దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

 

 నయమానును విడిచిన కుష్ఠువంటి వక్రీకరణలతో తంటాలు పడుతున్న జైశ్రీరాం పాస్టర్ కి సమాధానమే ఈ వ్యాసం

అపోస్తలుడైన పేతురు పౌలు పత్రికలను ఉద్దేశించి "వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు (వక్రముగా త్రిప్పుదురు)" (2 పేతురు 3:16)‌ అని ప్రస్తావించడాన్ని బట్టి కొందరు లేఖనాలను తమ స్వకీయ నాశనమునకు అపార్థము చెయ్యడం, లేక వక్రముగా త్రిప్పడం ప్రారంభంనుండీ జరుగుతూ వస్తుందని మనకు అర్థమౌతుంది. అలా నాశనపాత్రుడైన ఒక దుర్బోధకుడి వల్ల వక్రముగా త్రిప్పబడి, తప్పనిసరి పరిస్థితుల్లో క్రైస్తవులు కూడా విగ్రహారాధన చెయ్యవచ్చు అనడానికి అతను ఆధారంగా చూపిస్తున్న లేఖనాన్ని విశ్లేషించడానికి ఈ వ్యాసం రాస్తున్నాను.‌

విషయానికి వస్తే; రెండురోజుల క్రితం నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి వాక్యజ్ఞానం, క్రైస్తవ నైతికతలు లేకున్నప్పటికీ కేవలం తనకున్న వాక్చాతుర్యంతో తన గురువైన మరో దుర్బోధకుడు నేర్పించిన నాలుగు ముక్కలతో ప్రముఖబోధకుడిగా వర్ధిల్లిన ఒక దుర్బోధకుడు తీసుకువచ్చిన వాదనను ప్రస్తావించాడు. ఆ దుర్బోధకుడు ఎలీషా నయమానుల సందర్భాన్ని ఉటంకిస్తూ క్రైస్తవులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో విగ్రహారాధన చెయ్యవచ్చు లేదా వాటిని నమస్కరించవచ్చు అన్నట్టుగా వాదిస్తున్నాడంట. ఆ వాదన వినగానే నేను గతంలో కొన్ని దుర్బోధలు విన్నప్పటికంటే మరి కొంచెం ఎక్కువగానే ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే ఆ వాదన వల్ల సరైన వాక్యజ్ఞానం లేని లేక అప్పుడప్పుడే క్రొత్తగా క్రైస్తవ్యంలోకి వస్తున్నటువంటి విశ్వాసులు మరలా విగ్రహారాధన వైపుగా మళ్ళించబడే ప్రమాదం ఎంతైనా ఉంది. ఆవిధంగా ఆ దుర్బోధకుడు చేస్తున్నటువంటి వాదన తనతో పాటుగా ఇతరులను కూడా క్రైస్తవ నియమాల నుండి దారితప్పించే అపవాది అస్త్రంగా ప్రయోగించబడింది. గమనించండి. నాకు ఫోన్ చేసిన సహోదరుడు ఒక హైందవకుటుంబంలో విశ్వాసిగా మారి విగ్రహారాధనకు సంబంధించిన విషయాలలో ఇప్పటికీ తన కుటుంబం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురౌతుంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఆ వాదనవల్ల ప్రేరేపించబడితే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకాని విగ్రహారాధన విషయంలో ఇంతకాలం నిష్ఠగా ఉంటూ నా కుటుంబాన్ని బాధపెట్టాను, నేను కూడా బాధపెడ్డానని అప్పటినుంచి కొన్ని ప్రత్యేక సమయాలలో విగ్రహారాధన చేసుండేవాడు కదా? కానీ ఆ సహోదరుడు లేఖనజ్ఞానం కలిగినవాడు కాబట్టి అలా దారితప్పకుండా నాకు సమాచారం అందించాడు. కానీ అలాంటి లేఖనజ్ఞానం లేనివారు ఆ వాదన విషయంలో తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఆందోళన చెందుతున్నాను.

2తిమోతికి 2:17 కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును.

ఇక ఆ దుర్బోధకుడు విగ్రహారాధనకు సానుకూలంగా వక్రీకరించిన లేఖనభాగం దగ్గరకు వద్దాం. మనం "1 రాజులు 5వ అధ్యాయాన్ని" చదువుతున్నప్పుడు సిరియా రాజుకు కుష్ఠురోగం కలిగిన నయమాను అనే సైన్యాధిపతి ఉంటాడు. ఇశ్రాయేలీయుల దేశం నుండి బానిసగా చెరపట్టబడిన ఒక యువతి సమాచారం మేరకు అతను ప్రవక్తయైన ఎలీషాను సంప్రదించి స్వస్థత కోరుకుంటాడు. ఎలీషా చెప్పినప్రకారం అతను యోర్దాను నదిలో ఏడుసార్లు మునిగినప్పుడు ఆ కుష్ఠురోగం నుండి స్వస్థతపొందుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరి సంబాషణనూ చూడండి.

2 రాజులు 5:17-19 అప్పుడు-యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా ఎలీషా-నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్ద నుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.

ఈ సంబాషణలో నయమాను "నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని" పలికినప్పుడు దానికి ఏలీషా "నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవివ్వడాన్ని" బట్టి ఆ దుర్బోధకుడు క్రైస్తవులు తప్పనిసరి పరిస్థితుల్లో విగ్రహాలకు నమస్కరించినప్పటికీ పాపం కాదని బోధిస్తున్నాడంట. నిజానికి పరిశుద్ధాత్ముడు ఆ భావంలోనే ఈ మాటలను రాయించాడా అనేది తెలుసుకోవడానికి ముందు; బోధకులు అనుసరించవలసిన ప్రాముఖ్యమైన నియమం గురించి మనం తెలుసుకోవాలి.‌

అదేంటంటే; మనం ఏదైన లేఖనభాగం ఆధారంగా బోధించేముందు ఆ లేఖనం రాయబడిన సందర్భం చూడాలి. అలానే మిగిలిన లేఖనాల పరిథిలో ఆ లేఖనాన్ని అర్థం చేసుకోవాలే తప్ప, ఆ ఒక్క లేఖనాన్ని బట్టి మిగిలిన లేఖన నియమాలను తుంగలో త్రొక్కకూడదు, దానికి అనుకూలంగా మరల్చకూడదు. దేవుని ఆజ్ఞలు ఏం చెబుతున్నాయి, మిగిలిన లేఖనాలు ఏం చెబుతున్నాయి అనేది ప్రాముఖ్యం. ఈ నియమాన్ని ప్రక్కనపెడితే ఎలాంటి దరిద్రపు బోధలనైనా చెయ్యవచ్చు. నేడు సంఘంలో ప్రవేశించిన దుర్బోధలన్నీ అలా ప్రవేశించినవే. ఇలా చేసేది ప్రజల దురాశలకు అనుకూలంగా బోధించి వారి మెప్పును పొందుకోవాలనుకునే దుర్బోధకులే తప్ప నమ్మకమైన సేవకులు ఇలా చెయ్యలేరు. మనం మాట్లాడుకుంటున్న దుర్బోధకుడు ఆ జాబితాకు చెందినవాడే. ఒకవిధంగా అతనికి దుర్బోధకులకు లేక వక్రీకరణ బోధలకు పితామహుడు అనే బిరుదుకూడా ఇవ్వవచ్చునేమో.

ఒకసారి విగ్రహారాధన విషయంలో దేవుని ఆజ్ఞను చూద్దాం;

నిర్గమకాండము 34:14 ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.

లేఖనాలలో ఇలాంటి ఆజ్ఞలను ఎన్నిటినో మనం గమనిస్తాం. ఈ ఆజ్ఞను బాగా గమనించండి; "ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు" అని రాయబడింది. నమస్కారం చెయ్యవద్దు అంటే చెయ్యకూడదు అంతే. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఆ దుర్బోధకుడు మనం భక్తితో నమస్కారం చేస్తే విగ్రహారాధన ఔతుంది తప్ప మనసులో ఎలాంటి భక్తిభావనా లేనప్పుడూ లేక తప్పనిసరి పరిస్థితుల్లోనూ నమస్కారం చేసినప్పటికీ విగ్రహారాధన కాదు అనే భావం వచ్చేలా వాదిస్తుంటాడు. అదే నిజమైతే షద్రకు మేషాకు అబేద్నేగోలకు ఆ జ్ఞానం లేకుండిందా? వారి మనసులో ఏమీ లేదు కాబట్టి రాజు ఆజ్ఞాపించినప్పుడు (దానియేలు 3) అతని దేవతకు నమస్కారం చేసుంటే సరిపోయేదిగా? ఆ మాత్రం దానికి ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు పోరాడవలసి వచ్చింది? వారేమీ మా దేవుడు కాపాడేస్తాడు అనే ధైర్యంతో ఆ తెగింపును చూపించలేదు. అందుకే "షద్రకును, మేషాకును, అబేద్నేగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము" (దానియేలు 3:16-18) అని సమాధానం ఇచ్చారు. దీనిప్రకారం ఆ దుర్బోధకుడి దృష్టిలో వీరు చూపించిన తెగింపు సరికానిది అనుకుంటా. కానీ వీరు "ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా. ఆయన రోషముగల దేవుడు" అనే దేవుని ఆజ్ఞను బట్టి వేరొక దేవునికి నమస్కారం చేసి తమ దేవునికి రోషం పుట్టించడం కంటే ప్రాణాలు కోల్పోయినా పర్లేదు అనే నిష్ఠను చూపించారు. ఒకవేళ వారు కనుక నెబుకద్నెజరు చెప్పినట్టు అతని దేవతకు నమస్కారం చేసుంటే అతని దృష్టిలో యెహోవా దేవుని భక్తులు కూడా తమ దేవుని విషయంలో నిష్ఠలేని వారే అనే అభిప్రాయం ఏర్పడేది.

గమనించండి. నేనిక్కడ కావాలనే "షద్రకు, మేషాకు, అబేద్నేగోల" ప్రస్తావన మాత్రమే తీసుకున్నాను దానియేలుది తీసుకోవడం లేదు. ఎందుకంటే దానియేలు విషయంలో రాజును తప్ప ఎవరినీ పూజించకూడదనే ఆజ్ఞ ఉంటుంది (దానియేలు 6:7). మనం మాట్లాడుకుంటున్న దుర్బోధకుడు వాక్యాన్ని వక్రీకరించడంలోనూ మసిపూసి మారేడుకాయ చెయ్యడంలోనూ ఘనుడు కాబట్టి నేను కనుక ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తే అక్కడ దానియేలు సింహాల బోనుకు సిద్ధమైంది వేరొక దేవునికి నమస్కారం చెయ్యడం విషయంలో కాదు. రాజుకు తప్ప ఏ దేవునికీ నమస్కారం చెయ్యకూడదు అన్నది ఆజ్ఞ కాబట్టి అతను యెహోవాను పూజించకుండా ఉండలేకనే ఆ తెగింపును చూపించాడని సులభంగా వాదించుకోగలడు. కానీ "షద్రకు, మేషాకు, అబేద్నెగోల" విషయంలో అలాంటి అవకాశం దొరకదు కాబట్టి నేను వారి సంఘటనను ప్రస్తావించాను.

ఆ దుర్బోధకుడు వాదిస్తున్నట్టుగా తప్పనిసరి పరిస్థితుల్లో విగ్రహాలకు నమస్కరించినా పాపం కాకుంటే ఆ విషయంలో ప్రారంభక్రైస్తవ సంఘస్తులు రోమీయుల చేతిలో ఎందుకు చిత్రవధలు అనుభవించి చంపబడ్డారు? వారి మనసులో ఏమీలేదు కాబట్టి ఒక నమస్కారం చేసేస్తే సరిపోయేదిగా? నిజానికి మనసులో ఏమీ లేదు కాబట్టి విగ్రహాలను నమస్కారం చేసినా పాపం కాదు అనేది పెద్ద పనికిమాలిన వాదన. ఇది ఎలా ఉంటుందంటే నా మనసులో ఏం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేనేం చేసినా పాపం కాదు అనే దిశగా మనల్ని ప్రేరేపిస్తుంది. అతను ఆ సిద్ధాంతాన్నే సంఘంపై రుద్దుతూ ఒక తల్లి తన పిల్లల పోషణ నిమిత్తం వ్యభిచరించినప్పటికీ అది పాపం కాదు అన్నట్టుగా కూడా వాదిస్తున్నాడంట. దాని గురించి నేను ఇప్పటికే వివరించాను. ఈ వ్యాసం చదవండి.

పది ఆజ్ఞల వివరణ

ఇక ఎలీషా నయమానుల దగ్గరకు వద్దాం; అక్కడ మనకు తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూ "అప్పుడు-యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక" అని రాయబడి నయమాను తప్పనిసరి పరిస్థితుల్లో నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినప్పటికీ "యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక" అని తాను తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యబోతున్న విగ్రహారాధనకు ఎలీషా అనుమతి కోరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ వెంటనే ఎలీషా "నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చిన" దానిని‌ బట్టి నయమాను అభ్యర్ధనకు ఎలీషా అనుమతిని ఇచ్చినట్టుగా అర్థమౌతుంది.

కానీ నేను ముందుగా వివరించినట్టు ఇలాంటి అనుమతి వాక్యసమ్మతం కాదు. మిగిలిన లేఖనాలు దానితో విబేధిస్తున్నాయి. అలాంటప్పుడు లేఖనాలకు అనగా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే మన ముందు రెండు పరిష్కారాలు మాత్రమే ఉండాలి.

1. జరిగిన ఈ సంఘటన చరిత్రగా రాయబడుతుంది తప్ప దేవుని ఆజ్ఞలుగా కాదు. ఉదాహరణకు; "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు"(నిర్గమకాండము 20:3-17) అనేవి స్వయంగా దేవుడు పలుకుతున్నటువంటి ఆజ్ఞలు. ఆయన పలికిన ఆజ్ఞలనే మోషే ప్రజలకు తెలియచేసాడు‌. గ్రంథస్థం చేసాడు. మిగిలిన ప్రవక్తలు కూడా దేవుడు తమకు ప్రత్యక్షతలు ద్వారానో లేక ఆత్మ నడిపింపు ద్వారానో తెలియచేసిన ఆజ్ఞలనే ప్రజలకు బోధించారు. గ్రంథస్థం చేసారు. కానీ చరిత్రగా రాయబడిన వాటిలో భక్తుల చరిత్రలో జరిగింది జరిగినట్టుగా రాయబడుతుంది. ఉదాహరణకు; భక్తురాలైన శారా హాగరు ద్వారా సంతానం పొందుకోవాలని అబ్రాహామును ప్రేరేపిస్తుంది, అబ్రాహాము దానికి ఒప్పుకుంటాడు (ఆదికాండము 16). అక్కడ వారి జీవితంలో జరిగింది జరిగినట్టుగా రాయబడింది తప్ప అబ్రాహాముకు కానీ శారాకు కానీ దేవుడు అలా ఆజ్ఞాపించలేదు. ఎంత భక్తులైనా తమ‌ జీవితంలో పొరపాట్లు చేసే ప్రమాదం‌ ఉంది. కాబట్టి మనం దేవుని ఆజ్ఞల వెలుగులో వారు చేసింది సరియేనా లేక సరి కాదా అన్నది నిర్ణయించుకోవాలి తప్ప, వారు చేసింది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారు చేసారు కాబట్టి మేమూ చేస్తాము అన్నట్టుగా దానిని ప్రామాణికంగా తీసుకోకూడదు.

అందుకే "ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు" (కీర్తనలు 119:4,5). "నేను భూమి మీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము" (కీర్తనలు 119:19). "గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు" (కీర్తనలు 119:21). "మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు" (కీర్తనలు 17:5). "నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును" (సామెతలు 3:6). అని ఇలాంటి మాటలు లేఖనాలలో ఎన్నో చోట్ల రాయబడ్డాయి. అలానే మన బోధ విషయంలో కూడా "ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచా రించుడి ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు"(యెషయా 8:20) అని రాయబడింది.

ఈవిధంగా ఆలోచించినప్పుడు విగ్రహారాధన విషయంలో ఎలీషా నయమానుకు ఇచ్చినటువంటి అనుమతి "ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషముగల యెహోవా. ఆయన రోషముగల దేవుడు" అనే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి అక్కడ ఎలీషా తప్పు చేసాడని భావించాలి (నిజానికి ఎలీషా అలా చెయ్యలేదు అది క్రింద వివరిస్తాను). అలా భావించి మనం దేవుని ఆజ్ఞలను బట్టే బోధించాలి తప్ప చరిత్రలో దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదో ఒక సందర్భాన్ని చూపించి విశ్వాసుల మనసులను చెరపకూడదు. కానీ ఆ దుర్బోధకుడు మరియు అతనిలాంటి అపవాది పరిచారకులు ఆజ్ఞలను ప్రక్కనపెట్టేసి తమ దుర్మార్గపు బోధకు అనుకూలంగా ఇలాంటి సందర్భాలు వెతుక్కుంటుంటారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు పాపాన్ని ఖండిస్తాయి. పాపం విషయంలో మినహాయింపులు కల్పించవు.

అందుకే "పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును" (1యోహాను 3:4), "ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి" (యోహాను 3:18,19) అని రాయబడింది‌‌. అలాంటప్పుడు పాపాన్ని విడిచిపెట్టలేని గుంపును ఆకర్షించుకోవాలంటే వాక్య వక్రీకరణలతో వారికి పాపం విషయంలో మినహాయింపులు కల్పించడం ఆ దుర్బోధకులకు ఒక మంచిమార్గం. అలాంటి పాపులకోసమూ వారికి అనుకూలమైన ఇలాంటి బోధకులకోసమే పౌలు తిమోతీని "వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును" (2 తిమోతి 4:2-4) అని హెచ్చరించాడు. దీనివల్ల వాక్యజ్ఞానం లేని నిజమైన విశ్వాసులు కూడా మోసపోతారు అందుకే ఈ ఆందోళన.

గమనించండి: నేను ఇక్కడ దేవుని ఆజ్ఞలనూ మరియు చరిత్రనూ వేరుగా ప్రస్తావించడాన్ని బట్టి అంటే దేవుని ఆజ్ఞలు మాత్రమే లేఖనాలని చరిత్రకు సంబంధించినవి లేఖనాలు కావని నేను వేరు చేస్తున్నట్టుగా అపార్థం చేసుకోవద్దు. మన చేతిలో ఉన్నటువంటి 66 గ్రంథాలూ లేఖనాలే. అనగా ఆత్మ ప్రేరేపణతో రాయబడిన మాటలే (లూకా 24:44,45, 2 పేతురు 1:20,21, 2 తిమోతీ 3:16,17). ఉదాహరణకు ఆదికాండములో జరిగిన చరిత్ర అంత స్పష్టంగా మోషేకు ఎలా తెలుసు? అతను ఆత్మప్రేరణతోనే దానిని రాసాడు.‌ కానీ‌ 3వ అధ్యాయంలో సాతాను హవ్వతో పలికిన మాటలు కూడా ఉంటాయి. సాతాను అలా పలికాడని మోషేకు ఎలా‌ తెలుసు? అలానే యోబు విషయంలో ఏం జరిగిందో అతనికి ఎలా తెలుసు? ఆత్మప్రేరణతోనే దానిని రాసాడు. ఆవిధంగా బైబిల్ గ్రంథం అంతా ఆత్మ ప్రేరేపణతో రాయబడిందే. కానీ చరిత్రను మనం చదువుతున్నప్పుడు దేవుని ఆజ్ఞల వెలుగులో దానిని పరిశీలిస్తూ ఆ భక్తులు చేస్తుంది సరినో కాదో గ్రహించుకుంటూ సరైనమాదిరిని అనుసరించాలి. సరికాని మాదిరిని బట్టి జాగ్రత్తపడాలి. అందుకే బైబిల్ చరిత్రలో భక్తులు చేసిన మంచీ రాయబడింది అలానే చెడు కూడా రాయబడింది. మనం ఆజ్ఞల వెలుగులో మంచిని అనుసరించి చెడును విసర్జించాలి. వారిలా మనమూ పడిపోకుండా జాగ్రత్తపడాలి. ఈ వాక్యభాగాలు చూడండి.

యాకోబు 5:10,11 నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.

1 కొరింథీయులకు 10:1-12 సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘము క్రిందనుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులైయుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

రోమీయులకు 15:4 ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.

యాకోబు 2:20-26 వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసికొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా? కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి. అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా? ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

2. నిజానికి ఎలీషా ఒక మంచి ప్రవక్త అతను విగ్రహారాధన విషయంలో దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా అనుమతిని కల్పించే ప్రసక్తే లేదు. అతను అంత మంచి ప్రవక్త కాబట్టే ఏ ప్రవక్త విషయంలోనూ జరగని అద్భుతం అతని విషయంలో జరిగింది (2 రాజులు 13:20,21). అలాంటప్పుడు అతను మాట్లాడినట్టుగా రాయబడిన వాక్యభాగం మన బైబిళ్ళలో సరిగానే అనువదించబడిందా లేక ప్రతుల్లో ఏదైనా పొరపాటు చేసుకుందా అనేది పరిశీలించుకోవాలి. మనకు అంత సామర్ధ్యం లేనప్పుడు ఆ సామర్ధ్యం కలిగిన కొందరు బైబిల్ పండితుల రచనలను బట్టి వాటిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చదువుతున్నటువంటి బైబిళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథకర్తలు రాసినటువంటి లేఖనాల యొక్క ప్రతులను బట్టి చెయ్యబడిన తర్జుమాలు మాత్రమే. వేల సంవత్సరాలుగా ఆ మూల ప్రతులను ఒకదానినుండి మరొకటిగా ప్రతులుగా చేస్తున్నప్పుడు వాటిలో సంఖ్యాపరమైన, అక్షరసంబంధమైన పొరపాట్లు జరగడం సహజం. ఎందుకంటే ఆ ప్రతులు రాసింది మనవంటి‌ సాధారణ మనుషులే. దీనికి సంబంధించి ఇప్పటికే నేను ఒక వ్యాసం రాసాను చదవండి.

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం నివసించారు?

ఈవిధంగా ఆలోచించినప్పుడు "De Rossi గారు" 2 రాజులు 5:19 లోని ఎలీషా మాటల్లో ప్రతులను బట్టి చోటుచేసుకున్న ఒక పొరపాటును గుర్తించారు. "Adam Clark గారు" తన వ్యాఖ్యానంలో ప్రస్తావించిన "De Rossi గారి" వివరణను ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను చదవండి.

"Verse 2 Kings 5:19. And he said unto him — There is a most singular and important reading in one of De Rossi's MSS., which he numbers 191. It has in the margin לא ק that is, "read לא lo, not, instead of לו lo, to him." Now this reading supposes that Naaman did ask permission from the prophet to worship in Rimmon's temple; to which the prophet answers, No; go in peace: that is, maintain thy holy resolutions, be a consistent worshipper of the true God, and avoid all idolatrous practices. Another MS., No. 383, appears first to have written לו to him, but to have corrected it immediately by inserting an א aleph after the ו vau; and thus, instead of making it לא no, it has made it לוא lu, which is no word"

దీనినిబట్టి నయమాను ఎలీషాతో "నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక" అని పలికినప్పుడు, ఎలీషా వెంటనే "నెమ్మది గలిగి పొమ్మని" అతనికి చెప్పలేదు. మొదట వద్దు (No) అనగా నువ్వు "యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను" (2రాజులు 5:17) అని ఏదైతే నిర్ణయించుకున్నావో దానికే కట్టుబడి ఉండమని చెప్పి ఆ తర్వాత "నెమ్మది గలిగి పొమ్మని" అతనితో చెప్పాడు.‌ ప్రతుల్లో అక్కడ "א" (ఆలెఫ్) అనే అక్షరం విషయంలో పొరపాటు జరగబట్టి వాటిని బట్టి తర్జుమా చెయ్యబడిన మన బైబిళ్ళలో "వద్దు" (No) అనే పదం కోల్పోబడింది. దేవుని ఆజ్ఞల వెలుగులో పరిశీలించినప్పుడు "De Rossi గారి" ఈ వివరణ సత్యమే ఎలీషా అలానే పలికాడు అనడంలో మనకు ఎలాంటి సందేహం లేదు.

"Adam Clark గారు" తన వ్యాఖ్యానంలో నయమాను మాటలకు "Dr. Lightfoot గారు" చేసిన తర్జుమాను కూడా ప్రస్తావించారు. దానిప్రకారం నయమాను ఆ మాటలను భవిష్యత్తులో చెయ్యబోయే విగ్రహారాధనకు అనుమతిగా ప్రస్తావించలేదు. గతంలో చేసినదానికోసమే క్షమాపణ కోరుతున్నాడు. కానీ నాకు అది అంగీకారంగా అనిపించలేదు కాబట్టి "Dr. Lightfoot గారి" అనువాదాన్ని నేను విడిచిపెట్టాను.

గమనించండి. బైబిల్ నుండి ఏదైనా సిద్ధాంతం తయారుచెయ్యాలంటే ఇప్పటివరకూ నేను వివరించిన నియమాలను అనుసరించే చెయ్యాలి. కానీ ఈ దుర్బోధకుడికీ అతనివంటి ఇతర దుర్బోధకులకూ ఇవేం అవసరం ఉండదు. వాళ్ళ మనసులో ఉన్న నీచానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఏదైనా ఒక సందర్భం కనిపిస్తే చాలు. వెంటనే మహాజ్ఞానులుగా జ్ఞాన ప్రదర్శనలు ఇచ్చేస్తుంటారు.‌ వాదనకోసం ఇప్పటివరకూ నేను చెప్పిందంతా ప్రక్కనపెట్టేసి ఆ సందర్భం విగ్రహారాధనను సమర్ధిస్తుందే అనుకుందాం. "తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను" (రోమా 15:2) అని రాయబడింది. మరి తప్పనిసరి పరిస్థితుల్లో విగ్రహారాధన పాపం కాదని చెప్పడం వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా? లేక బలహీనుల మనసులు చెరపబడే ప్రమాదం ఉందా?. పౌలు తనకున్న జ్ఞానంతో "ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము" (కొలస్సీ 1:28) అని సాక్షమిస్తుంటే "నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది" (గలతీ 4:19) అని అతను సంఘం యొక్క పరిశుద్ధత విషయంలో ప్రయాసపడుతుంటే ఆ పౌలుతో పోల్చుకునే ఈ దుర్బోధకులు మాత్రం అపవాది కుయుక్తులతో సంఘాన్ని లోకం‌ వైపూ పాపం వైపూ మళ్ళించడానికి శతవిధాలుగా ప్రయాసపడుతున్నారు.

2 కోరింథీయులకు 11:3,13-15 సర్పము తనకు యుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

సంఘమా వీరి విషయంలో జాగ్రత్త. ఇలాంటివారు వస్తారని పౌలు మరియు ఇతర అపోస్తలులు ముందే మనల్ని హెచ్చరించారు (అపొ. కా 20:29,30, తీతుకు 1:11, రోమా 16:17,18, 2 పేతురు 2:1,12,15-19, ఫిలిప్పీ 3:18,19)

నిజానికి ఈ దుర్బోధకుడు విగ్రహారాధనకు అనుకూలంగా ఇప్పుడే కాదు గతంలో కూడా అలాంటి బోధలు ఎన్నిటినో చేసాడు. ఉదాహరణకు; విగ్రహార్పితాలు తినవచ్చు, క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చు ఇలాంటివి. వాటన్నిటికీ అతను ఇలానే సంపూర్ణ లేఖనాలను పరిశీలించకుండా కొన్ని లేఖనభాగాలను వక్రీకరిస్తూ మరికొన్ని లేఖనాలను సందర్భరహితంగా జోడిస్తూ బోధించాడు. ప్రస్తుత మన అంశం అవి కావు కాబట్టి వాటిని పూర్తిగా వివరించదలచుకోలేదు. కానీ బైబిల్ లో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం ఈ విగ్రహార్పితాల కోసం ఏం చెబుతుందో చూడండి.

ప్రకటన 2:14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు.

ప్రకటన 2:20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.

ఈ వాక్యభాగాల ప్రకారం విగ్రహార్పితాలు తినవచ్చు అని బోధించేవారు యెజెబెలు సంబంధులు మరియు బిలాము శిష్యులు. ఈ విగ్రహార్పితాల విషయంలో పౌలు కూడా తన వాదనను మొదట సున్నితంగా ప్రారంభించి చివరికి వాటిని తినకూడదు అనే కచ్చితంగా బోధించాడు.

1 కొరింథీ 10:19-22 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?.

ఇక‌ బొట్టు విషయానికి వస్తే ఈ దుర్బోధకుడు బొట్టు పెట్టుకోవద్దని బైబిల్ లో ఎక్కడుంది అనే కుతర్కం ఉపయోగిస్తాడు. బైబిల్ సంబంధిత సంస్కృతుల్లో బొట్టు లేనప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఎలా రాయబడుతుంది? అందుకే అది కుతర్కం అంటున్నాను. అలాగైతే సిగరెట్ కాల్చేవాడు కూడా అదే తర్కాన్ని ఉపయోగించి సమర్ధించుకుంటాడు. కానీ ఏ హైందవ పండితుడ్ని అడిగినా ఆ బొట్టు వెనుకున్న వారి మతసంబంధమైన ఉద్దేశాన్ని తెలియచేస్తాడు. "విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము" (అపో.కా 15:20) అని రాయబడినదానిని బట్టి విగ్రహసంబంధమైన బొట్టుతో క్రైస్తవస్త్రీలకు ఏంటి సంబంధం? పైగా ఆ బొట్టు వీరు క్రైస్తవస్త్రీలు కాదు హైందవస్త్రీలే అనడానికి ఆధారంగా గుర్తించబడుతుంది. అందుకే అది నిషేధం అని చెబుతున్నాము. వారి భర్తలు ఒప్పుకోవట్లేదంటే ఆ భర్తలు క్రీస్తును కూడా ఒప్పుకోరు అందుకని ఆయన విషయంలో కూడా రాజీపడిపోవచ్చా? ఈ దుర్బోధకుడైతే అలానే బోధిస్తాడు లెండి.

ఆ దుర్బోధకుడికి ఒక సలహా "బోధకులకు మరి కఠినమైన తీర్పుందని గ్రహించరా" అని పిచ్చిపట్టినట్టు ప్రసంగాల్లో అరవడం పాటల్లో ప్రేలడం కాదు. ఆ కఠినమైన తీర్పులో ఇలాంటి పనికిమాలిన బోధలు చేసే తమరే ముందుంటారని గ్రహించి ఇప్పటికైనా తమరిని ఆవహించిన అపవాదిని విదిలించుకునే ప్రయత్నం చెయ్యండి. మనుషుల మెప్పుకోసం కాకుండా దేవునిమెప్పుకోసం ప్రయాసపడేలా ఎవరైనా మంచి వాక్యానుసారమైన బోధకుడి దగ్గర శిక్షణ తీసుకోండి. ముందు నిజాయితీగా ప్రభువును విశ్వసించండి. ఆ ఆశతోనే మీరు ఇతరుల విషయంలో పదే పదే ప్రస్తావించే లేఖనభాగాన్ని మీ ముందే ఉంచుతున్నాను ఒకసారి మీకోసం మీరు కూడా చదవండి.

"నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి" (యాకోబు 3:1). ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?" (రోమా 2:21).

చివరిగా; నాకు ఫోన్ చేసిన ఆ సహోదరుడు అన్నా అతనిని వెంబడించేవారి పరిస్థితి ఏంటన్నా అతను ఇంత భయంకరమైన దుర్బోధలు చేస్తున్నప్పటికీ అతనిని వారు ఇంతలా ఎలా సమర్ధిస్తున్నారు అని ప్రశ్నించాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? "వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును" (1యోహాను 4:5). వారికి తమ దురాశలకు లేక పాపాలకు అనుకూలంగా బోధించే బోధకుడు కావాలి, ఇతనిలోనూ ఇతని జాబితాకు చెందిన మరికొందరు బోధకులలోనూ ఆ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వారు వారినే వెంబడిస్తారు. "పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు" (2తిమోతికి 3:7) అని తిమోతీకి పౌలు అదేగా చెబుతున్నాడు. నిజానికి వారి గుంపులో రక్షణపొందినవారు ఎవరైనా ఉండుంటే ఎప్పుడో ఆలోచించుకునేవారు, బయటకు వచ్చేవారు‌. ఎందుకంటే "ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును" (యోహాను 7:17) అనే యేసుక్రీస్తు ప్రభువు మాటలను బట్టి "ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల" తాను వింటున్న బోధలను వాక్యపు వెలుగులో పరిశీలిస్తాడు. వాక్యపు వెలుగులో అంటే వారి ప్రియ బోధకుడు తన బోధకు అనుకూలంగా చూపించే వాక్యభాగాల వెలుగులోనే కాదు సంపూర్ణ లేఖనాల వెలుగులో ఆ వాక్యభాగాలను అర్థం చేసుకుంటాడు (1 కొరింథీ 2:13). అలానే ఆ వాక్యభాగాల భావం ఆ బోధకుడు చెప్పిందే సత్యం అనుకోకుండా ఇతర బైబిల్ పండితులు ఆ వాక్యభాగాలను ఎలా అర్థం చేసుకున్నారో అది కూడా పరిశీలించి అప్పుడు ఆ బోధ‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా "ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న" వారు చేసేపని. ఆ ఉద్దేశం లేనివారికి ఈ పరిశీలణతో పని ఉండదు. తమ దురాశలకు అనుకూలమైన ఆ బోధకుడి మాటలూ కేకలే వారికి సర్వసత్యం. వారికి పరలోకం ఇచ్చేది యేసుక్రీస్తు కాదు. ఆ దుర్బోధకుడే. అలాంటి గుంపుల విషయంలో "నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు" (2 థెస్సలొనీక 2:9-12) అనే మాటలను గుర్తు చేసుకుని మౌనంగా ఉండడమే. నేను ఈ వ్యాసం రాస్తుంది అలాంటి గుంపులకోసమో నూతిలో కప్పల కోసమో కాదు. సంఘంలో‌ బలహీనులకోసం మాత్రమే.

వారికి విజ్ఞప్తి: ఇలా తప్పనిసరి పరిస్థితుల్లోనూ లేక మనకు ఏదైనా లాభం వస్తుంది అనిపించినప్పుడూ ఏమైనా చెయ్యవచ్చు అనే దుర్బోధ ఎంత ప్రమాదకరమో ఇప్పటిదాకా నేను వివరించినదానిని బట్టి భవిష్యత్తులో అలాంటి బోధలు సంఘంలో మరేం ప్రవేశించినప్పటికీ వాటిపట్ల జాగ్రత్తగా ఉండండి. అందుకే పౌలు "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను (లేఖనముల వలన) మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి" (2థెస్సలొనిక 2:15) అని ఆజ్ఞాపించాడు.

1 యోహాను 4:6 మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.