దుర్బోధలకు జవాబు

రచయిత: ఆర్థర్. డబ్ల్యు. పింక్
చదవడానికి పట్టే సమయం: 19 నిమిషాలు

ఆడియో

అపవాది ఆరంభికుడు కాదు, అనుకరించేవాడు. దేవునికి యేసుక్రీస్తు ఏకైకకుమారునిగా ఉన్నట్లే అపవాదికి కూడా ''పాపపురుషుడనే నాశనపుత్రుడు ఉన్నాడు'' (2థెస్స. 2:3).

పరిశుద్ధత్రిత్వం ఉన్నట్లే పాపత్రిత్వం కూడా ఉంది (ప్రకటన 20:10). మనం బైబిల్‌లో 'దేవుని బిడ్డల' గురించి మాత్రమే కాక 'దుష్టుని పిల్లల' (మత్తయి 13:38; యోహాను 8:44) గురించి కూడా చదువుతాము. 'ఇచ్ఛయించుటకును కార్యసిద్ధికలుగజేసికొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై తనవారిలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడేనని' మనం చదువుతాము గదా (ఫిలిప్పీ 2:13). అదే విధంగా అవిధేయులైనవారిని ప్రేరేపించే శక్తి అపవాదేనని కూడా రాయబడింది (ఎఫెసీ 2:2). ''దైవభక్తిని గూర్చిన మర్మము'' ఉన్నట్లే (1 తిమోతి 3:16) ''ధర్మ విరోధ సంబంధమైన మర్మము'' కూడా ఉంది (2 థెస్స. 2:7). తన దాసుల మీద ''ముద్ర వేయడానికి'' దేవుడు దూతల్ని వాడుకున్నట్లే (ప్రకటన 7:3) సాతాను కూడా తన భక్తుల మీద ముద్ర వేయడానికి తన సేవకులను వాడుకుంటాడని వాక్యం చెబుతుంది (ప్రకటన 13:16). 'దేవుని ఆత్మ 'అన్నిటిని', దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తున్నాడని' మనం చదువుతాము కదా (1 కొరింథీ 2:10). అలాగే సాతాను కూడా ''గూఢ సంగతులను'' (లోతైన వాటిని) తెలియజేస్తాడని (ప్రకటన 2:24) బైబిల్‌ చెబుతుంది. క్రీస్తు అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేసినట్టే సాతాను కూడా అద్భుతకార్యాలు, సూచకక్రియలు చేస్తాడు (2 థెస్స 2:9). క్రీస్తు సింహాసనాసీనుడైయున్నట్టే సాతానుకు కూడా సింహాసనం ఉంది (ప్రకటన 2:13). క్రీస్తుకు సంఘం ఉన్నట్టే సాతానుకు కూడా 'సమాజం' ఉంది (ప్రకటన 2:9). క్రీస్తు లోకానికి వెలుగు. అలాగే అపవాది కూడా ''వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు'' (2 కొరింథీ 11:14). క్రీస్తు ''అపొస్తలులను'' నియమించాడు. అలాగే సాతానుకు కూడా అపొస్తలులు వున్నారు (2 కొరింథీ 11:13). ఇవన్నీ సాతాను సువార్తను పసిగట్టి అప్రమత్తంగా ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తున్నాయి.

నకిలీని సృష్టించడంలో అపవాది మహానిష్ణాతుడు. క్రీస్తు విత్తిన పొలంలోనే అపవాది కూడా పని చేస్తున్నాడు. ధాన్యంలా కనబడే గురుగులను మొలిపించి ధాన్యఉత్పత్తిని ఆపాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని కార్యాన్ని నిర్వీర్యం చేయడానికి అపవాది క్రీస్తును అనుకరించడం మొదలుపెట్టాడు. కాబట్టి క్రీస్తుకు సువార్త ఉన్నట్లే అపవాదికి కూడా సువార్త ఉంది. అపవాది సువార్త క్రీస్తు సువార్తకు నకలు. అపవాది సువార్త నిజసువార్తను దగ్గరగా పోలి ఉంటుంది గనుక దాని వలన అనేకమంది  మోసపోతున్నారు. ఈ అపవాది సువార్తను గురించి గలతీ పత్రికలో పౌలు ఇలా చెప్పాడు: ''క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు'' (గలతీ 1:6,7). ఈ కల్తీసువార్త అపొస్తలుల కాలంలో కూడా ప్రకటించబడింది. దాన్ని ప్రకటించేవారి మీదికి గొప్ప శాపం వస్తుందని పౌలు చెప్పాడు. ''మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక'' అని పౌలు చెప్పాడు. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఈ తప్పుడు సువార్తను నిశితంగా పరిశీలిద్దాం.

సాతాను సువార్త విప్లవాత్మక సూత్రాలున్న వ్యవస్థ కాదు. ఇది అరాచకత్వపు పథకం అంతకంటే కాదు. ఇది యుద్ధాన్ని, అల్లకల్లోలాన్ని పుట్టించదుగాని ఐక్యతే దాని లక్ష్యం. ఇది కుమార్తెకు వ్యతిరేకంగా తల్లిని లేక కుమారునికి వ్యతిరేకంగా తండ్రిని లేపదు. ఇది మానవులంతా 'సహోదరులని' చెబుతుంది. ఇది లోకస్థునిని క్రిందికి లాగదుగాని అతన్ని పైకిలేపి అభివృద్ధిపరుస్తుంది. ఇది విద్యను, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది 'మనిషిలోని మంచిని' పురికొల్పుతుంది. ఈ లోకాన్ని కష్టరహితమైన సానుకూల నివాసంగా మలిచి క్రీస్తు లేని వెలితిని దేవుని అవసరతను గుర్తెరగకుండేలా చేయడమే దీని ప్రధానలక్ష్యం. ఇది ఒక వ్యక్తిని ఈ లోకవిషయాలతో ఆక్రమితం చేసి పరలోకవిషయాలను మనస్కరించటానికి సమయం కాని ఆసక్తిగాని లేకుండా చేస్తుంది. ఇది త్యాగం, దాతృత్వం వంటి సూత్రాలను ప్రకటిస్తూ ఇతరుల కోసం జీవించాలని,అందరికీ దయ చూపాలని బోధిస్తుంది. ఇది శరీరానుసారమైన మనస్సును ఆకర్షిస్తుంది గనుక అనేకమందికి నచ్చుతుంది. ఎందుకంటే మనిషి పాపంలో మరణించాడని, నిత్యజీవము నుండి వేరుపరచబడ్డాడని, అతడు తిరిగి జన్మిస్తేనే నిరీక్షణ ఉందనే సత్యాన్ని ఇది విస్మరిస్తుంది.
సత్క్రియలు రక్షణ యొక్క ఫలితం అన్న దేవుని నియమానికి భిన్నంగా, సత్క్రియల వలన రక్షణ కలుగుతుందని ఇది ప్రకటిస్తుంది. ఇది యోగ్యత వలనే నీతిమంతులౌతారని బోధిస్తుంది. 'మంచి చెయ్యి, మంచిగా జీవించు' అనేది దీని నినాదం. కాని ఇది మనిషిలో మంచి లేదనే సత్యాన్ని ప్రకటించదు. ఇది 'మంచి నడవడి రక్షణ యొక్క ఫలం' అని చెప్పే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా 'మంచి నడవడి వలన రక్షణ కలుగుతుందని' ప్రకటిస్తుంది. దీనికి శాఖలు, వ్యవస్థలు అనేకం. 'సంయమనం', 'సంస్కరణోద్యమం', ''క్రైస్తవ సామాజిక సమితి,'' ''నైతిక సాంస్కృతిక సంస్థలు'', ''శాంతి సమావేశాలు'' మొదలైనవన్నీ క్రియల వలన రక్షణ అనే ఈ సాతాను సువార్తను తెలిసో తెలియకో ప్రోత్సహిస్తున్నాయి. 'అంగీకార పత్రాలు' 'క్రీస్తు' స్థానాన్ని, 'సామాజిక పవిత్రత', 'వ్యక్తిగత మారుమనస్సు' స్థానాన్ని, 'రాజకీయాలు' మరియు 'తాత్విక చింతన', 'హితబోధ' మరియు 'భక్తి'స్థానాన్ని ఆక్రమించాయి. క్రీస్తులో నూతన సృష్టి కంటే ప్రాచీనపురుషుడ్ని మెరుగుపరచుకోవటమే వారు ఎక్కువ ఉపయోగకరంగా భావిస్తారు. సమాధానాధిపతి ప్రస్తావన లేకుండానే వారు సార్వత్రిక సమాధానాన్ని వెదుకుతున్నారు.

అపవాది అపొస్తలులు సారాదుకాణ నిర్వాహకులో లేదా వేశ్యావర్తకులో కాదు కాని అధికశాతం సంఘంలోని దుర్బోధకులే. నేడు అనేకమంది ప్రసంగీకులు క్రైస్తవ మూలసత్యాలను బోధించడం లేదు కాని వారు సత్యం నుండి తొలగి కల్పనాకథలను బోధిస్తున్నారు. వారు పాపం యొక్క ఘోరప్రమాదాన్ని, దాని పర్యావసానాన్ని ప్రకటించకుండా కేవలం మంచిని గుర్తెరగకపోవటం లేదా మంచి లేకపోవటమే పాపమని బోధిస్తున్నారు. ''రాబోవు ఉగ్రతను తప్పించుకొమ్మని'' హెచ్చరించడానికి బదులు దేవుడు ప్రేమాస్వరూపి గనుక ఆయన తన సృష్టి మీద ఉగ్రతను తేడు అని బోధిస్తూ తద్వారా దేవునిని అబద్ధికునిగా చేస్తున్నారు. వారు ''రక్తం చిందకుండా పాపక్షమాపణ లేదని'' బోధించడానికి బదులు క్రీస్తు మార్గదర్శి గనుక ఆయన అడుగుజాడల్లో జీవిస్తే చాలని బోధిస్తున్నారు. ''వారు  దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు'' (రోమా 10:3). వారి సందేశం సహేతుకంగా అనిపించవచ్చు. వారి లక్ష్యం యోగ్యమైనదిగా కూడా అనిపించవచ్చు. ఐనా వారి గురించి ఇలా రాయబడి ఉంది - ''క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునైయున్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతిపరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికంతము కలుగును'' (2 కొరింథీ 11:13-15).

దేవుని సత్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తూ ఆయన రక్షణమార్గాన్ని స్పష్టంగా వివరించే నాయకులు నేడు వందలాది సంఘాలలో లోపించారనే వాస్తవంతో పాటు, ఈ సంఘాలలోని అధిక సంఖ్యాకులలో సత్యాన్ని గ్రహించాలనే ఆసక్తి స్పష్టంగా కొరవడిందనే నిజాన్ని కూడా మనమెదుర్కోవలసి ఉంది. నేడు క్రైస్తవకుటుంబాల్లో వాక్యపఠనం లేదు. సంఘాల్లో బైబిల్‌ను సరిగా బోధించటం లేదు. పురోగతికి పరుగులు తీసే ఈ నిర్విరామయుగపు ఒడుదుడుకుల మధ్య, దేవునిని కలుసుకునేందుకు సిద్ధపడే సమయం గాని తపన గాని అనేకులకు లేదు. వాక్యాన్ని పరిశోధించటంలో సోమరులైన అనేకులు తమ కోసం పరిశోధన చేసిపెట్టే బోధకులను ఆశ్రయిస్తారు. ఐతే ఈ బోధకులు కూడా దేవుని వాక్యానికి బదులుగా సామాజిక మరియు ఆర్థిక సమస్యలపై ప్రసంగాలు చేస్తూ వారిని మోసపరుస్తున్నారు. ''ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును'' అని సామెత 14:12 చెబుతుంది. ''మరణానికి'' దారితీసే ఈ మార్గమే సాతాను వంచన. అదే అపవాది సువార్త. ఈ మార్గం మానవ ప్రయత్నాలతో రక్షణ సంప్రాప్తమౌతుందని బోధిస్తుంది. ఒకని యెదుట సరియైనదిగా కనిపించే మార్గం ఇదే. ఇది ప్రకృతి సంబంధియైన వ్యక్తికి హేతుబద్ధమైనదిగా అనిపించేలా రూపొందించబడిన మార్గం. ఇది వినేవారి మనస్సులను ఆకట్టుకునే విధంగా తెలివిగాను ఆకర్షణీయంగాను బోధించబడుతుంది. ఇది క్రైస్తవ పదజాలాన్ని వాడుతుంది. ఇది కొన్నిసార్లు దానికి అనుకూలించే బైబిల్‌ వచనాలను కూడా వాడుతుంది. ఇది ఉన్నతమైన ఆలోచనలను మనుష్యుల ముందుంచుతుంది. ఇది మన వేదాంత కళాశాలల్లో  శిక్షణ పొందిన కొందరు బోధకుల చేత ప్రకటింపబడుతుంది గనుక లెక్కకు మించిన ప్రజలు దీని వలలో చిక్కి మోసపోతున్నారు.

నకిలీనాణెము అసలు నాణానికి ఎంత దగ్గరగా పోలి ఉంటే మోసపరచడం అంత సులభమౌతుంది. అలాగే దుర్భోధ  అనేది సత్యాన్ని వ్యతిరేకించటం కాదు, దానిని వక్రీకరించటమే కనుక సత్యతిరస్కారం కన్నా పాక్షికఅబద్ధమే అత్యంత అపాయకరం. అందుచేతనే అబద్ధానికి జనకుడు క్రైస్తవ వేదికలపైకి చొరబడినప్పుడు క్రైస్తవమూలసత్యాలను తిరస్కరించటం వాని విధానం కాదు. దానికి భిన్నంగా అతడు వాటిని తెలివిగా ఒప్పుకుంటూనే వాటికి వక్రభావాలు చెబుతూ తప్పుడు అన్వయింపును నేర్పిస్తాడు. ఉదాహరణకు అపవాది దేవుని ఉనికిని బహిరంగంగా ఖండించేంత అవివేకి కాదు. అతడు దేవుని ఉనికిని అంగీకరిస్తూ ఆయన గుణలక్షణాలను వక్రీకరించి బోధిస్తాడు. ''యేసు క్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు'' (గలతీ 3:26), ''తన నామమునందు విశ్వాసమునుంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను'' (యోహాను 1:12) అని లేఖనాలు స్పష్టంగా చెబితే, దేవుడు మనుష్యులందరికీ ఆత్మీయతండ్రి అని అపవాది ప్రకటిస్తాడు. అంతేగాక ''ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను'' (ప్రకటన 20:15) అని వాక్యం చెబితే దేవుడు కనికరస్తుడు గనుక ఆయన మనుష్యులను నరకానికి పంపడని అపవాది ప్రకటిస్తాడు. అలాగే అపవాది మానవచరిత్రకు కేంద్రబిందువైన క్రీస్తును తృణీకరించేంత వెర్రివాడు కాదు. దీనికి భిన్నంగా వాని సువార్త క్రీస్తును మనుషులందరిలోకెల్లా ఉత్తమునిగా గుర్తిస్తుంది, ఆయన క్రియల దయాళుత్వము, వ్యక్తిత్వపు సౌందర్యము మరియు ఉపదేశాల మృదుత్వము వైపు వారి దృష్టిని ఆకర్షిస్తుంది.

అది ఆయన జీవితాన్ని కొనియాడుతూ ఆయన పాపపరిహారమరణాన్ని తెలివిగా పక్కకు తప్పిస్తుంది . అతి కీలకమైన ఆయన సిలువమరణాన్ని అది విస్మరిస్తూ, ఆయన పునరుత్థానాన్ని ఒక మూఢవిశ్వాసంగా పరిగణిస్తుంది. అది క్రీస్తు రక్తప్రోక్షణను ప్రస్తావించని సువార్త. అది సిలువ వేయబడని క్రీస్తును ప్రకటిస్తుంది. యేసును దేవునిగా కాక కేవలం ఒక ఆదర్శపురుషునిగా మాత్రమే అది చిత్రీకరిస్తుంది. 2 కొరింథీ 4:3-4లోని లేఖనభాగం మన ప్రస్తుత అంశంపై మరింత వివరణనిస్తుంది. అక్కడ మనమిలా చదువుతాం, ''మా సువార్త మరుగు చేయబడినయెడల నశించుచున్నవారి విషయంలోనే మరుగు చేయబడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత (సాతాను) అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.'' అపవాది క్రీస్తు వెలుగును దాచి అవిశ్వాసుల మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేస్తాడు. అతడు ఈ కార్యాన్ని క్రీస్తు సువార్తకు బదులుగా తన స్వీయసువార్తను ప్రత్యామ్నాయపరచటం వలన జరిగిస్తాడు. గనుకనే వానికి ''సర్వలోకమును మోసపుచ్చే అపవాదియని'' బిరుదు ఇవ్వబడింది (ప్రకటన 12:9). మనిషిలోని మంచి మీద దృష్టి మళ్లిస్తూ నైతిక సమున్నతమైన జీవితాన్ని కలిగుండమని ప్రోత్సహిస్తూ నానా అభిప్రాయాలు గల వారందరూ ఏకీభవించగలిగేటటువంటి వేదికను అతడు సిద్ధపరుస్తాడు. సామెతలు 14:12ను నేను మరలా ప్రస్తావిస్తున్నాను -  ''ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును.'' నరకానికి వెళ్ళే మార్గం సదుద్దేశాలతోనే ఏర్పరచబడుతుందనే మాటలో ఎంతో కొంత వాస్తవముంది. సదుద్దేశాలు గలిగి నిజాయితీ గల నిర్ణయాలతో ప్రశంసనీయమైన ఆదర్శాలు కలిగి తమ వ్యవహారాలలో నీతి, వ్యాపారాలలో నిజాయితీ మరియు తమ ప్రవర్తన అంతటిలో ప్రేమను కనపరచి తమ నిష్కాపట్యాన్ని బట్టి అతిశయించిన అనేకులు తమ స్వనీతి క్రియల చేత దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడగోరి తమ్మును తాము పాపులుగాను, నశించినవారుగాను, నరకపాత్రులుగాను రక్షకుని అవసరతగలవారుగాను గుర్తెరగటం లేదు గనుక వారు నరకంలో ఉంటారు. ''సరియైనదిగా'' కనపడు మార్గము ఇలాంటిదే. నీతిక్రియల వలన దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడగలమనేది సాతాను వంచన. కాని ''మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు.ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే'' (ఎఫెసీ 2:8) అని, అంతే కాక ''మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే ...... మనలను రక్షించెను'' (తీతుకు 3:5) అనీ దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక 'క్రైస్తవ సేవకుడిని' కలిశాను. ఆ వ్యక్తి ఏడు సంవత్సరాలు పరిచర్యలో చురుకుగా పాల్గొంటూ ప్రసంగించాడు. కాని ఆ వ్యక్తి కొన్ని మాటలను తరుచూ వాడాడు. అప్పుడు అతడు ''తిరిగి జన్మించాడా'' అనే అనుమానం నాకు కలిగింది. నేను అతన్ని ప్రశ్నించినపుడు అతనికి లేఖనాలు తెలియదని మరియు క్రీస్తు సిలువ త్యాగం పట్ల కొంచెం అవగాహన మాత్రమే అతనికుందని నాకు తెలిసింది. కొంతకాలం పాటు నేను అతనికి రక్షణ మార్గాన్ని అర్ధమయ్యేలా చెప్పాను. ఒకవేళ అతడింకా రక్షణ పొందకపోతే దేవుడు రక్షిస్తాడనే ఆశతో వాక్యాన్ని చదవాలని నేను అతన్ని ప్రోత్సహించాను.

అనేక సంవత్సరాలు సువార్తను ప్రకటించిన ఆ వ్యక్తి ఒకరోజు సాయంకాలం తాను గత రాత్రే క్రీస్తును వాస్తవంగా కనుగొన్నానని చెప్పడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. గతంలో అతడు క్రీస్తు ఆదర్శాన్నే ప్రకటించాడని, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించలేదని అంగీకరించాడు. ఇతనిలాగే  అనేకమంది క్రైస్తవులున్నారని నేను నమ్ముతున్నాను. వారు సండే స్కూల్లో యేసు జననము, జీవితము, బోధలు తెలుసుకుని ఆయన చరిత్రను నమ్మి ఎంతో కష్టంతో ఆయన కట్టడలను ఆచరిస్తూ వారి రక్షణకు అవసరమైనదల్లా ఇంతేనని భావిస్తారు. కాని వారు పెద్దైన తరువాత నాస్తికులను, అవిశ్వాసులను కలిసినపుడు అసలు యేసు వాస్తవంగా జీవించలేదని వింటారు. అయితే చిన్నతనం నుండి వారి మనసులో వేయబడిన ముద్ర అంత సులువుగా చెరిపివేయబడలేదు గనుక వారు క్రీస్తునందలి విశ్వాసపు ఒప్పుకోలులో దృఢంగా నిలిచి ఉంటారు. కాని ఒకవేళ మనం వారి విశ్వాసాన్ని పరీక్షిస్తే, వారు యేసును గురించి అనేక విషయాలు నమ్ముతారే గాని వాస్తవానికి ఆయనను నమ్మటం లేదని తెలుస్తుంది. చరిత్రలో యేసు అనే ఒక వ్యక్తి జీవించాడని వారు నమ్ముతూ ఆ విశ్వాసం వలన తాము రక్షింపబడ్డామని భావిస్తారు. కాని వారెన్నడూ ఆయనకు వ్యతిరేకమైన జీవితాన్ని విడువలేదు. వారు సంపూర్ణ హృదయంతో ఆయనకు లోబడలేదు. జీవితాన్ని సమర్పించకుండా క్రీస్తు బోధకు సమ్మతి తెలపడం ''ఒకనికి సరియైన మార్గముగా కనబడవచ్చు గాని తుదకు అది మరణానికి నడిపిస్తుంది.'' క్రీస్తు వ్యక్తిత్వపు వాస్తవికతకు కేవలం మేథో సంబంధమైన ఆమోదానికి మాత్రమే పరిమితమైన విశ్వాసం ఒక వ్యక్తికి సరియైన మార్గముగా కనబడుతుంది గాని తుదకు అది మరణానికి దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది నిశ్చయంగా సాతాను సువార్తే.

ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డావు? సరియైనదిగా కనబడినప్పటికీ మరణానికి దారితీసే మార్గంలో నిలబడ్డావా? లేక జీవానికి నడిపించే ఇరుకుమార్గంలో ఉన్నావా? నాశనానికి నడిపించే విశాలమార్గాన్ని విడనాడావా? నీలోని క్రీస్తు ప్రేమ, ఆయన్ని దు:ఖపరిచే వాటన్నిటిని ద్వేషించేలా చేస్తుందా? ఆయన 'నీమీద ఏలాలని' ఆశిస్తున్నావా(లూకా 19:14)? నువ్వు దేవుని చేత అంగీకరింపబడటానికి కేవలం యేసు రక్తముపై, ఆయన నీతిపై ఆధారపడుతున్నావా? బాహ్యంగా దైవభక్తిలా అనిపించేవాటిని నమ్మేవారు, బాప్తిస్మము, ప్రభువు బల్ల మొదలైనవాటిని ఆశ్రయించేవారు, గౌరవనీయులుగా గుర్తింపబడేందుకు మతసంబంధమైన విషయాలలో చురుకుగా పాల్గొనేవారు, లాంఛనప్రాయంగా సంఘాలకు హాజరయ్యేవారు మరియు క్రైస్తవులుగా మారేందుకు ఏదో ఒక సంఘంలో చేరేవారు అందరూ మరణానికి, అంటే ఆత్మీయ నిత్యమరణానికి దారితీసే మార్గంలో ఉన్నారు. మన ఉద్దేశాలు ఎంత మంచివైనా, మన కారణాలు ఎంత గొప్పవైనా, మన భావాలు ఎంత సహేతుకమైనవైనా, మన ప్రయత్నాలు ఎంత యథార్థమైనవైనా, దేవునికుమారున్ని అంగీకరించకపోతే దేవుడు మనల్ని తన కుమారులుగా అంగీకరించడు.

సాతానుసువార్తలో నమ్మశక్యంగా కనిపించే మరొక కోణం ఏమిటంటే, అతడు బోధకులను క్రీస్తు ప్రాయశ్చిత్తమరణాన్ని ప్రభోదించటానికి నడిపించి, దేవుడు వారి నుండి కోరేదల్లా కేవలం తన కుమారునిపై విశ్వాసముంచటమేనని ప్రజలకు ప్రకటిస్తాడు. తత్ఫలితంగా మారుమనస్సు పొందని వేలాదిమంది ప్రజలు తాము రక్షింపబడ్డామని మోసపోతున్నారు. కాని ''మారుమనస్సు పొందనియెడల మీరందరును అలాగే నశింతురు'' అని యేసు చెప్పాడు (లూకా 13:3). ''మారుమనస్సు పొందటం'' అంటే పాపాన్ని ద్వేషించి దాని విషయమై దు:ఖపడి దాని నుండి వైదొలగటమే. ఇది పరిశుద్ధాత్ముడు మనలో విరిగి నలిగిన హృదయానుభవాన్ని పుట్టించటం వలన కలుగుతుంది. విరిగి నలిగిన హృదయముగలవారు తప్ప మరెవరూ క్రీస్తును రక్షణకు యోగ్యమైన విధంగా విశ్వసించలేరు. ప్రజలు యేసును 'ప్రభువుగా' అంగీకరించకుండానే ఆయన్ని 'వ్యక్తిగత రక్షకునిగా' అంగీకరించామనే భ్రమలో ఉన్నారు. దేవుని కుమారుడు తన ప్రజలను పాపములో కొనసాగేలా రక్షించటానికి రాలేదు కాని, ''వారి పాపముల నుండి'' వారిని విడిపించి రక్షించడానికి వచ్చాడు (మత్తయి 1:21). పాపాలలో నుండి రక్షింపబడటం అంటే దేవుని అధికారం పట్ల నిర్లక్ష్యం మరియు తిరుగుబాటు నుండి రక్షింపబడటం. అది స్వయంచిత్తాన్ని మరియు స్వయాన్ని తృప్తిపరచుకోవటాన్ని త్యజించటం. అది సొంతమార్గాల్ని విడనాడటం (యెషయా 55:7). అది దేవుని అధికారానికి లోబడి, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించి, ఆయన ఏలుబడికి మనల్ని మనం సమర్పించుకోవడమే. క్రీస్తు ''కాడిని'' ఎన్నడూ ఎత్తుకోకుండా అన్ని విషయాల్లోనూ ఆయనను సంతృప్తిపరచాలని చూడకుండా క్రీస్తు సిలువకార్యము మీద ఆధారపడుతున్నామని భ్రమపడేవారు సాతాను చేత మోసగింపబడుతున్నవారే. మత్తయి సువార్తలోని 7వ అధ్యాయంలో క్రీస్తుసువార్త మరియు సాతాను యొక్క నకిలీసువార్త, ఇవి రెండూ దారితీసే పరిణామాలను సూచించే రెండు వాక్యభాగాలున్నాయి . మొదటిది మత్తయి 7:13-14లో ''ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది. దాని కనుగొనువారు కొందరే.'' రెండవది మత్తయి 7:22-23లో ఉంది - ''ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.'' అవును చదువరీ! క్రీస్తు నామంలో సేవ చేస్తూ ఆయన నామంలో ప్రసంగిస్తూ సంఘంచేత గుర్తింపు పొంది లోకం చేత గుర్తెరుగబడి కూడా క్రీస్తు చేత ఎరుగబడకుండటం సాధ్యమే. కాబట్టి మనమెక్కడున్నామో తెలుసుకోవడం, విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవటం, వాక్యం చేత మనల్ని మనం బేరీజు వేసుకోవటం, శత్రువు చేత మనము మోసగించబడుతున్నామో లేదో వివేచించుకోవటం మరియు మన జీవితాన్ని ఇసుకపై నిర్మిస్తున్నామా లేక క్రీస్తు అనే బండపై కడుతున్నామా అని పరీక్షించుకోవటం ఎంతో అవసరం. పరిశుద్ధాత్ముడు మన హృదయాలను పరిశోధించి మన స్వీయచిత్తాన్ని విరగ్గొట్టి దేవునిపట్ల మనకున్న వైరాన్ని వధించి మనలో రక్షణార్థమైన పశ్చాత్తాపాన్ని కలిగించి లోకపాపాల్ని మోసే దేవునిగొర్రెపిల్ల వైపుకు మన దృష్టిని మళ్లించును గాక.

Add comment

Security code
Refresh

Comments  

# మరియొక సువార్తRaju 2020-11-26 09:11
చాలా చక్కగా వివరించారు సార్.... ఇంకనూ అనేక మంది కి ఈ విషయాలు తెలియబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.