నిజ క్రైస్తవ జీవితం

రచయిత: ఆర్థర్. డబ్ల్యు. పింక్
అనువాదం: ఉషశ్రీ పోలవరపు
చదవడానికి పట్టే సమయం: 14 నిమిషాలు
ఆడియో

'నీఛుడను' అనే ఈ శీర్షిక కొంతమందిని ఈ వ్యాసం చదవకుండా ఆటంకపరచొచ్చు. అలా జరగకూడదని ఆశిస్తున్నాను. నిజమే, ఇది మిమ్మల్ని సంతోషపెట్టే  ప్రసంగం కాకపోవచ్చు.

ఇది మీ సంఘాలలో ప్రస్తావించబడటం ఎంతో అరుదు కావచ్చు. ఐనప్పటికీ, ఇది వాక్యానుసారమైన అంశము. పతనమైన మానవుడు 'నీఛమైనవాడు' , ఎంత నీఛమైనవాడంటే 'సగం మృగం, సగం దయ్యము' అని  చెప్పుకోవచ్చు. ఈ వర్ణన వాస్తవాతీతమైనది కాదు. మానవుడు ''అడవి గాడిద పిల్లవలె జన్మించాడు'' (యోబు 11:12 ), మరియు ''సాతాను యిష్టము చొప్పున అతడు చెరపట్టబడ్డాడు'' (2 తిమోతి 2:26). 'ఆ! అది మనిషి తిరిగి జన్మించనప్పటి స్థితి, కానీ పునర్జన్మ పొందినవారికి అది వర్తించద'ని సమాధానమివ్వటానికి బహుశ నువ్వు సిద్ధముగా ఉన్నావేమో. ఒక కోణం నుండి అది నిజమే; కాని మరొక కోణం నుండి అది నిజం కాదు.

కీర్తనాకారుడు ''నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగమువంటివాడినైతిని'' (కీర్తన 73:22) అని అంగీకరించలేదా? నేర్పింపబడనొల్లనివాడనై, అవిధేయుడనై దేవుని ఏర్పాట్లకు విరోధంగా తిరగబడువాడనై, పరిశుద్దునిలా కాక నేను కనీసం మనిషిలాగా కూడా ప్రవర్తించటంలేదని అతడు ఒప్పుకుంటున్నాడు. అదే విధముగా ''నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు'' (సామెతలు 30:2) అని ఆగూరు కూడా ఒప్పుకున్నాడు. నిజమే మనము ఇలాంటి విలాపవాక్యాలు 'పెంతెకోస్తు' లేదా 'రెండవ ఆశీర్వాదము' పోందామని చెప్పేవారి వద్ద నుండి కాని, మేము 'విజయవంతమైన జీవితము' గడుపుతున్నాము అని గొప్పలు చెప్పుకునే వారి వద్ద నుండి కానీ వినము. కానీ,ఎవరైతే తమ స్వంత హృదయాలలో ఉన్న ఘోరవ్యాధిని గుర్తెరిగి దు:ఖిస్తున్నారో, వారి పరిస్థితిని ఈ మాటలు సరిగ్గా వివరిస్తాయి. ఇటీవలే ఒక క్రైస్తవ సహోదరుడు నాకు వ్రాస్తూ, నాలో లోబడటానికి ఇష్టంలేని దురభిమానము, దుర్మార్గత ఎంత బలంగా ఉన్నాయంటే ఒక్కోసారి అవి నన్ను ''నా గాయములు దుర్గందభరితమైనవి మరియు దుర్మార్గమైనవి'' అని విలపించేలా చేస్తున్నాయి అని చెప్పాడు. అయితే చదువరీ, కీర్తనలను మరియు సామెతలను ఈ విధంగా అన్వయించటానికి అభ్యంతరం చెప్పి, నూతన నిబంధనకాలానికి చెందిన మనము వారికన్నా మెరుగైన స్థితిలో ఉన్నామని నువ్వు అంటావా? బహుశా అలా నీకు ఎవరైనా చెప్పి ఉండవచ్చు కాని దేవుని వాక్యము కూడా అలాగే చెబుతుందనుకుంటున్నావా? ఐతే శ్రేష్ఠమైన ఒకానొక క్రైస్తవుని మూలుగు విను - ''నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను'' (రోమా 7:14) - నీకు ఎప్పుడు కూడా ఈ విధంగా అనిపించలేదా? ఐతే నేను యథార్థంగా నీ గురించి విచారిస్తున్నాను. అలాగే 'సగము దయ్యము' అనే పతనమైన మనిషిని గూర్చిన వివరణను సమర్థిస్తూ క్రీస్తు, పునర్జన్మనొందిన పేతురుతో ''సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతరకారణమైయున్నావు''(మత్తయి 16:23) అననలేదా? నీకూ, నాకూ ఇలాంటి గద్దింపు వర్తించే సందర్భాలు లేవా? నామట్టుకు నేను సిగ్గుతో తలవంచి మరీ, 'అయ్యో ఉంది' అని  ఒప్పుకుంటాను.

''చిత్తగించుము నేను నీఛుడను'' (యోబు 40:4) అన్నవి ఏబేలును చంపిన తర్వాత బాధతో కయీను కానీ, రక్షకునిని శత్రువుల చేతికి అప్పగించిన వెంటనే యూదా కానీ పలికిన మాటలు కావు కానీ ''అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవ్వడును లేడు''( యోబు 1:8) అని దేవుడే సాక్ష్యమిచ్చిన ఒకని విలాపమై ఉన్నది. అయితే యోబు పలికిన ఈ మాటలు భయంకరమైన కష్టాల వలన పుట్టిన తీవ్రవిచారము వలన కలిగినవా? లేదా తన ఈ స్వయంనిందిత భాషాప్రయోగం సమర్థనీయమేనా? అలాగైతే నేటి క్రైస్తవులు వాటిని ప్రతిధ్వనించటం సరియేనా? ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని తెల్సుకోవటానికి మరో ప్రశ్న అడగాలి. ''నేను నీఛుడను'' అని యోబు ఎప్పుడు అన్నాడు? తన తీవ్రనష్టాల వార్తను మొదట అందుకున్నప్పుడా? కాదు. అప్పుడు అతను ''యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకోనిపోయెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక'' అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. మరి అవి తన స్నేహితులు అతనితో తర్కించి అతనిని గద్ధించినప్పుడు అతడు పలికిన మాటలా? కాదు. అప్పుడు అతడు తనను తాను నిర్దోషిగా కనపరుచుకుంటూ తన మంచితనము గురించి అతిశయపడ్డాడు. మరి అలాగైతే యోబు ''నేను నీఛుడను'' అని ప్రకటించినది ఎప్పుడు? అవి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆశ్చర్యంగొలుపు విధంగా తన యొక్క అద్భుతమైన పరిపూర్ణతలను గురించి అతనికి బయలుపర్చినప్పుడు అతడు పలికిన మాటలు. అన్నిటినీ పరిశోధించే నిష్కల్మషమైన దేవుని పరిశుద్ధత వెలుగులో నిలిచి ఆయన గొప్పశక్తిని గుర్తెరిగిన తరుణంలో అతడు పలికిన మాటలు అవి.

ఒక వ్యక్తి  జీవముగల దేవుని సన్నిధిలోనికి నిజంగా తేబడినప్పుడు అతిశయోక్తులు ఆగిపోతాయి. మన సొగసు వికారమౌతుంది (దానియేలు 10:8). ''అయ్యో......... నేను నశించితిని'' (యెషయా 6:5) అని మనము విలపిస్తాము. దేవుడు తనయొక్క అద్భుతమైన పరిపూర్ణతలను ఒక వ్యక్తికి స్వయంగా బయలుపర్చినప్పుడు ఆ వ్యక్తి తన నీఛస్థితిని గురించి బలంగా ఒప్పించబడతాడు. ఎంత ఎక్కువగా మనము దేవుని అనిర్వచనీయమైన మహిమను ధ్యానించటంలో నిమగ్నమై ఉంటామో, అంత ఎక్కువగా మన మీద మనకున్న మంచి అభిప్రాయం తొలగిపోతుంది. దేవుని వెలుగులోనే, కేవలం దానిలోనే ''మనము వెలుగును చూచుచున్నాము"( కీర్త 36:9). ఎప్పుడైతే ఆయన మన మనస్సులో మన హృదయంలో ప్రకాశించి ''చీకటిలో దాగి ఉన్న విషయములను'' వెలుగులోనికి తెస్తాడో అప్పుడే మనము మన స్వభావము యొక్క దుర్మార్గతను తెలుసుకుని మనకు మనమే అసహ్యులముగా కనబడతాము. మన  తోటివారితో కొలిచి చూసుకున్నప్పుడు, సాధారణంగా ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనలను మనము ఎంచుకుంటాము. (రోమా 12:3); కానీ దేవుని స్వభావము యొక్క పరిశుద్దతతో మనలను మనము బేెరీజు వేసుకున్నప్పుడు మనము ''ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను"(ఆది 18:27) అని రోదిస్తాము. నిజమైన పశ్చాత్తాపము, ఒక వ్యక్తికి తనను గురించి తనకున్న అభిప్రాయాన్ని మారుస్తుంది.

ఆలాగైతే ఈనాడు క్రైస్తవుడు ''నేను నీఛుడన''ని చెప్పటం సబబేనా? క్రీస్తునందు తనకున్న నీతిని విశ్వాసముతో వీక్షించినప్పుడు కాదు కాని స్వభావరీత్యా తాను ఏమైయున్నాడో, వాక్యపు వెలుగులో కనుగొన్నప్పుడు ఇటువంటి ఒప్పుకోలు సరైనదే. అధిక వినయాన్ని ప్రదర్శించి ఎంతో తగ్గింపు కలవాడన్న పేరును సంపాదించుకోవటానికి కాదు కానీ, ఆ మాటలు హృదయపూర్వకమైన  ఒప్పుకోలుని బట్టి పలకగలగాలి. ప్రత్యేకముగా అది మనము దేవుని వద్దకు పశ్చాత్తాపముతోనూ విరిగి నలిగిన హృదయముతోనూ వచ్చినప్పుడు చేసే ఒప్పుకోలుగా ఉండాలి. అంతేకాదు, అపోస్తలుడైన పౌలు బహిరంగంగా ''అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను'' (రోమా 7:24) అని ఒప్పుకున్నట్లుగా మనము కూడా విశ్వాసుల  ఎదుట ఒప్పుకోగలగాలి . దేవుడు మనకు తెలిపినదానిని ఒప్పుకోవటం (దేవుని యందు భయభక్తులు కలిగినవారి ముందు) మన సాక్ష్యంలో భాగం. ''నేను నీఛుడను'' అన్నది రచయిత యొక్క నిష్కపటమైన దు:ఖభరితమైన ఒప్పుకోలు.

1. 'నా ఊహలను బట్టి నేను నీఛుడను':

వ్యామోహాలు నాలో మరుగుతున్నప్పుడు ఎంతో మష్టు పైకి తేలుతుంది. ఎంతో రోతగల దృశ్యాలు నా కల్పనాస్థావరంలో దర్శనమౌతున్నాయి, ఎంతో అవినీతికరమైన కోరికలు లోపల కలత రేపుతున్నాయి. దేవుని పరిశుద్ధ సంగతుల ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మనసు తిరుగాడుతూ, ఆలోచనలు మురికైన దుర్గంధమైన వాటి పైకి మళ్ళుతున్నాయి. రచయిత దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు, "అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు.. తో నిండియున్నవని'' ఒప్పుకోవల్సి వచ్చింది (యెషయా 1:6). ప్రతిరాత్రి నేను ''పాపమును అపవిత్రతను పరిహరించుటకు తీయబడిన ఊటపై....'' (జెకర్యా 13:1) ఆధారపడుతున్నాను.

2. 'నా స్వచిత్తాన్ని బట్టి నేను నీఛుడను' ః

దేవుడు నా ప్రణాళికలను భంగపరుస్తున్నప్పుడు నేను ఎంతగా వ్యసనపడుతున్నాను? దేవుని ఏర్పాట్లు నాకు అసంతృప్తి కలిగించినప్పుడు, నా దుష్టహృదయంలో  తిరుగుబాటు ఎంతగా  రేగుతున్నది? కుమ్మరి చేతిలో మట్టివలె నిశ్చలంగా ఉండకుండా, కళ్లెముతో నియత్రింపబడటానికి ఇష్టంలేక, వెనుకకాళ్ళమీద నిలబడి తన్నే మొండిగాడిదపిల్ల వలె  ఎన్నిసార్లు నేను నా స్వంత మార్గాలను ఎన్నుకుంటున్నాను? అయ్యో, అయ్యో, సాత్వికత మరియు దీనమనస్సుగల ఆయన నుండి నేను ఎంత తక్కువగా నేర్చుకున్నాను! ''శరీరము'' శుద్ధీకరించబడే బదులుగా కుళ్లుతున్నది; ఆత్మపై దాని వైరము బలహీనపడటానికి బదులుగా అది ప్రతి సంవత్సరము బలపడుతున్నట్టుగా కనపడుతుంది. 'ఆహా! గువ్వవలె నాకు రెక్కలున్న యెడల నానుండి నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే!(కీర్తనలు 55:6)'

3. 'నా వేషధారణను బట్టి నేను నీఛుడను':

ఎన్నిసార్లు నేను "శరీర విషయమందు చక్కగా అగుపడగోరి"(గలతీయులు 6:12) ఇతరులచేత హెచ్చింపబడాలని ఆతురపడుతున్నాను! ఆధ్యాత్మిక విషయాలలో గొప్ప పేరు సంపాదించుకోవాలనే  ఆపేక్షను బట్టి నేను ఎంత కపటముగలవాడిని! ఎంత తరుచుగా నిజస్థితిని మరుగుచేస్తూ నేనెంతో మెరుగుగా ఉన్నానని ఇతరులు భావించేలా ప్రవర్తించాను! ఎంత గర్వం మరియు స్వనీతి నన్ను ఉప్పొంగజేశాయి? దేవునికి కాక మనుషులకు వినసొంపైన ప్రార్థనలు చేస్తూ, ఆధ్యాత్మిక బంధకాలలో ఉంటూనే స్వతంత్రముగా ఉన్నట్లు నటిస్తూ, నేను అనుభవించని మరియు స్పర్శించని విషయాలను గురించి మాట్లాడుతూ, సంఘవేదికపై నేను ఎంత యథార్థతలేనివాడుగా ప్రవర్తించాను! కుష్ఠువాని స్థానము తీసుకొని పెదవులు కప్పుకొని ''అపవిత్రుడను, అపవిత్రుడను'' అని బిగ్గరగా ఏడవటానికి నాలో ఎక్కువగా, మరి ఎక్కువగా కారణము కనపడుతుంది.

4.'నా అపనమ్మకాన్ని బట్టి నేను నీఛుడను':

ఎన్నిసార్లు నేను అనుమానాలతోను అపార్థాలతోను నిండి ఉన్నాను! ఎంత తరచుగా నేను ప్రభువుపై కాక నా జ్ఞానంపై ఆధారపడుతున్నాను! అడిగినవాటిని పొందానని నమ్మటంలో (మార్కు 11:24) నేను ఎన్నిసార్లు విఫలమయ్యాను! శోధన ఘడియ వచ్చినప్పుడు మునుపు పొందిన విడుదలలు ఎన్నిసార్లు మరచిపోయాను! కష్టాలు పైబడినప్పుడు, కనిపించని ఆయన తట్టుకు నా కన్నులెత్తక కనిపించే ఇబ్బందులతోనే ఎన్నిసార్లు నేను సతమతమయ్యాను! ఆయనకు సమస్తము సాధ్యమని గుర్తుంచుకోకుండా, ''ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా'' (కీర్త 78:19) అని అనటానికి ఎన్నిసార్లు సిద్ధపడ్డాను. నిజమే, ప్రతిసారీ అలా జరగదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కృపతో పుట్టించిన విశ్వాసాన్ని ఆయన ఉజ్జీవింపజేస్తూ ఉంటాడు, కాని కష్టాలు ఎదురైనప్పుడు, ఆయన కార్యము చేయకపోతే, ఎన్నిసార్లు నేను ''మీరింకను నమ్మిక లేక ఉన్నారా'' ( మార్కు 4:40) అని చెప్పటానికి నా ప్రభువుకు కారణమిస్తున్నాను?

ప్రియచదువరీ, పైన చెప్పినవాటితో నీ అనుభవము ఎంతమేరకు సరిపోలుతుంది? ''నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును'' (సామెతలు 27:19) అన్నది నిజమే అనిపిస్తుందా? నీ రోగగ్రస్తమైన హృదయలక్షణాలను నేను వివరించానా? నువ్వు ఎప్పుడైనా దేవుని ముందు ''చిత్తగించుము నేను నీఛుడను'' అని ఒప్పుకున్నావా? ఎంతగానో తగ్గింపు కలగజేసే ఈ వాస్తవాన్ని నువ్వు క్రీస్తునందు నీ సహోదరీసహోదరుల ఎదుట ఒప్పుకున్నావా? అది నోటితో మాత్రమే  ఒప్పుకోవడం సులభమే కానీ  అనుభవపూర్వకంగా దాన్ని నువ్వు గుర్తెరిగావా? నీ నిజస్థితిని గుర్తించటం నిన్ను ''సిగ్గుపరచే'' (ఎజ్రా 9:6) విధంగాను రహస్యముగా దేవుని ఎదుట మూలిగే విధంగాను చేస్తుందా? నువ్వు నీఛుడవనే బాధారకమైన గుర్తింపు, పరిశుద్దుడైన దేవునిని సమీపించటానికి  సరిపోనివాడవనే గ్రహింపును నీలో కలిగిస్తుందా? అయితే

1. దేవునికి నువ్వు కృతజ్ఞుడవై ఉండటానికి గొప్ప కారణం ఉంది ః పరిశుద్ధాత్ముడు నీ దౌర్భాగ్యస్థితిలో కొంత నీకు చూపించినందుకు, నీ నాశనకరమైన పరిస్థితి గురించి నిన్ను అజ్ఞానంలో ఉంచనందుకు, కోట్లమంది క్రైస్తవులను ఆవరించిన ఆధ్యాత్మిక అంధకారంలో నిన్ను వదిలివేయనందుకు, దేవునికి నువ్వు ఎంతో కృతజ్ఞుడవై ఉండాలి.

సముద్రమంత దుర్మార్గతను నీలో చూసి, దు:ఖంతో మూలుగుతున్న నా సహోదరుడా , పవిత్రమైన క్రీస్తు పేరును కలుషితమైన నీ పెదవులతో ఉచ్ఛరించటానికి కూడా తగనివాడవని నీకనిపిస్తోందా? ఐతే ''తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారేమాత్రము సిగ్గుపడరు అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదుర''ని (యిర్మియా 8:12) వ్రాయబడిన స్వనీతిపరులలో నీవు ఒక్కడవు కానందుకు దేవునికి నీవెంతగానో కృతజ్ఞతలు చెల్లింపబద్దుడవైయున్నావు. పాపం వలన గుడ్డివైన నీ కళ్ళను సర్వకృపామయుడైన దేవుడు అభిషేకించాడని, ఇప్పుడు ఆయన దృష్టిలో  నీ ఘోరమైన వికారాన్ని నువ్వు  కొంచమైనా చూసుకుని ''నేను నల్లనిదాననైనను'' ( ప.గీ 1:5) అని నిర్ఘాంతపోవటానికి అవకాశం కలిగిందని దేవునిని స్తుతించటానికి నీకు ఎంతైనా కారణం ఉంది.

2. యెహోవా సన్నిధిలో వినయంతో నడవటానికి నీకు గొప్ప కారణం ఉంది. నీ నీఛత్వం గురించిన గ్రహింపు ఆయన సన్నిధిలో యథార్థమైన తగ్గింపుతో ''పాపినైన నన్ను కరుణించు దేవా'' అని రొమ్ము కొట్టుకుని విలపించటానికి నిన్ను నడిపించిందా? అవును విశ్వాసంలో ఏదిగినవానికి సైతం అటువంటి ప్రార్థన అతడు తన తప్పిపోయిన స్థితిని మొదట కనుక్కున్నప్పుడు ఎంత సరిపోయినదిగా ఉందో ఇప్పుడు కూడా అంతే సరిపోయినదిగా ఉంది. ఎందుకంటే అతను మొదలుపెట్టిన విధంగానే కొనసాగాలి (కోలస్సి 2:6, ప్రకటన2:5). కానీ, అయ్యో, ఎంత త్వరగా,ఎంత సులువుగా మన నీఛత్వం యొక్క గ్రహింపు మనల్ని వదిలేస్తుంది! ఎంత తరుచుగా అహంకారం మరలా మనపై అధికారం చేస్తుంది! అందుకే మనం '' మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంటనుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి'' అని హెచ్చరింపబడ్డాము. ఆయన సన్నిధిలో నువ్వు అణకువగా నడుచుకునేలా నీ నీఛత్వాన్ని నీకు బహిర్గతం చేయమని దేవునిని ప్రార్థించాలి.

3. నీమీద త్రియేక దేవునికి ఉన్న ఉత్కృష్టమైన ప్రేమను బట్టి నువ్వు ఆశ్చర్యపడటానికి గొప్ప కారణం ఉంది. దైవికత్రిత్వంలోని వ్యక్తులు ఇటువంటి నీఛుడి మీద తమ హృదయం నిలిపారన్న విషయం ఆశ్చర్యాలలోకెల్ల ఆశ్చర్యం. ఆలోచనలోను, మాటలోను, క్రియలోను నువ్వు చేయబోయే పాపాల గురించి ముందే తెలిసినా, తండ్రియైన దేవుడు నిన్ను'' శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడ''న్న సత్యము నిన్ను ఆశ్చర్యంతో నింపాలి. దుర్గంధభరితమై రోతగా ఉన్న నీవంటివానిని విమోచించటానికి కుమారుడైన దేవుడు తన మహిమావస్త్రాలు పక్కనపెట్టి పాపపుశరీరరూపాన్ని ధరించుకోవటం అన్నది నిజంగా,"సమస్తజ్ఞానమును మించిన" ప్రేమ. ఇంత నీఛుడి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలనుకోవడం,"ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను" అన్న సత్యాన్ని నిరూపిస్తుంది. "మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్." (ప్రకటన1:6)

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.