాలన చేయు పెద్దలు” అని పౌలు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక సంఘంలో నిర్దిష్టమైన సభ్యత్వమనేది లేకపోతే ఇక పెద్దలు ఎవరిని పాలించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే దానర్థం సంఘ సభ్యత్వమనేది లేకపోతే సంఘంలో పాలన అనేది కుదరదని గమనించాలి. ఒకసారి ఆలోచించండి, పౌరులు లేకుండా ఒకడు దేశాన్ని పరిపాలించగలడా? సైన్యంలో చేరని సైనికులు ఎక్కడైనా ఉంటారా? ఉద్యోగస్తులు లేకుండా ఒక పరిశ్రమ ఎక్కడైనా ఉంటుందా? అలాగే పిల్లలు లేకుండా కుటుంబం ఎక్కడైనా ఉంటుందా? సంఘం అనేది ఒక ఆత్మీయ కుటుంబం. ఈ ఆత్మీయ కుటుంబాన్ని పోషించడానికి, దానికి సహాయం చేయడానికి దేవుడు కాపరులను నియమించాడు. ఆ ఆత్మీయ కుటుంబ పరిచర్య నిమిత్తమైన దానిలోని సభ్యులు వారి శక్తి మేరకు తమను తాము అప్పగించుకోవాలి.

సంఘ సభ్యత్వానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు

సంఘ సభ్యులకు ఉండే బాధ్యతలు గురించి ఇప్పటి వరకూ బైబిల్లో కొన్ని లేఖనాలను పరిశీలించాం. ఇప్పుడు నూతన నిబంధనలో ఉదాహరణలను మనం చూద్దాం :

1. దేవాలయంగా కట్టబడడం
                 2. మానవ శరీరం
                 3. కుటుంబం
                 4. ద్రాక్షవల్లి
                 5. గొర్రెల మంద
                 6. పెండ్లి కుమార్తె
                 7. యాజక సమూహం

ఇక్కడ మొదటి మూడు ఉదాహరణలు కూడా ఒక వ్యక్తిని లేదా విశ్వాసిని దృష్టిలో ఉంచుకుని రాయబడ్డాయి. మిగిలిన నాలుగు ఉదాహరణలు కూడా ఆది నుండి ఉండే సార్వత్రిక సంఘం గురించి రాయబడింది. మొదటి మూడు ఉదాహరణలు కూడా విశ్వాసులకు ఖచ్చితంగా సంఘ సభ్యత్వాన్ని కోరుకోవడాన్ని తెలియజేస్తున్నాయి. అది ఎలాంటి సభ్యత్వమంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంఘానికి కట్టుబడి ఉండేలా ప్రతిజ్ఞ పూనాలి. ఆ విధంగా చెయ్యాలంటే ఒక సంఘం యొక్క బోధలకు, క్రమ శిక్షణకు, పరిచర్యకు లోబడి ఉండాలి.

ఆలయంగా కట్టబడడం

లేఖనాల్లో అనేకసార్లు "కట్టబడుట” అనే విషయాన్ని చూస్తాం. ఎఫెసీ 2:21-22లో చూస్తే, “ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు” అని పౌలు రాస్తున్నాడు. చూడండి! ఒక కట్టడం అనేది అనేక వస్తువుల సముదాయం . అవి ఇటుకలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, లేదా కలప కావచ్చు.

ఇక్కడ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తే, ఎవరికి నచ్చిన జీవితం వారు జీవిస్తే ఇక్కడ “దేవుని ఆలయంలో అమర్చబడుచున్నారు” అనే వాక్యానుసారమైన ఉదాహరణకు అర్థం ఉండదు. దేవుని ఆలయంలో అల్లరికి, గందరగోళానికి, వ్యక్తిపూజకి తావు లేదు కాబట్టి, ఏ ప్రభువైతే మనలను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా సృష్టించాడో, ఆ ప్రభువే మన కొరకు ఒక స్థలాన్ని కూడా సిద్ధపరచాడు. చక్కగా నిర్మించిన భవనంలో ఎలాగైతే రాళ్ళు, దూలాలు, స్తంభాలు, చెక్కలు, ద్వారాలు ముందుగా నిర్ణయించబడ్డ స్థలంలో అమరుస్తారో, అలాగే ప్రభువు తన ప్రజలను చక్కగా అమర్చడానికి సంఘంలో సభ్యులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన కొరకు వాడబడడానికి ఆయన పిలుస్తున్నాడు. సంఘం అనేది దేవుని చేత రూపించబడింది కాబట్టి సంఘంలో ఒక పద్ధతిని మనం గమనించవచ్చు.

1 తిమోతి 3:15లో వచనాలు సంఘ సభ్యత్వం గురించి శక్తివంతంగా మాట్లాడుతున్నాయి. దేవుని మందిరంలో, అంటే జీవముగల దేవుని సంఘంలో, జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను” ఇక్కడ కూడా ఒక కట్టడానికి ఎలాగైతే పునాది, స్తంభాలు ఉంటాయో, అలాగే ఒక సంఘానికి కూడా ఉంటాయని పౌలు చెబుతున్నాడు. ఎలాగైతే ఒక దేవాలయం యొక్క బోధలు దాని మీద ఉంటాయో, అలాగే విశ్వాసులు కూడా ఆ సత్యానికి ప్రాతినిధ్యం వహించి, దానిని దృఢపరుస్తారు. ఇక్కడ చెబుతున్న ఉదాహరణకు అర్థం ఏమిటంటే, ప్రతీ విశ్వాసి యొక్క జీవితం ఈ వాక్యభాగాన్ని గౌరవించేదిగా ఉండాలి. ప్రతీ ఒక్క విశ్వాసి కూడా ఈ కట్టడం (సంఘం) యొక్క భారాన్ని మోసే నమ్మకమైన, నిలకడ కలిగిన స్తంభంగా ఉండాలి. ఏ విశ్వాసి కూడా ఏ సంఘానికి లోబడని, తెగిన గాలిపటం లాంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు. చూడండి! ఏ భవనంలో అయినా గోడలు, కిటికీలు, దర్వాజాలు అప్పుడప్పుడు బయటికొచ్చి మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ లోపలికెళ్తాయా? అవి ఎప్పుడూ భవనంలో నిలకడగానే ఉంటాయి తప్ప అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రావటం అంటూ జరుగదు.

మానవ శరీరం :

1 కొరింథీ. 12:12లో ఇంకా అనేక వాక్యభాగాల్లో మానవ శరీరాన్ని ఉదాహరణగా తీసుకుని రాయడం జరిగింది. “ఏలాగు శరీరము ఏకమై యున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నియు అనేకములై యున్నను ఒక్క శరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు” ఇక్కడ ఒక సంఘాన్ని శరీరంతో పోల్చబడింది. ఒక శరీరానికి ఏలాగైతే అనేక అవయవాలు అమర్చబడి ఉంటాయో, అలాగే ఒక సంఘము కూడా శరీరంతో పోల్చబడింది. ఈ అవయవాలు శరీరానికి ఏ విధంగా అమర్చబడ్డాయంటే అవి ఒకదానికొకటి అతుకబడి ఉన్నాయి లేకపోతే ఆ శరీరం పనిచేయదు. ఇంకా ఈ అవయవాలన్నీ పనిచేస్తేనే శరీరం పనిచేస్తుంది. ఒకే శరీరంలో ఒక అవయవానికి మరొక అవయవానికి పరస్పర సహకారం, సమన్వయం కలిగి ఉంటాయి. ఒక సంఘంలో ఖచ్చితంగా విశ్వాసులు సభ్యులుగా ఉండాలి అనే ఉద్దేశం ఈ ఉదాహరణలో రాయబడి ఉంది. ప్రతీ విశ్వాసి మరొక విశ్వాసితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగుండి, పరస్పర సహకారం అందించుకోవాలి.

సంఘం అంటే కేవలం వారం వెంబడి వారం ఒక వ్యక్తి వాక్యం చెబుతూ ఉంటే వినడం మాత్రమే కాదు. ఇక్కడ ప్రతీ విశ్వాసి లేదా సభ్యునికి ఉండాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకరిమీద మరొకరు ఖచ్చితంగా ఆధారపడితేనే ఈ పని జరుగుతుంది. అందరి మధ్య సమన్వయం ఉంటేనే అందరూ ఒక తాటి మీద ముందుకెళ్తారు, సంఘానికి శిరస్సు క్రీస్తు మాత్రమే అని గుర్తిస్తారు. (దేవుని వాక్యంలో ఆర్చిబిషప్పుల గురించి పోపుల గురించి ప్రస్తావనే లేదు).

ఇకపోతే పౌలు ఎఫెసీ. 4:15-16లో "ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది”. దేవుడు ఎందుకు సంఘంలో విశ్వాసులందరినీ జతపరుస్తాడంటే వారు ఇతర విశ్వాసుల జీవితాల్ని, క్రియల్ని గమనించి, వారు కూడా వారి విశ్వాస జీవితంలో ఎదుగుతారనే ఉద్దేశ్యంతో దేవుడు వారినందరినీ సంఘమనే శరీరంతో జతపరుస్తాడు.

శరీరానికి అతుకబడకుండా శరీరంలో ఏ అవయవమైనా పనిచేయటం ఎక్కడైన చూశారా? అలాగే ఏ విశ్వాసి కూడా సంఘానికి అతుకబడకుండా ఉండకూడదు. నూతన నిబంధన సంఘంలో ఒక సభ్యునిగా (అవయవంగా) ఉండకుండా ఏ విశ్వాసైనా ఉండవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానమేమిటంటే, ఏదైనా ఒక భయంకరమైన పాపం చేసి ఉంటే తప్ప లేక సంఘం నమ్మే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే తప్ప ప్రతి విశ్వాసీ సంఘంలో సభ్యుడిగా ఉండవలసిందే. పైన ఉదహరించబడ్డ కారణాలు తప్ప మరే కారణం చేతనైనా ఏ విశ్వాసీ సంఘంలో సభ్యుడుగా ఉండకుండా ఉండే అవకాశం లేదు.

కుటుంబ బంధం :

బహుశ ఎవరైనా "నేను సంఘంలో చేర్చబడటానికి నాకంత జ్ఞానం లేదు. లేక నేను విశ్వాసంలో ఇంకా బాల్యస్థితిలోనే ఉన్నాను” అని అంటే దానికి సమాధానం ఏమిటి? వెంటనే ఈ ప్రశ్నకు సమాధానం 1 తిమోతి 3:5లో దొరుకుతుంది. ఇక్కడ సంఘాన్ని ఒక ఇంటితో లేక ఒక కుటుంబంతో పోల్చాడు. చూడండి! నేను చాలా చిన్న వాడిని కాబట్టి నేను కుటుంబంలో ఉండటానికి వీల్లేదు. అని ఎవరైనా అంటారా? ఎవరైనా కుటుంబంలో ఒక చిన్న పాపను చూసి, ఈమే కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండటానికి చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈమెను ఇంటి గుమ్మం దగ్గర విడిచి పెడదామని ఎవరైనా అంటారా? ఎవరైతే కుటుంబంలో బలహీనంగా ఉన్నారో వారినే ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా! అయితే సంఘంలో చిన్న పిల్లలు సభ్యులుగా ఉండాల్సిన అవసరం లేదు కాని ఆత్మీయంగా ఎవరైతే పిల్లలుగా ఉన్నారో వారు ఖచ్చితంగా సభ్యులుగా ఉండాల్సిందే.

చూడండి! ప్రతీ కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు. ఒక పద్ధతి ఉంటుంది. అంతేకాదు ఆ కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉంటాయి. అందరూ కలిసినట్టుగా ఒకే లక్ష్యం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులు ఒకరిపట్ల ఒకరు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు. వారందరూ ఒకే ఇంటిపేరు కలిగి ఉంటారు. తిరిగి జన్మించబడ్డ విశ్వాసులందరూ ఇతర విశ్వాసులతో సంఘంలో సభ్యులుగా చేరాలని మన రక్షకుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆ సంఘం దేవుని వాక్యాన్ని నిర్దోషమైందిగాను దైవావేశం వల్ల కలిగింది గాను గుర్తించి క్రీస్తు నియమించిన ప్రణాళికను అమలు చేసే సంఘంగా ఉండాలి. ఈ విషయంలో మరింత లోతుగా ముందు పేజీల్లో అధ్యయనం చేద్దాం.

2 పాఠం

స్థానిక సంఘం యొక్క లక్షణాలు

ప్రతీ స్థానిక సంఘం ప్రభువు దృష్టికి అంగీకారంగాను, ఫలభరితంగాను ఉండడానికి నూతన నిబంధన నాలుగు ప్రాథమికమైన నియమాలు బోధిస్తుంది.

1. ప్రతీ స్థానిక సంఘానికీ క్రీస్తు ప్రభువుగాను (యజమాని) శిరస్సుగాను ఉన్నాడు. ప్రతి సంఘం కూడా స్వతంత్ర్య ప్రతిపత్తి కలిగినదై, ఏ ఇతర సంఘానికి కానీ, డినామినేషనకు గానీ లోబడి ఉండకూడదు.

2. ప్రతీ సంఘం మారుమనస్సు పొంది, తిరిగి జన్మించబడ్డ వ్యక్తులను మాత్రమే సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలి. (తిరిగి జన్మించబడ్డ వారే సంఘసభ్యులుగా ఉండడానికి అనుమతి ఉందనే నియమాన్ని గమనించగలం)

3. ప్రతీ సభ్యుడు కూడా నమ్మకంతో సహవాసానికి పూర్తిగా కట్టుబడి సంఘానికి పరిచర్య చేయాలి.

4. ప్రభువుకు లోబడే ప్రతీ వ్యక్తి ఆత్మీయ ఎదుగుదలను కలిగి ఉండాలి. (ఇది ప్రభువు యొక్క చిత్తం మేరకు ఆయనకు తగిన సమయంలో అట్టి వృద్ధి ఆయన దయచేస్తాడని గమనించాలి.)

1. స్వతంత్ర్య సంఘం

ఏ ఇతర సంఘం చేతనైనా, లేక ఏ డినామినేషన్ చేతనైనా ఒక సంఘం పరిపాలించబడకూడదు. (ఒక సంఘం తమ మిషనరీ చేత మరొక ప్రాంతంలో సంఘం స్థాపిస్తున్నట్లయితే, అది ఆమోగ్యదాయకమైనదే). ప్రతీ సంఘం క్రీస్తు యొక్క ఆధీనంలో, ఆయన యొక్క సూచనల మేరకు, ఆయనకు లోబడి ఆయన ఆశీర్వాదం నేరుగా పొందే సంఘమై యుండాలి. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం‌ మనం డినామినేషన్ల చరిత్ర చూచినప్పుడు, సంఘాలు వాక్యపరమైన హెచ్చరికలను నిర్లక్ష్యపరచినందువల్ల, వారు ఇతర సంఘాలమీద కూడా అధికారం చెలాయించడం వల్ల, సాతాను చేతికి సులువుగా చిక్కి వాడి చేతిలో అన్ని సంఘాలు నాశనమైనట్లు కనిపిస్తున్నాయి.

ఒక స్థానిక సంఘం ఎలాంటి స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటుందో మనం నేర్చుకుందాం. స్థానిక సంఘం అంటే అనేకమైన అపోహలున్నాయి. వారికి దగ్గరలో ఉండే క్రైస్తవ సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటే చాలు అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. అయితే, స్థానిక సంఘం అంటే మనకు ఏది దగ్గరలో ఉంటే అదే అని అనుకోవటానికి వీలులేదు. ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవ సార్వత్రిక సంఘం గురించి మనం మాట్లాడడం లేదు కానీ ఒక వ్యక్తిగత సంఘం గురించి మాట్లాడుతున్నాం. దీని అర్థం ఏ డినామినేషన్ కాదు. క్రీస్తు పాలనకు లోబడి ఆయనను నేరుగా ఆరాధించే ఒక వ్యక్తిగతమైన సంఘమని దీనర్థం. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల విశ్వాసులు సంఘానికి దగ్గరలో ఉండలేరు. నూతన నిబంధనలోని పత్రికలను చూస్తే, ప్రతీ పత్రిక ఒక స్వతంత్ర్య సంఘానికి కాని ఆ సంఘంలో ఉండే కాపరులకు గాని రాయబడినట్లుగా కనిపిస్తుంది. ఈ సంఘాలు ఏ ఇతర సంస్థల యొక్క ఆధీనంలో పనిచేస్తున్నట్టు మనం చూడలేదు. ప్రతీ సంఘం కూడా ప్రభువుకు నేరుగా జవాబు చెప్పాలని మనం గమనించాలి. ప్రతీ సంఘం నేరుగా క్రీస్తు అధిపత్యానికి లోబడి ఉండాలని నేర్చుకోవాలి. సంఘాల సముదాయాన్ని కానీ, సంస్థలను కానీ, డినామినేషన్ల ఉద్దేశించి కానీ క్రీస్తు ఎక్కడ మాట్లాడలేదని గమనించాలి. ఆయన మాట్లాడినప్పుడల్లా ప్రతి సంఘాన్ని వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడినట్టు మనం లేఖనాల్లో చూడగలం.

ఉదాహరణకు ప్రకటన 2:1లో "ఎఫెసులో ఉన్న సంఘపు దూత (బహుశ ఆ సంఘ కాపరి)కు ఈలాగు వ్రాయుము. ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్థంభముల మద్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా” అని రాయబడింది. ఇక్కడ దీపస్థంభాలు సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి. (ప్రకటన 1:20) ఇక్కడ ప్రభువు ప్రతీ సంఘాన్ని నేరుగానే పరీక్షిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. ఇక్కడ ఏ బిషప్ లేడు, సినోడ్ ప్రెసిడెంట్ లేడు, ఏరియా సూపరిండెంటు లేడు. ఇక్కడ మధ్యవర్తంటూ ఎవరూ లేరు. కానీ ప్రతి సంఘం దేవునికి వాక్యానుసారంగా నేరుగా క్రీస్తే ప్రతి సహవాసమునకు అధికారిగా ఉంటూ ఆయన వాటిని పరిపాలిస్తున్నాడు.

అపొ.కా. 13:1-2 వరకూ చూస్తే, “అంతియొకయలోనున్న సంఘంలో బర్నబా, నీగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ - నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను”. అనేకమంది ప్రవక్తలు యెరూషలేములో ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు నేరుగా అంతియొక సంఘానికి వెళ్ళినట్లు చూస్తామే కానీ యెరూషలేము సంఘం ద్వారా వెళ్ళినట్టు చూడం. అంతియొకయ సంఘం ఆయన అధికారానికి లోబడే ఒక స్వతంత్ర్య సంఘంగా ప్రభువు చేత గుర్తించబడింది. ఇక్కడ మానవ అధికారం చెలాయించడానికి అవకాశం లేదని మనం గమనించాలి. నూతన నిబంధనలో మనం గమనిస్తే ప్రతీ సంఘం క్రీస్తుకు జవాబుదారీ అన్న విషయాన్ని “సంఘం” అనే పదాన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోవడం వల్ల మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. గ్రీకు భాషలో 'ఎక్లీసియా' అంటే ఒక సహవాసంగా ఏర్పడడానికి బయటికి పిలువబడ్డవారని లేక గుమికూడినవారని అర్థం. ఈ పదం నూతన నిబంధనలో 114సార్లు ప్రస్తావించబడింది. అయితే ఎక్కడా కూడా ఒక డినామినేషన్ లేక కొన్ని సంఘాల సముదాయాన్ని ఉద్దేశించో రాయలేదు. లేఖనాలు సంఘాల సముదాయాన్ని ఎప్పుడూ ఒక సంఘంగా గుర్తించలేదు.

ఒక నిర్దిష్ట ప్రదేశంలో కూడుకుంటున్న విశ్వాసులను దృష్టిలో పెట్టుకుని “ఎక్లీసియా” అన్న పదం ఎక్కువగా వాడబడుతుంది. మరికొన్నిసార్లు ముందుగా ఏర్పరచబడ్డవారిని ప్రతీ ప్రదేశంలో ప్రతి కాలంలో ఉన్న విశ్వాసులను దృష్టిలో పెట్టుకుని రాయబడింది. అయితే వ్యక్తిగత సంఘాలనైనా లేకపోతే సార్వత్రిక సంఘాన్నైనా దృష్టిలో పెట్టుకుని ఈ పదాన్ని (ఎక్లీసియా) వాడారు తప్ప, వీటి రెండింటికీ మధ్యలో వచ్చే అర్థంతో ఈ పదాన్ని వాడలేదు. ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల నూతన నిబంధనలో స్వతంత్ర్య సంఘాలని వేటిని అన్నారో తెలుసుకోవచ్చు.

ఈ రోజుల్లో “సంఘం” అనే పదం మీద అవగాహన లేకుండానే ఆ పదాన్ని వాడుతున్నారు. కొంతమంది ఫలానా దేశంలో ఉన్న క్రైస్తవులను దృష్టిలో పెట్టుకుని, వారిని ఒక "సంఘం"గా పరిగణిస్తూ "సంఘం" అనే పదాన్ని వాడారు. అయితే బైబిల్ లో ఒక ప్రాంతంలో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడేటప్పుడు, "సంఘాలు” అనే బహువచనాన్ని వాడుతూ ఉంటారు. ఈ విధంగా 35 సార్లు నూతన నిబంధనలో రాయబడింది. 1 కొరింథీ. 14:34లో చూస్తే, ఇక్కడ “స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలెను” అని రాయబడినట్లు చూడగలం.

పైన రాయబడ్డ ఉదాహరణలన్నిటినీ గమనిస్తే ప్రతీ సంఘం వ్యక్తిగతంగా దేవునికి లెక్క అప్పచెప్పాలనే విషయాన్ని మనం నేర్చుకోగలం. చూడండి! ప్రతీ శరీరం మరొక శరీరంతో సంబంధం లేకుండా ఉంటుంది. అయితే ఆ శరీరానికి శిరస్సు ప్రధానంగా ఉంటుంది. క్రీస్తు ఆ శరీరానికి శిరస్సుగా ఉన్నాడు (ఎఫెస్సీ. 4:15) అయితే ఆ శరీరం మాత్రం సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతీ సంఘం నేరుగా క్రీస్తుకే జవాబుదారిగా ఉంటుందన్న విషయం ఎప్పుడూ మరవకూడదు. కాబట్టి ఇక్కడ ఒక జాతీయ సంఘానికి గాని లేక ఒకరి క్రింద ఒకరు ఉండే గురుపీఠానికి గాని అవకాశం లేదు.

మరి ఒక కుటుంబం కూడా సంఘంతో పోల్చబడింది. మనం దేవుని యొక్క కుమారులము కుమార్తెలుగా ఉన్నాం. ప్రతీ కుటుంబం తనకు తాను ప్రత్యేకంగా ఉంటూ తన తండ్రితో సన్నిహితమైన, అనురాగపూర్వకమైన సంబంధం ఉంటుందని గ్రహించాలి. ఈ విధంగా ప్రతీ విశ్వాసి నేరుగా ప్రభువు యొక్క ప్రేమను పొందుకుంటాడు. దీనిని గుర్తుంచుకోవడానికి బైబిల్ లో రిఫరెన్సులు గుర్తులేకపోతే ఈ మూడు ఉదాహరణలు మనం గుర్తుంచుకోగలం.

2. మారుమనస్సు పొందినవారే సభ్యులుగా ఉండాలి.

వాక్యపరమైన సంఘాలకుండే ప్రత్యేకమైన లక్షణమేమిటంటే, వారు కేవలం మారుమనస్సు పొందిన (విశ్వాసం ప్రకారం నడుచుకుంటున్నవారినే) సంఘ సభ్యత్వంలోకి అనుమతించాలి. నూతన నిబంధనలో ఉన్న ప్రతీ సంఘాన్ని గమనిస్తే, ప్రతీ సంఘం కేవలం మారుమనస్సు పొందిన విశ్వాసులకు మాత్రమే అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడగలం. పౌలు రోమాలో ఉన్న సంఘానికి “రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికి అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డ వారికందరికి... కృపయు సమాధానము...” అని రాస్తున్నాడు. ఈ విధంగానే కొరింథులో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి “కేవలం ఎవరైతే నిజమైన ఆత్మీయ అనుభవం కలిగి ప్రభువును కనుగొంటారో వారికి మాత్రమే సంఘ సభ్యత్వంలో చోటుందనే” నమ్మకంతో రాస్తున్నాడు. చూడండి! ఇక్కడ పౌలు ఏమంటున్నాడో “..కొరింథు సంఘములో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసు నందు పరిశుద్ధపరచబడిన వారై.... యున్నారని” అంటున్నాడు (1 కొరింథీ. 1:2)

ఇక కొలస్సీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు రాసిన తొలిపలుకులను గమనిస్తే, ఖచ్చితంగా మారుమనస్సు పొందినవారినే సంఘసభ్యులుగా పరిగణించాడని చెప్పవచ్చు. “కొలస్సయిలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులనైన సహోదరులని” సంఘంలో ఉన్నవారిని సంబోధిస్తున్నాడు. కేవలం మారుమనస్సు పొందిన విశ్వాసులను మాత్రమే సంఘంలో సభ్యులుగా చేర్చుకోవడమే సంఘం యొక్క లక్ష్యం అని అపొ. కా. 2:47లో చూస్తే అర్థమౌతుంది. ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను” అని లూకా ఇక్కడ రాస్తున్నాడు.

సంఘమంతటినీ సంపూర్ణంగా ఉంచడం అసాధ్యం కాబట్టి కేవలం మారుమనస్సు అనుభవం ఉన్నవారినే సంఘ సభ్యులుగా చేర్చుకోవటం అనేది అవివేకం కాబట్టి మనమందరినీ చేర్చుకోవాలని కొంతమంది ఈ విషయాన్ని విమర్శించేవారు లేకపోలేదు. ఇలాంటివాళ్ళే అందరూ పరిశుద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడం అసాధ్యం కాబట్టి మనం అందర్నీ చేర్చుకోవాలని పట్టుబట్టేవారు కూడా ఉన్నారు. బలహీనమైన మానవ ఆలోచలనకు మనం లోబడకుండా నూతన నిబంధనలో చూపించిన పద్ధతికి లోబడాలి. కొంతమంది సంఘ సభ్యత్వంలోకి అన్ని రకాలవారిని చేర్చుకోవచ్చనే మత్తయి 13:24లో రాయబడ్డ గోధుమలు, గురుగులు ఉపమానాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ ఉపమానంలో గోధుమల్ని గురుగుల నుండి వేరు చేయాలా అని శిష్యులు యజమానిని అడిగినప్పుడు, ఆ యజమాని కోతకాలమందు గురుగుల్ని కట్టలుగా కట్టి కాల్చివేయండి, తరువాత గోధుమల్ని తెచ్చి తన కొట్టు గదిలో పెట్టండని చెబుతాడు. ఈ ఉపమానాన్ని ఆధారం చేసుకుని కేవలం మారుమనస్సు పొందినవారినే సంఘ సభ్యత్వంలోకి చేర్చుకోవాలనే లక్ష్యం ఉంచుకోవడం అసాధ్యమని వాదిస్తుంటారు. అయితే ఈ ఉపమానంలో "పొలం” దేనికి సాదృశ్యంగా ఉందో మనం ప్రశ్నించుకోవాలి. ఎవరైతే సంఘ సభ్యత్వంలోనికి ఎవరినైనా చేర్చుకోవచ్చని వాదిస్తారో వారు "పొలం” సంఘానికి సాదృశ్యంగా ఉందని చెబుతారు. అయితే క్రీస్తు పొలం లోకానికి సాదృశ్యంగా ఉందని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి గోధుమలు గురుగులు ఒకే సంఘంలో ఉండవని, ఇవి రెండూ కూడా లోకంలో కలిసి పెరుగుతాయని, తీర్పు రోజున వాటి భవిష్యత్తు తేలుతుందని మనం గ్రహించాలి. సంఘంలో కేవలం మారుమనస్సు పొందినవారికి మాత్రమే అనుమతి ఉంటుందనే బోధకు ఈ ఉపమానం వ్యతిరేకమైనది కాదని గ్రహించాలి.

ఇంకా ఈ విషయాలపై సందేహాలేమైనా ఉంటే మనం ఇంతకుముందు సంఘాన్ని గురించిన దృష్టాంతాలను(శరీరం, ఆలయం, కుటుంబం) జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మరలా “శరీరం” అనే దృష్టాంతాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. చూడండి! శరీరంలో అన్ని అవయవాలూ జీవం కలిగి ఉండాలి. ఏ అవయంలోనైనా జీవం లేకపోతే శరీరంలో పాలిభాగస్తులై ఉండడం అసాధ్యం. అలాగే సంఘంలో కూడా ఆత్మీయంగా ఎవరైతే తిరిగి జన్మించలేదో వారు సంఘమనే శరీరంలో పాలిభాగస్తులై ఉండడం అసాధ్యం.

సంఘంలో జీవం లేనివారిని చేర్చుకోవచ్చనే వాదనను సమర్థించే దృష్టాంతం ఒక్కటే ఉన్నది. అది ఏమిటంటే ఆలయం లేక (భవనం) కేవలం ఒక భవనంలో ఉండే వస్తువులు జీవం లేనివని ఒప్పుకోవచ్చు. అయితే 1 పేతురు 2:5లో “యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు” అని పేతురు రాస్తున్నాడు. జీవం లేని రాళ్ళకు దేవుని ఆలయంలో చోటులేదని గమనించాలి.

ఇక కుటుంబం అనే దృష్టాంతం గురించి మనం మాట్లాడుకుంటే, కుటుంబంలో జీవంలేని (చనిపోయిన) సభ్యులంటూ ఎవరూ ఉండరు. కేవలం ప్రాణంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ జీవం కలిగిన వాళ్ళందరికీ క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. కేవలం మారుమనస్సు పొందినవారినే సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ విషయం బైబిల్లో మరొకచోట కూడా రాయబడింది. యోహాను 15:2లో ప్రభువు ద్రాక్షవల్లి తీగెలు గురించి మాట్లాడుతున్నాడు. ప్రతీ తీగ కూడ ద్రాక్షవల్లి వంటి లక్షణాలు కలిగి ఉండి, అతుకబడి, ఫలించినవి తప్ప మిగిలినవి పారవేయబడతాయి.

3. సంపూర్ణంగా సంఘానికి కట్టుబడి విశ్వాసులు :

వాక్యపరమైన సంఘానికి ఉండే అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే వారందరూ బోధయందు, వాక్యాన్ని నేర్చుకోవడమందు, ప్రభువు కొరకు ఇతరులతో కలిసి పనిచేయడమందు, ఇతరుల యెడల ప్రేమయందు ఏకమనస్సును కలిగి ఉండడం. మరొకమాటలో చెప్పాలంటే సహవాసానికి పూర్తిగా కట్టుబడి పరిచర్య చేయడమే.

కొంతమంది క్రైస్తవులు, 'మనం సంఘంతో మరింత దగ్గరగా అతుకబడాల్సిన అవసరం లేదండీ, మనం తరచుగా సంఘానికి హాజరవుతూ, ఆరాధిస్తూ, కానుకలు అర్పిస్తూ, స్నేహపూర్వకంగా అందరితో ఉంటే చాలండి', అని అంటారు. రోమా 12:1లో (కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను) రాయబడిన విధంగా సంఘస్తులు కేవలం ప్రేక్షకపాత్ర వహించే విధంగా రూపొందించబడలేదు కానీ ప్రతీ విశ్వాసీ ఆయన పరిచర్యలో నిమగ్నమై ఉండాలని రూపొందించడ్డారు. రోమా 12వ అధ్యాయంలో సంఘంలో సభ్యులు ఎలా ప్రవర్తించాలో రాయబడి ఉంది. ఒక సంఘ సభ్యునికి ఉండాల్సిన కనీస అర్హతలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. "ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండిననూ, ఈ అవయములన్నిటికిని ఒక్కటే పని ఏలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము." (రోమా 12:4-5).

పౌలు కొలస్సీ సంఘాన్ని ఉద్దేశించి కొలస్సీ 2:5లో "నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను”. ఇవి చాలా శక్తివంతమైన మాటలు. వాస్తవంగా “యోగ్యమైన ప్రవర్తన” అనే మాటలు ఒక “క్రమ పద్ధతి” అనే అర్థం వచ్చే గ్రీకు మాట నుండి తర్జుమా చేసారు. దీని పూర్తి అర్థం ఏమిటంటే “క్రమపద్ధతిలో అమర్చబడుట” అన్నమాట. ఒక సైన్యం ఏలాగైతే ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ముందుకు కొనసాగుతుందో, అలాగే కొలస్సీ సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రతీ ఒక్కరూ వారికిచ్చిన పరిచర్యలో వారు పాలిభాగస్తులై ఉండే విధంగా అద్భుతంగా అమర్చబడ్డారు. ఇక్కడ సంఘంలో ప్రతీ ఒక్కరూ ప్రభువు యొక్క అధికారానికి లోబడి వారి వారి స్థానంలో స్థిరంగా అమర్చబడి యుద్ధానికి సన్నద్ధులైన సైనికులవలే ఉన్నారు. కొలస్సీ సంఘంలో ఉన్న ప్రతీ పురుషుడు, స్త్రీ, యవ్వనస్తుడూ వారి వారి శక్తి సామర్థ్యం చొప్పున పూర్తిగా వారి తలాంతులన్నీ సంఘం యొక్క ప్రయోజనార్థం ఉపయోగించాలన్న విషయాన్ని పౌలు నొక్కి చెబుతున్నాడు.

విశ్వాసులు సంఘానికి పూర్తిగా లోబడాలన్న విషయం నూతన నిబంధనలో క్రొత్త విషయమేమి కాదు. ఇప్పుటివరకూ చర్చించిన ఉదాహరణలన్నీ సంఘ సభ్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఒక్కసారి గమనించండి, ఒక శరీరం పనిచెయ్యాలంటే ఎన్ని అవయవాలు పని చెయ్యాలో! శరీరం అనేది అనేక అవయవాలు పొందికగా అమర్చబడిన ఒక వ్యవస్థ. చూడండి! కన్ను, చెయ్యి కలిసి పనిచేస్తాయన్న విషయం ఎప్పుడైనా గమనించామా? ఇది ఐకమత్యానికీ మరియు ఒక అవయవానికి ఇంకొక అవయావానికీ మధ్యనున్న సంబంధాన్ని తెలియపరచే చిత్రం (1 కొరింథీ. 12:13-37).

ఇక భవనం అనే దృష్టాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ భవనంలో ఉన్న రాళ్ళు చక్కగా ఒక పద్ధతిలో అమర్చబడితేనే మిగిలిన గోడలు, స్తంభాలు నిలబడతాయి. సంఘంలో సభ్యులందరూ ఐకమత్యంతో పరిచర్య చేయడానికి ఇది ఒక ఉపమానం.

యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడ్డ ద్రాక్షావల్లి ఉపమానం కూడా నూతన నిబంధనలో ఉండే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఏ తీగలైతే ఫలించవో అవి ప్రభువుకు అసహ్యంగా ఉన్నాయి. దీనిని బట్టి మనం ప్రభువు యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలం.

మరలా "కుటుంబం” అనే దృష్టాంతం కూడా సంఘంలో సభ్యులందరూ ఇతర సభ్యుల ప్రయోజనార్థమై కష్టపడి పనిచేయడానికి సాదృశ్యంగా ఉంది. "సంఘం" గురించి రాయబడ్డ దృష్టాంతాలన్నీ మనం ఇతర సభ్యులతో ఐక్యత కలిగి ఆరాధనలోను, పరిచర్యలోను పాల్గొనడానికి మనం ఖచ్చితంగా బద్దులమై ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. ఎవరికీ
సంబంధం లేకుండా జీవించడం, అందరికీ అందుబాటులో లేకుండా దూరంగా ఉండటం, బద్ధకం కలిగి నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉండటం వంటివన్నీ ప్రభువు చెప్పిన బోధలను ప్రక్కన పెట్టడమే.

4. ఫలభరితమైన ఎదుగుదల :

మత్తయి 28:19-20లో సర్వలోకానికీ సువార్త ప్రకటించండి అనే ఆజ్ఞను ఆధారం చేసుకుని ప్రభువు యొక్క ఆజ్ఞలకు లోబడ్డ ప్రతి సంఘం ఫలభరితంగా ఎదుగుతుంది. ఈ ఎదుగుదలని బట్టే ఒక సంఘం క్రీస్తు సంఘంగా నిర్థారించబడుతుంది.

“కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి”.

ప్రభువు రూపంలో మనం ఎంతమంది శిష్యుల్ని తయారు చేయగలమో అన్నది కేవలం ప్రభువుకు మాత్రమే తెలుసు. కొంతమంది విశ్వాసులు మంచి ఉజ్జీవం ఉన్న సమయంలో జీవించే అవకాశం కలిగి ఉంటారు. మరి కొంతమంది విశ్వాసులు శోధనల కాలంలో (సత్యాన్ని), సువార్తను వ్యతిరేకించే కాలంలో ఉంటారు. మనం ఎంత ఫలభరితంగా జీవిస్తామో దేవుని చేతిలో ఉంటుంది. ఎందుకంటే ప్రభువేమంటున్నాడంటే “ఒకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను”(మత్తయి 13:23). ఫలం అనేది ప్రభువు చేతిలో ఉంటుంది. విస్తారమైన కోతను కోస్తామో లేక కొద్దిదైన ఫలాన్ని అందుకుంటామో, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు యొక్క సంఘాలు ఆత్మల యొక్క కోతను కోస్తాయి. మనము శిష్యులను తయారుచేసే పనిలో ఉంటే ప్రభువు మనతో ఉంటాడు.

శిష్యులను తయారు చేయడాన్ని ప్రభువు విత్తనాలు విత్తడంతో పోల్చుతున్నాడు. మరొక విషయం ఏమిటంటే విత్తనాలు జల్లడానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. కనుక మనం ప్రభువు చెప్పిన బోధ నుండి ప్రోత్సహాన్ని పొందుకోవాలి (గలతీ. 6:9). 'మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము' అన్న మాటలను జ్ఞాపకం చేసుకుని, విత్తనాలు విత్తటానికి పంటను కోయటానికి మధ్య కొంత సమయం వేచియుండాలని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పంటను కోసే సమయం వస్తుందన్న విషయాన్ని మరిచిపోకూడదు. “నేను నాటితిని, అపొల్లో నీళ్ళు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే” (1 కొరింథీ. 3:6)లో అపొస్తలుడైన పౌలు తన పరిచర్యను బట్టి, అపొల్లో పరిచర్యను బట్టి కొరింథు సంఘాన్ని ఉద్దేశించి మాటలాడాడు.

సర్వలోకానికీ వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్న ఆజ్ఞకు ఎంత మట్టుకు లోబడ్డామన్నది ఆ సంఘాల్లో ఉన్న ఎదుగుదలను బట్టి తెలుసుకోగలం. కొద్దిదైనా, గొప్పదైనా ఎంతో కొంత ఎదుగుదల ఉండవలసినదే.

ఉదాహరణకు ఎఫెసీ. 4:16లో చూచినట్లయితే “ఒక ఎదిగే శరీరాన్ని” దృష్టిలో పెట్టుకుని పౌలు మాట్లాడుతున్నట్టు మనం గమనించగలం. ఇక ఎఫెసీ. 2:21లో చూస్తే “ఒక కట్టడం” గురించి మాట్లాడుతున్నాడు. కట్టడం అంటే దానిలో ఎదుగుదల ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. అలాగే ఇక కుటుంబం విషయానికొస్తే కుటుంబంలో ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది. గొర్రెల మంద, ద్రాక్షవల్లి, ఇలాంటివాటిని గమనించినప్పుడు, వాటిలో ఎదుగుదల లేకుండా (ఫలాలు ఫలించకుండా) స్తబ్దత అంటూ ఉండదు. అలాగే ప్రతి సంఘం కూడా దేవుని చిత్తానుసారంగా విత్తనాలు విత్తుతూ, ఆత్మల పంటను కోయడమే పరమావధిగా ముందుకు సాగిపోవాలి. ఒక విశ్వాసి ఒక సంఘంలో చేరాలనుకున్నప్పుడు, ఆ సంఘం ఈ సువార్త సత్యాలను తెలుసుకున్న సంఘమై ఉండాలి.

3వ పాఠం

స్థానిక సంఘం యొక్క ఉద్దేశం

గత పాఠంలో చూసిన నాలుగు సత్యాలు ఒక సంఘం యొక్క ఉనికికి చిహ్నంగా ఉండాలి. ఇప్పుడు సంఘం యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం.

అపొ.కా. 2:41-47లో సరళంగా అర్థం చేసుకోవడానికి నాలుగు అంశాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

సంఘం ఉన్నది -

1. అందరూ కలిసి ప్రభువును ఆరాధించడానికి,

2. ఒకరి యెడల ఒకరు బాధ్యతాయుతంగా మెలుగుతూ సహవాసంలో ఉంటూ పరలోకాన్ని ప్రతిబింబించే ఒక ప్రదేశంగా ఉండటానికి,

3.సువార్తను ప్రకటించడం ద్వారా మరియూ దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా దేవునికి మహిమను తేవడానికి, మరియు

4. దేవుని పరిచర్యలో దేవుడు వారికిచ్చిన తలాంతులను వాడుకోవడానికి.

 1. అందరూ కలిసి ప్రభువును ఆరాధించడం :

ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకూ చెప్పబడ్డ విధంగా ఇతర విశ్వాసులతో కలిసి ప్రభువును ఆరాధించడం, ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, ఆనందమై ఉంది. ప్రభువును ఆరాధించడం నిత్యత్వంలో కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆ దేవదూత గణంతో కలిసి ఆ త్రియేక దేవునికి సమస్త ఘనత, మహిమ నిత్యం చెల్లిస్తూ ఉంటాము.

విశ్వాసులు ఆత్మీయ లోతుతో, నిజాయితీతో దేవుణ్ణి ఆరాధించినపుడు ఆయనకు మహిమ కలుగుతుంది. అంతేకాదు. విశ్వాసులందరూ ముక్తకంఠంతో ఏకహృదయంతో ఆయనను ఆరాధించినప్పుడు ఆయనకు గొప్ప మహిమ కలుగుతుంది. ఒక సంఘం యొక్క ప్రత్యేకమైన పని ఏమిటంటే ఆ సంఘంలో ప్రభువు యెడల గౌరవ ప్రధమైన ఆరాధన కలిగి, లేఖనాలు చదవబడాలి. ఇంకా ప్రార్థన మరియు వాక్యప్రకటన ఉండాలి. ఇదంతా కూడా విశ్వాసులు ఐక్యత కలిగి ఒక పద్ధతిలో ప్రభువును ఆరాధించాలి.

అందరూ కలిసి ప్రభువును ఆరాధించినపుడు, విశ్వాసులందరూ కలసి ఆరాధించినపుడు అది ఒక గొప్ప శక్తివంతమైన సాక్ష్యంగా మారుతుంది. ఒక వ్యక్తి ప్రభువును వ్యక్తిగతంగా ఆరాధించినపుడు ఒక అవిశ్వాసికి అది అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు ఎందుకంటే అది తన వ్యక్తిగత ఆరాధన కాబట్టి. ఒక మాటలో చెప్పాలంటే మనలో ఉండే గర్వాన్ని బట్టి బయటికి కనపడేటట్లు ఒక వ్యక్తి ప్రార్థన చెయ్యడం, ఇతరులకు చందాలు ఇవ్వడం లాంటివి ప్రభువుకు ఇష్టం ఉండదు కాని అందరూ కలిసి ప్రభువును ఆరాధించడం ఎంతో తగ్గింపుతో కూడిన ఆరాధన. ఆయనను గౌరవంతో ఆరాధిస్తూ, ఆయన సన్నిధి చేత తాకబడినట్లుగా ఆయనను ఆరాధించడం మనమిచ్చే ఒక గొప్ప సాక్ష్యం. ఇక్కడ సంఘ సభ్యులు చేయాల్సిన కొన్ని బాధ్యతలను చూడవచ్చు. దేవునికి దక్కాల్సిన ఘనత ఆయనకే దక్కేటట్టుగా ఆయనను మనం ఆరాధించాలంటే మనం మన హృదయాలను సిద్ధపరుచుకుని, ఆరాధనకు ముందుగా రావాలి. ఆరాధనకు ముందుగానే మన సమస్యలన్నిటినీ తీర్చుకుని, మన పాపాలన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకుని, మన హృదయాలను సిద్ధపరచుకుని ఆరాధనకు రావాలి.

2. పరలోకాన్ని ప్రతిబింబించే ప్రదేశం (విలక్షణంగా ప్రభువు యొక్క ఆధిపత్యానికి లోబడ్డ ప్రదేశం)

వీలైనంత వరకూ సంఘమనేది ఈ లోకంలో పరలోకాన్ని ప్రతిబింబించే ప్రదేశంగా ఉండాలి. ప్రభువు యొక్క శక్తిని, ఆయన కృపను నిరూపించి, క్రీస్తు ప్రేమను, ఆయన జీవితాన్ని ప్రతిబింబించే ఒక నమ్మకమైన కుటుంబంగా సంఘం ఉండాలి. ప్రేమను, ఆప్యాయతను, ఐక్యతను వ్యక్తపరిచే కుటుంబంగా ఉండడమే ప్రభువు యొక్క చిత్తం. ఒకరికి ఒకరు సహాయపడుతూ, ఎంతో ఉత్సాహంతో ప్రతీ స్థానిక సంఘం ఉండాలన్నది దేవుని చిత్తమై ఉన్నది.

యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు తన తండ్రిని ప్రార్థించేటప్పుడు, 'మనము ఏకమై ఉన్నట్టుగా వీరిని లోకం తెలుసుకునేట్టు సత్యమందు వారిని ప్రతిష్టించుము', అని అన్నట్టు ప్రతీ సంఘం ప్రభువు మాటలను పోలి నడుచుకోవాలి. అయితే ఈ ఐక్యత డినామినేషన్లనన్నిటిని కలపడానికి ఉపయోగించింది కాదు గానీ వాక్యపరమైన (సిద్ధాంతపరమైన) ఐక్యత కలిగి, ఇతర విశ్వాసులతో సహవాసంలో ఉండటం కొరకే. సువార్త ప్రకటనతో పాటూ, సంఘం యొక్క ప్రాథమిక బాధ్యత ఏమిటంటే సంఘం యొక్క జీవితాన్ని, వారి నడకను ప్రతీ ఒక్కడూ చూసే అవకాశమివ్వాలి.

“మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” అని 1 పేతురు 2:9లో మన గురించి రాయబడింది కదా!

నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులు, పరలోకాన్ని ప్రతిబింబించే ప్రదేశంగా సంఘం ఉండటాన్ని కోరుకున్నారు. చూడండి - ఎఫెసీ 2:19-22లో "... పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై యున్నారు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు”అని రాయబడి యున్నది.

ఈ విధంగా సంఘాన్ని కాపాడడానికి, నడిపించడానికి ఐక్యతలో అభివృద్ధి చెందడానికి, ప్రభువు ప్రతి సంఘానికీ కొన్ని పద్ధతులను అనుగ్రహించాడు. ముఖ్యంగా ఈ విషయాలు (సంఘాన్ని) మనకు కాపరి పత్రికల్లో స్పష్టంగా కనబడతాయి. ఈ పత్రికల్లో సంఘకాపరులు సంఘాన్ని ఏ విధంగా కాయాలో రాయబడి ఉంది.

ఈ లోకంలో మనం అనేక రకాలైన ప్రభుత్వాలను చూస్తుంటాము. కానీ సంఘనాయకులు సంఘం చేత ఎన్నుకోబడి, లేఖనాల్ని ఆధారం చేసుకుని సంఘాన్ని కాయాలని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. సంఘ నాయకుల జీవితాలు మాదిరికరంగా ఉండాలని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు.

సంఘ అధికారం (ప్రభుత్వం) అనే అంశం లేఖనాల్లో చూసినప్పుడు అది అద్భుతంగా, చాలా సన్నిహితంగా రాయబడింది. మొదట్లో చూస్తే ఒకదానికొకటి సంబంధం లేదన్నట్టు అనిపించినా, క్రొత్త నిబంధనలో చూస్తే కొన్ని వచనాలు సంఘ సభ్యుల మీటింగును దృష్టిలో పెట్టుకుని రాసినట్లు గమనించగలం - సంఘం ఎంత ఖర్చుపెట్టాలి, ఎవర్ని పరిచారకులుగా ఎన్నుకోవాలి, ఎవర్ని సంఘకాపరులుగా ఎన్నుకోవాలి, ఎవర్ని మిషనరీలుగా ఎన్నుకోవాలి, ఎవర్ని సంఘంలో సభ్యులుగా ఉంచాలి, ఎవర్ని సభ్యత్వం నుండి తొలగించాలి అన్న విషయాల్ని చూడవచ్చు.

అయితే మరికొన్ని వచనాల్ని చూస్తే పైన ప్రస్తావించిన అంశాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనపబడతాయి. అయితే అ లేఖనాలన్నిటినీ ఒకసారి పరిశీలిస్తే, సంఘం తీసుకునే నిర్ణయాలన్నిటిలోనూ సంఘ సభ్యులందరూ పాల్గొంటారు. అయితే కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు కాపరులకు (సంఘ నాయకులకు) వదిలిపెట్టినట్లు లేఖనాల సారంశం. ప్రతీ సంఘం పరలోకాన్ని ప్రతిబింబించాలంటే సంఘనాయకులు తీసుకునే నిర్ణయాలు బాధ్యతాయుతంగా ఉండాలి.

నియంతల్లాగ ఏకచక్రాధిపత్యం వహించి ప్రభువు హస్తాన్ని ఇష్టమొచ్చినట్లు వాడుకునే సంఘ నాయకులకు సంఘంలో తావులేదు. కాని ఒక కుటుంబంలో నిరూపించుకున్న (సంఘం) కుటుంబం చేత బలపరచబడ్డ నాయకత్వాన్ని సంఘం కోరుకుంటుంది. సంఘానికి ఒకే దర్శనం, ఒకే లక్ష్యం ఉండేలా నడిపించే బాధ్యత సంఘకాపరులకు, నాయకులకు ఉంది. ఇక్కడ (సంఘం) నాయకులు దయగలిగినవారుగా, జాలి కలిగినవారుగా ఉండాలి. నాయకులు సంఘంలో నుండి వచ్చిన దయగలిగిన నాయకులవలే ఉండాలి తప్ప సంఘంపై అజమాయిషీ చేసేవారుగా ఉండకూడదు. సంఘనాయకులు విశ్వాసులకు మాదిరికరంగా ఉంటూ విశ్వాసుల బాధను అర్థం చేసుకునేవారుగా ఉండాలి.

ఈ విధమైన వాక్యపరమైన సంతులనంతో కూడిన నాయకత్వాన్ని సంఘసభ్యులు మీటింగులలో చూడగలం. అనవసరమైన చిన్న చిన్న లేక రోజువారీ అంశాలను సంఘనాయకులతో చర్చించి కేవలం వారు నిర్ణయం తీసుకునే అంశాలను మాత్రమే వారి యొద్దకు తీసుకుని రాకూడదు. మెంబర్స్ మీటింగ్ జరిగేటప్పుడు చర్చించాల్సిన అంశాలు ఎలాంటివి ఉండాలంటే ఎవరిని సంఘ సభ్యత్వములోనికి తీసుకోవాలి, ఎవరిని పరిచారకులుగా లేక కాపరులుగా ఏర్పరచాలి? తీసుకోవల్సిన ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? పెట్టాల్సిన ఖర్చులు ఏమిటి? అవసరాలు ఏమిటి అన్న విషయాల్ని సంఘ సభ్యుల మీటింగ్ లో చర్చించాలి. సంఘమంతా ఆయా విషయాల్ని పంచుకోవాలి, బాధ్యత తీసుకోవాలి (సభ్యులందరూ) ప్రార్థించాలి, ఇంకా కష్టపడాలి. సంఘసభ్యులు నిర్ణయం తీసుకునేటట్లుగా ఆయా అంశాలను సంఘనాయకులు వారి ముందు ఉంచాలి. ఇలా కాకుండా మరే పద్ధతైనా అవలంబించినట్లయితే వాక్యాన్ని (లేఖనాల్ని) ప్రక్కన పెట్టినట్లే.

సంఘం పరలోకాన్ని ప్రతిబింబించే గుంపుగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ సహవాసంలో పాల్గొంటూ, ప్రేమ కలిగి, స్నేహభావంతో, ఇతరులను గౌరవిస్తూ, ఒకరి భారాలను మరొకరు మోస్తూ క్రీస్తు నియమాన్ని నెరవేర్చడమే (గలతీ. 6:2). ఈ నియమాలు ఈ పుస్తకం చివరిభాగంలో రాయబడ్డాయి. మనకున్న స్వార్థాన్నంతటినీ విడిచిపెట్టి, ఒకరికొకరు ప్రార్థించుకుంటూ, ఒకరి అవసరాల్ని మరొకరు గమనిస్తూ, ఒకరియెడల ఒకరు స్నేహభావం కలిగి ఉండటమే సంఘ సభ్యులుగా దేవుడిచ్చిన పిలుపును అందుకోవడం అంటే.

మన సుఖం కొరకు, మన ఆనందం కొరకు ప్రభువు యొక్క సంఘాన్ని వాడుకునే శోధనను మనం జయించాలి. ముఖ్యంగా యౌవనస్థులు దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు వినోదాలు, రకరకాల కార్యక్రమాలకు ముందుపీట వేసి ఆరాధనను, ఆత్మీయ ఎదుగుదలను వెనుకకు తోసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో "సంఘం" క్రైస్తవ వినోదాలకు కేంద్ర బిందువుగా మారిపోతుంది. కాని అసలు ప్రశ్న ఏమిటంటే “నేను సంఘానికి ఏమి చేస్తున్నాను అన్నదే!” యెరూషలేములో ఉన్న సంఘాన్ని మనం చూస్తే వారు ప్రభువు కొరకు బలంగా సాక్ష్యం చెబుతూ, వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని పఠిస్తూ వారి సమయాన్ని గడపడం మనం చూడగలం. పెంతెకొస్తు దినాన అందరూ మారుమనస్సు, రక్షణ పొందాలని పేతురు పిలుపునిచ్చాడు. కాబట్టి వారు ప్రతి రోజూ దేవాలయంలోనూ, ఇంటింటనూ మానక బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ (అపొ.కా. 5:42) ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” అన్న ప్రభువు మాటలకు మొదటి నుండి లోబడినట్టు గమనించగలం. (మార్కు 16:15).

సువార్త పని చేయడానికి, వాక్యాన్ని బోధించడానికి, వాక్యం చెప్పేవారిని పోషించడానికి, మనకున్న తలాంతులు ప్రభువు సేవలో వినియోగించడానికి, క్రొత్తగా మారుమనస్సు పొందినవారిని బలపరచడానికి నిరంతరం శ్రమించే సంస్థలా పనిచేసే సంఘాలు కావాలి. క్రీస్తు రాజ్యవ్యాప్తి కొరకు క్రీస్తు నియమించిన స్థానికసంఘాలు లేకుండా ఆయా లక్ష్యాలను మనం సాధించలేం.

ఇప్పటి వరకూ ప్రస్తావించిన పనులేవి కూడా సంఘం లేకుండా సాధించలేం. ప్రజలందరూ (సభ్యులందరూ) కూడుకోకుండా దేవుణ్ణి ఆరాధించడం అసాధ్యమని గమనించాలి. ఆలాగే ఒక కుటుంబంలాగా ఉండే సంఘాలు లేకుండా పరలోకాన్ని ప్రతిబింబించే సంఘాలను స్థాపించడం అసాధ్యం. అలాగే సంఘాలు లేకుండా సువార్త పరిచర్య చేయడం ద్వారా రక్షించబడ్డవారిని బలపరచడం అసాధ్యం.

4. తలాంతులను సమకూర్చడం :

విశ్వాసులకిచ్చిన తలాంతులు క్రీస్తు పరిచర్యలో వాడడానికి సంఘం యొక్క నాల్గవ ఉద్దేశమై ఉంది. విశ్వాసుల యొక్క తలాంతులను బలపరచి వారిలో సమన్వయాన్ని తీసుకుని రావడం సంఘం యొక్క ఉద్దేశమై ఉంది. మరొక విషయం ఏమిటంటే రాబోయే తరంవారిని సిద్ధపరచడానికి కూడా సంఘం‌ ఉంది (2తిమోతి 2:2). ఇవన్నీ ఒక స్థానిక సంఘం లేకుండా సాధించడం కష్టతరం. ఒక సంఘం (సహవాసం) అనేది లేకుండా విశ్వాసుల తలాంతులు గుర్తించడం కష్టం. ఒకరికి ఒకరు సమన్వయ సహకారం లేకుండా ఒకరి తలాంతులు గుర్తించడం, వారికి తర్ఫీదు ఇవ్వడం, వారిని మెరుగుపరచడం లాంటివి చెయ్యడం కుదరదు. ఎఫెసీ 4:15-16 చూస్తే, ఈ వచనాలు సంఘసహవాసం విభిన్నమైనది, క్లిష్టతరమైనదైనప్పటికీ, అందరూ ఐక్యత కలిగి పరిచర్య చేసే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ పౌలు సంఘసభ్యులందరూ కలిసి "ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము, ఆయన శిరస్సయి యున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలో నున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది” అని ప్రార్థిస్తున్నాడు. .

ఒకసారి ఒక సహవాసంలో మెంబర్షిప్ (సభ్యత్వం) అనేది లేనట్లుగా ఊహించుకుందాం. ఉదాహరణకు ఒక వ్యక్తి విశ్వాసుల్ని చాలా సులభంగా దర్శించగలడు కాని సువార్తను వివరించమన్నా లేక కష్టంలో దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోవాలన్నా చేయలేడని అనుకుందాం. అలాంటి వ్యక్తి తనంతట తానే పరిచర్య చేయాలంటే అది చాలా క్లిష్టతరమైనది. అదే ఆ వ్యక్తి ఒక సహవాసానికి అనుబంధంగా ఉంటూ పరిచర్య చేసాడనుకోండి, అది చాలా ఫలభరితంగా ఉంటుంది. ఎందుకంటే సంఘంలో సువార్తను వివరించగలిగేవాళ్లు, కష్టంలో దు:ఖంలో ఉండేవాళ్ళను ఆదుకునేవాళ్ళు మరికొందరు ఉంటారు కాబట్టి.

మనకు వ్యక్తిగతంగా ఎన్ని తలాంతులు ఉన్నప్పటికీ, ఇతరులతో కలిసి పనిచేసినప్పుడే మన తలాంతులకు నిజమైన పని కల్పించినట్లు కనుక ఒక స్థానిక సహవాసం చేయాల్సిన పని ఏమిటంటే అందరూ కలిసి, సమిష్టిగా, పరిపూర్ణంగా ప్రభువు కొరకు పనిచేసేలా కృషి చేయాలి. దానిని పనిచేసే సంఘం అంటారు. నిజానికి ఒక సహవాసంలో సభ్యులుగా ఉండకుండా ఉంటే ఖచ్చితంగా త్వరలో ఒంటరితనంతో ఓడిపోవడం, నిరుత్సాహపడటం లాంటివి జరగడం ఖాయం.

మనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించే విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తామో దానిని బట్టి సంఘం పని చేసే తీరు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఆర్థిక వనరులను బట్టి కేవలం ప్రభువు మీద ఆధారపడి పనిచేసే సంఘ నాయకులను పోషించడానికి ఇంకా అనేక అవసరాలను తీర్చే విషయంలో సహవాసం ముందుంటుంది. ఈ విషయాన్ని 1 కొరింథీ. 9:16-24 వరకూ చూడగలం.

image

ఇతర విశ్వాసుల తలాంతులు వాడబడటానికి సంఘం ఎంతో సమిష్టిగా కష్టపడాలి. మరొక విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా పనిచేస్తే మన కష్టమంతా బూడిదలో వేసిన పన్నీరే. ఈ విధంగా చార్లెస్ వెస్లీ రాస్తున్నాడు - "ప్రభువా నీవు మా యొక్క ఉద్దేశాలను దీవించకపోతే, మేము అద్భుతంగా చేసిన క్రియలన్నీ వ్యర్థములే, ఇక మా ఆలోచనలు నెరవేరవు. మా బలమంతా వృథాగా ఖర్చు చేసినట్లే. కానీ! మా ప్రయత్నాలన్నిటిలో నీవు ఉంటే అవన్నీ ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి."

ఇటువంటి క్లిష్టతరమైన బాధ్యతల నుండి దృష్టి మళ్లించి సింపుల్ గా ఏదో వాక్యం చాలులే, అందరూ కలిసి కష్టించి పని చేయవలసిన అవసరం లేదులే అని అనుకునేలా సాతాను పాస్టర్లను, సంఘ నాయకులను శోధిస్తూనే ఉంటాడు. ఏదో సండేస్కూలు నడిపించడానికి కొంతమంది ఉంటే చాలు లేకపోతే ఆయా కార్యక్రమాలు చూసుకోవడానికి కొంతమంది ఉంటే చాలు, సమస్యలన్నీ పోతాయి అని అనుకునేలా చేస్తాడు. సహవాసాన్నంతటినీ ఏకతాటిపై నడిపించి ప్రతీ క్షణం ప్రభువు కొరకు పనిచేయకుండా ఉండటానికి, ఈ విషయాన్ని తలచుకొంటే చాలు గుండె గుభేలుమనేంతగా సాతాను తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కావున మనం విశ్వాసుల తలాంతులు సద్వినియోగం చెయ్యడానికి అవసరమైన వనరులన్నీ సేకరించడానికి, నిజమైన దేవుని సైనిక బలగాన్ని తయారు చేయడంలో అహర్నిశలు శ్రమిస్తూనే ఉండాలి. దేశంలో ఉండే పెద్ద పెద్ద సంస్థలకీ, దేవుని సంఘానికి ఉన్న తేడా ఏమిటంటే సహవాసం మన గర్వాన్ని, అహంకారాన్ని అణచివేస్తుంది. మానవుని మనస్సు ఈ విషయంలో చాలా బలహీనమైనది (రక్షించబడ్డవారి యొక్క మనసు కూడా బలహీనమైనదే).

కొంతమందికి పెద్ద పెద్ద సంస్థలను కలిగుండి వాటి మీద ఆజమాయిషీ చెలాయించడం అంటే ఎంతో ఇష్టం. వారికి వారి పదవులు పోతాయని ఎంతో భయం. వారు వారి యొక్క సంస్థలు, డినామినేషన్లు వారికే దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి కళ్ళెదుటే తప్పులు దొర్లుతున్నా పట్టించుకోరు. వారి ఆత్మను పట్టించుకోరు. ఇలాంటి సంస్థల మీద, గ్రూపుల మీద సాతాను తన దృష్టిని నిలుపుతాడు. తద్వారా ఆ సంస్థలు, గ్రూపులు అబద్ధబోధకులకు నిలయంగా, వాక్యానికి విరుద్ధంగా ఉండే పద్ధతులను వాడే గ్రూపులుగా మారతాయి. కాలక్రమేణా ఈ సంస్థలు, డినామినేషన్లు ఆత్మీయంగా పటిష్టమైన స్థితి నుండి వైదొలగి క్షీణించిపోయే అవకాశం ఉంది. ఈ సత్యం చరిత్రలో పునారావృతం కావడం మనం చూడగలం.

కాని ఒక "సహవాసాన్ని” దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. పెద్ద పెద్ద సంస్థలన్నిటిని ప్రక్కన పెట్టి కేవలం స్వతంత్ర “సంఘాన్నే” క్రీస్తు ఆశీర్వదించాడు. సంఘం కన్నా క్లిష్టమైనది మరొకటి ఏమీ లేదు. ఎవరైతే విశ్వాసులు లోతుగా గమనించారో, వారినే వారి అధికారులుగా సంఘం ఎంచుకుంటుంది. వారే సంఘాన్ని నడిపిస్తారు. సంఘం మీద పెత్తనం చెలాయించడానికి అవకాశాలుండవు. కాబట్టి పెద్ద పెద్ద సంస్థలకు యజమానుల్లాగా ఉండటానికి అవకాశం ఉండదు. కాబట్టే నూతన నిబంధనలో సంఘాన్ని గురించి చూపించిన పద్ధతి అమోఘమైనది. పెద్ద పెద్ద డినామినేషన్లను, సంస్థలను నిర్మించకుండా, సంఘాన్ని నిర్మించడమే దేవుని చిత్తమై ఉంది. ఇటువంటి డినామినేషన్లు, సంస్థలు విశ్వాసులను నిష్ప్రయోజకులుగా మార్చి, భయంకరమైన పాపంలో పడిపోయేట్టు మారుస్తాయి. కాని రక్షించబడి ప్రభువు చేత ఆకర్షించబడి వారి యొక్క తలాంతులు, వనరులన్నీ ప్రభువు యొక్క మహోన్నతమైన పరిచర్యలో వాడే కుటుంబమే ఒక స్థానిక సంఘం.

4వ పాఠం

సహవాసానికి కట్టుబడి ఉండడం

ఈ దినాల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే, 'విశ్వాసులు (మెంబర్స్) వారి స్థానిక సహవాసాలకు బలంగా కట్టుబడి ఉండరు' అనే విషయాన్ని వింటూ ఉంటాం. వారి స్థానిక సంఘం గురించి ఆలోచించకుండానే ఏ ఊరిలో ఉండాలి, ఎక్కడ ఉద్యోగం చెయ్యాలి అని ముందుగానే నిర్ణయాలు తీసుకుంటారు. బలంగా ఒక సహవాసానికి కట్టుబడి ఉండాలి అనే ఆలోచన కన్నా ఎంత సంపాదించాలి, నాకు ఏది బాగుంటుంది అనే వ్యక్తిగత నిర్ణయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. విశ్వాసులు సహవాసానికి కట్టుబడి ఉండకుండా కేవలం వారి భౌతిక అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారని అనేకమంది సంఘకాపరులు వాపోతుంటారు.

ఇలాంటి సందర్భాల్లో మనం ప్రభువు చిత్రాన్ని అతిక్రమించే అవకాశం ఉందా? ప్రభువు మనం సంఘానికి లోబడి, కట్టుబడి ఉండాలనే బాధ్యతను ఇస్తే, ఆ బాధ్యతను మనం విస్మరించి దానిని వెనక్కు నెట్టేస్తే ఏమి జరుగుతుంది? దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని నిశ్చయత ఏ విధంగా ఇవ్వగలవు? నీ జీవితంలో ఉండే అనేక ప్రాముఖ్యమైన విషయాల్లో నీ సంఘానికి కట్టుబడి ఉండడం ఎంతవరకు నీకు ప్రాముఖ్యమైనది లేక ప్రధానమైనది అనే విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ పాఠంలో సంఘానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సువార్త ఏమాత్రం లేని ఒక ప్రదేశంలో ఒక 10 జంటలు (విశ్వాసులు) ఒక సంఘంగా ఏర్పడిన విషయం రచయితకు తెలుసు. కేవలం రెండు సంవత్సరాలు కాకుండానే మొత్తం అందరూ వెళ్ళిపోయి కేవలం రెండు జంటలు మాత్రమే మిగిలి ఉన్నారంట. ఇంతకీ కారణం ఏమిటి? ఇక్కడకంటే వేరొకచోట మంచి ఉద్యోగం అవకాశాలు వచ్చేసరికి, వాళ్ళ కెరీర్‌ను అభివృద్ధి చేసుకుందామనే ప్రక్రియలో అందరూ ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాస్తవం ఏమిటంటే వీళ్ళందరూ అత్యవసర పరిస్థితిలో లేరు. కేవలం క్రీస్తు శరీరంతో సన్నిహిత సంబంధం లేకపోవడం వల్ల దేవుడు వారిని ఎక్కడ పెట్టాడో అక్కడ ప్రభువుకు సాక్షులుగా ఉండాలనే కోరిక బలంగా లేకపోవడం వలన వీళ్ళందరూ ఆ సంఘాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోతే సంఘం కుంటుపడిపోతుంది అన్న విషయం వారికి తెలిసినప్పటికీ, వాళ్ళకి వాళ్ళ కెరీర్లు, ఉద్యోగాలే ప్రాముఖ్యమని చెప్పుకోవాలి.

సంఘానికి మొదటి ప్రధాన్యత లేక సంఘం పట్ల చిన్న చూపా!

ఇక్కడ విషయం ఏమిటంటే, విశ్వాసులకు సంఘమంటే అంత చిన్నచూపు ఎలా ఏర్పడింది? ఒక సంఘం గురించి బైబిల్ ఏమి చెబుతుంది అనే విషయం పట్ల అవగాహన లేకపోవడం అనేది (ఇక్కడ) స్పష్టంగా కనిపిస్తుంది. బహుశ క్రీస్తు శరీరం అంటే వారికి అర్థం కాలేదేమో. వారికి సంఘం ఒక సూపర్ మార్కెట్, బాగా లేకపోతే ఒక బ్యాంక్ బ్రాంచ్ లాగా కనిపించి ఉండొచ్చు. “నాకు మన సూపర్ మార్కెట్ ఇష్టమండీ లేకపోతే మన బ్యాంక్ బ్రాంచ్ అంటే నాకు ఇష్టమండీ” అని, వాటి కొరకు వేరే ఊరికి వెళ్ళకుండా నిర్ణయించుకునే వాళ్ళెవరైనా ఉంటారండీ? వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ వారికి కావలసిన సదుపాయాలు దొరుకుతాయి కాబట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి వెనుకాడరు.

అయితే ఇక్కడ ఒక సంఘం అంటే ఏమిటి? దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కొంతమంది విశ్వాసులందరూ కలిసి వారికి కుదిరినప్పుడల్లా ఆరాధించేదేనా సంఘమంటే లేకపోతే అది దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనదా? దేవుడు విశ్వాసులను సభ్యులుగా ఎంచుకుని, వారికి తలాంతులు, బాధ్యతలు అప్పగించి ఒకరికి ఒకరు కట్టుబడి ఉంటూ ఆయనకు పరిచర్య చేస్తూ ఒక కుటుంబంగా ఉండటానికి పిలిచాడా లేదా? నువ్వు వెళ్ళే సంఘంలో దేవుడు నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడా లేదా? ఒకసారి ఆలోచించు.

అయితే కట్టుబడి ఉండటానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అందరూ స్వాతంత్య్రాన్నే కోరుకుంటున్నారు. ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి అనే మాటంటే చాలు, ఏదో బంధకాల్లో ఉన్నట్లు, మళ్ళీ ధర్మశాస్త్ర భారం మోసినట్లు, మనల్ని యంత్రాల్లాగ మార్చేస్తున్నారంటూ ఫీలైపోతూ ఉంటారు. కట్టుబడి ఉండడాన్ని ఆత్మ ఇచ్చే స్వాంతంత్య్రానికి విరుద్ధంగా ఉందంటూ బాధపడిపోతారు. కానీ నూతన నిబంధనలో చూస్తే విశ్వాసులందరూ ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి, పరిచర్యలో ఒకరికి ఒకరు కట్టుబడి ఉండటాన్ని మనం చూస్తాం. అప్పుడప్పుడు వచ్చిపోయేవారే నూతన నిబంధనలో ఉన్న సంఘమంటే కుదరదండీ. సంఘానికి శిరస్సయిన క్రీస్తు యొక్క ఆజ్ఞలను శిరసావహించడానికి ఆత్మీయంగా అల్లుకున్న ఒక ప్రత్యేకమైన కుటుంబం. సంఘం క్రీస్తు యొక్క ఆనందానికి అతిశయం. ఆయన దానిని తన కంటికి రెప్పలాగా చూసుకుంటాడు.

1 కొరింథీ. 12వ అధ్యాయంలో పౌలు పలుమార్లు సంఘాన్ని ఒక శరీరంగా పేర్కొన్నాడు. అయితే 'దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను' అని 18వ వచనంలో అంటూ 'శరీరంలో వివాదాలు ఉండకూడదు' అని అంటున్నాడు. శరీరంలో ఉన్న ప్రతీ అవయవానికి ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ప్రతి అవయవానికి ఒకొక్క బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ప్రభువు చిత్తప్రకారం ఒక వ్యక్తి సంఘంలో నుండి తొలగించబడితే తప్ప, ఒక ముఖ్యమైన అవయవం ఆ శరీరం నుండి తొలగించబడదు. కాబట్టి సంఘంలో ఒకరి యెడల మరొకరు ఎంత బాధ్యత కలిగియుంటారంటే, ఒకరు శ్రమపడుతుంటే, మిగిలినవాళ్ళు కూడా శ్రమపడాల్సిందే. దేవుని ప్రణాళికలో సంఘానికి ఒక ప్రత్యేక స్థానముంది. సంఘం అనేది ఒకరియెడల మరొకరు సన్నిహిత సంబంధాన్ని కలిగుంటారు అనే దానికి “శరీరం” తో పోల్చి చూచినట్టు ఎఫెసీ 4:16లో చూస్తాం. “ఆయన శిరస్సయియున్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి, తనలో నున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది” అని ఎఫెసీ 4:16లో రాయబడింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక శరీరంలో అతుకబడిన కీళ్ళు, అవయవాలు ఇతర శరీరాలతో (సంఘాలతో) అతికీఅతకనట్లు అప్పుడప్పుడూ వెళ్ళివస్తున్నట్లుగా ఊహించుకోవడం కుదురుతుందా? ఒక చెయ్యో లేకపోతే మోకాలో వాటంతట అవే వెళ్ళి వేరే శరీరానికి అతకడటం కదురుతుందా? ఆయా ప్రజలు ఆయా సంఘాల్లో ఉండటం దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి చెందిన హక్కని, దీనిని దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడని ఈ దృష్టాంతం ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడ మనం ఒక సంఘమనే కుటుంబానికి కట్టుబడి ఆ సంఘానికి మనం పరిచర్య చేస్తూ మన జీవితాలను కొనసాగించాలని దేవుడు మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. విశ్వాసులందరూ కలిసి క్షేమాభివృద్ధి చెందేలా ఇలాంటి వచనాలు మనకు తెలియజేస్తాయి. దేవుని యొక్క శక్తిని, కృపను ప్రతిబింబింపచేయడానికి ఒకరికి ఒకరు ప్రేమ కలిగి, ఒకరియెడల మరొకరు బాధ్యత కలిగి, ప్రభువుకు పరిచర్య చేయడాన్ని ఈ వచనం తెలియజేస్తుంది.

మరి నూతన నిబంధన "సంఘం" యెడల ఇంత ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటే, ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు ఎందుకు "సంఘం" యెడల అంత తక్కువ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? బహుశా సంఘం యొక్క అజమాయిషీని తిరస్కరించాలి అన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారేమో!! ఔను, సంఘంపై ఇతరులు కాని, ఏ ఇతరత్రా కౌన్సిల్ కాని, లేక వేరే ఏదైనా ఒక వ్యవస్థ కాని, లేక ఏ ఇతర సంఘ నాయకులు కానీ సంఘంపై అజమాయిషీ చెలాయించడాన్ని మనం సహించకూడదు. ప్రతి విశ్వాసి ఒక యాజకుడే, ఎవరైతే రక్షకుడిని వెదకడానికి ప్రయత్నం చేస్తారో వారు నేరుగా ఆయన యొద్దకు వెళ్ళవచ్చు. కనుక దీన్నంతా గమనించి, సంఘం గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో, అయితే గమనించాల్సిన విషయమేమిటంటే వారు ఒక విశ్వాసికున్న స్వాతంత్య్రానికి ఇవ్వవలసినదాని కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విశ్వాసులెవరూ ఏ సంఘానికి లోబడాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. వారికి సంఘస్తులంటే కేవలం ఆదివారం ఆరాధనకు వెళ్లి వాక్యం వినేవారనే అభిప్రాయం ఉంది. అంతే తప్ప సంఘానికి లోబడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు.

అయితే ఇక్కడ చిక్కేమిటంటే, సంఘం కూడా ఆదివారం ఆరాధనకే పరిమితమయ్యేది అయినప్పుడు ఇతరుల దగ్గర నుండి నమ్మకత్వాన్ని, కట్టుబడి ఉండడాన్ని ఆశించడం తప్పే ఔతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘం కూడా ఒక బ్యాంకు, ఒక సూపర్ మార్కెట్, ఒక యూనివర్శిటీ లేక ఒక స్కూలు లాంటిదే అని అనుకోవాల్సివస్తుంది. ఒక బ్యాంకుకి, ఒక సూపర్ మార్కెట్టుకి, ఒక యూనివర్శిటీకి ఎంతైతే కట్టుబడి ఉండాలో అంతే సంఘానికి కూడా కట్టుబడి ఉండాలి. అంతకంటే ఎక్కువగా కట్టుబడి ఉండనవసరం లేదని అనుకుంటారు. ఒక కస్టమరు లాగా విశ్వాసులు కూడా సంఘం నుండి వారు పొందే లాభాలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా కానుకలు సమర్పిస్తే చాలు, అంతకంటే ఎక్కువగా విశ్వాసులు సంఘం కొరకు త్యాగపూరితంగా జీవించాల్సిన అవసరం లేదని అనుకుంటారు.

వాక్యంలో చెప్పబడ్డదానికి మించి ఒక విశ్వాసి మీద సంఘానికి అధికారం లేదు అని ఒప్పుకుంటున్నాము. అంత మాత్రన విశ్వాసులు వారి సంఘాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అనుకుంటే పొరపాటే. దేవుడు విశ్వాసులను వారి సంఘాలకు ఒక ప్రత్యేకమైన రీతిలో కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఒకరి యెడల ఒకరు సమన్వయత కలిగి, ఐక్యత కలిగి దేవుని యొక్క గొప్పదనాన్ని నిరూపించే ఒక ప్రజగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా మరొకచోటికి వెళ్ళాలని దేవుడు తెలియపరిచేంత వరకూ ఆయా విశ్వాసులు వారి సంఘాలకు కట్టుబడి ఉండాలి.

ఈ విషయం అనేక సందర్భాలలో ఉపమానరీతిలో బైబిల్ అంతటా ప్రస్తావించబడింది. సంఘాన్ని ఒక శరీరంతో ఒక, ఆలయంతో, ఒక కుటుంబంతో పోల్చడాన్ని బైబిల్లో చూడవచ్చు. సంఘసభ్యులను అత్యంత ప్రాముఖ్యమైన పనులు చేసే విడదీయలేని ఒక ఆంతరంగిక అవయవాలుగా వర్ణించారు. 1 కొరింథీ. 3:16-17లో చూచినప్పుడు, సంఘమంతా కలిసికట్టుగా ఒక గుంపుగా ఉండాలని పౌలు హెచ్చరించాడు. పౌలు “మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును” అని అంటున్నాడు.

ఒక విశ్వాసి ఎప్పుడు తన సంఘాన్ని వదిలి వెళ్ళొచ్చు ?

ఒక విశ్వాసి తన సంఘం నుండి మరొక సంఘానికి శాశ్వతంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని కనుగొన్న తరువాతే వెళ్ళాలి. ఒక సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టవచ్చు అన్న విషయాన్ని ఈ పాఠం చివరిలో మనం తెలుసుకుంటాము. కానీ ప్రతీ విశ్వాసి తన మనసులో “దేవుడు ఈ సంఘానికి నమ్మకంగా ఉండడానికి నన్ను పిలిచాడని కాబట్టి నేను వేరొక చోటికి వెళ్ళటం న్యాయమేనా అని ప్రశ్నించుకోవాలి. నిజంగా నన్ను దేవుడు వేరే చోటికి పిలుస్తున్నాడా అని ప్రశ్నించుకోవాలి. నేను మరొక చోటికి వెళ్ళే ముందు క్రీస్తునందు నా సహోదరీసహోదరుల యొక్క సలహా నేను విన్నానా? నేను మరొక చోటికి వెళ్ళటానికి అనుగుణంగా దేవుడు ఆ విధమైన పరిస్థితులను సృష్టించాడా? దేవుని దగ్గర నుండి స్పష్టమైన అనుమతిని పొందానా? అని ప్రశ్నించుకోక తప్పదు.

సంఘానికి సన్నిహితంగా ఉంటూ నమ్మకంగా పరిచర్య చేస్తున్న కొంతమంది జీవితాలలో సహజంగా వచ్చే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కారణం వల్ల వాళ్ళు వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒకవేళ వాళ్ళు పనిచేసే కంపెనీ వేరేచోటికి మారినందుకో, లేకపోతే వేరేచోట వారికి మెరుగైన ఉద్యోగవకాశాలు ఉన్నందువల్లనో లేకపోతే అద్దె రేట్లు ఆ ఏరియాలో విపరీతంగా ఉండడం వల్లనో, మరొక చోట అద్దెరేట్లు చౌకగా ఉండడం వల్లనో వాళ్ళు వేరొక చోటికి వెళ్ళాల్సి రావొచ్చు. అయితే ఈ సమస్యలు వచ్చిన వెంటనే మనం వేరొక చోటికి వెళ్ళాలి అని అనుకోవడం తప్పు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో తరచుగా సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, కొన్ని కఠినమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, మనం ప్రభువుకు ప్రార్థించినప్పుడల్లా ఆయన మన ప్రార్థనలను విని మనకు సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరంగా ఊహించని రీతిలో ప్రభువు మనకు సహాయం చెయ్యడమే ప్రభువు యొక్క కృపకు తార్కాణం. దీనికి మనమందరం సాక్షులం. అయితే కొంతమంది విశ్వాసుల జీవితంలో సమస్యలు తలెత్తగానే, ఆ సమస్యలని వదిలించుకోవడానికి వాళ్ళు వేరే చోటికి వెళ్ళటం అనివార్యం అని భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు సంఘానికి కట్టుబడి ఉండటానికి సహాయం చెయ్యమని ప్రభువుని వేడుకోకుండా వెంటనే టెన్షన్ పడిపోయి, ఎలా సమస్యల నుండి బయటపడాలా అని పరిష్కారం కోసం వెతుక్కుంటూ ఉంటారు. సంఘస్థులు ప్రభువు యొక్క శక్తిని అర్థం చేసుకోకపోవటం వల్ల సంఘాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇది చాలా విచారకరమైన విషయం .

కొన్నిసార్లు క్రొత్త ప్రదేశాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఏ సంఘాలయితే ఉన్నాయో అలాంటి సంఘాల్లోనికి ఏ విశ్వాసులు రారు కాని అలాంటి సంఘాల్లోనుండే చాలామంది బయటకు మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయా ప్రదేశాల్లో ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించగలరు. వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఈ విశ్వాసులు రక్షించబడేదేమో ఒక సంఘంలో, జాయిన్ అయ్యేదేమో మరో సంఘంలో. ముఖ్యంగా వారు రక్షించబడిన సంఘాల కష్టాల్లో ఉన్నప్పటికీ వాటితో ఏ మాత్రం సంబంధం లేకుండా వేరే సంఘాల్లో జాయిన్ ఔతారు. అయితే ఒక్కటి మాత్రం మర్చిపోతూ ఉంటాం. అదేంటంటే '“దేవుని చిత్తం” ఇదేనా' అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మానేస్తాం. కేవలం సమస్యలతోనే విశ్వాసుల జీవితం ముడిపడి ఉండాలి అనేదే దేవుని చిత్తమా?

అయితే ఒకటి, అదేమిటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎంత నమ్మకంగా ఉన్నా సరే అది వ్యర్థమే. దేవుడు తన సార్వభౌమ ప్రణాళికలో ఆయన ప్రజలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలోనికి వెళ్ళనిస్తాడు. ఆయన ఒక సైన్యాధిపతిలాంటివాడు. యుద్ధరంగంలో ముందు వరుసలో ఉన్న సంఘాలన్నీ ఆయనకు తెలుసు. ఒక సంఘంలో పాతుకుపోయినవారిని మరొక సంఘానికి ఆయన తీసుకెళ్ళవచ్చు. అనేకమంది విశ్వాసులు క్రొత్త నిబంధనలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం గమనించగలం. కొన్నిసార్లు వారికొచ్చిన శ్రమల వలన, మరి కొన్నిసార్లు మరి కొన్ని కారణాల వలన వారు క్రొత్త ప్రదేశాలకు తరలిపోవడం చూస్తూ ఉంటాం.

కాబట్టి మనం మన సంఘం నుండి వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చిన సందర్భాలలో మొట్టమొదటిగా మనం దేవుని మీద ఆధారపడ్డామో లేదో మనం నిరూపించాలి. దేవుడు నమ్మదగినవాడు అని మొట్టమొదటిగా మన సంఘంలో నిరూపించాలి. మన దగ్గరున్న వనరులన్నీ అయిపోయిన తరువాత, దేవుని బ్రతిమిలాడిన తరువాత, అప్పుడు వేరే ప్రదేశానికి వెళ్లాలా వద్దా అని ఆలోచించాలి. దేవుడు తన వాక్యంలో తెలియపరచిన విషయాల పట్ల మనకు ఏమాత్రం గౌరవం లేకపోతే మనం తిన్నని మార్గంలో ప్రయాణిస్తున్నామన్న నిశ్చయత ఏంటి? దేవుని చిత్తం అనేది దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో భాగంగా ఏ సంఘంలో అయితే మనల్ని ప్రభువు పెట్టాడో, ఆ సంఘానికి నమ్మకంగా కట్టుబడి ఉండటం అనేది మన ప్రధానమైన బాధ్యత.

నమ్మకత్వాన్ని (కట్టుబడి ఉండడం) పెంపొందించుకోవడం

"క్రీస్తు శరీరం” అనే అంశం నుండి వెలుబడ్డ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఒక సంఘానికి ఏ విధంగా కట్టుబడి ఉంటూ సహాయకరంగా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. 1 కొరింథీ. 12:27లో వాడబడిన ఈ పదాన్ని ఒక స్థానిక సంఘానికి అన్వయించొచ్చు. అలాగే సార్వత్రిక సంఘానికి కూడా అన్వయించొచ్చు. ఐక్యత కలిగి, ఒకదాని మీద మరొకటి ఆధారపడి పనిచేసుకునే శరీరంలో ఉన్న అవయవాల గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. అయితే క్రీస్తు యొక్క సన్నిధి గురించి కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మనం ఎక్కడ ఉంటే మన శరీరం కూడా అక్కడే కనిపిస్తుందో, అలాగే సంఘం ఎక్కడ ఉంటే అక్కడ క్రీస్తు కూడా కనిపించాలి. ప్రతీ సహవాసం లేక సంఘం క్రీస్తు శరీరానికి ఈ లోకంలో ప్రతినిధులుగా ఉండాలి.

కాబట్టి ప్రతీ సంఘానికి అత్యంత గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి సంఘం క్రీస్తు శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి. మనం ఒక సంఘానికి సభ్యులుగా క్రీస్తు శరీరమై ఉన్నాం. మనం సంఘంగా ఏదైతే చెయ్యలేకపోతామో అది క్రీస్తు విషయంలో చెయ్యలేకపోతున్నామని గమనించాలి. నేను నా సంఘం యెడల ఏ మాత్రం పట్టింపు లేకుండా సోమరిపోతుతనంతో వ్యవహరిస్తే, నేను క్రీస్తు యెడల ఏ మాత్రం పట్టింపు లేకుండా సోమరిపోతుతనంతో వ్యవహరిస్తున్నానని గమనించుకోవాలి. నేను ఆయన శరీరాన్ని ఎలా బాధపెట్టగలను? ఆయన శరీరాన్ని తేలికగా ఎలా తీసుకోగలను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

సంఘానికి కట్టుబడి ఉండడాన్ని పెంపొందించుకునే విషయం ఇక్కడ మరొక విషయాన్ని గురించి ఆలోచించాలి. అదేమిటంటే క్రీస్తు శరీరం. ఆ క్రీస్తు శరీరంలో జీవానికి ఉన్న విలువను గుర్తించాలి. 'శరీరం' అనే పదాన్ని చూచినప్పుడు అది జీవం కలిగుందని జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకు బాగా గాయపడి, రక్తం కారుతున్న ఒక వ్యక్తిని దార్లో చూసామనుకోండి, మనం ఏమి చేస్తాం? మనం ఆ వ్యక్తిని చూసి చూడనట్లు వెళ్లిపోతామా? ఒకవేళ మనం అలా చేస్తే, ఒక్కసారిగా మనమీద మనకి సిగ్గు, అవమానం కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మనమందరం ప్రాణానికి లేదా జీవానికి ఒక గౌరవం ఇస్తాం. ప్రాణాన్ని కాపాడాలనే బాధ్యత మనకు సహజంగానే వస్తుంది. అందుకనే దీనికి వెల చెల్లించకుండా మనకిచ్చిన బాధ్యత నుండి మనం తప్పించుకోలేము.

అలాగే విశ్వాసులుగా కూడా క్రీస్తు శరీరం యెడల ఇటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఒక్కసారి ఆత్మీయమైన కళ్ళతో చూస్తే, ఇది ఒక విలువైన జీవం కలిగిన శరీరం. క్రీస్తు అవయవాల్లో జీవించి ఉన్నాడు. ఆయనకు ఈ లోకంలో ప్రాతినిధ్యం వహించడానికి వాళ్లందరినీ ఒక్క త్రాటి మీద నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి! ఈ శరీరం గాయపడితే ఎలా చూస్తూ కూర్చుంటాం? ఆ అవయవాలన్నీ ఒకదాని తరువాత మరొకటి నాశనం అయిపోతూ ఉంటే ఎలా చూస్తూ కూర్చుంటాం? లోకంలో ఎలాగూ భ్రూణహత్యల్ని చేస్తున్నారు. ఇది మానవ జీవితానికి విలువలేకుండా చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రీస్తు శరీరం యెడల కొంతమంది విశ్వాసులు ప్రవర్తించే విధానం చూస్తే వారు కూడా ఆత్మీయ విషయాల్లో ఇలాంటి హేయమైన చర్య చేస్తున్నారని చెప్పక తప్పదు.

క్రీస్తు శరీరంతో మాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా కొంతమంది సంఘసభ్యులు వేరే ప్రదేశాలకు తరలిపోతూ ఉంటారు. వారికి క్రీస్తు శరీరమనే స్థానిక సంఘానికి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవాన్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తుంటారు. సంఘం అనేది ఎంత విలువైందో అందరూ గుర్తించాలి. ఇదేదో తాత్కాలిక సంబంధం కాదండి! ఒక సంఘం నిజమైన, వాక్యపరమైన సంఘమైనప్పుడు దాని యెడల ప్రేమ కలిగి, దానికి లోబడి, పరిచర్య చేయాలి.

సంఘాన్ని వదిలివేయడానికి చెప్పే కారణాలు (తప్పుడు ఉద్దేశాలు):

మన జీవితంలో వచ్చే శోధనని బట్టి మన ప్రాధానత్యలు మారతాయా? "క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు" అని రోమా 16:10 పౌలు చెబుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే అతడు ఒక గొప్ప శోధనని విజయవంతంగా ఎదుర్కొన్నాడు, తనకు వచ్చిన పరీక్షను తట్టుకున్నాడు. తనకున్న పరిస్థితిలో తన శక్తిని కూడగట్టుకొని ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాడని అర్థం చేసుకోవచ్చు. చాలామంది వారి జీవితాలలో శోధన వచ్చినప్పుడు దానిని ప్రతిఘటించకుండానే దానికి లొంగిపోతూ ఉంటారు. దీనికి కారణంగానే వారి జీవితాల్లో సంవత్సరాల కొలదీ సంతోషమేమీ లేకుండా ఆత్మీయంగా ఎందుకూ పనికిరాకుండా పోతారు. కొంతమందికి ఉద్యోగం, నివసించే ప్రదేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వాళ్ళు ఆత్మీయ అరణ్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల దేవునికి పరిచర్య చేసే భాగ్యాన్ని కోల్పోతూ ఉంటారు.

మనకు ఒక శోధన వచ్చినప్పుడో లేక ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడో మనం మన హృదయాలను పరీక్షించుకోవాలి. మనం ఏయే కారణాల చేత లేక (కోరికల చేత) ప్రభావితం చేయబడుతున్నామో పరీక్షించుకోవాలి. మాకు తెలిసిన కొంతమంది పట్టణాల నుండి జనసాంద్రత లేని పచ్చటి గ్రామీణ ప్రాంతాలకు తరలిపోయారు. ఇలాంటివారు పట్టణాల్లో నివసించే విశ్వాసులను చూసి వారికి కాలుష్యం, మురికి భవనాలంటే గొప్ప ఆసక్తిని అనుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి ! పట్టణాల్లో ఉన్నటువంటి విశ్వాసులు వారి స్థానిక సంఘాన్ని ప్రేమించబట్టి, ఆ సంఘ సాక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దగా ఆకర్షణ లేని ప్రాంతాల్లో కూడా ఉండటానికి నిర్ణయించుకుంటారు. ఆ మాటకు వస్తే మొట్టమొదటిగా మీరు చక్కటి విలాసవంతమైన, ఆకర్షణీయమైన ప్రాంతాల్లో నివసించమని బైబిల్లో ఎక్కడ ఉంది? ఒక అవిశ్వాసి తనను తాను సంతోషపరుచుకోవడానికే మొదట ప్రాధాన్యత ఇస్తాడు. మనమైతే ప్రభువు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండాలి. ఇక ఏదేను వనంలో ఉన్నా, బబులోనులో ఉన్నా, శోధనలు వచ్చేవి రాక మానవు.

ఇంకా తమ సంఘాల నుండి అనాలోచితంగా తరలిపోవడానికి ఇతరత్రా కారణాలు అనేకం ఉన్నాయి. కొంతమంది తమ బలహీనతల్ని అణగదొక్కుకోలేక వేరేచోటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివి ప్రతీ సంఘకాపరికీ తెలిసిందే. వారి ఆత్మీయ జీవితాలు బలహీనంగా ఉండటం వలన, వారు అసంతృప్తిని గుర్తించి సమస్య మనలో లేదు సంఘంలో ఉంది అని నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకుని మౌనంగా ఉంటూ ఫిర్యాదులు చేయడం మొదలుపెడతారు. ఆ పరిస్థితిలో వారు ఆత్మీయ ఆహారం తీసుకోవడం గానీ, సహాయం కొరకు అడగడం గానీ సహవాసంలో ఉండడం లాంటివి చేయరు. కొన్నిరోజులు అయ్యేసరికి వారు సంఘాన్ని వదిలి పెట్టేస్తారు. కాని ఇది ప్రభువు యొక్క నిర్ణయానికి లోబడి తీసుకున్న నిర్ణయం కాదు. సంఘం పట్ల వారికి లోతైన అవగాహన ఉండి ఉంటే వారు సంఘానికి వ్యతిరేకంగా తిరగబడరు. కాని వారికి అటువంటి అవగాహన లేకపోవడం వల్ల వారికి కోపమొచ్చినప్పుడల్లా వారి కోపాన్ని సంఘం మీద చూపిస్తూ ఉంటారు.

ఇదే విషయాన్ని సి.హెచ్. స్పర్జన్ "క్రొవొత్తుల్లో వాక్యాలు” అనే శీర్షికలో ప్రస్తావించారు. దేనిమీద పెట్టడానికి అనుకూలంగా లేని విచిత్రమైన ఆకారంలో ఉన్న క్రొవ్వొత్తిని గురించి ఆయన ఈ విధంగా రాశాడు.

“ఎవరితో సర్దుకోలేని కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు. అయితే వారికున్న నమ్మకం ఏమిటంటే సమస్య వారిలో లేదు కాని పరిసర ప్రాంతాల్లో ఉందని అనుకుంటూ ఉంటారు. ఏ మంచీ చెయ్యని ఒక విశ్వాసి గురించి నేను చెప్పగలను. ఎందుకంటే ఏ సంఘం పరిపూర్ణంగా లేదు కాబట్టి నేను ఏ మంచీ చెయ్యలేను అని అనుకుంటాడు. ఒకప్పుడు అతడు మాతోపాటు ఉన్నాడు. మా గురించి అన్నీ బాగానే తెలుసుకున్నాడు. ప్రతీదానిని సిద్ధాంతపరంగా అర్థం చేసుకోవడం అతనికి చిన్నతనంగా అనిపించింది. మంచి నాగరికత, సంస్కృతి, జ్ఞానం కలిగిన 'ఇండిపెండెంట్' సంఘానికి వెళ్ళాడు. అక్కడికెళ్ళిన తరువాత వాళ్ళ 'సంస్కృతి' అతనికి అతిగా అనిపించింది. సరే! ఇలా కాదు బాగా మంట కలిగిన “మెథడిస్ట్” ల దగ్గరికి వెళ్ళాలి అని అక్కడకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఎంత మంట కలిగి ఉంటారని ఊహించాడో అంత మంట వారి దగ్గర లేదు. వారికి సిద్ధాంతపరంగా సరైన అవగాహన లేదని గ్రహించి, ఇక మన స్నేహితులైన “ప్రెస్బిటీరియన్స్” సరసన చేరాడు. ఇక వీళ్ళు బాగా లోతుగా ధ్యానించడం ఆయనకు నచ్చలేదు. దీనితో ఆయన విసుగు చెంది “స్వీడన్ బోల్గేరియన్స్” చెంత చేరాడు. ఆయన భార్యగాని ఆయనను వారించకపోతే “ఎపెస్కిపేలియన్స్”లో చేరేవాడే.

అక్కడవారి ఓటయమ్ కమ్ డిగ్నిటేట్ (మర్యాదగా కాలక్షేపం చేయడం) వారి సభ్యత ఆయకు నచ్చేదే. అక్కడ ఉండుంటే “చర్చి వార్డెన్”గా కూడా అయ్యేవాడే. కాని అంతలోనే ఆయన “బ్రదర్” అయ్యి కూర్చున్నాడు.

అయనను అంతటితో విడిచిపెడదాం! ఇదివరకటికంటే ఇప్పుడు బాగానే ఉన్నాడని అనుకుంటున్నాను. ఎంతైనా పాత అలవాట్లు మారడం కష్టమే. అందరూ ఐక్యంగా ఉండే సంఘాల్లో ఆయన సర్దుకోలేకపోతే, ఇక మిగిలిన సంఘాల్లో ఎలా సర్దుకుంటాడు? ఆదాము ఎదేను తోటను ఎలా విడిచి పెట్టాడో, ఈయనగారు కూడా తన ఉన్నత స్థానం నుండి పడటం ఖాయం.

ఏ సంఘంలోనూ చేరకుండా కుదుటపడని వ్యక్తులు వారి హృదయాలను పరిక్షించుకుని, వారి హృదయాల్లో ఉన్న స్వార్థ తలంపులన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అసలు ఒక వ్యక్తి ఒక సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? కొంతమంది వ్యక్తులు వారి తలాంతులను సంఘం గుర్తించలేదని లేక వారు సంఘంలో చేరిన వెంటనే వారికి ఏదో ఒక బాధ్యత ఇవ్వలేదనే నెపంతో తెగ బాధపడిపోతూ ఉంటారు. వారి గురించి వారు కావల్సినదానికంటే మరింత ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. మనం ఈ సంఘం కాకుండా వేరే సంఘంలో (ఇంతకంటే మంచి సంఘంలో) చేరితే మనకు లాభం చేకూరుతుందని ఊహించుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారు “వాక్యపరమైన నమ్మకత్వాన్ని” కోల్పోయి వేరే సంఘంలో చేరిపోతారు.

విశ్వాసుల నమ్మకత్వానికి పరీక్ష

కొంతమంది వారి సంఘానికి నమ్మకంగా ఉండే విషయంలో విఫలమైన్పటికీ, మరికొంతమంది వారి విశ్వాసాన్ని అద్భుతంగా నిరూపించుకున్నారు. వారు వాక్యానికి కట్టుబడి ఉండటం ద్వారా వారి జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నారు. ఎప్పుడైతే వారు దేవునికి లోబడి సంఘాన్ని అంటిపెట్టుకుని ఉన్నారో అప్పుడు ఆశ్చర్యకరంగా వారికి ఉద్యోగాలు దొరకడం, ఉండటానికి ఇల్లు దొరకడం, ఇంటిలోనూ ఆశ్చర్యకరంగా అందుబాటులోనికి రావడం లాంటి ఆశ్చర్యకార్యాలు జరగడం అనేకం మేము చూసాం. కొన్నిసార్లు సంఘానికి కట్టుబడి ఉన్న సందర్భాల్లో ఆ వ్యక్తి తన ఉద్యోగం కోల్పోవచ్చు. లేకపోతే మరొక నష్టం తనకు రావొచ్చు. అలాంటి పరిస్థితులలో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే “ఇంతకీ నేను నష్టాలు భరించడానికి సిద్ధంగా ఉన్నానా?” ఒక్కసారి చరిత్రలోనికి తొంగి చూస్తే, అనేకమంది వారి సంఘం కొరకు అనేక నష్టాల్ని అనుభవించిన వ్యక్తుల్ని మనం చూడగలం. కొన్ని సంవత్సరాల క్రితం దేశం మీదకి శత్రువులు యుద్ధానికి దండెత్తి వచ్చినప్పుడు, అనేకమంది తమ కుటుంబాలను విడచి దేశం కొరకు పోరాడటానికి యుద్ధానికి వెళ్ళేవారు. కొంతమంది స్వతహాగా పిరికివాళ్ళయినప్పటికీ వారు ఆ సమయంలో అనేక సాహస కార్యాలను చేసేవారు. అనేకమంది యౌవనస్తులు దేశం కొరకు వారి ప్రాణాలను పణంగా పెట్టేవారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి! ప్రభువు తరపున ఆత్మల యుద్ధంలో త్యాగం చెయ్యడం కన్నా విలువైంది మరొకటి ఉందా? ఇలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది విశ్వాసులు ఏమంటారో తెలుసా? “లేదండీ! నా ఉద్యోగం నాకు ముఖ్యమండీ. నా కెరీరే నాకు ముఖ్యమండీ. మా కంపెనీ ఏది చెయ్యమంటే నేను అది చెయ్యాలండీ, ఒకవేళ ప్రమోషన్ వస్తే పొందుకోవాలండీ. ట్రాన్స్ ఫర్ వస్తే వెళ్ళాలండీ” అని అంటూ ఉంటారు. గమనించండి! నిజంగా మారుమనస్సు పొందిన వ్యక్తి యొక్క జీవితంలో ప్రభువు ఆయన యొక్క అద్భుతమైన కృప ద్వారా నూతనమైన విలువల్ని, నూతనమైన అనుభూతుల్ని తీసుకుని వస్తాడు. కాబట్టి మనం ఎన్నటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించకూడదు. మనం ప్రభువు కొరకు, ఆయన సంఘం కొరకు నిలబడాలి.

దేవుడు మనల్ని ఏ సంఘంలో అయితే ఉంచాడో ఆ సంఘ సహవాసం నుండి వెళ్ళగొట్టటానికి సాతానుడు శోధిస్తూ ఉంటాడనే విషయాన్ని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. ఎవరైతే ప్రభువుకు ఎక్కువగా పరిచర్య చేయాలని ఆశపడతారో వారే ఎక్కువ శోధనలకు గురి కావడం చూస్తూ ఉంటాం. మనమందరం మన సంఘాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఏ విశ్వాసులైతే దేవుని చేత గొప్పగా వాడబడ్డారో వారందరూ ఎప్పుడో ఒకప్పుడు సంఘాన్ని వదలిపెట్టి మరొక చోటికి వెళ్ళిపోవాలనే ఆలోచనతో బలవంతం చేయబడినవారే. బహుశా ఈ శోధనల ద్వారా ప్రభువు వారి అవసరాలను ఎలా తీర్చాడో చూడగలిగారు. దీని ద్వారా ప్రభువు వాళ్ళను ఆ సంఘంలోనే ఉండమంటున్నాడనే విషయాన్ని వాళ్ళు ఋజువు పరుచుకున్నారు. సాతాను విశ్వాసుల్ని ఏ సంఘంలో అయితే ఉంచాడో అక్కడ నుండి తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసులు వేరే ప్రాంతాలకు తొలగిపోయే విధంగా వారిని శోధిస్తూ ఉంటాడు.

ఈ అధ్యాయం ప్రారంభంలో ఒక బాల్యదశలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని వదలివేసిన కొంతమంది యవ్వన జంటలు గురించి ప్రస్తావన జరిగింది కదా, మరి వారి సంగతేంటి? మరి వారికి నిజంగా నమ్మకత్వం, విశ్వసనీయత, ధైర్యం ఉన్నాయంటారా? ఇప్పుడు వారెక్కడున్నారో వారికే తెలియాలి. ఇప్పుడు వారు మంచి పొజిషన్లో ఉన్నారా? విలాసవంతమైన గృహాల్లో ఆనందిస్తున్నారా? వాళ్ళింటి ముందు మంచి మంచి కార్లు ఉన్నాయా? మనల్ని ఒక వాక్యపరమైన సంఘంలో ప్రభువు పెట్టినపుడు దేవుడే అక్కడ వారిని పెట్టినట్లుగా జ్ఞాపకం చేసుకుని దానిని మనం పూర్తిగా గౌరవించాలి. మన కోరికలకు అనుగుణంగా తెగిన గాలిపటాలుగా మనం ఉండకూడదు. ఒకవేళ మనం మరొక సంఘానికి లేక మరొక ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకోక ముందు మనం ప్రభువు యొక్క అధికారానికి లోబడి, ఆయన మనల్ని నడిపిస్తున్నాడన్న అవగాహన యెడల సంతృప్తి చెందిన తరువాతే ముందుకు నడవాలి.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనమేమి ప్రస్తావించలేదు. స్టూడెంట్ల గురించి గాని, పాస్టర్ల గురించి కాని ప్రస్తావించలేదు. స్టూడెంట్లు ఒక కాలేజీని ఎంచుకునే ముందు ఒక మంచి సంఘాన్ని వెతుక్కోవాలి. అయితే వాళ్ళు ఒక కోర్సు మరొక పట్టణంలో చేసినంత మాత్రాన వారు శాశ్వతంగా సంఘాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతున్నట్లుగా భావించడానికి వీలులేదు. అనేకసార్లు దేవుని సేవకుల్ని ప్రభువు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి లేక మరొక పరిచర్యకు పిలుస్తూ ఉంటాడు. విశ్వాసులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అనేకమైన మంచి కారణాలు ఉండొచ్చు. అనేకసార్లు దేవుడే వారిని మరొక ప్రాంతానికి వెళ్ళడానికి మార్గం సిద్ధపరుస్తూ ఉంటాడు. కానీ, దేవుని వాక్యానికి లోబడాలి అనే విషయం పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఇది అనేక సంఘాల్ని, విశ్వాసులను బాధపరిచే విషయం.

అర్థరహితమైన నమ్మకం

సంఘానికి కట్టుబడి ఉండడం అనేది ఒక వాక్యపరమైన బాధ్యత అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో గ్రుడ్డిగా నమ్మటం వల్ల తరువాత ఆ సంఘాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొంతమంది విశ్వాసులు సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండండి అంటే ఉండరు, కొంతమంది ఫలానా సంఘాన్ని వదిలేయండి అంటే దానిని వదలరు. ఎలాంటి పరిస్థితుల్లో ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో సంఘానికి కట్టుబడి ఉండనవసరం లేదనే విషయం దేవుని చిత్తంలో ప్రాముఖ్యమైన అంశమై ఉంది. అసంఖ్యాకమైన విశ్వాసులు సంఘానికి కట్టుబడి ఉండే విషయంలో సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడం వల్ల, వేలమంది విశ్వాసులు సత్యాన్ని (వాక్యాన్ని) అణచివేసి, సత్యాన్ని వెక్కిరించే విశ్వాస భ్రష్టమైన డినామినేషన్ సంఘాలలో ఇంకా ఇరుక్కుపోయి ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందంటే వారు "సంఘానికి కట్టుబడి” ఉండాలనే విషయాన్ని అపార్థం చేసుకున్నారు కాబట్టి.

ప్రభువు తన వాక్యం ద్వారా నిర్జీవమైన, పనికిరాని సంఘాల నుండి బయటకు రమ్మని అనేకమార్లు హెచ్చరించినా వారు ఈ విషయాన్ని గమనించరు. వారు మంచి సంఘం యొక్క పరిచర్య ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, దేవునికి శత్రువులైన అబద్ధబోధకుల చేతలను బలపరుస్తూ ఉంటూ, ఫలభరితమైన పరిచర్య చేయకుండా చెడ్డ సంఘాలలోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అసత్య (వాక్య విరుద్ధమైన) బోధ చేసే సంఘాలకు దూరంగా ఉండటం సరైనదే, ఎందుకంటే అది మనం దేవుని వాక్యానికి ఎంతగా లోబడుతున్నామనేది తెలుపుతుంది. సత్య సువార్తను వాక్యపరమైన సిద్ధాంతాలను ఎంతగా పరిరక్షిస్తున్నామో తెలుపుతుంది. అనేకమంది విశ్వాసులు పూర్తిగా ఆత్మీయంగా చనిపోయిన లేక వాక్య విరుద్ధమైన సంఘాల్లో ఉండటం వలన సువార్త పరిచర్య కుంటుబడిపోయింది. వారు అటువంటి సంఘాల నుండి బయటకి వచ్చి, బలమైన, సువార్త ప్రకటించే సంఘాల్లో చేరినట్లయితే ఆ సంఘాలు బలంగా తయారవుతాయి. అసత్య బోధ నుండి వేరుపడమని దేవుడు తన బిడ్డలను హెచ్చరిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలకు లోబడడం మన కర్తవ్యం. దీనికి మనం ఆయన మీద ప్రేమతో స్పందించాలి. అది మనకు ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది.

'రక్షణ అనేది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే', 'దేవుని వాక్యం దోషరహితమైంది', ఇలాంటి ప్రధానమైన సిద్ధాంతాలను నమ్మని సంఘాలతో కాని, అలాంటి సంఘకాపరులతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని హెచ్చరించే వాక్యాలను చూద్దాం. రోమా 16:17లో “సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను” అని పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసత్య బోధకులు ఉండే సంఘాల్లో ఆరాధిస్తూ, పనిచేయాలా? సత్య సువార్తను హృదయపూర్వకంగా నమ్మని, బోధించని పాస్టర్ల ప్రసంగాలను విని వారికి మద్దతు పలకాలా?

చూడండి! అపొస్తలుల ఏ విధంగా హెచ్చరిస్తున్నారో - గలతీ 1:8లో, "మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను .... మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవునుగాక” అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీ 3:18లో అసత్య బోధకులను, సంఘాలను పౌలు క్రీస్తు సిలువకు శత్రువులుగా పోల్చుతున్నాడు. అపొస్తలుడైన యోహాను 2వ యోహాను 10-11లో “ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును”

మనము క్రైస్తవ ప్రాథమిక సిద్ధాంతాలను వ్యతిరేకించే బోధకులకు సహాయం చేస్తున్నామా? ఒకవేళ అలా చేస్తున్నట్టైతే మనం ప్రభువు యొక్క శత్రువులకు సహాయం చేస్తున్నట్టే. పైన రాయడ్డ వాక్యాలు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు. ఆయన ఆ అసత్య సంఘాల నుండి తొలగిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నప్పుడు, “సర్లే, చూద్దాం లేండి, ఒకవేళ దేవుడు నడిపిస్తే అలా చేద్దాం లేండి” అని అనడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన వాక్యంలో మనకు ముందుగానే తెలియపరచాడు కాబట్టి.

1తిమోతి 4:1లో “అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు”. అసత్య బోధ అనేక సంఘాలలో ప్రవేశించి, ఆయా సంఘాల మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. మరి ఆ పరిస్థితులలో విశ్వాసులు ఏ విధంగా స్పందించాలి? ఈ ప్రశ్నకు పౌలు ఈ విధంగా స్పందిస్తున్నాడు. “ఎవడైననూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైన బోధనుపదేశించిన యెడల వారికి దూరముగా ఉండుము” అని పౌలు హెచ్చరిస్తున్నాడు. (1 తిమోతి 6:3-5)

2 తిమోతి 2:16 ప్రకారం అట్టివారికి దూరంగా ఉండాలి.

2వ కొరింథీ. 6:14-17లో కూడా వాక్యాన్ని ధిక్కరించేవారికి దూరంగా ఉండమని రాయబడి ఉంది. చూడండి!
"మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్జీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును”.

ఇన్ని వాక్యభాగాలను ప్రస్తావించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఈ అంశం మీద ఆయన చాలా స్పష్టంగా తన వాక్యంలో పొందుపరిచాడు. మనం ఏమి చెయ్యాలి అనే విషయం మీద దేవుని వాక్యంలో ఇంతకుముందే నిర్ణయించబడింది. ఏదైన సంఘం అసత్య బోధలు బోధించినా లేక వాటిని అనుమతించినా లేక అట్టివారిని చూసీ చూడనట్టు ఉన్నా, మనం వారు మారుమనస్సు పొంది వాటిని విడిచిపెట్టేలా మనవి చేయాలి. వారు వినకపోతే అలాంటి సంఘం నుండి మనం బయటకు వెళ్ళిపోవాలి.

ఇది కేవలం సంఘాలకు మాత్రమే కాదు క్రైస్తవ సంస్థలకు కూడా వర్తిస్తుంది. మనం చదివే కాలేజీలో కాని, మనం పనిచేసే చోట కానీ విశ్వాసం లేని నామకార్థ క్రైస్తవులు పెట్టే మీటింగులకు వెళ్ళి వాళ్ళకు మద్దతు పలకాలా? మనం వారికి దూరంగా ఉండాలని బైబిల్ చెబుతుంది. దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఫలాన కమిటీలో ఉంటే వారు నిర్వహించే మీటింగులకు మద్దతు పలకాలా? అట్టివారికి దూరంగా ఉండమని బైబిల్ చెబుతుంది. ఇలాంటి విషయాల గురించి బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది.

మంచి సంఘాలను కూడా విడిచిపెట్టే సమయమొస్తుందా?

సిద్ధాంతపరంగా మంచి సంఘాలను కూడా విడిచిపెట్టే సమయమొకటి వస్తుందా అంటే, ఔను వస్తుంది. ఆయా సంఘాలు చేసే భయంకరమైన పాపాలు సరిదిద్దుకోకపోతే, అవి సిద్ధాంతపరంగా మంచి సంఘాలు అయినప్పటికీ, అట్టి సంఘాల నుండి వేరుపడాలి. ఏదైనా సంఘం అన్ని సిద్ధాంతాలను సరిగా బోధించేదైనప్పటికీ కొన్ని భయంకరమైన పాపాల్లో కూరుకునిపోతే అలాంటి సంఘం ఇక సంఘంగా పిలవబడదు. అలాంటి సంఘాలకు విశ్వాసులు లోబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాంటి సంఘాలు ఇక సంఘాలుగా పిలిపించుకునే అర్హతను కోల్పోయాయి. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి రాయబడింది. ఆ సంఘం చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందకపోతే ఆ సంఘంలో ఉన్న దీపస్తంభం తీసివేయబడుతుందని మనమక్కడ చూస్తాం.

ఇప్పుడు, ఎలాంటి విషయాలలో సహవాసం నుండి తొలగిపోవాలనే విషయం గురించి తెలుసుకుందాం -

1. మొట్టమొదటిగా, ఏదైనా సంఘం, సంఘసభ్యులు చేసే భయంకరమైన పాపాలను చూసి చూడనట్టుగా ఊరుకుని వారిని గద్దించకుండా ఉంటే, మొట్టమొదటిగా మనం విశ్వాసులుగా అలాంటి విషయాలను ఖండించాల్సినవారమై ఉన్నాం. మనం అలాంటి విషయాలను సంఘం యొక్క దృష్టికి తీసుకుని వచ్చినప్పటికీ వారు ఇలాంటి విషయాలలో చర్య తీసుకోకపోతే, ఆ సంఘాన్ని విడిచిపెట్టాలి. ఎఫెసీ. 5:11లో "నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి”. అలాంటివారి సహవాసంలో ఉండొద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు. 1 కొరింథీ. 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా సంఘం యొక్క పవిత్రతను గురించి నూతన నిబంధనలో స్పష్టంగా రాయబడింది.

2. రెండవదిగా, ఏదైనా సంఘం ప్రభువు ఆజ్ఞాపించిన సువార్త పరిచర్యను ఆ సంఘం అశ్రద్ధ కలిగి ఆసక్తి లేకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి సంఘం నుండి తొలగిపోవలసిన బాధ్యత ఉంది. ప్రతీ సంఘానికీ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి ప్రాథమిక బాధ్యతను ఏ సంఘమైనా విస్మరిస్తే, అలాంటి సంఘం నమ్మకమైన విశ్వాసుల నమ్మకత్వాన్ని కోల్పోతుంది. పూర్తిగా సోమరులై ఉండి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ లోబడనటువంటి సంఘాలతో మనం సహవాసంలో ఉండి ఉపయోగం ఏమిటి? మన రక్షకుని దృష్టిలో అత్యంత ఉన్నతమైన పరిచర్యను నిర్లక్ష్య చేసి, ఫలాలు ఫలించని సంఘంతో మనకు ఏమి సంబంధం?

3. మూడవదిగా, ఏదైనా సంఘం వాక్యానుసారమైన క్రమాన్ని విడిచిపెట్టి, దానికి వ్యతిరేకమైన పద్ధతులను పాటిస్తూ సువార్త పరిచర్యను ఈ లోక సంబంధమైన పద్ధతులతో చేస్తుంటే, నిజమైన విశ్వాసులు యొక్క మనస్సాక్షి విపరీతమైన ఒత్తిడికి లోనౌతుంది. పవిత్రమైనవాటిని తీసుకుని వచ్చి అపవిత్రమైనవాటిగా చేసి సంఘస్తులను అలాంటి ఆరాధనలో పాల్గొనే విధంగా చేసే సంఘాల నుండి తొలగిపోవాలి. యాకోబు 4:4లో, ".... ఇహలోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” అని యాకోబు అంటున్నాడు. ఇలాంటి విషయాలలో సంఘానికి లోబడడడం కంటే దేవుని ఆజ్ఞలకు లోబడి కట్టుబడి ఉండడం ఎంతో ప్రాముఖ్యం. ఒక సంఘం సిద్ధాంతపరంగా వాక్యానుసారమైనది అయినప్పటికీ ఇలాంటి సంఘాలకు లోబడాల్సిన అవసరం లేదని పైన ఉదహరించబడ్డ మూడు విషయాలు చెబుతున్నాయి.

ఎక్కడైతే ఇటువంటి సమస్యలుండవో, అటువంటి సంఘానికి మనం కట్టుబడి ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ శరీరంలో (సంఘంలో) మనల్ని శాశ్వతంగా నిర్మించిన అవయవాలుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనల్ని మరొక చోటికి బదిలీ చేస్తే, దేవుడు ఏ సంఘంలో మనల్ని పాలి భాగస్తులుగా చేసాడో, ఆ సంఘానికి హృదయపూర్వకంగా లోబడాలి. క్రైస్తవ జీవితం అనేది ఇతరులతో సంబంధం లేకుండా మనంతట మనం జీవించేది కాదు. మనల్ని ఇతర విశ్వాసులతో పనివానిగా ఉండటానికి ఆయన పిలుస్తున్నాడు. ఒక సైనికుడిగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఒక సంఘానికి కట్టుబడి ఉండటానికి పిలుస్తున్నాడు.

ప్రభువు నుండి ప్రతీ ఆశీర్వాదం
సంఘాన్ని పరిపూర్ణపరచడానికి
మనం ఆయనకే బలంగా అంటు కట్టబడి ఉందాం!
ఆ సహవాసం ప్రేమతో కట్టుబడడానికి,
ఒకరితో ఒకరు ఐక్యపరచబడడానికి,
ఐక్యతతో, పరిశుద్ధతతో, శాంతి
మార్గంలో నడిపించుమయ్యా!
మమ్మల్ని బలపరచు, మమ్మల్ని నడిపించు,
నీ చిత్త ప్రకారం నీవు మాకిచ్చిన
పలు తలాంతుల ప్రకారం
మేమందరమూ నీ పనిని నెరవేర్చడానికి
మేము ఒకరిమీద ఒకరు ఆధారపడడానికి
మమ్మల్ని ఎప్పుడూ నీ సేవ నుండి తొలగించవద్దు
ప్రతి ఒక్కరి మీద నీ కృపను ఉంచు
మేమందరము నీ చేత మలచడబడి ఉన్నామయ్యా
- చార్లెస్ వెస్లీ
 

5వ పాఠం

సంఘసభ్యత్వానికి కావల్సిన నియమాలు

సంఘంలో సభ్యులు ఎలా నడుచుకోవాలో ఈ పాఠంలో ప్రస్తావించబడింది. జాన్ ఫ్లెచర్ ఆఫ్ మెడీ (1929-1785) చేత రాయబడ్డ ఈ సూచనలు ఈ పాఠంలో రాయబడ్డాయి. జాన్ ఫ్లెచర్ (డిలా ఫైబెరె) స్విట్జర్లాండ్ లో ఉన్న జెనీవా పట్టణంలో జన్మించాడు. తరువాత ఇంగ్లాండులో స్థిరపడ్డాడు. ఆయన 1739లో జరిగిన ఉజ్జీవ కూటంలో మారుమనస్సు పొందాడు. 1760లో ఆయన మెఢీ అనే ప్రాంతంలో సంఘకాపరిగా తన పరిచర్యను ప్రారంభించాడు. అనతికాలంలో సువార్త పరచర్యలో, పరిశుద్ధతలో, నిజాయితీలో, విశ్వాసం పెంపొందించే విషయంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు.

సంఘంలో సభ్యులు ఏ విధంగా నడుచుకోవాలో, ఈ నియమాలను వారి జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలో ఇందులో సంక్షిప్తంగా రాయబడ్డాయి. పాత నిబంధనలో మాలాకీ 3:16లో "... యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను” అని మనం చూడగలం.

మన ప్రభువు పరలోకానికి ఆరోహణమైన తర్వాత కొంతమందిని ఆయన కొరకు ఐక్యంగా ఉండడానికి ఏర్పరచుకున్నట్టు మనం అపొ.కా. 1:14లో చూడగలం. "వీరందరును, వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి”.

"పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు వారందరును ఒక చోట కూడి ఉండిరి", అని అపొ.కా. 2:1లో చూడగలం. దేవుని మహాశక్తి చేత అనేకమంది ఆయనను విశ్వసించినప్పుడు, “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. విశ్వసించిన వారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి”. ఇది చాలా సన్నిహితమైన సహవాసమని, దీనిని ఎలాంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టుకూడదని అపొస్తలులు పలుమార్లు ఆజ్ఞాపించారు.

“కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు” హెబ్రీ 10:25

"సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మిలో సమృద్ధిగా నివసింపనియ్యుడి” కొలస్సీ 3:16

“కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యెకనికొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి. అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి. (1థెస్సలోని. 5:11, 14)

పైన ఉదహరించబడిన వచనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతీ తరంలో ఉన్న విశ్వాసులందరూ (సంఘ సభ్యులందరూ) వాక్యం ఆజ్ఞాపించినట్టుగా ప్రతీ ఒక్కరూ నిజాయితీ కలిగి దైవానుసారమైన పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈ విషయాన్ని 3 అంశాలుగా తెలియజేయవచ్చు.

ఎ. చెడు చేయడం ఆపేయాలి (యెషయా 1:16, రోమా 12:9)

బి. మంచి చేయడం నేర్చుకోవాలి (యెషయా 1:17, రోమా 12:9)

సి. దేవుడు చూపించిన మార్గాల ద్వారా వెలుగును వెతుకుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి (యెషయా 55:6, 2తిమోతి 2:5)

ఎ. చెడు (కీడు) చేయడం ఆపేయాలి

1. భ్రష్టత్వంతో నిండిన ఈ లోకాన్ని అనుసరించి, దాని పోకడలను కానీ, దాని ఆకర్షణలను కానీ, లోకపు నృత్యాలకు కానీ, జూదానికి కానీ ఏ సంఘ సభ్యుడూ లోబడకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వినోద కార్యక్రమాలు దేనిలోనూ పాల్గోకూడదు. దయచేసి ఎఫెసీ 4:22, రోమా 12:2, గలతీ 5:24-25, కొలస్సీ, 3:17 చూడండి.

2. ఏ సభ్యుడూ స్వార్థచింతన కలిగి, తన్ను తాను సుఖపెట్టుకుంటూ, సోమరిగా ఉండకూడదు. తనను తాను పొగుడుకునే విధంగా ఖరీదైన బట్టలు వేసుకోకూడదు. దయచేసి 1 థెస్సలోని. 5:23, 1 పేతురు 2:11, 2తిమోతి 2:3,1 కొరింథీ. 9:27 చూడండి.

3. ఏ సభ్యుడు కూడా ఇంటింటా తిరుగుచూ ఇతరుల యెడల కఠిన హృదయంతో ఉండకూడదు. దయచేసి 1 పేతురు 3:8, 4:15, 1 తిమోతి 5:13 చూడండి.

4. తనను మంచి పొరుగువాడిగా మార్చని ఏ పాటలు పాడటం కానీ, పనికిరాని సాహిత్యం చదవడం గానీ చేయకూడదు. దయచేసి యాకోబు 5:13, ఎఫెసీ 2:3, కొలస్సీ 3:16 చూడండి.

5. ఏ సభ్యుడు కూడా అపవిత్రమైన కాముకత్వానికి తనను తాను అప్పగించుకోకూడదు. అతడు ఒక త్రాగుబోతై ఉండకూడదు. దయచేసి యెషయా 58:13, సంఖ్యా. 15:32-36 చదవండి.

6. ఏ సంఘసభ్యుడు కూడా పోట్లాడటం కానీ, తగాదాలాడటం కానీ, గొడవలకు దిగడం కానీ, కీడుకు ప్రతికీడు చేయడం కానీ, పెద్ద పెద్దగా అరవటం కానీ, అవమానానికి తిరిగి అవమానించడం కానీ చేయకూడదు. దయచేసి ఆరవ ఆజ్ఞను చూడండి. ఇంకా కొరింథీ. 5:11, 6:7, రోమా 13:13 చదవండి.

7. ఏ సభ్యుడు కూడా దుర్వ్యాపారంలో పాల్గొని ఇతరులను నష్టపరచటమే ధ్యేయంగా వ్యాపారం చేయకూడదు. ఇతరులు ఏ విషయంలో అభ్యంతరపడతారో వాటిని అతడు ఇతరుల పట్ల చేయకూడదు. దయచేసి 1 థెస్సలోనికయులకు 4:6, 1 కొరింథీ. 10:24, రోమా 13:7 చదవండి.

8. ఏ సభ్యుడూ కూడా తన ఉద్యోగబాధ్యతను విస్మరించి ఆత్మీయ కార్యకలాపాల్లో గడపకూడదు. అతనికి ఒకవేళ సమయం చాలకపోతే, తన కాలక్షేపానికి వెళ్ళబుచ్చే సమయాన్ని తగ్గించుకుని లేకపోతే తన నిద్రాసమయాన్ని తగ్గించుకుని క్రైస్తవ కార్యక్రమాలలో పాల్గోవాలి. అంతేకాని తన ఉద్యోగ బాధ్యతలకు కేటాయించిన సమయాన్ని దొంగతనం చేయకూడదు. దయచేసి 2 థెస్సలోనియులు 3:8-12, 1తిమోతి 5: 14, రోమా 12:11 చదవండి.

బి. మంచి చేయడం నేర్చుకోవాలి :

1. ప్రతి సభ్యుడూ ఇతరులకు, వారి అవసరార్థం అక్కరల కొరకు వారికి పరిచర్య చేయాలి. అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించాలి. ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేయాలి. దయచేసి ప్రసంగి 4:10; గలతీ. 6:2; మత్తయి 25:35; యాకోబు 1:27 చదవండి.

2. ప్రతీ సభ్యుడు ఇతరులకు తన శక్తి మేరకు పరిచర్య చేయాలి. ఆత్మీయ విషయాలు తెలియనివారితో ఓపిక కలిగి వాటిని తెలియజేయాలి. అసభ్యంగా ప్రవర్తించేవారిని ఓపికతో గద్దించాలి. ఎవరైతే పాపంలో కొనసాగుతున్నారో వారిని అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా హెచ్చరించాలి. దయచేసి లేవియకాండము 19:17 ద్వితీయోపదేశకాండము 6:7, హెబ్రీ 3:13 చదవండి.

3. ప్రతీ సభ్యుడు తన సాక్ష్యం ద్వారా, ఒక పద్ధతి ప్రకారం జీవిస్తూ, జాగ్రత్తగా నడుచుకోడం ద్వారా తన చుట్టూ అక్రమం చేసేవారినీ, అసభ్యంగా ప్రవర్తించేవారిని గద్దించడానికి తన శక్తి మేరకు ప్రయత్నించాలి. దయచేసి ఎఫెసీ 5:11, 1 సమూయేలు 3:13, యాకోబు 5:19,20 చదవండి.

4. ప్రతి సభ్యుడు తన పనియందు అత్యంత ఆసక్తి కలిగి పని చేయాలి. దయచేసి మత్తయి 5:16, 1 పేతురు 2:12, 2 కొరింథీ. 6:3 చదవండి.

5. ప్రతి సభ్యుడు ప్రతీదినం తనను తాను ఉపేక్షించుకుని, తన సిలువ ఎత్తుకుని, తిరిగి జన్మించిన వ్యక్తిగా క్రీస్తును వెంబడిస్తూ, సిలువను గురించిన వెర్రితనాన్ని అంగీకరిస్తూ, మనుష్యులు తనను బాధిస్తారని, నిందిస్తారని, అందుకు ముందుగానే సిద్ధపడి, క్రీస్తు నిమిత్తం ఆ బాధను భరిస్తూ ఆయనను వెంబడించాలి.

సి. వాక్యానుసారమైన పద్ధతుల ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవడం

1. ప్రతి సభ్యుడు సంఘంలో దైవారాధనకు తప్పక హాజరవ్వాలి. దయచేసి కీర్తన 42:4, లూకా 2:37ల చదవండి.

2. ప్రతి సంఘ సభ్యుడు దేవుని వాక్యాన్ని వివరణాత్మకంగా బోధించే బోధను వినాలి. దయచేసి 2 తిమోతి 4:2, రోమా 10:17 చదవండి.

3. ప్రతీ సభ్యుడు ప్రభువు బల్ల సంఘంలో ఇచ్చినప్పుడల్లా దానిని స్వీకరించాలి. దయచేసి అపొ.కా. 2:46; 1 కొరింథీ. 11:24 చదవండి.

4. తల్లిదండ్రులుగా ఉంటూ ఎవరైతే సభ్యులుగా ఉంటున్నారో, వారు ఖచ్చితంగా, తన కుటుంబం విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నించాలి. దయ చేసి నిర్గమ 13:8-10, 14:16, ద్వితీ. కాండము 6:6-9, సామెతలు 22:6, మత్తయి 19:14 చదవండి.

5. ప్రతీ సభ్యుడు పగలు,రాత్రి వ్యక్తిగత ప్రార్థనలో గడపాలి. దయచేసి కీర్తన 119:164; దానియేలు 6:13, అపొ.కా. 9:11; మత్తయి 14:23 చదవండి.

6.ప్రతి సభ్యుడు దేవుని వాక్యాన్ని తరచుగా చదివి ధ్యానించాలి. దయచేసి ద్వితీయో. 6:7, కీర్తన 1:2, ప్రకటన 1:3, యోహాను 5:39, లూకా 10:26, అపొ.కా. 17:11 చదవండి.

ఎవడైనా సభ్యుడైయుండి వ్యభిచారిగాను, జారుడుగాను, లోభిగా అయినా, తిట్టుబోతుగా అయినా, ఇతరులను అవమానించేవాడుగా అయినా, త్రాగుబోతుగా అయినా ఉంటే అలాంటి వ్యక్తితో సహవాసం చేయకూడదు. కనీసం అతనితో భోజనం కూడా చెయ్యకూడదు.

ఒక క్రమం లేకుండా, సోమరిపోతుగా ఉంటూ, లోకసంబంధియై గర్విష్టిగా ఉంటూ, వాదోపవాదాలకు దిగుతూ, విపరీతమైన కోపం కలిగి ప్రవర్తిస్తూ ఉండే వ్యక్తిని సంఘ క్రమశిక్షణకు లోబడే విధంగా చెయ్యాలి (ఎవరైతే సంఘం యొక్క శాంతికి, ప్రేమకు అడ్డుబండలుగా మారతారో).

ఒక్కసారి పౌలు ఏమని చెప్పాడో గుర్తు తెచ్చుకోండి - “అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి” అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి” అని అంటున్నాడు. (2 థెస్స. 3:14-15).

సంఘంలో సభ్యులందరూ ఒకరియెడల ఒకరు ఎటువంటి చెడు తలంపులతోనూ ఉండకూడదు. ఒకవేళ అది ఎవరికైనా ఎవరి యెడలనైనా చెడు సంబంధమైన భావాలు కలిగుంటే, తక్షణమే వాటిని వ్యక్తపరచాలి. దయచేసి రోమా 12:9; ఫిలిప్పీ. 2:1-3, మత్తయి 18:15-17 చదవండి.

సంఘ సభ్యుల బాహ్య సంబంధమైన ఆత్మీయ జీవితం యెడల సంతృప్తి చెందడానికి వీలు లేదు కానీ జీవితంలో తగ్గింపును కలుగచేసి వారి హృదయాలను విశాలపరచే దేవుని ప్రేమను వెతకాలి. సంఘ సభ్యులందరూ ఒకనియందు ఒకడు అనురాగం కలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోవాలి. (రోమా 12:10) ప్రతి సంఘసభ్యుడు "సంతోషించు వారితో సంతోషించాలి, ఏడ్చువారితో ఏడవాలి, హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండాలి" (రోమా 12:15-16).

6వ పాఠం

కుటుంబ నిబంధన

1689వ సంవత్సరములో పాస్టర్ బెంజిమిన్ కీచ్ (హస్లీడౌన్ బాప్టిస్ట్ మీటింగ్) ఆత్మీయంగా ఐక్యతతో ఉండటానికి ఈ ప్రఖ్యాతిగాంచిన “నిబంధనను” ఆయన అమలులోనికి తీసుకుని వచ్చాడు. ఈ సంఘం తదుపరి దినాల్లో మెట్రోపాలిటన్ టేబర్నకిల్ గా మార్చబడింది. అందులోని సంఘ సభ్యులందరూ ఈ నిబంధనకు అనుకూలంగా నడుచుకున్నట్టు చూడగలం. వారు ప్రభువు బల్లలో పాల్గొన్నప్పుడల్లా ఈ నిబంధనను గట్టిగా చదివి వినిపించేవారు. ప్రభువును యథార్థంగా వెంబడించాలనుకునే ప్రతి విశ్వాసికీ ఇదే సరైన గుర్తు.

"మేము (ఎవరైతే) దేవునియందు భయం కలిగి, కలిసికట్టుగా ప్రభువును వెంబడిస్తూ పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా లోతుగా సిగ్గుపడుతూ మా అతిక్రమాలను నీయెదుట వెల్లడిపరుస్తున్నాము. మేము దేవుని సమక్షంలో మరియు ఇతరుల (విశ్వాసులు) సమక్షంలో మా యొక్క అయోగ్యతను గుర్తెరిగి, సంఘంలో ప్రభువుకు మమ్మల్ని మేము అప్పగించుకుని, అపొస్తలుల బోధ ప్రకారం ఆయన మా దేవుడని, మేము ఆయన ప్రజలమని ఆయన (ఉచితమైన కృపతో) శాశ్వతమైన నిబంధన ప్రకారం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మేము అంగీకరించబడతామని నిరీక్షిస్తున్నాము. ఆయన మా ప్రధాన యాజకుడై మమ్మల్ని నీతిమంతులుగా ఎంచి, మమ్మల్ని పరిశుద్ధపరచి, మా ప్రవక్తగా మాకు బోధిస్తాడని నమ్ముతున్నాము. ఆయన మా న్యాయాధిపతిగా, రాజులకు రాజుగా, ఆయనకు మరియు ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞలకు లోబడడం ద్వారా మేము ఎదిగి, బలపరచబడి, ధృఢపరచబడతామని నమ్ముతున్నాము. మేము ఆయనకు పవిత్రమైన పెండ్లి కుమార్తె మాదిరి మా జీవితాంతం ఆయనకు పరిచర్య చేస్తూ పెండ్లి కుమారుడైన యేసు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాము.

1. మేము సంఘంలో బల్ల ఆరాధనలో పాల్గొనడమందు సంతృప్తిని కలిగి ఉన్నాము. మేము పరిశుద్ధమైన ఐక్యత కలిగి, ఇతర విశ్వాసుల సహవాసం కలిగి సువార్త యొక్క క్రమశిక్షణకు లోనౌతాము. మాకు ఇవ్వబడిన పరిశుద్ధమైన భాధ్యతలన్నిటినీ ఇలాంటి ఆత్మీయ కుటుంబంలో నెరవేరుస్తాము. మేము పరిశుద్ధతతోనూ, దైవానుసారమైన జీవితంలోను, తగ్గింపు కలిగిన జీవితంలోనూ సహోదర ప్రేమలోను, ప్రభువుతో మా సహవాసం ఆయనకు ప్రీతికరంగాను, ఆయన దృష్టికి అంగీకారంగాను మిగిలిన ప్రభువు బిడ్డలకు ఆశీర్వాదకరంగా నడుస్తామని మాట ఇస్తున్నాము.

2. మేము ఒకరికొకరము మా యొక్క సంభాషణలను కాపాడుకునే విషయంలో, ఇతరులను పాపంలో నెట్టకుండా ఇతరులను ప్రేమలోను, మంచి పనులు చేసే విషయంలోను తగ్గింపు కలిగి ఇతరులను హెచ్చరించే విషయంలో గద్దించే విషయంలో, ఇతరులను మందలించే విషయంలోనూ క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటామని మాట ఇస్తున్నాము.

3. అలాగే ఇతరుల కొరకు ఒక ప్రత్యేక రీతిలో ప్రార్థించడానికి, సంఘం యొక్క మహిమ కొరకు సంఘ విస్తరణ కొరకు, ఆ సంఘంలో దేవుని సన్నిధి కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ ద్వారా సంఘం యొక్క కాపుదల కొరకు ఆయన మహిమ కొరకు జీవిస్తామని మాట ఇస్తున్నాము.

4. మేము ఇతరుల యొక్క ప్రతి (అంతరంగిక, బాహ్య) భారాలు పంచుకునే విషయంలో ఒకరికి ఒకరు సన్నిహిత సంబంధం కలిగి, ఒకరి యెడల ఒకరు సానుభూతి కలిగి, దేవుని యొక్క చిత్తం మా జీవితంలో ఏదైనా ఇతరులతో కలిసి ముందుకు సాగిపోతామని మాట ఇస్తున్నాము.

5. మేము ఇతరుల బలహీనతలను, తప్పిదాలను భరించి క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారాల ప్రకారం తప్ప మరి వేరెవరికీ అనగా సంఘాల్లో ఉన్నవారికైనా, బయటివారికైనా తెలియచేయమని మాట ఇస్తున్నాము; దేవుడు ఉద్దేశించిన ఆజ్ఞలను బట్టి, విధి విధానాలను బట్టి, సువార్త సత్యాన్ని బట్టి పవిత్రంగా కొనసాగుతామని మాట ఇస్తున్నాము.

6. ఇలా చేయడం ద్వారా సహవాసంలో బేధాభిప్రాయాలు చోటు చేసుకోకుండా, సంఘం యొక్క ఐక్యతను, సంఘ శాంతి పెంపొందటానికి కృషి చేస్తామని మాట ఇస్తున్నాము.

7. ప్రభువు దినాన మరియు ఇతర సమయాల్లోనూ, ఇంకా ప్రభువు మాకిచ్చిన అవకాశాలను బట్టి, ఆయనను ఆరాధించడానికి, ఇతరులను ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి సంఘ ఆరాధనలకు హాజరౌతామని మాట ఇస్తున్నాము.

8. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన ప్రకారం మా యొక్క శక్తి మేరకు దేవుని చేత ప్రతిష్టించబడి సువార్తను బోధించే సంఘ కాపరి సువార్త చేత సంఘం చేత పోషించబడాలని మాట ఇస్తున్నాము. ఈ నిబంధనను అతిక్రమించడం కంటే మన మనస్సాక్షికి వ్యతిరేకమైన పాపం మరొకటి ఉంటుందా?

మా శక్తి వల్ల కాక మా బలహీనతల్ని బాగా గుర్తించి, దేవుని యొక్క బలం చేత శక్తి చేత మాకనుగ్రహించిన సువార్త (సంఘ) బాధ్యతలను మేము నిర్వర్తిస్తామని, మమ్మల్ని ఆయనకు అప్పగించుకుంటూ, మేము ఆయనవారమని, ఆయన పరిచర్యకు మమ్ములను మేము అప్పగించుకుంటున్నాము. ఆయనకు సమస్త ఘనత, మహిమ కలుగును గాక. ఆమేన్!"

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.