దుర్బోధలకు జవాబు

రచయిత: నీవన్ థామస్
చదవడానికి పట్టే సమయం: 12 నిమిషాలు

ఆడియో

| ప్రపంచములో ఎక్కువ మంది ప్రజలు క్రైస్తవులు. అయినా క్రిస్టియానిటీ ఇండియాలో మాత్రమే ఉన్న నిమ్న (మాల, మాదిగ) కులాల వారిది అనే అపోహ మన దేశ ప్రజలలో ప్రబలంగా ఉంది. ఇది నిజమా?

ఒకసారి మన హిందూ మతము గురించి తెలుసుకుందాం!

| ప్రపంచములో మరేదేశములో లేని విధంగా మన దేశంలోని ప్రజలు చాతుర్వర్ణాలుగా, కులాలు ఉప కులాలుగా, వర్గాలుగా విభజించబడియున్నారు.

శ్లో|| బ్రాహ్మణోఅస్య ముఖమాసీత్ బాహూ రాజస్యః కృతః |

ఊరూ తదస్య యద్వైశ్యాః పద్భ్యాం శూద్రో అజాయత ||

'ఆయన (విరాట్ పురుషుడు) ముఖము నుండి బ్రాహ్మణులు, చేతుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు' అనీ మన ఋగ్వేదంలో చెప్పబడింది. అయితే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో అస్పృశ్యులు లేరు. అందుకని వాళ్లని 'పంచములని” అన్నారు. ఇవే కాక శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, స్మార్తులు అని వివిధ మత శాఖలు కూడా ఉన్నాయి.

| క్రీ.పూ. 150 ప్రాంతంలో హెలియోడరస్' అనే గ్రీకు దేశస్తుడు తాను "భాగవత' మతమును స్వీకరించానని భీలా స్టేషన్ సమీపంలోని చెప్నాగర్లో గరుడ స్తంభం నిలబెట్టి శాసనము వ్రాయించాడు. అతడు భాగవత మతమును స్వీకరించి విష్ణుభక్తుడయ్యాడు. (ఆ కాలంలో మన మతాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలిచేవారు. అందులో భాగవత మతమొకటి. క్రీ.శ. 8వ శతాబ్దములో అరబ్బుల (ముస్లింలు) వల్ల హిందూ మతమనే పేరు వచ్చింది. బైబిల్లో క్రీ.పూ. సుమారు 500 ప్రాంతములో వ్రాయబడిన ఎస్తేరు గ్రంథములో ఇండియా గురించి 'హోదూ' (1912) అని హెబ్రీ భాషలో వ్రాయబడింది. ఈ పదం 'హిందూ' పదానికి చాలా దగ్గరి పోలిక కలిగిఉంది.) అయితే మనం హెలియోడరస్'ను హిందువుగా అంగీకరించగలమా? మన కులంలో అతన్ని కలవనిస్తామా? అతన్ని ఏ కులంలో కలుపుకుందాం? మన ఇంటికి పిలిచి అతనికి భోజనము పెట్టగలమా?

యుగోస్లేవియా దేశంలో పుట్టి మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేసిన మదర్ థెరిస్సా (ఆగస్ గోనా బొజాక్షువు) తాను హిందువుగా మారతానంటే ఒక హిందువుగా అంగీకరించి మన కులంలో కలుపుకోగలమా? అంతెందుకు మన దేశంలోని వారే ఒక కులానికి చెందిన వ్యక్తి మరొక కులస్తునిగా మార్చు కోవడం వీలవుతుందా? ప్రపంచములో ఉన్న ఏ వ్యక్తి అయినా మన దేశానికి సేవచేసి దేశ భక్తుడు కావచ్చును. మన దేవతలను ఆరాధించి దైవ భక్తులు కావచ్చును. కానీ 'హిందువు' మాత్రం కాలేడు. ఎందుకంటే హిందుత్వమనేది ఒక కుల, వర్ణ వ్యవస్థ. హిందువు అవ్వాలంటే మనకున్న కుల, ఉప కులాలలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే.

మన దేశంలో దాదాపు 2550 కులాలు, 25000 పై చిలుకు ఉప కులాలు (గోత్రాలు) ఉన్నాయి. బహుశః ఇవి వారి వారి వృత్తులను బట్టి, గుణాలను బట్టి విభజించబడి ఉండవచ్చు.

శ్లో|| చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |

తస్య కర్తారమపి మాం విద్ధకర్తార మవ్యయమ్ ||

'బ్రాహ్మణ క్షత్రియాదులను నాలుగు వర్ణములు సత్యాది గుణముల యొక్కయు, ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు, విభాగము ననుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్తనైనప్పటికిని వాస్తవముగ నన్ను అకర్తగను, నాశరహితునిగను ఎఱుగుము.

అయినా ఒక కులానికి మరొక కులానికి ఎంతో సామ్యబేధముంది. కొన్ని కులాలు ఉన్నతమైనవైతే మరి కొన్ని కులాలు నీచమైనవిగా ఉన్నాయి. ఒక కులానికి మరో కులానికి ఆచారాలు, కట్టుబాట్లలో ఎన్నో తేడాలు ఉన్నాయి.

అందుకే మన భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్. అంబేడ్కర్ ఈ కుల వ్యవస్థను గర్షిస్తూ నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చనిపోను' అని తెగించి చెప్పాడు. అంతేకాకుండా సమానత్వంలేని, సోదరభావంలేని, స్వేచ్చలేనీ ఈ మతంలో ఏ నిమ్న కులాల వారూ ఉండకూడదనీ, ఎవరికిష్టమైన మతమును వారు స్వీకరించవచ్చని, అది క్రిస్టియానిటే కావచ్చు, బౌద్ధమతమే కావచ్చు, మరేదైనా కావచ్చు అని వారికి హితబోధ చేసాడు. 1956 అక్టోబర్ 14వ తేదీన తన 5 లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ద దీక్షను స్వీకరించాడు. అదే విధంగా తర్వాతి కాలాలలో అనేక మంది ఇతర నిమ్న కులాలవారు క్రిస్టియానిటీని కూడా స్వీకరించారు. అంతేగాని నిజానికి వారికి క్రీస్తు ఎవరో కూడా సరిగా తెలియదు. అలాంటి వారిని బట్టి క్రిస్టియానిటీ నిమ్న కులాల వారిది అని ఎలా చెప్పగలం?

భారతదేశములో క్రైస్తవ్యం

నిజానికి క్రైస్తవ్యం భారత దేశంలో క్రీ.శ. 1వ శతాబ్దంలోనే ప్రవేశించింది. అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం. ఆ కాలంలో యేసు ప్రభువు శిష్యులలో ఒకరైన తోమా థామస్) భారతదేశంలోని పంజాబులో ఉన్న 'తక్షశిల' ప్రాంతానికి వచ్చాడు. ఆయన ద్వారా తక్షశిల రాజైన 'గండప్ప రాజు' క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. క్రీ.శ. 1834వ సంవత్సరములో పురావస్తుశాఖవారి తవ్వకాల్లో గండప్ప రాజు నాణాలు బయటపడ్డాయి. ఆ నాణాలలో ఒకవైపు రాజు బొమ్మ, మరొకవైపు ఇతర బొమ్మలతో పాటు సిలువబొమ్మ కూడా ముద్రించబడి ఉన్నాయి. ఆ తరువాత తోమా అక్కడి నుండి కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వచ్చాడు. కేరళ, తమిళనాడులో ఉన్న అగ్రకులాల వారైన బ్రాహ్మణులు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. క్రీ.శ. 1957వ సంవత్సరములో పురావస్తుశాఖ పరిశోధనల్లో కేరళలోని నీల్లకల్ అడవుల్లో మొదటి శతాబ్దానికి చెందిన క్రైస్తవ మందిరమును కనుగొన్నారు. బహుశః ప్రపంచములోనే ఇది మొదటి క్రైస్తవ మందిరమై ఉండవచ్చును . (మన ఆంధ్రరాష్ట్రానికి కూడా మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం వచ్చినట్లు మన తెలుగు చరిత్రకారుడైన గోపాలాచారి తన 'హిస్టరీ ఆఫ్ ఆంధ్ర కంట్రీ' అనే గ్రంథములో పేర్కొన్నాడు.)

| క్రీ.శ. మొదటి శతాబ్దములో మన భారత దేశములోని కొంత భాగాన్ని 'శక రాజులు' పరిపాలించారు. వీరినే "సిథియనులు' అని కూడా అంటారు. వీరి ప్రస్తావన బైబిల్ గ్రంథములో ఉంది. బహుశః వారి ద్వారా కూడా మొదటి శతాబ్దములోనే క్రిస్టియానిటీ మన దేశములోకి అడుగు పెట్టి ఉండవచ్చును.

క్రీ.శ. 13వ శతాబ్దములో మార్కొపోలో భారతదేశాన్ని సందర్శించాడు. ఆయన తన డైరీలలో వ్రాసుకున్న వాటి ప్రకారం అప్పటి భారతదేశపు ప్రతి 6 గురు రాజులలో ముగ్గురు క్రైస్తవులు అని వ్రాశాడు(8).

అంటే భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవ్యాన్ని స్వీకరించింది రాజులు మరియు అగ్రకులాల వారేనన్నమాట!

| అంతే కాకుండా ఈ మధ్య కాలములో చూసినట్లయితే- పురుషోత్తం చౌదరి (1803-1890), తమిళనాడుకు చెందిన అత్యున్నతమైన బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వెంగళ్ చక్క రాయ్ చెట్టి (1880-1958), సాధు సుందర్ సింగ్ (1889-1929), భక్తిసింగ్ (1903-2000) లాంటి వారెందరో ఉన్నారు. (ఆ మధ్య హైద్రాబాద్లో బ్రదర్ డేవిడ్ గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన క్రైస్తవుల కూడిక జరిగింది. దానికి దాదాపు 2000 మంది బ్రాహ్మణ క్రైస్తవులు హాజరయ్యారని వినికిడి). మరలాంటప్పుడు క్రైస్తవ్యం నిమ్నకులాల మతమెలా అవుతుంది?

| ప్రపంచ జనాభాలో దాదాపు 210 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అందులో భారత దేశానికి చెందిన వారు దాదాపు 8 నుండి 10 కోట్ల మంది ఉన్నారు. అందులో నిమ్న కులాల వారు దాదాపు 6 కోట్ల మంది ఉన్నారు. అంటే నిమ్న కులాల వారు ప్రపంచ క్రైస్తవ జనాభాలో దాదాపు 3 శాతం మాత్రమే. మిగిలిన 97 శాతం ప్రజలలో విదేశీయులు, రాజులు మరియు అగ్రకులాల వారు ఉన్నారు. మరి అలాంటప్పుడు కేవలం 3 శాతం మాత్రమే ఉన్న నిమ్న కులాలను బట్టి క్రిస్టియానిటీ నిమ్నకులాల మతం ఎలా అయ్యింది?

| క్రైస్తవ్యానికి నిమ్నకులాల వారిది' అనే పేరు రావడం నిజంగా నిమ్నకులాల వారు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక గొప్ప ప్రాజెక్టుకు ఎవరో గొప్ప వ్యక్తుల పేరు పెట్టడం పరిపాటే. అదే విధంగా భారతదేశంలో క్రిస్టియానిటీ అనే గొప్ప ప్రాజెక్టుకు నిమ్నకులాల వారి పేరు పెట్టడం వారు చేసుకున్న అదృష్టం కాక మరేంటి?

అసలు మతము అంటే ఏమిటో ఒకసారి చూద్దాం!

‘మత్యుబ్బ మతః' - అనగా మతి నుండి పుట్టినది 'మతము' అని అర్థము. మనుష్యుల మతి అంటే “ఆలోచనల' నుండి పుట్టినది 'మతము'.

| పూర్వం మానవుడు ప్రకృతితో చేసిన పోరాటం చెప్పుకోదగ్గ పరిణామాలకు దారి తీసింది. అడవులూ, కొండలూ, గట్టినేలలూ, కరువులూ, వరదలూ, జంతువులు విసిరిన సవాళ్లను మానవుడు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ క్రమములోనే అతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాడు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకున్నాడు. కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలకు (మరణం లాంటివి) పరిష్కారమే లేకుండా పోయింది. ప్రకృతి శక్తుల విలాసం అర్థం కాకుండా పోయింది. అందుచేత మానవులు వాటితో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ప్రకృతిలోని సంపద, ప్రకృతిలోని విరోధ భావము మనిషిని మానవాతీత శక్తుల' గురించి ఆలోచింపజేసింది. ఆ ఆలోచనల' నుండి పుట్టినదే 'మతము (10).

మతము అనేది సామాజిక చైతన్యం యొక్క ఒక ప్రత్యేక రూపం. పరలోకం, దేవుడు, దేవుళ్లు,దేవతలు, దయ్యాలు, దేవదూతలు, ప్రవక్తలు మొదలగు వాటి పై నమ్మకం దీని మౌలిక లక్షణం.

అయితే దేవుడు అనగా సృష్టికర్త ఒక్కడే ఉన్నాడా? లేక దేశానికి ఒక్కడు, రాష్ట్రానికి ఒక్కడు, కులానికి ఒక్కడు, మతానికి ఒక్కడు ఉన్నాడా? ఈ భూమిని, సూర్య, చంద్ర, ఆకాశ, నక్షత్రాలను, సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కరేనా? లేక అనేకులు ఉన్నారా? ఈ విషయాల గురించి ఒక మానవ మాత్రుడు చెప్పగలడా? ఒక మానవ మాత్రుడు వీటి గురించి ఆలోచన చేయగలడా? నిజానికి దేవుడు, దేవదూతలు, ఈ సమస్త సృష్టిని గూర్చిన జ్ఞానము మానవుని జ్ఞానానికి మించినది, అతీతమైనది. మరి అలాంటప్పుడు మానవుని 'మతి నుండి పుట్టిన మతము' ఏవిధంగా ఈ విషయాల గురించి చెప్పగలదు? చెప్పలేదు! అంటే దేవుడు లేదా సృష్టి కర్తను గురించిన జ్ఞానము 'మతాతీతమైనది'. ఆ విషయాలను గురించి స్వయంగా దేవుడే చెప్పాలి లేదా ఆయన ప్రవక్తలు చెప్పాలి.

క్రిస్టియానిటీ అంటే అందరూ అనుకుంటున్నట్టుగా...

* ఒక మతం కాదు. ఎందుకంటే అది మనుష్యుల ఆలోచనల నుండి పుట్టలేదు.

* హిందూ మతం మీద అలిగి వచ్చిన 'నిమ్నకులాల వారిది కాదు.

ఒక కులానికో, వర్గానికో, మతానికో, దేశానికే చెందినది కాదు.

* తల్లిదండ్రులు పెట్టిన పేర్లు మార్చుకొని బైబిల్ లోని వ్యక్తుల పేర్లు పెట్టుకోవడం కాదు.

* రంగు బట్టలు విప్పేసి తెల్లబట్టలు చుట్టుకోవడం కాదు.

* బొట్టు, గాజులు, పూలు తీసివేసి విధవలుగా కనబడడం కాదు.

* అన్యులను శత్రువులుగా భావించడం కాదు.

మరి క్రిస్టియానిటీ అంటే...?

* దేవుడు యేసు క్రీస్తు' ద్వారా ఏర్పరచిన 'రక్షణ మార్గము'.

*పాపస్వభావులమైన మనలను పరిశుద్దుడైన దేవునితో సమాధానపరచి పరలోకమునకు చేర్చేది.

*క్రీస్తును వెంబడించడం. అంటే ఆయన బోధనలను అనుసరించడం.

*మనల్ని వలే మన పొరుగువారిని ప్రేమించడం (మత్తయి 22:39).

* మన శత్రువులను సహితం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయడం (మత్తయి 5:44)

* దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించడం మరియు ఇహలోక మాలిన్యము మనకంటకుండా చూసుకోవడం (యాకోబు 1:27)

*మనం ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మన మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందడం (రోమా 12:2)

క్రిస్టియానిటీ అంటే - 'మతము' మార్చుకోవడం కాదు. పేరు’ మార్చుకోవడం కాదు. 'వేషధారణ' మార్చుకోవడం కాదు. 'మనస్సు' మార్చుకోవడం. నిజమైన దేవున్ని వెంబడించడం, చేరుకోవడం.

ప్రభువైన యేసు క్రీస్తు మీ మనస్సులను మార్చి నూతనపరచును గాక! ఆమెన్,

నోట్స్ :

(1) ఋగ్వేదం - 10-90-12

(2) ఆర్వీఆర్- కుల వ్యవస్థ

(3) సోర్స్ : జాషువా ప్రాజెక్ట్

(4) భగవద్గీత 4:13

(5) డా|| బి.ఆర్. అంబేడ్కర్ - 'రిడిల్స్ ఆఫ్ హిందూఇజం'

(6) డా! పి. మనషే గారి భారతదేశ మతాలు-వాటి క్లుప్త వివరణ
(జమీలా వర్గీస్- క్రిస్టియన్స్ ఇన్ పీపుల్ ఆఫ్ ఇండియా)

(7) బైబిల్ - కొలొస్సయు 3:11'

(8) డా!! పి. మనష్షే గారి 'భారతదేశ మతాలు-వాటి క్లుప్త వివరణ

(9) రాబిన్ బాయిడ్ - భారతీయ క్రైస్తవ వేదాంతం

(10) రామ్ శరణ్ శర్మ - ప్రాచీన భారతదేశ చరిత్ర'

 

 

 

Add comment

Security code
Refresh

Comments  

# క్రైస్తవ్యం నిమ్న కులాలవారిదాRaju 2020-11-26 12:21
చాలా చక్కగా వివరించారు సార్... ఇంకనూ అనేక మంది కి ఈ విషయాలు తెలియబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.