దుర్బోధలకు జవాబు

రచయిత: హితబోధ నెట్వర్క్

 

వాక్యపునాదా, వక్రపునాదా అనే ఈ సిరీస్ యొక్క 3వ భాగంలో, ప్రవీణ్ పగడాలగారి వక్రీకరణబోధను, విషం నిండిన ఆలోచనలను సంఘం ముందు మరోసారి బయటపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాం.

I  ప్రవీణ్ పగడాలగారు, 1 కొరింథీ 2:14 కాల్వినిజంను నిర్థారిస్తుందా అనే వ్యాస ప్రారంభంలో, కాల్వినిస్టులు అనేక శతాబ్దాలుగా వాక్యాన్ని వక్రీకరించి, సంఘాన్ని వారి మూసలో కూర్చోబెట్టాలని ప్రయత్నించిన ప్రతీసారీ వారిని సంఘం ఎదుర్కొంటూ వచ్చిందని, కాల్వినిస్టుల వల్ల సంఘంలో చీలికలు, వైషమ్యాలు, అలజడులు, మారణహోమాలు తటస్థించాయని వాపోయారు. కానీ నిజానికి సంఘంలో ప్రవేశించి సంఘ ప్రతినిధులుగా  చలామణి అయ్యే ప్రవీణ్ పగడాల లాంటి వక్రబోధకులనే సంఘం అనేక శతాబ్దాలుగా ఎదుర్కొంటూ వస్తుంది. ఆ క్రమంలోనే ఈ వ్యాసాల్ని మేము రాస్తున్నాము.

ఒకవైపు, ఇండాలజీ Conferencesలో కాల్వినిజం భావజాలం కలిగిన విలియం కేరీ సేవలను ప్రశంసిస్తూ, జోనాతాన్ ఎడ్వర్డ్స్ లాంటివారి వాదనల్ని తన‌ బోధల్లో ప్రస్తావిస్తూ, తిరిగి వారివల్ల సంఘంలో అలజడి, వైషమ్యాలు, మారణహోమం జరిగాయని దుమ్మేత్తిపోయడం ఎంత అనైతికమో మీరే ఆలోచించాలి. ఒకవేళ కాల్వినిస్టు భావజాలాన్ని నమ్మేవారు ఎవరైనా, వాక్య వ్యతిరేకంగా మారణహోమాన్ని చేసినా, అది వారి వ్యక్తిగత అపరాధంగా మనం భావిస్తామే తప్ప, వారు నమ్మే భావజాలమే దానికి కారణమని నిందమోపం. ఒకవేళ ప్రవీణ్ పగడాలగారి కొలమానం ఇదే అయితే,  క్రైస్తవులుగా, క్రైస్తవ బోధకులుగా చెప్పుకునేవారు సైతం కొన్నిసమయాల్లో మారణహోమం చేసినట్లు, ఆఫ్రికా దేశంలో ఉన్న నల్లజాతీయులను బానిసలుగా మార్చుకున్నట్లు చరిత్ర చెబుతుంది. దీనంతటికీ క్రైస్తవ భావజాలమే కారణం అందామా? లేక అది వారి వ్యక్తిగత అపరాధం అందామా?

ఈ విషయంలో ప్రవీణ్ పగడాలగారు మతోన్మాదుల వాఖ్యలతో కుమ్మక్కైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక భావజాలానికి ఆపాదించేది వారేమరి. 

క్రైస్తవులు నమ్మే 'మానవపతనం' మనిషి స్వభావసిద్ధంగా మాత్రమే పాపి అని ప్రకటిస్తుంది తప్ప సువార్తకు స్పందించలేనంతగా పతనమవ్వలేదని ప్రవీణ్ పగడాలగారు ప్రస్తావించారు. ఈయన నమ్మే ఈ సగం పతనాన్ని పూర్తి క్రైస్తవ సంఘానికి ఆపాదించి మాట్లాడటానికి ఈయనేమీ పూర్తి క్రైస్తవ్యానికి ప్రతినిధిగా ఎన్నుకోబడినవారు కాదనేది గుర్తుంచుకుంటే మంచిది.

II‌  I కొరింథీయులకు 2:14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

ప్రవీణ్ పగడాలగారు ఈ వాక్యభాగం కాల్వినిజాన్ని సమర్థించడం లేదని, కాల్వినిస్టులకు అసలు వాక్యాన్ని సందర్భానుసారంగా చదవడమే రాదని చిత్రీకరించడానికి ఎప్పటిలాగ వాక్య సందర్భాన్ని వివరిస్తాననే నాటకం వేశారు. ఆ క్రమంలో భాగంగా దీనికి ముందున్న వచనాలన్నిటినీ ప్రస్తావిస్తూ ఆమాటలన్నీ, మనుష్యజ్ఞానానికీ, దేవుని జ్ఞానానికీ మధ్య తారతమ్యం చూపించే మాటలే అని, మనం తిరిగి జన్మించేది దేవుని వాక్యం మూలంగా మాత్రమే అని చెప్పడానికే పౌలు వీటినన్నిటినీ రాస్తున్నాడనీ తేల్చేసే ప్రయత్నం చేసాడు. వాస్తవానికి ఇక్కడ సందర్భాన్ని మనం పరిశీలిస్తే పౌలు రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు.

A తాను ప్రకటించేది మనుష్య జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానం అని తన వాక్య పరిచర్య గురించి చెబుతున్నాడు.

I కొరింథీయులకు 2:1-7 సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.  నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.  మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.  మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక(మూలభాషలో-ఈ యుగ) జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

B ఆ దేవుని జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం అందరికీ లేదని, అయితే మనం దేవుని సంగతులను గ్రహించి వాటిని దేవుని జ్ఞానంగా స్వీకరించడానికి పరిశుద్ధాత్మ కార్యమే కారణమని చెబుతున్నాడు.

I కొరింథీయులకు 2:9-12 ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.

దీని ప్రకారం దేవుడు సిద్ధపరచినవి కొందరికి అర్థం కావడానికి పరిశుద్ధాత్మ చేసే కార్యమే కారణమని, కొందరికి అర్థం కాకపోవడానికి వారు ప్రకృతిసంబంధమైన మనుషులు అవ్వటమే కారణమని పౌలు చెబుతున్నాడు. ఇది ఈ వాక్యభాగానికి అసలైన సందర్భం.

మనుషులందరూ ప్రకృతిసంబంధమైనవారిగానే పుడుతున్నప్పటికీ, దేవుని ఏర్పాటులో ఉన్నవారికి పరిశుద్ధాత్ముడు హృదయాన్ని తెరచి బయలుపరచటం ద్వారా వారు దేవుని జ్ఞానాన్ని అంగీకరించి నూతనంగా జన్మిస్తున్నారు. ఈ ఏర్పాటు గురించి పౌలు ముందు అధ్యాయంలో చెబుతున్న మాటలు చూడండి.

I కొరింథీయులకు 1:26-29 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని(మూలభాషలో-శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని  ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,  జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

ప్రవీణ్ గారు పౌలు మాటల్లో ఈ రెండవ కోణాన్ని విడిచిపెట్టి కేవలం మనుష్యజ్ఞానం, దేవుని జ్ఞానమనే తారతమ్యాన్నే వివరించే ప్రయత్నం చేస్తూ, చదువరులను మభ్యపెట్టే ప్రయత్నం‌ చేసారు. పైగా దాన్ని కప్పిపుచ్చడానికి  ఇంకా తన వ్యాసంలో ఇతర వాక్యభాగాలను ప్రస్తావిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించారు, వాటిని కూడా చూడండి.
  

III ప్రవీణ్ పగడాలగారు తన ప్రతీ వ్యాసంలోనూ, కాల్వినిస్టులకు వాక్యం రాయబడిన సందర్భం, నేపథ్యం వగైరా వగైరా తెలియవంటూ ఆరోపణలు చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని రాజ్యం కోసం రాయబడిన మాటలను సందర్భంలో చూడకుండా, YWAM (YOUTH WITH A MISSION) నేర్పిన "Seven Mountains" అనే వేరొక సువార్తతో కలిపి,చెరిపి బోధించే ఈయన, వాక్యం రాయబడిన సందర్భం, నేపథ్యం వివరిస్తానంటూ మాట్లాడం హాస్యాస్పదంగా లేదా? ఆలోచించండి. బైబిల్ గ్రంథాన్ని సందర్భం, నేపథ్యం పరిధిలో చదవాలనే బోధను విస్తృతంగా చేసినవారు కాల్వినిస్టులే (Prolegomena and Isagogics); చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.

IV ఇంకా ప్రవీణ్ పగడాలగారు మాట్లాడుతూ దేవుని వాక్యానికి మనుష్యులను యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చే(తిరిగి జన్మింపచేసే) శక్తి ఉందని అనేక లేఖనభాగాలు చూపించే ప్రయత్నం చేసారు. కాల్వినిస్టులు ఎవరూ కూడా, మనిషి వాక్యము ద్వారా రక్షించబడతారనే (నూతనంగా జన్మిస్తారనే) సత్యంతో విబేధించడం లేదు. ప్రవీణ్ పగడాల వంటివారే మనిషి వాక్యం ద్వారా మాత్రమే కాకుండా మెల్లని స్వరం ద్వారా కూడా రక్షించబడతారని చెబుతుంటారు. కాల్వినిస్టుల వాదన ప్రకారం మనిషి వాక్యం ద్వారా మాత్రమే రక్షించబడతాడు. కానీ అలా జరగాలంటే ఆ వాక్యాన్ని అంగీకరించేలా పరిశుద్ధాత్ముడు వారి హృదయాలను తెరవాలి. అందుచేతనే వాక్యం విన్న, చదివిన ప్రతీ ఒక్కరూ దాన్ని అంగీకరించి రక్షించబడటం లేదు కానీ, పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయాన్ని తెరుస్తాడో వారికే అది సాధ్యమౌతుంది. ఈ వచనాలు పరిశీలించండి.

అపొస్తలుల కార్యములు 16:14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను.

తీతుకు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన(పునఃస్థితి స్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

దీనిప్రకారం, వాక్యమనే సాధనం ద్వారా పరిశుద్ధాత్ముడు అనేకులను (తండ్రి నిర్ణయించినవారిని) నూతనంగా జన్మింపచేస్తాడని చెప్పడానికి కాల్వినిస్టులకు వాక్యాధారాలు ఉన్నాయి. అలా కాదు వాక్యం మాత్రమే చేస్తుందని చెప్పే ప్రవీణ్ పగడాలగారికి, వాక్యాన్ని‌ విన్న, చదివిన అందరూ ఎందుకు తిరిగి జన్మించబడటం లేదనే ప్రశ్నకు సమాధానం ఉందా? పైగా ఈయనే తన వ్యాసంలో, పేతురు రాసిన పత్రిక నుండి శాశ్వత బీజము నుండి పుట్టింపబడినవారమనే వాక్యభాగాన్ని ప్రస్తావించారు. మళ్ళీ పుట్టించబడటం ఏమిటి? మీ వాదన ప్రకారం వాళ్లకి వాళ్లే  'ఫ్రీ విల్'తో పుట్టారు కదా?

ముస్లిములతో చర్చలు చేసేటపుడు, వారికి కౌంటర్లు పెట్టేటపుడు వారు వేరువేరుగా ఉన్న రెండు వాక్యభాగాలను చూపించి  Contradiction అని ప్రశ్నిస్తే, అది Contradiction కాదు Contradistinction అని చెప్పిన ప్రవీణ్ పగడాలగారు,  ఈ విషయ‌ంలో మాత్రం, మనిషి వాక్యం ద్వారా రక్షించబడుతున్నాడని, పరిశుద్ధాత్మ హృదయాన్ని తెరచి నూతనస్వభావాన్ని అనుగ్రహించినపుడే ఆ వాక్యాన్ని గ్రహించి రక్షించబడుతున్నాడనే Contradistinctionగా రాయబడిన వాక్యభాగాలను ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో మరి! ఒకవేళ  అర్థమైనా,  ఆర్మీనియన్ సిద్ధాంతాలు‌ నమ్మే విస్తారమైన సమూహాల మన్ననలు కోల్పోపోతానేమో అనే భయంతోనే ఆవిధంగా నటిస్తున్నారేమో అనిపిస్తుంది.

V ప్రవీణ్ పగడాలగారు యెషయా 55:11 వచనాన్ని ప్రస్తావించి, దేవుని వాక్యం ఆయన యొద్ద నుండి ఏ ఉద్దేశంతో పంపబడిందో దాన్ని తప్పకుండా నెరవేరుస్తుందనే వాక్య భాగాన్ని ఉటంకించారు. వాస్తవానికి ఈ వచనం ఈయన వాదనకు గుణపాఠం చెబుతుంది; ఎందుకంటే, ఈయన వాదన ప్రకారం దేవుడు ఈ లోకంలో అందర్నీ రక్షించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు అందరి కోసమూ ప్రాణం పెట్టాడు. కానీ చాలా మంది‌ని వాక్యం మార్చలేకపోతుంది. దీని ప్రకారం వాక్యం దేవుడు పంపిన ఉద్దేశం పూర్తిగా నెరవేర్చకుండా నిష్ఫలంగా మరలుతుంది.

అంతేకాకుండా, నమ్మువానిలో మాత్రమే ఆ‌ వాక్యం పనిచేస్తుందని ఈయన ప్రస్తావించడంలో మరింతగా ఇరుక్కుంటున్నారు. ఎందుకంటే అందరినీ రక్షించాలనే ప్రణాళికతో యేసుక్రీస్తు అందిరి కొరకు ప్రాణం పెడితే, వాక్యం వారందరిలోనూ దేవుని ఉద్దేశం నెరవేర్చాలి కదా? ఇదే ఈయన బోధలో ఉన్న గందరగోళం. ఇందుకు భిన్నంగా కాల్వినిస్టుల వాదన ప్రకారం,  దేవుడు ఎవరినైతే రక్షించాలని ఉద్దేశించాడో వారి రక్షణ కోసమే వాక్యాన్ని పంపించాడు. పరిశుద్ధాత్మ వారి హృదయాన్ని తెరవడం ద్వారా వాక్యం వారిలో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.

ఇకపోతే, మాటిమాటికీ కాల్వినిస్టులు దేవునిని నియంతగా చూపిస్తున్నారని గగ్గోలు పెట్టే ప్రవీణ్‌గారూ, మీరు చూపించిన వాక్యభాగంలో అది దేవుని ఉద్దేశాన్ని మాత్రమే ఎందుకు‌ నెరవేరుస్తుంది? అది మీ ప్రకారం నియంతృత్వం ఔతుంది కదా?

VI అదేవిధంగా, ప్రవీణ్ పగడాలగారు కాల్వినిజం మనిషిని తన బాధ్యతనుండి తప్పించివేస్తుందని మరోసారి అబద్ధం ఆడుతున్నారు; ఈ మధ్య అబద్ధాలాడటమే ఈయనకు అలవాటుగా మారిందేమో అనిపిస్తుంది. కాల్వినిజం ఎక్కడా మనిషిని తనయొక్క బాధ్యత నుండి తప్పించడం లేదు. దేవుని వాక్యం చెబుతున్నట్లుగా ఆ బాధ్యతను నెరవేర్చే సామర్థ్యం కూడా ఆయనే ఇస్తాడని ధైర్యం చెబుతుంది.

ఫిలిప్పీయులకు 2:13 ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

VII ప్రవీణ్ పగడాలగారు, తన వ్యాసంలో దేవుడు పౌలును ఎన్నుకున్నాడని ప్రస్తావిస్తూ, అదే చేతితో దేవుడు ఎవరినీ బలవంతంగా కృప చూపి రక్షించడని రాసుకొచ్చారు. అలా అయితే అసలు దేవుడు పౌలును ఎలా ఎన్నుకుంటాడు? పౌలే కదా తన 'ఫ్రీ విల్'తో దేవున్ని ఎన్నుకోవాలి?  పౌలు తన 'ఫ్రీ విల్'తో, సంఘాన్ని‌ హింసించాలనే ఆసక్తితో ముందుకు పోతుంటే, దారిలో కనిపించి గుడ్డివాణ్ణి చేసి బలవంతంగా ఎందుకు తన వైపుకు తిప్పుకున్నాడు?

ప్రవీణ్ పగడాలగారు, ఒక వాక్యాన్ని చూపించి ఇందులో  కాల్వినిస్టులు చెబుతున్నట్టు ఉందా, అలా కనిపిస్తుందా అని మాటిమాటికీ Tension పడుతుంటారు. ఈ క్రింది వాక్యాల్ని యథార్థంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాం.

యిర్మియా 20:7 యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి.

2 కొరింథీయులకు 5:14 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.

ఈ వచనాల్లో‌ స్పష్టంగా దేవుడు మనిషిపై తన బలవంతపు కృప చూపిస్తాడని రాయబడింది. మరలా ప్రవీణ్ పగడాలగారు, బలవంతం అనగానే దానికి వేరే అర్థాలు పులుముతారెమో.  ఆయనకదే పనికదా! దేవుడు తాను ఎన్నుకున్నవారిని రక్షించడానికి, మహిమార్థమైన తన పనిని వారితో జరిగించి నీతికిరీటం ఇవ్వడానికి  బలవంతం చేసినా అది మంచిదే కదా, కాదంటారా?

VIII ప్రవీణ్ పగడాలగారి వ్యాసం చదివాక,  ఆయన సువార్త ప్రకటన/వాక్యము అనేదాన్ని కేవలం ఒక మాటగా మాత్రమే తీసుకుంటూ, ఆ మాటతోనే మనుషులు రక్షించబడిపోతారనే అపోహలో ఉన్నట్టు  అర్థమౌతుంది. వాస్తవానికి సువార్త ప్రకటన అనేది కేవలం మాట మాత్రమే కాదని, వాక్యం చెబుతుంది.

I థెస్సలొనీకయులకు 1:4 ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

దీనిప్రకారం, సువార్త ప్రకటనలో మాటతో పాటుగా, పరిశుద్ధాత్మ తన శక్తి చేత ఏర్పాటును అనుసరించి విశ్వసించేలా కార్యం చేస్తాడు. ప్రవీణ్ పగడాలగారి వాదన ప్రకారం, దేవుని జ్ఞానాన్ని/వాక్యాన్ని ఎవరైనా చదివి అర్థం చేసుకోగలిగితే, ఇక పరిశుద్ధాత్ముడు సహాయం చేయడం ఎందుకట? యూదులకు ప్రతీరోజూ చదువుతున్న వారి లేఖనాలు ఎందుకు అర్థం కాలేదట? ఇక్కడ చాలా స్పష్టంగా ప్రవీణ్ పగడాలగారు పరిశుద్ధాత్మ శక్తితో జరిగే కార్యాన్ని మానవ సామర్థ్యానికి ఆపాదించి దేవుని మహిమను‌‌‌ దొంగిలిస్తున్నారు.

IX అదేవిధంగా, ప్రవీణ్ పగడాలగారి వ్యాసాన్ని చదువుతున్నపుడు, పాపం కూడా దేవుడు అనుగ్రహించే పరిపూర్ణతలో భాగమని సంఘాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారని అర్ధమౌతుంది.
మేమేమీ ఈయనలా అన్యాయపు వాదన చేయము కానీ, దానికి ఆధారమిస్తున్నాం చూడండి. 

Annotation 2020 08 12 233254

తన వ్యాసంలో ఈయన కొరింథీ సంఘంలో ఉన్న వావివరసలు లేని వ్యభిచారులను కూడా, పౌలు పరిపూర్ణులని ప్రస్తావించాడని అంటున్నారు. వాస్తవానికి పౌలు ఆ సంఘంలో వ్యభిచారం చేసినవాణ్ణి మీలో నుండి వెలివేయమనీ, మీరు కూడా గతంలో మరికొన్ని హేయక్రియలను చేసి మారుమనస్సు పొందారని చెబుతున్నాడు.

I కొరింథీయులకు 5:1,2 మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు.

1 కొరింథీయులకు 6: 11 మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.

దీనిప్రకారం పౌలు 1 కొరింథీ 2:6లో‌ పరిపూర్ణులని ప్రస్తావించింది, వావివరసలు లేనివాళ్ళను ఉద్దేశించి కాదని, గతకాలపు పాపపు జీవితాన్ని విడిచి మారుమనస్సు పొందిన పరిపూర్ణుల కోసమని అర్థమౌతుంది. పౌలు ఆ సంఘంలోనూ, ఇతర సంఘాలలోనూ ఆ విధంగా పరిపూర్ణులైనవారి మధ్య పరిచర్య చేస్తున్నానని తన గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఒకవేళ ప్రవీణ్ పగడాలగారి వాదన ప్రకారం వావివరసలు లేనివారు కూడా పరిపూర్ణులే అయితే పరిపూర్ణత‌ వారికి ఎలా వస్తుందో‌ చూడండి.

మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

దీని ప్రకారం ఒక వ్యక్తి వావివరసలు లేకుండా ప్రవర్తించినా, పరిపూర్ణుడే అని ప్రవీణ్ గారు బోధిస్తూ సంఘాన్ని సర్వనాశనం వైపు నడిపిస్తున్నారు. సంఘమా జాగ్రత్త!!!

X ప్రవీణ్ పగడాలగారు  పదేపదే, చస్తే పరలోకం పోతాం అన్నట్టుగా ఉండకూడదంటూ, నిత్యజీవ సువార్తని చులకన చేస్తూ మాట్లాడుతుంటారు. బహుశా ఈయన చచ్చి పరలోకం కాకుండా, వేరే చోటికి పోవాలనుకుంటున్నారేమో, అందుకే వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు కాబోలు.

ఈయన, వాక్యాన్ని వక్రీకరించి తన YWAM మూసలో సంఘాన్ని కూర్చోబెట్టాలనే ప్రయాస మాని, వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరించాలని కోరుతున్నాము. ఆయన A.W. Pinkగారిని పింకు,‌ పెంకు అంటూ అపహాస్యం చేసినట్లు మేము కూడా చేయగలిగినా క్రీస్తు నేర్పిన ప్రేమతో ఆవిధంగా చేయకున్నాము. పైగా పింక్ గారు, జాన్ కాల్విన్ గారు, మెకార్థర్ గారు, జాన్ పైపర్ గారు ఎక్కడో నర్మగర్భంగా బోధించారట, వాళ్లు ఎక్కడా నర్మగర్భంగా బోధించలేదు. స్ట్రైట్ గా బోధించారు, ఏమన్నా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ప్రవీణ్ పగడాలగారూ.

వాక్యపునాదా వక్రపునాదా సిరీస్ యొక్క 4వ భాగంలో మళ్ళీ కలుద్దాం.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.